Jump to content

లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు/బ్రిటీష్ మ్యూజియంలో మన అమరావతి శిల్పాలు

వికీసోర్స్ నుండి

బ్రిటీష్ మ్యూజియంలో మన అమరావతి శిల్పాలు

"ఏ యమృత క్షణమ్ముల సృజించిరో శిల్పకులీను లీజగ
ధేయములైన శిల్పముల; దెల్గు కళా ప్రతిభల్ చరిత్రలో
మాయని కీర్తి వెల్గినవి మంజుతరాంధ్ర విశిష్ట శైలికిన్
మా యమరావతీ కళకు మంగళగీతముపాడె లోకముల్"

బ్రిటీష్ మ్యూజియంను సందర్శించే వేలాది యాత్రికులు అమరావతి శిల్ప సౌందర్యాన్ని తిలకించి ఆనందాశ్చర్యచకితులవుతుంటే, శ్రీ కొండూరి వీరరాఘవాచార్యులు గారి పై పద్యం గుర్తుకు వచ్చింది.

ప్రపంచ ప్రసిద్ధ పురావస్తు ప్రదర్శనశాలల్లో బ్రిటీష్ మ్యూజియం అత్యంత ప్రముఖమైంది. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించిన బ్రిటీష్ చక్రవర్తులు ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన అద్భుత కళాఖండాలు బ్రిటీష్ మ్యూజియంలో కొలువై ఉన్నాయి. ప్రతిరోజూ వేలాదిమంది యాత్రీకులు దేశ విదేశాల నుంచి వీటిని సందర్శించడానికి వస్తుంటారు.

మనదేశం నుంచి అమూల్యమైన కళాసంపదను బ్రిటీష్ వారు తరలించుకుపోయారు. వాటిలో ప్రాముఖ్యం గల మన అమరావతి శిల్పాలు బ్రిటీష్ మ్యూజియంలో ఉన్నాయని విన్నాను. మా లండన్ యాత్రలో అమరావతి శిల్పాలను తిలకించడానికి డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ బోయిపాటి ప్రమోదకుమార్లతో కలిసి బ్రిటీష్ మ్యూజియానికి వెళ్లాను. మొత్తం మ్యూజియమంతా చూడాలంటే ఒకరోజులో పూర్తయ్యే పని కాదు. అందువల్ల ఏకాయెకిన అమరావతి గ్యాలరీకి వెళ్లాము. అద్దాలగదిలో అతి జాగ్రత్తగా అమర్చిన అమరావతి శిల్పాలను చూసి అచ్చెరువు చెందాను.

మ్యూజియంలో వివిధ దేశాల శిల్పులు చెక్కిన శిల్పాలు వందలాదిగా ఉన్నాయి. కానీ వాటిలో తలమానికమైనవి మన అమరావతి శిల్పాలు. బ్రిటీష్ మ్యూజియానికి వన్నె తెచ్చిన మహాశిల్పాలు అవి.

శిల్పరూపంలో సౌందర్యాన్ని పోతపోసి లోకోత్తర కళాసృష్టి చేసిన ఆంధ్ర శిల్పికి జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయాను. తెలుగు శిల్పుల ఉలి చెక్కిన శిల్పాలు సృష్టికే అందాలు తెచ్చాయి. వాటిని చూసి తెలుగువాడిగా గర్వపడ్డాను. అంతకుమించి విదేశీయులు ఆ శిల్పాల మనోహరత్వాన్ని తిలకించి, మైమరుస్తుంటే మరింత ఆనందమనిపించింది.

అమరావతి శిల్పాలు నిజంగా రాతిలో కవితలు. మనోహరత్వం, ప్రాణ స్పందనలతో ఎంతో మనోజ్ఞంగా దర్శనమవుతున్నాయి. ధార్మిక విషయాలనే కాక, లౌకిక విషయాలను కూడా శిల్పించడం గమనించాను. దేవతామూరులకు బదులు ఈ శిల్పాల్లో మానవుల, జంతువుల, పక్షుల, వృక్ష రూపాలు ఎక్కువ గోచరిస్తాయి. నిత్య జీవితంలోని సామాన్య ఘట్టాలకు రూపం యిచ్చారు. మానవుని నిత్యజీవితంలోని ప్రేమ, సంయోగవియోగాలు, బాధలు, ద్వేషం, వ్యధలు, క్రీడలు, అలంకరణలు తదితరాలేవీ వారి కళాసృష్టి నుంచి తప్పించుకోలేదు.

హీనయాన బౌద్ధ శిల్పులు బుద్ధుని రూపం ఎక్కడా ప్రవేశించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ శిల్పాలు బ్రిటీష్ మ్యూజియానికి తరలిపోవడం వెనుక పెద్ద చరిత్రే వుంది. దానిని సంక్షిప్తంగా క్రింద ఇస్తున్నాను. బ్రిటిష్ మ్యూజియంలో ప్రాచ్యదేశాల ప్రాచీన సంపద విభాగానికి డిప్యూటీ కీపర్‌గా పని చేస్తుండిన శ్రీ రాబర్ట్ నాక్స్ (Robert knox) వ్రాసిన "Amaravati-Buddhist Sculpture from the Great Stupa" గ్రంథం నుంచి ఈ విషయాలు తీసుకోబడ్డాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరంలో నిస్తేజంగా ఉన్న అమరావతి క్రీస్తు శకం ప్రారంభకాలంనాటికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రం, ప్రముఖ వ్యాపార కేంద్రం. శ్రీలంక, చైనా, జపాన్ వంటి దేశాల నుంచి ఎందరో విద్యారులు ఇక్కడి విద్యాలయాల్లో అధ్యయనానికి వచ్చేవారు. బౌద్ధమత వినాశనం తరువాత ఈ ప్రాంత ప్రాధాన్యత తగ్గిపోయింది. చారిత్రక శిల్పసంపద భూగర్భంలో ఇమిడిపోయింది. ఒక మహాస్తూపం మాత్రం చెల్లాచెదరై దయనీయంగా పడి ఉన్న శిల్పాలను, శిల్పఖండాలను దీనంగా చూస్తూ, చరిత్రకు మౌనసాక్షిగా ఉండేది.

