వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/ఆంధ్రులు-సంగీత నాట్యాలు

వికీసోర్స్ నుండి

ఆంధ్రులు - సంగీత నాట్యాలు

‘దేవానా మీద మామనంతి మునయః
కాన్తమ్ క్రతుమ్ చాక్షుషమ్'. - మాళవికాగ్ని మిత్రము

'Music is a moral law, it gives a soul to the Universe, wings to the mind, flight to the imagination, a charm to sadness, gaiety and life to everything. - Plato

భారతజాతివలెనే దాని సంగీత నాట్యకళలూ అతి ప్రాచీనాలు. వేదకాలం నాటికే మనకు సంగీత నాట్యాలతో నిరుపమానమైన పరిచయం ఉన్నట్లు స్పష్టమౌతున్నది. నేటి పురాతత్త్వవేత్త మొహంజోదారో, హరప్పాలలోని చరిత్రాత్మక పరిశోధనల మూలంగా ఈ రెండు కళలూ ప్రాగ్వైదికయుగంలోనే భారతదేశంలో విశేష వ్యాప్తి పొందినట్లు వ్యక్తమౌతున్నది. వేదవాఙ్మయంలోని యమయమీ ఊర్వశీపురూరవాది సంభాషణలు ప్రాచీన భారతీయ వాకోవాక్య సంపత్తికి (Dialogue) ప్రబల నిదర్శనాలు. శిక్షాస్మృతులలో కొందరు దేవతలను ఆరాధించేటప్పుడు గృహస్థు కులపురోహితుడి తోనూ, భార్యతోనూ కలిసి కొన్ని గేయాలు పాడవలెననీ, కొన్ని నాట్యాలు చేయవలెననీ నియమాలు కనిపిస్తున్నవి. గృహస్థూ, పురోహితుడూ పాడుతుంటే యజమానురాలు వీణాతంత్రులు మేళవిస్తూ శ్రుతి కలపవలెనట! అటువంటి వీణను 'పిచోళీ' అని వ్యవహరించేవారట. దీనికే 'ఔదుంబరవీణ' అనే నామం కూడా కనిపిస్తున్నది. ఇది జంత్రవాద్యాల ప్రాథమిక స్థితి అని చెప్పవచ్చును.

సామవేదంలోని 'కృష్ణ'లలోనే సంగీత శాస్త్రంలోని స్వరాలను మనం గుర్తించవచ్చును. నేటి శాస్త్రాని కంతటికీ మూలరూపాలని అనిపించుకోతగిన శుద్ధ, భిన్న, గౌడ, వేసర, సాధారణాలు అనే అయిదు గీతాలూ సామవేదంలోని ప్రస్వర, ఉద్గీత, ప్రతీహార, ఉపద్రవ, నిధానాలలో నుంచి వచ్చినవేనని సంగీత శాస్త్ర పరిశోధకుల అభిప్రాయం. ప్రస్తారం చేసి చూస్తే తదుపరి వ్యాప్తిలో ఉన్న సమస్త రాగాలూ ఈ అయిదింటిలో దేనికో ఒకదానికి చెందుతవి. సామలను స్తోభలంటారు. వాటిని ఉదాత్త, అనుదాత్త, స్వరితాది విభేదాలతో గానం చెయ్యటం మనకందరికీ తెలిసిన విషయమే. సంగీతంతోపాటే నాట్యం కూడాను. దేవతా ప్రీతికోసం సామగానం చేసేటప్పుడు నృత్య, గీత, వాద్యాలు మూడూ కలిసి ఏర్పడే తౌర్యత్రికము (Symphony - Union of Song, Dance, and Instrumental music) కలిగితే గాని రసనిష్పత్తి కలగదని ప్రాచీనుల అభిప్రాయము.

భరతశాస్త్రం మీద వ్యాఖ్యానం వ్రాసిన తిక్కాకర, అభినవగుప్తపాదులిద్దరూ భరతాచార్యుల వారికి పూర్వమే భరత శాస్త్రాన్ని గురించి కాశ్యప విశాఖాది ఆచార్యులు ప్రవచించినట్లు వ్రాసి ఉన్నారు. వారి గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోవటం కారణంగా భరతర్షి ఈ శాస్త్రాన్ని నిబంధించి క్రమమార్గంలో లోకంలో ప్రచారం చేయవలసి వచ్చింది.

భరతాచార్యులవారి నాటికే ఆంధ్రులు గాంధర్వ విద్యాప్రవీణులనీ, నాట్యశాస్త్రకోవిదులనీ తెలుస్తున్నది. ఈ ఆచార్య మహాశయుడు 13వ అధ్యాయంలో (1) అవంతీ (2) దాక్షిణాత్య (3) పాంచాలీ (4) మాగధీరీతులని నాట్యాన్ని విభజించి దక్షిణ దేశానికి ఎల్లలు చెపుతూ 'దక్షిణసముద్ర వింధ్యమధ్య దేశమ్' అన్నాడు. ఆయన మతంలో కోసలులు, కళింగులు, ద్రావిడులు, ఆంధ్రులు, మహారాష్ట్రులు, దాక్షిణాత్యులు. వీరు బహునృత్యగీతాభిమానులట! చతుర మధుర లలితాంగాభినయులట!

