రుక్మిణీపరిణయము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

పంచమాశ్వాసము



కరతూణీకృతర
త్నాకరభీకరగజాంధకాసురదళనా
కపరాక్రమవిలస
ద్గోకర్ణవిభూషితాంగ కుక్కుటలింగా.

1


వ.

అవధరింపుము సూతుం డమ్మునిశ్రేష్ఠుల కెఱిఁగించినతెఱంగున శుకుండు పరీక్షి
న్మహీకాంతున కవ్వలికథావిధం బెఱింగింపం దొడంగె నట్లు కృష్ణుండు కుండిన
నగరాభిముఖుండై చనిచని.

2


ఉత్సాహ.

ముదముతోడ నేకరాత్రమున విదర్భభూమికిన్
గదియ నేఁగ నత్తెఱంగు కామపాలుఁ డంతయున్
మది నెఱింగి వాహినీసమాజయుక్తుఁడై చనెన్
కదనభేరికల్ చెలంగఁ గంసవైరివెంబడిన్.

3


పంచచామరము.

మురారియానతిన్ మదిం బ్రమోద మూని యంతటన్
ధరామరుండు రుక్మిణీనితంబినీమణీగృహాం
తరాళసీమఁ జేరి నిల్వఁ దన్ముఖానుమోద మా
నరాధినాథపుత్రి గాంచి నవ్వుమో మెలర్పఁగాన్.

4


ఉ.

దిగ్గున లేచి విప్రకులధీమణికిం బ్రణమిల్లి జాళువా
నిగ్గులు దేఱుపీఠమున నిల్చి కరంబులు మోడ్చి యాత్మలో
నగ్గల మైనకో'ర్కె లలరారఁగ ని ట్లను నోబుధేంద్ర యా
దిగ్గజరాజతుల్యుఁ డరుదెంచెనొ లేదొ వడిన్ వచింపుమా.

5


తే.

అలకళానిధిరాక కుత్పలము లాస, నొందుక్రియను మదీయనేత్రోత్సలంబు
లోకళానిధి వినుము నీరాక కిప్పు, డెదురుచూచుచు నున్నవి ముదము మీఱ.

6


మ.

రమణన్ విప్రుఁడు శౌరిపట్టణము చేరం గల్గెనో లేక మా
ర్ధమునం జిక్కెనొ వెన్నుఁ డీపనికి నేరం బెన్ని రాఁడయ్యెనో
విమతశ్రేణితలంపు విస్తరిలునో వేంచేయునో యంచుఁ జి
త్తమునం గుందుచు నుంటి నింతదడవున్ ధాత్రీసురేంద్రోత్తమా.

7

క.

ద్విజవర నీ వరిగినపని, గజిబిజియై చనెనొ నిన్నుఁ గన్గొని వికచాం
బుజనయనుఁ డాదరించెన, నిజసరణి యెఱుంగఁ బల్కు నెవ్వగ దీఱన్.

8


క.

అని ఘన మగుచంచలబు, ద్ధిని నాపని విన్నదాఁకఁ దివిరెడుకన్యా
జనమణిఁ గన్గొని భూసుర, తనయుఁడు నగి పల్కె వినుము తగ నీయాజ్ఞన్.

9


సుగంధివృత్తము.

కామినీమణీమణిప్రకల్పితేందుశాలికా
స్తోమహేమధామదివ్యధూపధూమసౌరభో
ద్దామసామజాశ్వసంతత ప్రకాశ మైనయా
సోమవంశధాముప్రోలు చొచ్చి యందు నొక్కెడన్.

10


సీ.

తళుకుఁజెక్కులధగద్ధగలపై ముత్యాలచౌకట్లనిగనిగల్ చౌకలింపఁ
దెలిదమ్మిఱేకులఁ దెగడుగన్గవడాలు మొలకనవ్వులకాంతిఁ గలసి మెలఁగఁ.
బెనుమొగుల్ జిగిమించుతనుకాంతితో మేల్మిపసిఁడిచుప్పటిసిరుల్ బలసి మెఱయ
నఱుత మించిన మొల్లసరులసౌరభము చందనపుమేపూఁతవాసనల నెదుర


తే.

నుదుటఁ గస్తూరిరేఖసొం పొదవి పొదల, దివ్యమణిభూషణద్యుతుల్ దిశలఁ బర్వ
భువనమోహనశృంగారపూర్ణుఁ డగుచు, నలరుమురవైరిఁ గన్గొంటిఁ గలువకంటి.

11


క.

పున్నమచందురుఁ డనఁదగు, వెన్నుని నటఁ జూచి నీదువృత్తాంతం బా
పన్నగరిపుకేతనునకు, విన్నప మొనరింప హాసవికసితముఖుఁ డై.

12


క.

నీసుగుణరూపయౌవన, భాసురసుకుమారతలకుఁ బలుమఱు మది ను
ల్లాసము నొంది ముకుందుఁడు, మీసంబులు దువ్వె రిపులమీఁదం దరుణీ.

13


తే.

కనకభూషణమణిగణధననవాంబ, రాదికము నా కొసంగి దా నపుడె కదలి
వాఁడె వేంచేసె రిపులఁ బోవంగఁ దఱిమి, నిన్ను వరియించు నిఁకఁ జూడు నీరజాక్షి.

14


క.

వనితా నీభాగ్యంశం, బున నిపు డాచెలువుఁ డబ్బె భోగీశ్వరుఁడున్
వినుతింపఁ గలఁడె యాతని, ఘనతరసుకుమారకూపకాంతిప్రతిభల్.

15


తే.

వానియాకార మారమావరకుమార, మారమాధవధవళాంశుమానితంబు
వానిసామ్రాజ్య మాస్వరావాసవాస, వాసవాంబరవాసఃప్రహాసకంబు.

16


సీ.

విరిదమ్మిఱేకులసిరి మించుకనుదోయి నిండుఁజందురుఁ దేరునెమ్మొగంబు
హరినీలములు నేలుతరమైనమెయిడాలు గజతుండరుచిరంబు భుజయుగంబు
మించుటద్దపునిద్ద మెంచులేఁజెక్కులు మేలుసంపఁగెమొగ్గఁ బోలునాస
మొల్లమొగ్గలకాంతిఁ దెల్లజేయురదాళికం బూపమానంబు కంఠతలము


తే.

పటుకవాటంబుతో సాటిఁ బరఁగుఱొమ్ము, చిగురుటాకులసొంపెల్లఁ దెగడునడుగు
లహహ కృష్ణునిసౌందర్య మరిది పొగడ, నహికులాధ్యక్షునకుఁ బితామహునికైన.

17


ఉ.

చెప్పెడి దేమి యావిభునిచెల్వము గాంచినఁ గమ్మఁదేనియల్
చిప్పిలు ముద్దుఁబల్కులును జెన్నుగ గానము విన్న యంతలో

ముప్పిరిగొన్నమోహపుసముద్రములోపల నీఁదుచుండి యా
యొప్పులకుప్ప లైనదివిజోత్తమకన్యకలుం గరంగరే.

18


తే.

