Jump to content

రామేశ్వరమాహాత్మ్యము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

రామేశ్వరమాహాత్మ్యము

పంచమాశ్వాసము



మద్భారద్వాజమ
హామునికులతిలక భీమయాగ్రతనూజ
క్షేమప్రదమల్లేశ్వర
స్వామీ గురుజానపల్లిసదనివిహారా.

1


వ.

అవధరింపుము శౌనకాదిమహర్షులకు సూతుం డి ట్లనియె.

2


క.

శ్రీవిశ్రుతరామేశ్వర
దేవునివిఖ్యాతకథను ధీజనులారా
వివరింతు వినుం డని
భావంబున గురునిఁ దలఁచి పలుక దొడంగెన్.

2


క.

సిరివిరిబోడికి నెళ వై
మరకతకురువిందవజ్రమయభవనం బై
నిరుపమవిభవం బై మణి
పుర మొప్పుం బాండ్యదేశభూషణ మగుచున్.

3


క.

పరబలహృన్నిజనాయక
సురక్షితం బగుచు గురువ సువ్రజవిద్యా

ధరవిబుధసురమణీభా
సుర మై మణిపురము దనరు సురపురముగతిన్.

5


సీ.

నిబిడవజ్రశిలావినిర్మితాభ్రంకష
        ప్రాకారవలయవిభ్రాజితంబు
సలలిప్రపూరసంక్షాళితాతలలోక
        గంభీరతరపరిఘాపయోధి
అనిమిషయువతిదివ్యవిమానమార్గాన
        రోధకృద్విధుకాంతసౌధరాజి
ఘనగోపురాగ్రసంఘటితహాటకకుంభ
        కలితహీరత్తారకాగణంబు


గీ.

పద్మరాగోపలాబద్ధభవ్యవేది
బహుళసౌభాగ్యశోభితపుణ్యవీథి
రతిమనోభవనిభసతిపతియుతంబు
మహికి నూపుర మనఁ బొల్చు మణిపురంబు.

6


సీ.

రంభోర్వశీముఖ్యరమణీవిలాసంబు
        లంగనారత్నంబులందుఁ గూర్చి
ఘనవైజయంతవిఖ్యాతసౌభాగ్యంబు
        ప్రాసాదపఙ్క్తుల పదిలపరచి
కమనీయసురదీర్ఘికాగభీరత్వంబు
        పరిఘాపయోరాశి దిరము చేసి
దివిషద్ద్రుమాణిక్యధేనుదానవినోద
        శైలి రాజులయందు సంగ్రహించి


గీ.

పద్మభవుఁ డమరావతీపట్టణంబు
సారము హరించి యమ్మహిదారపురము
కౌశలం బొప్ప నిర్మించెఁ గాక యున్న
కలదె తాదృక్ప్రసిద్ధపిశృంగారలక్ష్మి.

7

గీ.

దిటముగా నిందు సుడిగట్టుతియ్యనీటి
కడలినివ్వలనవ్వలఁగా నొనర్చి
నలువ తననేర్పు నెగడంగ నిలిపె ననఁగ
వీటఁ గోటయు పరిఘయు వినుతిఁ గాంచు.

8


గీ.

అరులు దిగులొందు తనపుత్త్రుఁ డైనరాజు
తమిని మిన్నంది చన నప్డు దాకుననుచు
నెట్టుకొని వార్ధి వెస కోట జుట్టుకొనియె
ననుచు జను లాడుకొన ఖేయ మమరుఁ బురిని.

9


గీ.

పురము నెంతెయు నొకశిరంబున వహించె
జిత్ర మని చిల్వఱేని దర్శించువాంఛ
నడఁగి పాతాళమున కేగె ననఁగఁ బురిని
బహుళగంభీరనీర మై పరిఘ దనరు.

10


మ.

జలఖేలత్ఫణికన్యకాకుచతటీసంఘట్టనోద్ధూతచం
చలకల్లోలవిధూతహాటకసరోజశ్రేణినిర్యద్రజః
కలితం బై విహరన్మరాళకులరంగత్కూజితోపేత మై
యలరుం దత్పురియందు ఖేయవలయం బంభోధిగంభీర మై.

11


గీ.

అతులకలధౌతరత్ననిర్మితము లగుచు
మిన్నొరయుచున్న యవ్వీటిమేడగములు
పద్మినీబాంధవునిఁ గ్రిందుపరచకున్నె
పూని మిత్రుం డని తలంచి మానెఁ గాక.

12


చ.

అనిశము దత్పురంబునను హాటకనిర్మితహర్మ్యసీమలం
దనుపమకామసంగరభరాలసనీలసరోజలోచనా
జలముల సేద దీర్చు సురశైవలినీకనకారవిందబృం
జనవపరాగంధసముదంచితమందమరుత్కిశోరముల్.

13


ఉ.

కూరిమిఁ గిన్నరు ల్సభలఁ గూడి వియజ్ఝరతీరకుంజముల్
చేరి యనూనగానములు సేయఁగ వీణలు మేళవించి త

ప్పౌరసువర్ణసౌధచరభామలముచ్చట లాలకించి వి
స్ఫారనిరోశముల్ మగుడి వైతుర వీణలమీద సిగ్గునన్.

13


గీ.

సౌధవీథులనడుజాడఁ జనుచుఁ జంద్రుఁ
డప్పురస్త్రీలనగుమోము లరసి చూచి
జాలములవెంట కరములు సాచిసాచి
బిసరుహాక్షుల లావణ్యభిక్ష వేడు.

14


క.

పురమరకతవరణశిఖో
త్కరరుచిత్పణ మనుచు మేయఁ గమకించు శా
కరమణి సౌధచ్ఛవిపు
ష్కరమని రవివారుల గ్రోలఁ జను నిజ మనుచుం.

15


క.

చాలంబొడవగునప్పురి
సాలము వీక్షించి దాటఁ జాలమటంచున్
జాలుకొని చుక్క లిది యను
కూలం బని యేగుఁ గోటగుమ్మముదారిన్.

16


గీ.

కావ్యపరిచితి లేనివాక్పతి కహీన
శాస్త్రనైపుణ్య మేరీతి సంభవించు
ననుచు జీవుని నిరసింతు రచటిభూసు
రేశ్వరు లచింత్యవిద్యాసమృద్ధివలన.

17


ఉ.

అర్కవిభుప్రతాపులు శరాసనవేదవిచక్షణు ల్సమి
త్కర్కశు లింద్రవజ్రదృఢకాయు లజేయపరాక్రము ల్శుభో
దర్కులు సాహసాంకులు మదాంధవిరోధిశిరోధిశాణసం
పర్కధగద్ధగచ్ఛితకృపాణులు తత్పురిరాజనందనుల్.

18


క.

భాసురజితశరభసమా
ఖ్యాసముపేతులము గాన నలకేసరిమౌ
కేసరి విక్రమమున నని`
రాసుతులు దరిర్తు రప్పురశ్రేష్ఠమునన్.

19

మ.

అలవీట న్నెలకొన్నవైశ్యు లురులాభాపేక్ష ద్వీపాంతరం
బులకుం బోయి సువస్తురత్ననికరంబుల్ నావలం దెచ్చుచోఁ
జెలువొప్ప న్వెలిదీవి కేగికొని లక్ష్మిం దెచ్చుటం జేసి వా
రలయిండ్లం గమలావధూటితన మై రాజిల్లు నెల్లప్పుడున్.

20


ఉ.

శ్రీయువతీపియాంఘ్రిసరసీజభవున్ జనరక్షణక్షమో
పాయవిచక్షణుల్ భువనపావనదేవనదీసహోదరుల్
న్యాయపథప్రవర్తనుల నారతభూసురసాదభక్తి శో
భాయుతు లుగ్రసత్త్వబలభద్రులు శూద్రులు బొల్తు రప్పురిన్.

21


క.

సుడివడ బెడిదపుపిడుగుల
నడరుచుఁ బెడచేత నడఁతు రలమృడుఁబుడమిం
బడవైచినకవ్వడివడి
కడజడ నని నగుదు రందుఁ గల వీరభటుల్.

22


మ.

కర మొప్పం బురి పద్మలోచనలు శంఖగ్రీవికల్ కుందబృం।
దరదల్ నీలకచావళుల్ మకరపత్రభ్రాజిగండస్థలుల్
వరమాలూరకుచల్ ముకుందపదభాస్వన్మధ్యమల్ దివ్యభా
స్వరశృంగారనిధుల్ దనర్తు రచట న్వారాంగనారత్నముల్.

23


చ.

