Jump to content

రాణా ప్రతాపసింహ చరిత్ర

వికీసోర్స్ నుండి

శ్రీ

రాణా ప్రతాపసింహ చరిత్ర



కర్త

కవిసార్వభౌమ

డి.రాజశేఖర శతావధాని


సర్వస్వామ్య సంకలితము. ]

వెల రు.56

శ్రీ

రాణా ప్రతాపసింహ చరిత్ర

రా జ శేఖ ర క వి ప్రణితము.

కవిత్వము ♦ తన్మయత్వము

శ్రీ శ్రీ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారి

విపులసమీక్ష.

ప్రస్తుత గ్రంథాన్ని ఆంగ్ల భాషా నిష్ణాతులు శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారు మిక్కిలి మెచ్చుకొన్నారంటే నాబోట్ల లెక్కేమిటి, యీయన పేరు రాజశేఖరుడు. యీ పేరు పరమేశ్వరునిదే కానీ, ప్రస్తుత గ్రంథ రచనా సందర్భంలోవున్న కొన్ని ఘట్టాలను బట్టి చూస్తే ప్రతాపసింహునికి పర్యాయ మేమో అని ప్రతి సహృదయునికీ గోచరిస్తుందని నానిశ్చయం. కవులలో తన్మయత్వం కలవారు కొందఱేే వుంటారు. ఆధునికులలో యీ రాజశేఖరకవి తన్మయత్వంకల కవి అని రచన వ్యాఖ్యానిస్తూవుంది వుదాహరించ వలసి వస్తే గ్రంధంలో నూటికి 50 పద్యాలైనా పుదాహరించవలసి వస్తుంది. కనుక కొంచెం మాత్రమే పుదాహరిస్తాను.

మ॥ రవి యస్తాద్రిని మొల్చుగా కఖిల పారావారముల్ కృంగుఁగా
    కవనీ చక్రము వ్రీలుగాక చెడుగా కాకాశ మయ్యుగ్ర భై
    రవుఁడై లోకముఁ గాల్చుఁగాని లవమున్ రాణా ప్రతాపుండు గౌ
    రవమున్ గోల్పడి మర్త్యమాత్రునకు శీర్షం బొగ్గ డెప్పట్టునన్

యీ మాటలు ప్రతాపుని మంత్రిన్నీ కులవృద్ధున్నూ పరమ పూజ్యుడున్నూ అయిన “సలుంబ్రా-కృష్ణసింహుడు" అగ్బరు చక్రవర్తికి సర్వసేనాధి పతిన్నీ బావమఱదీన్నీ అయిన మానసింహ రాజన్యున కిచ్చే జవాబులోనివి మానసింహుని తండ్రీ భగవాన్దాసు తాత్కాలిక సుఖంకోసం తన కూతుర్ని (దిగ్ధిగ్ధిక్) అగ్బరు చక్రవర్తి కిచ్చి పెండ్లిచేసి కులగౌరవాన్ని కాపాడు కొంటూ వనవాసం అనుభవిస్తూ వున్న ప్రతాపసింహుణ్ణి కూడా తమతోపాటు చక్రవర్తికి లోబడవలసిందని రాయబారాన్ని తెచ్చిన సందర్భంలోనివి. ప్రతాపుని అభిప్రాయాన్ని వ్యాఖ్యానించే చిన్న పద్యంకూడా వొకటి వుటంకిస్తాను.....

ఈ రెండు చిన్న పద్యాలిస్తే యేం తేలుతుంది ఆయా పద్యాలున్న ద్వితీయాశ్వాసం 330 పద్యాలుస్నూ వుదాహరిస్తే బాగా తృప్తి కలుగుతుంది. ప్రతాపరుద్రుడికి ప్రతాపసింహుడు దీటు మాత్రమే కాదు. హెచ్చు. కవి ఆకవికి లోచ్చైనను, తన్మయత్వంలో హెచ్చు. లోగడమాటలు ప్రతాస రాణావారి మంత్రివి. ఈమంత్రిని సర్వవిధాలా భీష్ముడే అని చెప్పడంలో అతిశయోక్తి కన పడదు. ఆ గ్రంధంలోవున్న పాత్రలన్నీ యే కళంకము లేనివిగా కవి చిత్రించి వున్నాడు. రాణాప్రతాపుణ్ణిన్నీ రాముణ్ణిన్నీ త్రాసులోపెట్టి తూస్తే ప్రతాపుదే అసిధారావ్రతంలో చాలా మొగ్గుతాడు. కుశలవులు రాముణ్ణి యెత్తి పొడిచారు. ప్రతాపుణ్ణి అయితే యెత్తి పొడవలేరనే తోస్తుంది. తగిన పదార్థానికి తగిన పాచకుడు లభిస్తే రుచి కలిగినట్లు ఈ రాజశేఖరకవివల్ల ప్రతాపుడి ప్రతాపం శోభించింది. యెక్కడ యెంతవఱకు వ్రాయడం అవసరమో అక్కడ అంత వఱకే వ్రాసి చదువరులకు విసుగులేని పద్ధతిని గ్రంధరచన సాగించడము సుబసుఖాలు పట్టు పడేదికాదు. ఆపద్ధతి ఈ రాజశేఖర కవికి లభించింది. ఈ గ్రంధంలో వచనాలు లేవు అన్నీ ఛందోమయాలే. సుప్రసిద్ధమైన పద్యాలే. సుమారు యేడెనిమిది రకాలు వాడబడ్డాయి. వుదాహరించవలసివస్తే చాలా స్థలం ఆక్రమిస్తుంది సీసపద్యం........

