Jump to content

రాధామాధవము/మునిపలుకు

వికీసోర్స్ నుండి

శ్రీదేవాయనమః.

మునిపలుకు

శ్రీమహావిష్ణుదేవుని యవతారములలో నెల్ల నెల్లవిధములఁ బరమోత్కృష్టమైనది శ్రీకృష్ణావతారమే యని యసంఖ్యాకు లగు భారతవర్షవాసులు విశ్వసించెదరు. కావుననే యమ్మహాత్ముని నిరతిశయమనోహరశైశవలీలలు, తదమేయదివ్యమహిమములు, తదీయాత్యద్భుతదుష్టశిక్షణ, శిష్టరక్షణాది సచ్చారిత్రములు, నాతని యద్వితీయరాజకీయపరిజ్ఞానవిశేషములు మొదలగునవి యనేకములగు పురాణములయందును, నాటకములయందును, బ్రబంధముల యందును, శతకములయందును, బద్యములయందును, పాటలయందును, వీధిభాగవతములయందును, గొల్లసుద్దులయందును, స్తోత్రములయందును, వేయేల?, బడిపిల్లలగిలకల పద్యములయందును భక్తి, నీతి, శృంగార, వైరాగ్యాదులఁ బ్రబోధించునట్లుగ, హృదయంగమముగ నభివర్ణింపంబడి యున్నవి. అట్టిమహామహుఁ డైన శ్రీకృష్ణభగవానునకును, శ్రీమహాలక్ష్మియపరావతార మని (ఈగ్రంథమునందు) పేర్కొనఁబడిన రాధామహాదేవికిని జరిగిన స్వయంవరవివాహమహోత్సవమును దెలుపు నీరాధామాధవప్రౌఢప్రబంధమును రచియించిన మహాకవి చింతలపూఁడి యెల్లనార్యుఁడు. ఇక్కవిచంద్రుఁడు శ్రీవత్సగోత్రుఁడు; వల్లభరాయప్రపౌత్రుఁడు; కృష్ణభట్టారక పౌత్రుఁడు; ఇతనితండ్రి కామనార్యుఁడు; తల్లి లచ్చమాంబ. ఇవ్విషయము లీగ్రంథము ప్రథమాశ్వాసములోని (కవి, తనపితృ పితామహ ప్రపితామహ వర్గత్రయమును దెలిపికొనిన) 20 వ పద్యమునుబట్టి యెఱుంగనగును. మఱియు, నీగ్రంథములోని యాశ్వాసాంతగద్యములయందు గల 'కామయప్రభుసుపుత్ర' యను నీతనివిశేషణమునుబట్టి, యీతఁ డార్వేలనియోగిబ్రాహ్మణుఁ డనియు, నీతనివంశమువారు చింతలపూడి గ్రామమునకు నధికారులై యుండియుందు రనియు గ్రహింపవచ్చును.

ఇమ్మహాకవి కులగోత్రాదులు తెలిసినవి గావున నీతని నివాసస్థలమునుగూర్చి కొంచెముగ నాలోచింపవలసి యున్నది. మన దేశమున సామాన్యముగా గ్రామములను బట్టియు, బిరుదాదులను బట్టియు గృహనామములు వెలయుచుండును.

“ఓలేటివారు, ఉప్పులూరివారు, నడకుదుటివారు, పానుగంటివారు...” ఇట్టి పేరులు గ్రామములనుబట్టి యేర్పడినవి; “దిట్టకవివారు, నిమిషకవివారు, ప్రబంధకవివారు, ద్వివేదులవారు, ఏనుఁగువారు...” ఇత్యాదులు బిరుదములనుబట్టి పుట్టినవి; నేతివారు, నూనెవారు, జిడ్డువారు, పెసలవారు, కందులవారు, వంకాయలవారు, పచ్చిపులుసువారు, తవ్వావారు, ఐదుసోలలవారు...” ఇత్యాది నామములు వర్తకవ్యాపారాదులవలనఁ గలిగినవి. (మఱియు ననేకవిధవిచిత్రతరగృహనామము లింకను గలవు.)

ఇక్కవిచంద్రునియింటిపేరు చింతలపూఁడివా రని యీ గ్రంథముకడపట నున్న “సంతత భావశుద్ధియుత, చింతలపూఁడి యెల్లకవిశేఖరు ......" అనుపద్యమువలనఁ దెలియుచున్నది. ఇది 'చింతలపూఁడి' యను గ్రామమునుబట్టియే యేర్పడి యుండె ననుట స్పష్టము.

బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవి, ఎం. ఏ. గారు, తమ చెన్నపురివిశ్వవిద్యాలయోపన్యాసములలో నొకదానియం దీయెల్లయకవినిగూర్చి ప్రశంసించునప్పుడు, “ఈతనిది కడపజిల్లాలో పెన్నానదీతీరమున నున్న చింతలపూఁడి" యని చెప్పినట్లు [1]విష్ణుమాయానాటకగ్రంథోపోద్ఘాతము 11 పుటయందు వ్రాయఁబడి యున్నది. కాని, కడపజిల్లాలో చింతకుంట, చింతలచెఱువు, చింతలచెలిక, చింతలజూటూరు, చింతరాజుపల్లె, చింతలకుంట — అను గ్రామములుమాత్రమే యున్నట్లు తెలియవచ్చుచున్నది. మఱియు నాజిల్లాలో 'చింతలపూఁడి' యనునది యున్నట్లే కానరాదు. కావున మనయెల్లనార్యుఁడు కడపమండలస్థగ్రామనివాసుఁడై యుండఁ డని యెన్నవచ్చును.

విష్ణుమాయానాటకప్రబంధమునకు నుపోద్ఘాతమును వ్రాసిన బ్రహ్మశ్రీ కోరాడ రామకృష్ణయ్య, ఎం. ఏ. గా రిక్కవినివాసమునుగూర్చి చర్చించుచు,
“(విష్ణుమాయానాటకమున) గౌతమీతీరభూమిని గూర్చి యితఁడు (కవి) చేసిన వర్ణనమునుబట్టి చూడఁగా, నీతఁ డీ(గోదావరీమండల)ప్రాంతమువాఁ డేమో యను సందేహము బలపడుచున్నది. పుండరీకునిచరిత్రమునఁ జేయఁబడిన కృష్ణాగౌతమీతీరభూతలవర్ణనమునుబట్టియు, నైదవయాశ్వాసములోని నారదునికథకుఁ బ్రధానరంగ మైన సర్పవరక్షేత్ర(కాకికాడసమీపగ్రామ)మును వర్ణించినరీతిని బట్టియు నాతని కీ(కృష్ణాగౌతమీతీరప్ర)దేశమునందు గల విశేషాభిమానమును, బరిచయమును జాటుచున్న వనవచ్చును... కావున సాధనాంతరములచే నీతనినివాసస్థానము వేఱుదేశ మని నిరూపింపఁబడునంతవఱకు నీతఁడు గోదావరీకృష్ణామధ్యప్రదేశమువాఁ డని, వేఁగిదేశీయుఁ డని నిర్ణయింతముగాక.”

అనునట్టి భావమును సూచించిరి. వీరినిర్ణయము సైతము కొంతవఱకు విమర్శింపఁ దగినదై యున్నది. ఆంధ్రదేశమున, 'చింతలపూడి' గ్రామములు,

1. అమలాపురము తాలూకా, (వన్నెచింతలపూఁడి, కాఁపుచింతలపూఁడి.)
2. ఎల్లవరము డివిజను,
3. ఏలూరుతాలూకా,
4. గుడివాడ తాలూకా,
5. తెనాలితాలూకా,
6. దర్శితాలూకా,
7. రేపల్లెతాలూకా,
8. గొలుగొండతాలూకా,
9. గొలుగొండ ఏజెన్సీ,
10. వీరవల్లి తాలూకా
(8. 9, 10 —ఇవి విశాఖపట్టనమండలములోనివి.)

ఇత్యాది భిన్నప్రదేశములయం దనేకములు గానంబడుచున్నవి. ఇం దేది కవినివాసగ్రామమో నిర్ణయించుట కష్టమే.

ఎల్లనార్యుఁడు, కవులచరిత్రములయందు చేరకపోయినను, కాలపురుషునియనుగ్రహమున నాతని గ్రంథములు మూఁడు (1 రాధామాధవము, 2 తారకబ్రహ్మరాజము, 3 విష్ణుమాయానాటకము - అనునవి) బయలుపడినవి. ఏతద్గ్రంథత్రయములో నొకదానియందును కవి తననివాసస్థానమును దెల్ఫికొని యుండ లేదు.[2]

ఒక్కప్పు డిక్కవి శ్రీకృష్ణదేవరాయలయాస్థానమునకు నరిగి, యచ్చట, అల్లసాని పెద్దనార్యునిచే 'నగరు, తగరు, తొగరు, వగరు,' అనుపదములు ప్రాసస్థానములయం దుంచి రామాయణపరముగాఁ బద్యముఁ జెప్పునట్లు ప్రశ్నింపఁబడి, యాశువున,

"చ.

నగరు పగాయె నింక విపినంబుల కేఁగుఁడు రాజ్యకాంక్షకుం
దగరు కుమారులార! యని తల్లి వగల్ మిగులంగఁ దోఁపఁగాఁ
దొగరున రక్ష గట్టి మదిఁ దోఁపక గద్గదఖిన్నకంఠయై
వగరుచు చున్నఁ జూచి రఘువంశవరేణ్యుఁడు తల్లి కిట్లనున్.”

అను రమ్యతరపద్యమును జెప్పి సభవారి నానందపఱిచెనఁట ! పిమ్మట భారతభాగవతపరముగాఁ గూడఁ జెప్పునట్లు కోరఁబడి, యిక్కవి వానిని సైత మాశువుననే,

“చ.

తొగరుచి కన్నుదోయిఁ గడుఁ దోఁపఁగఁ గర్ణుఁడు భీమసేనుపైఁ
దగరు ధరాధరంబుపయిఁ దాఁకినభంగిని దాఁకి నొచ్చి తా
వగరుచుచున్ వెసం బరుగువాఱిన నచ్చటి రాజలోకముల్
నగరు సుయోధనాజ్ఞ మది నాటుటఁ జేసి ధరాతలేశ్వరా?"


చ.

వగరుపుమాత్రమే వరుఁడు వశ్యుఁడు కాడు సఖీసఖిత్వ మె
న్న గరుడవాహనుండు మము నాఁ డటు డించుట యెల్ల నుద్ధవా!
తగ రని కాక మోహపులతాతనువైన విడంగఁ జూతురే?
తొగరుచి యోషధీశునకుఁ దోఁపఁగఁ జేయునె వీడనాడఁగన్?"

అని రచియించి చదివినట్లును, కృష్ణరాయ లాతనిని విశేషముగ మెచ్చుకొని బహూకరించినట్లును కవిజీవితాదులవలనఁ దెలియుచున్నది.

మఱియు, మనకవి, తనరాధామాధవకావ్యమును శ్రీకృష్ణదేవరాయలకు వినుపించినట్లును, నాతనిచే 'రాధామాధవ’బిరుదము నందినట్లును ఈగ్రంథము ప్రథమాశ్వాసములోని 30 వ పద్యమునఁ జెప్పి యున్నాఁడు. ఎట్లన,

“శా.

