వరవిక్రయము/అష్టమాంకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అష్ఠమాంకము

మొదటి రంగము


(ప్రదేశము: వెఱ్రిబుఱ్రల వెంగళప్పగారి కచేరి చావడి.)

వెంగ :- (పడక కుర్చీలోఁ బరుండి) అదిగో! పదికూడా అయినది. ఇప్పటికొక పార్టీ రాలేదు; ఇంకా వచ్చేదేమిటి? ఈవిధంగా వున్నది వ్యాపారము! పదికొట్టేసరికి పాగా, కోటూ తగిలించుకొని సాయల వాళ్లలాగు చక్కాబోయి, కచేరి కాంపౌండులలోనూ, రైలు స్టేషనుల వద్దను, ఘాటీపాకలవద్ద కూడా కాచి మనిషి కంటబడేసరికి మరిడీ దేవతవలె పట్టుకుంటూ వుంటే యెందరికని యేడుస్తవి కేసులు! ఈ రోజులలో నాలుగే వృత్తులు. ఒకటి సిగరెట్ల దుకాణము. రెండు కాఫీహోటలు. మూడు మెడికల్‌ ప్రాక్టీసు, నాలుగు ప్లీడరీ. ఏ సందులోకి వెళ్ళి, యే గుమ్మంవంక చూచినా ఏ సిటీ సిగరెట్‌ స్టోర్సు బోర్డులో, ఏ "మైసూరు మహాలక్ష్మీవిలాస్‌ కాఫీక్లబ్" బోర్డో, యే 'ఏ.డి.రాజు, యల్‌.యమ్‌.యస్‌. మెడికల్‌ ప్రాక్టిషనర్‌' బోర్డో, యే 'బీ. వీ. రాఘవాచారి, బి.యే.,బి.యల్‌. హైకోర్టు వకీలు' బోర్డో ప్రత్యక్షం! ఈ నాలుగు వృత్తులలో కాఫీహోటలు ఫస్టు; ప్లీడరీ లాస్టు! నాన్‌కో-ఆపరేషను కొంత నాశనం చేస్తే స్టాంపుడ్యూటీ పెరిగి సర్వనాశనం చేసింది! ఈ తాలూకా బోర్డు ప్రెసిడెంటు పదవే రాకపోతే యీపాటి కీబీరువా లమ్ముకొని పోవలసిందే! దీని తల్లి బొడ్డు పొక్క! దీనికీ వచ్చాయిప్పుడు తిప్పలు! పోయిన సంవత్సరం అమాం బాపతులూ అయిదువేలు గిట్టాయి. ఈ సంవత్సరం టి. ఎ. ఫిక్సెడ్డుచేసి, మా నోటిలో మన్ను కొట్టారు! ఇదిపోతే ఇక, కంట్రాక్టర్ల కమీషను యీ సంవత్సరము వాళ్ళివ్వవల్సింది కూడా నిరుడే వాడుకున్నాను. ఇక వాళ్ళిచ్చేదేమిటి, చచ్చేదేమిటి? పోతే, యిక, చచ్చుముండా స్కూలు టీచర్లున్నారు. ఫయినులు వేసి, బదిలీలు చేసి, బర్తరఫులు చేసి గోలయెత్తించే ఒక్కొక్కనెల జీతం వూడిపడేసేరికి చుక్కలు రాల్తాయి. పయివాళ్ళను తగ్గించి, బంధువులను తెచ్చిపెట్టుకోవడం మొదలు పెట్టాక అది అఘోరంగానే వుంది! ఈ కాకిపిండాలయినా ముట్టకుండా స్వరాజ్య పార్టీవా రిక్కడ కూడా సన్నాహాలు మొదలుపెట్టారు. ఎలక్షను రోజులు దగ్గిర పడుతున్నాయి! వెనుకటిలాగే ఓట్లు కొందామంటే వెనుకటి ఋణమే యిప్పటికింకా తీరలేదు. బాగా వచ్చేటప్పుడు వొల్లు తెలియక బ్రాంది దగ్గరనుంచి అలవాటు చేసుకున్నాను. ప్రాతఃకాల మయ్యేసరికి బాటిల్‌ కావాలి. ఈ తిప్పలకు తోడు యింటిదాని బాధొకటి పట్టుకున్నది! ఫస్టు తారీఖున రెండు పెద్ద కాసులూ చేతులో పెట్టకపోతే చెప్పుదెబ్బలు తప్పవు! ఆ రాత్రి దాని కంటపడడం చేత ఆవిధంగా రాజీ చేసుకోక తప్పిందికాదు. ఎవరో వచ్చుచున్నారు! (అని లేచి గంభీరముగా గూరుచుండును.)