వేయిదెఱఁగుల నయ్యదువీరుచెలువు, పూని వినుతింప నేటికి వానిఁ బోలి
యంబుజారాతి తా విధుఁ డనఁగఁ బరఁగె, నల వసంతుఁడు మాధవుఁ డనఁగఁ దనరె.

19


తే.

అనిన విని యాత్మ నుప్పొంగి యవ్వరాంగి, పెన్నిధానంబుఁ గన్గొన్న పేదయట్లు
తనమనోరథ మీడేఱె నని తలంచి, విప్రకులశేఖరుని గారవించి పలికె.

20


మ.

ధరణీదేవకుమార నీమహిమ చిత్రం బెన్న నిద్ధాత్రి నె
వ్వరికిం జెల్లు నమందయాన మొనరన్ ద్వారావతిం జేరి భా
స్వరలీలన్ మహిపానరోధము ప్రవేశంబై జగత్కారణున్
బరమాత్మున్ హరిఁ దోడితెచ్చితివి మద్భాగ్యాధిదైవంబవై.

21


క.

కన్నియతలఁ పిది యెం తని, యెన్నక కారుణ్యదృష్టి నీక్షించి తగన్
వెన్నునిఁ దోడ్కొని తెచ్చిన, ని న్నేక్రియఁ బ్రస్తుతింప నేర్తు మహాత్మా.

22


క.

ఆరయ నీఋణ మింతయుఁ, దీరుపఁ గా నేర వసుమతీసురవంశో
ద్ధారక యూరకయె నమ, స్కారముఁ గావింతు భక్తి గడలుకొనంగన్.

23


తే.

అని నమస్కార మొనరించె నంత రామ, కృష్ణు లేతెంచి రని విని కేవలప్ర
మోదమునఁ దూర్యఘోషముల్ మొరయ భీష్మ, కుం డెదుర్కొని పూజించి కోర్కు లలర.

24


చ.

నగరికిఁ దోడితెచ్చునెడ నవ్యకుతూహలహృత్పయోజలై
మగువలు తత్తఱించుచును మాధవుఁ గన్గొనఁగోరి చేరి కెం
జిగినునువాతెఱల్ గదలఁ జేతులు ద్రిప్పుచు నుండి రప్పు డా
సొగసులు చూచి డెందములఁ జొక్కుచు జాణలు మేలుమే లనన్.

25


చ.

కలికి యొకర్తు కన్గనను గస్తురి దిద్ది లలాటపట్టికం
జెలువుగఁ గజ్జలం బిడి కుశేశయలోచనుఁ జూడ వచ్చె ను
గ్మలి మఱియోర్తు వేనలిని గంధము మెత్తి మిటారిగుబ్బలన్
గలయఁ బ్రసూనమాలికలు గట్టి హరిం గనఁ జేరెఁ గేరుచున్.

26


చ.

పొలఁతుక యోర్తు నవ్యమణిభూషణముల్ ధరియించుచుండి యా
నలినదళాక్షుఁ గన్గొనఁ జనన్ వలె నంచును దత్తరంబుతో
గళమునఁ గాంచియున్ జిలుఁగుఁగౌనునఁ దీఁగెయు వేణి నందియల్
వలయసమూహముల్ పదములన్ వెసఁ బెట్టుకవచ్చె నిచ్చలున్.

27


తే.

వీడి జీరాడుపెన్నెఱుల్ గూడఁబట్టి, తత్తఱంబున హరిఁ జూడఁ దరుణి యోర్తు
సరగఁ బఱతెంచులా గొప్పెఁ జామరంబు, పూని శౌరికి విసరరాఁబోలు ననఁగ.

28


ఉ.

కంచెల విప్పి యోర్తు తనగబ్బిచనుంగనపైని వాసనల్
మించుమృగీమదంబునఁ దమిన్ మకరీమయచిత్రపత్రముల్

కొంచక వ్రాయుచుండి యదుకుంజరుఁ గన్గొనఁ జేర షట్పదా
భ్యంచితపుష్పమంజరులు బాగుగఁ గానుక దెచ్చెనో యనన్.

29


ఉ.

బంగరుతమ్మిమొగ్గ లొకభామయురంబున నించి వేడ్క ను
ప్పొంగుచుఁ గైరవాప్తకులభూషణుఁ గన్గొనఁ జేరఁ జూడ ని
న్నుం గనుఁగొన్న యంతనె మనోభవుఁ డక్కున దమ్మితూపు లే
యంగఁ దొడంగె నంచు నసురారికిఁ జూపఁగ వచ్చుకైవడిన్.

30


సీ.

మృగమదామోదముల్ జగతి నంతట నిండ గడగడ సైకపునడుము వడఁకఁ
బదముల నందియల్ పలుదెఱంగుల మ్రోయఁ గనకకంకణములు ఘ ల్లనంగ
సుమమాలికలు కుచాగ్రములపై నర్తింప జడకటి సీమపైఁ జవుకళింపఁ
దాటంకదీధితుల్ తళుకుఁజెక్కులఁ గ్రమ్ము గరువంపునడకలు గడలుకొనఁగఁ


తే.

జిలుఁగుచెంగావిపావడ చిందులాడ, నెమ్మొగంబున నవ్వువెన్నెలలు పర్వ
నొకసరోజాతపత్రాక్షి యుల్లసిలుచుఁ, జేరె వేవేగఁ జాణూరవైరిఁ జూడ.

31


ఉ.

గొల్లమెఱుఁగుఁబోండ్లు జిగిగుబ్బలఁ గ్రుమినఱొమ్ముకం దిఁకం
దెల్లమిగాఁ గనంబడఁగ నేర దచించు వసించి యత్తఱిన్
హల్లకపాణి యోర్తు దనుజారియురంబున నించెఁ దావులన్
మొల్లము మీఱుచున్న గిరిమొల్లసరంబులు కౌతుకంబునన్.

32


తే.

బిత్తరి యొకర్తు దోయిట ముత్తియంపు, సేసఁబ్రా లిడి యావృషభాసురారి
శిరముపై నించెఁ గోరిక చెంగలింప, రమణఁ దలఁబ్రాలు వోయుచందమున నపుడు.

33


చ.

గొనకొని వీథివీథులను గుంపులు గూడి దరస్మితాంచితా
నన లగుచున్ నిరంతరకనత్కనకాభరణప్రసక్తనూ
తనమణిదీప్తిదీపికలఁ దద్దయుఁ దేటమిటారిచూపులన్
వనజదళాయతాక్షులు నివాళు లొసంగిరి కంసవైరికిన్.

34


సీ.

కలికిరో యీతఁడే కులుకుఁబ్రాయపుగొల్లకన్నెల నలపించువన్నెలాఁడు
లలనరో యీతఁడే చెలఁగి నందవధూటిమ్రోల నాడెడుజగన్మోహనుండు
తరుణిరో యీతఁడే ద్వారకాపురమర్త్యకోటులకెల్లఁ దంగేటిజున్ను
తెఱవిరో యీతఁడే దేవకీవసుదేవు లున్నతంబుగఁ గన్నపెన్నిధాన


తే.