ఆంధ్రజాతి ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందకు వచ్చి కళాప్రియంభావుకమైనది, ప్రప్రథమంలో శాతవాహన రాజుల కాలంలోనే. ఈ రాజవంశం కంటే ప్రాచీనము లనిపించుకున్న జగ్గయ్యపేట, భట్టిప్రోలు మొదలైన కొన్ని ప్రదేశాల్లోని శిల్ప ఖండాలను పరిశీలిస్తే, ఆ నాటికే ఆంధ్రులు సంగీత నాట్యశాస్త్రాలలో అందెవేసిన చేతులని అవగతమౌతుంది. శాతవాహన రాజులలో మూడవవాడు కృష్ణుడు. జగత్ప్రశస్తి గన్న సాంచీ స్తూప స్తంభంమీద ఇతని ప్రాకృత శాసనం ఒకటి కనిపిస్తున్నది. సాంచీ శిల్పాలలో కొన్ని ఆంధ్రులవి. వాటిలోని నాట్యభంగిమలూ, జంత్రవాద్య సమ్మేళన చిత్రములూ శాతవాహనులనాటి ప్రాథమిక స్థితిలోని ఆంధ్రుల సంగీత నాట్యవైభవాన్ని ఊహించటానికి చక్కని ఉదాహరణాలు. కొంత కాలానికి పాత వాహనరాజులు యావద్భారతాన్నీ కైవసం చేసుకొని మగధ రాజధానిగా రాజ్యపాలనం చేశారు. వారిలో ప్రసిద్ధుడు హాలమహారాజు గాథాసప్తశతీ సంగ్రథిత, 'బృహత్కథ' కర్త గుణాఢ్య పండితుడు, కామసూత్ర కర్త వాత్స్యాయన మహర్షి ఈ కాలంవారు. గాథాసప్తశతిలో అనేక గాథలు ఆ నాటి ఆంధ్రుల సంగీత, నాట్య, చిత్రలేఖనాది కళాప్రియత్వాన్ని వెల్లడి చేస్తున్నవి. మహర్షి వాత్స్యాయనుడు కామ సూత్రాలలో అనేక సందర్భాలలో సంగీత నాట్యాలకు సంబంధించిన సూత్రాలు వ్రాసినాడు. ఆయన విద్యా సముద్దేశంలోని నాగరవృత్తంలో నాగరకులు యక్షరాత్రి, సువసంతక, మదనోత్సవాది గోష్ఠులు జరుపలెననినాడు. వీటిలోని సువసంతక, మదనోత్సవములు, కేవలము నృత్యగీతవాద్య ప్రాయాలైనవని కామసూత్ర వ్యాఖ్యాత జయమంగళుడు 'సువసంతో మదనోత్సవ, తత్ర నృత్తగీతివాద్య ప్రాయః' (1-4-42) అని వ్యాఖ్యానించినాడు. 'పక్షస్య మాపక్షస్యవా ప్రజ్ఞాతే హని సరస్వత్యా భవనే నియుక్తానాం నిత్యసమాజః, కుశీల వాశ్చాగంతుకాః ప్రేక్షణకమేషాం దద్యుః, ద్వితీయే-హని తేభ్యః పూజానియతం లభేరయన్, తతో యథాశ్రద్ధ మేషాం దర్శన ముత్సర్గోవా. ఆగంతుకానాం చ కృతిసమవాయానాం పూజన మభ్యుపపత్తి శ్చేతి గణధర్మః' (161-165) మొదలైన మూల సూత్రాలలో మహర్షి వాత్స్యాయనుడు 'ప్రఖ్యాతమైన పండుగదినాల్లో నగరానికి వచ్చే నటులూ, సంగీతజ్ఞులూ, మొదటిదినం సమస్త ప్రదర్శనాలో పాల్గొని, మూడవ దినం క్లిష్టదానం అవుతుంది. కనుక రెండవ దినమే వారి కోసం ఏర్పాటైన ప్రేక్షక మూల్యంలోనుంచి కొంత ధనాన్ని బహుమానంగా పుచ్చుకోలవసిందనీ, దానికి ఇష్టంలేని సందర్భంలో ప్రేమ పూర్వకంగా నాగరకులు ఇచ్చిన వస్త్రాభరణాలతో తృప్తిపొంది జరిగిన నాటక ప్రదర్శనాన్ని ప్రేక్షకులు తిరిగి కోరినట్లయితే ప్రదర్శించవలసిందనీ, నగరాలలో ఉండే కుశీలవులకూ, నాగరకులకూ, పరిషత్తులకూ ఆగంతుకులుగా వచ్చిన నటగాయకాది కళాభిజ్ఞులను గౌరవించడం ధర్మ' మనీ శాసించినాడు. దీనినిబట్టి క్రీస్తు పూర్వమే ఆంధ్రజాతి సంగీత నాట్యాది కళాభిజ్ఞత సంపాదించి కట్టుబాట్లతో వాటిని పోషించుకున్నదని వ్యక్తమౌతుంది. అంతకు ఎంతో పూర్వమే భారతదేశంలోని సమస్త ప్రాంతాలలోనూ స్త్రీ పురుష నాటక సంఘాలు ఉన్నట్లు వాల్మీకి మహర్షి రామాయణంలోని 'న రాజకే జనపదే ప్రభూత నటనర్తకాః, ఉత్సవాశ్చ సమాజాశ్చ వర్ధంతే రాష్ట్ర వర్ధనాః' ఇత్యాది అభిభాషణాలవల్ల తెలుస్తూనే ఉన్నది. మహర్షి శయనోపచారికాలలోనూ, చతుష్షష్టినిరూపణములోను వైశికమునను మరికొన్ని సూత్రాలు వ్రాసినాడు, ఆ నాడు ఉదక వాద్యములు భాండనృత్యములు నున్నట్లు తెలియుచున్నది. హాల మహారాజు నాటిదని చెప్పదగ్గ కౌముదీ మహోత్సవ నాటకంలో మరికొన్ని సంగీత నాట్య ప్రశంసలు కనిపిస్తున్నవి. హాల మహారాజు అనంతరం సాతవాహన రాజులలో గౌతమీ పుత్ర, వాసిష్ఠీ పుత్రులు ప్రసిద్ధి కెక్కిన రాజన్యులు. వీరు ధాన్యకటకము రాజధానిగా ఆంధ్రదేశాన్ని పాలించి అమరావతి, రామిరెడ్డిపల్లి, గుంటుపల్లి, గోలీ, బుద్దాం, సమాధానపురం, మంచికల్లు మొదలైన అనేక ప్రదేశాలలో బౌద్ధక్షేత్ర నిర్మాణానికి కారణభూతులై అనేక యజ్ఞయాగాదిక్రతువు లొనర్చి పూర్వరాజన్యప్రశస్తి పొందినవారు. పైన చెప్పిన యజ్ఞ యాగాది క్రతు లక్షణాలను పరిశీలించినప్పుడు దేశంలో సంగీత నాట్యాలు అత్యుత్తమ స్థితిని పొందినవని చెప్పవలసి వస్తుంది. పూర్వోక్తాలైన బౌద్ధ క్షేత్రాలలోని శిల్పఖండాలను పరిశీలించినప్పుడు, ఈ అభిప్రాయం దృఢ మౌతుంది. ఆలీఢ ప్రత్యాలీఢాది పాదవిన్యాసాలూ, పతాకాది ముద్రలూ, కోమల కరణాంగహారాలూ వాటిలో శిల్పితాలైనవి. జంత్ర, చర్మ వాంశికాది వాద్యాలతో ఆ నాటి ఆంధ్రులకు పరిచయమున్నట్లు స్పష్టమౌతుంది. వేయితీగలు గల 'గెయిటర్'ను పోలిన ఒక నాద్యవిశేషశిల్పం ఒకటి అమరావతి స్తూప చిత్రాలలో కనిపిస్తున్నది. సాతవాహన రాజులనాటి సంగీత నాట్యాలనూ, శాస్త్ర విస్తృతిని స్మరించటానికి శిల్పఖండాలు తప్ప మరొక ఆధారం ఏమీ కనిపించటం లేదు.

సాతవాహన రాజుల తరువాత ఆంధ్రదేశాన్ని, ఇక్ష్వాకులు, పల్లవులు, శాలంకాయనులు మొదలైన ఆంధ్రభృత్యులు పరిపాలించారు. శాతవాహన రాజులు చేతికిచ్చిన కళాసంపత్తిని వ్యర్థం చేయకుండా వన్నెలు చిన్నెలు దిద్దుకుంటూ, పూర్వ ప్రభుమార్గాన్ని అనుసరించి పోషించారు, ఈ రాజవంశాలలో జన్మించిన ప్రభువులు. మాధ్యమిక బౌద్ధవాదానికి పట్టుగొమ్మ అయిన నాగార్జునాచార్యుడు ఇక్ష్వాకు వంశ మూలపురుషుడు - శాంతిమూలుని సమకాలికుడని చరిత్రజ్ఞుల అభిప్రాయము. ఇది సత్యమైనట్లైతే ఆ మహావిజ్ఞాని వ్రాసిన సంగీతశాస్త్రం ఏ టిబెత్తు భాషలో నుంచో బయట పడినప్పుడు ప్రాచీనాంధ్ర సంగీత విద్యావిశేషాలు మరికొన్ని బయటపడవచ్చును. నాగార్జున కొండ శిల్పాలలో కొన్ని ఖండాలను పరిశీలించినప్పుడు ఆ నాటి సంగీత నాట్యాలను గురించి కొంత ఊహాగానం చెయ్యటానికి అవకాశం ఉంటుంది.

సాతవాహన రాజ్యపతనానంతరం ఇక్ష్వాకులతో పల్లవులు కూడా ఆంధ్ర దేశంలో కొంత భాగాన్ని పాలించారు. వీరు పశ్చిమం నుంచి చాళుక్యరాజు రెండవ పులకేశి వచ్చి దక్షిణానికి తరిమివేసేటంతవరకూ దేశాన్ని పాలించి, సంగీత నాట్యాలకు దోహదమిచ్చారు. పల్లవ మహేంద్రవిక్రముడు దక్షిణానికి వెళ్ళిపోయేటప్పుడు అనేక కవిగాయక శిల్పి వర్గాలను ఆంధ్రదేశం నుంచి ఆయనవెంట తీసుకొని వెళ్ళినాడు. వారిలో సుప్రసిద్ధుడు మేధావి రుద్రుడనే నామాంతరమున్న రుద్రాచార్యులు. ఈ మహానుభావుడు తన కాలంలో ఉన్న తానాలను సరిదిద్ది నిబంధిస్తే, ప్రభువు మహేంద్రవర్మ ‘కుడిమియ మలై' అనేచోట శాసనస్థం చేయించాడు శిలాస్తంభాలమీద. ఇక్ష్వాకుల పతనానంతరం ఆంధ్రదేశం విష్ణుకుండినుల హస్తగతమైంది. ఉండవల్లిగుహలు వీరు తొలిపించినవేనని శ్రీ భావరాజు కృష్ణరావు గారి అభిప్రాయము. అందులోని వీణాది వాద్యజంత్రాలనూ, నాట్య భంగిమలలో నున్న స్త్రీ వేషాలనూ పరికిస్తే, ఆ నాడు కూడా సంగీత నాట్యాలు రెండూ ఆంధ్రులకు ఆదరణపాత్రాలైన కళలుగా ఉన్నవని వ్యక్తమౌతుంది.

'అందీ అందని భావరేఖల ప్రసన్నాగారతన్ లేత పూతన్ తీపారగ తీర్చి దిద్దిన అజంతాగహ్వర శ్రేణులు', వాకాటకరాజుల నాటివి. కానీ శిల్పు లాంధ్రులు. ఎల్లోరా, కైలాసము, అజంతా శిల్పఖండాలనూ, భిత్తిచిత్రాలనూ పరిశీలిస్తే సంగీత నాట్యాలకు ఆ నాటి రాజన్యులెంత ప్రాధాన్యము నిచ్చారో వ్యక్తమౌతుంది. శివ తాండవాది దేవతా నాట్య భంగిమలను నిరూపణ చేసే సందర్భంలో శిల్పులు ఉపయోగించిన వీణలనూ, సంగీత వస్తువులనూ గమనిస్తే, అజంతా శిల్ప సమ్రాట్టులకు సంగీత నాట్య శాస్త్రాలలో ఉన్న పరిచయం ద్యోతిత మౌతుంది.

