Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/వివాహము-కూటాంతరత

వికీసోర్స్ నుండి

వివాహము - కూటాంతరత

ప్రపంచంలోని నేటి నాగరకజాతులూ అనాగరకజాతులూ, వివాహ విషయంలో కొన్ని ప్రాథమిక నిబంధనలను ఏర్పరచుకున్నారు. జీవనయాత్రలో సహపథికను గానీ, పథికుణ్ణిగానీ ఎన్నుకోవటానికి వ్యక్తిప్రణయము (Individual Love) జీవనయాత్రలో మూలాధారం కాకపోవటమే కారణము. జాతిరక్షణ, దేవతాపితృ ఆరాధనా, సంతానమూ, ఈ నిబంధనలకు కారణాలు.

వైవాహిక విధానాలను స్థూలంగా 1. కూటాంతర వివాహములు (Endogamous Marriages) 2. కూటబాహ్య వివాహములు (Exogamous marriages) అని విభజించవచ్చు. ఈ రెంటిలో మొదటి పద్ధతి ననుసరించి వ్యక్తి వివాహము స్వకూటమిలో నుంచి జరుగుతుంది. అంటే అతను వివాహం చేసుకునే కన్య అతను ఏ కూటమికి చెంది ఉంటాడో అదే కూటమికి చెంది ఉండవలెనని నియమమున్నదన్న మాట. రెండవదానిలో వ్యక్తికి అతని కూటమిలో నుంచి వివాహము జరుగరాదు. అంటే అతను వివాహమాడే కన్య అతని కూటమిలో జన్మించి ఉండరాదన్నమాట.

ఈ రెండు రకాలైన పద్ధతులూ ఒకేకాలంలో ఒకే దేశంలో ఉండటానికి అవకాశం ఉన్నది. అంటే ఆ దేశంలోని కొన్ని జాతుల్లో కూటాంతరతను, కొన్ని జాతుల్లో కూట బాహ్యతను అనుసరించి వివాహాలు జరుపుకుంటారన్నమాట.

అందుకనే వైవాహిక విషయంలో అంతఃకూటమి (Inner-Circle), బహిః కూటమి (Outer-Cirle) ప్రతిదేశంలోనూ ఉండేదిగా కనిపిస్తున్నవని హెన్రీ మెయిన్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త అభిప్రాయమిచ్చాడు. లోకంలో అనేక జాతులవారు ఇతర జాతులవారితో వైవాహిక సంబంధంగానీ, కామ సంబంధం (Sexual Relation) గానీ ఉండడానికి వీలు లేకుండా అనేక నియమాలను ఏర్పరచుకున్నారు. ఇటువంటి జాతివైరాలు, ఉద్భవించటం కేవలం అనాగరిక జాతుల్లోనే కాదు, నాగరకు లనిపించుకున్న వాటిలోనూ పొడకట్టినవి.

రోమనులు గొప్ప విజేతలు. వారు జయించిన దేశాలలోని జాతులనుంచీ వివాహయోగ్యదాయకమైన కన్యలను వారు వివాహం చేసుకోవటముగానీ వారి కన్యకలను జయించినవారికి ఇవ్వటంగాని జరగలేదు. పైగా రోమను కన్యకలను ఇతరులకు ఇచ్చి వివాహం చేయటము చట్టసమ్మతము కాదని తీర్మానించినారు. వారి కన్యకలను బానిసలుగా స్వీకరించి వారితో కామోపభోగాన్ని అనుభవించటాన్ని వారి న్యాయస్థానం అంగీకరించింది.

ప్రతి జాతీ ఇతరజాతిని తనకంటే తక్కువదానిగా పరిగణించటం లోకంలో పరిపాటి. అందుమూలంగా ఇతర జాతులతో వైవాహిక సంబంధాలను అరికట్టటానికి యత్నిస్తుంది. జాతులు ఇతర జాతులతో వైవాహిక ప్రణయాన్ని అడ్డుకోవు. కానీ అటువంటి వివాహాన్ని న్యూనతాదృష్టితో చూడటము కద్దు. ఇది జాతులు సహజ లక్షణాలు.

అటువంటి పట్టింపులు కేవలం రక్త సంబంధికులతో తరతరాలనుంచీ సాంసారిక యాత్ర గడుపుతూ వస్తున్న తక్కువ జాతివారిలో విశేషంగా కనిపిస్తుంది. స్త్రీ పురుషులలో గమనిస్తే ఈ నిరసనభావం స్త్రీలలో విశేషంగా గోచరించింది.

