వరవిక్రయము/ద్వితీయాంకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ద్వితీయాంకము

(ప్రదేశము -: లింగరాజుగారి వ్యాపారపు గది)


లింగ:- (ఆయాసముతోఁ ప్రవేశించి) ఇస్‌! అబ్బా!

చ. పిడుకలు వంటకట్టెలును, బీటలు, చేటలు, లెక్కచూచి, యే
    ర్పడ, పొయిబొగ్గులం గొలిచి, పాదుల కాయల నెంచి, దూడ పా
    ల్విడిచిన దాఁక నిల్వఁబడి; వాకిటి కొబ్బరిచెట్ల కాయలన్‌
    గడనమొనర్చి; యిప్పటికిఁ గాలిడఁ గల్గితి నింటి లోపలన్‌.

ఇఁక స్థిమితముగా గూరుచుండి, యీఁ పూఁటతోఁ గాలదోషము పట్టు కాగితము లేమయినఁ గలవేమో చూడవలెను. వాయిదా నోటీసులు వ్రాయవలెను. ఈ పూట కోర్టులో హీరింగు లేమున్నవో చూడవలెను. దేనిపట్ల రవంత యేమఱినను దెబ్బ తినక తప్పదు! పనివచ్చినచో ప్రాణములనైనఁ బోనీయఁదగునుగాని పయిస సొమ్ము పోనీయఁగూడదు! ప్రాణములలో నేమున్నది? గాలియేగా! పైకమట్టిదా! ప్రపంచమంతయు దానిలో నున్నది! కనుకనే, "ధనమూల మిదం జగ"త్తన్నాఁడు.

సీ. కులలోప, గుణలోపములు మాపుకొనుటకు
          ధనము ప్రధాన సాధనము నేడు
   వరకట్నములకు సభాకట్నములకును
          ధనము ప్రధాన సాధనము నేఁడు
   మున్సిపల్‌, లోకలు బోర్డన్ యెన్నికలకు
          ధనము ప్రధాన సాధనము నేఁడు
   మడులు మాన్యములుఁ గొంపలు వచ్చిపడుటకు
          ధనము ప్రధాన సాధనము నేఁడు

   అట్టి ధనమును దన పాడు పొట్టకొఱకో,
   బట్ట కొఱకో, లంక పొగాకు చుట్టకొఱకో,

వెనుక ముందులు చూడక వెచ్చపెట్టు
నిజముగవారు మతిలేని వారు కారె!

భాగ్యము పెరుగుఁటకు బహుప్రజ్ఞలు కావలెను.

సీ. తలలు మాఱిచియొ, మూటలు విప్పియె, కొల్ల
        గొట్టియో సిరి కూడఁబెట్టవలయు
    ఆస్తులనెల్ల భార్యల పేర వ్రాయించి
        మాయ దివాలాలు -తీయవలయు
    వడ్డికి వడ్డి, యా వడ్డికిఁ బైవడ్డి
       పెంచి గిజా యనిపించవలయు
    రాత్రులు మేల్కొని రామకీర్తనలను
       పాడుచుఁ గొంపఁ గాపాడవలయు

    అప్పుగొన్నవారి యాస్తులెల్లను వచ్చి
    పడెడుదనుక నిద్ర విడువవలయు,
    దొంగ లెక్కలుంచి దొరల కంటను దుమ్ము
    గొట్టి పన్ను మాన్పుకొనగవలయు.

పెక్కు మాటలేల...

సీ. పరువుఁ, బ్రతిష్ఠయుఁ బాటింపఁగారాదు
        పొట్టకేమియుఁ గర్చు పెట్టరాదు
    బంధువు లేతేరఁ బల్కరింపరాఁదు
        వేఱు విస్తరి యింట వేయరాదు
    కష్టజీవులఁజూచి -కటకటపడరాదు
        త్రిప్పక తన యప్పు తీర్పరాదు
    దార కేనియు పెట్టె తాళ మీయగరాదు
        వేయి కల్లలకేని వెఱవరాదు

    ఇన్ని విధముల గాపాడకున్న ధనము
    దక్కనేరదు; ధనముచేఁ దక్క నింటఁ
    బెత్తనము లేదు! బయటను బేరు లేదు!
    పలుకుబడి లేదు! బ్రతికిన ఫలము లేదు.

