Jump to content

వాసిష్ఠరామాయణము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

వాసిష్ఠరామాయణము

ప్రథమాశ్వాసము

శ్రీమద్దివ్యమునీన్ద్రచిత్తనిలయం సీతామనోనాయకం
వల్మీకోద్భవవాక్పయోధిశశినం స్మేరాననం చిన్మయమ్
నిత్యం నీరదనీలకాయ మమలం నిర్వాణసంధాయినం
శాన్తం నిత్య మనామయం శివకరం శ్రీరామచన్ద్రం భజే.


అహోబలగిరీశాయ నిత్యాయ నిగమాత్మనే
శ్రీశాయ శాన్తరూపాయ నృసింహవపుషే నమః.


ఇష్టదేవతాస్తుత్యాదికము

ఉ.

శ్రీకరలీలఁ బ్రాణుల సృజింపఁ దలంచి విధాత తాన యై,
చేకొని వానిఁ బ్రోచునెడ శ్రీవిభుఁ డై, యవి సంహరింప భీ
మాకృతిఁ దాల్చి, మువ్వురకు నవ్వల నొక్కటియై, వెలుంగు సు
శ్లోకుఁ బురాణుఁ బుణ్యపురుషున్ బరమాత్ముని భక్తిఁ గొల్చెదన్.

1


ఉ.

శ్రీ యన విష్ణుపేరురముఁ జెన్ను వహించి యలంకరించి, దా
క్షాయణి నాఁగ శంభుమెయి సామున నెక్కొని, వాణి నాఁగ నా
తోయజగర్భు నెమ్మొగము దూఁకొని యేలెడునాదిశక్తి సు
శ్రీయుఁ జిరాయువున్ సరససిద్ధకవిత్వము మాకు నీవుతన్.

2


క.

వారణముఖు మృదుమోదక
పారణపారీణు సిద్ధ పన్నగ మఖభు

క్చారణసేవితుఁ బాపని
వారణు విఘ్నాంబుజాతవారణుఁ దలఁతున్.

3


గీ.

ఉదయవేళ విరించియై యొప్పుదాల్చి,
పట్టపగ లెల్ల రుద్రుఁడై ప్రజ్వరిల్లి,
మాకు హరిమూర్తి యైన తామరలయనుఁగు
భూరితేజంబు మా కిచ్చి ప్రోచుఁ గాత.

4


గీ.

వ్యాస వాల్మీకి శుక కాళిదాస బాణ
హర్షణాదుల నాద్యుల నాత్మ నిలిపి,
సకలభాషారసజ్ఞుల సముల నన్న
యార్య తిక్కకవీంద్రుల నభినుతింతు.

5


క.

అద్వైతతత్త్వమతుల జ
గద్విదితవిశాలయశుల గతకలుషుల రా
గద్వేషలోభరహితుల
విద్వత్సింహముల వేదవిదుల భజింతున్.

6


చ.

కదిసిన నోరదోయి, యొరుకబ్బపుదొంతులసత్పదార్థముల్
గదుకుచు, నెట్టివారిఁ బొడగన్నను గు ఱ్ఱని, స్నేహసౌఖ్యముల్
మలికి నసహ్యమై, శునకమార్గమునం జరియించుచున్న దు
స్పదకవు లెల్ల మత్కవితఁ దప్పులు వట్టక విండ్రు గావుతన్.

7


క.

తిరువేంకటనాయకపద
సరసిజమధుకరుల నఖిలసమయజ్ఞుల మం
త్రరహస్యవిదుల నఘసం
హారులను మద్గురుల ఘనుల నార్యులఁ గొల్తున్.

8


క.

మదిఁ బ్రహ్లా దార్జున నా
రద సనక సనంద శుక పరాశర రుక్మాం
గద భీష్మ శౌన కాదుల

సదయాత్ముల భాగవతుల సతతము దలఁతున్.

9


వ.

అని పరబ్రహ్మోపాసనంబును, నిష్టదేవతాభివందనంబును, సుకవివిద్వ
జ్జనప్రార్థనంబును, కుకవిజనవాగ్బంధనంబును, గురుచరణస్మరణం
బును, బరమభాగవతసంకీర్తనంబునుం జేసి, కృతకృత్యుండ నై,
తొల్లి హరిభక్తిరసావేశంబున గతిపయాక్షరాభ్యాసచాపలంబునం
జేసి, విష్ణువిభవాభిరామకథాప్రభూతంబులం బద్మపురాణోత్తరఖండం
బును భాగవతదశమస్కందంబును దెనుంగున రచియించి, యప్పుణ్య
పురాణంబులకున్ గృతిపతిగా నేపుణ్యం బ్రార్థింతునో యని విచా
రించి, గజగంధవారణ గండగోపాల చలమర్తిగండ రాయగజకేసరి
దొంతిమన్నె విభాళాది నానాబిరుదవిఖ్యాతులం బ్రసిద్ధుం డగు రామ
గిరిపట్టణాధీశ్వరుండైన కుమారముప్పభూపాలుని మాన్యమంత్రివర
ధురంధరుండును, నమ్మహారాజ దిగంతవ్యాప్త కీర్లిలతాలవాలుం
డును, ధర్మచారిత్రుండును, నీతిచాతుర్య వివేక విశేషగుణాలంకారుం
డును, నఖిలదిగ్భరితకీర్తివిశాలుండును, వాణసవంశాభిసుధాకర కాశ్య
పగోత్ర పవిత్రాబ్బనార్యతనూభవుండునునగు కొండనామాత్యుండు,
నాకు నతిస్నేహబాంధవుండును, నపూర్వవచనరచనాబంధురకావ్య
రసాభిజ్ఞుండును,నర్థిజనపారిజాతుండును, గావున, నమ్మంత్రి యుగంధ
రుం గృతిపతిం గావించి, వెండియుం గవిత్వతత్త్వరచనాకౌతుకం
బునం జిత్తంబు జొత్తిల్ల నొక్క కృతిం జెప్పంబూనితి. అందేని నిఖిల
భూతాంతర్యామియు, నిగమార్థగోచరుండును, నిత్యసత్యజ్ఞానానంద
శుద్ధాంతరంగుండును, నిశ్చలానందయోగీంద్రహృదయుండును, నిః
శ్రేయసానందఫలప్రదాయకుండును, నిర్మలచిదాభాసుండును, నిరా
కారుండును, నిర్గుణబ్రహ్మంబును, నగు నారాయణుం డొక్కరుండు
దక్క నన్యంబు లే దనియును, బ్రహ్మాదిచేతను లతనితేజఃకణంబు లని
యును, దేహం బనిత్యంబు దేహి నిత్యుం డనియును, జీవుండు చిత్తం

బనియును, చిత్తంబునంద జగత్తులు విస్తరిల్లు ననియును, దత్సంకల్పంబ
బంధంబు తన్నిరసనంబ మోక్షం బనియును, చిత్తశాంతియ జీవన్ముక్తి
యనియును, బెక్కువిధంబు లుపన్యసించునట్టి వాసిష్ఠసంగ్రహప్రబం
ధం బాంధ్రభాష నఖిలలోకోపకారార్థంబుగా రచియించెద.

10


ప్రతిజ్ఞ

క.

ఇది తత్త్వరహస్యార్థము
పదసంగతిఁ దెనుఁగు పఱుపఁ బ్రాజ్ఞులకును బె
ట్టిద మగుఁఁ దత్పరవాసన
విదితంబుగఁ గవులు మెచ్చ విరచింతుఁ దగన్.

11


క.

విజ్ఞానులు మును సెప్పిన
సంజ్ఞాభ్యాసములు కొంత జాడలు దోఁపన్
విజ్ఞాపనంబు సేసెదఁ
బ్రాజ్ఞులు తార్కికులు తప్పుపట్టకుఁడు దయన్.

12


క.

కఱ కిది నీరస మని వే
సర కల్లన వినుఁడు, తుద రసాయన మగుఁ, దాఁ
జెఱకుఁ దుదనుండి నమలిన
తెఱఁగున, మది కింపుఁ దనుపుఁ దీపున్ జూపున్.

13


క.

మృదుమధురఁ రచన గావ్యము
గదియించినయట్ల తత్త్వగాఢార్థము చె
ప్పుదుఁ, బువ్వుఁదేనె గొను తు
మ్మెద మ్రాఁకులు దొల్చునేపున్ మెఱసినభంగిన్.

