వల్లభాయి పటేల్/బోర్సద్ సత్యాగ్రహము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వివిధ ప్రాంతములనుండి వాలంటీర్లు వచ్చి ఖైదులో నంతులేని బాధల నొందిరి.

పటేలు సోదరులు ముఖ్యముగ నా యుద్యమమున కండఁగా నిలఁబడిరి.

జులై 18 వ తేది పతాకాదినముగా నిర్ణీత మయ్యెను. కాంగ్రెసు కార్యనిర్వాహక వర్గము వా రా నాఁడు దేశమంతటఁ బతాకోత్సవములు, నూరేగింపులు జరుపవలసినదిగా రాష్ట్ర కాంగ్రెసు సంఘములకుఁ దాఖీదులు పంపించిరి.

తదాజ్ఞానుసార మన్ని ప్రాంతముల యందును బతాకోత్సవము విజయోపేతముగ సాఁగెను. వల్లభాయి పటేలు కూడ జులై 18 తారీఖునఁ ప్రభుత్వము వారిచే నిషిద్ధప్రదేశముగా నిర్ణయింపఁబడినచోటఁ బతాకోత్సవము జరిపించెను. ప్రభుత్వము కిమ్మనలేదు. తరువాతఁ బ్రభుత్వమువారు సత్యాగ్రహుల నందఱను బేషరతుగా విడుదలచేసిరి.

బోర్సద్ సత్యాగ్రహము

బోర్సద్ గ్రామ మరాజక వాదులకు దోపిడిగాండ్రకు నిలయమని చెప్పి ప్రభుత్వము ప్రత్యేకపుఁ బోలీసు సిబ్బంది నక్కడఁబెట్టి, వారిపై 1922లో రెండులక్షల నలుబదివేల రూపాయల యదనపుపన్ను శిక్షార్థము విధించిరి. ఇది చాల నక్రమమైన యారోపణము. ఈ దోపిడులు పోలీసువారి యిషారావల్ల జరుగుచున్నవిగాని మఱియొకటికాదు. (పోలీసుల తుపాకులుకూడ దోపిడిగాండ్ర యొద్దనుండెను. పటే లీ విషయ మును గమనించి ప్రభుత్వమును హెచ్చరించెను. ప్రభుత్వము వల్లభాయి మాటను మొదటఁ బెడచెవిని బెట్టెను. ఆయన యొక మాసమురోజు లక్కడ మకాముపెట్టి ప్రజ లా పన్నీయకుండ సత్యాగ్రహము చేయించెను. చిట్టచివరకుఁ బ్రభుత్వము వారు హోంమెంబరును విచారణకుఁ బంపించిరి. ఆయన శిక్షార్థము పన్ను విధించుట యక్రమమని రిపోర్టు వ్రాసెను. ఈ విధముగఁ బటేలు బోర్సదులోకూడఁ దన విజయ పతాకను బ్రతిష్ఠించెను.

అహమ్మదాబాదు మునిసిపాలిటీ అధ్యక్షత

స్థానిక సంఘములలోఁ బ్రవేశించ వచ్చునని కాంగ్రెసు తీర్మానించినది. తదనుగుణముగాఁ గాంగ్రెసు ప్రముఖ నాయకులు వానిలోఁ బ్రవేశించిరి. చిత్తరంజనదాసు, విఠల్ భాయి పటేలులు వరుసగాఁ గలకత్తా, బొంబాయి కార్పొరేషనులకు మేయరులైరి. రాజేంద్రబాబు పాట్నాకు, జవహరులాల్ నెహ్రూ అలహాబాదుకు, వల్లభాయి యహమ్మదాబాదుకు మ్యునిసిపల్ అధ్యక్షులైరి. కాని వా రెక్కువకాల మీ పరిపాలనలోఁ బాల్గొనఁజాలక విడచిపెట్టవలసినవారైరి. వల్లభాయి మాత్ర మట్లు వదలిపెట్టలేదు. ఆయన దేనిలోఁ బ్రవేశించినను సగము సగముపనులు చేయఁడు. (1924 మొ|| 1928 వఱకు నైదు సంవత్సరము లహమ్మదాబాదు పురపాలక సంఘమున కధ్యక్షత వహించి యెన్నో మార్పులు చేసెను. నగర పారిశుద్ధ్యమును బెంపొందింపఁ జేయుటయేగాక, ప్రయిమరీ పాఠశాలల యుపా