Jump to content

వాసిష్ఠరామాయణము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

వాసిష్ఠరామాయణము

ద్వితీయాశ్వాసము


క.

శ్రీమదహోబలపట్టణ
ధామ మహోద్దామచక్రదారితదనుజ
స్తోమ భవభీమ భక్త
క్షేమంకర విదళితాంహ శ్రీనరసింహా.

1


ఉత్పత్తిప్రకరణము

వ.

దేవా సకలతత్త్వార్థవివేకి యగు వాల్మీకి భరద్వాజున కి ట్లనియె.
అట్లు ముముక్షుప్రకరణం బెఱింగించి వసిష్ఠుండు రామచంద్రుం
గనుంగొని – సకలజగ దుత్పత్తి స్థితి లయ కారణంబు మనం బని
చెప్పంబడు, నీయర్థంబున కొక్కనిదర్శనంబు గల దాకర్ణిం
పుము; అని యిట్లనియె.

2


సీ.

పరఁగ నుత్పత్తిప్రకరణం బెఱింగింతు;
        నాకాశజంబు లీలాఖ్యకంబు
తనరు కర్కటియు నై తర్వాతఁ గృత్రిమేం
        ద్రము చిత్తజాఖ్యానకమును శాంబ
కంబును మఱి లవణంబును సప్తభూ
        ములు వన నితిహాసములును గలుగు
నందు నాకాశజాఖ్యానంబు మొదలనే
        బోధ్యరూపము సూక్ష్మముగ వచించి


గీ.

పిదప విస్పష్ట మొనరింతు నదియుఁ దెలియ
వినుము ప్రతిపత్తియును భూతివేదనంబు

దనరు నపరోక్షచైతన్య మనఁగ నివియు
జీవునకు నామకములు రాజీవనయన.

3


వ.

సంవిత్స్వరూపం బగు జీవుండు పదార్థజ్ఞానోదయంబున నహంకార
ముక్తుం డై పురుషుం డనంబడు; నతండు సంకల్సవికల్పాది భావ
జనితం బగు విపరీతజ్ఞానంబున నుదకంబ ఫేనతరంగబుద్బుదాకారం
బగునట్లు తాన జగద్రూపం బై వెలుంగుచుండుఁ; దత్ప్రపంచంబ
బంధంబును దన్నిరసనంబ ముక్తియు ననంబడు; నట్లు గావున తద్దృ
శ్యనిరసనమార్గం బెఱింగించెద నాకర్ణింపుము.

4


గీ.

కానఁబడుచున్నయట్టిజగంబు లెల్ల
విలయకాలంబు నప్పడు విరిసిపోవు,
వినుము నిద్రించి తెప్పిఱువేళలందు
దొడరి కల లేమియును లేక యడఁగినట్లు.

5


సీ.

తత్కాలమున మహాతమము తేజంబును
        బొడమక యొక్కట నడఁగు; నందు
నవ్యక్త మచల మనాఖ్య మవర్ణ మై
        చిన్మాత్ర మొకటియ చిక్కియుండు;
నాచిత్తునకుఁ బరమాత్మ పరబ్రహ్మ
        సత్యంబు నా బుధసమితిచేత
వ్యవహారసిద్ధికై వివిధనామంబులు
        గల్పింపఁబడియె. నిక్కముగ నతఁడు


గీ.

నన్యుఁడును బోలె జీవాత్ముఁ డై వెలుంగు;
నతఁడు కలనాకలత్వంబు నగ్గలించి
విను మనంబునఁ బొల్చు; నమ్మనము పేర్చి
తాన సంకల్పజాల మై తనరు ననఘ.

6


వ.

ఆ సంకల్పంబున నింద్రజాలంబునంబోలె జగత్తు జనియించు. అంబుధి

వలనం దరంగంబులును గాంచనంబువలనం గటకమకుటాది భూషణం
బులును జనియించుచందంబున శాశ్వతం బగుపరమాత్మయందు నశ్వ
రం బగుసృష్టిపృథగ్భావంబున వర్తిల్లు ఇట్టిద యని యుత్పత్తిప్రకా
రం బెఱుంగు మని చెప్పి వసిష్ఠుండు మఱియు నిట్లనియె.

7


ఆకశజోపాఖ్యానము

క.

విను రాఘవ యాకాశజుఁ
డను పేరిటివిప్రవర్యుఁ డాత్మవిదుఁడు స
జ్జనహితుఁడు ధర్మశీలుఁడు
ఘనుఁ డాయుష్మంతుఁ డొకఁడు గలఁ డీధాత్రిన్.

8


గీ.

అతని తేజంబు దుస్సహమై వెలుంగ,
మృత్యు వతికోపమున వాని మ్రింగ వచ్చి
తనకు నొకభంగి నగపడ కునికిఁ జూచి
కినుక వొడమిన మది వితర్కించె నిట్లు.

9


గీ.

కాలపాశంబు గయికొని క్రమముతోడ
నఖిలభూతంబులను మ్రింగునట్టి నాకు
నకట యీతనియందు వ మ్మయ్యె నాదు
శక్తి యుపలంబు సోఁకినశస్త్ర మట్ల.

10


వ.

అని వితర్కించి.

11


క.

ఆవిప్రుదివ్యతేజము
భావింపఁగఁ జక్కఁ జూడఁ బట్టఁగఁ గదియం
గా వెరవు లేక మృత్యువు
వేవేగను వచ్చెఁ బ్రేతవిభు సన్నిధికిన్.

12


వ.

ఇట్లు చనుదెంచి సమవర్తిం గనుంగొని మృత్యువు కృతాంజలి యై యిట్లనియె.

13


శా.

దేవా దేవరయాజ్ఞ మోచుకొని ధాత్రిం బొల్చు భూతావళిన్

దైవానీకము నేచి మ్రింగుదు; నసాధ్యం బెద్దియున్ లేదు నా;
కీవిప్రోత్తముఁ జూడ డగ్గఱ భయం బేపారె; నాకాశజుం
డేవెంటన్ మరి నాకు లోబడఁడు; వీఁ డెవ్వాఁ డెఱింగింపవే.

14


చ.

అన విని కాలుఁ డిట్లనియె; నక్కట మృత్యువ కేవలంబు స
జ్జనుల వధింప నీ కెటుల శక్యము? వారల వారికర్మముల్
గనుఁగొని చుట్టుముట్టుకొని కాల్పఁగ, నీవు నిమిత్తమాత్ర మై
యసువునఁ ద్రుంతుగాక విగతాయువులన్ మదమత్సరాత్ములన్.

15


వ.

అదియునుం గాక.

16


క.

ఏకర్మంబును బొరయక
నాకాశమునందుఁ బుట్టినాతనిఁ బుణ్య
శ్లోకుని నాకాశజు నీ
కేకతమునఁ ద్రుంపవచ్చునే హింసాత్మా?

17


వ.

అని సమవర్తి మృత్యువునకుం జెప్పె ననిన విని సాశ్చర్యహృద
యుండై రఘుపుంగవుం డమ్మునిపుంగవున కిట్లనియె.

18


గీ.

మునివరేణ్య మీరు మున్ను సెప్పినపుణ్యుఁ
డొక్కవిప్రుఁ డంటి రక్కజంబు,
తనకుఁ దాన పుట్టి దనరుపితామహుఁ
డజుఁడు గాఁగ నోపు నాన తిమ్ము.

19


వ.

అనిన వసిష్ఠు డిట్లనియె. మృత్యువునకు వివాదం బొనరించు నతండు
కేవలంబ బ్రహ్మ యగు, నతండు పృథివ్యాదిభూతరహితుండై యా
కాంబునుం బోలె నిరాకారుండై వెలింగి సంకల్పపురుషుం డనం
బడు. మఱియును.

20


గీ.

అతఁడు చిన్మాత్రరూపుఁ డనాదివంద్యుఁ
డజుఁ డనంతుఁడు చిత్తలౌల్యమునఁ దాన
పుట్టి వంధ్యాతనయుభాతిఁ బురుషుభంగి

దేహిక్రియఁ దోఁచుఁ; బరమాత్మ దేహి గాఁడు.

21


వ.

అన విని రామచంద్రుం డఖలభూతంబులకు నాధ్యాత్మికంబును నాది
భౌతికంబు నను దేహద్వయంబు గలిగియుండు, నా బ్రహ్మంబున కెవ్వి
ధం బెఱిఁగింపవే యనుటయు నమ్మునికుంజరుం డిట్లనియె.

22


గీ.

భూతజాలంబు కారణోద్భూత మగుట
దేహయుగళంబుతోన వర్తించుచుండుఁ
గారణాత్ముఁడు గా కున్కిఁ గమలజన్ముఁ
డాధిదైవికదేహుఁడ యై వెలుంగు.

23


వ.

అట్లు గావున నద్దేవుండు సంకల్పపురుషుండును చిన్మాత్రస్వరూపుం
డును సకలజగదుత్పత్తిస్థితిలయకారణంబు నై విహరించుచుండు.
మఱియును.

24


గీ.

పొరి మనోరూపమును స్వయంభువును నగుచు
వెలయు నద్దేవుచే సృష్టి విస్తరిల్లు;
నట్లు గావున నీతోఁచు నఖిలజగము
దన్మనోమయ మని యాత్మఁ దలఁపు మనఘ.

25


వ.

అనిన విని రామచంద్రుం ‘డమ్మనోరూపం బెట్టిది? యమ్మనంబుచేత
నీదోషమంజరి యగుజగత్తు లెట్లు విస్తరెల్లె? నాన తిమ్మ’ ని యడి
గిన, నప్పరమసంయమి యిట్లనియె.

26


క.

విను మాత్మునిసంకల్పమె
మన మనఁబడుఁ గాక, వేఱ మన సొక్కటియే?
దనరఁగ సంకల్పము నెడ
మన మని వర్తించుచుండు మహితవివేకా.

27


వ.

అట్లు గావున మనస్సంకల్పంబులకు నెన్నఁడును దేనిచేతను భేదంబు
లే కుండు. మఱియు నవిద్యయు సంస్కృతియుఁ జిత్తంబు మనంబు
బంధంబు మలంబుఁ దమంబను నివి సంకల్పనామంబు లై యుండు;

వీని చేత జగంబులు విస్తరింపఁబడు; నట్లగుటం జేసి.

28


గీ.

కణఁగి సంకల్పకాలంబు గళిత మైన,
నంబ రానిల ది గ్భూము లాది యైన
యఖలజగములు నణఁగంగ, నణఁగ కొక్క
చిత్ప్రకాశంబు విమల మై చిక్కి యుండు.

29


వ.

సకలజగద్ద్రష్ట యగువిమలాత్మునకు నీవు నేను జగంబులును దృశ్య
నిమిత్తతఁ గలుగునప్పుడు కేవలత్వంబు లే కుండు. దద్దృశ్యసంభ్ర
మం బణంగెనేని ప్రతిబింబరహితం బగు దర్పణంబునుంబోలె దృష్ట
త్వంబు లేక కేవలాత్మస్వరూపం బై వెలుగు చుండు.

30


క.

విను మన మాకాశం బగు;
మన మసదాశృతియు దోషమయము వినాశం
బును నగు; ద్రిజగముఁ బెనుచును
గనుఁగొనఁ గలవలనఁ బొడముకలిమియుఁ బోలెన్.

31


సీ.

అఖిలప్రపంచంబు నణఁగినలయవేళ
        యందును సర్గాదియందు శాంత
మగురూప మొక్కటి యవశిష్ట మై యుండు
        నస్తమింపనిసూర్యున ట్లతండు
నజరుం డనామయుఁ డజుఁ డాదిదేవుండు
        పరమాత్మకుఁడు మహేశ్వరుఁడు తనర,
సర్వకాలంబును సర్వంబు సేయుచు
        సర్వాత్ముఁ డన సడిసన్నవాఁడు,


గీ.

నిగమగోచరుఁడును గాఁగ నిగుడు నెవ్వ
డరయ మోక్షంబునం దతివ్యక్తుఁ డెవ్వఁ
డతని కాత్మాదినామంబు లరసి చూడఁ
గల్పితంబులు గాని నిక్కములు గావు.

32

వ.

అది యెట్లంటేని.

33


సీ.

దొరసి వేదాంతవాదులు బ్రహ్మ మన, సాంఖ్య
        వరశాస్త్రనిపుణులు పురుషుఁ డనఁగ,
విజ్ఞానవిదులు శుద్ధజ్ఞాన మితఁ డన,
        శూన్యమతజ్ఞులు శూన్య మనఁగ,
నర్కాదితేజంబు లన్నియు నెవ్వండు
        వెలిగించుచును దాను వెలుఁగుచుండు,
కర్తయు భోక్తయు స్మర్తయు భర్తయు
        ద్రష్టయు ఋతము నై దనరు నతఁడు,


గీ.

అఖిలమున నుండి లేనివాఁ డయ్యె నెవ్వఁ,
డరయ దేహస్థుఁ డై దూర మయ్యె నెవ్వఁ,
డధికతేజంబుతోఁ బేర్చి యతఁడు విమల
చిత్ప్రకాశస్వరూపమై చెలఁగుచుండు.

34


క.