రాజశేఖర కవిగారి రచనలో, యెంతసేపు పరిశీలించినా పొల్లుమాటలు కనబడవు. కవిత్వం, మూడు వంతులతో వొకవంతు మాత్రమే దరహంమీద, తెలుగు పదాలు కలదిగా వుంటుంది. తక్కిన రెండువంతులూ తత్సమ పదాలుగా వుంటాయి. కాని, ప్రసాదగుణ భూయిష్టంగా వుండే ధార కావడంచేత కదళీపాకంగా అందరికీ అందుబాటులో వుంటుంది.

ధారాళమైన ధారతో చదువరులకు చదివినకొద్దీ చదవాలనే కోర్కిని గలిగించే శైలిలో వున్నప్పటికీ అఈ కథ భారత-రామాయణాల మాదిరిగా సర్వే సర్వత్ర తెలిసింది కాకపోబట్టి వాట్లమాదిరిని ఈ కవిత్వం వ్యాప్తికి రాకపోయింది గాని, ఆలాగే కాకపోతే, ఈ రాణాప్రతాపచరిత్ర రామాయణం లాగ వ్యాపించ తగ్గది. ఈప్రతాపుడు రాముడికంటే ఏ సుగుణంలోనూ తీసి పోడు. ఈ రాజ శేఖరకవి కవిత్వం రామాయణగాధ తెలుగులో రచించిన కవుల కవిత్వానికిన్నీ తీసిపోదు.

మ॥ అమరోద్యానమువోలే నెల్లేడ సమగ్రానందమున్ బెంచి లో
    కముఁ గల్యాణపు మండపంబటు వెలుంగన్ జేయు స్వాతంత్య్ర ధ
    ర్మ మహాదేవత మున్గె గిల్బిష సముద్రంబందున రక్త హ
    స్తములన్ లేపిన లేచు లేవదణు మాత్రన్ రిక్త హస్తంబులన్.

నాలుగో చరణంలోవున్న “రక్త హస్త-రిక్త హస్త " శబ్ద కూడిక మిక్కిలీ హృదయంగమం. యుద్ధభాగంలో ఈకవి కవిత్వం తిక్కన సోమ యాజని జ్ఞప్తికి తెస్తూ వుంటుంది.

ఉ॥ అత్తరి విక్రమించి భయదాహవశౌర్యుడు శ్వామసింహ భు
    భృత్తిలకుండు శీర్షకము భేదిల మోదును ఖాను ఖడ్గ ము
    ద్వృత్తి వియత్త లంబులకుఁ ద్రెవ్వఁగఁగొట్టి హయంబుఁ గూల్ప నో
    రెత్తక వాఁడు మౌనము వహించుచుఁ బాఱెను నేల దూఁకుచున్.

ఈలాటి పద్యాలు వరుస వెంబడిని వుదాహరించ వలసిన పున్నాయి. కవి అధునాతనుడే అయినా కవిత్వం అధునాతనంగా వుండదు.

అయీ పుస్తకం వీరరస ప్రధానం. రాజపుత్రులకూ మహమ్మదీయులకూ, సంబంధించిన యుద్ధపద్ధతిని తేల్పేది. కవి మనఆంధ్రుడు. రాయలసీమ వాడు. ఇంటిపేరు దుర్భాకవారు. దుబ్బాక వెంకటాచల శాస్త్రుల్లు గారిని మేము అడియారు ఆనేబిసెంటు సభకు వెళ్ళినప్పుడు యిప్పటికి యేభై యేళ్ళ క్రిందట సందర్శించి వున్నాం. బహుశః ఆదుబ్బాకవారున్నూ యీదుబ్బాక వారున్నూ వొకరే యేమో. భవతు. మొత్తం కవి మహమ్మదీయులకు అను కూలించేవాడు మాత్రం కాదు, అయితే మాత్రం, రెండూ రెండుకళ్లుగానే చూచుకొని రచన సాగించాడు గాని, పక్షపాతంగా కలం నడపలేదు. అగ్బరు గుణాతిశయాన్ని శత్రువులచేత గూడ చక్కగా అనువదింప చేశాడు. సందేహం లేదు. కాని, యుద్ధవర్ణనలో మాత్రం రాజపుత్రుల యందు నలుసంత పక్షపాతంగా కలం (ఆవశంగానే - అనుకుందాం) నడిచిందేమో. అని నాకు అనుమానం......బాహుబలాఢ్యులున్నూ, పౌరుష ప్రధానులున్నూ అయిన రాజపుత్ర వీరులు - లక్షలుకొలది మహమ్మదీయులతో వేలకొలదిగా మాత్రమే వున్న తాము సుమారు 25 యేండ్లు నిలిచి పోరాడి నిర్వహించ గలిగారన్నది పరమార్ధం. రాజపుత్రులది తమదేశంలో మట్టుకు తమ స్వాతంత్యం నిల్పు కొనే ప్రయత్నమే కాని అగ్బరు చక్రవర్తి ప్రభుత్వాన్ని యీ దేశాన్నుంచి ఆసీమాంతం చెరుపుదామనే ప్రయత్నంకాదు. చక్రవర్తికో? తన గొడుగు తప్ప యింకోగొడు గెక్కడా వుండనేకూడదనే గౌరవాకాంక్ష. అవును. అతడు సార్వభౌముడు కదా పాపం ఆ బిరుదం అర్ధవంతం కావాలంటే యింకో శూరుడు తనకు మొక్కనివాడు వుండడంవల్ల కాదు. యీదోషం మహానుభావుడైన అగ్బరుది కాదు. అది అతడు ధరించిన సార్వభౌమ బిరుదాని దనుకో వాలి. ఆయీ బిరుదే చాలా ఘోరాలు చేయించింది అగ్బరుచేత. గ్రంధకర్త ప్రతాపుణ్ణెంత చక్కగా కాపాడి దిద్ది తీర్చాడో అగ్బరు చక్రవర్తి నికూడా అంత శ్రద్ధాభక్తులతో దీద్ది తీర్చి ధీరోదాత్త నాయకాగ్రేసరుణ్ణిగా ప్రకటించాడు. వాల్మీక్యాదులు రావణాదులను యింత చక్కగా చిత్రించనే లేదన్నా తప్పు లేదనుకుంటాను.