వెర్రివెంకటాయలు! పత్రికలనియుఁ బరిశోధన లనియుఁ, సంఘ సంస్కరణము లనియు, సహాయ నిరాకరణము లనియు, స్వరాజ్యమనియు, చట్టు బండలనియు, పనిలేని గొడవలు పయిఁబెట్టుకొందురు. కాని వడ్డీలు పెరుగుటకు వాటమైన సాధన మొక్కరును జూడరు?

ఆ. కలుపు పెరుఁగునట్లు; -కంచెలుం బాదులు
    పెరుగునట్లు నాచు పెరుఁగునట్లు;
    వడ్డి పెరిఁగెనేని వహ్వా! యదృష్టము
    పండె ననఁగ నిండ్లు నిండిపోవె!

వాస్తవమునకు వడ్డీకి సాటియైనది మరియున్నదా?

ఆ. నిజముకన్న గల్లఁ నిశ్చయంబుగఁ దీపి
    బిడ్డకన్న ముండ బిడ్డ తీపి
    కరము, వేతనంబు -కన్న లంచము తీపి
    వసుధ, మొదలుకన్న వడ్డి తీపి!

(అంతలో స్మృతి నభినయించి) అన్నన్నా యెన్నడునులేని దీపూట ప్రాతఃకాల లక్ష్మీప్రార్థనము మాట పరాకు పడితిని గదా! (అని చెంపలు వైచుకొని, యినుపపెట్టె యెదుట నిలిచి చేతులు జోడించి)

దండకము: భగవతీ! భాగ్యలక్ష్మీ! ప్రణామంబు! నీ దాస దాసానుదాసుండ. నీపాదముక్తుండ, నీ దివ్యరూపంబె నిత్యంబు భావింతు, నీదివ్య నామంబె నిక్కంబుగా నిద్రలోఁగూడఁ జింతింతు, నాదిక్కు, నామ్రొక్కు, నా యండ, నా దండ నీవే సుమా! భార్యయుం, గీర్యయుం; బిడ్డలుంగిడ్డలు; దేవుడుం, గీవుడున్‌; మోక్షముం, గీక్షమున్‌; సర్వమున్నీవె! సత్యంబు! నీకై నిరాహారినై యుందు, నీకైనిశల్‌ నిద్రమాన్కొందు, నీకై శరీరాభిమానంబు వర్జింతు, నీకై యసత్య ప్రమాణంబు లెన్నేనియు గావింతు నీయాన! ఈపెట్టెయే నీ పవిత్రాలయం; నేనె నీ యర్చకుండన్‌; యథార్థంబుగా నాదు ప్రాణంబులెనీదు పూజాసుమంబుల్‌; శరీరంబె నైవేద్య కుంభంబు, నాయింటనేయుండి, నాపూజలం గొంచునే యింటికే నంపినంబోయి యా యిల్లు మట్టంబు గావించి నా ఇంటికిం దెచ్చినాకిచ్చుకే చుండంగదే కన్నతల్లీ! నమస్తే! నమస్తే! నమః. ఘంట:- (ప్రవేశించి) బాబూ! పది కావచ్చింది. వంట సామానిస్తారా!

లింగ:- నీవంట వల్లకాడుగాను! నీకింత తిండియేవ యేమిరా! ధనుర్మాసము దప్పళమున కెవరైన పిలుతురేమో కాసింతసేపు కనిపెట్టఁగూడదా?

ఘంట:- సరే, మీ యిష్టం. రాత్తిరి పద్దులు రాసుకుంటారా?

