Jump to content

లంకావిజయము/లంకావిజయము-పీఠిక

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

లంకావిజయము

(రావణదమ్మీయము)

పీఠిక

ఇష్టదేవతాదిస్తుతి

శ్రీలక్ష్మిస్తనకుంకుమాంకమొకొ నాఁ జెల్వై యెదం గౌస్తుభం
బోలిం గ్రాల దయారసం బురివి పై కుప్పొంగె నా నెమ్మెయిన్
మేలౌగందపుఁబూత యొప్పఁ దగులక్ష్మీజాని కుయ్యేటిగో
పాలుం డైహికసౌఖ్యముం బరము శుంభల్లీల మా కీవుతన్.

1


మ.

తనయుద్వాహమునందు శైలసుత మోదస్వాంత యై మస్తకం
బున నిం పొందెడు ముత్తియంపుఁదలఁబ్రా ల్వోయంగ భావించి చ
య్యనఁ దారాప్తిని గంటి నే ననుచు హర్షాయతుఁ డౌచంద్రుఁ గ
న్గొని హాసం బొనరించుశంభుఁ డిడు మాకు న్నిత్యకల్యాణముల్.

2

చ.

సుమహితశాఖలం దనరి శోభిలుచుండెడునంచితాఖిలా
గమములు జన్మభూము లనఁగాఁ దగుమీవదనంబు లెన్నిచం
దములఁ దలంచిచూచినను దా రహితత్వము నొందియుండుట
బ్రమెయను వాణివాక్యచతురత్వము మెచ్చునజుం భజించెదన్.

3


సీ.

హరిరాగసంప్రాప్తి సురుచిరత్వముఁ దాల్చి
        కమలాహ్వయంబునఁ గ్రాలురమణి
విధుకరస్పర్శనవికసనంబు వహించి
        యిందీవరఖ్యాతి నెసఁగువనిత
చక్రిభోగస్థితి స్వస్థతఁ గైకొని,
        యుర్వీసమాఖ్యఁ జెన్నొందుతరుణి
యలగజేంద్రవరదేహానుగుణ్యము నొంది
        పదాఖ్యచేతను బ్రబలునతివ


గీ.

త్రిజగములతల్లి దివ్యసాధ్వీమతల్లి
యర్ణవవరేణ్యపుత్త్రి సువర్ణగాత్రి
సత్కృపావీక్షణంబున సకలశుభము
లొసఁగి యనిశంబు మముఁ బ్రోచుచుండుఁగాత.

4


సీ.

వరగోత్రజాత యైపఱలినగౌరి యా
        ర్యాభిధానముఁ గాంచు టబ్బురంబె!
సర్వమంగళ నానేసఁగుసతి శివ యన
        విఖ్యాతి నొందుట విస్మయంబె!
హైమవతి యనంగ నలరుచుండునపర్ణ
        నన్నపూర్ణ యనంగ నద్భుతంబె!
కాత్యాయనీసంజ్ఞఁ గాంచునంబిక వృష
        గతికుమారునిఁ బెంపఁగనుట యరుదె!

గీ.

యంచు సుమనఃకదంబంబు లెంచుచుండ
భాసిలి సమస్తసద్గుణప్రౌఢి మెఱయు
నట్టిసర్వజ్ఞుభామిని యస్మదీయ
కామితార్థంబు లీవుతఁ గరుణతోడఁ.

5


క.

అతినిర్మలశుభకరగుణ
వతిని సుధాహారహీరవారవలక్షా
కృతిని సరసిజాతాసన
సతిని సరస్వతిని గొల్తు సమ్మోదమతిన్.

6


ఉ.

శ్రీయలరార సన్నుతులు సేసి నిరంతరభక్తిఁ గొల్తు దా
క్షాయణిసత్కుమారకు భుజంగమసంచయహారకున్ లస
త్కాయవిభావిశేషజితగైరికుఁ దుండకృతాహికారకున్
న్యాయవిచారు సత్పథవిహారు వినాయకుఁ గామ్యదాయకున్.

7


నవగ్రహస్తోత్రము

చ.

పరమహిమాధికత్వమును భాసుర మైనప్రతాపవృత్తిచే
హరణము నొందఁజేయుచు నయంబలరంగమలానిశప్రమో
దరతిఁ దనర్చి చక్రసహితత్వమున న్వెలుఁగొందుచుండునా
హరి మముఁ బ్రోచుఁగావుత దయారసపూరము నించి పెంపుగన్.