రాధామాధవ మచ్యుతాంకితముగాఁ బ్రౌఢక్రియం జెప్పి, త
న్మాధుర్యంబునఁ గృష్ణరాయవిభుఁ గర్ణాటేశు మెప్పించి, నా
[3]నాధాతృప్రతిమానసత్కవులలోనన్ భూషణశ్రేణితో
'రాధామాధవ’నామ మాందిన జగత్ప్రఖ్యాతచారిత్రుఁడన్.

(ఏతద్గ్రంథమును సభలో వినుపించి సభవారి మెప్పును బడసినసమయముననే, యత్యంతసమర్థుఁడగు నిమ్మహాకవి, వినోదార్థము పై ప్రశ్నము లడుగఁబడి, పైరీతి నాయాపద్యములను జెప్పియుండును.)

ఇవ్విషయములనుబట్టి యీతఁడు, కృష్ణరాయల యంతిమదివసములయందు దదాస్థానకవీంద్రుఁడుగాఁ బరిగణింపఁబడినట్లును, ఆరాజదేవేంద్రుని యాదరానుగ్రహములచే విజయనగరరాజధానీవాస్తవ్యుఁ డైనట్లును గన్పట్టుచున్నాఁడు. ఈతనినామ మష్టదిగ్గజకవులపట్టికయందు లేకపోవుటచే, నీతఁడు రాయల కడపటి దివసములలోనే తదాస్థానకవిగాఁ జేరినట్లు గ్రహింప నగుచున్నది. ఇఁక నీతఁ డక్కాలమున విజయనగరనివాసుఁడై యుండినట్లు భావించుటకుఁ గల కారణమును దెలిపెదను —

కృష్ణరాయలయనంతరము విజయనగరసామ్రాజ్యమును బరిపాలించిన యచ్యుతదేవరాయల మంత్రివర్యులలో నొక్క డగు నంజయ తిమ్మరుసు[4], మనరాధామాధవకవి, తారకబ్రహ్మరాజకావ్యమును రచియించినాఁ డనియు, దానిని తన యిష్టదైవత మగు శ్రీరామవిభునకుఁ గృతిగా నిప్పింపవలయు ననియు సభవారితోఁ బలికి, యిక్కవిని “సబహుమానంబునం బిలుపించి, యీవిధముగఁ గోరినట్లు ‘తారకబ్రహ్మరాజము'నఁ గలదు —

“గీ.

పరమహితుఁడవు తారకబ్రహ్మరాజ
మను ప్రబంధంబు నీ చెప్పినది మదాత్మ

నాయకుం డగు శ్రీరఘునాయకునకు,
నంకితము సేయవలయు నా కభిమతముగ.”

మఱియు, తారకబ్రహ్మరాజమునందే,

“ఉ.

నావుడు నీకు నంకిత మొనర్పఁ దలంచినవాఁడ బంధుసం
భావన; నీకు నిష్టముగ బ్రహ్మమయుం డగు రామభద్రధా
త్రీవరమౌళి కంకిత మిదే యొనరించిన, మంచిపైఁడికిం
దావి ఘటిల్లె నేమి యన? సంజయతిమ్మ! వివేకభూషణా.”

అని మనకవి యమ్మంత్రితో నుడివినట్లును గలదు.

పైసంగతుల నన్నిటినిబట్టియాలో చింపఁగా, నెక్కడనో గోదావరీమండలములో నున్న యేలూరుతాలూకాలోని చింతలపూఁడిగ్రామమునుండి, బళ్లారిజిల్లా కడపటి (పశ్చిమపు) సరిహద్దున నున్న విజయనగరమునకుఁ బోయి కృష్ణరాయలను సందర్శించియుండు ననుటకంటె, నచ్చటికి (ఏలూరికంటెను) సమీపమున నుండు (నెల్లూరుజిల్లా) దర్శితాలూకాలోని, లేక, (గుంటూరుజిల్లా) రేపల్లెతాలూకాలోని, 'చింతలపూఁడి'నుండియే, మనకవి, రాయలయాస్థాని కేఁగి యుండి, తనకవిత్వప్రజ్ఞాదికములఁ బ్రకటించి, తదాస్థానకవియై, యా రాజధానియందే నివాసమేర్పఱుచుకొని యుండు ననియు, అచ్యుతరాయల యనంతరము, విజయనగరరాజ్యము, రాజకుటుంబములోని (యంతః)కలహములవలనను, మహమ్మదీయయుద్ధయాత్రాద్యుపద్రవములవలనను నల్లకల్లోల మగుస్థితియం దుండుటచే నాతఁ డారాజధానినివాసమును విడిచిపెట్టి, కాలక్రమమున, కృష్ణాగోదావరీనదులచే సుక్షేత్రము లై యున్న ప్రదేశములకు సకుటుంబముగ వలస వచ్చి యచ్చటఁ దగినకుటుంబజీవనోపాధిని సంపాదించుకొని, యచ్చటనే స్థిరనివాస మేర్పఱుచుకొని యుండు ననియు, పిమ్మట, ఏలూరితాలూకాలోని చింతలపూఁడిగ్రామము మనకవియింటిపేరితోనే వెలసియుండు [5]ననియుఁ దలంచుట సమంజసమై యుండునని తోఁచుచున్నది.

మఱియు నిమ్మహాకవి, యానాఁటికి వయస్సు మరలినవాఁడై యుండుటచేఁ గాఁబోలు, రాజాశ్రయాదిప్రయత్నములు మాని గోదావరీప్రాంతదేశము చేరినతరువాత ఈప్రపంచమంతయు మహామాయాసమాచ్చాదిత మను నెఱుకతోఁ గడపటిదశయందు, విష్ణుమాయానాటక మనుప్రబంధమును రచియించి యాయుత్తమగ్రంథరాజమును రాధామాధవమువలెనే తనయభీష్టదైవతం బగుమదనగోపాలమూర్తికి నంకితము చేసి ధన్యుఁ డయ్యె ననియుఁ దోఁచుచున్నది.

(ఈ పై నిర్ణయము, ముద్రింపఁబడిన విష్ణుమాయానాటకమునందలి "కవి యొనర్చిన కృష్ణాగోదావరీమండలమధ్యగతభూతలవర్ణనాదులనుబట్టి, యాతఁడు వేఁగీదేశనివాసుఁడై

యుండు”నను శ్రీకోరాడ రామకృష్ణయ్యగారి యభిప్రాయమునకు విరోధింపదు.)

కవికాలము

ఎల్లనార్యకవి కృష్ణరాయలకడపటిదశనాఁటికే యాంధ్రగీర్వాణభాషాపాండిత్యసంపన్నుండై, యతిశయకవితాప్రౌఢుఁడై యామహారాజుమెప్పును గాంచెను గావున నీతఁ డించుమించుగ, క్రీ.శ. పదునాఱవశతాబ్దిప్రారంభమునఁ బుట్టియుండు నని నిశ్చయింపవచ్చును.

రాధామాధవకావ్యము

కృష్ణరాయలనాఁటికి, ఆంధ్రకవితామతల్లిక, భాషాంతరీకరణపరాధీనతను వదలి ప్రబంధనిర్మాణస్వాతంత్ర్యమును వాంఛించుస్థితికి వచ్చినది. కావుననే ఆముక్తమాల్యద, మనుచరిత్ర, పారిజాతాపహరణము మొదలగు ప్రౌఢప్రబంధము లామహారాజుకాలమున వెలువడినవి. అట్టిసమయముననే యీరాధామాధవప్రబంధరత్నమును సృష్టింపఁబడినది. ఏతద్గ్రంథావతారికయందు మనకవి, కవిస్తుతి నొనర్చు సందర్భమున,

"క.

నుతియింతు వాగ్విశేష
స్థితి రాధామాధవంబు చెప్పిన విద్యా

చతురానను నీలాచల
పతిహితు జయదేవసుకవిపంచప్రదరున్.”

(3 పుట)

అని జయదేవమహాకవి[6]రాధామాధవకావ్యమును జెప్పినట్లు సూచించియున్నాఁడు. అక్కవీంద్రుని (మూల)గ్రంథ[7] మిప్పుడు లభియించి యుండనికారణమున మనకవి దాని నెంతవఱకు ననుసరించి యున్నాఁడో చెప్పుటకు వలనుపడలేదు. బహుశః, ఇది దానికి భాషాంతరీకరణ మై యుండదు. అట్లే యై యున్నచో నీతఁ డవ్విషయమునుగూడ నిందు వక్కాణించియే యుండును. అదియును గాక, యీరాధామాధవమున నాంధ్ర రచనాజాతీయత విశేషించి కానంబడుచున్నది గాని, సాంస్కృతికగ్రంథరచనాపద్ధతి గోచరించుట లేదు. మఱియు నిందు మనకవీంద్రుఁడు పెక్కుచోటుల స్వతంత్రరచనమును మిక్కుటముగఁ జూపియున్నాఁడు.

కవికవిత్వము

రాధామాధవకవి కవిత్వము సహజధారావిలసితమై, మృదుమధురపదగుంఫితమై, ప్రౌఢమై, హృదయంగమ మై యీతనికిఁ గలయాంధ్రగీర్వాణభాషాపాండిత్యవిశేషమును బ్రకటించుచున్నది. హృదయాకర్షక మగు నత్యంతభావసౌందర్యమును పిక్కటిల్లఁజేయు నపూర్వకల్పనలు గల పద్యరాజము లిందు లెక్కకు మిక్కిలినవి చూపట్టుచున్నవి. మనోజ్ఞపదభావవిలసిత మగు గ్రంథరచనమున నిమ్మహాకవి, కవిరాజశిఖామణి యగు నన్నిచోడమహారాజు, 'కవిబ్రహ్మ' బిరుదవిరాజి యగు తిక్కనసోమయాజి, 'సాహిత్యరసపోషణసంవిధానచక్రవర్తి' యగు నాచనసోమనాథుఁడు మొదలగువారితోఁ దులఁదూగఁగలిగినవాఁడు గాని సామాన్యుఁడు గాఁడు. ఈగ్రంథమునందు కవి తనకవితామాధుర్యమును గూర్చి,

“చ.

సరసులు చిత్తగింపుఁ డని చాటను; మామకవాణి సన్మో
హర యగునేని వారిహృదయంబుల కిం పొనరింపకున్నె? యె
వ్వరు పిలువంగ వచ్చి యళివర్గము లాత్మలఁ జొక్కుఁ, దీనియల్
గురియు ప్రసూనగుచ్ఛపరికుంచితమల్లిమతల్లికావనిన్?”

అని వ్రాయుచు, ప్రదర్శించుకొన్న యాత్మగౌరవమునకుఁ దగినట్లుగానే యీమనోహరగ్రంథరాజము రసవత్తరమై పరిఢవిల్లుచున్నది.

కవిబిరుదము

కవిత్వము-అను నిరుపమానమనోజ్ఞకళ యుదయించినది మొదలుకొని నేఁటివఱకు బయలువెడలినగ్రంథములు సాధారణముగా,

“పరాశరస్మృతి, మనుస్మృతి, ...; [8]భారవికావ్యము, మాఘకావ్యము, ...; భాస్కరరామాయణము, సోముని హరివంశము, ...; అప్పకవీయము, రంగరాట్ఛందము, ...; బద్దెన నీతులు, వేమనపద్యములు...”

