వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/రాక్షస వివాహము

వికీసోర్స్ నుండి

రాక్షస వివాహము

“అంకిలి సెప్పలేదు చతురంగబలంబుతోడ నెల్లి ఓ పంకజనాభ. నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునకు భవదీయశౌర్యమే యుంకువసేసి, కృష్ణ! పురుషోత్తమ! చేకొని పొమ్ము వచ్చెదన్" అని శ్రీకృష్ణుని ప్రేరేపించి రుక్మిణీదేవి కృష్ణుని ధర్మపత్ని అయినది. పురుషోత్తముడు ఆమెను ప్రియపత్నిగా చేసుకొన్నాడు. రాక్షస వివాహాలకు కన్యను బలాత్కరించి ఎత్తుకోపోవటం ప్రధాన లక్షణం. దీనికి ఆమె అంగీకారం ఉండి ఉండవచ్చును. లేదా ఉండకపోనూ వచ్చును. పురాతన కాలంలో అన్ని దేశాలలోనూ అన్ని జాతుల్లోనూ, నేడు అనేక అనాగరక జాతుల్లోనూ ఈ రాక్షస వివాహ విధానం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తున్నది. అష్టవిధ వివాహాలలో రాక్షస వివాహం ఒకటిగా ధర్మశాస్త్రకర్తలు అంగీకరించారు. అష్టవిధ వివాహాలలో మొదటి నాలుగూ ధర్మ్యాలనీ, తదుపరి నాలుగూ వ్యూఢాలనీ చెప్పి "పూర్వః పూర్వః ప్రధానం స్యా ద్వివాహో ధర్మసంస్థితేః, పూర్వాభావే తతః కార్య యోయ ఉత్తర ఉత్తర, వ్యూఢానాంహి వివాహానా మనురాగః ఫల యతః, మధ్యమోపిహి సద్యోగో గాంధర్వస్తేన పూజితః" (వాత్స్యాయన సూత్రములు వివాహ యోగాధ్యాయము. (3.) (5.28,29) మన పూర్వులు వాటిలో మంచి చెడ్డలను నిరూపించారు. ఎనిమిది వివాహాలలోనూ తొల్లిటి తొల్లిటివి ప్రధానమైనవనీ, అటువంటి బ్రాహ్మాదులైన పూర్వ వివాహాలు లభించనప్పుడు ఉత్తరోత్తరాదులైన గాంధర్వాదులు యోగ్యాచరణాలనీ అభిప్రాయమిచ్చారు. ఈ విధంగా రాక్షస వివాహాన్ని ద్వితీయ పక్షాలైన వ్యూఢా వివాహాలలోనూ అధమమైనదానినిగానే మన పూర్వులు పరిగణించారు.

ప్రపంచ వివాహ చరిత్రను పరిశీలిస్తే అన్ని జాతులకూ ఇది ఒకానొక సమయంలో ఒక వివాహ విధానంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మెక్లినస్ అనే శాస్త్రజ్ఞుడు “నాగరకజాతుల్లో భార్యను పొందటానికి ఇది ఒక్కటే క్రమమైన విధానం' అని చెపుతున్నాడు. ఇతని అభిప్రాయంతో సాంఘిక శాస్త్రవేత్తలు ఏకీభవించారు.

