రాణా ప్రతాపసింహ చరిత్ర/ప్రథమాశ్వాసము
శ్రీ
కా మే శ్వ ర్యై న మః
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
ప్ర థ మా శ్వా స ము
శ్రీ
మత్కందుకమట్లు గుండ్రమయి వారిన్ రెండు పాళ్ళొక్కపాల్బూమిన్ నిండియు నూఱునర్వదియుఁ గోట్లు మర్త్యు లొప్పారఁగా
వ్యోమంబంటు నగాధిరాజ నివహంబుల్ మీఱ విశ్వంబు శో
ధామూల్యస్థితి నొప్పు నీశ్వరు ననంతైశ్వర్యముల్ చాటుచున్.1
సీ॥ కాంచన శృంగభాగము కిరీటము గాఁగఁ
గాశ్మీర మాస్యపంకజముగాఁగ
సింధు గంగానదుల్ చేఁదోయి గాఁగ నా
ర్యావర్తదేశం బురంబుగాఁగ
వింధ్యాచలేంద్రంబు బెడఁగు మధ్యము గాఁగ
గౌతమీ కనక మేఖలయుఁగాఁగ
మలయ సహ్యాద్రు లడ్గులు గాఁగ సింహళ
ద్వీప మంథోరుహ పీఠిగాఁగ
గీ॥ లవణ రత్నాకరము సరః ప్రవర మగుచుఁ
జెలఁగు భారత దేశ లక్ష్మీ సమగ్ర
భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవము
లిట్టివని వివరింపఁగా నెవరి తరము. 2
శా॥ జానొందన్ బహుళాంబు పూరము వనాకాశంబలల్ నింప స
స్యానీకంబు సమృద్ధమై యెదిగె భాగ్యస్ఫూర్తి హెచ్చింప ల
క్ష్మీనిత్యోత్సవ మందిరంబయి తనర్చెన్ విశ్వసర్వోన్నత
స్థానంబంది సమస్త వైఖరులు రాజస్థాన మవ్వేళలో.3
సీ॥ ఇట్టిరాజస్థాన మెపుడు స్వతంత్రులౌ
జనపాలమణుల పాలసమునొందు
దేశంబు లిరువది దీపింప వెలుగొందు
వానిలోనెల్ల మేవాడదేశ
మగ్రగణ్యము; దాని యధిపతియగు వాని
‘రాణా' యని జనులు ప్రస్తుతింతు
రతఁడు మతాధిపత్యమున నెల్లరకు జ
గద్గురుఁడగుచు విఖ్యాతిగాంచు.
గీ॥ నగరములలోనఁ గాశికానగర మట్లు
చిరయశముఁగాంచుఁ జిత్తూరు పురవరంబు
నచటి రాణాయు నందఱ నగ్రపూజ్యుఁ
డెల్ల సురలందుఁగాశి విశ్వేశు మాడ్కి.
సీ॥ హారావళి పర్వతావళి విరివిగా
నింద్రనీల శిలల నిచ్చుచుండ
సాంబారు లూనీ విశాల ప్రదేశములో
సహజమౌ లవణం బొసంగుచుండ
గను లెల్లెడల మరకతములు రత్నముల్
సౌవీరమును మంచి స్ఫటికములును
జంద్రకాంత శిలల స్వర్ణరౌప్యంబుల
నెడతెగకయె యెప్పు డిచ్చుచుండ,
గీ॥ భాగ్యము లొసంగి యేలిన వారియిండ్లు
బంగరుంగొండలట్లు చేయంగఁగలిగి
రత్నగర్భ యటన్న సార్ధక పదంబుఁ
బడసి మేవాడ దేశంబు పరిఢవిల్లె.5
శా. | ఆవిశ్వోన్నత పుణ్యవై భవ యశోహారాళి హారావళీ | 6 |
సీ. | సచరాచరప్ర పంచప్రాణమగు సూర్య | |
గీ . | లాశీలాదిత్య కనక సేనాది రాజ | 7 |
మ . | సమమైయొప్పు విశాలభైల శిఖరస్థానంబునన్ రాజపు | 8 |
గీ . | ప్రక్కపక్కనఁ బదిబండ్లు వరుసగాఁగ | 9 |
సీ. | విపణిమార్గములతో వీధుల తుదినొప్పు | 8 |
జతురంగముల తోడ నతి విశాలంబైన
వివిధాయుధాగార వితతితోడ
మణివితర్దికలతో మధుర నానాజాతి
ఫలమహీరుహ కదంబకము తోడ
గీ॥ సౌధములతోడ, బహుసరస్సమితి తోడ
రచ్చగమితోడ వారి యంత్రములతోడ
భరత ఖండైక లక్ష్మీనివాస భూమి
నగరమాత్రంబె చిత్తూరు నగర వరము.10
మ॥ వనితాశీలము నిల్ప శత్రువులఁ దుంప నేడు చిత్తూరు ద
ప్పిన నీలోకము శూన్యమంచుఁ గరముల్ వేయెత్తి ఘోషించేనో
యన సూర్య ధ్వజకోటు లెల్లెడ సహస్రాంశుల్ పిసాళించి న
ర్తన మాడున్ మృదులానిలంబు తమ మీఁదన్ సోఁక హేలాగతిన్ 11
సీ॥ నవ్వనేర్వక మున్నెక్రొవ్విన రిపుకోటిఁ
బాఱంగఁదోలి నవ్వంగ నేర్త్రు
కూర్చుండుటకు మున్నె క్రోధోగ్ర శత్రు వ
క్షోదేశ మెక్కి కూర్చుండ నేర్త్రు
నడువకమున్నె చండ విపక్షమకుట సం
తతులఁ బాదము లుంచి నడువనేర్త్రు
పరువులెత్తక మున్నె పరిపంధి తతి నొంచి
తఱుముచు వెనువెంటఁ బరువ నేర్త్రు
గీ॥ రాడుటకు మున్నె ఘోర రణాంగణముల
నరిశిరంబులతో బంతులాడ నేర్తు
రౌర; చిత్తూర్పురి జనించినట్టి వారు
శైశవము దాఁటుటకు మున్నే శౌర్య మహిమ.12 12
శా॥ ఇంద్రప్రస్థముగాదు ద్వారకయుఁగాదే కాశియున్ గాదు ని
స్తంద్ర ప్రాభవకీర్తి శోభిత మయోధ్యా పట్టణంబేని
దింద్రోపేంద్ర సమానులౌ నృపులు తామేలంగఁ జిత్తూర్మహ
స్సాంద్రశ్రీలను గుత్తకున్ గొనిన యాచందంబు దీపించెడున్. 13
సీ॥ హరితమౌనీంద్రు పాదాబ్జాత యుగళికి
శిష్యుఁడై శుశ్రూష చేయఁ గలిగె
వ్యాఘ్రశైలంబు తాపసు కూర్మిఁగని ద్విధా
రా ఖడ్గమును పొంది రాణ మెఱసె
బ్రమరుల గెలిచి భారత సూర్యుఁ'డని 'విశ్వ
పతి ' యని బిరుదముల్ పడయఁగలిగె
ఖాండహా రిస్పహన్ కాఫరి స్థానాది
యవనసీమలు గెల్చి యశముఁగాంచె
గీ॥ వందలకుఁ బైనఁ బుత్రులఁ బడసి సూర్య
వంశమును నిల్పి సౌపర్వ పర్వతమునఁ
దపముఁ గావించి ముక్తి కాంతను వరించె
బప్పరావు మేవాడ్భూప వంశకర్త.14
భరతఖండముపై యవనుల దండయాత్రలు
సీ॥ తమ యుపనదుల సంతతులెల్ల వెండి రే
కులువోలె నెల్లెడ నలముకొనఁగ
జహ్నుకన్యాసింధు సలిలపూరమ్ములు
సారతఁగూర్ప బంగారు పండు
రసఖండమై పచ్చరా బయలులమాడ్కి
లలిత సస్యశ్యామ లంబునగుచుఁ
బిడికెఁడు చోటైన వెలిఁబోవనట్టి యా
ర్యావర్త బహుళ భాగ్యాంక కధలఁ
గీ॥ జెవులు చిల్లులువోఁ బారసీక యవన
ఖాండహారిస్పహాను బాగ్దాదు మొగలు
గజ్నిపతులు మిడుతదండు క్రమ్మినట్లు
దాడి వెడలిరి తండోప తండములుగ.15
గీ॥ ఎనిమిదవ శతాబ్దారంభమునఁ గవీపు
'వాలీదు' తొలుత ఖాసిముఁబంపె నతఁడు
సింధుదేశమ్ము దాటి కాశీపురంబు
వఱకుఁ గలసీమ లన్నియుఁ బాడుచేసె.16
మ॥ ఒకబాగ్దాదు నరేంద్రచంద్రుఁడు కవీప్ 'ఓమా’రబుల్ హాసు సే
న కధీశున్ బొనరించి హైందవముపైనన్ బంపఁగా దూరమెం
చకయే యామడ యడ్గుగా నడిచి రాజస్థానమున్ జేరి భూ
ప కులారణ్యములన్ దహించె నతఁడున్ వైశ్వానరప్రాయుఁడై. 17
మ॥ ప్రళయాంభోధరపంక్తి చందమున గర్జల్ సేసి తచ్ఛైన్యముల్
దళమై యా యజమీరుపై నడిచె దూలారావు తౌరుష్క యో
ధులు మూన్నాళ్లు బడల్ పడన్ మెలఁగి శ్రాంతుండై యబుల్హాసు ను
జ్వల హేతి ప్రహతిన్ దెగెన్ రిపుజనోత్సాహంబు రెట్టింపఁగన్ 1818
సీ॥ తత్పరిసర సైకతస్థలిపైఁదోడి
బాలురతో నంతవఱకు నాడు
కొనెడు దూలారావు కొమరుఁ డేడేండ్ల లా
టుఁడు తండ్రియు శిరంబు డుల్లి ధాత్రి లఁ
బడుటఁ గన్గొని రక్త ముడుకెత్తి చేరువ
భటుచేతఁగల పెద్ద బారుటీటె
గుంజుకొం చరిగె చెంగున దాట్లిడుచు నబుల్
హాసు గుండియ లవియంగఁదాఁకె
గీ॥ నిరువురును బోరి రొండొరు నిచ్చమెచ్చ
కంత లాటుఁ డరిన్ గూల్చి యతనివెంట
నరిగె దివికి హితాహితులంద "ఱీతఁ
డౌర యభిమన్యు పైచేయి" యని నుతింప.19
సీ॥ లాటుఁడుత్తమ గుణాలయుఁ డమానుష వీర
పురుషమూర్తి యని యందఱకుఁదోఁచేఁ
జోహణు లాబాల శూరుని విగ్రహం
బులు రచింపించి దేవుని విధానంఁ
బ్రతివత్సరము భక్తివఱల జ్యేష్ఠద్వాద
శీ దినమందుఁ బూజించు చుందు
రాలాటుఁ డనిచేయు నపుడున్న కాలి గ
జ్జెల నెల్ల జనులు దర్శించి పోదు;
గజినీ మహమ్మదు దండయాత్ర
ఆ॥ వె॥ రాదినంబు నుండి యీదినంబునకుఁ జో
హణ కులంబు వారలాత్మజులకుఁ
గాలి గజ్జియలను గట్టరు లాటుని
యెడల వారి భక్తి యెట్టి దొక్కొ
సీ॥ భాగ్య సౌభాగ్య సంభావ్యముల్ సింధు ఘూ
ర్జర దేశములను వర్తకముఁబెంప
‘టైగ్రిస్' నదీ కృపీట పవిత్రమైన య
రాబియా పాలించు రాజలోక
మణి కనీప్ ఉస్మాను మఱి కలీన్ ఆలి యే
జీదు ఖొరాసాను క్షితిపమౌళి
యబ్దుల్ మలీకు సైన్య సముద్రములను బొం
గించి హైందవమును ముంచి తేల్చి
గీ॥ రటుపయిని హరూన్ ఆల్రాశ్చిదను కలీప్ అ
రాబియా మొదల్ కాశి పర్యంత మేలె
నవ్వల సెబాక్టజిన్ వచ్చె నతఁడు ప్రళయ
భైరవుని మహమ్మదుఁ దెచ్చే వానికొడుకు.21
మ॥ తడ వింతేనియు లేక వీరభట సంతానంబు తన్గొల్చి వెం
బడిరా సింధునదీన్ దరించుచు మహమ్మద్ గజ్ని గజ్నీ విభుం
డడవుల్ గాల్చుచు భస్మమున్ సలుపుదావాగ్నిన్ బలెన్ బొంగుచున్
దుడిచెన్ భారత దేశ పట్టణము లందున్ గల్గు సర్వస్వమున్ 22
మ॥ కడుసౌభాగ్యము గల్గు రాష్ట్రముల వంకన్ సుంత కన్నెత్తి చూ
డఁడు బంగారము పండు నేలలను జూడండట్టె పేర్వాసిఁగాం
చెడు దేవాలయ లింగముల్ పెఱికి గజ్నీ సౌధ సందోహ మె
క్కెడు సోపాన చయంబుఁ జేసె విహితుల్ కీర్తింప వేభంగులన్. 23
మ॥ అనయోత్సాహముతో మహమ్మదు చలంబారంగ సౌరాష్ట్రమం
దున విచ్చేయుచు సోమనాధపుర మందున్ సోమనాధేశ్వరా
ది నిలింప ప్రకర ప్రపూజ్యమగు జ్యోతిర్లింగ సంఘాతమున్
దునియల్ చేయుచు ద్రవ్యరాసులను దొంతుల్ దొంతులున్ జేకొనెన్ 24
సీ॥ భువన వీరసమూహమున మేటి యితఁడంచు
యశ మొందఁ గనిన మహాభుజుండు
కొండపల్లెను మార్చి గొప్ప సామ్రాజ్య సం
స్థగఁజేయు రాజతంత్రజ్ఞమౌళి
కన్నకొడుకునైనఁ గడికండలుగఁ జీల్చి
ధర్మంబు నిలుపు నుదారబుద్ధి
విశ్వకళాశాల వెలయించి దేశదే
శముల విద్యను బెంచు జ్ఞానమూర్తి
గీ॥ కవుల పాలిఁటి ముంగిటి కల్పకంబు
విగ్రహారాధనము పైన వెగటు వలన
గజిని మహమదు దండెత్తెఁ గాక యున్న
నంతవాఁడెట్లు జనహింస కనుమతించు25
గీ॥ ఇటులు పండ్రెండు మార్లు దండెత్తి వచ్చి
ధన కనక వస్తుతతిఁ గొని చనుటె కాని
భరతఖండంబు శాశ్వత వాసముగను
జేయఁదలపక నిజసీమఁ జేరుకొనియె.26
-: ఘోరీ మహమ్మదు యాత్రలు :-
ఉ॥ ఆకడగండ్లు వాసి, భరతావని కొంతకుఁ గొంత కోల్కొనన్
బోకయమున్నే వేఱొక రిపుండు మహమ్మదు పేరివాఁడు ఘో
రీకులుఁ డాత్మవాహినులు క్రిక్కిరియంగను గోరుచుట్టుపై
రోఁకటిపోటునాఁ బ్రళయ రుద్రుని కైవడి వచ్చె నుధ్ధతిన్.27
శా॥ ఆకాలమ్మున సార్వభౌముఁడయి యార్యావర్తమున్ బృధ్విరా
జేకచ్ఛత్రముగాఁగ నేలె నతఁడయ్యింద్రాత్మజున్ బోలె సు
శ్రీ కల్యాణ పరాక్రమోన్నతుఁడు ఘోరీవంశజున్ దాఁకి చీ
కాకై పాఱఁగజేయ సైన్యముల నాయత్తంబు చేసెన్వడిన్.28
గీ॥ చేరి హమ్మీర గంభీర సింహ నృపులు
కాకసస్ పర్వతమునుండి కాశిదాఁక
నూటయెనమండ్ర క్షితిపుల మాటమాత్రఁ
బిలుచుకొని వచ్చి పృధ్వీశుఁ గొలుతు రెపుడు.29
మ॥ అతితేజోబలధాముఁ డా సమరసింహశ్మీతలేంద్రుండు వం
దిత నానాజనపాలలోకుఁడగు పృధ్వీభర్తకున్ సోదరీ
పతి వజ్రాయుధకోటి మ్రింగఁగల మేవాడ్దేశ రాహుత్తులున్
గృతహస్తుల్ తనుఁగొల్వ వచ్చెనని కేకీభూత చేతస్కుఁడై.30
గీ॥ భరతఖండంబు నాక్రమింపఁగఁ దలంచి
యేడుమాఱులు ఘోరిదండెత్తి వచ్చె
మఱఁదియును బావయును దాఱుమాఱు చేసి
యతని వెనుకకు నంపించి రాఱుమార్లు.31
సీ॥ త్వార్వంశ భవులైన ధరణీతలేశ్వరుల్
పూర్వ మింద్రవస్థ పురిని సార్వ
భౌములై యేలిరవ్వారిలోన 'ననంగ
పాలుండు' కడపటివాఁ డతండు