ఒక టీచరు :- (చేతులు కట్టుకొని ప్రవేశించి, నమస్కరించి) అయ్యా! నేను అచ్చన్న పేట స్కూలు తాలూకు అయిదో టీచర్నండి.

వెంగ :- అయితే యేమంటావు? ఆ నంగినంగి వేషా లేమిటి?

టీచ :- వల్లూరులో నా భార్య కనలేక మూణ్నాళ్ళనుంచి కష్టపడుతూ ఉన్నదండి. రెండు రోజులు సెలవిప్పించితే వెళ్ళివస్తానండి.

వెంగ :- నీభార్య కష్టపడుతూ వుంటే నీ వెందుకు యేడవనూ? నీవు కనిపిస్తావా? లేక వకాల్తానామా పుచ్చుకొని నీవే కంటావా?

టీచ :- డాక్టరు దొరసానిగార్ని తీసుకువెళతానండి.

వెంగ:-అబ్బో! నీ మొహాని కదికూడానా! యినస్పెక్టరుగార్ని చూచావా?

టీచ :- చూచానండి. చూస్తే తమతో మనవి చేసుకోమన్నారు.

వెంగ :- అయితే ఆ పిడతను ముందుచూచి ఆ పిడత వెళ్ళమంటే అప్పుడు వచ్చావన్నమాట. ఫో! సెలవూ లేదూ గిలవూ లేదు ఫో!

టీచ :- (దైన్యముతో) అయ్యా! కటాక్షించాలి. కష్ట సమయం.

వెంగ :- పొమ్మంటే పొయ్యావు కావు గనుక రెండురూపాయలు ఫైను. టీచ :- మహానుభావులు:- దైవస్వరూపులు మన్నించాలి.

వెంగ :- ఫయినన్నా కదల్లేదు గనుక పదిహేను రోజులు సస్పెండు.

టీచ :- అధికార్లు ఆగ్రహపడితే నే నాగలేను. అనుగ్రహించాలి.

వెంగ :- సస్పెండన్నా జంకావు కావు కనుక డిస్మిస్‌ చేశాను ఫో.

