వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/దేవీ నవరాత్రాలు-ఆచార వ్యవహారాలు

వికీసోర్స్ నుండి

దేవీ నవరాత్రాలు - ఆచార వ్యవహారాలు

భారతీయుల సాంఘిక జీవనంలో పండుగలు విశేషమైన ప్రాధాన్యము అనాదికాలం నుంచీ వహిస్తూ ఉన్నవి. ఆ పండుగల్లోని గోష్ఠుల మూలంగానూ, ఇతరములైన కార్యకలాపాల వల్లనూ సంఘంలోని వ్యక్తులలో సమష్టి జీవనం అభివృద్ధి పొందుతూ వచ్చింది. జాతీయ జీవనాన్ని పెంపొందిస్తూ ఒకనాడు అనంతవైశిష్ట్యాన్ని చేకూర్చుకున్నవి. అందువల్ల అవి జనసామాన్య ధర్మంలోనూ, మత విషయక జీవనంలోనూ భాగాలై నేటివరకూ నిలచి ఉన్నవి.

హిందువుల ధర్మాలూ, వైజ్ఞానిక ప్రవృత్తి, నమ్మకాలూ, నిశ్చయాలూ వెల్లడి చేసే పండుగలు అనేకం ఉన్నవి. అట్టివాటిలో సంఘంలోని సమస్త వర్ణాలవారూ ప్రాచుర్యం వహించే పండుగలు కొన్ని మాత్రమే. నవరాత్రాలు అందులో ఒకటి. మకర సంక్రాంతి తరువాత దీనిని అత్యుత్తమమైన పండుగగా భారతీయ ప్రజలు భావిస్తూ ఉన్నారు.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకూ వచ్చునవే నవరాత్రాలు. నవరాత్రోత్సవాలు శరత్కాలంలో జరగటం వల్ల శరన్నవరాత్రాలనీ, లక్ష్మి, సరస్వతి, పార్వతి, రాజరాజేశ్వరి మొదలైన దేవీ రూపాలకు ఈ నవరాత్రాల్లో పూజ జరగటం వల్ల దేవీ నవరాత్రాలనీ వీటికి పేర్లున్నవి. సామాన్య ప్రజలు 'దశరా' అని వ్యవహరిస్తున్నారు.

రావణాసురుడు దేవీపూజ వసంతకాలంలో చేసేవాడట. శ్రీరామచంద్రుడు శరత్కాలంలో దేవీపూజ చేసి, రావణవధ చేసినట్లు మహర్షి వాల్మీకి పలికినాడు.

ఈ తొమ్మిది దినాల్లో ఆదిశక్తి మూర్త్యంతరంగా ఉన్న దుర్గాదేవీపూజ జరుగుతుంది. ఐశ్వర్యప్రద అయిన లక్ష్మిని, జ్ఞానప్రద అయిన సరస్వతిని విధియుతంగా ప్రజలు శక్తికొలదీ పూజాదికాలతో కొలుస్తారు. ఆశ్వయుజ శుద్ధ సప్తమినాడుగానీ, అష్టమి నాడు గానీ, లేదా దశమి నాడు గానీ సర్వసామాన్యంగా సరస్వతీపూజ జరుగుతుంది. వేదికమీద గ్రంథాదులను సేకరించి భారతీదేవిని, ఆహ్వానించి, షోడశోపచారాలతో పూజించటం అనాదికాలం నుంచీ వస్తూ ఉన్న ఆచారం. నవమినాడు లక్ష్మిని ధన, ధాన్య, వస్త్ర, వృత్తి, వస్తురూపాలతో అర్చిస్తారు.

ప్రాచీన కాలంలో రారాజుల ఇళ్ళలో కల్పోక్త ప్రకారంగానే తొమ్మిది దినాలూ దేవీపూజ జరిగేది. అనుదినమూ ప్రభువులు, అమాత్య సామంతాదులతో కొలువు తీర్చి విద్వదోష్ఠులతోనూ, సంగీత నాట్యాదికాలతోనూ, కాలం గడుపుతూ విద్వద్వరేణ్యులనూ, శాస్త్రవేత్తలనూ, కళాకారులనూ శక్తిసామర్థ్యాలను అనుసరించి గౌరవించేవారు.

