వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/దేవీ నవరాత్రులు

వికీసోర్స్ నుండి

దేవీ నవరాత్రులు

"శివః శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి ।
అతస్త్వా మారాధ్యాం హరిహర విరించ్యాదిభి రషి
ప్రణంతుం స్తోతుం వా కథ మకృతపుణ్యః ప్రభవతి || "

(శివుడు శక్తితో కూడుకొన్నప్పుడే సృష్టించే శక్తి గలవాడౌతున్నాడు. ఆమె చేరనప్పుడు ఆ మహాదేవుడు కదలనైనా సమర్థుడు కాలేడు. అట్టి స్థితిలో ఏ పుణ్యం ఎరుగని నేను, బ్రహ్మవిష్ణు మహేశ్వరాదులైన దేవతల చేత సేవింపబడే నీకు ఎలా మ్రొక్కగలను? ఎలా నిన్ను స్తుతింపగలను?)

- శంకరాచార్య

నవరాత్రులు - ప్రాముఖ్యము

పరజాతుల బుద్ధి సంస్కారాలతో అణుమాత్ర ప్రమేయమైనా లేకుండా, సర్వతోముఖమైన జాతీయ జీవన వికాసాన్ని ప్రతిబింబింపజేస్తూ, నానా విధాలయిన కార్యకలాపాల మూలంగా సమష్టి జీవితాన్ని కాపాడి వృద్ధి పొందిస్తూ, సమైక్యతను, సమగ్రతను సంపాదిస్తూ, భారతీయుల సాంఘిక వైజ్ఞానికాది దృక్పథాలను నిరంతరం తీర్చిదిద్దుతూ, అనాది కాలం నుండి అతిశయమయిన ప్రాముఖ్యాన్ని వహించిన కొద్ది పండుగలలో 'దేవీ నవరాత్రులు' ఒకటి. వీటిని కేవలం నవరాత్రులని వ్యవహరించడం కద్దు. చైత్రమాసారంభం నుంచీ ఒక నవరాత్రులు (వసంత నవరాత్రులు), భాద్రపదశుద్ధ ప్రథమ నుంచీ ఒక నవరాత్రులు (గణపతి నవరాత్రులు), ఆశ్వయుజంలో ఆదిని జరిగే ఒక నవరాత్రులు (శరన్నవరాత్రులు) ఉన్నా, “నవరాత్రులు” అన్న వ్యవహారం కేవలం ఈ దేవీ నవరాత్రులకే రూఢమైంది. అన్నివిధాలా ఈ 'నవరాత్రాన్ని' భారతీయులు మకర సంక్రాంతి తరువాత ప్రముఖమయిన పండుగగా భావిస్తున్నారు.

నవరాత్రులు - వివిధ నామములు

ఆశ్వయుజ శుద్ధ ప్రథమ మొదలు దశమి వరకూ సర్వ వర్గాలకు చెందిన భారతీయులందరూ భక్తిశ్రద్ధలతో, మహోల్లాస విలాసాలతో జరుపుకునే ఈ పండుగలకు శరన్నవరాత్రులనీ, దేవీ నవరాత్రులనీ పేర్లున్నవి. సంవత్సరాత్మకమైన కాలచక్రములో ఆశ్వయుజ కార్తిక మాసాలలో ఏర్పడే శరదృతువుకు ప్రత్యేక ప్రాముఖ్యమున్నది. తమోగుణ ప్రధానమయిన వర్షఋతువు వెళ్ళిపోయి ఆకాశం మేఘరహితం కావడం వల్ల ఈ ఋతువులో చంద్రకాంతి మిక్కిలి తేజోవంతమయి విలసిల్లుతుంది. భూదేవికి (స్త్రీ) పురుషుడికీ పునస్సమాగమం చేకూరుతుంది. మహాలయ అమావాస్యతో అంతమయిన సంవర్తక క్రియ నుంచి బయటపడ్డ ప్రకృతి పునఃసృష్టికి పూనుకుంటుంది. పరమేశ్వరికి అంశావతారమయిన సరస్వతి నవమాసాలు మోసి నూతన సృష్టి అనే నవబాలను ప్రసవిస్తుంది. ఆ తల్లి నవ మాస గర్భధారణకు ప్రతీకలే ఈ నవరాత్రులు. జ్యోతిష శాస్త్ర దృష్ట్యా విశేష ప్రాముఖ్యమున్న శరత్తులో జరిగే పండుగలు కాబట్టి ఈ ఉత్సవాలకు 'శరన్నవరాత్రు'లన్న పేరు వచ్చింది.

సృష్టి, స్థితి, సంహారాలకు నియంతలైన మూలపురుషులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సరస్వతి, లక్ష్మి, దుర్గ (చండి, కాళి) మువ్వురూ వీరి శక్తులు. పరాశక్తి (ఆదిశక్తి, మహామాయ) అంశావతారాలైన వీరిని ప్రధానంగాను, కలాంశావ తారాలయిన బాల, లలిత, శ్యామలాదేవి దేవీ మూర్తులను సముచితంగానూ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన ఆదిశక్తిని పూజించటం ఈ నవరాత్రులలో జరగడం వల్ల ఈ పండుగలకు దేవీ నవరాత్రులన్న పేరు కలిగింది.

దేవీ స్వరూప నిరూపణము

సృష్టి స్థితి లయాలను సంపాదించగలిగేది శక్తి. ఈ శక్తి, ఆదిశక్తి, పరాశక్తి, విష్ణుమాయ, యోగమాయ, పరమేశ్వరి, రాజరాజేశ్వరి, ప్రకృతి, మూలప్రకృతి, శ్రీ మున్నగు నామాలతో వ్యవహరించబడుతున్నది. ఈ ఆదిశక్తి స్ఫురణ వల్లనే బ్రహ్మాది త్రిమూర్తులు 'సృష్టి, స్థితి, సంహారా’లను చేయగలుగుతుంటారు. ఈ జగదంబ దేవతల్లోనూ, మానవాది భూతకోటిలోనూ నానావిధమైన అంశ విభేదాలతో, నానావిధ నామ రూపాలతో వర్తిస్తుంటుంది. జీవులు, మానవులు, దేవతలు ఈ శక్తి ప్రేరణ వల్లనే సుఖ దుఃఖానుభవాలను పొందుతుంటారు. అందువల్ల ఈ పరదేవిని దేవమానవాదులందరూ పూజించి, సేవించి శక్తి సంపన్నులౌతుంటారు. ఈ ఆదిశక్తి పురుష రూప అని కొందరు, స్త్రీ రూప అని కొందరు చెపుతుంటారు. కాని దేవీ భాగవతంలో ఈ పరాశక్తి తనను ధ్యానించి దర్శనాన్ని అర్థించిన బ్రహ్మకు సాక్షాత్కరించి 'పురుషుడను నేనే, స్త్రీని నేనే, ఇరువురిలో భేదము లేదని ఎవడు తెలుసుకుంటాడో అతడు ధీశాలి' అని పలుకుతుంది. - మహాసరస్వతి - మహాలక్ష్మి - మహాకాళి