'కుటుంబోత్పత్తి పరిణామము' అనే గ్రంథంలో ఏంజెల్సు మహాశయుడు రాక్షస వివాహాన్ని గురించి 'మానవజాతి ఏక గామిత్వం (Monogany) వరకు పరిణమిస్తున్న స్థితిలో రాక్షస వివాహము ఒకానొక అవస్థాభేదాన్ని నిరూపిస్తున్నది. ఈ వివాహ విధానంలో ఒక జాతికి చెందిన యువకుడు మిత్రబృందంతో పర జాతి కన్యకను బలాత్కరించి ఎత్తుకుపోతుంటాడు. కొంతకాలం వారి మిత్రులందరూ కన్యకను వంతుల ప్రకారం అనుభవిస్తారు. చిట్టచివరకు ఆమె మొదట ప్రేరేపించినవానికి భార్య ఔతుంది. కన్యక అతణ్ణి అంగీకరించక ఆ స్నేహితులబృందంలో మరి ఒకరిని భర్తగా కోరుకొని అతని వెంట పారిపోతే, అతని భార్య ఔతుంది. మొట్టమొదటివాడికి ఎత్తుకోరావటం వల్ల కలిగే హక్కులన్నీ పోతవి. గుంపుపెళ్ళి (Group-Marriage) సర్వసామాన్య లక్షణంగా మానవజాతి వైవాహిక విధానం నడుస్తూ ఉన్న దినాలలో ఈ విధానం అమలులోకి వచ్చి ఉంటుంది. బలాత్కారంగా యుద్ధసమయాలలో జితులైనవారి భార్యలనూ, కుమార్తెలనూ ఎత్తుకొని వచ్చి భార్యలుగా స్వీకరించటం గానీ, ఉంపుడుకత్తెలుగా నిలుపుకోవటం గానీ ఈ వివాహ విధానానికి లక్షణము అని నిరూపించాడు.

ఇటువంటి వివాహాలు ఇంగ్లండు దేశంలో ఏడవ హెన్రీ రాజ్యకాలంవరకూ పరిపాటిగా వస్తూనే ఉండేవట. అతడు రాజ్యంచేస్తూ ఉన్నప్పుడు రాజ్యార్హత కలిగిన రాజకుమార్తెను ఒక వ్యక్తి రాక్షస వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఇది తప్పిదంగానూ, న్యాయవిరుద్ధ వివాహంగానూ ఏర్పాటైంది. ఐర్లాండు దేశంలో పూర్వపిక్టులకూ గాలులుకూ జరిగిన యుద్ధాలు రాక్షస వివాహ మూలాలే. ఇటలీలో ఈ ఆచారం మధ్యయుగంలో కూడా ఉండేది. అందుకోసమని ధనిక కుటుంబికులు వారి కన్యకలను రక్షించుకోటానికని కొంతమంది వీరులను (Knights) నియమించేవాళ్ళు. మరొక వీరుడు ఆ ధనిక కుమార్తె రూపరేఖావిలాసాలకు ముగ్ధుడై బలాత్కరించి రాక్షస వివాహం చేసుకోదలచుకుంటే, ఆమెకు రక్షకుడుగా ఉంటూ ఉన్న వీరుడితో యుద్ధం చేసి జయించవలసి ఉంటుంది. యుద్ధంలో కన్యక వీరుడు ఓడిపోతే ఆమె ప్రతివీరుడికి భార్యగా పరిణమించక తప్పదు. పురాతన గ్రీసులోనూ ఇంతే.

దక్షిణాస్లావ్ జాతుల్లో ఈ ఆచారం 18 శతాబ్దం వరకూ ఆచారంగానే ఉంది. ఆల్బేనియా పర్వతప్రాంత జాతుల్లో నేడూ ఇదే ఆచారం. వీరు కొండజాతులు, మైదానంలో నివసించి జాతులు ఊర్లమీద పడి వివాహితలనూ, అవివాహితలనూ ఎత్తుకొనిపోయి దూషణానంతరం (Rape) వివాహం చేసుకోవటం వారి ఆచారం.

యహగన్లూ, ఓనస్ జాతివారూ పరాయి పిల్లలకోసం వారితో యుద్ధాలు చేసి శక్తిని ప్రకటించి ఎత్తుకోపోతారట. ఇటువంటి పని శాంతి సమయాలలో వారిజాతుల్లోనైనా జరుగుతుంటుంది. బ్రెజిలు మొదలైన దక్షిణ అమెరికా దేశాలలో వివాహం కోసం యుద్ధాలు జరుగుతవని ప్రపంచ చరిత్రకారుడు నెస్టర్ మార్కు అభిప్రాయము. ఇవి కేవలమూ కన్యకల కోసమే కాదు, వరులకోసం కూడా జరుగుతూ ఉంటవి. కొన్ని జాతుల్లో స్త్రీ జనసంఖ్య అధికంగా ఉంటుంది. అప్పుడు వారు ఇతర జాతులమీద పడి పురుషులను ఎత్తుకోపోయి వివాహమాడుతుంటారు. కాలిఫోర్నియా, లూషియానాలలో ఇండియను జాతులు పెళ్ళికుమార్తె యింటిమీద దండెత్తుతవి. ఈశాన్య ఆసియాలో చుకిచీ జాతి యువకుడు పిల్ల కాళ్ళు చేతులు కట్టివేసి బంధించి తెచ్చి వివాహం చేసుకుంటాడు. తల్లిదండ్రులు వచ్చి వారికి రావలసిన శుల్కం పుచ్చుకోవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.