ప్రతాపుని గుణగనిణాతికి లొంగిపోయిన అబ్దూరహిమాను మొదలైన పాదుషా మంత్రుల న్యాయైకదృష్టిని యీ కవి బహు చక్కగా ప్రక

టించాడు.

తే॥ మనుజపతిమౌళిమన్మధ మన్మధుండు
    చైతకాశ్వముపైన సాక్షాత్కరించి
    దివ్యదర్శన మిచ్చె నా తేజమునకు
    నంజలి ఘటించి యాత్మోపహార మిడుదు.

అబ్దూరహిమాను అనే పెద్దమంత్రి అగ్బరు చక్రవర్తితో మహా సభలో మాట్లాడే మాటలను వివరించే పద్యాలు సుమారు 25టి దాకా వున్నాయి. ఆపద్యాలలో యిది వొకటి పద్యంలోవున్న చైతకం రాణాప్రతాప సింహునికి ప్రాణతుల్యమైన వాహనం అబ్దూరహిమాను యెంతటి సహృదయుడూ కాక పోతే తన్ను యుద్ధంలో యెదుర్కోవడానికై సర్వ సన్నాహంతో వచ్చిన (శత్రువు) ప్రతాపుణ్ణి అంత పేర్మితో తనప్రభువు సమక్షంలో నిర్దేశించ గలడా? యింకో పద్యంకూడా వుదాహరిస్తాను.

మ॥ అకటా! నీవలేె ధర్మముల్ దెలిసి రాజ్యంబేలఁగా లేఁడొ, మ
    చ్చికమై భూప్రజఁ బుత్రులంబలెఁ గృపా శ్రీఁ జూడఁగా లేఁడొ, పా
    యక వర్ణాశ్రమ ధర్మ పద్ధతి తిరంబై నిల్పఁగా లేఁడోొ, యెం
    దుకు నాతండు స్వతంత్రుఁ డై నిలువఁగాదో? యానతిఁ గోరెదన్.

ఇంత నిర్భయంగా నిష్పక్షపాతంగా చక్రవర్తితో - (చాటునా మాటునా కాదు) మహాసభలో - శత్రుగుణాలను వ్యాఖ్యానించే రాజకీయోద్యోగులు వుంటే వుంటారేమో కాని విని సహించడమే కాకుండా అభినందించడం కూడా వున్న సార్వభౌముడు ఒక్క అగ్బరేకాని యిం కొకడు లేడనే చెప్పొచ్చు. రాణాప్రతాపసింహచరిత్ర అనే పేరుతో కవి దీన్ని రచించినా 'అగ్బరు చరిత్ర' అనే నామాంతరంతో దీన్ని పిలిస్తే పిలవవచ్చుననే నే నసుకొంటాను. నిజానికి అగ్బరు అట్టి మహానుభావుడో? కాదో? కాని గ్రంథకర్త రచన అతణ్ణినిషధయోగ్య - చక్రవర్తి శిరోభూషణంగా చిత్రించింది. బిల్హణుడేమన్నాడు ? రావణాసురుణ్ణి దుర్మార్గుణ్ణి చేసినవాళ్లూ కవులే, రాముణ్ణి, మహామహుణ్ణి చేసినవాళ్లూ కవులే అన్నాడు (విక్రమాంకచరిత్ర చూ). దాదాపు రెండువేల పద్యాలు యీ కవి యీచరిత్రలో లిఖించాడు. చేదస్తంగా పెంచిన ఘట్టం వకటి లేదు. ఋతువర్ణణకు గాని సూర్యోదయ—సూర్యాస్తమయాలకు వొక్కోక్క పద్యంకంటె ఖర్చు పెట్టినట్లు లేదు.

★★★ ★★★ ★★★ ★★★ ★★★ ★★★

ఈమాదిరి పద్యాలు సర్వత్రా వున్నాయి. చదువరులు చూచు కోవలసిందేగాని వుదాహరించవలసివస్తే వ్యాసం తేమలదు. సూత్ర ప్రాయంగా సుమారు పదేళ్ళకు పూర్వం పుస్తకాన్ని నేను చదివి యిచ్చిన అభిప్రాయం మూడు నాల్గు పంక్తులు మాత్రమే దానికి యీ విమర్శనం భాష్యం వంటిదేకాని అన్యం కాదు.......

ప్రస్తుత గ్రంధకర్త తురుష్క భాషాపదాలు చాలా వాడవలసివచ్చింది. ఆయా రాజుల నామధేయాలు దేశాల పేళ్లు పట్టణాల పేళ్ళు స్త్రీల పేళ్ళు సమస్తమూ ఆభాషలోనే వున్నాయి. వాట్లని మార్చడం యెట్లా? కొన్ని సంస్కృతభాషా సంపర్కం కలిగివున్నా తేజసింగు వగైరా అవిన్నీ అపభ్రంశంగానే వున్నాయి. అట్టి శబ్దాల విషయంలో గ్రంధకర్త బాధ్యుడు కాడని విజ్ఞు లెరిగినదే. యెన్నో లోకోక్తులు సమయోచితంగా రసోచితంగా యీయన వాడివున్నాడు. అందులో కొన్ని గోదావరీ మండలం వారికి అపరిచితాలు. అట్టిది ఒకటి చూపుతాను. యీలోకోక్తి "పాండవబీడు” ఈ ప్రాంతంలో "అయ్యవార్లంగారి నట్టిల్లు” పర్యాయంగా వుంటుందేమో అను కుంటాను. ఇది వాడినచోటు

గీ॥ వట్టి పాండవ బీడు మేవాడ సీమః

సందర్భాన్నిబట్టి చూస్తే శుద్దదరిద్ర ప్రదేశమనియ్యేవే తేల్తూవుంది. యింకా కొన్ని యిలాటివే వున్నాయి.

