Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-4/ఇతర వ్యాసాలు/ప్రశస్త రాసభము

వికీసోర్స్ నుండి

ప్రశస్త రాసభము

మహాసభ కార్యక్రమం అనంతంగా ఉంది, మళ్ళీ నిద్రకు అవకాశం దొరుకుతుందో లేదో, అది “చిత్తం ప్రసాదయతి, జీవన మాదధాతి, ప్రత్యంగ ముజ్వులయతి ప్రతిభావిశేషం” ఇత్యాదిగా ప్రశస్తి గన్నది అని నిశ్చయించాను. దిజ్మాత్రంగా ఆంజనేయ దండకాన్ని అరక్షణంలో మానసికంగా తిరగవేసి మైరేయ మాదకత్వంతో మేను శయ్యమీద వాల్చాను. అది జాగ్రదవస్థో' స్వప్నావస్థో చెప్పలేను. నలుదిక్కులను నల్లని పొగలు క్రమ్ముకోవచ్చి నా కళ్ళముందు కారుచీకట్లు ఆవరించాయి. ఆ అంధకార మధ్యాన్ని చీల్చుకొని వచ్చి ఓ చిక్కని కుచ్చుతోక ముచ్చటగా ముమ్మారు ఆడి నిలిచింది. ఏ ఉచ్చైశ్రవ దర్శనమో అవుతుంది. “మా పతిత జనోద్ధరణ సంఘాని"కి శుభపరంపరలు రానున్నవని మహానందపడుతున్నాను. పతిత జనోద్ధరణ పేరుతో హంగామాలు చేసి వత్రికాముఖంగా ప్రచారాన్ని సంపాదించి పైకి రాదలచుకున్న వాళ్ళుగాని, అందుమూలంగా అర్ధకామాల ఆకలి తీర్చుకోదలచుకొన్న వాళ్ళుగాని మా సంఘంలో సభ్యులుగా మచ్చుకైనా ఒక్కరూ లేరు. అందు స్వార్ధరహితులు కేవల కరుణాపరులు. దీనజనుల దుఃస్థితికి వసివాడి మనోవాక్కాయ కర్మలా వారిని ఉద్ధరించవలెననే అపేక్ష అతిశయంగా ఉన్నవాళ్ళు. అందుకు తమ శక్తిసామర్థ్యాలు ధారవోయటానికి సర్వసంసిద్ధులైనవాళ్ళు.

అపూర్వ దృశ్యంగా నా ముందు నిలచిన పృచ్ఛం లీలాప్రాయంగా రెండుమూడు చాలనాలను చేసి ఒక చక్రభ్రమణం చేసే స్ఫూర్తి చూపించేటప్పటికల్లా విచిత్ర భారీ కర్కశరాగ స్వరాలతో హారాలతో మూర్తిగొన్న కరుణగా నా మీద ఒక చతుష్పాత్తు నిలిచింది. నెమ్మదిగా దాని వెనక తుల్య సత్వరూపరేఖలతో అదే జాతి జంతువులు చిన్నవీ, పెద్దవీ కొన్ని గుంపు చేరి నిలిచాయి.