పుత్రసంతతి లేక పుత్రికలను నిర్వు
రనుగాంచె మొదటిదానిని గనూజి
బీజపాలునకును బిదపటిదాని సో
మేశున కజమీరు దేశపతికి
గీ॥ నిచ్చె,వారికి జయచంద్ర పృథ్వివిభులు
గలిగి రయ్యనంగుఁడు కొంత కాలమునకు
వ్యాధి పీడితుఁడగుచు నిజాత్మజలను
మనుమలను బిల్చుకొని చెంత నునిచికొనియె.32
గీ॥ ఒక్కనాఁడు పట్టాభిషేకోత్సవంబు
జరుప సామంత నృపుల నందఱును జేర్చి
యయ్యనంగుఁడు ఢిల్లీ సింహాసనంబు
నెక్కు మన నెక్కి కూర్చుండెఁ బృథ్వివిభుఁడు.33
సీ॥ "ఇరువుర మేము దౌహిత్రులమైయుందు
మప్ప నెల్లెండ్రకు నాత్మజులము
పదియు నెమ్మిది యేండ్ల ప్రాయ మందున్న నన్
వదలి యెనిమిదేండ్లవానిఁ బృథ్వి
సింహాసనాసీనుఁ జేయుట ధర్మ మీ
తని యధికార మే ననుమతింప
నాక్షేపణ మొనర్తు”నని ధిక్కరించి యా
జయచంద్రుఁ డేగెనాసభను వీడి
గీ॥ యతనివెంట నాబూపర్వతాధికారి
వ్యాఘరాజేంద్రుఁడును బట్టణాధినాధుఁ
డసమబలుఁడు భోలాభీముఁడా క్షణంబ
కదలిపోయి రాస్థానరంగంబు వదలి.34
సీ॥ తుహినాద్రినుండి సేతువుదాఁకఁ దనరు న
ఖండ భారతఖండ మండలంబు
సకల మేకచ్ఛత్ర సామ్రాజ్యముగ ధరి
త్రీ రాజ్యమేలెఁ బృధ్వీనృపాలుఁ
డా వీరనరు సహస్రాదిక యుద్ధముల్
ధర్మసంస్థాపన తత్పరతయు
నతని సామంత ధరాధీశ్వరుల భూరి
పౌరుష విక్రమ ప్రాభవములు
గీ॥ చంద్రభట్టారక సుకవి చక్రవర్తి
వ్రాయు శతసహస్రాధిక గ్రంధమందు
రససమృద్ధిని బర్వపర్వంబునకును
జీవకళ లుట్టిపడఁగ రంజిల్లు చుండు.35
-: సంయుక్తా స్వయంవరము :-
చ॥ అమిత విశాలమై సిరు లనంతముగాఁగల కాన్వకుబ్జ రా
జ్యము మును దక్షిణాపధమునందును వ్యాపన మొందె రాజసూ
యము నల ధర్మనందనుని యవ్వలనీ జయచంద్రుఁ డొక్కఁడు
క్కు మిగిలి చేయనేర్చె నృపకోటి యొనర్ప సమస్త కార్యముల్. 36
గీ॥ అవలఁ దన పెంచు సంయుక్తయనెడు కన్య
పరిణయ మొనర్పఁగా స్వయంవరముఁ జాటి
సకల దిగ్దేశవర్తి రాజన్యులకును
బంపె వైవాహి కాహ్వాన పత్రములను.37
సీ॥ తనకెకాదింక భూస్థలి రాజులకు నెల్లఁ
బెద్దయౌ రారాజు పృధ్వీరాజ
మౌళి కాహ్వాన మంపమి యట్టులుండ హా
స్యమునకై యొక పెద్ద యట్టచేత
నామహాప్రభు విగ్రహము రచింపించి సే
వకు దుస్తు లిడుచు నుద్వాహమండ
పము మహాద్వారంబు పరగడ మోడ్పుచే
తులతోడఁ దలవాల్చి నిలువఁజేసె
గీ॥ నల స్వయంవరాహూతులై యచటఁ జేరు
భూమివతులెల్లఁ దుచ్ఛమౌ బొమ్మఁ జూచి
సంభ్రమాశ్చర్య చకితులై చాలఁ దడవు
నిలిచి రనిమేషులగుచు బొమ్మల విధాన.38
సీ॥ "నృపమకుటములు తన్ని జనించె నామహా
భాగు సేవకుఁజేయఁబాడి గాదు
భువనోన్నత ప్రాభవుండైన మేటి యా
తని కెగ్గుచేయుట తగవుగాదు
రణరంగ ఫల్గుణ ప్రఖ్యాతి గల వీర
మౌళి నొప్పరికింప మేలు గాదు
శ్రీరమారమ ణావతారు జగద్వంద్యు
నవమాస మొసరింప ననువు గాద
గీ॥ యతఁడిది యెఱుంగునేని దక్షాధ్వరంబు
రూపుమాయింప వేడలు రుద్రుఁడయి దూకి
జగము సర్వసంహారము సలుపుఁగాని
యోర్వఁడవమానలేశ మాయోధమౌళి.39
క॥ అని వగచుచుఁ దమతమ యా
సనములఁ గూర్చుండి రవల సభయెల్ల మహా
జన నివహముచేఁ గ్రిక్కిరి
నెను బిదప ముహూర్తవేళ చేరఁగ వచ్చె. 40
మ॥ అతిలావణ్య విలాస విభమ సురూపాయత్త దివ్యాంగనా
తతులన్ మెచ్చని లోకమోహినులు కాంతారత్నముల్ నల్వురున్
జతురస్వాంతలు కొల్చివెంటనడువన్ సంయుక్త తారాగణాం
చిత జైవాతృక బింబమో యనఁ బ్రవేశించెన్ సభావేదికన్.41
చ॥ కలకలలాడె నేల్ల సభకప్పుననుండియు వింతయంత్రముల్
జలజల రాల్చెఁ బూలు నృపసత్తములున్ జెలి గారవించి రౌఁ
దలలను వాల్చుచున్ మృగమదంబు పునుంగు జవాది గందముల్
వలపులఁ జల్లె నెల్లెడ సభాసదు లెల్లరు నుల్లసిల్లఁగన్.42
సీ॥ జయచంద్రనృపమౌళి సంయుక్తతోడ ముం
దునకురాఁ బౌరోహితుండు నృపుల
వేఱువేఱుగఁ జూపి వారివారి సమగ్ర
పౌరుష ప్రాభవ వైభవములు
విపులంబుగా నిరూపించి వర్ణనచేనెం
గన్నె యొక్క నినైనఁ గన్నులెత్తి
కనుఁగొనకయే ముందుకై సాగి నృపపీఠ
ములు దాఁటి నడిచే విప్రుండు నవలఁ
గీ॥ గల మహామాత్యులను బంధువులను సైన్య
పతుల నుద్యోగులను జూపేఁబడఁతి ముందు”
కరిగె జయచంద్రుఁ డతిక్రుద్దుఁడగుచు మండి
కొమ మహాద్వారమున కీడ్చుకొనుచుఁ బోయి.43
మ॥ “ననుఁ దప్పించి మహేంద్రయోగ్యమగు నింద్రప్రస్థ సామ్రాజ్య మొం
దిన తుచ్చుండు గులామునున్ శరుఁడు పృథ్వీనాముఁ డవ్వాని బొ
మ్మను బెండ్లాడు “మటంచుఁ ద్రోసెఁ జెలికంపంబొంది తద్ధాటి బో
రన నేలన్ బడె సభ్యులందఱు మహోగ్ర క్రోధమున్ జెందఁగన్ 44
గీ॥ అవిర ళాత్మీయ పూర్వ పుణ్యముల రాశి
యెడతెగక తానువలచు వేయేండ్ల పైరు
ముందుఁగని లేచి సంయుక్త బొమ్మకు సుమ
దామమును వైచె సిగ్గునఁదలను వాల్చె. 45
సీ॥ పుష్పహారముసోఁక బొమ్మ తద్దయుఁ బెద్ద
ధ్వనితోడఁ బైన మస్తకమునుండి
పాదాగ్రమున దాఁకఁ బరియలై యందుండి
క్షణమున భువన విస్మయముగాఁగఁ
దలపైన వింత వింతల రంగుటీకల
కాంతార మబ్ధి భంగములు వోలె
నటునిటు తూగాడ నసమాన శతకోటి
మన్మధ సౌందర్య మహిమ వెలయ
గీ॥ ముందడుగు వైచుచును మహా పురుష మూర్తి
విమత సమవర్తి శ్రీమహావిష్ణు వట్లు
చారుమూర్తి పృథ్వీసింహ చక్రవర్తి
జగము లానందమొంద సాక్షాత్కరించె. 46
మ॥ అమృతాంశున్ గని పొంగు సంద్రముక్రియన్ క్ష్మాధీశు లానంద సం
భ్రము లౌచున్ జయనాదముల్ సలుప విశ్వత్రాత పృధ్వీంద్రుఁ డ
క్కొమఁ జేతన్ గొని యశ్వమెక్కిఁ 'యిదిగో గొంపోవుచున్నాఁడ ధై
ర్యము మీకుండిన నన్నుఁ 'దాఁకుఁ'డని డాయన్ బోయె ఢిల్లీదెసన్. 47
మ॥ సమరోర్వీతల ఫల్గునుం డితఁడనన్ సత్కీర్తి దిగ్దేశ ధా
గములన్ నిండిన యామహాప్రభువుఁ దాఁకన్ ధైర్యముల్ లేక స
ర్వమహీనాధులు వాని సాహసములు వర్ణించి తత్తన్ని వా
సములన్ జేరఁ బ్రయాణమైరి త్రుటిలో సంరంభ శూన్యస్థితిన్ 48
మ॥ 'అకటా! గర్భనిరోధి దుష్టుఁడు శరుండౌ పృథ్విసింహుండు క
న్యకఁగొంచున్ జనె మోసగించి పెనువంతన్ సైపఁగాఁజాలఁ ద
ప్పక వానిన్ దెగటార్చి నాయునురు నిల్వన్ బెట్టరే' యంచు నో
పికజాఱన్ జయచంద్ర భూవిభుఁడు తబ్బిబ్బొంది వాపోయినన్. 49
సీ॥ ఆబూ ధరాధీశుఁడగు జయత్ప్రమరుండు
ప్రబలుండు మండూరు వ్యాఘ్రరావు
కాన్యకుబ్జంబు లక్ష్మణసింగు విశ్వేశ
సింహవిభుండు కాశీధరాధి
పుఁడు మహోబానేత పూర్ణమల్లుండు ధా
రామహీపాలుండు రామసింహు
డాలాయు మదిలుండు నాజయచంద్రుండు
మదినమ్ము వాఁడిఁటి మాడుఖానుఁ
గీ॥ డొక్కొకరుఁ డై దువేలమంది యోధులఁగొని
త్వరితగతి బయల్దేఱి రవ్వారికెల్ల
సర్వసేనాధిపతి యౌచు జగ మద్రువఁగ
ముందుఁ గదలె బోళాభీమ భూవిభుండు. 50
సీ॥ మూఁడునాళ్ల ప్రయాణమున డస్సియుండె , జో
హణనేన దాని సంఖ్యయుఁ గొలంది
పైఁ జిచ్చుటెండ లోపల మండుకొనుక్షుధ
వీని మించుచుఁ గ్రొత్త పెండ్లికొమరి
తను సున్నితముగాఁగఁ గోనిపోవవలయు భా
రము కాన్యకుబ్జ సైన్యము లపార
మవ్వాని నడపు నాయకులు పెక్కురు భీముఁ
డుద్దండతర విక్రమోగ్ర మూర్తి
గీ॥ గడియ ప్రొద్దుండు వేళకే కాన్యకుబ్జ
దళము ఢిల్లీ సైన్యము డానెదానిఁ దాఁక
వేగురు భటుల నిలిపి పృధ్వీ విభుండు
ముందు నడిచె యుద్ధము ఘోరముగను రేఁగె. 51
గీ॥ అహితులను నూర్లు వేలుగా నణఁచి ఢిల్లి
భటులు కడతేఱి రంద ఱవ్వలి దినంబు
వెడలి రారోడు లలమిరి పృధ్విసింగు
భట సహస్రద్వయము నిల్పి వఱచే నవల. 52
క॥ అరివీరభటు ల నేకులఁ
బొరిగొని వారెల్లఁ దెగిరి మూఁడవనాఁడా
యిరువాఁగులు మఱలన్ డా
సిరి కాళిందీతటంబు చేరువ సీమన్ 53
మ॥ అరుగుదెంచెను యోగినీపురవరంబందుండి పృథ్వీంద్రు సో
దరుడున్ వీరుఁడు చంద్రరావు చముపుల్ తన్గొల్వ, రారోడ్భటో
త్కరమున్ దాఁకె నతండు యుద్ధము మహోగ్రంబై విజృంభించె దొం
తరగా మ్రగ్గెను రెండుపక్షముల యోధశ్రేణి నిశ్శేషమై. 54
ఉ॥ ఐదవనాడు వృథ్వి వసుధాధిపుఁ డాత్మపురంబుఁజేరి ని
త్యోదయ భాగ్యశోభన ముహూర్తమునందున విశ్వవైభవ
శ్రీదయివాఱఁ ద న్నభిలషించిన కన్యను బెండ్లియాడె స
మ్మోదముతో ధరావలయమున్ బరిపాలనఁజేసె దక్షతన్.55
సీ॥ అభిచార హోమంబు లాచరించెడువారి
బిలిపించి నూర్లును వేలు నొసఁగి,
హంతకులను గూడి మంతనంబు లొనర్చి
లక్షలు లక్షలు లంచమిచ్చి
పరిసర నృపకోటిఁ బురికొల్పి కోటానఁ
గోట్లిచ్చు పయి కుసిగొలిపి పంపి,
రాజోత్సవముల మారణ యంత్రములు పన్ని
పొంచి ప్రేల్పించి చంపించ నెంచి
గీ॥ యెందఱనో యాశ్రయించి యెన్నెన్నొ గతులఁ
గుట్రలు కుతంత్రములు చేసి కోర్కెలెల్లఁ
జెఱుచు జయచంద్రుఁ దుఱక కృశించుచుండె
నీర్ష్య; తనుచేర్చువాని దహింప కున్నె.56
సీ॥ ఇంకొక్కమాఱు దండెత్తిరమ్మని యతం
డర్ధించె ఘోరీమహమ్మదు విభు
నావార్త విని యసంఖ్య చమూతతులు కొల్వ
నరుదెంచె సమరసింహ ప్రభుండు
మూఁడుకోసుల దూరమునకేగి పృథ్వీంద్రుఁ
డడుగులకును మొక్కి యతనిఁ దెచ్చె
'గగ్గా'ర్నదీ తటక్ష్మాసీమ యవన సై
న్యం బుండె డిల్లి సైన్యములు వచ్చె
గీ॥ నాప్తులును దాను జయచంద్రుఁ డాయవనులఁ
గదిసె నుదయ మయ్యదిచూచి కదలి వెళ్లి
తండ్రి మృదుపాదములకు వందన మొనర్చి
యుదిలకొని మహారాజ్ఞి సంయుక్త యపుడు. 57
సీ॥ 'భరత మహామహీస్వాతంత్య్ర ముడుప శ
త్రులు వచ్చి రదినిల్పఁ దొడరవచ్చె
నాప్రాణవిభుఁ డఖండ ప్రాంభవుండు నే
నుండ వేర్వేఱ మీకుండఁదగునె
ధర్మపక్షము మాది దయచేయవయ్య పృ
థ్వీవిభు నర్ధాంగిఁ బిలుచుచుంటిఁ
జెడుగులే దీవు వచ్చిన సత్కరించు నా
భర్త నిన్ వైరము వదల దేని
గీ॥ నేగుము కనూజి కటులు పోవేని భార
తావనిని దాస్యమునఁ దోయు నపయశంబు
ననుభవింతు వా చంద్రతారార్క' మనుచు
మ్రొక్క-జయచంద్రుఁడును గడుఁ ద్దుఁ డగుచు. 58
సీ॥ కమనీయ భారతఖండ సామాజ్య సౌ
భాగ్యలక్ష్మి విధానఁబరగు మంగ
ళోదారమూర్తి సంయుక్త సాగిలపడి
యుండ భూదేవ మంతోక్తి పూత
కంధిజలాభిషేక పవిత్ర మామె మూ
ర్ధము నట్టె వామపాదమునఁ దన్ని
"కదలి పో నాసముఖమున నుండకు' మంచుఁ
ద్రోసిన లేచి యాదొడ్డతల్లి
గీ॥ "తెలిసినది విన్నవించితిదీన నీదు
హృదయము కఱంగకున్న నేనేమి సేతు'
నని కదలి వచ్చె సుభయ సైన్యములకును ర
ణంబు ఘోరంబుగా మూఁడునాళ్లు జరిగె. 59
గీ॥ సమరసింహుండు పడియె వైన్యములు చెడియె
రాజపరమేశ్వరుండు వీరప్రభుండు
పృథ్విరాజేంద్రుఁడును ఢీల్లిరిపుల బారిఁ
బడిరి భారతదేశ దౌర్భాగ్యకలన. 60
సీ॥ 'నుత రమాఖండ భారతఖండ గగనాగ్ర
