వరవిక్రయము/తృతీయాంకము

వికీసోర్స్ నుండి

తృతీయాంకము

మొదటి రంగము

(ప్రదేశము: లింగరాజుగారి పడక గది.)

సుభ :- (చదువుకొనుచుఁ ప్రవేశించి చటుక్కునఁపుస్తకము మూసి) సెబాసు వివాహమన్న నీ విమలా విజ యలదే వివాహము. సమాన వయోరూప సంపత్తిలేని దాంపత్య మేమి దాంపత్యము?

చ. ధనమె ప్రధాన భూతముగ దంతము లూడినవానికేనియుం దనయ
    లఁగట్టిపెట్టు తలిదండ్రులు హెచ్చగుచున్న ఇట్టి దుర్దినములలోన,
    నింతిగ, ధ రిత్రియిం జనియించుకంటె నిర్జన వనవాటిలో, నజగ
    రంబుగ నేని జయింపఁగా దగున్‌!

ప్రాయముడిగిన ప్రారబ్ధమునకు దోడు, పిసినిగొట్టుపీను గుఁగూడ నగుచో నిఁకఁ జెప్పవలసినదేమున్నది! నాకుఁబట్టిన యవస్థయే పట్టును! భగవంతుఁడా! తండ్రీ! నా భర్తవంటి భర్తను మాత్రము పగవారికైనఁ బ్రసాదింపకుము?

సీ. నగపేరు చెప్పిన నవ్వులఁ బుచ్చును
         కోకలు కొనుమన్న గొల్లుమనును
    పొత్తంబు దెమ్మన విత్తంబు లేదనుఁ
         గాగిత మడిగినఁ గాక పడును
    విడియ మొనర్చిన విసవిసలాడును
         కాని పూవును గొన్న కస్సుమనును
    వ్రత మొనర్చెద నన వలవల యేడ్చును
         ముష్టి పెట్టిన నెత్తి మొత్తుకొనును

    పండుగకు పబ్బమునకై బిండి వంట
    మాట యెత్తిన బగ్గున మండిపడును

    కటకటా! యిట్టి మగనితోఁ గాపురంబు
    సలుప శక్యమె యెంతటి సాధ్వికైన?

ఇంతటితోఁ దీఱినదా?

సీ. జడవైచుకొన సాని పడుచువఁటే యమఁ
          జీరగట్టిన షోకు మీరె ననును
    వంటవానిం బిల్వ వెంట నేతెంచును
          పోలితో మాటాడఁ బొంచి వినును
    చదివిన వ్రాసిన జగడమాడును, దొడ్డి
          లోని కేగిన నను మానపడును
    గడపదాఁటిన, వెన్కఁగొడుకు నంపించును
          బాడిన సతి కిది కూడదనును

    ఇంటికెవరైన వచ్చిన వెంటబడును,
    తగునె యీ చేష్ట లన పెంకి దాన వనును
    కటకటా! యిట్టిమగనితోఁ గాపురంబు
    సలుప శక్యమె యెంతటి సాధ్వికైన?

ఇఁక సంసార సందర్భములు సరేసరి!

సీ. పుడకలుం బిడుకలు బోషాణమున దాఁచి
         యెట్ట కేలకు లెక్క పెట్టియిచ్చు
    ఉప్పును బప్పుఁదా నుండెడు గదినుంచి
         తులముల చొప్పునఁ చూచిఁ యిచ్చు
    పెరటికూరల నెల్లఁ బెరవారి కమ్మించి
         యేర్చి చచ్చుం బుచ్చు నింటికిచ్చు
    వండినదెల్లఁ దా వడ్డించుకొని మెక్కి
         మిగతవారల కంట్లు - మిగులనిచ్చు

    తిరుగుచుండగనే యింటి దీప మార్చుఁ
    బలుకుచుండఁగనే గొంతు పగుల నార్చుఁ
    గటగటా? యిట్టి మగనితోఁ గాఁపురంబు
    సలుప శక్యమె యెంతటి సాధ్వికైన!

