లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు/నా ఇంగ్లాండ్‌ పర్యటన... మధుర స్మృతులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నా ఇంగ్లాండ్‌ పర్యటన...

మధుర స్మృతులు

ఆంధ్రా మెడికల్‌ గ్రాడ్యుయేట్సు రీయూనియన్‌ యు.కె. 2009 మే 2, 3 తేదీలలో కోవెంట్రీలో జరుగుతుందని ఆ సమ్మేళనంలో అతిథిగా పాల్గొనవలసిందని, డాక్టర్‌ సుబ్బారావు వి. చదలవాడ, డాక్టర్‌ రమేష్‌ పొట్లూరి గార్ల వద్ద నుంచి నాకు, ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమి అధ్యక్షులు డాక్టర్‌ యార్లగడ్డ లక్షీప్రసాద్‌గారి ద్వారా ఆహ్వానమందింది.

నేను ఎన్నికల రణరంగంలో తలమునకలుగా ఉన్నాను. 2009 ఏప్రిల్‌ 23వ తేదీన ఎన్నిక పోలింగ్ పూర్తయింది. 27వ తేదీన మేమిరువురమూ లండన్‌కి పయనమైనాము.

నేను అమెరికా, చైనా, జర్మనీ మొదలైన దేశాలు అప్పటికే సందర్శించి ఉన్నప్పటికీ, నా మనస్సు ఇంగ్లాండు వైపు చూస్తుండేది. దానికి కారణం మనదేశాభివృద్ధికి, ప్రత్యేకించి తెలుగుజాతి అభ్యుదయానికి కారకులైన వారిపై నాకు చిన్ననాటి నుండి అభిమానం ఉండడం కావచ్చు. తెలుగు భాషోద్ధారకుడు సి.పి. బ్రౌన్‌, కృష్ణ-గోదావరి డెల్టాల అభివృద్ధి కారకుడైన సర్‌ ఆర్థర్‌ కాటన్‌, భారతదేశపు ప్రథమ సర్వేయర్‌ జనరల్‌గా పనిచేసి, కైఫీయత్తుల సేకరణ ద్వారా తెలుగువారి చరిత్ర రచనకు ఆధారభూతుడైన, అమరావతి తదితర బౌద్ధ స్తూపాల శిల్ప వైశిష్ట్యాన్నివెలికితీసి లోకానికి చాటి చెప్పిన కల్నల్‌ కాలిన్‌ మెకంజీలపై తెలుగువారందరికీ లాగానే నాకు కూడ భక్తి భావం ఉంది. తెలుగుభాషకు అపారమైన సేవ చేసిన నేనెరిగిన మరో ఆంగ్లేయుడు జె.పి.ఎల్. గ్విన్ ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారిగా పనిచేశారు. తెలుగు అకాడమి స్థాపనలో విశేష సేవలందించారు. 1975లో జరిగిన ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలలో అంతర్జాతీయ తెలుగు సంస్థను నెలకొల్పవలసిందిగ శ్రీ గ్విన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు.