రంగ మధ్యాహ్న మార్తాండమూర్తి
బప్పరాయాన్వ యాభరణ షట్త్రింశన్నృ
పాలక కుల భూరివజ్రమకుట:
యరిగితే ననుఁబాసి చెఱవడె నాపృధ్వి
మఱఁద లెందరిగెనో యెఱుఁగరాదు
పదమూఁడు వేల్మంది భటులతోఁ గల్యాణ
సింగు నాపుత్రుఁడూర్ణిత పరాక్ర
గీ॥ ముఁడు స్వయంవరమునకట్లు నడిచె వికి
నిచటఁ బనియేమి మీరందఱేగు పిదప
నని పృథాదేవి వగచి నిన్ననుగమింప
సమసితే శత్రుగజసింహ! సమరసింహ'.61
మ॥ తొలుతన్ సాయము చేసినట్టి జయచంద్రున్ దాఁకె ఘోరీయు; దు
ర్బలుఁడై రాజ్యము వాఁడు వీడిచనెఁ; దార్తార్ వీరులుగా వెంబడిన్
గలయన్ దూఁకిరి; దిక్కులే కతడు గంగావాహినిన్ దూఁకి య
వ్వలి కేగెన్; దలఁద్రుంచి చంపిరి రిపుల్ వైవస్వతప్రాయులై 62
సీ॥ ప్రార్ధింతు వలవ దీపని” యంచు సంయుక్తి
కొనకాళ్లఁబడి వేడుకొనిన వినక
ఘోరీని బిలిపించి కొంప కగ్గి ఘటించి
నృపచంద్రు సమరసింహేంద్రుఁ దుంచి
పృధ్వీశు నట్టేటనిడి కుంకుమూడ్చి సం
యుక్త వైధవ్య సంయుక్తఁజేసి
యుర్వి యున్నంతకు నుగ్రాపకీర్తియై
రాజ్యంబు పారతంత్య్రమున నడితె!
గీ॥ కటకటా కోటియుగములు గడచుఁగాక
పృథ్వివిభువంటి రాజరా జెటులఁ గలుగు
భరతభూమి స్వాతంత్య్రమెబ్బంగిఁ బొలుచుఁ
జెనఁటి జయచంద్ర: నిబిడ దుష్కీర్తి రుంద్ర!63
గీ॥ "చెట్టుపై బక్షిశిరమును జెండు" మనినఁ
బృథ్విరాజు మూఁడు శరంబులెత్తి పులుఁగు
గళము దానివెంటనే ఘోరీగళము ద్రుంచి
యాత్మహృదయమ్ము భేదించి యరిగె దివికి.64
గీ॥ పృధ్వినృపమౌళి గృహము ఘోరిగృహంబు-
నమరసింహు గృహము జయచంద్రు గృహము.
నాల్గు గృహములు మొదలంట నాశ మయ్యె
దుష్టుఁడగు నొక్క దేశ విద్రోహి కతన.65 65
క॥ కుతుబుద్దీన్, సేవక సం
తతివాఁడు సమర్ధుఁ డగుటఁదగునని ఘోరీ
పతి భారతసామ్రాజ్యం
బతని వసము చేసి పోయె నాత్మనగరికిన్.66
ఉ॥ జంబవిరోధి వైష్ణవ విశాలత భూప్రజ నేలి శాశ్వతో
జ్జృంభిత కీర్తి చంద్రికలఁజిమ్ముచు వాఁడు 'కుటుబ్; మినార్' శిలా
స్తంభము నొక్కదాని జయసంభృతమై పొలుపొంద నిల్పెవి
శ్వంభరఁ బొల్చు నయ్యదియు సప్తవిచిత్రము లందు నొక్కఁడై.67
మ॥ పరిపాలించిరి వానివెన్క ధరణీభాగంబుఁ బెక్కుర్ నృపా
లురు: ఖిల్జీకులుఁ డొక్కఁడాదట జలాలుద్దీను దుస్తంత్ర ము
ష్కరుఁ డుండిన ఢిల్లిరాజు శిరమున్ ఖండించి యేత త్పురీ
వరమున్ జేకొని రాజ్య మేలఁ దొడఁగెజా బట్టాభిషిక్తుండునై. 68
క॥ అవల సలాయుద్దీనను
యవనుండు పరాక్రమక్ర మాటోపుఁడు పా
ర్థివుఁ డయ్యె దేశమంతయుఁ
దవిలి వసము చేసికొన సతఁడు గాంక్షించెన్. 69
గీ॥ సమరకోవిదుఁ డతఁడు మాళ్వమును దేవ
గృహమును విహారదేశమ్ముగెలిచి తృప్తి
పడక లయకాలరుద్రుని పగిది వెడలి
యల రణస్తంభపుర దుర్గమాక్రమించె. 70
మ॥ కమలాదేవి రతిస్వరూప యని యాకర్ణించి యాతండు సై
స్యముతో ఘూర్జరదేశ మేగి యనిలోనన్ దన్మహీనాధు జీ
వములన్ బాపి లతాంగిఁ జేకొనియె: నాపై నాసియా మధ్య భా
గమునందుండియు వచ్చి ఢిల్లిపురి లగ్గల్ వట్టి రామోగలుల్. 71
మ॥ ఉరుశౌర్యంబునఁ బెక్కు మాఱులు సలాయుద్దీను మోగల్ రిపూ
త్కరమున్ యుద్ధములందు మార్కొనుచు స్రుక్కన్ జేసి మోదించెఁ బా
ఱిరి స్వస్థానముఁజేర వారు భరతోర్విన్ వీడి ఢిల్లీశుఁడున్
ధరణీరాజ్వము వృద్ధిచేసికొను చందం బెంచుచుండెన్ మదిన్. 72
సీ॥ మేవాడరాజ్య లక్ష్మీనాధుఁడయిన ల
క్ష్మణసింగె బాలుఁడౌ కారణమున
భీమసిం గాతని పినతండ్రి ప్రతినిధి
యగుచు రాజ్యము నేలెనతఁ డశేష
బలశౌర్వయుతుఁడు సింహళరాజ్య మేలు హ
మీరశంకరుని యర్మిలి తనూజ
చతురబ్ది వలిత విశ్వధరిత్రిఁగల తలో
దరులందు మేటి సౌందర్య రాశి
గీ॥ యైన పద్మినిఁ బెండ్లాడె నామె యశము
దేశమెల్ల నిండెను రాజ్యతృష్ణకన్న
నంగనాతృష్ణ యెక్కు డౌ యవనవిభుఁడు
తరుణిఁగోరి చిత్తూరిపై దండు విడిసె. 73
మ॥ ఒకసంవత్సర మాఱుమాసము లలాయుద్దీసు దుర్గంబు సై
న్య కదంబంబులతోడఁ జుట్టుకొనుచున్ సంగ్రామమున్ జేసి యిం
చుక గెల్పొందఁగ లేక తీరని వ్యధన్ శోషిల్ల సాగెన్; లటూం
తకులై పోరిరి రాజపుత్రు లసమానక్షాత్ర దీక్షారతిన్.74
సీ॥ కడకుఁ 'బద్మినిఁజూప విడుతుముట్టడి' ననె
యవనేంద్రుఁ 'డద్దంబు సందుఁజూడు'
మని రాజపుత్రకు లని రలాయుద్దీను
విచ్చేసి సతిఁజూచి వెనుక కరుగు
నప్పుడు భీమసిం గరిగె వీడ్కొల్పుచుఁ
గోటదాఁటఁగఁ దురుష్కులతనిఁ జెఱఁ
బట్టి 'పద్మిని నీయవదలెద' మని రేడు
వంద లాందోళికల్ బయలుదేఱె
గీ॥ వెలఁదిఁ గడసారి దర్శింప భీమసింగు
పంపఁబడె నాతఁ డశ్వంబుపైనఁ గోట
దూఱె యవనుల్ విజృంభించి దూఁకిరపుడు
రాజపుత్రులు పోరి రబ్రంబుగాఁగ. 75
మ॥ స్థిరమౌ సత్ప్రభుభక్తియుక్తి నిజరాజ్జీ మాన సంత్రాణ ధ
ర్మరసావేశము పొంగి పైఁబొరల గోరాసింగు బాదులు సిం
గు రణాగ్రంబున వైరి వీరుల తలల్ గోటానఁ గోట్లున్ వసుం
ధరరాలన్ విహరించి రయ్యెడఁ గృతాంత ప్రాయులై యిర్వురున్. 76
క॥ వీరావేశము పొంగఁగఁ
దౌరుష్క భటాళిఁదగిలి తలలు నఱకుచున్
గోరాసిం గనిఁ బడియెను
వారిధిఁబడి య స్తమించు వనజాప్తు క్రియన్. 77
క॥ బాదూలుసింగు బాలుఁడు
ద్వాదశ వర్షములవాఁడు తౌరుష్కుల శౌ
ర్యోదయుఁడై తునుమాడుచు
నాదిన మొక్కరుఁడె యింటికరుగఁగఁ గలిగెన్. 78
మ॥ అమితోత్సాహముతోడఁ బోరెనఁగఁగా నానాఁడు మేవాడ రా
జ్య మహాసౌధమునందు స్తంభముల యోజన్ బొల్చు లోకైక వి
క్రమ ధౌరేయుల నొక్కఁడేని మిగులంగాఁ బోక సంగ్రామ రం
గమునన్ వీరవిహారముల్ నెఱపి స్వర్గంబేగి రొక్కుమ్మడిన్. 79
చ॥ పడతులు వేవురు గొలువఁబద్మిని వహ్నిని జొచ్చే: వైరులున్
గుడులును రాజసౌధములు గోపురముల్ కొలువుల్ గృహంబులున్
బుడమిఁ బడంగఁ జేయఁ బురమున్ సిరి దప్పె గజంబులున్ జొరం
బడి కలఁపన్ గలంతపడు పద్మసరః ప్రవరంబు చాడ్పునన్. 80
మ॥ అనహుల్ వారయి బూంది దేవగిరి ధారావంతులున్ మారు వా
రును డాండూపుర మాజసల్మియరు గోగ్రన్ దేశముల్ పెక్కు లొ
య్యన నొక్కొక్కఁడుగాఁ దురుష్క నరపాలాధీశ్వరున్ గొల్చి యా
తని రారాజుగ సమ్మతించెఁ బరతంత్రత్వంబుమైఁ గ్రుంగుచున్. 81
అజేయ సింహుని పాలనము
సీ॥ బహుకాలమునకుఁ బూర్వమున రాజస్థాన
వసుధయంతయు భిల్లవంశజులది
దారి దూరముతోలి బప్పరాయ నృపాలుఁ
డధికుఁడై మేవాడ నాక్రమించె
నదిమొదల్ బిల్లుల కారాజపుత్రుల
కణఁగని వైరాగ్ని యతిశయిల్లె
నొకరిదేశము పైన నొకరుఁడు దండెత్తి
పలుమాఱు పోరుట వాడుకయ్యెఁ
గీ॥ శైలవారా మహాటవుల్' కదిసి వేట
సలుపుచో వారువీరును గలిసిరేని
నిరు దెగల నాయకులను నిర్వురో కడకు నొ
కరుఁడొ మడియుట తప్పక జరుగుచుండె. 82
సీ॥ చిత్తూరు రాజ్య మజేయసింహుం డేలు
చుండి యోలగముండి యొక దినమున
నాత్మజుల్ సుజన సింహాజిత సింహులఁ
బదునేను బగునాల్గు వత్సరముల
వారలఁ గని భిల్లపతిమూంజుఁ డెనిమి దేం
డ్లకుముందు వనమున నన్నుఁ దాఁకె
వానిఁ దప్పుకొన నుపాయములేక య
ఱ్ఱాడితి విడక వాఁడట్టె పొదివి
గీ॥ కుంతమునఁ గ్రుమ్మెఁ దలనాటి గొప్ప గాయ
మయ్యె నాయాయువది గట్టిదగుట నెట్లొ
పురముఁ జేరితి నేటికి శిరము నిమురు
చో నిదిగొఁ బెద్ద గుంట చేసోఁకుచుండు. 83
క॥ నాఁ డదరిన యీ గుండియ
నేఁడును దిటవూన దతఁడు నిదుఁర గనఁబడున్
వాడి సగమైతి మూంజుని
గూడిన పగఁ బయికిఁజెప్పుకోన లేకుంటిన్. 84
మ॥ చతురంగ ధ్వజినీపతుల్ గొలువఁగా సన్నాహ సర్వాయుధాం
చితులై మూంజుని గూడెమున్ దఱిసి తచ్ఛీర్షంబు ఖండించి యా
ప్తతతో నాభయ ముజ్జగింపు డనుచున్ దైన్యంబుతోఁ బల్కఁ ద
త్సుతులున్ లేనగ వాస్యబింబముల యందున్ బెల్లు తొల్కాడఁగన్. 85
మ॥ "తనియన్ బిల్లలఁ బాపలన్ గని ధరాధ్యక్షుండపై భోగ భా
గ్యనికాయంబులమాఁగి వృద్దవగు నీవానంద సంపత్తి నిం
టను గూర్చుండుచుఁ బెండ్లిపేరఁటము మాటల్ మాని దుర్వార మృ
త్యునిభుండై చను మూంజునిన్ దొడరఁ బొండో యంచు వేధింతువే.86
ఉ॥ కాటికిఁగాళ్ళు చాచితివి కావలెనన్నను మూంజుతోడి పో
రాటము నీవె చూచుకొను మాడకు కాఱులు నిన్నుఁ జూచినన్
బోటులుగూడ నవ్వెదరుపొమ్మ" ని పల్కిరి చెంత నొక్కచో
నాటలమున్గి పై విషయమంతయు విన్న హమీరసింహుడున్. 87
ఆ॥వే॥ ఆయజేయసింహం ననుజుని కొడుకు ప
దేండ్ల బాలుఁ డటకునేగు డెంచి
చేతనున్న చిన్న సింగాణితో బాణ
సమితితో ధరిత్రిఁ జాఁగి మ్రొక్కి. 88
క॥ 'ఒక యశ్వము నొక కుంతము
నొక ఖడ్గము నిచ్చి పంపుమో తండ్రీ! త
ప్పక చని నే మంజూవి మ
స్తకముఁ దఱిగితెచ్చి యుంతుఁ జరణాబ్దములన్. 89
చ॥ అనుచు నుదారవీరరస మచ్చుపడన్ వచియించు చిన్న నం
దనుని నజేయసింగు గవి "తండ్రి! భవద్వచనంబు కోటి సే
యును చని నీవు పై రిశిరమూడిచి తెచ్చిన యంత సంతసం
బొనరెను నీవుపోవలవ దుండుము నాకడ' నంచుఁ బల్కినన్. 90
మ॥ "ఇదె తండ్రీ! పలుమాటలే నెఱుఁగరెండేమార్గముల్ నాకు నీ
మదవద్వైరిని భిల్లునిన్ దునిమి, తన్మస్తంబును దెచ్చి నీ
పదముల్ చేర్చెదన్ లేనిచో మఱల మేవాడ్దేశమం దెందు నా
పదమున్ మోపక దూరసీమల వసింపగా బోదు" నంచాడుచున్. 91
గీ॥ అంతనొక ఖడ్గమొకకుంత మశ్వముఁ గొని
గాలి కన్న హమీరు శీఘ్రముగఁ బోయెఁ
జనె దినములు పక్షములు మాసములు గడచే
నతఁడు చనుటేరికిని జ్ఞప్తియందెలేదు. 92
సీ॥ కొన్నాళ్లకవ్వలఁ గొండలోయను గద
యట్టి యాయుధ మూని యాశ్వికుండు
చేరరాఁగ నజేయసింహుండు నాతని
కొలువువారును జూడ్కి గొలిపి; రంత
నాహమీరుఁడు బల్లె మవనిపై నిడి తండ్రి
శ్రీపాదముల నమస్కృతి యొనర్చి
"గుఱుతింపు నీమూంజుశిర" మనె ఱేడు పు
త్రకుని ముద్దాడి యెత్తుకొని సింహ
గీ॥ పీఠ మెక్కించి తిలకంబుపెట్టి రాజు
సలిపి నిజపుత్ర యుగము దేశమ్మునుండి
తఱుమఁగొట్టె; ద్వితీయ పుత్రకుఁడు మడిసెఁ
గైలవారా గిరీంద్రి శృంగాటకమున 93
గీ॥ చుక్క తెగిపడ్డ కైవడి సుజనసింగు
వారిలోఁ బెద్దవాఁడు సత్పదము తప్పి
దక్కనున భారతాంబ పాదములఁ బడియె
వాఁడెపో శివాజీరాజు వంశకర్త. 94
గీ॥ సింగపుం గొదమ విధాన సింహపీఠిఁ
జేరి కూర్చిండిన హమీర సింహభూమి
పాలకప్రవరుండు సంవర్త సమయ
ఘన ఘనాఘనగంభీర నినదమరల. 95
సీ॥ "భిల్లులు తఱచుగా వేఁటల కరుదెంతు
రని సాద్రి విపినమం దణఁగి యుంటిఁ
బందిఁ తఱుముకొంచుఁ బరివారములు లేక
మూంజుఁ డొక్కఁడె వనంబునఁ గనఁబడె.