లింగ :- (తెరలో) మావన్నెల విసనకఱ్ర యేమి చేయుచున్నది?

సుభ :- ఏమి చేయుచున్నదా? ఉసూరుమని యేడ్చుచున్నది!

లింగ :- (ప్రవేశించి) ఓసీ! యెప్పుడు చూచిననెందులకో కొఱకొఱ లాడుచునే యుందువు. సంతోషముగా నుండు సమయ మెప్పుడే?

సుభ :- చచ్చిన మఱునాఁడు!

లింగ :- నీవా, నేనా?

సుభ :- మీకుఁ జావేమిటి! ఎన్ని కట్నము లందుకొనవలసి యున్నదో, యెందరి గొంతు లింకను గోయవలసి యున్నదో?

లింగ :- కట్నములమాట కలకంఠుఁ డెరుఁగునుగాని పెన్నిధివచ్చి నను నేనిఁక బెండ్లి మాత్రము చేసికొనను! బుద్ధివచ్చినది!

సుభ :- దాని కేమిలెండు! కలిమినిబట్టి యెవరికో గంగవెర్రులెత్తక మానవు, సిగ్గు బుగ్గి చేసికొని మీరు సిద్ధపడక మానరు!

లింగ :- సరే యదృష్టము పట్టినప్పు డాలోచించవచ్చును గాని, నా మీఁద నీకింత కోప మెందులకే?

సుభ :- మీ మీఁదనే కోపము! నా తండ్రి మొర్రోయని మొత్తుకొనుచుండ ఆయన మెడలు విరిచి అన్యాయముగ నా గొంతుకోసిన మాయమ్మ మీఁదఁ దప్ప నా కెవ్వరిమీఁదను కోపములేదు.

గీ. విద్యయు, వయస్సు, పరువును విడిచిపెట్టి
   భాగ్య మొక్కటియే చూచి బడుగు పిసిని
   గొట్టు పీన్గునకుం దన కూఁతు నిచ్చు
   తల్లి కుత్తుక తరిగినఁ దప్పు గలదె!

లింగ :- ఓసీ! భర్తయన భగవంతుఁడుగదా! భర్త నిట్టి పాడుమాట లనవచ్చునని యే పుస్తకములో నైన నున్నదా?

సుభ :- ఆలియన నర్ధాంగిగదా! అర్ధాంగి కన్న మైనఁబెట్టక, కూడఁబెట్టిన ధనము కూడఁ గొంపోయిన వారెవ్వరైన నున్నారా?

లింగ : -ఆహాహాహా! అంటించినావే ముక్కకు ముక్క! వెర్రిదానా! గడించినవాఁడెవ్వఁడు కర్చుపెట్టి చచ్చినాఁడే? చూడు.

సీ. ప్రాయకంబుగ బెట్టు పాఁతువాఁ డొక్కడు
         వరుసఁ బండ్లను మెక్కు -వాఁడొకండు

    కష్టపడి గృహంబు గట్టువాఁడొక్కఁడు
          వసతిగ నివసించు వాఁడొకండు
    ఆస్తికై వ్యాజ్యంబు లాడువాఁడొక్కఁడు
          వచ్చిన నది మ్రింగువాఁడొకండు
    కోరి ముండను బెట్టు కొనెడివాఁడొకండు
          వలపుకాఁడై పొందు వాఁడొకండు

    అట్లె, ధనము కూర్చు నిట్టివాఁ డొక్కండు
    వడిగఁదగులబెట్టు -వాఁడొకండు
    ఇది ప్రపంచధర్మ మీ నాడు పుట్టిన
    లీలగాదు దీని కేల గోల?

సుభ :- సరే కాని నా సమాధానము కూడ వినెదరా?