18వ శతాబ్దం నాటికి ఆ స్తూపం కనుమరుగైంది. స్తూపంలో అమర్చిన అపురూపమైన పాలరాతి శిల్పాలను కాల్చి బూడిద చేసి, సున్నంగా వాడుకునే దౌర్భాగ్య స్థితి దాపురించింది. అమరావతి శిథిలాల గురించి తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు మిగిలిన వాటిని సేకరించి, బ్రిటిష్ మ్యూజియానికి తరలించుకుపోయిన వివరాలు ఎంతో ఆసక్తిదాయకంగా ఉన్నాయి.

క్రీ.శ. 1790 నాటికి అమరావతి సూపం పూర్తిగా శిథిలమైపోయి, ఒక మట్టి దిబ్బగా మారిపోయింది. విరిగిపోయిన శిల్పావశేషాలు దాని చుటూ అక్కడక్కడ పడి వుండేవి. ఆ పరిస్థితిలో అప్పటి స్థానిక సంస్థానాధీశుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తన నివాసాన్ని చింతపల్లి నుంచి అమరావతికి మార్చుకుని, 10వ శతాబ్దికి చెందిన అమరేశ్వరాలయం చుట్టుప్రక్కల రాజ ప్రాసాదాన్ని పట్టణాన్ని నిర్మించడానికి ఉద్యమించాడు. ఈ శివాలయం తెలుగు దేశంలోని అయిదు ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటి. దురదృష్టవశాత్తు ఈ ప్రదేశానికి దగ్గరలోనే ఉన్న "దీపాల దిన్నె" అనే ప్రాంతంలో లభ్యమవుతున్న బౌద్ధమతానికి సంబంధించిన ప్రాచీన పాలరాతి ఫలకాలు భవన నిర్మాణ సామాగ్రిగా వారికి బాగా అక్కరకు వచ్చాయి. అపురూప శిల్పాలు గల అసంఖ్యాకమైన సున్నపురాతి పలకలు అమరేశ్వరాలయం ప్రక్కనే గల 'శివ గంగ" కోనేటి మెట్ల నిర్మాణానికి ఉపయోగించబడ్డాయి. స్థానిక ముస్లింలు భవన నిర్మాణానికి ఈ రాతి పలకలను ఉపయోగించడానికి ముందు, వాటిపై వున్న శిల్పాలను చెక్కి పలకలను చదును చేశారు. ఆ విధంగా ఈ కట్టడం యొక్క వినాశనం ప్రారంభమైంది.

ప్రాచీన శిల్పాలతో నిండిన ఈ అపురూపమైన నిక్షేపం గురించి విన్న కల్నల్ కోలిన్ మెకంజి ఈ స్థలాన్ని 1797లో సందర్శించారు. ఆ తరువాత ఆయన సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. ఆనాటికి స్తూపం ఉపరిభాగపు వ్యాసం సుమారు 30 గజాలుగా (27 మీటర్లు) ఉంది. మెకంజీ ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, ఆయన తిరిగి అమరావతికి 1816 మార్చిలో కానీ రాలేకపోయారు (దాదాపు 20 సంవత్సరాలు). ఈ మధ్య కాలంలో స్తూపాన్ని రాళ్ల కోసం ధ్వంసం చేయడం జరిగింది. నీళ్ల ట్యాంక్ నిర్మాణానికిగాను స్తూపం ఉపరిభాగాన్ని స్థానిక జమిందారు త్రవ్వించాడు. మెకంజీ అక్కడే ఆరు నెలల పాటు ఉండి, ఈ కట్టడం నిర్మాణాన్ని గురించిన పూర్తి వివరాలను రికార్డు చేయడం, డ్రాయింగులు గీయించడం మొదలైన పనులను తన సిబ్బందికి పరమాయించి, అజమాయిషీ చేశాడు. 1817వ సంవత్సరాంతానికి కానీ ఈ పని పూర్తి కాలేదు. మెకంజీ యొక్క ఈ రెండవ సందర్శనకు సంబంధించిన వివరాలు 1823లో ప్రచురించబడ్డాయి. ఆయన ఈ సందర్భంగా తయారు చేసిన నోటులు, డ్రాయింగులు, ప్లాన్లు లండన్‌లోని ఓరియంటల్ అండ్ ఇండియా ఆఫీసు లైబ్రరీలో భద్రపరచబడ్డాయి.

మెకంజీ ఆ స్థలం నుంచి 11 రాతిపలకలను పెళ్లగించాడు. వాటిని కలకత్తాకు తరలించడం జరిగింది. అందులో రెండింటిని అక్కడి ఇండియన్ మ్యూజియంలో భద్రపరిచి, మిగిలిన తొమ్మిది రాళ్లను 1821లో లండన్‌కు పంపి, వాడెన్ హాల్ స్ట్రీట్‌లోని ఈస్టిండియా కంపెనీ కలెక్షన్స్‌తో పాటు ఉంచడం జరిగింది. మెకంజీ మరికొన్ని రాళ్లను మచిలీపట్నం రేవు నుంచి తరలించాడు. ఆ తరువాత 1835 నాటికి రాబర్ట్‌సన్ అనే వ్యక్తి ఇక్కడి నుంచి 38 రాళ్లను తరలించుకుపోయి, క్రొత్తగా నిర్మించిన మార్కెట్ ప్రాంగణంలో అలంకారంగా ఉంచాడు. ఇతని గురించిన వివారలు ఏవీ తెలియడం లేదు. ఆ తరువాత ఇవి అలగ్జాండర్ అన్న వ్యక్తి హస్తగతమయ్యాయి. ఇతని గురించి కూడా ఏమీ తెలియడం లేదు. ఈయన వాటిని తన ఉద్యానవనంలో పెట్టుకున్నాడు.