నడిగె "నీవెవ్వఁడవని సన్ను 'నీవెవ్వఁ'
డని యంటి 'మూంజుఁడ' ననెడు నంతఁ
దల నాదు ఖడ్గధారల నూడి యిలరాలెఁ
గుంతంబు కొనఁ దలఁగ్రుచ్చి యెత్తి
గీ॥ శీఘ్రముగ నీపదంబులుచేర వచ్చి
నాఁడ' నన నెల్లరపుడు సంతసము నొంది
రీతఁ డఱువదియును నాలుగేండ్ల దాఁకఁ
బాలన మొనర్చె నవల మేవాడసీమ. 96
చ॥ అతనికుమారుఁడున్ మనుమఁడౌ లఘుఁ, డవ్వల రాజులౌచు శా
శ్వత బహుళాభివృద్ధి కొనసాగఁగ నేలిరి దేశమున్ లఘు
క్షితిపతి 'జావురా" ఖనులసీసము వెండియు లోనుగాఁగ ధా
తుతతులఁ ద్రవ్వఁజేసి తఱితో ధనరాసులఁ జేర్చె మెండుగన్. 97
మ॥ జనకుం డాడిన యొక్క మాటకయి తత్సామ్రాజ్యమున్ దాని ప
జ్జను లావణ్యనిధానమై వెలయు హంసాదేవినిన్ వీడి, త
మ్ముని రారాజు నొనర్చి భీష్ముచరితంబున్ దాఁబ్రదర్శించేఁ జం
డనృపుం డీలఘురాజు పుత్రుఁడు ప్రచండప్రాభవోద్దండుఁడున్. 98
క॥ ముకుళుఁడు లఘురాజు కుమా
రకుఁ డాతని వెనుక నేలె రాజ్యము తత్పు
త్రకుఁడగు విదళిత రిపుహ
స్తి కుంభుఁడౌ కుంభనరపతి శ్రేష్ఠుండున్. 99 99
మహారాణా కుంభుని పరిపాలనము.
మ॥ జనముల్మెచ్చఁగ నేఁబదేండ్లితఁడు రాజ్యంబేలె: మేవాడ్ధరి
త్రిని నయ్యెన్పదినాల్గు కోటలను ద్వాత్రింశస్మహాసంఖ్య యీ
తనిచే నిర్మిత మయ్యె; నన్నిఁటఁగడున్ దార్ధ్యంబు వైశాల్యమున్
గొని యవ్వీర వతంసుపేర నిలుచుఁ గుంభల్ మియర్ దుర్గమున్. 100
సీ॥ మాళవపతి మహమ్మద్ ఖిల్జి వార్ధి త
రంగముల్ వలెఁ జతురంగ బలము
గొలువ ఘూర్జర రాజుఁ గూడి దండెత్తి రా
నొక లక్ష యుత్తమాశ్విక దళంబు
పదునాల్గు వేలుకాల్బలముతో నరుదెంచి
యెదిరించి వారి జయించి మాళ్వ
ధరణీశుఁ దన రధ స్తంభంబునకుఁ గట్టు
కొనుచుఁ జిత్తూర్పురంబునకుఁ దెచ్చి
గీ॥ కాపుగా నైన్యముల నిచ్చికాన్క లిచ్చి
తగిన గౌరవ మిచ్చి స్వాతంత్య్ర మిచ్చి
యెడఁదఁ గరుణకు, జోటిచ్చివిడిచి పుచ్చెఁ
గుంభరాణా సమాను లీక్షోణిఁ గలరె. 101
మ॥ తన సంపూర్ణజయంబుఁ దెల్పఁగ జయస్తంభమ్ములన్ భక్తి పెం
పును సూచింపఁగఁ గోవెలల్ నిలిపే నాబూశృంగ శృంగాటకం
బున; వ్యాఖ్యాన మొకండు వ్రాసి యనయంబున్ గీత గోవిందమున్
జను లాబాలము నేర్వఁజేసెఁ గవితానందైక సంధాతయై. 102
గీ॥ కత్తీ కలములచే రెండు గతులఁ గీర్తి
కాంతఁ గొలిచిన మేటి భూకాంతులందు
నింత దొడ్డవాఁడున్న వాఁడే యటంచు
క్షోణి జనులెన్న మనియె నా కుంభ నృపతి. 103
సీ॥ సాధ్వి మీరాబాయి సౌజన్య ధన్య కుం
భవసుంధరాధీశు పట్ట మహిషి
జగదేక పావిత్య్ర సంపద కీలేమ
పర్యాయపదము గోపాలకృష్ణు
నడుగులు తరఁచి భక్త్యావేశమునఁ బొంగి
యమృత గీతములు పెక్కాలపించె
దన్మాధురుకిఁజొక్కి తలలూఁచి యాతల్లి
స్మరియింప నట్టి యన్నరులు లేరు
గీ॥ ద్వారకాపురి మొదలుగా వారణాసి
వఱకు దేవాలయముల గోపాలదేవు
గూర్చి కీర్తించి యాయమ్మ కూరుచున్న
చోటులను నేఁటికిని గూడఁ జూపుచుండ్రు. 104
-:రాణా సంగ్రామసింహుని పాలనము:-
మ॥ చరితార్ధుండగు కుంభుపౌత్రుఁ డవలన్ సంగ్రామసింహుండు భూ
వరుఁడయ్యెన్ రణమన్నఁ బండుగు వలెన్ భావించు శౌర్యాఢ్యుఁ డీ
పురుష శ్రేష్ఠుఁడు పెక్కు ఘోరసమరంబుల్ చేసి వైరి క్షితీ
శ్వరులన్ గెల్చుచు దేశమందు వినిచెన్ సౌభాగ్య భాగ్యోన్నతిన్. 105
సీ ॥ ఐదువందలు కరు లశ్వంబు లెనుఁబది
వేలు సామంతులు పెక్కుమంది
యనుసరింపఁగ జయయాత్ర సాగించె నం
బరు మారువారు లోఁబడియె గ్వాలి
యరు లోఁగె సజమేరు చరణముల్ గొలిచే శి
క్రియుఁగాల్ని తలలొగ్గి ప్రియము నెఱపె
నారామపురము చెందేరియుఁ బులుమేనె
గోగ్రోను దలనంచుకొనును నిలిచె
గీ॥ నయ్యె నంకితుఁ డాబూ ధరాధి నేత
బూంది దిగులొంది తత్కృపనొందె ముందె
చుట్టు గలదేశములను జేపట్టుకొనుచు
వసుధ సంగ్రాముఁ డేలే వైభవము తనర. 106
మ॥ ముజఫర్ షా యను మాళ్వభూపతి బలంబుల్ గొల్వ పైకెత్తి రా
గజమున్ దాఁకెడు సింహమట్లు తఱుమంగా వాఁడునున్ రాజ ధా
నిఁ జొఱంబాఱె విడంగఁబో కచట వానిన్ బట్టి చిత్తూరుఁ జే
ర్చె జగంబుల్ జయపేట్ట నమ్రుఁడయి యర్థింపంగ వీడెన్ వడిన్
మ॥ స్థిరశౌర్వుండును ఢిల్లివిశ్వపతికిన్ సేనాని బాహాబ లో
ద్ధురుఁడౌ 'ఆలి' సమస్త సైన్యములతో దుర్గంబు రక్షించు చుం
డ 'రణ స్తంభ పురంబు' పై సడచి కోటన్ గెల్చి పేరొందె నీ
భరతోర్విన్ దనకున్ సముండొరుఁడు గన్పట్టం డటం చెల్లెడన్
క॥ అమితబలులు యవనులు తం
డములయి జాక్సారిటీస్ తటంబులఁ గలదే
శమునుండియు భారత ఖం
డముపై దండెత్తి రాఁదొడఁగి రవ్వేళన్. 109
-: బేబరు దండయాత్ర :-
శా॥ ఛెంగిస్ ఖాను కుమార్తె సంతతి జనించెన్ ముందు టైమూరు, స
ర్వాంగీణ స్ఫుటశక్తితో సమర ఖండాధీశుఁడై, దానఁ దృ
ప్తిం గాంచంగనుబోక భారత మహాదేశంబును గెల్చె స
త్సంగుం డీతని రాజ్యమింతని వచించన్ జాల రెవ్వారులున్ 110
శా॥ "టైమూర్లేము” ప్రపౌత్రు పుత్రుఁ డతిశిష్టస్తుత్య సౌజన్య లీ
లామందారము ద్వాదశాబ్దముల కాలంబందె "బేబర్” నృపుం
డై మోగల్ క్షితి నేలఁ బూని రిపుగోత్రాధీశులన్ దాఁకి యు
ద్దామ ప్రౌఢిని వారిఁ బోదఱిమి సంస్థాపించెఁ దద్రాజ్యమున్. 111
సీ॥ “జాక్సారిటీసు” శ్రేష్ఠతమంబె కాని జా
హ్నవియొ లోకైక పూజ్యతకు రావు
'టర్కీ' ప్రశస్త మండలమౌనుగాని, ద
ర్యావర్త మమృత రసాత్మకంబు
‘సమరఖండ’ మతియోగ్యమకాని, ఢిల్లీ పు
రము స్వర్గమునకు స్వర్గమవు తావు
తురకలు స్వజను లౌదురుకాని, భారత
ప్రజలు లోకోత్తర ప్రాభవాంకు
గీ॥ లింటనుండిన విశ్రాంతి యెసఁగుఁగాని
రామమాంధాత లేలిన భూమిగెలువ
ఘనతరై శ్వర్యములు గల్గి గణన గలుగు"
ననుచు బేబరు దండెత్తి యరుగుదెంచె. 112
శా॥ ఆకాలమ్మున ఢిల్లి పట్టణ నృపుండా యిబ్రహీంలోడి తా
నాకర్ణించుచు వీనిరాక దశలక్షానీకినుల్ క్ష్మాస్ధలం
బాకంపింపఁగఁ జేరవచ్చి యని సేయన్ జొచ్చె బేబర్విభుం
డా కాలాంతకుఁడట్లు శాత్రవులఁ జెండాడెన్ మహోదగ్రుఁడై. 113
మ॥ గడియల్ మూఁడగు నంతలో రణము తగ్గన్ సాగె నాయిబ్రహీం
పడియెన్ సేనలు భిన్నధాండగతులన్ బ్రాపించె; బేబర్ మహీం
ద్రుఁడు ఢిల్లీపురి నాక్రమించుకొనె హిందూదేశ సర్వస్వ మ
ప్పుడు దాసోహ మటంచుఁ దత్పదయుగంబున్ గొల్చె నిర్వీర్యమై.114
-: సంగ్రామ సింహునితో - బేబరు యుద్ధము. :-
మ॥ అరులన్ గెల్చుచు సార్వభౌముఁడయి రాజ్యంబేలి సంగ్రామ భూ
వరు సంగ్రామ తలంబునన్ గెలిచి మేవాడ్దేశము జేకొనెన్
ద్వరమై నుగమృగేంద్ర వీర్యులగు యోధ శ్రేష్ఠులున్ గొల్వఁగా
నరిగెన్ బేబరు' సూర్యవంశమణి యుద్ధాయత్తుఁ డయ్యెన్ వడిన్. 115
సీ॥ డోంగరీకుఁడు బలోత్తుంగుం డుదయసింగు
రత్నసింహుడు సలుంధ్రావిభుండు
రణమల్ల నృపుఁడు మార్వారు నాయకమౌళి
మేత్రావిభుండగు క్షేత్రసింగు
ఝాలానృపాలుఁ డుజ్జయసింగు, సోనెగు
ఱ్ఱమహీంద్రుఁడైన యారామదాసుఁ
డల ప్రమరుండు గోకులదాసు చంద్రభా
నుండు మాణిక్య చంద్రుఁడు శిలాదుఁ
గీ॥ డును, హుసేని బ్రహీం సాహితనయుఁ డొకఁడు
స్వామి సంగ్రామసింహు వెంబడిని బోరి
చచ్చుటో గెల్చుటో వేఱుజాడలే ద
టంచు సేనలతో వచ్చిరని యొనర్ప 116
సీ॥ రెండు వాహినులు కార్తీక శుద్ధ పంచమి
నా బయానా ప్రాంతమందుఁగలివె
రాజ పుత్రస్థాన రాజు లందఱు వెంట
నడువ సంగ్రాముఁ డున్నత పరాక్ర
మము మీఱ యవనసైన్య ముఖాగ్రభాగంబు
చించి చెండాడి శోషిల్లఁ జేసె
బేబరు తనసేన వెనుకకుఁ ద్రిప్పి ద
స్యు శ్రేణి పోటుకాచుకొని నిలిచెఁ
గీ॥ క్రొత్త నేనలఁ చెప్పించుకొనియె నవియుఁ
లను బిరంగుల ముందడికొనుచు మౌన
నియతిఁ బదునేను దినములు నిలిచియుండె. 117
శా॥ వీరావేశము పొంగి రక్తముడుకన్, వేమాఱు తత్తచ్చ మూ
వారంబున్ దరిఁజేరి బేబరు రణోపన్యాసముల్ చేసినన్
గారాకైనను డుల్లకుండె జయముల్గాంక్షించి యెన్నెన్నొ వ్యా
పారంబుల్ బొనరించి నిస్పృహ జనింపన్ డీల్పడెన్ బెల్లుగన్. 118
గీ॥ తన బలముఁ దూఁచు గెలుపుకై కనులు వాచు
నాప్తతతి నేచు దిగ్గన నట్టె లేచు
విసివి తలరాచుఁ జేతులు వెలికిఁజాఁచు
నకట! బేబ రెవ్వఁడు గాచుననుచుఁ జూచు.119
సీ॥ తన ప్రయత్నము లన్నియును నిష్ఫలంబైన
దైవంబు స్మరియించి త్యాగ మెంచి
తా ననుదీనమును ద్రాక్షారసముఁ ద్రావు
రజత సౌవర్ణ పాత్రముల నేల
విసరి తున్కలుచేసి పెంకులు బైరాగు
లకు బీదలకు యోగులకును బంచె
నాక్షణంబుననుండి యాసవ మనుచరుల్
దాను ద్రావక యుండమాని వేసె
గీ॥ నవలఁ దనయేలు బడినున్న యవనరాజ్య
ములజల పన్నులొక కొన్ని తొలఁగఁజేసె
దైన్యమును భయమునె కాని ధైర్యమొసఁగు
పలు కొకండేని వినరాక పలవరించె.120
మ॥ నెలలెన్నో గమియించెఁ బేబరు మదిన్ భీతిల్లుచున్ ఢిల్లి మం
డలమున్ దాటకయుండునట్లును బయానాసీమయున్ గొన్ని ల
క్షలు కప్పంబు నొసంగు నట్లు నిఁక సంగామేంద్రుతో యుద్ధముల్
నిలుప బోయెడునట్లు సంధికిఁ బ్రయత్నించెన్ మనస్ఫూర్తిగన్ 121
క॥ ఈయత్నము విఫలంబై
పోయెఁ దుదకు సామదానములఁ గాని పనిన్
.