జగన్నియంతృత్వాన్ని లీలగా కలిగిన పరమాత్మ సృష్ట్యాది క్రియా కలాపాలను నిర్వర్తించడం కోసం ఆదిశక్తిని ఆధారంగా గ్రహించి, పురుష రూపంలో గాని, రూపంలో గాని అవతరించడం కలుగుతుంది. పురుష రూపంలో అవతరించినప్పుడు బ్రహ్మ, విష్ణు, రుద్రరూపాలను, స్త్రీ రూపంలో అవతరించినపుడు మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపాలను ధరించడం జరుగుతుంది. త్రిమూర్తులలో బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, విష్ణువు సత్త్వగుణ ప్రధానుడు, రుద్రుడు తమోగుణ ప్రధానుడు. త్రిశక్తులలో మహాసరస్వతి రజోగుణ ప్రధాన, బ్రహ్మీరూప, ఈమె ముఖ్యంగా జగదుత్పత్తి చేస్తుంది. జ్ఞాన సంచారాన్ని చేస్తుంది. విద్యాజ్ఞానాలకు అధిష్టానమైన ఈ తల్లి బుద్ధి, కవిత, మేధ, ప్రతిభ మొదలైన శక్తులను ప్రసాదిస్తుంది. వ్యాఖ్యా బోధల మూలంగా సమస్త సందేహాలను తీరుస్తుంది. ఈమె విచారణ కారిణి, గ్రంథకారిణి. మహాలక్ష్మి సత్త్వగుణ ప్రధాన.

దేవీపూజ - దిన సంఖ్య

దేవీపూజ భారతదేశములోనే కాక కొన్ని ఇతర దేశాల్లో కూడా ఏదో రూపంలో కనిపిస్తున్నది. కానీ ఆ దేశాల వారు భారతీయుల వలె దేవిని సమగ్ర రూపంలో భావించి, ధ్యానించి, దర్శించి పూజిస్తున్నవారు కారు. వారి పూజా విధానంలో జ్ఞాన విజ్ఞానాలు, లౌకికత - ఆధ్యాత్మికతలు, కామ నిష్కామములు, పరిపూర్ణ రూపంలో ప్రస్ఫుటితాలు ఐనట్లు కనుపట్టవు.

ఆదిశక్తి లోకవిద్రోహాన్ని తలపెట్టి, సాధుజన సంతాపాన్ని కలిగిస్తున్న కొందరు రాక్షసులను సంహరించడానికి స్త్రీ రూపంతో అవతరించింది. ఈ శ్రీదేవి మధుకైటభులను సంహరించడం కోసం, మహాలక్ష్మిగా అవతరించింది. మహిషాసురుణ్ణి సంహరించడం కోసం, మహాకాళిగా అవతరించింది. శుంభనిశుంభులను సంహరించడం కోసం మహాసరస్వతిగా అవతరించింది. ఇవికాక మరి ఆరు అవతారాలెత్తినట్లు దేవీ మాహాత్మ్యం వల్ల తెలుస్తున్నది. అవి శ్రీకృష్ణభగవానుని జన్మ సమయంలో కంసవధాప్రయత్నం కోసం నందుని ఇంట పుట్టి, కంసుడు సంహరింపబోయినప్పుడు అదృశ్యురాలైన మహా మాయావతారం, మహాక్రూరుడైన ఒక రాక్షసుణ్ణి వధించటం కోసం ఉదయించి, వధవేళ దంతాలను రక్తవర్ణం చేసుకున్న రక్తదంతి అవతారం, నూరేళ్ళ క్షామ మేర్పడ్డప్పుడు ప్రజల బాధలను తీర్చటానికి శాక ఫలాదులను ప్రసాదించిన శాకంభరి అవతారం, దుర్గుణ్ణి సంహరించటానిక ఎత్తిన దుర్గావతారం, మాతంగి అవతారం, అరుణుడనే రాక్షసుణ్ణి భ్రమరాల (తుమ్మెదల) సహాయంతో వధించిన భ్రామరీ అవతారం అన్నవి. దేవి మొత్తం తొమ్మిది అవతారాలు ఎత్తింది. ఈ నవావతారాలతో విలసిల్లిన తల్లిని నవాక్షరీ మహామంత్రంతో జపించాలి. ఈ నవావతారాలకు, నవాక్షర మహామంత్రానికి, శ్రీచక్రంలోని నవావరణలకూ, దేవిని నవరాత్రులు పూజించటానికి ఆధ్యాత్మికము, అంతరికమూ అయిన సంబంధం ఉంది.

తొమ్మిది దినాలు దేవీపూజ జరుపుకోలేని వాళ్ళు సప్తమి మొదలు మూడు రాత్రులు, పంచమి మొదలు ఐదు రాత్రులు, తదియ మొదలు ఏడు రాత్రులు. దుర్గాష్టమి మొదలు మహానవమిగా ఒక రాత్రి జరుపుకుంటారు.