ఇత్యాదులు, కవినామమే భూషణముగా వెలసినవి పెక్కులు గలవు గాని, గ్రంథనామమే బిరుదభూషణముగాను, ఆబిరుదమే నిజనామముగాను, ధరింపఁగలిగిన కవిచంద్రుఁ డీరాధామాధవకవి యొక్కఁడే కానవచ్చుచున్నాఁడు. తారకబ్రహ్మరాజమునఁ దనపూర్వనామమునకు బదులుగ, “రాధామాధవుఁడు సుకవిరత్నము చెప్పెన్.” "రాధామాధవుని సుకవిరత్నముఁ బలికెన్” అని మంత్రియైన సంజయతిమ్మరుసు పలికినట్లు కవి రాధామాధవనామమే వ్రాసికొని యున్నాఁడు; ఆగ్రం థము గద్యమున, “ఇది శ్రీ మదనగోపాలచరణ ... కామయప్రభుసుపుత్త్రశుద్ధసారస్వతవిభవ రాధామాధవప్రణీతం బైన... ఆశ్వాసము" అనియు వ్రాసికొనినాఁడు.

అష్టదిగ్గజములవంటి సుప్రసిద్ధకవివృషభులకుఁ బోషకుఁడై, అనాఁటికిఁ బ్రచారముననున్న యనేకమహాకవుల కావ్యనాటకాద్యుద్గ్రంథములను బెక్కింటిని పఠించి, తత్తద్రసవాహినుల నోలలాడినచిత్తముగల విష్ణుచిత్తీయ (ఆముక్తమాల్యదా) ప్రౌఢప్రబంధమునకుఁ గర్తయై యున్న యాకవిరాజశిఖామణి, యారాజరాజేశ్వరుఁడు, ఆ శ్రీకృష్ణదేవమహారాయ లీరాధామాధవసరసకావ్యమును శ్రోత్రపేయముగ నాకర్ణించి, యానందించి “నానాధాతృప్రతిమానసత్కవులలోనన్ భూషణశ్రేణితో ననన్యలబ్ధమును, నపురూపము నైన 'రాధామాధవ' బిరుదమును (గ్రంథనామాంకిత మైనదానిని) బ్రసాదించుట, యాకవితారసజ్ఞశేఖరుని యౌదార్యాతిశయమును, మనకవితల్లజుని కావ్యనిర్మాణకౌశలమును వేనోళ్ల ఘోషించుచున్నది. మఱియు, కావ్యరసతాదాత్మ్యముం గాంచిన యమ్మహారాజకవి, కవితాతాదాత్మ్యముం గాంచిన యిక్కవిపురందరునిఁ గనుంగొని, 'అతని కతండె సాటి' యని భావించినట్లుగా, విద్య, త్కవి, రా, జామాత్య, పురోహితాది మహాజన సంకీర్ణం బగునానిండుసభయందు, "సెబాస్! కవిచంద్రమా! నీవు నిక్కముగ రాధామాధవుఁడవే!" అని బహూకరించి పలికిన పలుకే మన కవికి సాటిలేనిబిరుదభూషణమై, బిరుదముల కెల్లఁ బరమావధిని జెందినబిరుద మైనది!

ఏతాదృశమహారాజప్రసాదితబిరుదగౌరవమే మనకవిరాజునకు నమూల్యాలంకార మై, యాతనిపురోభివృద్ధికిఁ గారణమై, యితోధికకావ్యనిర్మాణమునకు మార్గదర్శక మైనది. కావుననే మన రాధామాధవకవి, రాను రాను జానుమీఱినకవితాకళాకౌశలముతో 'తారకబ్రహ్మరాజము'ను, తన బిరుదమువలెనే (కవిత్వమున) పరమావధి గాంచిన 'విష్ణుమాయానాటక'ప్రబంధరాజమును సృజియించి సమానులలో నుత్తమశ్లోకుఁడై శాశ్వతకీర్తిని గడియింపఁగలిగెను.

రసగ్రహణపారీణు లైన మహారాజుల యాదరాతిశయాదులు సరసకళల కెంతటి ప్రోత్సాహకరము లైన నై, యాచంద్రార్కయశస్సంపాదకము లగునుగదా!

రాధామాధవము నాలకించి నిరవధికానందరసనిమగ్నుఁడై యిట్టిపరమబిరుదము ననుగ్రహించి యిచ్చిన 'కవితాశ్రీలోలుఁ' డాశ్రీకృష్ణరాయమహారాజకవివతంసము, ఏతత్కవివిరచితమే యగు విష్ణుమాయానాటకకావ్యమును చిత్తగించుటయే తటస్థించి యున్నచో మనకవిసింహు నెట్లు గౌరవించి యెంతగా నానందించి యుండునో నిర్వచించుట యూహమునకును, లిఖించుట లేఖినికిని గూడ నందనివై యుండి యుండును.

ఎల్లనార్యుని రాధామాధవకావ్యమును వీనులార విని, మనసార నామోదించి శ్రీకృష్ణదేవరాయ లాతనిని 'రాధామాధవుఁ డనియే ప్రశంసించినాఁడు! ఇట్లే రాధామాధవుఁడును, కృష్ణరాయని 'కవితాశ్రీలోల'త్వాదివిశిష్టగుణపరిపూరతను మెచ్చుకొని రాధామాధవకావ్యమునందు,

"క.

మఱచిరి గృహకృత్యంబులు,
మఱచిరి లజ్జాభయములు, మఱచిరి మగలన్,
మఱచిరి సర్వము గోపిక
లఱిముఱి శ్రీకృష్ణరాయఁ డాత్మఁ గరంపన్.”

(35పుట)

అని తనయిష్టదైవతమును, శ్రీకృష్ణదేవుని శ్రీకృష్ణరాయనామమున వ్యవహరింపకుండ నుండఁజాలక పోయెను.

ఆహా! ఎక్కడి ద్వాపరయుగ ఘూర్జరదేశకృష్ణుఁడు? ఎక్కడి యాంధ్రదేశి 'రాయ' శబ్దము? - తనప్రభువు తనకు నభీష్టదేవతార్దబోధక మగుబిరుదము నీయఁగా, తన యిష్టదైవతమునకుఁ దనప్రభువునామమే బిరుద మగునట్లు చేసినాఁడు గుణగ్రహణపారీణుఁడు, స్వామిభక్తుఁడు నైన మనకవీశ్వరుఁడు!

పైవిషయములను బట్టి చూడఁగా, రాధామాధవుని కవితావైదగ్ధ్యమును గూర్చి శ్రీకృష్ణదేవరాయలకును, కృష్ణరాయల రసగ్రహణపారీణతను గూర్చి రాధామాధవునకును గల గౌరవప్రపత్తులు సామాన్యములు గా వని చెప్పుట కెట్టిసంశయమును గోచరించుట లేదు.

కవియిష్టదైవాదికము

ఉపలబ్దము లైన యెల్లనార్యుని 'రాధామాధవ, తారకబ్రహ్మరాజ, విష్ణుమాయానాటకకోశములను బరీక్షించి చూడ, నిమ్మహాకవి, 'ప్రసన్నమదనగోపాల, రాధాకృష్ణకవచాది' మహామంత్రోపాసకుఁ డైన నిష్ఠాపరుఁడును, మహావిష్ణుభక్తుఁడును నై యుండినట్లు తోఁచుచున్నాడు. ఈగ్రంథము ప్రథమాశ్వాసము 17 వ పద్యము మొదలుకొని 27 వ పద్యమువఱకుఁ గలయవతారికాభాగమును బరికించినచో నివ్విషయము కొంతవఱకు విశదము గాఁగలదు. (మహాత్ములు మనస్సంకల్పబలంబున నభీష్టదేవతాసాక్షాత్కారమును బొందఁగలుగుదు రనుటకు సనాతనాధునాతనదృష్టాంతము లనేకములు గలవు.)

రాధామాధవకవి తనగ్రంథమున నిష్టదేవతాస్తుతియందు దేవీసహితు లైన విష్ణు, శంకర, బ్రహ్మలను గ్రమముగా వినుతించి, పిమ్మట గణనాయకుని స్తుతియించినాఁడు. అనంతరము వాల్మీక్యాదిసంస్కృతమహాకవులను, కవిత్రయ మని పేరుగాంచిన నన్నయ, తిక్కన, శంభుదాసులను, శ్రీనాథునిని మాత్రమే కీర్తించినాఁడు.

గ్రంథవిమర్శము

రాధామాధవము — ప్రభావతీప్రద్యుమ్నము

ఇంచుమించుగ సమకాలపువా రైనకవివర్యులచే రచియింపఁబడిన రాధామాధవ, ప్రభావతీప్రద్యుమ్నకావ్యములను బాగుగఁ బరిశీలించుచోఁ బ్రధానవిషయములయందు రెంటికిని విశేషించిన పోలికలు గానవచ్చుచున్నవి. ఏతద్గ్రంథకర్త లిరువురును, ఒకరినొకరు మించినకవులే; విద్యాపారంగతులే. కావున నేతత్కవిద్వయవిరచితగ్రంథవిషయములను సంగ్రహముగ నిచ్చటఁ బరామర్శించుచున్నాను.

కృష్ణదేవరాయల యాస్థానకవిశేఖరుఁ డగు 'అల్లసాని పెద్ద'నామాత్యునకుఁ బ్రభావతీప్రద్యుమ్నకావ్యకర్త యగు పింగళి సూరనార్యుఁడు (దౌహిత్రీభర్త) సమీపబంధుఁడును, అప్పటికిఁ బిన్నవయసువాఁ డయ్యుఁ గవితానైపుణ్యము గలవాఁడును నగుటచే నాతనికిఁ గృష్ణరాయలవిద్వత్కవిపరిషత్తుతో విశేషపరిచయము గలిగి యుండును. ఆమహారాజు రాధామాధవప్రబంధము నాలించి తత్కవికి సర్వాతిశయబిరుదప్రదానము గావించుటను సూరనార్యుఁడు స్వయముగ సందర్శించియే యుండును. అప్పటికి విద్యాగర్వము గల యాబాలకవి, ఆనిండుసభయం దనన్యసామాన్యగౌరవమును గాంచిన యీబాలకవి యగు రాధామాధవునికవిత్వమును లోలోన మెచ్చుకొని యుండును. అప్పు డట్టిమనోహరగ్రంథమును నిర్మింపవలయు ననుదృఢసంకల్ప మాతనిహృదయక్షేత్రమున నావాపిత మై యుండును. (ఆయుద్దేశమును) సఫలపఱుచుకొనుటకే పింగలి సూరనార్యుఁడు రాధామాధవమునకు బదులుగా నారీతి నామమే - కలప్రభావతీప్రద్యుమ్నమును గాలక్రమమున రచి యించి కృతార్థుఁ డయ్యెను. అప్పటికి నాయికానాయకులనామములతో నొప్పు నాంధ్రప్రబంధము రాధామాధవ మొకటియే యై యుండుటయు, అట్టిపేరితోనే విలసిల్లు రెండవయాంధ్రగ్రంథము ప్రభావతీప్రద్యుమ్న మై యుండుటయుఁ బైయూహమును స్థిరపఱుచుచున్నవి. ఇంతియ కాక యీయుభయకావ్యములలోను – పాత్రసృష్టియందును, తత్పోషణమునందును గూడఁ బెక్కుసామ్యములు గానవచ్చుచున్నవి —

రాధామాధవమునందు దౌత్యము నడపిన మధురవాణి, సాక్షాద్వాణీదేవి; ప్రభావతీప్రద్యుమ్నదూతిక యైనశుచిముఖి, వాణీదేవిచే నాదరింపఁబడిన హంసి. మధురవాణీశుచిముఖీశబ్దములు గూడ గ్రంథనామములవలెనే కొంతసామ్యమును జెందుచున్నవి. రాధామాధవములోని కథానాయికకు 'వినుకలి'వలనను, ప్రభావతీప్రత్యుమ్నములోని నాయికకు, 'కనుకలి'వలనను తమతమనాయకులపైఁ బ్రేమోదయ మైనది. ఉభయకవులును తమతమపొత్తములలోని దూతికలను సమయోచితముగ నితరులచేఁ బొగడించి యానెపమున నాత్మవిద్యాప్రావీణ్యమును బ్రకటించుకొన్నారు. ఎట్లన,

“సీ.

