వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/బృంద వివాహము
బృంద వివాహము
శాస్త్రజ్ఞులు అనాది మానవజాతుల వైవాహిక విధానాన్ని గురించి ఎంతోవిచారణ చేశారు. ప్రాథమిక స్థితిలో అది కేవలమూ శారీరక సంబంధమని నిర్ణయించారు. అనాది మానవ సంఘంలోని స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఈ శారీరక సంబంధంలో ఎటువంటి వివక్షా లేదని వారు అభిప్రాయపడినారు. దీనికే వివక్షారహిత కామము (Promiscuity) అని నామకరణం చేశారు. దీనిని బట్టి అతి ప్రాచీన కాలంలో ఎటువంటి వివక్షా లేకుండా స్త్రీ పురుషులు కామతృప్తి పొందేవారని నిశ్చయించవచ్చునన్న మాట.
అయితే ఈ వివక్షా రహితమైన కామోపభోగ స్వరూపం ఎటువంటిది? నేడు సంఘంలో ఉన్న నీతినియమాలూ, విధినిషేధాలూ ఆ నాడు లేవు. ఆ నాటి సంఘం కామసామ్యాన్ని (Sex Communism) పాటించేది. నేటి పరిభాషలో మాట్లాడితే అన్నకు చెల్లెలు, తండ్రికి కూతురూ భార్య లౌతారు; అక్కకు తమ్ముడూ, తల్లికి కుమారుడూ భర్త లౌతారు. బెహరింగు జలసంధి దగ్గర ఉన్న కలియక్కులలోనూ, అలాస్కాలోని కడైయక్కులలోనూ, బ్రిటిష్ నార్త్ అమెరికాలోని టెన్నెహిజాతిలోనూ ఇటువంటి స్వీయబంధు ప్రణయము (Incest) నేటికీ కనిపిస్తున్నదని 'సంసారోత్పత్తి' (Origin of Family) అనే గ్రంథంలో ఏంజెల్సు మహాశయుడు వ్రాసి ఉన్నాడు. చిలీలోనూ, చిప్పల్ ఇండియను జాతివారిలోనూ ఇటువంటి ఆచారము నడుస్తూ ఉన్నట్టు కొందరు యాత్రికుల వ్రాతల వల్ల తెలుస్తున్నది.
పైన పేర్కొన్న అనాగరిక జాతులకంటె నాగరకులనిపించుకున్న రోమనులు, పర్షియనులు, పార్థియనులు, హూణులు మొదలైన మరికొన్ని జాతులవారి చరిత్రలు చదువుతుంటే ఇటువంటి స్వీయబంధుప్రణయము నాగరక జాతుల్లోనూ చాలాకాలము వరకు గడచినట్లు కనిపిస్తుంది. కానీ తరువాతి కాలంలో ఈ ఆత్మ బంధు ప్రణయాన్ని కొన్ని జాతులు ఎబ్బెట్టుగా చూచారు. కొన్ని విధినిషేధాలు ఏర్పాటుచేసుకున్నారు.
మోర్గన్ మహాశయుని సిద్ధాంతాన్ని అనుసరించి ఇటువంటి వివక్షా రహితమైన కామోపభోగస్థితిలో నుంచే మొట్టమొదటి మానవ సంసారాలు (Human Families)
ఏర్పడినవి. అంటే ఒక కుటుంబానికి సంబంధించిన తాతలనూ తాతమ్మలనూ
నియమించారు. తాతలకు సంబంధించిన వారందరూ భర్తృవంశం వారైనారు.
ఆ విధంగా వివాహం చేసుకున్నవారివల్ల కలిగే సంతానాలమూలంగా
భర్తృవంశాలవారూ, భార్యవంశాలవారూ ఏర్పడి ఉంటారు.
