వల్లభాయి పటేల్/పితృ పరిచయము

వికీసోర్స్ నుండి

న్వయమొనర్చిన నేర్పరి - అశోకుఁడు, అక్బరు సాధించలేని యేకచ్ఛత్రాధిపత్యము సాధించిన సామర్థ్యము సర్దారుకే కలిగినది. సర్దారు తన జీవితములో సాధించిన ఘనతర విజయ మిది.

అంతర్జాతీయ విషయముల నెహ్రూ అఖండ ఖ్యాతిఁ గాంచినటులనే దేశరక్షణవిషయములలోఁ బటేలు ప్రతిభావంతుఁడని ప్రఖ్యాతిఁ గాంచినాఁడు.

వారు భారత భాగ్య విధాతలు.

ఆయన నాయకత్వమున భారతభూమి యవరోధముల నన్నిటి నతిక్రమించి యనతికాలములో నభ్యుదయము నొందఁ గలదని నిస్సందేహముగా భావించవచ్చును.

పితృ పరిచయము

వల్లభాయిపటేలు తండ్రిపేరు జవేరుభాయి వృత్తిచేఁ గర్షకుఁడు. ఆయన జన్మస్థానము గుజరాతులోని పేట్‌లావ్ తాలూకాలోని కరంసాద్ గ్రామము - జవేర్‌భాయి సామాన్య గృహస్థుఁడే కాని ధైర్య సాహసములలో సాటిలేని మేటి. 1857 లో జరిగిన స్వాతంత్ర్యసమర మా కర్షకవీరు నాకర్షించినది. గొడ్డు, గోద, పిల్ల, మేక, భూమి, పుట్ర వదిలిపెట్టి యా స్వాతంత్ర్యసమరమునఁ జేరినాఁడు. వీర నారి ఝాన్సీలక్ష్మీ బాయి దళమునఁజేరి స్వాతంత్ర్య సమరము సాగించినాఁడు.

ఆయన తెలివితేటలు, నిర్భయత, యాయన కెన్ని యాపదలు వచ్చినను నభివృద్ధిఁ గాంచినవి. అందుల కొక యుదాహరణము. ఆ స్వాతంత్ర్యసమరమున ‘మలహర రా’వను నొక స్వదేశసంస్థానాధీశునిచే నాయన ఖైదునం దుంచఁ బడెను. ఒకనాఁ డా కారాగృహప్రాంగణముననే యా మహారాజు చదరంగ మాడుచుండెను. ఆయన యెత్తులలోఁ దప్పులు చూపి మంచి యెత్తులు చెప్ప సాగినాఁడు జవేర్భాయి. తుదకు మహారాజు జవేర్భాయి సాయము వలననే యాటలో గెలుపొందెను. అంతట మహారాజు జవేర్భాయిపై ననుగ్రహము కలవాఁడై యిట్టి వివేకసంపన్నుని బందిగా నుంచుట తగదని విడుదల చేయించెను.

జవేర్భాయిలో ధైర్యసాహసములతోపాటు భగవద్భక్తి కూడ నుండెను. ఆహార విహారాదులలో నాయన యతి జాగరూకత కలిగి యుండువాఁడు. నియమనిగ్రహములు కలుగుటచే మంచి యారోగ్యవంతుఁడై తొంబది రెండేండ్లు జీవింపఁ గలిగెను.

ఆపదలలో నమాంత మతిధైర్యముతో దూకునట్టి సాహసము, ప్రతిభ, కష్టసహిష్ణుత మొదలగు గుణగణము లన్నియు వల్లభాయికిఁ బితృపాదులనుండి సంక్రమించినవి.

జవేర్భాయికాఱుగురు సంతానము - అందైదుగురు కుమారులు; ఒక కుమార్తె. ప్రథముఁడు సోమాభాయి, ద్వితీయుఁడు నరసీభాయి. తృతీయ చతుర్థులు విఠలభాయి, వల్లభాయులు - ఐదవవాఁడు కాశీభాయి - కూతురు పేరు దహీబేను, చిన్నతనములోనే చనిపోయినది. నాలుఁగవవాఁడగు వల్లభాయి 1875 సంǁ అక్టోబరు 31 తేదీన జన్మించెను.