టీచ :- ఆరి ఛండాలుడా! ఆ మాటకూడా అనేశావా; సరే ఇంతేనా యింకేమయినా చెయ్యగలవా? ఈ మూడేళ్ళముష్టి పదివిపోగానేఁ ఇంటింటా అడుక్కుతినే యోగం నీకుగాని యీపాటి కాటికాపరి పని మాకు దొరకకపోదు. అదిగాక నీవంటి అధమాధముని కాలంలో, అడలిపోతూ నవుకరీ చెయ్యడం కంటే యాయవార మెత్తుకున్నా మంచిదే. శేషాద్రిగారి చెప్పులుమోసి, కామరాజుగారికి కాళ్ళు గుద్ది మాలవాడికి వంటింటిలో మంచంవేసి వారికీ సాధ్యంకాని ఓట్లకు వందలకు వందలు సమర్పించీ, ఈ సామ్రాజ్యం సంపాదించావు! అయితే యేమీ ఆ పడ్డపాట్లన్నీ అప్పుడే దులిపేశావు! అల్పున కధికారం పట్టినా, ఆడదానికి వైధవ్యము వచ్చినా "యెద్దు కచ్చుపోసినా, యేనాదికి పెత్తనమిచ్చినా, క్షణంలో స్వరం మారుతుందన్న వాఁడు వెఱ్ఱివాఁడా! ఏమి విపరీతకాలం వచ్చిందో! యెక్కడ చూచినా మునిసిపాలిటీలూ, లోకల్ బోర్డులూ, నిరక్షరక్షులతోనో, నీవంటి నీచాతినీచులతోనో నిండిపోతున్నాయి! అయిందాకా, అడ్డమైన గడ్డి కరవడం! అయిందనగానే, ఆకాశం ముట్టడం! యిదీ యిప్పటి మర్యాద! అయినా, మీ యాపదమ్రొక్కులు నమ్మి మీలాంటి వాళ్ళకు వోట్లిచ్చేవారి ననాలి గాని మిమ్ముల నవలసిన పనిలేదు! మీకు వోట్లివ్వడం వలన మీపాపాలలో భాగం పంచుకోవలసివుంటుందన్న సంగతి తెలిస్తే ఒకరయినా మీకు వోటిస్తారా? నీకూ కాలం దగ్గిర పడ్డది! కాకపోతే, కళ్ళింత మూసుకుపోవు! ఇనస్పెక్టరుగారిమీద నీకింత కడుపుమంటెందుకు? నీతో గలిసి నీ పాటకు తాళం వేశారు కారనేనా? ఆయన చెప్పులు మొయ్యడానికయినా నీ కర్హత వున్నదా? నీవు చేసిన దారుణాలకు, నీ గుండెలలో గునపం లాగు ఆ మహారాజు కాస్త అండగా వుండబట్టే, యింత అన్నం తిన్నాం! ప్రతివారిని పిడత పిడతంటావు! పిడతేమిటి? నీ పిండాకూడు! ఎంతమంది నీ జీవానికి పడి యేడ్చు చున్నారో యెందరి వుసురు నీ యింటావంటా చుట్టుకుంటూ వుందో యెరక్క ఇంత పొంగి బోర్ల పడుతున్నావు! భగవంతుడు మా మొర వినకాపోడు. పటుక్కున నీ దుంపతెంపకాపోడు! ఈసారి నిన్నెలాగు ఈడ్చి పారేస్తారు. ఈ మాటలు మాత్రం మనస్సులో వుంచుకో! ఇకసెలవు! (నిష్క్రమించును.)

వెంగ : -హమ్మా! హమ్మా! ఎంతలేసి మాటలన్నాడు! ఆ వెధవ అల్లా దులిపేస్తూవుంటే పాడునోరు పైకి లేచిందే కాదేం? ఇదే కామోసు గిల్టీకాన్‌షన్ అంటారు! నిజంగా యింత నిర్భాగ్యపు వెధవను నేఁ నిదివరకెన్నడూ కాలేదు. నా ధూంధాంలు చూచి, నలుగురు టీచర్లూ నా యంతవాడు లేడనుకునేవారు. ఈ సంగతి తెలిస్తే ఇకనన్నెవడైనా లక్ష్యపెడతాడా! సమయానికి చాకలి వెధవకూడా లేకుండా పోయాడు! అవసరానికి లేకపోయినందుకా వెధవను డిస్మిస్‌చేసి తీరుతాను! అదెవరు?

లింగ :- (ప్రవేశించి) ఈ పూట పంతులుగారింత తీరికగా నున్నారేమి?

వెంగ :- దయచెయ్యండి! యేమి తీరిక! యేమిలోకం! పార్టీ లంతా యిప్పుడే బసలకు పోయారు. ఎవరో టీచరువచ్చి, యేదో చెప్పుకుంటుంటే వింటున్నాను. ఏమిటి సమాచారం? కూర్చోండి!

లింగ :- (కూర్చుండి) పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారి కొమార్తెను మా పిల్లవానికిచ్చిన సంగతి మీరెఱిగినదే గదా? వివాహ కాలమున నాలుగువేల రూపాయల నగలుంచినారు. వివాహమై మూడేండ్లు కావచ్చినది. పిల్లను గాపురమునకు బంపరు. మా నగలు మా కిమ్మన్న మాటాడను మాటాడరు. అసలు రహస్యమేమా? ఆ నగలు మనవి కావు. తరువాతఁ జూచుకొందమని తాకట్టు వస్తువులు తీసి తగిలించినాను. తాకట్టు పెట్టిన వారిపుడు నన్ను తాటించుచున్నారు.