ఈ విధంగా ఏర్పడ్డ వివాహ సంస్థలో పూర్వికులకూ, వారిసంతానంతో వైవాహిక సంబంధము ఉండటానికి అవకాశం లేదు. ఆ నాటి వైవాహికమంటే కేవలమూ రతీత్యాదులు మాత్రమే - కేవలమూ కామోపభోగము. ఇటువంటి స్థితిలో అన్నకు చెల్లెలు భార్య కావచ్చును. అక్కకు తమ్ముడు భర్త కావచ్చును. ఈ విధమైన వైవాహిక పద్ధతిని నిరూపించే జాతి నేటి ప్రపంచంలో ఎక్కడా కనిపించటం లేదు. అయితే ఇటువంటి వివాహ క్రమము ఒకానొక కాలంలో తప్పకుండా ఉండి ఉంటుందని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడినారు. తరువాత కాలంలో అన్నదమ్ముల మధ్యా అక్కచెల్లెళ్ళ మధ్యా ఉండే ప్రణయాన్ని అరికట్టినారు. క్రమంగా పినతండ్రి పెత్తండ్రి బిడ్డల మధ్యా, పినతల్లీ పెత్తల్లి బిడ్డల మధ్యా ఉండే వైవాహిక సంబంధం కూడా తొలగిపోయింది. అందు మూలంగా అన్నదమ్ములు ఒక సంసారానికి సంబంధించినవాళ్ళూ, అక్కచెల్లెళ్లు ఒక సంసారానికి సంబంధించినవాళ్ళూ అయినారు. ఈ సంబంధం ఏకోదరులు విషయంలోనే కాదు - వేలు విడిచినవారైనా సరే - మరికొంత దూరమైనా సరే. ఈ విధంగా తరువాతి కాలంలో సంసారాలు ఏర్పడ్డవి. ఇటువంటి సంసారాలను శాస్త్రజ్ఞుడు మోర్గన్ 'పునలీయన్ సంసారా' అన్నాడు.
పునలీయన్ సంసారాలలో ఎన్ని మార్పులతోనైనా వివాహం జరగటానికి అవకాశమున్నది. కాని ప్రధానంగా ఒక కులంలోని స్త్రీలందరూ జన్మతః ఆ కులంలోని పురుషులందరికీ భార్యలై ఉంటారు. అయితే వారి సంబంధము సోదర సోదరీ సంబంధము కాకూడదు.
ఈ సంసారాలలోని వివాహ విధానాన్ని పరిశీలించి చూస్తే ఏర్పడే సంబంధ బాంధవ్యాలు ఈ క్రింది విధంగా ఉంటవి. రామన్న అమ్మ చెల్లెలి బిడ్డలందరూ రామన్న తల్లి బిడ్డలు. రామన్న తండ్రి తమ్ముని బిడ్డలందరూ రామన్న తండ్రి బిడ్డలు. రామన్న పినతల్లి భర్తలందరూ రామన్న తల్లికి భర్తలు. రామన్న తండ్రి తమ్ముని భార్యలందరూ రామన్న తండ్రికి భార్యలు.
అన్న తమ్ముళ్ళకూ, అక్కచెల్లెళ్ళకూ మధ్య వైవాహిక సంబంధం నిషేధితం కావటంతో, మానవజాతి వైవాహిక విధానంలో మరొక మార్పు వచ్చింది. ఈ మార్పు రెండు విధాలుగా రూపొందింది.
1
'పునలియన్' వివాహ విధానాన్ని అనుసరించి ఏర్పడ్డ కుటుంబాలు రెండు
రకాలని వెనుక గుర్తించాము. వాటిలో ఏకగర్భాన పుట్టడం వలన పితృ సంబంధంగా
సహోదరత్వమూ, మాతృసంబంధముగా సహోదరత్వమూ ఏర్పడ్డది. వారందరికీ ఒక
తల్లి ఉంటుంది. ఆమె మూలముగా అక్కచెల్లెళ్ళు కాదగినవారు నియమితులౌతూ
ఉంటారు. వీరికి భర్తలు ముఖ్యంగా 'అన్నదమ్ములు' కాదగినవారిలో ఉంటుంటారు.
అందువలన మగవారు తల్లికి సంబంధించి ఉండటానికి వీలు లేదు. అందువల్ల
వారు తల్లి కూటమికి సంబంధించరు. అదే రీతిగా కులంలోని స్త్రీ సంతానం తండ్రి
కూటమికి సంబంధించి ఉండదు. ఈ విధంగా తల్లి జాతి తండ్రి జాతి వేరైనారు.
ఈ పునలీయన్ వివాహ విధానము క్రమక్రమంగా ఒక పురుషుడు ఒక స్త్రీతో తాత్కాలికంగానో, మరికొంత కాలంగానో వైవాహిక బంధం కలిగి ఉండే అవకాశానికి దారి తీసింది.