14


క.

ఇది యల్పగ్రంథం బని
మదిఁ దలఁపకుఁ డఖలశాస్త్రమతములు దీనన్
విదితం బగు నద్దములో
మదదంతావళము దోఁచు మాడ్కిని తెలియన్.

15

నరసింహదేవునకుం గృతి నిచ్చుట

వ.

అని సకలజనసమ్మతంబుగా నుపక్రమించి, యనన్యసామాన్యయగునిక్క
వితావధూమణికిఁ బురుషుండు పురాణ పురుషుండు గావుతమని, యఖిల
లోకాధీశ్వరుడును, నతులకల్యాణగుణగణా లంకారుండును, ననవరత
లక్ష్మీసమేతుండు, నాదిమధ్యాంతరహితుండును,నభిమతఫలప్రదాయ
కుండును, నగు నహోబలశ్రీనృసింహదేవునకు నిచ్చెదనని తలంచి, య
ఖిల వేదవేదాంత వాగ్గోచరుండగు నద్దేవున కతితుచ్ఛంబులగు మద్వా
క్యంబు లర్పింతు ననుటయు మహాద్రోహంబగునో యని శంకించి
యప్పరమేశ్వరుం డాశ్రితసులభుం డగుటయు, మత్కవిత్వంబు తదీయ
వరప్రసాదలబ్ధం బగుటయు, భావించి, మనంబున నిట్లని వితర్కించితి.

16



క.

వనరాశిజలము గొని యా
వనరాశికి నర్ఘ్య మిచ్చు వడువున, హరి యి
చ్చినవాక్యములనె యతనికి
ననయము గృతి సెప్పి సుకృతి నగుదు ధరిత్రిన్.

17


క.

గురుఁడును దల్లియుఁ దండ్రియుఁ
బురుషుఁడు విద్యయును దైవమును దాతయు నాఁ
బొరి నేడుగడయు దా నై
హరి నను రక్షించుఁ గాత ననవరతంబున్.

18


క.

తనపేరిటివాఁ డనియును
దనదాసులదాసుఁ డనియుఁ దన కీకవితా
వనితామణి నిచ్చినవాఁ
డనియును రక్షించుఁ గాత హరి నన్ను దయన్.

19


వ.

అదియునుం గాక.

20


క.

కృతి బోధామృతరస మఁట,
కృతికథ శ్రీరామచంద్రకీర్తన మట, త

త్కృతినాయకుండు లక్ష్మీ
పతి యఁట, నా కింతకంటె భాగ్యము గలదే!

21


వ.

అని పరమానందకందళిత హృదయానందుండ నై యేతత్కవితాలతాలవాలం బగుమదీయవంశం బభివర్ణించెద.

22


కవివంశాభివర్ణనము

ఉ.

ఆజలజాక్షునాభిజలజాత్మజుమానసపుత్త్రుఁ డై భర
ద్వాజుఁడు ధాత్రి బెంపెసఁగెఁ దన్మునిగోత్రజులందు నిత్యవి
భ్రాజితపుణ్యమూర్తి యగు బ్రహ్మనమంత్రికిఁ బుట్టెఁ దీవ్రరు
క్తేజుఁడు గుండనార్యుఁడు సుధీజన భూజన కీర్తనీయుఁడై.

23


వ.

ఇట్లుదయించి.

24


క.

గుండన ప్రాభవమున భ
ర్గుం డన శ్రుతిశాస్త్రపారగుం డన నయమా
ర్గుం డన వితరణనయనాభా
గుం డన వర్ణనకు నెక్కెఁ గోవిదసభలన్.

25


క.

అంబుజభవనిభుఁ డాప
స్తంబాగ్రణి యైనగుండసచివునకును గొ
మ్మాంబకుఁ బుట్టెను బుత్త్రయు
గం బొగి నల్లాడవిభుఁడు గంగన యనఁగన్.

26


వ.

అందు.

27


క.

అల్లాడమంత్రి రిపుచయ
మల్లాడఁ బ్రతాపలీల నధికుం డై సం
ఫుల్లసితకీర్తిమల్లీ
వల్లీ వేల్లితదిగంతవారణుఁ డయ్యెన్.

28


సీ.

అతఁడు తిక్కన సోమయాజుల [1]పౌత్త్రుఁ డై
        కొమరారు గుంటూరుకొమ్మవిభుని

పుత్త్రిఁ జిట్టాంబిక బుధలోకకల్పక
        వల్లి వివాహ మై వైభవమున,
భూసార మగుకోటభూమిఁ గృష్ణానదీ
        దక్షిణతటమున ధన్యలీల
నలకు రావెల యనునగ్రహారము తన
        కేకభోగ్యంబుగా నేలుచుండి,


గీ.

యందుఁ గోవెల గట్టి, గోవిందు నెన్న
గోపికానాథుని ప్రతిష్ఠఁ గోరి చేసి
యఖలవిభవంబులందును నతిశయిల్లె
మనుజమందారుఁ డల్లాడమంత్రివిభుఁడు.

29


క.

అయ్యువతీ రమణులకును
నయ్యలమంత్రీంద్రుఁ డుదితుఁ డై ధారుణిలో
నెయ్యెడ నర్థార్థులు మా
యయ్య యనుచుఁ బొగడ నెగడె నౌదార్యమునన్.

30


వ.

అమ్మంత్రిచంద్రు గుణవిశేషంబు లెట్టివనిన.

31


చ.

తిరుగనిమందరాచలము ద్రిమ్మటఁ బొందనిభానుఁ డుగ్రుచేఁ
గరఁగని కాముఁ డమ్ముమొనఁ గ్రాఁగనివారిధి యన్యకాంతది
క్కరుగనినిర్జరేంద్రు డెడ రైనను బొంకని ధర్మసూతి నా
బరఁగె ధరిత్రి నర్థిజనభానుజుఁ డయ్యలమంత్రి పెంపునన్.

32


సీ.

ఆత్రేయగోత్రపవిత్ర పేరయమంత్రి
        పుత్రి సింగాంబికఁ బుణ్యసాధ్వి
వెలయ వివాహ మై, వేఁగిదేశంబులో
        నేపారు రాజమహేంద్రపురికి
నధిపతి తోయ్యేటి యనపోతభూపాలు
        మంత్రి యై రాజ్యసంపదలఁ బొదలి,

యొప్పార గౌతమియుత్తరతటమున
        మహనీయ మగుపెద్దమనికియందు


గీ.

స్థిరతరారామతతులు సుక్షేత్రములును
బెక్కు లార్జించి సితకీర్తిఁ బెంపు మిగిలి
యఖలజగదన్నదాత నా నవనిఁ బరఁగె
మధురగుణదుర్యుఁ డయ్యలమంత్రివరుఁడు.

33


చ.

ఒనరఁగ నవ్వధూవరు లహోబలదేవునిఁ గొల్చి తద్వరం
బున నొగి సింగనార్యుని నమోఘగుణాఢ్యు ననంతుని న్మహీ
జననుతు నోబయాంకు బుధసన్నుతిపాత్రుని నారయాహ్వయుం
గని నరసింహనామములు గారన మారగఁ బెట్టి రందఱన్.

34


క.

వారలలో నగ్రజుఁడను
వారిజదళనయనచరణవారిజసేవా
సారమతి నతులవాక్య
శ్రీరచనాచతురమతిని సింగాహ్వయుఁడన్.

35


క.

కూనయముప్పనృపాలక
సూను శ్రీ తెనుఁగున్నపతి సుదతీ మల్లాం
బా నందనుఁ డగు ముప్పయ
భూనాథుని సుకవివరుఁడ బుధసన్నుతుఁడన్.

36


ముప్పప్రభువర్ణనము

వ.

మఱియు రాజకంఠీరవం బగు నాకుమారముష్పభూపాలుని ప్రాభవ
పరాక్రమంబు లెట్టి వనిన.

37


సీ.