అప్రయత్నంగా నా నోట్లో నుంచి “చక్రీవంతః" అన్నమాట వెలువడింది. “చక్రం సమూహహస్తద్వంతః చక్రీవంతః" గుంపై ఉండేవి అన్నాను, చదువుకున్ననాటి సంస్కారంతో. జగత్సౄష్టిలో చక్రీవంతాలు కాని జంతువు లేమున్నవి, మనుష్య జంతువులు చక్రీవంతాలు కావా? అన్నవి ఆ గుంపులో కొన్ని పెద్ద నోళ్ళు విప్పి. వెంటనే నేను “ఖరా” అన్నాను. "ఖం ముఖాంతర్వర్తి మహదాకాశ మేషా మస్తీతి ఖరాః” - ముఖంలో గొప్ప బయళ్ళు కలవన్న నా శబ్దార్థాన్ని గమనించి, పెద్దనోళ్ళు ఉండటం చేత ముఖంలో గొప్ప బయళ్ళు ఏర్పడటం మానవ జంతువుల్లో కొన్నిటికి లక్షణమై ఉండటం మీరు గమనించే ఉంటారన్నవి మరికొన్ని. ఇంతలో మొఱ పెట్టినట్లుగా ఒక చక్రీవంతం ఓండ్ర పెట్టింది. నేను “గర్దభాః' రాసభాః - రాసంతే ఉచ్చైరితి రాసభాః గర్దంత్యుచ్చైరితి గర్దభాః" - బిట్టు మొఱపెట్టేవి అన్నాను. మహారణ్యాల్లో మహనీయ స్వేచ్ఛాసంచారం చేస్తూ మనోజ్ఞమైన జీవనం చేస్తున్న మమ్మల్ని మచ్చిక చేసుకొని ఆశలు ప్రేరేపించి తెచ్చి తమ మధ్యకు తెచ్చి మా వల్ల పొందదగ్గ మహోపకారాలన్నీ పొంది, ఇంకా కొన్నిటినీ పొందుతూ కూడా చిత్తచాంచల్యంతో, గజ హయాదులకు గౌరవ స్థానమిచ్చి మనస్సు మార్చుకొన్న మీ మనుష్య జంతువు తెచ్చిపెట్టిన తీరని దుఃస్థితికి శోకించి శోకించి మా కంఠాలిలా మారిపోయాయి. అన్నాడొక గార్దభ నేత.

మహాసభకు ముందు ఈ రాసభాదర్శన మేమిటని ఒక వంక కలవరం పొందుతూనే “ఇలా నన్ను చూడరావటంలో మీ ఉద్దేశ మేమి" టన్నాను సౌజన్యంతో. “మీ పతిత జనోద్ధరణ సంఘ దృష్టిని మా గార్ధభ జాతి సముద్ధరణం మీద కేంద్రీకరించవలసిందని అభ్యర్థించటానికి ఇలా సమూహంగా వచ్చాము. మాది పతిత జనోద్ధారణ సంఘం గదా! మీరు జంతువులు కదా ఇది ఎలా కుదురుతుందనుకోవద్దు. మనుష్యులు ఎంతటి జంతువులో మేమూ అంతటి 'జనులము.' జంతు శబ్దం మీకు కూడా రూఢమైనట్లు జన శబ్దాన్ని మాకు కూడా మీ సంఘ భవిష్యత్కార్యక్రమం ద్వారా రూఢం చెయ్యండి. మా పూర్వోన్నతిని, నేటి దుఃస్థితిని భావించి సమర్థించగల సామర్థ్యం మీకున్నదని మా గాఢ విశ్వాసం" అన్నాడు గార్దభ నేత. రాసభాలన్నీ ఐక్యకంఠంతో నాకు జయపెట్టినట్లు ఓండ్రపెట్టాయి. సెలవు తీసుకొంటున్నట్లు ఉన్నమిత పుచ్ఛాగ్రచాలనం చేసి కోలాహల ధ్వనులతో గార్దభాలన్నీ తిరోగమించాయి.

సద్దుకు మెలకువ వచ్చి శయ్యపై కూర్చున్నాను. ఆలోచన ప్రారంభమైంది. జన శబ్దాన్ని జంతుపరంగా అన్వయించవచ్చా? తప్పేముంది? శబ్దవేత్త లంగీకరిస్తారు. లోకం అంగీకరిస్తుందా? లోకం క్రొత్త మాటలను ఎన్నిటిని అంగీకరించటం లేదు; ఎన్ని శబ్దాలకు క్రొత్త అర్థాలను కల్పించుకోవటం లేదు? ఏమైనా సరే 'జన' శబ్దాన్ని ‘జంతు’ పరంగా అన్వయించి మా పతిత జనోద్ధరణ సంఘదృష్టిని గార్దభ జనసముద్ధణకే కేంద్రీకృతం చేయాలని నిశ్చయించాను. మా సంఘ సభ్యులంగీకరిస్తారా? లోకంలో గార్దభమంటే అణుమాత్రమైనా గౌరవం లేకపోగా, తిరస్కార దృష్టి ప్రబలంగా ఉంది. ఎవర్నైనా గట్టిగా తిట్టాలంటే గార్దభం పేరు ముందు వినిపిస్తున్నది.

"ఆడిన మాటం దప్పిన గాడిద కొడుకంటు దిట్టగావిని అయ్యో! వీడా నా కొడుకని గాడిద యేడ్చెంగదన్న ఘనసంపన్నా!”