 సద్వివేకనిరూఢసౌజన్యశీలవు
              సుస్నేహసౌహార్దసులభమతివ
శ్రవ్యశక్యోక్తి కౌశలకథాసరణివి
              నిన్ను వర్ణింపంగ నేర్తు మెట్లు?

☆ ☆ ☆ ☆ ☆

అతివ! మధురవాణి యనుపేరు సార్థంబు
నీకు; నిన్నుఁ బోల నీవె నేర్తు
గాక! యొరుల సాటిగాఁ జెప్పవచ్చునే?
చెప్పునెడల వాణిఁ జెప్పవలయు!"

రాధామా. (82 పుట).

"సీ.

శబ్దసంస్కార మెచ్చటను జాఱఁగనీక
              పదమైత్రి యర్థసంపదలఁ బొదలి
తలఁపెల్ల నక్లిష్టతను బ్రదీపితముగాఁ
              బునరుక్తిదోషంబు పొంతఁ బోక
☆ ☆ ☆ ☆ ☆
ఒకటఁ బూర్వోత్తరవిరోధ మొందకుండఁ
దత్తదవయవవాక్యతాత్పర్యభేద
ములు మహావాక్యతాత్పర్యమునకు నొనరఁ
బలుక నేర్చుట బహుతపఃఫలము గాదె?”

ప్రభా. ప్ర. ద్వితీ. 3 ప.

“క.

నీ వెవ్వరికొలఁదియుఁ గా
వోవరటామణి! విహంగయోషవె? భాషా
ప్రావీణ్యము చూడఁగ వా
గ్ధేవతవో కాక యాకె దిద్దినకవివో!”

ప్ర. ప్ర. ద్వితీ. 4 ప.

మఱియు, మధురవాణీశుచిముఖులు తమతమకథానాయికలహృదయములను బరీక్షింపఁ జిత్రతరముగఁ బ్రయత్నించినారు. (ప్రయత్నము సమానమే.)

రాధామాధవము (83, 84 పుటలు)

“గీ.

అనిన మధురవాణి హర్షించి యాయింతి
తలఁపు నిశ్చయంబుఁ గొలుపఁబూని
సందియంబు గలుగ సరసోక్తినైపుణి
నెఱిఁగి యెఱుఁగనట్టు లిట్టులనియె.


“ఉ.

వాక్యము లిట్లయా! హృదయవాసన యెట్టిదొ కాని! శౌరితో
నైక్యము గల్గెనేని వినవమ్మ! సువర్ణకలాపయుక్తమా
ణిక్యశలాకవోలె రమణీయతఁ దాల్పవె నీవు? నవ్యచం
ద్రక్యధిరాజబర్హసమతాభరణక్షమకేశమంజరీ!


వ.

అని సంశయంబుగాఁ బలికిన.


"క.

ఏఁటికి ననుమానించెదు?
జోటీ! యామేటిఁ గవయఁ జూడక యొరునిం
గీటసమానుని మదిలోఁ
బాటింతునె? హరిణి వృకముపైఁ బడఁజనునే?”

పై పద్యములయందు, దూతిక యగుమధురవాణి, రాధాదేవిహృదయమును బరీక్షింప నెంతనేర్పు చూపినదో, రాధ తనహృద్గతాభిప్రాయము నెంతయమాయికముగా రూఢి

పఱిచినదో యారయ నగును.)

ప్రభావతీప్రద్యుమ్నము

(శుచిముఖి ప్రభావతితో నిట్లు పలుకుచున్నది.)

“మ.

అతివా! నిన్ వినుపించువేళఁ బ్రతివాక్యం బేమియుంలేమిఁ ద
ద్రతికాంతు వెసఁ దెత్తుఁ బంపుమని పంతం బాడుకోరాదు; గా
ని తగం దెచ్చెద నిశ్చలం బయినపూన్కి సిద్ధగంధర్వదై
వతదైత్యాదికులంబులం దొకని నెవ్వానిన్ మదింగోరినన్.”

తృతీ. (94 ప.).

(ప్రద్యుమ్నునిదక్క నిఁక నెవ్వరిఁ గోరినను దెచ్చెద నన్నది!)

ఏతత్పరీక్షకు నిర్వురునాయికలును దమతమ దూతికలకు నేకవిధప్రత్యుత్తరమునే యిచ్చినారు —

“గీ.

తల్లియును దండ్రియును నీదు తలఁపుకొలఁది
జాగనిత్తురె? యంటివా! జలజనేత్ర!
కృష్ణావర్త్మాభిముఖతం దక్కించిరేని,
కృష్ణవర్త్మాభిముఖతఁ దక్కింపఁగలరె?

(రాధామా. 84 పుట)

"క.

విను! ప్రద్యుమ్నుని దక్కన్
మనముననే నొరు వరించుమాట విడువు; మా
ఘనుఁ డొల్లకున్నఁ జెందుదు
మనసిజశిఖిఁ దనువు వేల్చి మఱుసటిమేనన్.”

(ప్ర. ప్ర. తృ. 102 వ.)

ఉభయకవులును తమతమగ్రంథనాయికలు బ్రహ్మదేవునిసృష్టిలోనివారు గానియట్లే చెప్పియున్నారు —

(రాధామాధవములో వాణియైన మధురవాణి రాధను జూచి యిట్లనుకొనినది.)

"ఉ.

ఈతరళాయతాక్షి రచియించెడిచాతురి యెట్లు గలెనో
ధాతకు? ధాతచేత రచితం బగునే యిటువంటిరూపు? నేఁ
జూతున కాదె యక్షసురసుందరులన్ సృజియించువేళలం?
దేతదనూనవిభ్రమము లెక్కడి వాచిగురాకుఁబోండ్లకున్?"

(73 పుట)

మఱియు, తనసుహృజ్జనబంధుసమక్షంబున సహస్రగోపుఁడు రాధాజననవృత్తాంతంబును జెప్పుచు, వ్యాసుఁడు తన కొకదివ్యమంత్రం బుపదేశించినట్లును, తన్మంత్రసమాకలనంబువలన వరప్రదాత యగుశివుండు రాధాదేవిని బ్రసాదించినట్లును జెప్పి యున్నాఁడు.

(ప్రభావతీప్రద్యుమ్నములో, శుచిముఖ, ప్రద్యుమ్నునితో బ్రభావతిం గూర్చి చెప్పుపట్టున,)

“క.

అత్తరుణీమణిరూపముఁ
జిత్తరువున వ్రాయునేర్పు సేకుఱునేనిం
దత్తుల్యవనిత నెందే
నత్తొలువేలుపు సృజింపఁడా తన సృష్టిన్?”


“ఆ.

అజుఁడె యొకప్రసంగమై చెప్ప వింటి న
క్కాంత యతనిసృష్టి గాకునికియు,.
నాదిశక్తి, శివుమహాదేవి తనదైన
చిత్రమహిమచే సృజించుటయును.”

ఇత్యాదిగ నుగ్గడించినది. ఇప్పట్టున నుభయకావ్యములయందును, కథానాయికలను- బ్రహ్మదేవుఁడు, రచియించుటకైనఁ జతురుఁడు గాఁ డని యొకకవియు, వ్రాయుటకైనను నేర్పరికాఁడని యొకకవియు నొకరీతినే వ్రాసియున్నారు.

రాధామాధవుఁడు రాధ "నీశ్వరుని”చే సృష్టింపఁజేయఁగా, సూరనార్యుఁడు ప్రభావతిని “ఈశ్వరి”చే సృజియింపఁజేసినాఁడు!

రాధికకు నిజసోదరుఁడైన భద్రకునివలనను, ప్రభావతికి నిజజనకుఁడైన వజ్రనాభునివలనను తమతమయభిమతనాయకులను బడయుటకుఁ గలిగినయడ్డంకులయందును, కథానాయకులు తమతమప్రియురాండ్రను బరిగ్రహించుపట్టులను గూడ రెండుకావ్యములయందును సంవిధానసాదృశ్యము గనఁబడుచున్నది. (మొదటిది స్వయంవరవ్యాజము; రెండవది నాటకప్రదర్శనకైతవము.) మఱియు రాధామాధవమున స్వయంవరాగతు లగు రాజేంద్రులను వివరించి చెప్పుటకై, వాణీదేవి, తనపెంపుడుచిలుకను బంపినది; ప్రభావతీప్రద్యుమ్నమున మఱియొకదూతికగా నొకచిలుక గల్పింపఁబడినది.

ఇట్టి కథాసంబంధమునకుఁ జేరినపోలికలే కాక యచ్చటచ్చట భావైక్యము సూచించు పద్యములును, సమానరచనలు గలవచనములును బెక్కులు రెంటను గానవచ్చుచున్నవి.

నాయికానేత్రవర్ణనము

"క.

వాలికచూపులు గలయా
బాలికకన్నులు దనర్చు, బలువడి మ్రింగం
జాలక పుక్కిటివెన్నెల
లాలితగతి నుమియు వెన్నెలపులుఁగులగతిన్.”

(రాధామా. 49 పుట)

ఉ.

ఎప్పుడు భక్తభావమున నింపడరన్ ద్విజరాజుపాదముల్
దప్పక సేవచేయు సుకృతంబునఁ గాంచెఁ జకోరయుగ్మ మీ
యొ ప్పననొప్పుఁ గన్ను; లవి యోలినక్రోలినతేటవెన్నెలల్
చిప్పిలినట్లు మించు సతిలేనగవుల్ వెలినిగ్గుఁజూపులున్."

ప్ర. ప్ర. ద్వి. 73 ప.

(ఇందుభావ మించుమించుగ నొకటే.)

సీ.

జలజాయతాక్షువక్షస్స్థలిఁ జేర్పని,
              కుచములు కుచములే కోమలాంగి!

(రాధామా. 79 పుట.)

☆ ☆ ☆ ☆ ☆

“సీ.

ఆరతికిఁ గరంబు లైతిరే నవ్విభుఁ,
              గౌఁగిలింపఁగ నబ్బుఁ గరములార!
ఆయింతికిఁ గుచంబు లైతిరే నతనివ,
              క్షోనిపీడన మబ్బుఁ గుచములార!

☆ ☆ ☆ ☆ ☆

ప్ర. ప్ర. తృ. 105. ప.

