వాడుకరి:Jahnavi morla/sand box/కన్నబెన్నా
అడవి శాంతిశ్రీ
• చారిత్రాత్మక నవల •
ఉపక్రమణిక
కన్నబెన్నా
మహాబలేశ్వర జటామకుటవినిర్గత సుందరీ! కన్నబెన్నా! పశ్చిమాద్రితనయా! మలయసానుజా! శీతలవాయుదేవ సహోదరీ, నీలనదీ మృగమదము గదంబించే నీ నీలనీరాలలో విజయపుర ఇక్ష్వాకురాజాంతఃపుర వక్షోజ చందన చర్చలు కలసి కదలిపోతున్నవి.
ఏనాటి కాంతవు! యుగయుగాల నుండి నీవు గంభీరంగా ప్రవహిస్తున్నావు నువ్వు. గంగా సింధు యమునా బ్రహ్మపుత్రలు నీకు కడగొట్టు చెల్లెళ్ళు. నీవూ, గోదావరి కవల పిల్లలు. నీవే జంబూనదివి. నీ ఇసుకలో బంగారు కణికలు, బంగారు రజను మిలమిల మెరసిపోయేది. ఈనాటికి నీ తీరాన స్వర్ణగిరి నిలిచి ఉంది. బంగారు గనులు నీ యొడ్డుల తలదాచుకొన్నవి. నీ గంభీర గర్భములో జగమెరుగని వజ్రాలు రత్నాలు నిదురిస్తున్నవి. నీది రతనాల బొజ్జ.
కృష్ణవేణీ! నీలనదీ! ప్రేమమయీ! అనేకాంధ్ర సార్వభౌమ సహచరీ! ఆంధ్రాంగనా! నీవు నీలవపుషవై, లోకానికి నిత్యత్వాన్ని ఉపదేశిస్తూ ఉంటావు. నీవు నిర్మలాంగివై, నిత్యసృష్టిని లోకానికి పాటపాడి వినిపిస్తూ ఉంటావు. ప్రతియామినీ నీరవఘటికలలో నీ అక్క గోదావరితో హృదయమార వాకోవాక్యాలు పలుకుతూ ఉంటావు. నీవు ఆంధ్ర వసుంధరా నీల మేఖలవు.
గోదావరి ఏకావళి. మహానదీ తపతులు ఆయమ్మ బాహువులు. నర్మద చెంపసరులు. కావేరి వేగైలు ఆమెకు మంజీరాలు.
కృష్ణవేణీ! దివ్యసుందరీ! మనోహర నృత్యవిలాసినీ! నమోనమస్తే. ఆంధ్రి
కొన్ని కోట్లకోట్ల సంవత్సరాల క్రిందట నువ్వు రూపెత్తి ఉంటావు ఆంధ్రదేవీ! ఆ దినాలలో, ఆ వేడిలో, ఆ ఉబికిపోయే అగ్నికుండాలలో, ఆ మెట్టలలో, పల్లాలలో, ఆ ఉబ్బలిలో, ఆ మట్టల మహారణ్యాలలో ప్రయాణం చేసే నీ బిడ్డలు గోదావరీ కన్నబెన్నాది వాహినులు నీతోపాటే అవతరించిన సముద్రుణ్ణి చేరడానికి ఎంత ఆయాసపడిపోయినవో!
లక్షలు లక్షలు సంవత్సరాలు నీవు బాలగండాలుదాటి, చల్లబడిన వెనుక జంబూద్వీపపు టొడిలో ఆడుకొంటూ, ఉదయ సముద్రతీరాల ఇసుకలతో బొమ్మరిళ్ళు కట్టుకునేదానవు. ఆ నాళ్ళలో నీవు శూన్యకటీరవు. ఆంధ్రభూమీ! ఇంకను లక్షల సంవత్సరాలు గడిచాయి సుమా! నీ నదుల ఒడ్డులతో అడవులు భూగర్భంలో ఇంకి బొగ్గుగనులవుతున్న ఘడియలవి. వికృతరూపాలతో వీర విహారంచేసే ఆ సరీసృపాలు నశించాయి. కొత్త జంతువులు క్రిములు, కీటకాలు ఉద్భవించాయి. ఆ దినాల్లోనే తమః ప్రధానుడైన మానిసి నీ అంకతలాన ఆడుకొన్నాడు. ఆ రెండుకాళ్ళ జంతువుకు ఏ కొంచెమో మనస్సు ఉంది. అతడు రాత్రించరుడు, ఆతడు మాంసా శనుడు.