వ్యవసాయమూ, కంచరమూ, కమ్మరమూ మొదలైన వృత్తులు గల సామాన్య జనం, నవమి నాడు వారి వారి వృత్త్యుపకరణాలను లక్ష్మీ స్వరూపాలుగా భావించి, అలంకరించి, శక్తి కొలదీ జాతరలు చేసుకొనేవారు.

పదవ దినము విజయదశమి. ఈ దినాన రారాజులు సింహాసన ఛత్ర చామరాది రాజలాంఛనాలనూ, గజాశ్వాది సేనాంగాలనూ, భక్తియుతులై పూజించేవారు. క్షత్రియుల ఇళ్ళల్లో సర్వసామాన్యంగా ఈ తొమ్మిది దినాలకోసం పూజావేదికను ఒకదానిని నిర్మించేవారు. పూర్వం విశేష ప్రాచుర్యం వహించిన తండుల కుసుమ జలవికారాది కళాకుశలులు ఆ వేదికను అలంకరించేవారు. దానిమీదనే యుద్ధోపకరణాలను, ఛత్రచామరాదులను నిలిపేవారు. ఆ వేదిక మీద నిర్మించిన అగ్ని కుండంలో ఆర్ష ధర్మానుసారంగా సమస్త ఆయుధ దేవతలనూ ఆవాహన చేసి, సమంత్రకంగా వారి ప్రీతికోసం పాయసహోమం చేసేవారు.

పూర్వం రాజకుటుంబాలు విజయదశమినాడు చేసే కర్మలో లోహాభిస్మార మొక చిత్రమైన కర్మ. లోహుడనే రాక్షసుడు లోకభయంకరుడై దేవతలమీద దండెత్తగా, వారు అతన్ని ముక్కలు ముక్కలుగా త్రుంచి వేశారట. అవే నేటి ఆయుధాల కుపకరించే లోహపుముక్కలు. లోహరాక్షసుని అవశిష్ట భాగాలైన లోహపుముక్కలు ఈ అభిస్మార కర్మవల్ల మొక్కపోవని వారి నమ్మకము. ఆయుధ పూజ పరిపూర్తి అయిన తరువాత, ససైన్యంగా అశ్వాలను, గజాలను అధిరోహించి నగరానికి ఈశాన్య దిక్కుగా ఉన్న శమీ వృక్షం దగ్గరకు వెళ్ళి శమీ పూజ చేస్తారు. వీటి అవశిష్ట రూపాలే నేడు మన పిల్లలు పట్టే విల్లంబులూ, కోతులూ - 'జమ్మికొట్టటము' శమీపూజకు మారురూపంగా నిలచిన ప్రక్రియ.

శమీవృక్షం దగ్గర మొదట 'అపరాజిత' పూజ జరుగుతుంది. ఆమె దుర్గాదేవి మూర్తిభేదము. అష్టదళపద్మం మీద దక్షిణ వామ భాగాలలో జయవిజయలను ఆవాహనచేసి పూజిస్తారు. దుర్గా రూపమునూ 'శమీ శమయతే పాపం శమీ శత్రువినాశనీ' అని ప్రతిష్ఠ వహించిన జమ్మి చెట్టు మొదట మన్ను త్రవ్వి నీరుపోసి, అక్షతలు గలిపి తిరిగి వచ్చేటప్పుడు శిరస్సుమీద ధరించి రావటము ఆచారము. పరసీమలో శత్రువుల బొమ్మలనుంచి ధనుష్టంకారం చేసి వాటి హృదయసీమల్లో అమ్ములు నాటి, జమ్మి దాకి నెత్తిమీద ఉంచుకొని తిరిగి వచ్చి విద్వదోష్ఠీలోలు రయ్యేవారు పూర్వపు రారాజులు. పాండవుల అజ్ఞాత వాసారంభదశలో ఆయుధాలను కట్టకట్టి మత్స్యపుర ప్రేతభూమిలో ఉన్న జమ్మిమీద ఉంచి వెళ్ళిపోయిన తరువాత, ఉత్తర గోగ్రహణ సందర్భంలో అర్జునుడు గాండీవాన్ని స్వీకరించి విజయాన్ని పొందాడు. (రుద్రుడికి శ్మశాన భూమి విహారస్థానము. ఆయన ఈశాన్యదిశ కధిపతి. అందువల్లనే శ్మశానాలు గ్రామాలకు ఈశాన్య దిశకు చేరువగా ఉంటవి) విజయదశమి నాడు అర్జునుడు శత్రువిజయం చేయటం వల్ల విజయదశమి మహోత్సవాన్ని క్షత్రియులు మహోల్లాసంతో జరిగించేవారు.

