వావిలాల సోమయాజులు సాహిత్యం-4/ఇతర వ్యాసాలు/సాహిత్యంలో చంద్రుడు

వికీసోర్స్ నుండి

సాహిత్యంలో చంద్రుడు

"వెండిగిన్నెల్లోన వెన్న పెట్టుకొని, పమిడి గిన్నెల్లో పాలు పోసుకొనీ, తేరుమీదా రానె తేనెపట్టూ తేనె, కొండమీదా రావె కోటిగిన్నె తేవే, చందమామా రావె జాబిల్లి రావె - "

అని తన కోసమూ, తమ్ముడి కోసమూ, ఆకాశవీధిలో నిత్యయాత్ర చేసే చంద్రుణ్ణి తెలుగు ఆడబిడ్డ అనాదినుంచీ ఆహ్వానిస్తూనే ఉన్నది. అయితే చందమామ తెలుగు బిడ్డలకు ఏ నాటి మామ? ఎలా మామ? - జగదేకమాత లక్ష్మీదేవితోబాటు క్షీరసముద్ర గర్భాన జన్మించటం వల్లనేనా అతడు మామ?

"స్త్రీలకు నేనంటే ప్రీతి. జానపద పదాలు పాడుకుంటూ నా వెన్నెట్లో వాళ్ళు రాటం త్రిప్పి నూలు వడుకుతుంటారు”; “నేను వెలుతురు నీకివ్వకపోతే నీకు బ్రతుకే లేదు" అని సూర్యచంద్రులిద్దరూ ఒకరినొకరు ఎద్దేవా చేసుకుంటారు. సూర్యుడు చంద్రముఖాన ఇసుక చల్లుతాడు. ఆమె ముఖాన మచ్చలు ఏర్పడతవి. కొంతకాలానికి సంధి కుదిరి ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే సంతానం కలిగింది. మళ్ళీ మనఃస్పర్ధలు. చంద్ర సూర్యుడికి విడాకులిచ్చి ఇంట్లో నుంచి లేచిపోయి బిడ్డలను ముక్కలు ముక్కలుగా చేసి పైకి విసురుతుంది. ఆకాశంలోకి వెళ్ళినవన్నీ నక్షత్రాలూ, నేలమీద పడ్డవి జలచరాలూ, జంతువులూ అయినవి. - ఇవి ఫిలిప్పైన్ జాతివారి సూర్యచంద్ర కథనంలో ముఖ్యాంశాలు.

నీగ్రోజాతి పుక్కిటి పురాణాల్లో సూర్యచంద్ర లిద్దరూ స్త్రీ మూర్తులు. అన్యోన్యం వారి సంతానాన్ని చంపుకొని తినటానికి సంధి చేసుకున్నారు. దానికి విరుద్ధంగా చంద్ర సంతానాన్ని సూర్య కంటికి కనబడకుండా పగలు దాచిపెట్టి, రాత్రిళ్ళు బయటకు తీసుకోవస్తుంది. వాళ్ళే నక్షత్రాలు.

ఆదియుగంలో సూర్యుడు భూమి మీదనే నివాసం చేస్తుంటే 'టిట్రరే' అనే రేచుక్క వెంబడించి అతణ్ణి మింగేస్తుంది. అతని ఎముక ఒకటి ఆకాశంలోకి ఎగిరి “కొడవలి” ఆకారంతో చంద్రుడై క్రమక్రమంగా పూర్ణరూపాన్ని పొంది ప్రకాశిస్తుంది. నాయకుడి డాలుమీద చిత్రితమైన చంద్రరూపం రాత్రిళ్ళు ఆకాశంలోకి ఎగిరి వెన్నెల కాస్తుందని ఒప్పోజా గుంపువారి నమ్మకం.