సాధారణంగా లోకంలో జరిగిన జాత్యంతర వివాహాలనూ (Inter-National Marriages) వర్ణాంతర వివాహాలనూ (Inter-caste marraiges) పరిశీలిస్తే ముఖ్యంగా, ఎక్కువ సందర్భాలలో భర్త ఉన్నతమైన కుటుంబాలకు గానీ, వంశానికి గానీ చెంది ఉంటాడు. దీనికి మూలకారణం సామాజిక శాస్త్రవేత్తలు ఇలా చెపుతున్నారు:

"స్త్రీ తనను తక్కువచేసుకోటానికి నిరాకరిస్తుంది. పురుషుడికి అంతటి సునిశితత్వం గానీ, జాత్యభిమానము, వర్ణాభిమానముగానీ ఉండదు.”

ఇందుకు నిదర్శనంగా అత్యుత్తమ ప్రజాస్వామిక దేశమని ప్రఖ్యాతిగన్న అమెరికాను తీసుకుందాము. ఆ దేశంలో నీగ్రో పురుషులను వివాహమాడిన శ్వేతజాతి స్త్రీలు అల్పసంఖ్యాకులు. దక్షిణ రాష్ట్రాలలో అటువంటి వివాహాలను ఆచారమూలంగా బహిష్కరించారు. అయితే అంతమాత్రాన శ్వేతజాతి స్త్రీలకు నీగ్రోజాతి పురుషులతో కామసంబంధం లేదని చెప్పటానికి వీలులేదు. మరికొన్ని రాష్ట్రాలలో ఆచారం మాట అటుంచినా న్యాయశాస్త్రం కూడా అంగీకరించదు.

ఈ కూటాంతరతకు (Endogamy) ముఖ్యంగా జాతిగర్వమూ, దేశౌన్నత్యగర్వమూ కారణాలు. జాతిగర్వము మూలంగా అన్యజాతులమీద అసహన భావం కలగటం సహజలక్షణం. అదేరీతిగా దేశౌన్నత్యగర్వం కారణంగా విదేశీయులంటే సౌహార్దము లేకపోవటమూ, వైముఖ్యమూ, వైమనస్యమూ కలిగి ఉండటమూ సమస్త దేశాలవారికీ లక్షణము. అందులో ఆచార వ్యవహారంలోనూ, నాగరికత లోనూ, ఆధ్యాత్మిక, ఆధిభౌతిక జీవిత విధానాలలోనూ విశేషమైన అంతరం ఉన్న జాతుల మధ్యా దేశాలమధ్యా ఈ అసహనభావము, వైమనస్య వైముఖ్యాలూ విశేషంగా గోచరిస్తూ ఉంటవి.

జంతు జాతుల్లోనూ ఒక జాతికి చెందిన ఒక విలక్షణత ఉన్న ప్రత్యేక జంతుకోటికి (Distinct Species) మరొక విలక్షత కలిగిన ప్రత్యేక జంతుకోటితో కామసంబంధం కనిపించదు. అది ఆయా జాతులకు సహజావబోధము (Instinct). అదేరీతిగా రూపంలో స్వజాతికంటే భిన్నమైన జాతిలోని వ్యక్తులతో కామబంధాన్ని వైవాహిక సంబంధాన్ని గానీ, కలిగి ఉండటాన్ని జాతులు అసహ్యించుకుంటవి. స్త్రీ జాతిలో ఉండే కామసంబంధమైన సహజావబోధము పురుష జాతిలోని కామసంబంధమైన సహజావబోధంకంటే భిన్నమైనది. అందువల్ల స్త్రీలకు విదేశీయులతో రక్తసంబంధమంటే పట్టుదల విశేషము.

ఇందుమూలంగా మానవజాతిలోనే అనేకరకాలైన విలక్షణవర్గాలు (Species) ఉన్నవనికాదు. కొన్ని కొన్ని ఇళ్ళల్లో అలవాటు పడ్డ జంతువుల్లో కూడా పరస్పరమూ మిథున క్రీడకు అంగీకారము కనిపించదు.

