Jump to content

వదరుబోతు/బిరుదయుగము

వికీసోర్స్ నుండి

బిరుదయుగము

6

ఇరువదవ శతాబ్దము నెవరే యుగమన్నను నామతమున నది బిరుదయుగము. తలతోఁక లేని బిరుదములఁ గోట్ల కొలఁదిగి ననుదినమును వార్తాపత్రికలలో నిప్పుడు వినుచున్నారము. అం- దును నౌదార్యమున కాటపట్టయిన మన యాంధ్ర దేశమున నవి కాసునకు గంపెడు! కాగితములు కరవై గడియ యొక గండముగ నున్న యిప్పుడు సయితము దేశ పత్రిక లెడప దడప తీఱిక కల్పించు కొని నెమ్మదిగా రెండు పుటలయిన నీ స్తృతిపాఠక లేఖకుల వ్రాఁతలకుఁ జోటియ్యవలసియే యున్నది. ఇతర విషయము లటుండ కవితా విషయమున నీ యాచారమునకు మట్టు మర్యాదలే లేవు. పదు నాఱవ శతాబ్దమునఁ గృష్ణదేవరాయని 'భువన విజయ' మహాసభలోని యష్టదిగ్గజములలో నెల్ల నొక్క యల్లసాని పెద్దనకు మాత్ర మేగ్రహ బలముననో యొక బిరుదము వచ్చెను. మహా కవులగు వ్యాస వాల్మీకి పాణిని కణాద కాళిదాస భవభూతి హర్షాదుల కొక్కొకబిరుద మేని లభింపఁ లేదు. ఇంక నేటి స్థితిఁ బరికించితిమా, శనిచాలని మే ముగ్గురునల్వురోతక్క పేరునకు ముందో వెనుకనో యొకటి రెండయిన బిరుదవాక్యముల నంటించుకొనని వ్రాయసగాఁడే యరుదు. కవియే యసంభవము; గ్రంథకర్తయే లేఁడు.

ఆశుకవులు, బాలకవులు, కవిరాజులు, శతావధానులు, మనకు సులభముగ నర్థమగుదురు. ' కాని యీకాలపు బిరుడము లింతటితో ముగియు నవి కావు. ఆవాక్యములసృష్టి యొక విచిత్రపు పద్ధతి. ఈబిరుదములకై సరస్వతి బాల్య కౌమార యౌవన వార్ధకములలో, క్షణమొక యవస్థతోఁ దన్నుకొనుచు గిజగిజ లాడుచున్నది; సంస్కృత కవులు పాప మేయేదేశమువారో యాంధ్రులై యవతార మెత్తవలసిరి; ప్రాచీనులు గూడ 'నభినవ' జన్మకష్టముల ననుభవించిరి; చాలదని యాంగ్ల దేశపు కవులును, నాటకకర్తలును దెలుఁగువారై యిందుఁ బుట్టసాగిరి; ఇవన్నియునుండ సింహ శరభ గండ భేరుండాదులును బిరుదావళి కెక్కవలసి పచ్చెను. ఇంక మూషికమార్జాలాదుల వంతు గూడ నింతలో రానున్నదేమో!

ఆంధ్రవ్యాసుఁడింతలో రానున్నాఁడు. అభి- నవతిక్కన యీవరకే యున్నాడు గాఁబోలు. ఆంధ్రపరాశర, ఆంధ్రగౌతమ, ఆంధ్రబ్రహ్మలును సిద్ధముగ నున్నారు. షేక్స్పియరు స్కాట్టులు చేసిన పుణ్యమేమి మా పాపమేమి, యని గోల్డు స్మిత్తు, మెకాలే, మాక్సుముల్లర్లు కోపగించు కొన్నారనుకొందును. అభినవదండి బిరుదము కేతన యపహరింపక పోయిన ఇప్పటి కెందరో గ్రుద్దు లాడుకొని యుందురు. ఆంధ్రకాళిదాస బిరుదమును గూర్చి చాలమందికి కేశాకేశి బాహాబాహి యింతలో జరుగునని నాభయము.