రష్యాలోని సాహోయన్, జిటాయల్, ఒష్టాయల్ జాతుల్లో వరులు వధువును బలాత్కరించి తెచ్చుకుంటారు. ఆమె అంగీకరింపక పోయినా, ఆమె తల్లిదండ్రులు అంగీకరింపకపోయినా ప్రయోజనం లేదు. కన్య ఒకదినం అతని పర్ణకుటిలో పవ్వళిస్తే చాలు, అతని భార్య ఐపోతుంది. ఇతరులు వివాహం చేసుకోటానికి అంగీకరించరు కూడాను. మలై అర్చిపెలగోలోనూ, మలనీషియాలోనూ, ఆస్ట్రేలియాలోనూ రాక్షస వివాహమే నేటికీ చాలాచోట్ల ఆచారము. మహమ్మదు పుట్టుకకు పూర్వం అరబ్బు సైనికులు రాక్షస వివాహం అడవచ్చునని వారి ధర్మశాస్త్రం అంగీకరించిందట. స్కాండినేవియా జాతుల్లో భార్యలకోసం నిరంతరమూ యుద్ధాలేనట. కొసక్, యుక్రీనియన్ జాతుల్లో కన్య దూషణ చేసిన వానిదే.

టుటానిక్ జాతుల ధర్మశాస్త్రం 'రాక్షస వివాహం' అధర్మమైనది; న్యాయసమ్మతము కాదని చెప్పింది. అటువంటి వారిని శిక్షిస్తుంది; కానీ ఒకానొక వైవాహికవిధానంగా దానిని అంగీకరించింది. తూర్పు ఆఫ్రికాలో యువకుడు కన్యక ఇంటిమీదికి కత్తికటారులతో వెళ్ళి అడ్డగించిన ఆమె అన్నదమ్ములతో పోట్లాడి, ఆమెను తెచ్చుకొని బలాత్కారంగా వివాహమాడుతాడు. మంగోలు జాతుల్లోనూ, మొరాకోలోనూ ఇదే ఆచారం. బర్మా జాతుల్లోనూ ఇటువంటి వివాహాలు ఒకానొక కాలంలో వున్నట్లు నేటి వైవాహికాచారాలలో కనిపించే ఉట్టుట్టి పోరాటాలవల్ల వ్యక్తమవుతున్నదని సాంఘిక శాస్త్రవేత్తలంటున్నారు.

నేటి రోమను కన్యక తల్లి ఒడిలోకి పారిపోతుంది. పెళ్ళికుమార్తెను చేసిన తరువాత వివాహ మాడనని చర్చికి పారిపోతుంటే పెళ్ళికుమారుడు స్నేహితులతోనూ, బంధువులతోనూ మళ్ళీ బలాత్కరించి తీసుకోవస్తాడు. జర్మనీదేశంలో పెళ్ళికుమార్తెను బలాత్కరించి తెచ్చుకోటం క్షేమకరమైనదని నేటికీ ఒక నమ్మకం. 'నవ్వే పెళ్ళికూతురు ఏడ్చే భార్య ఔతుందనీ, ఏడ్చే పెళ్ళికూతురు నవ్వే భార్య ఔతుందనీ' వారి సామెత. సైబీరియాలో కులం పెద్దలే వివాహాన్ని నిర్ణయించినా వరుడు వధువును బలాత్కరించి లాక్కో రావటం వైవాహికాచారం.