సంపెంగవిరులతో జాజులుం గురువేరు
        కొమరార నునుసేసకొప్పువెట్టి,
మృగమదకర్పూరమిళిత మౌపన్నీరు
        తనుపార మేనఁ జందన మలంది,

యుదయభానుప్రభ నుల్లసం బాడెడు
        మణిభూషణస్ఫూర్తి మాఱు మలసి,
పర పైనవెన్నెలనురువుల పోలికఁ
        దనరారు ధవళవస్త్రములు గట్టి,


గీ.

మానినీకరచామర మరుతచలిత
కుంతలుం డయి తగ నిండుకొలువునందుఁ
దనువుఁ గీర్తియుఁ గల పుష్పధన్వుఁ డనఁగఁ
జూడ నొప్పారు ముప్పయక్షోణివిభుఁడు.

38


మ.

అనిలో రాయగజేంద్రసింహ మగుముప్పాధీశు చే భగ్ను లై
చని, స్వప్నంబున నవ్విభుండు వెలయన్ శంకించినన్ మోస మౌ
నని చింతించి, నఖాంకురాంకుశవినోదాసక్తి నిద్రింప నీ
క నివారింతురు రాజకుంజరములన్ గాంతామణుల్ కానలన్.

39


గీ.

ఆమహీవిభుచేత రామాద్రిసీమఁ
బెక్కువృత్తులు గ్రామముల్ వెలయఁ గాఁచి
యతనియాశ్రితులం దెల్ల నధికుఁ డనఁగఁ
జతురుఁ డన ధన్యుఁ డన సడిసన్నవాఁడ.

40


వ.

అట్లు గావున.

41


శా.

ఆయుశ్శ్రీశుభమోక్షదున్ హరిఁ బ్రబంధాధీశుఁ గావించి, దు
ర్మాయాదూరము నిర్వికారము సదామాంగల్యయుక్తంబు నా
మ్నాయాంతార్థవివేకసారము మనోమత్తేభసింహంబు సం
శ్రేయోమార్గము నైన బోధమయ వాసిష్ఠంబు నేఁ జెప్పెదన్.

42


వ.

అదియును వాల్మీకిమునిప్రణీతంబును, వసిష్ఠవిశిష్టవాగ్విలాసభాసు
రంబును, రామచంద్రకథాప్రధానంబునుం గావున, వాసిష్ఠరామాయ
ణం బనంబడు. ఇప్పురాణవాక్యరత్నోపహారంబులు పురుషోత్తమున
కిచ్చుట యదియు నొక్కయారాధనవిశేషం బగుటం జేసి -

43

షష్ఠ్యంతములు

క.

అక్షయలక్ష్మీలలితక
టాక్షేక్షణలక్ష్యజలచరాంబుజరేఖా
లక్షణదక్షిణహస్తున
కక్షుభితాత్మునకు దేవతారాధ్యునకున్.

44


క.

అంబుజలోచనునకుఁ బీ
తాంబరునకు నంబరానిలానలధరణీ
శంబరరవిచంద్రాత్మున
కంబుధికన్యాముఖాంబుజాంబరమణికిన్.

45


క.

ఫాలాక్షజనితదహన
జ్వాలాలీలావరుద్ధశాత్రవసేనా
జాలునకు సటాపటలో
త్తాలునకుఁ గరాళకఠినదంష్ట్రాలునకున్.

46


క.

పంచాశుగధరగురునకు
బంచాయుధకలితలలితబాహాఢ్యునకున్
బంచాననవిసుతునకుఁ బ్ర
పంచవిదూరునకు మనుజపంచాస్యునకున్.

47


క.

రాకాశశాంకశంఖసు
ధాకాశసురేంద్రదంతిదంతతుహినహీ
రాకాశవాహినీబిస
నీకాశరమావకాశనిభగాత్రునకున్.

48


క.

శ్రీయువతీస్తనపరిరం
భాయతవక్షఃస్థలునకు నతులితవిజయో
పాయునకు శ్రీయహోబల
నాయకున కుదారవీరనరకేసరికిన్.

49

క.

నీకున్ బ్రబంధరత్నము
నాకల్పోన్నతిగ నిచ్చి యపవర్గపద
శ్రీ కర్హుఁడ నై వెలసెదఁ
జేకొను మౌభలగిరీంద్ర శ్రీనరసింహా.

50


వ.

నిత్యపరంపరామంగళాభివృద్ధిగా నారచింపం బూనిన వాసిష్ఠరామా
యణంబునకుం గథాప్రారంభం బెట్టి దనిన.

51


వ.

వైరాగ్యంబు, ముముక్షుత, ఉత్పత్తి, స్థిత, ఉపశమనంబు, నిర్వా
ణంబు, అని జ్ఞానోపదేశంబు లాఱుప్రకరణంబు లై యొప్పు అందు
బాలలీలోత్సుకుండగు రామచంద్రుండు ప్రసంగరూపంబున నువన్య
సించిన వైరాగ్యప్రకరణంబు తొలుత నెఱింగించెద.

52


క.

అతులతపస్స్వాధ్యాయ
వ్రతశీలుడు బోధనిధి భరద్వాజుఁడు వి
శ్రుతకీర్తిన్ యొక్కనాఁ డే
కతమున వాల్మీకిమౌనిఁ గని సుప్రీతిన్.

53


క.

పాదప్రణామపూజల
సాదరమున గురునిఁ దనిపి సాంజలియై య
వ్వేదమయుమొగము గనుఁగొని
మోలి మృదుమధురవాక్యముల నిట్లనియెన్.

54


గీ.

అనఘమానస మీదయ నఖిలవేద
శాస్త్రపారంగతుఁడ నైతి; జనులజన్మ
కలిత సంసార దురితసంకటము దొఱఁగి
యవ్యయానంద మగుమార్గ మానతిమ్ము.

55


వ.

అనిన విని ప్రియశిష్యుం డగుభరద్వాజునకు వాల్మీకి యిట్లనియె.

56


క.

విను వత్స లెస్స యడిగితి,
విన యోగ్యుఁడ వీవు నీకు విస్పష్టముగా

ఘనమోహతమము దూరం
బునఁ దొలఁగఁగఁ ద్రోచుమార్గమును వినిపింతున్.

57


గీ.

అకట భవపాశ బద్ధుండ నైననాకు
వెడలఁ బ్రా పెద్దియో యని వెఱచుచున్న
యార్తు డధికారి యగుఁ గాని యజ్ఞుఁ డైన
దజ్జ్ఞుఁ డైనను దీనికి దగఁ డొరుండు.

58


గీ.

కానఁబడు లేక విరియు నారావర్ణ
భాతి నీజాగరభ్రాంతి భ్రమలఁ బెట్టు
నదియుఁ బలుమాఱు దలఁచినయంతకంటె
నట్టితలఁపులు దలఁపనియదియ లెస్స.

59


గీ.

కానఁబడ్డవి మిథ్యలు గాఁగఁ దెలియు
జ్ఞానమునఁ జేసి దృశ్యమార్జనము సేయఁ,
జిత్తగేహంబు విమల మై చెలఁగి నిత్య
మైననిర్వాణపదవృత్తి యంద మొందు.

60


వ.

అట్లు గాక కేవల శాస్త్రగతంబులం బడి పొరలు సంసారులకుం గల్ప
శతంబుల నైనను మోక్షంబు పొందనేరదు. అందు మోక్షం బెట్టి
దనిన, నఖిల వాసనాపరిక్షయం బని సెప్పంబడు. అవ్వాసనలు మలి
నయు శుద్ధయు నన రెండు దెఱంగు లై యుండు. అందు మలినవాసన
యజ్ఞానతమోవృత్తియు నహంకారయుక్తంబును జన్మకారిణియు
నగు. మరియు శుద్ధవాసన వేఁచినబీజంబుంబోలెఁ బునర్జన్మాంకురంబు
బొడమనీక దేహార్థంబు ధరియింపంబడి తజ్ జ్ఞ యగు. అందు శుద్ధ
వాసనాయుక్తులు జీవన్ముక్తుఁ లనంబడుదురు. అందు-

61


క.

జీవన్ముక్తుఁడు రాఘవుఁ
డీవసుధాతలమునందు; నేర్పడ్డ విను మ
ద్దేవుచరితంబు జరనుం

జావును మాన్పంగ నోపు సౌజన్యనిధీ.

62


వ.

అనిన విని భరద్వాజుం డక్కథాక్రమంబు వివరించి సెప్పు మనుటయు
వాల్మీకి యిట్లనియె.