8


మ.

ప్రకటం బైనకురంగలాంఛనముతో భాసిల్లి దాక్షాయణీ
సకలాభీష్టఫలప్రదుం డగు చొగిన్ సౌమ్యాఖ్యఁ జెన్నొందిపొ
ల్చుకుమారుం గని దేహశుభ్రరుచితో శోభిల్లు నాసోమనా
మకుఁ డశ్రాంతశుభప్రదాయియగుచు న్మమ్ముం గృపంబ్రోవుతన్.

9


ఉ.

మేదురవృత్తి నాకముసమీపమునందు వసించుచుం బ్రవా
ళోదితకాంతితోఁ గడఁగి యొప్పి ద్విజాదిసదాశ్రితాళి కా

మోదమునన్ రుచుల్ దనరఁ బొల్పుగఁ గామ్యఫలంబు లెల్ల న
త్యాదరలీల నిచ్చుమహిజాధికత న్మదిలో నుతించెదన్.

10


మ.

ఘనమార్గంబున సంచరించుచు సదా కావ్యప్రియైకాత్ముఁడై
యనయంబున్ బలభద్రుడంచును బుధుండంచున్ సమస్తావనీ
జనము ల్వర్ణనసేయఁ బొల్చి యుచితజ్ఞత్వంబునుం గల్గియుం
దనరంగాఁ జనురౌహిణేయుని మదాత్మన్ నిల్పి వర్ణించెదన్.

11


మ.

అరయ న్వర్ణనసేతుఁ దారకపదవ్యశ్రాంతవర్తిన్ గురున్
స్ఫురదుత్తుంగబలాతిరేకకలుషీభూతారిజీవున్ ఘనాం
గిరసాఖ్యాతు బుధౌఘపూజితపదున్ క్షేమంకరాంచత్తపో
భరసంతోషితసర్వమౌనిధిషణున్ వాచస్పతి న్నార్యునిన్.

12


ఉ.

పుణ్యజనప్రకాండపరిపూజితమంజుపదద్వయాద్భుతా
రుణ్యగుణప్రభావముల రూఢిగ శుక్రసమాఖ్యయున్ మహ
ద్గణ్యత మిత్రజాతవిహితంబును గల్గి చెలంగుచుండు న
ప్పుణ్యుఁగవిన్ ముదంబొదవఁ బొల్పుగ నెమ్మదిలో నుతించెదన్.

13


క.

తనరఁగ నంజలి సేసెద
మనమున హర్షంబుతోడ మార్తాండతనూ
జునికిన్ సద్గుణఖనికిన్
శనికిం బరిపంథిగోత్రసంఘాశనికిన్.

14


క.

తమునిం గాఢద్యుతిజితఁ
తముని న్వినివార్యశౌర్యధైర్యాదిగుణో
త్తమునిన్ భాసురమంగళ
తముని న్నుతి సేతు సంతతము నిం పమరన్.

15


క.

చేతోవీథిన్ సన్నుతి
నేతు న్విక్రమసమేతు శ్రీకరగుణసం

ఘాతున్ భవ్యామేయని
కేతున్ రిపువిపినధూమకేతుం గేతున్.

16


సంస్కృతాంధ్రకవిస్తుతి

సీ.

వరతపఃపరిపూతు వల్మీకసంజాతు,
        సన్మునిస్తుతిపాత్రు శక్తిపౌత్రు
నసమానపదగుంభనానుసారి మురారిఁ,
        గల్పితార్యోల్లాసుఁ గాళిదాసు
సరసమనోహరాంచత్ప్రబంధు సుబంధు,
        సూరిసన్నుతసద్విహారుఁ జోరు
సతతకావ్యరచనాహితవిచారు మయూరు,
        మానితకవితాసమాను భాను


గీ.

శ్రీకరాఖిలవిద్యాధురీణు బాణు
మృదువచోమృతదానైకమేఘు మాఘు
మఱియు సంస్కృతసుకవిసమాజములను
మానసంబునఁ దలఁచి నమస్కరింతు.

17


సీ.