వివక్షారహిత కామోపభోగాన్ని అనుభవించే కాలంనుంచి పునలియన్ వివాహం అమలులోకి వచ్చే కాలంలో మానవజాతిలో గుంపు పెళ్ళిళ్ళు (Group Marriages) జరిగినవి. ఈ వివాహ విధానాన్ని అనుసరించి ఆ జాతులలోని స్త్రీ పురుషులు యావన్మందీ రెండు కూట బాహ్య కుటుంబాలుగా (Exogamous Families) విభజన పొంది ఉంటారు. ఒక కుటుంబంలోని వారు, స్త్రీలు యావన్మందీ, జన్మతః రెండవ కుటుంబంలోని పురుషులకు వివాహ సంబంధం వహించవలసిన వారై ఉంటారు. అదే రీతిగా అవతలి కుటుంబంలోని స్త్రీలందరూ ఇవతలి కుటుంబంలోని పురుషులు యావన్మందికీ పుట్టుకతోనే భార్యలై ఉంటారు. బృంద వివాహ విధానంలో ఇది ప్రాథమిక స్థితి. ఇటువంటి స్థితి ఆస్ట్రేలియాలో ఈ నాటికీ కనిపిస్తుంది.
దక్షిణ ఆస్ట్రేలియాకు సంబంధించిన మౌంట్ గాంబయర్ దగ్గిర నివసించే నీగ్రో జాతిలో ఈ ప్రాథమిక బృందవివాహం (Group Marriage) స్థితి కనిపిస్తున్నది. ఈ నీగ్రోజాతిలోని స్త్రీ పురుషులు యావన్మందీ క్రొక్కీ, కుమైట్ అనే రెండు కుటుంబాలుగా విభజన పొంది కనిపిస్తారు. క్రొక్కీలు క్రొక్కీలతో కామ సంబంధము, (వైవాహిక సంబంధము) కలిగి ఉండరాదు. కుమైట్లతో వారు వివాహం చేసుకోవచ్చును. అంటే కామ సంబంధము నెరపవచ్చునన్న మాట. అదే రీతిగా కుమైట్లు క్రొక్కీలతో వైవాహిక సంబంధము నెరపవచ్చును. వారిలో వారికి వైవాహిక వ్యాపారాలు పనికిరావు.
అంతేకాదు, పుట్టుక చేతనే క్రొక్కీ జాతిలోని మగవానికి కుమైటు జాతి స్త్రీ భార్య;
కుమైట్ జాతి స్త్రీకి క్రొక్కీ జాతి పురుషుడు భర్త. అందరు క్రొక్కీలూ, అందరు కుమైట్లనూ
అందరు కుమైట్లూ అందరు క్రొక్కీలనూ వివాహమాడతారు.
ఈ వివాహ విధానము మధ్య ఆస్ట్రేలియా అనాగరక జాతుల్లోనూ కనిపిస్తున్నది. ఈరీ సరస్సుప్రాంతంలోనూ, డార్జిలింగ్ నదీ ప్రాంతాలనూ అక్కడక్కడా ఇటువంటి వైవాహిక విధానంతో నివసించే జాతులు నివసిస్తున్నారు. న్యూ సౌత్ వేల్సుకు సంబంధించిన 'కుమిలాఠాయ్' జాతివారు అనాది కాలంలో తల్లి కుటుంబము తండ్రి కుటుంబము అనే రెంటిని నాలుగు విభాగాలుగా చేసుకున్నారు. ఇందులో మొదటి రెండు విభాగాలవారు పుట్టుకతోనే భార్యాభర్తృ సంబంధం కలవాళ్ళు. తల్లి సంబంధాన్ని బట్టి వారి సంతానము 3వ విభాగానికీ 4వ విభాగానికి చెందుతుంటారు. 3,4 విభాగాల సంతానం వారిలో వారు వివాహం చేసుకుంటారు. వివాహానంతరము 3, 4 విభాగాలకు సంబంధించిన వారు, వారి వారి తల్లి హక్కును అనుసరించి తల్లి వంశంలో చేరుతుంటారు. ఈ పద్ధతిని అనుసరించి ఒక తరానికి సంబంధించిన అక్క చెల్లెళ్ళ మధ్యనూ, అన్నదమ్ముల మధ్యనూ సంతానప్రాప్తి పనికిరాదు. అంటే వైవాహిక బంధము నిషేధిత మన్నమాట. వీటినుండి క్రమ క్రమంగా తల్లిని ఆధారం చేసుకొని కొందరు మూల స్త్రీలు (Women Ancestors) ఏర్పడినారు. వారి మూలంగా కొన్ని కుటుంబాలు ఏర్పడినవి.
కొన్ని మధ్య ఆస్ట్రేలియా జాతులలోని వివాహ విధానము పరిశీలిస్తే ఒకానొక కాలంలో ఆయా జాతుల్లో బృంద వివాహమున్నట్లు అర్థమౌతుంది. ఈరీ సరస్సు ప్రాంతంలోని జనంలో వివాహం రెండు విధాలుగా ఉంటుంది. 1. టిప్పు ముల్కు వివాహము 2. పిర్రారు వివాహం.