ఇందు మొదటిపద్యము, మధురవాణి రాధికకు బోధించినది; రెండవది నాయిక తనలో భావించుకొన్న పద్యము.
"సీ.

కలికియొయ్యారంపుగతుల వ్రేతలఁ గన్ను
              లార్చి యిక్కువలకుఁ దార్పఁ డయ్యె,
సహచరగోపాలచయముతో నెప్పటి
              యట్ల సంప్రీతి మాటాడఁ డయ్యె,
మణికుండలప్రభామండితగండస్థ
              లుల హాసచంద్రికల్ నిలుపఁ డయ్యె
నారదవాక్సుధాపూరంబు కడు నాని
              చెవి కొండుపలు కింపు సేయఁ డయ్యె
త్రిజగతీవిభ్రమశ్రీలఁ దేజరిల్లు
నాదిలక్ష్మికి నీడు జోడైనరాధ
మీఁదికూర్మి మనంబులో మిక్కుటముగ
మాధవుం డొక్కకేవలమర్త్యునట్లు.”

రాధామా. 54 పు.

ఇందు కవి శ్రీకృష్ణుని కేవల మానవునిఁ జేసినాఁడు. కాని వెంటనే,

సీ.

విరహతాపంబున విహ్వలుం డయ్యును
              భక్తులతాపంబు పరిహరించు,

☆☆☆☆☆

గీ.

కామసుఖసక్తుఁ డయ్యును ఖలుల కెల్లఁ
గామసుఖసక్తతలఁ బాపుఁ గమలనేత్రుఁ
డాత్మసంపూర్ణకాముండు నగుటఁ జేసి,
యఖిలలోకైకకర్తయు నగుటఁ జేసి.”

(రాధామా. 55 పుట.)

అని మరల నాతనిదేవత్వమును సైతము ప్రదర్శించినాఁడు!
“సీ.

కనఁ డొద్ద నున్నవారిని వీరు వారని
              కనినఁ దదర్హవర్తనలు మఱచు,
వినఁడు చెప్పినపల్కె వేమఱు చెప్పక
              వినిన నే మే మంటి? రనుచు నడుగు,
చనఁ డెత్తు లిడక మజ్ఞనముఖ్యవిధులకుఁ
              జనినఁ దబ్బిబ్బుగాఁ జలుపుఁ గ్రియలు
కొనఁడు నానాసేవకులసేవ లెవ్వియుఁ
              గొనిన వీడ్పాటుగాఁ బనులు పనుచు
శుచిముఖీవాక్యదర్పణస్ఫురితనిరుప
మానదనుజేంద్రకన్యకామణిమనోజ్ఞ
రూపరేఖావిలాససంరూఢమైన
యాత్మ మరలింపనేరక హరిసుతుండు.”

ప్ర. ప్ర. ద్వితీ. 108 ప.

ఇందు సూరనార్యుఁడు ప్రద్యుమ్నునిఁ గేవలమర్త్యునే చేసినాఁడు.

"... ప్రాణసఖులకు దాఁచెడు పనులు గలవె... ?”

అని మధురవాణి రాధతోఁ బలికినది.

"అరయఁగఁ దల్లి కక్కసెలియండ్రకు...
...... దోఁచురహస్యములు...
... ... చెలికిఁ బ్రాణము లిచ్చిన నప్పు దీఱునే?”

ప్ర. ప్ర. తృతీ. 98.

ఇది ప్రభావతి హంసితోఁ బలికినది.

రాధామాధవుని భావమును సూరన ప్రపంచించినాఁడు. ఇట్టిసాదృశ్యము లీరెండుగ్రంథములయందును బెక్కులు గలవు.

పైసందర్భములు మొదలగువానినిబట్టి యాలోచించునారికీ రాధామాధవకావ్య మాదర్శకమును, ప్రభావతీప్రద్యుమ్న మనుకరణమును నై యుండినట్లును, కావుననే సూరనార్యునకుఁ బ్రభావతీప్రద్యుమ్నమున జిలుగుమెఱుంగులు పెట్టుకొనుట కవకాశము గలిగియుండినట్లును బోధపడక మానదు.

నేర్పరి యగుచిత్రకారుఁడు తనబుద్ధివైశద్యముచే నేది యే నొకచిత్రమును వినూత్నపద్దతిని మనోహరముగఁ జిత్రించి మెప్పొందఁగా, నట్టిసమర్థుఁడే యగు వేఱొకచిత్రకారుఁడు తనప్రజ్ఞావిశేషమున నట్టిదే యగు మఱియొకచిత్రమును రచియింప సమకట్టి క్రొత్తక్రొత్తచిన్నెలకు, వన్నెలను నచ్చటచ్చటఁ జేర్చి దిద్ది తీర్చి, కృతకృత్యుఁ డగుటకుఁ జాలినంతయవకాశ ముండును గదా!

చిన్ననాఁడు కృష్ణరాయలసభయందు రాధామాధవమువంటి యుత్తమకావ్యమును రచియింపవలయు నని పింగలిసూరనార్యుని హృదయక్షేత్రమున నాటుకొనిన సంకల్పబీజమే, కాలక్రమమున నంకురించి, రేకెత్తి, తరుణవృక్షమై, యభివృద్ధిం గాంచుచున్న కవితాశక్తిదోహదముచే దృఢమహీజమై, తుదకు బ్రభావతీప్రద్యుమ్నమువంటి మధురఫలమును లోక మాస్వాదించునట్లు చేయఁగలిగినది!

ప్రభావతీప్రద్యుమ్నమునకు రాధామాధవమే యాదర్శక మైనను, సూరనార్యుఁడు, కథాసంవిధానచాతుర్యమున నేమి, అభినవపాత్రసృష్టియం దేమి, జాతీయపదప్రయోగనైపుణ్యమునం దేమి, సమయోచితవచఃప్రాగల్భ్యమునం దేమి రాధామాధవకవిని మించునట్టి మేలిమెఱుంగులను జూపఁగలిగెను. కాని, మృదుమధురపదప్రయోగసారళ్యమునందును, విషయవర్ణనవైదగ్ధ్యమునందును, నిరర్గళధారాసమారూఢియందును, పాకఋజుత్వశయ్యాసౌకుమార్యాదులయందును మనరాధామాధవకవికి దీటు గాఁజాలఁ డయ్యెను.

శ్రీకృష్ణరాయేంద్రప్రదత్త మగు నెల్లనార్యుని రాధామాధవబిరుదగౌరవమువంటి గౌరవమును వాంఛించి దృఢసంకల్పుఁ డైన సూరనార్యుఁ డీవిధముగ, ప్రభావతీప్రద్యుమ్నకావ్యరాజమును సృజియించి, శుచిముఖికి బ్రహ్మాణి యగువాణిచేఁ బ్రసాదింపఁబడిన 'ఉపమాతిశయోక్తికామధేను' బిరుదమునకు భంగ్యంతరముగఁ దానే లక్షీభూతుఁడై, చరితార్థుఁ డైనాఁడు. ఈవిషయమునుబట్టి, బాగుగఁ బరిశీలింపఁగా, నింకను నిగూఢమైన పరమార్థ మొక్కటి స్ఫురించి, యేతదుభయకవుల సౌహార్దసామరస్యములను దృఢపఱుచుచున్నది. ఎట్లన,

ఎల్లనార్యుఁడు, తనరాధామాధవమునందు, మధురవాణీరూపమున (తాను) వాణి యై యున్నట్లును, సూరనార్యుఁడు, తనప్రభావతీప్రద్యుమ్నమునందు శుచిముఖీరూపమున (తన్ను) వాణీదేవి దిద్దితీర్చినహంసియై యున్నట్లును ధ్వనిప్రధానకావ్యకర్తలైన యీయిరువురుకవుల రచనలను బట్టియు ద్యోతక మగుచున్నదిగదా! మఱియు, ప్రభావతీప్రద్యుమ్నమునందు వాణీదేవి శుచిముఖికి నొసగిన 'ఉపమాతిశయోక్తికామధేను' బిరుదము, అద్వితీయబిరుదాభిరాముఁ డగు రాధామాధనకవిచే, ననన్యసామాన్యకవిప్రతిభానిధి యగు సూరనార్యు నుద్దేశించి చేయఁబడినయభినందనమే యై యున్నట్లు ధ్వనించుచున్నది. అట్టిరాధామాధవునిచే మెప్పు నొందుటయే సూరనార్యుని పరమోద్దేశమై యుండి, యట్టిసంకల్పము సిద్ధించుటచేతనే యాతఁడు (సూరనార్యుఁడు) ప్రకారాంతరమున నవ్విషయము నిట్లు ప్రదర్శించి యుండును. దీనివలన సమకాలికులైన యీకవిద్వయములో నొకరియం దొకరికి నిర్ష్యాసూయలు లే వనియు, నుభయులును బరస్పరగౌరవాభిమానములు గలవారై యుందు రనియు నిర్ధారణ మగుచున్నది.

ఈసందర్భమున నొక్కమాటను చెప్పకుండ నుండఁజాలము.

"శ్రీకృష్ణరాయయుగ”మని ప్రసిద్ధిని గాంచిన యాప్రబంధయుగమునందు కావ్యరచనాప్రావీణ్యమున నున్నతోన్నతస్థానము నలంకరించిన కవిసింహు లీయెల్లనసూరనార్యు లిరువురే!

రాధామాధవులు

రాధామాధవుల ప్రేమవిలాసములనుగూర్చి వ్రాసినకవులలోఁ జాలమంది, తమతమగ్రంథములయందు రాధను స్ప షముగానో, గూఢముగానో పరకీయ యైననాయికగాఁ బ్రదర్శించి యున్నారు. ఈపద్దతిమీఁదనే రాధామాధవవిలాసము, రాధికాసాంత్వనము మొదలగు గ్రంథములు రచియింపఁబడినవి. వీథిభాగవతములలోఁ గూడ రాధ పరకీయయే! విశేషించి రాధను గూర్చిన సామెతలును, జనప్రవాదములును గూడ నిట్లే యున్నవి! ఇది మిక్కిలి యన్యాయ్యము!

విష్ణుకథాసంకలితము లైనపురాణాదులలో — భాగవతమునందు గాని, విష్ణుపురాణమునందు గాని, శ్రీకృష్ణప్రాధాన్యమును బ్రకటించుభాగము గలభారతమునందు గాని రాధానామము గానరాదు. కాని, బ్రహ్మవైవర్తపురాణమున రాధాదేవీపరమౌత్కృష్ట్యము వివిధవిశేషమహిమములతో వర్ణింపఁబడి యున్నది. అప్పురాణమునందు విష్ణుదేవునకు లక్ష్మీదేవివలెనే త్రిమూర్తులకును మూలకారణుఁ డైన శ్రీకృష్ణదేవునకు నీరాధాదేవి నిత్యానపాయిని యైనదేవిగా నభివర్ణింపఁబడి యున్నది. మఱియు నందు, రాధయే మూలప్రకృతిగను, శ్రీకృష్ణుఁడే యాదిపురుషుఁడుగను గీర్తింపఁబడిరి. అట్టి రాధాకృష్ణులు కారణాంతరములచే వారిగోలోకమునుండి భూలోకమున నవతరంచుటయు, వారిలో రాధ శాపవశమున జన్మించి రాయణపత్నీమాత్రముగ నుండవలసివచ్చుటయు నాపురాణగ్రంథముననే వక్కాణింపఁబడి యున్నది. రాధను పరకీయగా వర్ణించినకవులకు నీవిషయమే యాధారమై యుండవచ్చును. దీనింబట్టి కొం దఱుకవులు రాధాకృష్ణులవిలాసమును 'గోరంతలు కొండంతలు'గాఁ జేసి వ్రాసి యున్నారు.