స్పెన్సర్ అనే రచయిత మొట్టమొదట 'కన్యకను ఇలా బలాత్కరించి తీసుకురావటానికి ఆమె అంగీకరించకపోవటం కారణమై ఉంటుంది' అన్నాడు. కొన్ని జాతుల్లో వివాహం కాని స్త్రీ పురుష జాతులకు రెంటికీ వైవాహిక సంబంధమైన యుద్ధాలు జరుగుతుంటవి. వాటిలో స్త్రీ జాతి బహుతీవ్రంగా ప్రతిఘటిస్తుంటారు. దీనికి మానసిక శాస్త్రవేత్తలూ, సాంఘిక శాస్త్రవేత్తలూ నిత్యవైరము (Sex - antagonism) మూలకారణమన్నారు. నేడు కూడా అనేక అనాగరిక జాతుల వివాహ సందర్భాలలో ఇటువంటి యుద్ధాలకు ప్రత్యామ్నాయంగా జరిగే ఉట్టుట్టి పోరాటాలు కనిపిస్తున్నవి. అరబ్బు జాతుల్లో పెళ్ళికొడుకు పక్షంలోని ఆడవాళ్ళు పెళ్ళికుమార్తె ఇంటిమీదికి దోపిడికి వెళ్ళి వాళ్ళ పురుషులతో పోరాడతారట!

భారతదేశంలో రాక్షసవివాహాన్ని మనువు ఒకానొక వైవాహిక విధానంగా అంగీకరించాడు. ఇది కేవలం క్షత్రియజాతికి మాత్రమే చెల్లుతుంది. ఒరిస్సాలోని భుయలాజాతిలో యువకుడు ఒక కన్యకను ప్రేమించినప్పుడు, ఆమె అంగీకరించకపోయినా, ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోయినా, ఏకాంతంగా కనిపించినప్పుడు ఎత్తుకోవచ్చుకుంటాడు. చిట్టగాంగ్ కొండ జాతుల్లోనూ ఆడపిల్లలు తక్కువ. వారు కూడా పరదేశం మీద పడి కన్యకలను తెచ్చుకుంటారు. వంగదేశంలో క్లాహౌ జాతి యువకుడు సంతోషంతో నృత్యం చేసే కన్యకను ఒంటరిగా చూచి తెచ్చుకొని భార్యనుగా చేసుకుంటాడు.

రాక్షస వివాహానికి దూషణము ప్రధాన లక్షణంగా అనేక జాతుల్లో కనిపిస్తున్నది. దూషణ మూలంగా భార్యలను సంపాదించుకోవటం పూర్వ రోమనుల లక్షణం. దీనికి సంబంధించిన అనేక కథలు బైబిలులో (Judges XX-XXI, Numbers XXXI, 7-8, Dueteronomy XXI) కనిపిస్తున్నవి. ఆస్ట్రేలియా జాతుల్లో భార్యను పొందే విషయంలో బలాత్కారమూ, దూషణమూ విశేషంగా ద్యోతకమౌతున్నది. ఇతర జాతిలోని స్త్రీని పొందదలచుకున్నప్పుడు వారి గుంపుమీద కాపలా వేసి, ఒంటరిగా కనిపించిన స్త్రీని ఆయుధంతో ఒక దెబ్బకొట్టి, చెట్టుపొదల మాటుకు తీసుకోవెళ్ళి, స్మృతి వచ్చిన తరువాత వారి గురువు దగ్గరకు తీసుకోవెళ్ళి బహిరంగంగా నేను ఈమెను వివాహం చేసుకుంటున్నాను అని నిరూపించటానికి, కులంవారి ఎదుట వరుడు దూషణచేస్తాడు. ఈ జాతిలో రాక్షస వివాహ విధానమూ, దానికి అంగముగా, ఉన్న దూషణమూ చిత్రాతిచిత్రంగా కనిపిస్తున్నది. పరకులాల మీద ఇద్దరు ముగ్గురు మిత్రులు కలిసి దూషణయాత్రకు (Rape raid) బయలుదేరటం సర్వసామాన్యం. నిశ్శబ్దంగా వారి గుడిసెల్లో ప్రవేశించి ముళ్ళపొదను పోలిన బల్లెపు కొనకు స్త్రీల జుట్టును ఒకడు పెనవేస్తాడు. రెండవ వాడు బల్లెపు కొన వక్షఃప్రదేశానికి ఎదురుగా నిల్పి భయపెట్టి నిలుస్తాడు. నిద్ర మేల్కొన్న తరువాత ఆ స్త్రీ కిక్కురు మిక్కురు మనకుండా వారు చెప్పిన చోటికి నడిచి వెళ్ళుతుంది. ఆమెను ఒక చెట్టుకి కట్టివేసి 'నీవు నా బానిస' వని ఆమెకూ, 'ఈమె మా బానిస' అని ఇతర కులానికి తెలియజెప్పి, తరువాత వారిలో ఒకరు వివాహ మాడతారు. సర్వసామాన్యంగా ఆ జాతుల్లో ఉన్న వైవాహిక విధానమే ఇది కనుక, బందీకృతలైన స్త్రీలు ప్రతిఘటించటానికి ప్రయత్నించరు. ఆ జాతుల్లో చిన్నతనం నుంచి పిల్లలు ఇటువంటి దూషణక్రియకు అలవాటు పడే ఆటలు ఆడుకోవటం ఆ జాతులవారు నేర్పుతారట!