'త్యుకియోమి' చంద్రదేవత 'ఇజాన' (పింటోవారి పరమాత్మ) దక్షిణ నేత్రం నుంచి ఉద్భవించాడని జపానువారి నమ్మకం. 'హెంగో' అనే చైనావారి చంద్రుడు పూర్ణంగా అమృతపానం చేయలేకపోవటం వల్ల స్వర్గానికి వెళ్లుతూ దారిలో ఆగిపోయిన 'త్రిశంకువు'. రాత్రిళ్ళు మాత్రమే ప్రకాశించే అతణ్ణి పట్టుకొని అహర్నిశలూ అమృతప్రదానం చేసేటట్లు చేసుకోవాలనే సంకల్పంతో, 'చిన్' జాతిపూర్వులు ఆకాశాన్ని అందుకునే మేడలు కట్టడానికి ప్రారంభించారు. వినికిడి వల్ల చంద్రుడిది తెలుసుకొని ఒక పెద్దవెన్నెల తుపాను రేపి ఆ సౌధాల నన్నిటినీ నేలమట్టం చేశాడు.

దొంగలకూ, గూఢచారులకూ అధిదేవత ముసల్మానుల 'షాహూర్' అనే చంద్రదేవత. త్రిమూర్తులలో ఒకడు. బాబిలోనియా జాతి త్రిమూర్తి గణంలో 'సిన్' అనే చంద్రదేవత, ప్రథమ - షమాస్ (సూర్యుడు) 'ఇష్ తార్' లతో బాటు.

గ్రీకుల చంద్రదేవత 'సెలినీ' యౌవన ప్రదాయిని; హృద్రోగాలకు కారకురాలు. సూర్యుడు (హెలియస్) ఉషస్సు (ఇనోయస్) లకు తోబుట్టువు.

ఈ నాగరక, అనాగరక పురాణాలూ, పుక్కిటి పురాణాలూ పురస్కరించుకొని ఆయా జాతుల్లో అనంతంగా సారవత్సాహిత్యమూ, జానపద సాహిత్యమూ పుట్టినది; నేటికీ పుడుతూ ఉన్నది.

సీ. "ఒక వేయి తలలతో నుండ జగన్నాథు తే. బొడ్డుదమ్మిని బ్రహ్మ పుట్టె మొదల, నతని గుణమ్ముల నతని బోలిన దక్షు డగు నత్రిసంజాతు డయ్యె నత్రి కడగంటి చూడ్కుల కలువల సంగడీ డుదయించి విప్రుల కోషధులకు, నమర ధరాతతి కజుని పన్పున నాథు డైయుండి రాజసూయంబు సేసి మూడు లోకముల చంద్రుడు గెల్చినట్లుగా మన భాగవతపురాణం పలుకుతూ ఉన్నది. భారతీయుల అనేక ఆచార వ్యవహారాలు చంద్రుడిమీద ఆధారపడ్డవి. చాంద్రమానమే కర్మకాండకు ఆధారము. కృచాంద్రాయణమూ, సూర్యచంద్రుల నోములూ మన ఆచారాలు. రెండు సంక్రాంతుల నడుమ గౌణచంద్రుడూ, ముఖ్యచంద్రుడూ ఇద్దరూ కనిపిస్తే కొన్ని కర్మలు ఆగిపోతవి.

'కుముదాప్త బాంధవుని కొమ్ము తరిగితే కాటకం తప్పదని ముసలమ్మల నమ్మకం. జాతకచక్రాలలో “చంద్ర లగ్నాత్” చూడవయ్యా ఎలా ఉందో నంటాడు శాస్త్రవేత్త తోడి జ్యోతిష్కుడితో. హృద్రోగాలు పెరిగి వైద్యులతరం కాకపోతే “కాస్త చంద్రుడికి జపం చేయించి, మానెడు సోలెడు యవలు దాన మిప్పించండి, నయం కాక దాని తాతకు అచ్చామా?" అనే ధీమాతో సలహా చెబుతాడు సిద్ధాంతి.

“ఆదిత్యాత్ చంద్రమసం చంద్రమసో వైద్యుతమ్" అని ఛాందోగ్యోపనిషత్తు పలుకుతున్నది. అయితే ఈ చంద్రలోకం నేరని చెబుతున్నారు నేత్తలు. అగ్నిహోత్రాది కాలైన వైదికకర్మలుగానీ, సప్త సంతానాదికాలు గానీ చేసినవారు చంద్రలోకాన్ని పొందుతారట! ఉత్య్రాంతి చెందిన జీవుడు రాత్రి దగ్గరకూ, రాత్రి కృష్ణపక్షం వద్దకూ, అది దక్షిణాయనం దగ్గరకూ తీసుకోపోతాయి. జీవుడు అక్కడనుంచీ భౌతికాకాశాన్నీ, దానినుంచి చంద్రలోకాన్ని చేరి ఉదకశరీరాన్ని పొంది, కర్మ క్షయమయ్యేవరకూ సుఖంగా ఉండి, తరువాత ఆకాశాన్నీ, వాయువునూ పొంది మబ్బై వానగా మళ్లీ అవని మీద అవతరిస్తాడు.