స్థాలీపులాకంగా ఈ రాజశేఖర కవి కవిత్వాన్ని గూర్చి కొన్ని మాటలు వ్రాశాను. ఈయన దే శ భ క్తి పరవశుడే కాని కులాచారాలయందు పట్టుదల కలవాడు. ఈ విషయం కవిత్వంలో సర్వత్రా గోచరిస్తుంది. సంస్కృత భాష లో కూడా మంచిప్రవేశం కనబడుతుంది. తెలుగు మెట్రిక్యులేషన్ వఱకూ చదివిన పాఠశాలలోనే అభ్యసించి వుండాలి. కీ॥ శే॥ గిడుగు రామమూర్తి పంతులుగారు నొక్క క్షణముకూడా వ్యర్థం చేయ కుండా జీవితాన్ని భాషకోసం వ్యయించిన నిష్కల్మష హృదయుడు. ఆయీ రాణాచరిత్రం ఆయన చూచివుంటే చాలా సంతోషించేవాడు. యెంతేనా వ్రాసేవాడు కూడాను. నాకు తెలిసినంతలో విమర్శించాను. యీనాటి ధన్య కవులలో యీయన చిటికెనవ్రేలి మీదికి వచ్చేవాడు గానీ అల్లా-టప్పావాడు కాడు.

శ్లో॥ కవిః కరోతి కావ్యాని లాలయత్యుత్తమో జనః
    తరుః ప్రసూతే పుష్పాణి మరుద్వహతి సౌరభం॥
    
మ॥ భగవంతుండగు రాజశేఖరుఁడు నీపట్లం గఁలాఁ డాంధ్రమం
    దగణేయంబగు కీర్తి నీఁగల ప్రతాపాధీశుచారిత్రమున్
    సొగసౌరీతి రచించి సత్కవుల మెచ్చుల్ హెచ్చుగాఁ గొంటి వెం
    తగ వర్ణింతును రాజశేఖర కవీ! ధన్యుండ వీ వన్నిఁటన్

∞♦∞♦∞♦∞♦∞♦∞♦∞

రాణా ప్రతాపసింహ చరిత్ర

విశ్వనాథ సత్యనారాయణ

"భారతము” దేశభక్తిని పెంపొందించునని రష్యను దేశస్థులు తమ భాషలోనికి అనువర్తించు కొనుచున్నారట. భారతమున కాశక్తి యున్నచో "రాణా ప్రతాపసింహ చరిత్ర”కును ఆశక్తి కలదు.

రాణాప్రతాపుఁడు పేరునకు రాజపుత్రుఁడు. ఆంధ్రుఁడు కాడు. ధర్మరాజాంధ్రుఁడా? కృష్ణు డాంధ్రుఁడా? రాముఁ డాంధ్రుఁడా? శంకరుఁ డాంధ్రుఁడా? వారందఱు భారతీయులు. అందుచేత ఆసేతుశీతనగము వారి కధలు పాడిరి. అట్లే ప్రతాపుఁడును. భారతము పూర్వకాలము కధనే చెప్పును. అందులో నున్న ధర్మముమాత్రమే మనజాతిది. ఆ విషయము ద్వాపరయుగము నాఁటిది. మన పరిస్థితులతో సంబంధము లేనిది. ప్రతాపసింహచరిత్ర మన ధర్మమునే గాక మనపరిస్థితులుగూడ చెప్పును. అగ్బరు చక్రవర్తితో పాతికయేండ్లు హోరాహోరి పోరాడి-స్వదేశము వదలి-కొండలలో గుట్టలలో నివసించి తిండిలేక గడ్డిరొట్టెలు తిని దైవవశమున మఱల స్వాతంత్య్రము సంపాదించిన మహాపురుషుఁడు, రాణాప్రతాపుఁడు. ఆయనకన్న ధర్మరాజాదు లేమియు నెక్కువవారు కారు. వస్తురమ్యతకుఁగాని, కథా చమత్కారమునకు గాని, ఇందలి భిన్నపాత్రల భిన్నతా విశిష్టతకుఁగాని భారతమునకీ గ్రంధము తీసిపోదు.

వస్తు విటువంటిది. కవి-యెటువంటివాఁడు? వ్యాసునకు తిక్కన్నకు నెంత వీరరసావేశ మున్నదో యంత వీరరసావేశము గలవాఁడు. వెనుకటికి బ్ర॥ శ్రీ॥ చెళ్లపిళ్ల - వెంకటశాస్త్రిగారిని ఎవరో ప్రశ్నించిరట "భాగవతము పోతన్నగారు వ్రాయనిచో, మఱి వ్రాయుటకు సమర్ధు లెవరని, కాసుల పురుషోత్తమ కవియని వారే సమాధానము చెప్పిరట నన్నెవరైన భారతము లోని యుద్ధపంచకము తిక్కన్న గారు వ్రాయకయుండుచో మఱియెవరు వ్రాయఁగలుగుదురని ప్రశ్నించినచో నేను “రాజశేఖర శతావధానిగారని సమాధానము చెప్పెద. ఈ గ్రంధములో చివరి నాల్గశ్వాసములు యుద్ధము తప్ప వేఱే లేదు. యుద్ధవర్ణన మెచ్చటచూచినను తిక్కన్న గారి రచనతోఁ దులదూగుచున్నది.