ఆస్ట్రేలియా జాతుల్లో అందమైన ఆడపిల్ల జీవితం అతి గహనంగా ఉంటుంది. ఒక భర్తతో ఆమెకు సుస్థిరమైన కాపురమంటూ ఏర్పడబోయే లోపల, ఒకదాని వెంట ఒకటిగా అంటి వచ్చే ఎన్నో దూషణక్రియలకు ఆమె గురౌతూ ఉంటుంది. అందువల్ల ఆమె శరీరము చెడిపోటమూ, ఆమె చివరకు చేరే నూతన సంఘంలో చికిత్స దొరకకపోవటమూ నిశ్చయము. ఇటువంటి అవస్థలకు పాలైన స్త్రీ కులంవారు ఆమె పొందుతున్న కష్టాలకు ప్రతిక్రియగా మరికొన్ని యుద్ధాలు చేయటమూ, అందువల్ల మరికొంత మంది జనాన్ని కోల్పోవటమూ జరుగుతుంది. అందుమూలంగా కొన్ని జాతులవారు అందమైన ఆడబిడ్డలను పెరిగి పెద్దవాళ్ళు కాగానే దేవతలకు బలియిస్తుంటారు. ఒకవేళ అటువంటి యుద్ధాలలో వారు గెలిచినా దోషిని ఒప్పజెప్పిన తరువాత, పది బల్లాలు అతనికి తగిలీ తగలనట్లుగా విసిరి చివరకు సంధి చేసుకొని, విందు కుడుస్తారు. న్యూ గినీలలోని పాపను జాతిలోనూ, ఫిజీ ద్వీపవాసుల్లోనూ, ఇటువంటి ఆచారం నేటికీ కనిపిస్తున్నది. నిజమైన దూషణముగానీ, కల్పితమైన దూషణము (Stimulated Rape) గానీ, వీళ్ళల్లో సర్వసామాన్యము. దీనికి ఆ జాతులవారూ అధిదేవతనుగా ఒక శక్తిని కొలుస్తారు. దూషిత ఐన స్త్రీ అతని సెజ్జ చేరటముగానీ, మృతి పొందటము గానీ జరుగుతుంది. చివరకు ఉభయజాతుల వారూ చేరి విందు చేసుకుంటారు. బ్రతికి ఉంటే ఈ విందుతో వివాహం పూర్తి ఐనట్లు. బలాత్కరించి తెచ్చి వివాహమాడిన స్త్రీ అతని పౌరుష పరాక్రమాలకు చిహ్నమనీ, అధిక గౌరవ వ్యాపకమైన పతాకమనీ అనాగరిక మానవుని భావన. రాక్షస వివాహం విశేష ప్రచారంలో ఉండే వైవాహిక విధానం కారణంగా, జాతిలోని కన్యకలను ఉత్తమ ప్రణయాదికాలవల్ల వివాహం చేసుకున్న వారికంటే, పరస్త్రీని బలాత్కరించి తెచ్చి దూషణానంతరం వివాహం చేసుకున్నవారు పరాక్రమోపేతులనే అభిప్రాయం ఆ జాతుల్లోని స్త్రీ పురుషుల్లో ప్రబలంగా ఉండటమూ, అందుమూలంగా అటువంటి వారికి విశేష గౌరవము సంఘంలో ప్రాప్తించటమూ జరుగుతూ వచ్చింది.