అన్న చాటూక్తి ఈ తిట్టుకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించింది. (దేశ) ద్రిమ్మరిని కంచర గాడిదలా తిరుగుతున్నాడంటున్నారు. ద్రిమ్మరితనం చేతకాకనేమో, ఆదరించి తిండి పెట్టేవాళ్ళు లేని కారణం వల్ల కలిగిన గార్ధభానికి గాలిగాడన్న పేరు పెట్టారు. గార్దభానికి మందబుద్ధికి మారు పేరుంది. కొండవీటి రెడ్డిరాజన్యుల శ్వేతచ్ఛత్రచ్ఛాయల్లో "కవితాసతి వీర విహారం చేస్తున్న రోజుల్లో "బూడిద బుంగలై... కొండవీటిలో గాడిద నీవునుం గవివి గావుకదా అనుమానమయ్యెడిన్" అన్నాడు మహాకవి శ్రీనాథుడు ఒకనాడు. గోధనమని చెప్పుకొన్నట్లు, గార్దభ ధనమని చెప్పటం ఏ కాలంలోనూ ఉన్నట్లు కనిపించదు.

గజాదుల్లో భద్ర, మంద్ర, మృగీ జాతులున్నట్లు గార్దభాలలో భద్రాది జాతులున్న విషయాన్ని ఏ శాస్త్రకారుడూ పరిశీలించినట్లు కన్పించదు. పైగా "కుట్టకుంటే కుమ్మర పురుగనటం లోకలక్షణం.” పేదకోపం పెదవికి చేటనే సామెత కనుకూలమైన స్థితిలో నేడు ఉండటంవల్ల కరవకపోతేనేం, శుద్ధసత్త్వ స్వభావం వల్ల గార్దభం కరవక పోవటం చేత మనుజలోకానికి కడు చులకనై పోయింది. ఎంత చులకన కాకపోతే "కరవగవచ్చునే బలిమి గాడిదలకున్ పులితోలు గప్పినన్?" అని అలికంబున యక్షిని దాచినట్టి సర్వజ్ఞుడు నాచన సోమనాథు డంతటి వాడంటాడా?

మాతా రుద్రాణాం దుహితా వసూనామ్ స్వసాదిత్యానా మమృతస్య నాభిః ప్రణువోచం చికితేషు జనాయ మాగా మూగా మదితు వధిష్ట! - ఋగ్వేదం - మండలము VII

"రుద్రులకు మాత, వసువులకు దుహిత, ఆదిత్యులకు భగిని. అమృత స్వరూపమైన దుగ్గానికి స్థానము అయిన గోవును ఓ మనుజులారా! వధింపకుడు. ఇది బుద్ధిమంతులైన జనులకు నేను చెప్పుతున్నాను" అని గోజాతి మీద ఋగ్వేద కవి ప్రకటించిన అభిమానాన్ని ఏ కవీ ఎన్నడూ ప్రకటించినట్లు కనిపించదు.

సర్వజననిరాదరణ వల్ల వస్త్రభారవహనం, కుగ్రాసము లక్షణాలైనందు వల్ల కూడా గార్దభం పరిహాసపాత్రమైంది. లేకపోతే అన్యాపదేశంగానైనా ఒక కవి -

“రేరే రాసభ! వస్త్రభారవహనాత్ కుగ్రాస మశ్నాసి కిం రాజాశ్వావసథం ప్రయాహి చణకా బ్యూషాన్సుఖం భక్షయ | సర్వాన్ పుచ్ఛవతో హయా ఇతి వదం తృత్రాధికారే స్థితాః రాజా తై రుపదిష్టమేవ మనుతే సత్యం తటస్థాః పరే ॥”