మా నాన్నగారు శ్రీ మండలి వెంకటకృష్ణారావుగారికి గ్విన్‍తో సత్సంబంధాలు ఉండేవి. నా వివాహానికి గ్విన్ దంపతులు విచ్చేసి ఆశీర్వదించిన మధుర జ్ఞాపకం నా మదిలో మెదులుతూ ఉంటుంది. మా నాన్న గారు లండన్ వెళ్లినపుడు, వారు వచ్చి కలిశారు. మేము లండన్ వెళ్లినప్పుడు 1999 సెప్టెంబరులో గ్విన్ పరమపదించినట్లు తెలుసుకుని విచారించాను. గ్విన్ మన మధ్య లేకున్నా, వారు తయారు చేసిన ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ, ఆధునిక తెలుగు వ్యాకరణం తెలుగు భాషకు వారు అందించిన అమూల్యాభరణాలు. నా లండన్ పర్యటన ద్వారా వీరందరినీ ఒకసారి మనసారా గుర్తు చేసుకునే అవకాశం కలిగింది. లండన్లో డా॥ గోవర్ధన్‍రెడ్డిగారి ఇంట్లో మా బస. వారు ప్రసిద్ధ వైద్యులు; బ్రహ్మచారి. మా కోసం బర్మింగ్‍హామ్ నుంచి డా॥ జమలాపురం హరగోపాల్ వచ్చారు. నిజాం రాజ్యంలో ఆంధ్ర మహాసభ ప్రముఖులు, హైదరాబాదు రాష్ట్ర విముక్తి పోరాటయోధులు సర్దార్ జమలాపురం కేశవరావుగారి కుమారుడని తెలుసుకుని ఆనందించాను. వారి మామగారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పద్మభూషణ్ డా॥ పాతూరు తిరుమలరావుగారు. డా॥ తిరుమలరావుగారితో సన్నిహితంగా మెలిగే అవకాశం నాకు విద్యార్థి దశలోనే కలిగింది. డా॥ గోవర్ధన్‍రెడ్డిగారు మితభాషి. డా॥ హరగోపాల్ చక్కటి సరస సంభాషణాచతురులు. వారి ఆతిథ్యం మాకెంతో ఆత్మీయ పూర్వకంగా లండన్‍లో లభించింది. స్వగృహంలో ఉన్న సంతృప్తి డా॥ గోవర్ధన్‍రెడ్డిగారి ఇంట్లో కలిగింది.

లండన్ తెలుగు సంఘం అధ్యక్షులు డా॥ రాములు దాసోజు మమ్మల్ని విందుకు ఆహ్వానించారు. అక్కడే మరో మిత్రుడు శ్రీ కోట మల్లేష్‍తో కూడా పరిచయం కలిగింది. లండన్‍లో తెలుగు వారికి గొప్ప వేదిక లండన్ తెలుగు సంఘం. లండన్‍లో పరిచయమైన శ్రీమతి వింజమూరి రాగసుధ నర్తకీమణి, మంచి కవయిత్రి. లండన్ తెలుగు సంఘంలో చురుకైన పాత్ర వహిస్తున్నారు.

మేడమ్ తుస్సాడ్స్ :

డాక్టర్ లక్ష్మీప్రసాద్‍తో కలిసి లండన్‍లో ముఖ్యప్రదేశాలు సందర్శించాను. అంతర్జాతీయ ప్రముఖుల మైనపు బొమ్మాలతో కూడిన మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం నన్నెంతో ఆకర్షించింది. అక్కడ కొలువు తీరిన ప్రముఖుల బొమ్మలు 'సజీవ మూర్తులు' అని భ్రమింపచేస్తాయి. మహాత్మాగాంధీ, సచిన్ టెండూల్కర్, సల్మాన్‍ఖాన్ బొమ్మలు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ కనిపించాయి. ఆ ప్రతిమలతో ఫోటో దిగితే వాటిని చూసిన వారు నిజంగానే ఆ ప్రముఖులను కలసి తీసుకున్నారేమోనని తప్పక భ్రమిస్తారు.

మేడమ్ తుస్సాడ్స్ (1761-1850) ఫ్రాన్స్‍లోని స్ట్రాబర్గ్‍లో జన్మించారు. మాడలింగ్‍లో ప్రఖ్యాతిగాంచిన డా॥ ఫిలిప్పి కర్టియస్ వద్ద ఈమె తల్లి హౌస్ కీపర్‍గా పనిచేసేది. కర్టియస్ వద్దనే తుస్సాడ్స్ మైనపు బొమ్మలు చేయడం నేర్చుకున్నారు. ఈమె తయారు చేసిన మైనపు బొమ్మలు అనతికాలంలోనే మంచి ప్రాచుర్యం పొంది ఈమెకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. తుస్సాడ్స్ వాక్స్ మ్యూజియం లండన్‍లో ఒక గొప్ప సందర్శన స్థలం. ఇప్పడు ఈ మ్యూజియానికి ప్రపంచంలో ఎన్నో చోట్ల బ్రాంచిలు కూడా ఉన్నాయి.