విదితంబుగ నద్దేవుని
సదమలరూపంబునందు జగదూర్ము లొగిం
బొదువుచు విచ్చుచు వెలుఁగుచు
మరి విస్మృతి సేయు నెండమావులభంగిన్.

35


వ.

అనంతం బగుజగద్బృందంబు తాను జేయుచు నెన్నడు నెద్దియుం
జేయనివాఁ డై యుత్పత్తిస్థితిలయంబులు దొఱంగి నిర్వికల్పజ్ఞానస్వ
రూపుం డై యాత్మ యొక్కండును దనయంతన వెలుంగుచుండు నని
తత్త్వస్వరూపం బెఱింగించి యిట్లనియె.

36


సీ.

అఖిలేతిహాసంబులందు సారం బైన
        యాకాశజాఖ్యాన మర్థి వినిన
వారలు నిత్యజీవన్ముక్తులై పొల్తు
        రిట్టిజీవన్ముక్తుఁ డెవ్వఁ డనిన

పరఁగ రాగద్వేషభయముల కనురూప
        మై చరింపక లోన ననుదినంబు
నాకాశమునుబోలె నతిస్వచ్ఛ మగు నెవ్వఁ
        డతఁడు జీవన్ముక్తుఁ డనఁగఁ బరఁగుఁ;


గీ.

దనరునఖిలార్థజాలంబులను జరించి
యెల్లకార్యంబులందును జల్ల నగుచుఁ
బొరిఁ బదార్థంబులందును బూర్లుఁ డెవ్వఁ
డతఁడు తన్ముక్తుఁ డన నొప్పు నమలచరిత.

37


వ.

అట్టిజీవన్ముక్తుండు కాలవశంబునం దనశరీరంబు విడిచి జీవాత్మస్వరూ
పంబు వెడలి పరమాత్మయందుఁ బొందు నది విదేహముక్తి యనం
బడు; నప్పరమాత్మ యెట్టి దనిన, జీవస్వరూపం బగుచిత్తునకుఁ జైత్యో
న్ముఖత్వంబు గలుగునప్పుడ యది చిన్మయంబును నమలంబును శాంతం
బును నగుపరమాత్మస్వరూపం బని యాకాశజోపాఖ్యానంబు బహు
ప్రకారంబుల సవిస్తరంబుగా నెఱింగించి, వసిష్ణుండు రామచంద్రుం
గనుంగొని ‘యీయాఖ్యానంబునందుఁ బరమాత్మ మాయామనో
రూపం బై జగత్తుల సృజయించుట వర్ణింపఁబడియె; నింక నమ్మా
యకు బహుదుర్ఘటహేతుత్వంబును, జగత్తునకు మాయికత్వంబును,
విదితం బగులీలోపాఖ్యానం బెఱింగించెద సావధానుండ వై విను
మ’ ని యిట్లనియె.

38


లీలోపాఖ్యానము

క.

ఇలఁ బద్మకుఁ డనుభూపతి
గలఁ డాతనిభార్య లీల కాంతామణి, యా
లలన గడుభక్తి వాణిం
బొలుపుగఁ గొలువంగఁ దనకుఁ బొడసూపుటయున్.

39


వ.

అద్దేవికిం బ్రణమిల్లి యి ట్లనియె.

40

గీ.

వాణి, నాకంటె మున్ను నావరుఁడు తనువు
విడిచెనేనియుఁ దజ్జీవుఁ డెడలిపోక
నొగి నిజాంతర్గృహంబున నుండునట్లు
వరము గృపసేయు మొకటి శాశ్వతము గాఁగ.

41


వ.

మఱియు నేను మత్పతినిమిత్తం బై యెప్పుడు నినుఁ జూడ వేఁడెద
నప్పుడు నాకుం బొడచూపునట్టివరంబునుం గా నీరెండువరంబులు
నొసంగుము-----అని ప్రార్ధించిన నట్ల యగుం గాక యని మఱియు
నద్దేవి యిట్లనియె.

42


ఉ.

నీపతి మేను వాయునెడ నెయ్య మెలర్పఁ బ్రసూనమంటప
స్థాపితుఁ జేసి పుష్పములు దట్టముగాఁ బయి నింప నంగకం
బే పరి పోక పుష్పములు నెండక క్రమ్మఱ నీకు భర్త యై
ప్రా పగు నాత్మగేహమునఁ బాయఁడు జీవుఁడు దా వియత్ప్రభన్.

43


క.

అని చెప్పి వాణి చనుటయు
మనమున హర్షించి లీల మణికొ న్నేండ్లుం
జనఁ దత్కాలంబునఁ దన
పెనిమిటి మృతుఁడైనఁ జూచి బెగ్గిలక ధృతిన్.

44


క.

భారతి చెప్పిన విధమున
నారాజుఁ బ్రసూనమంటపాంతఃస్థునిఁ గా
జేరిచి పైఁ బుష్పంబులు
బోరనఁ గుప్పించి శోకపూరితమతి యై.

45


వ.

సరస్వతిఁ దలంపఁ దత్క్షణంబ చనుదెంచిన నద్దేవిపాదంబులపైఁ గన్నీ
రు దొరంగం బ్రణమిల్లి గద్గదకంఠి యగుచు నిట్లనియె.

46


శా.

తల్లీ భారతి మద్విభుండు మృతుఁ డై తా నేఁగె నీ చెప్పిన
ట్లెల్లం జేసితి; నాతఁ డెం దణఁగెనో? యెచ్చోట నున్నాడొ? నా
యుల్లం బానృపు బాసి యోర్వగలదే? యొం టెట్లు వేగింపుదున్?

జెల్లంబో నను జీవితేశుకడకుం జేర్పించి రక్షింపవే.

47


వ.

అని విలపించుచున్న యప్పరమసాధ్వి నూఱించి వాణి యిట్లనియె.

48


క.

రాకాశశిముఖి, విను చి
త్తాకాశం బనఁగ మఱి చిదాకాశము నా
నాకాశం బనఁ ద్రివిధం
బై కర మొప్పారు, నవి నిరాకారము లౌ.

49


వ.

అట్లు గావున నివి యాకాశబ్దవాచ్యంబు లై యుండు, నందు దక్కి
నరెంటినిం బొరయక నెద్ది వెలుగు నది చిదాకాశం బని యెఱుంగు.
మవి పరస్పరవిలక్షణంబు లై యుండు నెట్లనిన బుద్ధియందు వికార
స్ఫూర్తియు,నాకాశంబున జాడ్యపరిపూర్ణతయుం, గలిగి యుండు.
నందును రెంటినిం బొరయక చిదాకాశంబు వికారజాడ్యంబులు దొ
ఱంగి స్ఫురత్స్ఫూర్తులు గలిగి యుండు. మఱియు నాసంవిత్స్వరూ
పంబునకును.

50


క.

దేశముననుండి వేఱొక
దేశంబును బొందునపుడు తిర మై నడు మే
దేశము లే కునికి చిదా
కాశం బని యెఱుఁగు మాత్మఁ గమలదలాక్షీ.

51


క.

అందును సంకల్పాదుల
నెందును నెడబాసి పొంది తేనియుఁ బరమా
నందు సకలాత్ము శాంతుం
బొందెదు సంశయము విడుము పూర్ణేందుముఖీ.

52


గీ.

అఖిలదృశ్యంబు లెడఁబాసి యందుఁ బొందుఁ
గాని యొండువిధమ్మునఁ గానఁబడడు,
మద్వరంబునఁ జేసి నీమగనిఁ గాంచె
దతివ శీఘ్రంబ యవ్విధం బాచరింపు.

53

సీ.

అని వాణి తనయింటి కరుగుటయును, నంత
        లీల సేసెను వినిర్లేపబుద్ధి
బాహ్యకర్మంబులఁ బాసి శీఘ్రంబున
        నిర్వికల్పసమాధినిష్ఠ నిల్చి,
రంజిల్లునంతఃకరణపంజరముఁ బాసి,
        పరమాత్ముఁ బరిపూర్ణు నిరుపమాను
నిరుపాధికుని బొంది నిఖిలంబుఁ గనుదివ్య
        దృష్టి మైఁ దనపతిఁ దేఱి చూడఁ,


గీ.

బరఁగ షోడశవత్సరప్రాయ మైన
భూమిపాలకుఁ డగుట నద్భుతముఁ బొంది,
వాణిఁ దలఁచిన నప్ప్రొద్దె వచ్చి భద్ర
పీఠమున నున్నఁ గని మ్రొక్కి ప్రీతిఁ బలికె.

54


గీ.

వాణి, యద్భుత మయ్యె; నావరున కెట్లు
సృష్టివలనన వేఱొకసృష్టి పుట్టె
నేమి? యీ జాగరభ్రమ నెఱుఁగవలయు
నానతి మ్మన లీల కిట్లనియె దేవి.

55


క.

అతివా మృతిఁ బొందిన నీ
పతితొలుపుట్టువును దలఁప భ్రాంతియ; యిపు డీ
క్షితిపతి రెండవజన్మము
ధృతి నిట్టిద యివ్విధంబు దెలియఁగ వినుమీ.

56


వ.

అది యెట్లంటేని.

57


సీ.

తనరుచిదాకాశమున నొకానొకచోట
        సంసారమంటపస్థలము గలదు
దానియం దొకగిరితటమున నొక్కెడ
        నొకయూర నొక్కవిప్రోత్తముండు

భార్యయుం దాను నిర్భరలీల వసియించి
        యుండె. నా బ్రాహ్మణుం డొక్కనాఁడు
శైలసానుస్థితశాద్వలతలమునఁ
        బొలుచునిష్టత నుండ, భూధరంబు


గీ.

క్రింది సౌభాగ్యసంపద లంద మొంద
సకలసేనాసమన్వితప్రకటలీల
మెఱసి మృగయానురక్తుఁడై మెలఁగుచున్న
మానవేంద్రునిఁ జూచి విస్మయము పొంది.

58


క.

చింతించె విప్రుఁ డీభూ
కాంతునిసౌభాగ్యమహిమ గడు నొప్ప నయో
సంతసమున దిగ్వలయం
బంతయు నే నెప్డు రాజ నై యేలుదునో?

59


వ.

అని చింతావృతమానసుం డై యమ్మహీసురుండు పంచత్వంబు నొంది
పద్మభూపాలుం డై జనియించె. నాబ్రాహ్మణిశరీరంబు విడిచి లీల
యనుపేర నీవ యై యుదయించితివి. మీ రిరువురు మృతు లై యష్ట
మదివసంబు వర్తిల్లుచున్నది. యిచ్చట డెబ్బదియేండ్లు రాజ్యసుఖంబు
లనుభవించితి. రిప్పుడు పద్మభూపాలుండు కాలగోచరుం డగు ప్రథమ
దివసంబున నయ్యీభూపతికి షోడశవర్షంబు లయ్యె నని వాణి
మఱియు నిట్లనియె.

60


క.

ఆవనితయు మును నీగతి
వావిరి ననుఁ బూజసేసి వరయుగళంబున్
దా వేఁడఁ బ్రియునిజీవము
వే విడిచియు నిజగృహంబు వెడలక యుండన్.

61


వ.

ఇట్లు గావున మీ యిరువుర సర్వసంసారమును నా బ్రాహ్మణి మంట
పంబునంద యున్నయది. పునర్జాతుం డగుభూపతిసంసారంబు భవ

ద్గృహంబునం దున్నయది. యని చెప్పిన విస్మయం బంది లీల యి
ట్లనియె.

62


క.

అక్కట విప్రునిజీవం
బెక్కడ నెచ్చోట నున్న? దే మెక్కడ? నీ
దిక్కులు గిరులును భూమియు
నెక్కడ మాయింట నణఁగె? నిది మిథ్య సఖీ.

63


సీ.

సర్షపకోటరస్థలి మదాంధం బైన
        దేవతాగజము బంధింపఁబడియె;
నణువులోపల మహాహర్యక్షసమితి దాఁ
        బొరి నొక్కదోమచేఁ బొరలఁబడియె;
కమలబీజములోనఁ గనకాద్రి యుండంగ
        భృంగపోతముచేత మ్రింగఁబడియె;
ననినట్లు పొసఁగనియనృతోక్తు లెట్లాడి?
        తనవుడు లీల కి ట్లనియె దేవి;


గీ.

మెఱయ నామాట లెందును మిథ్య గావు
వినుము మనచేత నియతిభేదనము సేయఁ
బడదు దనయూర నాత్మీయభవనమునన
నుండు నావిప్రుజీవాత్మయును లతాంగి.

64


వ.

అమ్మహారాష్ట్రం బాకాశరూపంబు గావున నాకాశాత్ముం డైన యతం
డంద యుండి చూచుచుండు నట్లు గావున.

65


గీ.

తరుణి మాయిద్దఱకుఁ దొంటితలఁపులందు
మఱపు జనియించి వేఱ సంస్మరణ వొడమెఁ
గలల జాగ్రదవస్థల తలఁపు లెట్టు
లట్ల మరణంబు మర్త్యుల కంబుజాస్య.

66


గీ.

అరయ సంకల్పముకురంబునందుఁ బోలెఁ

బొరిఁ జిదాకాశకోశకోటరమునందు
భూము లంతఃస్థితంబు లై పొలుపు మిగులు
నని యెఱుంగుము మనమున వనజనయన.

