Jump to content

వల్లభాయి పటేల్/ఉపప్రధాని

వికీసోర్స్ నుండి

ఉపప్రధాని

"పరిపాలనలోఁ బాల్గొనుటకు బుద్ధిమంతులు నిరాకరించిన దుష్పరిపాలనక్రింద జీవితము గడుపు శిక్ష వారనుభవించవలసి యుండును."

-ప్లేటో.

తాత్కాలిక ప్రభుత్వానంతరము వివిధరాష్ట్ర సంస్థాన ప్రతినిధులతో రాజ్యాంగ పరిష త్తేర్పడవలసియుండెను. కాని దీనిలోఁ బాల్గొనుటకు ముస్లింలీ గంగీకరింపదాయెను. ప్రత్యల్ప విషయమునకు నది వ్యతిరేకించుచుండెను. ఈ లీగుపరిస్థితిని గ్రహించి పటే లెవరు సహకరించినను, సహకరించక పోయినను బరిషత్సమావేశ మాగఁబోదని ఘంటాపథముగఁ జెప్పెను.

ఆయన చెప్పిన చొప్పుననే 1946 డిశంబరు 9 వ తేదీ ననుకొన్నట్లు రాజేంద్రప్రసా దధ్యక్షుఁడుగ ముస్లింలీగు సభ్యులు హాజరు కాకపోయినను రాజ్యాంగపరిషత్తు ప్రారంభమాయెను.

ముస్లింలీగు నెహ్రూ ప్రభుత్వములోఁ జేరి యాంగ్లేయోద్యోగులతోఁ గలసి ప్రతిష్టంభన కావించుచుండెను. అటుల ప్రభుత్వముతోఁగలసిరాక యిటుల రాజ్యాంగపరిషత్తులోఁ బాల్గొనక ద్విజాతిసిద్ధాంతమును బ్రచారముచేసి యా సిద్ధాంత సాఫల్యమునకై జిన్నాగారి యధ్యక్షతను 'డైరక్టుయాక్షన్‌' అనగాఁ బ్రత్యక్ష చర్య యారంభించెను. ఇందువల్ల దేశమంతట హిందూ మహమ్మదీయ కలహములు చెల రేగెను. పంజాబు, బెంగాలు, ప్రాంతములలో నీరక్త పాతము మఱింత పెచ్చు పెరిగెను. భారత స్వాతంత్ర్యసంపాదనకు భిన్నముగఁ గొందరు దేశద్రోహులు చేయుచున్న దుష్కార్యములను గుఱించి మీరట్‌లో వల్లభాయి వివరించెను. దీనిని బురస్కరించుకొని యాయన మహమ్మదీయ ద్వేషి యని, వారిపై హిందువులను బహిరంగముగ రెచ్చగొట్టుచున్నాఁడని గాంధీజీయొద్దఁ గొందరు ఫిర్యాదుచేసిరి. దేశమునఁ జెల రేగిన రక్తపాతమునకు వ్యధితుఁడై గాంధీజీ ఢిల్లీలో నుపవాసవ్రతము పూనెను! ఆ యుపవాస దీక్షలో మహాత్ముఁ డొకనాఁ డిట్లు పలికెను.

"సర్దారు వల్ల భాయికి మహమ్మదీయుల యెడల విద్వేషమునట్లు పలువురు మహమ్మదీయమిత్రులు నాతోఁ బలికిరి. నా హృదయాంతరమునఁ జెప్పరాని యావేదన జనించినది. దానిని నాలోనే యణచివేసికొని వారు చెప్పినదంతయు వింటిని. పండిత నెహ్రూను నన్నుఁ గొండంతలుగాఁ గొనియాడుచున్న మీకు సర్దారు వల్లభాయిని మానుండి విడఁదీయుట యుచితము గాదు. అందఱను సమాదరించగల యుదారహృదయుఁడగు వల్లభాయి తలవని తలంపుగా నొక్కొకపు డొరులమనస్సు నొప్పి పడునట్లు తూలనాడుట గలదు. అతఁడు నా సహచరుఁడని, యావజ్జీవమిత్రుఁడని నే నాతనిఁ బూసికొనివచ్చుట లేదు."