టిప్పు ముల్కు వివాహము వ్యక్తిగతము (Individual Marriage). ఈ వివాహ విధానాన్ని అనుసరించి ఒక వ్యక్తి ఒక భార్యతో కాపురం చేస్తాడు. 'పిర్రారు' వివాహ విధానంలో ఇద్దరు గాని, ముగ్గురు గాని అన్నదమ్ములు ఇద్దరిని గానీ, ముగ్గురిని గానీ అక్కచెల్లెళ్ళ వివక్ష లేకుండా వివాహం చేసుకుని అందరూ ఒక బృందంగా కాపురం చేస్తారు. ఇక్కడ అన్నలూ తమ్ముళ్ళూ ఏకగర్భజనితులు కానవసరం లేదు. ఒక భార్య భర్తను తనకు ఇటువంటివానిని పిర్రారుగా ఇవ్వమని అడగవచ్చును. ఒక స్త్రీకి పిర్రారు భర్తలు అనేకమంది ఉండవచ్చును. అదేవిధంగా ఒక పురుషుడికి పిర్రారు భార్యలు అనేకమంది ఉండవచ్చును. ఒక పురుషునికి ఒక స్త్రీగానీ, ఒక స్త్రీ ఒక
పురుషునికి గానీ పిర్రారు కావటము సంఘంలో వారికున్న స్థానాన్ని బట్టి ఉండదు.
అది జన్మతః వచ్చే ఆచారము. ఒక తడవ పిర్రారు అయినవాడు గానీ అయినది గానీ
నిరంతరమూ 'పిర్రారు' అయి ఉంటుంది.
టిప్పుముల్కు వివాహము వ్యక్తిపరము కావటం వల్ల స్త్రీ కావచ్చును, లేదా పురుషుడు కావచ్చును. టిప్పు ముల్కుకు గౌరవం విశేషము. 'టిప్పుముల్కు' భర్త భార్యను పిర్రారులకంటే అధిక గౌరవంతో చూస్తాడు. ఆమె సంతానాన్ని తన సంతానంగా భావిస్తాడు.. ఒక టిప్పుముల్కు భర్తను గానీ, భార్యను గానీ కాదని మరొక వ్యక్తికి ఏకకాలంలో టిప్పుముల్కు కావటానికి వీలు లేదు.
ఆస్ట్రేలియా జాతుల్లోని ఉరుబిన్నా వారి వివాహ విధానము ఒకానొక కాలంలో గుంపు పెళ్ళి ఉన్నట్లు నిరూపిస్తున్నది. ఆ జాతి భాషలో 'మియా' శబ్దానికీ తల్లి అనీ, జాతి తల్లి అనీ అర్థాలు. ఆ తరంలో వున్న స్త్రీలందరికీ ఈ పదాన్ని సమానంగా ఉపయోగిస్తారు. తల్లి జాతిలో వారందరూ ఒక వ్యక్తికి తల్లులు, వేరేజాతిలోని వారందరూ భార్యలు. కురై జాతిలో మరదలు (భార్య చెల్లెలుగానీ అక్కగాని న్యాయతః అతనికి భార్య అయినా అతని గుడిసెలో నిద్రపోరాదు. బ్రోగన్ జాతి వ్యక్తిని ఒక స్త్రీ భర్తని పిలిచినా భర్త, భార్య అని వ్యవహరించినా ఆమె ఇతర కులం ఇళ్ళలో తప్పకుండా నిద్ర చెయ్యాలి.
ఉరుబిన్నా జాతి ప్రతి మగవాడితోనూ ఒక 'నూప' ఉంటుంది. ఆమె భార్యకు అక్క చెల్లెళ్ళ వరుసలోనిది. ఆమె అతఃపూర్వం ఒకరిని వివాహం చేసుకొని ఉండవచ్చు. అయినా అంతమాత్రంతో ఆమె ఒక్కడినే వివాహం చేసుకున్నదనిగానీ, చేసుకోవలెనని గానీ చెప్పటానికి వీలు లేదు. మగవాళ్ళకు నూపలున్నట్లే ప్రతి స్త్రీ మరొక పురుషునికి భార్య పిరంగరు అయి వుంటుంది. 'పిరంగరు'గా ఆమె అనేకమందితో శరీర సంపర్కాన్ని పొందవచ్చు. దీనినిబట్టి తేలిన సారాంశమేమనగా ఉరుబిన్నా జాతిలో వ్యక్తిగత వివాహము ఆచారం మూలంగా గానీ, పేరుకు గాని లేదన్నమాట.
