Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/దీపావళి

వికీసోర్స్ నుండి

దీపావళి

ఆశ్వయుజ మాసం శరన్నవరాత్రులతో ప్రారంభిస్తుంది. అంతటా దీపావళి మహోత్సవాలు జరుగుతవి. భారతదేశంలో సమస్తజనం సంతోషంతో పాల్గొనే పండుగల్లో దీపావళి ఒకటి. అతిముఖ్యమైనదని కూడా చెప్పవచ్చును. ఒక కవీంద్రు డన్నట్లు.

      సీ. "ఒక దివ్వె వెలుగంగ నుజ్జ్వలంబయి భార
                    తీ దివ్యరేఖ దీప్తించెననగ,
           ఒక సంచు మ్రోయగా నుత్తమ భారతి
                    జయభేరి మ్రోగిన సరణిదోప,
            ఒక చిచ్చుబుడ్డి యాగక ముత్యముల్ చిమ్మ
                    భారత రత్నముల్ ప్రబలెననగ,
            ఒక చువ్వ మింటికి సెక దీసికొని పోవ
                     భరతశోభలు మిన్ను ప్రాకెననగ,

      తే.గీ. అన్ని యొకమారు తోపగానన్ని యొక్క
            మారుతోచినయట్లయి మారుమ్రోగ
            భరతవర్షంపు గీరితి పరిఢవిల్ల
            వెలుగు దీపావళీ దివ్య విభవ మవని.”

భారతదేశ కీర్తివ్యాపకాలైన మహోత్సవాలలో దీపావళికి అగ్రస్థానం.

దీపావళి అతి ప్రాచీనమైన పండుగ. మధ్యయుగంలో వచ్చింది కాదు. ఈ పండుగకు సంబంధించి జనశ్రుతిలోనూ, భాగవతాది పురాణాలల్లోనూ కొన్ని కథలు కనిపిస్తున్నవి. ధర్మసంస్థాపనార్థం ఉజ్జయినీసంస్థాన సింహాసనాన్ని విక్రమాదిత్య గుప్తుడు ఆశ్వయుజ మాసంలో దీపావళినాడు అధిష్ఠించినాడని చరిత్రజ్ఞులంటున్నారు. ఆ నాటినుంచి విక్రమశకం ప్రారంభించింది. అందువల్ల ఆ నాటి విదేశీయ సంప్రదాయాలకూ, క్రూరయాతనలకూ, పరిపాలనకూ తల వొగ్గి బాధపడలేక

బయటపడిన భారతీయ ప్రజ, ఆనందంతో ఎత్తిన దీపహారతులే నేటి దీపావళికి


మూలమని కొందరి అభిప్రాయం. ఆ రాజన్యుడు విక్రమాదిత్యుడూ, గుప్త వంశస్థుడూ, ముఖ్యపట్టణము ఉజ్జయినీ, నూతన శకారంభం వీటినిబట్టి ఈ విధంగా ఊహించటానికి అవకాశం లేకపోలేదు.

దీపావళి శబ్దానికి దీపపు వరుస అని గానీ, సమూహము అని గానీ అర్థం చెప్పవచ్చును. ఈ పండుగ లక్ష్మీదేవి (ఐశ్వర్యాధిదేవత) లేదా భవానీ దేవి ఆధిక్యమును నిరూపించటానికి ఏర్పడ్డ పండుగగా కనిపిస్తుంది.

పూర్వం ప్రాగ్జ్యోతిషాధిపతి అయిన నరకుడు వరమాహాత్మ్యం వల్ల ఇంద్రపదవిని పొంది ముల్లోకాలనూ చీకాకు పరచినప్పుడు, శ్రీకృష్ణుడు ఇంద్రాది దేవతల మొరవిని అతనితో యుద్ధం చేసి, అతణ్ణి రూపుమాపి అతని చెరలో ఉన్న పదహారు వేలమంది గోపికలనూ విడిపించి వివాహమాడినట్లునూ, అతని విజయసూచకంగా దీపావళీ మహోత్సవాలు జరుగుతున్నట్లు పురాణాలవల్ల తెలుస్తున్నది.