అయితే ఈ సహజావబోధానికి కారణం ఏమిటి? శాస్త్రజ్ఞులు దీనికి 'సామ్యము' (Similarity) ముఖ్య కారణంగా పలుకుతున్నారు. కామ విషయంగానూ జాతులు గానీ, వ్యక్తులు గానీ ఒక విధమైన సామ్యమును ఆదరిస్తారని వారి అభిప్రాయము. సంతాన శాస్త్రజ్ఞులు ఇది ఒక విధమైన శారీరక న్యాయము (Physiological Law) అన్నారు. సంతానోత్పత్తికి ప్రతికృతి (Reproduction) ప్రాథమికాంగము. దీనికీ సామ్యము అత్యావశ్యక మని వారి అభిప్రాయము.

ఈ సామ్యము ప్రత్యేక జాతులమధ్యనే కాదు. ఒక విలక్షణత ఉన్న వర్గంలోనైనా అత్యవసరమని శాస్త్రజ్ఞులు పలుకుతున్నారు. పరస్పర సంయోగము (Inter-Crossing) చేయించదలచుకున్నా ఈ సామ్యమును ముఖ్యంగా గమనించ వలసి ఉంటుందని వారి ఊహ.

వృక్షజాతిలో గానీ, జంతు జాతిలోగానీ ఒక విలక్షణమైన వర్ణానికి (Species) మరొక విలక్షణమైన వర్ణంతో పరస్పర సంయోగం కలిగించవచ్చును. అటువంటి సందర్భాలలో సంతానం విశేషముగా కలుగుతుందని కానీ, ఎక్కువ సంఖ్యకు అవకాశం ఉంటుందని గానీ సిద్ధాంతీకరించటానికి వీలులేదనీ, దానికి భిన్నంగా జరగటం కద్దనీ, అందుకు అనేక నిదర్శనాలు కనిపిస్తున్నవనీ ప్రపంచ వివాహ చరిత్రకారుడు వెస్టర్ మార్కు అభిప్రాయము.

సర్వ సామాన్యంగా ఆచారంలో అనేక జాతుల్లో వివాహము జాతికి బాహ్యంగా జరగటం లేదు. కొన్నిటిలో అంతర్వర్గాలను కూడా వ్యతిక్రమించి జరగటం లేదు. కొన్నిటిలో వాటి ఊళ్ళను మించి జరగవు. వంగ రాష్ట్రంలో బరయాన్ జాతివారు విదేశీయ స్త్రీని వివాహం చేసుకున్నవాడిని కులంలో నుంచి నేటికీ బహిష్కరిస్తారట. అతడు ఆ విదేశీయ భార్యను బహిష్కరిస్తేగాని తిరిగీ కులంలో చేర్చుకోటానికీ అంగీకరించరట. అంటే ఒక వ్యక్తి కులంలో నుంచి వెళ్ళిపోయినా అంగీకరిస్తారుగాని, విదేశీయ స్త్రీని తమ కులానికి కోడలిగా స్వీకరించరన్నమాట.

ఒకజాతిలో పుట్టిన ఆడపిల్లలు విదేశీయుణ్ణి వివాహమాడటమనే ఊహను కూడా అసహ్యించుకుంటారు. అస్సాములోని అభీరులు, పాడవొలు వారి జాతుల్లోని కన్యకలు విదేశీయుని వివాహ మాడటానికి ఉద్దేశిస్తే సూర్య చంద్రులు ఆకాశంలో ప్రకాశించరనీ, భూకంపాలు కలిగి లోకం తారుమారై పోతుందనీ నమ్ముతారు. ప్రమాదవశాత్తు అటువంటి దుఃస్థితి సంభవిస్తే దానికి తగ్గ ప్రాయశ్చిత్తాలూ, శాంతులూ, ఉపశాంతులూ జరుపుతారు. లేకపోతే జాతికంతటికీ శాంతిగానీ, భద్రత గానీ లేదని వారి విశ్వాసము.

ఈ విధంగా జాత్యేతర, వర్ణేతర వర్గేతర వివాహాలను అరికట్టటమనే ఆచారం వ్యక్తిపరమైనది కాదు. జాతిపరము, వర్ణపరము, వర్గపరము అంటే ప్రతిజాతి జాతిలోని స్త్రీలను బయటకు పోనీయటానికి ఇష్టపడలేదనటం.

