Jump to content

వల్లభాయి పటేల్/కెయిరా సత్యాగ్రహము

వికీసోర్స్ నుండి

కెయిరా సత్యాగ్రహము

గుజరాతు దేశములోని కెయిరా జిల్లాలో 1918లోఁ బంటలు పండక కఱవేర్పడినది. పండినను నెండినను బన్ను మాత్రము తప్పదని ప్రభుత్వముపన్నులకై రయితులను బెక్కు బాధలు పెట్టసాగిరి. రైతుదగ్గర డబ్బులేదు. విఠల్‌భాయి మొదలగు నాయకు లా సంవత్సరముపన్నులు రద్దుచేయవలసినదని వాదించిరి. కాని ప్రభుత్వము వారిమాటను బెడచెవిని బెట్టినది. పంట నాల్గవవంతుకుఁ దగ్గినఁ బన్నును వసూలు చేయరాదని ప్రభుత్వనియమములఁ గలదు. ఆ సంవత్సరము పంటలోఁ బాతిక వంతుకూడ లేదు. సర్కారుద్యోగులు పంటలు బాగుగఁ బండినవని వాదించసాగిరి. కాని యీ విషయమును బహిరంగముగ విచారించుటకుఁ బ్రభుత్య్వ మంగీకరించలేదు. ప్రభుత్వోద్యోగులు రైతులను బన్నులకై బాధలుపెట్టసాగిరి. అందుచేత రైతులు రక్షణకై గాంధిజీ నాశ్రయించిరి. రైతుల వాదము సరియైనదని మహాత్ముఁడు తెలిసికొని ప్రభుత్వముతో నీ విషయమును బరామర్శించెను. కాని ప్రయోజనము లేకపోయినది. అంతట మహాత్ముఁడు సత్యాగ్రహము ప్రారంభించెను. రయితులను జైలుకు బంపినను, నాస్తులు జప్తులు చేయించి వేలము వేయించినను ప్రభుత్వమువారు పన్నులు వసూలు చేయలేకపోయిరి.

చాంపరాను సత్యాగ్రహములో రాజేంద్రప్రసాదు గాంధిజీకిఁ గుడిభుజముగానుండి పనిచేసినట్లే వల్లభాయి యీ సత్యాగ్రహములోఁ దన వృత్తిని వదలిపెట్టి యధికకృషిచేసి సత్యాగ్రహ విజయమునకుఁ దోడ్పడినాఁడు.