దేవీ నవరాత్రులు - పూజా కల్పవిభేదాలు

దేవీ నవరాత్రులను శరదారంభంలోనే కాకుండా వసంతారంభంలో చైత్రశుద్ధ ప్రథమ నుంచి కూడా జరుపుకోవచ్చని నిర్ణయ సింధువు అను ధర్మశాస్త్ర గ్రంథము వల్ల తెలుస్తున్నది. వసంత శరత్తులు రెండూ నానారీతి వ్యాధులకు నిలయాలు కనుక వీటికి యమదంష్టికలని పేరు. అనగా యముని కోరలని యర్థము. ఈ కారణం వల్ల ఈ రెండు ఋతువులలోనూ దేవీనవ రాత్రులు జరుపుకోవాలని భాగవతం చెపుతున్నది. అయినా శరత్తులోని నవరాత్రులే దేవీనవరాత్రులుగా ప్రఖ్యాతి వహించాయి.

దేవీ పూజకు విధానాన్ని తెలియజేసే ప్రతిపదాది, నవమ్యాది, షష్ట్యాది, సప్తమ్యాది, అష్టమ్యాది, అష్టమీ, నవమీ కల్పాలనే ఏడు కల్పగ్రంథాలు ఉపాసకుల కోసం ఏర్పడ్డాయి. వీటిని అనుసరించి జరిగే దేవీ పూజ సాత్త్వికి, రాజసి, తామసి అనే ప్రధాన భేదాలతో ఉంటుంది. జపయజ్ఞాదులు, మాంసరహిత నైవేద్యాలతో కూడినది సాత్త్వికీ పూజ. జపయజ్ఞాలు లేక, బలులు, మాంస నైవేద్యములతో కూడింది రాజసిక పూజ. సురామాంసాది నైవేద్యాలతో చేసేది తామసిక పూజ. ఉపాసకుల గుణ, ప్రయోజనాలను బట్టి ఈ మూటిలో ఒక విధమైన పూజా విధానాన్ని అనుసరిస్తారు. సాత్వికతత్వం గల మహర్షులు మొదలైన వారు సాత్వికిని, రజఃప్రవృత్తి గల రాజులు, వీర పురుషులు రాజసిని, తమః ప్రవృత్తి గల రాక్షసులు, రాక్షసత్వం గలవారై తామసిని ఆదరిస్తుంటారు. ఎట్టి చిత్తవృత్తితో దేవిని పూజిస్తే అట్టి ఫలం కలుగుతుంది. కానీ సత్యపదార్థ తత్త్వం గోచరించడానికి, దేవీ శ్రద్ధ కలగడానికి శుద్ధ సాత్విక స్థితి (సాత్విక సాత్వికం) అత్యవసరం. మోక్షాపేక్ష గలవారికి సాత్వికమే సంశయ రహితమయిన మార్గం. దాక్షిణాత్యులు సాత్విక విధానాన్నే విశేషంగా ఆదరిస్తారు. ఉత్తర దేశంలో ముఖ్యంగా వంగదేశంలో దేవీపూజ అజమహిషాది బలులతో (మేకలు, దున్నపోతులు మున్నగునవి), సురాపానము, అశ్లీల సంభాషణము మొదలయిన కార్యకలాపాలతో ఉన్మత్తము, భీకరమై, రాజస తామస విధానాలను అనుసరించి జరుగుతుండేది.

ప్రతిపదాది కల్పోక్త పూజాపద్దతి

ప్రతిపదాది కల్పాన్ని అనుసరించి దేవీ పూజలు జరిపేవాళ్ళు, పాడ్యమి నాడు దీక్ష వహించి కలశస్థాపన చేసి దేవిని ఆవాహన చేస్తారు. వేదిక మీద దేవీ ప్రతిమలను నిలిపి కేశసంస్కారాది ద్రవ్యాలను సమకూరుస్తారు. విదియ నాడు కేశబంధన సేవ, తదియనాడు దర్పణ ప్రదానం, అలంకరణ ద్రవ్య సమర్పణం, చవితినాడు మధుపర్క సమర్పణం, పంచమినాడు షోడశోపచార పూజ చేస్తారు. షష్ఠినాడు సాయం సమయములో బిల్వతరుబోధన చేస్తారు. ఇది దక్షిణాయనం కనుక (దేవతలకు రాత్రి పూట కనుక) దేవతలు నిద్రావస్థలో ఉంటారు. రావణవధ సందర్భంలో దేవ విజయాన్ని కోరి బ్రహ్మ దేవీపూజ చేసినప్పుడు, పంచమినాడు కన్యకారూపంలో కనిపించి 'మర్నాడు బిల్వవృక్షం మీద నిద్రపోతున్న నన్ను మేల్కొల్పు'మని చెప్పింది. ఆ సంఘటనకు సూచకంగా బిల్వతరుబోధన నవరాత్రి పూజలో చేరింది. బిల్వతరువు వద్ద ఈ తంతు జరిగేటప్పుడు 'ఆ నాడు రావణవధార్థం, రామ విజయార్ధం నిన్ను మేల్కొల్పాడు. అలాగే షష్ఠినాడు నిన్ను నేను అకాలంలో మేల్కొల్పుతున్నాను' అంటారు.

తరువాత సప్తమి నాడు స్వగృహంలో షోడశోపచార పూజ చేస్తారు. అష్టమినాడు ఉపవాసముండి, సప్తమాతృకా సహితయైన దేవిని (అష్టశక్తి) పూజిస్తారు. నవమినాడు ఉగ్రచండ్యాది పూజలు గాని, మహాలక్ష్మి పూజలు గాని జరుపుతారు. ఈ నాటి హోమాదులతో, విశేష పూజాదులతో నవరాత్రి పూజ పూర్తవుతుంది. దశమినాడు ఉదయం గాని, సాయంకాలం గాని, దేవిని మంగళ వాద్యాలతో ఊరేగిస్తూ వెళ్ళి నదీ జలాల్లో నిలిపివస్తారు. దీనినే దేవీ ప్రస్థానము, మహాపూజ, గౌరమ్మ నీళ్లట అని అంటారు. మనవారు ఆదిశక్తిని కన్యకగా భావించటం వల్ల ఈ నవరాత్రులలో నిత్యం కన్యకలను పూజిస్తారు. కొందరు సుమంగళీ పూజలు కూడా చేస్తారు.