పురాతన అరబ్బు జాతివారు వారిలో వారికి రక్తసంబంధం అభివృద్ధి కావటానికి గ్రామాన్ని దాటిన వివాహ బంధాన్ని సంఘం అంగీకరించలేదట! మొరాకోలో బర్బరులు తమ జాతితో అన్యులకు ప్రసక్తి కలగకుండా ఉండటానికి గ్రామంలో ఉన్న వాళ్ళతోనే వివాహ సంబంధం జరిగి తీరాలని నియమించుకున్నారట. ఇది ముఖ్యంగా తండ్రివైపునే జరుగుతుంది. గ్రామంలోనైనా తండ్రివైపు వారినే వివాహ మాడవలసి ఉంటుంది. అందువల్లనే జీలో పహద్ కుమార్తెలకు తన తండ్రి వంశంలోని వారికే వివాహం చేసుకోవలసిందని సలహా యిచ్చి, వారసత్వ విషయికమైన కష్టంనుంచి గట్టెక్కవలసి వచ్చింది. ఇటువంటి వివాహాలలో గ్రామాంతర, పిత్రీయాంతతత కనిపిస్తుంది. అందువల్ల శాస్త్రజ్ఞులు దీనిని పిత్రీయ స్థానీయాంతర వివాహాలు (Patri-Local marriages) అని నామకరణం చేసినారు.

జాతుల్లోని కూటాంతరతకు మతం కూడా ఒక ప్రబలకారణము. తండ్రి మతంలోనుంచి కుమారుడు బాహ్యుడౌతాడనే ఉద్దేశంతో కొన్ని జాతులు కూటాంతరతను అంగీకరించినవి. న్యాయశాస్త్ర కర్త మోజెస్, ఇజ్రాలైటులకు కాననైటులతో వివాహ సంబంధం పనికిరాదని శాసించాడు. దీనికి ముఖ్యకారణము ఇజ్రా తరువాతి కాలంలో అనేకమంది పాగనులు కాననైటులతో కలిసినారట.

పందొమ్మిదవ శతాబ్ది ప్రథమ భాగంలో కూడా యూరప్ దేశంలో ఇజ్రాలైటులకు క్రైస్తవులకు వివాహ బంధాలు ఉండేవి కావట. నెపోలియన్ చక్రవర్తి క్రీ.శ. 1807 సంవత్సరములో పండిత పరిషత్తులను ఏర్పాటు చేయించి వారి ఇరువురి మధ్యా జరిగే వివాహాలు చట్ట సమ్మతాలైతే చాలుననీ, మత సంఘ సమ్మతాలు కానవసరము లేదనీ తీర్మానం చేయించి శాసించినాడు.

క్రీ.శ. 1844లో రాబినికల్ సమ్మేళనం జరిగింది. తత్ఫలితంగా క్రైస్తవ, జ్యూజాతుల మధ్య జరిగే వివాహాలు అంగీకృతాలైనవి. ఏకేశ్వరోపాసకుల మధ్య జరిగే వివాహాలన్నీ చట్టసమ్మతాలని ఆ సభ అంగీకరించింది. కానీ తల్లిదండ్రులు సంతానాన్ని మతంలోకి తీసుకురావలసిన షరతు మాత్రము పెట్టుకున్నారు. సంఘ సంస్కర్తలు దీనికి వ్యతిరేకంగా వాదించారు. అంతటితో జ్యూలు తద్భిన్నులతో వివాహ సంబంధాలు చెయ్యరని తేలిపోయింది. అందు మూలంగా ఐరోపా ఖండంలో ఈ నాటికీ అనేక ప్రాంతాలలో ముఖ్యంగా రష్యాలో - జ్యూలకూ క్రైస్తవులకు వివాహ సంబంధాలు కనిపించవు, బహు సకృతు.

క్రైస్తవులు జ్యూలకూ క్రైస్తవులకూ వివాహ సంబంధాలు పనికిరావని తీర్మానించారు. దీనికి కారకులు కాన్స్టంటైన్ ప్రభృతులైన చక్రవర్తులు. మధ్య యుగసాహిత్యంలో జ్యూ జాతిమీద విశేష ప్రచారం సాగింది. సాహిత్యాన్ని పరిశీలిస్తే క్రైస్తవ కన్యకలు జ్యూ జాతిని ఎలా అసహ్యించుకున్నారో, ఎలా అసహ్యించుకోవాలో కూడా వ్యక్తమవుతుంది. క్రైస్తవులు పాగనులతోనైనా వివాహం చెయ్యవచ్చునని అంగీకరించారు గాని జ్యూలతో వివాహాలు పనికిరావని నిబంధించారు.