క్రీ.శ. 610లో రెండవ పులకేశి పూర్వ దిగ్విజయయాత్రకు బయలుదేరి ప్రాగాంధ్రాన్ని జయించి, తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనుని నూతన రాజ్యాధిపతిని చేసి, తిరిగి వెళ్ళిపోయినాడు. అతని వంశస్థులు కొంతకాలం అంతఃకలహాలతో కాలం వెళ్ళబుచ్చి, తరువాత కళాపోషణకు పూనుకున్నారు. వీరితోబాటు పశ్చిమాన రాజ్యం చేస్తున్న బిల్హణమహాకవి శిష్యుడు సోమేశ్వరుడు నాట్యశాస్త్రాభిమాని. మహారాష్ట్రం నుంచి వచ్చిన ఒక గోండుకన్యకు స్వయంగా 'చరణాచారము' చెయ్యటానికి సింహాసనం దిగివచ్చేవాడు. ఆ మహారాజు నేర్పిన నాట్యభంగిమమే తరువాత కాలంలో 'గోండ్లి' అనే ప్రసిద్ధ నామాన్ని పొందింది. నృత్త రత్నావళిలో జాయపసేనాపతి ఈ విషయాన్నే -

"కల్యాణకటకే పూర్వం భూతమాతృమహోత్సవే సోమేశః కౌతుకే కాంచిద్ భిల్లవేష ముపేయషీమ్ నృత్యంతీ మథ గాయంతీం స్వయం పౌష్యమనోహరమ్ ప్రీతో నిర్మితవాన్ చిత్రగౌండినీ మిత్యయమ్ స్వతో భిల్లీ మహారాష్ట్ర గౌండినీ త్యభిధీయతే ॥”

అని పలికినాడు.

పశ్చిమ చాళుక్యులలోని సోమేశ్వరాది కళారాధకులను చూచి, కీర్తి స్పర్ధతో కొందరు పూర్వ చాళుక్యులు నాట్య సంగీత శాస్త్రాలకు చేయూత నిచ్చి పోషించారు. అందు మొదటినాడు, మొదటి చాళుక్య భీముడు. అతని మనుమడు రెండవ అమ్మరాజు. చాళుక్య భీమునికి (క్రీ.శ. 890-917) 'గాంధర్వ విద్యాప్రవీణ' బిరుదమున్నది. ఇతడు చెల్లవ అనే నట్టువరాలికి అత్తిలి విషయంలో రెండు ప్రదేశాలను దానం చేసినట్లు అత్తిలి శాసనం వల్ల (Attili C.P. grant 14 of MER 1917-18) తెలుస్తున్నది. అందులో చెల్లవ 'నట్టువరాండ్రనే కలువలకు సూర్యకాంతి' అని వర్ణిత ఐనది. రెండవ అమ్మరాజు (క్రీ.శ. 945-970) ‘కవిగాయక కల్పతరు' బిరుదనాముడు. ఇతని కీర్తిని కవిచక్రవర్తి, పోతన భట్టు అనే ఇద్దరు కవులు గానం చేసినట్లు చరిత్రజ్ఞులు తెలుపుతున్నారు. ఇతడు పట్టవర్ధని కులసంజాతనూ, సంగీత నాట్యశాస్త్రాలలో నిష్ణాత అయిన చామెకాంబను పోషించినట్లు తెలుస్తున్నది. (Kaluchambarru grant in E. I. Vol. VII, PP, 117 – 192) క్రీ.శ. 11వ శతాబ్ద్యాదిలోనే నన్నయ మహాకవి భారతకృత్యాదిన కవిగాయక సమితులకు నమస్కరించాడు. రాజరాజనరేంద్రుని కుమారుడు కులోత్తుంగ చోళదేవుడు మాతామహరాజ్యాన్ని పాలించటానికి పితృరాజ్యాన్ని వదలి దక్షిణానికి వెళ్ళిన తరువాత, నెల్లూరు చోళులు, నతవాడి ప్రభువులు, పొత్తపి చోళులు, కోటవంశీయులు, కాకతీయులు స్వతంత్రించి ఆంధ్రదేశాన్ని భిన్న భిన్న ప్రదేశాలలో ముఖ్యపట్టణాలు ఏర్పరుచుకొని పాలించటం ప్రారంభించారు. తరువాతి కాలంలో కాకతీయులు ప్రముఖులై మహాసామ్రాజ్యాన్ని స్థాపించారు.

కాకతీయులలో మొదటి ప్రతాపరుద్రుని కాలమునాటికి వీరశైవము ఆంధ్రదేశంలోని విశేష ప్రచారాన్ని పొందింది. వీరశైవభక్తులు పరమేశ్వర సన్నిధానాన్ని పొందటానికి సంగీతనాట్యాలను సహాయకారులుగా స్వీకరించారు. కాకతీయులనాటి సంగీత నాట్యాల స్థితిగతులను తెలుసుకోటానికి పండితారాధ్య చరిత్ర, క్రీడాభిరామము, పల్నాటివీరచరిత్ర ముఖ్యమైన సాహిత్యాధారాలు.

పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్రములో ఒకచోట విపులమైన నాట్య ప్రసంగము చేసినాడు. అందులో మార్గ, దేశవిభాగాలను పేర్కొన్నాడు. లాగు, వంజళము, ఢాళము, వళి, తివురు, బాగు, వాహిణి, సాళి ఇత్యాది దేశి భేదములను చెప్పినాడు. గతులలో అడ్డము, తివుటము, సన్న నమిలి, భ్రమర జలచరము, కోతి, గజ, సింహ, భుజంగములనూ, బంధములలో బారణ, దొర్తు, ద్రుక్కరము, మలపము, జల్లణము, బొల్లావణి, జొనాళి మొదలైనవాటినెన్నో ఉటంకించినాడు. వీణోత్తమము, బ్రహ్మవీణ సారంగవీణ, రావణవీణ, గౌణవీణ, కాశ్యపవీణ, భుజంగవీణ, భోజవీణ, త్రిసరణవీణ, సరస్వతీ వీణ, రావణ హస్తవీణ మొదలైన మార్గవీణలనూ, దివిరి, సకిన వళి, విట, సాగరిక, విపంచక, సర, మల్లరి, గోలాష్ఠి, షోషావతి మొదలైన దేశివీణలనూ, జాతివాస, విజాతివాస, పక్షవాస, రుద్రవాస, నిధివాస, ఋషివాస, కార్తికవాస, ఘోరవాస, త్రిపురవాసాది వాంశికాలనూ, ఆవజము, కాహళము, రుండము, తోలు తప్పటము, తారుమద్దెలలు మొదలైన వాద్యాలను పేర్కొనినాడు.

వీరశైవులు భక్తిరసోన్మాదావస్థకు సాధనంగా సంగీత నృత్యాదులను గ్రహించిన విధానం పురాణంలోని క్రింది పంక్తులవల్ల గోచరిస్తుంది :

"అక్క మహాదేవి! అల్లమద్దెలలు జక్కొల్పి వేగంబ సంధించుకొనుడు; సర్వమానమున బసవ ప్రమథవ్వ! కర మర్థి పట్టుడు కాహళలోలి సకలవ్వ! నీవును సంగళవ్వయును నొకరీతి నిలువుడు సుకరమ్ము గాను, బాలరుద్రమ! ఎత్తుపట్టగ వాళె గ్రోలు వాయింపుము గుడ్డవ్వ! నీవు సట్టన నృత్యంబు సరసం బెరింగి సంగు దాసమ! మహేశ్వరి! వీరభద్ర లింగవ్వ! మీరు కేళికలు సేయుండు; రమణదుకూలాంబరమును గంచుకము నమరించుకొని చల్లడము బిగియించి ఏతెమ్ము! నీవు పురాతమ్మ! శీఘ్ర మాతతమ్ముగ నృత్యమాడుదు గాని; తాళముల్ వట్టుడు, తాళగింపుండు నాళతి వేళకు నందరు ననుచు, నవిరళంబుగ నంత నార్భటం బిచ్చి జవనిక రప్పించి సరసమై నిలచి, పొలపగు ముఖరసంబును సౌష్ఠవమ్ము, లలియు, భావంబు, ధూకళియు, ఝుంకళియును మరియు రేవయు, విభ్రమమును రేఖయును నెరయంగ నీరీతి నృత్యంబు సలుప” (బసవ పురా. పే. 62) బసవపురాణంలో సకలేశ్వర మాదిరాజయ్య కథలోనూ, నాట్యనమిత్తిండి కథలోనూ ఇట్లే మరికొంత విపులముగా గాంధర్వప్రశంస కనిపిస్తున్నది. భక్తులు శ్రీశైల పర్వతారోహణం చేసేటప్పుడు, తుమ్మెద పదములు, ప్రభాత శంకరాదిపదములు పాడుకొంటూ, ఆరభటీవృత్తిలో అంగలు వేస్తూ వెళ్ళేవారని సోమన చెప్పినాడు. ఆ నాటికే యక్షగాన నాటకాలూ, తోలుబొమ్మలాటలూ తెలుగుదేశంలో ప్రసిద్ధంగా ఉన్నట్లు సోమన రచనలవల్ల తెలుస్తున్నది. 'శతకంబు, శివతత్త్వ సారంబు, దీపకళిక, మహానాటకము నుదాహరణములు, రుద్రమహిమయు, ముక్తకామములు, ప్రథమదేశ పురాతనపటుచరిత్రములు, క్రమమొంద బహునాటకము లాడువారు, భారతాదికథల చీరమరుగుల నారంగబొమ్మల నాడించువారు' అన్నవి ఆయన మాటలు. మహాకవి శ్రీనాథుడు, కాకతీయ ప్రథమ ప్రతాపుని సమకాలికుడైన నలగామరాజు పలనాటిని పాలిస్తూ సింహాసనం ఎక్కేటప్పుడు, ఒకానొక నర్తకి వచ్చి నాట్యం చేసిన విధానాన్ని కంటికి కట్టేటట్టు