జేయఁ దలఁచె యవన మహీ
నాయకుఁడును ద్రోహబలమునన్ మది నిడుచున్. 112
గీ॥ స్వామి పదసీమఁ దెగి నిజప్రాణమైన
ధారపోయు పవిత్ర హైందవులయందు
నకటకట! శిలాదుఁడు గాక యన్నముఁ దిను
నాతఁ డెవఁడు స్వామి ద్రోహమాచరించు. 123
గీ॥ కడపటి దినంబు నిరు మొనల్ గలిసి నపుడు
బలముతో శిలాదుండు బేబరును గలిసె
నని తుముల మయ్యెఁ బెక్కుఁగాయములు తగిలి
యవల సంగ్రాముఁ డరిగె సైన్యములు విఱిగె. 124
మ॥ కడుఁదీక్ష్ణంపుఁ బిరంగి గుండొకఁడు మోకాలన్ బ్రవేశించె; మం
డెడు నుగ్రంపుఁ దుపాకిసోఁకి కనులూటిన్ జెందె నెమ్మేనిపైఁ
బొడమెన్ గాయము లెన్బ దిట్లు రుధిరమ్మున్ జిమ్మి పుష్పించి యుం
డెడు బంధూక మహీజమున్ దెగడె క్షోణీనేత సంగ్రాముఁడున్. 125
మ॥ "చనఁ జిత్తూరికి గెల్పులేక" యని బుస్సాప్రాంత మందుండె; న
ప్పెను గాయంబులఁ జేసి శక్తిచెడి నిర్వీర్యంబునైదేహ మ
జ్జన నాధేశ్వరుఁ డొక్క వత్సరమునన్ స్వర్గస్థుఁడయ్యెన్ విక
ర్తనుఁ డస్తంగతుఁడైన కైవడిఁ బ్రజల్ దైన్యంబునన్ గ్రుంగఁగన్. 126
క॥ అరి రాజాంతకుఁడగు బే
బరు సంగర జయము నొంది ధారత ధరణీ
శ్వరులకును రాజరాజయి
పరిపాలింపన్ దొడంగె వసుధా తలమున్.127
చ॥ ఒకసమయంబు నందు హుమయూనును వ్యాధియు సోకి యంత కం
తకుఁ జెలరేఁగె' బేబరును “నన్గొని నాసుతుఁగావు దేవ" యం
చకుటిల బుద్ధి వేఁడుకొనె నట్టులె వ్యాధియు వాని సోఁకి పు
త్రకుఁడును వ్యాధిఁ బాసె. నొకరాతిరి ప్రాణము వాసె బేబరున్ .128
క॥ ఘనశౌర్యుఁడు సంగ్రాముని
వెనుక నతని సుతులు రత్నవిక్రమ సింహుట్
మనుజేంద్రులై మహీతల
మును బరిపాలించి రధికమోదము తోడన్. 129
మ॥ అనలాస్త్రంబులు వాడినన్ జయము తధ్యంబంచు నావిక్రముం
డును గొన్నింటిని దెచ్చె వీరభటు లెంతో మూర్ఖులై వీనిఁజే
కొన మశ్వంబులనుండియున్ దిగము నీకున్ గూర్చు నెవ్వానినై
న నియోగింపుము వీనిఁబూన్ప' మని మందప్రజ్ఞులై యాడుున్.130
←◆చిత్తూరు - రెండవ ముట్టడి◆→
చ॥ పెడమొగమైన నన్యులను విక్రముఁడున్ నియమించె సేనలున్
జెడె నిరుపాయలై యొకరినిన్ మఱి యొక్కరు మెచ్చకుండ నీ
దుడుకుఁదనం బెఱింగి బహదూరను ఘూర్జర దేశ భర్తయున్
వెడలె మహాచమూ తతులు వెంటఁ జనంగను జిత్తురిన్గొనన్.131
మ॥ తనుశత్త్రుండొకఁడిప్డు చిత్తురుపయిన్ దండెత్తునన్ మాట శ్రో
త్రములన్ సోఁకిన రాజపుత్ర నృపతుల్ దౌదవ్వు లందుండి సై
న్యములన్ దోడ్కొని వచ్చి రొండొరువు లంతర్భేదముల్ లేక డెం
దములన్ జిత్తురనంగ నెంత యభిమానంబున్నదో వారికిన్.132
సీ॥ రౌద్రకేసరి కేసరముల నుయ్యెల ల్యూగు
నతిబలాఢ్యులు దేవరాధిపతులు
కులపర్వతముల ఢీకొని పిండిగాఁజేసి
యంబుధిఁ గలుపు ఝూలావనీంద్రు
లుంకించి తాఁకిన సుర్వీతలంబుపై
కెగిరించు సోనెగుఱ్ఱేశ్వరులును
ఫాలాక్షతో మెడపట్టులు పట్టి గె
ల్వంగఁజాలిన హరవంశ్యమణులు
గీ॥ జగము సర్వసంహారంబు సలుపఁ గలుగు
నసమశౌర్యులు చోండావ దన్వయులును
నడచు సంద్రంబు లనఁగ సైన్యములఁ గొనుచు
వచ్చి చేరిరి చిత్తూరు పురవరంబు. 133
గీ॥ పదము వెన్క మఱల్పని పటు పరాక్ర
మైకధన్యులు గొలువ సురేశ మల్లు
సుతుఁడు “భాగ్జీ ” తరలి వచ్చె నితడు బాడ
బానలముఁ బాఱమ్రింగు మహాభుజుండు. 134
గీ॥ అఖిల జగముల లోని శౌర్యంబు ముద్ద
చేసి దుర్గంబునిండ నుంచినను గానీ
క్రూరులగు పరంగుల పిరంగులకు ముందుఁ
దూఁచుకొన రాయి నిలుచట దుర్లభంబు. 135
సీ॥ లాబ్రిఖాన్ బిరుద మలంకరించెడు ప్రోడ
గోతులు త్రవ్వించి, కూరి మందు
వహ్ని రవుల్ కొల్పి పగిలించె నీతండు
బహదూరుసాహి సేవలను దనుపు
బుడుతకీచు పరంగి ముందు 'వాస్కోడిగా
మా వెంట నరుదెంచె మందుగుండు
పరగించి యగ్ని పర్వతముపొంగిన యట్లు
పొంగించి బహుదుర్గములను గూల్చె
గీ॥ వైరి దుర్భేద మైన చిత్తూరికోట
దక్షిణపు గోడ డుల్లి రంధ్రంబు వడియె
నూర్ణీత జగన్నుత పతాక్ర మార్జునుం డ
రాతులను దానికి యర్జునరావు మడిసె.136
గీ॥ ఐదువందలు హర వంశ్యులతనితోడఁ
బడిరి మధ్యాహ్న మార్తాండు పగిది మండి
యరులఁ దాఁడి దుర్గారాయఁ డస్తమించె
నఖిల చోండావదన్వయు లనుసరింప. 137
గీ॥ ఆవల దేవరభటులు ఝాలాన్వయులును
జీవము లొసంగి రంత భాగ్జీయు వచ్చి
ప్రళయ కాలాంతకుని బోలుభటులఁ గూడి
కదన మొనరించి పండె నాగండి దండ. 138
సీ॥ తరువాత రాజమాతయు జవాహిరిబాయి
రాఠోడుసుత తనుత్రాణ ఖడ్గ
ములనూని యాస్థలంబునఁ బోరిమడిసె, న
వ్వెలంది కీర్తిని జరిత్రల సువర్ణ
పరమాక్షరముల వ్రాసిరి పూజ్యులాది నం
బంతలో దుర్గ మావంత యవల
విఱిగె లోపలి వీరవరుల సంఖ్యయుఁ దగ్గె
నుదయసింహ కుమారుఁడొకఁడు తప్ప
గీ॥ రాజ వంశమంతయు రణాగ్రమున మ్రగ్గె
నతని సురధాని రాయల కప్పగించి
వెలికి దాఁటించి మిగిలినవీరు లొక్క
స్థలము చేరిరి కార్యనిశ్చయము కొఱకు. 139
సీ॥ గందంపు మంచిచెక్కల నొక్కపోవుగాఁ
గూర్చి తైలముపోసి కుప్పలుగను
గర్పూర రజము పైగప్పి యగ్ని రగిల్చి
వెలఁదులు పదమూఁడువేల మంది
జలకంబు లాడి దువ్వలువలు సొమ్ములు
దాలిచి పూచిన తంగేడు లటు
వెడలి పెండ్లికిఁ బోపువిధమున గుంపులై
చిఱునవ్వు మోముల సిరులు నింప
గీ॥ బంగరు, సలాకలట్లు పావకునిఁ జొచ్చి
రీవెలఁదులఁ గర్ణావతీదేవి నడిపె
నామె యుదయసింహకుమారు ననుఁగుఁదల్లి
దుర్జయార్జున రాయనితోడఁ బుట్టు. 140
మ॥ తమ కాంతామణు లెల్ల వహ్నిఁబడి మందన్ దేవరస్వామి దు
ర్గము నందుండిన యోధులన్ గొనుచు సూర్యద్వారమున్ దీసి సిం
హము మాడ్కిన్ వెలిఁ దూఁకి శాత్రావులు చీకాకొంద వర్తించి సై
న్యములున్ దానును సర్వశూన్యముగ నంతంబొందె నవ్వేళలో. 141
కర్ణావతీదేవి తనకు సాయపడుమని హుమాయూను నర్ధించుట
చ॥ దురము భయంకరం బగుచు దుర్గము నిల్వదటంచుఁ దోఁచు ముం
దర నవరత్నసంతతులు దాఁపిన తోరము రాజ్ఞి ఢిల్లీ భూ
వరుకడ కంపె; గష్టములువచ్చిన యప్పుడు రాజపత్ను లీ
కరణి నొనర్చి సాయమునుగాంచుట వాడుకయై తనర్చెడున్. 142
సీ॥ పరిసర గ్రామ సంవాసినులగు వెలం
దులు వేయిమంది యాతోరము నొక
కనకపుం బళ్ళెరంబున నుంచి పూవు ల
క్షతలను బెట్టి పూజల నొనర్చి
నడచుచు వెళ్ళి యందఱు ఢిల్లిఁ జేరిరి
హుమయూను వంగదేశమున నుండె
నటకేగి దర్శించి రతఁడు హర్షించి హ
స్తమున రక్షాబంధనము నొనర్చి
గీ॥ "సారసదళాక్షు లార యీతోర మంది
నపుడె కర్ణావతీదేవి కన్న నైతి
నామె నాచెల్లె లుదయసిం గల్లుఁడయ్యె
వారిసేమమె నాసేమమై రహించు.143
గీ॥ భువన వంద్యుండు సంగ్రామభూప మణికి
ముందు మాతండ్రి కూర్చినకుందు దీఱ
నతని దేవేరినిఁ గుమారు నాదరించి
నామొగల్ వంశమును బావనం బొనర్తు.144
గీ॥ అఖిల నృపులకుఁ బాదుసాయనుట కన్న
రాజపుత్ర మహాదేశరాజ మాత
కన్న యనుటయె కడుగౌర వాస్పదంబు
పయనమై వత్తు బహుదూరుపంచి పుత్తు.145
మ॥ స్ఫురదిందీవర నేత్రలార! యిదె నాపుణ్యంబు వర్ణింపఁగాఁ
దరమే! నేఁటివిపత్తు దీర్చుటకు నింద్రప్రస్థమేయైన భా
గ్య రమాక్రాంతము నాదు రాజ్యమయినన్ గాదేని నాప్రాణ మా
పరమోత్కృష్టగుణాఢ్య పాదము కడన్ భక్తిన్ సమర్పించెదన్ 146
మ॥ ధర పుట్టొందిన దాది నిందనుక నే తౌరుష్క భూపాలుఁడీ
భరతోర్విన్ బడయంగఁ జాలని కడున్ బ్రత్యేక మర్యాద కా
కరమైతిన్! భువన ప్రపూజ్యయగు నా కర్ణావతీదేవి స
చ్చరణాబ్దంబులు జన్మజన్మమును నే సద్భక్తి సేవించెదన్" 147
మ॥ అని అత్యుత్తమ భక్తి భావరతితో నవ్వారి పాడింబులన్
దన శీర్షంబిడి మ్రొక్కి వీడ్కొలిపి యాధన్యాత్ముఁడున్ జైత్రయా
త్రను జాలించి యపార సైన్యసముదగ్రక్షాత్ర విస్ఫూర్తి బో
రన బృహ్మాండము వ్రక్కలై పడఁగఁ జేరన్ బాఱె ఢిల్లీ దెసన్. 148
మ॥ చని వైనంబునెఱింగి యక్కటకటా! సర్వంబున్ మించి పో
యెను! దుర్గం బరిచేతఁ జిక్కెను బలంబెల్లన్ నశించెన్ గృపా
ఖని నన్గోరిన దొడ్డతల్లియగు నాకర్ణావతీదేవి యే
మని చింతించెనౌ! మందభాగ్యునకు నేలాదక్కు తత్సేవనల్. 149
మ॥ అకటా! సూర్యుఁడు వంశకర్తయఁట క్షీరాబ్ధిన్ వలెన్ బూజ్యమై
యకలంకంబగు గొప్పవంశమఁట ధన్యాత్ముండు సంమ సిం
హు కుటుంబంబఁట! సుంత సాయపడఁగా నొక్కింత తావున్నఁ బా
యక మత్కీర్తి వెలింగియుండు గద బ్రహ్మాండైక సుస్థాయిగన్ 150
సీ॥ ఆతల్లి బదులు తదాత్మజుఁ గొలిచి దే
హము ధన్య మొనరింతు నని తలంచి
చిత్తూరుపురి విసర్జించి ఘూర్ఖర మేగు'
మని బహదూరున కాజ్ఞఁబంపె
నామూర్ఖుఁడు తదాజ్ఞ నౌదలఁ దాల్పక
సమర సన్నాహమున్ జరుప దొడఁగె!