1845లో మద్రాసు సివిల్ సర్వీసుకు చెందిన సర్ వాల్టర్ ఇలియట్ అమరావతిని సందర్శించే నాటికి, మహాస్తూపం దిమ్మె పూర్తిగా అంతర్ధానమై పోయింది. ఆయన చూసే నాటికి స్తూపాన్ని పూర్తిగా ధ్వంసం చేసి, యధేచ్ఛగా స్తూపం అడుగు భాగాన్ని త్రవ్వి, లభించినంత వరకు రాళ్లను పెకలించి తీసి, కాల్చి సున్నంగా మార్చేశారు. ఒకప్పడు అక్కడొక మహా కట్టడం ఉండేదని చెప్పడానికి గుర్తులు మాత్రం మిగిలాయి.

ఇదంతా గమనించిన ఇలియట్ ఆ ప్రాంతంలో త్రవ్వకాలకు ఆదేశించాడు. స్తూపానికి వాయవ్య భాగంలో ఇలియట్ త్రవ్వకాలు జరిపించి దాదాపు 79 శిల్పాలను వెలికి తీశాడు. అయితే వాటికి సంబంధించిన వివరాలు ఎక్కడా వెల్లడించబడలేదు. పరిపూర్ణత లేని డ్రాయింగ్‌లు,శిల్పాలను గురించిన చిత్తు ప్రతులు కొన్ని ఇలియట్ త్రవ్వకాలకు సంబంధించినవి బ్రిటిష్ మ్యూజియంలో లభిస్తున్నాయి. ఇలియట్ త్రవ్వకాల తరువాత ఈ ప్రదేశం 1845 నుంచి 1877 మధ్యకాలంలో, స్వెల్ మళ్ళీ త్రవ్వకాలకు పూనుకునే వరకు పూర్తిగా విస్మరించబడింది.

త్రవ్వి తీసిన రాళ్లను మద్రాసుకు తరలించి, మద్రాసు కాలేజి ఆవరణలో అశ్రద్ధగా ఎండవానలకు వదిలి వేశారు. 1858లో వాటి గురించి విచారించిన కోర్టు డైరెక్టర్లు ఈ రాళ్లను సెంట్రల్ మ్యూజియానికి తరలించారు. అప్పటికే ప్రచండభానుడి ప్రతాపానికి గురైన శిల్పాలు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. 1856లో ప్రభుత్వ సెంట్రల్ మ్యూజియం సూపరింటెండెంట్ ఎడ్వర్డ్ బల్ఫోర్ చొరవతో రెవరెండ్ విలియం టేలర్ వాటికి నంబర్లు ఇచ్చి కేటలాగులోకి ఎక్కించాడు. టేలర్ జాబితా ప్రకారం ఇవి 79. ఇందులో నుంచి రెండు రాళ్లు పోయాయి. వాటికి మచిలీపట్నం నుంచి తెచ్చిన 37 రాళ్లను కలిపారు. ఏడ్వర్డ్ బల్‌ఫోర్ ఈ రాళ్లను మద్రాసు మ్యూజియంలో తొమ్మిదేళ్లు భద్రపరిచాడు. వాటిని ఫొటోలు తీయించి డ్రాయింగ్లు గీయించి, నంబరింగ్ చేయించాడు. ఈ డ్రాయింగ్లు ఇప్పడు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇందుకు సంబంధించి ఏ పత్రమూ ప్రచురింపబడలేదు. ఇలియట్ మారబుల్స్ కు ఫొటోలు తీసి, ప్రభుత్వ ఫొటోగ్రాఫర్ కాస్టల్ లిమ్యాటైస్ 1858లో ప్రచురించే నాటికి వాటికి మరో ఏడు రాళ్లు చేరి, మొత్తం 111 అయినాయి.

1859 నాటికి ఇవి 121కి చేరాయి. ఆ సంవత్సరం ఎడ్వర్డ్ బల్‌ఫోర్ కోరిక మేరకు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ధనంతో వాటిని ఓడలో లండన్లోని ఇండియా ఆఫీసుకు తరలించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఫైవ్ హౌస్, వైట్ హాల్ లోని ఇండియా మ్యూజియంలో వాటికి ఒక స్థలాన్ని చూసే వరకు, సంవత్సరం పాటు ఇవి సౌత్ పార్క్‌లోని బాల్స్ వార్స్ ప్రాంగణంలో నిరాదరణకు గురై పడి ఉన్నాయి. ఎండవానలకే కాక, వాయు కాలుష్యానికి కూడా ఇవి గురై దెబ్బ తిన్నాయి. మద్రాసులో ఫొటోలు తీసే నాటికి దాదాపు సురక్షితంగా ఉన్న ఈ రాళ్లు 1880లో బ్రిటిష్ మ్యూజియం వాటిని హస్తగతం చేసుకొనే నాటికి అక్కడి వాతావరణానికి బాగా పాడైపోయాయి.