“ఘనవైభవంబున కామవిభుడు నవ్వుచు సెలవిచ్చె నాట్యంబు సేయ, వరమృదంగము లెస్స వాయించు మేటి కుడిభాగమందున గుదురుగా నిలచె, దాళమానజ్ఞులు దాపటి దిశను నిలచి యుత్సాహంబు నేరుపుమీర, ముఖవీణ వాయించు ముఖ్యుడొక్కండు రాగమాలాపించు రమణు లిద్దరును, నిండు వేడుకతోడ నిలచిరి వెనుక గంజలోచనయును ఘనమైన పాత్ర మదనుపట్టపుదంతి మంజులవాణి ....నిలచి నాట్యమునకు నేర్పరియైన నేత్రపాణికి తన వినయంబు సూపి, అతడొసంగిన గజ్జె లతిభక్తితోడ బాదములం గట్టి, పంచవర్ణముల కాసె గట్టిగ గట్టి కడు జనం బడర మద్దెల తాళాల మధ్య నిలుచుండి యోరజూపున రాజు నొయ్యన జూచి సమపాదయుతమైన స్థానికస్థితిని దాత్పర్యమున దేవతలకును మ్రొక్కి పుష్పాంజలి యొసంగి పూని నాట్యంబు సమకట్టి నాదంబు సభయెల్ల గ్రమ్మ గైకొలు విడుదలల్ ఘనకళాశైలి కైముడి కట్నముల్ కనుపింప జేసి వెలయంగ దొమ్మిది విధము లైనట్టి భూచారి నాట్యంబు పొందుగా సల్పి పదునారు విధములై పరిగిన యట్టి యా కాశచారియు సమరంగనాడి, గతచారి భేదముల్ కనుపడునట్టు భ్రమణసంయుతదీప్తపటిమ మీరంగ బాణి భేదములను బాటించి చూపి స్థానక సంచయ సంయుక్త మమర బ్రేరణి దేశిని ప్రేంఖణ శుద్ధ దండికా కుండలి తగు బాహుచారి సప్తతాండవములు సల్పె చిత్రముగ...”

అని వర్ణించినాడు. ఇంత విపులంగా నాట్యోపక్రమోపసంహారాలను విశదీకరించిన పట్టు ఆంధ్రసాహిత్యంలో మరొకటి కనిపించటం లేదు. కాకతీయుల కాలంలో ఏకవీరాదేవి జాతరలు జరిగేవి. అందులో జన సామాన్యానందానుభవం కోసం ద్విపద ప్రబంధాలను పాడేవారని వినుకొండ వల్లభామాత్యుడు క్రీడాభిరామంలో -

"ద్రుతతాళంబున వీరగుంఫితకథల్ దుంధుం కిటత్కార సం గతి వాయింపుచు నాంతరాళికయతి గ్రామాభిరామంబుగా యతిగూడన్ ద్విపదప్రబంధమున వీ రానీకముల్ బాడె నొ క్కత ప్రత్యక్షరమున్ గుమారకులు ఫీ ట్కారంబునన్ దూలగన్.”

ఒక కోమలి వీరగాథలు పాడుతూంటే జనం పొంగి పరవశులై పోతూ ఉండేవారని వల్లభరాయుడు సీ. "గర్జించియరసి జంఘాకాండయుగళంబు వీరసం బెట క్రోల వ్రేయు నొకడు, యాలీఢపాదవిన్యాస మొప్పగ వ్రాలి కుంతాభినయము గైకొను నొకండు బిగువు కన్నుల నుబ్బు బెదరు చూపులతోడ ఫీట్కార మొనరించు పెలుచ నొకడు, పటుభుజావష్టంభపరిపాటి ఘటియిల్ల ధరణి యాస్ఫోటించి దాటు నొకడు,

తే. యుద్ది ప్రకటింప నొక్కరుం డోలనాడు బయలు గుర్రంబు భంజళ్ళు పరుపు నొకడు కొడుము దాటింపుచును పెద్ద కొలువులోన బడఁతి పల్నాటివీరులు బాడునపుడు.”

అన్నాడు. గుర్రపు భంజళ్ళు మహాకవి పింగళి సూరనార్యుని విశేషంగా ఆకర్షించినవి. అందువల్ల ఉదాత్తనాయకుడైన ప్రద్యుమ్నునిచేత ప్రభావతీ ప్రద్యుమ్నంలో ఆయన గుర్రపు భంజళ్ళు త్రొక్కించాడు. దేశీయ నాట్యమూ, సంగీతమూ విస్తారంగా ఆ దినాల్లో ప్రచారంలో ఉండటం చేతనే, కవి బ్రహ్మ తిక్కనామాత్యుని దృష్టి వాటిమీద నిలిచింది. ఆయన అర్జునుణ్ణి విరాటరాజు కొలువులో ప్రవేశపెట్టేటప్పుడు 'ఒండు పనులకు సెలవు లేకునికిజేసి యభ్యసించితి శైశవమాదిగాగ, దండలాసకవిధమును గుండలియును, బెక్కణంబు తెరంగును ప్రేరణంబు' అని ఆ వీరుడినోట పలికించాడు. ఈ కవిబ్రహ్మ తన నాటి తోలుబొమ్మలనుంచి ఎన్నో ఉపమానాలు గ్రహించాడు. 'కీలుకా డెడలింప గెడసిన బొమ్మల కైవడిఁ బటుతురంగ ప్రజంబు క్రాలఁ’ (ద్రోణపర్వము - ఆ.3) ‘చలమున దుస్ససేనుడును సౌబలుడున్ మిముబట్టి యార్ప బొమ్మలక్రియ నాడుచుండుదురు మానక నీవు సుయోధనుండు' (ఉద్యోగ పర్వము).

కాకతి గణపతిదేవ చక్రవర్తి బావమరది జాయపసేనాపతి నృత్తరత్నావళి కర్త. ఇతని నృత్తరత్నావళి మధ్యయుగంలో ఆంధ్రులు రచించిన నాట్య గ్రంథాలలో సుప్రసిద్ధమైనది. ఇది అముద్రితము. దీని ప్రతి ఒకటి తంజావూరు సరస్వతీ మహల్ తాళపత్ర గ్రంథాలయములో ఉన్నది. ఈ గ్రంథాన్ని బట్టి గణపతి దేవ చక్రవర్తి సంగీత నాట్య ప్రియుడనీ, కౌమారం నుంచీ ఆయన నాట్యశాస్త్రంలో విశేషకృషి చేసినవాడనీ, అతని ప్రతిభను గమనించి ప్రభువు నృత్తరత్నావళీ రచన చేయలసినదని శాసించినట్లు అందులోని -

"ప్రేక్ష్య ప్రజ్ఞా మతిశయవతీం స్వామిభక్తిం చ, హర్షా దాకౌమారా ద్గణపతినృపో జాయనం యం సమర్థమ్ | శుండామాత్యే సకలసుమన స్సేవ్యమానో జయంతం నాచాంపత్యై హరిరివ కలా శ్లాఘనీయం వ్యనైషీత్ ॥ జిత్వా శౌర్యేణ పృథ్వీం జలనిధిరశనాం స్వస్థిరీకృత్య లోకం సంగీత స్యోపభోగం సకుతుకమనసః స్వామినః శాసనేన | తస్యాభీష్టస్య భాస్వన్మణినికరనిభం నృత్తలీలాయితస్య రాజోల సౌ శాస్త్ర మేత ద్రచయతి చతురం నృత్తరత్నావళీతి ||"

అన్న వాక్యాల వల్ల తెలుస్తున్నది.