సెంటుపాల్ మహాశయుడు క్రైస్తవులకు హీదెనులతో వివాహము పనికిరాదని శాసించినాడు. అటువంటి వివాహము ప్రమాదవశాన జరిగితే దానిని 'అవివాహితతో నెరపిన కామసంబంధము' (Fornication) గా పరిగణించవలసి ఉంటుందన్నాడు. క్రైస్తవ మత వ్యాప్తిని ఉద్దేశించి అటువంటి వివాహాలు జరిగించటానికి కొంత ప్రోత్సాహమిచ్చినాడు.

కాథలిక్కులు హెరిటిక్కుల మధ్య వివాహాలు పనికి వస్తాయని క్రైస్తవ సంఘం అంగీకరించింది. వారు క్రైస్తవ మతాన్ని అంగీకరించవలసి ఉంటుందన్నారు. కొన్ని క్రైస్తవ పరిషత్తులలో దీనికి వ్యతిరేకంగా తీర్మానించారు. ఇటువంటి వివాహాలకు మతప్రవక్తల అనుమతి అవసరమన్నారు. అటువంటి వివాహాలు మతవక్తల ముందు జరిగితే తప్ప అంగీకరణయోగ్యాలు కావని ట్రెంటులో జరిగిన పరిషత్తు తీర్మానించింది. కానీ కాలక్రమేణ 'పోపులు' ధర్మాంతర వివాహాలను (Mized Marraiges) అంగీకరించారు. పుట్టే సంతానము పొందే విద్యాదికాలను జూచి చర్చి అసహ్యించు కున్నది. ప్రొటెస్టెంట్లు మొదట ధర్మాంతర వివాహాలను వ్యతిరేకించారు గాని, క్రమక్రమంగా ఆమోదించారు. ఈ వివాహాలు ఈ నాడైనా రోమను కాథలిక్, ప్రొటెస్టెంటు దేశాలలో చట్టసమ్మతాలైన వివాహాలకు (Legal marriage) భిన్నంగా లేవు. గ్రీసు దేశానికి సంబంధించిన చర్చి వారిలో మతసంంధమైన నిబంధనలు ఈ నాటికీ కొంతవరకు కనిపిస్తూ ఉన్నవి.

అంతర్వివాహాన్ని ఇస్లాంమతం మొదటినుంచి ఈ నాటివరకూ అరికడుతూ వచ్చింది. 'ఇస్లాం మతధర్మాన్ని స్వీకరించని స్త్రీని వివాహమాడవద్దని' కొరాను పలుకుతున్నది. ఇస్లాం మత ధర్మాన్ని స్వీకరించినంత మాత్రంతో సరిపోదు. ఆ ముసల్మాను ధర్మశాస్త్రాల మీద ఆస్థ కలిగి ఉండాలి; నమ్మకము కుదిరినదై ఉండాలి.

ఈ మూలసిద్ధాంతాలను ఆధారం చేసుకొని సున్నీ షియ్యా న్యాయ శాస్త్రవేత్తలు కొన్ని నిబంధనలు చేశారు. ఈ రెండు వర్గాలవారూ విగ్రహారాధనం చేసే జాతుల్లోని స్త్రీలను వివాహం చేసుకోకూడదని అనుశాసించారు. దీనిని బట్టి ఎటువంటి సందర్భంలోనూ మహమ్మదీయ స్త్రీగాని, పురుషుడు గానీ ధర్మాంతర వివాహాన్ని చేసుకోటానికి అవకాశం ఆ ధర్మ శాస్త్రజ్ఞులు కల్పించలేదని వ్యక్తమౌతున్నది.

హిందువులలో కూటబాహ్య వివాహము - స్థూలదృష్ట్యా స్వీకరించినప్పుడు జరగటానికి వీలు లేదు. హిందూ జాతిలోని వర్ణ వ్యవస్థకు మూలాధారము అదే. హిందువులలో కూటాంతర వివాహమే ప్రధానధర్మము.