వంగ దేశస్థులు ఈ పండగను దుర్గాపూజ, కాళీపూజ అని వ్యవహరిస్తారు. అర్ధరాత్రి వేళ ఆ దేశస్థులు గృహద్వారతోరణాలనూ, నదీతీరాలనూ, దీపావళులు వెలిగించి పూజ చేస్తారు. ఈ సందర్భంలో వారు పూజించే దేవత కాళరాత్రి మహామాయ. మార్కండేయ పురాణంలోని దేవీమహాత్మ్యంలో ఈ శక్తిని గురించి 'కాళరాత్రి ర్మహారాత్రి శ్చ దారుణా' అని చెప్పి ఉంది. ఇతర పుస్తకాలలో 'దీపావళి తయా ప్రోక్తా కాళరాత్రిస్తు సా మతా' అని కనిపిస్తున్నది. దీపావళి నాటి రాత్రి మహారాత్రి కాళరాత్రి. ఆ నాటి పగలు కాలవేలము లేదా వారవేలము. వ్యాపారస్థులు కొత్త చిట్టాలు ప్రారంభిస్తూ, అతిశయమైన వైభవంతో పూజాపునస్కారాలూ, గృహాలంకరణలూ జరుపుతారు; వారిలో కొందరు కొద్ది రోజులల్లోనే 'దివాలా' తీస్తారు. అందువల్ల ఒక ఉర్దూకవి 'ఐసీ ఆయీ థీ దివాలీ కి దివాలా నికాలా' అని చమత్కరించాడు.

నరకాసుర వధ వంటి పౌరాణిక గాథలు కొన్ని కనిపిస్తున్నా దీపావళికి విశేషమైన మతసంబంధము గానీ, తాంత్రిక సంబంధము గానీ కనిపించటం లేదు. అందువల్ల దీనిని కొందరు అతి ఆధునికమైన పండుగగా భావిస్తున్నారు. దీపావళి ముఖ్యంగా సూర్యగమనంలో కలిగిన ఒక మార్పును సూచిస్తున్నది. ఈ నాడు ఆ గ్రహరాజు తులారాశి (Libra) లో ప్రవేశిస్తున్నాడు. బార్హస్పత్య మానాన్ని అనుసరించే ఔత్తరాహులకు

కార్తిక ప్రతిపత్తునాటితో నూతన సంవత్సరం ఆరంభిస్తుంది.


తులారాశి చిత్రార్థము, స్వాతి, విశాఖ, 3/4లో ఉన్నది. అశ్వని మొదలుకొని విశాఖ ఉన్నవరకూ ఉన్న నక్షత్రాలు ఉత్తరార్ధ గోళంలో ఉన్నవి. అయితే క్రాంతి వృత్తంలోని నక్షత్రాలు విశాఖ మొదలుకొని దక్షిణార్ధంవైపు మరలుతూ ఉన్నవి. ఇక్కడ ఒకవిధమైన శాఖాంతరం ప్రారంభించటం వల్లనే ఈ చుక్కలకు విశాఖ అనే పేరు వచ్చినట్లు కనిపిస్తున్నది. తుల అంటే సరిగా తూచి పంచేది అని అర్థము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించగానే శీతోష్ణాలు ఎక్కువ తక్కువ లేకుండా సరిసమానంగా ఉంటవి. అదేరీతిగా దివారాత్రాలు కూడాను. తుల మధ్యదేశాధిపతి శిబి అగ్ని పరీక్షకు ఆగిన మహాపవిత్రస్థానము. చాల్డియా, అసీరియా, అకేడియా దేశాల వారు కూడా ఈ రాశిని 'తుల్కు ' అని అంటున్నారు; దానికి కూడా తుల అనే అర్థము.

విశాఖ నక్షత్రమే రాధ. విష్ణుస్వరూపుడైన శ్రీకృష్ణుని ప్రియ. ఆయన ఘోషుని భార్య. శరత్తులోనే కృష్ణభగవానుడు స్థావర జంగమాత్మికమైన చరాచర ప్రకృతి సమస్తమూ ముగ్ధ మయ్యేటట్లు మోహన వేణుగానం చేసింది. 'భూసతికిన్ దివంబునకు పొల్పెసగంగ శరత్సమాగమం బాసకల ప్రమోదకరమై ఒప్పుచున్న' దాని మహాకవులు ఈ కాలాన్ని గురించే చెప్పినారు కూడాను.

ప్రాణికోటిని మొరవెట్టేటట్లు చేసిన 'నరకుని సంహరించి ఇంద్రునికి (మేఘాధిపతి) సంతోషం కలిగించి, పారిజాతము (సముద్రంలో పుట్టినది) ను తీసుకొని రావటమూ సమస్తమూ ఒక రీతిగా కాలములోని మార్పును సూచించే సంజ్ఞాత్మకమైన కథనం (Symbolic expression) గా కనిపిస్తున్నది.