"ఏ యహింసావిధానమున మన మిదివరలో విజయము సాధింపఁగలిగితిమో, యా యహింసావిధానమును బ్రభుత్వాధికారము హస్తగతమైన పిదప నవలంబింపలేమని యతఁడు గ్రహించెను. నేను నా సహచరులు దేని నహింసావిధానమని నిర్వచించు చుంటిమో యది నికరమగు నహింసావిధానము కాదనియు సాత్వికమగు నిరోధమున కనుకరణము మాత్రమే యనియుఁ గ్రమముగా గ్రహించితిమి. దేశపరిపాలనకుఁ గడంగిన వానికి 'సాత్వికనిరోధ'మక్కరకు రాదు. ప్రజల బాధ్యత వహింప వలసిన ప్రజాప్రతినిధియగు పరిపాలకుఁడే దుర్బలుఁడైనచో, నతని కాధిపత్య మొసంగిన ప్రజలగతి యేమి? సర్దారు వల్లభాయి తన్ను నమ్మినవారి నెన్నటికిని నట్టేట ముంచఁడనియు, వారిని హీనపఱచఁడనియు నాకుఁదెలియును."

గాంధీజీ యుపవాస మొనర్చినను, మఱియెంతగా మొఱ బెట్టినను మతకలహాగ్ని చల్లార లేదు. ఈ యగ్ని యిట్లుండగనే 1948 జూన్ నెలలోగా భారతదేశమునుండి బ్రిటిషువారు నిష్క్రమింతురనియు, నీలోగా భారతదేశ పరిపాలన మెవరికి స్వాధీనము చేయవలయునో నిర్ణయించుటకు లార్డు మౌంట్ బాటెన్‌ను రాజప్రతినిధిగాఁ బంపుచున్నామని బ్రిటిషు ప్రధాని పార్ల మెంటులో 1947 ఫిబ్రవరి 27నఁ బ్రకటించెను.

లోగడ నిశ్చయము ప్రకారము మౌటుబాటెన్ భారతదేశమునకువచ్చి కాంగ్రెసు ముస్లింలీగు నాయకులతో మంతనములు జరిపెను. ముస్లిము లధిక సంఖ్యాకులుగనున్న పంజాబు, సింధు, బెంగాలు; సరిహద్దు రాష్ట్రముల గలిపి "పాకిస్థాన్‌" అనుపేర ప్రత్యేకరాజ్యమును నెలకొల్పవలెనని ముస్లింలీగు నాయకులు మంకుపట్టుపట్టిరి. ఇందువల్ల బీహారు, పంజాబు రాష్ట్రములలో హిందూముస్లిందొమ్మీ లధికమయ్యెను. ఇందుచే సాధ్యమైనంత త్వరలో భారత దేశసమస్యా పరిష్కార ముచితమని బ్రిటిషు ప్రభుత్వము నిశ్చయించెను.

మౌంట్‌బాటెన్ 1947 జూన్ 7 వ తారీఖున భారత నాయకుల నాహ్వానించి బ్రిటిషువారి నూతన పథకమును దెలియజేసెను. దానిలో సారాంశమేమన రెండుమూడు నెల లలో బ్రిటిషు ప్రభుత్వము భారతపరిపాలనను దేశీయుల కొప్పగించును. హిందువులు ముస్లిములు హెచ్చుగానున్న రాష్ట్రములలో రెండు కేంద్రప్రభుత్వములు నెలకొల్పఁబడును. ఈ కేంద్ర ప్రభుత్వముల రెంటికి నధినివేశస్వాతంత్ర్య మీయఁబడును. ఇవి తమకిష్టమగుచో బ్రిటిషు రాజకూటములో నుండవచ్చును; లేకున్న స్వతంత్ర రాజ్యములుగ నిర్ణయించుకొని వేఱుపడ వచ్చును. స్వేదేశసంస్థానములు స్వతంత్రములగును. అవి యే యధినివేశములో నైనను జేరవచ్చును. కానిచో బ్రిటిషు ప్రభుత్వముతోఁ బ్రత్యేకముగా నొడంబడిక చేసికొనవచ్చును.