కాకతీయుల కాలంలో వీరశైవంతో పాటు ఆంధ్రదేశంలోని కొన్ని ప్రాంతాలలో కాలాముఖ పాశుపత శైవాలు కూడా విజృంభించినవి. పాశుపత గోళకీ మఠానికి గణపతి దేవచక్రవర్తి కుమార్తె రుద్రాంబ గుంటూరు జిల్లా మల్కాపురంలో కొంత భూమిని దానం చేస్తే, మఠాధిపతి విశ్వేశ్వర శివదేశికాచార్యులవారు దేవాలయం కట్టించి దాని అంగరంగ భోగలక్షణాలుగా ఇద్దరు నర్తకులను, అయిదుగురు ఆవజ కాండ్రను, తగిన వాద్యసంపత్తిని ఏర్పరచినట్లు తెలుస్తున్నది (J.A.H.R.S. Vol. IV. Pts. 8 & 4) వీరికాలంలో దేవాలయాలకు సంబంధించిన గాంధర్వ విద్యాప్రవీణుల జీవితాలు నాటకాలుగా కట్టి ఆడతగినట్లుగా ఉండేవట. క్రీడాభిరామంలో ఒక వారాంగన ప్రశంస మాటలమధ్య వచ్చినప్పుడు, మంచన శర్మ టిట్టిభ సెట్టితో 'లెస్సగాక, కిరాట! ఈ లేమచరిత మాడుదురు నాటకంబుగ నవనిలోన' అని చెప్పేవాడు.

కాకతీయుల పతనానంతరం క్రీ.శ. 14వ శతాబ్ది మధ్య భాగంలో బృహదాంధ్రదేశం 1. కోరుకొండ, 2. రాచకొండ, 3. పిఠాపురము 4. కొండవీడు, 5. విజయనగరము అనే ఐదు రాజ్యాలుగా ఏర్పడిపోయింది. కళాపోషణ విషయంలో వీరందరూ కాకతీయుల అడుగుజాడలనే అనుసరించారు.

కొండవీటి రాజ్యస్థాపనాచార్యుడు ప్రోలయ వేమారెడ్డి; ఎర్రాప్రగడ రామాయణ హరివంశాలకు కృతిభర్త. ఎర్రాప్రగడ హరివంశంలో కృష్ణుని జలక్రీడలను వర్ణించే సందర్భంలో 'లలితగగనరంగంబున, నలయక క్రొమ్మెరుఁగు గొండ్లియై యాడెడు చో నలవడియె మొగిలు తెరలును, బొలుపగు వడగండ్లగములు పుష్పాంజలులున్' అని నాట్యపూర్వరంగాన్ని ఉద్ఘాటించాడు. ప్రోలయ వేమారెడ్డి కుమారుడు అనవేమారెడ్డి కంచి, రన్ని, పొన్ని అనే ముగ్గురు నాట్యశాస్త్రాభిజ్ఞుల పోషించినట్లు తెలుస్తున్నది. కొండవీటి రెడ్డి రాజులలో ఒకడైన కుమారగిరిరెడ్డి వసంత రాజీయ మనే నాట్యశాస్త్రాన్ని ఒకదానిని వ్రాసి దానిని శిష్య అయిన లకుమాదేవి మూలాన ప్రచారం చేయించినట్లు -

"జయతి మహిమా లోకాతీతః కుమారగిరి ప్రభో
సృదసి లకుమాదేవీ యస్య ప్రియాసదృశీ ప్రియా |
నవ మభినయం నాట్యార్థానాం తనోతి సహస్రధా
వితరతి బహూ నర్థా నర్థివ్రజాయ సహస్రశః ||”

అన్న శ్లోకం వల్ల వ్యక్తమౌతున్నది. కుమారగిరి రెడ్డికి వసంతరాజు బిరుదనామము, అతని వసంతోత్సవ ప్రియత్వం వల్ల కలిగింది. ఇతని బావమరిది కాటయ వేమన శాకుంతల వ్యాఖ్యలో కుమారగిరి నాట్యశాస్త్రాన్ని గురించి 'మునీనాం భరతాదీనాం చ భూభుజాం, శాస్త్రాణి సమ్య గాలోచ్య నాట్య వేదార్థవేదినాం, ప్రోక్తం వసంతరాజేన కుమారగిరి భూభుజాం, నామ్నా వసంతరాజీయం నాట్యశాస్త్రం యదుత్త మమ్' అని వ్రాసి ఉన్నాడు. కుమారగిరి తరువాత కొండవీటిని పాలించిన పెదకోమటి దత్తిలమతాన్ని ఆధారం చేసికొని ఒక నాట్యశాస్త్రాన్ని వ్రాసినట్లు తెలుస్తున్నది. కొండవీటి రెడ్డిరాజ్యం అంతరించిన తరువాత శ్రీనాథ మహాకవి రాజమహేంద్రవరం రెడ్లను ఆశ్రయించాడు. ఈ మహాకవిగ్రంథాలలో అనేక సందర్భాలలో సంగీత నాట్య ప్రశంసలు కనిపిస్తున్నవి. 'వల్లకి చక్కి కాహళము వంశము ఢక్క హుడక్క ఝర్జరుల్, ఝల్లరి యాదిగా గలుగు శబ్ద పరంపర తాళశబ్దమై, యుల్లసిలం బ్రబంధముల కొప్పుగ నాడుదు రగ్రవేదిపై, బల్లవపాణు లీశ్వరుని పంటమహీశులు పూజసేయగన్ హిందోళంబున బాడి రచ్చరలు భీమేశున్ త్రిలోకాధిపున్ - భీమఖండము పాడిరంగనల్ దేశ విధంబు మార్గమున తేటయు నొక్కట సాళగింపగన్ - నైషధము; బెండపూడి యన్నయామాత్యుండు కట్టించిన మొగసాలవాకిటి మహోత్సవ మంటపమునందు, పేరోలగంబుండి '... కుండలీ, దండలాసక, ప్రేరణ, సింధు, కందుక, ధమాళీ, చేలమతల్లికా, హల్లీసకాది నృత్యంబుల నవలోకింపుచు మేలంబు లాలకించుచు, జంపూచాటునాట కోదాహరణజయఘోషచక్రవాళ చతుర్భద్ర చతురాత్రి ప్రబంధంబు లాకర్ణించుచు' మొదలైన సంగీత నాట్య సంబంధములైన రచనలు శ్రీనాథ మహాకవి గ్రంథాలలో విశేషంగా కనిపిస్తున్నవి. కోరుకొండ రాజుల్లో ముమ్మడి నాయకుల తమ్ముడు సింగమనాయకుడు గొప్ప సంగీత కళాభిమానిగా కనిపిస్తున్నాడు. ఒకానొక శాసనంలో ఇతన్ని గురించి

శా. 'వీణా వాదనకోవిదేన విలసల్లాస్య ప్రశస్యశ్రీయో
సారస్యాస్పదగానమానవిధినా సౌజన్యమానాత్మనా ।
నిత్యైశ్వర్యవిలాసినా నిరుపమాకారేణ కాంతాజనే
నాయంకూనయభూమిసింగతిలకః క్రీడన్ సదామోదతే!

అని ఉన్నది.

కొండవీటి పెదకోమటి వేమారెడ్డితోనూ, విజయనగర రాజన్యుడు ప్రౌఢదేవరాయలతోనూ కీర్తిస్పర్ధ వహించి కవితాపోషణం చేసిన రాచకొండ రాజు సర్వజ్ఞ సింగభూపతి సంగీత నాట్యాలకు దోహమిచ్చినట్లు కనుపించదు. కానీ ఓరుగంటి నివాసి బమ్మెర పోతనామాత్యుడు భాగవతంలో 'వినుము దేహధారి స్వతంత్రుడు కాడు, జంత్రకాని చేతి జంత్రబొమ్మ కైవడి నీశ్వరతంత్రపరాధీనుండై దుఃఖంబులందు నర్తనంబు సలుపు' (దశమస్కంధము ఆ 2) అని బొమ్మలాట ప్రశంస చేసినాడు.

