Jump to content

వదరుబోతు/తీఱికలేమి

వికీసోర్స్ నుండి

తీరికలేమి

4   

గతరాత్రి సాంఘిక విషయము నొకదానిం గూర్చి వితర్కించుకొనుచుఁ బెద్దయుంబ్రొద్దు నిద్ర మేల్కొనియుండిన కతంబున నేఁటి యుదయమున నాకొక్కింత జబ్బు చేసినది. 'ఇంచుక 'కాఫీ' కషాయము సేవింతమని "యానందభవన ” మున కరిగి యొకచోఁ గూర్చుండి 'కాఫీ' నార్చుకొనుచుఁ జుట్టునుం జూచితిని. కొందఱు త్రాగుచుండిరి; . కొంద ఱుపహారములఁ దినుచుండిరి; కొందఱు పోలుపొందులేని విషయములఁ జర్చించు చుండిరి; మఱి కొందఱు యువకు లూరక నిలుచుండి చుట్ట దాబి గుప్పు గుప్పున పొగ వెడల విడుచుచు నాకసమున నది సెందు పరిణామములను శ్రద్ధతోఁ దిలకించుచుండిరి; ఒక రిద్ద ఱుపహారముల నార- గించువారివంక సాసూయముగఁ జూచుచుండిరి.

ఆయువకులలో నొకడు 'వదరుఁబోతు' పత్రిక నొక్క_టిని జుట్టఁజుట్టి డా కేలఁబట్టియుంటఁ జూచి, నాగరకతరుణులుగూడ నాపత్రికల మ- న్నించుచున్నారని యానందించితిని. అది యెన్ని యవ లేఖయో, తద్విషయములపై నతని యాశ- యమేమో కనుఁగొన నెంచి యతనిఁ బ్రశ్నింపగా నతడు తన కది చదువఁ బ్రొద్దులేదనియు, వల- దన్న గౌరనహాని యని తానది పుచ్చుకొనవలసి వచ్చెననియుఁ జెప్పి నాసంశయముఁ దీర్చెను. 'అకటా! పొద్దులేదఁట! ఒక్క "ఈజిప్టు" చుట్ట నెవఁడైన దానము చేసియుండినచో నానిరంతరో- ద్యోగి యంటే నిలువంబడి యింకొక గడియపఱకుఁ గాలు గదల్చియుండఁడు గదా! నా యానంద- మున కంతరాయ మొదవ విషణ్ణుఁడనై మన నాగరకతరుణుల 'ప్రొద్దులేమి'కి వగచుచు నిలుసేరితిని.

మాటకు ముందు కాలము చాలదనుట మనకిపు డలవాటు. విద్యార్థులకుఁ బాఠములు చదువఁ గాలము లేదు; విద్యావంతుల కితరుల కుపదేశించుట కవకాశము చాలదు; సేవకులకు నియమితమగు పని చేయను బ్రొద్దు తక్కువ; అధికారికిఁ బ్రజల మొఱ లాలకించుటకుఁ దఱి లేదు; ధనవంతున కితరులు కష్టసుఖములు విచారింప వేళ యుండదు; మూఁడు గాళ్ళ ముసలికి “రామా! కృష్ణా" యనుకొనుటకే తీఱిక యొదవదు.

కాని, కాలము చాలదని మనపూర్వు లిన్ని తంటాలు పడుచుండినట్లు వినము. శ్రీరామ చంద్రు నంతటిరా జెట్టియల్పుని విన్నపములైనను సావధానముగ నాలించు చుండెనఁట, ఉపదేశించు వారున్న చో నింకెన్ని ధర్మములు పురాణములు వినుటకైన ధర్మరాజు కాలము చాల దనియుం- డఁడు. ఇదేమి కాని, పదునారు వేల భార్యలతో గాపురము సేయవలసివచ్చినను, శ్రీకృష్ణుఁ డెన్నఁ డును దీఱిక లేదన లేదు.

మఱి సృష్టికర్త మనల మోసగించి నలువది యెనిమిది గంటల దినము నిపు డిరువదినాల్గు గంటల దానిగ మార్చెనా? మార్పు జెందినది. మన యోగ్యతయే! వాస్తవముగ నుపయోగింప లేనంతఁ కాలము మన యధీనమున నున్నది. యంత్రమున కావిరిశక్తి గల్గినచో మన ముప- యోగించు కొన్నను లేకున్ననుఁగూడ నది పని వేయుచుండును. వలసిన పనులఁ జేయింపనిచో మానవ స్వభావము మనచే వ్యర్థ కార్యముల నేని జేయించునుగాని యూరకుండదు. ఇట్టి యభ్యాస మతిశయించు కొలఁది కాల మంతయు వ్యర్థకా ర్యాచరణమునకే సరిపోవుటం జేసి సత్కార్యము లకు మన కప్పుడు “తీఱిక లేదు.”