ఈ దేశ విభజనపద్ధతికిఁ దొలుదొలుత కాంగ్రెసు వారంగీకరించలేదు. కాని బ్రిటిషువారు ముస్లింలీగువారితో నేకీభవించి చేయుచున్న కుటిల రాజకీయ తంత్రాంగమువల్ల దేశమునఁ గల్లోలము హెచ్చుమీఱి రక్తపుటేఱులు పాఱుచుండుటచే గత్యంతరము లేక విదేశపరిపాలనవిముక్తికై యెట్ట కేల కీ విభజన సిద్ధాంతమున కిష్టపడవలసి వచ్చెను.

ఈ ప్రణాళిక ననుసరించి బ్రిటిషు ప్రభుత్వము 1947 సంవత్సరము జులై నాలుగవ తేదీని పార్లమెంటులో భారతస్వాతంత్ర్య శాసనమును బ్రతిపాదించెను.

ఈశాసనము ప్రకారము భారతదేశము విభక్తమై యధినివేశములుగా నేర్పడెను.

మద్రాసు, బొంబై, మధ్యరాష్ట్రము, సంయుక్త రాష్ట్రము, ఒరిస్సా, తూర్పుపంజాబు, పశ్చిమబెంగాలు, బీహారు, అస్సాం, (సిల్హటు జిల్లా మినహాః) ఈ రాష్ట్రములతో ఇండియన్ యూనియ నేర్పడి దానికి రాజధాని ఢిల్లీ కాఁగలదు. కరాచీ రాజధానిగా సింధు, సరిహద్దురాష్ట్రము, పశ్చిమ పంజాబు, తూర్పుబెంగాలు, (సిల్హటుజిల్లాతోసహా) పాకిస్థానధినివేశముగా 1947 ఆగస్టు 15 వ తేదీన నవతరించెను.

1947 ఆగస్టు 15 వ తేదీన భారతదేశ విభజనయు, స్వాతంత్ర్యమును నొక్కసారిగా నేర్పడినవి. భారతదేశములోఁ గొంతభాగము పరాయి ప్రాంతముగ విభజింపఁబడినను, కొన్ని శతాబ్దములనుండి పరపాలనకు లోఁబడినదేశము. స్వతంత్రము పొందినది. మౌంటుబాటెన్ భారతాధినివేశమునకు గవర్నర్ జనరల్‌గా నియమితుఁడయ్యెను. పాకిస్థాన్‌కు జనాబ్‌జిన్నా గవర్నర్ జనర లయ్యెను.

క్రొత్తరాజ్యాంగ పరిషత్తు 1947 ఆగస్టు 14 వ తారీఖున రాత్రి సమావేశమయినది. ఆ శుభముహూర్తమునకు మన స్వాతంత్ర్య రాజ్యచిహ్నముగ ధర్మచక్రగర్భితమగు త్రివర్ణ పతాకమును సర్వసమ్మతితో రాజ్యాంగభవనముమీద నెహ్రూ ప్రతిష్ఠించెను. ఆ పరిషత్తువారు నెహ్రూను నాయకుఁడుగ నెన్నుకొనిరి. నెహ్రూ, వల్లభాయి నుపప్రధానిగను, మఱి కొందఱును వివిధశాఖామంత్రులుగను నెన్నుకొనెను.