మబల యీతఁడె బృందావనాంతరప్ర, చారభిల్లనితంబినీచారుదృక్చ
కోరరాకాసుధామయూఖుం డటంచు, నెంచి దీవించి సేసలు నించి రపుడు.

35


క.

తగు నీచెలువుఁడు భీష్మక, జగదీశ్వరసుతకు భోజజనపతిసుతయుం
దగు నితనికి నియ్యిరువురఁ, దగ గూర్చినఁ దమ్మిచూలి తా జాణగదా.

36


తే.

అనుచుఁ బౌరాంగనలు చేరి యభినుతింప, నంత భీష్మకుఁ డాప్రలంబాంతకాబ్జ
నయనులను దోడుకొని తననగరు చేరి, వసనమణిభూషణాదులు వారి కొసఁగి.

37

క.

క్షితిధరసుతఁ గొల్వఁగ సు, వ్రతయై తగురుక్మిణీకురంగాక్షి నలం
కృతఁ జేయ నపుడె యానర, పతి వెరవరు లైనచెలులఁ బని గొలుపుటయున్.

38


క.

వారును ధరణీవరక, న్యారత్నముఁ జేరి నిశ్చలానందమునన్
గేరుచు భువనోన్నతశృం, గారం బందఱు నొనర్పఁ గణఁగిరి వరుసన్.

39


ఉ.

కౌను చలింప నిద్దపుమొగంబునఁ జెమ్మట ముంపఁ గంకణ
ధ్వానము లింపు నింపఁ గరతాళగతుల్ పచరింప హారముల్
పూని నటింప నూర్పు సొలపున్ వలితెమ్మెర లంకురింపఁగాఁ
జాన యొకర్తు రుక్తిణికి సంపఁగెనూనెఁ దలంటె నేర్పునన్.

40


తే.

కస్తురియుఁ జందనంబును గలపి యొకతె, నలఁగువెట్టెను ధారుణీనాథసుతకుఁ
గప్పురము చిల్కి సీకాయ గలిపి కాచి, నట్టిమృదువైన యటకలి పెట్టె నొకతె.

41


తే.

జాళువాబిందియలను గొజ్జంగినీరు, నింతి జలకంబు లాడించి చంచలాక్షి
కురులు నొడలును దడి యొత్తి సరగ మణుఁగు, జీరఁ గట్టిరి కొంద ఱబ్జారిముఖులు.

42


తే.

అగరుధూపంబు లిడె నొక్కచిగురుఁబోణి, నెఱులవేనలి యిడె నొకనీలవేణి
తళుకుటద్దంబు కెంగేలఁ దాల్చి యెదుట, నిలిచె నొయ్యారముగ నొకనలినపాణి.

43


సీ.

నీలంపుగుంపుపై మేలిముత్తెము లున్నకరణి గొప్పున మొల్లవిరిసరంబు
లఱచందురునియందు నెఱిగందు వెలుఁగొందుతీరున నొసలఁ గస్తూరిరేఖ
తమ్మిఱేకులలోనఁ దుమ్మెదల్ నిల్చినగతిని వాల్గన్నులఁ గజ్జలంబు
వలిగట్టుబలుశృంగముల మంచు గప్పినజాడఁ జన్గుబ్బలఁ జందనంబుఁ


తే.

బొందుపఱిచి సరత్నజాంబూనదాంఘ్రి, కటకకంకణకింకిణీకాంచికాంగ
దాంగుళీయకతాటంకహారనూపు, రాద్యలంకారములఁ గన్య నలరఁ జేసి.

44


క.

నరనాథున కెఱిఁగించినఁ, బరితోషము నొంది యిపుడె బాలామణి నీ
శ్వరికిన్ మ్రొక్కఁగఁ దోడ్కొని, యరుగుడు వేవేగ నంచు నానతి యిడినన్.

45


సీ.

లతకూన యోర్తు మొల్లముగఁ గ్రొన్ననలు నబ్జానన యోర్తు హిమాంబువులును
రంభోరు వొకతె సౌరపుఁగప్పురంబును శైలస్తని యోర్తు చందనంబు
మృగనేత్ర యోర్తు చెల్వగుకమ్మకస్తురిఁ బుష్పలిట్కచ యోర్తు పూవుఁదేనెఁ
గొమ్మ యొక్కతె ముద్దుగుల్కుఫలంబులు ఫణిరోమలత యోర్తు మణిగణంబు


తే.

లెలమిఁ గొని రాఁగ దూర్యము ల్చెలఁగి మ్రోయ, భద్రగీతము లుడుగక పాడుకొనుచు
విప్రకామిను లరుదేర వీరభటులు, బలసి కొల్వ నుదగ్రవైభవముతోడ.

46


క.

బాలారత్నము శివుని, ల్లాలిగృహంబునకు నరిగి యం దయ్యమకున్
గే లెత్తి మ్రొక్కి యెంతయుఁ, దాలిమి మదిలోన నిల్పి తరలనిభక్తిన్.

47


తే.

గంధపుష్పాక్షతాంబరకనకభూష, ణోపహారఫలానేకధూపదీప
కలితకర్పురవీటికాదులను బూజ, లొనరఁ గావించి యిట్లని వినుతి చేసె.

48

సీ.

జయజయ జగదంబ సరసగుణాలంబ జయజయ శుభమూర్తి సారకీర్తి
జయజయ కల్యాణి సమదకోకిలవాణి జయజయ మృదుగాత్రి శైలపుత్రి
జయజయ హరిణాక్షి సకలసత్కృతిసాక్షి జయజయ మునిలోల సాధుశీల
జయజయ కౌమారి శమితామితేంద్రారి జయజయ గుహమాత సతతిపూత


తే.

జయ పదాంభోజ సంసక్తచంచరీక, నికరశంకాకరామరానీకనిటల
ఘటితపటుతరకస్తూరికానవీన, సౌరభోరుప్రభాశ్రేణి జయ భవాని.

49


శా.

అక్షీణప్రతిభావిభాసితబుధేంద్రానందసంధాయినీ
సాక్షాద్భద్రకరీ దయామయఝురీ సౌందర్యపాథోనిధీ
కుక్షిప్రోల్లసదబ్జజాండసమితీ ఘోరాహవార్వద్విష
ద్రక్షశ్శౌర్యవిదారిణీ మముఁ గృపన్ రక్షింపు దాక్షాయణీ.

50


చ.

కరతలకీరడింభవినిఖండితశుంభనిశుంభసంభృతాం
బురుహభవాండకుంభపరిముక్తమహాసురదంభజంభజి
ద్వరకరికుంభశుంభదననద్యపయోధరకుంభసంతత
స్ఫురదురుశాతకుంభమణిభూషణజాలవిజృంభశాంభవీ.

51


చ.

నిరుపమభక్తియుక్తులను నిత్యముఁ జిత్తమునందు ముందు నీ
చరణము లాశ్రయించుటకుఁ జక్రధరున్ వరుఁ జేయు మమ్మ నిన్
శర ణని నమ్మి యెప్పుడు నచంచలవృత్తిఁ జెలంగువారికిన్
జిరతరమై యభీష్టఫలసిద్ధి యగుం గద సర్వమంగళా.