చంద్ర చంద్రికల మీద మమకారం చేతనే శాస్త్రకర్తలు సహితమూ గ్రంథాలకు చంద్రిక, కౌముది ఇత్యాదిగ నామకరణం చేశారు. మేఘవిజయ కవి హైమకౌముది, భట్టోజీ దీక్షితుని సిద్ధాంత కౌముది, జయదేవుని చంద్రాలోకము - ఇత్యాదులు నిదర్శనాలు.

ప్రణయవిహ్వలులైన నాయికానాయకుల చేత అనేక అచేతనాలను దూతలుగా చేసింది కవిలోకం. మేఘుని ఆహ్వానించి మేఘదూతమూ, శుకాలకూ, హంసలకూ అనంత వాడిమను ప్రసాదించి శుకదౌత్యాలూ, హంసదౌత్యాలూ నడిపించారు కవులు. కృష్ణ చంద్రతర్కాలంకారుని సీత రామచంద్రునితో దౌత్యం నెరపటానికి చంద్రుణ్ణి ఆహ్వానించింది. ఆధునికులలో విశ్వనాథవారి 'శశిదూతము' 'సహస్రశీర్షా పురుష' వలె వేయి పడగలు విప్పినది. అంటే మనకు చంద్రుడంటే ఎంతో అభిమాన మన్నమాట. అతనికి నామకరణం చేయటంలోనే 'చది' (ఆహ్లాదనే ధాతువును గ్రహించారు శబ్ద మహర్షులు. ఓషధీశు డతడేనని ఆంతరంగికంగా ఆమోదించారు. 'అబ్జ' శబ్దంతో అతన్ని నీటబుట్టినవాడన్నారు. అతడు జైవాతృకుడు పైరుపచ్చలను బ్రతికించేవాడు. అమృతతుల్యమైన సోమాన్ని ప్రసాదించడం వల్లనే సోముడైనాడు. స్థితిని బట్టి శశిధరుడూ, మృగాంకుడూనూ. 'వాగ్వై బృహతీ తస్యా ఏష పతి స్తస్మాదు బృహస్పతిః' అయిన బృహస్పతికి శిష్యుడు. తారాజారుడు. ఐతేనేం? శంకర శీర్షానికి అవతంసమైనాడు.

వైదిక సాహిత్యంలో చంద్రుడు 'సూర్యచంద్రమసు' అనే దేవతాద్వంద్వంలో ఒకడు. సోమయాగ విశేషాలను చెపుతూ "వాగ్దేవత కోసం స్థూలశరీరుడైన పశు వును ప్రాణపంచకాన్ని వరుణుడికీ, నేత్ర ద్వయాన్ని సూర్యుడికీ, మనస్సు చంద్రుడికీ, శ్రోత్రాలను దిక్కులకూ, జీవాత్మను ప్రజాపతికీ ఇవ్వవలసిందని తైత్తిరీయ బ్రాహ్మణంలోని ఒక అనువాకం అనుశాసిస్తున్నది.

చంద్రుడు గంధర్వుడు. “సుషుమ్నః సూర్యరశ్మి శ్చంద్రమా గంధర్వః" అని శ్రుతి. 'గాంధరిత్రేతి గాంధర్వః' అని నైఘంటికులు. ఇక్కడ సూర్యకిరణమే గోవు. సుషుమ్న మనే సూర్యకిరణాన్ని ధరిస్తున్నాడు కాబట్టి చంద్రుడు గంధర్వుడు. నక్షత్రాలనే అప్సరసలతో మిథునభావాన్ని పొంది చంద్రుడు క్రీడిస్తున్నాడని శతపథ బ్రాహ్మణఋషి కల్పన.