ఆర్యవర్యుని నన్నపార్యుని రమ్యయ
        శోరాజిఁ దిక్కనసోమయాజి
రమణీయసుగుణాభిరాము నాచనసోము,
        రసికత్వసాంద్రు నెఱ్ఱసుకవీంద్రు
సకలకవినుతయశస్కరు భాస్కరు,
        గీతగుణసమాజుఁ బోతరాజు
భూనుతవాక్యభాషానాథు శ్రీనాథుఁ,
        బృథుకకవిస్వాంతభీము భీము

గీ.

సూక్తిచాతుర్యుఁ బింగళిసూరనార్యుఁ
బ్రీతబుధముఖ్యు నలసానిపెద్దనాఖ్యు
నాంధ్రభాషావిశారదు లైనయట్టి
సకలసత్కవివర్యుల సన్నుతింతు.

18


క.

సేవింతు న్మద్గురుని య
శోవిలసితవిమలచిత్తు సురుచిరవిద్యా
ప్రావీణ్యుఁ గీర్తికులజు మ
హావినుతచరిత్రు నయ్యనంతాఖ్యుం దగన్.

19


క.

కవివరులఁ జూచినంతనె
జవమునఁ బఱ తెంచి తఱుమసాగెద రెపుడున్
భువిఁ గవుల మనుచుఁ గొందఱు
తవులగ వారలకు నిడుదు దండంబు తగన్.

20


కవిజన్మస్థానవివరణము

వ.

మజ్జన్మస్థలం బైనకుయ్యేరు పురవరం బెట్టి దనిన.

21


మ.

పురమధ్యస్థితవిష్ణుదర్పణమొ నాఁ బూర్వాశనాత్రేయి భా
స్కరి దూతం బురిఁ జేరనీనికరణం గాలాశమల్లీశుఁ డ
ప్పురలక్ష్మీసఖు లాక్కొనాఁ బడమరం బొడ్లమ్మతాళ్లమ్మ లు
త్తరదిగ్భూమిఁ దొరాలకో డుదధిచందం బొప్పుఁ గుయ్యేటికిన్.

22


శా.

భవ్యక్రోశయుగాలిదూరయమదిగ్భాగక్షమాసంగతా
చ్ఛవ్యాకీర్ణతరంగశీకరసమంచద్గౌతమీనామస
ద్దివ్యద్వీపవతీభవాదిమదిశాత్రేయసుసంగోల్లస
ద్గవ్యూతిద్వయదూరసంస్థితమహాకల్లోలి కుయ్యే రిలన్.

23

శా.

దక్షారామపురీవినిర్మితగుహాంతస్థాయి భీమేశసం
జ్ఞక్షోణీధరకార్ముకాంతికవిరాజత్సప్తగోదావరా
శుక్షేమంకరనిర్ఝరానుగతసంశుద్ధోత్తరాశీకకు
ల్యాక్షీణోదకసంయుతాదిమదిశాస్థాత్రేయి కుయ్యే రిలన్.

24


క.

ఏటికిఁ బర్వ మొకటఁ గు
య్యేటికిఁ దరి నత్రినది రహ న్మునిఁగిన వే
యేటికిఁ దత్ఫల మామి
న్నేటికి దిగి మునిఁగినట్టు లెంతయు నొప్పున్.

25


క.

కుయ్యేరు ధనసమగ్రం
బయ్యేరటఁ గట్టి దున్నిరఁట పంటల నిం
డయ్యేరు వెన్నుదాల్పులు
పయ్యేరుపడంగ భక్తి పరఁగుచు నొప్పున్.

26


కవివంశప్రకారము

శా.

శ్రీరమ్యోరుతపోగరిష్ఠుఁడు మహర్షిశ్రేష్ఠుఁ డవ్యాజుఁ డౌ
భారద్వాజుఁడు భూరితేజుఁ డగుచు న్భాసిల్లఁ దద్గోత్రజుం
డై రాజిల్లెను పిండిప్రోలుకులవీరామాత్యుం డుద్యత్ప్రభా
సారాదిత్యుఁడు నిత్యసత్యుఁడు సమస్తక్ష్మావరస్తుత్యుఁడై.

27


శా.

కుయ్యేటం గలపిండిప్రోలుకులు లేకూటస్థుచే నుద్భవం
బ య్యభ్యున్నతి నొంది రట్టికమనీయాకారనాసత్యు వీ
రయ్యామాత్యు జగన్నుతప్రబలదానౌన్నత్యు సంబోధిరా
ట్ఛాయ్యంఘ్రిద్వయభృత్యుఁ గేవలునిగాఁ జర్చింపఁగా నర్హమే.