మరునిమదంపుటేనుఁగులు మారునిపెంపుడిలేండ్లు శంబరా
సురరిపుగేళికీరములు సూనకదంబుఁడు బ్రోది సేయుజం
గరునునుబువ్వుదీవలు జగన్నుతయానకటాక్షమాధురీ
పరిచితభాషణాంగరుచిభాసిను లప్పురిలో విలాసినుల్.

24


వ.

అరయఁగ నారదభ్రమకరాలక లై శుకమోహనోక్తి బం
ధురత దనర్చి పర్వతమనోహరతుంగకుచావనమ్ర లై
పరగినవేశ్యలందు సిరి బర్వి యతిస్పృహణీయమూర్తు లై
కరము వసుంధర న్విమతిఁ గాంచుట చిత్రమె యెంచి చూచినన్.

25


సీ.

వనిత నీదండకై వలసివచ్చినవాఁడ
        విలు వెంత చెప్పిన వేగ నిత్తు

నిచ్చను విరిబంతు లిచ్చి మన్నింపుమీ
        ననవద్దు మాకు నోవనజగంధి
మగువరో కొసరక మాన మమ్మెదె నర
        య తనుసౌఖ్యవినోద మాచరించు
వదలక నే గొనవచ్చినప్పుడు నీవి
        విడిపోకయుండునే విద్రుమోషి


గీ.

యనుచుఁ దమతోడ నెరజాణతనము మీఱ
జాణశేఖరు లాడెడు సరసనర్మ
వచనరచనల కలరి భావజునితూఁపు
లమ్ముదురు పుష్పలావిక లప్పురమున.

26


గీ.

స్తబకముల బొల్చి విస్ఫురధ్వనులఁ బొసఁగి
భ్రమరివిలసితవృత్తసంపదల బొదలి
యతులమృదుకలికామంజులతలఁ దనరి
చాటుకృతు లట్ల వీటఁ బూఁదోట లమరు.

27


గీ.

వీట నీ టగుచున్నపూఁదోటలందుఁ
గ్రొవ్విరులతావి మిన్నందికొనఁగ నందుఁ
దిరుగుతెరగంటియన్ను లేతెంచి కాంచి
భళిభళీ యన నొప్పుచు నిలుతు రెపుడు.

28


మ.

కరి ము న్నొక్కటి పూజ సేయఁగ నుమాకాంతుండు దా మెచ్చి త
త్పరతం దారును మెప్పుఁ గాంతు మని శుంభత్పౌరకుంభీంద్రముల్
హరుమూర్త్యంతరమర్కుఁ డౌ టెఱిఁగి పూజార్ఖంబు హరషంబునం
గరము ల్సాచి పెకల్చు నిర్జరసరిత్కంజాతపుంజంబులన్.

29


మ.

నలు వొప్పన్ ద్విజరాజు గావు నను దా నందియ్య నోషట్పదీ
కలితాకాశతరంగిణీజజశంకం బట్టి తియ్యంగ నో
విలసత్పట్టణగంధసింధురపతు ల్వేమారు నేణాంకమం
డలపర్యంతము జాచు హస్తములు క్రీడాలంపటత్వంబునన్.

30

చ.

అలపురరాజబృందముల కప్పవమానుఁ డమిత్రవృత్తు లై
బలసినవారివాహములఁ బాయఁగఁ దోలఁగ నేర్పి తా తదు
జ్వలజవవిద్య నేర్చుకొని సక్తిని సంతత మభ్యసింపుచున్
బలిమిఁ జరించ నాతనికి భవ్యసదాగతి సంజ్ఞ వర్తిలున్.

31


మ.

హరిణోత్కృష్టగతిప్రభ న్వెలసి రాజాంచజ్జయశ్రీపద
స్పురదాత్మీయసులక్షణంబులు బురుస్తోమంబు లగ్గించి చూ
డ రహిన్ సింధువునందు దేవమణితోడం బుట్టి యుచ్చైశ్రవ
స్తురగశ్రేష్ఠముకన్నఁ బెద్దలవలెన్ శోభిల్లుఁ బౌరాశ్వముల్.

32


ఉ.

ఏదెసఁ జూచినన్ గజము లేదెసఁ జూచిన వాజిమండలం
బేదెసఁ జూచినన్ రథము లేదెసఁ జూచిన సైనికవ్రజం
బేదెసఁ జూచినన్ రుచిరహేమధరాధరసార్వభౌమదా|
యాదము లట్ల శోభిలు మహార్హహిరణ్మయరాసు లప్పురిన్.

33


చ.

చిలువలు గట్టు హారములు దక్కఁగ వైచి మెఱుంగుమేనులం
గలపముఁ బూసి వాసనలు గ్రమ్ముసరుల్ సవరించి కస్తురిం
దిలకము దిద్ది యొద్దికల నెచ్చెలులం జత గూడి వేడ్క వే
శ్యలసొగసుల్ గణింపు చనయంబు విటు ల్విహరింతు రప్పురిన్.

34


చ.

మలయసమీరుఁ డన్నగరి మాపటివేళ విలాసదీర్ఘికా
జలముల నీదులాడి వికసన్నవపుష్పలతాంగనాళికిన్
మెలకువనట్టువల్ గరపి మేలుగ వచ్చి శ్రమంబుఁ దీర్చఁగాఁ
బలుమరు నివ్వటిల్లు నల పౌరులకున్ సురతప్రసంగముల్.

35


వ.

మఱియు నప్పురంబు కప్పురంబువోలె సదా మోదజనకం బై, యు
ద్యానంబువోలె సుమనోమనోహరం బై, త్రిదివంబుఁబోలె సౌధో
త్కర్షవిశ్రుతం బై, కాసారంబువోలెఁ బద్మాకరం బై, రఘువంశంబు
వోలె రామాలంకృతం బయి, సముద్రంబువోలె వాహినీసంకులం
బయి, నృపసైన్యంబువోలె బహుళధార్మికం బై, రామాయణంబు
వోలె శోధనకాండం బయి, మహాప్రసాదంబువోలె బహువసుసం

పూర్ణం బయి, భారతంబువోలె సుశ్లోకం బయి, కుబేరదిగ్భాగంబు
వోలె సార్వభౌమనివాసం బయి, శంకరశరీరంబువోలె సర్వమం
గళాధారం బయి, ద్వారకాపురంబువోలె నచ్యుతాగ్రజసత్త్వ
కలితం బయి, వైకుంఠంబువోలెఁ బురుషోత్తమశోభితం బయి, శర
త్కాలంబువోలెఁ బ్రసన్నరాజరుచిరం బయి, సువర్ణతైలంబువో
లె లోకాద్యుషితం బయి, అంతరిక్షంబువోలె ననంతరత్నప్రభాం
చితం బయి, సత్కావ్యంబువోలె నలంకారప్రచురం బయి, పూర్ణి
మాచంద్రమండలంబువోలెఁ గళానిధి యయి, యొప్పు నప్పట్టణం
బున కధీశ్వరుండు.

36


సీ.

తనమహావిమలచిత్తము పార్వతీమనో
        హరునకుఁ గేళిమందిరము గాఁగఁ
దనధర్మమార్గవర్తనచరిత్రము క్షత్ర,
        జాతి కమూల్యభూషణము గాఁగఁ
దనఘనాద్భుతనిరంతరదానవిభవంబు
        కల్పభూజాదులగణన మాన్పఁ
దననితాంతసమృద్ధధనవిజృంభిత మైన
        సిరి కుబేరునకైన సి గ్గొనర్పఁ


గీ.

దనయశంబు దిగంతదంతావళీంద్ర
దంతకాంతుల నధికసాంద్రత ఘటింప
నమరు నిత్యప్రతాపనిరస్తకోటి
తరణివిభుఁ డైనశంకరధరణివిభుఁడు.

37


మ.

దిగిభశ్రేణి దశావశత్వమున వర్తించె న్మహాశేషప
న్నగుఁ డిచ్చం దిరిగెం గులాద్రు లల మైనాకుం గనంబోయె నొ
ప్పుగ శ్రీదేవినిఁ గౌఁగిలించెఁ గుహనాపోత్రీశ్వరుం డాదటన్
జగతీభారము శంకరుం డురుభుజస్తంభంబునం దాల్చుటన్.

38

సీ.

రాజమౌళి యనంగఁ బ్రఖ్యాతిచే మించి
        జితకాముఁ డనఁగఁ బ్రసిద్ధిఁ జెంది
సర్వజ్ఞుఁ డితఁ డనఁ జాలగౌరవ మంది
        సంతతంబును శివాశ్రయతఁ దనరి
అహితపురచ్ఛేదనాసక్తి విలసిల్లి
        భూతదయాళుఁ డై పొగడు గాంచి
అక్షయతూణీరుఁ డై యాజి జయ మొంది
        లోకపాలశ్రేణిలోన హెచ్చి


గీ.