63


సీ.

నారాయణునినాభినలినోదరంబునఁ
        బరమేష్టి, పొడమెఁ, దద్బ్రహ్మవలన
ఘనుఁడు మరీచి నాఁ గలిగె, నమ్మౌనికి
        గశ్యపుఁ డుదయించి కనియె సూర్యు,
నాసూర్యునకు మను వౌరసుఁ డై యుద్భ
        విల్లి యేలెను ధాత్రి, నల్లమనువు
పడసి నిక్ష్వాకునిఁ బరఁగఁ దత్పతివంశ
        కర్త యై రఘు వుర్విఁ గీర్తి కెక్కె,


గీ.

నతని కజుఁడు పుత్త్రుఁ డై నేల పాలించె,
నతనివలన నిందుమతి యనంగఁ
దనరుభాగ్యవతికి దానచింతామణి
ధర్మమూర్తి పుట్టె దశరథుండు.

64


వ.

అమ్మహాభాగుండు తనకు నయోధ్యానగరంబు నిజరాజధానిగా నఖల
సముద్రముద్రితధరావలయంబు నఱువదివేలేండ్లు పాలించి సంతతి
లేమికి నత్యంతచింతాక్రాంతుం డై పుత్త్రకామేష్టి సేయింప యజ్ఞ
పురుషుం డగువిష్ణునివరంబునం గోసలరాజపుత్త్రి యగు కౌసల్య
యనుపతివ్రతాతిలకంబునకు నొక్కపుణ్యదివసంబునందు –

65


ఉ.

శ్రీమహితాభిరాముఁడు విశిష్టజనస్తవనీయసద్గుణ
స్తోముఁడు భక్తలోకముఖతోయరుహాయతషండచండరు
గ్ధాముఁడు జూనకీనయనకైరవసోముఁడు ఘోరసంగరో
ద్ధాముఁడు కౌస్తుభాఖ్యమణిధాముఁడు రాముడు పుట్టెఁ బుత్త్రుఁడై.

66


వ.

తదనంతరంబ కేకయ రాజపుత్త్రి యగు కైకకు భరతుండును సుమి

త్త్రకు లక్ష్మణశత్రుఘ్నులును జన్మించిరి. అక్కుమారులకుం గ్రమంబున
జాతకర్మచౌలోపనయనంబులు సేయింప వారలు దినదినప్రవర్ధ
మాను లై గురుమందిరంబునందు-

67


క.

వేదములు తదంగంబులు
వేదాంతప్రముఖనిఖలవిద్యలును ధను
ర్వేదము నెఱిఁగిరి రాముఁడు
వేదమయుఁడు గురుగృహంబు వెలువడి భక్తిన్.

68


గీ.

స్నాతకవ్రతనియమితాచరణవృత్తి
బుణ్యతీర్థంబు లాడుచుఁ బుణ్యమునులఁ
బుణ్యదేశంబులను జూచి భూరియశుఁడు
ప్రీతి నేతెంచె మరలి సాకేతపురికి.

69


క.

తుదిఁ గొన్నినెలలు గొఱఁ దగు
పదియాఱవయేఁట నిండుప్రాయంబున ను
న్మదవృత్తిఁ దొఱఁగి డస్సెను
హృదయము సంసారభీతి నెంతయుఁ గలఁగన్.

70


క.

మునిజనవృత్తులు గనుఁగొని
మనమున రాజ్యాభిలాష మఱచి యజస్రం
బును వంత నొంది రాముఁడు
దినదినమును గుందఁ దొణఁగె తేజం బెడలన్.

71


వ.

అయ్యవసరంబున నొక్కనాఁడు.

72


క.

గోత్రపవిత్రుఁడు గాధిసు
పుత్త్రుఁడు హతకలుషుఁ డఖిలబుధజననుతచా
రిత్రుఁడు ఘనుండు విశ్వా
మిత్త్రుం డఘవిపినపవనమిత్త్రుఁడు భక్తిన్.

73


క.

తనచేయుక్రతువు నిచ్చలు

దనుజులు చెఱుపంగ విసికి తద్రణక్షణకై
ఘను రామచంద్రు నచటికిఁ
గొనిపోయెద నని యయోధ్యకున్ జనుదెంచెన్.

74


వ.

ఇవ్విధంబున ననేకమునిగణపరివృతుం డై జనుదెంచిన కౌశికునకు
దశరథేశ్వరుం డెదురు సని నమస్కరించి తోడ్కొని వచ్చి యాసనా
ర్ఘ్యపాద్యాదివిధులం బూజించి కుశలం బడిగిన యనంతరంబ, రామ
చంద్రదర్శనలాలసుం డై యభ్యంతరమందిరంబున కరుగ నక్కు
మారుండును బ్రత్యుత్థానంబు చేసి ప్రణమిల్లి పూజించి కుశలం బడిగి
నయనంతరంబ, సుఖాసీనుం డై యమ్మునిపుంగవుండు రాఘవుం గరు
ణార్ద్రదృష్టిం జూచి యంగంబు నివురుచు ని ట్లనియె.

75


వైరాగ్యప్రకరణము

సీ.

తండ్రి రాజ్యస్థుఁ డై ధరణిఁ బాలింపంగ
యువరాజవైభోగయోగ్య మైన
యౌవనంబున సౌఖ్య మనుభవించుచు నుండ
కిట్టిమనోవ్యథ యేల కలిగె?
నెలుకలు ద్రవ్వినయింటిచందంబున
దిగజాఱి నీమేను మిగుల డస్సె
నీదుఃఖములు నీకు నేయర్థమునఁ బుట్టె?
నిట్టివిరక్తి నీ కేల వచ్చెఁ?


గీ.

గెలనివారు నవ్వఁ గలఁగి మ్రాన్పడి యున్న
నిన్నుఁ జూచి వగ జనించె నాకు
వినుము దెవులు లేనివేదనఁ బొరలుచు
నున్నరూపు సెప్పవోయి వత్స.

76


చ.

అన విని రామచంద్రుఁడు కృతాంజలి యై తల వంచి భక్తి న
మ్మునికి నమస్కరించి, వగ మో మెగయింపఁగ లేక, బాష్పముల్

గనుఁగవ నుబ్బి జాఱ, మెయి కంపము నొందఁగ, మాట తొట్రుపా
టెనయఁగఁ బేరెలుం గదర, ని ట్లని పల్కె భయార్తమూర్తి యై.

77


గీ.

పుట్టు రూపంబు లెల్లను బొలియుకొఱక,
పొలియు టెల్లను గ్రమ్మఱఁ బుట్టుకొఱక,
కాని యెందును నిలుగడ గానలేని
యిట్టి సంసారమున సుఖ మెద్ది? నెపుడ.

78


గీ.

అస్థిరంబగు సర్వంబు నని యెఱుంగ
రాజ్యసుఖముల కె ట్లనురక్తి పొడము?
'ఏమి భోగంబు నా కిది యేమి వచ్చె?
నకట యెవ్వండ నే న' ని యాత్మఁ దలఁతు.

79


గీ.

ఇట్టిదుఃఖంబు నా కింక నెట్లు దొలఁగు?
ననుభయంబున దుర్వ్యథఁ దనరుచుందు,
జరఠతరుకోటరోజ్జ్వజజ్జ్వలనుభంగిఁ
బెరసి చింతానలము లోన దరికొనంగ.

80


క.

పెనురాలు నీటఁ గ్రుంకిన
యనువున దుర్వ్యథలు నన్ను నారటపఱుపన్
ఘనశోక మొదవి బంధులు
విని వగచెద రచుచు నేడ్వ వెఱతు మునీంద్రా.

81


క.

ఏవిధమునఁ దలపోసిన
నావిధమున నాకు నరుచి యగు సంసారం
బే నెట్టులఁ దరియింపుదు?
నే వెరవున విశ్రమింతు నిద్ధచరిత్రా?

82


గీ.

విత్త, మాయు, వహంకృతి, చిత్త, మాశ,
తనువు, బాల్యంబు, యౌనంబును, సుదతులు,
వార్ధకము, కాల మనునట్టివస్తువితతి

నేవి మే లని భోగింతుఁ బావనాత్మ?

83


వ.

అవి యెయ్యవి యం టేని.