బేబరు ఆర్చి పెలగోలలో పక్కన ఉన్న గ్రామంలోని కన్యకను బలాత్కరించి పొందనివాడు స్త్రీతుల్యుడనే భావం నేటికీ కనిపిస్తున్నది. ఫిలిపైన్స్ ద్వీపాలలోని జాతుల్లో నేటివరకూ స్వజాతిలోని కన్యకలను వివాహ మాడటం తెలియదు. టిబెట్ ని పూరంగ్ జిల్లాలోనూ ఇదే నీతి. బలాత్కరించి కన్యకలను తీసుకోవచ్చి దూషణ క్రియ జరిపిన తరువాత ఆమెగానీ, ఆమె తల్లిదండ్రులుగానీ వివాహానికి అంగీకరింపకపోతే అతడు కులం పెద్దలను తీర్పు చెప్పవలసిందని విన్నవిస్తాడు. సర్వసామాన్యంగా వారు అవతలి జాతిమీద యుద్ధానికైనా సిద్ధపడి వివాహానికి సుముహూర్తం ఏర్పాటు చేస్తారు. ఈ కులంపెద్దల అంగీకారానంతరం విందులతోనూ, మదిరాపానంతోనూ వివాహం జరుగుతుంది. గోండు జాతిలోనూ ఇదే లక్షణం. న్యూ బ్రిటన్ లోని చీజికీ జాతివారు కన్యను అపహరిస్తారు; వారు దొరకని సమయంలో పరుని భార్యనైనా అపహరించి దూషణానంతరం వివాహం చేసుకోటానికి వెనుదీయరు.

రాక్షస వివాహం నేడు ఆచారంగా లేని జాతుల్లోని వైవాహికపు తంతును పరీక్షిస్తే ఆ జాతుల్లో పురాతన కాలంలో ఉండే యుద్ధాలను జయించటానికి తగిన ఆధారాలు లభిస్తున్నవి. బ్రిటిష్ న్యూ గయానాలోని రోరో తెగలో రాక్షస వివాహానికి ప్రత్యామ్నాయంగా ఒక తంతు కనిపిస్తున్నది. వధూవరుల ఉభయ బంధువర్గాలకూ కల్పితమైన ఒక చిన్న జగడం జరుగుతుంది. వధువు తల్లి ఒక కొయ్యతో కనబడ్డ ప్రతివస్తువు మీదా విరుచుకోపడి చివరకు రోదనం ప్రారంభిస్తుంది. దానితో ఊరిలో వర్గం అంతా చేరుతారు. ఈ విధంగా మూడుదినాలు దుఃఖిస్తుంది. అనంతరం కూడా ఆమె పెళ్ళి కుమార్తెతో ఇంటికి వెళ్ళటానికి నిరాకరిస్తుంది. ఇది పెళ్ళికుమార్తెను బలాత్కరించి ఎత్తుకోపోయారని నిరూపించటానికి ఏర్పాటైన వింత ఆచారం. మంగోలు జాతిలో వరుని పక్షం వాళ్ళు పెళ్ళికుమార్తె యింటిముందుకు వెళ్ళి లోపలకి పోనియ్యమని అడుగుతారు. ఆమె అన్న 'మా ఇంటితో మీకేమి పని?' అని ప్రశ్నిస్తాడు. 'మా గుడిసెలో నివసించటానికి యుద్ధం చేయవలసిందే' అని అంటాడు. యుద్ధం సాగగానే అతను లొంగిపోతాడు. వరుని పక్షంవారు ఇంట్లో ప్రవేశిస్తారు. ఆ జాతిలో వధువు పారిపోతే పట్టుకొని పోవడం కూడా ఇటువంటిదే.

ఆ నాడు ఆచారంగా ఉన్న ఈ వివాహాలు నేడు ఇటలీ దేశస్థుల వివాహంలోని ఒక తంతులో ఇమిడి, పోలండు దేశంలో ఇటువంటి ఆచారం ఉంది. ఐర్లండు వివాహంలోనూ ఇవే కల్పిత యుద్ధాలు (Mock - fight) కనిపిస్తాయి.