ఉపప్రధానిగాఁ బటేల్ సంస్థానములు, దేశీయ ప్రచురణ శాఖలు చూచుచుండెను.

భారతదేశము స్వాతంత్ర్యము గాంచినందుకు బ్రపంచ మంతయు బ్రశంసించెను. భారత దేశమునఁగూడ, నానందోత్సవములు జరిగెను. అయినను దేశ మొకవంక విభక్త మైనదను దుఃఖము వెన్నాడుచునే యుండెను. స్వాతంత్ర్యానంతరము కూడః బెక్కుచోట్ల హత్యలు, గృహదహనములు, దోపిళ్లు, సాగెను. పాకిస్థాన్‌లో నుండలేమని హిందువులును; భారత దేశములో నుండఁజాలమని ముస్లిములును భయపడఁ జొచ్చిరి. పాకిస్తానంతటను హిందువులహత్య, హిందూస్త్రీలయపహరణ యధికమయ్యెను. లక్షలాది నిరపరాధులు దుర్మరణము నొందిరి. లక్షలకొలదిజనులు తరతరాలనుండి వచ్చుచున్న తమయాస్తిపాస్తులను బ్రియమైన జన్మస్థానమును వీడి 'యలో లక్ష్మణా' యని యితర ప్రాంతముల కేగవలసివచ్చెను.

ఇటుల దేశమంతట రక్తపాతము జరుగుచుండెను. విశేషించి పంజాబులో రక్తపాతము జరుగుచున్న సమయమున నమృతసర్ నగరమున కరిగి హింసకుఁ బ్రతిహింస తగదనియు, బాకిస్థాన్‌కుఁ బోఁదలచిన ముస్లిములను బోనిండని హితవు చెప్పి శాంతినెలకొల్పెను.

కేంద్ర ప్రభుత్వపుటాస్తుల పంపకమువల్ల భారత ప్రభుత్వము పాకిస్థాన్‌కు 50 కోట్ల రూపాయలు చెల్లించవలసి వచ్చెను. పాకిస్థాన్ ప్రభుత్వముకూడఁ గొన్ని కోటు లియ్యవలసియే యుండెను. తా నియ్యవలసిన దీయక, తనకు రావలసిన దానికై పాకిస్థాన్ పట్టుపట్టసాగెను. దీనికి వల్లభాయి కోపోదీప్తుఁడై, 'పాకిస్థాన్‌ తాను జెల్లించువఱకును భారతప్రభుత్వము గవ్వకూడ నీయ'దని యుద్ఘోషించెను. పాకిస్థాన్ పాలకులకుఁ బటేల్ పలుకులు శూలములవలె నుండెను. కొందరు ముస్లిం నాయకులు దీనిని గాంధీజీ కెఱింగించిరి. ఆయన మాటకు మీఱని వాడగుటచే వల్లభాయి యా మొత్తము నిచ్చుట కంగీకరించెను. ఈ సందర్భములో బొంబై నగరమున నాయన పలికిన పలుకులు గమనార్హ ములు. "మనము నీటికన్న నిర్లక్ష్యముగ ధనమును వెచ్చించు చున్నాము. 55 కోట్ల రూప్యములు చెల్లించుటతో గాంధీజీ సంతొషించునెడ నాపని మాకు సమ్మతమే. గాంధీజీ క్రోధమున కతీతుఁడు. మన మందరము నాయన స్థాయి యందుకొనినఁ బోలీసులు, సైనికులు, చట్టములు, మొదలగునవి యవసరమే లేకుండును."