28

క.

విదితయశుం డావీరయ
కుదయించిరి సుతులు సౌమ్యు లురుకీర్తియుతుల్
పెదవేంకటమంత్రియు శా
మ్యదరాతి యగుచినవేంకటామాత్యుండున్.

29


ఉ.

వీరయసూనులందుఁ బెదవేంకటధీమణి వీరభద్రునా
ధీరుఁడు గోపరా జనకృతిన్ మఱి యాతఁడు భద్రిరాజు స
బ్భీరహితాత్ముఁ డిద్దఱను వేంకటరాముని సర్వమంత్రినిన్
వారలు నల్వురేసిగను బాపయముఖ్యులఁ గాంచి రిర్వురన్.

30


క.

పటుతరమతి యగుచినవేం
కటధీమణిసూనుఁ డమలఘనకీర్తివిభా
పటలీహిమభానుం డు
త్కటదానుఁడు వీరయాభిధానుం డెన్నన్.

31


క.

ధీవీరతాదిగుణముల
ప్రోవీరసికుఁ డనఁ బిండిప్రోలికులీనుం
డౌవీరమంత్రి వెలసెను
సౌవీరాంధ్రాదిదేశసన్మంత్రులలోన్.

32


క.

ఆవీరన పెండ్లాడెన్
భూవినుతగుణావలంబ ముఖనిర్జితరా
కావిధుబింబన్ హరికరు
ణావర్ధితనిజకుటుంబ నరసాంబ నొగిన్.

33


క.

వీ రనఘు లనఁగ నెగడిరి
వీరనయుఁ బతివ్రతాత్వవిజితోమాదే
వీరనరసాంబయను యదు
వీరనలినశరజననుల విధమున జగతిన్.

34

ఉ.

ఆమిథునంబునం దుదయమై విలసిల్లిరి సింగమంత్రియున్
శ్రీమహనీయుఁ డై వెలయు కృష్ణసుధీమణియున్ లసద్యశో
ధాములు దీక్ష్ణధామహిమధాములయట్లు విభాకళాఢ్యులై
హైమమహీద్రమంధరము లట్లు సమంచితధైర్యసారులై.

35


క.

అందగ్రజుండు శాత్రవ
బృందారణ్యాన్యనలుఁడు పృథుబలుఁ డురుధీ
బృందారకగురుఁ డతిధృతి
మందరుఁ డన నెగడె సింగమంత్రి నిపుణతన్.

36


క.

ఆసింగవిభువరుండుమ
హాసిం గదనమున విపుల నణఁచును లంకా
వాసిం గకుత్స్థకులజుఁడు
వాసిం గడతేర్చినట్లు వరుస దలిర్పన్.

37


సీ.

ప్రకటమౌ గణపతిరాజువారిజమీది
        వాన్గిరీ చేసె నేవరవిభవుఁడు
బహుదేశభూపసభాపూజ్యుఁ డగుచు నం
        దలమెక్కి తిరిగె నేతరణి తేజుఁ
డన్నపానీయవస్త్రాదుల నర్థులఁ
        దృప్తులఁ జేసె నేదీప్తయశుఁడు
సంగీతసాహిత్యసరసవిద్యలకు నా
        శ్రయుఁ డనఁ దనరె నేచతురబుద్ధి


గీ.

యతఁడు హరిభక్తుఁ డర్హధర్మానురక్తుఁ
డార్యజనహితుఁ డతులగాంభీర్యయుతుఁడు
చారురూపస్మరుఁడు సదాచారపరుఁడు
రుచిరగుణపాళి సింగనసచివమౌళి.

38

ఉ.

మ్రింగఁడు దేవభూసురవరేణ్యధనంబుల నీతిచేత ను
ప్పొంగఁడు సజ్జనుల్ తనదుభూరిగుణంబులు లెక్కవెట్టుచో
లొంగఁడు వైరు లెంద ఱనిలోన నెదిర్చిన మించె వన్నెవా
సిం గడుఁ బిండిప్రోలికులసింగఁడు మంత్రులలోన నెంతయున్.

39


క.

ఆతనితమ్ముఁడు బుద్ధివి
ధాత నితాంతసువిభూతి ధరణీధరజా
మాత నిరూఢదయాశ్రీ
నేత నియతిఁ గృష్ణమంత్రి నెగడెం ధరణిన్.