మూడు రాత్రుల పూజ

దేవిని మూడు రాత్రులు మాత్రమే పూజించేవారు. మూలా నక్షత్రయుక్తమైన సప్తమినాడు కలశ స్థాపనాదులు చేస్తారు. ఆ నాడు సరస్వతీ పూజ జరిపిస్తారు. సరస్వతీ పూజను అష్టమినాడు, నవమినాడు చేయడం కూడా ఉన్నది. అష్టమి దుర్గా పూజకు, నవమి లక్ష్మీపూజకు ప్రధానంగా ఉద్దేశింప బడతవి.

మహా నవమినాడు ధనధాన్యాది వస్తురూపంలోనూ, కంచరం, కమ్మరం, కుమ్మరం, వ్యవసాయం మొదలైన వృత్తుల సాధనాల రూపంలోను మహాలక్ష్మి పూజ ఎట్టి విభేదాలు లేకుండా చేస్తారు. ఆ నాడు నానాజనం శక్తి కొద్దీ జాతరలు చేసుకుంటారు. ఆ నాడు మొదలు ఈ నాటి వరకూ చక్రవర్తులు, రాజులు, జమీందారులు మహానవమి నాడు లోహాభిసారిక అనే తంతు నడిపించేవాళ్ళు. పూర్వం లోహుడనే రాక్షసుడు లోకభీకరుడై దేవతల మీదకి దండెత్తి వస్తే దేవి సహాయంతో వాణ్ణి ముక్కలు ముక్కలుగా త్రుంచి వేశారట. ఆ లోహపు ముక్కలే నేటికీ ఆయుధాలకు ఉపకరిస్తున్నాయి. శస్త్రోపజీవులైన క్షత్రియులు నవమి నాడు పై వృత్తాంతానికి స్మృతిగా లోహాభిస్మారమనే చిత్ర క్రియను చేసి ఛత్ర, చామర, సింహాసన, కనకదండాది రాజలాంఛనాలనూ, చాపఖడ్గాది ఆయుధాలను పూజిస్తారు. దీనికే 'ఆయుధ పూజ' అని నామాంతరము.

నవరాత్రులు - లౌకిక ప్రాముఖ్యము

ప్రాచీన కాలంలో చక్రవర్తులు జరిపించే ముఖ్యనగరంలోని నవరాత్ర్యుత్సవాలకు దేశంలోని సామంతులు నలమూలల నుంచీ వస్తూ తమ ప్రాంతంలోని వేదశాస్త్ర విద్వాంసులను, సంగీత నాట్యాది కళావేత్తలను, మల్లురు మున్నగు బలవిద్యాప్రవీణులను ఇతర చిత్ర విద్యానిపుణులను వెంటబెట్టుకో వచ్చి సమ్రాట్టుకు సమర్పించేవారు. ఆయన నవరాత్రులలో ప్రతినిత్యం వారిని పరీక్షించి, సముచిత బహుమానాలిచ్చి సత్కరించేవాడు. వారి సంచారం విద్యాభివృద్ధికీ, కళాకౌశలాన్ని విస్తరింపజేయడానికి తోడ్పడుతుండేది. చక్రవర్తుల మార్గాన్నే సామంతులు, ధనికులు ప్రముఖోద్యోగులు అనుసరించేవాళ్ళు. ఇందువల్ల పాలకులైన వారికి వివిధ విద్యారంగాలను సమీక్షించి, దోహదమిచ్చి ప్రయోజనాత్మకంగా దేశశక్తులను ఏకోన్ముఖం చేయడానికి అవకాశం లభించేది. విద్వాంసులలో, ప్రజలలో అన్యోనమైత్రి, అవగాహన, పరస్పర సహన సహకారాలు, అభివృద్ధి పొంది, సమష్టి జీవనవిధానం వృద్ధి పొంది, ప్రగతిని సాధించడానికి వీలయ్యేది. ఇట్టి ప్రయోజనాలు నవరాత్రుల వల్ల ఆ నాడే కాక యీ నాడూ లభిస్తున్నవనటం నిస్సంశయం.

నవరాత్రులు - స్త్రీలు - బొమ్మల కొలువులు

దేవీ నవరాత్రులలో స్త్రీలు విశేషంగా ప్రముఖ పాత్ర వహిస్తూ వస్తున్నారు. ఒక వంక వీరు భర్తలతో పాటు కల్పోక్త పూజలలో పాల్గొంటూ, మరొకవంక జ్ఞాన విజ్ఞాన ప్రచారకమైన బొమ్మల కొలువును నిర్వహిస్తున్నారు. వీరి 'బొమ్మల కొలువు' బహుళార్థ సాధకమైన క్రియాకలాపం. ఇది ప్రధానంగా విజ్ఞానవంతులు గాని సామాన్య ప్రజలకూ, భావికాల సంస్కృతీపరిరక్షకులైన బాలలకు భారతీయుల సగుణ నిర్గుణ విభేదాలతో అనంతంగా విలసిల్లే దేవతా స్వరూపంతో ప్రథమ పరిచయం కలిగించడానికి ఉద్దేశింపబడింది. వేదాలకు పురాణాలు వాఖ్యానాలైనట్లు దేవతా స్వరూపానికి ఈ బొమ్మల కొలువులు వ్యాఖ్యలు. బ్రహ్మ శబ్దానికి వికృతి రూపమే బొమ్మ. ఈ బొమ్మల కొలువుల్లో విజ్ఞానవతులైన స్త్రీలు సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులను, వారి శక్తులను, వారి అంగదేవతలను నవ రసోచితంగానూ, స్థానోచితంగాను నిలుపుతారు. ప్రశ్నించినవారికి వయోవిజ్ఞాన విభేదాలను అనుసరించి వివరిస్తారు. ఈ కొలువులోను, వీటికి అనుబంధంగా సాగించే పేరంటాలలోనూ స్త్రీలు తొమ్మిదినాళ్ళూ సర్వస్వతంత్రలై శక్తి స్వరూపిణులుగా వ్యవహరిస్తూ తమ విద్యా సంస్కృతులను, సంగీత చిత్ర లేఖనాదులందలి కళాకౌశలాలను, అలంకరణలోని నర్మమర్మాలను, లోకజ్ఞతా క్రియాదక్షతలను ప్రదర్శిస్తుంటారు. ఇందుమూలంగా స్త్రీలలో పరస్పరానుబంధాలు, స్నేహ సౌహార్దాదులు వృద్ధి పొంది సంఘ పురోభివృద్ధికి దారి తీస్తవి.