లింగ:- అదిగో ఆ మాటన్నావు సరి! (అని డసుకు పెట్టె దగ్గఱఁ గూరుచుండి, పద్దుల పుస్తకము పైకిఁదీసి) ఏదీ చెప్పు, బియ్య మెన్ని?

ఘంట:- మణిమెడు తక్కువ మానెడు.

లింగ:- (వ్రాయుచు) వంటకట్టెలు?

ఘంట:- మూడు.

లింగ:- పిడకలు?

ఘంట:- రెండు.

లింగ:- నిప్పు పుల్ల?

ఘంట: -నిన్న మధ్యాహ్నం చీల్చిన పుల్లలో నిలవ బాపతు సగం.

లింగ:- ఉప్పు?

ఘంట:- వుద్ధరిణేడు.

లింగ:- చింతపండు?

ఘంట:- నిన్న మధ్యాహ్నం పులుసుకోసము పిసగ్గా నిల్వవున్న తుక్కు.

లింగ:- ఉట్లేమి చేసినావు?

ఘంట:- వుంచా నీపూటకు.

లింగ:- మిరపకాయలు?

ఘంట:- మూడు.

లింగ:- మాగాయ?

ఘంట:- అమ్మగారి కోటెంకా, అబ్బాయిగారి కో ముక్కాను.

లింగ:- గంజి? ఘంట:- గరిటెడు మీకూ, అరగరిటెడు అబ్బాయిగారికి పోశాను.

లింగ:- మిగిలిందీ?

ఘంట:- చద్దన్నాల్లో సరిపెట్టాను.

లింగ:- నీవో?

ఘంట:- బజార్లోంచి బంగాళాదుంపల కూర తెచ్చుకున్నాను.

లింగ:- ఏడిచినట్లే యున్నది. కాని యెన్నడు నీలాంటి విఁక నింటికి గొనిరాకు! ఆవాసన తగిలి అబ్బాయికూడా పాడుకాఁగలడు! తెలిసినదా? ఇదిగో కరివేపచెట్టు మీఁద కాకి గూడు పెట్టినది. ఇంతలో డొంకినితో దానిని బడద్రోసి ఈ పూఁట పొయిలోనికి సిద్ధము చేసికో. కరివేపమండ రాలినచో కడుపు చీల్చెదను సుమా!

ఘంట:- రామరామా! పక్షిగూడు పడగొట్టడం పాపం కాదండీ?

లింగ:- పాప మేమిటి నీ బొంద! ఖరసంవత్సరములో మా ఇంటి వంటంతయు కాకిగూళ్ళతోనే వెళ్ళిపోయినది.

ఘంట:- ఇదేఁమిటండీ! యింత ఘోర మెక్కడా చూళ్ళేదు. ఇల్లాంటి పనులు మాత్రం ఇంకెప్పుడూ చెప్పకండే. (నిష్క్రమించును.)

లింగ:- దరిద్రపుఁ గుంకలకు ధర్మపన్నములు మెండు! ఆ వాజె వన్నెల విసనకర్ర యిగుటంబట్టి వంటకుంకలను బెట్టుకొనక వల్లపడకున్నది. కుర్రవానికి వివాహమై, యా కుర్రది కాఁపురమునకు వచ్చువఱకు నీకుంక కుద్వాసన చెప్పుటకు వీలులేదు.

బస:- (ప్రవేశించి) నాన్నా! అమ్మకు మొన్న బండికట్టినవాడు అద్దెకొఱకు వచ్చి యఱచుచున్నాడు.

లింగ:- ఇంటిలో లేరని చెప్పకపోతివా? బాబూ! పదునారేండ్లు పయింపడినవి ఇప్పటికైన నీకీపాటి యూహ పుట్టలేదేమిరా?

బస:- ఉండఁగా లేరని చెప్పుట కూహ యెందులకు నాన్నా? అబద్ధమాడఁగూడదని మా టీచర్లనేక పర్యాయములు చెప్పినారు.