ఈ గ్రంధము అస్వతంత్ర జాతికొక స్మృతిగ్రంథము వంటిది. రాణా ప్రతాపుని భద్రాకరణ ప్రతిజ్ఞ చూడుఁడు............ఈ ఘట్టము ద్వితీయాశ్వాసములో నున్నది. ఈ ఘట్టము చదివినచో పారతంత్య్రజాతికి ఇది స్మృతిగ్రంధ మన్నమాట కర్ధము తెలియును.

రాణాప్రతాపునకును, మహాత్మునకు గల సామ్యము భారత జాతికి గల యస్వతంత్రత, మహాత్మునిది కత్తిలేని సాత్త్వికపుపోరు - ప్రతా పునిది కత్తిగల సాత్త్వికపుపోరు. ప్రతాపసింహుఁడు అక్బరును జయింప వలెనని యుద్ధము చేయలేదు. పౌరుషశక్తితో గెలువలేనని యాయనకు దెలియును. కాని వట్టి ధర్మము కోసము యుద్ధము చేసెను. భారత జాతీయ ధర్మము పరులకు లొంగిపోదు——చచ్చిపోదు అని రుజువు చేయుటకే యుద్ధము చేసెను.

"కాన విజయంబు ముఖ్యంబు గాదు మనకు, ధర్మ నిర్వహణంబు కర్తవ్య మిపుడు."

ఇది ప్రతాపుని యూహ. ఈఘట్టము చదువవలెను. నేఁటి సత్యాగ్రహ మునకు ఆనాఁటి ప్రతాపుని యుద్ధధర్మమునకు భేదమే లేదు.

ప్రతాపీయులు_అన్నము తినలేదు.-- నీరుత్రావలేదు నిదురపోలేదు. ఇది బలవంతము చేతగాదు వ్రతముచేత.

ఈ కధకు మన కథకు వేయి పోలికలు. అన్నిటికన్న గొప్ప పోలిక అబ్దూరహిమాన్ - ఈయన అగ్బరు చక్రవర్తి సర్వ సేనాని- వీర రసా రాధకుఁడు- ప్రతాపునకు పృధ్వీసింహుఁడు వ్రాసిన యుత్తరము కవియైన యీ ముసల్మాను సేనాని వ్రాసిపెట్టినది. ఆయన యెంత వీరుఁడో యంత కవి. రవిధ్వజము - గరుడధ్వజముగా, కృపాణము - నందకముగా, కవచము పట్టుబట్టగా, హాల్దీఘాటు యుద్ధమున తనకు “ప్రతాప రాజనారాయణుఁదు దర్శన మొసంగెనట. అతఁ డగ్బరుతో ననుచున్నాఁడు. ఆ ప్రతాపుఁడు.....

మ॥ "అకటా నీవలె ధర్మముల్ దెలిసి రాజ్యం బేలఁగాలేఁదొ మ
     చ్ఛికమై భూప్రజఁ బుత్రులన్ బలెఁ గృపాశ్రీఁ జూడఁగాలేఁడొ, పా
     యక వర్ణాశ్రమ ధర్మపద్ధతి తీరంబై నిల్పఁగా లేఁడొ, యెం
     దుకు నాతండు స్వతంత్రుఁడై నిలువఁ గాదో యానతీఁ గోరెద౯.”

ఈరహిమానుఁడు మఱియు ననెను ఆ ప్రతాపునకు తాము సమకాలికు లగుటయే గొప్పతనమట. ఇట్టి రహిమానులు నేఁటి పాశ్చాత్యులలో నెంతమంది లేరు ఆ పాశ్చాత్యులలో నక్బరు చక్రవర్తులే లేరు అక్బరు

చక్రవర్తి ప్రతాపుని గురించి యిట్లనెను._

"ఆ మహానాయక వతంసమా ప్రతాపుఁ
డెన్ని గతుల యోజించిన నన్నుఁబోలు
కోటి సార్వభౌములు చేరి కొలువఁ దగిన
క్షాత్రనిధి యనుమాట వజ్రాల మూట"
"నాదు జీవితశేష మంతయుఁ ప్రతాపు
సేవ కడిపినఁగాని దుష్కీర్తి పోదు.”
"మన బ్రతుకులు పోరులనె తెల్లవారిన వకటా,"

ఇది అక్బరుయొక్క సౌశీల్యము.....

ఈకవి యఖండమైన క్రొత్త పలుకుబడులు గలవాడు.

"ఇతడు బాడబానలము పారమ్రింగు మహా బలుండు”
"పిడుగుల్ వ్రేళ్ళ నఱకు భయద శౌర్యులు*
"మొదలన్ నెత్తురు పంచుకొంచనుజుఁడై పుట్టొందె”
"ఒకకాడన్ జనియించు రెండుపువు లట్లొప్పారి”
"దురదృష్టం బది యెల్ల నాపయిని గంతుల్ పెట్టె"
"అక్బరు విజయరధము కాడిమోసిరి స్వాతంత్య్ర ఘనతమఱచి"
"పుడిసెం డూపిరి మేన నుండు వఱకున్ బోరాడి"
"మూటలను గట్టి యాయువు బుఱ్ఱకెత్తి
"శాశ్వత బ్రహ్మకల్ప మీజగతి నుందుమో. ”

ఈ మొదలైన వనేకములు-ఇంక సందర్భానుసారముగ లోకోక్తులు మొదలైనవి కుప్ప తెప్పలుగానుండి గ్రంధము ఆంధ్రసరస్వతీదేవికి క్రొత్త భూషణముగా నున్నది.

