Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/వివాహము-వయస్సు

వికీసోర్స్ నుండి

వివాహము - వయస్సు

వైవాహిక సమస్యలలో వయోనిర్ణయం ఒకటి. అది ఏ ఒక ప్రత్యేక కారణంమీదా ఆధారపడి ఉండదు. ముఖ్యంగా దేశము, కాలము, వృత్తి, ఆర్థిక వ్యవస్థ, వ్యక్తుల గుణగణాలను బట్టి ఈ సమస్య నిర్ధారణ చేయవలసి ఉన్నది.

కొన్ని దేశాలలోనూ, జాతుల్లోనూ భార్యలు దొరకటం చాలా కష్టము. కొన్ని దేశాలు కేవలం 'కన్యావివాహాలు' పరమ పవిత్రాలుగా భావిస్తుంటవి. అటువంటి సందర్భాలలో వయస్సు ఈ లక్షణాలను అనుసరించి దేశకాలపాత్రలుగా నిరూపితమౌతుంది. బగండా జాతిలో బహుపత్నీత్వవిధానం అమలులో ఉంది. స్త్రీపురుష జన సంఖ్య 31/2 :1X ఉన్నా యువకులకు భార్యలు దొరకటం కష్టమట. అందువల్ల ఆ జాతివారు కన్యకను చౌకగా కొనవచ్చుననే ఉద్దేశంతో కన్యా వివాహాలు చేస్తారు. అందువల్ల కన్యాత్వం దూషితము కాకపోవటము వధూవరులు ఉభయవంశాల పరస్పర మైత్రి అభివృద్ధి అకృత్రిమంగా పెంపొందించుకోటానికి అవకాశం ఉంటుంది. కొన్ని సెమిటిక్ జాతుల్లో 18 ఏళ్లు దాటిన పురుషుణ్ణి భార్యను చూచుకోమని న్యాయస్థానం ఒత్తిడి చేస్తుందట. అటువంటి నిర్ణయము స్త్రీ విషయంలో 13వ సంవత్సరానికే ప్రారంభిస్తుంది.

కన్యావివాహాలు పనికిరావనే వారు వారికి ప్రథమంలో వివేచనజ్ఞానం ఉండని కాలంలో వివాహం జరిగి, తరువాత రజస్వలలై భర్తగృహంలో నూతన గృహస్థితులతో విసుగు చెందుతుంటారు. అది భవిష్యద్వైవాహిక జీవనానికి భంగం కలిగిస్తుందని - అభిప్రాయపడ్డారు. యౌవనారంభంలో వివాహం జరిగితే ఆ వయస్సులో స్త్రీ పురుషుల మనస్సులు కొంత పరిపక్వతను పొంది ఉండడం ఒకరినొకరు అవగతం చేసుకొనగలుగుతారు; అందువల్ల వైవాహిక జీవితంలో అన్యోన్యత ఉంటుందని వారంటారు. యౌవనారంభంలో జరిగే వివాహాలలో కేవలం జాత్యాకర్షణ (Sexual attraction)కు మాత్రమే ప్రధాన స్థితి లభిస్తుందనీ, పరిపూర్ణమైన మానసిక ఉద్వేగాదికాలను గురించి ఉద్యద్యౌవనంలో ఉన్నవారు ఆలోచించరనీ వీరిని కొందరు

ఖండించకపోనూ లేదు.


వివాహ వయస్సుకు నిర్ణయం ప్రధాన సూత్రాలలో సంతానం ఒకటి, వయస్సు మీరిన కొద్దీ సంతానాన్ని పొందటం కష్టం. వయస్సు మించిన కొద్దీ స్త్రీలలో ముఖ్యంగా, కొంత స్తబ్ధత (Frigidity) ఏర్పడుతుంది. అందువల్ల ముప్పది ఏండ్లు దాటిన స్త్రీ సంతానాన్ని పొందటానికి ఎంతో బాధపడవలసి ఉంటుంది. యౌవనారంభంలో ఉన్న వ్యక్తికి శరీరాపాయం లేకుండా సంతానం కలుగుతుందని శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు. యౌవనారంభం అయిన తరువాత వయస్సు ఎంతగా పెరగకపోతే సంతానాన్ని అంతే సుకరంగా పొందవచ్చునన్నమాట.