అయితే, అది కేవలము ఒక వర్ణముతోనే ఆగిపోలేదు. ప్రతి వర్ణములోనూ కొన్ని ఉపవర్ణములు (Sub-castes) ఏర్పడినవి. సర్వసాధారణముగా వివాహము ఉపవర్ణ, ఉపవర్గముల మధ్యనే నిలచిపోతుంది. ఎప్పుడైనా, వర్ణాంతర, వర్గాంతర వివాహాలు ఉపవర్గాలమధ్య జరగవచ్చునేమో కాని అనాదిలో ఏర్పడ్డ వర్ణ, వర్గాల మధ్య అంతర్వివాహాలు పనికిరావు. ఉపవర్గాలలోనూ కొన్నిటినుంచి కన్యకను స్వీకరించవచ్చునుగాని కన్యకను ఆ ఉపవర్గంలోని వరునకు ఇచ్చే అవకాశం లేదు.

ఒక వర్ణము అనేక ఉపవర్గాలుగా విభజితమైన సందర్భాలలో 'అనులోమము’ (Hyper-Gamy) కనిపిస్తుంది. అందువల్ల తల్లిదండ్రులు కన్యకలను వారికంటే అధికులని పేరుపడ్డవారికి ఇవ్వవలసి ఉంటుంది. లేకపోతే తక్కువ వానికిచ్చి సాంఘికంగా తమ వంశాన్ని అల్పుడైన వియ్యంకుని వంశస్థితికే తీసుకోపోవలసి ఉంటుంది. అందువల్ల పురుషులు తమ వంశంలోని పిల్లలనూ వివాహం చేసుకునే అవకాశం ఏర్పడి ఉండేదన్నమాట. ఇది ఉత్తర భారత జాతుల్లో కనిపిస్తుంది. దక్షణ భారతములోనూ, అస్సాములోనూ ఇటువంటి ఆచారమున్నట్లు గోచరించిందని వివాహ చరిత్రకారుని అభిప్రాయము.

మడగాస్కరు ద్వీపములో జాతులు మూడు విధాలు 1. ప్రభువులు 2. మధ్యస్థులు, 3. బానిసలు. బానిసలలో కూడ ఉపవర్గాలున్నవి. వీరిలో వర్గ బాహ్య వివాహాలుగాని, బానిసలమధ్య ఉపవర్గాంతర వివాహాలు గానీ లేవు. తూర్పు ఆఫ్రికా మాసై జాతుల్లో కమ్మరము, వడ్రంగము ఇత్యాది కర్మకార వృత్తిగలవారు అంతర్వివాహాలు చేసుకోటానికి వీలులేదు.

ఫొనీషియాలో ప్రభువర్గం వారు జనసామాన్యాన్ని మరొక జాతికి చెందిన వారినిగా చూస్తారు. అందువల్ల అన్యోన్య వివాహ బంధాలు లేవు. తహతీలో తక్కువ జాతివాడిని వివాహం చేసుకుంటే కలిగే సంతానాన్ని చంపటానికి ముందు అంగీకరించవలసి ఉంటుంది.

క్రీ.పూ. 445 ప్రాంతాలలో గ్రీసుదేశం మహా వైభవాన్ని అనుభవించే దినాలలో ప్లీబనులూ, పెట్రీషియనులూ అని రెండు తెగలుగా ఉండేవారు. ఒకరితో ఒకరికి వివాహ సంబంధాలు ఉండేవి కావు. సిసిరోవంటి విజ్ఞాని క్రొత్తగా బానిసత్వం పోగొట్టుకున్నవారితో వివాహబంధాలు జాతీయులకు పనికిరావనినాడు. శాసనసభ్యత బానిసస్త్రీని వివాహమాడటం వల్ల పొయ్యేది. అదేరీతిగా బానిసత్వవిముక్తుని అతని పోషకురాలు వివాహం చేసుకునే అధికారం లేదు. వివాహము పనికిరాదనినారేగాని గ్రీసు రోమను శాస్త్రవేత్తలు స్వతంత్రులు, బానిసలు - అనే రెండు జాతుల మధ్య ఒక విధమైన కామ సంబంధము ఉండవచ్చునని (Contu Bernium) అంగీకరించినారు.

ప్రాచీన కాలంలో ట్యుటానిక్ జాతులవారు ఎవరైనా స్వతంత్రుడు బానిసతో వివాహ సంబంధం నెరపితే అతనిని బానిసనుగా చేసేవారు. అటువంటి పనికి పూనుకున్నప్పుడు ఆమెను చంపివేసేవారు.