ఆస్ట్రేలియా అరుంటా జాతిలో వ్యక్తి వివాహమున్నా మగవాడు ఇతర జాతి -అది బహిష్కృత జాతి అయినా సరే - కాపురం కొన్ని సమయాలలో చేయవచ్చును.
ఆస్ట్రేలియాలోని అనాగరక జాతుల్లో కాకుండా కొన్ని నాగరక జాతుల్లోనూ ఇటువంటి వైవాహిక విధానం ఉన్నట్లు శాస్త్రజ్ఞులు పలుకుతున్నారు. సీజరు మహాశయుడు ఒక దేశాన్ని గురించి వ్రాసిన వ్రాతల్లో ఇలా అన్నాడు :
"వారి సాంఘిక జీవనవిధానం చిత్రమైనది. అన్నలూ తమ్ములూ, తండ్రులూ, కుమారులూ కలిసి పది పన్నెండు మంది భార్యా బృందంతో కాపురం చేస్తుంటారు.
మొదట ఆ స్త్రీని బృందంలోకి ఎవరు తీసుకొని వస్తారో అతనికి ఆమెవల్ల కలిగే
సంతానం లభిస్తుంది. ఇదే రీతిగా ఒక తంతువు ననుసరించిగానీ, ఆచారాన్ని
అనుసరించి గానీ ఒకరినొకరు వివాహం చేసుకోకుండానే అందరూ కలిసి ప్రణయ
సామ్యాన్ని (Sex Communism) పొందుతుంటారు” అని.
టిబెట్టు, సిక్కిమ్, బూటానులలో ముగ్గురు నలుగురు అన్నదమ్ములు కలిసి సమాన స్వామ్యలలో ముగ్గురు నలుగురు అక్కచెల్లెళ్ళను వివాహం చేసుకునే ఆచారం అమలులో ఉండేది. పెద్ద భార్య సంతానము పెద్దవానికీ, రెండవ భార్య సంతానము రెండవ వానికీ, మూడవ భార్య సంతానము మూడవ వారికీ, ఈ రీతిగా చెందుతుంది. ఇందులో ఎవరికైనా సంతానం లేకపోతే వాళ్ళ వాళ్ళ అనుమతిమీద పంచుకుండేవారు.
తోడాజాతిలో కుటుంబంలో పెద్ద కుమారుడు పెళ్ళి చేసుకుంటాడు. అతనికి అయిదారుగురు తమ్ములుంటే ఆ భార్య అందరినీ భర్తలుగా స్వీకరిస్తుంది. వారికి ఆమెతో కామ వ్యాపారము చేయగల వయస్సు లేనప్పుడు కూడా వారామెకు భర్తలే. వారు పెద్దవారయిన తరువాత ఆమె వారితో సంభోగ సంబంధాన్ని నెరపుతుంది. ఆ భార్యకు చెల్లెళ్ళుంటే వారు అక్క భర్తలకు న్యాయతః భార్య లౌతుంటారు. కులంలో ఆడవాళ్ళు తక్కువైనప్పుడు కొన్ని సమయాలలో అయిదారుగురు అన్నదమ్ములకు ఒకటే భార్యగా కూడా ఉంటుంది. ఇద్దరన్నదమ్ములకు ఇద్దరు భార్యలు సమస్వామ్యంతో కూడా ఉండవచ్చును.
లంకలో క్రీ.శ. 1818లో ఒక చట్టం జరిగింది. దానిని అనుసరించి ఇద్దరు ముగ్గురు భార్యలు సమస్వామ్యంతో ఉండవచ్చునని తీర్మానమైంది.
సఖాలిన్ ద్వీపానికి సంబంధించిన గిల్సన్ జాతిలో కూడా ఒకానొక కాలంలో 'బృంద వివాహం' ఆచారంగా ఉన్నదని చెప్పటానికి తగిన ఆధారాలు కనిపిస్తున్నవి. 'ఈ నాటికీ వారిలో ఒక వ్యక్తికి అన్న భార్యలతోనూ, భార్య చెల్లెళ్ళతోనూ వైవాహిక సంబంధం కలిగి ఉండే స్థితి ఉన్నది. వారి జీవన విధానంలో సాంఘిక, ఆర్థిక, సామ్యం కనిపిస్తున్నది' అని ఏంజెల్సు మహాశయుడు అభిప్రాయమిచ్చి ఉన్నాడు.