ఇక విజయనగర రాజన్యుల సంగీత నాట్యపోషణమును గురించి ఆలోచించవలసి ఉన్నది. హరిహర బుక్కరాయల మహామంత్రి విద్యారణ్యులవారు సంగీతసారమనే ఒక శాస్త్రగ్రంథాన్ని వ్రాసినారట. అందులో 267 రాగాలు ప్రత్యేకంగా వారు సూచించినట్లు ఇతర గ్రంథాలను బట్టి తెలుస్తున్నది. బుక్కరాయల వల్ల పెంచుకలదిన్నె గ్రామాన్ని అగ్రహారంగా స్వీకరించిన నాచన సోమనాథ కవి శేఖరుడు ఉత్తర హరివంశంలోనూ, వసంత విలాసంలోనూ కొన్ని సంగీత నాట్య ప్రశంసలు చేసినాడు. ‘కమలముఖీ కటాక్ష కటకాముఖపాణి నభోపకారివిభ్రమమణి పుంఖరింఖ దభిరామరుచుల్' - ఉత్తరహరివంశము. ఆ 1. పద్యం 159; పేదలైన విన బ్రాహ్మణు వీట, జాణలు మెత్తురు జాజరపాట - ఉ. హరి. పీఠిక;

సీ. 'వడకు పన్నగరాజు పడగలమీద స
ర్వం సహాకాంత పేరణము సూప,
నుర్రూతలూగెడు నుదయాస్తగిరులతో
నాకాశలక్ష్మి కోలాటమాడ,
తెరలెత్తి సప్తసాగరములు పొరలంగ
వరుణుండు గొండిలి పరిఢవింప,

మొగములచాయ వేరొక చందముగ నిల్పి
కమలసంభవుడు ప్రేంఖణ మొనర్ప
.........

తే. శౌరి పూరింప నప్పాంచజన్యరవము' - ఉత్తర హరి. ఆ. 4-215.

ఇందుకు కొన్ని ఉదాహరణాలు. వసంత విలాసంలో నాచన సోమనాథుడు పేర్కొన్న జాజర పాటను తరువాత ఎంతో కాలానికి దామర్ల వెంగళ భూపాలుడు బహుళాశ్వచరిత్రలో చెప్పినాడు.

శ్రీనాథ మహాకవిని 'దీనారటంకాల తీర్ధమాడించిన' విజయనగర చక్రవర్తి ప్రౌఢదేవరాయలు సారంగదేవుని సంగీతరత్నాకరానికి వ్యాఖ్యవ్రాసిన కల్లినాథుణ్ణి పోషించాడు. (J.A.H. R.S. Pts. 2, 3, 4 page 204) సాళువ నరసరాయల కాలంలోనే మొట్టమొదటి యక్షగానం కనిపిస్తున్నది. అది ప్రస్తుతం ఉపలబ్ధం కాదు. కర్త చెన్న శౌరి. హరిభట్టు నారసింహ పురాణంలో 'సౌరభిచరితంబు జక్కులకథ చెప్పి లాలితనవరసాలంకృతముగ' అని తన పూర్వజుడు అన్న శారిని కీర్తించాడు. విజయనగర సామ్రాజ్యాన్ని కృష్ణరాయలు పాలిస్తూ దక్షిణాపథాన్నంతటినీ ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందకు తెచ్చిన తరువాత, సమస్త కళాపోషణం విశేషంగా జరిగింది. సంగీత నాట్య సాహిత్య శిల్పాలు అన్యోన్యాశ్రయాలై ఇతని కాలంలో విలసిల్లినవి. చివరకు దుఃఖాన్ని కూడా సంగీతదృష్ట్యా కవులు, అవలోకించారు. శిల్పంలో 'సరిగమపధనిస స్వరవల్ల కీతుల్యరవ విఠోబాస్తంభ రాగఫణితి' గమనింపదగినది. ప్రబంధనాయిక లందరినీ 'వీణాప్రియ'లనుగా తీర్చిదిద్దిన కవులు కథానాయికల చేత ఏదో ఒక వీణను పట్టించారు. 'తరుణాంగుళిచ్ఛాయ దంతపు సరకట్ల నింగిలీకపు వింతరంగులీన' అన్నచోట 'సర' అనే ఒకానొక వీణను వరుథిని చేత పట్టించాడు పెద్దనామాత్యుడు. 'కిన్నర' వీణ కూడా ఆ దినాలలో ప్రచారంలో ఉన్నట్లు కవితా స్వరూప నిరూపణ చేసే సందర్భంలో 'కిన్నర మెట్ల బంతి సంగాతపు సన్నతంతు’ అన్నచోట ఆయన చెప్పినాడు. నయగారపు కన్నడి, గౌళపంతు ఇత్యాది రాగాలు ఆ నాడు ప్రసిద్ధి వహించినట్లు తెలుస్తున్నది. రాయలనాటి వీణమెట్లు ప్రస్తుత కాలంలో నిబద్ధాలై ఉన్నట్లు కనుపించదు. అవి వాతావరణాన్ని బట్టి, పాటకుని గొంతును బట్టి, రాగాన్ని అనుసరించి మార్చేవారు. మనుచరిత్రలో వరూథిని విరహావస్థలో ఉన్నప్పుడు చెలికత్తె పలికిన 'వాలారుం గొనగోళ్ళ నీ వలసతన్ వాయించుచో నాటకున్, మేళంబై, విపంచి నిన్న మొదలున్ నీవంటమింజేసి యా, యాలాపంబె యవేళ పల్కెడు ప్రభాతాయాతవాతాహతిన్, లోలత్తంత్రుల మేళవింపగదవే లోలాక్షి దేశాక్షికిన్' అన్న వాక్యాలవల్ల తెలుస్తున్నది. ఆనాటి జనసామాన్యరసికలోకానికి ఈ రాగవిభేదాలు తప్పకుండా తెలిసి ఉంటవని మనం నిశ్చయించవచ్చును. రాధామాధవకవి ఈ విషయాన్నే 'కొలదిగ రాగ భేదములకున్ దగు సారెలు సారెకొత్తి తంత్రులు కొనగోళ్ళ మీటుచు జనుంగవ దండె యమర్చి కృష్ణ లీలలు ప్రకటించి పంచమకలశ్రుతి మాకు లిగుర్ప రాధకున్ వలపులు చిల్కగన్ మధురవాణి ప్రవీణత బాడె వీణతోన్' అని పలికినాడు. వీణా వాదనమూ, అభ్యసనమూ సర్వసామాన్యంగా ఆ నాడున్నట్లు గోచరిస్తుంది. లేకపోతే రాయలు ఆముక్తమాల్యదలో -

ఉ. "వేవిన మేడపై వలభి వేణిక జంట వహించి విప్పగా
బూవులు గోట మీటుతరి పోయెడు తేటుల మ్రోత లేమి శం
కావహమౌ గృతాభ్యసన లౌటను దంతపు మెట్లవెంబడిన్
జే వడి వీణ మీటుటలు చిక్కెడ లించుటలున్ సరింబడన్.” (ఆ1. ప. 62.)

అన్న పద్యంలోని భావాభినివేశానికి వీలుంటుందా? రాయల పాలనకాలంలో 'నాట్యకళ' అత్యుత్తమ స్థితి పొందినది చెప్పటానికి రామాలయ శిల్పాలు నిదర్శనాలు. మనుచరిత్రలో ఒకచోట పలికిన -

చ. 'చిలుకల కొల్కి కల్కి యొక చేడియ నాటకశాల మేడపై
నిలువున నాడుచుండి, ధరణీపతి చూడదలంచి యంచునన్
నిలచి రహిం గనుంగొనుచు నెయ్యమునన్ దనువల్లి యుబ్బి కం
చెల తెగబడ్డ కేతనము చీర చెరంగున మూసెఁ జన్నులన్.'

అన్న పద్యంవల్ల ప్రత్యేకంగా ఆ నాడు ఆంధ్రదేశంలో నర్తనశాల లున్నట్లు వ్యక్తమౌతున్నది. ఇక్కడ 'కంచెల' శబ్దానికి నాట్యం చేసేటప్పుడు బిగుతు కోసం తొడుగుకునే చనుకట్టు అని బ్రౌను అర్థము చెప్పినాడు. రాయలు ప్రజావినోదార్థము తోలుబొమ్మ లాటగాండ్రను రావించి, వారిమీద కాళన మంత్రిని అధికారిగా నియమించి గ్రామసీమల్లో వారిచేత ప్రదర్శనలు చేయించేవాడట. ఇతని కాలంలోనే మొట్టమొదటి 'కొరవంజి'కి ఆదరం లభించినట్లు అయ్యల రాజు రామభద్రుని 'జక్కిణీ, కొరవంజి వేషముల కేళి సల్పిరి, దేవతానటీమణులకు బొమ్మవెట్టు క్రియ' అనే ప్రయోగం వల్ల వ్యక్తమౌతున్నది. పదకవితాపితామహుడు, తాళ్ళపాక పెదతిరుమ లార్యుడు రాయలకు సమకాలికుడు. పదకవితకు ప్రాపకం లభించింది. కవితా పితామహుడు పెద్దన్న 'మధురకిన్నరీ నిక్వాణంబుల రాణం ద్రాణచెరచు లక్ష్మీ నారాయణ కల్యాణంబు పాటలం దీటకొను తిన్నని రవంబు' అని వాటికి స్థానమిచ్చాడు.

