Jump to content

రాధామాధవము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీరాధామాధవము

పంచమాశ్వాసము

శ్రీరాధానఖరక్షత
తారేశకళానిరస్తదర్పకదర్పో
దారాంధకార! జగదా
ధార! గుణావాల! నవమదనగోపాలా!

1


గీ.

అవధరింపుము దేవ! సంయమివరుండు
సకలవేదాంతవిద్యావిశారదుండు
శుకమహాయోగి పలికె నుత్సుకత మెఱయ
నింపుగా నాపరీక్షిన్నరేంద్రునకును.

2


క.

ఆరాధామాధవులను
గారా మారంగఁ గూర్చి కడుఁ దత్కరుణా
గౌరవము వడసి మగుడన్
గీరము దివి కేఁగి వాణికేలన్ వ్రాలెన్.

3


గీ.

నీలవర్ణుని వరియించి నీరజాక్షి
గూడియుండిన నెంతయుఁ జూడ నొప్పె
నీలమేఘంబుచెంగటి కోలమెఱుఁగుఁ
బోలె లావణ్యవైభవస్ఫూర్తి మెఱసి.

4

వ.

ఇవ్విధంబున సకలలోకహితం బగు నమ్మహోత్సవంబునఁ
బ్రాణవల్లభాసమన్వితుండై మహావైభవంబున హర్షించి
యున్న పురుషోత్తముం జూచి యమ్మేలు సహింపఁజాలక
విశ్వవిశ్వంభరామండలేశ్వరకుమారకంఠీరవులు క్రోధలజ్జా
విషాదవేదనాభారదూరీభూతధైర్యులై దురభిమానంబునఁ
గనలి మోహాంధతమసంబునఁ గాననేరక యవార్యదోర్వీ
ర్యంబున శౌర్యంబుఁ గార్యంబుగాఁ బ్రతిష్ఠించి పోరాట
నోటుపఱచి గోపాలుని గోపాలనంబున కనిచి బలాత్కా
రంబున నైన నీయబలఁ గొనిపోవుట తగుఁగాక యూరక
మరలినఁ బౌరుషయశోహాని గాదె యని నిశ్చయించి మత్స.
రంబు తమకంబునఁ దమతమగంబులు భగ్గున దిగ్గనుఱికి
హయగజారూఢులై సైన్యంబులు గూర్చుకొని పేర్చి రమ్మ
హాబలకోలాహలసమయంబున నమేయమాయాబలుం డగు
హలగ్రీవుండను నానిశాచరవిభుండును రాజకూపంబుఁ బరి
త్యజించి నిజఘోరవికృతాకారంబుఁ బ్రకటించి ప్రజ జడియు
సందడి డాయవచ్చి, కొందలపడక గోవిందుముందట నున్న
కన్నెంబట్టి బిట్టువడిం దిగిచి తనరథంబున నిడుకొని కరాళ
శార్దూలముఖంబునం బడిన యామిషంబు నొడిచికొనిపోవు
సాలావృకంబుకైవడి రయంబునఁ బురంబు వెడలిపఱచిన.

5


క.

మేడలఁ గోటల వీథుల
వేడుకఁ గనునెల్లజనము విధుముఖి దనుజుం

డోడక కొని చనుటకు వడఁ
కాడెడుమది నొక్కపెట్ట యాక్రందించెన్.

6


వ.

అప్పుడు.

7


మ.

పటురోషారుణితేక్షణంబులఁ బ్రలంబద్వేషి మున్నాడి యు
త్కటవేగంబునఁ దేటిపై కుఱికి దోర్దండంబు లుప్పొంగ నొ
క్కట వి ల్లెక్కిడి కేలఁ గ్రూరశర ముగ్రస్ఫూర్తి మైఁద్రిప్పుచున్
గుటిలాత్మా! యెటు వోయెదంచుఁ దగిలెన్ గోవిందుఁ డుద్యద్ధతిన్.

8


శా.

ఘంటాకింకిణినిస్వనంబులు చెలంగన్ దార్క్ష్యకేతుప్రభల్
మింటం బర్వ హరుల్ సమీరములువోలెం బోవఁగా దైత్యుతే
రంటం బాఱె రథంబు రాధిక భయోద్యద్గ్రీవయై చూడ వె
న్వెంటన్ రాముఁడు గోపకాళియుఁ దగ న్నేత్రోత్సవంబై వడిన్.

9


క.

కూడుకొని రపుడు శౌరియుఁ
గూడె ననుచు [1]నాశ యెడలఁ గుటిలుఁ దదృశ్యుం
డై డాఁగె నసురపతి; హరి
జాడకు నొకకొంత దొలఁగి సైన్యముఁ దానున్.

10


మ.

అతివేగంబున నట్లు శార్ఙ్గి గడుడాయ న్వచ్చి సేనాసమ
న్వితుఁడై కన్పడకున్న మాయఁ గొలిపె న్వీఁడంచు లీలన్ జగ
త్త్రితయంబున్ దనమాయఁ గప్పు చతురశ్రేష్ఠుండు దన్మాయ సం
గతిగా వైష్ణవశక్తిఁ దూల్చి కని యాక్రవ్యాదుతో నిట్లనున్.

11

శా.

ఓరీ! దానవ! యింతనీచమతిఁ బ్రత్యూహింప నేమేమి చే
కూరెన్ వ్రేఁగయి తోఁచెనే యకట నీకుం బ్రాణముల్ మేనికిన్
జేరంబోదురె! రానివస్తువుల కేస్త్రీ దక్కునే నీకు నీ
మూరింబోయినకండక్రొవ్వు నిను నిర్మూలంబు సేసెం దుదిన్.

12


వ.

అని కోపించి.

13


క.

మును దనకేల నమర్చిన
ఘనకాండం బేయఁ బిడుగు కంటెను వ్రేఁగై
చని యది యవిరళగతి న
దనుజునురము గాఁడి వెడలి ధారణికంటెన్.

14


క.

రక్కసుఁడు దాన నెత్తురు
గ్రక్కుచు మూర్ఛిల్లె నంత రథము రథముతోఁ
గ్రక్కునఁ జేర్చి యుపేంద్రుఁడు
నెక్కొనఁ దనయరదమునకు నెలఁతుకఁ దిగిచెన్.

15


వ.

అటు మగుడం దిగిచికొని తనశతాంగం బెడగలుగ నిలిపి,

16


గీ.

భీతియును సిగ్గు మోదంబుఁ బెనఁగొనంగ
శిరము వ్రాలిచియున్న యచ్చెలువ మేను
హస్తపంకజమున శౌరిక యట్టె నిమిరె
వెఱచితే యని పులక లావిర్భవింప.

16


గీ.

ప్రియతలోదరి మదిలోని భీతి యడఁచి
విజయశంఖంబు పూరించె వెన్నుఁ డంతఁ
దన్మనోహరరవము సంకేతన మెలర్ప
గోపకులతోన చని శౌరిఁ గూడె హలియు.

17

ఆ.

అపుడు మూర్ఛఁ దేఱి యమరారి యంతకు
చెలువుఁ దాల్చి గ్రుడ్లు జేవుఱింపఁ
జివురుఁ బోణి మగుడఁ జేకొని యుద్దండ
శౌర్యరేఖ నున్న శౌరిఁ జూచి.

18


మ.

తరుణీరత్నముఁ గ్రమ్మఱం బడసి యుత్సాహంబు దీపింపఁగా
మరలం జూచెదు పోవనిత్తునె నినున్ మమ్మానిశాతాశుగో
త్కరపాతంబుల రామయుక్తముగ నీదర్పంబు వారించి యా
సరసీజాయతనేత్ర మ్రింగక వృధాజల్పంబు లింకేటికిన్.

19


వ.

అని పలికి కుటిలభ్రూకుటిచటులనిటలఫలకుండై వికటదంష్ట్రా
కరాళవదనగహ్వరనిష్ఠ్యూతనిష్ఠురభయంకరాట్టహాసంబు
న దిక్కటాహంబులు పగిల్చి యుద్ధసన్నద్ధుం డయ్యె నాసమ
యంబున.

20


సీ.

గజఘటాఘంటికాఘణఘణాత్కృతులు ది
              గ్దంతులచెవులు చిందఱలు గొలుపఁ
బటుతురంగమఖురపుటకఠినధ్వనుల్
              పిడుగులచప్పుళ్ళు బడలు వఱుప
భటసింహనాద ముద్భటభంగిఁ గొండ గు
              హలు వ్రక్కలించి సింహములఁ గలఁప
నిర్వక్రరథచక్రనిష్ఠురగతు లనం
              తోరగస్వామి నుఱ్ఱూఁత లూఁప


తే.

సకలదిగ్దేశరాజన్యసైన్యములును
బెల్లగిలి యొక్కపట్టున బిరుదుపడగ

లాకసంబున ముడివడ నవని రేణు
పటలములు చీఁకటులు గొల్ప భయదలీల.

21


క.

నలుగడల గోమతీపురి
వెలువడి హరిఁ బొదివి దెసల వీరావేశం
బులఁ జూపి గుణరవంబులు
చెలఁగఁ బరిష్కారమణిరుచి శ్రీ లడరన్.

22


వ.

నిట్టవడిఁ జుట్టుముట్టి తత్పురగోపురోపకంఠంబున యమునా
తరంగిణీతీరంబున నిలిచి యన్యోన్యానుమతంబున రామ
కృష్ణు లెందునుం బోవకుండ నడ్డుకట్టుకొనువారై వారున
డుమఁ జిక్కునట్లుగా హలగ్రీవు ననుసరించి చక్రాకారంబున
నాక్రమించి తమతమనెలవులఁ గ్రౌంచ గరుడ శకతీర్ణ చంద్ర
ప్రముఖ మహావ్యూహంబుల మోహరంబులు దీర్చి ముంద
ట నరిగ తండంబును దానికిఁ బ్రాపై విలుకాండ్రమొత్తం
బును దానికి బాసటయై యెడనెడ దారుణశిలాబాణయం
త్రకారులును వారికిఁ దోడై యుభయపక్షంబుల హయ
ధట్టంబులు బోటొగ్గి నిలిచె వానివెన్నుఁ దన్ని నానాభూ
మండలేశ్వరులును నెలవంకల వలవంకల మత్తకరిఘటల
నిడుకొని యనేకరథకదంబపరివృతులై కేతనంబులు గ్రాల
నాతపత్రంబుల క్రీనీడ ధనుష్టంకారంబు లొనర్చుచు శిర
స్త్రాణచిత్రకవచభాసితులై సముజ్జ్వలమకుటమణిదీప్తులు
కిరణజాలంబులై క్రాల నానాదిక్కుల నొక్కసమయంబున

నుగ్రతేజంబుల నుదయించి వెలుంగు మార్తాండమండలం
బు లనునోజఁ దేజరిల్లుచుండి రమ్మహారణమండలంబు దేవ
మానవకోటులచూడ్కికి విస్మయభయోత్సాహకారి య
య్యె వెండియు.

23


చ.

సరినృపకోటి తీరతరుషండము, వీరరసంబు నీరు, భా
స్వరకమలంబు గోపసుతసైన్యము, కర్ణిక తేరు, రాధికా
తరుణి మధూళిధార, హరి తత్ప్రియసక్త మధువ్రతంబుగా
సరసిరుహాకరంబుక్రియ సంగర మొప్పె సుదర్శనీయమై.

24


క.

ఇవ్విధమునఁ దనుఁ జుట్టిన
యవ్వసుధేశ్వరుల దైన యాటోపంబున్
గ్రొవ్వును మత్సరమును గని
నవ్వుచు మాధవుఁడు రామునకు ని ట్లనియెన్.

25


ఉ.

కంటివె రామ! యీనృపులగర్వము కార్యవిజృంభణంబుఁ బె
న్బంటుఁదనంబు మోహరము భంగియు వీ రిఁక దావవహ్నిఁ బె
ల్లంటఁగఁ బోవు నల్పశలభావళికైవడి నన్నుఁ దాఁకి యొ
క్కంట నణంగి పోఁగల రఖర్వమదీయశిలీముఖార్చులన్.

26


క.

కనుఱెప్ప వెట్టునంతనె
మునుమిడి యీరాజసైన్యముల రక్కసునిన్
సునిశితశరపంక్తులచే
ననిచెద జముకడకు నీవు నమరులు మెచ్చన్.

27


మ.

అను నాలో ననలోగ్రమూర్తి దనుజుం డాభీలదోర్లీలమైఁ
దను వేల్పుల్ గొనియాడ నోడక వడిన్ దామోదరున్ డాసియే

సె నితాంతోరునిశాతమార్గణములన్ సేనాట్టహాసస్ఫుర
ద్ధ్వని దిగ్బిత్తులఁ బర్వ రాధ గడుభీతస్వాంతయై చూడఁగన్.

28


ఆ.

శరము పింజపింజ గఱచి రక్కసుతూపు
గములు శౌరిఁ దీవ్రగతులఁ గప్పె
ఘోరవిలయమేఘవారిధారాసహ
స్రములు ధారణీధరంబుఁ బోలె.

29


క.

ఆ సాయకములఁ దునుకలు
చేసెం దత్కాండవితతిఁ జెదరక తత్సే
నాసముదయములఁ గూల్ప శ
రాసనవిద్యావినోదికయై హరి లీలన్.

30


మ.

తనకాండంబులు ఖండఖండములుగా దామోదరుం డేయఁగాఁ
గని నక్తంచరుఁ డాగ్రహంబున మహోగ్రస్ఫూర్తి రక్షశ్శరం
బెనయన్ నారి నొనర్చి మంత్రయుతమై యేపారఁగా నేసె నే
సినయాఘోరశిలీముఖంబు బహుళార్చిద్ధూమముల్ గ్రక్కుచున్.

31


చ.

ఘనవికృతాస్యనేత్రములు గర్కశదంష్ట్రలు దీర్ఘజిహ్వలున్
ఘనమలినోరుకాయములు గల్గు నిశాచరకోటు లుద్భవిం
ప నతిభయంకరాకృతిఁ బ్రభంజనవేగము మీఱి దిక్కులె
ల్లను గబళింపుచు హరిబలంబును డాసె మహాశనిక్రియన్.

32


క.

దానిఁ గని శౌరి కఠిన
జ్యానావం బెసఁగ వైష్ణవాశుగ మేయన్
మానుగ నా దివ్యాస్త్ర మ
నూనోద్యమదివ్యతేజ ముప్పతిలంగన్.

33

మ.

పటుశంభోత్కరరావముల్ చెలఁగ శుంభచ్చక్రకోటిచ్ఛవి
చ్ఛటలాశావలయంబున న్నిగుడఁ జంచద్విష్ణురూపంబు లొ
క్కట వేవేలు జనింపఁగా నమరసంఘప్రస్తుతప్రాభవో
త్కటవేగంబునఁ దాఁకితత్ప్రదరమున్ ఖండించెఁ జండార్భటిన్.

34


ఉ.

దానవదానవారికరధర్మగుణప్రవిముక్తబాణసం
తానము గప్పి సూర్యకిరణప్రతిరోధ మొనర్ప నెయ్యెడం
గానఁగ నీక చీఁకటులు గ్రమ్మి కఠోరపరస్పరాశుగా
నూనమహోగ్రఘట్టనల నుబ్బెడుమంటలఁ బాయునుద్ధతిన్.

35


క.

ధవునిశితశరము లసురం
దవిలినఁ గడు నుబ్బు, ధవునిఁ దద్బాణంబుల్
దవిలినఁ బొక్కును రాధిక
ధవునిజయము దితిజుపాటుఁ దలఁపుచు మదిలోన్.

36


సీ.

అమరారి యురవడి నార్చినఁ గడు నుల్కి
              వడి డాసి ప్రియుకేలి నొడిసి పట్టు
వెడవాయు దానవువికృతరూపముఁ జూచి
              వెఱచి ప్రాణేశ్వరువెనుక డాఁగు
నాసురాస్త్రములు ఱువ్వని రాఁగ మార్మోము
              సేయుచోఁ బతి నవ్వ సిగ్గు నొందు
దనుజుఁ దూలఁగ నేసి తనుఁ జూడుమని సన్న
              సేయువల్లభుదృష్టిఁ జెంగలించు

తే.

ఘనపరస్పరబాణఘట్టనలఁ బొడము
నగ్నికణముల కధిపు హేమాంబరాంచ
లంబుఁ బాపెడు రాధావిలాసినీల
లామ మాహవభూమి నెల్లరును జూడ.

37


క.

కలయఁగఁ జెలువుని జూచిన
జలజాక్షికిఁ బొడముఁ జిత్తజవ్యథ పైపైఁ
గలయఁగ రాక్షసుఁ జూచిన
జలజాక్షికిఁ బొడముఁ జిత్తజవ్యథ పైపైన్.

38


సీ.

చెలువకు నన్యోన్యసింహనాదంబున
              గాత్రవల్లికఁ గంటకములు మొలచు
శతపత్త్రగ్రంధికి నితరేతరవిలోక
              నంబుల ఘర్మకణంబు లొలయు
వరవర్ణినికిఁ బరస్పరమర్మభేదక
              వాక్యసంగతి నశ్రువారివొడము
నిభరాజగమనకు నుభయాభిముఖసన్ని
              కర్షణవ్యాప్తిచేఁ గంప మడరుఁ


ఆ.