లింగ :- అక్కరలే దక్కరలేదు. ఈ వితండవాదమున కిప్పుడు తీరిక లేదు. నీకొక శుభవార్త చెప్పిపోవలెనని వచ్చినాను.

సుభ :- ఏమిటది? ఎవరైన బదులుకొరకు వచ్చుచున్నారా ఏమి?

లింగ :- బదులుగాదు బండలుగాదే. అబ్బాయికి బిల్ల నిచ్చుటకై పెండ్లి కొడుకు చూపులకు వచ్చుచున్నారు.

సుభ :- మనకుఁ బిల్లనిచ్చునంతటి మతిమాలినవా రెవ్వరబ్బా?

లింగ :- ఎవరా? పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారు.

సుభ :- ఏమిటీ? కాళిందినా? కమలనా ?

లింగ :- కాళిందియో గీలిందియో నాకు తెలియదు. పెద్ద కొమార్తె.

సుభ :- పేరుతో మీకేమిపని! కట్నము మాత్రము గళ్ళున పెట్టెలోఁ బడిన జాలును! ఏపాటి?

లింగ :- ఏమో వారియిష్టమే మిచ్చిననుసరే.

సుభ :- అట్లయినఁగాలమున కేదియో అంతరాయ మున్నదన్న మాటే! సరేకాని క్షౌరము చేయించుకొననే లేదుగద?

లింగ :- అబ్బా, అగపడినప్పుడెల్ల క్షౌరపుగోలయే కదా! నేను జావఁగానే, సర్వస్వము నీ క్షౌరముల క్రిందనే చెల్లును గాఁబోలును!

సుభ :- మీకా విచార మెందులకు? మీరు పోవునప్పుడు మీ యినుపపెట్టె మీ నెత్తి కెత్తెదనులెండు! లింగ :- ఆహా! అట్టి యవకాశమేయున్న నదృష్ట మేమనవచ్చును!

గీ. సంపద మహత్వ మెరుగని చవట బ్రహ్మ
   చావు లేకుండగా నేని సలుప డయ్యె
   చచ్చునప్పుడు వెను వెంట సకలధనము
   తీసికొనిపోవు విధమేని తెలుపడయ్యె. (తెరపడును.)

రెండవ రంగము

ప్రదేశము: లింగరాజుగారి కచేరి చావడి

(ప్రవేశము: పురుషోత్తమరావుగారు, లింగరాజుగారు, బసవరాజు, పేరయ్య, వీరయ్య చాపలపైఁ గూరుచుండి)

లింగ :- విన్నావా? మున్నంగివారికిని, మాకును మూడుతరముల నుండి సంబంధ మవిచ్ఛిన్నముగా సాగుచున్నది. మూర్తి రాజు పంతులు గారా సంగతులన్నియు నెత్తుకొని మూరెడుత్తరము వ్రాసినారు. అందుచేత నింత దూరమాలో చించవలసి వచ్చింది-

వీర :- మూడు తరలానాటి సంబంధ మొకటేనా? మూడువేల రూపాయల కట్నమో!

పేర :- వీరయ్యా! నీ గొడవ మా విపరీతంగా వుందే! మూడు వేలు మూడువేలని యిక్కడికి ముప్పయిసార్లన్నావు. ముష్టి మూడువేలు మేరేకాని మేమివ్వలేమనుకున్నావా? లింగరాజుగారు! ఆ మొత్తం మే మే యిస్తాము. మా కింద ఖాయం!

వీర :- అదేమన్నమాట? మీరథికంగా అన్నదేముంది?

పురు :- అట్లయిన నింకొక యైదువంద లధికముగా నిచ్చెదము.

వీర :- మా పంతులుగారు మరియైదువందలు.

పేర :- వొయ్యోయ్? వద్దుసుమా వొద్దు! మా పంతులుగారి సంగతి తెలియక మాజోరుగా వస్తున్నావు! మాట దక్కదు సుమా.