సామజాంతకవిక్రమశాలి యగుచు
భూతి నలరారు నమ్మహాపుణ్యమూర్తి
శంకరాహ్వయుఁ డగుట కాశ్చర్య మేల
నతనిఁ దలఁచినఁ బ్రజకు సౌఖ్యంబు గలుగు.

39


క.

కురథుఁడు విషమేక్షణుఁ డ
ధ్వరహరుఁ డుగ్రుండు గాని ధన్యుం డాశం
కరుఁ డైశ్వర్యము శోభిలఁ
బరగెన్ భువి వెలితి లేని పౌరుషమహిమన్.

40


ఉ.

మానుగఁ దియ్యవిల్లు విరిమచ్చికనారియుఁ దావితూఁపులుం
బూనినవాఁ డతండు మఱి పూననివాఁ డితఁ డింతమాత్రమే
కాని మ ఱెద్దియుం గొఱఁత గాదు మనోభవశంకరక్షమా
జానులకున్ జగత్రితయసన్నుతరూపవిలాససంపదన్.

41


చ.

ఇలపయి శంకరక్షితితలేంద్రుఁడు కల్పతరుత్రపాకరో
జ్వలదురుదానశీలత నజస్రము శోభిలుచుండఁ బైఁడిగు
బ్బలి వెరచున్ ధనార్థులకుఁ బంచి యిడుందను నంచు దేవతా
నిలయము గాన మాను నని నిర్భయవృత్తి వహించు వెండియున్.

42


ఉ.

వేమరుఁ బుణ్యకాలముల వేడుక శంకరరాజు ప్రాజ్ఞుఁ డై
హేమమయాంబరంబులు మహేశుగురించి మహీసుపర్వసు

త్రాముల కిచ్చుచుండఁగ నుదంచితవస్త్రసమృద్ధశాలి యై
కామవిరోధి మాన్చెఁ జిరకాలికనైజదిగంబరత్వమున్.

43


చ.

అనిమొన వైరిరాజులు భయానకభూరితరానకధ్వనుల్
విని పరువెత్తి యెత్తి యట వీవధకంటకకుంఠితాంఘ్రు లై
పనిచెడి ఖిన్ను లై పతగభావము భావములందుఁ గోరుచున్
వనరుహసంభవుం బరుషవాక్కుల నింద యొనర్తు రెంతయున్.

44


గీ.

అనృతవాదియుఁ బాపచింతానిలుండుఁ
బరధనాపేక్షియును నెవ్వఁబడినవాఁడు
రోగియును నెందు లే డొకరుండుఁ దలఁప
శంకరుం డేలునిఖిలరాజ్యంబునందు.

45


గీ.

గోవు లెల్లప్పుడును బాలు గురియుచుండుఁ
బుష్పఫలసంపదల నొప్పు భూరుహములు
బహుళసస్యంబు ముక్కారు బండుచుండు
నతఁడు బాలింప ధాత్రి బుణ్యంబుకలిమి.

46


క.

పానీయశాలికలు ను
ద్యానంబులు సలిలపూరితము లగుచెరువుల్
నానామణిమయదేవ
స్థానము లానృపుఁడు నిలిపె ధరఁ దగునెడలన్.

47


చ.

ఫలఘృతశాకపంచవిధభక్ష్యసశర్కరపాయసాంచితో
జ్వలకలమాన్నదానమయసత్రసహస్రము లెల్లచోటుల
న్వలను దలిర్ఫ నిల్పి హిమవన్మలయాచలమధ్యతీరముల్
లలి భజియింప నేగుద్విజులం దనుపు న్నృపశంకరుం డొగిన్.

48


మ.

చతురంబోధిపరీతభూతలపతు ల్సమ్యక్ప్రకారంబునన్
నుతిభద్రేభతురంగహేమమణిసందోహంబు లర్పించి యా
నతు లై కొల్వఁగ నేకహేళిని మహానందంబుతో శంకర
క్షితిపాలుండు ధరిత్రి యేలె విలసత్కీర్తిం బ్రతాపోన్నతిన్.

49

క.

ఈవస్తు విపుడు తనకుం
గావలె ని మ్మనుచు నొరునిఁ గని వేఁడెడువాఁ
డేవంక లేఁడు శంకర
భూవరురాజ్యమునఁ బ్రజలు బొరిసిరిఁ గనుటన్.

50


గీ.

ఆనృపాలుఁడు గావించునధ్వరముల
నిజహవిర్భాగభోగసంతృప్తు లగుచు
మనుగుడుపుపెండ్లికొడుకులమాడ్కిఁ బుషిత
గాత్రు లై రింద్రుఁడాదిగాఁ గలుగుసురలు.

51


క.

దనుజుల హరివలె శాత్రవ
మనుజేంద్రుల గెలిచి విజయమహనీయుం డై
ఘనభూచక్రము దాల్చెను
తనసిరి బుధనుతము గానతండతులధృతిన్.

52


క.

కావలసినయప్పుడ యా
భూవరపుంగవునిరాష్ట్రములఁ బర్జన్యుం
డావిర్భవ మొంది సుభి
క్షావహముగ వాన గురియు నంచితవృత్తిన్.

53


క.

నగరంబులు రాష్ట్రంబులు
నగణితధనధాన్యయుతము లై యభయము లై
నెగడఁగఁ బ్రముదితమానసు
లగుమనుజుల్ దన్ను బొగడ నానృపుఁ డలరెన్.

54


వ.

మఱియు నప్పుడమిఱేఁడు మూడుగన్నులవేల్పుం బ్రోడతోడం
గూడి పోరాడి యోడించి మించిన క్రీడియుం దమకు నీడు గా డని
వాడి మెరసి పలుకు విలుకాండ్రు దన్ను గొలువ బలువడిం బరిఢవిల్లి
యెల్లకడలు గెలిచి కొలిచి నిలిచిన రాచపట్టిం జేపట్టి మట్టుబరచి బెట్టి
దం బగుకినుకం గనుపట్టి యని యొనరించిన ఱేనిం దునిమి యెనిమిది
కడలు గడలుకొనునెలుంగుల బలుకంబంబుల గెలుపువ్రాలు వ్రా

యించి జింక నెక్కు నెక్కటితో మిక్కుటంబుగా వెకసక్కెం
బు లాడు వడిగలమేలుజక్కి పౌజులడెక్కలతెరవునం గ్రమ్మి ముమ్మ
రంబుగా నెగయునెలదుమ్ముకడలుంజడి యడుసు కొలుప దాడి యా
డి పుడమిచేడియకుఁ దాన యొడయం డై యడిగెడువారికోరిక కెక్కు
డుగా విడిముడి యిడుచుం గడుంబొడ వగుపొగడుఁ గాంచి పుడుకు
దొడుకుం దెగడి నెగడి కడలిరాయని నడుగుపరచి బుడుతనెలదారిం
గేరి పెట్టుచెట్టుచట్టుల రట్టుపాలు జేసి పాసిం బేర్చి నేర్చినవాఁ డై
జన్మంబు లెన్నేనియు నొనర్చి వెన్నుండు మొదలగు జన్నంపుతిండి
పిండులకుఁ బండుగ జేయుచు నక్కజం బగుచక్కదనంబునం జు
క్కలఱేనికిం జక్కెరవిలుకానికి నెక్కువ యై పక్కిజక్కిరాహత్తు
పెక్కురక్కసులం జక్కాడుకిరణి వెక్కసపుటక్కరుల నుక్క
డంచి ప్రజలయెడ నిక్కువంపుమక్కువ నెరపుచు మిక్కిలివన్నె కె
క్కి ముక్కంటిమెడకుం దొడ వగుపడగదారివడువున నుడువ వలం
తి యై తనయాన పూని కానినడకలు మాని మానికంబులు కానుక లొ
సంగి దొరలందరు శరణని మ్రొక్కుచుం గొలువ విలువలేనికలిమి
యుం బలిమియుం నెలకొని తనయందు నింపొంద చందమామచందం
బున నందఱికి విం దై యెందునుం గొఱంత లేక చెందొవవిందుతాల్ప
రియడుగుకెందమ్మిదోయి డెందంబునం బొందుపరచి హత్తుకొన్నబ
త్తిం బుత్తడివిరులగుత్తులుం దామరపువ్వుమొత్తంబు లిడి కొల్చుచు
నెత్తమ్మివిడిదిపడంతుకం దనవెడందరొమ్మున నిమ్ముగా నిడుకొన్న
క్రొన్ననవిలుకానితండ్రియుఁబోలె సిరుల నిరవొందుచు నొయ్య
న నయ్యెకిమీడు జగం బేలుచుండె నంత.