40


సీ.

కుయ్యేటి కీశాన్య మయ్యున్నతోరాల
        కోటిచెంత రచించెఁ దోఁట యొకటి
గ్రామస్థపాంథతర్పణమధురోదక
        ప్రప నిజావాసాజిరమునఁ గట్టె
నలఘుపుణ్యక్షేత్రముల దననిక్షేప
        మమరఁజేసెను రమేశార్పణముగ
నుర్వీసురులకు గృహోపకరణధన
        క్షేత్రాదిదానముల్ సేసె మిగుల


గీ.

భూరిదివ్యాలయతటాకములు ఘటించె
గృతిముఖంబున నత్యంతకీర్తి వడసె
మంత్రిమాత్రుఁడె లోకైకమాన్య పిండి
ప్రోలి శ్రీకృష్ణవిభుఁ డుషర్బుధనిభుండు.

41


ఉ.

ప్రేమను బిండిప్రోలికులకృష్ణసుధీమణి పెండ్లియాడె శ్రీ
రామను బోలినట్టిదగురామను సద్వనితాలలామ నా
నామనుముఖ్యతారకసునామనుతిస్ఫుటకామసద్యశ
స్తోమను వక్త్రకాంతిజితసోమను సద్గుణధామ నున్నతిన్.

42

చ.

సరసత నొప్పుకృష్ణునకు సాధ్వికి రామకుఁ దిమ్మమంత్రియున్
స్థిరమతివీరరాఘవుఁడు సింగయయున్ వరదయ్యమంత్రియున్
నరసయమంత్రిచంద్రుఁడు ననందగు నేగురుపుత్రకుల్ జనిం
చిరి కలశాబ్ధివేలుపుల చెట్టులయ ట్లురుదానశీలు రై.

43


మ.

ఘనుఁ డాతిమ్మయమంత్రి కిత్తమయనం గా నొప్పుభవ్యాంగనా
జనచూడామణియందుఁ గాంచె సుతుల సన్మాన్యుల న్రామకృ
ష్ణునిఁ దమ్మయ్యను బుచ్చివేంకటసుధీంద్రున్ బ్రహ్మవిష్ణీశు లి
ట్లొనరం ధాత్రి జనించి రొక్కొ! యని యార్యుల్ సన్నుతుల్ సేయఁగన్.

44


వ.

అందు.

45


మ.

దళితామిత్రుఁడు రామకృష్ణసచివోత్తంసంబు శ్రీశాంకరీ
కులకాంతామణియందుఁ గాంచె సుతులన్ గోపాలునిం దిమ్మమం
త్రిలలామున్ ఘనుఁబద్మనాభసచివున్ ధీరత్నము న్వేంకటా
చలమున్ రాషయమంత్రి నేగుర యశస్సంఛాదితాశాళులన్.

46


ఉ.

శ్రీలుఁడు సత్కృపాళుఁడు హరిన్నుతశీలుఁడు పిండిప్రోలిగో
పాలుఁడు రాజమాంబికయు బాగుగఁ గాంచిరి మము నల్వురన్
ధీలలితుండు శ్రీతిరుపతిప్రభుచంద్రుని రామకృష్ణునిన్
శ్రీలలనేశ్వరాంఘ్రియుగసేవకు లక్ష్మణు నన్ను రామునిన్.

47


చ.

పెనుపుగ వీరమంత్రి చినవేంకటధీమణిఁ గాంచె వీరమం
త్రి నతఁడు సింగకృష్ణులను గృష్ణయ యేగుర నందుఁ దిమ్మరా
జనఘుల రామకృష్ణముఖులౌ ముగురన్ మఱి రామకృష్ణుఁ డిం
పెనయఁగ గోపయప్రభృతు లేగుర గోపయ మమ్ము నల్వురన్.

48

ఉ.

వీలుగఁ బిండిప్రోలికులవీరయధీమణి చిన్నవేంకట
శ్రీలలితాఖ్యు వీరవిభుఁ గృష్ణుని దిమ్మని రామకృష్ణు గో
పాలుఁడు రాజమాంబ యను భామయుఁ గాంచిరి తిర్పతిన్సుధీ
లాలితు రామకృష్ణునిని లక్ష్మణుఁ డన్నను రాము నల్వురిన్.