67


వ.

ఎట్లనినం బరమాణురూపం బగుచిదాత్మయందు దద్రూపం బగు
మనంబున జగత్తులు ప్రతిభాసాత్మకంబు లై యుండును. అనిన విని
లీల యిట్లనియె.

68


క.

జననీ, యావిప్రుడు చని
యెనిమిదివసంబు లంటి; విచటను మాకుం
జనియెను సప్తతివర్షము;
లెనయఁగ నె ట్లయ్యె? దీని నెఱిఁగింపు తగన్.

69


సీ.

అన విని దేవి యిట్లనుఁ బ్రతిభాస మౌ
        కంటె నెందును దేశకాల దైర్ఘ్య
ములు లేవు చిద్రూపమున కట్టి ప్రతిభాస
        తీరు సెప్పెద, విను ధీరహృదయ
జీవుండు మరణమూర్ఛావస్థ ల ట్లొంది
        తెలివొంది తొల్లిటితలఁపు లుడిగి
యవ్యభావము నొంది యాధేయమౌనిది
        యాధారమం దున్కి హస్తపాద


గీ.

సహిత మీమను గలయది; జనకునకును
సుతుడు; నా కిట్లు సౌకర్యహితులు వీర
లికి మదీయాస్పదం బనునిట్టిభ్రాంతిఁ
దొడర వేగంబ జగములు దోచుచుండు.

70


వ.

అనిన విని లీల యిట్లనియె.

71


క.

పరమేశ్వరి, నీచేతం
బరమజ్ఞానంబు గానఁ బడసితి, నాభూ

సురమిథున మున్న సర్గకు
గురుదయ నను వేగఁ దోడుకొని పొమ్మనుడున్.

72


వ.

అమ్మహాదేవి యి ట్లను నపరంబును భావంబును నగుచైతన్యచిద్రూ
పక మగునట్టి స్థితి సంహరించి నిర్మలస్వరూపవు గమ్ము; అట్లేని నిరర్గ
ళంబున మనకు నచ్చటు చూడ నగు; నద్దర్శనంబునకు శరీరంబు మ
హార్గళంబు గావునం శతస్వరూపం బగునాధిభౌతికదేహంబు తద్ధ్యా
నంబున మముబోంట్లచేతఁ జిరవాసనలవలన గ్రహింపబడు నవ్వాస
నాణుత్వం బెప్పు డవు నప్పుడే యీశరీరంబునందు నాతివాహికత్వంబు
నొందు నీహారంబు తపనతాపంబున నుదకం బైనట్లు శుద్ధసత్త్వాను
పరత్వం బగుచిత్తతనువాసన యాతివాహికం బగు ననిన విని లీల
యిట్లనియె.

73


క.

ఈయర్థమునందు సుఖా
శ్రాయాభ్యాసంబురూపు చను నెట్టిద కా
నేయనువున వర్ధిలు నది
పాయక వర్ధిలఁగ నేమి ఫల మగుఁ దల్లీ.

74


వ.

అనిన విని సరస్వతి లీల కి ట్లనియె.

75


గీ.

తత్త్వచింతనంబుఁ దత్కథనంబు న
న్యోన్యబోధనంబు నొగిఁ దదేక
పరతయును ననంగఁబడు నివి యభ్యాస
మండ్రు తత్త్వవేదు లమలహృదయ.

76


గీ.

దృశ్యములసంక్షయంబును దెలియఁజేసి
పరగ రాగాదివికృతులఁ బలచఁ జేసి
చెలఁగి యుపరతి నుదయింపఁజేయు నెద్ది
యదియు బ్రహ్మానుసంధాన మనఁగఁ బరఁగు.

77


సీ.

అని యిట్లు చెప్పి తా నమ్మహానిశయందు

        నతులితయోగసమాధినుండి
జ్ఞానదేహముతోడ శారద య ట్లేగఁ
        దరుణియు మానుషతనువు విడిచి
దివ్యకాయముఁ దాల్చి దివి నుండి యిరువురు
        నలకు బ్రహ్మాండమండలముఁ బాసి
యటు పోవ నొకశైలతటమున నొక్కగ్రా
        మమునందు నొకవిప్రమంటపంబు


గీ.

గని యదృశ్యాంగు లయి యటఁ గదలి వేగ
నరిగి రెండవసర్గంబునందుఁ బొంది
పువ్వుఁబానుపుపైఁ బద్మభూమిపాలు
శవముతో నొప్పు మంటపస్థలము గనిరి.

78


క.

కని యోగస్థితి నొందియుఁ
జనుదెంచి నిజేశుఁ డున్న సదనంబునకున్
మన మలర దివ్యయోగిని
వనితామణి లీల వేడ్క వాణియుఁ దానున్.

79


గీ.

ఇట్లు చనుచేరఁ దత్పతి యెదురు వచ్చి
యమ్మహాదేవి కెఱఁగి పాదాంబుజంబు
లందుఁ బుష్పంబు లర్పించి యచలభక్తి
మ్రోల నిలుచున్న యాభూమిపాలుఁ జూచి.

80


క.

జననాయక నీతొల్లిటి
జననము మదిఁ దలఁపు మనుచు శారద దయ నా
తనిశిరమునఁ జే యిడ న
మ్మనుజేంద్రున కంత హృదయమాయ దొఱంగెన్.

81


వ.

ఇట్లు మనోగతం బయినమాయ యాక్షణంబ పాసి తన పూర్వజన్మవృ
త్తాంతం బంతయు మనంబునఁ దోచిన నచ్చెరు వొంది యవ్విదూర

విభుం డాత్మగతంబున 'నోహో యతివిస్మయం బగుసంసారమా
య యిమ్మహాయోగినులకతంబున నాకుం బరిజ్ఞాతం బయ్యె' నని
పలికి వారలం గనుంగొని ముకుళితకరకములుం డయి యిట్లనియె.

82


క.

వనజాక్షులార వినుఁ డీ
తను వెడలినదినమునకును దగ షోడశహా
యనము లయి పెక్కుగార్యము
లును బంధులు మిత్త్రగణములును దోచె మదిన్.

83


వ.

అనిన విని వాణి యి ట్లనియె.

84


సీ.

ఉహింప మృతిమహామోహమూర్ఛానంత
        రంబున నీ కిట్లు రాజఋషభ
యాలోకమును భాసి యమ్ముహూర్తమునను
        నాయింటిలోనను నలఘుసర్గ
విభ్రమం బుదయించె వేఱె యాకాశని
        ర్మల మైనయట్టి యామనమునందు
విలసిల్లు వ్యవిహారవిభ్రమకృత మైన
        యీప్రతిభాస నీ కిచటఁ బుట్టెఁ


గీ.

బరఁగఁ బదియాఱువర్షాలప్రాయ మగుట
తలఁపఁ గలలోన నొకముహూర్తంబునందు
వర్షశత మగు నేమాయవలన నెట్ల
నదియ యీజాగరభ్రాంతి యని యెఱుంగు.

85


మ.

పరమార్థంబునఁ బుట్టుట ల్మడియుటల్ భావింప లే వెన్నఁడున్,
నిరుపాధిస్థితిశుద్ధబోధమయ మై నీయందు నీ వుండితి,
ట్టిరువారన్ సకలంబు గన్గొనుచు నొం డీక్షింప వొక్కింతయున్,
బొరి సర్వాత్మతఁ జేసి నీవ జననంబుం దాల్తు నీయం దొగిన్.

86


క.

వితతపదార్థారూఢుఁడు

నతిజడుఁడు నశుద్ధమతియు నగునాతనికిన్
ధృతి సత్తు గాని జగములు
మతి దృఢమై వజ్రసారమయ మగు ననఘా.

87


వ.

మఱియు బాలునకు బేతాళుండు మరణాగతదుఃఖం బొనరించునట్లు
ను, మృగంబుల కెండమావు లుదకంబై తోఁచునట్లును, మూఢునకు
నసత్తయినజగంబు సదాకారం బై దుఃఖం బొదవించుచుండును. కన
కం బెఱుంగనివానికిఁ గనకమయం బగు కటకంబు కటకం బనుబుద్ధియ
కాని హేమం బని యెఱుక లేనియట్లు పురాగారనగరనరేంద్రభాసు
రం బగు నీ ప్రపంచంబునందుఁ బ్రపంచం బనుబుద్ధియ కాని పరమాత్మ
బుద్ధి వొడమనేరదు. అహంకారయుక్తం బగునీవిశ్వంబు దీర్ఘస్వ
ప్నం బని యెఱుంగుము. ఈ జాగరభ్రాంతి కలలయందుఁ దోఁచిన
పురుషులయట్ల యని యనేకదృష్టాంతంబు లుపన్యసించి భారతి
మఱియు ని ట్లనియె.

88


సీ.

సర్వగతంబును శాంతంబుఁ బరమార్థ
        ఘనమును శుచియును ననుపమంబు
నాతతంబును బరమానందమును జైత్య
        చిన్మాత్రతనువు నచింత్యతమము
సర్వగతము సర్వశక్తియు సర్వాత్మ
        కంబును దానయై గలిగియుండు
నెక్కడ నెక్కడ నెబ్భంగి నుదయంచు
        నక్కడ నీరూప మగునృపాల;


గీ.

నీవు లీలార్థ మిట్లు వర్ణింపబడితి
తివిరి సిద్ధాంతదృష్టిని దృష్ట మయ్యెఁ
బోయి వత్తుమె నీకు నభ్యుదయ మనుచు
వనిత లివురు నరిగిరి మనుకులేశ.

89

వ.

అని చెప్పి మఱియు వసిష్ఠుం డి ట్లనియె నప్పరమయోగినులు చనిన
యనంతరంబ యొక్కభూపాలుం డనేకబలసమన్వితుం డై చనుదెంచి
విదూరపురంబుపై విదిసి యుద్ధార్థి యై పిలిపించిన నతండును జ
తురంగబలసమేతుండై పురంబు వెలువడి తలపడిన నుభయబలంబు
లకుఁ బోరు ఘోరం బయ్యె నట్టియెడ.

90


శా.

ఆరాజన్యు లుదగ్రు లుగ్రగతి నన్యోన్యప్రహారార్థు లై
వీరానీకము విచ్చలింపఁగ భుజావీర్యం బవార్యంబుగా
గ్రూరాస్త్రంబుల నొండొరుం బొదివి దిక్కుల్ వ్రయ్యఁ బెల్లార్చుచున్
బోరాడంగ విదూరుఁ డీల్గె నపు డాభూమీశుచే భూవరా.

91


వ.

ఇట్లు పడిన యతనిజీవరేఖ విద్యుల్లేఖయుం బోలె గగనంబున కెగ
యుట గనుంగొని సరస్వతి లీల కి ట్లనియె.

92


ఉ.

కోమలి యిప్పు డిట్లు మనకుం బ్రతిపత్తి యొనర్చి భూవర
గ్రామణి యివ్విదూరుఁ డిటు గయ్యమునం బగవారిచే మృతుం
డై మహి వ్రాలె గంటె యది యక్కట యాతనిజీవరేఖ సౌ
దామనివోలె నెచ్చటికిఁ దారెడునో చని చూచి వత్తమే.

93


వ.

అని యయ్యిరువురు నత్తేజంబు వెనుచన నదియు ననేకసర్గపరం
పరలు బరిభ్రమించి మఱియును.

94


ఉ.

కొండలు నబ్ధులు న్నదులుఁ గోన లసంఖ్యము దాఁటి చిద్వియ
న్మండల మూఁది యచ్చట వనంబు ఫలంబులుఁ బోలెఁ బేర్చి యొం
డొం డొరువర్తనం బెఱుఁగకుండఁ జరించుచు నున్నయట్టి బ్ర
హ్మాండసముచ్చయంబు లోకయర్బసదంఖ్యలు చూచి యవ్వలన్.

95


క.

వివిధమణిగోపురంబుల
వివిధావరణముల నధికవిభవం బై యా
దివిజేంద్రుపట్టణముగతి
భువిఁ బెం పగుచున్నపద్మపురి వెసఁ జొచ్చెన్.

96

గీ.

అట్లు సొత్తెంచి యప్పురియంతరముల
జీవుఁ డిల్లిల్లు వెసఁ జొచ్చి పోవఁబోవ
వెలఁది జోడును విడువక వెంట నరిగె
సూదిపిఱుఁదన చనుదెంచుసూత్ర మట్ల.

97


వ.

ఇవ్విధంబునఁ జనిచని యత్యంతరమణీయం బగు రాజమందిరంబు ప్రవే
శించి.

98


ఉ.

మాడుగుక్రేవ సోమమణిమంటపముం గని దానితిన్నెపై
వాడనిపుప్వుఁజప్పర మవారణ మై వెసఁ జొచ్చి యచ్చటన్
బాడఱి పాన్పుపైఁ బడినపద్మునిదేహముఁ బొందె జీవుఁ డా
చేడెలు చూడ మేఘమును జెందినతీఁగెమెఱుంగుచాడ్పునన్.

99


క.

ప్రాణమునఁ గూడుకొని త
త్ఘ్రాణద్వారమున జీవకళ వికసించెన్
వేణుద్వారమున జగ
త్ప్రాణుఁడు విహరించునట్లు భానుకులేశా.