55


ఉ.

కోకిలపంచమస్వరివిఘూర్ణితకర్ణవధూవియోగిహృ
ద్భీకరపుష్పగుచ్ఛమధుబిందుఝరీవిచరన్మధువ్రతా
స్తోకసుఝంక్రియానినదశోభితసర్వజనోత్సవప్రద
శ్రీకలితంబు వొల్చె వనసీమలయందు వసంత మెంతయున్.

56

గీ.

జైత్రయాత్రోద్యతానంగసార్వభౌమ
సచివకృతరక్తరాంకవచటులపటకు
టీరము లనంగ వనుల నింపారె బాల
పల్లవాంచితభూరుహప్రతతు లపుడు.

57


క.

అవనీచ్యుతపత్రము లై
నవపల్లవలక్ష్మిచేఁ గనందగె మహిరు
ణ్ణివహములు లేమి దొలఁగిన
భువిలో సిరిచేత వెలయుపురుషులకరణిన్.

58


క.

శుకచంచూపుటనిభకిం
శుకముకుళవ్రజము లపుడు చూడఁగ నొప్పెన్
మకరధ్వజతేజోగ్ని
ప్రకటప్రభ లచటనచటఁ బర్వె ననంగన్.

59


గీ.

కలితదక్షిణదిగ్వధూగర్భమున జ
నించిన సమీరశిశువు మన్నించి లతలు
చిగురుటుయ్యెల నుంచి పోషింపఁ బెరిగె
భీతి విరహుల కాత్మలోఁ బెరుగుచుండ.

60


సీ.

సహకారమంజరీసౌరభ్యవిభవంబు
        మాధివీమంటపమండితంబు
వ్యాకోచకేసరవాసనానిలయంబు
        మల్లికాస్ఫుటదినాంతోల్లసితము
మలయమారుతపోతమానితభువనంబు
        స్మరశరోల్లేహనసాధనంబు
డోలికాకేళీవిలోలబాలారత్న
        మఖిలర్తుగణమస్తకాభరణము


గీ.

కేళి వనవాసికాతీరఖేలనార్హ
మంజుకుంజగృహాంతరమదనకదన

పరవశాక్షీణసుఖవధూవరవిహార
కాంత మగుచు వసంతంబు ఘనతఁ జూపె.

61


గీ.

సామవేదంబుఁ జదువుచు సాధువృత్తి
మాధవస్తుతిఁ గావించు మౌనులేమొ
పికము లటు గానిచో సంప్రియము లగుచు
సద్విజఖ్యాతిచే నెట్లు సంచరించు.

62


చ.

ప్రమదము నంబికాంగనలు పాటలు పాడ మరుల్లసల్లతా
ప్రమదలు లాస్యము ల్సలుప భవ్యవనీవనితావివాహసం
భ్రమసమయబునం దలరి మాధవుఁ డో యన మాధవుండు ఠీ
వి మెరయ సత్ఫలంబులు సువిప్రకారంబుల కిచ్చె హెచ్చుగన్.

63


సీ.

పృథులపల్లవితపుష్పితఫలితోర్వీజ
        రాజరాజితవనభ్రాజితంబు
ప్రసవాసవానూనపానమాద్యద్భృంగ
        సంఘఝంఝక్రియాసంక్రమంబు
సహకారభూమిహాంచలఫలాస్వాదనా
        పేక్షాతిశయచలత్పక్షికులము
ఘనసమ్మదాకులకలకంఠకులకంఠ
        కాకలీకలకలోత్కంఠితంబు


గీ.

కుసుమమంజులపంజులకుంజపుంజ
మదనకదనపరిశ్రాంతమతపతిలక
ఫాలభవనారికణహారిబాలపవన
మగుచు నింపొందెఁ జైత్రసమాగమంబు.

64


సీ.

తతము లై విభ్రమాంచితము లై మధుపాన
        మదమున మిక్కిలి బొదలి రొదలు
గదుర నింపుల నింపు కొదమతుమ్మెదలచేఁ
        దనరుచు ఘనరుచు లొనర గొరల

గురులతాగృహముల విరులతావులపాను
        పులయందుఁ బతులతోఁ గలసి యతుల
రతుల డస్సినమదవతులచక్కనిచెక్కు
        లను గ్రమ్ముజెమట లింపున హరించు


గీ.

కమ్మశిసుదుమ్ములరజమ్ము గ్రుమ్మరించి
వలపు మొలపించి చలువయు మొలవఁజేసి
యలయిక లణంచి మెల్లగ మెలఁగి చెలఁగి
తెమ్మెరలు మధువేళ వనమ్ములందు.

65


వ.

ఇవ్విధంబున మవ్వం బై నివ్వటిల్లు నవ్వసంతసమయంబున నవ్వసు
మతీశ్వరుం డొక్కనాడు మంజులసాలభంజికాశుంభన్మరకతస్తం
భసంభారంబును నత్యుత్తమచంద్రకాంతభిత్తివిరాజమానంబును
వజ్రకీలితలాలితద్వారచారుతరంబును నభినవస్ఫటికరత్ననిర్మిత
సోపానశ్రేణీరమణీయంబును పురుహూతనీలనిర్మితవాతాయన
స్ఫీతంబును పద్మరాగమణికుట్టిమంబును మృదులభాసురకౌస్తు
భాస్తరణసమంచితంబును నృపోపాయనద్విరదమదజలపంకిలాం
గణంబును అసాధారణసౌభాగ్యసాకల్యకళ్యాణంబును విచిత్ర
విభవశేషవిలసితంబును నగు సభాభవనంబున నవరత్నమయసింహాస
నంబున నాసీనుం డై కాంతకాంతాకరతులస్ఫురన్మణీదండమం
డితచారుచామరమరుద్వీజ్యమానుం డగుచు వైదికమీమాంసకశాబ్ది
కనైయాయికవైశేషికాలంకారికజ్యోతిషకపౌరాణికసుకవీ
శ్వరమంత్రిసామంతపురోహితగాయకవిదూషకవైణిక
వాంశికమౌరటీకవందిమాగధవైతాళికనర్తకసైనికవ్యావహారిక
వారాంగనాదిజనులు యథాస్థానంబుల నుండి యుచితగతులం గొ
లువ కలువకుం జిలువదొరకైనం బలుకనలవిగాని చెలువంబునం గొలు
వు కలువరాయని పొడుపుతరిం బొలుపగు చెంగల్వుకొలనువోలె
నిండుకొని కన్నులపండువ యై సొంపు సంపాదింప వేదంబులు చ

ర్చింపుచు శాస్త్రవాదంబులు పరీక్షింపుచు పురాణేతిహాసకథ లి
చ్చగింపును చంపూనాటకోదాహరణాదిచాటుప్రబంధంబు లా
లోచింపుచు సంగీతమాధుర్యరసప్రవాహంబులం దేలుచు నృత్యగీ
తిప్రకారంబులు విలోకించి మెచ్చుచు ప్రణతనరపాలులం గృపా
శీతలకటాక్షవీక్షణంబులఁ జూచుచు సకలవిద్యాప్రసంగగోష్ఠీవి
నోదంబుల నుల్లసిల్లుచు శంకరమహీవల్లభశేఖరుండు పేరోలగం
బున్నసమయంబున.

66


సీ.

శార్డూలనఖములు చమరవాలంబులు
        గోరోచనంబును జారపప్పు
సెలవిండ్లు పీలిపువ్వులఝల్లులును జున్ను
        జవ్వాదిపిల్లులు శారికలును
కస్తూరిమృగములు కరటిదంతములును
        నెరవైన డేగలు నెమ్మిపురులు
వేణుముక్తాఫలశ్రేణులు పునుఁగును
        కలితకాలాగరుఖండతతులు


గీ.

మఱియు నరపులు గలుగు సమస్తశస్త
వస్తువులు కాన్క లిచ్చి యవ్వసుమతీశ
సింహు నొయ్యనఁ బొడగాంచి చెంచుదొరలు
ముదము గదురంగ నట సాగి మ్రొక్కి రపుడు.

67


ఆ.

మ్రొక్కి లేచి కేలుమోడ్పు నెన్నొసల ఘ
టించి పలికి రిట్లు చెంచుదొరలు
సామి చిత్తగించు చక్కగా మాసేయు
విన్నపంబు తప్పు లెన్న కీవు.

68


క.

నిసుగులు మేమును నీదయ
ససి జొప్పడ నడవిఁ గడుపుచల్ల గదల కె

ద్దెసఁ బ్రొద్దు వొడుచుటెఱుఁగక
యొసపరిగీముల సుకించియుంటిమి సామీ.