పరమభక్తాగ్రేసరుఁ డగుమనరాధామాధవకవి, బ్రహ్మవైవర్తపురాణములో నిరాధాతత్వమును సంపూర్ణముగ గ్రహించి యాదివ్యప్రకృతినే లక్ష్మీదేవిగా భావించి, యీరాధామాధవకావ్యమునందు రాధాదేవిని శ్రీమహాలక్ష్మియపరావతారముగాఁ గల్పించి ప్రశంసించి యున్నాఁడు. కవి యిక్కల్పనయందు మాత్రమే కొంచెము స్వాతంత్య్రమును వహించెను. కాని, విశేషించి బ్రహ్మవైవర్తపురాణతత్త్వమునే యనుసరించినాఁడు. మఱియు, రాధ పరకీయ యను నయథార్థకల్పిత మగు నపస్మృతికిఁ దనహృదయమునందువోలె నిక్కావ్యమునం దెచ్చటను జోటియ్యలేదు.

భగవంతునియెడ భక్తునికిఁ గల యెడతెగని ప్రేమము, స్వైరిణికి నుపపతియందు గలుగు నిరంతరదృఢతరానురాగమువంటి దను ననుభవసాధ్యదృష్టాంతమును రూపకముగాఁ బ్రదర్శించుటకుఁగాను, బ్రహ్మవైవర్తపురాణకారుఁడు శాపమిషంబున మూలప్రకృతిస్వరూపిణి యైన రాధాదేవిని భూలోకమునకుఁ దెచ్చి, యామెకుఁ బరకీయాభూమికను గల్పించి, యాత్మభర్త యైన శ్రీకృష్ణునినే యుపభర్తగాఁ జేసి, యామెకు నాతనినియెడఁ గల నిరతిశయానురాగవ్యాజమునఁ బరమభక్తినే (లోకమునకై) ప్రబోధించినాఁడు. ఇక్కథలోని బహిర్భావ మును మాత్రమే కావ్యవస్తువుగాఁ బరిగ్రహించిన యితరకవులు, రాధికను కేవలజారిణిగనే ప్రదర్శించి, తమతమగ్రంథముల నతివేలశృంగారరసవాహినులలోఁ దేల్చి వైచినారు. భక్తిప్రబోధమునకై పురాణకర్తచేఁ గల్పింపఁబడిన యిక్కథ, యిక్కవులచే వ్యత్యస్తముగాఁ బరిణమించినది. మనరాధామాధవకవి, యట్టిమార్గము ననుసరింపక లక్ష్మీనారాయణులనే రాధామాధవులను గాఁ జేసికొని యిమ్మనోహరకావ్యరాజమును శృంగారరసానుప్రాణిత మైన భక్తిరససుధాసాగరముగాఁ చేసివైచినాఁడు. మఱియు, వల్లవనాయకుఁడైన సహస్రగోపునితనయ యగు రాధను దేవీమూర్తిగనే భావించి, యామెను వర్ణించుపట్టునఁ (గవిసంప్రదాయానుసారము) బాదాదిగ శిరఃపర్యంతము నవయవవర్ణనము నొనర్చి యున్నాఁడు. ఇట్టి భక్తితాత్పర్యముచేతనే యీతనికిఁ గవితాతాదాత్మ్యము గలిగి, రాధామాధవత్వము ప్రాప్తించినది!

ఇక్కావ్యమునం దంతటను బవిత్రమైన రాధామాధవతత్త్వమే ప్రతిపాదితమై యున్నది.

సీతారాములవలెనే విష్ణుభక్తులకు రాధాకృష్ణులు నభీవదైవతములై యున్నారు. రాధాదేవి గాక, రుక్మిణ్యాద్యష్టమహిషులు శ్రీకృష్ణునకు ధర్మపత్నులై యున్నట్లు పురాణాదులయం దున్నను, భక్తు లెల్లరు రాధాకృష్ణనామమునకే ప్రియపడెదరు. మఱియు, వారు, తక్కిన యేదేవేరులనామములతో డను శ్రీకృష్ణునామమును జేర్చి సంస్తుతించుచున్నట్లు (రుక్మిణీకృష్ణ, సత్యభామాకృష్ణ ఇత్యాదిగఁ) గానరాదు!

కవిమతము

రాధామాధవకవీంద్రుని కావ్యములను బరిశీలింప, నీతఁడు విష్ణుభక్తాగ్రేసరుఁడు గాఁ గానవచ్చుచున్నాడు. కాని, మతాభినివేశపరతంత్రులై, శివనామోచ్చారణమాత్రముననే భాగవతాపచారము సంఘటిల్లు నని భావించు వీరవైష్ణవులవలెను, విష్ణునామాకర్ణనమాత్రముననే స్వమతాచారభ్రష్టతాదోషము సంభవించు నని తలంచు వీరశైవులవలెను నీతఁడు, మతవైషమ్యమును బరిగణింపక, హరిహరాద్వైతతత్త్వమును విశ్వసించిన సత్యతత్త్వజ్ఞానిగాఁ దోఁచుచున్నాఁడు. కావుననే, వైకుంఠనగరమునకు “పార్వతీవల్లభుండు, దైవదుందుభి జయజయధ్వనులు చెలఁగ, మైత్రిని” వచ్చినప్పుడు, “మాధవుండు, కాంచి, వికసించి, యెదురేగి, కౌగిలించి, సంభావించి," ... విరూపాక్షునికేలు కేలం గీలించి..... తోడ్కొని వచ్చి, తమ కిద్దఱకును భేదంబు లేదని తెలుపుచు, నతండును, దానును నొక్కదివ్యమణిసింహాసనంబుననే యధివసించె" నని చెప్పి, మనకవి, హరిహరాభేదతత్త్వమును విష్ణుదేవునిచేతనే సిద్దాంతపఱిపించినాడు.

మఱియు నీతఁడు, ఈగ్రంథము 130 వ పుటలోని 55 వ పద్యము మొదలుకొని 69 వ పద్యమువఱకు నున్నపద్య ములలోఁ, బారము ముట్టునట్లు, శివమహిమ నభివర్ణించి, (సహసగోపముఖంబున) శివసంస్తుతిని గావించినాఁడు. ఇంతియ కాక, కథానాయిక యగు రాధాదేవియవతారమునకు శివునినే కారణభూతుఁడైనవరప్రదాతగా నొనర్చి హరిహరాభిన్నత్వమునందు దనకుఁ గలవిశ్వాసమునకుఁ బ్రాధాన్యము నిచ్చినాఁడు.

ఇక్కావ్యమునందు గోచరించు “వల్లవీవల్లభా,” “అంబికాధవా” అను మకుటములు గల పద్యములను బట్టి చూడఁగా, నిక్కవిచంద్రుఁడు చిన్ననాఁడు హరిహరస్తవరూపము లగుశతకములను గూడ రచియించెనా యనుభావమును గలుగుచున్నది.

ఛందోవ్యాకరణవిశేషములు

రాధామాధవకావ్యములోని ఛందోవిశేషములలో "రేఫద్వయ'మైత్రివిశేషము తప్పఁ జర్చింపవలసినది వేఱకటి గానరాదు.

రేఫద్వయమైత్రిని గూర్చి లాక్షణికులలోనే భిన్నాభిప్రాయములు గలవు. యతియందుగాని, ప్రాసమునందుగాని రేఫశకటరేఫములకు మైత్రిని సంఘటింపరా దని కొందఱు, వానిని బ్రాసమునఁ గూర్పరాదు గాని యతికిఁ గూర్పవచ్చు నని కొందఱు (లాక్షణికులు) నందురు. బాగుగఁ బరిశీలించినచో నీలాక్షణికుల కెవ్వరికిని శకటరేఫతత్త్వము పట్టువడినట్లు గొనరాదు.

శకటరేఫోచ్చారణము నన్నియభట్టారకునకుఁ పూర్వకాలమునందే శిథిలమైపోయినట్లు దెలుపు శాసనదృష్టాంతములు పెక్కు లు గలవు. పురాతనశాసనములలోనే యొకదానియందు శకటరేఫముతోఁ గూడిన పదము వేఱొకదానియందు రేఫయుక్తమై యగపడుచున్నది. వాని నెల్ల విమర్శించుట వ్యర్థము. ఉచ్చారణభేద మున్నకాలమందు — అనఁగా నన్నియకుఁ గడుంగడుఁ బూర్వమైనకాలమునందు రేఫద్వయమునకుఁ గలయిక నింద్య మనునిబంధన ముండియుండును. కాలక్రమమున నాశకటరేఫమునకు రేఫోచ్చారణము ప్రాప్తించి పురాతనోచ్చారణ మస్తమించినను, నారెంటికిని మైత్రి కూడ దనునియమము మాత్రము (నేఁటికిని!) నిల్చియున్నది! ఇ ట్లుండుటయే కాని రేఫద్వయమునకు మైత్రిని గూర్పని లక్షణగ్రంథకారుఁడు గాని, కవి గాని కానరాఁడు. ఏదైన నిట్టికలయిక గల ప్రయోగము నెవ్వరేని యేగ్రంథముననైనఁ జూపినచో నప్పదము ద్విరూపములలోని దని మనవారు సమాధానము సెప్పెదరు! ఈ ద్వైరూప్యనిర్మాణ మేఁటికో!

పైవివరణమువలన మనకవివైన “కఱకుఁదనము మాని యురలిపడక” (48 పుట. 163 పద్యము.) ఇత్యాదిప్రయోగములు గ్రాహ్యము లగుచున్నవి.

ఇఁక వ్యాకరణవిశేషములలో విశేషముగ విమర్శింపఁదగినవి యంతగా లేవు. ముఖ్యము లగువానిని రెండుమూఁడిటినిమాత్రము సంగ్రహముగఁ జర్చించెదను.

(1) క్త్వార్థకేకారసంధి,

"ఉ.

నెయ్యపుబోటికత్తియల నేర్పునఁ గన్మొఱఁగొక్క..."

(97 పుట. 141 ప.)

(కన్మొఱఁగి+ఒక్క=కన్మొఱఁగొక్క)

ఈసంధి నింద్య మని కొందఱయభిప్రాయము. ప్రాచీనకవులలో సామాన్యముగా నందఱు నీసంధిని గూర్చినవారే యనియు, నది సాధువు గావుననే పెక్కురుకవులు దానిని వాడినా రనియు, “క్త్వార్థేతోనభవేత్సదా”యను సూత్రము (బాలసరస్వతి కాలమున[9]) బయలుదేఱినతరువాత నది నన్నియనిబంధన మని భయపడి లేఖకులును, ముద్రితగ్రంథపరిష్కర్తలును పూర్వపాఠములను దిది వేసినా రనియు మఱి కొంద ఱందురు. దీనింగూర్చి పత్రికలలోఁ బూర్వ మనేకవాదప్రతివాదములు జరిగినవి!