వీర :- పేరయ్యా నీ బెదిరింపులకు నేను జడిసేవాడ్ని కాను! మా పంతులుగారు పెట్టమన్న మొత్తం వఱకూ పెట్టిమరీ తీరుతాను. పురు :- (రోషముతో) సరే కానిమ్ము నాలుగువేల నాలుగు వందలు.

వీర :- అయిదువందలు

పురు :- ఆరు; రా యెంతవరకు రాగలవో రా.

వీర :- రాక విడిచి పెడుతానా? యేడువందలు.

పురు :- ఎనిమిది ?

బస :- (తనలో) బాగు బాగు! ఫార్సులాగునే యున్నదే!

గీ. పేకల నోకులం బాడు వీఁక నడి బ
   జారులో గుడ్డలం బాడు సరణి; పెండ్లి
   కొడుకు నిటు మధ్య నిడి, కసి గొన్న యట్లు
   వేలముం బాడు టెన్నఁడు యెరుంగ !

లింగ :- వీరయ్య! వీరిక్రింద ఖాయపరుప వచ్చునా!

వీర :- అప్పుడేనా? అయిదువేలు?

పేర :- (లేచి) బాబూ, యీ బేరం మనకు కుదిరేదికాదు లేవండి.

పురు :- అయ్యా! సెలవు తీసుకొను మనెదరా?

లింగ :- సందర్భము లన్నియుఁ దమరు స్వయముగా జిత్తగించుచు నన్ను నెప పెట్టుట న్యాయమా!

పురు :- సరే మీ చిత్తము. (అని లేచి పేరయ్యత బైటకేగును)

వీర :- కొంపతీసి, బేరం గోవిందా కొట్టదుగద?

లింగ :- వెర్రివాఁడా! పేరయ్య అంత పెయ్యమ్మ యనుకొంటివా?

వీర :- నన్ను మెచ్చుకోరేం? నా పాఠం నేనెల్లా వప్పగించాను?

లింగ :- నిత్యము గోర్టులలో బ్రతుకు ముండకొడుకవు; నీకిదిలెక్కా (అని యేదియో వ్రాయుచున్నట్లు నటించును.)

బస :- (తనలో) వీరి ప్రసంగంబట్టి వీరేదియో కుట్ర సాగించునట్లు కనబడుచున్నది. వీరయ్య ఫాల్సు పాటగాడై యుండును.

పేర :- (బయటను) పంతులుగారు! బహుదూరం వెళ్ళారు. ఇంతదూరం వెళ్ళడం నాకిష్టంలేదు. వెళ్ళకచేసేదీ కనపడలేదు. ఆ ఏల్నాటి శనిముండాకొడుకు లేకపోతే ఏంచక్కా ఫయిసలయ్యేది! చెరపడానికి చేటపెయ్యచాలును! నిజానికి నిలివెడు ధనమిచ్చినా యీపాటి పిల్లవాడు మాత్రం ఇక సందర్భపడడు.

పురు :- పోనిండింకను రవంత దూరము పోయి చూతమా?

పేర :- పోవుటకేం పోవచ్చును ఆ సులువు బలువు లాలోచించుకో వలసిన వారు మీరు. అమ్మగారితో ఆలోచింతా మంటే అవకాశంలేదు. మనం మళ్ళీ వచ్చేసరి కీముండాకొడుకు మంగళం పాడేస్తాడు.

పురు :- అనవసరమగు నాలస్యమే కాని అది మాత్రమేమి చెప్పఁ గలదు? ఇంకొక మాట యని చూతము రండు.

పేర :- అయితే, ఒక పనిచెయ్యండి. ఆవెధవతో వేలంపాట నాకిష్టంలేదు. ఆఖరుమాటని యింకో ఐదువందలమాంతంగా పెట్టండి, దానితో దిమ్మతిరిగిందా, తిరుగుతుందీ. తిరక్కపోతే, తిన్నగా ఇంటికి చక్కాపోదాం ఏమిశలవు?