69


క.

నీ వేలిక లెంకల మై
కావలసినపనులు సేయఁగాఁ జాలుదు మో
దేవా నీయడుగులు గనఁ
గా వేడుక వొడమి వచ్చి కంటిమి నెమ్మిన్.

70


క.

మాసత్తువ మావడి మా
చేసూటియు మాకడిందిసిరి వేటకు వి
చ్చేసి కనుంగొని వన్నెయు
వాసియు మా కబ్బఁజేయవలదే నీకున్.

71


క.

కానల మెకాలుకన్నులఁ
గానవు కడుఁ బోతరించి కావర మనఁ గా
లూనవు రంకెలు వేయుచు
మానుగఁ బొద లీగుఁ బంటమానులు చెలుపున్.

72


క.

కడువాడికోర లొరపులఁ
బొడి యై దట్టంపుటిసుకపోలిక రాలన్
గడుసుపడి యొక టొకటితో
బడిబడి పోరాడుఁ గ్రొవ్వి పందులు కినుకన్.

73


క.

ఎల్లెడఁ జూచిన తారై
పెల్లుగ నఱ్ఱాడుమన్ను బిల్లులు డొంకల్
కే ళ్ళురుకుచు రొద సేయుచుఁ
ద్రుళ్ళుచుఁ ద్రెళ్ళుచును లేచి దుముకుచు నచటన్.

74


ఆ.

మబ్బురొదలకంటె నిబ్బడి గొనుచు నా
గుబ్బతిల్ల నరిది బొబ్బ లిడుచు
సింగములు చెలంగి చంగున నురికి యే
నుంగుమొత్తముల నణంగి త్రుంచు.

75

వ.

అనిమఱియు నన్యవన్యమృగమదోద్రిక్తవ్యాపారంబు లుగ్గడించి
అదకుం బద నై యున్న దిప్పుడు వేటకు విచ్చేయందగునని చెంచులు
విన్నవించిన నాకర్ణించి దుష్టమృగనిగ్రహంబు కర్తవ్యం బని నిశ్చ
యించి శంకరమహీపాలుండు ధనురస్త్రశస్త్రప్రవీణు లగుమృ
గయుల వేటకు రమ్మని చాటంబంచి యారాత్రి గడిపి ప్రభాతంబు
నం గాలోచితకరణీయంబులు నిర్వర్తించి రక్తోష్ణీషపరిచ్ఛదుఁడు
ను దిద్దగోధాంగుళిత్రాణుండును మహాకోదండపాణియు కచ్ఛా
బద్దమండలాగ్రుండును మృగయావిహారసముచితవేషధారియుం
బాదుకాగూఢచరణకమలుండును సన్నద్ధుండు నై.

76


ఉ.

మానసవైనతేయపవమానసమానసముజ్వలద్రయ
శ్రీనిలయంబు శారదశశిప్రతిభాదవిభాంచితంబు నౌ
మానితవాజి నెక్కి రిపుమర్దనుఁ డానృపమౌళి విక్రమా
నూనమహాపదాతిమృగయుల్ దను గొల్వఁగ నేగె వేటకున్.

77


సీ.

వెంట మాణిక్యంబు విశ్వాసి జందిడు
        పాలసంద్రంబు తుపాకిగుండు
భైరవి జోళంగి బలుబంతి జవ్వాది
        వియ్యాలదాడి వివేకి జోగి
యురిగోల వలిచీమ గరుడ పైఁడిసలాక
        భూతనాథుఁడు కూన బొడ్డుకంట
నీలమేఘము పైఁడినిగ్గు జేవురుగొండ
        రాముబాణంబు వారణము సురటి


గీ.

పుణ్యతీర్థము చేమంతి పోతురాజు
సాళువము నాగ బేర్వడ్డ జాగిలములు
సరభణులఁ బట్టికొని తెచ్చి సాగి నడచి
రవనిపతిమ్రోల మృగయు లయ్యవసరమున.

78


తరళ.

వలలు బోనులుచిక్కముల్ పెనువాతికత్తులు బల్లెముల్

బలుతుపాకులు వాగురుల్ మిడిబద్ద లీటెలు దీము లం
బులపొదుల్ తడవిళ్ళు నారసముల్ గుదె ల్గొని వేటకాం
డ్రెలమిఁ గొల్వఁగ వచ్చె భూమిత-లేంద్రుఁ డున్నతి మీఱఁగన్.

79


మ.

అవనీశుం డనుయాయిసైనికసువీరాలాపవార్తాశ్రుతి
ప్రవణుం డై చని కాంచె దుర్మదనదద్భల్లూకవ్యాళోగ్రశ
ల్యవరాహద్విపఖడ్గసింహశరభవ్యాఘ్రాదినానామృగో
గ్రవిహారాకులభీకరం బగుమహారణ్యంబు దౌదవ్వులన్.

80


వ.

వెండియు మందారమాకందమాలూరమాతులుంగమధూకమాధవీ
మాలతీమల్లికాసాలతమాలకృతమాలభూర్జరఖర్జూరసర్జకార్జునహారీ
తకిక్రముకామలకమాగధసింధువాదబదరికాకేసరకురువకకురంట
కాదిపాదపవిటపాగ్రనిరర్గళవిహరమాణకీరశారికాకోకిలపారా
వతప్రముఖనిఖిలశకునినికరనినాదపూరితంబును పథికజనశ్రవణ
రంధనీరంధ్రమహోత్సవసంపాదనచతురసదాగతిపూరితకీచ
కధ్వానసంగతనిర్ఝరిణీసంజనితకమలఖేలద్రోలంబగానమృదుల
నిస్వనభాసురంబును సహస్రకిరణపరంపరాదురవగాహంబును
నగు నరణ్యంబు దరిసి మృగంబులు సంచరించితావుల రసిములు
తారు వేయించి పొంగు వారించి వలలు బరపించి తెర లెత్తించి బో
ను లొడ్డించి దీములు ఘటించి తెరవు లరికట్టించి వాకలు వంపిం
చి మచ్చుమందులు చల్లించి వాకట్టు కట్టించి.

81


శా.

శాపం బెక్కిడి యర్గళోపమభుజాసారం బెలర్పన్ మహా
కూపారధ్వని ధిక్కరించు గుణనిర్ఘోషంబు గావించి యా
టోపం బొప్ప మృగంబు లుర్విఁ బడ నైష్ఠుర్యంబుగా నేసె నా
భూపాలేంద్రుడు చండకాండచయముల్ పుంఖానుపుంఖంబుగాన్.

82


క.

నరపతి యీగతి నిష్ఠుర
శరములు బరపుటయు నచలసాధ్వసపరతన్
గిరికరికేసరికాసర

తరక్షుముఖమృగము లరచి ధరణిం ద్రెళ్ళెన్.

83


గీ.

ధరణినాథపృషత్కనిర్దళితమృగని
కాయఘనకాయగళితరక్తప్రవాహ
చయము బ్రవహించె గైరికశైలసాను
భాగసంజాతనిర్ఝరపఙ్క్తిపగిది.

84


క.

ఆనరనాథునియానతిఁ
బూని భటుల్ చెంచుదొరలు బొరిగుహలఁ బ్రతి
ధ్వానము లీనఁగ నార్చుచు
మానితశునకముల నే ర్పమర విడిచి రొగిన్.

85


ఆ.

అవియు రూపవీర్యజవసత్త్వముల సింహ
శాబకములఁ బోలఁజాలుఁ గాన
నుగ్రమృగసమూహనిగ్రహం బొనరించె
నతులనఖరదంష్ట్రికాయుధముల.

86


ఉ.

అంతట వారలున్ మృగపదాండము వెంబడి నేగి కుంజపుం
జాంతరసీమఁ బొంచినమృగావళిఁ ద్రంచియు రజ్జుజాలసం
క్రాంతినిలోగి చిక్కిన మెకాల వధించియు దీము లొడ్డ వి
భ్రాంతి వహించి కేళ్ళురుకువానిని కూల్చియుఁ బెక్కుభంగులన్.

87


వ.