ఇంకా లక్షల సంవత్సరాలు గడిచినాయి. సాత్విక రాజసులైన అసురులు సముద్రతీరాల రాజ్యాలు ఏర్పరుచుకొన్నారు. వారు పొడుగరులు, తెల్ల మేనులవారు, పైడివన్నె కేశపాశాలవారు. ఆర్షమూ అనార్షమూ అయిన భగవద్విచారము చేయగలవారు.
ఓ గోదావరీ, ఓ కృష్ణవేణీ! మీరు వీరప్రసవిణులు. సంస్కార ప్రియులైన ఆ అమరసంతతులు మీ తీరాల అనేక నగరాలు నిర్మించారు. వారి నగరాలు జగత్ప్రసిద్ధి పొందినవి. వారు శివపూజాధురంధరులు. గోదావరీ కన్నబెన్నల వెన్నుదన్ని పుట్టిన సింధునదీ తీరాలలో ఎంతో నాగరికత వృద్ధిచేసుకొని, హిమాలయ లోయలనుండి దిగివచ్చిన ఆర్యజాతులవారి వలన ఆ అసురులు ఓడిపోయారు. అంతట పశ్చిమ జంబూ ద్వీపం పొడుగునా వారు సముద్రయానం చేస్తూ పశ్చిమసముద్రంలో లంక మొదలయిన దీవులలో కొందరు ఆగిపోగా, మిగిలినవారు ఇంకా దక్షిణానికి పోయి ఆ దినాలలో ఇంకా పేరులేని కన్యకాగ్రం చుట్టివచ్చారు. వారిలో కొందరు కావేరీ ముఖద్వారంలో ఆగిపోయారు. ఇంకా కొందరు ఉత్తరంగా వచ్చి దక్షిణ పినాకిని ముఖద్వారంలో ఆగారు. ఇంకా కొందరు ఉత్తర పినాకిని కన్నబెన్నా గోదావరీ ముఖద్వారాలలో ఆగినారు దీవీ!
ఇంకా కొన్ని వేల సంవత్సరాలు గడచినాయి. అసురుల అన్నదమ్ములైన ఆర్యులలో విభేదాలు పొడమి, ఆంధ్రు లనేవారు విడిపోయి మెట్ట దారిని వింధ్యను దాటి ఉత్తరకళింగం, అక్కడనుండి గోదావరీతీరం చేరుకొన్నారు. ఆంధ్రులలో కొందరు తెలుగునదితీరాన ఆగిపోయినారు. కొందరు గోదావరి తీరాన ఆగిపోయినారు. కొందరు కన్నబైన్నా తీరానకు వచ్చి ఇదివరకే అచట వృద్ధిపొంది ఉన్న అసురులతో యుద్ధాలు సలపడం ప్రారంభించారు. ఆంధ్రరాజయిన విష్ణువునకు, అసురుడగు నిశుంభునకు ఎంతకాలమో యుద్ధం జరిగింది. నిశుంభాసురుడు హతుడైనాడు. ఆంధ్ర వంశ్యులు ప్రభువులైనారు. ఓ ఆంధ్రవసుంధరా! అంత నీపైడి కడుపున ఆంధ్రబాల అవతరించింది.
చంద్రకళ
తల్లీ, ఆంధ్రవసుంధరా! నువ్వు చంద్రకళాదేవివి! యుగ యుగాలనుండి అసురులకు చంద్రకళే దేవి. ఐసీస్, ఇస్తారతీ! ఈశానీ! ఈజిప్టులో, అసురదేశంలో (అస్సీరియా) సింధుతీరంలో చంద్రకళాదేవి తన జ్యోత్స్నామందహాసాలలో బిడ్డలను ఓలలాడించి, వారి జీవితాలు అమృతమయాలు ఆనందపులకితాలు చేసినది.
ఆంధ్రమాతా! నీరూపము స్నిగ్ధపూర్ణ కౌముదీస్వచ్ఛము. నీ వామహస్తాన పుండరీకాలు శ్వేతకుముదాలు లీలాపుష్పాలై విలసిల్లుతున్నవి. నువ్వు త్రిభంగమూర్తివి. నీ అమృత పయస్సులను గోదావరీ కృష్ణవేణ్ణా పినాకినీ నాగావళీ తెలివాహ నదులలో ఆస్వాదిస్తున్నారు ఆంధ్రులు. భద్రాచల వేదాద్రులు నీ ఉత్తుంగ పయోధరాలు. నీవు సదాకోటి పత్రాల స్వర్ణ పద్మాసీనవు.