రాయల ప్రాపకం క్రింద కొన్ని సంగీతలక్షణ గ్రంథాలు జన్మించినవి. వాటిలో లక్ష్మణభట్టు 'సంగీత సూర్యోదయము' ప్రసిద్ధమైనది. లక్ష్మణభట్టు కర్ణాటక సంగీతాన్ని జన్య జనకరాగవిభాగం చేసి నిరూపించటానికి ప్రారంభించినవారిలో మొదటివాడని చెప్పవచ్చును! 'కామ దేవవిలాస' మనే సంగీత నాట్య శాస్త్రగ్రంథ మొకటి ఈ కాలంలో జన్మించినదని తెలుస్తున్నది. అళియరామరాజు సంగీత కళాభిమాని. బియకారం రామయామాత్యుని 'స్వరమేళకళానిధి' ఆయన కాలంలో జన్మించిన అత్యుత్తమ సంగీత శాస్త్ర గ్రంథము.

తళ్ళికోట యుద్ధానంతరము విజయనగర సామ్రాజ్యలక్ష్మి పెనుగొండ, చంద్రగిరులకు చేరింది. కానీ ప్రభువుల కళాభిమానం వారిని పరిత్యజించ లేదు. పెనుగొండ రాజులలో తిరుమల రాయలు భట్టుమూర్తికి ఆశ్రయుడు. కృత్యాదిలో భట్టుమూర్తి 'సంగీతకళారహస్యనిధి' నని చెప్పుకున్నాడు. ఆయన 'లలనా జనాపాంగ’ వంటి ఛందోబద్ధలయ ప్రధానాలయిన పద్యాలనే కాకుండా, వచనాలను కూడా శిష్టు కృష్ణమూర్తిశాస్త్రులవారి వంటి ప్రసిద్ధ విద్వాంసులు వీణ మీద పలికించినట్లు వినికిడి. వసుచరిత్రలో ఒకచోట 'హారముల్ కుఱుచలు త్రొక్క' అనే ప్రయోగం కనిపిస్తున్నది. దీనికి శబ్ద రత్నాకరకారులు ఒక నాట్య విశేషమని వ్రాసి ఉన్నారు. ఈ ప్రాంతములో గోదావరీ పరిప్రాంత నివాసి సోమనాథ పండితుడు ఒక సంగీత శాస్త్రాన్ని రచించినట్లును, అది తరువాత ఖిలమై పోయినట్లును సంగీత సారామృతాదిశాస్త్ర గ్రంథాల వల్ల తెలుస్తున్నది. ఇతడు స్వరాలు 15 మేళ కర్తలుగ నిశ్చయించినాడట. తిరుమల రాయలు గీత గోవిందంమీద ఒక వ్యాఖ్యానాన్ని అంకితం పుచ్చుకున్నాడు.

విజయనగర పతనానంతరం ఆంధ్రకళాకోవిదులూ, శాస్త్రజ్ఞులూ దక్షిణదేశానికి వలసవెళ్ళినారు. అక్కడ తంజాపురము రఘునాథరాయలు విశేషంగా కళాపోషణం చేశాడు. ఆయన కవి, గాయకుడు, శాస్త్రజ్ఞుడు. ఇతడు సంగీత నాట్యాల రెంటియెడా సమానత్వం వహించి సంగీతసుధ, భరతసుధ అనే రెండు ఉత్తమశాస్త్ర గ్రంథాలను రచించినట్లు తెలుస్తున్నది. సంగీతసుధ మొదట రఘునాథరాయలు 7 అధ్యాయాల గ్రంథంగా వ్రాసినాడట. నేడు 4 అధ్యాయాలు మాత్రమే కనిపిస్తున్నవి. ఈ గ్రంథంలో రాయలు 50 రాగాలను 15 మేళకర్తలుగ విభజించినాడు. ప్రాచీన శాస్త్ర గ్రంథాలలో రాగాలకు అంస, న్యాస, గ్రహాలు మాత్రమే కనిపిస్తవి. ఇతడు శ్రుతి, స్వర అలప్తికలను గూడా చేర్చినాడు. ఈ మహాగ్రంథానికి రఘునాథరాయల గురువు గోవిందదీక్షితుడు వ్యాఖ్యానం వ్రాసినాడు. రఘునాథ రాయలు వీణావాదనలో దిట్ట అని దీక్షితులు “జయంతసేనాది రాగ రామానాందాది తాళాన్ రచయన్ నవీనాస్, సంగీత విద్వాంస ముపాదిశ స్త్వమ్ విపంచికావాద దక్షణానామ్' (J.O.R. Vol. III - 154) రీతిగా పలికినాడు. రాయలు వీణలలో నాలుగు రకాలను సూచించి వాటి అమరికను గురించి కొంత చర్చించినాడు. అతని పేరుమీద రఘునాథ మేళ నొకదానిని సృజించాడు. అతని ఆస్థానంలో సంగీత శాస్త్రనిధులు - స్త్రీ పురుషులు అనేకులు ఉన్నట్లు 'వాగ్గేయ కారప్రముఖై రనేకై ర్విచిత్ర గీతాదికళా ప్రవీణైః, తథైవ వీణాదిమవాదవిద్యా విచరక్షణైః క్వాపినిషేవ్యమాణః' అనే ప్రమాణం వల్ల తెలుస్తున్నది. ఇతని కొలువులో ఉండే అనేక నాట్యగత్తెల విలాసవిభ్రమాలనే 'శృంగార సావిత్రి'లో అశ్వపతి తపోభంగం చేయటానికి వచ్చిన అప్సరసలకు చూపించినాడు. వెంకటమఖి, రఘునాథ రాయల ఆస్థాన సంగీత విద్వాంసులలో ప్రముఖుడు. 'తుర్దండి ప్రకాశిక' అనే సంగీత శాస్త్ర గ్రంథ నిర్మాత. వీణ, శ్రుతి, స్వరము, మేళము, రాగము, అలాపనము, రాయ, గీత ప్రబంధాలు అనే 10 అధ్యాయాల గ్రంథము. రఘునాథుని వీణమెట్ల పద్ధతిని అనుసరించక, సప్తస్వరాలకూ సర్వ కాలసర్వావస్థల్లో ఒదిగేటట్లు మెట్లను సరస్వతీ వీణకే ఏర్పాటు చేసి, 72 మేళకర్తలను నిరూపించిన మహానుభావుడు వెంకటమఖి. ఇతడు జయదేవుని గీత గోవిందమార్గాన్ని అనుసరించి త్యాగరాజస్వామిమీద 24 అష్టపదులు చెప్పినాడట (భారతీయ సంగీతము - వీణ సుబ్రహ్మణ్యశాస్త్రి పే. 6)

కృష్ణరాయల కాలంలో అల్పప్రచారాన్ని పొందిన యక్షగానాలు రఘునాథరాయలు, అతని కుమారుడు విజయరాఘవరాయల కాలంలో విశేష వ్యాప్తిని పొందినవి. తంజావూరు కోటలో ప్రత్యేకంగా నాటకశాలలు కట్టించినట్లు ఆయన అంకితం పుచ్చుకున్న విజయవిలాసంలోని 'మాటల నేర్పులా సరసమార్గములా నాటకశాలలా... కీర్తిలోలుడు జుమీ రఘునాథ నృపాలుడిమ్మహిన్' అన్న పద్యం వల్ల వ్యక్తమౌతున్నది. రఘునాథరాజు స్వయంగా 'అచ్యుతేంద్రాభ్యుదయ' మనే యక్షగానం వ్రాయటమే కాకుండా, ఎలకూచి బాలసరస్వతి వంటి విద్వాంసుల దృష్టిని వాటిమీదికి ప్రసరింపచేశాడు. బాల సరస్వతి 'కల్యాణకౌముదీకందర్ప నాటకం' వ్రాసినాడు. రాయలకుమారుడు విజయరాఘవరాయలు కళాపోషణ కోసమే రాజ్యాన్ని పాలిస్తున్నట్లు శారదా ధ్వజాన్ని ప్రతిష్ఠించాడు. 50 యక్షగానాలు వ్రాసి ఆడించాడు. ఇతని కాలంలో తంజావూరు నాటకశాలల్లో నటించిన యక్షగానాలు 300కు పైగా ఉన్నవట. నాటకాలు ఆడేటప్పుడు రంగులు వేసుకొని పాత్రోచిత వేషధారణలతో ప్రజలను రంజింపజేసేవారట. స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించినట్లు తెలుస్తున్నది. ప్రత్యేకమైన నాట్య ప్రదర్శనాలు కూడా విజయరాఘవుని కాలంలో కొలువులో జరిగేవి. అతడు అంకితం పొందిన రాజశేఖరవిలాసంలో చుండి కాళయ అతని సభలో ఖ్యాతి పొందిన నర్తకీమణుల ప్రత్యేకతలను గురించి -

సీ. “చౌపదంబులు సీత రూపవతీ కాంత
శబ్దచూడామణి చంపకాఖ్య,
చెలువగు జక్కిణి చెలువ మూర్తి వధూటి
కొదమ కోమలవల్లి గురునితంబ
నవపదంబులు లోకనాయికా లోలాక్షి
యలదేశి శశిరేఖికాబ్జనయన,
తురు పదంబులు రత్నగిరి నితంబినియును
పేరణివిధము భాగీరథియును

తే. మదన ప్రదద్యూత నవరత్నమాలికాది
బహువిధాలక్ష్య నాట్య ప్రపంచమెల్ల
ఘనత కెక్కిన తక్కిన కాంతలెల్ల
నభినయించిరి తమ నేర్పు లతిశయిల్ల.”

