Jump to content

వదరుబోతు/విద్య

వికీసోర్స్ నుండి

విద్య

విద్యా ప్రభావమును వర్ణించుచు భర్తృ హరి కడమాటగ “విద్యావిహీనః పశుః" అని వచించెను. ఇది యాధారముగ విద్యావంతులు మనుకొనువారు విద్యాహీనులు నెంతో నీచముగఁ జూచుచు వారికన్నఁ దామొకమెట్టు పైనున్నట్లు భావింతురు. సంఘములో విద్యాహీనుల కెందును గౌరవములేదు. ఇట్టి యభిమానమన్ని సంఘ ములలోను పురుషులయందె కాక స్త్రీలయందును ప్రబలుచున్నది. కాని నాకుఁ జూడ నిది యొక శోచనీయమైన దుర్నయము. విద్యావంతుల మను కొనువా రితీరులఁజూచి నవ్వవలయునేల? పట్టు చీరఁ గట్టుకొన్న భాగ్యశాలిని యితరులు గేలి సలుపవలెనని ధర్మశాస్త్రమా! కొమ్ముకుప్పెలును చిఱు గంటలును గల వృషభ మెట్టిజతతో కాడి గట్టినను గొంచమైన యేవగించుకొనదు కదా? కాని, నాకొక్క సందేహము దానికిఁ గూడ విద్య నేర్పినచో నిట్టిగుణమే పట్టువడునేమో?

విద్యయనుమాట కెన్ని యర్థము లున్నవని వాదించినను సామాన్యముగ వ్రాత చదువులకే యది రూఢముగ నున్నది. పూర్వకాలమున సంస్కృతభాషలో సాహిత్యమునందో, శాస్త్రము నందో, పాండిత్యము గలవాఁడే విద్యావంతుఁడు. తదితరు లపుడు గౌరవమున కనర్హులు. అన్య భాషాజ్ఞానము గలవా రాకాలమున ననార్యులుగ భావింపఁబడిరి. ఇప్పుడో విద్యయనఁగా క్రమ క్రమముగ నాంగ్లేయ భాషాభ్యాసమునకే యన్వ యింపఁ బడుచున్నది. కాననే "ఎ. బి. సి.” రాని వాఁ డెంత బృహస్పతి యయినను విద్యావంతులలోఁ బరిగణింపఁబడఁడు. అట్టివాని విద్య విద్యగాదు; బ్రతుకును బ్రతుకుగాదు అందఱవలె నద్దె యిచ్చిన తరువాత గూడ నతనికిఁ బొగబండిలోఁ గూర్చుండ తావుసయితము దొఱుకదు. వీరిలో నెవరు నిజముగ విద్యావంతులు?

ఇంతియగాదు. ఒకరి విద్య యింకొక్కరి కవిద్య. వేద వేదాంతముల సారమెఱింగిన సాత్వికుఁడు శుద్ధముగ మాతృభాషనేని మాటాడ నేరని మన విద్యార్థులంజూచి గొణఁగు కొనుచు మొగము చిట్లించుకొనును."షేక్స్పియరు” నాటకముల సారస్య మెఱిఁగిన నవనాగరకుఁడు రాజ భాషరాని శ్రోత్రియునిఁ బరిహసించును. మంగలిరంగనిపాఠము వచ్చినంత నవనాగరిక బాలిక మడి గట్టుకొని గోపికాగీతలు బాదుకొను ప్రాత ముత్తెదువఁజూచి గేలిసలుపును. ఈ యిరు తెగల విద్యావంతులును బల్లెలలో నెవరి జోలియు లేక 'నాగలే నావిద్య' యనియున్న హాలికుని నీచపుచూపు చూతురు. కాని వాఁడీ ప్రాత విద్యల నధిక్షేపింపలేదు; కొత్త విద్యల హాస్యము సేయనులేదు. వానికి రఘువంశముపైఁగాని, "షేక్స్పియరు” నాటకముపై గాని ద్వేషము లేదు. భారతమును వానికి నిజమే; బైబిలును సత్యమే. మృతమునకుఁ బాత్ర మాధారమా, పాత్రమున కాధారము ఘృతమా, యని తల పగుల గొట్టుకొను పండితులును, రాలిన పండు నేలఁబడుట నేలగుణమా? పండు గుణమా! యని కూడునీరువిడిచి చింతించు శాస్త్రజ్ఞులును వానికి సమానులే. ఈచదువు రామిచే వాని కితరుల గొడన యక్కర లేదు. వానిది వేఱువిద్య.