పేటక్, మాక్సు క్రిస్టియన్ వంటి సంతాన శాస్త్రజ్ఞులు పురుషుడు 25వ ఏట, అంతకంటే కొంత వయస్సు తక్కువలో స్త్రీ వివాహం చేసుకోవటం యుక్తమన్నారు. అనేక కారణాల చేత కొద్ది వయస్సులలో వివాహం చేయటం పనికిరాదని పాశ్చాత్య లోకాలలో శాస్త్రజ్ఞులు పలుకుతున్నారు. వారు చెప్పే ముఖ్య కారణాలను పరిశీలించవలసి ఉంటుంది. ఆధునిక స్త్రీ పురుషునితో సమాన స్వేచ్ఛనూ, ప్రాతినిధ్యాన్నీ వహిస్తున్నది. అందువల్ల ఆమెకూ ప్రత్యేక వ్యక్తిత్వమున్నది. ఆ కారణం మూలంగా వెనకటి వలె వివాహ నిర్ణయ విషయంలో పురుషునికి వలె ఆమెకూ ప్రధాన స్థితి ఉన్నది. ఆమెకు వయస్సు అభివృద్ధి అవుతున్న కొద్దీ అనేకులతో పరిచయం కలిగించుకునే అవకాశం లభిస్తుంది. ఆ పరిచయస్థులలో ఎవరితో ఆమె వైవాహిక జీవనము సంతృప్తికరంగా ఉంటుందో నిర్ణయించుకునే అవకాశం ఆమెకు లభింపజేయటం అత్యవసరం కనుక, కన్యకగా ఉన్నప్పుడే ఇక వివాహం పొసగదని వీరి అభిప్రాయం.

రెండవ కారణం విద్యాసంబంధమైనది. భవిష్యద్గృహకృత్యాలను సమర్థతతో సరిదిద్దుకోదగిన విద్య, కాలానుగుణమైన విజ్ఞానం పొందటానికి యుక్తమైన వయస్సు ప్రాచీనకాలం కంటే విశేషంగా కావలసి ఉంది. అందువల్ల కూడా వైవాహిక వయస్సు తప్పకుండా అభివృద్ధి పొందవలసిన అగత్యం కనిపిస్తున్నదని వారి నిశ్చయము. ఇందుమూలంగా పురుషుని వైవాహిక వయస్సు కూడా పెరిగి కావలసిన ధనాదికాన్ని సంపాదించి వైవాహిక జీవనాన్ని సుఖప్రదం చేసుకునే అవకాశాన్ని అతడూ పొందగలుగుతాడు. ఇటువంటి అవకాశాలు లేకపోతే జీవిత సహపథికులుగా ఉండి పవిత్ర జీవయాత్ర సాగిద్దామనుకుంటే భార్యాభర్తలిద్దరూ నిరాశను పొందుతుంటారు. సంసార బాధ్యతలతో భర్త ఆర్థిక ప్రతిపత్తికోసం పాకులాడుతుంటే, భార్య ఏకాంత జీవనం గడుపుతూనో, లేక ఆమె కూడా ఆర్జనకు పూనుకోవలసి ఉండటం వల్లనో

వైవాహిక జీవనం అసంతృప్తికర మౌతుందని వారి అభిప్రాయము.