దరుణి కొకరి యొకరి తనురక్తధారల
భంగిఁ గనిన మ్రానుపాటు చెందు
వల్లభుండు నసురవరుఁడుఁ బోరాడ శృం
గారభీతిసాత్త్వికములచేత.

39


వ.

అట్టియెడ.

40

ఉ.

చక్రి నెదిర్చి పోరుబలసంపదయున్ విలువిద్యనేరుపున్
విక్రమరేఖయుం గలుగువీరుఁడు వీఁడె యటంచు భూమిభృ
చ్చక్రము మెచ్చఁగాఁ గనలి శార్ఙ్గి ప్రియాంగన దేఱ దోర్విలా
సక్రియ నొక్కభల్లమునఁ జంపె నిశాచరనాథుసూతునిన్.

41


ఆ.

మఱియుఁ బెక్కు తీవ్రమార్గణంబుల రథ్య
వితతిఁ గూల్చి వానివిల్లుఁ దునిమి
రథము నుగ్గు సేసి రయమునఁ దన్మహా
రూఢకపటబలము రూపు మాపె.

42


క.

విరథుఁ డయి దానవుండును
ధరణికి లంఘించి క్రోధతామ్రాక్షుండై
పొరిఁ బొరిఁ గనులను నిప్పులు
దొరుఁగఁగ సంవర్తరుద్రమర్దమలీలన్.

43


మ.

క్రకచక్రూరనిశాతదీర్ఘతరదంష్ట్రల్ గీఁటుచున్ జిహ్వమృ
త్యుకరాళోగ్రముహుఃప్రకంపితమహాదోర్మండలోగ్రాకృతిన్
వికృతాస్యంబునఁ గ్రాల శూలధరుఁడై విక్రాంతికిన్ దేవతా
ప్రకరంబున్ భయ మంది చూడఁ బటుశుంభద్వేగసంరంభియై.

44


ఆ.

తనదుభంగిఁ జూచి జనులెల్ల హరి మ్రింగె
మ్రింగె దానవుం డనంగఁ బొంగి
రాజు లార్వ నుర్వరాచక్ర మల్లాడ
నీడు లేని కడిమి నీడఁ బోక.

45

క.

వెడవెడ నార్చుచు శూలము
వడిఁ ద్రిప్పుచు నూర్ధ్వకేశవల్లులు దూలన్
గడు నుగ్రోల్లంఘనగతు
లడరన్ మాధవుని మ్రింగు నాసన్ డాసెన్.

46


మ.

రవిఁ బట్టం బఱతెంచురాహువుక్రియన్ రాత్రించరుం డట్లు ద
న్ను వడి న్మ్రింగెదనంచు వచ్చురయమున్ రోషంబు నాటోపమున్
భువనక్షోణభంగియుం దెలిసి యంభోజాక్షుఁ డక్షీణదోః
ప్రవిజృంభం బడరన్ ధనుర్గుణలతారావంబు నిండారఁగన్.

47


మహాస్రగ్దర.

సమ[2]సప్తార్చిష్మదర్చిళ్ఛట కుపమ
              యనం జాలునాఖీలకాలా
స్త్రము చంచద్భంగి నేయం జటులత
              నశనిస్ఫారమూర్తిన్ మహీశుల్
భ్రమ నొంద న్మింట మంటల్ పయికొనఁగఁ
              బొగల్ పర్వ నుద్దామవేగో
ద్యమలీల న్వచ్చి త్రుంచె దనుజుని
              తల భూతవ్రజంబుల్ వడంకన్.

48


క.

హరిశరహతి రక్కసుతల
ధరఁ బడఁ బిచ్చిల్లి రక్తధార లెగయ న
చ్చెరు వై చిమ్మనగ్రోవికిఁ
బురుడయ్యెన్ దత్కబంధము రణక్షోణిన్.

49

గీ.

కత్తిఁ బొరసిన తేనియఁ గాంక్ష నివిరి
జిహ్వ తెగిపడఁ బడుబేల చెలువు దోఁప
మాధవాన్విత యై యున్న రాధఁ జెనకి
నీచమతి నిర్జరారాతి నేలఁ గూలె.

50


శా.

ఆ నేత్రోత్సన మైనగెల్పునకు మోదాంభోధికల్లోలడో
లానిత్యోత్సవకేళిఁ దేలె జగమెల్లన్ లీలమై నప్సర
స్స్త్రీనృత్యక్రమగానముల్ చదలఁ బర్వెన్ బర్వమై వల్లవా
న్యూనోత్సాహకృతోల్లసన్మధురవేణుధ్వాన మొప్పెం గడున్.

51


క.

దానికి మదిఁ గన లొదవఁగ
భూనాయకు లొక్కపెట్ట పొదివిరి శౌరిన్
నానాముఖముల నార్భటు
లీనన్ బెన్ ధూళి లోకమెల్లను మ్రింగన్.

52


మ.

హరిహేషాకరిబృంహితంబులు భటోద్యద్గర్జలున్ స్యందనో
త్కరచక్రారవముల్ ధనుర్గుణనినాదంబుల్ హతానేకని
ర్భరభేరీపటహాదివాద్యరవముల్ బ్రహ్మాండభాండంబు ని
ష్ఠురభంగిన్ బగిలించె నొక్కట రణక్షోణిన్ జగత్క్షోభమై.

53


క.

జలజోదరుఁ బొదివినయ
బ్బలములకుం గవిసి గోపబాలురు శరపం
క్తుల నొంచిరి సింగపుఁగొద
మలు నఖరాగ్రముల గజసమాజముఁ బోలెన్.

54

క.

భూపాలసైన్యసంఘము
గోపాలకబలము వోరెఁ గుంభిని వడఁకన్
భూపాలకులును మన్మథ
గోపాలుఁడు దమజయంబుఁ గోరుచుఁ జూడన్.

55


క.

పడుహరులుఁ గూలు రథములు
మడియు భటోత్తములు నొఱలు మాతంగములున్
మిడుఁగుఱులు చెదరఁ బొడియై
పుడమిఁ దొరఁగు కైదువులను బోరఁ దనర్చెన్.

56


సీ.

కడుపులు చించి యొక్కటఁ దెంచి రాఁ దీసి
              ప్రేవులు పేర్లుగాఁ బెనచువారు
కోసిన తలలెల్ల కొండలుగా వైచి
              పలుమాఱుఁ బతి మెచ్చు వడయువారు
తలఁ ద్రుంచి తత్కబంధమునఁ గ్రమ్మెడురక్త
              జలధార లెల్లెడఁ జల్లువారు
కట్టల్కఁ జిదియంగఁ గొట్టి మేనులు ముద్ద
              సేసి మానిసిరూపు చెఱుచువారు


తే.

నై సురాసురగంధర్వయక్షదుర్ని
రీక్షముగఁ గేళి సలిపిరి యేచి త్రోచి
యుభయసేనలవారు దోర్విభవ మెసఁగఁ
గుంభినికి భారమై యొక్కకొంతప్రొద్దు.

57

వ.

అట్టియెడ.

58


సీ.

పదివేల నొకఁడు పాట్పడి గెల్వఁజూచును
              దూలింతు రొకనిని వేలుగూడి
మొనసి జోడై పంతమునఁ జొచ్చి పొడుతురు
              గుంపు విప్పుదురని గుంపు గట్టి
తముఁ దాఁకఁ దలఁచు సైన్యము దాఁకుదురు మున్నె
              యాడాడ బిరుదులు వాడియోర్తు
రుక్కున నొకమూఁక పెక్కుమూఁకలు సేతు
              రన్నిమూఁకల వారె యై చరింతు


తే.

రమలచూడాగ్రపింఛగుచ్ఛములు దూలఁ
బేరురంబులఁ దామరుపేరు లొలయ
నచ్యుతాపారమూర్తు లుదగ్రబలప
రాక్రమంబున నాభీరరాజసుతులు.

59


క.

నానాబలములు వలవ
సూనులకోల్తలకుఁ గాక సుడివడె ఘనసం
తానము లత్యుత్కటజం
ఝానిలరయమునకుఁబోలె నాహవభూమిన్.

60


క.

ఆ వల్లవవీరుల బా
హావిభవము నెలమి సొంపు నాటోపము దే
వావళులు చూచి పొగడె న
భోవీథి న్విజయదుందుభులు మొరయంగన్.

61

ఉ.

అంత సమస్తభూపతులు నాత్మచమూనిచయంబు వీఁగి వి
భ్రాంతి వహింప వీరుల మరల్పుచు నొక్కట వచ్చి తాఁకి ర
త్యంతరయంబున లయకృతాంతమహోగ్రగతిన్ రథాశ్వదు
ర్దాంతమదాంధసింధురశతంబులతో ధర గ్రక్కతిల్లఁగన్.

62


వ.

సకలసాగరంబులును గల్పాంతసమయవాత్యాఝంపాకంప
మానసముత్తుంగభంగంబులై యభంగనిర్ఘోషంబున ఘూ
ర్ణించుచుఁ బొంగి నింగిముట్ట వెల్లివిరియుచందంబున నమం
దక్ష్వేళాడంబరంబుతో మొగులు ముట్టిన కేతనాతపత్రనివ
హంబులు ముడివడ రోషావేశవేగంబున నిఖిలహరిద్భాగం
బులఁ జుట్టి గట్టిమోహరంబై తాఁకినఁ దూఁతకొమ్ము లొత్తి
కూఁక లాకసంబు నిండ మెండుకొని చండపుండరీకసింహ
రంహంబునఁ దొట్టి కట్టలుక నా దిట్టగొల్లకొమరులు పట్టిస
ప్రాసతోమరగదాకుంతపరిఘకరవాలముసలముద్గర
శూలభిండివాలచక్రక్రకచధనురాదిసాధనకలహకళావై
దగ్ద్యంబు మెఱసి వారివారికిం దలకడచి వీరరసావేశంబునఁ
జేతులతీఁట దీఱదనుచుఁ దలపడి రమ్మహావీరసంగ్రామంబు
సుపర్వపర్వంబై యుండె నట్లు నృపగోపాలబలంబులు హరి
ణశార్దూలసమజంబులును ద్విరదమృగేంద్రబృందంబులు
ను నాగగరుడనివహంబులునుం బోలెఁ బోరాడునెడ నా
భీరకుమారుల యగ్గలికఁ గని మావంతు లేనుంగులం బురి
కొలిపిన.

63

క.

కొండల పొడవై మదవే
దండసహస్రములు తండతండములై యు
ద్దండగతిఁ దనరె ఘనతర
తుండాగ్రము లెత్తి ఘీంకృతులు పెల్లడరన్.

64


సీ.

ఫూత్కారములతోడఁ బొరిబొరివర్షంబు
              వడువున సీకరావళులఁ ద్రోచి
కాలసర్పంబులకరణి నల్లాడెడు
              శుండాగ్రములఁ బట్టి చుట్టివైచి
వాఁడికొంతములకైవడి మీఱుఘనదంత
              కోరకద్వయములఁ గ్రుమ్మి కుమ్మి
ఘనమహీధ్రములనైనను వాలుకగఁ జేయు
              బల్లిదంబునఁ బట్టి మల్లలాడి


తే.

రుధిరమును మాంసమును బెనుఱొంపి గాఁగ
సంచరించుచు ఘంటికాస్వనము లొలయ
దుర్నిరీక్షంబు లగుచు సింధురము లని న
పారబలమున గోపాలబలముఁ గలఁచె.

65


క.

కని బలభద్రుఁడు ముసలముఁ
గొని యరదము డిగ్గనుఱికి కొండలఁ జెండా
డ నెసంగు వజ్రవిధమున
ఘనసంరంభమున దంతిఘటలకుఁ గవిసెన్.

66

క.

లాలితనవరత్నరుచి
శ్రీ లలరఁ బ్రలంబవైరిచేత నుదంచ
లీలల ముసలము వెలిఁగెం
గైలాసాగ్రేంద్రచాపుఖండము వోలెన్.

67


క.

తునిసిపడు తొండములు భ
ల్లని విఱిగెడు దంతసముదయము పిచ్చిలి క్ర
మ్ము నసృగ్ఝరులు దఱుచుగఁ
దనికి యొఱలెఁ గరులు ముసలదండాహతులన్.

68


సీ.

ఒకటి కుంభములు వ్రచ్చి కడంక ముత్తియ
              ములు వీరలక్ష్మి కంజలు లొనర్చు,
దృఢశక్తి నొకటి దిర్దిరఁ ద్రిప్పి వినువీథి
              నెగురవైచును వేల్పు లెత్తిచూడ
నురువడి నొకటిపై నొకదాని వైచి పై
              కుఱికి యారెంటి గుంజుఱకమట్టు
నొండొంటి యొకరెంటితొండముల్ బిగియఁగ
              ముడిచి యుయ్యల లూఁగి ముణుఁగఁద్రోచుఁ


తే.

దెగువఁ గొన్నిటి గుల్లల తిత్తులుగ మ
హీస్థలిం దొండ మొడిసి యెత్తెత్తి పొడుచుఁ
జటులగతి మత్తమాతంగఘటల కుఱికి
కామపాలుండు భీమసంగ్రామకేళి.

69

సీ.

[3]గురుసు గూడఁగఁ దీసికొని దంతములఁ గరి
              కుంభముల్ పగులంగఁ గొట్టి కొట్టి
యిరుసు లెడలఁ ద్రోచి యెత్తి కండుల రథా
              వళి నుగ్గునూచగా వైచి వైచి
కళ్యాలు సడలించి గళములఁ బెనఁగొల్పి
              వీతుల నేలతో వ్రేసి వ్రేసి
కరములు విఱిచి తద్గతమహాసులఁ బదా
              తులకంఠనాళముల్ ద్రుంచి త్రుంచి


తే.

కలఁచి తెరలించి గగ్గులకాడు సేసి
సకలబలములు దెసలకు సరగఁ దెచ్చె
నచ్యుతాగ్రజుఁ డాగ్రహవ్యగ్రభర్గ
చటులనిటలేక్షణ జ్వలజ్జ్వలనలీల.

70


క.

వారణకోటికి నడ్డం
బై రౌతు లనేకహయసహస్రములను న
వ్వీరునిపైఁ బఱపిన హలి
వారల నెదిరించి యంపవానల ముంచెన్.

71


చ.

అసదృశమత్స్యకచ్చపముఖాంబుజనిప్రకరాకులంబు లై
శ్వసనవశంబున న్నిగిడివచ్చు నుదన్వదభంగభంగముల్
వెస బడబాగ్నిచే నడఁగులీలఁ దదుత్తమవీతిజాతముల్
బిసరుహనేత్రుచేఁ బొలిసెఁ బెక్కులు సాదిసమన్వితంబులై.

72

వ.

ఆసమయంబున.

73


శా.

మార్వీనిస్వనగర్జ లుల్లసిల వర్మప్రస్ఫురద్రత్నరో
చిర్విద్యుల్లత లీనఁగా నృపవరాక్షీణాంబుదశ్రేణి పె
ల్లుర్విన్ యంత్రశిలాతతుల్ పిడుగులై యొండొండ రాలన్ జగ
త్పర్వంబై వడి ముంచె నచ్యుతగిరిన్ బాణావళీవృష్టితోన్.

74


చ.

తనుఁ గడుముంచి మించి బెడిదంపువడిన్ నృపు లేయునస్త్రముల్
సునిశితసాయకావళులఁ జూర్ణము సేయుచు లీలమైఁ గన
త్కనకమయోరుపుంఖమణికాంతులు పర్వఁగ నర్ధచంద్రబా
ణనిహతిఁ ద్రుంచె నానలినాభుఁడు సత్కరచాపసంహతిన్.

75


క.

అరిమార్వీటంకృతులును
గురుశరములు రాధకాంచిగుణమణిరవమున్
దరళకటాక్షశ్రీలును
సరిగాఁ గ్రీడించె శౌరి సంగరకేళిన్.

76


సీ.

చిద్రుపలై మణికోటి చెదర నుద్ధతి మిట్ట
              కోలల మకుటముల్ గూల నేయు
వడిఁ జిప్పగమిరాలవెడఁద నారసములఁ
              గవచముల్ దునుకలు గాగ నేయుఁ
దనువులు వడ వాఁడిమొదలసాయకముల
              వరముష్టిబంధముల్ వదలనేయు
నశ్వముల్ చెడి పాఱ నర్ధచంద్రాశుగ
              శ్రేణి సూతులతలల్ ద్రవ్వ నేయు

తే.

బలవదవనీతలేశమండలము దఱిసి
ధీరగతిఁ జిత్రభంగులఁ దేరు మెలఁగఁ
జక్రధరుఁడు త్రిలోకైకచాపగురుఁడు
ప్రాణదయితకుఁ గన్నులపండువుగను.

77


క.

బలదేవునిచే నంబర
తలమునఁ దూలాడు కరులఁ దార్కొని హరితో
పులఁ దెగి యెగసిన వెలిగొడు
గులు ఘనయుతబకము లనుటకుం దగియుండెన్.

78


క.