పాకిస్థాన్ దౌర్జన్యములకుఁ బ్రతిగ భారతదేశమున హిందువులు కొందరు ముస్లిములను హింసింపఁ దొడఁగిరి. అహింసావాదియగు గాంధీ దీని నరికట్టఁజొచ్చెను. పాకిస్థాన్‌ను గాంధీజీ బుజ్జగించుటవల్లనే హిందువులకు సర్వనాశనము కలుగు చున్నదని కొందరు హిందువులు భావింపసాగిరి. ఇది క్రముగఁ బెరిగెను. పాకిస్థాన్‌నుండి వచ్చిన కాందిశీకులకును, వారియెడ నభిమానము చూపించు నితరులకును, మహాత్మునియెడల ద్వేషభావ మేర్పడెను. ఈ దుష్పరిణామ ఫలితముగ మహాత్ముఁడు ఢిల్లీలో 1948 జనవరి 30 వ తేదీ సాయంకాలమునఁ బ్రార్థనాసమయమున నుపన్యసించుచుండ, గోడ్సే యను మహారాష్ట్ర బ్రాహ్మణయువకుఁడు తుపాకీ ప్రేల్చగా నాయన 'హా - రామా'యనుచు నసువులఁ బాసెను.

గాంధీజీ జిన్నాతో మన మన్నదమ్ములమువలె విడిపోయెదమని యెంతో బుజ్జగించి చెప్పెను. ఆ మహమ్మదాలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతమును నెలకొల్పి మహమ్మదీయులలో ద్వేషానలము రెచ్చగొట్టి - మనము విరోధులమువలె విడిపోవుదమని మహాత్మునితో వెల్లడించెను. "గాంధీజీ యీ విభజన సిద్ధాంతమున కిష్టపడఁడాయెను. గాంధీజీ శిష్యులలోఁ బ్రముఖు లును, దేశములో మిక్కిలి పలుకుబడిగల నెహ్రూ పటే ళ్లిరువురు నీ బ్రిటిషువారి పరిపాలన, మహమ్మదీయుల ద్వేషాగ్ని నుండి తప్పించుటకు దేశవిభజన కంగీకరించిరి. ఈ స్వాతంత్ర్య దేవత ప్రతిదేశమున నెంతో రక్తము బలిగొనినగాని ప్రత్యక్షము కాదాయెను - మన మీ దేవతకు రక్తము బలి యీయకయే స్వాతంత్ర్యము పొందితిమి. కాని యా దేవత యూరకుండునా ? లక్షలకొలది జనుల రక్తమును గ్రోలుటే గాక భారతదేశపిత, యహింసాధర్మబోధకుఁడైన గాంధీ మహాత్ముని రక్తమునుగూడఁ జవిచూచినది.

గాంధీజీ నిర్యాణమునకు లోకమంతయు దద్దరిల్లినది. భారత దేశమంతయుఁ గన్నీరు మున్నీరుగాఁ గార్చెను. దేశపిత హత్యావార్తను విని యెందరో యసువులువాసిరి. స్వాతంత్ర్య దేవత యిప్పటికైనను దృప్తిచెందెనా?

గాంధీజీ నిర్యాణముచే వల్లభాయి తల్లిని గోల్పోయిన బాలునివలె నాయెను.

గాంధీజీ జీవించి యుండఁగనే భారతభాగ్యవిధాతలుగా నున్న నెహ్రూ, పటేలులలో ననైక్య మేర్పడినదని విని యాయన యెంతయో విచారించెను. తమలో నట్టి యనైక్య మేమియులేదని వారిరువురు వెలిబుచ్చిరి.

ఈ యిరువుర మధ్య విభేధము కల్పింప కొందరు కృషి చేసిరి. వల్లభాయిపటేల్ నెహ్రూకన్న వయస్సునఁబెద్ద. ఇంతే గాదు, సర్వశక్తి సంపన్నుడు, అయినను గాంధీజీ వారసుని నాయకత్వము క్రిందనే యాయన నిస్సంకోచముగను మన స్ఫూర్తిగను, బనిచేయుట ప్రశంసనీయము, ఇటువంటి శక్తి సంపన్నుఁడు, మఱొకఁడుండిన నెహ్రూను బదభ్రష్టుని జేయుటకుఁ గృషిచేసియుండెడివాఁడే. క్రమశిక్షణాదీక్షాదక్షుఁడై వల్లభాయి 1950 అక్టోబరు 2 వ తేదీని ఇండోర్‌లో నెహ్రూతో విభేదముల ప్రసక్తిఁదెచ్చి పలికిన పలుకులే యిందుకు నిదర్శనము. ఆయన యిట్లన్నాఁడు.