బాదుసా తుదిలేని బలములతో దుర్గ
మును నాల్గువైపుల ముట్టడించె!
గీ॥ నా మహాసేనఁ జూని, భయంబు లేని
నీరు సోఁకు నుప్పువలెఁ గన్పింప కేగె
బలముతో బహదూరు మాధ్వమును ఘూర్ణ
రము హుమాయూన్ జయించె సైన్యముల నుంచె 151
గీ॥ పూన్కి చెడి దేశములు వట్టిపోయి నట్టి
వెకలి ఎక్రమ సింహుని వెదకి తెచ్చి
సింహ పీఠిఁ బునఃప్రతిష్ఠితుని జేసి
దీవెనలు పోసి ఢిల్లీకిఁ దెరలిపోయె. 152
సీ॥ జననమో పటుతురుష్క నృపాల కులమున
భావమో రాజ్య సంపాదనంబు
ప్రాయమో సకల ప్రపంచంబు తనదని
పోరాడ వలసిన పూర్ణ వయసు
అరిది రాజస్థాన మాకర్షకము కాని
రాణి యర్ధింప సౌభ్రాత్ర మూని
వంగభూమిని దనపని మాని యొక వేయి
మైళ్ళేగుదెంచి ధర్మము వరించి
గీ॥ స్వకులు బహదూరు శిక్షించిపంచి దేశ
మందు భయమును డించి సౌఖ్యంబు నించి
వట్టి చేతులు వెనుకకువచ్చె నెట్టి
సరళ హృదయుండొ హుమయూను చక్రవర్తి. 153
-:మేవాడకు వనవీరుఁడు పాలకుఁడగుట:-
మ॥ ఒకయేడాదిగ రాజ్యమేల్కొనెనొ లేదో యెల్లసేనాధినా
యకులన్ బాధల ముంచె నీకృతి సలుంబ్రాధీశుఁ డాత్మగా సహిం
పక రాజ్యచ్యుతుఁజేసి విక్రముని మేవాడ్దేశ మేలంగఁ బూ
నికమీఱన్ వనవీరుఁ దెచ్చి నిలిపెన్ సింహాసనం బందునన్. 154
సీ॥ వనవీరుఁ డవని పాలన మశాత్రవము సే
య సుదయసింహుఁ గూల్పను దలంచెఁ
బున్నాయనెడి దాది ముందెంట్లొ సడినట్టి
యొకపూల బుట్టలో నుదయసింహు
నుంచి భటులవెంట నూరివెల్పలికంపి
తనపుత్రునుంచెఁ దత్థ్సానమందు:
వనవీరుఁ డుదయసింహుని జూపుమని వచ్చెఁ
సతి నిజాత్మజుఁ జూపె నతఁడుపొడిచె
గీ॥ బుత్ర శోకంబు దిగమింగి పున్న వెడలి
స్వామి నొడినుంచి దేశ దేశములు తిరిగి
వర్తకుం 'డసాసా' కడ వానిఁ జేర్చి
సకల లోకైక విఖ్యాతి సంతరించె! 155
క॥ తను నెంత కాచి కుడిపినఁ
దనసుతుఁ బరుసుతుని కొఱకు దారుణ ఖడ్గం
బునఁజీల్పఁ గనిన వెలఁదుల
వినియుంటిమె పున్నదక్క వేఱొకదానిన్. 156
క॥ వనవీరుఁడు దాసీనం
దనుఁడును హంతకుఁడు సాహిదా పర్హుండౌ
జనపతి లేమి మహీ పా
లన మతఁడొనరింప నెగ్గులన్ గనకుండెన్.157
ఉదయ సింహుడు రాణాయగుట.
సీ॥ పాలించె నతఁడు మేవాడ్దేశ మైదేడు
లొక వత్సరము వసంతోత్సవములు
సకల వైభవముల సాగు పిదప వన
వీరుఁడు సామంత విభులఁజేర్చి
కోసుఁడు ప్రసాద మంచని తొందరించె, స
లుంబ్రాధిపతీ కోపలోహితుఁడయి
యఖిల ప్రజాగణం బభినుతుల్' నేయంగ
వాని సింహాన భ్రష్టుఁజేసి.
ఆ॥ వే॥ యుదలకు సింహుఁ దెచ్చియుర్వీశ్వరుని జేసె
సోనెగుఱ్ఱ విభుఁడు సుగుణరాశి
యఖిలసింహుడు సుత నా కరుణాదేవి
విభవ యుక్తి నొసఁగి పెండ్లి చేసె. 158
సీ॥ విలయ రణక్షేత్రముల సర్వ సేనాధి
నాధుఁడై యెవఁడు సైన్యముల నడుపు
నఖిల సామంత గోత్రాధీశు రెవ్వాని
యాజ్ఞ లౌదఁల దాల్చి యవధరింత్రు
నృపమౌళి రాజధానినిదాఁట రాణివా
సము రాజ్య మెవని పోషకత నిలుచుఁ
బరమ శిశోదియాన్వయ భూపతుల నిల్ప
నడఁప నెవ్వాడు సర్వాధికారి
గీ॥ యెవని యనుమతిలేక ధాత్రీశుఁ డష్ట
సచివు లుద్యోగులెల్ల మాషప్రమాణ
మవని దానంబు చేయ యోగ్యతయె కాంచ
రతఁడు సామాన్యుఁడే సలుంబ్రాధినేత 159
మ॥ పదమూఁడేడుల చిన్ని లేవయసు మేవాడ్రాజ్య భారంబునున్
గుదురై మోచేడు వీరులెందఱో నిజాంఘ్రుల్ గొల్త్రు ఢిల్లీశుఁడున్
సదయాంతః కరణుండు నేర్పుమెయి రాజ్యంబేలు నాసక్తి పెం
పొదవన్ బోక జడాత్ముఁడై యుదయసింహుండుండె భోగాప్తిమై. 160
మ॥ సమరోత్సాహము లేదు విక్రమకళాసంపత్తియు లేదు దు
ర్దమ ధైర్యోన్నతి లేదు చిత్తురు మహారాజ్యంబు పాలింపఁ బూ
జ్యమయౌ సద్గుణ మొక్కఁడేనియు రహించన్ బోదు వైయాఘ్ర గ
ర్భమున మేఁక విధంబునన్ బొడమె సంగ్రామేంద్రు గర్భమునన్.161
మ॥ ఉదయాస్తాచల మధ్యగంబగు జగంబుఱ్ఱూఁత లూఁగించె బె
ట్టిదుఁడౌ పుత్రుఁడు ఘోర సంగర కిరీటిప్రాయుఁడై కీర్తి సం
పద నార్జించెను తండ్రి యెట్లితఁడు మేవాడ్రాజ్య మందార శా
ఖిఁ దినన్ జొచ్చిన పుప్పియట్లు వొడమెన్ గీర్తిన్ గళంకించుచున్.162
చ॥ వరుసగ ముప్పదేం డ్లి తఁడుపాలనమున్ బొనరించె నందులో
నిరువదియైదు శాంతముగనెట్టులొ సాఁగె ననంతరమ్మునన్
ధరతరముల్ తపింపఁగను దారుణ ఘోర విపత్తు దేశమున్
బొరిగొని గౌరవంబు నుడిపోవఁగఁ జేనె నరుంతు దమ్ముగన్ 163
మ॥ అనఘున్ విక్రమసింహు భూరమణుఁ జేయన్ గల్గి ఢిల్లీపురం
బున కేగెన్ హుమయూను వంగమున రాణ్ముఖ్యుండు సామంతుఁడై
చను షేర్ఖాను స్వతంత్రరాజ్యమును సంస్థాపింప యత్నించి నా
డను వార్తల్ విని పాదుషా వెడలె సైన్యాయత్తుఁడై వానిపై.164
రాజ్యచ్యుతుఁడై హుమాయూను కడగండ్లు పడుట.
ఉ॥ అంతములేని సైన్యముల నంబుధిచాడ్పున నిల్పియున్న సా
మంతుని దాఁకి పోరుట ప్రమాదకరంబని సంధిఁగోరి వృ
త్తాంతమునంపె షేర్కులుఁడు తానును సమ్మతిఁజూపెఁ గ్రుంకెఁ బొ
ద్దంతట రెండు సైన్యములు నచ్చట నిల్చెను నిద్రం నొందగన్.165
చ॥ కొసరి కసాయి మేకలను గొంతులు గోయు విధాన మారియుశా
మసఁగినయట్లు మృత్యువును నాలుక సాఁచిన భంగి డిల్లి సై
న్యసమితి పైనవ్రాలి తునుమాడఁగఁ జొచ్చిరి నిద్రవోవు చుం
డు సమయమందె వంగసుభటుల్ తమనాథుని యాజ్ఞ పెంపునన్.166
మ॥ హుమయూ నంతటఁబాఱె ఢిల్లీదెస కత్యుగ్రుండు షేర్ఖాన్ ససై
న్యముగా వెంటనుఁదాఁకె నేమియును జేయలేక యందందు మా
ర్గమున జిక్కిన వారిఁ జేర్చుకొని పాఱన్ జొచ్చెఁ బాంచాల దే
శము డాయంగనె రెండు సైన్యములకున్ సంగ్రామ మయ్యెన్ వడిన్. 167
సీ॥ రణమంచు వినిన మరణమంచు బెదరి ది
ఙ్మార్గంబులకుఁ గొంతమంది నడువ
సమదశాత్రవ పరాగము దృష్టిగతమైన
మది కలంగియుఁ గొంతమంది పాఱ
విమతసైన్యము దర్శనము దండధరదర్శ
నంబని యడలి కొందఱు తొలంగ
మొదటి పిరంగి చప్పుడయి నంతనే గుండె
లవిసి నీరయి కొంద ఱవలి కుఱుుక
గీ॥ నా హుమాయూను త్రోవలో నడ్డమైన
జనులఁ జేర్చి చేకూర్చిన నైన్యమెల్లఁ
జేయి జారిన కడవయై ఛిన్న మయ్యె
షేరుఖాన్ ఢిల్లీ పట్టాభిషిక్తుఁ డయ్యె 168
మ॥ చమువుల్ లేక మహామహీవలయ రాజ్యం బూడిపోవంగ నా
హుమయూనున్ వెనువెంటనే తగిలి లాహోర్ దాఁకఁ బోనీక నై
న్యములన్ దోడ్కొని షేరుఖాను దఱిమెన్ వాఁ డంతటన్ దేశ దే
శముల గ్రుమ్మరే నేచ్చటేనిఁ దలఁదాచన్ వచ్చు నంచాసతో. 169
మ॥ స్తిమితత్వంబు వహింపకేగి యొకచో 'షేకల్లి' యక్ బార సీ
కమహాయోగిని గాంచి యాతఁ డడుగంగాఁ దెల్పె నాత్మీయ వృ
త్తముఁ దత్సన్నిధి నున్న వానిసుత 'యుద్వాహమ్ము గావించు కొం
దు మహాభాగుని వీనినే నన నతండున్ వానికిచ్చెన్ సుతన్ 170
సీ॥ ఏలుటకు మహా మహీవలయము లేదు
కొలువు సేయఁగ భటకోటి లేదు
కాంచనాదిక ధనగ్రామంబులును లేవు
సముదార దివ్యభోగములు లేవు
వసియింపఁగా దొడ్డభవనంబులును లేవు
తాల్ప ననర్ఘ వస్త్రములు లేవు
వాహ్వళి యొనరింప వాహనంబులు లేవు
శ్రమ దీఱ గంట విశ్రాంతి లేదు
గీ॥ కేవలము హుమాయూన్ పడుక్లేశ మెంచి
మనసు గరగించు సౌజన్య మహిమ నెంచి
కోరి యర్ధాంగమును బంచుకొనియె నెట్టి
పావనాత్మికయో హమీదా వధూటి. 171
మ॥ వనిత యోధులఁ గొంచు యోధపురికిన్ వచ్చెన్ దలన్ దాఁప వ
ద్దనెఁ దన్నేత జసల్ మియర్ ప్రభువు పొమ్మంచాడె మార్వార్ నృపుం
42
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
డును బంధింపఁగఁజూచెఁ గొన్ని నెల లిట్లున్ జెల్ల రారాజు దూ
ఱెను దూరమ్మున సింధుదేశపు టెడారిన్ దైవమున్ దూఱుచున్ . 172
సీ॥ వైశ్వానర జ్వలజ్జ్వాలా సమూహంబు
చిమ్మి సూర్యుఁడు ప్రకాశించు చుండ
నుర్వీతలంబెల్ల నుఱ్ఱూఁతలూఁగ జృం
భించి వాయువు పెల్లు వీచు చుండ
సుడికట్టి మండుటిసుక లేచి మిన్నంది
వ్రాలి ప్రాంధుల ముంచివైచు చుండఁ
బెక్కు యోజనములు వెడలిన నాల్క పై
జేర్పఁ జుక్కయు నీరుచిక్క కుండ
గీ॥ నరులు దఱుమంగ ననుచరు లంత మొంద
స్వర్ణసౌధంబుల వసించి పరమ సుఖము
మీఱఁదగు నిండుచూలా లెడారి యందు
నా హమీడా లతాంగి ట్లరుగ నేర్చె. 173
గీ॥ రాచఱక మది బరువయ్యె రాజమౌళి
కనుచరత్వంబు బరువయ్యే సనుచరులకు
నున్న వారెల్ల బరువైరి యొంటియలకు
నొక హమీద మాత్రము చలింపకయె నిలిచె. 174
మ॥ హుమయూ నెక్కిన యొంటెయున్ మడిసె నత్యుగ్రాతపవ్యాప్తిఁ గూ
రిమి భుృత్యుండని యొంటె నిమ్మనుచు ‘టార్డీబేగు' నర్థించెఁ గ్రూ
రమతిన్ వాఁడు తిరస్కరించి చనె; నింద్రప్రస్థ రాజ్యంబుఁ బూ
ర్ణముగా నేలినమేటి నీరమున కన్నన్ బల్చనయ్యెకా గటా. 175
గీ॥ తురక ఱేనికిఁ గష్టముల్పెఱిగెఁ గాని
పెక్కు విశ్వయత్నములు సల్పినను గాని
కానరాదయ్యె వట్టి వెక్కసము తక్క
నిండుదప్పి నార్పగ నొక్కనీటిచుక్క. 176
గీ॥ చూలుపండిన యా హమీదా లతాంగిఁ
జిచ్చు టెండ కెడారిలోఁ దెచ్చు టెల్లఁ
బూపపిందెల క్రొమ్మావి మొక్క నకట
తీవ్ర దావాగ్నిలో నీడ్చి తేచ్చుటయ్యె. 177 177
పీ॥ తడిలేక యెండి కొఱడుగట్టి నాల్క నా
భినిజేరి దిగగుంజు కొనుచుఁ బోవ
నెంతేనిఁ జలియించి హృదయకోశం బట్టె
కుత్తుక కెకతొట్టు కొనుచు రాఁగ
మెదడు నీరసమయి ప్రిదిలి పైత్యోద్రేక
మునను బ్రలాపసంధిని వెలార్ప
క్షితితలంబెల్ల మ్రింగినఁగాని తీరఁబో
దనిపించు మరణ వేదన కలంప
గీ॥ నున్న కష్టంబులట్టులే యుండ యవన
భటులు దాహమార్పఁగ నీరు వడయలేక
పిచ్చి యెత్తుచుఁ గేకలు వేసికొనుచు