నారాయణశరఖండిత
వైరిసుభటకరటిఘోటవారంబు జగ
ద్ఘోర మయి పొలిచె హలికకు
ఠారము మై దళిత మైనయడవియుఁ బోలెన్.

79


క.

హరిచండకాండహతి భూ
వరులు కిరీటములు వాసి వాసవభిదురో
ద్ధురధారాంచలభిన్నశి
ఖరధరనీకాశతం బ్రకాశించి రనిన్.

80


క.

పైపైఁ బడుబలములు బహు
రూపంబులు సకలసురవరులు చూపఱుగాఁ
జూపెఁ గళానిపుణత్వము
గోపాలమణీంద్రజాలికుఁడు రణవీథిన్

81

తే.

ఏచి విక్రాంతి చూపఁగా నేనృపాలు
[4]నాదరింపక విజయ కన్యాలలామ
శౌరి వరియించె సత్కీర్తిచారుహాస
చంద్రికలదిశల్ వెలుఁగఁ బ్రసన్నమూర్తి.

82


వ.

ఇ ట్లవిరళబహుళనవ్యక్రవ్యరుధిరపూరమత్తనృత్యదనేకభీకర
భూతభేతాళకరకరాళకపాలకంకాళతాళకోలాహలదుర
వగాహం బగుమహాభీమసంగ్రామమధ్యంబున మధ్యందిన
మార్తాండమండలంబుతేజంబునఁ దేజరిల్లుచు విజయోల్లాస
భాసితుండై యవార్యదోర్వీర్యంబున ననవద్యధనుర్విద్యా
చండపాండిత్యంబున విక్రమంబు నెఱపుచక్రపాణియఖర్వ
దుర్వారఘోరనారాచనిచయంబు లనల్పవేగంబున నశనిక
ల్పంబులై వచ్చి చిచ్చుముట్టించినట్లు మర్మంబులు విచారింప
వీరకర్మంబులు విడిచి విహ్వలులై యతిరభసంబున జరాసంధ
సింధురాజ విందానువింద శిశుపాల నేపాళ చోళ మాళవ
కుంత లావంతి కాశ కరూశ లాట భోట కొంకణ టేంకణ
కళింద పుళింద బర్చర విదర్భ ప్రముఖనిఖిలదేశాధీశులు
తలచెదరి బెదరి బిరుదకేతనాతపత్ర వాలకరవాల బాణా
సన తూణీరంబులు వైచి రాచర్కంబు వదలి వెఱచఱచి
పఱచినఁ గో యని యార్చి ఘనధనుష్టంకారఝంకారంబు
లొనర్పుచుఁ బ్రచురదర్పంబున వెన్నుండు వెన్నాడినఁ

గలంగి మలంగి ప్రాణభీతిఁ బోఁడిమి చెడి యెగుసిగ్గులు
లేక నానాదిక్కులఁ దలచీర లెఱుంగక గాలిగొడుఁగు
లై కైదువులు వైచుచుఁ బఱచి యంధకారబంధురంబు
లగు గిరిగుహాగర్భంబుల డాఁగువారును, గిరిగుహాగర్భంబు
ల డాఁగంబోయి తదంతరాళంబు లుడుగక పట్లు సేసికొని
యున్న సింహశరభశార్దూలకోలాదిదుష్టసత్త్వంబుల వివి
ధకఠోరరావంబులు విని గుండె లవిసి బ్రమసి ఝల్లనం
బ్రేలి కాలు జాఱి చఱులం బడి మ్రగ్గువారును, గాఱడ
వుల నీరంబు లైనజాడలు దూఱి పాఱి నీరంధ్రనికుంజక్రో
డంబుల నొదుఁగువారును, నీరంబులు దూఱంబోవు తమకం
బునఁ దమకరంబులఁ దలవెండ్రుకల ముండ్లకంపలు పట్ట
విడిపించుకొనంజాలక చీకాకై పైసందడి గ్రమ్ముపెంపై
కాలుమట్ట దానం గెడయువారును, మ్రానువడి పీనుంగు
పెంటలు చొచ్చినవారును, జచ్చినట్లు కాలు చే యార్పక
పడియుండువారును, నట్ల పడియుండి కాకగృధ్రకంకనివహం
బులు నిశితచండతుండాగ్రంబుల వదననేత్రోదరంబులు
పొడిచి చించినఁ బంచత్వంబు నొందువారును, నెత్తుటం
దోఁగినకుణపంబుల నుపలక్షించి రణకంపంబు వట్టి గిజిగిజం
దన్నుకొనుచు ధరణిం బడి పొరలువారును, వారల వికృతా
కారంబులు చూచి వెఱచి భూతావేశవికారంబునఁ గళవ
శపడుచున్న పదాతులును, జోడుపక్కెరలు తెగం గోసి

యఱుతలకుం ద్రోయుచుఁ గేడెంబులు వెన్నునకుఁ దిగిచి
తేజీలం బఱపుకొని తలవీడులం బాఱిపోవువారును, కోయని
గుఱ్ఱంబుల కాళ్లు నఱికి తెగసెడక యడిదంబులు ఝళిపిం
చుచు ముట్టిపాటైనఁ బ్రాణంబులైన నిత్తుమని నెత్తురుజొ
త్తుకూడుకొని సందడింబడక నెలవరులై చేరువ తెరువున నేఁగు
వారును, [5]గొరిసెలపస చెడి పఱచి పఱచి యవి దగదొట్టి
నిలిచినఁ బాసిపోవక యండగొట్టు గుఱ్ఱంబులవలనియాస
విడిచి భగ్గన డిగ్గనుఱికి పాఱువారును, నెలవుదప్పి తప్పు
త్రోవలఁ జని కాలువయొడ్లయొఱకంబులఁ జేలగటఁ దగిలి.
జాడంగానక తిరిగి తిరిగి వచ్చినచోట్లకు వచ్చుచు నుపా
యశూన్యులై సంచరించువారును, దట్టని యడవులం దొట్టి
విడివడినగుఱ్ఱంబులఁ గూడింపుచుఁ బయిఁ బడినఁ బట్ట నలవి
గాక హేషాభీషణంబుగా మార్కొని కొట్లాడుచుఁ గల్లరి
గొట్లు పొదలు దూఱి పాఱువడిం గంటకంబులు మేనులు
చింపఁ గ్రొన్నెత్తురులు జొత్తిలుచు నక్కడక్కడ బలుఁదీఁ
గెలం దగిలి వ్రేలువారును నై వాహకులును మావంతు
లుఁ గూలిన యథేచ్ఛానువర్తనంబున నయ్యైయెడల నెత్తు
రుమడుఁగులు చొచ్చి ప్రేవులతీఁగెలు మృణాలజాలంబు లని
తిగిచివైచుచుఁ దిరుగునవియును, విచ్ఛిన్నకక్ష్యాజాలంబులై
యంకుశంబులు లేని యాధోరణులం గైకొనక జాడించి

వైచి వనవేదండంబుల వెంబడిఁ గొండలకుఁ బోవునవి
యును, దానధారాభారంబు లై యంతృశిక్షలకు రాక యొ
కటి కొకటి దార్కొని శకలీభూతదంతకాండంబు లగుచుఁ
ద్రోవలఁ గిట్టి బలంబులం బఱవనీక చలంబునఁ బోరునవి
యును మదమేనుంగుల గౌలునకుం గాక చెదరి హస్తిపకు
ల కశక్యం బై శకటాందోళికాగోతురంగమనివహంబులఁ
బడలు వఱపుచుఁ బఱపుచున్నవియు, నైన మాతంగంబులు
ను సారథులు లేక రథ్యంబులు చెడి పఱచుచు విషమస్థలం
బుల యొఱకంబులఁ బడి యొడ్డగెడవై వ్రాలునవియును,
నొకటి నొకటి గడువం బాఱురభసంబునఁ గదిసి కేడింప
నెడలేని యిఱుకటంబుల నొండొండ భళ్లనుచుఁ దాఁకి
వికలఫలకకూబరయుగకీలకచక్రంబు లై కూలునవియును
సమతలంబు లగు మహాపథంబుల నేటిమీఁదియోడలుం
బోలెఁ బడగలు దూల నతిజవంబున ధాటి దప్పక వడిం బ
ఱచి యిసుకతిప్పలం బడి దుమ్ము దూలఁ గ్రుమ్మరునవి
యును, మేదోమాంసమస్తిష్కంబులరొంపిం బడి డిందిన
కుండలు వెడలఁ ద్రిప్పరాక రథికసారథులు దిగి పఱచిన
గుఱ్ఱంబులతోన చిక్కియుండునవియు నైన రథంబులును
దీనదశం బొంది యిట్లు చతురంగబలంబులును బలాయితం
బు లైనఁ జూచి గారుణికాంతరంగుండై యార్తజనశరణ్యుం
డగు నారాయణుండు విజయశంఖంబుఁ బూరించి మరలి

యింత నంత దారిచిక్కిన కాలు చెయ్యిఁ గూర్చుకొని యొ
య్యనొయ్యన వచ్చువారు తనపొడఁ గని వడవడ వడంకు
చుఁ గసవుఁ గఱచి ప్రణమిల్లిన నోడకుఁ డోడకుం డనుచు
నభయదానంబు లొసంగుచుఁ దదాశీర్వాదస్తోత్రంబు లాక
ర్ణింపుచు నెడనెడ విశీర్ణంబు లైన కటకకేయూరహారకిరీట
కర్ణపత్త్రాదికనకమాణిక్యమండనంబులును వికలంబు లైన
యంకుశచంద్రహాసప్రాసప్రదరధనురాదిసాధనంబులును
విచ్ఛిన్నంబు లైన మణిమయచ్ఛత్త్రచామరధ్వజవ్యజనని
వహంబులును జిక్కైన కక్ష్యారశనామేఖలాజాలంబులును
భిన్నభిన్నంబులైన శంఖకాహళభేరీపటహడిండిమవీణావేణు
కాంస్యనికరంబులును జక్షురుత్సవం బొనర్ప వచ్చుచుఁ దన్మా
ర్గంబున.

83


సీ.

ముదిత! నీకుచకుంభములను బోలుదు మన్న
              వారణకుంభముల్ వ్రయ్య లయ్యెఁ
బొలఁతి! నీకరివంకబొమలఁ బోలుదుమన్న
              సింగిణిచాపముల్ చిద్రుప లయ్యెఁ
జామ! నీకేశమంజరులఁ బోలుదుమన్న
              పీలిజల్లెడెలు పిర్వీకు లయ్యె
లలన! నీకంధరాలక్ష్మిఁ బోలుదు మన్న
              చిందంపుగుల్లలు చిప్ప లయ్యె


తే.

జలజలోచన! నీకటాక్షములతోడి
మైత్రి వడసిన నిశితమామకశరముల

సమదవిద్వేషి రాజన్యసైన్యభూమి
నువిద! మో మెత్తి చూడు నేత్రోత్సవముగ.

84


క.

అని ప్రియురాలికిఁ జెప్పుచు
వనజాక్షుఁడు రామగోపవర్యులతో న
య్యని వెడలి కడఁక బృందా
వనమార్గము వట్టి చను నవసరమునందున్.

85


క.

గుణనాదము గజఘంటా
గణధ్వనులు మింటఁ జెలఁగఁ గదిసి మొరయఁగా
మణిమయవివిధవిభూషా
ఘృణులు నిగుడ భద్రకుండు కినుక యెలర్పన్.

86


తే.

ఇరుగెలంకులయందు ననేకబలము
లెలమిఁ గొలువంగఁ బఱచి వీఁ డెవ్వఁ డనుచుఁ
దన్నుఁ గనుఁగొను నాగదాధరుని ననతి
దూరమునఁ జూచి పలికె గంభీరఫణితి.

87


చ.

నిలు నిలు కృష్ణ! కృష్ణ! ధరణీవరసూనుల భీతచిత్తులన్
నలువురఁ బోరునన్ గెలిచినాఁడ నటంచును విఱ్ఱవీఁగి నా
చెలియలిఁ గొంచుఁబోయెద విసీ! యిది బంటుతనంబె భద్రకుం
డలఘుపరాక్రమాఢ్యుఁడని యాత్మఁ దలంపవ యించుకేనియున్.

88


ఉ.

ఆసురవృత్తి నీసరసిజాననఁ జేకొని యవ్వలవ్వలం
బాసి పురంబునం జొరక పాఱెద వీక్రియఁ బోవనిత్తునే

వాసికి నెక్కు నాకు నెనవచ్చినరాజవె విక్రమింప నీ
కీసతి రాజకన్య దగునే మదిలోనఁ దలంచి చూడఁగన్.

89


ఉ.

నాసరి గొలవా రని మనంబునఁ జూచెద వేమొ కాముసూ
పాసిన దా కళంకము కృపానిధి యైనసువర్ణభూధరే
ష్వాసనుచేత రాజ్యమహిమాతిశయంబును భూపతిత్వమున్
వాసియుఁ గల్గినాము సరివారె? మహీశులు మాకు నీభువిన్.

90


ఉ.

ఆలరికాండ్రతో వలసినట్టులు గొల్లలయిండ్లలోపలన్
బాలును నేయియుం బెరుఁగు బల్మి హరింపుచుఁ గ్రొవ్వి తత్కుల
స్త్రీలకుఁ గన్ను లార్పుచుఁ జరించెడు ఘోషమె వీరసంకులా
భీలత లోకపూజ్యమయి పెంపెసలారెడు మత్పురంబునన్.

91


క.

గొల్లవు నీ విట్టులు నా
చెల్లెలిఁ గట్టెదురఁ బలిమిఁ జేకొని చనినన్
జెల్లుబడి సాగవిడిచిన
గొల్లఁడ నేఁ గాక నీవు గొల్లఁడ వగుదే.

92


ఉ.

లాలితమచ్ఛరాసన కళామహిమోద్దురభంగి కీవృథా
స్థూలుఁడు హాలికుండు వ్రజసూనులు నీవును నోర్వఁజాల రీ
బాలిక డించి ఘోషగతి పట్టుము కాచితి నందపుత్ర! గో
పాలక! యాలఁ గాచి వనపంక్తులవెంటఁ జరింతుగా కొగిన్.

93


ఆ.

కాక రణ మొనర్పఁ గలిగిన నామ్రోల
నిలుము వింటివిద్య నేర్పుకడిమి

శంకరప్రసాదసంప్రాప్తమామకా
శుగనితాంతగతులఁ జూతుగాని.

94


వ.

అని మిక్కిలిఁ బోటుబంటునుంబోలె బిరుదు వక్కాణింపు
చున్నభద్రకుం జూచి మాధవుండు కలికిమొగంబునఁ జిఱు
నగవు దొంగలింప లేఁ గెంపుచాయ కొనచూపులు నిగు
డ్చుచు వానితో నిట్లనియె.

95


తే.

అంతవాఁడవె నీవు నీ వాడినట్ల
సేయనోపుదు వేమన్నఁ జెల్లు నీకు
నీవు వలికినయటుల నృపులతోడఁ
బోరనేకాక నీతోడఁ బోరఁగలనె!

96


క.

అంత విజృంభంబున బల
సంతానముతోడఁ బొదువఁ జల మేటికి నీ
స్వాంతమునఁ బొడమె చెపుమా
యంతయు నీచిత్తవృత్తి నరయఁగ వలయున్.

97


క.

సురభూసుర గురుభూవరు
లరుదందుచుఁ జూడఁ దత్స్వయంవరభూమిన్
గర మర్థి వరించిన సర
సిరుహాననఁ గొంచుఁ బోవఁ జెల్లదె నాకున్.

98


క.

ఆవల నావలఁ బోవక
నీ వీఁ డేమిటికిఁ జొత్తు నే నిదె చెపుమా
నీ వేటికిఁ బుర మేటికి
నావచ్చినరాకయెల్ల నాతిక కాదే.

99

ఉ.

ఈనలినాక్షి నన్ను వరియించిన నీరస మెత్తి పోరి య
ద్దానవుఁడున్ నృపాలకకదంబముఁ బడ్డవిధంబుఁ గంటివో
కానవొ తేటతెల్లమిగఁ గానఁగ వచ్చునె నీకు లోన దు
ర్మానముతోడఁ గూడి నడుమంత్రపురాజ్యమదంబు మీఱఁగన్.

100


క.

అనఘచరిత్రుం డగు నీ
జనకుని మన్ననయు రాధచంచలభావం
బును నీకు నడ్డువడినవి
చను చను మిఁక రాముఁ డోర్వఁజాలఁడు దీనిన్.

101


మ.

అనినం బ్రస్ఫురితప్రచండభుజసమ్యక్కార్ముకజ్యాలతా
ధ్వని[6]దిక్కుంజరకర్ణపూర్ణ మయి యుద్యత్సింహనాదంబుతోఁ
గొనసాగన్ వలకేల దీప్తు లడరన్ గ్రూరాస్త్ర మల్లార్చి యా
వనజాతాక్షునిఁ బల్కె భద్రకుఁడు గర్వగ్రంథిలస్వాంతుఁడై.

103


చ.

అరిగెదుగాక యీ సరసిజాననఁ దోఁకొని పల్కినట్ల నీ
బిరుసుఁదనంబు నాకడిమిపెంపును నిప్పుడె నీళ్లుఁ బాలు సొం
పరుదుగ నేర్పఱించు కలహంసకదంబము జోక లోకభీ
కరతరమచ్చిలీముఖనికాయములే విభజించు నాజిలోన్.