ఆంధ్ర మెడికల్ గ్రాడ్యుయేట్స్ రీయూనియన్ :

కొవెంట్రిలో ఆంధ్ర మెడికల్ గ్రాడ్యుయేట్స్ రీ యూనియన్ 2009 మే 2,3 తేదీలలో డా॥ సుబ్బారావు వి. చదలవాడ, డా॥ రమేష్ పొట్లూరి ఆధ్వర్యంలో జయప్రదంగ జరిగింది. నాలుగైదు వందలమంది తెలుగు వైద్యులు ఈ సమ్మేళనంలో పాలు పంచుకున్నారు. చాలామంది బంధుమిత్రులను అనుకోకుండా అక్కడ కలిసే అవకాశం కలిగింది. మా
ప్రాంతీయులు శ్రీమతి తార వడ్డె, డా॥ఎస్. కృష్ణ, డా॥ హరనాథ్ రెడ్డి, డా॥ చి. హరిమోహన్, డా॥ధనంజయరావు చుండూరి, వారి సోదరులు మా అవనిగడ్డలో ప్రముఖ న్యాయవాది శ్రీ కంఠంనేని రవీంద్రరావుగారి కుమార్తె, అల్లుడు డా॥ వేములపల్లి రవి కలిశారు. డా॥ వెలగపూడి బాపూజీరావుగారి సంపాదకత్వాన వెలువరించిన ప్రత్యేక సంచిక చక్కటి వ్యాసాలతో, చిత్రాలతో ఆకర్షణీయంగ రూపొందించారు. ప్రసిద్ధ చిత్రకారుడు బాపు, డార్విన్ పరిణామక్రమాన్ని దశావతారాలతో సమ్మేళనం చేస్తూ వేసిన ముఖచిత్రం ఎంతో ఆలోచనాత్మకంగా ఉంది. 200 ఏళ్ల క్రితం జన్మించిన డార్విన్ ప్రతిపాదించిన పరిణామక్రమ సిద్ధాంతానికి, వేల ఏళ్ల క్రితమే భారతదేశ పురాణాలలో దశావతారాల ద్వారా పరిణామదశలను సూచించిటం ద్వారా స్ఫూర్తి నిచ్చిందనే అర్ధం వచ్చేటట్లు చక్కటి చిత్రాన్ని చిత్రించడం శ్రీ బాపూకే చెల్లింది.

సమ్మేళనంలో స్థానిక కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకర్షించాయి. ఈ పర్యటనలో శ్రీ సూర్యదేవర ప్రసాద్ దంపతులు, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారి కుమారుడు డా॥ గోవర్ధన చంద్, వారి సతీమణి శ్రీమతి సతి వారి ఇళ్లకు ఆహ్వానించి చక్కటి ఆతిథ్యమిచ్చారు. ప్రసిద్ధ కవి స్వర్గీయ దేవరకొండ బాలగంగాధర తిలక్ కుమారుడు డా॥ సత్యనారాయణ మూర్తి, మా నాన్నగారి స్నేహితులు డా॥ బాబూరావు చాపరాలను కలవడం ప్రత్యేకంగా ఆనందాన్నిచ్చింది.