84


గీ.

సొరిదిఁ జింతాసమూహంబు చుట్టియున్న
ధనము దుఃఖంబె గాని సంతసము నీదు,
సంప్రసూతకళత్రసంశ్రయగృహములు
దీను లగువారి కాపద దెచ్చునట్లు.

85


క.

మదకారణంబు లోభా
స్పద మవివేకంబు త్రోవ భయచింతలకున్
గుదు రఘరాశి మహోగ్రా
పదలకు నాశ్రయము ధనము పరమమునీంద్రా.

86


క.

పరనింద పడనిధనికుడు,
సొరిదిం దనుఁ బొగడుకొనని శూఁరుఁడుఁ, బ్రజలన్
సరిగాఁ జూచిన ప్రభువును,
బురుషోత్తమ యెందు దుర్లభులు తలపోయన్.

87


ఉ.

చిత్తసమాకులీకరణశీలమనోరమ దైన్యసాధ్య ని
స్సత్త మహాభుజంగకులసంశ్రయగర్తసమృద్ధవల్లి దు
ర్వృత్తగృహాంతవాసిని నవీనవిలాసిని లక్ష్మి; యిట్టిసం
పత్తి సమస్తదోషభవబంధభయప్రద గాక సౌఖ్యమే.

88


వ.

మఱియు నాయు వెట్టి దంటేని.

89


గీ.

ఆయు వస్థిరంబు నతిపేలవము పల్ల
వాగ్రసలిలబిందువట్ల తలఁప
నుండి యుండి దేహ మూరక పడఁ ద్రోచి
వేదు రెత్తినట్లు విడిచిపోవు.

90


క.

విషయాశీవిషభీషణ
విషజర్జరితాత్ము లాత్మవిద్యావినయ

ద్విషు లగువారలబ్రతుకులు
విషమంబులు చవుట నిడినవిత్తులు దలఁపన్.

91


గీ.

పొందవలసినయర్థంబు పొంద నేర్చి
దుష్కృతులు చేసి క్రమ్మఱ దుఃఖపడక
యచలనిర్వాణసుఖవృత్తి నందునట్టి
వారిబ్రతుకులు బ్రతుకులు వసుదమీఁద.

92


క.

జననంబు నొంది వెండియు
జననము లేకుండ మెలఁగుజనుజననంబే
జననంబు గాక, ముదిమిని
బనుపడు పెనుగార్దభంబు బ్రతుకును బ్రతుకే?

93


వ.

మఱియు నహంకారం బెట్టి దనిన.

94


క.

అనఘా మోహమువలనన
పనిలేకయ పుట్టి పెరిగి పగతుం డై పైఁ
జను మిథ్యాహంకారముఁ
గనుఁగొన మదిలోన వగపు గదిరెడు నాకున్.

95


గీ.

విను మహంకార మెందాఁక వృద్ధిఁబొందు
నకట యందాక తృష్ణయు నతిశయిల్లు,
మేఘబృందంబు సాంద్ర మై మింటఁ దోపఁ
బొరి విజృభించుకుటజమంజరియుఁ బోలె.

96


వ.

మఱియుఁ జిత్తం బెట్టి దనిన.

97


గీ.

దోషజుష్ట మైనదుర్జనచిత్తం బ
నార్య మార్యసేవ కలమికొనక
పవనచలితపింఛలవముచందంబునఁ
జంచలించు చుండు సన్మునీంద్ర.

98


క.

దూరము పనిగలగతిఁ జను,

నూరక యిల్లిల్లు సొచ్చు, నొగిఁ జీ యనఁగాఁ
గూరదు సిగ్గున, సుజనుల
జేరదు, చిత్తంబు, గ్రామసింహము వోలెన్.

99


గీ.

ఎట్టిచోట నయిన నించుక మేలును
బొందలేదు నిధుల బొందెనేనిఁ,
బెరసి మానసంబు, పరితృప్తి నొందదు,
జలము నించునట్టిపజ్జభంగి.

100


గీ.

పరఁగ భూమినుండి పాతాళమునఁ గ్రుంకు,
నచటనుండి ధాత్రి కరుగుదెంచుఁ,
గ్రూరరజ్జుకలితకూపకాష్ఠముభంగిఁ
దెరలి మనసు సాలఁ దిరుగు చుండు.

101


క.

కనకాద్రి నెత్తవచ్చును,
వనరాసులు గ్రోలవచ్చు, వనశిఖిఁ గడిగాఁ
గొనవచ్చుఁ, గాని యేగతి
మనము నిరోధింపరాదు మహితవివేకా.

102


వ.

మఱి తృష్ణ యెట్టి దంటేని.

103


క.

హృదయాంధకార మొదవఁగ
విదితం బై తృష్ణ వొడము, విను, దోషములన్
గుదు రగుచుండును, శర్వరి
యుదయింపఁగ గూబకదుపు లొగి వచ్చుగతిన్.

104


గీ.

అధికసంసారదోషంబులందు నెల్ల
నధికదోషంబు తృష్ణయే యండ్రు మునులు,
వెలయ నంతఃపురములోనివిభుని నైన
బహులసంకటములపాలుపఱుచుఁ గాన.

105


గీ.

ఆయసాగ్నికంటె నసిధారకంటెను

బిడుగుకంటెఁ జాల బెడిద మగుచుఁ
దృష్ణ పేచిన్ మిగుల దీవ్ర మై సతతంబు
హృదయముల వసించి యేర్చు ననఘ.

106


క.

మేరుసమానుని నైనను
శూరోత్తము నైనఁ దృష్ణ సోఁకిన యేనిన్
జీరికిఁ గైకొన రెవ్వరు
నారయ నది దొఱఁగినతఁడె యధికుం డెందున్.

107


వ.

మఱియు శరీరం బెట్టి దనిన.


చ.

గురుతర శల్యసంగతము గుర్వగుమాంసవిలేపనంబు పె
న్నరములప్రోక చర్మపరిణద్ధము శోణితమజ్జపూయమం
దిరము వికారధర్మి యగుదేహము రోగనిధానగేహ మౌఁ
బురుషవరేణ్య యీ చెనఁటిబొందుల కేమిసుఖంబు సెప్పుమా.

108


గీ.

ముదిమికాల మైన ముదిమియుఁ బొడసూపు,
మరణకాల మైన మరణ మొదవు,
పేదవాని కైన పృథివీపతికి నైన
సమమ దేహములకు సహజ మిదియ.

109


గీ.

ఘనతటిల్లతికలు గంధర్వనగరంబు
లభ్రపంక్తు లట్ల యస్థిరంబు
లై విశీర్ణశాల లగుశరీరంబుల
విశ్వసించువారు వెడఁగు లనఘ.

110


సీ.

ఆశాసమావృతి, యతిశక్తిహీనత,
        జాడ్యంబు, దైన్యంబు, చపలతయును,
మాటాడ నేరమి, మాటపొం దెఱుఁగమి,
        యిది పాము త్రా డని యెఱుక లేమి,
మూత్రపురీషసంప్లుతగాత్రుఁ డై యుంట,

        తన్నుఁ దా నెఱుఁగక తన్నుకొనుట,
కదలి యిట్టట్టు పోఁ గాళ్లు రా కుండుట,
        గురుజనశిక్షలఁ గుతిలపడుట,


గీ.

యివియు మొదలు గాగ నెన్నఁ బె క్కగునట్టి
బోధ లనుభవించు బాల్యవృత్తి
పరమమునివరేణ్య ప్రత్యక్షనరకంబు,
దీన నేమి సుఖము తెలుపవయ్య.

111


క.

తల్లియుఁ దండ్రియు నితరులుఁ
బల్లిదులై తోడ నాడుపడుచులు నడువన్
దల్లడపడుశైశవ మిది
చెల్లంబో దురితదుఃఖశీలము గాదే.

112


వ.

మఱియు యౌవనం బెట్టి దనిన.

113


క.

బాలత్వ మెడలి, తరుణిమ
కా లూఁదఁగఁ, జిత్తభవవికారంబులు మైఁ
గీలుకొని త్రుళ్లఁ జేయఁగఁ,
పాలసుఁ డై దురితవితతిపా ల్పడి పోవున్.

114


గీ.