ఈకళ యింకయు నాడువారి కంతగా పడలేదు కానీ, యున్నచో, నీవఱకే యభినవ కుమ్మర మొల్ల, నవీనముద్దుపళని, ఆంధ్రబిసాంటుగా ర్లవతరించియే యుందురని నానమ్మకము. మగ వారు కొల్లలుగ బిరుదములు ధరించియుండ వారు మాత్ర మూరకుందురా? వారికి మాత్రము తగిన శక్తి లేదా?

కొన్నాళ్ళవెనుక నొకశాస్త్రిగారి 'కాంధ్ర బృహస్పతి' యను బిరుదువచ్చెను. వారు పూర్ణ పాండిత్యముగల్గి నిరంతరము పలువురు శిష్యులకు సాత్వికవిద్యాదానము సేయువారుగాన పురజనులు వారి నా బిరుదమున గౌరవించిరి. కాని తాను మాత్ర మనామధేయురాలుగ నేలయుండవలెనని పట్టుబట్టి వారి జాయ కొన్ని దినములలోనే కడు ప్రయాసతో తనపూన్కి నెఱవేర్చుకొనియెను. లోకు లామెకు 'ఆంధ్రతార' యను బిరుద మియ్యక తప్పినదికాదు.

నేఁడుదయము దపాలావాడు పుస్తకము నొకటి దెచ్చి యిచ్చెను. అది యాంధ్రకాళిదాస ప్రహసనము; వృద్ధసరస్వతి కొండలరాయశర్మ ప్రణీతము. అభిప్రాయార్థమై మాకార్యస్థానమ- లంకరించినది. పుట త్రిప్పి చూచితిని -- పీఠిక పుట 1, అభిప్రాయములు 24, విన్నపము 57, గ్రంథా రంభము 64, ప్రకటనలు 68. అనివిషయసూచిక యున్నది. సరే గొప్పగ్రంథమె యనుకొని పీఠికను రుచిసూచితిని. “పండితులారా!-- శనిగ్రహస్తుతి తెనిఁగించి యాంధ్రశని యనియు, కలిపురుషుని తైలాభిషేక వ్యాఖ్యకు టిప్పణము వ్యాసి యాంధ్ర కలినాథుఁ డనియు, ఆంధ్రనామ సంగ్రహమున కనుక్రమణిక గూర్చి నవీన వాగనుశాసనుడనియు బిరుదముల నొందిన యీవృద్ధసరస్వతిగారి కృతికిఁబీఠిక వ్రాయ గల్గుట నాయదృష్టమే!” అని యేమేమో రామాయణమంత యున్నది. కడకొక బి. ఎ. గారి వ్రాలు గలదు.

గ్రంథము సగము చదివిన ట్లే! కానిమ్మని యభిప్రాయముల వంక నవలోకించితిని. నూర్ల కొలది యభిప్రాయదాతలు గలరు. కొందరి నామ ములు మాత్రము వ్రాసెదను.

1. ఆంధ్రశుక్రాచార్య, అభినవాంధ్ర స్కాటు
     వీర భద్రకవి
2. ఆంధ్రనాటక వృద్ధప్రపితామహ, అభినవ.
     షేక్ స్పియరు రమాకాంతరావు;
' ఆంధ్రనాటక పితామహ' బిరుదు మీవఱకే
     'ఖర్చు ' పడిపోవుటఁజేసి వీరికీ వృద్ధత్వము,
3. వచన వాచస్పతి, రామానుజరావునాయఁడు;
4. చారిత్య్రమాతామహ, సాంబకవి;
5. నవలామన్మథ, శిశుకవి పోతిరెడ్డి;
     (వీరు దినమున కొక నవల వ్రాయఁగలరఁట!)
6. గద్యభాస్కర, కవిబ్రహ్మ, మహేశ్వరకవి;
7. శ్రీమాన్ , విద్వాన్, అపశబ్ద శిరోమణి
     రసగంగాధర, వ్యాకరణ కుఠార, దొడ్డప్పా
     చార్యుడు;
     