వివక్షా రహితమైన కామోపభోగం ఉన్న కాలంలో ఏర్పడ్డ సంసారాల వల్ల బృంద వివాహ విధానము అమలులోకి వచ్చింది. అంతకంటే విశేష నాగరికతలను తెలియ పరిచే పునలియన్ వివాహ విధానానికి ఇది పూర్వ రూపము. అన్నదమ్ములు
ఒక కుటుంబానికి, అక్కచెల్లెళ్లు ఒక కుటుంబానికి చెందటమనే లక్షణం ఏర్పడ్డ
తరువాత జన్మించినది ఈ పునలియన్ వివాహ విధానము. గుంపు వివాహానికి
అటువంటి లోపం లేదు. ఒక కుటుంబంలోని స్త్రీలందరూ జన్మతః, మరొక
కుటుంబంలోని పురుషులకు భార్యలు. అదేరీతిగా కుటుంబములోని పురుషులందరూ
అవతలి కుటుంబములోని స్త్రీలకు భర్తలు.
బృంద వివాహ విధానాన్ని పరిశీలించి చూస్తే వివాహం గుంపుమీద జరుగు తున్నట్లు కనిపిస్తుంది. భార్యలు కాదగ్గ కులంలోని స్త్రీలు ఎంత దూర ప్రదేశంలోనైనా ఉండవచ్చును. అదేవిధంగా భర్తలు కాదగ్గ పురుషులు కూడా ఎంత దూర ప్రదేశాన్నైనా ఉండవచ్చును. ఒక పురుషుడు జన్మతః తనకు భార్య కాదగిన స్త్రీ దగ్గరికిపోయి నేను నీకు భర్తనని ఆమెతో భోగించవచ్చును. అదేరీతిగా ఒక స్త్రీ ఏ దేశంలో ఉన్నా జన్మతః భర్తృకుటుంబానికి చెందిన పురుషుని దగ్గరకు పోయి నీవు నా భర్తవని చెప్పి కామోపభోగాన్ని పొందవచ్చును.
ఈ వైవాహిక విధానం నేటి నాగరకుని దృష్టికి కలుషపూరితంగా కనుపించ వచ్చును. కానీ దీనిని గురించి ఒకానొక శాస్త్రజ్ఞుడు ఏమంటున్నారో గమనించవలసి ఉన్నది :
"వ్యభిచార గృహాలకు భిన్నమైన మార్గాన్ని దర్శించలేని ఫిలిస్టయన్ జాతులలో ఉన్న వైవాహిక విధానం కంటే ఇది చెడ్డది కాదు. ఫిలిస్టయన్ జాతుల్లోని వ్యక్తి బహిరంగంగానూ, గూఢంగానూ అనుభవించే కామోద్రేక జీవిత విధానం బృంద వివాహవిధానాన్ని అనుసరించే వ్యక్తులలో కనుపించదు. నేడు బృంద వివాహ విధానం లేదు. లోకంలో దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు మాత్రం ఆచారంగా వస్తున్నవి. వాటిని బట్టి చూస్తే అవి కేవలం దాంపత్య వివాహాల కంటెనూ, బహుపత్నీత్వ విధానం కంటెనూ, కొంచెం భిన్నంగా మాత్రమే కనిపిస్తవి. పూర్వం బృంద వివాహం ఉన్న జాతుల్లో కొన్ని సందర్భాలలో స్వేచ్ఛా సంభోగము మాత్రం కనిపిస్తుంది. ఈ హక్కు జన్మతః కలగటం చేత అది అనూచానంగా వస్తున్నది. ఈ ఆచారము క్రమక్రమంగా మాసిపోతున్నది. బృందవివాహ విధానము ఏ నాటికైనా నశించి తీరవలసినదే అయినా అది వివాహ పరిణామస్థితిని తెలియపరిచే ఒకానొక విధానము.”
పై శాస్త్ర కర్త అభిప్రాయపడినట్లే బృంద వివాహమును బహిరంగంగా చూసే వ్యక్తికి ఇది పట్టింపు విశేషంగా లేని దాంపత్య వివాహం గానో, లేక అనిబద్ధ ఏకపత్నీ
వివాహము ఇంత కంటే ఏకగామిత్వము అంటే బాగుంటుంది - (Monogamy)
గానో కనిపిస్తుంది. అక్కడక్కడా బహుపత్నీత్వము కూడా ఉన్నట్లు తోస్తుంది. కొన్ని
సందర్భాలలో వైవాహిక ధర్మానికి మోసకారులు (Infidels) కనిపిస్తారు.