ఓ రాసభమా! వస్త్రభారాన్ని వహిస్తూ ఈ చెడుతిండి తినటమెందుకు? రాజాశ్వశాలకు పోయి సుఖంగా సెనగలను భక్షించు. అచటి అశ్వాధిపతులు పుచ్చవంతాలన్నింటినీ హయాలనే అంటారు. రాజు వారి మాటలనే విశ్వసిస్తాడు. ఇతరులు తటస్థులుగా ఉంటారు. (నీకు ఏ భయమూ ఉండదు. దేశ ద్రిమ్మరితనం వల్ల నొప్పితో ఎప్పుడో కాళ్ళీడుస్తుంటే చూచినవాడల్లా అడ్డకాళ్ళ పెద్దమ్మలను గాడిద కాళ్ళవాడన్నాడు. 'గాడిద చెవులు' అన్న జాతీయం కూడా ఇలాంటిదే. త్రిస్థాయి సంగీతాన్ని వినిపించటంలో దివ్యశక్తి గల గార్దభాన్ని పట్టుకొని 'గాడిద చెవులు' అనటం కేవలం అన్యాయం! పాశ్చాత్యలోకంలో కూడా గార్దభ శ్రవణశక్తిని గురించిన ఈ అపోహ ఎందుకో కలిగింది. తాను పట్టుకొన్నదల్లా బంగారమయ్యే వరాన్ని పొంది, అత్యాశ చేత తన చుట్టూ ఉన్న సర్వస్వాన్ని స్వర్ణం చేసి, ఆకలితో అలమటించిన 'మైదాస్' రాజులు ఇతనికీ, 'పాన్' అనే సస్యదేవతకూ జరిగిన సంగీతం పోటీలో విజయాన్ని 'పాన్'కు కట్టబెట్టడం కోసం ఇతని చెవులను గార్దభాశ్రవస్సులుగా మార్చినట్లు కనిపించడం ఇందుకు తార్కాణం.) ఉత్సాహరాహిత్యానికి, మాంద్యానికి, మంకు పట్టుకు, మర్యాదావిహీనతకు సంకేతమైపాశ్చాత్య దేశాలలోను గార్దభం గౌరవప్రతిష్ఠలను ఏ కాలంలోనైనా ఆర్జించుకున్నట్లు కనుపించదు.

రూపరేఖల్లోగాని, బుద్ధివర్తనలలో గాని లోకంలో ఇంత వ్యతిరేకత ఉన్న గార్దభ జాతి సముద్ధరణకు స్థిరసంకల్పుండనైన నాకు "క్రియాసిద్ధిస్సత్త్వే భవతి మహతాం నోపకరణా" మహాత్ములకు పని నెఱవేరటం ప్రభావం వల్ల కలుగుతున్నది. ఉపకరణాల వల్ల కాదు. అమంత్ర మక్షరం నాస్తి నాస్తి మౌషధం. అయోగ్యః 'పురుషోనాస్తి యోజక స్తత్ర దుర్లభః - మంత్రం కాని అక్షరం లేదు, ఔషధం గాని మూలిక లేదు. యోగ్యత లేని పురుషుడు లేడు - కాని వాటిని 'సంఘటిత పరచువాడు లేడు అన్న పెద్దల సూక్తులే ఉద్బోధకాలు.

మర్నాడు సభాప్రారంభం కాకముందే వైయాకరణ సార్వభౌముడితో మాట్లాడి జంతు శబ్దాన్ని, మనుష్యులతో సహా సర్వజంతువులకు సామాన్యపరంగా వాడినట్లే ‘జన' శబ్దాన్ని సర్వజంతు సామాన్య పదంగా ప్రయోగించే రూఢిని కల్పించవచ్చునని అనిపించుకున్నాను. మా సంఘంవారి అంతర్వలయంలోని (Inner Circle) ప్రధాన సభ్యులొకరిద్దరికి నా ఉద్దేశాన్ని సూచించాను. “ఆత్మవత్ సర్వభూతాని” అన్న అంశం మీద నాకంటె విశేష ప్రత్యయము గలవాళ్ళు, ఉదార కరుణామూర్తులు, వైచిత్రియెడ విశేషాసక్తి గలవారు అయినవారు రాసభసముద్ధరణ విషయంలో సర్వవిధాలా తోడ్పాటిస్తానన్నారు. నేను కొంత సాధనసామగ్రి సంపాదించుకున్నాను.