డా॥ చదలవాడ సుబ్బారావు, శ్రీమతి ఉమాబాల దంపతులు చూపిన ప్రేమాభిమానాలు మరువలేము. డా॥ సుబ్బారావు నిగర్వి పెద్దరికంలోను హుందాతనంలోను వారికి వారేసాటి. గుంటూరు ప్రముఖులు, ప్రసిద్ధ వైద్యులు, మాజీ శాసనసభ్యులు, సంఘసేవాపరాయణులు డాక్టర్ కాసరనేని సదాశివరావుగారి కుమార్తె శ్రీమతి ఉమాబాల. డా॥ సుబ్బారావుగారు తీరికలేని పనివత్తిడిలో ఉండి కూడా మమ్మల్ని తమ కారులో లేక్‍డిస్ట్రిక్ట్‍కు తీసుకెళ్లారు. సుందరమైన కొండచరియల నడుమ మనోహరమైన సరస్సులతో ప్రకృతి సౌందర్య శోభితమైన ప్రదేశాన్ని మాకు వారక్కడ చూపించారు.
ఆంధ్ర మెడికల్ గ్రాడ్యుయేట్స్ రీయూనియన్ సత్కారం శ్రీ మండలికి అందజేస్తున్న డా॥ బాపూజీరావు,డా॥ గోవర్ధన చంద్ త్రిపురనేని దంపతులుఆంధ్ర మెడికల్ గ్రాడ్యుయేట్స్ రీయూనియన్ సమావేశంలో డా॥ గోవర్ధన్‍ రెడ్డి, డా॥ యార్లగడ్డ, డా॥ సుబ్బారావు చదలవాడ, డా॥ సత్యనారాయణమూర్తి దేవరకొండ, శ్రీ మండలి
బ్రిటిష్ మ్యూజియం వద్ద
విండ్సర్ క్యాజిల్ వద్ద

విండ్సర్ క్యాజిల్

ఇంగ్లండ్లో నేను చూసిన మహత్తర రాజప్రాసాదం విండ్సర్ క్యాజిల్. డా॥ హరగోపాల్ కారులో మమ్మల్ని అక్కడకు తీసుకు వెళ్లారు. ఎలిజబెత్ మహారాణికి సంబంధించిన రాజప్రాసాదం ప్రస్తుతం పురావస్తు ప్రదర్శనశాలగా ప్రతిరోజూ వేలాది యూత్రీకులను ఆకర్షిస్తున్నది. భారతదేశానికి సంబంధించిన అనేక కళాఖండాలు, టిప్పు సుల్తాన్ తలపాగా కుచ్చులతో సహా అక్కడ ప్రదర్శనలో చూసి ఆశ్చర్యపోయాము. టిప్పుసుల్తాన్‍ను ఓడించిన ఆంగ్లేయులు ఆయన తలపాగా కుచ్చులను ఈ ప్రదర్శనశాలకు తరలించి భద్రపరిచారు.

విండ్స్‍ర్ క్యాజిల్ బెర్క్ షైర్‍లోని ఇంగ్లీష్ కౌంటీలో ఉంది. ఇది బకింగ్ హామ్ పాలెస్ (లండన్)కు, హోలీరోడ్ పాలెస్ (ఎడింబరా)కు దీటుగా వున్న పురాతన కట్టడం. మహారాణి ఎలిజబత్ ఇక్కడ గడిపి వెళుతుంటారు. ఇది వెయ్యి సంవత్సరాలుగా బ్రిటిష్ పాలకుల కోటగా వున్నట్లు భావిస్తున్నారు.

లండన్ టవర్

లండన్‍లో మేము చూసిన మరో మహత్తర కట్టడం లండన్ బ్రిడ్జ్. థేమ్స్ నది ఒడ్డున చైనీస్ రెస్టారెంట్‍లో అల్పహారం తీసుకుంటూ లండన్ బ్రిడ్జ్ సోయగాలను తిలకించాము. ఆ వంతెన విూద నడుచుకుంటూ, లండన్ టవర్‍కు వెళ్లాము. రెండు వేల సంవత్సరాల చరిత్ర గల కట్టడమది. ఆ ప్రాంతం రోమనుల ఆక్రమణలో ఉన్ననాటి నుంచీ ఈ వంతెన ఉందట. ఇదే ప్రదేశంలో కీ.శ. 50వ సంవత్సరంలో రోమను సైనిక అవసరాల కోసం ఒక చెక్క వంతెనను నిర్మించారని, అది క్రమంగా ప్రస్తుత రూపును సంతరించుకుందనీ, చరిత్ర చెబుతున్నది. ఇప్పడున్న బ్రిడ్జ్ 1967-1972 మధ్యకాలంలో నిర్మించబడింది.

