వల్లభాయి పటేల్/విద్యార్థిదశ
విద్యార్థిదశ
వల్లభాయి బాల్యములోఁ దండ్రివెంటఁ బొలము వెళ్లు చుండెడివాఁడు. తండ్రి కొలఁదిగాఁ జదివికొన్నవాఁ డగుటచేత నింటియొద్దఁ బాఠము లన్నిటి నక్కడఁ గంఠస్థము చేయించు చుండెను. ఇట్లు కొంతకాలమైనతరువాత నాతఁడు వల్లభాయిని నడియాడ్‌లోని యాంగ్లపాఠశాలకుఁ బంపెను.
బాల్యమునుండి పటేలు మంచిచుఱుకు, కఱకు గలవాఁడు. చదువుసంధ్యలలో నందఱకంటె నధికుఁడేకాని మిక్కిలిపెంకె.
ఒకసారి లెక్కలమాస్ట రింటివద్దఁ బది లెక్కలు చేసికొని రమ్మనఁగాఁ జేసికొనిరాలేదు. ఆయనకు లెక్కలు బాగుగానేవచ్చును. క్లాసులో లెక్కలు బాగుగనే చేయుచుండెను. అందుచేతనే యాయన యా లెక్కలు చేసికొని రాలేదు. అయినను దాను జెప్పినట్లు చేయనందులకుఁ బంతులు కోపించి మఱునాఁడు మఱల నా పదిలెక్కలను జేసికొనిరమ్మనిచెప్పెను. ఆనాడు పటే లొకగణికపుస్తకమును దీసికొని ‘యిదిగో! పంతులుగారు! ఇందుఁ జాలలెక్కలున్న’ వని చూపించెను.
ఆయన నడియాడ్‌లోఁ జదువుచున్న రోజులలో మఱియొక ఘట్టము జరిగినది. నేటికిఁగూడఁ గొన్ని స్కూళ్లలో జరుగుచున్నట్లే యాస్కూలులోఁగూడ నుపాధ్యాయుఁడు పుస్తకము లమ్ముచుండెను. ఇందువలన నాయనకుఁ గొంచెమో గొప్పయో లాభము ముట్టుచుండెను. తన వద్దనే పుస్తకము లను గొనుఁడని యాయన పిల్లలను దబాయించుచుండెను. మన పటేలు చిన్నతనములోనే యీ పంతులయొద్ద నెవ్వరును బుస్తకములను గొనఁగూడదని యొక పితూరీ లేవఁదీసెను. ఆ నాయకుని యాజ్ఞానుసారముగాఁ బిల్లలందఱును బుస్తకములు కొనకుండుటయేగాక, సమ్మెకూడఁ చేసిరి. ఇట్లయిదాఱురోజులు సమ్మె జరుగువఱ కా పంతులు లొంగివచ్చి మీ యిష్టము వచ్చినచోటఁ బుస్తకములు కొనవచ్చునని యంగీకరించెను. తమకోరిక నెఱవేఱగాఁ బటేలు పరామర్శతోఁ బిల్లలందఱును బడికి వెళ్లిరి.
నడియాడ్‌లో విద్యాభ్యాసమైన తరువాత వల్లభాయి ‘బడౌదా’ పాఠశాలలోఁ బ్రవేశించెను. సంస్కృతము చదువుట యాయనకిష్టములేదు. అది చాలాకష్టమైన భాషగా నాయనకుఁ దోఁచినది. అందుచేత మెట్రిక్ పరీక్షలో నాయన గుజరాతినే తీసికొనెను. ‘చోటేలాల్’ అను ఉపాధ్యాయుఁ డాయనకు గుజరాతి చెప్పుచుండెను. కాని యాయనకు సంస్కృత మనిన నమితప్రేమ. సంస్కృతము చదువనివారిని హేళన చేయు చుండెడివాఁడు. వల్లభాయి యాయన క్లాసులోఁ బ్రవేశింపఁగనే వ్యంగ్యముగా ‘దయచేయుఁడు, మహాపురుషు’లని యాయన హేళనచేసెను. వ్యంగ్యముగా నుడివిన యా వాక్యమే యథార్థమగునని యా పంతు లేమి యెఱుఁగును?