ఉపన్యాస ప్రారంభంలో దేవతాభక్తి విశ్వాసాల మీద విశేషత గమనించి "శీతలాదేవికి శ్రీవాహనోన్నతి చెలువొందె నేజాతి కాలము సామి" అన్న పంక్తికి మా సనాతన సభ్యుడొకడు సంతోషాన్ని ప్రకటించటం గమనించాను. గార్దభానికి ఉన్న సత్త్వప్రీతిని, శాంతిరస ప్రణయాన్ని ప్రత్యేకించి వివరించాను. రాసభ, గర్దభ, శబ్దాత్పత్తులు చెప్పి గార్దభానికి గల శబ్ద ప్రాధాన్యాన్ని ఉటంకించటం కొంత రక్తి కట్టింది. త్రిభువన భాండ నిర్మాణానికి కులాలుడు, మృత్తికలతో బాటుగా గార్దభము సహాయ కారణమైంది అన్న నా వాదం విన్నమీదట, ఒక తార్కిక శిరోమణి ఇది గొప్ప విషయమన్నట్లు నేత్రాలను విస్ఫారితం చేశాడు. విధాతృని ప్రధాననిర్మాణాలలో ఒకటి కావటం చేత శబ్ద ప్రధానము, సత్త్వ విస్ఫురితము అయిన రాసభము, పరిశుద్ధులకు గాని పట్టుబడనని అభివ్యక్తం చేయటం కోసము నేడు రజకుల నాశ్రయిస్తున్నది అన్న అంశం ఒక వర్గంవారికి మనోరంజకమైందన్న విషయాన్ని గమనించాను. ఉన్నదో, లేదో వేదంలో గర్దభప్రశస్తి కనిపిస్తున్నదన్న నా బుకాయింపు రాసభానికి శబ్ద ప్రామాణ్యాన్ని చేకూర్చటమే కాక కొంత వైశిష్ట్యాన్ని చేకూర్చింది.

"గంగి గోవుపాలు గరిటడైనను చాలు, కడివెడైన నేమి ఖరము పాలు?” అని నేమన్న తిరస్కార పూర్వకంగా ఏ దృష్టితో అన్నాడో గాని, ఖరము పాలు కడివెడు లభించటమంటే సామాన్యమా? ఖరము పాల ఘనత సర్వసన్యాసి వేమన్నకేం తెలుసు? కాని సౌందర్యపోషకాలున్న సంవర్ధకమైన ఖరక్షీరాన్ని స్నానద్రోణులతో నింపుకొని స్నానమాడి జగదేక సుందరిగా రూపొందిన క్లియోపాత్రా నడిగితే తెలుస్తుంది. ఈ సందర్భంలో గాడిదను పాలిచ్చి పొమ్మని తల్లి జోల పాట పాడటం, "పాటిమీద పోయె ఓ పల్లెగాడిదా! పరిగెత్తి అబ్బాయికి పాలిచ్చి పోవె” అన్న జానపద సాహిత్యంలో పేర్కొనదగ్గది.

కృష్ణావతారం సమయంలో గార్దభం చేసిన మేలు లోకం ఎన్నడూ మరువజాలదు. చెరసాలనుంచి చిన్ని కృష్ణుని గోకులానికి చేర్చేటప్పుడు వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్న విషయం పురాణప్రసిద్ధం. ఎప్పుడో రజకుని ఇంట దొంగలు పడ్డారని ఓండ్రపెట్టి మేల్కొలిపిన సందర్భాన్ని అపార్థం చేసుకుని, వసుదేవుడు తొందరపడి గాడిద కాళ్ళు పట్టుకున్నాడేగాని దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం పరమాత్మ అవతరించిన అంశాన్ని అర్థం చేసుకోలేనంతటి అవ్యక్తప్రాణి కాదు గార్దభం.

ప్రాచీన రాజవంశీయులలో గౌరవప్రదమైన జంతువులను తమ వంశచిహ్నంగా ఉంచుకోవటం కద్దు. దేవగిరి యాదవ రాజవంశీయులు మేషశిరాన్ని తమ రాజవంశ చిహ్నంగా నిలుపుకున్నారు. అలాగే గార్దభ వంశీయులు రాసభశీర్షాన్ని తమ రాజచిహ్నంగా స్వీకరించి ఉంటారనటంలో చరిత్రకు వ్యతిరేకత ఎక్కడా ఉండదనుకుంటాను.