నవరాత్రి ఉత్సవాలు చిరకాలం నుంచీ జరుగుతున్నవి. ఒక్కొక్క దేశంలో ఒకవిధంగా నడుస్తున్నవి. అందులోని ఆచార వ్యవహారాలకూ, అర్హమైన సంప్రదాయానికీ అనంతవైవిధ్యం గోచరిస్తున్నది. దేవీ స్వరూపాలు భిన్నభిన్నాలైనట్లే పూజావిధానాలు కూడా భిన్నభిన్నంగా ఉన్నవి.

దేవీపూజకు సప్తవిధాలైన కల్పాలున్నవి: 1. నవ్యమాది కల్పము 2. ప్రతిపదాది కల్పము 3. షష్ట్యాది కల్పము 4. సప్తమ్యాది కల్పము 5. అష్టమ్యాది కల్పము 5. అష్టమీ కల్పము 7. నవమీ కల్పము. సామాన్యులైనవారు సప్తమ్యాది కల్పాన్నీ, సంపన్నులైనవారు ప్రతిపదాది కల్పాన్నీ అనుసరించి దేవీపూజ చేస్తారు.

ప్రతిపదాది కల్పాన్ని అనుసరించి ఆశ్వయుజ శుద్ధ ప్రతిపత్తునాడు ప్రతిమా కలశస్థాపనాదులు జరిగించి దేవికి కేశసంస్కారాది ద్రవ్యాలను చేకూర్చుతారు. విదియనాడు కేశబంధనం జరుగుతుంది. తదియనాడు దేవికి దర్పణాన్ని అర్పించటమూ, సిందూరము, లత్తుక మొదలైన అలంకరణ ద్రవ్యాలను సమర్పించటమూ జరుగుతాయి. చవితినాడు మధుపర్క సమర్పణమూ, నేత్రాలంకరణమూ చేయవలె. షష్ఠినాడు సాయంసమయంలో బిల్వతరు బోధనము జరుగుతుంది. దేవతలకు దక్షిణాయనం రాత్రి కనుక నిద్రించు దేవిని మేల్కొల్పటమే బోధనము. సప్తమినాడు స్వగృహంలో పూజ, క్రితం దినం షోడశోపచారపూజ జరుగుతుంది. కనుక షష్ఠిని ఉపవాసము, అష్టశక్తి పూజ, నవమినాడు ఉగ్రచండాది దేవీపూజ, బలిదానాదులూ, కుమారీ పూజ చేయటం ఆచారము. దశమినాడు పూజ అయిపోయిన తరువాత మధ్యాహ్నం మంగళ వాద్యాలతో, ఉత్సవాదులతో దేవీ ప్రతిమను నదీజలంలో నిలిపివస్తారు. దీనినే మహాపూజ అంటారు. పూర్వాచార పరాయణులైన ముత్తయిదువలు 'గౌరమ్మ నీళ్లట' అని అంటుంటారు.