104


వ.

అని యిట్లు మహారౌద్రంబున భద్రకుండు వలికి నవ్వొలయ
విలయసమున్నిద్రసక్రోధాట్టహాసభాసితుండగు దండధరుని
రెండవమూర్తియన నెఱవాఁడితనంబున మార్గంబున కడ్డమై
తనచేతనున్న కరవాఁడిబాణంబు మాధవులలాటంబు గాఁ

డనేసిన నతం డలుక మలఁకగొనునంతరంగంబునఁ గలం
గియుఁ గలంగక నాదుప్రాణేశ్వరి సహోదరుం డగుటఁ జేసి
ప్రాణంబుల కలుగుట యుచితంబు గాదని యొక్కహాస్య
కృత్యంబు విచారించి,

104


ఆ.

పడగఁ ద్రుంచె నొక్కబాణంబుచేఁ దేరు
గూల నేసె నొక్కకోలచేత
హయముఁ జంపె నొక్కయస్త్రంబుచే నొక్క
నారసమున విల్లు నఱకివేసె.

105


వ.

ఇట్లు విరథుం జేసి.

106


క.

వనజాక్షుఁడు లేనగ వా
ననమునఁ జెలువార వికటనారీగర్భం
బనుబాణము వఱపిన నా
సునిసితసాయకము దాఁకి చోద్యంబందన్.

107


క.

ఎక దిగఁ బాతిన చన్నులు
చికిబికి వెండ్రుకలకొప్పు చిఱుతపిఱుందుల్
వికటపుమోముం గలిగిన
కొకిబికి యంగమున నొక్కగోతై నిలిచెన్.

108


క.

ఆ యట్టహాసభంగియు
నా యలుకయు నామహాభుజాటోపము నా
భ్రూయుగవక్రత్వంబును
నే యెడనెడ వాసెనోసుమీ సతియైనన్.

109

క.

ఏ మంత్రంబునఁ గూడియొ
యామాయానాటకుని మహాస్త్రము చూడం
గామినిఁ జేసెను బురుషునిఁ
దా మును పదధూళి సేయదా శిల సతిగాన్.

110


సీ.

ఔదల మణిమయంబగు కిరీటము వోయి
              కుఱుచవెండ్రుకలతోఁ గొప్పు దోఁచెఁ
గొమరారువజ్రాలకుండలంబులు జాఱి
              చెవులఁ దాటంకముల్ చెన్ను మీఱె
ఘనమైనవీరకంకణవైభవము మాఱి
              కరముల గాజులు మురిప మొప్పె
ఠీవైన పట్టుధట్టీరింగు లెడఁ బాసి
              కటితటంబునఁ జీరకట్టు దనరె


తే.

మీసములు విచ్చి మూతికి మెఱపు చూపె
రిత్త ఱొమ్మునఁ జన్నులు బిత్తరించెఁ
గపటగోపాలు బాణసంఘటన నరిది
భద్రకున కాఁడురూపు సంప్రాప్తమయ్యె.

111


సీ.

కన్ను లార్చుచుఁ గొన్నిసన్నలు గావించుఁ
              దీఁగెనవ్వులు నవ్వి దిస్సువాఱుఁ
బయ్యెద దిగజార్చి పాలిండ్లు పచరించు
              నఱుతఁ బేరులు చక్క నలవరించు

గాజులచప్పుళ్ళు ఘలఘల మనఁజేయుఁ
              గొనగోళ్ళ నందంద కురులు దిద్దు
నేలపాటల నెల్ల నించుకించుక పాడుఁ
              దగవుమాటల జాణతనము లాడు


తే.

సిగ్గువడు దిట్టతనములు చేగచూపుఁ
బాయుఁ గడుడాయు మఱియును బహువిధములఁ
జేష్ట లొనరించు నాయింతి సేననడుమ
హాస్యరస మొక్కరూప మైనట్టిభంగి.

112


క.

కరతాళగతుల నాడున్
మురిపెంబులు చూపు వికటముగ నవ్వొలయన్
బొరి సివములాడు సంగర
ధరఁ బెంపుడుక్రోఁతివిధము దళు కొత్తంగన్.

113


క.

సురవరు లచ్చెరువందిరి
పరిహాసము చేసె గోపబాలకతతి త
త్పరిజనులు వెఱఁగుపడి రా
హరి భద్రకు నింతిఁ జేసి యాడింపంగన్.

114


తే.

అద్భుతము సిగ్గు దైన్యంబు ననఁగి పెనఁగ
నాఁడుపోడిమి నర్తించు నన్నమొగము
రాధ గనలేక యాౌదల వ్రాల్చియుండెఁ
జిత్తమునఁ బ్రేమ సొలయక స్నేహ మొంది.

115

వ.

అంతఁ దద్వృత్తాంతం బంతయు నెఱింగి సహస్రగోపాలుం
డును బరిజనబంధుసహితుండై రయంబున వచ్చి బహువిధ
దీనాలాపంబులఁ బ్రార్థించి దుర్జనుం డని చూడక మాకొ
డుకునకు మరలఁ బురుషత్వంబు దయసేసి పుత్రదానం
బొసంగవే మహాత్మా! యని పలికి కరంబులు మోడ్చిన
భక్తవత్సలుండు కావున నప్పరమపురుషుండు కరుణార్ద్ర
హృదయుండై యతనిని దగ్గఱం బిలిచి మేను నిమిరినఁ
దత్కరస్పర్శనంబునఁ జిత్రంబుగా నెప్పటియట్ల పురుషరూ
పంబు వహించి లజ్జావనతవదనుండై యున్న బావమఱంది
సయ్యాటంబునఁ ద్రస్తరులాడి యుపలాలించి మన్నించి
జనకసహితంబుగాఁ బురంబునకు వీడుకొల్పి యమ్మాధ
వుండు రాధ మదిఁగలంకఁ దీర్చి సుప్రసన్నం జేసి ముకుంది
నియుఁ దానుం దగినజాణతనంబు లాడుచుఁ జని కొంత
దవ్వున సేవార్దంబు సుందరవల్లవకుమారుల నిడుకొని బల
భద్రునిం దక్కినగోపాలుర మంద కనిచి బృందారణ్యంబు
చేరంబోయి యమునాతటంబునఁ దేరు డిగ్గి యున్నయవ
సరంబున.

116


క.

రాధామాధవులను జగ
దాధారులఁ జూడ వచ్చి రమరోరగవి
ద్యాధరముఖ్యులతో గం
గాధరపద్మజులు మౌనిగణములుఁ దారున్.

117

క.

దేవీసహితుండై యా
గోవిందం డెదురువోయి కోరికఁ దగుసం
భావన లొనరింపుచుఁ ద
ద్భావములకు సంతసంబు దలకొనఁ జేసెన్.

118


వ.

తదనంతరంబ వారును దానును నొక్కమనోహరపులినమం
డలంబునఁ గూర్చుండి రప్పు డార్యావల్లభుండు మనోహర
చ్ఛద్మగోపాలమిథునంబు నుచితాన్యోన్యప్రేమానుకూల
తలకు ముచ్చట వడి మెచ్చి కౌతుకంబున నిట్లనియె.

119


తే.

క్షీరవారాకరంబున సిరియు నీవు
నలినలోచన! కూడుండునాఁటికంటె
మదనగోపాలమూర్తి! ప్రేమమున రాధ
తోడఁ గూడున్న నినుఁ జూడ వేడుకయ్యె.

120


వ.

అని వైకుంఠంబులోని మాటల నూహించి మీ యిద్దఱకు
నితరేతరప్రణయసంగమసౌభాగ్యంబు పరిణయమహో
త్సవం బని పలికి మఱియును.

121


సీ.

మదనగోపాలకవిదితరూపములు ము
              ప్పదిరెండు త్రైలోక్యపావనములు
మదనగోపాలకపదపూజనాకల్పి
              తార్థంబు లఖిలక్రియాకలనలు
మదనగోపాలకమంత్రంబు సకలతం
              త్రములలో నిహపరదాయకంబు

మదనగోపాలకమంత్రసంసిద్ధులౌ
              జనులు పరిష్కృతసకలహృదయు


తే.

లనుచు నిగమాంతములు చెప్పునట్ల చూడ
మదనగోపాలకృష్ణ! యీమహితమూర్తి
నిఖిలలోకైకపూజ్యత నీదుభూత
భావిమూర్తులకంటె దృక్పర్వమయ్యె.

122


వ.

అని తల్లీలలు ప్రకటించు సమయంబున.

123


క.

నారదుఁడు వచ్చె వీణా
నారాయణనామపూర్ణనానాశ్రుతియై
యారాధామాధవుల య
శోరూఢులఁ బాడియాడుచు న్వినువీథిన్.

124


వ.

ఇట్లు చనుదెంచి నందనందనుచేత పూజాభినందితుండై యా
నందలహరిం దేలుచుఁ గొంతవఱకు వీణవాయించి యలపు
దొట్టి తనకుం దానె చాలించి గఱ్ఱనఁ ద్రేన్చి కుట్టూర్పు
లూర్చుచు నిట్లనియె.

125


క.

నారాయణ! నీనామసు
ధారసమాకంఠపూరితం బయ్యెను నా
కోరినయట్లన నీ వీ
ధారణిపై గోపవేషధారివి యగుటన్.

126


వ.

అని కొలువుఁ గలయంజూచి.

127

గీ.

అయ్య యీఫాలలోచనుం డలిగినాఁడు
పురనిశాటులతో నేమి? పోటులాడె
నిఖిలశస్త్రాస్త్రవైచిత్రి నేఁడు శౌరి
పోటులాడుట చూచితిఁ బొందుగాను.

128


వ.

తక్కిన నరదేవదానవుల పోట్లాటలును నానాయుగంబులం
జూచిన యవియున్న నెన్నడు నేఁడువోలెఁ గన్నుదనియద
నీస్వయంవరమహోత్సవంబు నాకుఁ బెనుపండువై సం
తుష్టి యొనర్చె ననుచు మునులం జూచి పాణిపల్లవం బెత్తి
“రాధామాధవ దంపత్యో రవిచ్ఛిన్నప్రీతి రస్త్వితి భవంతో
బ్రువంతు” అని యాశీర్వదించిన నందఱు నట్ల పలికిరి. త
ద్వాక్యంబుల కలరి మాధవుండు మందస్మితంబు దళుకొత్త
నతని సంభావించె నాసమయంబున.

129


గీ.

దివ్యగంగామహానదీదేవి దివ్య
భామయై వచ్చి నవహేమపంకజముల
నర్థిఁ బూజించెఁ బుండరీకాక్షు రాధ
తోడఁ గూడంగ సురమునిస్తుతులు చెలఁగ.

130


గీ.

కనకకలధౌతమణిపుష్పకలితలలిత
హర్మ్యమండపచంద్రశాలాభిరామ
మైన దివ్యాలయము తన్మహావనమున
నచ్యుతక్రీడలకు బ్రహ్మ యట సృజించె.

131

క.

ఏవేళకు నేవస్తువు
లావల్లవుఁ డాత్మఁ గోరు నల్లన నాబృం
దావనమునఁ గలిగుండె మ
హావైభవ మెసఁగఁ దన్మహత్త్వముకలిమిన్.

132


గీ.

హరికిఁ గ్రీడార్థమై పురందరునియాజ్ఞఁ
బారిజాతాదిసురలోకపాదపంబు
లనిశకిసలయకుసుమఫలాభివృద్ధి
నుండె బృందావనమున నేత్రోత్సవముగ.

133


క.

వనకేళికౌతుకంబున
వనజాక్షున కప్పు డెద్ది వలయునొ యనుచున్
వనమున నన్నిఋతువులును
ననువొందెం దగినభంగి నయ్యైయెడలన్.

134


వ.

ఇవ్విధంబున వేల్పులందఱు నందనందను నభినందితహృద
యునిం జేసి యుచితగతుల వీడుకొని నిజవాసంబులకుఁ
జనిరి. రాధాసహితుండై మానవుండు నవ్వనంబుఁ బ్రవే
శించె నంత.

135


క.

లవలీతక్కోలైలా
లవంగనవమాలికాదిలతికాపుష్ప
స్రవదవిరళమధుపిచ్ఛిల
పవనం బాదంపతులకుఁ బ్రమదం బొసఁగెన్.

136

సీ.

అంబరంబునఁ జెరలాడు రాచిలుకలు
              పచ్చతోరణముల బంతి గాఁగ
నునుగాలిఁ దూలి మిన్నులు ప్రాఁకు నవపరా
              గంబు మేలిమి మేలికట్లు గాఁగఁ
గాసారమకరందకలితపయోజనుల్
              కమనీయపూర్ణకుంభములు గాఁగఁ
బ్రవిమలకనకచంపకతరుకోరక
              ప్రతతి నివాళిదీపములు గాఁగఁ


తే.

బరభృతంబులరొద లింపుపాట గాఁగ
శోభనపుఁబెండ్లిచందాన సొంపు మీఱు
వనము సొత్తెంచి రావధూవరులు వేడ్కఁ
జెలఁగి వనదేవతలు పువ్వుసేస లొలుక.

137


చ.

సితకిరణోపలావళి రచించిన మించుటరుంగుమీఁదఁ బు
ష్పితవకుళావనీరుహముచెంతఁ దమాలలతామతల్లితో
హిత మొనరించె వారలకు నెంతయు నక్కడ వెండికొండఁ బ
ర్వతతనయాసమేతుఁడయి రాజిలు రాజకిరీటుపోలికన్.

138


క.

మరకతమణిసోపానో
త్కరములఁ దగునారికేళకదళీపున్నా
గరసాలంబులఁ గాంచన
సరసిజములసొంపు చూపె జలజాకరముల్.

139

క.

సురమిథున మధురసింజిత
భరముఖరితగుహల, శిఖరపర్యంతనట
త్సురుచిరబర్హిణముల, మణి
కిరణంబులఁ బ్రియ మొనర్చెఁ గ్రీడానగముల్.

140


సీ.

సురపొన్నపువ్వులఁ బొరిఁబొరిఁ దొరిఁగెడు
              మధువులఁ గ్రోలెడు మధుకరములు
కలికిలేమావిమోకలఁ జిగిర్చిన చిగు
              రాకులు గబళించు కోకిలములు
కదళికాతరువుల [7]ముదిరిచిట్లెడుఫల
              రాసులు చవిచూచు రాచిలుకలు
కొలఁకులమేలైన నలినమృణాలంబు
              లప్పళించెడు మల్లికాక్షములును


తే.

దయితలకుఁ గొంత మందిచ్చి తాము గొనుచు
ఱెక్కలార్పులు మదిఁ దత్తఱింత లెసఁగఁ
బ్రేమఁగవఁ గూడి పెనఁగుచు బిత్తరించు
సొంపులింపులఁ దేల్చె నాదంపతులకు.

141


ఉ.

పొన్నలపుప్పొడిన్ మొగలిపువ్వులపుప్పొడి సన్నగాడ్పులన్
మిన్నులు వ్రాఁక భానురజనీకరదీప్తు లటంచు జక్కవల్
క్రొన్ననవిల్తుసేఁతలకుఁ గూడువిధంబును నింగి ముట్టు న
వ్వెన్నెలపుల్గులాటలును వేడుకఁ దేల్చెఁ దదంతరంగముల్.

142

క.

ఫలనిబిడంబై కుతుకము
నెలవుకొనంజేసె నొక్కనేరెడుఁబొద యా
నలినాక్షీనలినాక్షుల
కలసాలగ్రామశైలఖండములీలన్.

143


వ.