యౌవనంబునందు నవికారి యై తన్నుఁ
బరులు మే లనంగ బ్రతికెనేని,
యతఁడు పుణ్యపురుషుఁ డతఁ డుత్తమోత్తముఁ
డతడు వంద్యమానుఁ డఖిలమునకు.

115


క.

వినయము బుధసంశ్రయ మై
ఘనగుణమణిచయము సానుకంపాస్పద మై
తనరెడుపుణ్యాత్ములయౌ
వన మతిదుర్లభము గగనవనమును బోలెన్.

116


వ.

మఱియు స్త్రీ లెట్టివా రంటేని.

117

సీ.

అస్థికీకస సిరాయతమాంస పుత్త్రిక
        లంగనాజనలలితాంగకములు,
కీలాల మూత్ర సంక్లిష్టదుస్సహములు
        తరళలోచనలనితంబకములు,
చర్మసువృతమహాదుర్మాంసపిండంబు
        లువిదలపీనపయోధరములు,
కలితలాలాశ్లేష్మఘనగరండంబులు
        కొమ్మలమోపులు, కుటిలబాష్ప


గీ.

మయము గానుండు నతివలనయనజాల,
మిన్నియును జెప్ప నేటికి నింతులందు
నెచటఁ గనుపెట్టి చూచిన హేయకరము
గాక యెచ్చోట సుఖము సుశ్లోక చెపుమ.

118


క.

మరుఁ డను మేటికిరాతుఁడు
సరభసముగ ముగ్ధమతుల జనవిహగములన్
దొరసి పడ నడఁప నొగ్గిన
యురులు సుమీ సంయమీంద్ర యువిదలు దలఁపన్.

119


క.

సతులె యిహలోకసుఖదలు
సతు లెడలిన సౌఖ్య మేమి? సతి విడువ జగ
త్త్రితయము విడుచుటె, జగముల
సతి విడిచినయతఁడ సుఖిసమర్థుం డరయన్.

120


వ.

మఱియు వార్ధకం బెట్టి దనిన.

121


గీ.

బాల్యవృత్తి నెగడి పర్యాప్తి గా నీక
యౌవనంబు గ్రోలు, నంత నదియు
వర్ధిలంగ నట్లె వార్ధకం బది గ్రోలుఁ,
గంట యొండొరువుల క్రౌర్య మిదియ.

122

క.

నరునిశరీరమున జరా
తరుణి ప్రవేశించి ప్రజ్ఞ దరలించుఁ జుమీ
పరకాంత గృహముఁ జేకొని
దురటిలునిల్లాలి వెడలఁ ద్రోచిన భంగిన్.

123


సీ.

పుత్త్రదారాదులు మిత్త్రులుఁ దనుఁ వెఱ్ఱిఁ
        జేసి నవ్వఁగ మదిఁ జివికి చివికి,
కుడువ వేడుక పుట్టి గడియు నోటికిఁ బోని
        వేదన వెడవెడ వెచ్చి వెచ్చి,
యంగకంబులజవం బడఁగంగఁ దనివోని
        భోగేచ్ఛ వొడమఁగఁ బొక్కి పొక్కి,
తనుతంతువులు రోగ మనుమూషకము చేరి
        కొఱుకంగ లా వేది క్రుస్సి క్రుస్సి,


గీ.

కడఁగి మేన బూదిఁ దుడిచినవిధమున
ముణిఁగి నరసియున్న ముదుకశిరముఁ
గోరి బూదిచఱుచుకూష్మాండఫలభాతి
వెదకి కాలుఁ డనుభవింప కున్నె.

124


గీ.

మరణ మనునృపాలుఁ డరుదేర ముందఱ
రమణఁ బలిత చామరములు వీవ
దొరసి రోగదోషదుఃఖసేనలు వేగ
నరుగుదెంచు చుండు ననఘచరిత.

125


వ.

మఱియుఁ గాలం బెట్టి దనిన.


గీ.

ఎలమి సంసారమున సుఖ మింత లేదు;
ఎట్టకేలకు నది జనియించెనేని,
కాలుఁ డెడ సొచ్చి తా నది గ్రోలు చుండుఁ,
దఱిమి తంతుల నెలుకలు గొఱుకునట్లు.

126

క.

విశ్వాత్ముఁ డైనకాలుఁడు
విశ్వముఁ గబళించు మాయ విలసింపఁగ, నీ
నశ్వరసంసారంబు ము
నీశ్వర మముఁబోఁటిజనుల కేటికిఁ జెపుమా.

127


గీ.

ఇంద్రియములె శత్రు లింద్రియంబులకును;
సత్యమున నశించు సత్యనియతి
యాత్మ నాత్మ యణఁచు నతిఘోర మగుకాల
మహిమఁ దన్మనంబు మనముఁ జెఱుచు.

128


ఉ.

దిక్కులు కొండలుం జుణుఁగు, దేశము లెల్ల నదృశ్యమై చెడున్;
జుక్కలు డుల్లు, నంబుధులు శోషిలు, విష్ణువిరించిరుద్రులున్
దక్కక గ్రాఁగిపోదురు, బుధస్తుత కాలుఁడు వేచి మ్రింగఁగా;
నక్కట మర్త్యు లెల్ల మనునాసలు చేయుట మోస మౌఁగదే.

129


క.

అనఘుఁ డవాచ్యుఁ డదర్శనుఁ
డనుపముఁ డశ్రాంతుఁ డభవుఁ డజ్ఞాతుఁడు నాఁ
జను విభ్రమకాలుఁడు భూ
జనము విడంబించు చుండు సన్మునివర్యా.

130


గీ.

సభ్యు లైనవారిసంగతి నహములు
పుచ్చ కిటను నటను బోయి రాత్రు
లింటి కరిగి విశ్రమించుసంసారుల
కెట్లు నిద్ర వచ్చు సిద్ధచరిత?

131


సీ.

బ్రహ్మయోగీంద్ర యీభవరోగములు నాకు
        నేవెంట నెడఁబాయు? నెద్ది సార?
మేమార్గమునఁ జేసి యీదుష్టసంసార
        దుఃఖంబు వెడలు? సత్పురుషు లొందు
గతి నాకుఁ గలుగు మార్గము విస్తరించి మీ

        రెఱిఁగినభంగి నా కెఱుఁగఁ జెప్పుఁ;
డెఱిఁగింప కుంటిర యేని మజ్జనభోజ
        నాదులఁ దొఱఁగి మీ యడుగులొద్ద


గీ.

మేను దొఱఁగువాడ; మీయాన; యని పల్కి
నిబిడబాష్పకలితనేత్రుఁ డగుచుఁ,
చిత్రరూపభంగిఁ జేరి యూరక యుండె
సత్యధనుఁడు రామచంద్రుఁ డనఘ.

132


వ.

అని యివ్విధంబున వైరాగ్యప్రకరణంబు తద్రసగర్భితంబు లగువా
క్యంబుల నుపన్యసించిన రామచంద్రుం గనుంగొని మునిజనం బనేక
విధంబులఁ బ్రస్తుతింప విశ్వామిత్త్రుండు సంతుష్టాంతరంగుం డై యి
ట్లనియె.

133


ముముక్షుప్రకరణము

క.

మనువంశతిలక, సర్వం
బును జెప్పితి వీవ, సూక్ష్మబుద్ధిని నీయం
తన దెలిసినాఁడ, విఁక నే
వినిపించెడి యర్థ మెద్ది విజ్ఞాననిధీ?

134


వ.

ఈ యర్థంబున కొక్క యితిహాసంబు గలదు. తత్కథాకర్ణనం
బున నీకును జిత్తసంశయనివృత్తి యగు. దత్తావధానుండ వై విను
మని కౌశికుం డిట్లనియె.

135


గీ.

అనఘ, నీయట్ల శుకయోగి యాత్మబోధ
తాన తనసూక్ష్మబుద్ధి నంతయును దెలిసి,
బుద్ధివిశ్రాంతికై శంక వొడమి, తండ్రి
పాలి కేతెంచి ప్రణమిల్లి పలికె నిట్లు.

136


క.

ఈమలినపు సంసారం
బేమిట నుదయించె? నెంత? యెవ్వని? కిది

కేమిగతి నెన్నఁ డణఁగును?
ధీమన్నుత తెలియ నాన తీవే నాకున్.

137


వ.