ఇవ్విధంబున నాఖేటచాతుర్యపాటవనిరాఘాటచటులాటవి
కవీరభటశ్రేష్ఠులు గరిష్ఠవిక్రమాకుంఠమృగయావినోదాయత్తచి
త్తు లై మత్తేభంబులఁ ద్రుంచియు లులాయంబుల మాయించియు
శార్దూలంబుల మర్దించియు గండకంబుల ఖండించియు శరభంబు
లం బరిమార్చియు శల్యంబులం ద్రెళ్ళించియు నన్యవన్యమృగ
నికరంబులం దెగటార్చియు తెరవేట గంటవేట మొదలయయిన వేట
లన్నియు ఘటియించియు తనడెందంబున కానందంబు సంపాదిం
పుచుఁ దోడం జనుదేర మఱియు నాధరణీశ్వరుండు ధనుర్ధరుం
డై కాంతారంబులం బర్వతంబులం గుహాంతరంబులం దగినయెడల

మృగంబుల నన్వేషింపుచు గిరిశిఖరనిర్గతనిర్ఝరిణీసంజనితకంజా
తపుంజమంజులపరాగభరితసౌరభ్యధురంధరగంధవాహకిశోర
ప్రసారమహితభారనిరస్తాయానుం డగుచుఁ జని చని యొక్కవిపి
నోద్దేశంబున.

88


గీ.

గిరిగుహామధ్యవాసునిఁ బరమశాంతు
వ్యాఘ్రచర్మావృతాంగు దయాంతరంగు
మౌని నొక్కని వ్యాఘ్రమన్ మతినిఁ దునిమె
మనుజనాయకుఁ డొకతీవ్రమార్గణమున.

89


గీ.

శంకరనృపప్రయుక్త మాసాయకంబు
శీఘ్రగతితోడ వచ్చి యాచెంత నున్న
యమ్మునీంద్రునిపత్ని మహాపతివ్ర
తాళిరోమణి దెగటార్చె దైవగతిని.

90


వ.

ఇట్లు శంకరనృపాలప్రయుక్తబాణనిహితు లైనజననీజనకుల జూచి
తత్సుతుండు జాంగలుం డనువాఁ డప్పుడు భృశదుఃఖితుం డగుచు
నెలుంగెత్తి రోదనంబు సేయుచు ని ట్లని విలపించె.

91


సీ.

ఓ తాత యోమాత యోదయాంబుధులార
        యిటు నన్ను విడిచి మీ రెచటి కిప్పు
డేగితి రెచ్చోటి కేగుదు నేను నా
        కెవ్వాఁడు రక్షకుఁ డెన్ని చూడఁ
జదివించు నన్ను బ్రాఁజదువు లెవ్వాఁ డింక
        పటుశాస్త్రములు పఠింపంగఁజేయు
నెవ్వఁ డాచారంబు లెల్ల శిక్షించు నో
        తండ్రి నీ విట్లు దుర్దశ వహింప


గీ.

అమ్మరో నాకు భోజనం బర్థితో నొ
సంగు నెవ్వతె యుపదంశసంగతముగ

జనని యెవ్వతె యిఁక బాల్యచాపలమునఁ
బోరు పెట్టెడిననుఁ జేరి బుజ్జగించు.

92


గీ.

జీర్ణపర్ణంబు పారణశిథిలతనుల
నిరపరాధుల దృఢతపోనిష్ఠ గలుగు
వారి మిముల నిపుడు నిష్కారణంబ
చంపె నెవ్వఁడు దారుణసాయకముల.

93


వ.

అని పెక్కుభంగుల నమ్మునికుమారుండు పెద్దయెలంగెత్తి రోద
నంబు సేయుచుండె నంతం దత్ప్రలపితం బాలకించి శంకరభూపా
లుండు శబ్దంబున కభిముఖుం డై చని గుహాద్వారంబుఁ జేర నచ్చటి
మునులందఱు కయ్యాక్రందనంబు విని తదాశ్రమంబునకు సత్వరం
బుగా వచ్చి శరనిహతు లైన మునిదంపతులం గాంచి ధనుర్ధరుం డగు
రాజును విలోకించి విలపించుచున్న మునిపుత్త్రునిం గని భృశవి
హ్వలు లై భీతిచేతస్కుం డైనమునిపుత్రు నాశ్వాసింపుచు ని ట్లనిరి.

94


క.

ధనియెడ నిస్వునియెడ న
జ్ఞునియెడఁ బండితునియెడఁ గృశునియెడలం దీ
మునియెడల నైన నంతకుఁ
డనఘా సమవర్తి సంశయము లేదు సుమీ.

95


క.

వనమున నభమున గ్రామం
బున నగమున నెట్టిదేశమున నెచ్చట నుం
డినఁ గాని యమునివశతం
జనవలయు న్సకలజంతుసంతతి కనఘా.

96


గీ.

బాలకులు వృద్ధు లగువారు బహ్మచారు
లరయ గృహమేధులుని విపినాలయులును
యతులును శరీరములు విడనాడి యముని
వీఁడు జొత్తురు కాలంబు గూడె నేని.

97


క.

విప్రులు క్షత్రియులును వై
శ్యప్రవరులు శూద్రు లితరిసంకరజాతుల్

విప్రకుమారక యమలో
కప్రాప్తికి నేగవలయుఁ గాలవశమునన్.

98


మ.

సురలు న్సిద్ధులు సాధ్యులు న్మునులు యక్షుల్ నాగగంధర్వకిం
పురుషుల్ దైత్యులు మర్త్యు లన్యులు జగత్పూజ్యాత్ము లై యొప్పువా
క్తరుణీనాథముకుందచంద్రధరులుం గాలక్రమప్రక్రియన్
విరతిం బొందెద రందఱున్ గుణనిధీ నీ కేల శోకింపఁగన్.

99


గీ.

అద్వయము సచ్చిదానంద మప్రతర్క్య
ముపనిషద్గత మగుబ్రహ్మ మొకటి సూవె
చెడదు పుట్టదు పెరుగదు జీర్ణభావ
మందదు స్వయంప్రకాశ మై యమరుచుండు.

100


సీ.

పాపకామక్రోధభయమోహమాత్సర్య
        కారణం బత్యంతకష్టకరము
పరదారపరవిత్తహరణైకలోలంబు
        కలబుద్బుదాకారవిలసనంబు
మలమూత్రదుర్గంధనిలయంబు సాంద్రపూ
        యాసృగ్వసాపంకధూసరంబు
నవరంధ్రసహితంబు నానావిధక్రిమి
        సంకులంబు జడం బశాశ్వతంబు


గీ.

బహుతరక్లేశహింసాదిభాజనంబు
నిందితం బిట్టిదేహంబునందు నాత్మ
బుద్ధి గావించి తిరమని పొదలు నెవ్వఁ
డతఁడు మూఢుండు దుర్మతి యతఁడు సుమ్ము.

101


వ.

బహుఛిద్రఘటాకారం బైనశరీరంబునం బ్రాణవాయువు చిరకా
లంబు నిలువనేరదు కావున జననీజనకులం గూర్చి శోకంబు సేయకు
ము. వారు స్వకర్మవశంబునం జేసి కళేబరంబులు విడిచి చనిరి నీవు
ను గర్మవశంబున భూతలంబున నున్నవాఁడవు కర్మక్షయం బగు నె
ప్పు డప్పుడ పరలోకంబునకుం జనఁగలవు శరీరావాసస్థానంబు కర్మా

ధీనంబు గావున శోకంబు వలదు. ధైర్యం బవలంబించి సమాహితుం
డ వై తల్లిదండ్రులకు బ్రేతకార్యంబులు వేదోక్తప్రకారంబున
నాచరింపుము. నీతల్లియుం దండ్రియు శరఘాతంబున
మృతిం బొందిరి గావున వారికి దుర్మరణదోషనివృత్తి
యగునట్లుగా రామేశ్వరక్షేత్రంబునకుం జని యంద పైతృ
కక్రియాకలాపంబు సర్వంబును గావింపుమని మహామును లుప
దేశించిన శాకల్యనందనుం డైనజాంగలుం డట్లు పితృదేహంబులు
సంస్కరించి మరునాడు రామేశ్వరక్షేత్రంబునకుం జని యొక్క
సంవత్సరంబు వసించి తదంతిమదివసంబున నిశాసమయంబునం
గలలోనం దల్లిదండ్రుల హరిసారూప్యంబు వహించినవారిం
జూచి సంతసిల్లి మునుల కావృత్తాంతంబు వినిపించి సుఖించు
చుండె నంత నమ్మహర్షు లారాజుం జూచి కోపించి పరుషభాషణం
బుల ని ట్లనిరి.

102


క.

మోహాంధపాండ్యభూవర
బాహుబలోన్మత్త వంశపాంసన కుమతీ
స్త్రీహత్యయు ద్విజహత్యయు
సాహసి వై చేసితివి యసన్మార్గగతిన్.

103


ఆ.

కాన వహ్నియందుఁ గాయసంత్యాగంబు
సేయు మిప్పు డిట్లు సేయ వేని
శుద్ధి నీకు లేదు సుమ్ము ప్రాయశ్చిత్త
కోటిచేతనైనఁ గుత్సితాత్మ.