మఱియు నవ్వనవాటియందు హాటకమణిఘటితయంత్రప్రణా
ళీజాలకీలితప్రవాళలతాంబువాహీనీముఖంబుల బహుము
ఖంబుల వికచకమలకహ్లారనికరమకరందపరాగపరిమళమిళి
తంబులగు కాళిందీనదీప్రవాహపయఃపూరంబులు మృగ
మదశాదంబునఁ దీర్చిన కాలువలవెంట వచ్చి విప్పుగల
కప్పురపుఁగుదుళ్ళు నిండి మూలకందంబులం బొందిన రవల
మేలిమి గొని యేచి చూతపున్నాగసరళవకుళకేసరజంబూ
జంబీరకదంబముఖ్యతరుకదంబంబుల కొమ్మలం దగిలి కలయం
బ్రబ్బుకొని వీథీవిటంకంబుల సౌధచంద్రశాలామంటపకుటీర
తోరణాకారంబుల వివిధవిచిత్రకిసలయకుసుమఫలనివహం
బులు సముచితసన్నికృష్ణంబులై నవరత్నకీలితంబులగు సోపా
నవలభిగవాక్షకనకకుంభంబుల విడంబంబు చూప, వలరాచ
వాని సిరినగరనుసొంపున నొప్పు లీలాలవలీనాగవల్లీమల్లి
కామాధవీయూథికామాలతీజాతిలలితలతానికుంజపుంజంబు
లతో శశికాంతమణివేదికలమీఁద మధూలికణగణాకీర్ణంబు
లును, పరాగధూసరితంబులును నవకుంకుమోపధానపద్మ
దళాస్తరణశోభితంబులు నగు కనకడోలాతల్పంబులును నీరె

క్కని యున్నతస్థలంబుల లతాపాదపంబులకుఁ గనకకలశం
బుల నీరువోయు క్రీడావిబుధవధూజనంబులకుఁ జెంగల్వ
బావులక్రేవలం గనుపట్టు పరిణతలతాభరణంబులగు మాదీ
ఫలముదీఁగెలచిగురుంబోణులమోవులం దెగడు కెంజిగురు
జిగినిగనిగలు తీఁగెలు వాఱి తిర్యక్కృతంబులై పయింబర్వి
నవల రాచజోదు వైచిన పగడంపుఁగొత్తడంబులఁ గీలుకొని
క్రొన్నెత్తురులఁ దోఁగియున్న విరహిజనసముదయంబుల
రూపనుశంకఁ గొల్పు నిర్మలస్ఫటికహర్మ్యకుడ్యప్రదేశంబుల
నింగిలీకపురసంబు నింపుల వెలుంగారు కనకకలధౌతకరిదంత
రత్నపాంచాలికాసహస్రంబులను బాంధపరిపంథిసంతానం
బులపై దండు వెడలు కుసుమకోదండుయాత్రాసమయం
బునకు నాయితంబు సేసి తెచ్చి నిలిపిన కరిఘటలసౌవర్ణ
ఘంటికాకారంబున విలంబమానఫలంబులును విశదదంతం
బులభాతిఁ గోరకంబులు నొప్పనొప్పు కేతకీతరుషండంబుల
దండల వటవిటపిచ్ఛాయలఁ బచ్చికబయళ్ళఁ బ్రాణవల్లభు
లు తగుతెఱంగుల శృంగంబుల నివురఁ దనుకండూయన
ముకుళితలోచనంబులతో గగురుపొడిచి సుఖపారవశ్యంబు
నుం జెంది యించుకించుక తృణఖండంబుల నమలుచుఁ గ్రీడ
సల్పు హరిణీగణంబులం జూచి యనురాగంబు నొందుచు
నుభయపార్శ్వంబులఁ జమరీమృగంబులు వివిధసముద్దూత
శిఖికలాపజాలంబులు నవరత్నవిరచితాతపత్రంబులై వెలుం

గనుత్కంఠమరాళసారసచక్రక్రేంకారంబులు వేత్రపాణుల
యుపచారవాగ్రచనలుగా సంప్రీతిఁ బ్రీతిమాధవుల
యింటికి విందువచ్చు రతిమకరధ్వజు లనుమాడ్కిఁ గర
పల్లవంబులఁ జూతపల్లవమంజరులు రంజిల్ల వివిధసురభి
కుసుమసుగంధంబు లాఘ్రాణింపుచు రసాలఫలసామగ్రికి
మెచ్చుచు శ్రేణిశృంగారభంగు లగ్గింపుచు ముక్తాఫలరంగ
వల్లికాకారవికీర్ణమల్లికాకుసుమజాలకవిరాజమానమో
హనస్థలంబుల నిలిచి నెరసి దటనైన పుప్పొడినెలవులు
మెత్తమెత్తన మట్టి కోమలపదపద్మరేఖాలక్ష్మలక్ష్మీ
పరభాగంబులు గావింపుచు రవిరశ్మి సొరక జీబుకొనియున్న
సేమంతిపొదలఁ బువ్వుఁదేనె లుబ్బి సోనలు గురిసి పర్ణాగ్రం
బుల పయింబడి తుప్పునఁ దూలి తుంపర చింది మసకతిత్తు
లం బట్టినయట్లు బిరుసుమంచు నెరసినచందంబున మంద
పవమానంబున నివతాళించు నీడలైన బొట్లమేనులు గగు
రుపాఱిన కుంకుమరజంబు లద్దుకొనుచు మధూళిశీకరసం
సిక్తమార్గపంకిలంబులగు మణికుట్టిమమార్గంబులఁ గాలు
జాఱిన లీలాసంభ్రమంబున నవ్వుచు నొండొరులం బట్టుకొని
యంగాంగసంస్పర్శసుఖకేళిం దేలుచు మెఱుఁగుఁగెంపు
ఱాలతాపలవెంటఁ గనకవేదిక లెక్కునెడల పువ్వుఁదేనె
మీఁదఁ గొనుచు నతిశయస్వచ్ఛస్ఫటికమాణిక్యస్థలంబులు
పన్నీటిపటిమ లనువిభ్రాంతిఁ జరణపల్లవసంసక్తపరాగ

పంకంబు గడుగ డగ్గఱి తేట చూచి కాకుండుటకు సిగ్గువడి
మందస్మితంబులు నిగుడఁ దొలఁగిపోవుచుఁ జని చని కేళీ
భవనంబుదండఁ గదంబతరుషండమధ్యంబున విహరణశోణ
మణిమంటపంబు తత్కుసుమరంజితంబై వియోగజనాధిక
కంఠరక్తసిక్తంబగు మదనభూతబలిపీఠంబు వడువునఁ దేజ
రిల్లిన గుండె ఝల్లనఁ దదావేశంబునం బొంది యెట్టకేల
కించుకించుక దేఱినమనంబుతోడఁ దదంతికంబున.

144


సీ.

పచ్చలతలుపులు పవడంపుద్వారబం
              ధంబులు ముత్యాలతావళములు
వజ్రాలకంబముల్ వైడూర్యకుడ్యముల్
              జాలమార్గముల నీలాలగములు
పటికపుంజవికెలు పద్మరాగపువేది
              కలు పుష్యరాగంబుగద్దెపీఁట
లుజ్జ్వలగోమేధికోన్నతడోలికా
              స్తంభముల్ శశికాంతదర్పణములు


తే.

పసిఁడిజలపోసనంబుల పావజోళ్ళు
పువ్వుఁబాన్సులు పచ్చకప్పురపుసురటు
లింద్రనీలంపుఁజందువా లెనసి యొప్పు
స్వర్ణహర్మ్యంబు సొచ్చి రాసతియుఁ బతియు.

145


వ.

ఇట్లు ప్రవేశించి యయ్యిద్దఱుం బసిఁడికెందమ్మితూఁగుటు
య్యెల రతిరాజరాజ్యసింహాసనంబునంబోలె సుఖాసీనులై
రప్పుడు.

146

సీ.

మంజరీకుచకుంభకమండలి పుప్పొడి
              పయ్యెద దిగజాఱి బయలుపడఁగ
మధుకరప్రేమార్ద్రమధురదృక్తతి మొగ్గ
              సిగ్గుమఱుంగునఁ జీరువాఱ
సైకతోన్నతకటిచక్రదేశంబునఁ
              గలహంసమేఖలాక్వణన మెసఁగఁ
జిగురాకుమోవిపై నిగిడి కుందద్యుతి
              స్మితరుచిచంద్రికల్ చెంగలింప


తే.

నన్యభృతరుతమధురవాక్యములతోడ
వాసనల మేనిలోపలి వలపుఁ జిలికి
వల్లభయుఁబోలె వనలక్ష్మి వనజనేత్రు
హృదయపద్మంబునకుఁ జాల నిం పొనర్చె.

147


వ.

అప్పుడు.

148


ఆ.

చిత్తవృత్తి యెఱిఁగి చెలఁగి సంభ్రమలీల
నీరజాతపత్రనేత్రుచేతి
శంఖచక్రపుష్పచాపశరము లందు
కొని తొలంగి చనిరి గోపసుతులు.

149


ఉ.

సంతస మారఁ బ్రాణవిభుసంగతి డగ్గఱి యేకశయ్య నా
యింతి వసించె నెమ్మొగ మొకించుక యడ్డము సేసి సిగ్గుతోఁ
గంతుఁడు మానసంబు చెలికానిగతిన్ గిలిగింత పెట్టఁగా
నెంతయు గుబ్బచన్నులపయిం బులకాంకురరాజి నిల్పుచున్.

150

సీ.

జలరుహగంధి నిర్మలగాత్రి తరళాక్షి
              సురుచిరావయవ భాసురనఖాగ్ర
సుప్రసన్నానన శుద్ధాత్మ సురభిళ
              మాల్యానుకలిత ప్రేమార్ద్రహృదయ
[8]భారవేణిక కళాచారుభాషిణి మాన
              వతి కృతోత్సవలీల ధృతిసమేత
బాలిక లావణ్యహేలావిలాసిని
              ఘనకుచయుగళ యౌవనమనోజ్ఞ


తే.

యాదిగర్భేశ్వరీరత్నమాలతాంగి
కల్పవల్లియుఁబోలె సంకల్పఫలస
హస్రము నొసఁగకున్నె శయ్యాతలమునఁ
బ్రాణవిభునకుఁ గన్నులపండు వగుచు.

150


గీ.

అధిపుచెంగట నపుడు బింబాధరంబు
తొడలు నించుక యదర మైఁ బొడమెఁ జెమట
పోఁకముడి కొంత బిగిజాఱెఁ బువ్వుఁబోఁడి
తలఁపు కందర్పవిభ్రమాకులము గాఁగ.

151


క.

లీల ముకుందిని దగ న
వ్వేళం గర్పూరగంధవిసృమర మగుతాం
బూల మొసఁగె డగ్గఱి గో
పాలికి గోపాలకునకుఁ బ్రమదం బెసఁగన్.

152

మ.

చెలి చుట్టిచ్చిన వీడ్య మందుకొని యాశీతాంశుబింబాస్య సి
గ్గులమార్మోమున లేఁతన వ్వోలయఁ జక్షుష్కోణవీక్షల్ కెలం
కులఁ ద్రొక్కం గరవల్లిలేఁబులక లంకూరింప నవ్వారిగా
నలస ప్రక్రియ నిచ్చె నెయ్య మలరం బ్రాణేశు కెంగేలికిన్.

153


క.

చెలి యొత్తి చెప్ప నగుచున్
జలజానన గఱచి యాకు సగ మిచ్చిన నా
చెలువుం డలరుచు వాతెఱఁ
జులకనఁ గొనుచుం బ్రియోక్తిఁ జుంబన మడిగెన్.

154


క.

వెలుపల సిగ్గరియును లో
పల దిట్టయు నయ్యెనేని బాలిక వఱలన్
గలికి యగు నీవిధంబులు
గలవా రాధికకు వలపు గాదే పతికిన్.

155


సీ.

ఆ కందుకొనియెడి ననువున బుజముపైఁ
              జెయి వేసి కొనగోళ్ళ జెక్కు పుణుకుఁ
దాంబూలలహరిచేత జనించు చెమటార్చు
              వెరవునఁ బయ్యెదచెఱఁగు దిగుచు
మొలకట్టుమాణిక్యకములు చక్కఁద్రోయుచు
              జఘన మల్లల్లన సంస్పృశించుఁ
దలగడపై నొత్తి వెలికాలు సాచి యం
              గుళులు లోఁదొడల సందుల నిగుడ్చుఁ

తే.

జిన్నినగుమోము తనదిక్కు సేయఁగోరి
వీడియును వీడ నరగొప్పు వీడ్చునగుచు
భావరసగర్భచేష్టలఁ బ్రథమరతిని
రాధమది మేలుకొలుపుచు మాధవుండు.

156


క.

హాటకవిచిత్రముక్తా
స్ఫోటతుషారాంబుఘుసృణసుస్నిగ్ధరజః
పాటీరకర్దమము స
య్యాటంబున నలఁదెఁ గోమలాంగికుచములన్.

157


గీ.

శీతకరకాంతి శశికాంతశిలయుఁబోలె
నలినలోచను కరలీల నవిఁ గరంగి
[9]యవయవంబులు పొంగెఁ దా మవసి యవలఁ
గళలు నెలవుగఁ బయిపైని పులక లెసఁగ.

158


క.

నలినీదళతరళంబగు
జలబిందువువోలె నపుడు సతియంగమునన్
గళ దొలఁకాడఁ దొడంగెం
గలికి తలఁపు మరునిచేతఁ గళవళమొందన్.

159


గీ.

తన్మనోభావములుఁ దహతహలుఁ జూచి
జాలవల్లిక తాంబూలచయము నించి
శౌరిఁ గనుఁగీటి సన్నకు సన్న జాఱి
పువ్వుఁ దెర వేసిపోయె నబ్బోటికత్తె.

160

చ.

చెలి యటు వాసిపోవుటయుఁ [10]జెల్వ భయంపడ కించుకేనియున్
దలఁపునఁ గాకు లేక దయితప్రియలాలనమాత్ర నప్పుడే
వలపులకేళిఁ దన్మయత వ్రాలి సుఖాబ్ధితరంగమగ్నమై
దలఁపదు దేహమైన నది దర్పకవిభ్రమ మేమి చెప్పుదున్.

161


ఉ.

చిత్తజుకేళికిన్ మొనయఁ జేయుచు సిగ్గుల యుగ్గు విప్పి య
మ్మత్తచకోరనేత్ర నవమన్మథమూర్తి సరోజలోచనుం
డత్త[11]ఱి వేడ్కఁ గౌఁగిటికి నల్లనఁ జేర్చి బిగించెఁ బ్రేమఁ బూ
గుత్తుల మించు నాబిగువుగుబ్బ లురస్థలి గాఁడి పాఱఁగన్.


క.

అంగనయు హరియు గాఢా
లింగనబంధముల నెఱుఁగ లేరైరి యొడ
ళ్ళంగభవమధుమదాలస
తం గూ డొకకొంతతడవు తాదాత్మ్యమునన్.

162


గీ.

కొదమసంపెంగపూదండగుణము గలిగి
[12]గౌసె నెడ లెక్కుపెట్టని కంతునల్ల
చెఱకువిలుఁబోలెఁ గృష్ణుఁ డాచిగురుఁబోఁడి
తోడఁ గలికాశుగక్రీడఁ గూడి యొప్పె.

163


చ.

వనజదళాక్షియున్ హరియు వాతెఱతేనియ లాన మోము మో
మునఁ గదియించుటొప్పెఁ బ్రియముల్ దళుకొత్తఁగఁ జంద్రబింబమున్

వనజము మైత్త్రిఁ గూడుకొని వైరము లేక సుధామధూళు లిం
పొనరఁగ నీడుజో డెసఁగుచున్నవియో [13]తమలోనఁ దా మనన్.

164


సీ.

పంబినవిరహతాపమున శోషిలినవా
              తెఱలఁ జుంబనలీలఁ దేనె లుబ్బెఁ
గడువియోగార్చులుఁ గ్రాఁగినతనువులు
              శ్రమజలంబులఁ దోఁగి చల్లనయ్యెఁ
జిరవిప్రయోగార్తిఁ జిక్కినయంగముల్
              పరిరంభసంపద నురవుకొనియె
నాయల్లకవ్యథ నలఁగినచిత్తంబు
              లితరేతరాసక్తి నెలమిఁ బొందెఁ


ఆ.

బ్రేమ వొదలె సిగ్గు బిగిజాఱెఁ దహతహ
లెసఁగె శంక లుడిగె నేపు మీఱెఁ
దమక మెక్కె నొలసెఁ దర్జనగర్జాతి
తరళవచనరోషతాడనములు.

165


క.

కలమధురమణితములఁ జం
చలకరకంకణరవములఁ జరణతులాకో
టిలలితశింజితములఁ బూ
విలుకాఁ డచ్చోట నాట్యవిధ మొనరించెన్.

166

సీ.

వలయు బంధములకు మెలపుటకై సన్న
              గావించుఁ గుంతలగ్రహణకేళి
మూర్ఛాలసతఁ గన్ను మోడ్చుచో వాతెఱఁ
              బలునోవ నాటించి తెలివి గొలుపు
నానందసాంద్రత సంగముల్ వదలుచోఁ
              గెరలించి యొత్తి రాఁ గేల బిగుచుఁ
గళజాఱు గిలిగింతఁ జలియించుమేఁదీఁగె
              బిగియఁగౌఁగిటఁ జేర్చి సొగయఁజేయు


తే.

గురుకుచంబులఁ బొడము కప్పురపుఁజెమట
లద్దుకొను నవయవముల ననఁగి పెనఁగి
[14]మాధవుండు మదనతత్త్వసాధకుండు
నాత్మ నాత్మేశ్వరికిఁ గోర్కె యభినవముగ.

167


క.

కేళీగృహకుడ్యంబులఁ
గీలించిన బంధగతులఁ గీల్బొమ్మలుగా
నీలీల నుండి యల్లనఁ
గేళి సలిపి రింపుసొంపు గిఱికొనుచుండన్.

168


క.

తరుణీకృతహరివిక్రమ
కరణోదంచితచలాంఘ్రికమలము మణినూ
పురకలఝలంఝలధ్వని
మరుమువ్వలకోలవోలె మన మలరించెన్.

169

ఆ.

చతురశితిబంధచతురత్వములు చూపి
చెలువుఁ డలయు టెఱిఁగి చెంగలించి
గురునితంబబింబకచభారభరలీల
లోచనోత్సవముగ లేచి యేచి.

170


సీ.