1867వ సంవత్సరంలో పారిస్‌లో జరిగిన యూనివర్సల్ ఎగ్జిబిషన్లో కొన్ని అమరావతి శిల్పాలను భారతీయ వాస్తు శాస్త్రం మీద అధ్యయనం చేస్తున్న చరిత్రకారుడు జేమ్స్ ఫర్గూసన్ చూడటం జరిగింది. ఈ శిల్పాల ప్రాభవం గురించి తనకు కాకతాళీయంగా తెలిసిందని ఫర్గూసన్ ఒక సందర్భంలో చెప్పారు. ఆ తరువాత అమరావతి శిల్పాల ఫొటోలను తన వ్యాఖ్యానంతో ఆయన 1868లో "వృక్ష-సర్పపూజ" అన్న పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. 1873లో దీనికి రెండవ ముద్రణ వచ్చింది. ఈ మధ్యకాలం వరకు అమరావతి శిల్పాల మీద బ్రిటన్లో వచ్చిన సాధికారిక ప్రచురణ ఇదే.

ఫైవ్ హౌస్ నుంచి ఈ శిల్పాలను తరలించిన తరువాత వాటిని లాంబెల్లో బెల్ వెదర్ రోడ్ లోని "ఇండియా స్టోర్స్"లో 1874 వరకు, సౌత్ కెన్సింగ్టన్లోని న్యూ ఇండియా మ్యూజియంలో సౌత్ ఎంట్రెన్స్ లో వాటిని ప్రదర్శనకు నిలబెట్టే వరకు, పడేసి ఉంచారు. ఎగ్జిబిషన్ రోడ్లోని ఈ భవనంలో 1851కి చెందిన ఈస్టరన్ గాలరీస్ అనే అద్భుత ప్రదర్శనశాల ఉండేది. ఇది ఇండియా ఆఫీసు వారికి అద్దెకు ఇవ్వబడింది. తరువాతి కాలంలో ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్‌గా పిలవబడిన ఇండియా మ్యూజియం భవనాన్ని 1950లో పడగొట్టి, స్థానంలో ఇంపీరియల్ కాలేజి భవనాన్ని నిర్మించారు.

ఇండియా మ్యూజియంను రద్దు చేసి, అందులోని వస్తువులను బ్రిటిష్ మ్యూజియంకు కొన్ని విక్టోరియా - ఆల్బర్ట్ మ్యూజియంకు కొన్నింటిని ఇచ్చే వరకు అమరావతి శిల్పాలు 1879వ సంవత్సరం వరకు ఎగ్జిబిషన్ రోడ్డులోనే ఉన్నాయి. ఇండియా మ్యూజియంలోని భారతదేశానికి చెందిన పురావస్తు, శిల్ప సంపదను బ్రిటిష్ మ్యూజియానికి, అలంకరణ కళాఖండాలను, వస్రాలు, లోహ, దారు కళా ఖండాలను విక్టోరియా - ఆల్బర్డ్ మ్యూజియానికి (వీటికి కొన్ని మినహాయింపులున్నాయి) పంపడమైంది.

ఆ కాలంలో సర్ ఆగస్టస్ ఉల్‌స్టన్ ఫ్రాంక్స్ అనే ఆయన బ్రిటిష్ మ్యూజియంలో బ్రిటిష్ మరియు మధ్య ప్రాచ్య పురావస్తు విభాగానికి కీపర్గా ఉండేవాడు. ఈయన పురావస్తు కళాఖండాల సేకరణలోను, వాటిని పరిరక్షించడంలోనూ 19వ శతాబ్దంలోనే సుప్రసిద్దుడు. ఓల్డ్ ఇండియన్ మ్యూజియం నుంచి అమరావతి శిల్పాలను ఈయన 1880లో సేకరించాడు. ఈ శిల్పాల మీద ఆయన అమితాసక్తిని కనబరిచి, వాటి వైశిష్ట్యాన్ని తెలుసుకోవడానికి ఆ కాలానికి చెందిన సుప్రసిద్ధ పురావస్తు శాస్త్రవేత్తలను సంప్రదించి, గొప్ప పరిశోధన చేశాడు. రాబర్ట్ స్వెల్‌కు సర్ వాల్టర్ ఇలియట్ వ్రాసిన లేఖలో ఈ విషయం ప్రస్థావిస్తూ, "ఫ్రాంక్స్‌కు కళా ఖండాల పట్ల గల నిరుపమానమైన ప్రేమ నన్ను ముగ్గుణ్ణి చేసింది. వాటి విలువను గ్రహించి ఆ శిల్పాల పట్ల ఆయన తీసుకున్న శ్రద్ధ మూలంగా ఈ అపురూప కళా ఖండాలు మనకు దక్కాయి. ఆయన చేతుల్లో పడటం వాటి అదృష్టం. వాటి ప్రదర్శనం కోసం తగినంత స్థలాన్ని కేటాయించవలసిందిగా నేను ఆయనను అభ్యర్థించాను." బ్రిటిష్ మ్యూజియంలోని ప్రాచీన దక్షిణ, ఆగ్నేయ భారతదేశపు ప్రాచీన కళాఖండాల విభాగానికి అమరావతి శిల్పాలను మార్చడం మూలంగా ఇతర భారతదేశ, భారత ఉపఖండంలోని శిల్ప సంపదతో వాటిని సరిపోల్చి చూడటానికి అవకాశం ఏర్పడింది. అంతే కాక, భారతదేశ శిల్పశాస్త్ర పరిణామ వికాసాలను, చారిత్రక నేపథ్యాన్ని కూడా అధ్యయనం చేయడానికి ఈ ఏర్పాటు ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ ఏర్పాటును చూడగలిగి ఉంటే ఫ్రాంక్స్, ఇలియట్ ఇద్దరూ ఎంతగానో సంతోషించి ఉండేవారు.