కానీ అటువంటి వ్యక్తులు కూడా వైవాహికానందాన్ని పొందటానికి వీలులేకపోలేదట. అది సంతాననిరోధము. వారు కొలది రాబడిలోనే జీవితాన్ని ఇముడ్చుకుంటూ సంతాన నిరోధక సామగ్రి (Contraceptives) సహాయంతో సంసారం పెరగకుండా చూచుకుంటూ, కొంతకాలం ధనం ఆర్జించిన తరువాత సంతానాన్ని పొందవచ్చుననే పాశ్చాత్య సంతాన శాస్త్రవేత్తలు కొందరున్నారు. బహుకాలము విశేషంగా సంతాన నిరోధక సామగ్రిని ఉపయోగించిన వధూవరులకు సంతానం కలగటం అసంభవ మనేవారు కొందరూ, కలిగే సంతానం కేవల తామసిక, రాజసిక ప్రవృత్తులతో ఉంటుందనేవారు కొందరూ లేకపోలేదు. నేటి ఆర్థిక స్థితిని అనుసరించి పాశ్చాత్య దేశాలల్లో వైవాహిక వయస్సు 20, 25 సంవత్సరాలు స్త్రీకినీ, పురుషుడికి 30 సంవత్సరాలు అనీ వివాహ గ్రంథకర్తలు నిశ్చయించారు.

వివాహానికీ, కన్యకలు రజస్వలలు కావటానికి కొంత సన్నిహిత సంబంధము కనిపిస్తున్నది. పుష్పవతులు కానివాళ్ళకు వ్యక్తిత్వముండదని ఐననూ కొందరికి లేకపోవచ్చును - సామాన్యాభి ప్రాయము. మగపిల్లలకు కూడా వ్యక్తిత్వానికి కొంత వయస్సు అంటూ ఉన్నది. మానసిక శాస్త్రవేత్తలు మానవ జీవితాన్ని 1. నగ్నత్వము (Infancy), 2. బాల్యము (Childhoold), 3. యౌవనము 4. ప్రౌఢత్వము (Adult life), వృద్ధాప్యము (Old age) అని విభజించారు. నగ్నత్వము ఏడు సంవత్సరముల వరకు, ఏడు మొదలు పదునాలుగు వరకు బాల్యము. అది మొదలు యౌవనము ఇరువది ఒక్క సంవత్సరమునకు. ప్రౌఢజీవనము 50 సంవత్సరముతో అంతమౌతుంది. తరువాత వృద్ధాప్యము. రోమక ధర్మ శాస్త్రములో స్త్రీ పురుష వ్యక్తిత్వ వయోనిర్ణయం కనిపిస్తుంది. అందు స్త్రీకి 12వ ఏటా, పురుషునికి 14వ ఏటా వ్యక్తిత్వం (Puberty) కలుగుతుందని నిర్ణయం జరిగింది. దీనిని బట్టి సర్వసామాన్యంగా పదనాలుగు సంవత్సరాల ప్రాంతములో వ్యక్తిత్వం స్త్రీ పురుషులిరువురికీ కలగటం ప్రారంభిస్తుందని మూకుమ్మడిగా చెప్పవచ్చును. కానీ ఈ వ్యక్తిత్వం కలగటం కూడా ఆ దేశాల శీతోష్ణస్థితులమీదా విశేషంగా ఆధారపడి ఉంటుంది. ఉష్ణ ప్రదేశాలలో కొంత వేగంగానూ, శీతల ప్రదేశాలలో కొంత ఆలస్యంగానూ బాలబాలికలకు వ్యక్తిత్వం కలగటము సహజమని అభిజ్ఞులు పలుకుతున్నారు. కొన్ని సమయాలలోనూ, సంఘాలలోనూ వారి వారి కామకళా జీవనం కూడా బాలబాలికలకు త్వరగా గానీ, ఆలస్యంగా గానీ వ్యక్తిత్వం కలగటానికి తోడ్పడుతుంటవి. ప్రపంచములోని కొన్ని దేశాలలో వ్యక్తిత్వాన్ని (Majority) అంగీకరించటానికి కేవలం రజస్వలాధర్మారంభాన్ని