టవర్ బ్రిడ్జిని దాటి, లండన్ టవర్‍ను సందర్శించాము. ఇది లండన్ నగరంలోని అత్యంత ప్రాధాన్యతగల యాత్రా స్థలాల్లో ఒకటి. ఇది క్రీ.శ.
లండన్ టవర్ బ్రిడ్జి వద్ద


డా॥ చదలవాడ సుబ్బారావు దంపతులు, డా॥ మదినేని గోపాలకృష్ణలతో...
లండన్‌లో తెలుగు సంఘం అధ్యక్షులు డా॥ రాములు దాసోజు శ్రీమతి స్వదేశీ దంపతులతో...


థేమ్స్ నది ఒడ్డున
1080లో నిర్మితమైంది. లండన్ టవర్ ఒక దుర్గంగాను, రాజప్రాసాదంగాను, జైలుగాను చరిత్రపుటలకెక్కింది.

అత్యంత విలువైన 23,578 వజ్రాలు ఇక్కడి మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. అందులో చరిత్ర ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం కూడా ఉండటం గమనార్హం.

ఎందరో యుద్ధ ఖైదీలు దారుణ హింసలకు గురై ఇక్కడ అసువులు బాశారు. ఈ కోటకు వున్న కొన్ని బురుజులు ఆ దారుణ కృత్యాలకు సాక్షులుగా నిలిచివున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో దీనిని యుద్ధ ఖైదీల ఉరితీతకు ఉపయోగించారు. ఇప్పటికి మరణశిక్ష పడ్డ ఖైదీలను ఇక్కడ ఉరి తీస్తారు.

వీరాధివీరులు యుద్ధాలలో ఉపయోగించిన యుద్ధ సామగ్రితోపాటు ఇక్కడ చూడవలసింది ఎంతో ఉంది.

లండన్ టవర్‌ను చూసి, థేమ్స్ నదిలో పడవలో విహరించి, లండన్ అందాలను తిలకించాము.

వర్డ్స్‌వర్త్ నివాస గృహం

రెండువందల సంవత్సరాల క్రితం ప్రఖ్యాత ఆంగ్లకవి విలియం వర్డ్స్‌వర్త్ నివసించిన కుటీరాన్ని అద్భుతంగాను, అతి సుందరంగాను నిర్వహిస్తున్నారు. ఈ కాటేజిలోకి ప్రవేశించిన సందర్శకులు వర్డ్స్‌వర్త్‌తోను, ఆయన కుటుంబీకులు, సన్నిహితులతోను సంభాషించిన, గడపిన అనుభూతిని పొందుతారు. ప్రకృతి ప్రేమికులైన వర్డ్స్‌వర్త్ తన స్నేహితుడు, కవి, స్యామ్యూల్ టేలర్ కోవెరిడ్జ్‌తో కలిసి 1799లో లేక్‌డిస్ట్రిక్ట్‌కు సందర్శనకు వెళ్లాడు. అక్కడి ప్రకృతి సోయగాలను పరవశించిపోయిన వర్డ్స్‌వర్త్ అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవాలని ఆ క్షణమే భావించాడు. ఆ తరువాత కొన్ని నెలలకే అక్కడ
షేక్‌స్పియర్ నివాసం వద్ద


షేక్‌స్పియర్ ఇంటివద్ద విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం వద్ద
ఒక ఇంటిని నిర్మించుకొని, తన సోదరి డోర్తీతో అక్కడికి తరలివెళ్ళి, అక్కడే వుండిపోయాడు.