ఈహాలికునికుండు సమబుద్ధియు, సహనమును మనకు లేకుండుటకు మనలోపమా? కాక మన విద్యల పాపమా? కాదు. మనము చదువు నేర్చితిమి కాని వివేకము నేరువలేదు. విద్య తెలివి నిచ్చును; వివేకము. తెలివికి మంచిత్రోవ సూపును. మొదటిది సాధనము. రెండవది ఫలము. లభించిన సాధనమును మన ముపయోగ పఱచుకొన జాలమైతిమి. కత్తి చేతఁబట్టినపుడు మనుజుఁడు శత్రువుల ఖండించి కీర్తి నార్జింపవచ్చును. సరికదా తనముక్కు చెవులనేని కోసికొని నల్గురిలో నగు బాట్లును గావచ్చును. మనముగూడఁ జదువు నిట్లే యుపయోగించుకొను చున్నారము. ఇతరుల మేలునకుఁ గాకున్నమానెగాని, మన విద్య పొట్టకు బట్టకునుగూడఁ జాలదు. మఱి దీని యుపయోగమితరులఁ దప్పుపట్టనే! కాననే యొక్క పండితుఁడు “విద్య వివాదముకొఱకే” యని సెల పిచ్చెను.

వివేకము నేర్పని విద్యవ్యాసునికడ నేర్చినను వ్యర్థమే. వివేక మక్కఱలేనివాఁడు సకలవిద్యలను సాష్టాంగ ప్రణామములతో సాగనంపవచ్చును. పుణ్యమునకును పురుషార్థమునకును రాని విద్య బుద్ధికిఁ గష్టమేకాక నూనెకును నష్టము. మూఢుడు తానొక్కఁడు చెడినఁ జెడవచ్చును. అవివేకి తోడివారింగూడఁ జెఱచును. మోటువారి రాక్షస కృత్యములచే నొకరిద్దరు మరణింపవచ్చును గాని, కోట్లకొలఁది నిరపరాధులు యుద్ధరంగమున నకాలమరణము పాలుగారు. సామాన్య ధర్మ ములలో రుచిలేక విశేష ధర్మము లెఱుఁగక యందు నిందుఁ గొఱగాని యవివేకులగు చదివినవారికన్న నపండితుఁడే మేలని ప్రపంచతత్త్వవేత్తల మతము. అగుటం బట్టియే,

చదివినతనికన్న చాకలిమేలురా!
విశ్వదాభిరామ వినరవేమ!॥

యను వేమన బంగారంపుఁ బలుకులు!

చదువు మంచిదే యని యొప్పుకొన్నను మనవారు దానినభ్యసించు విధమైన నీయనర్థమున కెల్లమూలమనక తప్పదు. మోటుదన మగ్ని మాంద్యమువంటిది. ఆ రోగముగలవాడు మితా- హరమునఁ గాలముఁ గడుపవచ్చును. మందు కలదుకాని నియమిత కాలము దాక యపథ్య దోషము లేకుండ సాధించినచో నది యారోగ్య మును తప్పక ప్రసాదించును. అటుగాక కొన్నా- ళ్ళుమాత్రము సేవించి యనాదరము చూపినచో నాఁకలిహెచ్చి తిండి కారాట మధికరుగును; గాని జీర్ణశక్తి పూర్ణముగ రానికారణమునఁ గడ కతిసారరోగము నంటఁగట్టును. అగ్ని మాం- ద్యమున నారేండ్లు బ్రదుకఁగలవాఁ డతిసారమున మకరసంక్రమణమున కెదుఱు సూచుచుండును. అల్పవిద్యయు మోటుఁదనము నించుక తఱచి విడుచుటచే బుద్ధి కొక్కింత యుత్తేజనము గలిగి చిక్కినది కబళింప నాసవొడమును; కాని యర- గించుకొను శక్తి యుండమి నవివేకము ముదిరి మనుజుఁడు రెంటికిం జెడిన రేవణయగును. “చదువ వేయ నున్న మతియుఁబోయె” ననులోకోక్తి యిట్టి చదువునుఁ గూర్చియే!

మన పాఠశాలలలో బాలు రిట్టివిద్యనే క్రయమునకుఁ గొనుచున్నారు. పూర్ణ పాండిత్య మీ కాలమున ననేకుల కందరాని పండు; కాననే హంస కాకున్న మానె, కాకియుఁ గాని దుస్థితి సమకూరినది. ఇంతియ కాదు. ఎవరేమి చెప్పిన నేమియను సహనముండదు. తమంత విషయము నిర్దరించుకొను శక్తిలేదు. నిజ మరయగోరి పాటు పడ నోపిక రాదు; ఇతరుల యుపదేశమర్దము కాదు; మూఢభక్తికి నేర్చిన చదువు చోటియ్యదు; నల్గురిలో మాటాడకున్న నభిమానము విడువదు. పరిణామమిదియ. ఇట్టి విద్యానంతు లితరుు హీనపు చూపు చూచుటకన్న నగుబాటుకలదా? ఇట్టి జ్ఞానము కన్న మౌఢ్యము హృదయంగము కాదని యే వివేక శాలి యనఁగలడు? "Little knowledge is dangerous."