గానీ, ఉద్యద్యౌవనాన్నిగానీ పరిగణించక, యౌవన ప్రారంభానంతరము కొన్ని


సంవత్సరాలు గడవనిచ్చారు. ఇటలీలోనూ, హాలండు, గ్రీసు, ఇంగ్లండు, ఫ్రాన్సు దేశాలలో 21వ వత్సరంగా, స్త్రీ పురుష విభేదం లేకుండా వ్యక్తిత్వ వయో నిర్ణయం (Determing the age of Majority) జర్మనీలో 20 గానూ, స్పెయిను 23, ఆస్ట్రియా 24 గానూ పరిగణిస్తున్నవి. కానీ ఈ వయో నిర్ణయము న్యాయశాస్త్రానికి మాత్రమే వర్తిస్తుంది. సామాన్య వ్యక్తిత్వము (Puberty) స్త్రీలకే ముందు ప్రారంభమయ్యేటట్లు అందరూ అంగీకరిస్తారు. ప్రపంచంలోని వివిధ దేశాలలోనూ ఈ శతాబ్దారంభదశలో ఈ కిందివిధంగా వైవాహిక వయో నిర్ణయం జరిగినట్లు తెలుస్తున్నది.

దేశము పురుషుడు స్త్రీ
ఫ్రాంసు 18 15
జర్మనీ 20 16
ఆస్ట్రియా 25 24
స్పెయిన్ 18 16
గ్రీసు 16 14
హాలండు 18 16
ఇటలీ 18 15
డెన్మార్కు 20 16

అయితే తల్లిదండ్రుల (ఉభయ పక్షాలలోనూ) అంగీకారముంటే బాలబాలికలు 14వ సంవత్సరంలో వివాహం చేసుకోవచ్చునని ఆస్ట్రియా దేశంలో అభిప్రాయంగా ఉండేది.

భారతదేశంలో వైవాహిక వయో నిర్ణయం చిత్రాతిచిత్రమైన మార్గాలను అనుసరించుచున్నట్లు కనిపిస్తుంది. మొదట రజస్వలానంతర వివాహాలు ఉన్నట్లే కనుపించినా తరువాత తరువాత కన్యా వివాహాలు ప్రబలినవని చెప్పవలసి వస్తున్నది. అవి వర్ణవ్యవస్థ ననుసరించి అంతర్విభేదాలతో కూడా ఉన్నట్లు అర్థమౌతుంది. 'దేశప్రవృత్తి సాత్మాద్వా బ్రహ్మ ప్రాజాప త్యార్ష దైవానా మన్యతమేన వివాహేన శాస్త్రతః పరిణయే దితి వరణవిధానమ్' (2-1-21) అన్న వాత్స్యాయన మహర్షి సూత్రాన్నిబట్టి చూస్తే, భారతదేశంలో క్రీ.శ. 4వ శతాబ్ది మధ్యభాగం నాటికే, అంతకు పూర్వం కొంతకాలం నుంచి కూడా అష్టవిధ వివాహాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. కొందరు కన్యనూ, కొందరు గాంధర్వ విధానాన యువతిని వివాహ మాడినట్లు విస్పష్టము. కామతంత్రానికి ఏకైక శాస్త్రకారుడు వాత్స్యాయనుడు కన్యా సంప్రయుక్తంలో గాంధర్వము ఉత్తమోత్తమ వివాహమన్నాడు ఒకచోట. అందువల్ల రజస్వలానంతర వివాహాలు కన్యావివాహాలుగానే పూర్వం పరిగణితాలైనవని అనవచ్చును. కన్యా వయోనిర్ణయం కూడా అవ్యవస్థంగా మారుతూ వచ్చినట్లు కనిపిస్తున్నది. దానిని కొంతగా ఇక్కడ సం[గ్రహించటం అవసరం.