ఈకవి రాజపుత్రయోధుల శౌర్యాదుల నెంత వర్ణించునో ముసల్మానుల శౌర్యాదుల సంతే వర్ణించును. హుమయూనుని వర్ణించుటయు, బేబరుపడ్డ కష్టములు వ్రాయుటయు నొక ముసల్మాన్ కవి యెంత యభిమానముతో వ్రాయునో యీయనయు నట్లే వ్రాసెను. ఈ రచన భారతము ను దలపించుచున్నది. ఉదయసింహునకు 25 మంది కొడుకులు - రెండప వాఁడు సూక్తుడు - మూడవవాఁడు సాగరుఁడు - పెద్దవాడు ప్రతాప సింహుడు - జగమల్లుఁడు మఱియొకఁడు. ఇతడు శౌర్యహీనుఁడు. ఇతనికి రాజ్య మీయవలయునని రాజు తన సరదారులతో చెప్పిపోయెను.

మ॥ “కమలాప్తాన్వయమా! భవత్కృత మహాఘంబేమొ రాముండుపూ
     ర్వము కొన్నేడులు మానియుండవలసెన్ బట్టాభిషేకంబు, చం
     డమహీనాధుఁడు లేకయే చనియె నీ నాఁడీ ప్రతాపుండు స
     ర్వము గోల్పోయెను దుర్బలుల్ జనకు లౌరా యెంతకున్ గర్తలో'

అని బంధుజనులు విషాద మొందిరి సలుంబ్రాకృష్ణుఁడు అచ్చటి తీర్పరి. రాజుతో 'సరే' యనెను కాని చివరకు ప్రతాపునే రాణాచేసెను. జగమల్లుఁ డభ్యంతర పెట్టెను. ఈ కవి చాలచోట్ల నన్నయగారిని పోలినట్లు వ్రాయును. రాజసూయమున సహదేవుఁడన్న మాటలకు, ఇచ్చటి సలుంబ్రాకృష్ణుని మాటలకు పోలిక చూడుఁడు.

     "రాణాలన్ బొనరించు బాధ్యత సలుంబ్రా వారిదన్ మాట యీ
      క్షోణిన్ గల్గిన వారెఱుంగుదురు, ఇచ్చోనేఁ బ్రతాపున్ మహా
      రాణాగా నొనరింతుఁ గూడదను ధీరగ్రామణుల్ గల్గినన్
      బాణిన్ బైకెగనెత్తుఁ డిప్పుడె యెదుర్పన్ వత్తు నత్యుద్ధతిన్.”

జగమల్లుని త్రోసిరాజని కృష్ణుఁడు ప్రతాపునే సింహాసన మెక్కించెను.

      “పరిఫుల్ల రుచిర సరసిజ పరంపరలు నెరిపి నటు నదాభవనం బ
       ప్పుర జనములనెమ్మోములఁబరమామోదమున నపుడు భాసిలుచుండెన్

ఇది మఱల నన్నయ్యగారి రచన. ఈ పట్టాభిషేకోత్సవ మంతయు ప్రబంధ సరణి నడచెను.

రెండవ కొడుకైన సూక్తుఁడు సలుంబ్రాకృష్ణునివద్ద పెంపఁబడెను. ప్రతాపుఁ డతనిని దనవద్దకు పంపుమనెను. శ్రీకృష్ణుఁడుపంపెను. “నాస్వామి స్నేహముమ్రోలఁ దుచ్ఛములు సప్తద్వీప సామ్రాజ్యముల్"

వసంత కాలము వచ్చెను ఎల్లరాజులు ప్రతాపునకు కానుకలు పంపిరి. మఱల నన్నయ్యగారివలె వ్రాయుచున్నాఁడు.

మ॥ "తలపైనన్ మగఱాతురాయి వెలుగొందన్ ధాళధళ్యంబు రం
     జిలు ఖడ్గంబులు వ్రేల, దొడ్డనునుతేజీ లెక్కి యోధాళి చెం
     

   తల నేతేర, బ్రతాపసింహుఁ గొలువన్ నానామహీమండ లేం
   ద్రులు వేంచేసి రుగాది కానుకలు దొంతుల్ దొంతరల్ తెచ్చుచున్

అప్పు డందఱు వేఁటకుఁబోయిరి. ఈ వేటకుఁ బోయినపుడు రాజపురోహితుఁడైన హరభట్టుగూడ వెళ్లెను ఈ పురోహితులుగూడ వీరులే. రాజులకు ప్రాణములు ధారవోసినవారు ఐహికాముష్మికములకు చేయూత యైనవారు.

వేఁటయైన తరువాత కూర్చుండి మాటలాడుకొనుచుండఁగా నొక వరాహము వారి నడిమికి వచ్చెను దానిని అన్నదమ్ము లిద్దఱు సూక్తుడును ప్రతా పసింహుడు - తమ బాణములతో గొట్టిరి. నేను చంపితినన నేను చంపితినని తగవులాడిరి. సూక్తుఁడు ప్రభువుతో నన్నగారితో వివాదము పెంచెను. సలుంబ్రా కృష్ణునిగూడ లెక్క సేయలేదు. హరభట్టు సూక్తునకు నీతి సుపదే శించెను. ఆ పురోహితునితో సూక్తు డిట్లు పొగరుపోతు తనము ప్రకటించెను.

    "తనదౌ శక్తికి మీఱు కార్యములకున్ దార్కొన్నచో ముప్పు వ
     చ్చును మాయిర్వురలోన నొక్కఁడు రణక్షోణిన్ మృతిన్ గన్న మీ
     రును రావచ్చును నేడ్వవచ్చు మఱి పౌరోహిత్యమున్ జేయ వ
     చ్చును లబ్ధిన్ గొనవచ్చు నిప్డు చనవచ్చున్ దాఁటి దూరంబుగన్
 

అంత హరిభట్టు వారి యుద్ధ మాపలేక వారి నడుమ తాను కత్తి పెట్టు కొని పొడుచుకొని చచ్చెను.

"నాటి కష్టదశన్ దీర్పన్ బూని యాత్మార్పణంబు నొనర్చెన్ హర భట్టు త్యాగనిధియై ముల్లోకముల్ మెచ్చఁగన్.”