సూర్యచంద్రులిద్దరూ అశ్వినీ దేవతలు. 'అశ్వ' శబ్దానికి యాస్కాచార్య నిరుక్తం ఇలా ఉంది

“కిం చంద్రమాః ప్రత్యుపకారలిప్సయా కరోతి గోభిః కుముదావబోధనమ్ | స్వభావ ఏవోన్నత చేతసాం సతాం పరోపకారవ్యసనం హి జీవితమ్ ||"

“చంద్రుడు ఏ ప్రత్యుపకారాన్ని కోరి కలువలకు వికాస మిస్తున్నాడు? గొప్పవారు పరోపకారాన్ని చెయ్యటంలోనే జీవితాన్ని వినియోగిస్తారు” అని కవి ప్రకృతిసిద్ధమైన ఒక రహస్యం మూలంగా మానవజీవితం మీద నిశితవిమర్శ చేశాడు. చంద్రుడికి కుముదినీప్రియత్వంతో బాటు పద్మవైరమూ కవిలోకసిద్ధము; మహా కవి భట్టుమూర్తి ఒక విరహిణి నోట

శా. "ఈ వబుండవు నీటబుట్టితిసుమీ యేనంచు మోమోటపుం ద్రోవ ల్సెప్పగ సిగ్గుగాదె; - మరి, నీ తోబుట్టు శ్రీదేవి లీ లావాసంబుసిరుల్ హరింతు వనుచో నయ్యో కళాదుండు చే తోవీథిన్ సహజాధనాపహరణోద్యోగంబు నెగ్గించునే” చే

అని అనిపించాడు.

విరహిణులకూ, విధుమండలానికి చుక్కెదురు. తాపాపనోదన మౌతుందని తరిపి వెన్నెలలోకి వెళ్ళితే, అది సంతప్తాగ్ని కావటం ప్రబంధనాయికలకు పరిపాటి. చంద్రోపాలంభం చెయ్యని చేడియ అరుదు. ఒక అంగన “ఇంతులను ఏచే పాతకమే నీకు అజహత్కళంకమైన" దని ఆడిపోసుకుంటుంది చంద్రుణ్ణి. విప్రలంభనాయికల దృష్టిలో చంద్రుడు కటిక కసాయి. “గోవధ చేసే తురకల దైవంబవు నీవు మొదల దక్కక పాంథ స్త్రీ వధము సేయ రోయుదె?" అని ఒక అతివ అర్థాంతరీకరిస్తుంది. పాపము! చంద్రుడు వారి నోట తినరాని తిట్లు తింటాడు. అందరికంటే అతిగడుసరి వరూథిని.

తే.గీ. "త్రిపుర సంహార మొనరించునపుడు హరుడు బండి కల్లుగ నీమేను గండిచేసె నదియు సెలవారి తెగటార వైతి చంద్ర యకట! రోహిణియెడ నపథ్యమునజేసి.”

అని అతని చావును కోరుకున్నది. త్రిలోకకంటకుడవైన నీవు ఎప్పుడో ఒకప్పుడు నశింపకపోవని చ “ఒక పెను బాపరేడు చలమొప్ప రసాతలసీమకున్ చకో రకములు భూతధాత్రికి సురల్ దివికిన్ పగ దీరునట్లుగా మెకమెకపాటుతోడ నిను మ్రింగకపోరెపుడున్, త్రిలోకకం టకుడవుగాన నీ యొడలు నజ్జుగ జేసె కురంగలాంఛనా!” అని అతనిని బెదిరిస్తుంది.

ఒక ఆషాఢమాసవిరహిణి "కురంగం నీవద్ద ఉన్నా శక్రచాపానికి గురి కాకపోవడమూ, మెరపు వేడికి భయపడి పారిపోకపోడమూ చాలా చిత్రంగా ఉన్న” దని ఆశ్చర్యపడుతుంది. ఇతర వ్యాసాలు 853 నాగరకవృత్తాన్ని అనుసరించి 'యక్షరాత్రి' నాడు మదిరాపానం చేసి మదోన్మత్తమైన ఒక నాయిక సురాచషకంలో ప్రతిబింబించిన చంద్రునితో చేసిన ఉన్మత్త ప్రలాపాన్ని ఒక మహాకవి -