స్కాండినేవియన్ జాతుల్లో ఎక్కువ కాలం బానిసత్వం నిలవలేదు. జర్మనీలో అది 'సెర్ఫ్ డం గా మారింది. పుట్టుకతో సామ్యం (Equality of Birth) ఉంటేగాని వివాహానికి అవకాశం లేదు. జర్మనీ స్కాండినేవియాలలో క్రమక్రమంగా ప్రభుజాతి భిన్నమై పోయింది. ప్రభుజాతి వ్యక్తికీ, బానిసకూ ఏ కారణం చేతనైనా వివాహబంధం ఏర్పడితే దానిని దుష్టబాంధవ్యము (Mis-alliance) గా భావించేవారు. ప్రప్రథమంలో అటువంటి వివాహాలు చేసుకున్నవారు ఆర్థిక దుర్దశకు పాలైనారు. చాలాకాలం వరకు వారి సంతానానికి పౌరసత్వపు హక్కులు లభించలేదు.

చాలా సందర్భాలలో వర్గసంబంధమైన కూటాంతర వివాహ విధానానికి (Class Endogamy) జాతి వైషమ్యమూ, దేశ వైషమ్యమూ కారణాలు. అన్యదేశీయ దండయాత్రల ఫలితంగా సాంఘిక విభేదాలు ఏర్పడి ఉంటవి. జయించినవారు ప్రభువులూ, జితులు బానిసలూ ఔతుంటారు. వారి ఇరువురి మధ్యా వైవాహిక బాంధవ్యాలు ఉండేవి కావు.

సంస్కృత భాషలోని వర్ణశబ్దానికి 'రంగు' అని అర్ధము. దీనినిబట్టి వర్ణభేదం ఎలా ఏర్పడి ఉంటుందో మనం ఊహించవచ్చును. ఉత్తమ వర్ణం గల ఆర్యులు అనార్యులను జయించి బానిసలనుగా పరిగణించి ఉంటారు. తరువాతి కాలంలో వర్ణశబ్దం కులవిభేదాలను తెలియజేస్తూ వచ్చింది.

ఆర్యజాతి ఏర్పడక పూర్వం భారతదేశంలో నీలవర్ణులైన జాతుల వారుండేవారు. వారే దస్యులు. కాలక్రమేణ వారు ఆర్యులకు బానిసలై పోయినారు. విజేతలైన ఆర్యులలో మొదట స్త్రీల సంఖ్య అతిస్వల్పంగా ఉండేది. ఆ కారణం చేత అనార్యజాతి కన్యకలనూ, స్త్రీలనూ వివాహం చేసుకున్నారు. తరువాత తరువాత అటువంటి అగత్యం లేకపోవటం వల్ల అంతర్వివాహ విధానాన్ని వారు అరికట్టినారు. అంటే కూట బాహ్యవివాహాన్ని అంగీకరించటం మానివేసినారన్నమాట.

నార్మనుల దండయాత్రకు పూర్వం ఆంగ్లదేశానికి శాక్సనులు ప్రభువులు. తరువాత నేటి జర్మనీ ప్రాంతీయులూ, గాలులూ అయిన నార్మనులు ఆ దేశాన్ని జయించినారు, ప్రభువులైనారు. రోమను జాతిలోని 'పెట్రీషియనులు' మొదట ప్రభువర్గంవారు కారు. వారు రోము పట్టణాన్ని పట్టుకొని అక్కడ ఇతః పూర్వపాలకులైన శాబైనులను ఓడించి బానిసలుగా చేసుకున్నారు. వారు కాలక్రమేణ ప్లీబనులైనారు.

విజేతలు అన్ని దేశాలలోనూ వారి వారి పూర్వికుల సాంఘిక మత, రాజకీయ సంప్రదాయాలను అనుసరిస్తూ సామాన్య జనం దగ్గిరనుంచీ దూరంగా ఉంటూ వచ్చినారు. వారితో సహపంక్తి భోజనముగానీ, వివాహాలుగానీ జరిపేవారు కారు. అంటే ఆ విజేతలు ఎవరి మధ్య నివసిస్తున్నారో వారిని విజాతీయులుగానూ, అన్యదేశీయులుగానూ భావించే వారన్నమాట.