భారతీయ గృహ్య సూత్రాలలో కొన్ని పిల్ల పుష్పవతి కానప్పుడు వివాహం చెయ్యమని, కొన్ని నగ్నికగా ఉన్నప్పుడే జెయ్యమని (హిరణ్యకేతి గృహ్యసూత్రము - 1-19-2) చెప్పినవి. నగ్నిక అంటే ఆసన్నార్తవ. మానవ గృహ్యసూత్రము పుష్పవతి కాని కన్యకను వివాహం చేసుకోమని చెప్పుతున్నది. (1-7-4) పారాశరగ్భహ్య సూత్రంలో నూతన వధూవరులు క్షారం తినకూడదనీ, మూడు రాత్రులు అధశ్ళ్చయనం చెయ్యమనీ మిథునకర్మ జరుపరాదనీ చెపుతున్నది (2-1-4) ఆశ్వలాయన (1-8-10), ఆపస్తంబ (8-8-89) సాంఖ్యాయన (1-1) మానవ (1-14-14) కాధక (80-1) ఖాదిర (౧-4-9) గోభిలీయ (2-3) గృహ్యసూత్రాలలోనూ ఇటువంటి నిబంధనలు కనిపిస్తున్నవి. ఆశ్వలాయన గృహ్యసూత్ర వ్యాఖ్యాత కాలంలో - క్రీ.శ. 1200 ప్రాంతంలో వివాహం కాగానే గర్భాధానం జరుగుతున్నట్లు ఆయన (గ్రంథంవల్ల వ్యక్తమౌతున్నది. అందువల్ల హరదత్తుని కాలం నాటి వైవాహిక వయస్సు కన్యకకు 14 సంవత్సరాలుగా నిర్ణయం చెయ్యవచ్చును. యాజ్ఞవల్మ్య (1-2) సూత్రగంథాలలో గర్భాధారణ వంటి చతుర్థికర్మ ఒకటి కనిపిస్తున్నది. ఈ కర్మ వివాహమైన తరువాత, అంటే పాణిగ్రహణానంతరం నాల్గవనాడు జరుగుతుంది. మూడు దినాలు గడిచిన తరువాత ప్రథమ సంగమం జరుగవచ్చునని కొందరు ఆచార్యుల మతం. ప్రథమ సంయోగము వ్రథమరజస్సు అగిపోయిన తరువాత జరుగవలెనని సాంఖ్యాయన (1-17-19) పరాశర (౧-11) ఆపస్తంబ (38-8-10) హిరణ్య కేశి (1-23) గృహ్యసూత్రాలు చెబుతున్నవి. కొన్ని గృహ్యసూత్రాలలో వివాహం జరుగుతుండగా ప్రథమరజోదర్శనమైతే వాటి ప్రాయశ్చిత్తం కనిపిస్తున్నది. బోధాయన (4-1-10) కౌశిక - (79-16) స్మార్తసూత్రాలు (6-18) మనుస్మృతి పుష్పవతి అయిన తరువాత మూడు సంవత్సరాలు గడిచిన తరువాత కన్యకకు తల్లిదండ్రులు వివాహం చెయ్యకపోతే, అమె స్వయంగా భర్తను వెతుక్కోవచ్చు అనే అనుశాసనం కనిపిస్తున్నది. మనువు ముమ్మారు పుష్పవతి అయిన తరువాత స్వయముగా పురుషుని వరించి సంయోగాన్ని పొందవలెనన్సీ నగ్నికగా ఉన్నప్పుడే వివాహం కావలెననీ కొందరన్నమాట తప్పనీ త్రోసివేసినాడు. వీటన్నింటిని బట్టి పరిశీలించినప్పుడు రజస్వలానంతర వయసే వివాహ వయస్సు. బోధాయన సూత్రం కూడా (4-1-12-15) ఈ విషయాన్ని అంగీకరించింది.

మనువు (9-89-90) సద్వంశజుడు సద్యోన్యుడూ అయిన వరుడు లభించకపోతే కన్యక మృతివరకూ తండ్రి ఇంట్లోనే ఉండిపోవచ్చు అన్నాడు. ఇది ఒకవిధంగా నేటి పాశ్చాత్య విద్వాంసురాలు ఎలెన్కీ కోరిన మాతృత్వ రహితతావజ్ఞ (Exemption from Motherhood) అని చెప్పవచ్చును. ఈ పై అభిప్రాయాన్నే మహాభారతంలో వేదవ్యాసుడు అంగీకరించినాడు. (44-16)