100


వ.

ఇట్లు జీవకళ ప్రవేశించిన సర్వాంగంబులు కాంతియుతంబులు రసవం
తంబులు మృదులంబులు నయి యొప్పె నప్పుడు.

101


ఉ.

మోము వికాస మందఁ, గరముల్ గదలించుచుఁ, గాళ్లు సాచి, యి
ట్లా మెయి ప్రక్కగాఁ దిరిగి, యల్లన నీల్గుచు నావులించెఁ, గెం
దామరరేకులట్ల జిగిదారెడుకన్నులు విచ్చి సూచి యా
భూమివిభుండు మేల్కనియెఁ బొల్పగుజంగమవిద్యయో యనన్.

102


వ.

ఇట్లు మేల్కని గంభీరవాక్యంబుల నిది యెక్కడ నని పల్కు నాభూ
పాలుం గనుంగొని.

103


క.

కిలకిల నవ్వుచుఁ గన్నులు
తళతళ వెలుఁ గొంద మోముఁదామరసొబఁ గై
పలపలనినడుము దనరఁగ

కలకల నై వచ్చె లీల కాంతునికడకున్.

104


వ.

ఇవ్విధంబునఁ జనుదెంచి తద్వృత్తాంతం బంతయు నెఱింగించిన నతం
డచ్చెరు వొందుచుండె నంత సరస్వతి యమ్మహీపాలునకుఁ బరమజ్ఞా
నోపదేశంబు చేసి నిజేచ్ఛ నరిగె. బద్మభూపాలుండు లీలయుం దాను
ను జీవన్ముక్తులై యెనుఁబదివేలయేండ్లరాజ్యసుఖంబు లనుభవించి,
పదంపడి దేహవిముక్తులయి దివంబునకుం జని రని లీలోపాఖ్యానంబు
సవిస్తరంబుగా నుపన్యసించి వసిష్ఠుండు రామచంద్రున కి ట్లనియె.

105


క.

కానఁబడు నీప్రపంచము
లీనం బని లోకులకుఁ దెలియ 'లీలోపా
ఖ్యానము' చెప్పితి మదిలో
నీ నిఖల మతథ్య మని గణింపు కుమారా.

106


సీ.

పరమ మధ్యాత్మంబు బ్రహ్మ మనాభాస
        మతిశుద్ధపద మంచితాత్మకంబు
శాంత మద్వైతంబు సత్య మనంతంబు
        సత్త్వ మానందంబు శాశ్వతంబు
నతుల మనిర్దేశ్య మమల మచిహ్నితం
        బతిశుద్ధ మనఁ గల దనఘ వినుము
కరుడు లేనట్టిసాగరముచందంబున
        నత్యంతగంభీర మై వెలుంగు


గీ.

నదియుఁ బరమాత్మ; దేహంబులందుఁ బొంది
పరఁగ నిర్వాతదీపంబుభంగిఁ దనరు
నదియ జీవాత్మకళ; యని యాత్మ నెఱుఁగు
ప్రకటవిజ్ఞానగుణసాంద్ర రామచంద్ర.

107


గీ.

అదియ సంసారవాసన లగ్గలించి
క్రమము దప్పక ఘన మహంకార మయ్యె,

నణువుగతి సూక్ష్మమై పొల్చునగ్నికణము
బహుళతరకాష్ఠములచేతఁ బ్రబలినట్లు.

108


వ.

అయ్యహంకారంబు చేతనంబు మనంబు మాయ ప్రకృతియు నను
బహునామంబులు గలిగియుండు. నట్లు గావున నింతటికిం గారణంబు
మనంబ. తన్మనంబున జగంబులు విస్తరిల్లు. మఱియును.

109


క.

పారంబు లేనిసంవి
త్పారావారమునఁ దోఁచు భంగంబులయ
ట్లారూఢియై ప్రపంచము
నారయఁ దా నై వెలుంగు నాత్ముఁడు వత్సా.

110


గీ.

మనము వికృతియె సంసారమయము గాన,
సత్య మనఁ బోల దిది మహాస్వప్నమయము
నిజముగాఁ జూడనేరక నిక్క మండ్రు,
కొఱడు గని మర్త్యుఁ డనుశంక గూరినట్లు.

111


గీ.

అరయఁ బరమాత్మ జీవాత్మ లైక్యమైన
యట్ల జీవాత్మ చిత్త మై యలరుఁ దాన
చిత్తరూపంబు సృష్టి యై చెలఁగుచుండుఁ,
గాన నంతకుఁ బరమాత్మ కారణంబు.

112


వ.

ఈ యర్థంబున నొక్కయితిహాసంబు గలదు. కర్కటి యను రాక్షసి
మహాప్రశ్నంబు చేసె దాన నఖిలంబును దేటపడు; నాకర్ణింపు మనిన
రామచుద్రుం డిట్లనియె.

113

కర్కటికోపాఖ్యానము

క.

ఆరాక్షసి యెక్కడియది?
యేరూపున నెట్టిప్రశ్న లెవ్వరి నడిగెన్?
వా రెట్లు చెప్పి రుత్తర?
మారయ నవ్విధము దెలియ నానతి యీవే.

114

వ.

అనిన వసిష్ఠుం డి ట్లనియె.

115


ఉ.

కాటుకగుబ్బలి న్మలిచి కాలుఁ డొనర్చినకృత్తియో యనన్
బాటిగ నట్టహాసములఁ బాదవిఘట్టనలన్ మహాశుభృ
త్కూటము లెల్ల డొల్లఁగ నకుంఠితవృత్తి హిమాచలాంతరో
గ్రాటవులన్ జరించుచు నిశాటిని కర్కటి యుండు నిమ్ములన్.

116


సీ.

అమ్మహారాక్షసి యాఁకటి కోర్వక
        నవని జీవులఁ జంప నాత్మఁ గోరి,
యతిఘోరతపమున నబ్జజు మెప్పించి
        శూలయుఁ బోలె విషూచి యనఁగ
ధరలోనఁ గలజీవతతి నెల్లఁ బెక్కేండ్లు
        దయ లేక భక్షించి తనివి నొంది,
నిష్ఠ మై నింద్రియనిగ్రహంబున నిరా
        హారయు నై యతిఘోరభంగి


గీ.

జీవహింసయు మది రోసి చిత్స్వరూప
మాత్మ భావించి నిత్యసమాధి నిలిచి
తన్మయం బైనచిత్తంబు దరల నీక
ప్రీతి వేయేండ్లు తప మాచరించి మఱియు.

117


వ.

ఇ ట్లత్యంతనిష్ఠురానుష్ఠానంబు లనుష్టించుచున్న కర్కటి కడకుఁ
గమలగర్భుండు చనుదెంచి యి ట్లనియె.

118


క.

నీతపమున కే
మెచ్చితి,
చేతోవిశ్రాంతి గంటి, జీవన్ముక్తి
ఖ్యాతిఁ గయికొంటి, విలలో
నే తపములు నీతపమున కెనయే తరుణీ!

119


క.

ఈ కూ డుడిగినతపములు
నీ కేటికి సర్వశాంతి నెమ్మది నిగుడన్

నాకూన వత్స కర్కటి
చేకొని యాహారచింత చేయుము నెమ్మిన్.

120


వ.

మూఢులను దురారంభులను దుర్వ్యసనులను దుర్దేశవాసులను
వెకి భక్షింపుము. అనుచు నిర్దేశించి చనుటయు బాహ్యకర్మంబులు
మఱచి నిర్వికల్పసమాధి ననేకదివ్యవర్షంబు లుండె. బెద్దకాలంబు
నకుఁ చిత్తచలనం బగుటయు పూర్వస్మరణంబున బుభుక్షాతృష్ణలు
వేల్పం దొణంగిన నొక్కనాఁడు.

121


ఉ.

అచ్చపలాత్మ నొంటిగతి నాఁకటి కోర్వఁగలేక నొంటిమై
వచ్చునెడన్, విదేహజనవల్లభుఁ డన్నడురేయి మంత్రితో
నిచ్చలు వేఁట వచ్చి చరియింపఁగ, నవ్వనభూమిఁ గర్కశం
బచ్చుపడంగ వారిఁ గని యార్చుచు నిట్లని పల్క్ నుగ్రతన్.

122


క.

ఈశర్వరి నిద్దఱును దు
రాశలఁ జనుదెంచి నాకు నగపడితిరి; య
క్లేశత మీరక్తము లా
పోశనముగఁ బీఁచమణఁచి పుచ్చెద మిమ్మున్.

123


వ.

కా దేని నాయడిగిన ప్రశ్నంబుల కుత్తరంబులు సెప్పి ప్రాణంబులు
గాచికొం డని పల్కి, మఱియు ని ట్లనియె.

124


సీ.

ఏకమై యుండి యనేకసంఖ్యలు గల
        యణువులోఁ జెంది బ్రహ్మాండలక్ష
లంబుధిలో బుద్బుదారములభాతి
        నుండఁగ నవకాశ మొదవునట్టి
యాకాశ మెద్ది? దా నరయ నేమియు లేక
        యించుక గలవస్తు వెద్ది గలదు?
నడుచుచునుండియు నడువనివాఁ డెవ్వఁ?
        డుండక నుండియు నుండు నెవ్వఁ?

గీ.

డెనయఁ జేతన మంది దా నెవ్వఁ డయ్యె?
నరయ నెవ్వఁడు మింటఁ జిత్తరువు వ్రాసె
బీజముననుండి వృక్షంబు బెరసినట్లు
జగము నే యణువందు నిశ్చలత నుండు?

125


గీ.

కడలి కడ లొందుగతిఁ పృథగ్భాగ మయ్యు
నేక మగువస్తు వరయఁ దా నెద్ది యయ్యె?
ద్రవము నుదకంబు నొక్క టై తనరుభంగి
రెండుబలెఁ దోఁచి యొక్క టై యుండు నెద్ది?

126


వ.

అని చెప్పి మఱియు నారాక్షసి యి ట్లనియె.

127


క.

బంధురగతి నీ ప్రశ్నలు
సంధానము సేసి సెప్పఁజాలని యా ద
ర్పాంధులఁ నా జఠరాగ్నికి
నింధనములఁ జేసి పుత్తు నిరువుర మిమ్మున్.

128


వ.

అనిన విని వార లిరువురు నొండొరువులమొగంబు సూచికొని యవ్వి
భుం డాత్మవిద్యాసంవేది గావున భయపడక మంత్రి కి ట్లనియె.

129


క.

కర్కటి యనియెడి రాక్షసి
మర్కటి, యిది యడుగు నట్టిమాటలు మిగులం
గర్కశము లనక సంవి
త్తర్కములకు నుత్తరములు తగఁ జెప్పు మనన్.

130


వ.

అనిన విని మంత్రి యి ట్లనియె.

131


గీ.

కణఁగి వడ్లును పెరుగును గలుపుభంగి
నకటవికటంబు లగు ప్రశ్న లడిగె నదియు;
మూవలము వోలె దీనిచే జావ నేల
యీడుజోడుగఁ జెప్పెద నెఱిఁగినంత.

132


వ.

అని పలికి యా రాక్షసిం గనుంగొని మంత్రి యిట్లనియె.

133

క.

కమలేక్షణ నీ వడిగిన
విమలప్రశ్నములు బ్రహవిద్బోధకయో
గ్యము లతిదుర్లభములు విను
క్రమమున నన్నియును నేర్చుగతి వినిపింతున్.

134


సీ.

ఆఱింద్రియములకు నందక సౌఖ్య మై
        యాకాశసూక్ష్మ మై యలరునట్టి
యాత్మాణువునను బ్రహ్మండకోటులు పెక్కు
        బుద్బుదంబులు వోలెఁ బుట్టు నణఁగు
నాకాశ మయ్యు బాహ్యము లేమియును జేసి
        యనవకాశము చిన్మయత్వ మగుట
నిద మిత్థ మన రామి నేమియు లేదు స
        ద్వస్తుసంతతి కొంత దానె గలిగి


గీ.

తత్ప్రకాశతఁ జేసి చేతనము నొంది
లలి నభేద్యుండు గాన శిలాత్వ మయ్యె;
నాత్మ యను నాకసంబున నఖిలజగము
తలఁపుమిషమునఁ దానె చిత్తరువు వ్రాసె.

135


గీ.

అతని తలఁపున విశ్వంబు నయ్యెఁ గాన
విశ్వ మన వేఱె యొక్కటి వెదుక నేల?
నన్నియును దాన యగుఁ గాన నరుగఁ డెందు;
నాశ్రయము దాన యగు గాన నతఁడు గలడు.

136


వ.

అప్పరమాత్మ దాన సద్రూపం బగుట జేసి కలం డని చెప్పంబడు
నని యెఱింగించిన యామంత్రివాక్యంబులు విని సంతుష్టాంతరంగ యై
యారాక్షసి యతని కి ట్లనియె.

137


క.

నీ వఖలతత్త్వవిదుఁడవు
గావున నీ మధురవాక్యగతి నా భవమున్

బావనత నొందెనని యా
భూవరుఁ గని శాంతవచనముల ని ట్లనియెన్.

138


వ.