బాఱి రెల్లేడ నిసుక యెడారినడుమ.178 178
వ॥ కనిరొక బావివేఁకువను గన్నులపండువుగాఁగ! దాన మో
ట నిడి జలంబు దోలేడు నెడన్ వడి నెడ్లను దోలుకొంచుఁ బో
వు నతని కొక్కచోఁబయికి బొక్కెనవచ్చెనటన్న మాటలున్
వినఁబడఁబోమిఁ బెద్ద రణభేరిని గొట్టు టవశ్యమై తగెన్. 179 179
సీ॥ అతిదాహమున నోరు లట్టె తెఱచియున్న
జనులు బొక్కెన నూతి కొనను నిలిచి
నిలువకమున్నె దానిపయిన్ బడి జలంబుఁ
ద్రావఁబోయిన యంతఁ ద్రాడు దెగుచు
బావిలో బొక్కెన పడే దానివెంటఁ గొం
దఱు నూతఁబడిరి కొందఱు మహోగ్ర
తాప మోర్వక సైకతస్థలిఁ బడి మ్రగ్గి
రికఁ గొందఱానూతి నెక్కి దూకి
గీ॥ రంతఁ గొందఱు చేది తోయమ్ముఁద్రావి
గుండె బరువెక్కి కూలిరి కొందఱెట్లొ
'యమరకోట'కు నాఁటి సాయంతనంబు
నడచి కన్గొని రచటి రాణాప్రహారు. 180
అగ్బరు జననము
మ॥ మనూజాధీశుఁడు వారినందఱును సన్మానించె సౌఖ్యం బెల
ర్పను; నైదు బది వందలున్ నలువ దాపైనింక రెండైన యే
టను నాకార్తిక జీవవారము హమీడాబాను బేగంబు పు
త్రుని నీళ్లాడె నుదాత్త లక్షణయుతున్ దుర్వార తేజోన్నిధిన్ 181
శా॥ పెద్దల్ గోత్రజు లక్కుమారకునకు బ్రీతిన్ మహమ్మ జ్జలా
లుద్దీ నక్బరు నామముంచిరి హుమాయూన్ పాదుసా చూచి యా
ముద్దుంగుఱ్ఱని కీర్తివల్లి దెసలన్ బుష్పింపఁ గాంక్షించుచున్
ముద్దల్ ముద్దలు పంచె నాప్తులకు సమ్మోదంబుమైఁ గస్తురిన్. 182
చ॥ తను గడుఁజేరఁదీసి తలదాఁచుకొనన్ నెలవిచ్చి పేర్మి నె
నెక్కొనగ మెలంగు నయ్యమరకోట నృపాలునియొద్ద నాత్మ మో
హనసతియౌ హిమీడను నిజాత్మజు నక్బరు నిల్పి వెంట న
య్యనుచరు లేగుదేరఁగఁ బ్రయాణ మొనర్చె నతండు వెండియున్.183
మ॥ త్వరమై నాతఁడు పారశీకమును గాంధారంబు కాబూల్ వసుం
ధరలన్ జేకొనెఁ గాని రాజ్యము స్థిరత్వం బందకే సాఁగె; నీ
కరణిగా దాఁ బదునాలుగేడులు కడుఁ గష్టంబులం బొంది వం
దురె; నీలోపలఁ గొన్ని మార్పు లచటన్ దోతెంచె ఢిల్లీపురిన్. 184
మ॥ అల షేర్ఖాన్ బలశౌర్యశోభితుఁడు రాజ్యం బెల్లఁ గౌశల్యముల్
వెలయన్ బాలనచేసె వాని పిదప బృధ్వీపతుల్ చాల దు
ర్బలులున్ గ్రూరులు నౌట రాజ్యమది స్థైర్యంబూడెఁ గొన్నేండ్ల క
వ్వల రాజయ్యె సికంద రీతఁడు సురాపాన క్రియాలోలుఁడౌ 185
మ॥ స్థితి యిట్లుండు టెఱింగి దండుఁగొని డాసెన్ దా హుమాయూను శూ
రతముం డుగ్రపరాక్రమక్రముఁడు బైరాంఖాను వచ్చెన్ జమూ
పతి పండ్రెండవయేటనున్న సుతుఁ డక్బర్ గూడ నేతెంచె ను
స్థితిమై యుద్ధము సాఁగె ఢిల్లీని సికందర్ సా చమూపాళితో.186
మ॥ కడులేఁబ్రాయపుఁ జిన్నికుఱ్ఱఁడగు నక్బర్ ముందు నిల్చుండి యె
క్కుడు శౌర్యం బుసికోల్పి పూన్ప సుభటుల్ ఘోరంబుగాఁ దాఁకి ర
య్యెడ ఢిల్లీపతీ యోడిపాఱె విజయం బింపారఁ బట్టాభి షి
క్తుఁడునయ్యె హుమయూన్ నిజాప్తులును సంతోషించి యుప్పొంగగన్ 187
-:అక్పరు సింహాసన మెక్కుట:-
సీ॥ షేర్మండలంబను స్నిగ్ధ సౌధంబున
హుమయూను కూర్చుండి యొక్క నాఁడు
పొత్తముల్ చదువు నప్పుడు ప్రార్ధనము చేయు
కాలంబుఁ దెలుపుచు గంట మ్రోగె
వడివడి దిగిరాఁగదొడఁగె నాతఁడు నును
పై యున్న మెట్లపై నడుగు జాఱెఁ
బైనుండి క్రిందికిఁబడుట గాజు విధానఁ
దలయును వేయిప్రక్కలుగఁ బగిలె
గీ॥ నవలఁ బంజాబునందున్న యక్బ రటకు
వచ్చెఁ ఐదునైదువందలేఁబదియు నాఱు
నగు శరత్తున నతనిఁ గల్యాణపురిని
ఢిల్లీపతిఁ జేసి రుద్యోగులెల్లఁ గలిసి.188
మ॥ ప్రవిశేష ప్రకట ప్రభావుఁడగు బైరాంఖాను క్షాత్రైక ధ
ర్మవిదుండాహుమయూను కోడలు సలీమాదేవిఁ బెండ్లాడి బాం
ధవుఁడై యక్సరు బాల్యమూడి తరుణత్వంబౌందు నందాఁక రా
జ్యవిధానంబును నిర్వహింపఁదొడఁగెన్ సంరక్షకుండై తగన్ 189
బైరాంఖాన్ విజయములు
సీ॥ కాశ్మీరమందు సికందరుసాహి సై
న్యము ప్రోవుచేసి రణంబుఁ గోర
నచటఁ గాబులులో నక్బరు ప్రతినిధి
తరుణంబు వీక్షించి తిరుగఁ బడఁగ
మాళ్వదేశాధీశమణి ఢిల్లీపైఁ బడు
టెప్పు డెప్పుడటంచు నెగురు చుండఁ
బులివంటి ప్రోడ హేముఁడు క్షణక్షణమును
దండెత్తి రాగాలు ద్రవ్వుచుండ
గీ॥ నల్ల కాబూలుకొ ఱ కేగ ఢిల్లీ పోవు;
ఢిల్లీకై చూడఁ గాబూలు చెల్లి పోవు
వెనుక నూయి ముందర గోయి యనుట యయ్యె
శౌర్యధనుఁడు బైరాంఖాను సైన్యపతికి. 190
క॥ తొలుత సికందరుసాహిని
గలియుచు బై రాముఖాను కల్యాణూ రన్
స్థలమున నోడింపఁగ నతఁ
డలఘుగతి శివాల కద్రు లందున డాగెన్ 191
.
సీ॥ లక్ష పదాతి దళంబు కరుల్ వేయి
దినవెంట నేతేర దండు వెడలి
హేముఁ డాగ్రాపురికేగి చేకొనిదాని
నవల ఢిల్లీపురం బాక్రమించె
బైరాముఖానుఁ డక్బరు ససైన్యముగ సి
ద్ధంబైరి పానిపట్టంబు నొద్ద
నుభయ సైన్యములకు యుద్ధం బెసఁగెఁ దురు
ష్కులు శత్రుసేన ప్రయ్యలుగఁ జేసి
గీ॥ హేము బంధించికొనుచు బై రాముఁ జేర్చి
రతఁడు కారుణ్యమును మానియక్బరుఁ గని
శత్రుశేష ముపద్రవసమితిఁ దెచ్చు
శీఘ్రముగ వీనిమస్తంబుఁజెండు" మనియె.192
శా॥ "నామేల్గూర్చి వచించు నీనుడిఁ దలన్ దాల్పంగనౌఁ గాని యీ
హేముం డోడినవాడు; పట్టువడినాఁ; డీనాఁ డవధ్యుండు; నా
కై మన్నింపు" మటంచు నక్సరనె; ఖడ్గంబెత్తి ఖండించె బై
రాముం డత్తఱి హేముమస్త మిల పై రాలన్ భటుల్ భీతిలన్ 193 193
సీ॥ క్షాత్రప్రధాన నిశాత వర్తనుఁడౌట
నావేశ మదికొంత యలరుఁ గావి
రాముఖానుఁ డక్బరుఁ బెక్కు గురువుల
వేర్వేఱ నియమించి వివిధ విద్య
లభ్యసింపఁగఁజేసె, నాతని వేయి క
న్నులఁజూచి వేయిచేతులను గాచి
ధరణి రాజ్యం బూర్జితము చేసెఁ గాబూలు
చేకొనె గాంధారసీమ గెలిచె
గీ॥ జాన్ పురం బజమీర్ ప్రదేశములు గొనియె
గ్వాలియరు పట్టుకొనియె మార్వారు నొంచె
క్షణము విశ్రాంతిఁ గొనక రాజ్యములు గెలిచె
నక్బరున్నతి పరమ లక్ష్యముగ నుంచి. 194
--అక్బరు సమగ్ర రాజ్యాధికారము నొందుట.--
మ॥ అరుదెంచెన్ బదునెన్మిదేడులగు ప్రాయం బప్పు డక్బర్ వసుం
ధరఁ దానేలఁ దలంచె సేవకతతిన్ ద్రవ్యంబు నర్పించి సం
బర మొప్పారఁగ నాత్మరక్షకుని నా మక్కాకుఁ బంపించె ద
గ్గర నబ్డూరహిమాను దత్సుతుని వేడ్క నిల్పి పోషించుచున్. 195
సీ॥ ఆజాను దీర్ఘ బాహార్గళయుగళుఁడు
ద్యత్పద్మ పత్రనేత్రముల వాఁడు
ఘనసార్వభౌమ లక్షణ లక్షితుండు ప్ర
సన్నమనోహ రాస్యంబు వాఁడు
బలశోభితారోగ్యవచ్చరీరుండు నీ
రద సామ్యగంభీరరవము వాఁడు
శాంతిప్రధాన వర్చశ్శోభితుండు ద
యాపూర్ణ మృదు హృదయంబు వాఁడు
గీ॥ కష్టము సహింపఁగల ధైర్యగరిమ వాఁడు
వితరణ వికాసముల వాడు-వేయు నేల
భరతఖండ మేలిన సార్వభౌము లందు
నింతవాఁ డింక లేఁడనునంత వాఁడు. 196
సీ॥ అంచెలమార్చుచు నశ్వంబులను, స్వారి
యిరువదైదామడల్ పఱచియుండె
ఘూర్జరమ్మునఁ ద్రోవ గొప్ప బెబ్బులిరాఁగ
నద్దానిఁజేత జొప్పడఁచియుండె
విడక 'ఖండిరా' వనెడి మత్తకరినెక్కి
యైదామడలదూర మరిగియుండె
నాడు సింగము పిల్లలైదు మండుటెడారి
యందుఁబైఁ బడఁ బీచమణఁచి యుండె
గీ॥ నిరువురను దనసందిట నిఱికి కొనుచుఁ
గోట గోడలపై నెక్కి దాఁటి యుండె
నప్రతీప ప్రతాప ధైర్యములు దేహ
బల మితని సొమ్మనుచు మెచ్చ మెలఁగియుండె. 197
మ॥ భగవాన్ దాసుఁ డొసంగె నాత్మసుత నక్బర్ నేత కుద్వాహ మం
దగరాడ్ధీరుఁడు వాని సోదరు సుతుండౌ మానసింహుడు వీ
ర గరిష్ఠుండయి ఢిల్లిఁ జేరి పరరాష్ట్రశ్రేణులన్ గెల్చి కీ
ర్తి గురుత్వంబు వహించి యక్బరుకడన్ దీపించె సేనానియై. 198
సీ॥ ముప్పాలుప్రజ హైందవులుగాన వారి సే
మము తన కెప్డు సేమమని తలఁచె
నని జయించుచుఁ బట్టుకొనినవారిని బాని
సలఁజేయు రట్టంబు నిలిపివైచె
యాత్రలకేగు భక్తావళితోఁ బన్ను
గొనరాదనుచు దానిఁ గొట్టివైచె
జిరకాలముగను వేసెడు జుట్టుపన్ను న్యా
యవిరుద్ధమని దాని నవలఁ ద్రోసె
గీ॥ హైందవంబున యవనరాజ్యంబు నిలుస
నెన్నియత్నముల్ వలయుఁ దానన్ని చేసె
మంచుమలనుండి కన్యాకుమారి దాఁక
వసుధ నెల్లఁ చాలింప నక్బరు దలంచె. 199 199
--/ అక్బరు - దిగ్విజయములు / --
క॥ కొనె మేత్రాదుర్గము, చే
కొనె గోగ్రోటన్ కోట యింక గోవిందివనం
బను దేశము గెలిచెను గో
టను నాగ్రాపురమునన్ దృఢముగఁ గట్టెన్.200
క॥ శరణని మాళవపతి దరి
కరుదేరఁగఁ గూర్మిగని సహస్ర హయాధీ
శ్వర సేనాధీశుగ నా
దరమున నాస్థానమున నతనిఁ జేర్చుకొనేన్.201
క॥ తపతీనదిపైఁ గల బ్ర
హ్మపురంబును విజయగృహము నతిరయమారన్
నృపకుల దీపకుఁ డక్బరు
కృపకును లోనగుదు మనుచుఁ గ్రేళ్ళురికె వడిన్.202
క॥ రావలపిండి సమీపము
లో విలయాంతకునకైన లొంగని గక్కా
రావీరుల కావర ముడి
వోవఁగఁ బంజాబు దేశమును గెల్చుకొనెన్.203
క॥ తూరుపుసీమల దృష్టిని
సారింప నడేల్ కులుండు చానార్ దుర్గ
ద్వారములు దీసి యక్సరు
భూరమణుని పాద కమలములు పూజించెన్.204
క॥ నరసింగపూరు చౌరా
ఘరు మఱిహోరంగబాదు క్రమమొప్పఁగ న
కృరు పాదుసాహి చరణాం
బురుహంబులు శరణమనుచుఁ బొగడుచు నిలిచెన్.205 205
క॥'రండో వీరోత్తమ' యని
ఖాండీషు నృపుండు కాళ్ళు గడిగి తనూజన్
మండల రాజ్యంబు నృపా
లుండలునకు నప్పగించెఁ గడు భక్తి మెయిన్.206
గీ॥ చతు రనంత బలంబులు సందడింప
సింధు గంగానదుల మధ్య సీమలందుఁ
జైత్రయాత్రా పరంపరల్ సలిపి దిగ్వి
జయము సాగించె నక్బరు చక్రవర్తి! 207
చిత్తూరు - మూడవ ముట్టడి.