8. చతుర్వాణీ భుజంగ, సాహిత్య పతంగ,
   వేణీనాథకవి;
   (వీరికరవ మింటిభాష; హిందూస్థానీ కన్న
    డము లించుకవచ్చును; తెలుఁగు నీవలనేర్చిరి;
    ఏఁడాది నుండి కవన మారంభమయినది.)
9. అవధాని రావణాసుర, తర్కతీర్థ, అక్బర్
   జహాంగీరు కవులు;
10. కవితాహంకార చక్రవర్తి, వాగ్దేవీ భ-
    యంకర, తిట్టుకవిభూషణ, ఘటికాశతాక్షర
    గ్రంథకరణనిపుణ, మిధున కవులు.
ఇంక, ఆంధ్రపాణిన్యాచార్య, నిమిష కవి
శిరోమణి ప్రముఖులు పెక్కండ్రుగలరు.

ఇచ్చటికి గ్రంథ పరీక్ష యయినది. నాయభి ప్రాయ మొక్కటె కొదవ!

ఇంతలో విద్యాప్రియరావు (ఇదియు బిరు' దమే!) నాగదినలంకరించి, యీ గ్రంథము నంది కొని కటాక్షించి కవన ధోరణి మెచ్చుకొని తల యూఁచెను. కవులకుఁ గాసిచ్చి యెఱుఁగకున్నను బిరుదదానములో నితఁ డభినవకర్ణుఁడు. మే మీ విషయమును గూర్చియే ప్రసంగించు చుండునంత, యిరువురు బుడుబుకుక్కలవారు వచ్చి వాఁకట నిలిచి పినాకినీ ప్రవాహముఁబోలు నాశుధారతో. గద్యపద్యరూపముగ గ్రుక్కతిప్పక చెరి యొక పాదముఁ జెప్పుచునతనిపై కవనము గ్రుమ్మరించిరి . ఆ జంటకవుల ధోరణికి నే నద్భుత పడితిని. రావు గార ట్టే నోఱు తెరచుకొని వినసాగిరి.నా యా శు కవితలోఁ కొన్ని పంక్తులు మాత్రము నా స్ఫురణలో నున్నవి.

"ఆదివారమే బుడుబుడుకా
          అమృతపుపలుకే పలికీని
  ......................
          
ఒక్కమాటనే నిక్కడ చెప్పెద
           నిక్కముగానది నడచీని
ఈ దిక్కులోననొక చక్కని చిన్నది
            నిక్కి నిక్కి నినుజూచీని
ఆ-యక్క సోయగము టక్కు గాదు మీ
            చుక్కలరాయఁడు మెచ్చీని
బల్-ఱెక్కలుగలిగిన మక్కువతో నా
            దిక్కు నీమనసు తిరిగీని
ఆ-సక్కెరబొమ్మను పెక్కు లేలయీ
           వక్క లాకులే `తెచ్చీని
ఈ-వక్కాకామెకు నిక్కముగా మది
           తిక్కతనము నెత్తించీని
వేరొక్కటిచూడక తిక్క ముదిరి సీ

            పక్కకుతానై వచ్చీని,
ఆ చుక్క నీయెదకుఁ జిక్కినంత బుడు
        బుక్కుల తిమ్ముఁడు నవ్వీని”

విద్యాప్రియుని యానందము పార మెఱుం గదు. అతఁడు "సెబాసు”ల వర్షించుచు నీధార- ముగిసినంతఁ దనపై నున్న 'శల్లా' నట్టె వారిపైఁ బారవైచి, యొక పత్రికలో నీబిరుదముల వ్రాసి బహుమతిచేసెను.

“బక్కటెద్దు భయంకర గంగిరెద్దులు, గ్రుక్కు త్రిప్పని గురులింగలు, వచనకవి చౌడప్పలు, గా మసింహులు, సరస్వతి మేనమామలు.”