49


వ.

అని యిష్టదేవతావందనంబును, నవగ్రహధ్యానంబును,
మద్గురుసేవనంబును, సుకవిజనస్తుతియు, గుకవిప్రతారణం
బును, మజ్జన్మస్థలం బైనగుయ్యేరుపురవర్ణనంబును, మద్వంశ
సూచనంబునుం గావించి, యే నొక్కప్రబంధంబు నవరస
భావార్థలక్షణానుబంధంబుగా నూహించి కల్యబ్దములు
4898శాలివాహనశకాబ్దములు 1719 ఇంగ్లీషుసంవత్స
రములు 1797 ఫసలీ 1207 నగు పింగళసంవత్సరశ్రావణ
మాసములో రచియింప నుద్యోగించి యున్నసమయంబున.

50


సీ.

పాత్రభారద్వాజగోత్రుఁ డాపస్తంబ,
        మునిసూత్రుఁ డగుపిండిప్రోలి రామ
కృష్ణమంత్రికి శాంకరీసాధ్వికిని బెద్ద
        పట్టి శ్రీతిమ్మయపద్మనాభ
వేంకటాచల రామవిభులకగ్రభ్రాత
        కీర్తి సీతారామకృతికి లక్ష్మి
యనుసతికిఁ దనూజ యగు రాజమకుఁ బతి
        ప్రథితుఁడౌ తిరుపన్న రామకృష్ణ


గీ.

నామలక్ష్మణాఖ్యుని నను రాముఁ గన్న
తండ్రి గోపాలమంత్రి సన్మతివిశేష
దేవతామంత్రి ద్యుతిభాసి త్రిదివవాసి
కరుణ నొకనాఁడు నాకలఁ గాన నయ్యె.

51

కృతికారణము

క.

అటు గనిపించిన నే ను
త్కటసంతోషమున లేచి తత్పదములకుం
బటుభక్తి మ్రొక్కుచు నిటల
ఘటితాంజలి నైన నన్నుఁ గని యిట్లనియెన్.

52


సీ.

ఆరెవెట్టంబన్న యూర నుండెడు రావు
        బుచ్చయ్య నరసమాపుత్రకుండు
దమన్నరా వన ధర్మరాయం డని
        నిరుపేళ్లతోడుత నెసఁగు వెలమ
యరయ భద్రయ్య జగ్గయ్య తమ్మయ్య భా
        పయ్య లన్నలుగురి కగ్రజుండు
పుత్రాదిసంపత్తి పొసఁగునతఁడు మన
        కుయ్యేరు ప్రీతితో గుత్తసేసి


గీ.

[1]నీదులంక మాన్యము బల్మిని హరియించెఁ
గానఁ దత్ప్రాప్తికై రాముకథయును మన
కథయు జతగాఁగ నర్థంబు ఘటనపఱచి
కృతి రచించి గోపాలున కిమ్ము తనయ.

53


క.

మనకుయ్యేరున నెలమిం
బెనఁగొనుగోపాలమూర్తిపేరనె సుమ్మీ
మును నా పే రిడియెను మ
[2]జ్జనకుం డటు గాన నతఁడె దైవము మనకున్.

54


క.

ఆతనిఁ గృతిపతిఁ జేసిన

ఖ్యాతి యగుం గార్యసిద్ధి యగుఁ గైవల్యం
బే తుది నబ్బును మనకుల
జాతుల కందఱకు నిది నిజము లక్ష్మణుఁడా!

55


ఉ.

కొందఱుశబ్దసౌష్ఠపముఁ గొందఱు భావముఁ గొంద ఱర్థముం
గొందఱు సంధిసంఘటనఁ గొంద ఱలంకృతివృత్తి గొందఱుం
గొందఱు తెన్గు సంస్కృతముఁ గొందఱు చందముఁ గొంద ఱన్నియుం
గొందఱు జూతు రెల్లకవికోటి బళీ యనఁ జేయుమీ కృతిన్.

56


వ.

తత్కృతియందు.

57


గీ.

లక్ష్మణుండు లంకాపతి లక్ష్మణాగ్ర
జుఁడు కవనచారి గోపాలసూనుఁ డజసు
వంశజాతుఁడు రాజాంబవత్స పిండి
ప్రోలికవివరుఁ డనుపేళ్లఁ బొదలు మీవు.

58


క.