వెంగ :- కార్యంకాగానే చల్లగా సంగ్రహించుకోక పోయారా?

లింగ :- అప్పటి నా యభిప్రాయమదే కాని సాగినది కాదు. ఆపిల్ల ఎలాగుననో నా యభిప్రాయము కనిపెట్టి అందుల కవకాశము చిక్కనిచ్చినదిగాదు. వెంగ :- ఆ పిల్లకిప్పుడెన్నో యేడు?

లింగ :- పదునాఱవ యేఁడు ప్రవేశించినది.

వెంగ :- ఐతే మైనార్టీ వదలలేదన్నమాట. అబ్బాయికో?

లింగ :- పందొమ్మిది.

వెంగ :- సరే దానికేం! ముందో నోటీసుముక్క వ్రాసిపారేసి అబ్బాయి పేరుతో తక్షణం తండ్రిమీద దావా దాఖలు చేదాం!

లింగ :- తండ్రిమీఁదనే కాదు. దానినిగూడఁ గోర్టునకీడ్చి తెప్పించి నలుగురిలో నగ లూడదీయించినగాని నా కసి తీఱదు.

వెంగ :- అదెంతపని? పసిపిల్లను నగలతో పరారీ చెయ్యడానికి సిద్ధముగా యున్నారని చెప్పి యెంజెక్‌షన్ ఆర్డరు పుచ్చుకొని యిట్టే ఈడ్పించుకొని రావచ్చును. కోర్టులో మనమాటంటే ఇపుడు కోటి రూపాయల క్రింద చెలామణీ అవుతుంది.

లింగ :- ఇంకొకటి, మనకు మనోవర్తి బాధ లేకుండా ఈ సంబంధ మింతటితోఁ దప్పిపోవు దారికూడఁ జూడవలెను.

వెంగ :- దానికేముంది? ప్రతిరాత్రీ మునసబుగారు పేకాటకు మన ఇంటికి వస్తూనే యుంటారు. ఇది నా స్వంత వ్యవహారము వంటిదని చెప్పితినా, ఆయన స్వంత కార్యము క్రింద చూచెదరు.

లింగ :- సరే, సాయంకాల మబ్బాయినిఁగూడిఁ దీసికొని వచ్చెదను. మీరు కోర్టునుండి రాఁగానే నోటీసు వ్రాయుఁడు. (అని లేచును.)

వెంగ :- వచ్చేటప్పుడు ఫీజేమయినా తెచ్చి జమకట్టిస్తారు గాదూ?

లింగ :- అయ్యో, దానికేమీ? ఆమాట మీరు చెప్పవలెనా? (కొంచెము పరిక్రమించి) ప్లీడరింటఁగాలు పెట్టగానే, ఫీజుగోల సిద్ధము! ఫీజు ముట్టువఱకుఁ ప్లీడరు పిశాచమే!

గీ. రోగి చావనీ బ్రతుకనీ రొక్క మెటులొ
   లాగ జూచును వైద్యుఁడు లాఘవముగ
   వ్యాజ్య మోడనీ గెల్వనీ వాటమెఱిఁగి
   పిండుకొనఁజూచు ప్లీడరు ఫీజు ముందె!

★ ★ ★

రెండవ రంగము

(ప్రదేశము: కమల గది.)

కమ :- (నూలు వడుకుచు) కనుకనే పెద్దలు కదురు తిరిగినను కవ్వము తిరిగినను కాటకముండదని చెప్పుదురు. సందియ మేమి?

గీ. రాట్నపుం జక్ర మిటు లహోరాత్రములును
   గాలచక్రంబు కైవడిఁ గదిలెనేని
   విష్ణుచక్రంబువలె క్షామ విదళనంబు
   చేసి, భూచక్రమెల్లను జెతనిడదె!