ఇటువంటి తికమక ఉండటము వల్లనే అనేక దేశాలలో బృందవివాహ లక్షణాలను చూచి శాస్త్రజ్ఞులు మోసపోయినారు. ఎర్నెస్టు క్రాలే మహాశయుడు ఆస్ట్రేలియా జాతుల్లోకి నూపా, పిర్రారు భార్యలను జూచి అది బహుభార్యాత్వ లక్షణముగాని, బృంద వివాహ లక్షణము కాదనినాడు. పిర్రంగులకు జరిగే బృంద వివాహాన్ని కొందరు కాముక స్వేచ్ఛ (Sexuallicence) గా పరిగణించారు.
ఆస్ట్రేలియా జాతుల్లో కొన్ని పండుగలు వచ్చినప్పుడు యువతులను వివాహ యోగ్యలనుగా చేసే ఆచారం ఉన్నది. ఆ స్త్రీలలో వివక్ష లేకుండా కులంలోని పురుషులు అనుభవించటం వలన వారికి పరిణయ యోగ్యత కలుగుతుంది. ఈ ఆచారాన్ని చూచి శాస్త్రజ్ఞులు 'వివక్షారహిత కామము, (Promiscuity) బృందవివాహ లక్షణము అన్నారు. కానీ అది బృంద వివాహ లక్షణము గానీ, వివక్షా రహిత కామముగానీ కాదు. అది ఒక మతాచారము' అని కాలే అభిప్రాయపడినాడు. అంతేకాక ఆది అనే పాశ్చాత్య దేశాలలో మధ్యయుగం నాడు విశేష ప్రచారం ఉన్న ప్రభుహక్కుకు (Jusprimae noctis) ఆద్యంతమూ భిన్నమైనదని అభిప్రాయమిచ్చినాడు.
ఆస్ట్రేలియా డైరీ జాతిలో ఉన్న 'పిర్రంగు'ల విషయంలో ఒక నియమ మున్నది. ఆ నియమము అనేక జాతుల్లో కూడా ఉన్నది. భార్య అంటే, టిప్పుముల్కు, లేనప్పుడు మాత్రమే ఒక వ్యక్తి పిర్రంగుతో కాపురము చెయ్యవచ్చును. ఎటువంటి సందర్భములో నైనా ఆ వ్యక్తి పిర్రంగును భర్త దగ్గిరనుంచి బలాత్కరించి తీసుకోరావటానికి అవకాశం లేదు. ఈ 'పిర్రుంగు' ఆచారము ఒకానొక ఉపస్థితి (Initiation) ని తెలియపరుస్తుంది. భర్త లేనప్పుడు పిర్రంగుతో మరొకడు కాపురము చెయ్యటము కూడా బృంద వివాహ లక్షణాన్ని వ్యక్తపరుపదు. ఇది ఒకానొక కాలంలో దక్షిణ ఐరోపాలో ఉన్న సిసియేట్ (Ciciseate) వంటిదని ఆయన అభిప్రాయము.
ఈ లక్షణాలన్నీ గుంపుపెళ్లి లక్షణాలనీ, శాస్త్రజ్ఞులు ఒకానొక కాలంలో గుంపు పెళ్ళిళ్ళు ఉన్నవని ఎందుకు అంగీకరించటము లేదో తనకు అర్థము కావటము లేదనీ, అందువల్ల నేటి సభ్యజాతికి ఎటువంటి అగౌరవమూ ప్రాప్తించదనీ 'సంసారోత్పత్తి' రచయిత ఏంజెల్సు మహాశయుడి అభిప్రాయము. ఆస్ట్రేలియా జాతుల్లో యువకుడు చాలాకాలం అవివాహితుడిగా ఉండాలి. ఇది
అతని బ్రహ్మచర్యం కోసం కాదు, ఆ జాతి స్త్రీల కామతృప్తి కోసం. అతను త్వరగా
వివాహం చేసుకుంటే వివాహ ధర్మాన్ని విచ్ఛిన్నం చేసి అతను స్త్రీలతో స్వేచ్ఛగా వ్యవహరించటానికి వీలు ఉండదు. ఈ సందర్భంలో మరొక చిత్రమైన ఆచారాన్ని కూడా గమనించవలసి ఉంది. కొన్ని ఆస్ట్రేలియా జాతుల్లో వివాహ వయస్సు రాని కుర్రవాళ్ళకు పెద్దవాళ్ళనిచ్చి వివాహం చేస్తారు. వారిని కులంలోని పెద్దవాళ్ళు అనుభవిస్తుంటారు. వివాహిత అయిన భార్య మరొకరిని వివాహం చేసుకొనే అధికారం ఉండదు. అందుమూలంగా కులంలోని వృద్ధులైన పురుషులకు యౌవన వతులను అనుభవించే అవకాశం లభిస్తుంది. ఇటువంటి ఆచారాలు కూడా ఒకానొక కాలంలోని వివక్షారహిత కామాన్నీ, బృంద వివాహ లక్షణాలనీ తెలియపరుస్తున్నవని కొందరి అభిప్రాయము.