అజ్ఞాని ఐన రజకుడు అపార్థం చేసుకుని కుర్కురాన్ని శిక్షించే బదులు గార్దభాన్ని చంపుకొని అప్రతిష్ఠ తెచ్చిపెట్టాడే గాని, ఆ కథాసందర్భంలో కూడా తప్పిదం గార్దభానిది కాదనే మా మతం. “సాదురేగిన తల పొలమున గాని నిలువదన్నట్లు" అప్పుడప్పుడూ గగ్గోలుగా ఓండ్రపెట్టినా గార్దభం అతి సత్వప్రధానమైన జంతువు. కనుకనే జీసస్ ప్రభువు ధర్మవిజయం కోసం జెరూసలెంకు ధర్మ జైత్రయాత్రకు బయలుదేరేటప్పుడు గార్దభవాహనారూఢుడై పయనించాడు.

ఎవరెన్ని రీతుల తిరస్కరించినా బిడ్డల తిరస్కారాన్ని పొందని జంతువులు లోకంలో గార్దభాలే. అందువల్లనే “బాలేయా” లన్న పేరు ఈ జంతుజాతికే దక్కింది. బాలేఖ్యువత్సే భవ్య హితాః బాలేయాః - తమ పిల్లలకు హితమైనవి. మనుష్య జంతువులతో సహా ఇలా బాలేయా లనిపించుకోదగ్గవి లోకంలో మరొక జంతుజాతి శశవిషాణం!

ఈ ప్రయాణసమయంలోనే గార్దభ పృష్ఠప్రదేశంలో నీలిమచ్చ ఏర్పడ్డది. అక్కడి కేశాలు ఒకటి రెండు పెరికి కోరింత దగ్గు ఉన్న పిల్లలకు మెడలో తావీజు కట్టితే, అది చేతితో తుడిచినట్లు తగ్గిపోవడం ఈ నాటికీ పశ్చిమాసియాలో స్థిరమైంది. అన్నట్టు ఆసియా సమైక్యతకు అత్యంతకృషి చేస్తున్న మనకు గార్దభం 'ఆసియా జంతువు' అని తెలుసుకోవటం, దాన్ని సముద్ధరించే కార్యక్రమవిషయంలో అత్యంతావశ్యకమైన అంశం. "కరవగ వచ్చునే బలిమి గాడిదకున్ పులితోలు గప్పినన్" అని తరువాతి కాలంలో చులకనగా చూడబడటం తటస్థించినా, ఒకనాడు స్వేచ్ఛా సంచారం చేస్తూ కదుపులు కదుపులుగా ఆసియా మహారణ్యాలల్లో గార్దభం విశృంఖల విహారం చేస్తున్న దినాలలో, అవి జగదేకవీరుడు సీజర్ మహాశయుని హయరత్నాలను వెన్నాడి పట్టుకొని హతమార్చి మిగిలినవాటిని త్రిప్పి పంపినట్లు యాత్రాగ్రంథాలవల్ల తెలుస్తున్నది.

ఇంతేకాదు, ప్రాచీనులైన ఈజిప్ట్ దేశీయులకు, రోమనులకు, గ్రీకులకు గార్దభం అతి పవిత్రమైన జంతువు. వారి దృష్టిలో ఇది ఎప్పుడో రసోద్రేకం కల్గినప్పుడు ఓండ్ర పెట్టటం తప్ప తెలివి తక్కువతనం లేని జంతువు. అంతేకాదు, మేధాసంపత్తి గల ప్రాణి. అమితమైన ఆధివ్యాధి నివారకములైన నంత విచిత్రశక్తులు గల జంతురాజము. పరోపకారం చేయటంలో, అన్యుల బాధను తాను అనుభవించటానికి అంగీకరించేది. వృశ్చికం కుట్టినవాళ్ళు దానిపై నెక్కి చెవిలో “నన్ను తేలు కుట్టిం" దని చెపితే వెంటనే ఆ బాధను తాను పుచ్చుకొని అవతలి వ్యక్తికి వ్యథానివృత్తి కలిగిస్తుందట!