ఈవాదములలో దేనినిగాని ఖండించుట మనయిప్పటిపని గాదు. పూర్వగ్రంథములయందు పరిష్కర్తలు విడిచి పెట్టినవియుఁ (క్త్వార్థేత్సంధి గలవి) బెక్కులు గలవు. ఒకటి రెంఢుదాహరణము లిచ్చట నిచ్చెదను —

శా.

ఆలో భీమునిపైఁ బుపరత్రితయసంహారంబు గావించు న
ప్ఫాలాక్షుండన నేఁగి మాధవుఁడు శుంభల్లీలతో బాహులం
గీలించెం బదునాల్గుతూపు; లది వీక్షిం చర్జునుం డాహరిం
దూలించెన్ విశిఖంబులన్ సురలు సంతోషించి భూషింపఁగన్.”

(చరిగొండ ధర్మనామాత్యుని చిత్రభారతము, అష్ట. 24 ప.)

క.

"...,.., ఎఱిఁగెఱిఁగి యుండి యకటా
కొఱవిం దలఁ గోఁకికొనుటకుం దలపెట్టెన్.”

(మాదయగారి మల్లన రాజశేఖరచరిత్రము, ద్వితీ. 33 ప.)

ఇట్టిప్రయోగములను జాలమంది ప్రౌఢకవు లాంధ్రకవిత్వము పుట్టినదాదిగఁ గ్వాచిత్కముగనైనఁ బ్రయోగించియున్నట్లు కానంబడుచునే యున్నది. కావున మనకవీంద్రుని ప్రయోగములును నట్టివే.

ఇత్వసంధి,

“తొల్కరని, (తొల్కరి + అని 94 పుట 133 వ.)
“వెండొర, (వెండి + ఒర 95 పుట. 136 ప.)

ఇత్యాదులు.)

అనేక హేతువులచే క్త్వార్థకేకారసంధియే సురక్షితమగుచున్నపు డీయిత్వసంధిని గూర్చి విశేషముగఁ జర్చింప నక్కఱ యుండదు. కాని, మహాకవుల యిట్టిప్రయోగములు రెండుమూఁడుమాత్రము చూపెదను —

“క. ఇతని...,...,... కనుదోయొలయన్.” (తిక్కన భార. శల్య. ఆ 1. 273 స.) (కనుదోయి + ఒలయన్.)
ఇట్లే కవిబ్రహ్మవి - ఇట్టితఁడు, పొయ్యిడుదు - ఇత్యాదులు గలవు.

“చిన్నిపైడందెలు ..." రాజ శేఖరచ. 1 ఆ. 63 ప. వెండుంగరము; తిత్తొల్చి. శ్రీనాథుఁడు; మోవిచ్చు= మోవి + ఇచ్చు, మొ- తెనాలిరామకృష్ణుఁడు... ఇత్యాదులు. (చూపఁబూనినచో నిట్టివి పరస్సహస్రములు!)

☆☆☆☆☆☆

ఈగ్రంథరాజమున నపురూపములును, ననన్యసామాన్యములును, మనోజ్ఞకల్పనావిలసితములును, సుకుమారపదభావసమన్వితంబులును, సహృదయహృదయంగమములును నగుపద్యములు రత్నాకరమునం దమూల్యమణిరాజములుంబోలె విరాజిలుచున్నవి. దిక్ప్రదర్శనముగఁ గొన్నిటిని మాత్ర మిచ్చట నుదాహరించుచున్నాను —

ప్రథమాశ్వాసము

సీ.

కపటదానవకోటి కాలంబుదరిద్రొక్కె
              దుష్టమార్గులకు దుందుడుకు వుట్టె
సంయములకుఁ దపస్సంపద గొనసాఁగె
              సాదులమది సంతసంబు వొడమె
సుప్రసాదశ్రీలఁ జూపట్టె దిక్కులు
              జగతి నెల్లెడల నుత్సవము లొదవెఁ
బుష్పఫలాభిసంపూర్తి వృక్షము లేచె
              సదమలసలిలలై నదులు దనరె

నఖిలలోకైకనాయకుం డాదిపురుషుఁ
డచ్యుతుఁడు లోకసంరక్షణార్థలీల
నవని నుదయింప సమ్ముఖుఁ డగుటఁ జేసి
యరయ నాతఁడు సర్వాత్ముఁ డగును గాదె?"

(93 ప.)

(సూర్యోదయమునకు ముందు కనువెలుఁగువలెనే యిందు భావిశ్రీకృష్ణావతారచరిత్ర మంతయు సూత్రప్రాయముగ సూచింపఁబడినది.)

సీ.

రమణికి మోహాంకురము సముద్భవ మయ్యె
              వెలఁదికి మమతలు వేళ్లు వాఱె
రాజీవనయనకు రాగంబు కొనసాఁగె
              సీమంతినికిఁ గోర్కి చిగురులొత్తె
లలనామణికి ముచ్చటలు చాలఁ బెనఁగొనెఁ
              బడఁతికిఁ దమకంబు ప్రబ్బుకొనియె
నలినీలవేణికి నాశలు బరువయ్యె
              గురుకుచయుగళకుఁ గూర్మి ననిచె
హృదయ మనుప్రమదావని నేచు కలికి
జవ్వనం బనునామనిసమయమునను
గుసుమసాయకవనపాలకుండు పెనుప
లేమ కిఁక శౌరికరుణ ఫలించు ననఁగ.

(128 ప.)

(ఇందు రాధాదేవి ప్రేమాంకురము, వనస్పతిబీజాంకురముం బోలె, ఫలప్రాప్తిపర్యంతరము, ఎట్లు క్రమాభివృద్ధి నందినదో రమ్యతరముగఁ జిత్రింపఁబడినది.)

సీ.

అబలవేనలిలోని యర్ధభాగము గాదె
              పరగఁ జూచినఁ గృష్ణపక్షతమము?
హరిమధ్యగతిలోని యష్టభాగము గాదె
              తక్కినయైరావతంపునడక?
సుదతిఫాలములోని షోడశాంశము గాదె
              హరుమాళిశశిఖండ మరసిచూడ?
లోలాక్షిచూపులలోని వేయవపాలు
              గాదె శంకింపంగఁ గమలదళము?
కోకములు, పాటలాధర గురుకుచములు
వియ్యములు గావె? వెడవిల్తువింటినారి,
కామినీమణినూఁగారుఁ గవలు గావె?
యెట్లు వర్ణింపవచ్చు నీయిందుముఖిని?

(58 ప.)

(ఇందు రాధాదేవిలోకోత్తరసౌందర్యము, పరమోత్కృష్టమును, దివ్యతమము నైనట్లు, అత్యద్భుతముగను, అతిప్రౌఢముగను, అనుభవగమ్యముగను నభివర్ణిత మైనది.)

సీ.

ఉడుగని వేఁడినిట్టూర్పులు, వడగాలిఁ
              గదిసి కయ్యమునకుఁ గాలు ద్రవ్వ,
నడరుకంపంబున నంగవల్లిక, మేఘ
              సమయతటిల్లతఁ జౌకళింపఁ,

జేకొన్నపాండిమఁ జెక్కుటద్దంబులు
              శారదశశిలక్ష్మి జాఱఁద్రొక్కఁ
బుంఖానుపుంఖమై పొడమెడుగరుపాటు
              మించి హేమంతర్తు మేలుకొలుప,
మలయు చెమ్మట నెమ్మోము మంచువడ్డ
తమ్మి నెలయింప, దృగ్రాగతరళదీప్తి
పల్లవంబులు మధువేళఁ బరిహసింపఁ
జూడరే! యింతి వెడచూపు చూపె నేఁడు!

(196 ప.)

(ఇందు విరహప్రతప్త యైననాయిక సాత్త్వికావస్థలకు ఋతుధర్మముల నారోపించి, కవి, కల్పనాచమత్కారమును మెఱయించినాఁడు.)

తృతీయాశ్వాసము

చ.

బలువగునారిపై శరము, బాణముపై నరదంబు, తేరిపై
విలు, విశిఖాసనంబుపయి వీరభటాళియు నొప్పు చిత్రభం
గుల నిజజూటదేశమునఁ గ్రుమ్మరుకూటపురాసురేంద్రులన్
గెలిచిన యోధవర్య! నినుఁ గీర్తన సేయుదు నంబికాధవా!

(62 ప.)

(ఈపద్యము విచిత్రకల్పనాసమంచితమై, యంబికాధవుఁ డగు త్రిపురాంతకుని యఘటనఘటనాసామర్థ్యమువలెనే యప్రతిమానమై యున్నది.)

చ.

కమలజముఖ్యసన్మునులు గాఢవివేకులుసైతమున్ మనః
కమలతలాభిగమ్యములు గావని చెప్పుదు రేనియంఘ్రిప
ద్మము? లటువంటినందసుకుమారునిపాదముఁ ద్రొక్కఁజూచెదన్
బ్రమద! మదీయసాహసముభంగి యెఱింగితె? చిత్ర మయ్యెడిన్!

(121 వ.)

(ఈపద్యము దుర్లభానురాగముచే, ఆశనిరాశలనడుమ నల్లాడుచున్న హృదయము యథాతథముగఁ జిత్రింపఁబడినది.)

చతుర్థాశ్వాసము

సీ.

నెలఁతవేనలిపిండు నీలిదట్టినచీర
              సుదతిలేనగవులు చొక్కుమందు
ముదితక్రొన్నెలవంకనుదురు కన్నపుఁగత్తి
              మెలఁతకన్దోయి తుమ్మెదలక్రోవి
[10]కలకంఠకంఠికీల్గంటు తాళపుఁగొంకి
              పడఁతుకగోరు[11] బల్పంపుఁదునుక
జలజాక్షి మణితముల్ శకునంపుఁబలుకులు
              మగువనితంబంబు మఱుఁగుఠావు

చేసికొని పాంథహృత్కుడ్యసీమ లగలఁ
ద్రవ్వి నిద్దంపుసన్మానధనము దిగిచెఁ
గిక్కు మనకుండ నేరికిఁ జిక్కువడక
సూనశరుఁ డను జగదేకచోరగురుఁడు.

(89 ప.)

(ఇందు లోకమోహనకరములగు కామినీమనోహరాంగవిలాసాదులు చోరపరికరములుగాఁ గల్పించి, కవి, తనకళానైపుణ్యమును వెల్లడించినాఁడు!)

సీ.

తోరమై సారమై తొరఁగు చంద్రికలును
              జలజలనై రాలు చంద్రికలును
వలిగాలితెరలపై వ్రాలు చంద్రికలును
              సడలి తుంపర చిందు చంద్రికలును
వఱలి మీఁగడ గట్టి వడియు చంద్రికలును
              జాఱక తొట్టెడు చంద్రికలును
నురువులు గ్రమ్ముచుఁ బొరలు చంద్రికలును
              జడికట్టి ప్రవహించు చంద్రికలును
దిశలు వెల్లివిరిసి దివి ముట్టి కడుదిట్ట
ద్రోచి జగము ముంచి తొలఁకియాడె
మాధురీధురీణమదనగోపాలలో
చనదయాసుధారసంబువోలె.

(97 ప.)