ప్రశాంత వాతావరణం, కొండలు, కొండలను తాకుతున్న మేఘాలు, సన్నటి వర్షపు జల్లులు, ఎలాంటి వారికైనా కవితావేశం తెప్పించే ప్రకృతి అందాలు అక్కడ దర్శనమిస్తాయి. సహజంగా కవి అయిన వర్డ్స్‌వర్త్ ఈ వాతావరణంలో తన్మయుడై వ్రాసిన "I Wandared Lonely as a Cloud" వంటి కవిత్వం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. డోర్తీ కూడా గ్రాసమర్ జర్నల్ వంటివి అక్కడి నుంచే వ్రాసింది.

వర్డ్స్‌వర్త్ నివసించిన "డౌన్ కాటేజి" సందర్శనలో ఆయన నిత్య జీవితం గురించి, రచనల గురించి, ఆయనను సందర్శించిన వారి గురించి సమగ్రమైన సమాచారం పొందవచ్చు వర్డ్స్‌వర్త్ రచనల వ్రాత ప్రతులు కూడా అక్కడ మనం చూడవచ్చు. ఈ పర్యటనలో నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన విషయం ఇంగ్లాండ్ దేశీయులలో వారి కవులపట్ల గల అపార గౌరవాభిమానాలు. వారు నివసించిన ప్రదేశాలు చెక్కు చెదరకుండా కాపాడుతూ, వారు వాడిన వస్తువులు, వారి రచనలు ప్రదర్శనకు ఉంచి, వారి పేర ప్రయివేట్ ట్రస్టులను ఏర్పాటు చేసి, ఆర్థిక అవసరాలకు ప్రభుత్వంపై ఆధారపడకుండా, అవసరమైన డబ్బును, సందర్శకుల నుంచి, అభిమానుల నుంచి సేకరించి, స్మృతి చిహ్నాలను పదిలపరచడం, నన్ను అబ్బురపరిచింది. ఈ రకమైన ట్రస్ట్‌లు ఏర్పాటు చేసి మనదేశంలోని, ప్రత్యేకించి మన రాష్ట్రానికి చెందిన కవులు, కళాకారులు, నాయకుల స్మృతులను శాశ్వతం చేసే ప్రయత్నం చేయాలి.

విలియం షేక్‌స్పియర్ జన్మస్థలం

ఇది ఇంగ్లాండ్‌లోని వార్‌విక్‌షైర్లో ఉంది. 16వ శతాబ్దపు ప్రఖ్యాత కవి విలియం పేక్స్పియర్ స్మారక మ్యూజియం ఇందులో ఉంది. 16వ శతాబ్దంలో చెక్కతో షేక్స్‌పియర్ తండ్రి నిర్మించిన ఈ ఇంటిని అతి పదిలంగా కాపాడుతున్నారు. దీనిని "షేక్స్‌పియర్ బర్త్ ప్లేస్ ట్రస్ట్" నిర్వహిస్తున్నది. దీనిని "సాహిత్య ప్రేమికుల మక్కా"గా వ్యవహరిస్తారు. ఇంగ్లాండ్ సందర్శనలో నన్ను అమితంగా అలరించిన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ ఇంటి వెనుక భాగంలో ఒక చిన్న ఉద్యానవనం ఉంది. ఈ తోటలో పేక్స్పియర్ కాలం నాటి పూల మొక్కలను, ఔషధ మొక్కలను ఇక్కడ మనం చూడవచ్చు. ఈ తోటలోని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ శిలాప్రతిమ నన్ను విశేషంగా ఆకట్టుకుంది. దీనిని అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ జ్యోతిబాసు బహూకరించారట. ప్రపంచ ప్రసిద్ధ కవి పేక్స్పియర్ నివాస ప్రదేశంలో విశ్వకవి రవీంద్రుని ప్రతిమను చూసి, భారతీయుడుగా నా హృదయం పులకించిపోయింది. భారతీయ సాహిత్యానికి దక్కిన అపురూప గౌరవంగా దీనిని నేను భావించాను.