ఒకకేలఁ బ్రాణేశుచికురముల్ గబళించి
              కే లొక్క టురమున లీల నూఁది
యడుగుఁగెందమ్ములు తొడలపై నొకకొంత
              సమకొల్పి యర్థంబు శయ్య మోపి
కించిదుదంచితాగకుంచితగతులచే
              మొలనూలిచిఱుఘంటికలు చెలంగఁ
జిన్నికౌ నసియాడఁజేయు పయోధర
              ముల గుబ్బసరములు ముడివడంగఁ


తే.

దనుతరస్వేదబిందుసుందరముఁ దరళ
చూర్ణకుంతలపంక్తి భాసురము మంద
హాసగర్భంబు నై వదనాబ్జ మలర
సరసపురుషాయితక్రీడ సలిపె నింతి.

171


క.

కమలాక్షి యుపరికేళీ
సమయంబున నుల్లసిల్లె సరసక్రీడన్
గమలజముకుళాగ్రంబునఁ
గొమరారెడు పసిఁడియంచకొదమయుఁ బోలెన్.

172

మ.

ప్రచలత్కాంచికలాపదీప్తకటిచక్రశ్రీలు నంసోచ్చల
త్కచభారోద్గళితప్రసూనములు రంగగత్కుంతలప్రోల్లస
ద్రుచిరేఖావలనంబు దృగ్లలితచేతోజాతసమ్మూర్ఛనా
రచనాభంగియు శౌరి కిం పొసఁగె నారాజాస్య క్రీడింపఁగన్.

173


క.

హరి కరజక్షతి యాసర
సిరుహానన మెఱుఁగుఁజిన్నిచెక్కున నొప్పన్
సురుచిరదర్పణబింబాం
తరబింబితబాలచంద్రునకు సరివోలెన్.

174


క.

పొలఁతి చనుగ్రేవఁ దొడికిన
[15]పలుఁగాటుల చాఱ నడఁచుఁ బై పై హరియూ
హలు గాకా జిగిబిగులం
బలుఁ జారనె చూపు జీరువాఱు నటంచున్.

175


గీ.

చామవసివాళ్ళ మేనును జాఱుతుఱుము
సోల మును జొక్కు దేరెడు చూపు నలస
గతులు రతితుది నెమ్మదిఁ గరఁప మగుడ
మగుడఁ దమిఁ బెంచి క్రీడించు మాధవుండు.

176


క.

ఆలీలామిథునము కే
లీలం పటజాతఘర్మలేశశ్రమముల్
దూలిం చన యాకపటికి?
నేలా సుమనోజలంబు హేలాగతులన్.

177

క.

ఎప్పుడు రవి యుదయించునొ
యెప్పుడు గ్రుంకునొ యెఱుంగ కీక్రియఁ గాంక్షల్
ముప్పిరిగొనఁ గ్రీడించిరి
యప్పంకజముఖియుఁ బంకజాక్షుఁడు మఱియున్.

178


చ.

మదిఁ గడు నుల్లసిల్లి మధుమాసమహోత్సవ ముగ్గడించుచున్
మదనధనుర్లతాగుణనినాదము వీనుల కింపు చేయ న
మ్మదవతియున్ ముకుందుఁడును మందకుతూహలరేఖఁజంద్రికా
సదమలచంద్రశాలికలఁ జల్ఫి రనేక[16]వినోదనక్రియల్.

179


సీ.

భ్రమరదంపతుల విభ్రమముల సొంపారు
              మల్లికానవపుష్పమండపములఁ
గలకంఠకాకలీకలకలంబుల మించు
              మేలైన గుజ్జుమామిళ్ళనీడఁ
గలికిజక్కవ[17]పులుంగులకేళికల మీఱు
              జలజాకరోదారసైకతముల
బర్హిణమిథునశుంభన్నాట్యముల నొప్పు
              సురుచిరమణికేళి గిరులచఱులఁ


తే.

గుసుమఫలవీచికారత్నవిసరవిభవ
లీల కలరుచు మదనగోపాలవిభుఁడు
భృంగకోకిల కోకబర్హిణవికస్వ
రస్వరంబులఁ గ్రీడించి రమణిఁ దేల్చె.

180

సీ.

మేలి పువ్వులు గోసి మెలఁతకు నొకచోటఁ
              గుంతలంబులు దీర్చి కొప్పు ముడుచు
ననపరాగము నూర్చి నలినాక్షి కొకచోట
              మెఱుఁగారు పాలిండ్లమీఁద నలఁదుఁ
బొగడపువ్వులదండఁ దగగ్రుచ్చి యొకచోట
              లలితాంగిజఘనమండలి నమర్చు
మకరందములు గ్రోలి యొకచోట నలినీల
              కుంతలవాతెఱఁ గ్రుమ్మరించు


తే.

నొక్కయెడఁ దీఁగెయుయ్యెల నూరుయుగళి
బాల నిడుకొని ప్రియమైనలీల నూఁచు
నొక్కయెడ మృగమదమున నువిదగండ
పాళికల వ్రాయుఁ గొనగోళ్ళఁ బత్త్రలతలు.

181


సీ.

శృంగారవతిలీల శిఖిపింఛమౌఁ దలఁ
              జుట్టి కౌస్తుభము వక్షోజసీమ
నమరించి పీతాంబరము నితంబంబునఁ
              గైసేసి శౌరిశృంగారరేఖఁ
దాఁ దాల్చి కీల్కొప్పు ధవునకు ముడిచి పూ
              గుత్తు లురమ్మునఁ గుచయుగముగ
సమకొల్పి గుబ్బసరములన్ దొడిగి తన
              వలువ పయ్యెద దీర్చి యలరఁగట్టి

తే.

తనదు శృంగార మొసఁగి మోదమున నగుచుఁ
బ్రియుఁడు నే నీవు నాక్రియఁ బ్రియ వటంచుఁ
దక్కు గిలిగించు మ్రొక్కుఁ గందర్పకేళిఁ
బురుషరతి నైపుణము చూపి పరిణమించు.

182


సీ.

కుంజగర్భంబులఁ గూడాడునప్పుడు
              సారంగమిథునంబుసరణి చూపి
క్రీడాచలంబులఁ గ్రీడించునప్పుడు
              విద్యుదంబుదములవిధముచూపి
వీథీతలంబున విహరించునప్పుడు
              మల్లికాతరువులమహిమ చూపి
సైకతస్థలములఁ జరియించునప్పుడు
              కలికి జక్కవదోయిచెలువు చూపి


తే.

స్నేహభంగులు గమనీయదేహరుచులు
పెనఁకువలజోడు వాయక యెనసియుండు
చందములు నందములుగఁ బూర్ణేందుముఖియు
నందసూనుండు నొప్పి రానందలీల.

183


ఉ.

లాలితపాదనూపురఝలంఝలరావము లుల్లసిల్ల లీ
లాలసభంగిఁ గ్రుమ్మరు మురాంతకుసంగడి నాసహస్రగో
పాలతనూజక్రేంకృతులఁ బంచశరుండను వేఁటకానితోఁ
బోలఁగ వేఁటమైఁ దిరుగు పోషితరాజమరాళియో యనన్.

184

చ.

చెలువ వినూత్నపాదసరసీరుహకుంకుమపంకరేఖలన్
జెలువయి కేళి హేమగిరిశృంగతలంబులు చుంబనక్రియన్
జలజదళాక్షు వీడెపురసంబున ముద్రలు చెంది యొప్పు నా
లలన పయోధరంబుల విలాసము చూపె వియచ్చరాళికిన్.

185


చ.

పొలఁతియు శౌరి గల్పతరుపుష్పవిభూషణభూషితాంగులై
మలయుచుఁ బ్రీతిమాధవులమాడ్కి వనావళిఁ గేలి మైరహః
కలనల సంచరించెడు వికాసము మన్మథవిభ్రమైక[18]
ర్యలు గని చొక్కి రాత్మహృదయంబుల ఖేచరకామినీమణుల్.

186


వ.

ఇట్లు బహువిధంబుల నభిరామమూర్తులు నాత్మారాములు
నగు నా రాధామాధవు లభిమతరతిరహఃకేళీవిలాసంబుల
నుల్లసిల్లుచు డెందంబు లానందమయంబులై నిగుడ మగు
డని కాంక్షలఁ ద్రిలోకగణ్యం బగు బృందారణ్యంబున మ
నోహారులై యేకాంతస్థలంబుల ననర్గళోత్సాహవిభవంబున
విహరించి యమునాప్రవాహంబున జలక్రీడలు సల్పువారై
యెయ్యన నొయ్యారంబు నడకల గిల్కు పసిండిగొడుగుల
పావలు ఘళ్ళుఘళ్ళు మన నన్యోన్యదత్తహస్తపంకజు లై
యక్కడక్కడఁ దరుశాఖాశీతలచ్ఛాయల నిలిచి మలయ
మారుతంబుచేతఁ బరిభ్రమశ్రమం బపనయింపుచు ముకుం
దినియుఁ గింకరవల్లవకుమారులు సేవింప నమ్మహానది
సేరంబోయి.

187

సీ.

తమ్మితేనెలు గ్రోలి దట్టమై దివి నాడు
              కొదమతుమ్మెదపిండు కొప్పు గాఁగ
జలచరోల్లంఘనంబుల మించు తళుకులు
              ప్రణయకటాక్షసంపదలు గాఁగఁ
గల్లోలవల్లిపైఁ గనుపట్టుకోకదం
              పతులు వక్షోజకుంభములు గాఁగ
వాయువిధూత నవ్యపరాగపటలంబు
              కట్టిన చిత్రాంశుకంబు గాఁగ


తే.

యమున సాక్షాత్కరించి తమ్మలరి పిలుచు
సాంత్వనము లట్లు హంసనిస్వనము లొలయ
రాధికయు మాధవుండుఁ దీరమున నిలిచి
ప్రస్తుతించిరి దాని సౌభాగ్యమహిమ.

188


వ.

అప్పుడు.

189


క.

గోపీసహస్రములతో
గోపాలవిభుండు రాధఁ గూడి పయఃక్రీ
డాపాటవములు చూపెడు
నేపున వ్రేపల్లెలోని కెఱుకవడంగన్.

190


వ.

సంజ్ఞానిస్వనం బొనర్చువాఁడై తత్తీరంబున నొక్కపారి
జాతము క్రీనీడ నొప్పు చంద్రకాంతమణివేదికామధ్యంబున.

191

సీ.

పసిఁడిపావలమీఁద నొసపరి మువ్వంక
              బాగున దివ్యరూపంబు దనర
తాపలికర్ణకుండల మొకించుక వ్రాలి
              యంసదేశంబున నత్తమిల్లఁ
దిర్యక్కృతంబులై తీఁగవెన్నెలమించు
              తళుకుఁజూపులు కెలంకులు నటింప
లాలితోదంచితభ్రూలతాయుగళి నే
              ర్పడిన వళిత్రయీఫాల మలర


తే.

రాధికాభుజనిహితదోర్దండుఁడై స
మంచితాంగుళిపల్లవన్యాసములను
రంధ్రముఖముల సప్తస్వరములు గూర్చి
మురళి వాయించె నాజగన్మోహనుండు.

192


చ.

హరిమురళీనినాదమున నంబరవీథి విమానపఙ్క్తులం
దిరిగెడు దివ్యకాంతలు మదిం బ్రసవాస్త్రవికార మొంది యం
బరములు కట్టుజాఱఁ గచభారభరంబులు వీడి పుష్పముల్
దొరఁగఁగ నిల్చి చూచిరి విలోలకటాక్షములం బ్రసక్తతన్.

193


చ.

అమృతరసోపమానజలజాక్షమనోహరవేణుగాననా
దమునఁ బ్రమత్తబర్హణకదంబము నాట్యము సల్పెఁ దన్మనో
రమవనవీథిఁ బింఛనికరంబు లుదంచితలీలఁ గ్రాలఁగా
సుమధుర[19]షడ్జమన్ స్వరము చూపుచుఁ దన్నయనాభిరామమై.

194

చ.

కలమురళీసముల్లసితగానకళన్ వికసించి కల్పకం
బులు హరిఁ బుష్పమంజరులఁ బూజలు చేసె మృగీమృగావళుల్
సులలితధీరనేత్రముల సొంపులఁ దేల్చెఁ గరంగి నిర్ఝరం
బులగతిఁ బాఱెఁ దన్నికటభూమి మహీధరరత్నజాలముల్.

195


క.

చిత్తములు వొదల గోపా
లోత్తము వేణుస్వరముల నుప్పొంగి రయ
ప్రోత్తలితకర్ణములతో
నత్తఱి సురధేనుబృంద మరుదెంచెఁ దగన్.

196


ఉ.

ఆనలినాయతాక్షుమధురాధరవేణురవామృతంబుతో
వీనులు నిండి వేడుకలు వెల్లిగొనన్ స్మరమోహపాశసం
తాననిబద్ధబుద్ధిఁ బ్రమదంబున ఘోషము వాసి వల్లవ
స్త్రీనికరంబు వచ్చె వనసీమ కనేకసహస్రసంఖ్యమై.

197


వ.

ఇవ్విధంబున లావణ్యయౌవనమదవిలాసితలును సంపూర్ణ
పూర్ణిమాచంద్రబింబవిడంబిముఖపంకజలును ఘనజఘనభా
రచారుసంచారిణులును నురుపయోధరభరాందోళాయమా
నతనుమధ్యలతికలును మత్తమయూరబర్హిసుషమాకూ
లంకషచికురబంధలును విలోలాక్షులు నగు రాజకుమారిక
లును మదనగోపాలలీలావాగురికలం దగిలి యులంబులు పల్ల
వాయుధవికారసమాకులంబులై నిగుడ గములుగములై బృం
దావనవీథుల వనదేవతలకు మెఱుంగుఁజూపులను నీరాజనం
బులు సేయుచుఁ జరణతులాకోటిమణినిక్వణమధుపూరంబుల

శ్రవణపుటకటాహంబులు పూరించుచు మోహినీదేవతలమా
డ్కిఁ గన్నులపండువై కుసుమకోదండుండు విడంబించి చ
క్రిపై నొక్కి తెగఁ దొడిగియేసిన వచ్చు నమోఘసమ్మోహన
బాణసహస్రంబు లనుబాగున నరుగుదెంచి గోపాలమన్మథు
నిఁ బరివేష్టించి రప్పుడు జగన్మోహనుఁ డందఱహృదయం
బులయందు ముందరియట్ల యొక్కచందంబునఁ బ్రణయకా
రకస్నేహంబులు తొంగలింపంజేసి వారును దానును న
య్యేటిలోనికి డిగ్గి యొక్కపులినదేశంబున.

198


గీ.

హారకేయూరమకుటమంజీరముఖ్య
భర్మమణిభూషణంబులు పై పసిండి
దుప్పటియు నూడ్చి ధమ్మిల్ల మొప్పముడిచి
పద్మలోచనుఁ డాయత్తపడియె నపుడు.

199


ఆ.

రాధతోడ గోపకరమణులు జలకేళి
సమయభూషణముల నమరి వచ్చి
[20]యొడలికంటు వలిపయొల్లిపయ్యెదలలో
జన్నుఁగవలరుచులు చౌకళింప.

200


క.

వేడుక నంజనగిరి గో
రాడి చతుర్దంతి నీరికై కరిణులతోఁ
గూడి సురతటిని జేరిన
జాడఁ జతుర్బుజుఁడు నదికిఁ జనె సకియలతోన్.

201

గీ.

పసిఁడిముద్రలకొమ్ములు పద్మనాళ
యంత్రనాళంబులును గూర్చి యతిముదమున
సారగోరోచనాగంధసారఘుసృణ
హేమమయపాత్రికలతోడ నిందుముఖులు.

202


క.

కొందఱు రాధికవల నొక
కొందఱు మాధవుని వంకఁ గూడిరి వారున్
జింది వసంతము లాడిరి
చందనగంధులు సుగంధిజలపూరములన్.

203


గీ.

తమ్మి పుప్పొడి యొకతటిత్తరళనేత్ర
జలజదళలోచనునిమీఁదఁ జల్లె నగుచు
నెంత గయ్యాళి చూడవే యిది యటంచుఁ
దోడి వ్రీడావతులు చూచి తొంగలింప.

204


క.

శౌరి ప్రజస్త్రీకరకా
శ్మీరద్రవగంధసారమేళనరుచిరా
కారుఁ డయి మూఁడుమూర్తుల
సారము దా ననుచుఁ దెలుపు సంగతి నొప్పెన్.

205


మ.

చివురుం జిమ్మనఁగ్రోవి ముంచుకొని కాశ్మీరాంబుపూరంబు మా
ధవుపై రాధిక డాసి చిమ్మ నలరెన్ దద్ధార కందర్పరా
ణ్నవమత్తద్విరదేంద్రుశిక్షకొఱకై నాటించు రాకోలకున్
సవ[21]తై యస్రచలత్కణావళుల రుచ్యస్ఫూర్తి శోభిల్లఁగన్.

206

చ.

చలమున రాధయున్ హరియుఁ జందనవారి వసంతమాడ న
వ్వల నొకబోటి కేళ్లుఱికి వచ్చె హిమాంబువు చల్లిపోవ లీ
లలరఁగ నిల్చె దాని వనరాంధ్రము పట్టున నీతి దూఱి నె
చ్చెలులు హసింపఁగా నది వసించె వడిం బఱతెంచి లోపలన్.