1880లో అమరావతి పాలరాళ్లను బూమ్స్ బర్రీకి తెచ్చినపుడు మొదట వాటిని మ్యూజియం యొక్క సమున్నతమైన మెట్లపై ముఖ్యంగా మొదటి అంతస్తు వెనుక గోడకు, పక్క గోడలకు అమర్చడం జరిగింది. కూర్చున్న సింహాలను రెంటినీ మెట్లకు ఇరువైపులా క్రింది భాగంలో ఉంచడం జరిగింది. 1881 అన్నింటిలోకి బాగా ఉన్న 69 కళాఖండాలను గోడలకు అమర్చడం జరిగింది. మిగిలినవి రిజర్వులో ఉంచడమైంది. అమరావతి పాలరాళ్లను వాతావరణ ప్రభావం నుంచి, తుంటరి సందర్శకుల ఆకతాయి చేష్టల నుంచీ రక్షించవలసిన అవసరం ఉందని రిపోర్టు చేయగా, ఈ శిల్పాలకు గ్లాస్ ఫ్రేమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రాంక్స్ ఈ కళా ఖండాలను జేమ్స్ ఫెర్గూసన్ అనే వ్యక్తి తోడ్పాటుతో అమర్చాడు. అయితే ఈ శిల్ప తోరణాలు స్తూపాలకు చెందినవి కావు - ఇవి బౌద్ధ ఆరామాలకు చెందినవి అన్న ఫెర్గుసన్ అభిప్రాయంతో ఫ్రాంక్స్ సరిగానే విభేదించాడు. పూర్వపు ప్రదర్శనకు సంబంధించిన ఫొటోలు ఏవీ లభించకపోవడం దురదృష్టకరం

1860లో సేకరించిన ఇండియా మ్యూజియంలోని కళాఖండాల సముదాయానికి సర్ వాల్టర్ ఇలియట్ 1882లో అప్పగించిన మరొక కళా ఖండం చేరింది. ఇది ఒక డోలు ఆకారంలో గల అపురూప శిల్పం. ఫ్రాంక్ అభ్యర్ధన మేరకు మరొక కుడ్య చిత్రాల అడ్డ పలక మద్రాసు మ్యూజియం నుంచి 1885లో వచ్చింది. ఈ కళా ఖండాలన్నీ ఇప్పటికీ చెక్కుచెదరక చాలా చక్కని స్థితిలో ఉన్నాయి.  అమరావతి శిథిలాలకు సంబంధించిన మరికొన్ని కళా ఖండాలను సముపార్జించాలన్న కోరిక ఫ్రాంక్స్‌కు కలిగింది. ముఖ్యంగా బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న కళా ఖండాల పరంపరలోవి కావాలని ఆయన కోరుకున్నారు. స్వెల్ కు ఆయన 24 ఫిబ్రవరి 1881లో వ్రాసిన లేఖలో ఇందుకుగాను తన స్వంత డబ్బును కూడా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నానీ, కాబట్టి కళా ఖండాలున్న పాలరాళ్లను కృష్ణా నది కాలువ ద్వారా మదరాసుకు తరలించవలసిందని కోరాడు. అదే చివరకు జరిగింది. ఒక వేళ అన్ని రాళ్లు ఒకేసారి బ్రిటిష్ మ్యూజియానికి తరలించడం మంచిదని నీవు భావిస్తే, ఆ విషయం నాకు వెంటనే తెలియజేసినట్లయితే, ఈ అంశం మ్యూజియం ట్రస్టీల ముందుంచి, వారి అనుమతి పొందుతానని కూడా ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆ పరిస్థితిలో నావికాదళానికి చెందిన ఒక ఓడను ఇందుకోసం నియోగించడం జరుగుతుందని కూడా వ్రాశాడు.

మద్రాసు గవర్నర్‌కు స్వెల్ చేసిన అభ్యర్ధన ఆధారంగా ఆయన ప్రాంక్‌కు వ్రాసిన లేఖలో పేర్కొన్న ప్రకారం రెండు కళాఖండాలను బ్రిటిష్ మ్యూజియానికి పంపడానికి ఆమోదించబడింది. 19వ శతాబ్దం చివరి భాగంలో చేసిన ఒక చట్టం ద్వారా భారతదేశ ప్రాచీన సాంస్కృతిక సంపదను అక్కడే పరిరక్షించాలనే కట్టుబాటు విధించడం మూలంగా, సిపాయిల తిరుగుబాటు కాలంలో మాదిరిగా ప్రాచీన సాంస్కృతిక సంపదను ఒకేసారి పెళ్లగించి తీసుకుపోయే అవకాశం లేకుండా పోయింది.

అమరావతి శిల్పాలు బ్రిటిష్ మ్యూజియంలో 1880 నుంచి 1940 వరకు అద్దాల ప్రేమ్ల వెనకాల సురక్షితంగా ఉండి, సందర్శకులకు ఈ ప్రపంచంలోని ఒక భాగానికి సంబంధించిన ప్రాచీన సంస్కృతిని పరిచయం చేస్తూ నిలిచాయి. అవి బ్రిటిష్ సామ్రాజ్యపు వైభవం వెలిగిపోతున్న రోజులు. భారతీయ అద్భుత శిల్ప సంపదను ప్రపంచ ప్రాచీన ప్రఖ్యాత నాగరికతల సరసన సగౌరవంగా నిలిపిన కాలం. అద్భుత భారతీయ ప్రాచీన శిల్ప సంపదను ప్రపంచ పాఠకులకు, మ్యూజియం సందర్శకులకు పరిచయం చేసిన కీర్తి ఫ్రాంక్స్‌కు ఫెర్గుసన్‌కు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