మద్వాక్యంబులకుం దగినయుత్తరంబులు నీవునుం జెప్పుదు గాక యన
వుడు నా నృపాలుండు కర్కటి కి ట్లనియె.

139


సీ.

జగములు లేమి నిశ్చయముగాఁ దెలిసిన
        నేదేవుసుజ్ఞాన మెపుడు వెలుఁగు,
నఖిలసంకల్పసంన్యాసంబు చేసిన
        నేదేవు మనములో నిడగ వచ్చు,
మెఱసి యే దేవుని మీలనోన్మీలనం
        బుల సృష్టి యణఁగుచుఁ బొడముచుండు,
నఖిలవేదాంతవాక్యములకు నిష్ట మౌ
        నందాఁక నేదేవుఁ డతిశయిల్లు,


గీ.

గోటికోట్యంతరంబులఁ గొమరు మిగిలి
దృష్టివిషయంబు గాక యేదేవుఁ డమరుఁ,
దివిరి సచరాచరంబు లేదేవు లీలఁ
బరఁగి వర్తిల్లు, నది పరబ్రహ్మ మబల.

140


గీ.

వెలయ విశ్వాత్మకుఁడు నాఁగ విశ్వములును
దాన యయ్యును నొక్కటై తనరు నట్టి
శాశ్వతబ్రహ్మచిన్మాత్రసత్యవాక్య
ఫణితి నీచేత వినఁ గంటి పద్మనయన.

141


వ.

అని చెప్పుటయు.

142


క.

వెన్నెలఁ గన్న కుముద్వతి
చెన్నున మేఘంబుఁ గన్న శిఖిగతి మదిలోఁ
దన్నెఱుఁగని సంతసమున
నన్నరపతిఁ గాంచి దనుజ యలరుచుఁ బలికెన్.

143

ఉ.

అక్కట యస్తమింపని వియన్మణిభంగిని మీ వివేక మిం
పెక్కి వెలింగె, మీకు సరియే బుధు లెందును? బుణ్యులార మీ
మక్కువతోడివాక్యముల మామకదుఃఖమనోభయంబులుం
గ్రక్కున బాసె దీపశిఖఁ గ్రాఁగినచీఁకటిభంగి మీదయన్.

144


చ.

అనుడు నృపాలుఁ డి ట్లనియె; నంగన నీ వతిపుణ్యశీల, వీ
వనముల నుఁడ నేల! తగువస్త్రవిభూషణగంధమాల్యముల్
దనియఁగ నీకు నిత్తు; నతిదారుణరూపము మాని సౌమ్యవై
యొనరఁగ గొన్నివాసరము లుండుము మాకడ నున్నతస్థితిన్.

145


వ.

అట్లేని చోరులను బాపకర్ములను రాజుద్రోహులను నీకు భక్ష్యంబుగా
నిచ్చెద. వారల హిమవత్పర్వతప్రాంతంబునకుఁ గొనిపోయి భుజి
యించి సుఖం బుండు మని పలికి యా భూపాలుండు నిజమంత్రిసమే
తుం డయి గృహంబునకుం జనియె. కర్కటియు రాజు సెప్పినట్లు
క్రూరులను భక్షణ చేయుచు నప్పటప్పటికిం జని హిమాచలశిఖ
రంబునఁ బరమసమాధి నుండె నని కర్కటివృత్తాంతంబు రామచం
ద్రునకుం జెప్పి వశిష్ఠుం డి ట్లనియె.

146


క.

ఈసూచితవృత్తాంతము
మాపరముగఁ జెప్పఁబడియె మనుజేశ్వర నీ
కీసంసారము చిత్తవి
లాసస్ఫురణమున నైన లక్ష్యము దెలియన్.

147


క.

రాగాదిదోషదూషిత
మై గర్హిత మైనచిత్త మది సంసారం
బాగతిఁ బరిభ్రమింపమి
వేగమె భవబంధములకు విడుగడ గాంచున్.

148


వ.

మఱియు నీ యర్థంబున సకలశ్రుతిభూషణంబును ననిందితంబును
నగునొక్కయితిహాసంబు సెప్పెద. నందుఁ జిచ్ఛక్తిసముల్లాసంబునం

జన నిశ్చయం బగుట ముం జిత్తం బను బాలుండు ప్రపంచపిశాచం
బుఁ గనుంగొని భయపడి ప్రబోధితుం డై పరస్పరరూపం బని యెఱిం
గిన చందంబునం దేటపడ నెఱింగించెద, నాకర్ణింపు మని వసిష్ఠుం
డు రామచంద్రున కి ట్లనియె.

149


క.

ఇంద్రుఁడు నాఁ నొకవిప్రుఁడు
సుందరియును దాను నాత్మశుద్ధిసమాధిం
జెంది రజతాద్రితటమున
నిందుధరుం గూర్చి తప మహీనతఁ జేసెన్.

150


గీ

అట్లు తపము సేసి యద్దేవువరమునఁ
బుత్త్రదశకలబ్ధి బొంది, కొంత
కాలమునకు వారు కాలగోచరు లైన,
నక్కుమారు లెందు దిక్కు లేక.

151


వ.

చింతాక్రాంతు లై యొండొరులం గూడుకొని యందఱు నగ్రజుకడ
కుం జని యి ట్లనిరి.

152


ఏమి సేయుద మింక? నేది కార్యము మన?
        కెవ్వరు గల రిందు? నెందుఁ బోద?
మీదుఃఖములఁ బాసి యెబ్భంగి సుఖియింత?
        మని తన్ను నడిగిన; నతఁడు మీకు
నెట్టిది మది కించు నట్టిది వర మిత్తు
        నడుగుడు మీ రన్న; నాత్మఁ బొంగి
యచ్చట నొకయూరియధికారిఁ బొడగని
        యాతనిసంపద యడుగ; నదియు


గీ.

నెంతపని యన్న; వారు సామంతపదవి
యడుగ; నది యేల యన్న; వా రవని నేలు
రాజసంపద వేఁడ; నారాజ్య మెంత

యనిన ననుజన్ము లందఱు నన్న కనిరి.

153


వ.

అ ట్లేని మాకు నఖిలరాజలోకశాసనుం డగురాజు సామ్రాజ్యపదంబు
గృపసేయు మనిన, నదియు నశ్వరం బేటికి? ననిన, వా రింద్రత్వం బడు
గుటయు నతండు.

154


గీ

తగఁ బ్రజాపతికిని ముహూర్తంబు సనిన
నింద్రసంపద చెడిపోవు, నేల మీకు?
ననిన వారలు మాకుఁ గల్పాంతములను
జేటు లేనట్టిగతి గృపసేయు మనిన.

155


వ.

వారికి నగ్రజుం డి ట్లనియె.

156


క.

 ఆకల్పాంతమునందును
బ్రాకటముగఁ జేటు లేని బ్రహ్మపదంబున్
మీ కిచ్చెద నని పలికన
నాకొమరులు నన్నఁ జూచి యని రుత్సుకులై.

157


వ.

తండ్రీ మీవాక్యంబు లత్యంతయుక్తంబు లయి యున్నయవి; యప్ప
దం బెవ్విధిం బ్రాపించుఁ జెప్పవే యనిన నగ్రజుం డి ట్లనియె.

158


గీ.

అభిలజగములు సృజియించునట్టి బ్రహ్మ
యేను యనుబుద్ధి వెలిచింత లెల్ల మఱచి,
నియతిఁ బద్మాసనస్థు లై నిలిచి చూచి,
తత్పదంబును బొందుఁడు తమ్ములార.

159


వ.

అనిన వార లగ్రజువాక్యంబు లంగీకరించి యతండునుం దారును న
త్యంతనియతాత్ము లయి యొక్క పుణ్యనదీతీరంబునందు.

160


సీ.

పద్మాసనస్థు లై బాహ్యకర్మంబులు
        మఱచి దేహంబుల మమత లుడిగి
సకలేంద్రియంబుల సమత మై జంధించి
        చిత్తంబు లొక్కటఁ జేసి నిలిపి

చింతలనెడఁబాసి యంతరంగంబులఁ
        బరమాత్మతత్త్వంబు పదిలపఱిచి
యఖిలలోకంబుల నమరులఁ గల్పించు
        బ్రహ్మల మే మనుభావనలను


గీ.

దపము సేయంగఁ దొల్లింటితనువు లెల్ల
శీతవర్షాతపంబులఁ జివికి యెండి
జీర్ణపర్ణంబులట్ల విశీర్ణ మైన
దివ్యదేహంబు లొంది భూదేవకులులు.

161


చ.

పదురు కుమారులుం బదురు బ్రహ్మలరూపులు దాల్చి యెల్లెడన్
విదితము గాఁగ సృష్టులను వేఱె యొనర్చి సుఖించుచుండఁగా
మొదలిటి బ్రహ్మ వారిఁ గని ముక్కున వ్రే లిడి యాత్మ నద్భుతం
బొదువ శిరంబు లూఁచి వెఱపొందె రఘూత్తమ యేమి సెప్పుదున్.

162


వ.

అని మఱియు నిట్లనియె.

163


క.

చిత్తంబ కర్త సృష్టికి
చిత్తమ జీవుండు గాక జీవుఁడు వేఱే?
చిత్తంబ చేయును గ్రియల్
చిత్తవ్యతిరిక్త మైన చేతలు గలవే.

164


వ.

అది యె ట్లనిన, బ్రాహ్మణమాతృకు లగునైందవు లందఱు మనోభావన
బ్రహ్మరూపంబు దాల్చి సృష్టికర్త లయి వెలింగి రట్లు గావున.

165


గీ.

దేహవాసన సేసినదేహి దాన
దేహబాధల సుడిపడి తిరుగుచుండు;
నాత్మవాసన సేసినయట్టియోగి
దేహ మిది మేలు కీ డని తెలియ నేచున్.

166


క.

అనిన విని రఘుపుంగవుండు మునిపుంగవున కిట్లనియె.

167


క.

దేహము జీవుఁడు వే ఱగు

టూహింప నతథ్య మైన, నొక్కటి వినుఁడీ;
దేహము సుఖదుఃఖంబులు
దేహికి ప్రాపింప కున్నె దివ్యమునీంద్రా!

168

కృత్రిమేంద్రోపాఖ్యానము

వ.

అనిన వసిష్ఠమునీంద్రుం డీ యర్థంబున నొక్కయితిహాసంబు గల
దాకర్ణింపు మని యి ట్లనియె.

169


క.

ఇంద్రద్యుమ్నుం డనురా
జేంద్రుడు గలఁ డతనిసతి మదేభగమన స
న్మంద్రమృదువచన రాకా
చంద్రానన మదనమోహశర మన వెలయన్.

170


ఉ.

ఆ సుదతీలలామ దనహర్మ్యతలంబున నిల్చి మానసో
ల్లాసము సేయుపట్టణవిలాసము సూచుచు నుండ, నయ్యెడన్
భూసురవర్యుఁ డొక్కవిటపుంగవుఁ 'డింద్రుఁడు' నాఁగ నొక్కఁ డా
సాసల వేశ్యవాటికలయందు రమించుచు నుండు నాతనిన్.

171


క.

కని వానిపట్టుఁ బేరును
దన బోటుల చేతఁ దెలిసి తరలేక్షణ నె
మ్మనమునఁ గోరిక తీఁగెలు
గొనసాఁగఁగ వానిఁ బొందఁ గోరుచునుండెన్.

172


వ.

అంతట నొక్కనాఁడు.

173


ఉ.

ఆరమణీశుమ్రోల నితిహాసకుఁ డొ'క్కఁడు గోష్ఠి సేయుచున్
వారక యింద్రుఁ డొక్కమునివల్లభుభార్య నహల్యఁ దెంపునన్
జారత కోర్చి పొందిన ప్రసంగము చెప్పఁగ నామృగాక్షియున్
జేరువ వించునుండి దనచిత్తమునన్ దలపోసి యిట్లనున్.

174


గీ.

ఆతఁ డింద్రు డే నహల్య నిద్దఱకును
బొందు గూర్చె మున్ను పుష్పశరుఁడు

పుణ్యకథలయందుఁ బొందుట సెప్పడి
నింకఁ జిత్తశంక లేల నాకు.

175


వ.

అని నిశ్చయించి.

176


ఉ.

ఆ తరలాక్షి యొక్కతెయ యానడురాతిరి పెక్కుమోసలల్
వే తఱియంగ దూరి యట వీధికి వెల్వడి సందిక్రంతగా
నాతని యిల్లు సొచ్చి ప్రియ మారఁగ వాఁడును దాను సంతత
ప్రీతి రమించుచుండె విపరీతగతిన్ భయ మేది యెంతయున్.

177


వ.

అంత నొక్కనాఁడు.

178


క.

ఆ పట్టణపుఁ దలవరు
లేపారఁగఁ బట్టి వారి నిరువురఁ గొని యా
భూపాలుమ్రోలఁ బెట్టిన
గోపంబున నృపతి వారిఁ గొట్టించె వెసన్.

179


వ.

మఱియు ననేకవిధంబుల బాధింప వారల శరీరంబుల జర్జరితంబు
లయి రక్తధార లొలుకుచుండ మిసిమింతులు గాక కలకల నవ్వుచు
నానృపాలున కి ట్లనిరి.