52


క.

అమ్మా శంభునిమోహపుఁ, గొమ్మా బంగారుబొమ్మ కోర్కులు దయతో
నిమ్మా నిన్నే నమ్మితిఁ, జుమ్మా యర్చనలు గూరుచుటఁ గైకొమ్మా.

53


తే.

అనుచు నుతిచేసి విప్రకామినుల కపుడు, గంధమాల్యాభరణవస్త్రకంఠసూత్ర
వీటికేక్షుఫలాదులు వెస నొసంగి, యవనిపతిపుత్రి యంబాగృహంబు వెడలి.

54


సీ.

జలదమధ్యంబున వెలువడి చెలువుల వఱలెడుక్రొక్కారుమెఱుఁ గనంగఁ
దారాపధంబునఁ దరలి యుర్వికి డిగ్గి విలసిల్లునవచంద్రకళ యనంగఁ
గణఁగి ముజ్జగము లొక్కట గెల్వఁ బూనినరతిరాజుమోహనాస్త్రం బనంగ
నజుఁడు లోకులకెల్ల నాసఁ గొల్ప నొనర్పఁ బొదలెడు పసిఁడికీల్బొమ్మ యనఁగఁ


తే.

పుడమిఱేఁడులమానసాంబుజవనములు, గలఁపఁ బఱతెంచువలఱేనిగంధకరి య
నంగ నంగన లెలమిఁ గొల్వంగ వేత్ర, పాణు లిరువంకలను బరాబరులు సేయ.

55


సీ.

తాటంకరుచులు నిద్దపుఁజెక్కులను బర్వఁ జికురముల్ మొగమునఁ జిందులాడ
గిలుకుటందియగముల్ ఘలుఘల్లు రని మ్రోయ దరహాసచంద్రికల్ సిరులఁ బ్రబల
ఘనపయోధరభారమునఁ గౌను నటియింప ఘనసారవాసనల్ గ్రమ్ముకొనఁగ
మణిభూషణద్యుతు ల్మహి యెల్ల మెఱయింపఁ జుఱుకుఁజూపులు వింతసొగసుఁ జూప

తే.

నధరబింబారుణప్రభ లమలరదన, కుందతతులకు రాగంబుఁ గూర్ప రుచిర
కనకకంకణఝణఝణత్కారనినద, ములు జనంబుల కానందముగఁ జెలంగ.

56


చ.

సురటి యొకర్తు వీవ నొకసుందరి యాకుమణుంగు లియ్య బం
భరనిభవేణి యోర్తు నునుఁబయ్యెదఁ జక్కఁగ దిద్ద బింబికా
ధర మఱి యోర్తు చేరి కయిదండ యొసంగఁ బొసంగ నన్నరే
శ్వరసుత యేఁగుదేర వరుసం గని యబ్బురపాటు మీఱఁగన్.

57


తే.

శంబరారాతి కుసుమకదంబకములు, దమయురంబులు గాఁడంగఁ దవిలి యేయ
రాజసుతులెల్ల నస్త్రశస్త్రమ్ము లుడిగి, చోద్యపడి ఱెప్పవేయక చూచుచుండి.

58


క.

బళిరా ఘనధమ్మిల్లం, బళిరా చెలిరదనపఙ్క్తి యభినవముక్తా
వళిరా యివ్వీచీనిభ, వళిరాణిగఁ గల్గుమహిమ వశమా పొగడన్.

59


ఉ.

ఖంబు గదే కవున్ శ్రుతిసుఖంబు గదే సుడి షట్పదీమయూ
ఖంబు గదే కచంబు విశిఖంబు గదే నిడువాలుఁజూపు శం
ఖంబు గదే గళంబు ప్రముఖంబు గదే జిగి నిర్జితాబ్జశం
ఖంబు గదే ముఖం బభిముఖంబు గదే తరుణత్వ మింతికిన్.

60


క.

తరుణీమణిచన్గవకున్, బురు డొనరుప నించుకై నఁ బోలునె సుమమం
జరులన్ గిరులన్ దిర మగు, సిరులన్ దనరారుపసిఁడిచెండ్లన్ గిండ్లన్.

61


సీ.

విరళమై తనుఁ దానె వీడి పాఱకయున్న ధరఁ గళాహీనతఁ బరగకున్న
మిత్రుఁ గన్గొన నోర్వమిని ముణుంగకయున్నఁ గారెక్కి దళములు గాకయున్నఁ
బ్రియకరస్పర్శచేఁ బెల్లు వివ్వకయున్నఁ బలుమాఱు భంగత నలరకున్నఁ
బొరిఁబొరి జిగి దప్పి పొరలు డుల్లకయున్నఁ గడునూఁచకోఁతలఁ బడకయున్న


తే.

ఘనశశికుముదకిసలయకమలముకుళ, భంగరంభాకలమగర్భపఙ్క్తి సాటి
కెక్కు నియ్యింతివేణి ముఖేక్షణాధ, రోష్ఠకుచవళిసక్థిజంఘోపమకును.

62


సీ.

అరవిందశరకుందదరబృందముల మాఱు మదనితీముఖనేత్రరదగళములు
హరిడింభకరికుంభగిరిరంభలను గేరు సతిమధ్యకుచకటీసక్థికములు
నదకోకనదశౌకమదపైకముల మీఱు సుదతినాభిపదోక్తిసుస్వరములు
ఫణిసోమమణిహేమఘృణిచామరములతీ రతివరోమలతాస్మితాంగకచము


తే.

లహహ యిక్కన్యకామణి యఖిలభువన, మోహనాకారరేఖాసమున్నతముగఁ
దనరుచున్నది దీని నుద్వాహ మగుట, కన్న నిఁక నెన్న వేఱె భాగ్యంబు గలదె.

63


తే.

అనుచు నృపులెల్ల విభ్రాంతి యలరఁ జూచు, చుండి రయ్యెడ భోజభూమండలేంద్ర
తనయ క్రేఁగంటిచూపుల ధరణివరుల, వరుస నందఱఁ గనుఁగొంచు నరిగి యరిగి.

64


సీ.

సజలనీరదనిభశ్యామదేహమువాని హరినీలముల నేలుకురులవానిఁ
దెలిదమ్మిఱేకునఁ దెగడుకన్నులవాని డంబైనబవరిగడ్డంబువాని

మినుకులీనెడుమంచిమెఱుఁగుఁజెక్కులవాని నగవుదేఱెడిముద్దుమొగమువానిఁ
బొడవులై కనఁబడుభుజదండములవాని బఱపుమీఱెడుగొప్పయురమువానిఁ


తే.

దలిరుటాకులఁ బోలుపాదములవాని, సిరుల కిర వగుకాంచనాంబరమువాని
నతులమణిభూషణాంచితుఁ డైనవాని, సారశృంగారుఁ డగువాని శౌరిఁ గాంచి.

65


ఉ.