లింగ: -మీ టీచర్లిట్టి మెట్టవేదాంతములు కూడఁజెప్పుచున్నారుగా? సరే, యిఁకనేమి చదువు సంగతి చక్కగానే యున్నది!

బస:- ఫవుంటెను పెన్నుకుఁ బయిక మిచ్చెదవా? లింగ :- బాబూ! కానీకిఁ గలము వచ్చుచుండఁగా ఫవుంటెను పెన్ను యెందులకు పనిలేక? అంతగా మనసైనచో అలుక పాన్పుమీఁద అన్నిటితోపాటు ఫవుంటెను పెన్నుగూడ నత్తవారినడిగి పుచ్చుకొనవచ్చును. గాని బండివానికేదో చెప్పి పంపివేయుడు.

బస :- అదిమాత్రము నావల్ల గాదు! (అని నిష్క్రమించును.)

లింగ :- ఆ వన్నెల విసనకర్ర సంగతి యీ విధముగా నున్నది. యీ పాడుకట్టె సంగతి యీవిధముగా నున్నది! పాడు టీచర్లు కుఱ్ఱవాండ్రను పాడుచేయుచున్నారు! పయిగా కలము క్రిందను, కాగితముల క్రిందను ఖర్చుపడుచున్న డబ్బునకు లెక్కయే లేదు! కనుకనే గాంధీమహాత్ముఁడు చదువులకు స్వస్తి చెప్పింపుమన్నాడు. వివాహమగువఱకును వీనిని మాన్పించుటకు వీలులేక చూచుచున్నాను. ఇదేమి ప్రారబ్ధమో యీ దినములలో కాలేజికి వెళ్ళుచున్న వానికిగాని కట్నములబిగువు లేకున్నది! ఈ కసుగాయ కుంకను కట్నములకొఱకు గాకఁగతుల కొఱకుఁ బెంచుచున్నానా! నా మొదటిపెండ్లికి రెండువేలుఁ, రెండవపెండ్లికి నాల్గువేలు, మూడవ పెండ్లి కెనిమిదివేలు మొత్తము పదునాలుగువేలు వచ్చినవి. ఈ కుంకకుఁ గూడ నిదేవిధముగా వచ్చునని యాశ. ఇదేమి పాపమో ఇంతవఱకు వేయి, రెండువేలు ఇచ్చెదమనెడివారే కాని పట్టుమని పదివేలీయఁగలవా రగపడలేదు! నియోగ మంతకంతకు నిర్భాగ్య యోగమయి పోవుచున్నది! ఎవరు చెపుమా వచ్చుచున్నది! చవటకుంక, తలుపుతీసి చక్కబోయినాఁడు కావలయును! బండివాడో పరదేశ బ్రాహ్మణుడో యైయుండును! కానిమ్ము గది తలుపుమూసి, యేమియు నెత్తుకొనిపోకుండ, కంతలగుండాఁ గనిపెట్టెదను. (అని లేచును.)

పేర :- (అంతలో బ్రవేశించి) మహదైశ్వర్యాభివృద్ధిరస్తు! మనోవాంఛాఫల సిద్ధిరస్తు! రాజ ద్వారే, రాజ భవనే, రాజ సభే, రాజ సమీపే, సర్వదా దిగ్విజయమస్తు!

లింగ :- ఏమీ! పేరయ్యయే! ఏదో పనిమీద వచ్చినట్లున్నారే?

పేర :- ప్రభువుల వద్దకు పనిలేన్దే రాగలమా? లింగ :- అట్లయినఁ గూర్చుండి అదేమో చెప్పుము. (అని కూర్చుండును.)

పేర :- (కూర్చుండి తనలో) ఈ ముండాకొడుకుదగ్గర ముక్కు సూటిగా పోగూడదు. ముందీదారి త్రొక్కుతాను. (పయికి) చెప్పుట కేముంది? పష్టుకళాసు పద్దుమీద బదులు కావలసి వచ్చాను.

లింగ :- ఎవరికి? ఏపాటి?

