Jump to content

వల్లభాయి పటేల్/వెట్టిచాకిరి

వికీసోర్స్ నుండి

వెట్టిచాకిరి

మహాత్ముడు గుజరాతులో రాజకీయజీవితము నారంభించగనే పటేలు కాయనయం దధికవిశ్వాస మారంభ మాయెను. దీనికిఁ దగినట్లుగానే 1916లో గుజరాతు రాష్ట్రీయ రాజకీయసభ గోధ్రాలో జరిగెను. దానికిఁ బటేలు కార్యదర్శి, మహాత్ముఁ డధ్యక్షుఁడు. ఆసభలో నొక నిర్మాణకార్యక్రమ మేర్పఱుపఁ బడినది. ఆ కార్యక్రమ నిర్వహణమున కొక కమిటీ యేర్పడెను. వల్లభాయి యా కమిటీకిఁ గూడఁ గార్యదర్శియయ్యెను. ఒక కార్యము చేయఁదలఁచికొన్నప్పుడు మీన మేషాలు లెక్క పెట్టుకొనుచుఁ గూర్చుండువాఁడుకాఁడు పటేలు. నీళ్లునమలుట యాయన ప్రవృత్తిలోనేలేదు. చేయఁ దలఁచికొన్నపని చకచక చేయుటయే యాయన స్వభావము. ఆ ప్రాంతములో వెట్టిచాకిరి యధికముగా నుండెను. దానిని మొట్టమొదటగాఁ దుదముట్టించవలెనని పటేలు పట్టుపట్టెను. మహాత్ముఁడు చాంపరాను రయితులలోఁ బనిచేయుటకు వెళ్లి యుండెను. కార్యభారమంతయుఁ బటేలుపైనే పడెను. ఆయన కమిషనరు కొక యుత్తరము వ్రాసెను. దానికి సమాధానము రాకపోవుటచేతఁ గమిషనరు కొక నోటీసు నిచ్చెను. వారము రోజులలో నీ నోటీసుకు సమాధాన మీయకపోయిన హైకోర్టు ఫైసలాయితా ననుసరించి, యీ వెట్టిచాకిరి శాసన విరుద్ధమైనదని భావించి, దీనిని మాన్పించుటకుఁ బ్రయత్నించెదనని సూచించెను. ఆరోజునే కమిషన రాయనను బిలిపించి పటేలు సూచన ప్రకారము వెట్టిని మాన్పించెను.