గుంపు వివాహ పద్ధతిలో ఎప్పుడూ సంతానానికి తండ్రి ఎవరో కనుక్కోటము చాలా కష్టము. తల్లి ఎవరో చెప్పటము చులకన. అయితే ఆ తల్లి తన బిడ్డలనే కాకుండా ఆ వంశంలో ఉన్న పిల్లలనందరినీ తన బిడ్డలుగానే స్వీకరించి వ్యవహరిస్తుంది. తల్లివలెనే వాత్సల్యాదికాలను చూపిస్తుంది. అయినా ఆమె తన పిల్లలమీద ఇతరులమీద కంటే విశేషమైన మమకారం చూపిస్తుంది.
వంశక్రమము బృంద వివాహాన్ని బట్టి మాతృపర మౌతుంది. వంశాలు స్త్రీ నామం మీదనే చెల్లుబడి ఔతుంటవి. సామాన్యంగా అన్ని అనాగరిక జాతుల్లోనూ పూర్వం ఇదేవిధానం ఆచరణలో ఉండేది. గౌరవార్హతలు తల్లులకు విశేషము. ఈ విశేషాన్ని ప్రప్రథమంలో గమనించిన శాస్త్రజ్ఞుడు జౌబన్ మహాశయుడు. వంశక్రమాన్ని తల్లిమూలంగా గుర్తించడంలో ఆస్తిపాస్తులు తల్లిపరమై ఉంటవి గాని అవి సమష్టి కుటుంబానికి చెందినవి. అందువల్ల అవిభాజ్యాలు.
గుంపు పెళ్ళి ఆచరణలో ఉన్న కాలంలో కూడా ఒకవిధమైన రాక్షస వివాహము (Marraiges by Capture) ఉండవచ్చును. ఏ యువకుడైనా ఒక యువతిని బలాత్కరించి తెచ్చినా, చుట్టిముట్టి అనేకమంది మిత్రులతోనూ బంధువులతోనూ కలిసి ఎత్తుకోవచ్చినా, ఆమెను అపహరించటానికి సాయం చేసిన వారందరితో బాటు కొంతకాలం సమష్టిగా అనుభవించిన తరువాత ఆమె అతనికి ఆచార సమ్మతమైన భార్య ఔతుంది. అప్పుడు ఆమె భర్తల వంశంలోదిగా పరిగణిత ఔతుంది. వారిలో వారికి బాంధవ్యాలు ఏర్పడు తుంటవి. గుంపు పెళ్ళి విధానం అమలులో ఉన్నా వ్యక్తులు జంటలు జంజోయిగా తాత్కాలికంగానో, మరికొంత అధిక కాలమో భార్యాభర్తలుగా కలిసి జీవిస్తుంటారు.
ఈ విధానంతో బాటు బహుభార్యాత్వమూ, బహు భర్తృత్వమూ కూడా బృంద వివాహం
ఉన్న జాతుల్లో ఉండవచ్చును. గుంపు పెళ్ళిలో ఉన్న రాక్షస వివాహము వల్లనూ,
బహుభార్యాత్వమూ, బహుభర్తృత్వము మూలాన బృంద వివాహం వెనుకబడిపోయి
ఉంటుంది.
గుంపు పెళ్ళి (బృందవివాహము) అత్యధమ జాతి వైవాహిక విధానాన్ని నిరూపిస్తున్నది. అంతకంటే ఉత్తమమైనది పునలీయన్ వివాహ విధానము. బృంద వివాహ విధానము ఆటవికులూ, దేశద్రిమ్మరులూ అయిన జాతి జీవిత విధానాన్ని వ్యక్తం చేస్తుంది. 'పునలీయన్' వివాహము కొన్ని కట్టుబాట్లు కలిగిన స్తిమిత జీవిత విధానాన్ని నిరూపిస్తుంది. మానవ జాతులలో ఆటవిక స్థితి పోవటంతో బృంద వివాహ విధానం నశించింది. కానీ ప్రపంచంలో ఇంకా కొన్ని కొన్ని అనాగరిక జాతుల్లో దాని లక్షణాలు మాత్రం జీర్ణ స్థితిలోనూ, భ్రష్ట రూపంలోనూ పొడకట్టుతూ ఉన్నవి.
(ఆంధ్రపత్రిక - 1948 సెప్టెంబరు 22)