1939లో యుద్ధం మంచుకొస్తున్న తరుణంలో అమరావతి శిల్పాలను విడదీసి, ఒక సురక్షిత ప్రదేశంలో భద్రపరచడం జరిగింది. 1951-52 సంవత్సరంలో తిరిగి మ్యూజియంలోని ముందు హాలులో వాయవ్యభాగంలో ప్రస్తుతం గిఫ్ట్ షాపు ఉన్న ప్రదేశంలో ఈ శిల్పాలను అమర్చడం జరిగింది. పైకప్ప, డోలు ఆకారంతో ఉన్న రాళ్లను పశ్చిమపు గోడకు అమర్చి కుడ్య చిత్రాలున్న పలకలను వాటి ముందు బిగించడం జరిగింది. ఈ పద్ధతి అప్పట్లో వాడులోకి వస్తున్న ప్రదర్శనా విధానానికి అనుగుణమైంది. అయితే ఆ తరువాత ఆ రాళ్ల బరువు దృష్ట్యా, వాటికవిగా అంత బరువును మోయలేవని గ్రహించడం వల్ల, వాటి బరువును ఆపడానికి స్టీల్ ఫ్రేమ్లను ఏర్పాటు చేయడం జరిగింది.

1950 నాటికి శిల్పాల ఉపరితలం స్వల్పంగ శిథిలమవుతున్నట్లు గుర్తించడమైంది. లండన్లో ఉన్న శిల్పాలను బ్రిటిష్ మ్యూజియం రీసెర్చ్ లాబరేటరీలోను, భారతదేశంలో ఉన్న శిల్పాలకు ప్రభుత్వ కెమిస్ట్ చేతను రసాయన పరీక్షలు నిర్వహించడం జరిగింది. సున్నితమైన, మృదువైన పాలరాళ్లు వాతావరణంలోని వేడి మూలంగాను, ఇతర కాలుష్యాల మూలంగాను దెబ్బతింటున్నట్లు గుర్తించడమైంది. ఈ దురదృష్టకర పరిస్థితి ఈ రాళ్ళను తిరిగి విడదీసి, వాతావరణ కాలుష్యం ఉండని, ఎయిర్ కండిషన్స్ ఎయిర్ ఫిల్టర్ భూగర్భ మందిరంలో ఉంచడానికి దారి తీసింది. అందువల్ల 1960 నుంచి ఇవి సందర్శనకు నోచుకోలేదు. అపుడపుడు అతి తక్కువ సంఖ్యలో ప్రముఖ సందర్శకులను, పరిశోధకులను ఈ శిల్పాల అధ్యయనానికిగాను అనుమతించడం జరిగింది.

ఓరియంటల్ గ్యాలరీని కింగ్ ఎడ్వర్డ్ భవనానికి మార్చిన పిమ్మట అమరావతి శిల్పాలను సాధ్యమైనంత వరకు తిరిగి ప్రదర్శనకు ఉంచాలని మ్యూజియం ట్రస్టు నిర్ణయించడమైంది. "అసాహిషింబుల్" అనే జపాన్ వార్తా పత్రిక యాజమాన్యం ఈ ఆలోచనను ఎంతో ఉదారంగా సార్ధకం చేసింది. భారతీయ ప్రాచీన మహోన్నత శిల్ప కళా వారసత్వానికి గుర్తుగా అమరావతి శిల్పాలు మరొకమారు బ్రిటిష్ మ్యూజియంలో సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.

మద్రాసు ప్రభుత్వ మ్యూజియంలో మొదట 1850లో అమర్చబడి, ఆ తరువాత బ్రిటిష్ మ్యూజియానికి తరలింపబడిన ఈ శిల్పాలను మ్యూజియం సూపరింటెండెంట్ ఎడ్వర్డ్ బల్ ఫోర్ ఆదేశాలమేరకు కాప్టెన్ ట్రైస్ ఫొటోలు తీయడం జరిగింది. ఈ ఫొటోలను ఏ రకమైన వ్యాఖ్యలేకుండా 1858లో మద్రాసు మ్యూజియంలో ఇలియట్ మారబుల్స్ అన్న పేరుతో ప్రచురించడం జరిగింది. ప్రస్తుతం ఇదొక అపురూపమైన ఆల్బమ్. ఉపరితలం దెబ్బతిన్న శిల్పాలకు సంబంధించిన పూర్తి వివరాలను అధ్యయనం చేయడానికి ఈ ఫొటోలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ అద్భుత కళాఖండాలను ప్రజా బాహుళ్యానికి పరిచయం చేసిన బల్ఫోర్ కు, కాప్టెన్ ట్రైస్ కు మనం సర్వదా ఋణపడి ఉంటాము.

1859లో ఈ శిల్పాలు బ్రిటన్ కు వచ్చినప్పటి నుంచీ ఇవి రెండు ప్రముఖ ప్రచురణల్లో చోటు చేసుకున్నాయి. మొదటిది జేమ్స్ ఫెర్లుసన్ ప్రకటించిన "వృక్ష-సర్ప ఆరాధన". ఈ బృహత్ ప్రచురణలో సాంచి శిల్పాలను గురించి, అమరావతి శిల్పాలను గురించి విస్తారంగా చర్చించడమైంది. భారతీయ శిల్ప సంపదపై వెలువడ్డ మొట్టమొదటి పరిశోధనాత్మక ప్రచురణ ఇది. ఇండియా ఆఫీసు ఆధీనంలో ఉన్న ఈ కళా ఖండాలకు అద్భుతమైన స్పష్టతతో ఫొటోలను తీసి, ఈ శిల్పాలకు సంబంధించిన అన్ని వివరాలను ఇస్తూ, బౌద్ధమతం గుఱించి వివరణ ఇవ్వడం జరిగింది. కళాఖండాలను దేనికది విడివిడిగాను, ఏ పలకకు ఆ పలకగా ఫొటోలు తీయడమైంది. అయితే ఎంట్రీ ఫారాల గురించి చెప్పలేదు.