104


క.

దోషాధార భవత్సం
భాషణమాత్రమున వచ్చు బ్రాహ్మణహత్యా
దోషాయుతంబు దుష్టమ
నీషా మావంక నింక నిలువక చనుమీ.

105


సీ.

నావుఁడు శంకరభూవిభుం డటువలె,
       నగుఁ గాక హవ్యవాహనునియందు

విడిచెద నెమ్మేను విప్రహత్యాపాప
        శాంతికి నై భవత్సవిధభూమిఁ
గాయపరిత్యాగకలనచే మత్కృత
        దోషం బశేషంబుఁ దొలఁగునట్ల
ఘనులార నా కనుగ్రహము సేయుఁడు మీర
        లని మునీంద్రులతోడ నాడి తనదు


గీ.

సచివులను బిల్చి పల్కె విచార మెడలి
చేసితిని బ్రహ్మహత్య దుశ్శీలపరత
వెలఁదిఁ జంపితి గానఁ దత్కలుషశోధ
నార్థ మనలంబుఁ జొచ్చి దేహంబు విడుతు.

106


వ.

ఇంధనంబులు శీఘ్రగతిం దెచ్చి వహ్ని దరికొల్పుండు. మత్పుత్త్రు
ని రాజ్యంబునం బ్రతిష్ఠింపుఁడు. శోకంబు మానుఁడు, దైవంబు
దురతిక్రమం బని యేలిక పలికిన పలుకుట విని దుఃఖింపుచు మంత్రు
లి ట్లనిరి.

107


ఉ.

శత్రులకైన మే లెపుడు సల్పెడివాఁడవు పాండ్యభూప నీ
పుత్త్రులఁ బ్రోచినట్లు మముఁ బ్రోచితి నిత్యము నిన్నుఁ బాసి లో
కత్రియగణ్య యెట్లు చనగాఁగల ముజ్వలితాగ్నిఁ జొచ్చి మ
ద్గాత్రము లుజ్జగించెదము తథ్యము సు మ్మని పల్క వారితోన్.

108


వ.

రా జి ట్లనియె.

109


మత్తకోకిల.

ఓమహామతులార చెప్పెద నొక్కమాఱు వినుండు నే
నేమి సేయుదు ఘోరపాతక మిట్లు చేసితి రాజ నై
భూమి యేలఁగ నాకుఁ జెల్లదు పొండు గొబ్బున వీటికిన్
మామకాత్మజు రాజుఁ జేయుఁడు మానుఁ డాత్మల శోకమున్.

110


వ.

అని సాంత్వనపూర్వకంబుగాఁ బలికి మంత్రుల నొడంబరచి తదా
నీతచారుసమేధితం బై ప్రజ్వలింపుచున్న మహాజ్వలనంబుఁ గ
నుంగొని.

111

గీ.

స్నాన మొనరించి యాచమనంబుఁ జేసి
శుద్ధిమతి యయి రోహితాస్యునకు మౌని
పుంగవులకు బ్రదక్షిణపూర్వకముగ
మ్రొక్కి మానసమున సాంబమూర్తి నిలిపి.

112


వ.

ధైర్యం బవలంబించి శంకరవసుంధరావల్లభుండు వహ్నిలోన నురు
కం బ్రారంభించిన.

113


గీ.

ప్రావృడంభోధరధ్వని ప్రతిమభయద
నాదము సెలంగ మౌనిబృందంబు వినంగఁ
బాండ్యకులరత్న మైనయాప్రభునిఁ గూర్చి
యప్పు డాకాశవాణి యి ట్లనుచుఁ బలికె.

114


సీ.

శ్రీకంకరక్షమాధీశ వహ్నిప్రవే
        ళము నీ విపుడు సేయకుము మహీసు
పర్వహత్యాహేతుపాతకోగ్రభయం బ
        దణగదు నీకు సుగుణాలవాల
చెప్పెద నవహితచిత్తత మదుపదే
        శము నిను సద్వేదసమ్మితంబు
దక్షిణాంభోరాశితటమున గంధమా
        దనమహాధారుణీధరమునందు


గీ.

రామసేతువునందు శ్రీరామచంద్ర
సంప్రతిష్ఠితు రామేశు సర్వగురుని
శివుని గౌరిసనాథునిసేవ సేయు
మచట భక్తిని నీ వొక్కహాయనంబు.

115


వ.

త్రికాలంబును బ్రదక్షిణనమస్కారంబులు సేయుము. ప్రత్యహం
బు రామేశ్వరస్వామికిఁ గవ్యఘృతిభారద్వయంబునను, ద్విభార
పరిసమ్మతంబు లైన గోక్షీరంబున ద్రోణపరిమాణం బగుమధురసం
బునను, మహాభిషేకం బాచరింపుము. ప్రతిదినంబు చందనాగరు

కుంకుమకర్పూరంబుల రామనాథునిం బూజింపుము. పాయసా
న్నాదివివిధపదార్ధంబుల నైవేద్యంబు సమర్పింపుము. తిలతైలం
బునఁ బ్రతిదినంబు దీపారాధనం బొనర్చు మిట్లు రామేశ్వరుం
గొల్చిన యక్షణంబ నీకు స్త్రీహత్యయుం బ్రహ్మహత్యయు నశిం
చు రామనాథునిదర్శనంబున భ్రూణహత్యాయుతంబును, సురా
పానాయుతంబును, స్వర్ణస్తేయాయుతంబును, గురుస్త్రీగమనా
యుతంబును, తత్సంయోగదోషంబులును, సకలపాతకంబులును
దొలంగు.

116


గీ.

ఎంచ రామేశుసేవ లభించెనేని
గంగచే గయచేఁ బ్రయాగంబుచేత
నేమి వివిధాధ్వరంబుల నేమిఘోర
తపముచే నేమి నరులకు ధరణినాథ.

117


క.

కావున సేతువునకుఁ జను
మీవు శివున్ రామనాథు నీశ్వరు నభవున్
సేవింపు మిఁక విలంబము
గావింపకు మిపుడ చనుము గాఢవివేకా.

118


వ.

ఇ ట్లాకాశవాణి పలికినపలుకులు విని.

119


క.

మునులందఱు శంకరనృపుఁ
గనుఁగొని సేతువున కాశుగతి నేగుము నీ
వనఘా సేవకభవభం
జనుఁ గొల్వుము రామనాథు సదయస్వాంతున్.

120


వ.

రామనాథేశ్వరస్వామిమాహాత్మ్యం బెఱుంగక మేము ని న్నగ్నిలో
జొరుమంటి మని యమ్మహర్షు లాడిన నట్ల వారిచే ననుజ్ఞాతుం డై యా
పాండ్యభూమండలాఖండలుండు.

121


క.

కరితురగరథపదాతులఁ
బురమునకుం బంపి మునుల బొరి వలగొని మ్రొ

క్కి రభసమునఁ గతిపయబల
పరివృతుఁ డై తాను సేతుబంధంబునకున్.

122


సీ.

చని సేతువున నొక్కసంవత్సరము నిల్పి
        భక్తిపూర్వకముగఁ బ్రత్యహంబు
మూఁడుసంధ్యలయందు ముదమున బూజించి
        రామనాథేశ్వరస్వామి నభవుఁ
గొనకొన యల ధనుష్కోటిని బ్రతివాస
        రంబును మునిఁగె నిరంతరంబు
ధరణీసురల కన్నదానంబుఁ గావించి
        యేకభుక్తము జేసి యింద్రియముల


గీ.

గెలిచె నొప్పుగ దశభారములధనంబు
రామనాథుని కొసఁగె నీక్రమముచేత
నభ్రభారతి చెప్పినయట్ల పూజ
నంబు తగ సల్పె నప్పాండ్యనరవిభుండు.

123


క.

అంతట శంకరనృపుఁ డ
బ్దాంతిమదివసమునఁ బ్రీతుఁ డై హైమవతీ
కాంతుని రామేశ్వరుని న
నంతుని బొగడంగఁదొడఁగె నచలితభక్తిన్.

124


శ్లో.

నమామి రుద్ర మీశానం రామనాథ ముమాపతిం
పాహిమాం కృపయా దేవ బ్రహ్మహత్యాం దహాశు మే॥

125


శ్లో.

త్రిపురఘ్న మహాదేవ కాలకూటవిషాదన
రక్షమాం కరుణాసింధో స్త్రీహత్యాం మే విమోచయ॥

126


శ్లో.

గంగాధర విరూపాక్ష రామనాథ త్రిలోచన
మాం పాలయ కృపాదృష్ట్యా మత్పాపం ఛింది శంకరా॥

127


శ్లో.