పురు :- సరేరండు, (అని పేరయ్యతో మరలలోపలికేగి) లింగరాజుగారు! మరియొక్క మాట యనిపోవుదమని మరల వచ్చినాను. ఇంకొక యైదు వంద లిచ్చెదము. ఇష్టమున్న మా క్రింద స్థిరపరుపుడు, లేదా, యింతటితో మాకు సెలవు.

లింగ :- మూర్తిరాజుగారి క్రింద స్థిరపరిచి నట్టుత్తరము వ్రాయుటకు మొదలు పెట్టినానే, సరే సమాప్తి కాలేదు కనుక దోషములేదు. ఏమి వీరయ్యా! వీరి క్రింద స్థిరపరుప వచ్చునా?

వీర :- వారు నాకిచ్చిన వర్దీ యెంతవరకో, అంతవరకూ పాడాను. టెల్లిగ్రాపిచ్చి తిరిగి ఆర్డరు తెప్పించుకునేవరకూ ఆగండి.

లింగ :- అదేమన్నమాట, అయిదు నిమిషము లాగను. పెద్ద మనుష్యుల కడ పేచీలు పనికిరావు! అయ్యా తమ క్రింద ఖాయము.

పేర :- తథాస్తు! పంతులుగారూ! తమవద్ద పదిరూపాయలు లుంటే ప్రస్తుతము బజానా క్రింద జమకట్టించండి.

పురు :- (రూపాయలు తీసి యిచ్చును)

పేర :- తమరు కాస్త రసీదుముక్క వ్రాసి యిప్పించండి.

లింగ :- అభ్యంతరమేమీ? (అని రసీదు వ్రాసి చదువును) "బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి సింగరాజు లింగరాజు వ్రాసియిచ్చిన రశీదు. మీ కుమార్తె చి||సౌ|| కాళిందిని నా కొమారుడు చి|| బసవరాజునకు చేసికొనుటకు అందులకై మీరు మాకు కట్నము క్రింద నైదువేల ఐదువందల రూపాయల రొఖ్కము, రవ్వల యుంగరము, వెండి చెంబులు, వెండి కంచము, వెండి పావకోళ్ళు, పట్టు తాబితాలు, వియ్యపురాలు, వియ్యంకుల లాంఛనలములు యథావిధిగా నిచ్చుటకును. ప్రతిపూట బెండ్లివారిని బ్యాండుతోఁ బిలుచుటకును, రాక పోకలకు బండ్లు, రాత్రులు దివిటీలు నేర్పాటు చేయుటకును, రెండుసారులు పిండి వంటలతో భోజనములు, మూడుసారులు కాఫీ, సోడా, యుప్మా, యిడ్డెను, దోసె రవ్వలడ్డు, కాజా, మైసూరు పాకాలతో ఫలహారములు చొప్పున మా యిష్టానుసారమైదుదినములు మమ్ము గౌరవించుటకును అంపకాలనాడు మాకు పట్టుబట్టను, మాతో వచ్చువారికి కుప్పాడ బట్టలు నిచ్చుటకును నిర్ణయించుకొని బజాన క్రింద పది రూపాయలిచ్చినారు. గనుక ముట్టినవి.

"సింగరాజు లింగరాజు వ్రాలు" చాలునా?

పేర :- చాలుబాబు! చాలు! మచ్చుకోసం దాచిపెట్టి తేవలసిన మతలబు! (అని రసీదు తీసుకొని పురుషోత్తమరావుగారి కిచ్చును.)

పురు :- బావగారూ! మాకిఁక సెలవా?

లింగ :- చిత్తము, చిత్తము. తాతగారు పిల్లపేర వ్రాసి యిచ్చిన దస్తావేజొకసారి పంపెదరా?

పురు :- అభ్యంతరమేమీ? అట్లే పంపెదను.

(తెరపడును)

ఇది తృతీయాంకము