సంతస మంది యీనృపతిచంద్రునితోడ జయంతుఁడు న్నిశా
కాంతుఁడు నవ్విసంతుఁడును గంతుఁడు నింతయు సాటి యాదురే
వింతలుగాను ముం దితనివేసము దివ్యవిలాసమున్ సుధీ
మంతులు దెల్పఁగా వినినమార్గము నిక్కువ మయ్యె నియ్యెడన్.

66


ఉ.

అద్దిర రాకుమారుమొగ మందము పున్నమచందమామతో
నుద్ది యగుం గురుల్ సురవరోపలకాంతిఁ దృణీకరించు లే
నిద్దపుముద్దుఁజెక్కులు వినిర్మలదర్పణదర్పలీలలం
దద్దయుఁ గేరుమీఱుమృదుదంతమరీచులు మొల్లమొగ్గలన్.

67


క.

నునుమేనుడాలు తొలుకరి, పెనుమబ్బులఁ దఱుమఁజాలుబింబము పగడం
బును దలిరుటాకునధరం, బున కెనయన నించుకైనఁ బోలునె తలఁపన్.

68


తే.

తమ్మిఱేకుఁలఁ దెగడునేత్రములవాఁడు, ఇమ్ముమీఱు వెడందయురమ్మువాఁడు
చండవేదండతుండాభచారుబాహు, దండములవాఁడు బళిర యీధరణివిభుఁడు.

69


ఉ.

ఈరుచిరాస్యుఁ డీసరసుఁ దీవిభుఁ దీనవమోహనాంగుఁ డీ
సారవిలాసుఁ డీవికచసారసపత్రవిశాలనేత్రుఁ డీ
ధీరవరేణ్యుఁ డెప్పుడు మదిన్ గలకోరికలెల్లఁ గూర్చుచున్
గూరిమితో వరించుఁ దొలునోములపుణ్యఫలామితోన్నతిన్.

70


క.

అని వనజదళాయతలో, చన దనడెందమున మిగులసంతోషరసాం
బునిధిం దేలుచు నొయ్యన, దనుజకులారాతికడకుఁ దఱియం జేరెన్.

71


క.

అంబుజనయనుఁడు నపు డా, బింబాధర చెలువుఁ జూచి ప్రేమ దలిర్పన్
జంబుకముల నడిమిటిభా, గంబు వడిం గొనెడుమత్తగజరిపుమాడ్కిన్.

72


తే.

మహికి లంఘించి రాజకుమారిఁ దెచ్చి, రథముమీఁదట నిడుకొని ప్రధనవిజయుఁ
డగుచు శంఖంబు పూరించి యరులు చూడ, బలిమిఁ దనపట్టణపుఁద్రోవ పట్టి చనియె.

73


ఉ.

అత్తరి మాగధాదులు మురారిజయంబు సహింపలేక యు
న్మత్తకరీంద్రముల్ హరిని మార్కొనుచందము దోఁప నందఱున్
మొత్తములై హయద్విపచమూరథకోటులఁ గూడి యెంతయున్
దత్తఱ మొంది నందసుతుఁ దాఁకిరి రాకను డాక సేయుచున్.

74


మ.

భటవాహేభశతాంగఘట్టనల భూభాగంబు గంపింపఁ ద
త్పటుఘోషంబుల దిక్తటంబులు చెవు డ్పాటొందఁ బెంధూళి యొ

క్కట నంభోరుహబాంధవుం బొదివి లోకం బంతట న్నిండుఁజీఁ
కటిఁ గావింప నిలింపసంఘములు శంకం జెంది వీక్షింపఁగన్.

75


క.

దురదుర దురమున కేపు గ, దురఁ దురగేభములతో నెదు రెదు రరుల నం
దఱఁ దఱియం గని శాతో, దరి దఱియం జేరి కడు బెదరి హరి కనియెన్.

76


క.

దేవా వీక్షింపుము రిపు, భూవరసైన్యములు గదసి పొరిఁబొరి శితబా
ణావలు లేయఁగఁ జాఁగిరి, నీవిక్రమశక్తి యెఱుఁగనేరక ఖలులై.

77


ఉ.

నావుడు శౌరి నెమ్మొగమునం జిఱునవ్వు దలిర్పఁ బల్కె నో
శైవలకుంతలా మును నిశాతశిలీముఖపంక్తు లేయుచో
భావజుచేతివేదనకుఁ బల్మఱు లొంగుదుఁ గాని యింక జ
న్యావలిలోన శత్రునివహాంబకపంక్తికి లోఁగ నింతయున్.

78


సీ.

చెలియ నీకుచకుంభములదండ నుండినఁ గరిఘటాదృతభీతి నెరయు టెట్లు
లలన నీచూపుదూఁపులగాపు గల్గఁగాఁ బరుతూఁపులు మీఁదఁ బరఁగు టెట్లు
నాతి నీపరిరంభణపుజోడు గల్గఁగాఁ బ్రహరణంబులు మేనఁ బర్వు టెట్లు
రమణి నీవాక్సుధారససృష్టి గురియఁగా ఖలులచే నాశంబు గల్గు టెట్లు


తే.

కావున నితాంత మగుచును దావకాభి, నవకృపాలోకనం బింత దవిలెనేని
పరబలంబులఁ జీకాకుపఱిచి త్రుంతుఁ, జూడు నాబాహువిక్రమస్ఫురణ నేఁడు.

79


తే.

అనుచు వచియించి యెంతయు నాగ్రహించి, రథము మరలించి యాహవప్రౌఢి మించి
పాంచజన్యంబు పూరించి పరిహసించి, శరతతుల నించి విమతుల మురువుడించె.

80


ఉ.

అప్పుడు రామసాత్యకిగదాదియదూత్తము లెత్తి యార్చుచున్
నిప్పులురాలుబాణములు నించి విరోధినరాధినాథులం
గప్పి గజాశ్వయూథములఁ గాఁడఁగ నేసి వధించి నెత్తురుల్
గప్పున నేఱులై పొరల ఘోరరణం బొనరించి రుద్ధతిన్.

81


చ.

మరలక దంతవక్త్రుఁడును మాగధసాల్వవిదూరకాదులున్
గొరకొరఁ బోరికి న్నడచి ఘోరపరాక్రమ మొప్ప సేనలం
బురికొనఁ జేసి డాసి యదుపుంగవసైన్యముమీఁదటం బొరిం
బొరిఁ గురియించి రొక్కటను భూరిశిలీముఖధార లుక్కునన్.

82


శా.

భేరీకాహళభాంకృతుల్ సుభటగంభీరార్భటుల్ సంతత
క్రూరానేకపబృంహితంబులు జవాక్షుద్రాశ్వహేషాధ్వనుల్
సారస్యందనబృందఘోషములు భాస్వచ్ఛింజినీరావముల్
ఘోరాయోధనభూమిఁ బుట్టె గగనక్షోణీస్థలుల్ నిండుచున్.

83

సీ.