ఆర్కిటిక్ ప్రాంతాలను పర్యవేక్షణ చేసిన ఒక భూప్రదక్షకుడు, గ్రీన్లాండు ప్రాంతంలోని ఈ వివాహ విధానాన్ని గురించి విపులంగా వ్రాసాడు. ఆ దేశంలో అనాగరిక జాతుల్లో కన్యకను జుట్టుపట్టి లాక్కోరావటం తప్ప ఇతరమైన వైవాహికవిధానమే లేదట. ఈ వివాహాన్ని కన్యక తల్లిదండ్రులైనా చూస్తూ ఉండవలసిందేగానీ ప్రతిగా ఏమీ చేయటానికి వీలు లేదు. పైగా అది కేవలము వ్యక్తిగతమైనదిగా భావిస్తారుట. ఎస్కిమో జాతిలో ఈ విధంగా బలాత్కృతి ఔతున్న కన్యక పోరాడుతుందిట. ఇది కేవలమూ ఆమె పవిత్ర నీతి నియమాల్ని (Modesty) నిరూపించటానికి చేసే ప్రతిఘటన మాత్రమే. జీవనము ఆ బలాత్కరించే వ్యక్తితోనే ఉన్నదని ఆమెకు తెలుసును. ఇది పరంపరాగతంగా వస్తూ ఉన్న ఆచారం గనుక, ఆమె అనుసరిస్తున్నది. అంతే. వేరొక జాతిలో రాక్షస వివాహలక్షణం చిత్రమైన స్థితిలో కనిపిస్తున్నదని ఫీల్డింగ్ 'వైవాహిక విచిత్రాచారాలు' అనే వ్యాసంలో నిరూపించాడు. కన్యక తండ్రి ఆమెకు యుక్తవయస్సు రాగానే అతడు ఆమెను పెళ్ళాడదలచుకున్న యువకునితో 'నీవు నా కుమార్తెను బలాత్కరించవచ్చును' అని చెపుతాడు. అతనిని ప్రతిఘటించకుండా లొంగిపోవడం కేవలం స్త్రీ జాతికి అపకారం. 'నీ శక్తిని ఉపయోగించి పెనగులాడాలి సుమా!' అని తల్లి కుమార్తెకు నీతి గరపుతుంది. కన్యక ఒంటరిగా నిద్రిస్తూ ఉన్నప్పుడు ఎన్నడూ బలాత్కరించటానికి పూనుకోడు. అది అతని ఉజ్జీవనానికి శుభోదర్కమైన క్రియ గాదని అతని నమ్మకం. వరుడు బలాత్కరించటానికి తలపడి వస్తున్నాడని తెలుసుకొని, కన్యక వస్త్రాలంకరణంతో, ఇది ఒక విధమైన యుద్ధానికి ఆయత్తం చేసుకొని పారిపోతుంటుంది. వరుడు మిత్ర బృందంతో వెంటబడి ఆమెను అడ్డగిస్తాడు. కొంతకాలం వారి ఇద్దరిమధ్యా చిన్న యుద్ధం జరుగుతుంది. కొంతసేపు పోరాడి ఆమె ఓడిపోతుంది; వివాహానికి అంగీకరిస్తుంది. ఇది ఒక బహిః ప్రదేశంలో జరుగుతుంది. ఇద్దరూ వాహనంమీద గ్రామంలోకి తిరిగి వస్తారు. పెద్దలు వారికి వివాహం చేస్తారు. పురాతన గ్రీసుదేశంలో - ప్రధానంగా స్పార్టాలో, ఈ రాక్షస వివాహ లక్షణం వారి వివాహపుతంతులో నిలచిపోయింది. ఫ్లూటార్కు మహాశయుడు 'లికుర్గన్ జీవితంలో దీని స్వరూపాన్ని క్రింది విధంగా నిరూపించాడు.