నవరాత్రులు - బాలలు

శ్రీరామ విజయానికి చేదోడు వాదోడైన ఆంజనేయాది వానర వీరులకు ప్రతీకలైన కోతులను ఆడించుకుంటూ, విల్లంబులు చేపట్టి 'విజయీభవ దిగ్విజయీభవ' చెప్పుకుంటూ, 'అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పుబెల్లాలు' మొదలైన దసరా పద్యాలు చదువుకుంటూ భారతీయ విద్యా సంస్కృతులను పరిరక్షించడానికి ఏర్పడ్డ మహాసైన్యంలోని బాలశాఖో అన్నట్లు ఈ నవరాత్రులలో బాలలు వీథివీథీ ఊరేగుతారు. తమ గురువులను సగౌరవంగా ఇండ్లకు తీసుకుపోయి ఏడాది పొడుగునా సాధించిన విద్యావిశేషాలను స్థూలారుంధతీ న్యాయాన తల్లిదండ్రుల ముందు ప్రదర్శించి, అయ్యవారికి వార్షికమైన కట్నాన్ని ఇప్పించి, చందన తాంబూల నూతన వస్త్రదానాది సత్కారాలు చేయించి సంతసిస్తారు. విజయదశమి నాటి సీమోల్లంఘనము, జమ్మికొట్టం మొదలైన కలాపాల్లో వీరి వర్తన చూస్తుంటే భారతజాతి సంస్కృతీ వీరతలు వీళ్ళ చేతుల్లో భద్రంగా ఉంటవనే విశ్వాసాన్ని పెద్దలకు కలిగిస్తూంటారు.

విద్వదోష్ఠులలోను, సంగీతాది సభలలోను పాల్గొంటూ విద్వాంసులు, కళాకారులు వార్షికాలను, పారితోషికాలను అందుకుంటూ సంచారం చేస్తుండడం వల్ల నవరాత్రులలో దేశం కళకళ లాడుతుంటుంది. దేవాలయాల్లో నానావిధ చిత్రవర్ణాలతో, మృణ్మయాదులతో దేవీరూపాలను దినానికొకరీతిగా కల్పన చేస్తుండటం వల్లనూ, హరికథా శ్రవణాదుల వల్లనూ అవి విజ్ఞాన నిలయాల వలెనూ, ప్రయోజనాత్మకమైన విలాస రంగాల వలెనూ విలసిల్లుతుంటవి. సామాన్య జనులు కొందరు మహిషాసుర మర్దని మొదలైన దేవీ రూపాలను ఆ తల్లి వాహనాలైన సింహ శార్దూల రూపాలను, రాక్షసరూపాల, వేషాలు ధరించి పగటి వేళ ఊరేగింపులు చేసుకుంటూ దేవీ కథలను ప్రదర్శించి, సాధారణ జనులు విజ్ఞాన విలాసాలకు తోడ్పడుతుంటారు. తమిళ కన్నడ దేశాలలో దేవీ వేషాలను మధ్య నిలుపుకొని, తారు పూసుకున్న రాక్షస విచిత్ర వేషధారులు పగటివేళ వీథుల విజ్ఞాన విలాసాలకు తోడ్పడు తుంటారు. భారతదేశమంతటా విస్తరించి ఉన్న ప్రధాన శక్తి పీఠాలు గల నగరాల్లో ఈ నవరాత్ర్యుత్సవాలను ప్రజలు వైభవోపేతంగా జరుపుకుంటూండటం కనిపిస్తుంది.

విజయదశమి - నామ హేతువులు

విజయదశమి దేవీ నవరాత్రులకు కిరీటం వంటిది. ఈ పండుగకీ పేరు రావటానికి పురాణాలు, వ్రత గ్రంథాలు, జనశ్రుతి (ట్రెడిషన్) అనేక కారణాలను చెపుతున్నవి. రావణ వధ నవమినాడు జరిగింది కనుక కృతజ్ఞతా ప్రకటన కోసం దేవతలు దేవీ విజయోత్సవాలు దశమి నాడు చేశారనీ, తత్సూచకంగా దేవీ నవరాత్రుల నెంటనే వచ్చే శ్రవణంతో కూడిన దశమి విజయదశమి అయిందని ఒక అభిప్రాయం. పాండవ యోధుడైన అర్జునుడు ఉత్తర గోగ్రహణ యుద్ధంలో భీష్మద్రోణాది వీరుల మీదికి వెళ్ళి ఈ దశమి నాడు విజయం పొందడం, విజయదశమి. దేవి మహిషాసురుణ్ణి వధించినపుడు ఈ దశమి నాడు దేవతలు విజయోత్సవం జరపటం వల్ల విజయదశమి అనీ, దశమినాడు జైత్రయాత్రకు బయలుదేరిన రాజులకు విజయం తథ్యం కనుక విజయదశమి. అశ్వయుజ శుద్ధ దశమి నాటి శ్రవణా నక్షత్రోదయ సమయానికీ 'విజయ' అన్న జ్యోతిషశాస్త్ర సాంకేతిక వ్యవహారం ఉండడం వల్ల అటువంటి 'విజయ'తో గూడిన దశమి విజయదశమి. నవమాస గర్భధారణకు సంకేతకంగా నవరాత్రులు చేసి దేవి నూతన సృష్టిని కల్పించడంలో దశమి నాడు విజయాన్ని పొందింది కనుక విజయదశమి. విశ్వజిద్యాగం చేసి మృణ్మయ పాత్రతో మిగిలిన రఘువు దగ్గరకు వరతంతు మహాముని శిష్యుడయిన కౌత్సుడు గురుదక్షిణ కోసం (పదునాలుగు కోట్ల బంగారు నాణెములు) యాచించటానికి వచ్చి, ఆ మహారాజు రిక్తహస్తుడని గుర్తించి వెళ్ళబోతున్నప్పుడు, ఆయన అతణ్ణి ఆపి స్వర్గం మీదికి యుద్ధయాత్రకు బయలుదేరడానికి ఉద్దేశించాడు. మరుక్షణంలోనే కుబేరుడు రఘుమహారాజు కోశాగారంలో కనక వృష్టి కురిపిస్తే కౌత్సుడు అందులో తనకు కావలసినంత ద్రవ్యాన్ని తీసుకొని, మిగిలినది ఈ రఘుమహారాజ ధార్మిక విజయ విలాసంగా నవరాత్రులు గడిచిన మరునాడు ప్రజలకు పంచి యివ్వటం వల్ల, శ్రవణ నక్షత్రయుక్త దశమి విజయదశమి అయినదనీ అనేక రీతులుగా విజయదశమి నామానికి కారణాలను చెప్పుకోవటం జరుగుతున్నది. ఇలా అనేక మహత్తర విజయాలకు స్మృతి చిహ్నమైన విజయదశమి చేరటం వల్ల 'నవరాత్రము' దసరా (దశరా) అయినది.