207


ఉ.

తక్కరిలాగునన్ విభుఁడు దాకొని కస్తురి మెత్తు నేర్పుతో
నొక్కటఁ జన్నుఁగ్రేవ నఖ మొత్తినఁ దక్కక యాలతాంగియున్
జిక్కఁగఁ దమ్ములంబుఁ గొనుచాతురిఁ దన్మధురాధరంబునన్
గ్రక్కునఁ బల్లు మోపెఁ జెలికత్తె బళీ యని తన్ను మెచ్చఁగాన్.

208


గీ.

చారుకుంకుమధూళిధూసరితగాత్ర
వల్లులె యుల్లసిల్లిరి గొల్లసతులు
కమలరజమున దోఁగి సైకతతలమున
నెలమిఁ గ్రీడించు పసిఁడియంచలవిధమున.

209


గీ.

ఓలగందంపుఁబసుపుల నూని వెలుఁగు
గోపికల దేహదీప్తులు గొనలు సాగెఁ
జారు ధమ్మిల్లపుష్పవాసనలఁ బొలయు
మిండతుమ్మెదమొయిలుకు మెఱపు లగుచు.

210


క.

సింధురవరదునిపైఁ బు
ష్పంధయకుంతలలు చల్లు ప్రాలేయపయో
గంధభరంబులఁ బవనము
గంధవహత్వంబు సార్థకంబుగఁ బడసెన్.

211

సీ.

ఘనసారకర్దమంబునఁ దోఁగు నవ్వేళ
              నిలఁ జరించెడు చంద్రకళ లనంగఁ
గాశ్మీరచూర్ణపంకమునఁ దోఁగినవేళఁ
              జిత్తజుక్రోధాగ్నిశిఖ లనంగఁ
గమనీయమృగమదౌఘమునఁ దోఁగినవేళ
              నీలాంగతనురుచిశ్రీ లనంగ
సారగోరోచనావారిఁ దోఁగినవేళ
              దీపితహేమపుత్రిక లనంగ


తే.

సకలసద్గంధవస్తువాసనలఁ దోఁగి
నపుడు చిత్రాకృతులు నాఁగ నతిమనోహ
రాంగు లై రాధికాదిగోపాంగనలు సు
రాంగనలచూడ్కి కింపు లొసంగి రపుడు.

212


ఉ.

చక్కనిరాధ బిత్తరికుంచంబుపయిం దనగోరు నొక్క లోఁ
జిక్కిన కుంకుమద్యుతులచేఁ జెలువారుచుఁ బశ్చిమాద్రి బెం
పెక్కిన సాంధ్యరాగలలతేందుకళాకృతి శౌరిచూడ్కికి
న్మక్కు_వఁ గొల్పెఁ గట్టెదుర మారుతధూతపటాంచలంబునన్.

213


క.

బింకము లాడుచుఁ బాడుచు
జంకింపుచు నీరు మీఁదఁ జల్లుచుఁ గడఁకన్
బంకజముఖు లెలయించిరి
పంకజనయనుని వసంతపాటవలీలన్.

214

చ.

పలుమఱుఁ బొంచి పొంచి తనుఁ బాయక కుంకుమునీరు చల్లఁగా
నలికులవేణి నొక్కరితె నంటగఁ బట్టి విభుండు నీటిలోఁ
బెలుచన ముంతునంచు వెఱపించుచుఁ గౌఁగిటఁ జేర్చి దానిగు
బ్బలఁ బరిరంభకేళి [22]నొగిఁ బట్టుచుఁ జే వదలం దలంకెడున్.

215


గీ.

రాధయును మాధవుఁడు మత్సరమునఁ గదిసి
యంగములయందుఁ గుంకుము లలఁది యలఁది
దర్పకస్థానమునఁ జేయి దాఁక నులికి
నవ్వి రిద్దఱు నాలింగనం బొనర్చి.

216


సీ.

పవమానవశమునఁ బసిఁడిచీరచెఱంగు
              లెడలఁ గ్రొమ్మించుల యొడలు చూచి
బలిమిఁ గర్పూరాదు లలఁదెడు నెయ్యంపుఁ
              గైలాటములఁ జన్నుగవలు దొడికి
సంభ్రమోల్లంఘనసరణి ఝల్లున విచ్చు
              ధమ్మిల్లమునఁ బువ్వుఁదావి గ్రోలి
యెడనెడఁ దమ్ముల కే మిచ్చుచో నిచ్చలు
              తియ్యఁగెమ్మోవులఁ దేనె లాని


తే.

యొకరికొక్కరి యంసంబు నోలిఁజేరి
పలుగు జంకెనమాటలకొలఁది వినుచు
శ్రీవిభుఁడు గోపకన్యలకతో వసంత
కేళిఁ బంచేంద్రియోత్సవశ్రీలఁ దేలె.

217

క.

పన్నీటఁ దోఁగి వలువలు
కన్నెల మై నంటి లేని కైవడిఁ దోఁపన్
నున్న దొడలు జఘనంబులుఁ
జన్నులు బంగారుతళుకుఁ జల్లెన్ దిశలన్.

218


సీ.

ప్రోవులు గొన్న కర్పూరధూళీపాళి
              కుప్పలై రాలిన కుంకుమంబు
మేటులై యొదవిన మృగమదనాభులు
              జిట్టలై తొట్టిన తట్టుపునుఁగు
కొండలై నిలిచిన గోరోచనాపంక
              మేఱులై ప్రవహించు హిమజలమ్ము
గుంపులై పొదిగొన్న కుసుమగంధంబులు
              రాసులై పడియున్న ప్రసవరజము


తే.

గలిగి యమునాతరంగిణీపులినతలము
త్రిజగదభిరామమై యొప్పె దేవదేవుఁ
డచ్యుతుఁడు గోపకన్యాసహస్రసహితుఁ
డై వసంతోత్సవము సల్పు నవసరమున.

219


క.

[23]హరికరపుటమున వల్లవ
తరుణీకుచకుంభమధ్యతలములవలనన్
దొరఁగిన కుంకుమరేణువు
తరుణీసమ్మోహనౌషధము ధరియించెన్.

220

వ.

ఇవ్విధంబున లోచనోత్సవంబై మదనాధ్వరావభృథస్నాన
సంరంభంబున విజృంభించి మాఱులేక, విరహిసమాలోకభీక
రంబులై ప్రజ్వరిల్లుచుఁ బరిభ్రమించు నించువిలుకాని యా
గ్నేయాస్త్రపరంపర లను సొంపునఁ బెంపారుచుఁ బ్రత్యగ్ర
సమగ్రఘుసృణరసవిసృమరశరీరలైన బింబాధరలును, విట
మనఃపుటకుటిక్రోడంబు లను బంధురాంధకారమగ్నంబులు
గావింపంబడిన సిరిపట్టి దట్టని మాయాతమోవికారధూమ
రేఖ లనుచొప్పున నొప్పుచు నస్తోకకస్తూరిపంకంబులమూ
ర్తులై యాకర్షించు చంచరీకవేణులును బాంథసంతాన
ధుర్యధైర్యాంతరిక్షంబులు పెంపుసొంపున ముంపుదుర్వా
రసమాకీర్ణసుధాసముద్రకల్లోలవల్లికలను పెల్లున నుల్లసిల్లు
చు ఘనసారకర్పూరవారిధారాభిషేకనిషిక్తగాత్రలై, మై
త్త్రిం జెందునిందుముఖులును, విస్రస్తకబరీభారపరిగళద
విరళకుసుమవిసరంబులవలనను సమున్నతఘనస్తనసబక
వికీర్ణపుష్పపరాగంబులవలనను గర్ణావతంసకహ్లారమధుర
మధూళీసంభ్రమద్భ్రమరచారుఝంకారంబులవలనను బల్ల
వాయుధుని మోహవల్లికలపెల్లున నల్లిబిల్లిగొనుచు విరసం
పుమాటలలోనికీలును గసరుఁ జూపులలోని బిత్తరంబు
లును నొయ్యారంపునడకలలోని గరువంబులును మెలపు
లలోని మెలపులును జిఱునగవులలోని కలికితనంబును
బలుకులలోని పలుకును దొడువులలోని నిలుకడలును

జిక్కుపాటులలోని చనవులును రారాపులలోని నిరాకర
ణంబులును దమకఁపుడగ్గఱింతలలోని కౌఁగిలిమేలును రహ
స్యవర్ణంబులలోని చిక్కులును జరణకరపీడనాదులలోని
సరసత్వంబురు బరిచ్ఛటకరాకర్షంబులలోని యనుసరణం
బులును బరస్పరసంజ్ఞాభంగులలోని సమ్మతంబును గలిగి
వినయగౌరవస్నేహంబులు చెలువార సంభ్రమోల్లంఘన
ధావనంబుల మనంబు రంజిల్లఁ బయ్యెదలు జాఱియుఁ బోఁక
ముళ్లు వీడియు వసంతగంధతోయంబులఁ దడిసియు జిలుఁ
గుదువ్వలువలు సడలిన నిగనిగలు నిగుడు మృదూరుకాం
డజఘననాభిమూలపయోధరకక్షప్రదేశంబుల మెఱుంగుఁ
దీఁగె లందఱకనుదోయి నుయ్యాల లూఁగుచు నేపుమాపుఁ
బూవుంబ్రాయఁపుగొల్లగుబ్బెతల కందఱ కన్నిరూపంబు
లై విహరించి యనంతరంబ ప్రాణవల్లభాతిలకంబగు రాధి
కకుఁ గైదండ యిచ్చి మెలుపున మరకతమణిసోపానమా
ర్గంబుల డిగ్గి యగ్గోపాలమన్మథుండు నదీప్రవాహంబుఁ బ్ర
వేశించిన.

221


క.

జలజాక్షుల తెలిగన్నుల
తళుకులుఁ దనురుచులుఁ బులినతలముల నిగుడన్
గలహంసకలితయమునో
ర్ముల [24]సవిబయ లీఁది యొకతె [25]మునుకలు సలిపెన్.

222

గీ.

మౌగ్ధ్యమున నేటిలోఁ జొర మదిఁ గలంగి
తనువు గరుపాఱ నొకతె మాధవుని గాంచి
యెంత బంటని యడిగిన నింత బంటి
యనుచు నాజాడ చనుగుబ్బ లంటి చెప్పె.

223


క.

నవచంద్రకాంతసోపా
నవితానము మెట్టి ప్రౌఢనలినాక్షులు నా
ట్యవిధిజ్ఞ లరిగి రొక్కట
జవమున యమునాతరంగసంఘములందున్.

224


క.

పొలఁతులు యమునానదిలో
పల నుఱుకుట యొప్పెఁ బుష్పబాణుఁడు హరితూ
పులఁ జిక్క నదీదేవతఁ
బెలుచన నాటించు నంపపిండును బోలెన్.

225


సీ.

తమకేళి నవమరాళము లంచు నంచలు
              రాకలు గని యనురాగ మొందెఁ
దమతోడి చక్రవాకము లంచుఁ గోకముల్
              చన్నుగుబ్బలు గని సంతసించెఁ
దమజోక చంచరీకము లంచుఁ దుమ్మెదల్
              భ్రమరకంబులు గని పరిణమించెఁ
దమలోని జలచరతతు లంచు మీనముల్
              దృక్పరంపరఁ గని తివుటఁ బొదలెఁ

తే.

గాని బెదరవ యింపైన మానసముల
గొల్లగుబ్బెత లుల్లంబు లుల్లసిల్ల
నాత్మవల్లభుఁ గూడి యయ్యమునఁ జొచ్చి
కలికి తరఁగలఁ బడి యీఁదుక్రందు దగిలి.

226


క.

ఆ లోలాక్షులచలదృ
గ్జాలములకు స్రుక్కుఁ జక్రచయ మిందురుచి
శ్రీలని యిందీవరదళ
మాలిక లని సుడియు మత్తమధుకరరాజుల్.

227


క.

తరుణీకంకణనినద
స్ఫురణలు గాదంబచక్రములరవము మదో
ద్ధురమధుకరోత్కరశ్రుతి
విరావములు యమునలోన వీనులు దనిపెన్.

228


సీ.

కలువఱేకులు గావు కలికిబేడిస లివి
              కావు చంచలకటాక్షములు కాని
క్రొన్నురువులు గావు కుముదషండము లివి
              కావు క్రొమ్మించునఁగవులు గాని
వీచికల్ గా వరవిందనాళము లివి
              కావు దోర్వల్లీయుగములు గాని
చక్రముల్ గావు కంజాతకోశము లివి
              కావు బిత్తరిచన్నుఁగవలు గాని

తే.

యనఁగఁ గల్హారమైన కటాక్షఫేన
కుముదదరహాసవీచికాకమలనాళ
హస్తకోకాంబురుహముకుళస్తనములు
పడఁతుకలు నీళులాడ వీడ్వడఁ దొడంగె.

229


క.

వనజాక్షు లోలలాడఁగఁ
జనుగుబ్బలు వచ్చి తాఁకి జర్జరితములై
చనువీచులు కొండలు దాఁ
కిన యటుల బిందుతతులు కెలఁకులఁ జిందన్.

230


చ.

మలయుచు వల్లవాంగనలు మధ్యమదఘ్ననదీజలంబులో
పలనితరేతరాకలితబాహులఁ బాయగ నాచరింపఁ ద
ద్విలసదురోజకంఠముఖవిభ్రమ మోలిఁ దనర్చె వీచికాం
తలలితచక్రచంచుసముదంచితనాళయుతాబ్జసంగతిన్.

231


చ.

జలరుహకోరకంబులని సంతస మార నొకర్తు చూచుకం
బుల నెలదేఁటు లున్న నొకముద్దియ యబ్బుర మంది చూచి యా
నలినదళాక్షుతోడ నలనాఁతికిఁ జూలు ఘటిల్లెఁ జూడు నీ
కలికివిరాళిసేఁత ననఁగా విని నవ్విరి ప్రౌఢకామినుల్.

232


వ.

అప్పుడు.

233


గీ.

పసిఁడియనఁటులు నవహేమపద్మనాళ
జాలములఁ బువ్వుఁదెప్పలు సంఘటించి
జలజకర్పూరఖండపుష్పప్రవాళ
ఫలము లొడఁగూర్చి యెక్కె నప్పతియుఁ దాను.

234

క.

కాంతలు వెల్వడఁ దరఁగల
బంతులు తద్గురుకుచములపైఁ బడి చెదరెన్
బంతమున సమతకధికుల
నంతర మెఱుఁగక యెదుర్చు నల్పులువోలెన్.

235


ఉ.

ముప్పిరిగొన్నవేడుకల మూఁకలు గట్టి మరాళచక్రముల్
తెప్పలఁ గట్టినట్టి నవదీర్ఘమృణాళులు వట్టి యెల్లెడన్
దెప్పల నుల్లసిల్లి సిరి దీకొని పువ్వులఁ బువ్వుఁదేనెలన్
బుప్పొడిఁ బల్లవంబులను భూపతి ముంచిరి మిండగోపికల్.

236


చ.

జలరుహనేత్రలున్ హరియుఁ జల్లఁగఁ బెల్లుగఁ దూలు [26]సాంద్రనీ
రలసితమైన పంకజపరాగముఁ దద్రమణీయసౌరభో
చ్చలదళినీరజాలముఁ బొసంగె హితంబునఁ బొత్తు గూడి యి.
చ్చలనలచంద్రికాంధతమసంబులు వర్తిలుచున్నవో యనన్.

237


సీ.

ప్రియ యిడ్డ కలువపూఁతబేరుల నెలదేఁటి
              దండులఁ దాపింఛతరువువోలె
దయిత గుప్పిన పైఁడితమ్మిపుప్పొడి నరు
              ణారుణాంశువుల నీలాద్రివోలె
రామ ద్రోచిన మకరందపూరంబుల
              దానధారల మత్తదంతివోలెఁ
బ్రమద వైచిన నవకుముదజాలమున న
              క్షత్రజాలమున నాకసమువోలెఁ

ఆ.

గొమరు మిగులు మదనగోపాలకృష్ణుఁ డా
రమణిఁ గౌఁగిలింప? రాధ యొప్పె
సజలజలధరప్రసక్తమై మహనీయ
దీప్తి వెలుఁగు మెఱుఁగుఁదీఁగవోలె.

238


సీ.

వడి నొండొరులఁద్రోవ సుడిగుండములఁ బడ
              లీలమైఁ ద్రిప్పి పులినము చేర్చు
[27]నీఁదీఁది యలసి కా లూఁదిన నడిలోఁతు
              పట్టుననైనను మెట్టఁ జూపు
గుఱు తెఱుంగక మడుఁగున లోఁతుపట్లకుఁ
              జొరఁబోవఁ దరఁగలఁ దిరుగఁద్రోచు
వడిపెట్టునం దెప్ప వెడలిపోవచ్చిన
              వక్రభంగులఁ దొంటివలన నిలుపు


తే.

నందసూనుండు గోపికాబృందములును
సరసగతులను జలకేళి సలుపునపుడు
తత్కృపాశ్రీలు పడయఁ దద్భావలీల
కనుగుణంబుగ యమున నెయ్యంబు చూపె.