కామారే కామసంధాయిన్ భక్తానాం రాఘవేశ్వర
కటాక్షపాతం కురుమే శుద్ధం మాం కురు ధూర్జటే॥

128

శ్లో.

మార్కండేయభయత్రాణ మృత్యుంజయ శివాస్యయ
నమస్తే గిరిజార్థాయ నిష్పాపం కురు సర్వదా॥

129


శ్లో.

రుద్రాక్షమాలాభరణ చంద్రశేఖర శంకర
వేదోక్తసమ్యగాచార యోగ్యమాం కురుతే నమః॥

130


శ్లో.

సూర్యదంతభిదేతుభ్యం భారతీనాసికాభిదే।
రామేశ్వరాయ దేవాయ నమోమే శుద్ధిదో భవ॥

131


శ్లో.

అనంతసచ్చిదానందం రామనాథం వృషధ్వజం
భూయో భూయో నమస్యామి పాతకం మే వివస్యతు॥

132


గీ.

ఇవ్విధంబున రామేశు నిందుధరుని
వినుతి సేయుచునున్న యమ్మనుజవిభుని
యాననంబున వెడలె మహాభయంక
రస్వరూపిణి యైనట్టి బ్రహ్మహత్య.

133


ఆ.

అట్టిబ్రహ్మహత్య నతిఘోరమూర్తినిఁ
జూచి భైరవుండు శూలహతిని
సంహరించె రుద్రశాసనంబున నంత
రామనాథుఁ డనియె రాజుతోడ.

134


క.

క్షితినాథ నీయథార్థ
స్తుతుల నతిప్రీతమానసుఁడు నైతి భవ
త్కృతపూజనమున ముద మొం
దితి నిచ్చెద వరము వేఁడు ధీరవరేణ్యా.

135


వ.

స్త్రీహత్యాబహ్మహత్యలవలన నైన నీదోషంబు తొలంగె శుద్ధుండ వై
తివి. మున్నువోలె రాజ్యంబుఁ బాలింపుము. భక్తియుక్తం బగు
హృదయంబున నెవ్వారు న న్నిచ్చోట సేవింతురు వారిబ్రహ్మహ
త్యలు పదివేలైన నశింపంజేయుదు. మహాపాతకాయుతంబుల
నైన క్షణమాత్రంబున విదళింతు నన్ను సేవించుజనులు సంసరణ
కేశరహితు లై మత్సాయుజ్యంబు నొందుదురు. నీ చేసినస్తోత్రంబు
సభక్తికంబుగాఁ బఠించినవారికి మహాపాపసంచయంబు నశించు

నీభక్తితాత్పర్యవిశ్వాసస్తోత్రపూజావిధానంబులం బ్రసన్నుండ
నైతి. యధేష్టంబుగా వరంబు ప్రార్థింపుమని రామేశ్వరుం డాన
తిచ్చిన శంకరమహారా జి ట్లనియె.

136


ఉ.

ఇందుకళావతంస పరమేశ నినుం గనుఁగొంటి ధన్యతం
జెందితి నింతకంటె సువిశేషవరస్థితి లేదు నాకు సా
నందమ్బకండుపుత్త్రభయనాశకతారకపాదపద్మని
ష్పందసుభక్తిసంపద యొసంగుము పాతకతూలపావకా.

137


ఆ.

జననిగర్భగోళమునఁ బునర్జని నాకుఁ
దప్పుఁ గాత మత్కృతస్తవంబుఁ
దగఁ బఠించునరుఁడు ధన్యుఁ డై నీసేవఁ
గలుగుపుణ్యఫలముఁ గాంచుఁగాత.

138


క.

అని వేడిన నట్లగుఁ గా!
కని యతని ననుగ్రహించి యల రామేశుం
డనుపమలింగాకారం
బున నంతర్ధాన మొందె భూసురులారా.

139


క.

నరపతియు రామనాథుని
గిరిజావల్లభునిఁ గొలిచి కృతకృత్యతచేఁ
గర మొప్పుచు నిజసేనా
పరివృతుఁ డై చనియె నాత్మపట్టణమునకున్.

140


గీ.

అంత వనవాసు లైనమహామునులకుఁ
దనదువృత్తాంతమంతయు ధరణివిభుఁడు
విన్నవించిన వారు బ్రసన్ను లగుచుఁ
జెలఁగి పట్టాభిషిక్తునిఁ జేసి రతని.

141


మత్తకోకిల.

పుత్రదారసమేతుఁ డై బహుభోగి యై గుణశాలి యై
శోత్రియద్విజరక్షకుం డయి సూర్యసన్నిభతేజుఁ డై

శాత్రవక్షితినాథభూధరశక్రుఁ డై విజయంబునన్
ధాత్రి యేలెను బాండ్యశంకరధారుణీశ్వరుఁ డున్నతిన్.

142


మ.

కురిసె న్వృష్టి ఫలించె సస్యవితతుల్ గోవు ల్బహుక్షీరముల్
గురిసె న్రోగభయాపమృత్యుజనితక్షోభం బడంగెం బ్రజల్
సిరిచే హెచ్చిరి యజ్ఞకర్మములు బొల్బె న్నాల్గుపాదంబులం
బరగెన్ ధర్మము పాండ్యశంకరుఁడు సామ్రాజ్యంబు గావింపఁగాన్.

143


వ.

ఇవ్విధంబున సముద్రముద్రితమహీమండలంబు చిరకాలంబు పా
లించి పుత్త్రునకు రాజ్యం బొసంగి శంకరమహారాజు శరీరాంతం
బున రామేశ్వరమహదేవునిం జింతింపుచుఁ దత్సాలోక్యముక్తి వడ
సె నీప్రకారంబున మీకు రామేశ్వరమాహాత్మ్యంబు వివరించితి
నీయుపాఖ్యానంబు పవిత్రంబు లక్ష్మీకరంబు పుణ్యంబు దుఃఖహ
రంబు దుస్స్వప్నదోషనివారణంబు మహాశాంతికరంబు సకలార్థ
కారణంబు దీని౦ బఠించినవారికి విన్నవారికి స్వర్గాపవర్గంబులు సి
ద్ధించు జ్యోతిష్టోమాదియజ్ఞఫలంబును చతుర్వేదశతావృత్తిఫలంబు
ను సకలతీర్థస్నానఫంబును షోడశమహాదానఫలంబును లభించు
ను. బ్రహవిష్ణుమహేశ్వరలోకనివాసంబు దొరకు శివసాయు
జ్యంబు సంభవించు సకలకామంబులు ఫలించునని నిఖిలపురా
ణవ్యాఖ్యాసమేతుం డగుసూతుండు పలికిన విని నైమిశారణ్యని
వాసులు శౌనకాదిమహర్షులు సంతుష్టిం జెందిరి. సూతుండు కై
లాసంబునకుం జనియె నిమ్మహాప్రబంధంబు వ్రాసిన పుస్తకం బర్చన
జేసిన నారాధించిన శ్రీరామేశ్వరుం డాయురారోగ్యైశ్వర్యంబు
లు శాశ్వతమోక్షపదంబునుం గృప సేయు.

144


శా.

భక్తారామవసంతశాంతమునిహృత్పద్మాంతరాసీవస
న్ముక్తాహారపటీరహీరశరదంభోభృద్వళక్షాంగ వే
దోక్తానంతగుణప్రభావ పరిపూర్ణోదారకారుణ్యసం
సిక్తప్రేక్షణవిశ్వరక్షణచణశ్రీమత్త్రిశూలాయుధా.

145

క.

గురుజానపల్లిపట్టట
పరిపాలశీలభక్త పరతంత్రమతీ!
గిరిరాయకన్యకాకుచ
పరిరంభణభోగసుఖితభాసురహృదయా.

146


మత్తకోకిల.

భద్రిరాజుకులాబ్ధికైరవబంధు మల్లనమంత్రిరా
డ్భద్రదాయకపాదపంకజపంకజాననసారథీ
కాద్రవేయసుభూషణోజ్వలగాత్రగోత్రశరాసనా
సద్రయోక్షతురంగదైవతసార్వభౌమ మహేశ్వరా.

147

గద్య — ఇది శ్రీమదుమామహేశ్వరకరుణాకటాక్షవీక్షాపాత్ర,
యేనుగ లచ్చయామాత్యపౌత్ర తిమ్మనామాత్యపుత్త్ర
వివిధవిద్వజ్జనవిధేయ, లక్ష్మణకవినామధేయప్రణీ
తం బయిన రామేశ్వరమాహాత్వంబను
మహాప్రబంధముందు సర్వంబును
బంచమాశ్వాసము
సంపూర్ణము.
శ్రీ. శ్రీ. శ్రీ.

——————