విజయదశమి - ఉత్సర్జనోత్సవము

నవమినాటి రావణవధానంతరం దేవిని మహోత్సవాలతో స్వర్గానికి పంపించారు కనుక నేడు కూడా నవరాత్రులలో పూజించిన దేవికి విజయ దశమినాడు వీడ్కోలివ్వటం (ఉత్సర్జనోత్సవం) జరుగుతున్నది. ఈ ఉత్సర్జనోత్సవాన్ని శాబరోత్సవంగా జరిపించాలని, అలా చేయటం దేవికి ఎక్కువ ప్రియమనీ కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నవి. శబరుల వలె ఆకులలములు కట్టుకుని, భేరి పటహాది వాద్యాలను మ్రోగించుకుంటూ, శంఖాలు కొమ్ములు ఊదుతూ, ఆశ్లీలాలు పలుకుతూ, అసభ్య గానాలు చేస్తూ ఒకరి మీద ఒకరు బురద, బూడిదలు చల్లుకుంటూ దేవిని పంపించటం శాబరోత్సవానికి ముఖ్య లక్షణాలు. బురద చిమ్ముకోవటం, బూతులు మాట్లాడడం లేకపోతే దేవి తృప్తిపడదట. అణచిపెట్టిన క్షుద్ర లైంగికాభిలాషను (లోయర్ సెక్స్ డిజైర్స్) ఈ రూపంగా బయట పెట్టి, తృప్తిని పొంది, చేతనకు కలిగే నైజావరోధాలను తొలగించుకునేందుకు ఈ శాబరోత్సవమూలంగా మన పూర్వులు చక్కని అవకాశాన్ని కల్పించినట్లు కనిపిస్తుంది.

విజయదశమి - ఆచారాలు

విజయదశమినాడు సీతారాములను పూజించాలి అని నారద పురాణం చెబుతున్నది. దేవి పూజలు లేని ఉత్తర దేశంలోని కొన్ని ప్రాంతాలలో దీనిననుసరించి 'రామలీల' వంటి ఉత్సవాలను జరిపించడం ఆచారమైనట్లు కనిపిస్తుంది. గొప్ప ఊరేగింపులో రావణ కుంభకర్ణుల పెద్ద బుట్టబొమ్మలను విశాలమైన మైదానానికి తీసుకువెళ్ళి తగులబెట్టి ధర్మ ద్రోహులను, సాధుజన శత్రువులను హతమార్చినట్లు ఆ ప్రాంత ప్రజలు ఆనందిస్తారు. ఊరేగింపులో ఏనుగుల మీద సీతారామ లక్ష్మణుల వేషాలు ముందు నడుస్తుంటవి. ఈ ఉత్సవం వీరగుణ సూచకం కనుక, రామలీలల్లో కాళికా వేషధారులు చిత్రవిచిత్రంగా కత్తికటారులను త్రిప్పుతూ తమ శస్త్రవిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించి పాలకుల వల్ల పారితోషికాన్ని పొందుతారు.

గ్రహానుకూల్యం ఉన్నా లేకపోయినా పరదేశాలకు వెళ్లదలచుకున్న వాళ్ళు బయలుదేరటం మరొక ఆచారం. రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో దేవీ నవరాత్రుల లోను విజయదశమి నాడు, దేవీ విగ్రహాన్ని కాకుండా ఖడ్గాన్ని పూజిస్తారు. తామసిక పూజ చేసేవాళ్ళు విపరీతంగా మద్యపానం, జంతుబలి చేస్తారు. వంగదేశంలో ఈ నాటి సంబరాలు అతిభీకర రూపంలో సాగేవి.

విజయదశమి - బలనీరాజనోత్సవము

విజయదశమి ప్రధానంగా క్షత్రియుల పండుగ. అందువల్ల మహారాజులు, రారాజులు గజతురగ భటాది సైన్య బలాలన్నిటినీ ఈ విజయదశమి నాడు పర్యవేక్షించి, ప్రశంసించి, నీరాజన మిస్తారు. రావణ వధానంతరం దేవి ఈ దశమినాడే స్వర్గానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు దేవసేనకు నీరాజనమిచ్చాడట. అందువల్ల జైత్రయాత్రా సందర్భాల్లో బలనీరాజనోత్సవం చేయటం క్షత్రియులకు ఆచారమైంది. విజయదశమి నాడు జైత్రయాత్రా సూచకంగా సీమోల్లంఘనం చేయటం జరుగుతుంది. కనుక రాజులు ముందుగా బలనీరాజనోత్సవం జరిపించేవారు. కృష్ణ దేవరాయాది విజయనగర సార్వభౌములు ఈ ఉత్సవాన్ని ఘనవైభవంగా చేసినట్లు నిదర్శనాలు కనిపిస్తున్నవి. చక్రవర్తి మూలబలాన్ని ముఖ్యనగరంలో జరుగుతున్న నవరాత్ర్యుత్సవాలలో పాల్గొనటానికి వస్తూ సామంతులు వెంట తెచ్చిన సైన్యాలను బారులు తీర్చి మహానవమి వేదిక ముందు నిలిపితే ప్రతిశ్రేణి ప్రధాన గజాన్నీ, ప్రథనాశ్వాన్ని, ప్రధాన భటుని ఆ శ్రేణుల అధిపతులను చందనాదులతో అలంకరించి, మాలలు వేసి చక్రవర్తి స్వయంగా నీరాజన మిచ్చేవాడట. ఆ శ్రేణులలోని ఇతర గజాశ్వాదులను చక్రవర్తి సన్నిహిత బంధువులు, ముఖ్యోద్యోగులు ఇలాగే పూజించి నీరాజన మిచ్చేవాళ్ళు. ఈ నీరాజనోత్సవంలో దేశం నలుమూలల నుంచి రప్పించబడ్డ నాట్యకత్తెలు సైతం పాల్గొనేవారు. ఇట్టి విచిత్ర దృశ్యాలతో కూడిన విజయదశమి నాటి విజయనగరాన్ని విభ్రాంతితో తిలకించిన పియజ్ అనే విదేశీయాత్రికుడు 'ఇది స్వప్నమా! మిథ్యాకల్పనమా! మృణ్మయమైన భూమి మీద ఇటువంటి సౌందర్యం ఎక్కడ ఉంటుం!' దని మెచ్చుకున్నాడు. ఈ బలనీరాజనోత్సవం రాజభక్తిని, దేశభక్తిని, ధర్మ రక్షాసక్తిని సైన్యంలో పెంపొందించింది. దీన్ని కన్నుల పండువగా చూచిన ప్రజకు సమీకృతమైన దేశభక్తి అర్థమైనది. వారికి మనం శక్తిమంతులము, అజేయులం అన్న భావాలు హత్తుకుని మనోధైర్యాన్ని, హృదయశాంతిని లభింపజేశాయి.