గీ॥ భరతఖండైక భాగ్యమై పరగు రాజ
పుత్ర రాజ్య మేలని వాని పొడవు వృధయె”
యని నడిపె సేన తద్భార మాగలేక
యురగనాయకు ఫణము లుఱ్ఱూతలూఁగె.208
గీ॥ మహితధైర్యుండు తోడరమల్లు మేరు
శిఖరమట్టి ఖాసింఖాను; సింహ మట్టి
బిరుదుఁ 'ఖాన్ ఖానను' పిడుగుల్ వ్రేళ్ల నలుపు
భయద శౌర్యులు నడిచి రక్బరును గొలిచి.209
మ॥ అలఘుప్రాభవ కీర్తివిక్రమ యుతుండౌ మానసింహుండు, కొం
డలఁ బిండిన్ బడఁగొట్టు మేటి భగవాన్ దాసిందు నందున్న యో
ధులకు వృద్ధపితామహుం డిరువురున్ దోతెంచి; రీతండ్రి
డ్కులు దర్పించిన నడ్డుపాటు గలదె క్షోణితలం బందునన్. 210
క॥ ఈమెయి నక్బరు నడుపు చ
మూమానం బింతయనఁగ బుద్ధిఁ జొరదు; బు
స్సా మొదలుగఁ బాండోలీ
సీమ వరకుఁ బదియుమైళ్ళు సేనలు నిండెన్.211 211
సీ॥ జలధులంతటి సరస్సులు పెక్కులుండెఁ గ్రిం
దట వనాశానది నడచు చుండెఁ
దరుగని బహువిధ ధనధాన్య తతు లుండెఁ
బైరు క్రొత్తగ నెక్కి వచ్చు చుండెఁ
గోటలేడును జుట్టుకొని దృఢమ్ముగనుండె;
సప్త మహాద్వార సమితి యుండె,
గురుతరాయుధ పరంపర చెంత నుండె, యో
ధ తతి చిత్తములందు ధైర్య ముండె
గీ॥ నక్బరునకె కా దవ్వాని యబ్బకైనఁ
దగ్గక రణంబు సాగింపదగ్గ యన్ని
సాధనము లుండె, లేమి యెచ్చటను గలుగ
దుదయసింహరాణా లేమి యొకఁడు తక్క.. 212 212
ఉ॥ అంగడి నున్నవన్ని శనియల్లుని నొరనటన్న మాట వా
సిం గనఁజేసి యయ్యుదయసింహుఁడు యుద్ధమటన్న భీతిచేఁ
గ్రుంగుచు ‘రాజపిప్పిలి'ని గోహిలువంశ్యులయొద్ద డాఁగె సై
నం గనరాదు లోపము రణం బొనరించేడు యోధకోటికిన్. 213 213
సీ॥ అల సలుంద్రాధీశుఁడగు సాహిదాసు శౌ
ర్వాన్వితుండగు దేవరాధిపతియు
ఖేల్ల్వాప్రభువు శుద్దకీ ర్తి పుత్తనృపుండ .
బేడ్లా తోటేరియా వృధ్వివరులు
నింక మడేరియానృపతి చూడాసింగు
పావనాత్ముండు ఝాలా విభుండు
ఝూలూరినేత మీశ్వరదాసు సోనె గు
ఱ్ఱేంద్రుఁడైన కరుణా సాంద్రరాజు
గీ॥ గ్వాలియరు దేశపతి లోసుగా మహిపులు
పగిలేడు పిరంగి గుండుకు వక్షమిచ్చు
ధైర్య హేమాద్రులు విశేషదళము లలరఁ
బోయి నిల్చిరి గెలుపొ చావో యటంచు. 214 214
క॥ అల్ల యమభటుల గేరేడు
బల్లిదులగు భటులు గొలువవైరుల మనముల్
తల్లడిలఁగ వచ్చెను జయ
మల్లుఁడు రణరంగపార్ధమహిత యశుండై. 215 215
సీ॥ ఇతఁడు మార్వార్మహీపతి మాళదేవుని
సుతుఁడు బాల్యమునందె శూరలోక
చూడామణియన విశుద్ధి కీర్తి గడించెఁ;
దండ్రి కీతనికి భేదంబువచ్చి
చిననాఁడు తనదేశమును వీడి వెడలె: నీ
తని భుజాటోప దుర్దాంతత విని
చిత్తూరిరాణాయుఁ చేయిచ్చి మన్నించి
బదసూరు సంస్థాన పతిగఁ జేసె;
గీ॥ మహితధై ర్యంబు వజ్ర వర్మంబు గాఁగఁ
దనదు రారోణ్మహా వీర తతులఁ బూన్చి
తగిలి బ్రహ్మాండమైనఁ బిండిగ నొనర్చు
రౌద్రతరధాటిఁ గాలాగ్ని రుద్రుఁడితడు.216
క॥ కృప నాదరించు చిత్తూర్
నృపచంద్రుని పనులు మేని నెత్తురుకండల్
విపులముగ ధారవోసి జ
రుపు స్వామిస్నేహ బంధురుల్ వీరెల్లన్. 217
సీ॥ సమర మనేకమాసములయ్యె ; నక్బరు
పెక్కురు పనివాండ్రఁ బిలువ నంపి
దుర్గంబుక్రింద గోతులను ద్రవ్వించి చొ
ప్పించి యగ్నిరజంబు ప్రేలిపించెఁ;
జిత్తూరిసేన కాచిన నూనియలు శిలల్
గుప్పుచు వైరులఁ గూల్చుచుండె
యవనులు తలలపై శవకోటిఁ గప్పి దు
ర్గము క్రిందఁ ద్రోవంగఁ గడఁగుచుండి:
గీ॥ రెప్పుడును గాని యాగోడ లెచటఁగాని
పగులుటయుఁగాని సేనలోఁ బడుట గాని
కానరాదయ్యె; నక్బరు గడియ గడియ
కెటు లెటు టంచు విసుగు నొందుటయ కాని. 218 218
సీ॥ ఉన్నమం దంతయు నొకమాఱె పెక్కుతా
పులఁబోసి గూరి నిప్పును ఘటింప
నొకగని ప్రేలే; ముందుండిన మోగలుల్
కూలిరి; గోడయుఁ గొంత యురలె;
దానిలోఁ గొంద ఱంతమునొంది; రీవలా
వలివారు ముందుకుఁ గలయ దూఁకి;
రంత బ్రహ్మాండంబు నగలించు నొక పెద్ద
ధ్వనితోడ నొండొక గనియుఁ బ్రేలె:
గీ॥ దాన యవన హైందవుల గాత్రములు గాలిఁ
గలిసె శతశస్సహస్రశః ఖండము లయి;
విఱిగె నొకగోడ; యచటఁ బెక్కురు యవనులు
హైందవులు చేరి; రయ్యె ఘోరాహవంబు.219
క॥ రణరంగ మృగేంద్రులు చో
హణవీరులతోఁ గోటేరియా-బేడ్లా రా
ణ్మణు లాసమ్మర్ధ రణాం
గణమునఁ దెగి స్వర్గసీమఁ గట్టిరి గృహముల్. 220
క॥ హరవంశ్యుల నడుపుచు నీ
శ్వరదాసును దేవరాధి పతియును ఝాలే
శ్వరుఁడును బెండ్లికి నడచిన
కరణిని నని కేగి మడిసి కనిరి యశంబున్. 221
క॥ దురమున దూడాసింగును
గరుణాసాంద్రుండు వైరి గణ మస్తములన్
దరుగుచు రాసులు వోసిరి
పరలోక ద్వారసీమ వఱ కవ్వేళన్ 222
క॥ భండనశతఘ్నులనఁ దగు
చోండావ ద్భటులతో విశుద్ధ యశస్సాం
ద్రుండైన సాహిదాసుఁడు
ఖండితుఁడై యొరగె భటులు కళవళ మందన్.223 223
క॥ చండనృపాఖండలు కుల
మండనుఁ డరిదండధరుఁ డమాత్యు డితండున్
మ॥ ఇది నాయాజ్ఞి బహిష్కరించితిని నిన్నీ దేశమం దెచ్చటన్
మెదలన్ బోకన సాగరుండు నగి స్వామి చాల సంతోషమై
నది! రాజ్యం బది యెంత తీపనుచు డెందంబందు దావించితో
విదితంబయ్యె సమస్త భూజనులకున్ బెక్కేల వాక్రువ్వఁగన్.387
మ॥ ఇది నాయూ రిది నాదు రాష్ట్రమనున్ హీనుల్ మఱిన్ దుర్బలుల్
మది సూహింతురు కాని విక్రమకళాలంకారులౌ వారి క
య్యుద యాస్తాచల మధ్యగం బయిన సర్వోర్వీతలంబున్ ముదా
స్పదమౌ కొంగుపసిండి వోలెఁ దమదై భాసిల్లు నెల్లప్పుడున్. 388
మ॥ పరమ ప్రాభవ సంపదల్ విడిచి మేవాడ్దేశ మందుండఁగా
నెరియున్ నామది నీవు శత్రుఁడగుటన్ నీవారలున్ శత్రులౌ
దురు నీకెప్పుడు గర్భశత్రువులు మిత్రుల్ నాకు నట్లౌట మ
చ్చరణంబుల్ క్షణకాలముంచుదుఁ జరించన్ నీదు రాజ్యంబునన్. 389
సీ॥ పనియేమి పరభూమిపతుల సీమలకేగ
మేవాడ నెపుడెప్డు మ్రింగుదునని
కనువైచియుండు నక్బరు ధరామండలా
ఖండలుం డాతని కడకుఁ బోదుఁ
ద్వద్వికట ప్రవర్తనమున నతనికి
మిత్రలాభముగల్గు మేర యొదవె
నిప్పుడు పయనించి యేగెద ఢిల్లీపు
రమునకుఁ గొన్నిదినముల లోన
గీ॥ హెచ్చరిక గల్గి రాజ్యంబునేలు చుండు
మిదియె శాశ్వత మనియుండకెప్పు డెవ్వ
డెచట నేరీతి నిన్ను జయించి దాని
నపహరించునో తెలియఁబోదజున కైన. 390
మ॥ అని గాంభీర్య మెలర్పఁగా బలికి యశ్వారూఢుఁడై పోయె నా
తని వీక్షించుచుఁ గొంతసేపటికి యోధశ్రేష్ఠలున్ బెక్కురున్
దనవెంటన్ జనుదేర నయ్యెడ నరణ్యప్రాంతమున్ జేరఁగాఁ
జనే వేఁటాడఁ బ్రతాపసింహుఁడు జనుల్ సంతోషమున్ బొందఁగన్.391
ఉ॥ కొమ్ములులేని యమ్మహిషకోటులు తొండములేని భద్ర నా
గమ్ములు నాఁగ నొప్పు వనిఁ గల్గిన మత్తమహావరాహ పో
తమ్ముల నాప్రతాపుఁ డతిదారుణ లీలల వీఁటియున్ శరీ
రమ్ములు గాడఁగాఁ బొడివి రాసులు రాసులు వోసె నేలపై.392
మ॥ అరుణాంశుచ్చట లీన నేత్రములు శౌర్యాటోప మేపార సు
గ్రరసోద్రేకమునన్ బ్రతాపధరణీకాంతుండు సత్క్షాత్ర సం
భరితుం డెత్తిన యీఁటె దింపక మహామాయాకిరాతుం డటుల్'
నిరతోదగ్ర విహారముల్ నెరపి ఖండించెన్ వరాహమ్ములన్. 393
మ॥ తగుసామంతులు వీరయోధమణులంతన్ వారి దోశ్శక్తికిన్
దగు చందంబున నొక్కమైఁ గసి కాంతారంబునన్ గల్గు నా
మృగసంతానములన్ క్షణంబునను భూమిన్ గూల్చి పెక్కింటిఁ గు
ప్పగఁ దామొక్కెడఁజేర్చి రారుధిరముల్ పాఱంగఁబెన్కాల్వలై. 394
చ॥ అరిజవంబు మీఱ మృగయారతి సాఁగఁగఁజేసి నిల్పి స
త్వరగతి లెక్క సేయఁగఁ బ్రతాపుఁడు గూల్చు వరాహపంక్తి యం
దఱు సమయించు నమ్మృగవితానము మీఱుటఁజూచి హర్షముల్
వఱలఁగ “మంచికాలమిదివచ్చు" నటంచు, దలంచి రందఱున్. 395
మ॥ శివుముత్తైదువ ప్రీతి కేకలములన్ జెండాడి సామంత భూ
ధవులున్ యోధులు నూతనోత్సవ సముద్యత్కాంతులై భూమియున్
దివియున్ గ్రక్కదలంగ నర్చుచుఁ గడున్ దేజంబు దీపింప ను
గ్రవనంబున్ విడి రాజధానినిఁ జొరంగాఁబోయి రొక్కుమ్మడిన్.396
సీ॥ చిత్తూర్పురము శత్రుఁవేఁబడి రాజ భా
గము తద్ద పెద్దదిగాక యున్నఁ
దమదేశ సామంత ధరణీశు లొక్కా రొ
క్కరుపోయి యక్బరుఁ గలియు చున్న
గడలేని యుద్ధసంఘర్షణంబులఁ దమ
దేశమంతయుఁ బిప్పిదేలి యున్నఁ
బరిపంధియో నభోభాగ భూభాగముల్
తలక్రిందు చేసెడి 'బలియుఁడైన
గీ॥ దమమది హరించు ఘనుఁడు దుర్గాంత తేజుఁ
డర్కకుల వర్ధనుఁడు సుగుణాంబురాశి
యాప్రతాపుఁడు రాజౌట హర్ష పరత
మించిమిన్నంది ప్రజ రమియించె నపుడు. 294
గద్య:- ఇది శ్రీమత్కామేశ్వరీ కరుణా కటాక్ష వీక్షా సమాసాదిత రసవత్కావ్య
నిర్మాణ చాతురీ ధురీణ, సుగుణ గణపారీణ, దుర్భాకవంశ్య దుగ్ధాం
భోరాశి రాకా కైరవమిత్ర, శాలంకాయన గోత్ర పవిత్ర, సుజనజ
నానుగ్రహ పాత్ర, వెంకటరామార్య పుత్ర, కవి సార్వభౌమ - సాక్షా
ద్వీరప్రతాపాది వింశత్యధిక బిరుద విఖ్యాత, సుకవిరాజశేఖర,
రాజశేఖరకవి ప్రణీతంబైన రాణాప్రతాపసింహ చరిత్రంబను పద్య
కావ్యంబు నందుఁ బ్రథమాశ్వాసము.