ఫెర్గుసన్ ఈ ఫొటోలను మరింత అద్భుతంగా కూర్చి పలకలను అందంగా పేర్చి వివరణాత్మకమైన వ్యాఖ్యానాన్ని వాటికి ఇచ్చారు. ఆయన చేసిన ఈ పని ఆ తరువాత ఎన్నో తరాల వరకు ఎవరూ చేయలేని పనిగా నిలిచిపోయి, బ్రిటిష్ మ్యూజియంలోని కళాఖండాలకు సాధికారికమైన సమాచారంగా ఉండిపోయింది. బ్రిటిష్ మ్యూజియంలోని అమరావతి శిల్పకళాఖండాలకు సంబంధించిన సమగ్రమైన వివరాలను ఓరియంటల్ యాంటిక్విటీస్ డిపార్ట్మెంట్కు చెందిన డగ్లాస్ ల్యారట్ 1954లో ప్రచురించారు. ఈయన ప్రచురణ విడివిడిగా ఒక్కొక్క రాతి పలక గురించిన వివరాలతో కూడి ఉంది. ఈ ప్రచురణలో శిల్పాల వివరాలతో పాటు దక్కన్ చరిత్ర, కళాఖండాల సేకరణ చరిత్ర, స్తూపమూ, శిల్పులకు సంబంధించిన వివరాలు సమగ్రంగా ఉన్నాయి. 1942లో మద్రాసులోని కళాఖండాలకు సంబంధించిన వివరాలతో వచ్చిన శివరామమూర్తి ప్రచురణకు ఇది అన్ని విధాలా సోదరతుల్యం.

ప్రాచీన సంస్కృతులుగా భాసిల్లుతున్న ఈజిప్ట్, మెసపొటేనియా, మెడిటేరియన్ నాగరికతలకు సమాన స్థాయిలో అమరావతి శిల్పాలు నిలుస్తాయి. ఈ శిల్పాలను చెక్కిన విధానం ప్రాచీన భారతీయ సాంస్కృతిక సంపదను మాత్రమే కాక ప్రస్తుత భారతీయ జీవన విధానాన్ని అవగాహన చేసుకోవడానికి తోడ్పడుతుంది. సహజ సౌందర్యంతో అలరారుతున్న అమరావతి శిల్పాలు సరిహద్దులను చెరిపివేపి ప్రపంచ ప్రజలందరిని తమ వైపు ఆకర్షింపజేస్తూ, భారతీయ కళా సంస్కృతులను పరిచయం చేసూ, ఆంధ్రుల సాంస్కృతిక వారసత్వాన్ని దిద్దిగంతాలకు పరివ్యాప్తి చేస్తున్నాయి.

అమరావతి శిల్పి స్వతంత్రుడై అటు ప్రకృతిని ఇటు మానవ చిత్తవృత్తిని మనోజ్ఞమైన శైలిలో సృష్టించాడు.

అలంకార శిల్పాలు, రేఖలూ, వలయాలూ, చతురములు ఎన్నో విధాలుగా చిత్రించబడినవి. ఇవికాక తామర తీగలు, పుష్ప గుచ్చాలు సాక్షాత్కరిస్తాయి.

మిథున శిల్పాలలో - స్త్రీ పురుషులు అనేక భంగిమలలో బహు విధములైన శృంగార చేష్టలలో నిమగ్నులయి ఉంటారు. ఆంధ్ర శిల్పుల ఉలి శృంగార రస చిత్రీకరణలో మహా కావ్యాలను తలదన్నినట్లు తోస్తుంది.

శిల్ప రూపంలో పోతపోసి లోకోత్తర కళాసృష్టి చేశాడు నాటి ఆంధ్ర శిల్చి బ్రిటిష్ మ్యూజియంలోని అపురూప శిల్పాలలో కొన్నిటిని ఇక్కడ పరిచయం చేస్తాను. బుద్ధుని జీవితంలో ఒక దృశ్యాన్నిసూచించే సున్నపురాతి స్థంభం

క్రీ.శ. మూడవ శతాబ్దికి చెందిన ఈ కళాఖండం అమరావతి బృహత్ స్తూపం చుట్టూ ఉన్న ప్రాకారం నుంచి సేకరించబడింది.

బుద్ధుని సోదరుడైన సుందరానందుడు (నందుడు) బౌద్ధమతాన్ని స్వీకరిస్తున్న దృశ్యం ఈ శిల్పంలో అద్భుతంగా మలచబడింది.

రెండవ దృశ్యంలో బుద్ధుడు సుందరానందునికి సన్యాసం ఇస్తాడు. ఈ సందర్భంలో అతడు బుద్దుని ముందు మోకరిల్లి, ఆయన అనుగ్రహం కోసం తలయెత్తి పైకి చూస్తుండగా, బుద్ధుడు సుందరానందునిపై కారుణ్య దృక్కులను వర్తిస్తుంటాడు.

బుద్ధుని అవశేషాల అర్చన

అమరావతి మహాస్తూపం వేదిక నుంచి ఇది గ్రహించబడింది. ఇటువంటి దృశ్యాలను సాధారణంగా స్తూప పార్శ్వాలలో అమరుస్తారు.