విజయదశమి - అపరాజితా పూజనము

విజయదశమి నాటి కర్తవ్యాలు అపరాజితాపూజనము, శమీ పూజ, సీమోల్లంఘనములు. అపరాజిత (పరాజయము లేనిది) ఋగ్వేదార్య దేవత. కౌటిల్యుడు ఈమెకు అప్రతిహత (అడ్డు లేనిది) జయంత (విజయశీలము గలది) వైజయంత (జయము నిచ్చునది) అనే మువ్వురు క్షాత్రదేవతలను తోడుచేసి, జైత్రయాత్ర సందర్భాల్లో వీరిని పూజించి తీరాలని నియమ మేర్పరిచాడు. బహుకాలం నుంచి రాజులు ‘విజయ’ నామంగల దశమి నాడే రుద్రప్రియ అయిన అపరాజితను పూజించటం ఆచారంగా వచ్చింది. పూజ ముగిసిన తరువాత పసుపుగుడ్డలో గరిక, ఆవాలు పెట్టి వలయంగా చేసి 'అపరాజితా! నీవు లతలలో ఉత్తమమయిన దానివి. సకలార్థ సిద్ధి కోసం నిన్ను ధరిస్తున్నా' నని చెప్పి దానిని కుడిచేతి దండకు కట్టుకోవడం ఆచారం. అపరాజిత కాళిదాసు కాలంలో ఒక మూలికగాను, తరువాతి కాలంలో విష్ణు క్రాంత, చంద్రక్రాంతగానూ మారి, చివరకు మరుగుపడింది. చివరికీ శబ్దం అగ్నిని పుట్టించే అరణికి మూలము అయిన శమీ వృక్షాన్ని వ్యక్తం చేయటం జరిగింది. అగ్ని వీరానికి, వైరానికి ప్రతీక. ఆ అగ్నిని గర్భ మందు ధరించుట వల్ల పూజార్హతను పొందిన శమీ వృక్షాన్ని పూజించే సమయంలోనే తరువాతి కాలంలో రాజులు శమీపూజ చేశారు.

శమీపూజ - ఖంజరీటదర్శనము, సీమోల్లంఘనము

ఈ శమీపూజా సందర్భంలో శివ ప్రీతికరమైన ఈశాన్య దిక్కుకు వెళ్ళి అక్కడ ఉండే జమ్మిచెట్టుకు గొప్పు త్రవ్వి, నీరు పోసి, క్రింద స్థలశుద్ధి చేసి, అష్టదళ పద్మాన్ని నిర్మించి, దానిమీదికి దుర్గాదేవి మూర్త్యంతరమైన అపరాజితను, ఆమెకు అంగదేవత లయిన జయ విజయలను ఆహ్వానించి, అపరాజితకు, శమీదేవికి భేదం లేనట్లు పూజిస్తారు. పూజ వేళ 'శ్రీరామ పూజితా! శమీ! నా జైత్రయాత్రను నిర్విఘ్నంగా కొనసాగించు’ ఆమెను 'నీవు అర్జునుని బాణాలను ధరించిన దానవు; రామచంద్రునితో ప్రియమైన మాటలు పలికిన దానవు' అని స్తుతిస్తారు.

శత్రు విజయం కోసం, కార్యార్ధ సిద్ధికోసం, దేశాంతర యాత్ర కోసం విజయదశమి నాడు సీమోల్లంఘనం చేయవలెనని శాస్త్రం చెప్పింది. సీమోల్లంఘనం శమీపూజకు పూర్వం గాని, తరువాత గాని ఎప్పుడైనా చేయవచ్చునని ఉన్నా తరువాత చెయ్యటమే ఆచారమైనది. ఈ పొలిమేర దాటటానికి ముందు ఖంజరీట దర్శనం చేయాలి. ఈ కాటుక పిట్ట, వర్షర్తువు వెళ్ళిన తరువాత ఆకాశం మేఘ రహితమయితేనే కాని బయటికి రాదు. దీని రాక యాత్రానుకూల్యాన్ని సూచిస్తుంది. కనుకనే యాత్రకు ప్రతీక అయిన సీమోల్లంఘన సమయంలో ఖంజరీట దర్శనం చేయవలసి వచ్చింది. ప్రాచీన కాలవిజ్ఞానానికి సూచకమయిన ఈ చర్య ఇంకా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నది.