అనిన వేదవ్యాసుండు పుత్త్రున కి ట్లనియె.

138


క.

తనబుద్ధివికల్పనమున
జనియించు జగంబు; దాని సంక్షయమున నా
శన మొందును సంసారం;
బని మదిఁ గను మిదియె నిశ్చితార్థము పుత్త్రా.

139


క.

అని యిట్లు తండ్రి సెప్పిన
వినుతోక్తులు వినియు శుకుడు విద్యానిధి ని
మ్మనమున బహూకరింపమి,
గని వేదవ్యాసుఁ డతనిఁ గని యి ట్లనియెన్.

140


క.

ఏ నింతకు మిక్కిలి విన;
భూనుత నీ వడుగువాక్యముల కుత్తరముల్
ధీనిధి మిథిలానాథుడు
భానునిభుఁడు జనకభూమిపాలుఁడు సెప్పున్.

141


వ.

అతఁడు నీచిత్తసంశయంబుఁ బాప సమర్థుం డచ్చటికిం జని యడుగు
మనిన, శుకుండును జనకానుమతంబున మిథిలానగరంబునకున్ జని,
మహామునిగణ రివృతుండైన జనకుం గాంచిన, నమ్మహాత్ముండు
ప్రత్యుత్థానంబు సేసి యమ్మహానుభావుం బూజించి యాగమనప్రయో
జనం బడిగిన, శుకుండు దన తండ్రి నడిగిన యట్ల యడిగిన విని జన
కుండు పెద్దయుంబ్రొద్దు విచారించి యి ట్లనియె.

142


క.

అనఘ, చిత్పురుషుఁ డొక్కఁడె;
విను మన్యము లేదు; తత్త్వవిధ మిట్టి దగున్;
దన సంకల్పమె బంధము
తనసంకల్పక్షయంబ తగ ముక్తి యగున్.

143

క.

ఇవి తత్త్వనిశ్చితార్థము;
విదితం బిది తప్ప లేదు వేఱొక్కటి నీ
మది దృశ్య ముడిగినాఁడవు
పదిలంబుగ, నిదియ పట్టి భ్రాంతిఁ దొఱఁగుమీ.

144


క.

అని తత్త్వనిశ్చయము తన
జనకుఁడు మును చెప్పినట్లు జనకుఁడు సెప్పన్,
విని మానసవిశ్రాంతియుఁ
దనరఁగ, శుకయోగివరుఁడు తత్పతి కనియెన్.

145


క.

నా తెలివియు నిట్టిద మును,
మాతండ్రియుఁ జెప్పుశాస్త్రమత మిదియే, నీ
చేతం దెలియఁగ వింటిని,
జేతోవిశ్రాంతిఁ గంటిఁ జిత్సౌఖ్యనిధీ.

146


క.

అని శుకుఁడు నిశ్చితార్థము
గని బహుకాలంబు నిర్వికల్పసమాధిం
దనరియు నిర్వాణతఁ బొం
దెను దా నిఃస్నేహయుక్తి దీపమ పోలెన్.

147


వ.

అని చెప్పి విశ్వామిత్త్రుండు రామచంద్రున కి ట్లనియె.

148


గీ.

శుకుఁడు తెలిసినట్ల సకలంబు నీవును
దెలిసినాడ; వాత్మ మలినమార్జ
నమ్ము వొంది నీవు నన్ను వేఁడినమాట
కుత్తరంబు నిదియె చిత్తగింపు.

149


వ.

జ్ఞాతృజ్ఞేయం బైనచిత్తం బతిసమగ్రం బగుభోగబృందానుభవంబు లే
కునికియ లక్షణం బగువస్తువు జగం బగు, బంధంబు భోగవాసనచేత
దృఢం బగు, నవ్వాసన శాంతం బైన నబ్బంధంబు తనుత్వంబు నొందు.
అని సెప్పి విశ్వామిత్రుడు వసిష్ఠమహామునిం గనుంగొని, యిమ్మహా

త్మునకు బుద్ధివిశ్రాంతి యగువాక్యంబు లుపదేశింతురు గా కని పలు
కుటయు, నమ్మహాముని తొల్లి కౌశికునకు దనకు నైన వైరం బుప
శాంతి పొందెడునట్లు కమలగర్భుఁడు చెప్పిన వాక్యంబులు రామచం
ద్రునకుం జెప్పం దలంచి యి ట్లనియె.

150


సీ.

అనఘ, సంసారంబునందు సర్వంబును
        బౌరుషంబునఁ బొందఁ బడెడి; నందు
విను పౌరుషము రెండువిధము లై యుండు, స
        శాస్త్రంబు శాస్త్రానుసారి యనఁగ
నందు నశాస్త్రంటు నర్థసంప్రాప్తి కా
        శాస్త్రీయ మగు పౌరుషంబు దలఁపఁ
బకమార్థమున కగుఁ; బొరిఁ బూర్వవాసనా
        ప్రాప్తమైన యశాస్త్రపౌరుషంబు


గీ.

పర్వినప్పుడు శాస్త్రీయపౌరుషంబు
చేత నది యడ్డ పెట్టుచుఁ జిత్తశాంతి
నిగిడి సతతంబు వర్తింపు నెమ్మితోడఁ
బ్రకటసౌజన్యగుణభద్ర రామభద్ర.

151


గీ.

పూని యనభిజ్ఞచిత్తుఁడ వైననీవు
తగిలి యెందాక సుజ్ఞానతత్త్వుఁ డగుదు
మరగి యందాఁక గురుశాస్త్రమతము లెఱిఁగి
యాచరింపుము నిచ్చలు నతులపుణ్య.

152


వ.

అని చెప్పి, 'సంసారదుఃఖనివారణంబును ధీసమాశ్వాసనంబునుం గాఁ
బరమేష్టి తొల్లి నా కుపదేశించిన వాక్యంబులు తేటపడ నెఱింగించెద
నాకర్ణింపు' మనిన, విని రామచంద్రుండు 'పరమేష్టి యేమి కారణం
బున నేమి యుపదేశించె? నది మీ చేత నెట్లు పొందంబడియె? నత్తెఱం
గానతిం డ' నిన వసిష్ణుం డి ట్లనియె.

153

క.

అమల మనంతవిలాసం
బమృతము సర్వగము సచ్చిదాకాశ మనా
శము పరిపూర్ణం బగుతే
జము గల; దది వెలుఁగు సర్వసంశ్రయ మగుచున్.

154


క.

అది కదలియుఁ గదలనిదెస
నుదయించెను విష్ణుఁ, డతనియుదరంబునఁ బెం
పొదవిన కనకాంబుజమున
విదితంబుగ బ్రహ్మ పుట్టె విశ్వజనకుఁ డై.

155


వ.

అద్దేవుండు సకలభూతంబులం దత్కర్మానుసారంబుగం బుట్టించుటయు,
నీభారతవర్షజాతు లగు వారలు దుర్వ్యసనాక్రాంతస్వాంతులును
నల్పాయువులును నై దుఃఖించుచున్న, వారలం గనుంగొని దుఃఖు
లగుపుత్త్రులం జూచి శోకించుజనకుండునుంబోలెఁ గరుణించి, యేకా
గ్రచిత్తుం డై కొండొకసేపు చింతించి, జపదానతపస్తీర్థంబు లత్యంత
దుఃఖనివారకంబు గా వని సకలదుఃఖనిర్హరణం బై పరమానందంబు
నొందించునట్టి నిర్మలజ్ఞానోపదేశంబుఁ జేయం దలంచి, పరమేష్ఠి తన
మనంబువలన నన్నుఁ బుట్టించి నాకు సంసారవ్యాధిభేషజం బగుపర
మజ్ఞానంబు బహుప్రకారంబుల నుపదేశించి యి ట్లనియె.

156


గీ.

కడఁగి యేతత్క్రియాకర్మకాండసరణిఁ
గర్మకారుల కెఱిఁగింపు, కడు విరక్తు
లైనవారికి నాత్మవిజ్ఞానమార్గ
మర్థి బోధింపు, పుత్త్ర నీ వనుదినంబు.

157


వ.

అని యాజ్ఞాపించిన యక్కమలసంభవుచేత నియుక్తుండ నై యాయా
భూతపరంపరయందు విహరించుచుండుదు.