అంత యుద్ధము సమసిపోయెను. "గురు రుధిరంబు దాటగను కూడదు. అని ప్రతాపుఁడుయుద్ధమును మానివేనెను సూక్తుఁడు దేశమును వదలి పోయెను. ఎచ్చటికి బోయెను?

“ తా, నరిగెను ఢిల్లీత్రోవకు కులాంతకు లందఱు పోపు తావుకున్ "

ఇచ్చటినుండి ప్రతాపుని శౌర్యాగ్నిరాజి మండి, యత్యుగ్రమై, పాతికయేండ్లు తగులబెట్టిన ఘట్టము. ఆశౌర్వము, ఆయుద్ధములు, ఆప్రతి జ్ఞలు అవియన్నియు వ్రాసినచో పట్టరానంత గ్రంధమగును. ఈ కవి సార్వభౌముడు ఈఘట్టము చిత్రచిత్రములుగా వ్రాసెను మొదటనే చెప్పితిని గదా "ఈ గ్రంధము యుద్ధపంచకమువలె నున్నదని, ప్రతాపుఁడు దేశమంతయు బీడు పెట్టించి తన్ను సేవించు నందరిని వెంటఁదీసికొని కుంభల్మియరు దుర్గములో గూర్చుండును సలుంబ్రాకృష్ణుఁడు - భానుసింహుఁడు - మనస్సింహుఁడు శ్యామసింహుఁడు... తేజస్సింహుఁడు - రామచంద్రదేవుఁడు - భిల్లనాయకుఁడై న భీమచాందుఁడు వీరందఱు తమతమ రాజభక్తులను తెల్పిరి. వారి రాజభక్తి తెలుపుటలను చదివియే చూడవలయును. ఈబైరాగియైన ప్రతాపునకు_ఆమహా రాజైన అక్పరునకు విరోధము. భోగసన్న్యాసమున ప్రతాపుడు, రాజ్యతృష్ణ చేత_అక్బరు, తన చేతిలో చిక్కిన మోగలు సైన్యమును ప్రతాపు డెన్నిసారులో వదలిపెట్టెను ప్రతాపుని యీ కట్టుదిట్టములు చూచి అక్బరు భయపడెను. ప్రతాపుని గెలువలేనవని కాదు. ప్రతాపుని మీదికి పోయినచో తన కండగా నున్న రాజపుత్ర సేనానులకు కోపము వచ్చునని, అతఁడు దీర్ఘదర్శి-అప్పటి కప్పుడు భేదము పన్నుట కాకపోయినను భేదము పుట్టుటకు నొక సన్నాగము పన్నెను.........

     "నముఁగడుఁ బేర్మిమైఁ గనుచు నాప్రభుతన్ మదిమెచ్చి కన్య ని
      చ్చిన మిమువంటివారి వెలిచేసి ప్రతాపనృపుండు పంక్తి భో
      జమున కైన నించుకయు సైపక తేలియకచేసి చూచె మీ
      ఘనతకు హాని వచ్చినను గల్గవె నాకు విషాద వేదనల్

ప్రతాపుఁడీ కులము చెడినవారితో భోజనము చేయఁడు. కులము చెడుట తప్పని ప్రతాపుని యుద్దేశము. ఒక జాతియొక్క జాతీయతలో వర్ణ భేద ముతర్భూతమని వారి యుద్దేశము..... తరువాత అక్బరిట్లను చున్నాడు.

     "మఱి నాయొద్దను జేరు భూమిపతులన్ మర్యాదతోఁ జూడనో
      ధరణీభాగము లీయనో పిలిచి బాంధవ్యంబు చేకూర్పనో
      చిరమైత్రిన్ విహరింపనో నృపులు నన్ సేవించి చేదేమి మే
      సిరి? తానింతటి మౌర్ఖ్య మేమిటికిఁ దాల్చెన్ జెప్పఁగాఁ జాలుదే"
      

ఇంత రాజనీతి అక్బరు ప్రకటించెను. ఇట్టి రచన సామాన్య కవి

చేయునదికాదు. ఇది తిక్కనాదులు చేయఁదగ్గది మానసింహుఁడు ప్రతాపుని యొద్దకుఁబోయి అక్బరును గుఱించి యెంతయో పొగడెను. మానసింహుని వంశమునకు ప్రతాపుని వంశీయులు గురువులు, ప్రతాపుఁడు మానసింహుని పొగడిత విని అక్బరు రాజనీతి మానసింహునికి విఱిచి చెప్పెను.

  "నిగూఢ మాతని మనోవ్యాపార లీలాగతుల్ "
  “అల్లుడై-బావయై - మామయైన తన్ను
   వెలితి గననీక శ్రీ మహావిష్ణు నట్లు
   భారతీయులు కొలుతు రన్ భావమెఱిఁగి
   అక్బరటు చేసే హేతు వన్యంబు గలదె.”
  

అని చెప్పెను అంత చల్లెగాఁ బాలించు నక్బరు రాజ్యములో ఘోర్ఖర దేశమున క్షామము. అక్బరొకవంక దిగ్విజయమును చేయుచున్నాడు ధనేశ్వరమ్మున సన్న్యాసులలో - సన్న్యాసులకుఁ బోట్లాట పెట్టి తానొక పక్షము చేరి, వారందఱిని నాశనము చేసినాఁడు. యిందు ప్రతాపుని యొక్క ధర్మమననేమో; నిజమైన రాజెట్లుండ వలయునో, ఆప్రతాపుఁ డెట్లు నిజమైన రాజో ఈ ఘట్టమంతయు చదివినచోఁ దెలియును. ప్రతాపుడు ప్రకృతి బిడ్డ. భోగవిముఖుఁడై నరాజు. భోగాభిముఖుడైన రాజువలన లోకములో, గొంత భాగము తిండిలేకుండఁ బోవును.