180


ఉ.

ఈసునఁ జేయు కార్యముల నే మగు? నిద్దఱ నావలంతగా
గోసిన నైన నొప్పియును గోపముఁ బుట్టదు దేహవాసనన్
బాసి మనోగతుల్ సురతభావనఁ గూడి రమించుచుండ నీ
చేసినచేఁత లెవ్వియును జిత్తము నొంపఁగలేవు భూవరా.

181


క.

ఇత్తరలాక్షికి నాకును
జిత్తము లేకముగఁ గలసి చిత్తజసౌఖ్యా
యత్తత నవ్వల నుండఁగ
నిత్తనువులబాధ మాకు నెఱుఁగఁగ నగునే?

182


వ.

అది యెట్లనిన.

183


ఉ.

చిత్తమ కారణం బఖిలసృష్టికి, మ్రాఁకుల దీఁగెలన్ జలం

బత్తి రసస్వరూప మగునట్టి విధంబునఁ; జిత్త మవ్వలన్
మెత్తనిమేనితో మెలఁగ మేకొన నీ విటు రిత్త బొందులన్
గృత్తము సేయ నేల! పరికింపుము చిత్తవికారభావముల్.

184


ఉ.

దేహ మణంగిపోయినను, దేహశతంబులు దా మడంగినన్
మోహము సేయు నింతటికి మూలము చిత్తము; స్వప్నభూమిలో
నీహలు దీర్చుకొన్నయటు లిన్నియుఁ జిత్తలయంబు సేసినన్
దేహము వాసిపోవు జగతీవర దాఁపుము చిత్తరత్నమున్.

185


వ.

అనవుండు.

186


క.

పరమార్థామృత మగునా
యిరువురవాక్యములు విని మహీశుఁడు వారిన్
బొరి శిక్షించినవాఁడై
పురి వెడలఁగ నడిచి పుచ్చె భూవరముఖ్యా.

187


వ.

ఇట్లు పురంబు వెలుపడి యింద్రాహల్య లిరువురు నన్యోన్యప్రేమాతి
రేకంబునం గామోపభోగంబు లనుభవించి పెద్దకాలంబునకుఁ దనివి
సన దివ్యజ్ఞానసంపన్నులును నిత్యముక్తులు నై పరమసిద్ధికిం జని రని
కృత్రిమేంద్రోపాఖ్యానంబు సెప్పి; వసిష్ణుండు, సకలశరీరులకు శరీర
ద్వయంబు గలిగియుండు, నందు మనశ్శరీరంబు క్షిప్రగతియు సదాచ
లనంబు నై యుండు, స్థూలశరీరంబు రక్తాస్థిమాంసనిర్మితంబు నై
యుండు, ననిన రఘునందనుం డి ట్లనియె.

188


క.

మన మతిజడము నమూర్తం
బును సంకల్పప్రభూతమును నగు నేరూ
పున దేహము ధరియించెను
వినిపింపుము మునివరేణ్య విస్తరఫణితిన్.

189


వ.

అనిన విని వసిష్ఠుం డనంతంబును సర్వశక్తిమయంబు నగుపరమా
త్మునిసంకల్పంబు శక్తిఖచితంబు మనం బని బుధుల చేత వినంబడు

నీయర్థంబునఁ దొల్లి బ్రహ్మోపదిష్టం
బగునొక్కయితిహాసంబు
గల దాకర్ణింపుమని యి ట్లనియె.

190

బ్రహ్మోపదేశము

సీ.

ఏదిక్కు చూచిన నెంచి నూఱామడ
        వెడలుపు నిడుపు నై విస్తరిల్లు
చతిదుర్గ మైనమహాటవి నిర్జనం
        బును భీషణంబు నై దనరు; నందు
వేయు నేత్రంబులు వేయుఁ జేతులు మహా
        దీర్ఘవిస్తృతము నై తేజరిల్లు
భీమకాయంబునఁ బెం పొంది యొకమహా
        పురుషుఁ డయ్యడవి నెప్పుడు వసించి


గీ.

యుండి, యాతండు తన బాహుమండలముల
పరిఘములు పెక్కు దాల్చి నిబ్బరము గాగ
మొనసి తనమేను చదియంగ మోఁదికొనుచు
దనుపుగల యొక్క కదలికావనము సొచ్చి.

191


ఉ.

అచ్చటనుండి దుష్టతర మైనకరంజవనంబు సొచ్చి తా
నచ్చట నొక్కనూతఁ బడి యంతన లేచి యరంటితోఁటకున్
గ్రచ్చర నేఁగి మేను పెనుగాదలు గట్టఁగ వ్రేసికొంచుఁ ద
న్మెచ్చక యున్నవానిఁ గని మే గురుదాల్పఁగ నిట్లు పల్కినన్.

192


క.

ఈకాంతారములోపల
నేకాంతము యున్నవాడ వెవ్వఁడ? వకటా
నీ కీవ యడుచుకొనియెద
వీ కటికతనంబు మానవే యని కరుణన్.

193


గీ.

వ్రేసికొన నీక పట్టిన వ్రేటు లుడిగి
వాఁ డెలుంగెత్తి యేడ్వంగ, వలవ దనిన

మాని యొ త్తిలి నవ్వుచుఁ దాన తనదు
బాహులను మేను ఖండించి పాఱవైచి.

194


ఉ.

ఊరక యున్నఁ జూచి వెఱఁ గొందుచు నే నటు వోవ నొక్కచో
దారుణకాయుఁ డొక్కరుఁ డుదగ్రత నాతనియట్ల యంగమున్
ఘోరముగాఁగ మోఁదుకొనఁ గొంకక పట్టిన వాఁడు నన్ను ధి
క్కారము చేసి దుర్ద్విజుఁడ కాఱులు సెప్పకు మంచు నుధ్ధతిన్.

195


వ.

ఒక్కమహాంధకూపంబునం దురికె. నతండె కాఁ డట్టిపురుషుల ననే
కులం బొడగంటి నని సెప్పి; యీయాఖ్యానతాత్పర్యంబు నీ కెఱిం
గించెద విను మని యి ట్లనియె.

196


సీ.

అయ్యరణ్యంబు దా నది మహాసంసార,
        మాఋషుల్ మాన సాఖ్యంబు, లతని
కరములు పరిఘలు పరఁగ ధీవృత్తులు,
        ప్రహరణంబులు దుఃఖపాపవితతు,
లంధకూపము నిరయం, బరఁటులతోట
        స్వర్గంబు, బహుకరంజములు మత్యున్,
లెసఁగుశాస్త్రవివేక మేను వివేకింప
        భోగశైథిల్య మై పొడముచిత్త


గీ.

తాప మాతండు సేయురోదనము, హాస్య
మాత్మసంతోష, మంగకత్యాగ మనఁగ
వృత్తినాశంబు, వాడు దుర్వృత్తి నన్ను
ధిక్కరించుట నాస్తికస్థితి యెఱుంగు.

197


వ.

అని పితామహుఁడు తనకుఁ దొల్లి సెప్పినకథాక్రమం బెఱింగించి
వసిష్ఠుండు మఱియు ని ట్లనియె.

198


గీ.

గోరి యాత్మవివేకంబు కొంత గలిగి
యమలనిర్వాణపదమును నంద లేక

భోగముల మాని తద్గతిఁ బొందఁ దివురు
నదియ పరితాప మనఁబడు నవనినాథ.

199


క.

జ్ఞానవివేకప్రాప్తుం
డై నిఖిలము విడిచి తన్మయత్వంబునఁ ద
స్మానసలయ మొనరించుట
యానందు బనఁగ నొప్పు నవనీనాథా.

200


క.

చిత్తమ ప్రకృతియుఁ బురుషుఁడుఁ
జిత్తమ సంసార మగుట చింతించి తగన్
జిత్తత్యాగము సిసి న
రోత్తమ యానందపదము నొందుము నెమ్మిన్.

201


వ.

అని చిత్తోపాఖ్యానంబు రామచంద్రున కెఱింగించి వసిష్ఠుండు మఱి
యు ని ట్లనియె.

202


గీ.

సర్వశక్తిమయము శాశ్వత మాపూర్ణ
మవ్యయంబు బ్రహ్మ మనఁగ బరఁగి
సర్వదేవులందు శక్తిస్వరూపమై
మనము వెలుఁగుచుండు జనవరేణ్య.

203


వ.

ఎ ట్లనిన నది యాత్మకు నుల్లాసశక్తియు బ్రహ్మంబునకుఁ జిచ్ఛక్తి
యు వాయువునకు స్పందశక్తియు శిలలయందు దార్ఢ్యశక్తియు నుద
కంబునకు ద్రవశక్తియు ననలంబునకు దాహశక్తియు నాకాశంబునకు
శూన్యశక్తియు వినాశంబునకు లయశక్తియు నయి ప్రవర్తిల్లు. చిత్ర
వర్ణపింఛశిఖండమండితం బగు మయూరంబు తదండాంతర్గతజ
లం బై యున్న యట్లు మూలవిటపశాఖాపత్రపుష్పఫలసమేతం బగు
వృక్షంబు బీజంబునం దున్న యట్లు స్థూలసూక్ష్మరూపంబున విహరించు
చుండు; మఱియును.

204


గీ.

దేశకాలాదివైచిత్రిఁ జేసి ధరణి

సస్యములు పుట్టుగతి నాత్మశక్తి నొదవుఁ
గోరి యొక చోట నొకవేళఁ గొన్ని కొన్ని
నిత్యసత్యుండు పరమాత్మ నిఖలగతుఁడు.

205


ఉ.

మోక్షము సర్వధర్మముల మున్కొని కన్గొను దృష్టి తాన యై,
యక్షయ మైన జగము లన్నియఁ దాన సృజించి, యంతయున్
రక్ష యొనర్చు మానసము రాగిలెనేని, వికల్పుఁ జేయుఁ బ్ర
త్యక్షముగాదు బాలకులయాటలపాటలయట్ల రాఘవా.

206


వ.

ఈయర్థంబున కొక్కయితిహాసంబు సెప్పెద నాకర్ణింపుము.

207


క.

ఒక దేశంబున నొకపురి
నొకరాజవరేణ్యుదాది యొక్కతె యొకచో
నొకరాజకుమారునితో
నొకకథ వినిపించె మంజులోక్తులు వెలయన్.

208


వ.

అది యెట్లనిన.

209


సీ.

అవనిలో నతిశూన్యమైనమహాపురి
        నేపార నొక్కరా జేలుచుండు;
నతనికి మువ్వురు సుతులు ధర్మాత్ములు
        గల; రందు నిద్దఱఁ గనదు తల్లి,
యొకఁడు గర్భములోన నుదయింపఁ డెన్నఁడు;
        నట్టిమువ్వురు నవయావనముల
నిగిడి తా రున్నయానగరంబు వెలువడి
        యాకాశవనమున కరిగి, యందుఁ


గీ.

బూచి కాచి యొప్పు భూరుహచ్ఛాయల
విశ్రమించి యచట వేఁటలాడి;
రనుచు దాని సెప్ప నబ్బాలుఁ డక్కథ
నిజముగాఁ దలంచె నృపవరేణ్య.

క.

ఉపలాలోక్తుల నాయమ
విపరీతపుఁ గథలు సెప్ప వినినట్లు సుమీ
కపట మగునీప్రపంచము
చపలం బని తెలిసి రామ శాంతుఁడ వగుమా.

211


క.

సంకల్పమ సంసారము
సంకల్పమ చిత్తవికృతజాలం బని ని
స్సంకల్పుఁడ వయి మానస
శంక లుడిగి దాని నణచి శాంతుఁడ వగుమీ.

212


వ.

అని యెఱిఁగించి వసిష్ఠుండు రామచంద్రున కి ట్లనియె.

213

లవణోపాఖ్యానము

క.

తనసంకల్పవశంబున
ననయము భవపాశబద్ధుఁ డగుమూఢుఁడు దాఁ,
దనసంకల్పవశంబున
ననయము భవపాశముక్తుఁ డగుధీరుఁ డిలన్.

214


క.

బుద్ధిఁ దలపోసి యంతయు
సిద్ధంబుగ మును పరిత్యజించితి వెందున్;
సిద్ధుడవు నీవు; కేవల
బద్ధునివలె వగవఁ దగునె భానుకులేశా!

215


గీ.

ఆత్మతత్త్వం బనంతంబు నవ్వయంబు
నిర్వికల్పంబు తాన యై నిండి యుండు; .
మూఢుఁ డగుబద్ధుఁ డెవ్వఁడు? ముక్తుఁ డెవ్వఁ?
డన్నియును తన్మయత్వంబు లరసి చూడ.


వ.

అట్లు గావున మనోవిలాసమాత్రంబు బంధంబును, మనశ్శమనంబు
మోక్షంబు నగుఁ; దద్విలాసంబున గోష్పదంబు యోజనశతం బగు;
క్షణకాలంబు బ్రహ్మకల్పం బగు. నీయర్థంబున నొక్కనిదర్శనంబు

సెప్పెద నాకర్ణింపు మని యిట్లనియె.

217


క.