పటేలు కప్పుడు పదుమూడు, పదునాలుగేండ్లు - ఆఁతడు క్లాసులోఁ బ్రవేశింపఁగనే యుపాధ్యాయునకు నతనికి నీ సంభాషణము జరిగెను.
“ఎక్కడనుండి వేంచేసితిరి?” ‘కరంసాద్‌నుండి’ యని వల్లభాయి వినయపూర్వకముగా సమాధానము చెప్పెను.
“సంస్కృతము తీసికొనక గుజరాతీ తీసికొంటివే! సంస్కృతము లేక గుజరాతీ గణనీయముకాదని నీకుఁ దెలియదా” యని యా పంతులు లనెను.
అంతట నా పెంకెవా డిట్లుత్తర మిచ్చెను. “అందఱును సంస్కృతమే తీసికొన్నచోఁ దమరు చెప్పున దెవ్వరికి?”
ఈ యదార్థమును జెప్పినందుకుఁ బటేలు పంతులుగారి కోపమునకు గుఱియయ్యెను. ఆ రోజెల్ల బెంచిమీద నిలువఁబడ వలసినదిగా శిక్షింపఁ బడెను.
మాస్టరుగారి కీ శిష్యుని కీ శిక్షవిధించుటతోఁ దృప్తి కలుగలేదు. ఆయన క్రోధాగ్ని దినదినము ప్రజ్వరిల్లి వల్లభాయిని బాధింపసాగెను.
ఆయన వల్లభాయిని బ్రతిరోజు నింటివద్ద నధికముగా వ్రాసికొని రమ్మని విధించుచుండెను. గుజరాతీలో దీనిని ‘పహాడే’ యందురు. ‘పాడే’ యను నామాంతరమును గలదు. పాడే యనఁగ దూడ యనికూడ నిర్థాంతర మున్నది. ఒకనాఁ డా మాస్టరు పటేలును ‘నీవు పాడే చేసికొని వచ్చితివా’ యని యడిగెను.
పెంకెతనములోఁ బ్రసిద్ధుఁడైన పటేలు ‘మాస్టరుగారూ! పాడేను దీసికొని వచ్చితిని. స్కూలు ఆవరణలోనికి రెండు మూడడుగులువేసి సరాలునఁ బాఱిపోయిన’ దని సమాధానము చెప్పెను.
ఇటువంటి పిల్లవాని నెక్కడను జూడలేదని యతని ఈ పేజీ వ్రాయబడి యున్నది. ఈ పేజి వ్రాయబడియున్నదొ. మీదఁ గ్రుద్ధుఁడై పటేలును శిక్షింపవలసినదని హెడ్మాస్టరు వద్ద కాయన పంపించెను. ఆ ప్రధానోపాధ్యాయుఁడు యధార్థము చెప్పవలసినదని పటేలు నడిగెను. అంతటఁ బటేలు చేటభారతము నిట్లు విప్పెను - 'ఏమిచేయనండీ? ప్రతిరోజును నన్ను వ్రాసికొని రమ్మని వేధించుచున్నాఁడు ఇది యొక శిక్షయా? నేను జదివికొను పుస్తకమునుండి యేదైన వ్రాసికొని రమ్మనినఁ గొంత ప్రయోజన ముండును. వ్రాసినదే వ్రాసినచో నేమి ప్రయోజన ముండఁగలదు?" ప్రధానోపాధ్యాయుఁడు వల్లభాయి చెప్పిన మాటలను విని యతని నేమియు శిక్షింపక యూరకయే వదలిపెట్టెను. ఆ హెడ్మాస్ట 'రిట్టి పిల్లవాని నే నెన్నఁడుఁ జూడలే దని జీవితాంతమువఱకు నను చుండెడివాఁడు.
ఇట్లు పటేలు నిర్భయత, సాహసము, వినోదమును దెలియఁజేయు ఘట్టము లెన్నో విద్యార్థిదశయందుఁ గలవు.
నడియాడ్‌లో మఱొక యుపాధ్యాయునితో వివాద మేర్పడెను. తత్ఫలితముగా నాయన బడౌదా హైస్కూలు నుండి పంపివేయఁబడెను. తరువాత మఱల నడియాడ్‌లో హైస్కూలులోఁ బ్రవేశించి మెట్రిక్ పరీక్షలో నుత్తీర్ణుఁడైనాఁడు.