దీపావళి జైనులకు కూడా గొప్ప పండుగ. అయితే వారికి 'నరకాసుర వధా'ది పౌరాణిక దృష్టిలేదు. వారి దృష్టిలో ఇది ఐశ్వర్య సంబంధి. జైన వ్యాపారస్థులు ఆనాడు ధనపూజ చేస్తారు. వారూ ప్రమిదలలో - దీప పంక్తులుగా ఏర్పరచి - హారతులు తీర్చి దిద్దుతారు. జీన దేవుని నిర్వాణానంతరం అతని శిష్యులు పదునెనిమిది మంది రాజులూ ఒక గొప్ప సభ చేసి, 'జ్ఞాన దీపం (జినదేవుడు) వెళ్ళిపోయినాడు. కనుక మనము భౌతికపదార్థ దర్శనార్థం దీపాలను పెట్టి వెలిగిద్దామని' నిశ్చయించారట. ఆ నాడు మొదలు నేటివరకూ దీపావళినాడు వారు దీపావళీ సముత్సాహంలో పాల్గొంటున్నారు. వారికి దీపావళి నాలుగు దినాల పండుగ. మూడవ దినాన్ని మహావీరుని (జినదేవుడు) నిర్వాణదినంగా భావిస్తారు. మొదటి దినము ఇంట ఉన్న

లక్ష్మీతుల్యాలని భావించే విలువైన పదార్థాలనూ, ప్రతిమలకు 'పులికాపు' చేసి, రెండవ


దినము 'మిఠాయి' పంచిపెట్టి పేదసాదలకు సంతోషం కలిగించి, మూడవ దినం దస్తరాలను పూజిస్తారు. సాయంత్రం శారదాపూజ చేస్తారు. 'మిఠాయి' పంచి పెట్టటం వల్ల దుష్టశక్తులకు తృప్తి కలిగిస్తున్నామని వారు భావిస్తారు. శారదాపూజనాడు సర్వసామాన్యంగా జైనవర్తకులు పురోహితుణ్ణి పిలిపించి అతనిచేత పూజ చేయిస్తారు. అతడు దస్తరాల మీద 'శ్రీ' వ్రాస్తాడు. అది మేరుపర్వత రూపంలో ఉండవలెనని నియమం. అందువల్ల ముఖ్యంగా బేసి సంఖ్యగా ఉంటుంది. దస్తరం మీద ఒక పాత 'రౌప్యము' ఉంచి పూజిస్తారు. దాన్ని సంవత్సరాంతం వరకూ చలామణి అయ్యే ధనంలో కలపరు. అది అధికదనం తెచ్చి యిచ్చే వస్తువని వారి నమ్మకం. మరుసటి దినం బంధువులూ, స్నేహితులూ కలిసి క్రొత్త గుడ్డలు కట్టుకొని సద్దోష్ఠితో, సంగీత వ్యాపారాలతో కాలక్షేపం చేస్తారు.

హిందువులకు 'దీపావళి' దినం లోపరహితమైనది. మొదటిసారిగా అల్లుణ్ణి తీసుకోరావటానికిగానీ, చిన్నపిల్లలకు విద్యాభ్యాసం ప్రారంభించటానికీగానీ, వ్యాపారారంభానికి గానీ అంతకంటే మంచిదినం మరొకటుండదని వారి అభిప్రాయం. ఇటువంటి సందర్భాలలో జ్యోతిష్కుని పిలిపించి ప్రశ్నించ వలసిన అగత్యం లేదు.

దీపావళి వస్తుందనగానే ఇళ్ళకు వెల్ల వేయించి పసుపుకుంకుమలు పెట్టి రమ్యంగా అలంకరిస్తారు. ఆ నాడు భారతీయు లెరిగిన రేఖా శాస్త్రమంతా వ్యక్తమయ్యేటట్లు అంతర్గృహాలలోనూ, బాహ్య తోరణ ప్రదేశాలలోనూ చిత్రాతి చిత్రమైన రంగవల్లికలను తీర్చిదిద్దుతారు. ప్రాచీన కాలంలో ఈ నాడు గృహాలంకరణం కోసం తండుల కుసుమ బలివికారాదులైన కళలను స్త్రీలు ప్రత్యేకంగా అభ్యసించేవారని తెలుస్తున్నది. తోరణాలు కట్టటము ప్రాచీన భారతీయులు ఒక కళగా అభివృద్ధి పొందించారు. రాజనగరాలలో 'కలువడాలతో' స్తంభ వీధులను 'దీపావళి' పండుగనాడు అలంకరించేవారట. నరక చతుర్థినాడు తెల్లవారు జామున లేచి తలంటు స్నానం చేస్తారు. ఇది నరకాసురుడు చనిపోతూ కోరుకున్న కోరికట. అతని మృత్యు దినాన లోకంలో జనమందరూ అభ్యంగనం జేసి నూతన వస్త్రాలను ధరించేటట్లుగా వరమీయవలసిందని శ్రీకృష్ణుని కోరుకున్నాడట. పిండివంటలతో తృప్తికరమైన భోజనం చేసి, మర్నాడు కొత్త అల్లుళ్ళకి నూతన వస్త్రాలు కట్టబెట్టి ప్రొద్దు కుంగగానే మతాబులు, ఔట్లు, కాల్చుకుంటారు. 'భారతీ భాగ్య ప్రభావం' ఇటువంటిదని నిరూపించేటట్లుగా ఉంటుంది ఆ నాటి సౌభాగ్యము. అందువల్ల ఆ నాటి వెలుగును చూసి ఒక కవి