గార్థ్ హౌస్

డార్కింగ్ నగరంలో సర్ ఆర్థర్ కాటన్ నివసించిన ఇంట్లో ప్రస్తుతం " హౌస్’ పేరిట ప్రయివేట్ నర్సింగ్‌హోం-కం-ఒల్టేజి హోం నిర్వహించబడుతున్నాయి. దీనిని మహారాణిగారి వైద్యుడు లార్డ్ హార్డెన్ 1949లో అధికారికంగా ప్రారంభించాడు. ఒక సుందరోద్యానవనంలో గత శతాబ్దాంతంలో నిర్మించబడిన ప్రసిద్ధ భవనమిది. ఈ భవనం గదుల నుంచి చూస్తే, ఎత్తైన కొండలు, సువిశాలమైన ఉద్యానవనం, అందులో సమున్నతంగా నిలిచిన మహావృక్షాలు, పూలమొక్కలతో కనులపండువుగా దర్శనమిస్తూ, ఒడ్లను ఒరుసుకుంటూ పారే ప్రవాహాలు కనిపిస్తాయి. అదొక ప్రకృతి శోభతో అలలారే అద్భుత ప్రదేశం. అక్కడి వారందరూ వయసు పైబడిన పిమ్మట ఈ గార్థ్ హౌస్‌లో చేరాలని ఉవ్విళ్ళూరుతుంటారట. ఇక్కడ వుండే ప్రతి ఒక్కరిని వ్యక్తిగత శ్రద్ధతో, వారెప్పడూ మానసికోల్లాసంతో వుండేటట్లు చూడటమే తమ ధ్యేయమని నిర్వాహకులు చెప్పారు. ఇక్కడ దీర్ఘకాలిక వసతితోబాటు, స్వల్పకాలిక వసతి కూడా ఉంది. కొందరు సెలవుల్లో వచ్చి విశ్రాంతిగా కొన్నాళ్ళు గడిపి పోతుంటారు. ఇక్కడ చాలా కాలంగా ఉంటున్న వారంతా 80-90 ఏళ్ళ పైబడినవారే!

వృద్ధుల సంక్షేమం పట్ల ఆ దేశంలో ఉన్న ఆదరణా, వారి సంక్షేమానికి వారు చూపుతున్న ప్రాధాన్యతా ఈ పర్యటనలో నాకు స్పష్టమయింది.

గీతాంజలి సంస్థ సాహిత్య గోష్ఠి :

బర్మింగ్‌హాంలో "గీతాంజలి మల్టీ లింగ్వల్ లిటరరీ సర్కిల్" అని డా॥ కృష్ణకుమార్, వారి శ్రీమతి చిత్రాకుమార్ 1995లో "గీతాంజలి" అనే బాలకవయిత్రి కేన్సర్ వ్యాధితో మరణించగా ఆమె పేర ఈ సంస్థను ఏర్పరిచారు. భారతీయ భాషా కవులతో సాన్నిహిత్యం పెంచుకుని జాతీయ సమైక్యతకు ఈ సంస్థ దోహదపడుతున్నది. విశ్వహిందీ సమ్మేళనానికి ఈ సంస్థ ఎంతో సహకరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమి అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ఆహ్వానించి, సాహిత్య గోష్టిని ఏర్పాటు చేశారు. డా॥ కృష్ణకుమార్, బర్మింగ్‌హాంలో వున్న పలువురు భారతీయ సాహితీ ప్రియలు ఈ సమావేశానికి విచ్చేశారు. సాహిత్యాంశాల విూద జరిగిన చర్చలు ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. లండన్‌లో ఎన్ని మహత్తర కట్టడాలను చూసినా, ఇంగ్లండ్‌లో మన తెలుగు వైభవ చిహ్నాల విూదే నా మనసంతా కేంద్రీకృతమై ఉంది. ఆ విశేషాలను మన తెలుగువారు తెలుసుకోవాలని, తెలుగు వైభవ ప్రభావాలకు దోహదపడాలనీ ఆకాంక్షిస్తున్నాను.

★★★