తురగముల్ తురగముల్ కరులును గరులును బ్రాసికుల్ ప్రాసికుల్ భటులు భటులు
రథికులు రథికులుఁ బ్రథనభీషణు లైనవిలుకాండ్రు విలుకాండ్రుఁ జలము మెఱయఁ
గదిసి యొండొరులు దాఁకను బైకి నుఱుకుచుఁ బోనీకు పోనీకు పొడువు పొడువు
పట్టుము పట్టుము బంధింపు బంధింపు కొట్టు కొట్టు మటంచు కూఁక లిడుచు


తే.

గదల మోఁదుచుఁ దూఁపులు గుదులు గాఁగ, గుప్పుచును ఖడ్గముల నఱకుచును వాఁడి
బల్లెములఁ గ్రుమ్ముచును జగద్భయదముగను, బోరు చేసిరి నెత్తురుల్ పొరలిపాఱ.

84


లయగ్రాహి.

కూలెడురథంబులును వ్రాలెడుగజంబులును దూలెడుహయంబులును వ్రీలెడుసిడంబుల్
ప్రేలెడుగుణంబులును వ్రేలెడుభుజంబులును నేలఁ బొరలాడెడుకపాలరదహృత్కం
కాలధమనీపలలజాలకరవాలపదఫాలఘనజానుతనుతాలుఘుటికాదుల్
సోలుచును గోరికలఁ దేలెడుపిశాచఖగజాలములునుం గలిగి యాల మపు డొప్పెన్.

85


శా.

తాలాంకుండు హలంబుఁ ద్రిప్పి మగధాధ్యక్షు న్వడి న్మోఁద ని
ర్మూలీభూతశతాంగసూతహయుఁ డై రోషించి యవ్వీరుఁ డా
భీలాజిహ్మగసంహతుల్ బలునిపై బెట్టేసి తత్సేనలం
దోలం జాఁగినఁ గాంచి సాత్యకి వడిన్ దోస్సార మొప్పారఁగన్.

86


తే.

విలుగుణధ్వని చేసి నిప్పులు వెడల్చు, వాఁడితూఁపులు పదుమూఁడు వానిపైనిఁ
జొనిపి మరలించె సాల్వవసుంధరేశుఁ, డలుక నిగుడంగ నపుడు సాత్యకిని దాఁకె.

87


క.

హరిసోదరుఁడును సాల్వుని, యరదము పొడిపొడి యొనర్చె నైదమ్ముల న
ద్ధరణీశుఁడు విరథుండై, ద్విరదముపై నెక్కి యనికి దీకొల్పే వడిన్.

88


చ.

కరిఁ బురికొల్పి సాళ్వమహికాంతుఁడు రాఁ గృతవర్మ యడ్డమై
శరవిసరంబు లేయుటయుఁ జంచలచిత్తుఁడు గాక యన్నరే
శ్వరుఁడు కఠోరతోమరము సాఁచి వడిం బొడువంగఁ బూనినం
దనలక వానియీఁటె నడిదంబునఁ ద్రుంచెను యాదవేంద్రుఁడున్.

89


క.

గొదగొని శిశుపాలుం డొక, గద గొని యదరంట నార్చి గదునేసిన న
య్యదుకులతిలకుఁడు నేర్పున, నది దనుఁ గాఁడంగనీక యాగ్రహ మొదవన్.

90


క.

కంఠీరవంబు మిగుల న, కుంఠితగతిం గరిని బట్టుకొనుక్రియ విజయో
త్కంఠుఁ డయి వాని నొయ్యనఁ, గంఠము వట్టుకొని బిట్టు గాసిం బెట్టెన్.

91


ఉ.

బంటుతనంబు మించి పశుపాలకులెల్ల నృపాలురై కడుం
గంటకమూని కన్నులును గానక రాజుల గెల్వఁ జూచి రా
తొంటితెఱంగు లన్నియును దూరము చేసెద నంచు నెంచుచున్
వింటఁ గరంబుఁ జేర్చి యదువీరులఁ దాఁకెను బౌండ్రకుం డొగిన్.

92

తే.

వానితోనె విదూరకమానవేంద్రుఁ, డనికి మొన చేసి తరలెఁ గల్పావసాన
రుద్రుఁ డనఁ దగి దోర్బలాక్షుద్రుఁ డగుచు, నపుడు హరిఁ జూచి పౌండ్రకాధిపుఁడు పలికె.

93


తే.

ఓరి గోపాల నీ వొకపేరు గల్గు, శూరుఁడవు బలె ధారుణీశుల నెదుర్పఁ
బూనెదవొ యెద్దు గ్రోవొవి యాఁబోతుమీఁద, ఱంకె వేసినతెఱఁగున శంకలేక.

94


ఉ.

గొల్ల మెఱుంగుఁబోండ్ల నునుగుబ్బలపోటులు గావు కేర నీ
బల్లెపువాండ్రపోట్లు ననబంతులవేటులు గావు వాఁడిశో
భిల్లుగదాప్రహారములు బిత్తరిచూపులు గావు తూఁపు లీ
ప్రల్లద మేల బాల నిడి ప్రాణము నిల్పుక పొమ్ము గోపకా.

95


సీ.

భువనంబులం దెందుఁ దవిలి వసించిన నీఁగి శైలముక్రింద డాఁగియున్న
నీచవృత్తిఁ గణంగి నేలలోఁ దూఱిన స్తంభభావంబునఁ దరలకున్న
బలిభిక్షములకుఁ బాల్పడి చెయ్యి చాఁచిన మంచిబాఁపడ వంచు మౌనివైన
ఘోరకాంతారముల్ దూఱి చరించిన ధరణి నాఁగలి పూని తిరుగుచున్న


తే.

నుఱక యొకమ్రానిలోపల నిఱికి యున్నఁ, గలికితనమునఁ బలుమాఱు మెలఁగుచున్న
వేయిదెఱఁగుల నిన్నె భావించుచుందుఁ, గాక పోనిత్తునా మీఱి కంసవైరి.

96


చ.

అని యదలించి నూఱునిశితాంబకముల్ హరిమేన నించి రా
మునిపయి నిర్వదాఱుశరముల్ నిగిడించి పదేసితూపు లొ
య్యనఁ గృతవర్మసాత్యకిగదాదులమీఁదట నేసి యార్చె న
ట్లనె చెలరేఁగి యేసె శరలాఘవ మొప్ప విదూరకేంద్రుఁడున్.

97


క.

ఈరీతి నేయఁ గనుఁగొని, సీరియు శౌరియును గొదమసింగము లన న
వ్వీరులపైఁ గదిసి శరా, సారముఁ గురియించి పరులసైన్యము దలఁకన్.

98


మ.

బలభద్రుండు రథంబు డిగ్గి విలయప్రద్యోతమానానలో
జ్జ్వలఫాలాక్షుఁడుఁబోలె సీరముఁ గరాబ్జాతంబునం బూని యా
ఖలులం బైకొని మోఁది సైన్యముల వీఁగం దోలి ఘోరాహవ
స్థలియం దెక్కడఁ దానయై తఱిమె దోస్సారం బవార్యంబుగన్.

99


తే.

అట్లు తఱిమిన నిలుపలే కఖిలనృపులు, చైద్యుఁ దోడ్కొని దమతమసదనములకు
నరిగి రయ్యెడ రుక్మి యాహరినిఁ దాఁకెఁ, దొడరి యనలంబుపైఁ బడుమిడుతగతిని.