పూర్వ రాజన్యులు అశ్వారూఢులై పరివార సైన్య సమేతంగా పొలిమేర దాటి, ధనుష్టంకారం చేసి, అక్కడ ధర్మవిద్రోహులు, లోక కంటకులు అయిన శత్రువులకు ప్రతిగా నిల్పిన బొమ్మల మీద బాణ ప్రయోగం చేసి వధను అభినయించేవారు. వీరి జైత్రయాత్రకు పరద్రవ్యాపహరణాసక్తిగాని, రాజ్యవిస్తరణ కాంక్ష గాని కారణాలు కావు. తిరిగి వచ్చేటప్పుడు వీరు శమీ వృక్షం మీదుగా వచ్చి, చిన్న కొమ్మను త్రుంచి శిరసు మీద ధరించి తెస్తూ తరువాత నగర ప్రవేశం చేసేవాళ్ళు. ఆలయాల్లోని దేవతామూర్తులు సైతం ఈ విజయదశమి నాడు భూత ప్రేత పిశాచాదులను అదుపులో పెట్టడం కోసం చేసే జైత్రయాత్రకు సూచకంగా సపరివారంగా సర్వసన్నాహాలతో, సీమోల్లంఘనాదులు చేయడం ఆచారంగా వస్తున్నది. ధర్మ విజయాభిలాషతో, ధర్మ ప్రచార దృష్టితోను చేసే యాత్రకు సూచకంగా యీ నాడు పీఠాధిపతులైన యతీశ్వరులు, ఇతరులు సీమోల్లంఘనం చేస్తారు. నానావిధ విద్రోహలను వెంటపడి పట్టుకోవడానికి సూచకంగా 'పారువేట' జరిగేది. ఈ పారువేట తంతులో బాగా బలిసిన గొర్రెకు తోక కోసి, క్రొత్త సున్నం పెట్టి, కోలాహలం చేస్తూ తరిమితే అది చిక్కకుండా పారిపోతు న్నప్పుడు పిక్కబలం కలవాళ్ళు వెంట పరుగెత్తి దానిని గెలుచుకుని పురస్కారాలను, పారితోషికాలను పొందటమనే విశేషాన్ని జరిగిస్తారు. ఇవి సామాన్య జనవిలాసమై, శరీరపుష్టిని, ధావన కౌశలాన్ని పెంపొందిస్తవి.

సీమోల్లంఘనం సర్వసిద్ధి ప్రదం కాబట్టి శతవృద్ధులు తప్ప తక్కినవారు అందరూ ఈ విజయదశమీ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. వీరు కూడా సాంకేతికంగా పొలిమేర దాటిన చోట శత్రువిజయాన్ని అభినయిస్తారు. జయశీలంతో శమీ వృక్షం మీదుగా తిరిగి వస్తూ 'జమ్మికొట్టి' పత్రితో ఇంటికి వచ్చి, పెద్దల చేతిలో పెట్టి 'శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ' ఇత్యాదిగా గల శ్లోకాన్ని పఠిస్తూ నమస్కారం చేసి, ఆశీర్వచనాలు పొందుతారు.

నవరాత్రి విజయదశమ్యుత్సవాలు ఈ విధంగా హిందూ జీవన విధాన నాగరికతా సంస్కృతులను ప్రదర్శించుకోటానికి, పరస్పరావగాహనలకు పట్టని అద్దాలై, శీల శిక్షారక్షణలకు, ఉత్తరమాదర్శ సిద్ధులకు, ప్రవృత్తి నివృత్తుల సక్రమ సమ్మేళనం గల నిత్య ప్రగతి మార్గ సంచారాలకు నాటి నుండి నేటివరకూ నిరుపమమైన దోహదం చేస్తున్నవనటం నిస్సంశయం.

మన కర్తవ్యము

ఈ ఉత్సవాలను లోచూపుతో ఇతోధికంగా అవగతం చేసుకొని పునరుజ్జీవనాన్ని పొంది, ఆర్జించిన జ్ఞాన విజ్ఞానాల కనుగుణంగా ఆదర్శ జీవితయాత్రను సాగిస్తూ, అతిశయ శ్రద్ధా భక్తులతో సేవించి మాతృదేవీ మూర్తుల అపారమైన అనుగ్రహ విశేషం వల్ల సంప్రాప్తించే సర్వశక్తులను సమీకరించుకొని, వైజ్ఞానికరంగంలో హిందూసంఘాన్ని ఇతోధికంగా ఏకోన్ముఖమూ, పటిష్ఠమూ చెయ్యడానికీ, సముజ్జ్వలంగా హిందూ సంపదను పెంపొందించడానికి, బలప్రదర్శనాదులతో హిందూత్వాన్ని పరిరక్షించుకుంటూ విశ్రుత విజయాన్ని సాధించుకోటానికి మనం కడు జాగరూకతతో మెలగవలసి ఉంది. ఉత్తమ జీవిత దృక్పథం కోసం అందంగా అన్వేషిస్తూ అలసి అలమటిస్తున్న దేశాలకు, నీచ జీవన పద్ధతులతో నిలువునా మునిగి బ్రతుకుతూ, అయినా అదే ఇతరులు అనుసరింపదగ్గ బ్రతుకనే భ్రాంతితో విర్రవీగుతున్న వెర్రి దేశాలకూ జ్ఞాన విజ్ఞాన ప్రబోధం చేసి విముక్తిని చేకూర్చటం కోసం, మనం వీరత్వ వివేక విశ్వాసాలతో మన సంస్కృతిచేత సీమోల్లంఘన చేయించి, విశ్వ హిందూత్వ విజయయాత్రకు బయలుదేరవలసిన సమయం వచ్చింది. కనుక మనం కటిబద్దం కావలసి ఉంది. ఇంతటి మహత్తర కార్యభారాన్ని నిర్వహించవలసిన మనకు మహాసరస్వతి వివేకాన్ని, మహాలక్ష్మి సంపత్తిని, మహాదుర్గ శక్తిని, అపరాజితాదేవి విజయాన్ని ప్రసాదించుగాక!

దేవీస్తుతి

యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా ।
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ॥
యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే | నమః*
యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు నిద్రా రూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా | నమః*

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా | నమః *
యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా | నమః *
యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా | నమః *
యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా | నమః*
యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ॥

  • ఈ గుర్తుకు తరువాత వచ్చిన ప్రతిపాదము తరువాత 'నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై

నమో నమః' పఠించవలె.