మనువు తరువాత కాలక్రమాన కన్యక వివాహ వయస్సు తగ్గించడం జరిగింది. లౌషూక్షి గృహ్య సూత్రము ఆడపిల్లల బ్రహ్మచర్యము 10-12 సంవత్సరాలతో అంతమొందుతుంది అని చెప్పినది (19-2). వైఖానసస్మృతి బ్రాహ్మణుడిని నగ్నికను గానీ, గౌరిని గానీ వివాహమాడవలసిందని చెప్పి నగ్నిక వయస్సు 8 సంవత్సరాలనీ, గౌరి పుష్పవతికాని 10, 12 సంవత్సరముల కన్యక అని పలికింది. ఒక సూత్రంలో మృతి పర్యంతమూ వివాహమాడకుండా ఉండటానికి పైన చెప్పినట్లు మనువు అంగీకరించినా, మరొకచోట (9-94) 'ముప్పది సంవత్సరాలున్న యువకుడు అందమైన 12 సంవత్సరాల కన్యకను వివాహమాడవలసిం' దని శాసించాడు. ఆ సూత్రంలోనే పరంపరాగతాలైన వృత్తులూ, ధర్మాలూ నశించిపోతాయని తోచినప్పుడు, 24 సంవత్సరాల వయస్సున్న యువకుడు 8 సంవత్సరాల కన్యకను వివాహమాడ వచ్చునన్నాడు. పరాశర స్మృతిలో (ప్రకరణము 8) 8 ఏండ్ల కన్యక గౌరి అనీ, 9 ఏండ్ల కన్య రోహిణి అనీ, 10 ఏండ్ల కన్య రజస్వల అనీ చెప్పి ఉంది. 12 ఏండ్లు వచ్చిన తరువాత కన్యాదానం చెయ్యకపోతే ఆమె రజస్సును పితృదేవతలు పానం చేస్తారట, ఆమె తల్లిదండ్రులూ, జ్యేష్ఠభ్రాతలూ నరకాన్ని పొందుతారట. యమపరాశరాది గ్రంథాలు రజస్వలానంతర వివాహాన్ని పాపకృత్యంగా పరిగణించినవి. క్రమక్రమంగా 'అష్టవర్షా ద్భవేత్ కన్యా' అనే ఆర్యోక్తి ఏర్పడ్డది. బాల్యవివాహాలు ప్రబలినవి.

రామాయణంలో (అరణ్య కాండ 47-10-11) వివాహ సమయానికి సీతారాములకు వయస్సు 6, 16 సంవత్సరాలు, కానీ కౌటిల్యుని అర్థ శాస్త్రంలో క్షత్రియకన్యకు 16వ ఏట వివాహం చెయ్యటం యుక్తమని కనిపిస్తున్నది.

వైద్యశాస్త్రజ్ఞుడు సుశ్రుతాచార్యులు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత యువకుడికీ, 12 ఏండ్లు వచ్చిన తరువాత బాలికకూ వివాహం చేయమన్నాడు. వాగ్భటుడు యువకుని వయస్సు 21 సంవత్సరాలకు తగ్గించి, బాలికలకు 15, 16 సంవత్సరాలకు పూర్వం సంతానం కలగటం ప్రారంభిస్తే, తల్లికి బిడ్డలకీ ప్రమాదమన్నాడు.

సుశ్రుతాచార్యుల మతాన్ని అనుసరించి స్త్రీజాతి ఋతుధర్మం 12వ ఏట ప్రారంభించి 50 సంవత్సరాలవరకూ ఉంటుంది. 15 మొదలు 45 ఏళ్ళవరకూ సామాన్యంగా సంతానాన్ని పొందవచ్చును. ఆ నాటి భారతీయుని విద్యాభ్యాసానికి 25 సంవత్సరాలు పట్టి ఉండటం వల్ల పురుషుని వైవాహిక వయస్సు 25 అని ఆయన చెప్పి ఉంటాడు. పూర్ణ పురుషాయుష జీవితాన్ని మూడు విభాగాలు చేస్తే 32 సంవత్సరాలు వస్తుంది. సన్యాసాశ్రమము లేకపోతే బ్రహ్మచర్య గార్హస్య వానప్రస్థాలు ఒక్కొక్కదానికి 32 సంవత్సరాలనీ, నాలుగు ఆశ్రమాలు ఉన్నప్పుడు ఒక్కొక్కదానికి వయస్సు 25 సంవత్సరాలనీ సుశ్రుతాచార్యులు భావించి ఉండవచ్చునని ఒక ఆధునిక వైద్య శాస్త్రజ్ఞుని అభిప్రాయం.