ఈ శిల్పంలో బుద్ధుని అవశేషాలను ఒక ఆసనం మీద ఉంచి, అక్కడ బుద్ధుడు సజీవంగా ఆసీనుడైనట్లుగా భావించి, పూజించడం గమనించవచ్చు. నిజానికి బుద్ధుడు ఈ అవశేషాల ఆరాధనకు వ్యతిరేకం.

రాకుమారుడు సిద్ధార్థుని జన్మవృత్తాంతం చిత్రీకరించబడివున్న సున్నపురాతి పలక

క్రీ.శ. 2వ శతాబ్దికి చెందిన ఈ సున్నపురాతి పలక అమరావతి బృహత్ స్తూపం నుంచి సేకరించబడింది. అప్పడప్పడే భారతదేశంలో వ్యాప్తిలోకి వస్తున్న బౌద్ధమతానికి ప్రతీకగా ఈ అద్భుత శిల్పాన్ని భావించవచ్చు అమరావతికి చెందిన అత్యంత సుందర శిల్పాలలో ఒకటైన ఈ పలకలో సిద్ధార్ధుని జన్మ వృత్తాంతానికి సంబంధించిన నాలుగు ఇతివృత్తాలను గమనించవచ్చు.

బుద్ధుని అవశేషాల అర్చన
ఒక చక్రవర్తి చిత్రీకరించబడిన శిల్పం

ఈ శిల్పంలో ఒక చక్రవర్తి అంజలి ముద్రతో నిలబడి వుండటం గమనించవచ్చు. ఆయనకు ఇరువైపుల ఇద్దరిద్దరు చొప్పన నలుగురు సేవకులు - ముగ్గురు స్త్రీలు, ఒక పురుషుడు, తమ కుడి చేతుల్లో వింజామరలను ధరించి ఉన్నారు.

సిద్దార్ధుని మహాభినిష్క్రమణదృశ్యాన్ని చిత్రీకరించిన సున్నపురాతి కుడ్యం

ఈ అమూల్య శిల్పం యువరాజు సిద్దారుడు కపిలవస్తులోని తన భవనం వదిలి, తాత్విక జిజ్ఞాసతో నిష్క్రమించి, బుద్ధుడుగా మారటం వివరిస్తుంది. అతను ప్రత్యక్షంగా కన్పించకపోయినా, బుద్ధుని ప్రతీకగా గుర్రం మీద ఛత్రంతో బాటు రాజభవన తోరణ ద్వారం దాటుతున్న కంటకాశ్వం కన్పిస్తాయి.

ఇటువంటి సంప్రదాయిక తోరణాలు ఆ రోజుల్లో ప్రవేశ ద్వారాలుగా ఉండేవి. ఇవి దారు నిర్మితాలయి ఉండవచ్చు. ఈ విధానం బౌద్ధ స్తూపాలలో చాలా చోట్ల కన్పిస్తుంది. ఇప్పటికీ కనిపిస్తున్న స్థూపాల తోరణం ద్వారాలు కూడా ఇదే విధంగా కట్టబడి ఉన్నాయి.

బుద్ధ పాదాలు చిత్రీకరించబడిన శిల్పాలు

ఇది క్రీ.శ. 1వ శతాబ్దికి చెందింది. ప్రారంభ బౌద్ధ శిల్పాలలో బుద్ధుడిని మానవాకారంలో చూపలేదు. ఆయనను ఏదో ఒక చిహ్నం ద్వారా సూచించేవారు. అమరావతికి చెందిన ఈ శిల్పంలో బుద్ధుని పాదాలు చూపడం ఆ విధానంలో భాగమే.

బుద్దుని జ్ఞానోదయం, మహాస్థూపం

ఈస్తూపానికి రెండు వైపులా వివిధ కాలాలలోని చెక్కడాలున్నాయి. సుమారుగా క్రీస్తు పూర్వం 1వ శతాబ్దికి చెందినది మొదటి చెక్కడం. బుద్ధునికి జ్ఞానోదయమైన పిమ్మట ఆ ప్రదేశంలో ఒక పురుష బృందం అతని బోధనలు వినే దృశ్యం దీనిలో ఉంది. స్తూపం రెండవ వైపు క్రీస్తు శకం 8వ శతాబ్దం

బుద్ధుని జీవితంలో ఒక దృశ్యాన్ని సూచించే సున్నపురాతి స్థంభం
ఒక చక్రవర్తి చిత్రీకరించబడిన శిల్పాలు
బుద్ధ పాదాలు చిత్రీకరించబడిన శిల్పాలు
సున్నపురాతి స్థంభ భాగం
కాలంలో బాగా వివరంగా చెక్కబడినట్టిది. బోధి వృక్షం క్రింద ఖాళీ సింహాసనం బుద్ధుని జ్ఞానోదయాన్ని సూచిస్తుంది.

సున్నపురాతి స్థంభ భాగం

దీని నాలుగు వైపులా శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇది బౌద్ధమత ప్రారంభ కాలానికి చెందినదిగా గుర్తించబడింది. ఇందులో మూడు ప్రక్కల పద్మాలు చెక్కబడి ఉన్నాయి. నాలుగవ వైపు మరింత సున్నితమైన పనితనంతో ఉండి, పూర్ణ ఘటమూ, యక్షిణి ముఖం కనిపిస్తున్నాయి.

అమరావతి శిల్ప వైభవాన్ని మించింది మరేదీ లేదు. మన ఆంధ్ర శిల్పి కళానైపుణ్యం జగజ్జీగీయమానంగా అమరావతి శిల్పాలలో దర్శనమిస్తుంది. ఆంధ్ర శిల్పికి జేజేలు.