100


చ.

ఇటు లెదిరించి తూఁపుగము లేయఁ దొడంగిన జూచి వెన్నుఁ డా
కుటిలునిచాపఖడ్గరథఘోటకసూతులు నుగ్గుచేసి హృ
త్పుటమునఁ గోప మూనియును ద్రుంపక వాని విరూపిఁ జేసి యె
ప్పటిపురి త్రోవఁ బొ మ్మనుచుఁ బంపెను రుక్మిణి మ్రొక్కి వేఁడుటన్.

101


ఉ.

అంతట శంఖ మూఁది తమి నగ్రజసోదరబంధుయుక్తుఁ డై

సంతస మూని క్రమ్ముకొని సైన్యములెల్లను గొల్వ రుక్మిణీ
కాంత వినోదవైఖరులఁ గన్నులపండువు గాఁగఁ జూచుచున్
వింతయొయార మొప్పఁగఁ బ్రవేశ మొనర్చెను ద్వారకాపురిన్.

102


సీ.

పౌరులు చేరి శోభన లీలఁ గన్గొని యానందవార్ధి నోలాడుకొంచు
గంధపుష్పాంబరకనకభూషణరత్నవిసరముల్ కానుక లొసఁగుకొనుచు
భద్రతూర్యములు నభస్థలం బవియింప వందిమాగధులు చెల్వంది పొగడ
లాసకీజనులు విలాసరూఢి నటింప వారిజేక్షణులు నివాళు లొసఁగ


తే.

నపుడు కృష్ణుఁడు నిజమందిరాంతరమున, కరిగి తనతల్లిదండ్రుల కఖిలబంధు
గురుపురోహితవిద్వత్ప్రవరుల కెల్ల, జగ్గుగా మ్రొక్కె రుక్మిణీసహితుఁ డగుచు.

103


తే.

వినయగతి మ్రొక్కి వారిదీవనలు గాంచి, యంత విధ్యుక్తసరణి నయ్యవనినాథ
తనయ బెండ్లాడి ఘనతరోక్సవము మీఱఁ, దనరు నొకశుభముహూర్తంబునందు.

104


ఉ.

చెంగట రత్నపుత్రికలుఁ జిత్రవిలాసములు వెలుంగ సా
రంగమదంబువాసనలు గ్రమ్మగ నిద్దపునిల్వుటద్దపున్
రంగులు చెంగలింపఁ గపురంపుదుమారము చింద నంద మౌ
బంగరుమేడలోన విరిపాన్పున శౌరి చెలంగుచుండఁగన్.

105


తే.

ప్రోడచేడెలు గొంద ఱంభోజనయను, భోజకన్యకనుం గూర్పఁ బూని యపుడు
వెలఁదుక నలంకృతి యొనర్చి విభునిచెంత, కెలమిఁ దోడ్కొని యరుగుచు నిట్టు లనిరి.

106


క.

పదమా నీ వీక్రియ మృదు, పద మానక ప్రాణవిభునిసజ్జకు నిపుడే
మదనాగయాన మదనా, మదనాహనికేలిఁ దేలుమా మణిరదనా.

107


సీ.

ప్రియునియొద్దకు నీవె బిరబిర నరుగక కెలన నొక్కెడ నిల్వవలయుఁ జుమ్ము
చెలువుఁడు దమకించి చేపట్టి తిగిచినఁ బెనఁగుచు వెన్కకుఁ జనెదు సుమ్ము
పతి తనకుఱువులపై వసింపు మటన్న నొదిఁగి కూర్చుండుట యొప్పుఁ జుమ్ము
విభుఁడును న్గపురంపువిడె మొసంగిన సిగ్గుపడక కై కొనుటయె పాడి సుమ్ము


తే.

సరసుఁ డతనునికేలికి సంభ్రమించి, బిగియఁ గౌఁగిటఁ గదియించి చిగురుమోవి
యాని వలపూని యిక్కువ లంటునపుడు, విసువక [1]మెలంగవలయుఁ జూ పసిఁడిబొమ్మ.

108


చ.

అని చెలు లుగ్గడింప దరహాసము మోమున నంకురింప గ
మ్మునఁ గలపంపువాసనలు ముంప నొడల్ పులకింప నూపుర
ధ్వనులు ముదంబు నింపఁ జెలువం బగుకౌను నటింప నాన పై
కొని మరలింప డెందమునఁ గోర్కులు ముందరి కెచ్చరింపఁగన్.

109


క.

పడకింటిలోని కరిగిన, పడఁతుకఁ గన్గొని నరాధిపతిమేను గగు

ర్పొడువ నెపు డెప్పు డంచును, గడు నువ్విళులూరుచుండెఁ గామిను లంతన్.

110


ఆ.

వెలఁదిచేతివిడెము విభునకు నిప్పించి, విభునిచేతివిడెము వెలఁది కొసఁగఁ
జేసి కల్లపనులు చెప్పుక యొండొరుల్, దూసి రిండ్ల కాకు దూసినట్లు.

111


సీ.

కొమ్మపొక్కిటిపొన్నక్రొన్ననపై నిల్చి గురుతరోరోజమంజరులు ముసరి
బంధురాధరజపాప్రసవమార్దవ మెన్ని కమనీయరదనకుందముల వెలసి
లలితకపోలకలవలీదళము లెక్కి నయనోత్పలంబులపయిఁ జరించి
సుందరవదనారవిందంబుపై వ్రాలి వితతంబుగా దేహలతను గ్రమ్మి


తే.

చికురమధుకరకులములచెలిమిఁ గాంచి, యభినవానందలీలల నలరి యపుడు
నెమ్మదిఁ జెలంగె నెంతయు నమ్మురారి, చారువీక్షణమాలికాషట్పదములు.

112


తే.

తరుణి హిమభానుమండలదర్శనమున, సగము వికసించుచున్నట్టితొగలకరణి
శౌరిముఖచంద్రబింబదర్శనమునందు, నలరె నఱసిగ్గుఁజూపు లాజలజముఖికి.

113


శా.

ఆదామోదరభోజకన్య లటు లన్యోన్యాననాలోకనా
హ్లాదస్ఫూర్తిఁ జెలంగ నంగజుఁడు ప్రత్యాలీఢపాదస్థుఁ డై
కోదండంబు గుణధ్వనుల్ నిగుడఁ జేకొద్దిన్ వడిం దీసి బల్
పూఁదూఁపుల్ పరఁగించె నిర్వురపయిన్ బుంఖానుపుంఖంబుగన్.

114


ఉ.

అత్తఱి రాజకన్యకయొయారముఁ గన్గొని శౌరి యెంతయుం
జిత్తము దత్తిఱింపఁ దమిచేఁ జెయివట్టుక పూలశయ్య కా
బిత్తరిఁ దార్చి ముద్దుగొని బెట్టుగఁ గంచెల యూడ్చి గుబ్బలన్
మెత్తనిచందనం బలంది మెప్పుగఁ గమ్మవిడెం బొసంగుచున్.