(ఈయాశ్వాసములో నీఘట్టమునఁ గల [12]చంద్రికావికాసవిలాసములును, చకోరవినోదవిహారాదులును నత్యంతమనోహరములై, విచిత్రకల్పనావిలసితములై, యమృతరసతరంగితములై యపురూపములై, యచ్చున గుద్దినరీతిని మనోనయనములకు గోచరించునట్లు కవి ప్రదర్శించియున్నాఁడు. ఇవ్విషయము నీవిధముగాఁ బారము ముట్టున ట్లభివర్ణించిన కవికావ్యము వేఱొండు మృగ్యము.)

పంచమాశ్వాసము

సీ.

పసిఁడిపాపలమీఁద నొసపరి మువ్వంక
              బాగున దివ్యరూపంబు దనర,
డాపలికర్ణకుండల మొకించుక వ్రాలి
              యంసదేశంబున నత్తమిల్లఁ,
దిర్యక్కృతంబులై తీగవెన్నెలమించు
              తళుకుఁజూపులు కెలంకుల నటింప,
లాలితోదంచితభ్రూలతాయుగళి నే
              ర్పడినవళిత్రయీఫాల మలర
రాధికాభుజనిహితదోర్దండుఁడై స
మంచితాంగుళిపల్లవన్యాసములను
రంధ్రముఖముల సప్తస్వరములు గూర్చి
మురళి వాయించె నాజగన్మోహనుండు.

(192 ప.)

(అమృతోపమానమైన యిమ్మనోహరపద్యరాజమున నీరాధామాధవకావ్యసర్వస్వమును మూర్తీభవించి, మధురమోహనమురళీగానానందము భువనంబులనుంబోలెఁ బాఠకలోకసర్వాంతఃకరణములను తన్మయీభవనములుగఁ జేసివైచుచున్నది!)

సీ.

బ్రహ్మాదిసురముని ప్రకరంబులకుఁ బర
              బ్రహ్మస్వరూప మన్ భావశుద్ధి
ఆరూఢయోగక్రియాశుద్ధిబుద్ధుల
              కానందరసపూర మనెడు తెలివి
సహచరగోపాలజనులకు నిజసుహృ
              ద్వరుఁ డను వత్సలత్వంబుకలిమి
రాధికాప్రముఖనీరజలోచనలకును
              బ్రాణవల్లభుఁ డను ప్రణయభంగి
గలుగఁజేయుచుఁ గారుణ్యకలితలీల
దృష్టి భక్తుల కమృతంపువృష్టి గురియ
నలరుశృంగారి నట్టిమోహనమురారిఁ
దగిలి నర్తించు ధన్యులతలఁపు తలఁపు.

(268 ప.)

(పరమభాగవతోత్తముఁ డైన యిక్కవిచూడామణి, తన కావ్యరచనోద్దేశసాఫల్యము నీపద్యరూపమునఁ బ్రదర్శించి, భక్తితత్త్వపరమావధిని లోకమునకుఁ బ్రబోధించి, ధన్యుఁడైనాఁడు.)

ఈదృశమనోహరపద్యరాజములే కాక,

“ఎడమపిరి; బొమ్మపెట్టుట; సందులఁ దూఱుట; గోరుచుట్టుపై రోఁకటిపోటు; ఒక్కకన్ను కన్ను గాదు, ఒక్కకొడుకు కొడుకు గాఁడు; ... ."

ఇత్యాదిలోకోక్తులతోఁ గూడిన సమయోచితము లగు చక్కనిపద్యరత్నాలును నిక్కోశమున విరాజిలుచున్నవి.

మఱియు, భక్తి, శృంగారరసనిధానం బగు నేతత్కావ్యములోని యుపక్రమోపసంహారాదులు రాధామాధవలీలామయములై గ్రంథనామమును సార్థకపఱుచుచున్నవి.

మొత్తముమీఁదఁ గావ్యమంతయుఁ బ్రౌఢమై, ద్రాక్షాపాకలలితమై హృదయంగమమై యొప్పారుచున్నది.

మొన్న మొన్నటివఱకు లోకమున కజ్ఞాతములై పడియున్న రాధామాధవకవికావ్యములలో నొక్కటియగు నేతాదృశరమణీయప్రబంధము కాలవశమున విలుప్తమై పోకుండ సముద్దరించి, బ్రహ్మశ్రీ శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రిగారిచేతను, శ్రీపీఠికాపురసంస్థానాస్థానవిద్వత్కవీశ్వరులును, శతావధానులు నగు బ్రహ్మశ్రీ ఓలేటి వేంకటరామశాస్త్రిగారిచేతను బరిష్కరింపించి, ముద్రింపించి యాంధ్రభాషాయోషామణికి వినూత్నరత్నాలంకారముగాఁ బ్రకాశింపఁజేసి, కాలగర్భమున డాఁగియున్న యిక్కవిచంద్రుని యశశ్చంద్రికలను శాశ్వతముగ దిగంతములయందు వెలయించుటయే కాక, యిట్టికవిశేఖరుని కవితాసామర్థ్యమును మెచ్చుకొని, తదర్హబిరుదమును బ్రసా దించి మించిన శ్రీకృష్ణదేవమహారాయల రసజ్ఞశేఖరత్వము గూడ నేతద్గ్రంథమూలముగ లోకమున విశదపడుట కవకాశమును గలిగించిన దేశభాషాభిమానులును, కవితాప్రియులును, నుదారచరిత్రులును, సత్కార్యనిరతులును, విద్యావినయసౌశీల్యాదిసుగుణగణవిరాజతులును, కపిలేశ్వరసంస్థానప్రభువులును చిరంజీవులును నగు మహారాజరాజశ్రీ శ్రీరాజా బలుసు బుచ్చిసర్వారాయనృపవరేణ్యుల యీపరమోపకారమునకై యాంధ్రులెల్లరును శ్రీయుతు లగువారికిఁ గృతజ్ఞతాభినందనముల నందింపవలసియున్నది. సర్వేశ్వరుండగు పరమేశ్వరుని పరిపూర్ణానుగ్రహమున, శ్రీ ప్రభువువా రింకను నిట్లే, దేశభాషాపోషకము లగు సత్కృతులను వెలయింపఁజేయుచు, దిగంతాక్రాంతయశస్వంతులై, యితోధికాయురారోగ్యైశ్వర్యసంపన్నులై వర్ధిల్లుదురు గావుత మని జగదీశ్వరునిఁ బ్రార్దించుచున్నాను.

పిఠాపురము,

ఇట్లు విబుధవిధేయుఁడు,

3-1-1936.

నడకుదుటి వీరరాజు.

—————

  1. చెన్నపురి విశ్వకళాపరిషత్తునకుఁ (University of Madras) జెందిన ప్రాచ్యపరిశోధనాలయాంధ్రశాఖవారు (Oriental research Institute) ఎల్లనార్యవిరచితమే యగు విష్ణుమాయానాటకప్రబంధమును ముద్రింపించి ప్రకటించినారు.
  2. విష్ణుమాయానాటకప్రబంధమునఁ గవి వ్రాసినయవతారికాభాగ మింకను లభియింపనేలేదు. కవి తనపూర్వనివాసస్థానము నందు వక్కాణించియుండె నేమో!
  3. ‘ధాతృప్రతిమాన’విశేషణముచే ఆంధ్రకవితాపితామహుఁ డల్లసాని పెద్దనార్యుఁడును స్ఫురించుచున్నాఁడు.
  4. ఈతఁడు కృష్ణరాయల ప్రధానమంత్రి యగు తిమ్మరుసు కాఁడు.
  5. సాధారణముగా, ఆఱువేలవారు మొదలగుపూర్వులలో ననేకు లనేకహేతువులను బట్టి దక్షిణపుజిల్లాలనుండి గోదావర్యాదిమండలములకు వలసవచ్చి, యచ్చట స్థిరవృత్తులను సంపాదించుకొనినట్లును, వారివారి పూర్వపుగ్రామనామములనుబట్టి పుట్టినయింటిపేళ్లతోనే, యాయామండలములఁదు కొన్నికొన్నిగ్రామము లేర్పడినట్లును జెప్పుటకుఁ బెక్కునిదర్శనములు గలవు. గోదావరీమండలములోని, ఈఁదరపల్లె (ఈఁదులపల్లె భవానీశకవిపూర్వులపేర వెలసినది.) పెదపూఁడి, చెల్లూరు, నడకుదురు, నేదునూరు మొదలగున వన్నియు ని ట్లేర్పడినవే. ఇవి మొదలగుగ్రామము లన్నియు దక్షిణపుజిల్లాలలో నున్నవియే.
  6. గీతగోవిందకావ్యమును రచించిన జయదేవకవియే యీజయదేవకవి యై యుండవచ్చు నని విష్ణుమాయానాటకోపోద్ఘాతమున వ్రాయఁబడి యున్నది గాని యీయిరువురు కవులు నొక్కరే యైనట్లు గాన్పింపదు. గీతగోవిందకారునిరాధ స్వీయ యైనట్లు తోఁపదు. రాధామాధవములోని రాధాదేవి కేవలము వివాహితమహిళారత్నము; లక్ష్యంశసంభూతురాలు, కావున నీజయదేవు లిద్దఱును భిన్నులై యుందురు. మఱియు, వేఱొకజయదేవుఁడు 'శృంగారమాధవీయ' మను చంపూప్రబంధమును రచియించి యున్నట్లు గానవచ్చు చున్నది. మనకవి యుదాహరించిన రాధామాధవ మాశృంగారమాధవీయమునకు నామాంతరమే యైనచో మనకవి స్తుతియించిన జయదేవుఁ డాతఁడే యై యున్న నుండవచ్చును. ప్రసన్నరాఘవనాటకమును వ్రాసిన జయదేవుఁడు పైవారిలో నొకఁడో, అన్యుఁడో!
  7. ఉత్తరపశ్చిమదేశములయం దున్న వంగ, సంస్కృతలిపులు గల గీర్వాణభాషాగ్రంథవిక్రేతలకు జయదేవకృత 'రాధామాధవము'కొఱ కనేకలేఖలు వ్రాసితిని గాని యాగ్రంథ మున్నట్లే తెలియరాలేదు.
  8. కిరాతార్జునీయమునకు 'భారవి'యనియు, శిశుపాలవధమునకు 'మాఘ' మనియు వ్యవహారము గలదు.
  9. ఈసూత్ర మాంధ్రశబ్దచింతామణిలోనిది. ఈవ్యాకరణమును బాలసరస్వతియే నన్నియపేరితో రచియించి ప్రకటించినాఁ డని విమర్శకుల యాశయము.
  10. "కలకంఠిజడయల్కకసరు" అని వ్రాఁతప్రతి. “కలకంఠి జడయల్లిక సుద” ‡ అని కవి వ్రాసియుండెనా యని తోఁచెడి. జడయల్లికతుద, తాళపుఁగొంకివలెనే వంకరగా (వంగినరీతి) నుండును. 'కీల్గంటు' కొంకివలె నుండదేమో!
  11. ఇచ్చట 'గోరు' అనుపదము సాదృశ్యమునకుఁ బొందుపడదు. 'ఆరు' అని కవి వ్రాసియుండును. లేఖకప్రమాదమున “యారు" "గోరు” అయినదేమో!
  12. చతుర్థాశ్వాసము 95 వ పద్యము మొదలుకొని 102 వ వచనముకడవఱకుఁ జూడుఁడు!