ఈ కల్పాలను అనుసరించి చేసే పూజ సత్త్వ, రజః, తమోగుణాలను అనుసరించి సాత్వికి, రాజసి, తామసి అనే విభేదాలతో ఉంటుంది. సత్త్వరజస్తమోగుణాత్మకమైన ఈ పూజవల్ల, తత్తదర్ఘమైన శక్తి కలుగుతుంది. సత్వగుణ ప్రధానాలైన అవస్థలు మూడు. రజః ప్రధానాలు మూడు. తమఃప్రధానాలు మూడు. సాత్విక సాత్వికము, సాత్విక రాజసము, సాత్విక తామసములు సాత్వికావస్థలు. ఇదేరీతిగా రజస్తమస్సులలోనూ ఆయా సంబంధావస్థలు ఉన్నవి. వీటిలో శ్రేష్ఠమైన సాత్విక సాత్వికావస్థ ఉదయించి నప్పుడే వాస్తవమైన దేవీశ్రద్ధ ఉదయిస్తుందట! పూజావిధానాలలో సాత్వికము మునికోటికి, రజోయుతాలు రాజకోటికి, తామసములు నిశాచరులకు, దిద్దేశకాలాదికాలను తెలుసుకొని మంత్రద్రవ్య విప్రసంయుతంగా చేసేది సాత్వికము. ఇది అత్యుత్తమము, శాంతి దాంతి స్వభావులకు మాత్రమే ఇట్టి పూజావిధానము లభ్యము. రాజసములలో ద్రవ్య బాహుళ్యముంటుంది. సురామాంసాదులతోనూ, జంతుబలులతోనూ కూడినది తామసి. రాజసిలోనూ ఆమిషముంటుంది. సాత్వికంలో నిరామిష నైవేద్య యజ్ఞ పారాయణాదులు ఉంటవి.

దేవీపూజ విషయమున ఉత్తర హిందూస్థానమునకూ, దక్షిణ హిందూస్థానమునకూ విశేషమైన అంతరమున్నది. వారిది సప్తమ్యాది కల్పము. దాక్షిణాత్యులది ప్రతిపదాది కల్పము. ఈ రెంటికీ విశేషమైన అంతరమున్నది. వారిది తామసపూజ; అందువల్ల వారికి తుది మూడుదినాలే ప్రధానము.

ఉత్తర హిందూ దేశంలో పురాణాదులలో వర్ణితమైనట్లు దుర్గారూపమును మృత్తికాదులతో నిర్మించి ప్రతిష్ఠించి పూజ చేస్తారు. ఈ విగ్రహానికి, కుడివైపు సరస్వతీ గణేశుల ప్రతిమలూ, ఎడమవైపు లక్ష్మీకార్తికేయ ప్రతిమలూ ఉంటవి. ఉత్తరదేశంలో మహాకాళీపూజ సప్తమ్యాది కల్పాన్ని అనుసరించి జరుగుతుంది. ఇందులో తామసీవిధానము కనిపిస్తుంది. పశుబలి, మద్యపానము, అశ్లీలభాషణము విశేషము. ఇది కల్ప మన్నను క్షుద్రశక్తుల జాతరల కంటె భీకరమూ, బీభత్సమూ అని తెలుస్తున్నది. దక్షిణ దేశంలో కలశాన్ని స్థాపించి దుర్గాదేవిని ఆవాహన చేసి తొమ్మిది దినాలూ సాత్విక విధానాన్ని అనుసరిస్తారు. సరస్వతీ, లక్ష్మీ పూజలు కూడా జరుపుతారు. దక్షిణదేశంలో బొమ్మల కొలువు మహావైభవంతో జరుగుతుంది. మేల్కట్టులతో ప్రతిమామంటపాన్ని అలంకరించి వింత వింతగా బొమ్మల కొలువులు తీరుస్తారు. బాలికలూ, యువతులూ, అలంకరణం చేసుకొని వీథులు కళకళలాడేటట్లు పేరంటపు కొలువులతో ఈ దినాల్లో కాలం వెళ్ళబుచ్చుతారు.