ఇంచుమించుగ నీయనర్థమున కంతయు మన నాగరికతయే నిదానము. అనాగరకుఁ డెన్నఁడును కాలము నిట్లు నిందింపడు. పని పరిమిత మగుటచే వానికి జాలినంత యవకాశ మున్నది. పగ లంతయు నొడల నీరుట్టు నట్లుగ నాగేఁటితోఁ గష్టపడి పంట పండింపనున్న హాలికు నకుఁగూడ 'కాలము సమృద్ధిగ నున్నది. అక్కర మాలిన పనుల నధికముగ నంటగట్టుకొన్న మనకు మాత్రమే యీ యవస్థ. తెల్లవారలేచి మధ్యా- హ్నము దాఁక సబ్బునంటించుకొని త్రిప్పి త్రిప్పి చూచుకొనుచు ముఖముండనము చేసికొన మన వారికిఁ దీఱికయుండునుగాని మిత్రుని జాబునకు మూఁడునెలల కేని ప్రతివ్రాయ ననకాశములేదు. అనవసరమున నొకటిపై నొకటి యంగరఖాల దొడిగికొని మెడ "కజాగళ స్తనముల నతికించు కొనుటకును, కాలితిత్తుల బిగించుకొనుటకునే కాల మంతయు వ్యర్థమగుచుండ సద్వ్యాసంగమునకు గాల మెట్లువచ్చును? పరిచితులైననుగాకున్నను, త్రోవ నెదురయిన వారితో నెల్ల నిరర్థక జల్పనలొన రించుచు, 'శాస్త్రులవారి గుఱ్ఱము' వలె నిలువఁబడు పెద్దమనుష్యు లితర కార్యము లెప్పుడు చేయనేర్తురు? తమ కళత్రములు, భవనములు, వాహనములు, ఆరామములు సంపదలునే సర్వోత్తమములనితలం- చి యందఱయెదుట నభివర్ణించుకొను మహనీయుల కన్యులసుఖదుఃఖములరయ విరామమెందువచ్చును? కాలమును బరుగెత్తించుటకై మితిలేని ధనవ్య- యమునేని యోర్చి చీట్లాడుచుఁ గృతార్దులగు వారి కిఁక పొద్దెక్కడిది? - పనిలేని వారి యాశకు నలువది యెనిమిది గంటల దినమైనఁ జాలునా? వీరికోరిక ననుసరించి సృష్టికర్త యట్లే తన కాల చక్రమును మార్చె నను కొందము. ఈయసహ్యాలంకారములు, నీయసంబద్ధ జల్పనములు, నీయప్రస్తుతాత్మస్తుతిప్రసంగములు, నీయనర్ధక వినోదములును స్వేచ్ఛగా, నిరాతంక ముగ, యథాసావకాశముగఁ జరుగఁగలవు; కాని సద్వినియోగమున కపుడు గూడఁ దీఱిక యుండదు. ఇంక నియమితముగ దమ పనులొనరించుకొని కాలము నుపయోగించు కొనువారి కపుడు గొప్ప కష్టము. ఇప్పటి యిరువదినాల్గు గంటలే చాలి యున్న కారణమున వారి కప్పుడు పని యుండదు.

ఇంతమాత్రము కాక సృష్టికర్త కప్పుడు మూఁడు గొప్ప చిక్కులు దాపరించును. ఆస్థాన శాలలలోను కార్మికాగారములయందును పగ లంతయుఁ బనిచేయవలసిన చిన్ని యుద్యోగులును సేవకులును నిరంతరము నతనిందిట్టుచు శాపోదక ముల విడుచుచుందురు.కాలము గడుపలేని పు- ణ్యాత్ముల యుపయోగమునకై కొఱత పడకుండ చీట్లపేకల 'బస్తా'ల సిద్ధముచేసి సంపుటకు వేఱొక “అమెరికా” దేశమే సృష్టి కావలసి యుండును. ఇంటఁ గూర్చుండి మగల వేధించితినుచు నేపని పాటలు లేక దినమున కిపుడు మూఁడు గంటల కాలమేని సద్వినియోగము సేయనేరని మని నాగరక తరుణీజనమునకై సృష్టికర్త యపుడేమి పని నిర్మింపవలసి యుండునో నే నింకను నాలో- చింపఁదగియున్నది. "It is generally the idle who complain they cannot find time to do that which they fancy they wish. In truth, people can generally find time for what they choose to do"

-SIR JOHN LUBBOCK