158


గీ.

ఊరకుండుదుఁ, గర్తవ్య మొకటి లేదు,
శాంతమతిఁ జేసి నిజమానసంబు గెలిచి

సుప్తుఁ డగువాని బుద్ధి విస్ఫురణభంగిఁ
జేసియును జేయకుండుదుఁ జేయుపనులు.

159


క.

గురువాక్యము శాస్త్రార్థముఁ
బొరిపొరిఁ జిత్తానుభవముఁ బొందించి నిరం
తరమును నైక్యాలోకన
పరుఁ డగునభ్యాసి పొందుఁ బరతత్త్వంబున్.

160


గీ.

అల్పసంస్కృతమానసు లైనవారి
కైన మది మౌర్ఖ్య - మెడలించునట్టిశాస్త్ర
మిదియ తప్పంగ మఱి యన్య మెద్ది గలదు?
వినుము తత్పరబుద్ధివై మనుజనాథ.

161


క.

ధనమును గాయక్లేశముఁ
దసమిత్త్రులు తీర్థదేవతాసేవలు నెం
దును దత్త్వము నొందింపవు,
మనము నిరోధింపకున్న, మనుకులతిలకా.

162


క.

విను మోక్షద్వారపదం
బునకు శమంబును విచారమును సంతోషం
బును సాధుసంగమంబును
ననునాలుగు ద్వారపాలకాభిదము లగున్.

163


వ.

అవి యెయ్యవి యంటేని.

164


గీ.

దోషములు దుష్క్రియాదులు దుస్సహంబు
లైనదుఃఖంబు లెల్లను నాక్షణంబ
శాంతి మది నూనుమాత్రన సమసి పోవు,
నర్కుఁ డుదయింపఁ జీఁకటి యణఁగునట్ల.

165


క.

వినునెడఁ గనుఁగొనునెడ మూ
ర్కొనునెడ ముట్టునెడఁ జవులు గొనునెడ మేల్గీ

డును వచ్చినపుడు మోదం
బును ఖేదము లేనియుత్తముఁడు శాంతుఁ డగున్.

166


గీ.

పొలుచు వేడుకఁ బెండ్లికిఁ బోవునపుడు
నుగ్రు లై చంపఁ గొనిపోవు చున్నయెడల
చిత్త మెంతయుఁ జల్ల నై శీతకరుని
చందమున నున్నయాతండు శాంతుఁ డండ్రు.

167


గీ.

తాపసులయందు శాస్త్రవిత్తములయందు
యాజకులయందు నృపులందు నతిబలాఢ్యు
లందు శమయుక్తుఁ డగువాఁడ యధికుఁ డెందు;
నని యెఱుంగుము మనమున మనుకులేశా.

168


గీ.

వినుము శాస్త్రావబోధచే విస్తరిల్లి
పూతమును నిర్మలము నైనబుద్ధిఁ జేసి
కారణ మెఱింగి యాత్మవిచార మాత్మఁ
దవిలి సేయుచు నునికి కర్తవ్య మనఘ.

169


గీ.

అంధకారంబునందును నణఁగి పోదు,
దీపతేజంబునందును దిరిగి రాదు,
ఎట్టిమఱు వైనఁ గన్పించు నెదురులేక
చారుతర మైనయట్టి విచారదృష్టి.

170


క.

'ఏ నెవ్వఁడ? సంసారా
ఖ్యానం బీదోష మెట్లు గలిగెనొ?' యనుచుం
దా నిజయుక్తిం దెలియుట
వూని విచారంబు నీకె పో రఘువీరా.

171


క.

సంతోషము సుఖతర మగు,
సంతోషము నిత్యమోక్షసంప్రాప్తి యగున్,
సంతుష్టుం డెందును వి

శ్రాంతస్వాంతుండు రామ సౌజన్యనిధీ!

172


గీ.

వఱల నప్రాప్తములయెడ వాంఛ యెడలి
ప్రాక్యములయెడ సమతమైఁ బట్టుకొల్పి
పూని సుఖదుఃఖములు మదిఁ గానఁ బడని
యతఁడు సంతుష్టుఁ డనఁబడు నఖిలమునను.

173


గీ.

సర్వమానవులకు సంసారతారణ
కారణంబు పుణ్యకారణంబు
నై వెలుంగుచుండు నఖిలసంస్తుత్య మై
సాధుసంగమంబు జనవరేణ్య!

174


గీ.

విమలమతులు సములు వీతగర్వగ్రంథు
లాత్మవిదులు సాధు లైనజనులు
సేవ్యు లెందు వారి సేవించుటయ భవ
జలధి యుత్తరింపఁ గలుగువెరవు.

175


వ.

ఇట్లు సేవింపంబడు భవభేదనోపాయంబులను నీనాలిగింటి నభ్యసిం
చినవారలు మోహపారావారోత్తీర్ణులు అని చెప్పి వసిష్ఠుండు
మఱియు నిట్లనియె.

176


గీ.

యుక్తియుక్త మైనసూక్తులు బాలుండు
చెప్పి నేని వినుము చిత్తగించి,
యన్య మైనవచన మది బ్రహ్మ చెప్పినఁ
దృణమ పోలె విడువు ధీరహృదయ.

177


వ.

అని చెప్పి మఱియు నిట్లనియె.

178


సీ.

బ్రహ్మోపదేశంబు స్పష్టంబుగా నీకు
దృష్టాంత మొప్పఁగాఁ దేటగాఁగ
నింతయుఁ జెప్పితి నిది యుపదేశ సా
మగ్ర్యంబుగాఁ జిత్తమందు నెఱుఁగు

మట్లు నిరాకార మైనబ్రహ్మమునందు
        సాకారదృష్టాంత మైనయట్టి
యపవిత్రములు ప్రమోషాంతరంబులు నగు
        మూలవాదంబుల మొగిఁ గుతార్కి


గీ.

కత్వ మొందక చిత్తంబు కలఁగఁబడక
శమదమాదులచేత సుజ్ఞాన మొదవ,
నవి పరస్పరవృద్ధి యై యబ్జములును
సరసియును గూడి వర్ధిల్లు చంద మొందు.

179


గీ.

యశము నాయువుఁ బుణ్యంబు నర్థి నిచ్చు,
నఖిలపురుషార్థ మగు, నీటి యర్థి వినిన,
బుద్ధినైర్మల్య మొందించు, బోధ వొడమి
తత్పదంబునఁ బొందెడు ధర్మచరిత.

180


వ.

అని యిట్లు ముముక్షుప్రకరణంబు వసిష్ఠుండు రామచంద్రున కెఱిఁ
గించె ననిన విని సంతుష్టాంతరంగుం డై భరద్వాజుం డటమీఁది
వృత్తాంతం బేమి సెప్పె నెఱింగింపు మని యడిగిన.

181


ఉ.

ధన్యచరిత్ర ఫుల్లసితతామరసాయతనేత్ర లోకస
మ్మాన్య రమాకళత్ర మణిమండనమండితగాత్ర దైత్యరా
జన్యలతాలవిత్ర భవసాగరతారణమానపాత్ర సౌ
జన్యమనీషిమిత్త్ర రిపుసంచయశోషణ భృత్యపోషణా.

182


క.

శశిశకలసదృశ బిసనిభ
దశనాంకుర నఖరముఖ విదారిత విద్వి
ట్పిశితాశనవక్షస్స్థల
శశిధర ఫాలాక్ష భక్తజనిహర్యక్షా.

183

మాలిని.

పటుజలధరభాసా స్ఫార ఘోరాట్టహాసా
కుటిలజటిలకేశా కోటిసూర్యప్రకాశా
త్రుటితదురితపాశా దుష్టదైత్యప్రణాశా
నిటలతటసనేత్రా నిత్యలక్ష్మీకళత్రా.

184


గద్య.

ఇది శ్రీ నరసింహవరప్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజసగోత్ర
పవిత్రాయ్యలామాత్యపుత్త్ర సరసగుణధుర్య సింగనార్య ప్రణీతంబైన
జ్ఞానవాసిష్ఠరామాయణంబునందు వైరాగ్యప్రకరణంబును ముముక్షు
ప్రకరణంబును నన్నది ప్రథమాశ్వాసము.

  1. పా. పుత్త్రుఁడై