"గాంధీజీ నడిపించిన స్వాతంత్ర్య భారత సైన్యములో మేమందరము సైనికులమే. డిప్యూటీ ప్రధాని నని నే నెప్పుడు ననుకోలేదు. ఆవిషయము నెన్నడును బాటించనేలేదు. రాజకీయరంగములోఁ బ్రధానమంత్రియైన పండిట్ నెహ్రూయే నాయకుఁడు. ఇందుకుఁ దిరుగులేదు. బాపూ బ్రతికియుండఁగానే తనకు నెహ్రూయే వారసుఁడు కావలయునని యెన్నుకొన్నాఁడు.

"అంధకార బంధురమైన యీ జగతికిఁ దాను జూపించిన దివ్యజ్యోతిని పండిట్ నెహ్రూయే పట్టుకొనఁదగినవాఁడని బాపూ పదేపదే స్పష్టముగా జెప్పినాఁడు.

"అందువల్ల భారతజాతిపిత గాంధీజీ యాశయమును నెఱవేర్చుట, యాయన భావములను గౌరవించుట మన విధ్యుక్త ధర్మము - బాపూజీ యాశయములను హృదయపూర్వకముగా సమర్థించనివారు దైవమునకే యపచారము చేయు చున్నట్టు లెక్క.

"నేనును గాంధీజీ సైనికులలోనివాఁడనే. బాపూజీ యాశయములను సయితము వెన్నుపోటు పొడుచు కిరాతకుఁడనుగాను. నిజమునకు నే నగ్రనాయకులలో నొకఁడనని యనుకొనుటలేదు. రాజకీయరంగములో నాకుఁగూడ స్థాన మున్నమాట వాస్తవమే. గాంధీమహాత్ముని యనుచరులలో నొకఁడనుగా దేశమునకు సేవచేయుటకు నేను దీసికొన్న దే యా స్థానము. నా కంతే చాలు."

ఇట్టిది వల్లభాయి మనఃప్రవృత్తి, మహాశయము. దీనిపై నింకను వ్యాఖ్యానమేల?

Politics mesns organised life of a nation - రాజకీయములనిన జాతియొక్క నియమబద్ధమైన జీవితము. అట్టి జీవిత మలవడినపుడే మన మభివృద్ధిఁ బొందఁగలము

సమైక్య నవభారత నిర్మాత

సంస్థానశాఖామాత్యుడుగా నుండి పటేల్ సాధించిన ఘనవిజయము భారత చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖింపఁ దగినది.

1947 ఆగస్టు 15 వ తేదీ బ్రిటిషు ప్రభుత్వమునకు స్వరాజ్య ప్రదానము చేసినమాట వాస్తవమే. కాని స్వరాజ్యము వచ్చినదని సంతోషము మినహా మనము ప్రాముకొన్నది యేమియు లేదు. దానికిఁ గారణము లనేక మున్నవి. స్వాతంత్ర్యానంతరము మన మనేకక్లిష్టసమస్యల నెదుర్కొనవలసి వచ్చినది. అందులో నధికభాగము బ్రిటిషువారి కుటిల తంత్రమువల్ల నేర్పడినవే.

దేశమును గృత్రిమముగా రెండుగాఁ జీల్చినందున మనము పొందిన నష్టమొకటి. దానిని దలఁదన్నినది సంస్థానముల స్వాతంత్ర్యము మఱియొకటి. పోవుచుఁబోవుచు బ్రిటిషు