"In their marriages the bride-groom carried off the bride by violence, and she was never chosen in a tender age, but when she arrived at full maturity. Then the woman that had the direction of the wedding cut the bride's hair close to the skin, dressed her in man's clothes laid her upon a mattress, and left her in the dark. The bridegroom went in privately, untied her girdle, and carried her to another bed....” (Strange Customs of Courtship and Marriage - W. Fielding P. 251)

ఉత్తమ జాతులలోని వివాహాల్లోనూ ఈ లక్షణం అల్పమాత్రంగానైనా నేడు కనిపిస్తూ ఉన్నది. భారతదేశమూ, చైనా, జావా, ఈజిప్టు దేశాలలోనూ, యూరప్ దేశంలోనూ దీనికి సంబంధించిన ఒక తంతు కన్యక గిరి లేక కంచె తొక్కకుండా ఇంట్లో ప్రవేశించటము అనే ఆచారం కనిపిస్తున్నది.

ఈ రీతిగా నేటికీ నిజరూపాన్ని సంజ్ఞాత్మకంగానైనా నిలుపుకున్న రాక్షస వివాహం, వైవాహిక పరిణామంలో ఒకానొక దశను నిరూపిస్తూ ఉన్నది. దీనిని కొందరు ‘మహద్దూషణము' (Glorified Rape) అన్నారు. మనలో అతి ప్రశాంతంగా నడిచిపోతూ ఉన్న వైవాహిక విధానాలను ఏ రీతిగా గమనిస్తున్నామో, ఈ వివాహ విధానం ఆచరణలో ఉన్న జాతులవారు దీనిని అదేరీతిగా చూస్తున్నారు. కూటాంతరము అంగీకరించని జాతులకు ‘బాహ్యరక్తస్పర్శ' (Touch of Exogamous blood) దీనివల్ల కలుగుతున్నది. అందుమూలంగా జాతుల్లో నూతనరక్తం ప్రవేశిస్తున్నది. జాతి రక్తము గడ్డకట్టి పోవటమనే చెడు నేడు తప్పిపోతున్నది. ఈ దృష్టితో ఇటువంటి రాక్షస వివాహాలకు పూనుకున్న జాతివారు బలాత్కరించి తెచ్చిన స్త్రీలను వారి జాతి స్త్రీలకు పెంపుడు కుమార్తెలనుగా పరిశీలించి, యథావిధిగా వివాహం చేసినప్పుడు భార్యలుగా స్వీకరిస్తారు. ఈ పని ముఖ్యంగా మాతృస్వామిక కూటములో (Matriarchical Genus) జరుగుతుంది.

మెక్లినన్ అనే సాంఘిక శాస్త్రవేత్త సంజ్ఞాత్మకంగా నేటి వివాహాలలో రాక్షస వివాహ లక్షణం నిలబడి ఉండటము గొప్ప విశేషమనినాడు. ఉభయ పక్షాలలో వివాహానికి అంగీకారం ఉన్నప్పుడు వరుడు స్నేహితబృందంతో కన్యను బలాత్కరించటం కేవలమూ పూర్వాచారము. కొన్ని జాతుల్లో పూర్వము అంగీకారం లేకుండా జరుగుతున్నది. ఇది కేవలమూ దూషణము, బలాత్కారము, ఆచారము, కాదు. ఈ విభేదాన్ని గమనించవలసి ఉంది. ఈ రాక్షస వివాహ లక్షణం ఉన్నచోట పూర్వాచారమూ, సంజ్ఞాత్మకంగా బలాత్కారం జరిగినప్పుడు కన్యక చూపించే దుఃఖం విశేషంగా కృతకమూ, పరంపరాగతమూ, నీతి నిరూపణాత్మకము. కేవల దూషణ వివాహాల్లో దుఃఖము సత్యము. ఇటువంటి వివాహాలు విశేషంగా అనాగరక జాతుల్లో కనిపిస్తున్నా సర్వసామాన్యము కాదని గాడ్సీ అభిప్రాయం. అనాగరిక జాతులు ప్రక్క జాతులతో వైరం పెట్టుకోటానికి ఇష్టపడకపోవటమే దీనికి ఆయన చూపించే ప్రబల కారణము. ఇది వారికి సర్వ సామాన్య ధర్మము కావటం వల్ల వారు ఈ విషయాన్ని గురించి సత్యమైన యుద్ధాలకు పూనుకోరనీ, వారి మైత్రి దీనివల్ల నశించదనీ ఇతరులు అతని అభిప్రాయాన్ని అంగీకరించారు.

(ఆంధ్రపత్రిక, 1948 డిసెంబర్ 1)