అని పలికి యమ్మహాత్ముఁడు
సన నే మేలుకొని సంతసము నాశ్చర్యం
బును బటుభక్తియు ముప్పిరి
గొనుమదితో మ్రొక్కు లిడితి గోపాలునకున్.

59


ఆ.

అట్లు మ్రొక్కి హితుల కందఱ కీవార్త
సెప్పి యర్థయుగము సేరఁ గబ్బ
మే రచింపవలతినే మున్ను పింగళి
సూరనాదు లైనసుకవు లట్లు.

60


వ.

అనిన వార లిట్లనిరి.

61


చ.

గణుతికి నెక్కునట్టి ఘనకావ్యము లొప్పుగఁ జేయ శాస్త్రవి
క్షణములు మెచ్చ భావములు కల్పన సేయ రసంబు లొప్ప భా

షణముల కర్థగుంభనము సమ్మతి సేయఁగఁ బిండిప్రోలి ల
క్ష్మణకవివర్య నీవె తగుజాణుఁడ వన్యులు నీసమానులే.

62


క.

శ్రీమన్నారాయణకరు
ణామహిమప్రాప్తసహజనవరసభావా
ర్థామలవాగ్విలసనుఁడవు
సామాన్యకవీశ్వరుఁడవె చర్చింపంగన్.

63


మ.

అనిన న్వారలప్రేరణంబునను ము న్నత్యంతసంప్రీతి మ
జ్జనకుం డానతి యిచ్చుటం దుదిని మోక్షం బిప్పు డిష్టార్థముల్
గొనసాఁగంగ నొనర్పు శ్రీవిభునకుం గుయ్యేటిగోపాలదే
వున కీఁగోరుటఁ జెప్పఁబూనితి సుకావ్యుల్ మెచ్చ నీకావ్యమున్.

64


ఉ.

పారము లేని రామనరపాలకదేవుకథాసుధాబ్ధిలో
గోరిక మత్కథామధురకూపమునుం జతగా రచించుటల్
తోరపుమేల్మిపైఁడిమలతోఁ దగ బంగరుపూదియం జతం
జేరిచినట్లకాదె బుధశేఖరులార! తలంచి చూడఁగన్.

65


వ.

కావున.

66


క.

ఒ ప్పనితోచిన మెచ్చుఁడు
తప్పని తోఁచినను జాలఁ దఱచుం డొప్పుం
దప్పని యుపేక్షసేయకుఁ
డెప్పుడు నోసుమతులార! యేఁ బ్రార్థింతున్.

67


క.

అని బుధుల వేఁడికొని నా
మనమున గోపాలబాలు మాధవు భక్తా
వను దురితదూరుఁ దలఁచుచు
ననుమోదముతోడ నమ్మహాదేవునకున్.

68

షష్ట్యంతములు

క.

ప్రకటమహోన్నతనిజమ
స్తకమకుటాగ్రప్రదేశసంస్థాపితర
త్నకిరణనికరధగద్ధగి
తకకుద్భాగునకు భూరితరభోగునకున్.

69


క.

కరుణామృతకలితాంతః
కరణునకు నురస్స్థితాచ్ఛకౌస్తుభరత్నా
భరణునకుం గిల్బిషసం
హరణునకున్ హాటకాంబరావరణునకున్.

70


క.

శ్రితలోకగాఢతరదు
ష్కృతసంచయతిమిరతీక్ష్ణకిరణునకున్ సం
తతపాకశాసనాది
క్రతుభుగ్గణవినతభవ్యకరచరణునకున్.

71


క.

నవనీతచోరునకు దా
నవమదసంహారునకుఁ గనద్వల్లవమా
నవతీజారునకును ధ్యా
నవదాత్మవిహారునకు ఘనవిచారునకున్.

72


క.

సురుచిరసద్గుణజాలున
కురుతరమృగనాభితిలకయుతఫాలునకున్
శరధిసుతాలోలునకున్
గురుకీర్తివిశాలునకును గోపాలునకున్.

73


వ.

సమర్పణంబుగా నాయొనర్పంబూనిన లంకావిజయం బను
ద్వ్యర్థిప్రబంధంబునకుం గథాప్రారంభం బెట్టి దనిన.

74

  1. 'మనదు లంక మాన్యమ్ము బల్మిని హరించె' అని పాఠాంతరము.
  2. యతి విచార్యము