యోగ్యమైన అధికారం కలిగి యజ్ఞశాలానిర్మాణం చేసి, విధులు తెలుసుకొని దేవీవ్రతం చేయవలసి ఉంటుందని శిల్పగ్రంథాలు పలుకుతున్నవి. హరిహరాదులైన లోక పాలకులందరూ దేవీపూజాతత్పరులేనట. ఈ నవరాత్రి విధానాలకు సంబంధించిన దేవీపూజావిశేషాలు సంప్రదాయ గమ్యాలు. ఒకరి సంప్రదాయాన్ని మరొకరు గ్రహించటం కూడా పాపహేతు వట!

ఇక్కడ దేవీ స్వరూపాన్ని కొంతగా సంగ్రహించవలసి ఉన్నది. ప్రపంచము సమస్తమూ ప్రకృతిమయము. ప్రకృతి స్త్రీమూర్తి. ఆదిశక్తి. ఈమెవల్లనే ప్రపంచానికి సృష్టిస్థితి లయాలు ఏర్పడుతున్నవి. సృష్టి స్థితిలయాలకు కారణభూతులైన దేవతల్లో నానానామాలను ధరించి శక్తి ప్రకాశిస్తున్నది. బ్రాహ్మి, వైష్ణవి, గౌరి, వారాహి, నారసింహి ఇత్యాది నామాలతో భాసించే తల్లి పరాశక్తి. అందువల్లనే 'సర్వచైతన్య రూపాంతాం, ఆద్యాం విద్యాం చ ధీమహి, బుద్దిం యానః ప్రచోదయాత్' అనే దేవీ గాయత్రి. ఈ అర్థాన్నే దేవీ భాగవతము 'జగములు సృజింప రాజసీ శక్తియగుచు, జగములు భరింప సాత్వికీశక్తి యగుచు, జగము లణపంగ దామసీ శక్తియగుచు, నిన్ను నన్నును హరుని దానిల్పైనంబ' అని పల్కింది.

అంబిక, హైమవతి, కాత్యాయని, సతి, దుర్గ, భద్రకాళి, కాళరాత్రి, చండి మొదలైన నామాలలో ఉన్న రూపాలన్నీ ఆదిశక్తి స్వరూప భేదాలే. అంబికా నామము. శ్రుతులలోనూ, ఉమా, హైమవతీ, దుర్గాదులు ఉపనిషత్తులలోనూ కనిపిస్తున్నవి. ప్రకృతి స్త్రీరూపిణి కావటం వల్ల శాక్తేయులు పెక్కుశక్తులను పూజించే బదులు కేవలం స్త్రీని పూజిస్తారు.