ఆంధ్రదేవీ! నీ సౌందర్యము చూచి ముగ్ధుడై నీ అంకమైన శ్రీశైలమునందే వసించినాడు మల్లికార్జునుడు. ఆనందమయీ! అమృతమయీ! ఆంధ్రమాయీ! నువ్వు చంద్రకళాదేవివి అవడంచేత కళలన్నీ నీ పెదవులలో నీ భ్రూయుగ్మంలో, నీ హస్తాంగుళులలో వికసించుతున్నవి. నీ కంఠము మధురాతిమధుర గాంధర్వము! నీ దివ్యవాక్కు మహాకావ్యము “ఓ దినం సుందరీ! నీ తనయులు జగదేకసుందరులు. నీ సుతులు లోకరాధ్యులైన! ప్రజ్ఞావంతులు. కత్తిపట్టినా గంటముపట్టినా కుంచె పట్టినా గొడ్డలి పట్టినా విల్లు పట్టినా విపంచి తాల్చినా నీ పుత్రుల ఎదుట నిలువ గలిగినవారేరీ? వేద మాత నీతనయుల ముఖమందే వసిస్తూంది.
ఆంధ్రమాతా, భరతమాతకు అనుగుబిడ్డవు అపరాజితాదేవివి. అఖండ కీర్తి విశారదవు, ఓ ఆంధ్రదేవీ! నువ్వు తెలుగు తల్లివి, నీది తీయతీయని తెలుగుభాష పూర్ణవర్ణ మాలాశోభితయై వేదాన్నే మధురంగా పాడగలిగిన మంత్రభాష పరుషధ్వనులు నీచే సారళ్యమాధుర్యాలు అలవరచుకొన్నవి. ఓ ఆంధ్రమాతా! నీ కుమారుడు ఆపస్తంబుడు, బ్రహ్మర్షి సుమా! ఆతడు అతని సోదరుడు బోధాయనుడు!,
చంద్రకళాదేవి వయిన ఆంధ్రీ! శాతవాహనులు నీ అనుగు బిడ్డలు శ్వేతతారాదేవి వయిన ఓ తెలుగుతల్లీ, సిద్ధ నాగార్జునుడు నీకు గారాపు బిడ్డడు. మాధ్యమికవాదం నీయందుదయించి లోకాన్ని ఉద్ధరించింది. ఓ దివ్యసుందరీ! నీ బాలికలయిన గౌతమీ వాసిష్టదేవులు లోకైక సుందరులు. వారి బిడ్డలయిన శాతకర్ణి పులమావి చక్రవర్తులు ఆంధ్ర తేజస్సును తారాపథాని కందించినారు. త్రిలోకమోహినులైన నీ యాడుపడుచుల అందానికి, అలంకారకౌశలం పూలకు తావిలా సహజంగా అబ్బింది. ప్రసాధన శిల్పంలో సర్వస్త్రీజగత్తుకు వారిది ఆచార్యపీఠం.
ఆంధ్రదేవీ! నీ యనుగుకూతుళ్ళు పురుషులతో సమానంగా విద్యలూ, వీర వ్యవసాయ దీక్షలూ, లలితకళా కౌశలమూ నేర్చిన వీరసతులూ, వీరమాతలు. ఆనందమూర్తీ! ఆంధ్రమూర్తీ! నీ కన్నులలో లోకాల వెలిగించు వెలుగు, నీ నవ్వులో దేశాల తేలించు ఆనందము, నీ నడకలో సీమసీమల నాగరీకాలు దిద్దే ఒయ్యారమూ.
ఆంధ్రీ! నీవు కలువకంటివి, చిలుకల కొలికివి, తేనెవాతెఱదానవు తీగ చేతుల దానవు, పూబంతి గుబ్బెతవు, నీ నుదుట వెన్నెలవెలుగులు, నీ నోట కోకిలాలాపాలు, నువ్వు కులుకు మిటారివి, కటారి కత్తివి.
ఆంధ్రీ! నీ బిడ్డలు నిన్ను ప్రేమింతురు. నిన్ను పూజింతురు, నీ ఎదపై వ్రాలుదురు. నీకై తమ సర్వమూ అర్పింతురు.
తెలుగుతల్లీ! నీకు ఏటికోళ్లు.