అన్నీ చెప్పి రసరాజమైన శృంగారం విషయంలో గార్దభానికున్న ఘనతను కప్పిపుచ్చటం శ్రేయస్కరం కాదు. రాసభ భోగరాసిక్యాన్ని -

"ఆఘ్రాయాఘ్రాయ గంధం వికట ముఖపుటో దర్శయన్ దంతపంక్తిం ధావత్యున్ముక్త నాదో ముహురపి చ రసాత్ భ్రష్టయా పృష్ఠలగ్నః | గర్దభ్యాః పాదఘాత ద్విగుణిత సురతప్రీతి రాకృష్ణ శిశ్నో వేగాదారుహ్యముహ్యన్ అవతరతి ఖరః ఖండిత శ్చిరేణ |"

అని ఇలా వర్ణించటంలో అతిశయోక్తి అణుమాత్రం లేదు. "గర్దభ్యాః పాదఘాత ద్విగుణిత సురతప్రీతిః” అన్నది శృంగార రాసిక్యవిషయంలో పరాకోటినందున్న స్థితి అనటం ఛిన్న సంశయం. సత్యభామాపాదతాడిత శిరోరసికుడైన శ్రీకృష్ణుడే ఇందుకు సాక్ష్యము.

కామాంగ దైర్ఘ్యం వల్ల గార్దభం లైంగిక చిహ్నం (Sexual Symbol) గా రోమక లోకంలో విఖ్యాతి గన్నది. ప్రేమికులు శుభం కోసం గార్దభశీర్షాలను శయ్యలపై వ్రేలాడదీయించేవాళ్ళట! ఆప్రొడైట్ సయోనీసస్ల పుత్రుడైన వెరియపస్ అనే రోమక దేవత 'దుష్టో' కామోద్రేకవిజృంభణం నుంచి తన్ను తప్పించినందుకు 'ర్షియా' గార్దభాన్ని శ్రవఃకింకిణులతో అలంకరించి తన ఆలయాలలో గౌరవస్థానాన్ని కల్పించింది. చెడ్డ తప్పిదాలను చేసినవారిని, అవమానించదలచినవారిని గాడిదపై ఎక్కించి ఊరేగించటం అన్ని దేశాలలోనూ ఆచారంగా ఉన్నదనటానికి, మహాజ్ఞాని సోక్రటీస్ అజ్ఞానులైన గ్రీకులవల్ల పొందిన శిక్ష నిదర్శనముగా ఉంది.

మానవజాతి సాంస్కృతిక చరిత్రలో గోయుగం, దాన్ని త్రోసిపుచ్చి, అశ్వయుగం, అశ్వయుగాన్ని త్రోసిపుచ్చి యాంత్రిక యుగం వచ్చినట్లు స్పష్టరూపంగా గోచరిస్తున్నది. కాని మానవచరిత్రలోనే ఆదిగ్రంథమైన ఋగ్వేదంలో గోయుగం మహోన్నతంగా, ప్రస్ఫుటితమౌతున్నది. అంతకు పూర్వమైన ఆధారాలేవి లభించినా, గార్దభయుగం ఒకటి ఉండి తీరుతుందని, మానవుడు సాంస్కృతికంగా కళ్ళు తెరువక పూర్వమే గార్దభం అతడికి అనంతంగా సేవ చేసిందనీ మా దృఢనిశ్చయం. ఈ జాతి అదృష్టం మానవజాతి అజ్ఞానం వల్ల తారుమారైంది. 'Symbol of cow is a purity and a live epic of India' – అన్నాడు మహాత్ముడు. నేడు ఈ జాతి నుద్ధరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నాడు నాకు ఇంత గార్దభాభిమానమున్నదని చెప్పుకోటానికి సంశయించలేదు. మనకు రాన్ బ్రీవెర్ అనే జర్మనీ దేశీయుడు మార్గదర్శి సౌత్ హాల్ లో గార్దభ ఘోషాన్ని నడుపుతూ 'ధూమపత్రరాజు', 'స్వర్ణరాజు' ఇత్యాదిగనే తాను తన్ను “గార్దభ రాజు” నని నిర్భీతితో వ్యవహరిస్తున్నాడు. మీరు గార్దభ జనోద్ధరణకు పూనుకొంటారనీ మా పతిత జనోద్ధరణ సంఘం మీకు సర్వవిధాలా సహకరిస్తుందని మనవి చేస్తూ, సభాసభ్యుల హర్షధ్వానాలను అందుకొని నా ప్రశస్త రాసభోపన్యాసాన్ని పూర్తి చేశాను.