బృహన్నందికేశ్వర పురాణంలోని దుర్గాపూజాపద్ధతిలో సర్పతోభద్రమున నవావరణాలలో 'గుండీ' ననుసరించి పూజాలంకరణం చేసి, విశిష్ట కేతనాలతో జల కలశాలు నిలిపి కోటియోగినీదేవతలను పూజించవలెనని ఉన్నది. కళాకర్మకు సంబంధించిన మయదీపికలో దేవీమూర్త్యంతరాల స్వరూప లక్షణాలు చిత్రితాలై ఉన్నవి. తంత్ర గ్రంథాలను బట్టి ఆదిశక్తి కోటియోగినీరూపాలలో ఇవి ప్రధానాలుగా కనిపిస్తున్నవి. ఇందు కొన్ని సౌమ్యమూర్తులు, కొన్ని అసౌమ్యమూర్తులు. వికృత, విశ్వరూపిక, యమజిహ్వ, జయంతి, దుర్జయ, యమాంకిక, విరాళీ, భేతీ, విజయంతిక, దేవకి, యశోద, నంద, అంబ, సర్వమంగళ, కాళరాత్రి, లలిత, జ్యేష్ఠా, నీలజ్యేష్ఠా, భూతమాత, సురభి, యోగనిద్ర, శ్రీ, చాముండ, చండిక, నవదుర్గ, రౌద్ర, కాళీ, కలవికర్జీ, బలప్రమథినీ, మనోన్మనీ, కృష్ణా, ఉమా, పార్వతీ, మహాకాళీ, శివరాత్రి, వారుణీ, శివదూతీ, కాత్యాయనీ, కార్త్యాయనీ, అభయ, అంబిక, యోగేశ్వరీ, భైరవీ, రంభా, శివా, తుష్టీ, సిద్ధి, బుద్ధి, క్షమా, దీప్తి, రతి, శ్వేతా, వైష్ణవీ, ఐంద్రీ, యామ్యా, కౌమారీ, వారాహీ, బ్రాహ్మీ, సరస్వతీ, లక్ష్మీ, సావిత్రీ, సర్వగంధా, గంధేశ్వరి, శక్తి, ఆశా, బృహత్ముక్షీ, సర్వజ్ఞా, వామనీ, భయాతన, ఖగానన, తపనీ, క్రోధన, వమని, మహాక్రూర, లోలుప, హాహారవ, పిశితాశా, బడబాముఖి, పిశాచి, హుంకార, పిచువక్త్ర, విశాలాక్షి, విమల, చంద్రావళి, లాలస, చంద్రహాసన, లంకేశ్వరి, వరద, లంకా, కాలకర్ణి, లోల, ప్రచండోగ్ర, లయ, మేఘనాద, లీలా, కరంగినీ, బాల, విష్ణుజిహ్వా, క్షయా, రక్తాక్షి, అక్షయ, తాలుజిహ్వక, పింగాక్షీ, సవరాక్షపణ, ససంగ్రహి, వృక్షకర్ణి, హయాసన, తరళ, తార, అక్షోభ్య.

అంటే ప్రకృతిలోని ప్రతి శక్తినీ ఒక దేవతా రూపంలో ప్రాచీనులు నిరూపించారని ఈ అనంతకోటి దేవతా స్వభావాదులను బట్టి తెలుస్తున్నది. ఆసేతుశీతాచల పర్యంతం విశాలమైన భారతదేశంలో ఉన్న దేవాలయాలలో ఈ దేవతారూపాలు శిల్పాకృతి ధరించినవి. నేడు శిల్పాచార్యులమని చెప్పుకునే అనేకమంది విజ్ఞులకు కూడా అవగతం కానన్ని దేవతామూర్తులున్నవి. తంత్రగ్రంథాలను పరిశీలించి ఈ శిల్పమూర్తుల స్వరూపాదికాలను తెలుసుకోవలసిన విజ్ఞానం విశేషంగా కనిపిస్తున్నది.