అని వ్రాసి ఉన్నాడు. పదకవితా చక్రవర్తి క్షేత్రయ్య విజయరాఘవుని రాజ్యకాలంలోనే దక్షిణ యాత్ర జేసి 4000 పైగా (మేరునిఘంటువు లెక్క ప్రకారము) మధుర భక్తి ప్రపూరితాలైన పదాలను గానం చేశాడు. గేయకవితా ప్రపంచంలో పాత్రవైవిధ్యానికీ, పరిస్ఫుట రూప చిత్రణానికీ, భావవ్యక్తీకరణానికీ క్షేత్రయ్యకు సాటి నిలువగలవాడు లేడు. ఇతని పదాలలో మగబొమ్మలు సూటిగా మన కంటిముందు కనపడరు. వారి నాడించు సూత్రధారిణులు స్త్రీలు. స్త్రీ స్వభావము నందలి వైవిధ్యమును, అంద చందాలనూ, ఇంత సుకుమారంగా, గంభీరంగా త్రచ్చి చూచినవాడు లేడు. 'మగువ ఏకాంత మందిరము వెడలెన్' అన్న వనితాదివ్య సౌందర్య నిరూపణం మొదలు ఆహిరి చాపుతాళములో వ్రాసిన 'పచ్చి ఒడలిదానరా, పాపడు పదినెలలవాడు వచ్చి కూడుటకు వేళ గాదు' అన్నంత వరకూ ఆయన లేఖినికి విహారభూమి. మధుర చొక్కనాథుడూ, తొండైమాన్ రఘునాథరాజూ విజయ రాఘవునితో కీర్తిస్పర్ధ వహించి సంగీత నాట్యాలను పోషించారు. చొక్కనాథుని ఆస్థానకవి తిరుమలుడు 'చిత్ర కూటాచల మాహాత్మ్య' యక్షగానాన్నీ, మైసూరు సంస్థానాధిపతి చిక్క దేవరాయనిమీద ఒక కవి 'చిక్క దేవరాయ విలాస'మనే గేయ ప్రబంధాన్నీ వ్రాసినట్లు తెలుస్తున్నది. (తంజావూరు తాళపత్ర గ్రంథావళి నం. 520 Madras Oriental Manuscripts - Catalogue iii)

క్రీ.శ. 1676 తరువాత తంజావూరును పాలించిన మహారాష్ట్ర నాయకులు ఆంధ్రనాయకుల అడుగుజాడల్లో నడిచి యక్షగాన రచన చేశారు. కవితను పోషించారు. వారిలో 'షాజీ' ప్రముఖుడు. ఆస్థానకవులలో 'గిరి రాజకవి' ముఖ్యుడు. తంజావూరు మహారాష్ట్రులలో ప్రతాప సింహుని కాలంలో ముద్దు పళని సంగీత సాహిత్యనిధి తాతాచార్య శిష్య. ఆమె గోదాదేవి వ్రాసిన తిరుప్పావును 10 సప్తపదులుగా తెలుగులోకి పరివర్తన చేసింది. క్రీ.శ. 1793-1832లలో తంజావూరును పాలించిన శరభోజి కాలంలో త్యాగబ్రహ్మ జన్మించి 'నాదధేనువు'ను పిండి నవనీత మొలికించాడు. తెలుగుభాషను దాక్షిణాత్య సంగీత ప్రపంచానికి ఏకైక భాషగా తీర్చిదిద్దిన మహానుభావుడు త్యాగరాజస్వామి. కర్ణాటక సంగీత ప్రపంచంలో 'రసత్రయ'మని ప్రసిద్ధి వహించిన ముగ్గురిలో త్యాగయ్య. శ్యామశాస్త్రులిద్దరూ ఆంధ్రులే. శ్యామశాస్త్రి కుమారుడు సుబ్బరామదీక్షితులు, శిష్యులు పట్నం సుబ్రహ్మణ్యం, ముత్తు స్వామి దీక్షితులు, చిన్న స్వామి దీక్షితులు మొదలైన విద్వాంసులు ములికినాటి ఆంధ్రులు. ఈ సందర్భంలో సావేరిరాగాన్ని 8 గంటలు ఆలాపన చేసిన పల్లవి శేషయ్యను పేర్కొనుట సమంజసము.

కృష్ణరాయల కాలంలో నామమాత్రంగా వినబడుతున్న కొరవంజికి విశేష గౌరవమిచ్చి మహారాష్ట్రులు ప్రచారం చేశారు. జనసామాన్యానికి ఆధ్యాత్మిక విద్య 'జీవనాటకము' వంటి యక్షగానాల ద్వారా నేర్పటానికి యత్నించినట్లు వ్యక్తమగుచున్నది. ఈ కాలంలో పుట్టిన 'త్యాగరాజవినోద చిత్ర ప్రబంధనాటకం' అతిచిత్రమైనది. పాత్రోచితమైన భాష విచిత్రంగా సంస్కృతము, అరవము, మహారాష్ట్రము, తెలుగు కన్నడములలో ఉండేదిట. స్వర సాహిత్యము, జతులు, కీర్తనలు, జావళులు, యక్షగానాలూ ఈ కాలంలో లెక్కకు మిక్కిలిగా పుట్టినవి'

విజయనగర పతనానంతరం దక్షిణ దేశానికి వలసపోని కవులనూ, గాయకులనూ, నటకులనూ, వెంకటగిరి, విజయనగరము, పిఠాపురము మొదలైన సంస్థానాధిపతులు పోషించారు. కూచిపూడి వారు భరతశాస్త్రానికి పెట్టినది పేరై నేటివరకూ మధ్యాంధ్రంలో ఖ్యాతి గడించారు. వేములపల్లెవారు, ధర్మవరంవారు ఒక్కొక్క ప్రత్యేకతతో యక్షగానరచన చేశారు.

కంకంటి పాపరాజువంటి విద్వత్కవులు కాలానుభావాన్ని అనుసరించి ఉత్తర దేశంలో 'విష్ణుమాయావిలా' సాది యక్షగాన రచనకు పూనుకున్నారు. పాపరాజుకు నాట్యమంటే అభిలాష. ఉత్తర రామాయణంలో జక్కిణి, పేరిణి మొదలైన నాట్య విన్యాసాలను ఉటంకించాడు. ఇతర ప్రబంధాలలో సవరించిన హల్లీసకాన్ని -

సీ. “అన్యోన్యదండావృత్తు లెసగ నొం
డొరుల సాముఖ్యమ్ము నొందియొంది,
యీవలావల వచ్చి యితరేతరము దొల్త
నిలచిన వెలపుల నిల్చి నిల్చి,
కంకణమంజీర కాంచికల్ మ్రోయ స
వ్యాపసవ్యస్ఫూర్తి చూపి చూపి,
తాళవాద్యరవానుకూలంబుగా మంద 8
దృత మృదు గతులను తిరిగి తిరిగి,

తే.గీ. యనుపమ రసోదయంబున నభినవాతి
చిత్ర వర్తన భంగుల చెలగి చెలగి
విడివడిన మన్మథోన్మద ద్విరదములన
సఖులు హల్లీసకము సల్ప సంతసిల్లి.”

అని వివరించాడు. తరువాత కాలంలో ఆంధ్రులలో గాంధర్వవిద్య క్రమక్రమంగా సన్నగిల్లిపోవటం ప్రారంభించింది. ఒకనాడు యావద్భారతంలో ఖ్యాతి వహించిన ఆంధ్రుల సంగీత నాట్య కళాభినివేశం మళ్ళా ప్రాచీనౌన్నత్యంతో నూతన తేజస్సు ఏ నాడు వహిస్తుందో!

- భారతి, నవంబర్ - డిసెంబర్ 1948