పేర :- ఎవరికో తర్వాత చెపుతాను. బదులు కావలసింది పాతిక వేలు.

లింగ :- వడ్డీ యేమయిన వాటముగ వేయించఁగలవా?

పేర :- వడ్డీకేం? వాజిబీ ప్రకారం పుచ్చుకోండి.

లింగ :- వడ్డీకి వాజిబీ యేమిటి! ఆసామిని బట్టియు, ఆస్తిని బట్టియు, అవసరమును బట్టియు నుండును. నీతోడు, రూపాయ తొమ్మిదణాలకాని చొప్పున నిన్ననే ముప్పది వేలిచ్చాను.

పేర :- అయితే కుదరదు. ముప్పావలా అంటే ముద్దుపెట్టుకుని ఇచ్చేవారున్నారు. సెలవు! (అని లేవబోవును.)

లింగ :- ఆగు! ఆగు! అంత తొందర పడకూడదు. ఆస్తిమాట చెప్పవేమి?

పే ర:- ఆస్తికేం! అవల్‌ రకం ఆస్తి. అరవై యెకరాల సర్వదుంబాలా యీనాంభూమి. పది యెకరాల బత్తానారింజతోట, ఆరెకరాల అంటు మామిడితోట, తొమ్మిదెకరాల తుమ్మబీడు, ఇదే ప్రథమ తనఖా. ఇక విడిపించుకునేది కూడా కాదు.

లింగ :- సరే ముప్పావలార్ధణా చొప్పున పయిసలు చేయుము.

పేర :- ముప్పావలార్ధణా లేదు గీవలార్ధణా లేదు. నా కమీషను దగ్గిర సలుపులు పట్టకపోతే రూపాయివరకూ రుద్దుతాను.

లింగ :- నీ కమీషను మాట కేమి? నీ వెక్కడికిఁ బోదువు? నే నెక్కడికిఁ బోదును? ముందు కాగితములు తెమ్ము, చూతము.

పేర :- కాగితాలకేం! రేపీపాటికి కాకిచేత రప్పిస్తాను, (అని లేవఁబోయి, మరలఁ జతికిలబడి) అన్నట్టు అడగడం మరచాను. అబ్బాయికి యింకా వివాహం చేశారు కాదు. సమయము కాకనా? సంబంధాలు రాకనా?

లింగ :- సంబంధములు రాకేమీ! సమాధానము చెప్పలేక చచ్చిపోవుచున్నాను. అన్నట్లు నీవు పెండ్లిండ్ల బేరగాడవు గదా! నీ యెరుకలో జక్కని సంబంధ మేదయిన నున్నదా?

పేర :- చక్కందో గిక్కందో నాకు తెలియదు. మీకు సానుకూల పడుతుందో లేదో అంతకంటే తెలియదు. పడితే మాత్రం బంగారాని కెత్తు కెత్తయిన సంబంధం వొకటి సర్వసిద్ధంగా వుంది.

లింగ :- ఎవరు వారు?

పేర :- పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి యిద్దరు కొమార్తెలున్నారు. పెద్ద కుమార్తెకు పదమూడవయేడు. పక్వానికి వచ్చిన పండు! ముఖం ముద్దురోడు తూంటూంది. కళ్ళుచూస్తే కడుపు నిండ వలసిందే! చక్కగా చదువుతుంది.

లింగ :- సరేకాని కన్యకు గావలసిన చదువు, చక్కదనమువిగావు.

గీ. తిండి యొకప్రక్క వెలితిగాఁ దినవలయు,
   చెప్పకయె యింటిపనులెల్లఁ జేయవలయు,
   ఊరకే కొట్టినను పడియుండవలయు,
   ఇట్టి కన్యను వెతకి గ్రహింపవలయు.

పేర :- అలాగైతే మీరు చెప్పిన లక్షణాలన్నీ అచ్చంగా ఆ పిల్లవద్దనే ఉన్నాయి. మూడు మెతుకుల కంటె ముట్టదు. లేచింది మొదలు పరుండే వరకూ లేడిపిల్ల లాగు పని చేస్తుంది.