ఈ దేవతామూర్తులలో విలక్షణ రూపాలు కలిగిన వాటిని గురించి కొలదిగా ప్రసంగించిన తరువాత, మహిషాసురమర్దని, దుర్గ, కాళీలకు రూపకల్పనావశ్యకతనూ, భావనా వైచిత్రినీ నిరూపించుట సమంజసము. వికృత ఉష్ణ వాహన భయకృత మస్తకము మీద శవశకలం ఉంటుంది. 'ముసలం ముద్గరం యావ్యే పరశుం బంధనం తథా, బిభ్రతి యమజిహ్వా స్యాత్ కరాళా మహిషాస్థి' అనేది యమజిహ్వా స్వరూపము. బిడాలీ దేవత రూపము చిత్రాతిచిత్రమైనది. 'శకటస్థాతి ఘోరాస్యా క్షీర వర్ణాయమాంతికా, మార్జారస్థ బిడాలీ చ విశాలాక్షీ భవేత్ సితా' అని ఆమె స్వరూప నిరూపణము. విజయాంతిక దుర్గాపూజలో ఉపవిగ్రహమైన విజయ. అంబను తైత్తిరీయ సంహిత 'ఏషతే రుద్రభాగః సహస్రాంబిక యాతం జుషస్య' అని రుద్రునికి భగినిగా చెప్పుచున్నది. సర్వమంగళ జగద్ధాత్రు లిరువులు నేకరూపలు కాళరాత్రి స్వరూప ఐన మహామాయను ధ్యానించినాడట. జ్యేష్ఠా, నీలజ్యేష్ఠ లిద్దరూ లక్ష్మి తోబుట్టువులు. 'తురంగనాసా చ లంబోష్ఠీ లంబమాన స్తసోదరీ, ఆలోహితా స్మృతా హ్యేషా జ్యేష్టాలక్ష్మీ రితిశ్రియే' - అని జ్యేష్ఠా లక్షణము. విమల వ్యాఘ్రయాన, చేతియందు కర్తరి కలది. త్రినేత్ర, హుతాశన అగ్నిలోని స్త్రీ శక్తి. విశాలాక్షీ సుందరి. హుంకార మీనవక్త్రమీనగ. బడబాముఖి బడబాగ్ని స్త్రీమూర్తి. 'తర్జన్యాభయ భృత్సోమ్యే దండకపాలినీ, కృష్ణా హాహారవా క్రూరా రాసభస్య ఖరస్థితా' ఇది హాహారవ రూపము. వంగదేశంలో దుర్గాదేవిని చండికగా భావిస్తారు. దుర్గాపూజ కేర్పరచిన స్థలాన్ని 'చండీతల' మంటారు. పూజను చండీ పూజ అంటారు. యోగేశ్వరిని వంగదేశములోని కొన్ని ప్రదేశాలలో మాత్రమే పూజిస్తారు. కరింగిని క్రోధసుత, ఇదేరీతిగా మిగిలిన దేవతా మూర్తులును కొన్ని సాత్వికములు, కొన్ని రాజసికములు, కొన్ని తామసికములు.

ఈ సమస్త దేవతాస్వరూపాలకు మూలము ఆదిశక్తి. ఆమె ప్రథమంలో మహిషాసురుణ్ణి సంహరించటానికి అవతరించింది. రాక్షసమాత దితి కుమారుల అపజయానికి చింతించి మహిషీ రూపంతో బ్రహ్మనుగూర్చి తపస్సు చేసి మాయావి, శూరుడైన మహిషాసురుని కన్నదట. నాడు దేవతలకు దుర్నిరీక్షుడై, బాధలు పెట్టు సమయంలో దేవతలందరూ విష్ణుదేవుని చేరుకుంటే, వారి ఆలోచనాసమయంలో వారి శరీరాలనుంచి తేజోరూపాన వారి అంశాలు బయలుదేరి, సుందరాకార, ఆభరణభూషిత, అత్యుజ్జ్వల అయిన మహాదేవి అవతరించింది. ఆమె అష్టాదశభుజ. బ్రహ్మాది దేవతలు వారి వారి ఆయుధాలను ఆమె కిచ్చారు. ఇంతలో మహిషాసురునికి రాత్రి కల ఒకటి వచ్చి అందులో దేవి తన్ను సంహరిస్తున్నట్లు తెలిసికొని, నిరంతరమూ 'నా శరీరము నీ పాదాలకు అంటి ఉండేటట్లు ప్రసాదింప మని కోరగా, అతణ్ణి మహాదేవి ఉగ్రచండ, మహాకాళి, దుర్గ - అనే మూడు మూర్తులతో రూపుమాపి మహిషాసురమర్దని ఐంది.

పూర్వం తపశ్శక్తితో ముల్లోకాలనూ జయించిన రురుని కుమారుడగు దుర్గుని శక్తికి తాళలేక, దేవతలు శివుని శరణుచొచ్చారట. శివుడు దుర్గుని సంహరించటానికి (శాంభవీశక్తిని) మహాదేవిని కోరగా ఆమె కాళరాత్రిని పంపించినది. కాళరాత్రి హుంకారాగ్ని మూలాన అతని సైన్యాన్ని నాశనం చేసింది. దుర్గుడు కాళరాత్రితో పోరాడుతూ వింధ్యాద్రివరకూ వచ్చి, దేవిని చూసి మోహించి భార్యగా కోరాడు. ఆమె క్రూరదృష్టితో అతని సేవకులను చెండాడిన తర్వాత, దుర్గుడు గజరూపాన్ని ధరించి పోరాడగా ఆ గజాన్ని ఖండించిన తరువాత, మహిషరూపాన్ని పొంది దుర్గుడు పోరాడాడు. దేవి త్రిశూలంతో అతణ్ణి పొడిచి సహస్రబాహువులతో ప్రత్యక్షమైన అతణ్ణి చంపి 'దుర్గా' నామాన్ని వహించింది.

