వరవిక్రయము/నాంది, ప్రస్తావన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వరవిక్రయము

నాంది

భూరివరిష్ఠమై, విబుధ - పుంగవ మంగళ వాక్సమృద్ధమై,
చారుతరాప్సరోనటన - సంభృతమై, సవినోదమై, యహం
కార వికార దూరమయి - గర్హ్యతరోభయశుల్క శూన్యమౌ
గౌరి వివాహసంస్మరణ - కల్గగఁజేసెడుఁ గాక! భద్రముల్‌.

ప్రస్తావన

సూత్ర:-(ప్రవేశించి) ఓహో! యేమి యీ సభాసమ్మర్దము! ఆ మహాకవి కావ్యము లనఁగానే యభిజ్ఞుల కేమి యాదరము! (పరిక్రమించి) ఓ సభాస్తారులారా! వర్తమాన వరశుల్క దుర్నయ దూరీకరణమునకై బుద్ధిరాజు వీరభద్ర రాయామాత్యులవారి కంకితముగా, మహాకవి కాళ్లకూరి నారాయణరావు గారిచే రచింపఁబడిన వరవిక్రయ రూపకమును విలోకించు నిమిత్తము విచ్చేసిన మీయెడ నే నత్యంతముఁ గృతజ్ఞుఁడను, ఏమనుచున్నారు?

గీ."కవి ప్రసిద్ధుఁడు; కావ్యమా - కాలవిహిత
మైనయది; మీరలా భర-తాగమమునఁ
జతురు; లటుగాన, మీ ప్రద-ర్శనము కొఱకుఁ
ద్వరబడుచు నున్నవార మెం-తయును మదిని."


అనియా?- చిత్తము చిత్తము- ఇదిగో యిప్పుడే యుపక్రమించెదము.

(తెరవంకఁ జూచి) ఓసీ! ఓసీ! యెక్కడ! ఒక్కసారి యిటురమ్ము.

నటి:-(ప్రవేశించి) ఏమా యధికారము! కొని పాఱవైచినట్లె గొంతు చించుకొనుచున్నారే? సూత్ర:- ఓసి దెష్టా! కొనిగాక నినుఁగోసికొని వచ్చితి నంటే? నీ తండ్రి కిచ్చిన వేయి రూపాయల రొక్కము - నీకుఁబెట్టిన వేయి రూపాయల నగలు - ఏ గంగలోఁ గలిసినవి?

నటి:- మీ సొమ్ములు మీకుఁదిరుగ నిచ్చివేసిన నాకు విడియాకు లిచ్చెదరా?

సూత్ర:- ఆసి నీ బొడ్డుపొక్క! యిది అమెరికా దేశమను కొంటివా యేమి? కాదు కాదు- ఆర్యావర్తము. అబ్బో! ఆ యాట లిక్కడ సాగవు! బొందు మెడఁగట్టినచో, బొందిలోఁ బ్రాణముండువఱకును బందెగొడ్డువలెఁ బడి యుండవలసినదే.

నటి:- అట్లయిన నాసంగతి రేపాఁడంగుల సభలో నాలోచించెదము. కాని- యిప్పుడు నన్నుఁబిలిచిన పని యేమో సెలవిండు.

సూత్ర:- పాత్రములను సిద్ధపఱచితివా?

నటి:- సిద్ధపఱచుటయే గాదు- శీఘ్రముగఁ బ్రవేశింపవలసినదని చెప్పి కూడా వచ్చినాను.

సూత్ర:- అట్లయిన, వారింకను నాలసించుచున్నారేమి?

నటి:- మీ చెవులలోఁ జెట్లు మొలచినవా యేమి! ఆ చరకాగానము వినబడుట లేదా?

తెరలో:- చరకా ప్రభావం బెవ్వరి కెఱుక! జగతిలోన మన చరకా

సిరులతోడఁ దులఁదూగుచున్న యల-

సీమజాతి చూచుచున్న దేమఱక చరకా

సూత్ర:- ఔనే! అవిగో - భ్రమరాంబా, కాళిందీ, కమలా పాత్రములు చరకాగానముతోఁ బ్రవేశించుచున్నవి. మనము పోయి పయిపని చూతము రమ్ము. (ఇద్దరు నిష్క్రమింతురు)

ఇది ప్రస్తావన.

★ ★ ★