ప్రతిజాతికీ, ప్రతి వర్గానికీ, కొన్ని ప్రత్యేకాచారాలూ అభిమానాలూ లోకంలో గోచరిస్తున్నవి. వారి వారి జీవనవిధానాలు వేరు; వారి వారి ఉత్సాహోద్రేకాలు వేరు. వాటిని బట్టి ప్రతిజాతీ, ప్రతి వర్గమూ, తనను ఉత్తమ శ్రేణికి చెందిన దానినిగా భావించుకొని, ఇతర జాతులమీదా, వర్ణాలమీదా దాడిచేస్తూ ఉంటవి. ఆ జాతుల్లో పుట్టిన కవులూ, గాయకులూ ఆ మారణకృత్యాలను 'వీరగాథలు'గా భావించి కీర్తనం చేస్తుంటారు. ఈ ఉత్తమత్వాభిమానం మూలంగా జాతులమధ్య వివాహ బంధాలు ఉండవు.

ఈ విధంగా వివాహ బంధాలు లేకపోవటం వల్ల ఆయా జాతులు విశేషమైన నీతినియమాలు కలిగినవని భావించటానికి వీలులేదు. ఇందుకు ఉదాహరణముగా బెడాయిక్ జాతిని జూడవచ్చును. ఆ జాతి స్త్రీ కొద్దిమూల్యానికి టర్కీ దేశస్థునికి గాని, మరొక ఐరోపా దేశస్థునికి గానీ తన శరీరాన్ని అమ్ముకోవచ్చును. దానిని సంఘం అంగీకరిస్తుంది. కానీ ఆ విదేశీయుని వివాహం చేసుకుంటే తప్పిదము క్రింద పరిగణిస్తుంది. ఘోరశిక్ష విధిస్తుంది.

నేటి నాగరికత జాతులమధ్య, దేశాలమధ్య, మతాల మధ్య, సంఘాల మధ్య ఉన్న రాతిగోడలను బ్రద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇందుమూలంగా అన్ని దేశాలలో కాకపోయినా కొన్ని దేశాలల్లో నయినా - యుక్త వయస్సు గలిగిన స్త్రీ పురుషులు ఇరువురూ వారి వారి ఇష్టానుసారంగా మతసాంఘిక నిబంధనలకు తల ఒగ్గనవసరం లేకుండా వివాహం చేసుకొనే అవకాశం లభించింది. ఆ వివాహాలు చట్టసమ్మతాలైనవి. వెనుకవారు పడవలసిన ఆర్థిక నష్టాలవల్ల కలిగే భయం దూరమైపోయింది.

ఈ మార్పు అత్యంత ప్రధానమైనది. మానవ జీవిత చరిత్రలో ఈ వైవాహిక విధానంలోని పరిణామము మూలంగా నూతనాధ్యాయం ప్రారంభమైంది.

జాత్యహంకారమూ, కులగర్వమూ (Class Pride), ధర్మ, అసహనము (Religious, intolerance) స్త్రీ జాతి బానిసత్వమూ, అనులోమమూ (Hypergamy) కారణంగా ఏర్పడ్డ కూటస్థ వివాహ లక్షణం రూపుమాసిపోవటమంటే ఇక ప్రపంచంలోని ఏ జాతిలోనూ 'రాజుకూ రడ్డికీ' భేదముండదన్నమాట. ప్రభుజాతి, బానిస జాతి అనే విభేదం లేదన్నమాట. సాంఘిక జీవనంలో అత్యంతమైన మార్పు కలుగుతుంది. ప్రాచీన సాంఘిక దౌర్జన్యాలకూ, దురంతాలకూ ఇక తావుండదు. వ్యక్తిగత స్వాతంత్య్రానికి ఏ లక్షణమూ వేరు పురుగుగా పరిణమించలేదు. మానవ జాతుల మధ్య వ్యక్తుల మధ్య సహనభావం విశేషంగా అభివృద్ధి పొంది, ప్రపంచంలోని మానవ జాతులన్నీ కలిసిపోయి ఏకైక కుటుంబంగా కాకపోయినా విశేష సహనభావంతో వర్తించటానికి అవకాశం కలుగుతుంది. అటువంటి పరిణామానికి వైవాహిక విధానంలోని కూట బాహ్యత (Exogamy) రాచబాట వేస్తుంది.

(ఆంధ్రపత్రిక 1948 సెప్టెంబర్ 8)