ఎందుకుఁ జెపుమా నాన్నగారు వచ్చుచున్నారు! (అని లేచును.)

పురు :- (కాగితము చేతఁబట్టుకొని ప్రవేశించి) అమ్మా వియ్యంకుఁడుగారు చివరకు వీధి కెక్కినారు! ఇదిగో నోటీసు.

కమ :- ఏమని?

పురు :- చదివెద వినుము. (అని యిట్లు పఠించును.)

బి. యే. బి.యల్‌. హైకోర్టు వకీలు వెర్రిబుర్రల వెంగళప్పగారి వద్ద నుంచి, పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి, అయ్యా! మా క్లయింటు సింగరాజు బసవరాజుగారికి మీ కొమార్తె కమలను యివ్వడం మూలకంగా వివాహం కాబడ్డట్టున్నూ, వివాహ కాలములో మా క్లయింటు మీపిల్లకు నాలుగువేలు రూపాయల కిమ్మత్తు గల నాణెమైన బంగారపు నగలు వుంచబడ్డట్టున్నూ సదరు నగలను మీరు హరించడానికి దురుద్దేశముతో, సదరు చిన్నదాన్ని కాపరానికి పంపకుండా వుండబడ్డట్టున్నూ, మీపైన దావా వగైరా చర్య జరిగించేదిగా మాకు సమజాయిషీ ఇవ్వబడివున్నారు. ఈ నోటీసు అందిన ఇరువది నాలుగు గంటలలోగా సదరు వస్తువులు సహితం పిల్లను కాపురానికి పంపబడి మావల్ల క్రమమైన రసీదును పొందకుండా వుండబడే యెడల మీ వగైరాలపైన దావా చెయ్యడమే కాకుండా, మీవల్ల యావత్తు ఖర్చులున్నూ రాబట్టుకోబడడం యిందుమూలముగా తెలియజేయడమైనది. ఈ నోటీసు తాలూకు ఖర్చులుగూడా పిల్లతో పంపబడేది కాబడుతుందని చిత్తగింపవలెను.

-వెఱ్రిబుఱ్రల వెంగళప్ప.

కమ :- సరే దీనికి సమాధానమేమియుఁ వ్రాయవలదు. దావా కూడ దాఖలు కానిండు.

పురు :- అమ్మా! నీ అభిప్రాయమేమో నాకు బోధపడలేదు. "నన్నిప్పుడేమియు నడుగవలదు. సమయము వచ్చినప్పుడు సర్వముదేటఁ పడఁగల"దని నీ వాదిలోఁ జెప్పియుండుట చేత నిన్నేమియు నిరోధించి యడుగలేదు. కాని ఏమి యపకీర్తి వచ్చునో యను నాందోళన మాత్రము లేకపోలేదు. అదిగాక.

గీ. పరులకుం దాస్య మొనరించి పరువు మాలి
   బ్రతుక జూచుటకంటెను బస్తు మేలు,
   సరస మెఱుఁగనివారితో జగడమాడి
   కోర్టు కెక్కుటకంటెను గొఱత మేలు?

కమ :- అది నిజమే కాని యీ వ్యవహార మట్టిది కాదు. దీనికై మీ రించుకయు దిగులు పడవలసిన పనియు లేదు. సర్వము నాకు విడిచిపెట్టి మీరు శాంత మనస్కులరై యుండుడు.

పురు :- సరే కానిమ్ము. నీ మాటయే నాకు నిట్రాట. (నిష్క్రమించును.)

కమ :- (ఆకసమువంక చేతులు జోడించి) ఓ సర్వేశ్వరా!

ఉ. గట్టిగ నిన్నె నమ్ముకొని కష్టము లోర్చినవారి నేరి చే
    పట్టి భరించు కేవల కృపామయమూర్తి వటంచు నెట్టనం
    బట్టితి నీదు పాదములు, బాలను, బేలను, దీనురాల న
    న్నెట్టులు తేల్చెదో! తరుణ మియ్యది యే సుమి డాయ వచ్చెడున్‌.

(తెరపడును.)

(ఇది అష్టమాంకము.)

★ ★ ★