"ఓ చంద్రుడా! ఎందుకీ మధుపాత్రలో ప్రతిఫలిస్తావు? మీ రోహిణీదేవిని తలవెంట్రుకలు లేనిదానినిగా చేయిస్తాను. పాత్ర జోలికి వస్తున్న వారిని ఈ మద్యముతో కలిపి నిన్ను గూడా మింగుతాను జాగ్రత్త! దగ్గరకు రాకు. మా రాజు కోపానికి, రోహిణీ దేవి కోపానికీ గురి ఔతావు. మా గుంపులో దేనినో కామించి వస్తున్నట్లున్నావు. లేక పోతే నీకీ క్షయ ఎక్కడినుంచి వస్తుంది? నీవు ఇతర స్త్రీలంపటుడ వని నీ భార్యలకు అనుమాన మున్నట్లున్నది. లేకపోతే మధు పాత్రలో ప్రతిబింబించిన నిన్ను ఈ తారలు ఎందుకు అనుసరిస్తున్నవి? నిన్ను ఎవ్వతో రమ్మని ఆశపెడుతున్నట్లున్నది. అందుకనే ప్రతి రాత్రీ పశ్చిమదిక్కుకు వెళ్లుతున్నావు” అని అతిరసస్ఫూర్తితో భావించాడు.

చంద్రుణ్ణి మహాకవులు నానావిధాలుగా ఊహించారు. ఒకరు 'అత్రిమునిలోచన భూషికా' అంటే, మురారి మహాకవి 'జ్యోత్స్నా కరంభ' మన్నాడు. తెల్లవారు జామున చంద్రుణ్ణి పేలపిండి కలిపిన పెరుగు ముద్ద అన్నాడు భోజనప్రియుడైన ఒక కవి రాజు. 'నభస్సీమంతినీ సిందూర రేఖ' అనీ, 'గగనసరోవరహంస' మనీ, 'ప్రాక్సతీలలాట తిలక' మనీ, 'గగనకాసార పోత' మనీ, 'అప్సరస్త్రీ కరసరోజ చమక' మనీ అనేకంగా పోలికలు కనిపిస్తున్నవి. సరోజినీదేవి అతణ్ణి ‘A castemark on the azure brow of heaven' అని అన్నది. ఒకానొక ఆధునిక కవి అష్టమి చంద్రుణ్ణి చూచి ‘అప్సరఃప్రణయినీ కబరీచ్యుత మాల' అన్నాడు. ఉదయించే చంద్రకాంతిని 'అభినవఖరయోషిత్క షాయకంఠ కాంతి' అని ఉపమిస్తే, తెలుగు కవి ధూర్జటి చంద్రోదయసమయాన 'శీతగభస్తి బింబశివాలింగంగా దర్శించి' పూర్ణోపమగా ఇలా ప్రస్తరించాడు :

మ. "ఉదయగ్రావము పానవట్ట మభిషేకోదప్రవాహంబు వా 8, దరీధ్వాంతము ధూపధూమము. జ్వలద్దీప ప్రభారాజి కౌ ముది, తారానివహంబు లర్పిత సుమంబుల్గా, తమోదూర సౌ ఖ్యదమై శీతగభస్తిబింబ శివలింగ బొప్పు ప్రాచీదిశన్.”

సాహిత్యంలో చంద్రుని సమగ్రస్ఫూర్తిని బహిర్గతం చేసేటట్లు 'అల్లసాని అల్లిక జిగి బిగువు'లతో కూర్చిన వర్ణన :


సీ. 'కలశపాథోరాశి గర్భవీచిమతల్లి
              కడుపార నెవ్వాని కన్నతల్లి
    యనలాక్షు ఘనజటావనవాటి కెవ్వాడు
              వన్నెవెట్టు ననార్తవంపు పువ్వు,
    సకలదైవతబుభుక్షాపూర్తి కెవ్వాడు
             పుట్టు గానని మేని మెట్టపంట,
    కటికిచీకటి తిండి కరముల గిలిగింత,
             నెవ్వాడు తొగకన్నె నవ్వజేయు

తే.గీ. నతడు వొగడొందు మధుకైటభారి మరది
       కళల నెలవాడు, మించు చుక్కలకు రేడు :
       మిసిమి పరసీమ వలరాజు మేనమామ
       వేవెలుంగుల దొర జోడు. రేవెలుంగు.”


- సాహితీ సమితి గోష్ఠిలో చదివిన వ్యాసము,

భాద్రవదము, భారతి, సర్వజిత్ (ముద్రితము)