115


చ.

పలుచనితేనియల్ చిలుకఁ బల్కవె చిక్కలకొల్కి లేఁతవె
న్నెలవలెఁ జిన్నిన వ్వొలయ నెమ్మొగ మె త్తిటు చూడు బోటి కో
ర్కులు వెలయంగ నీ బిగువుగుబ్బ లురమ్మున నాని మన్మథా
నలపరితాప మార్పఁగదె న న్నఱసేయక కన్యకామణీ.

116


సీ.

లలన నీవలుదగుబ్బలపై నిలువఁగోరి తమ్మిమొగ్గలు నిరంతరము నొసఁగి
తరలాక్షి నీసుధాధరము గ్రోలఁగఁ గోరి తియ్యనిజుంటీఁగ తేనె లొసఁగి
చెలున నీలేఁతనవ్వులు గనుంగొనఁ గోరి రమణగర్పూరహారము లొసంగి
యెలనాఁగ నీముద్దుఁబలుకులు వినఁగోరి మధురవాక్యములఁ బల్మఱు నుతించి


తే.

వంచనము లేక యిష్టదైవంబు నిట్లు, పూజ గావించినాఁడ నీపొందుఁ గోరి
జాగు సేయఁగఁ దగ దింకఁ జలము మాని, యతనుకేలిని న న్నేలు మబ్జవదన.

117


క.

అని సరసోక్తులచే న, వ్వనితామణిఁ గరఁగఁజేసి వనజాస్త్రుఁడు గు
ప్పునఁ బైపైఁ బఱపెడునూ, తనకుసుమకదంబములకుఁ దాళక యెలమిన్.

118

సీ,

ముంగురుల్ దువ్వి కనుంగని ముద్దాడి తళుకులేఁజెక్కుటద్దముల నొక్కి
కెమ్మోవి యాని రాగిలి గుబ్బ లొత్తి పొక్కిలి గిలిగింతగాఁ గేల నిమిరి
నీవి జల్లున విచ్చి నెఱి జఘనస్థలం బాదిగా నిక్కువ లన్ని యంటి
బిగ్గఁగవుంగిటఁ బెనఁచి నఖక్షతదంతక్షతాదులు తగ నొనర్చి


తే.

మఱియుఁ బంచాస్త్రశాస్త్రసమ్మతుల నతుల, గతుల రతులఁ బెనంగి యాకంజముఖిని
రంజిలఁగఁ జేసి మిక్కిలి రసికుఁ డనఁగ, నలరి శౌరి నవోఢాసమాగమమున.

119


సీ.

వితతదంతక్షతావృతసుధాధరయును మానితనిశ్వాసమారుతయును
శితనఖరాంకురాంకితకుచకుంభయు ఘర్మకణక్లిన్నగండతలయు
వదనాంబుజాతసంవ్యాప్తశిరోజయు ఘనతరసీత్కారగళరవయును
రణితమంజీరకంకణకింకిణీకయుఁ దరళితహారలతాప్రకరయు


తే.

గళదహీనమృగీమదకర్దమయును, సదమలానందపరవశసంహననయు
నగుచు నృపపుత్రి మిగులసౌఖ్యం బొసంగె, సరసిజాక్షున కయ్యాదిసంగమమున.

120


ఉ.

అంత రతాంతవేళ దనుజాంతకుఁ డాచెలి నంకపీఠికన్
సంతస మొప్ప నిల్పి నునుఁజన్నుల గిందము మెత్తి క్రమ్మఱం
గుంతలజాలముల్ తుఱిమి కోక కటిన్ ఘటియించి సొమ్ము ల
త్యంతమనోనురక్తి నిడి యాకుమణుంగు లొసంగి నేర్పునన్.

121


తే.

సురఁటి విసరుచుఁ బల్మఱు సుదతితోడ, సరససల్లాపముఁ బ్రొద్దు జరప నిట్లు
ప్రతిదినంబును గాఢానురాగ మొదవఁ, దవిలి సంభోగలీలలఁ దనరుచుండి.

122


క.

పిదపన్ రుక్మిణి మొదలగు, మదవారణయాన లష్టమహిషులునున్ సొం
పొదవఁ బదియాఱువే లం, బుజకచ లగురాజసుతలు మునుకొని కొల్వన్.

123


తే.

దుష్టజనుల వధించుచు శిష్టజనుల, కభిమతార్థంబు లొనఁగూర్చి యాదరమునఁ
బ్రోది సేయుచుఁ గృష్ణుఁడు బుధులు పొగడ, భూరిసామ్రాజ్యలీలలఁ గేరుచుండె.

124


క.

ముదమున నీహరిసత్కథఁ, జదివిన వ్రాసినను విన్న జనులకు సతతా
భ్యుదయపరంపర లొదవుం, దుది నమ్మధువైరిపదము దొరకుం దిరమై.

125


క.

అని సూతుఁడు మునిజనులకు, వినిపించినరీతి శుకుఁడు వేడ్కఁ బరీక్షి
జ్జననాథున కెఱిఁగించినఁ, దనమది నవ్విభుని నెపుడుఁ దలఁచుచు నుండెన్.

126


క.

ఈకృష్ణకథ ముదంబున, నీకరుణ నొనర్చినాఁడ నిఖిలేశ్వర నీ
వాకర్ణించి ప్రబంధముఁ, గైకొనుమా తప్పులెల్ల క్షమచేసి శివా.

127


ఉ.

ఆరయ శాలివాహనశకాబ్దముల ద్రిగుణాంగచంద్రులం
బేరగుమన్మథాబ్దమునఁ బ్రేమఁ బ్రబంధ మొనర్చి మీ కిటుల్
చేరికతో సమర్పణము చేసితి నీకృతి యాతమిస్రను

త్కైరవమిత్రతారకముగా భువిఁ జెల్వనుఁగాత శంకరా.

128


క.

తరుణారుణాంబుజోపమ, చరణాభయహరణసతతసంభృతహరిణా
శరణాగతశరణాచిర, కరుణాశశిభరణ పీఠికాపురశరణా.

129


ఉ.

భాసురమందహాసపరిపాలితదాసజగజ్జనావనా
భ్యాసనిరంకుశోన్మదగజాజినవాసమనోవికాసకై
లాసనివాస సంతతవిలాససుమేరుశరాసవాసవా
బ్జాసన వాసుదేసవినుతా సమదివ్యయశోవిభాసితా.

130


మాలినీ.

కలుషఘనసమీరా కామగర్వాపహారా, వివితగుణసారా వేదమార్గప్రచారా
బలుదహితదూరా పన్నగాధీశహారా, వలయితమునివారా నంచితాశేషశూరా.

131


గద్య.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురంధర కౌం
డిన్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్యపుత్ర బుధజనవిధేయ తిమ్మననామ
ధేయప్రణీతం బైనరుక్మిణీపరిణయం బనుశృంగారరసప్రబంధంబునందు సర్వం
బును బంచమాశ్వాసము.

  1. పా. మెలంగవలెఁ జుమ్మ పసిఁడిబొమ్మ