అవనికిఁ దొడ వగునొకపురి
లవణుం డనురాజు రాజ్యలక్ష్మీయుతుఁ డై
తివిరి యొకనాఁడు కొలువున
నవిరళగతి నున్నవేళ నాతనికడకున్.

218


క.

తిలకంబును మసిబొట్టును
జిలిబిలిబదినికెలపూసచేరులు దెలిగ
న్నులకాటుకయును గుంచెయు
బలుమందులు దనర నొక్కపాఱుఁడు వచ్చెన్.

219


వ.

ఇవ్విధంబున శంబరుం డను నైంద్రజాలికుండు చనుదెంచి యారాజును
దీవించి సభామధ్యంబున నిలిచి కొండొకసేపు నిమీలితాక్షుం డై.

220


క.

చప్పట్లు వెట్టి చేతులు
విప్పుడు మంత్రించి కుంచె విసరుచు రాగం
బొప్పుగ మొగసిరిఁ గాటుక
గప్పినకనుఁగవలఁ గొలువు కలయఁగఁ జూచెన్.

221


వ.

ఇట్లు సూచుటయు నతనిమాయాజాలంబునం బడి తత్సభాజనంబు
నిశ్చేష్టితం బై సూచుచుండె. లక్షణభూపాలుండును జిత్రరూపుచం
దంబున గద్దియ నొరిగి నిశ్చేతనుం డయి ముహూర్తద్వయం బుండి
మేను చెమర్ప నదరిపడి భయభ్రాంతచిత్తుం డగుచు సభ్యులం గనుం
గొని యొకయాశ్చర్యంబు వినుం డని యి ట్లనియె.

222


అల్పాక్కర.

మీ రిందు శంబరు మెచ్చి చూడ
నారూఢి నే నొక్కహయము నెక్కి
దూరించి పో వనదుర్గభూమి
భారంబుగాఁ జొచ్చె వాజివేగ.

223

వ.

అంత రాత్రి యగుటయు మహాంధకారంబున నత్తురంగం బయ్యర
ణ్యంబునం గ్రుమ్మరుచుండ నే నొక్కతరుశాఖ పట్టుకొన్న; నవ్వాహ
నుబు నిజేచ్ఛం బఱచుటయు నిర్జనం బగు నవ్వనంబునందు.

224


క.

ఆలంబితశాఖుఁడ నయి
వ్రేలుచు దిగ వెఱచి తీవ్రవేదన వగలం
దూలుచు నాఁకట నెంతయు
జాలిం బడునంత వేగి సవితృఁడు వొడిచెన్.

225


వ.

అట్టియెడ నలుదిక్కులుఁ జూచుచు భయభ్రాంతచిత్తుండ నై యుండ
నవ్వనాంతరంబునందు.

226


ఉ.

చేతులగాజులున్ జెవులజిట్లును బొట్టును దాటియాకులున్
వాతెఱతీరు నై పఱపువాలికకన్నులు నల్లరూపునన్
భాతి దలిర్ప నొక్కతి యునామిక గ్రద్దన గంప మోచికొం
చాతెరువట్టి చేనికడ కంబలి తండ్రికి గొంచుఁ బోవఁగన్.

227


క.

కని డాయఁ బిలిచి నాన
చ్చినతెఱఁగున బడ్డనెగులుఁ జెప్పుచుఁ దరుణీ
నను డింపు మన్నమాటలు
విని యదియును గంప దింపి వెలవెల నగుచున్.

228


గీ.

కానికులముదానఁ గదియంగ వచ్చునే
యనినమాట కేను ననుమతింప,
లీల నదియు రెండురా లెత్తుగాఁ జేసి
యెక్కి కొంకు కొస రొకింత లేక.

229


ఉ.

నన్నును గౌఁగిలించి వదనంబు నురంబునుఁ జేర్చి డింపుచోఁ
జన్నులు సోకి మైఁ బులకజాలము నెక్కొనఁ జిత్త మెంతయున్
వెన్నవిధంబు దోఁప ననవిల్తునిబారికి నగ్గ మైతి నా
యన్నును నన్ను డించి మొగ మెల్లన వ్రాల్చుచుఁ బాసి నిల్చినన్.

230

వ.

దానితో ని ట్లంటి.

231


క.

నిన్నటినుండియు నాఁకట
నున్ననిమిత్తమున దాహ మొదవెను; మేనున్
గన్నులును దిమ్మ దిరిగెడుఁ
గ్రన్నన నాదప్పి దీర్చి రక్షింపఁ గదే.

232


వ.

అనిన నాచండాలి నాయభిప్రాయం బెఱింగి తనతెచ్చిన పర్యుషితా
న్నంబునం గామోపచారంబులం బరితోషితుం జేసిన; నేనునుం దాని
చేసినతగవునుం దగులంటు నగ్గలించి విడుప నోపక తజ్జనకానుమతం
బున వివాహంబై దానియింటనె యుండి దానివలన నలుగురు కొడు
కులం గని పెద్దకాలం బాచండాలసంసారసుఖంబు లనుభవించుచు
నుండ; నంత నద్దేశంబునకు రాజోపప్లవంబు గదిరి యూళ్లు విడిచి
వలసలు పోవుచుండ నప్పుడు.

233


చ.

కడవలు కావటందు నిడి గ్రక్కున మూఁపున మోచి బిడ్డనిన్
దడయక వీఁపునం దునిచి తక్కినమువ్వురఁ దోడుకొంచు, నా
పడతియు గంప మోచికొని పల్మఱు దిట్టుచు వెంటఁ గూడి రా
నడవికి నేఁగి పె క్కిడుము లందితి నయ్యెడ నేమి సెప్పుదున్.

234


వ.

అంతఁ గొన్నిదినంబులకును.

235


క.

కొడుకులు నాలును గడు నల
జడి బడి గ్రాసంబు లేక సమసిన వారిన్
బెడఁబాసిన బహుదుఃఖము
దొడరిన సొద సొచ్చి మేను దొఱఁగితి నచటన్.

236


వ.

ఇట్లు వడిఁ దెలివొంది చనుదెంచితి. నింతయును శంబరునికృత్యంబ.
సకలజీవులకు మనోమాయ దుఃఖం బాపాదించుచుండు. నని యమ్మ
హీపతిపలుక; నంత నయ్యైంద్రజాలికుడు నంతర్ధానంబు నొందు
టయు, సభ్యు లాశ్చర్యహృదయు లై యారాజున కి ట్లనిరి.

237

చ.

కనుఁగొన నైంద్రజాలికుఁడు గాఁ డితఁ; డట్టిఁడ యయ్యె నేని దా
ధన మభిలాష చేయఁడె? వృథా చనుదెంచి యదృశ్యుఁ డయ్యె; నె
మ్మనము జగద్విలాస మనుమాయిక మెల్ల నుఁ జూప వచ్చిన
య్యనిమిషదూత గాని యతఁ డారయ మర్త్యుఁడు కాఁడు భూవరా.

238


వ.

అట్లు గావున ననంతరూపం బగుపరమాత్మమాయ మనోరూపంబు
దాల్చి జగత్తుల భ్రమలం బెట్టుచుండు, దీనికి జింతింపవలవ దని
సభ్యు లారాజు ననునయించి. రని శాంబరికోపాఖ్యానంబు చెప్పి
వసిష్టుండు రఘునందనున కి ట్లనియె.

239


గీ.

అనఘ యల్పకాలమునన పెక్కేఁడులు
జరుగు టెల్ల నింద్రజాలమహిమ
యెంత సేసి రంత యెదుగు మనోమాయ;
యెంత యెడసి రంత యెడయుఁ దండ్రి.

240


వ.

సమయమంబున మనశ్శాంతి యగుఁ; దచ్ఛాంతిని మననవర్జితంబును
నుత్తమపదధ్యానంబును నగు; మందరంబు సముద్రంబునుం గలం
చినట్లు సంసారసంభ్రమం బుడుపవలయు. భోగసంకల్పవర్జితంబున
సంసాకవిషవృక్షాంకురంబు ద్రుంపవలఁయు; మఱియును.

241


క.

చిత్తవ్యాధుల కౌషధ
ముత్తమమును ఋజువు నయిన యొక్కటి విను మ
త్యుత్తమ మభిమతసుఖముల
పొ త్తెడలి నిరామయత్వమున సుఖి వగుమీ.

242


క.

ఏ యభిలాషలఁ బొందక
కాయము నిజ మనక బాహ్యగతు లెడలి మదిన్
స్వాయత్తజ్ఞానంబున
బాయక చిత్తంబు గెలువు భానుకులేశా.

243


గీ.

శాస్త్రశిక్షల నిశిత మై చల్ల నైన

చిత్తమునఁ దోఁచు చింతలు మెత్తనయిన,
చిత్తశత్రునిఁ దునుమాడి చింత లుడుగు
మనఘ యినుమును నినుముచే దునుమునట్లు.

244


గీ.

పౌరుషంబున సాధ్య మై పరఁగునీప్సి
తముల భోగింపవల దన్నఁ దానె తొలగు;
నట్టి చిత్తంబు నియమింపనట్టిపురుష
కీటకంబులఁ గాల్పనే కిల్బిషారి.

245


సీ.

పొలుచు బ్రహ్మంబునఁ బొంది నిరీహశా
        స్త్రములచేఁ జిత్తకృంతన మొనర్చి
యేకాంతముననుండి యెసఁగుచిత్తమునఁ జి
        ద్రక్షితంబుగఁ జేయఁ దగినయతఁడు
కల్పాంతపవనంబు కడువడి వీచిన
        నంబుధు లొక్కటి యయ్యె నేని
ద్వాదశాదిత్యులు తఱిమి కాసిన నైనఁ
        గల్పశతంబుల గ్రాఁగఁ డతఁడు


గీ.

ఏమి సెప్పుదు నొకచిత్ర మినకులేశ,
నిత్య మై యున్న బ్రహ్మంబు నిగుడ నీక
వినుము నిస్సార మైనయవిద్య దాన
యఖిలజగములు భ్రమఁ బెట్టి యాడుచుండు.

246


వ.

స్ఫటికోపలరచితంబు లగు విచిత్రప్రతిబింబంబులం బోలె నఖిలకార్యం
బులం జేయుచు నిర్మలచిత్తుఁడ వయి యుండు. మని బోధించినఁ, బర
బ్రహ్మమూర్తి యగునమ్మునివాక్యంబులకు వికసితాంతఃకరణుం డయి
రఘుపతి యి ట్లనియె.

247


గీ.

తృణకణాంశంబు వజ్రమై త్రుంచునట్ల
కోరి తామరనూలునఁ గొండ లెల్లఁ

గట్టువడినట్లు విశ్వంబు గట్టువడియె;
నకట మాయాప్రభావ మే మందు ననఘ!

248


వ.

అని మఱియు నిట్లనియె.

249


అక్కట లవణనృపాలుఁడు
తక్కక తనకొలువులోనఁ దనతను వుండన్
ది క్కెడలి మాలవాటుల
నక్కానలఁ బొంది యేమి యయ్యె మునీంద్రా.

250


క.

అనిన వసిష్ఠుం డి ట్లను;
విను రాఘవ లవణనృపతివృత్తాంతం; బా
యన రాజసూయయాగము
మును సేసినకతన దుఃఖములు కుడిచె వడిన్.

251


వ.

అది యె ట్లనిన రాజసూయయాగకర్తలు ద్వాదశవర్షదుఃఖంబు
లనుభవించుట జగద్విదితంబు గావున, నతని క్రతువునకు శతక్రతుం డ
సూయాయత్తుం డయి యొక్కదూతం బనిచిన వాడు శాంబరికరూ
పంబునఁ జనుదెంచి యారాజు నత్యంతమోహాంధుం గావించి చని
యె. నది కారణంబుగా నతండు ముహూర్తద్వయంబునఁ బండ్రెండేం
డ్లదుఃఖంబు లనుభవించె. నట్టి దురవస్థలం బడి లవణుండు కొలువు
వారలకుఁ జెప్పి వీడ్కొని నిజమందిరంబున కరిగి తనమనంబున ని
ట్లని వితర్కించె.

252


ఉ.

అక్కట రాజసూయమఖ మాగలిఁ జేసినయట్టినాకు నేఁ
డెక్కడి పాటు వచ్చె! నిది యేగతిఁ బాటిలె నొక్కొ దైవమా!
యెక్కడఁ జొచ్చువాఁడ నని యెంతయు బెగ్గిల నవ్వనంబు దాఁ
దక్కక తోఁచె నాతనిమనంబున దర్పణబింబభాతి యై.

253


వ.

ఇ ట్లత్యంతదుఃఖంబు నొందినయవ్వనం బంతయుం దనచిత్తంబునం
దోఁచిన నాభూపాలుండు మఱునాఁడు సచివసమేతుం డై బలంబులం

గూర్చుకొని దిగ్విజయార్థం బరుగుచందంబున దక్షణాభిముఖుం
డయి చని వింధ్యపర్వతప్రాంతారణ్యంబునందు.

254


చ.

తురగము చన్నమార్గమును, దూకొను వృక్షము కొమ్మ, మాలవాఁ
డరసినచేను, వానిసుత యన్నము వెట్టిన తావు, దానిఁ జె
చ్చెన వరియించి కాపురము సేసినయిల్లును, నాలు బిడ్డలున్,
సురిగిన చోటు, దాను సొద సొచ్చినభూమియుఁ జూచెఁ దెల్లగన్.