సీ. “వెలిగించుచుందురు విమలార్యమానినీ
               తిలకంబు లెల్లెడ దీపరాజి,
       పట్టించుచుందురు ప్రమదామణుల్ నిజ
               సుతులచే దివటీలు పతులు చూడ
       ప్రేలించుచుందురు వివిధంబులౌ బాణ
               సంచులు బాలురు సంబరమున,
        కట్టించుచుందురు కమనీయ వస్త్రముల్
               క్రొత్త యల్లుండ్రచే నత్తమామ

తే. లాత్రపడుచుందు రెల్ల రా రాత్రమందు
       పరమ తేజోమయంబగు ప్రకృతి జూడ
       భారతీ భాగ్యరేఖా ప్రభావ మిటులు
       వెలుగు నన దోచు దీపాళి విధము గనగ.”

అని అన్నాడు.

ఔత్తరాహులు వెలిగించే దీపావళికి మరొక అభిప్రాయం ఆధారం. సుఖప్రసూతలు కాలేక మరణించినవాళ్ళూ, బలవన్మరణాన్ని పొందిన వాళ్ళూ భూతరూపాలతో తిరుగుతుంటారని వాళ్ళ నమ్మకం. వారిని పారద్రోలటానికని వారు దీప సమూహాన్ని వెలిగిస్తారట!

దీపావళి మహోత్సవాలలో మందు సామాన్లు కాల్చటం బాబరు చక్రవర్తితో ప్రారంభించింది. అందువల్ల ప్రమిదల్లో దీపాలు వెలిగించటమే ప్రధానంగా భావించే అలవాటు కనిపిస్తున్నది. కన్యకలు తాళపత్రాలతో గుమ్మటాలు చేసి దానిలో దీపం పెట్టి, గిరగిరా త్రిప్పుకుంటూ పాటలు పాడుతారు. గ్రామసీమలలో చొప్పకట్టలు కట్టి ఊరి బయట త్రిప్పి చివరకు అన్నిటినీ ఒకచోట చేర్చి నరకాసురుణ్ణి దగ్ధం చేసివచ్చినట్లుగా తిరిగి వస్తారు. దీపావళి పండుగ సయాం దేశంలో కూడా జరుగుతుంది. వారూ కార్తిక మాసంలో మనవలెనే ఆకాశదీపాలు ఉంచుతారు. బోర్నియోలో కూడా దీపావళి ఒకనాడు జరిగినట్లు పురాతత్త్వవేత్తలు చెబుతున్నారు. తూర్పు బోర్నియోలో కుటై నదీప్రాంతాన 'మౌర కామన్' అనే ప్రదేశంలో బయటపడ్డ క్రీ.శ.400 నాటి సంస్కృత శాసనం మూలంగా, ఆ దేశపురాజు 'మూలవర్మ' చరిత్ర బయట పడినది. అందులో అతని దానాలు పేర్కొన్నారు. దీపమాలికలతో తిలా పర్వత దానం చేసి ఆకాశదీపాలు ముఖ్యపట్నంలో - దీపావళి మహోత్సవానంతరం


- నిలిపినట్లు తెలుస్తున్నది. మనదేశంలో అక్బరు చక్రవర్తి దీపావళీ మహోత్సవాలలో పాల్గొన్నట్లు ఐనీ - అక్బరీ వల్ల వ్యక్తమౌతున్నది.

ఈ రీతిగా పరిశీలిస్తే దీపావళికి పౌరాణిక, ఖగోళ, చరిత్రాత్మక ప్రాధాన్యమున్నట్లు అవగత మౌతున్నది.

   "భరతామప యద్రపో ద్యౌః పృథివి క్షమా
    రపో మో షు తే కిం చనామమత్"
                                                59-10 ఋగ్వేదము

'భూమ్యాకాశాలు ఏకమై లజ్జాకరమైన అన్యాయవర్తనాలు తల ఎత్తకుండా మొదలంట నాశనం చేసి, పక్షపాతాలను నిర్మూలించి తుడిచివేయును గాక! ఏ పాపాలూ ఏ దుఃఖాలూ మిమ్మల్ని అంటకుండు గాక!'

- ఆంధ్రపత్రిక - 1948 నవంబరు 3