కాళీతంత్రంలో మహాకాళీరూపాన్ని ఇలా నిరూపించారు. 'అతిభయంకర. కరాళదంష్ట్ర, చతుర్భుజ, ఒక చేత కపాలము, ఒక చేత ఖడ్గము - ఒకటి, వరదహస్తము. ఒకటి అభయహస్తము. శివశక్తి, దిగంబర, కరాళ జిహ్వ. కాలాధిదేవత మహాకాలునికి స్త్రీ మూర్తి. జగత్తు కాలంలో లయ మొందినప్పుడు సమస్తమూ శివము కాని శవము. జగన్నాశనము చేసిన ఏకైక వీరగా ఆమె భయంకర స్వరూపంతో నిలుస్తుంది. వికటాట్ట హాసము, విజయ ఘోరహాసము. నాలుగు హస్తాలు కాలంలో లయం పొందే నాలుగు దిశలు. ఖడ్గము వినాశసాధనము. తొలగిన తల విజయచిహ్నము. అమృతత్వంలో ఆనందమున్నది. వరదహస్తము కాలాధిదేవతయైన ఆమెకున్న దానయోగ్యతానిరూపణ లక్షణము. నగ్నత్వము సత్యము మాయావరణ రహితమైనదని నిరూపించు గుణము. చితి జగచ్చితి. కాలాధి దేవత ఐన ఆమె కాలకర్ణ, అంటే జగత్తులోని సమస్త రూపాలూ, వర్ణాలూ, లయ మొంది, కాలరాత్రి స్వరూపయైన ఆమెలో లయం పొందుతవని అభిప్రాయాన్ని మహాకాళీ రూపకల్పన నిరూపిస్తున్నది.

దుర్గాదేవి విగ్రహ రూపానికి కూడా ఇటువంటి అర్థాన్ని ప్రతిపాదించి పూర్వులు నిరూపించారు. దుర్గ పరబ్రహ్మము. త్రిశూలము జ్ఞానము, ఆమె వాహనమైన సింహము మహిషాసురాదులు కామక్రోధాదులు, త్రినేత్రాలు త్రికాలాలు, లక్ష్మీసరస్వతులూ, వినాయక కార్తికేయులూ చతుర్విధ పురుషార్థాలట. అందువల్ల దేవీపూజ వల్ల సాధకుడు పురుషార్థసాధన మూలాన జ్ఞానాన్ని సంపాదించుకొని, కామ క్రోధాదులను ధ్వంసం చేసి త్రిపురనాశకుడు, సర్వవ్యాపి అయిన పరమాత్మను తెలుసుకొంటాడు - అని దుర్గాపూజ అంతరార్ధము.

(శరన్నవరాత్రి పూజావిధానాన్ని గురించీ, దేవీ స్వరూపాన్ని గురించి విశేషంగా తెలుసుకోవటానికి భారతి - రక్తాక్షి ఆశ్వయుజమాసము సంచికలోని 'శరన్నవరాత్రాలూ' భారతి - ఆంగీరస అశ్వయుజమాస సంచికలోని 'నవరాత్రి పూజ', గృహలక్ష్మి ఆంగీరస సంచికలోని 'దసరా ఉత్సవము'లను చూడ గోరుతాను, దేవీ కథాదికాలను గురించి శ్రీ మాధవరామశర్మ శ్రీదేవీకథలు ఆంధ్రభాషలో విశేష పరిచయం కలిగించగల పుస్తకాలు.)

- ఆంధ్రపత్రిక - 1948 అక్టోబరు 6