255


వ.

ఇట్లు ప్రత్యక్షంబుగాఁ గనుంగొని లవణుం డాశ్చర్యహృదయుం డయి
యవ్విధం బెవ్వరికి నెఱింగింపక నిజమంత్రుల ననునయించుచు వార
లుం దానును బురంబునకుం జని సుఖం బుండె. విద్యాప్రభావం
బిట్టిద; యసత్యంబు సత్యం బయి తోఁచు. ననిన విని దశరథనందనుఁ
డి ట్లనియె.

256


క.

కలలోఁ గాంచినవస్తువు
లలఘుమతీ యేట్లు నిక్క మై తోఁచు? జగం
బుల వినియుఁ గనియు నెఱుఁగము.
వెలయగ సంశయముఁ బాపి వినిపింపు తగన్.

257


వ.

అనిన వసిష్ఠుం డి ట్లనియె.

258


ఉ.

ఈ యనుమాన మేల! విను మిట్టిద యల్ల యవిద్యపెం; ప దె
ట్లాయె ననంగరాదు సుగుణాకర; మీఁదట నాదివర్తనం
బాయెడ నన్నియున్ విదిత మయ్యెడివాసన లెల్లఁ గాకతా
ళీయములట్ల కాని యవి లే వని సెప్పఁగరాదు భూవరా.

259


వ.

అది యె ట్లనిన నాపల్లెయు వనంబును హయంబును నారాజునకుం
దొల్లియు దృష్టంబులు శాంబరికమాయాకృతంబునఁ దోఁచి నట్ల విం
ధ్యపుష్కరదేశంబునం గానంబడియె; భావికార్యంబులు సూచించు
స్వప్నబునం బోలె దృశ్యంబు లయ్యె. నింతియ కాని దీని కింత విస్మ
యం బేల? జ్ఞానజ్ఞేయరూపం బగువస్తుసంతతి నాపాదించు. నింతియ

కాని సత్యంబు గా దట్లు గావున.

260


గీ

వస్తువస్తువునడుమఁ గేవలము బయలఁ
గలిగి యుండియు నేరికి గాన రాక
తెలివియును జాడ్యమును లేక వెలుగు నెద్ది,
యట్టిరూపంబు నీవు గ మ్మనఘచరిత.

261


చ.

మును పరమాత్మతత్త్వమున మున్కొని చిత్తము పుట్టుఁ, జిత్తస
న్మననవికల్పజాలమున మానుగఁ బుట్టి జగత్ప్రపంచ మెం
దును దలపోయ శూన్య మయి తోచుచునుండు, నభంబు నీలిమం
బని తలపోసినట్లు పరమార్థము గామి యెఱుంగు రాఘవా.

262


క.

జాలిన సంకల్పంబులఁ
జాలించినఁ జిత్త మణఁగి సంసారమహా
జలము సెడుఁ నంత శర
త్కాలవియద్భాతిఁ బరమతత్త్వము వెలుఁగున్.

263


వ.

అని లవణోపాఖ్యానంబు సెప్పి వసిష్ఠుండు రామచంద్రున కి ట్లనియె.

264

అజ్ఞానభూమికోపాఖ్యానము

సీ.

జననాథ యెఱుఁగు, మజ్ఞానభూమిక లేడు
        పొలుపొంది మనములోఁ బూని వెలుగు;
నేడింటిసందుల నేపారుభూములు
        గణనకు మిక్కిలి గలిగి యుండు;
నవి బంధమూలంబు లై ఫలియించుచుఁ
        జెప్పంగఁబడియె సంక్షేపభంగి;
మొగిని రాగ ద్వేషములఁ బాసి శుద్ధసం
        విన్మాత్రచిత్తంబు విడువ నీక


గీ.

జాడ్యనిద్ర లుడిగి సంకల్పములఁ బాసి
శిలయుఁ బోలె నొండుతలఁపు లేక

వస్తువస్తుమధ్యవర్తి యై వెలుఁ గొందు
నదియ చిత్స్వరూప మనఁగఁ బరఁగు.

265


వ.

అందు నారోపితంబులగునజ్ఞానభూము లెవ్వియనిన-బీజజాగ్రత్తును,
జాగ్రత్తును, మహాజాగ్రత్తును, జాగ్రత్స్వప్నంబును, స్వప్నంబును,
స్వప్నజుగత్తును, సుషుప్తియు, ననంబడు. నివి యొండొంటిం గలసి
యనేకనామంబు లై యుండుఁ; దల్లక్షణంబు నెఱింగించెద.

266


గీ.

చిత్తునకుఁ దాన మొదలిటిచేతనంబు
నై యనాద్యంబు విమలంబు నై వెలుంగు
భంగిఁ జిత్తార్థజీవసద్భవనమునకుఁ
బ్రథమబీజంబు బీజజాగ్రత్తుభూమి.

267


వ.

అది యెఱుకకు నూతనావస్థ యనంబడు; నింక జాగ్రదవస్థ సెప్పెద.

268


క.

ఇది నాయి ల్లిది నామే
నిది రేపగ లని తలంచునెఱుక విశద మై
మదిఁ బొడమెడుప్రాగ్భావం
బది జాగ్ర త్తనఁగ నొప్పు నర్కకులేశా.

269


గీ.

ఈతఁ డతడు నేను నిది నాది యనఁగ జ
న్మాంతరముల వచ్చునట్టియెఱుక
ననఘచరిత యెఱుఁగు మది మహాజాగ్రత్త
టండ్రు తత్త్వవేత్త లైనమునులు.

270


క.

ఈరాజు గెల్చి నే నీ
యూ రేలెద ననుచు నొండె నొం డొక టొండెన్
గోరుట జాగ్రత్స్వప్నం
బార మనోరాజ్యమహిమ లందుట రామా.

271


గీ.

ఎండమాపు లుదక, మిరువురు చంద్రులు,
కప్పచిప్ప వెండి, గాఁ దలంచి

పెక్కుగతులభ్రాంతి బెరయుట స్వప్నంబు
రఘుకులాబ్ధిచంద్ర రామచంద్ర.

272


గీ.

పెద్దకాల మేని తద్దయుఁ దఱుచుగాఁ
జూడకుండి పిదపఁ జూచి తెలియు
జ్ఞాన మదియ స్వప్నజాగ్రత్తు నాఁబడు
ననిరి బోధవేత్త లైనమునులు.

273


క.

జడ నొంది యిపుడు సెప్పిన
షడవస్థలఁ దొఱఁగి దుఃఖజాలము మదిలో
నెడఁబాపి భావిదుఃఖము
బొడఁగనఁబడనిది సుషుప్తి భూరివివేకా.

274

జ్ఞానభూమికోపాఖ్యానము

వ.

ఆ వ్యవస్థలయందు సకలజీవులును దమోలీనం బయి యుండు. నవి
యజ్ఞానసప్తావస్థ లనం బడు. నానారూపంబుల నసంఖ్యంబు లయి
యుండు. నింక జ్ఞానభూము లేర్పడం జెప్పెద. నవి బెక్కువిధంబులు
గల వని యోగిజనంబుల చేత వినం బడు. వీని నెఱింగినయతండు
దుఃఖపంకంబునం బొరయక నిత్యసుఖంబు లనుభవించునట్టిమతం
బొక్కటి సెప్పెద; నది యెయ్యది యనిన– ప్రథమంబు సుఖేచ్ఛయు,
ద్వితీయంబు విచారణయుఁ, దృతీయంబు తనుమానసంబును, జతు
ర్థంబు సత్త్వస ప్రాప్తియు, బంచమంబు సంసక్తియు, షష్ఠంబు
పరార్థభావనయు, సప్తమంబు తుర్యగయు, నన నీసప్తభూమికలు
ముక్తిమార్గంబులును సకలదుఃఖరహితంబులు నై యుండు. వాని
వేఱువేఱ వివరించెద వినుము.

275


గీ.

'అకట నే నేల మూఢుండ నైతి?' ననుచు
శాస్తృదృష్టిని సజ్జనసంగమమున
దగిలి వైరాగ్యకాంక్షఁ జిత్తమున నూను

నది సుఖేచ్ఛాఖ్య యండ్రు వేదాంతవిదులు.

276


గీ.

శాస్త్రసత్సంగవైరాగ్యసమితి గలిగి
సద్విచారప్రవర్తన సలుపుచున్న
నది విచారణ యనంబడు ననఘచరిత;
యిదియ రెండవభూమి యై యెసఁగు చుండు.

277


క.

ఈ రెంటిని మనమున నిడి
దారుణవిషయేంద్రియములఁ దగులక మననం
బారఁ దనుత్వము సేయుట
యారయఁ దనుమానసాఖ్య యగుబోధనిధీ.

278


గీ.

అనఘ యీ మూఁడుభూముల నభ్యసించి
యర్థవాంఛలు డించి సత్త్వాత్మనిష్ఠఁ
దగిలి శుద్ధాంతరంగుఁడై తలఁపు లుడిగి
పరఁగుచుండుట సత్త్వసంప్రాప్తి యండ్రు.

279


క.

కూరిన యీనాలుగు మది
వారక తలపోసి సంగవర్జితుఁ డయి స
త్త్వారూఢస్థితి నుండుట
యారయ సంసక్తినామ మగు దాశరథీ.

280


వ.

ఈ యేనుభూముల నెఱిఁగి స్వాత్మారాముం డయి బాహ్యాభ్యంతరం
బులం బదార్థంబులు లేమి తెలిసి పరమార్థంబు తెలియుట
పరార్ధభావన యనం బరఁగుచుండు.

281


గీ.

ఆఱుభూములగతులును నాత్మ నెఱిఁగి
యేమిటను నైన భేదంబు లేమి దెలిసి
తత్స్వభావైకనిష్ఠ మైఁ దనరు నెఱుక
తుర్యగయటండ్రు బుధులు చాతుర్యహృదయ.

282


వ.

తుర్యగావస్థయె జీవన్ముక్తి యనంబడు. మఱి విదేహముక్తివిషయంబు

తుర్యగా తీతం బగు. నని చెప్పి వసిష్ణుండు మఱియు ని ట్లనియె.

283


సీ.

పొలిచెడి సప్తమభూమిక యగుతుర్య,
        గావస్థఁ బొందిన యట్టి పుణ్యు
లమలు లాత్మారాము లధ్యాత్మవేత్తలు
        భాగ్యవంతులు పరబ్రహ్మయోగి
పరు లనామయులు జీవన్ముక్తు లగువారు
        సుఖదుఃఖరసముల సుళ్లు పొంది
మునుఁగ, రేయాచారమును జేయ నొల్లరు,
        సేయంగ వలసినఁ జేసికొండ్రు,


గీ.

తనరు సంసారసుఖముల ననుభవింతు,
రలసి తెప్పిరి నిద్రించి తెలిసినట్లు
మరులుసతి బాలుగతి మాట మఱచుచుందు.
రిదియ నిర్వాణపద మని యెఱుఁగు రామ!

284


క.

జ్ఞానాజ్ఞానములకు సో
పానం జగుచున్న సప్తభౌమాఖ్యానం
బే నెఱి నీ కెఱిఁగించితి
భానుకులోత్తంస రామభద్ర మహాత్మా.

285


వ.

అని వసిష్ఠమహాముని రామచంద్రున కుత్పత్తిప్రకరణంబును, మనోవి
లాసంబున సృష్టి పుట్టుటయుఁ, దత్త్యాగంబున నశించుటయు, దృష్టాం
తంబు లగునుపాఖ్యానంబుల వ్యాఖ్యానంబు సేసె; నని సెప్పుటయు
విని సంతుష్టాంతరంగుండై భరద్వాజుం డట మీఁదివృత్తాంతంబు
వినిపింపు మని యడిగిన.

286


తురగగతివృత్తము.

బ్రకటదితిసుతజఠరగళదురురక్తసిక్తనఖాంకురా
సకలమునిజనహృదయసరసిజచారుషట్పదనాయకా

సుకవిజనమృదుమధురనవరసశుక్తిమౌక్తికపూజితా
వికచజలరుహవిభవవిదళనవీక్షణా శుభలక్షణా.

287


క.

విశ్వాత్మ విశ్వనాయక
విశ్వంభర విశ్వజనక విశ్వాతీతా
విశ్వామిత్త్రశుకాదిము
నీశ్వరనుతిఫలితసురమహీరుహరూపా.

288


మాలిని.

నిగమసదనదీపా నిశ్చితానందరూపా
సగుణవిగుణమూర్తీ సర్వసంపూర్ణకీర్తీ
యగణితగుణధన్యా యాదిమధ్యాంతశూన్యా
ఖగపతిగిరినాథా ఖండితారాతియూథా.

289

గద్య
ఇది శ్రీనరసింహవరప్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజసగోత్ర
పవిత్ర అయ్యలామాత్యపుత్త్ర సరసగుణధుర్య సింగనార్య
ప్రణీతం బైన వాసిష్ఠరామాయణంబునం
దుత్పత్తిప్రకరణం బన్నది
ద్వితీయాశ్వాసము.