239


సీ.

నాభితలమునఁ జనవఁ జేతు లిడి యెత్తి
              యీఁత నేరనినాఁతి కీఁతగఱపుఁ
దగుపాటి నీఁదుసుందరి యీఁది యలయువే
              ళను దెప్పకుం జేర్ప లంచ మడుగుఁ

దనతోడ గూడి పంతమున నెక్కటియీఁదు
              గరువంపుసతి మెచ్చి కౌఁగిలించుఁ
గడుగోలయైన యంగన నురస్స్థలి నుంచి
              వెన్నునఁ దగనీఁది వేడ్క సలుపుఁ


తే.

దానె యొక్కఁడు నీఁది యద్దరిఁ జరించి
కమిచి యచ్చటఁ జక్రవాకములఁ దెచ్చి
తమకుఁ దమకని వచ్చి హస్తములు సాఁచి
నందఱకుఁ నన్ని పంచిచ్చు నచ్యుతుండు.

240


క.

తమపోషితరాజమరా
ళముల నదీహంసికలఁ గలపి యవి మదనో
ద్యమమతిఁ గవగూడఁగ నా
ప్రమదలు నవ్వుదురు గోపకపతి వీక్షింపన్.

241


క.

ఇందుద్రవకుంకుమరస
చందనమృగనాభిపంకసంకలనలఁ గా
ళిందీసలిలోర్మిఘటా
బృందంబులు వేడ్కఁ దేల్చె బృందారకులన్.

242


క.

కమలాక్షునిదేహస్ప
ర్శమునుం గోవాంగనాంగచందనశశికుం
కుమసౌరభ్యముఁ గలిగెను
యమున సుకృతభాగ్యమహిమ లలవియె పొగడన్.

243

క.

వనమాణిక్యము బృందా
వనము; నదీజనని యమున; వనరుహనయనా
జనతిలకము రాధిక; య
వ్వనజాక్షుఁడు దేవదేవవల్లభుఁ డౌరా!

243


వ.

ఇవ్విధంబున బహువిధప్రియవిహరణంబుల రాధయుఁ దాను
మాధవుండును వల్లవవధూజనసహస్రంబులతోడఁ గూడి
జలక్రీడ లవధరించి తీరభూమికి విజయం చేసినప్పుడు.

244


క.

తడిపసుపుటొల్లె లంటినఁ
దొడలు నితంబములుఁ జన్నుదోయియుఁ గడు నే
ర్పడ నోసరిలుచు నగుచుం
బడఁతులు నది వెడలి రాత్మపతి దముఁ జూడన్.

245


క.

ఆతడివన్నెలసికలును
వాతెఱతెలుపులును బసుపువన్నెయొడళ్లున్
బ్రీతి యొనర్చె మురారికి
నాతరుణులు తీరభూమి కరుదేరంగన్.

246


క.

మును కైసేసినయవి గా
వని వేఁడినఁ గల్పతరువు లాయాభీరాం
గనల కొసఁగెఁ బుష్పాంబర
ఘనకనకవిభూషణములు కల్పితములుగన్.

247

గీ.

కోమలశ్యామలాంగకధామ మడర
రామయొక్కతె పీతాంబరంబుఁ గట్టి
యల్లనాఁ డమరవరుల కమృత మొసఁగి
నట్టిహరి మోహనస్త్రీత్వ మభినయించె.

248


గీ.

చంద్రముఖి యోర్తు సంపూర్ణచంద్రచంద్రి
కానిభం బైన వెలిపట్టుఁ గట్టి నిలిచె
దీప్తిపుంజంబు దిక్కులఁ దేజరిల్ల
దర్పకునికీర్తి శుచిమూర్తి దాల్చినట్లు.

249


గీ.

మేలుముత్యాలనిద్దంపుఁజేలఁ గట్టి
చూడనొప్పారె నెలదీఁగెఁబోఁడియొకతె
విమలకలికావళీకీర్ణవిశదరేఖ
నుల్లసిల్లెడు మల్లికావల్లివోలె.

250


క.

నారీమణి యొక్కతె సం
ధ్యారాగము పట్టుఁ గట్టి తనరె మనోభూ
వీరశ్రీ నిలిచిన దిదె
శౌరి వరించుటకు ననెడు చందము దోఁపన్.

251


వ.

మఱియుం దక్కినవారు పెక్కువన్నెలమనోహరాంశుకం
బులు ధరించి పుండరీకదళవిలాసంబును నపహసించు వెడంద
నిడువాలుఁగన్నుల నల్లగలువఱేకులు మురిపెంబు చూపి
నం గాని ముఖచంద్రచంద్రికలకు సౌహార్దంబు లేదనియుం
బోలె వాలికగాటుకరేఖలు దీర్చి,

252

క.

సరసపుఁగొనగోళుల వే
కురులు వడిం దీర్చి సురభికుసుమంబులు ని
బ్బరముగ నిడి ముడిచిరి మధు
కరవేణులు వింతవింతగతులన్ గొప్పుల్.

253


గీ.

రామయొక్కతె కాశ్మీరరజ మలంది
పసుపుఁజాయల నునుమేనఁ బొసఁగెఁ జూడ
బాగుగా జాజు చేసినఁ బ్రజ్వరిల్లు
కనకనిర్మితపాంచాలికయును బోలె.

254


గీ.

కప్పురపుగందవొడి యొక్కకాంత నుదుటఁ
బొందుగా వ్రేల నొసపరి బొట్టు పెట్టి
కంఠకక్షకుచాగ్రభాగములఁ జల్లెఁ
గమ్మగాడ్పులు ప్రియుమీఁదఁ గ్రమ్ముకొనఁగ.

255


గీ.

కప్పురపుధూళి పన్నీటఁ గరఁగి యొక్క
ముదిత నెలవంక తిరునాము నుదుటఁ దీర్చి
నందసుతునకు లోచనానంద మొసఁగె
నసమబాణుని యర్ధచంద్రాస్త్ర మట్లు.

256


గీ.

సలిలకేళీవినిర్మలచాపమూర్తు
లై విభూషణపుష్పగంధాదు లంది
పొలఁతుకలు చూడ నొప్పిరి పుష్పశరుఁడు
పూజ చేసిన దివ్యాస్త్రములును బోలె.

257

వ.

ఇట్లు మనోజ్ఞమండనమండలాభిరామవేషంబుల రాధాది
ఘోషయోషాలలామంబులు కర్పూరవీటికామధురరసరంజి
తంబులై కోమలారుణబీజసుందరంబులగు పరిపక్వదాడిమ
ఫలభిన్నదళప్రదేశంబులుం బోలెఁ బాటలప్రభాపటలకాంత
దంతంబులం గలిగి పరిమిళితంబు లగుచు వాతెఱలు సొం
పారఁ బ్రాణవల్లభు డగ్గఱి యయ్యైవిధంబుల సేవలు గైకొని
రటమున్న యవ్విభుండును,

258


గీ.

పసిఁడిదుప్పటి రింగులు వాఱఁ గట్టి
మృగమదంబునఁ దిరునాము దగ నొనర్చి
దివ్యగంధ మలఁది యభినవ్యపుష్ప
మాలికలు దాల్చె మదనగోపాలుఁ డపుడు.

259


గీ.

నీలవర్ణునితనురుచిశ్రీలలోన
లలితనాసాగ్రముక్తాఫలంబు వెలిఁగెఁ
జారుశృంగారరసమున సంభవించు
హాస్యరసమును బోలె నం దంద మొది.

260


క.

శ్యామలకోమలపల్లవ
ధామశ్రీతులసిమాల్యధరుఁడై రాధా
కాముఁడు దనఁ బయోధా
రామండలనీలజలధరంబును బోలెన్.

261

గీ.

గోపకాంతల నవనీలకుంతలములు
దువ్వి కూర్చిన యట్టి తద్రుచులువోలె
నలరిఁ జెంగల్వరేకుల నలరు శౌరి
మే[28]ను సుమగర్భమున నిడ్డమృగమదంబు.

262


వ.

ఇట్లు సముచితాలంకారభాసితుండై,

263


సీ.

యమునాతటంబున నమరభూజమునీడ
              మహనీయకర్పూరమండపమునఁ
బుష్పసింహాసనంబున రాధవామాంక
              పాళిక లీలాంకపాళిఁ దనర
ధవళముక్తాతపత్రద్యుతుల్ నిగుడఁ జా
              మరములనునుగాలిఁ గురులు దూల
నాభీరకన్యాసహస్రదృశ్చంద్రిక
              లర్చనాపుప్పోపహారములుగ


తే.

హారకేయూరమకుటమంజీరమకర
కుండలశ్రీలు దిక్కుల మెండుకొనఁగఁ
గొలువు గూర్చుండె గోగోపకులము గొలువ
సమధికస్ఫూర్తి గోపాలచక్రవర్తి.

264

సీ.

ఆకిరీటప్రభ లాపింఛరింఛోళి
              యాశ్రవణావతంసాబ్జయుగళి
యాకుంతలశ్రేణి యాతిరునాముసొం
              పావర్ణితభ్రూలతావిలాస
మాసుందరఘ్రాణ మాకృపావీక్షణం
              [29]బాదరహాస మాయధరబింబ
మాకోమలశ్మశ్రు లాకపోలద్వయ
              మాకంఠ మాబాహు లానఖాళి


తే.

యాయురస్స్థలకౌస్తుభ మాకటీర
భర్మశృంఖల మాపచ్చపట్టుదుప్ప
టాశుభాంఘ్రులరత్నంబు లందెదోయి
మన్మనశ్శ్రీకి నభిరామమండనంబు.

265


సీ.

బహురూపధరమనోభవధనుర్లతికావి
              నిర్ముక్తనారాచకనికరమట్లు
పవమానవశపరిప్లవబాలమలికా
              గళదచ్ఛసూననికాయమట్లు
కలశపాథోధిరంగద్వీచికోద్వాంత
              లలితముక్తాఫలకులములట్లు
కనకారవిందరేఖాసముదంచన్మ
              దస్ఫారభృం బృందములయట్లు

ఆ.

కారుమెఱుఁగు లట్లు కలువఱేకుల యట్టు
లుల్లసిల్లి వలపు వెల్లివిరిసి
కడఁగి ముంచె రాధికామాధవులగోప
బాలికాకటాక్షజాలకములు.

266


గీ.

ఊరులతికలఁ గదిసి కూర్చుండి రాధ
మేలమునఁ జన్నుమొనఁ బ్రియుమేను వొడిచి
తరళకందర్పగర్భనేత్రములఁ జూపెఁ
బ్రథమరతికేళిసంకేతభవనసీమ.

267


సీ.

బ్రహ్మాదిసురమునిప్రకారంబులకుఁ బర
              బ్రహ్మస్వరూపమన్ భావశుద్ధి
యాకూఢయోగక్రియాశుద్దిబుద్ధుల
              కానందరసపూర మనెడుతెలివి
సహచరగోపాలజనులకు నిజసుహృ
              ద్వరుఁడను వత్సలత్వంబుకలిమి
రాధికాప్రముఖనీరజలోచనలకును
              బ్రాణవల్లభుఁ డనుప్రణయభంగి


తే.

గలుఁగఁజేయుచుఁ గారుణ్యకలితలీల
దృష్టి భక్తుల కమృతంపువృష్టి గురియ

నలరు శృగారి నట్టిమోహనమురారిఁ
దగిలి వర్తించు ధన్యుల తలఁపు తలఁపు.

268


శా.

ఆరాధాముఖగోపకామినులతో నబ్జాయతాక్షుండు బృం
దారణ్యంబున నవ్విధంబున సముద్యల్లీలలన్ మన్మథో
దారప్రక్రియఁ గ్రీడసల్పుట మదిం దర్కించుటల్ బ్రహ్మవి
ద్యారంభం బొనరించుటల్ సకలవిద్యాకోవిదశ్రేణికిన్.

269


వ.

ఇవ్విధంబున సంతతంబును నానంతతేజోవిలాసంబున రాధావి
లాసినియుం దానును మాధవుండు మదనసహస్రశృంగార
రేఖ యంగీకరించి సకలలోకహృదయనయనాహ్లాదకరచ
రణకరలాఘవంబు లగు ద్వాత్రింశన్మదనగోపాలలీలా
రూపంబులఁ గ్రీడింపుచుఁ ద్రిభువనపాలనపరాయణుండై
నిజభక్తజనమనోరథపరంపరలఁ గరుణింపుచు నిజనిశ్చల
ధ్యానయోగారూఢులయందు దర్పణమండలంబులఁ బ్రతి
ఫలించు నమృతకరుండునుంబోలె శుభకరమూర్తిం బ్రవ
ర్తింపుచు నాత్మారామాభిమతక్రీడల విహరించె.

270


సీ.

వేదాంతచింతాతపోదాననియతులఁ
              బడయరానిపదంబుఁ బడయఁజేయు
గంగాదిపుణ్యాతరంగిణీతీర్థాళిఁ
              బోనిపాపంబులఁ బోవఁద్రోచు

నీశ్వరబ్రహ్మసురేంద్రాదిదేవత
              లీలేనిసంపద లెల్ల నిచ్చు
ననుపమదివ్యమహామంత్రజపములఁ
              బొందనివిద్యలు పొందఁజేయు


తే.

నిరవలోకనతత్పరనిష్ఠులకును
జూపరానట్టి నిజమూర్తి చూపు నెపుడు
రాధికామాధవప్రబంధాధినాథ
కృష్ణలీలావిహారసంకీర్తనంబు.

271


క.

అని శుకమునిమాళి వచిం
చిన శ్రీకృష్ణునకుఁ జెప్పెఁ జింతలపూ డె
ల్లన రాధామాధవమి
ట్లనుపమమధురముగ నాశశాంకార్కముగన్.

272


శా.

దీవ్యచ్ఛంఖసుదర్శనాంబుజగదాదీప్తప్రభామండలీ
భవ్యోదండభుజాచతుష్టయ రమాపద్మాయతాక్షీమనో
జ్ఞవ్యాపారవిరాజమానఘనవక్షఃపీఠ వేణుస్వన
న్నన్యశ్రావ్యనినాదమాధురికథానందజ్జగన్మానసా.

273


క.

లాలితరాధాఘనకుచ
పాళీకస్తూరిపంకపంకిలవిలస
త్కాళిందీతటినీక
ల్లోలాంబువిహారసౌఖ్యలోలమనస్కా.

274

మాలిని.

కనకపటకటీరా! కంధరశ్రీశరీరా!
మునిహృదయవిహారా! మోహనిర్మగ్నదూరా!
సనయగుణవిచారా! సర్వవేదాంతసారా!
మనసిజజయధారా! మానినీచిత్తచోరా!

275

గద్య. ఇది శ్రీమన్మదనగోపాలచరణకమలసేవాధురీణ సత్కళా
పారీణ కృష్ణభట్టారకపౌత్ర చింతలపూడి కామయప్రభు
సుపుత్ర సుకవివర్య రాధామాధవయెల్లనార్య
ప్రణీతంబైన రాధామాధవం బను
శృంగారప్రబంధంబునందుఁ
బంచమాశ్వాసము.
సంపూర్ణము.


ఉ.

సంతతభావశుద్ధియుతసంస్థితియున్ [30]సదయక్రియాపరి
శ్రాంతియు సర్వలక్షణవిచారణయున్ ఫలియించె రాధికా
కాంతుఁడు ప్రాణవల్లభుఁడు గావునఁ బావనమూర్తియైనయీ
చింతలపూడి యెల్లకవిశేఖరు కోమలకావ్యకన్యకున్.

  1. డిరియను (మూ.)
  2. సుప్త్యర్చి (మూ.)
  3. గురులు నూడగ (మూ.)
  4. డేలగింపక (మూ.)
  5. గొరిగల వసించెడి (మూ.)
  6. దిక్కుల్ జొర (మూ.)
  7. మదరింటిచిలు
  8. ప్రకటభారవేణి (మూ.)
  9. యవయవంబులయందె బాపినసియవల కళ (మూ.)
  10. జెల్వదయిం పదయించు (మూ.)
  11. రి కేపు
  12. గవిశ నెద రెక్కుపెట్టని
  13. తకోతములోన (మూ.)
  14. మాధవుఁడు మదనతత్వకళ... రాధ...త్ముఁడా. (మూ.)
  15. బలువాటకజార నొడుచుఁ బై పై హరియా | హగా....నటన్నన్. (మూ.)
  16. విధానస౦క్రియల్ (మూ.)
  17. లపు గులముల (మూ.)
  18. చేష్టలు గని చొక్కి రాత్మజలజంబుల (మూ.)
  19. షడ్జమస్వర (మూ.)
  20. వొంటి (మూ.)
  21. తైమస్రచలత్కణావిమనరుచ్య (మూ.)
  22. నొగిఁ బారుచుఁ జేవిదలం దలంకుచున్ (మూ.)
  23. హరిహరపల్లవ (మూ.)
  24. సలిబయలిందె నొకతె
  25. ప్రోడవులు (మూ.)
  26. చంద్రనీ, రలభయంబు
  27. నిందిందిర లలసి (మూ.)
  28. నసమ (మూ.)
  29. దరహాయధరదనము (మూ.)
  30. సనయ (మూ)