లింగ :- ఇంతకును కట్నమేపాటి యీయగలరు?

పేర :- అదిగో అక్కడే వుంది తంటా! ఆపిల్లలిద్దరకి వంటని వెయ్యేసి రూపాయలు బాలతొడుగు లున్నాయి. అయిదేసి వందలు వచ్చే మాతామహు డిచ్చిన మాన్యాలున్నాయి. అందువల్ల కట్నంలేకుండా చేసుకుంటామని కావలసినంత మంది కాళ్లకాడికి వచ్చి తిరిగి పోతున్నారు. లింగ :- అయితే పేరయ్యా! ఆ పిల్ల యొంటిని అచ్చంగా బంగారపు తొడుగుండుఁగాక అరువది పుట్ల మాన్యముండుగాక గౌరవము కోరువాఁ డెవ్వఁడైనఁ గట్నంలేని సంబంధముల కిష్టపడునా!

పేర :- అలాగైతే, గౌరవార్థమని మెడలు విరిచి కాస్తోకూస్తో ఇచ్చే లాగు చూడాలి. ఏమాత్రం అనమంటారు?

లింగ :- అసలు ఆయనకున్న అస్థియేమో చెప్పినావు కావు.

పేర :- ఆయనకున్న ఆస్తి యేమిటో అందరూ యెఱిగినదే. పది సంవత్సరాలు రెవిన్యూ యినిసిపేటరు పనిచేశారన్న మాటే కాని పయిసా పుచ్చుకొని యెరుగరు. ఈమధ్య నానుకోపరేషాన్ని నమ్మి ఆవుద్యోగానికి గూడా హస్తోదకాలిచ్చి హాయిగా రాట్నం ముందు పెట్టుకొని కూర్చున్నాడు. అయితే, పిత్రీయం బాపతు పదియెకరాల భూముంది. పన్నులు పోగా పదియెకరాల వల్లా పదిపదులు నూరుబస్తాలు వస్తాయి. వారు కాపురంవున్న మేడ వుంది.

లింగ :- అట్లయినచో, నటువంటి పెద్దమనుష్యులను మనమంత యిబ్బంది పెట్టుట న్యాయము కాదు, ఆ మేడ వారుంచుకొని ఆ పదియెకరముల పొలమును మనకు వ్రాసి యిచ్చి అందము కొఱకు వేయిన్నూటపదార్లు రొక్కము, వెండిచెంబు, వెండికంచము, వెండి పావకోళ్ళు, ఐదుదినముల నైదు పట్టుతాబితాలు ఇటువంటివి మాత్రమిమ్మనుము. నా బారీతనము బాగుగ నున్నదా?

పేర :- బాగేమిటి బంగారు తునక లాగుంది! కాకపోతే, కార్యమయిన మర్నాటినుంచి వారు అన్నమో రామచంద్రాయని ఆవీధినీ, యీవీధినీ అడుక్కు తినవలసి మాత్రం వుంటుంది! బాబూ! మీ బేరము కుదిరేబేరము కాదు! సెలవు పుచ్చుకుంటా. (అని లేవఁబోవును.)

లింగ :- (రెక్క పట్టుకొని) ఆగు ఆగఁవోయ్‌! అన్నిటిలో నొక్కటే తొందరా! నీ యభిప్రాయ మేమిటి?

పేర :- వేయిన్నూట పదహార్ల కయితే వెంటనే కుదురుస్తాను. అంతకు పయినైతే ఆ సంబంధం మీకు దక్కదు. లింగ :- సరికాని ఈ పిల్ల వాని క్రింద నా కెంత సొమ్మయిందో యెరుఁగుదువా! తృప్తిగా వారివల్ల రాఁబట్టి తృణమో కణమో నావల్లఁ దినవలెనేగాని నీ సొమ్మే పోయినట్లు నిగిడెదవేమి? పురుషోత్తమరావుగారు నాకంటెఁ బూర్వపుఁ జుట్టమా యేమిటి నీకు?