స్త్రీ పురుషుల మధ్య వైవాహిక వయస్సులో అంతరం ఎంత ఉండవలెననేది మరొక సమస్య. వీరి ఇరువురి మధ్య ఉండే అంతరాన్ని బట్టి కూడా కలిగే సంతానము, సౌఖ్యకరమైన జీవనమూ ఆధారపడి ఉంటాయి. ప్రపంచంలో సర్వసామాన్యంగా అనేక జాతుల్లో పురుషుని కంటె వధువు వయస్సు తక్కువగా ఉంటుంది. ఎక్కడైనా వరునికంటే వధువు వయస్సు అధికంగా ఉంటే దానికి ప్రత్యేకమైన కారణాలు ఉండవచ్చును. అన్న చనిపోయినప్పుడు అన్నభార్యను విధిగా వివాహమాడవలసిన సందర్భాలలో తప్పకుండా వధువు వయస్సులో వరుని మించి ఉంటుంది. ఆధునిక యుగంలోని ప్రణయ వివాహాలల్లో కొన్ని సందర్భాలలో కూడా వరుని కంటే వధువు వయస్సు పెద్దదిగా ఉండవచ్చును. సర్వసామాన్యంగా అటువంటి సందర్భాలలో కూడా విజ్ఞులు దానికి ఏదో మానసిక దౌర్బల్య సంబంధమైన మూలకారణాన్ని చెప్పుతున్నారు. ఏ దేశంలోనైనా వరుడు తప్పకుండా తనకంటే వయస్సున కొంత తక్కువగా ఉన్న దానినే వివాహం చేసుకోటం ఆచారంగా ఉంటుంది. సుశ్రుతాచార్యుల మతాన్ని అనుసరించి స్త్రీలలో ఋతుధర్మం 15 సంవత్సరము మొదలు 45 వరకూ ఉంటుంది. కాబట్టి వారి ఇరువురి మధ్యా సౌఖ్యకరమైన జీవనమూ, సంతానమూ కలుగవలెనంటే 15 సంవత్సరాల అంతరం ఉండితీరవలెనని అవగతమౌతున్నది. మనువు కూడా ముప్పదిసంవత్సరాల యువకుడు పన్నెండు సంవత్సరాల కన్యకను వివాహమాడ వలసిందని అన్నాడు. (9-24) అంటే ఆయన మతాన కూడా 18 సంవత్సరాల అంతరం ఉన్నదన్నమట. నేడు భారతదేశంలో జరుగుతున్న వివాహాల్లో వధూవరుల అంతరం 5 మొదలు 15 సంవత్సరాలుంటూ ఉన్నది. మహర్షి వాత్స్యాయనుడు ఆయన సూత్రాలలో (3-1-2) 'త్రిరాతృభృతి న్యూనవయసం' అని చెప్పినాడు. అంటే వధూవరుల మధ్య అంతరం తప్పకుండా మూడు సంవత్సరాలైనా ఉండి తీరాలన్నమాట. దీనిని బట్టి 3 మొదలు 15 సంవత్సరాల వరకూ అంతరం ఉండవచ్చును. 'ఆర్ట్ ఆఫ్ లవ్ ఇన్ ది ఓరియంట్' అనే గ్రంథంలో యన్.కె. బాసు మహాశయుడు భార్యాభర్తల అంతరాన్ని గురించి 'Ten years of age may be put as the safe biologic 'buffer' between marital partners in view of the fact that the senile changes take place earlier in Women than in Men and that feminine charm is always the outstanding asset in the balance sheet of Nuptials' అని వ్రాసి ఉన్నాడు. అంటే మొత్తముమీద ఏ మతాన్ని అనుసరించి చూచినా, మూడు సంవత్సరాలకన్నా తక్కువ గాని అంతరం వధూవరుల మధ్య తప్పకుండా ఉండితీరాలని అర్థమౌతున్నది.

(ఆంధప్రత్రిక 1948, నవంబర్ 17)