పేర : -ఆలాగన్నారు గనుక, అసలు సంగతి మనవి చేస్తాను వినండి. ఆయన కట్నంలేని సంబంధం ఖాయం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. నా బలవంతం మీద మహా పెడితే రెండువేల కంటె పెట్టరు. అందుచేత మనం కొంచెం మారుత్రోవ తొక్కాలి. ఆయనతో కట్నం మాటేమీ కచ్చితంగా చెప్పక మంచిరోజు చూచి మాట్లాడే నిమిత్తం మన ఇంటికి తీసుకువస్తాను. సరిగా ఆ సమయానికి వివాహాల వీరయ్యగాడు వచ్చి, వేలం పాటలోకి దించేలాగు ఏర్పాటు చేస్తాను. ఆపాటలో పంతులుగారి కావేశం ఎక్కించి మూడువేలవరకూ పాడిస్తాను. నా కేమిస్తారో న్యాయంగా సెలవివ్వండి!

లింగ :- ముష్టి మూడువేల కోసమిన్ని ముచ్చటలా! ఆ మూడువేలలోనే నీ ముడుపా! చాలు చాలు! అథమపక్ష మైదువేలయిన లేకున్న మనకాసంబంధ మక్కఱలేదు.

పేర :- అబ్బ, లింగరాజుగారూ! అసాధ్యులు గదా! సరే, చచ్చో ముతమారో అయిదువేలూ అనిపిస్తాననుకోండి. అందులో, అయిదువందలు నావి, మిగతవి మీవి. ఇష్టమేనా?

లింగ :- అదిగో అదే పనికిరాదు! అందులో అఱకాని బొఱ్రి కాఁగూడదు. నీ యైదువందలు నీవు పయిగా రాబట్టుకొనవలసినదే.

పేర :- సరే, నా తంటాలు నేనే పడతాను. వీరయ్యగాణ్ణి పంపుతాను గాని వాడూ మీరూ ముందు కాస్త కూడబలుకుకోండి. పని జరిగాక వాడికి పదిరూపాయలు మాత్రం పారవెయ్యండి.

లింగ :- దానికేమి, తరువాత నీవో, నేనో లేదనిపింతము లెమ్ము.

పేర :- అన్నట్లు ఆభరణాల సంగతి చెప్పారు కారు. ఆభరణాల మాట చెవిన పడితేనేగాని ఆడంగులకు వేడే పుట్టదు.

లింగ :- వెఱ్రివాఁడా! మా పిల్ల కు మేము వెలితి చేసి కుందుమా? అప్పు డడావిడి పడవలసి వచ్చునని అయిదువేల రూపాయల నగలు చేయించి సిద్ధముగా నుంచినాను.

పేర:- సరే యింకేమీ. నాకిప్పటికి శలవు. (అని లేచి నిష్క్రమించును.)

లింగ:- అన్ని విధములచేత నీబేర మనుకూలమయినదే. పదియెకరముల భూమియుఁ బదివేలు, బాలతొడుగు వేయి, కట్నము అయిదువేలు, మొత్తము పదునారు వేలు! లాంఛనము లనియు, గీంఛనము లనియు లాగుట కింకను లక్షమార్గములున్నవి. ఆమీఁద నలుకపాన్పున్నది. ఆ వెనుక, నాషాఢపట్టీ యున్నది. ఆపైని గర్భాధానపు బెట్టున్నది!

గీ. స్వామి కృపచేత నిది కొనసాగెనేని
   లాటరీలోనఁ బలె మంచి లాటువచ్చు;
   ఇంటిపనులెల్ల నేర్చిన గుంట కాన
   వెంటనే వంటవానిని గెంటవచ్చు.

(తెర పడును.)

ఇది ద్వితీయాంకము.


★ ★ ★