  “అకాపట్యము లాదరస్మితము లాయౌదార్య మావియ్య మా
   మోకాల్ మ్రొక్కులు నాచమూ విభవ మా ముప్రొద్దు సేవించుటల్
   నాకెత్తున్ దలనొప్పి పట్టణము లన్నన్ మీకు నెట్లుండునో
   నాకీ కొండలువోలె సౌఖ్య మిడు శాంతస్థానముల్ లేవుపో!
   
ఇది ప్రతాపమూర్తి అనిన, మానసింహుఁడు,

   ఈ యేరిటు పాఱఁజొచ్చె నెదురీద నెవండు సమర్థుఁడౌ వృధా పౌరుష మున్న
   దంచు బడబాజ్వలనంబును బాఱమ్రింగెదే!”
   

అన, ప్రతాపుఁడు ఒక చిన్నకధ (Parable) చెప్పెను. ప్రతాపుఁడు గాంధీ వంటివాఁడు - యేసుక్రీస్తు వంటివాడు - మహర్డుల వంటివాఁడు చివర కిట్లనెను. "నారాజ్య మరణ్యము-మేము సన్న్యాసులము మీయక్బరు నకు మమ్ము గెలువవలెనని పట్టుదల ఏమి”

"అప్రతిహతముగా నక్బ రొక్కఁడె యేల క్షితిని దేవుఁడు సృష్టి చేయలేదు. ప్రజ లతనిచేఁ జంపబడటకుఁ బుట్టలేదు- రాజకన్యక అతని భోగ పరతకుద్దేశింపఁ బడగలేదు. అతని రాజ్యతృష్ణ ముందు సర్వజగత్తు “పారతంత్య్రయమున మునుఁగుటెల్ల పాడిగాదనుచు నక్సరెంత యెఱిఁగిన జగమున కంత మేలు" చివరకు భోజనవేళ మానసింహునకు గోపము వచ్చెను. నిష్ఠురోక్తు లాడెను. మిమ్ము నాశనము చేసెదనని చెప్పి లేచిపోయెను.

   ఇది యవనసేనతోఁ జేయు కదనమో స్వ
   జనముతోఁ జేయు కదనమో శంక గలిగె

ఈశంక ఆనాటినుండి ఈనాటివఱకు అట్లే యున్నది. ఈయుద్ధములో ప్రతాపుని సైన్యములు చెదరిపోయినవి. ప్రతాపుని తమ్ముడు సూక్తుడు ప్రతాపుడు అవతార పురుషుడని గ్రహించెను మఱల నన్నగారి వైపే చేరెను.

చివరకు తనబిడ్డ మోలుగడ్డితో చేసిన తినుచుండగా నడవిపిల్లి వచ్చి దానిని గీరి రొట్టె నెత్తుకొని పోయెను. ప్రతాపుఁడు చక్రవర్తి నాఱు నెలలు గడు వడిగెను ఉత్తరమిచ్చిభిల్లుని పంపెను ఆయుత్తరమును చూచి యక్బరు పొందిన సంతోషమునకు మితిలేదు. అక్బరు సభ లో పృధ్వీసింహుఁడు ఆ యుత్తరమును ప్రతాపుడు వ్రాయనే లేదనెను. వారును వీరును వివాదపడిరి. ఆయుత్తరము తెచ్చినభిల్లునితో పృధ్వీసింహుడును భార్యయు నిట్లనిరి.

"చెప్పుము చిత్తమిచ్చి యిదె శ్రీ నృపలోక జగద్గురుండు మాయప్ప ప్రతాపదేవుని ముఖాంబురుహంబున జంద్రబింబ మందొప్పెడి వెన్నెలట్లలరు నుత్తమమౌ దరహాసరేఖ తానెప్పటి యట్ల పాయక రహించుచు నున్నదె భిల్ల శేఖరా!

ఈపద్యము భాగవత పద్యమువలె నున్నది. కృష్ణుఁడు సుఖముగా నుండెనా యని ధర్మరాజు అర్జును నడిగిన ఘట్టములోని పద్యమువలె నున్నది.

శ్రీ నృపలోక జగద్గురుండు-మాయప్ప- ప్రతాపదేవుఁడు " ఇందు రసధ్వని వేయిమూర్తుల రూపు గట్టుచున్నది. హృదయము నుండి వచ్చిన భాష యనఁగానిది. వట్టి యక్షరములుగా మాటలుగా గనిపించును గాని ప్రతాపుఁడుగా మూర్తి గట్టిన పృద్వీసింహుని స్వాతంత్య్రాభిలాష యంతయు ధర్మ వీర రసమంతయు ఆమాటలలో నున్నది. ఇట్టి రచన మహా కవులే చేయఁగలరు.

ఆబ్దూరహిమాన్ వ్రాసిన యుత్తరము అతడు పృధ్వీసింహునితోఁ జేసిన సంభా షణ - ఆయుత్తరమును చదివితీరవలయును - అందులో కొన్ని భాగములు'

   "భరత ఖండంబు నుద్దరింపఁగ జనించు
    ధూర్జటివి నీవు రాజమాత్రుఁడవు గావు"
   "తనదు నేర్పిడి సంత హైందవ మహత్త్వ
    మక్బరంతయుఁగొను దొడ్డ యడితికాడు
   "స్త్రీలఁ బురుషుల రాజ్యంబు దేశమెల్ల
    విలుచు నీయక్బరను గొప్ప విలువకాఁడు
    
ప్రతాపుఁ డిట్టివాఁడు --- ఇంక అక్బరు ఇట్టివాఁడు.

    "ఈవు విశ్వప్రపంచమం దీశ్వరుని య
     నంత లీలాగతులు గొనియాడె దెపుడు"
     
    "విలువఁ గట్టుచు రాజ్యంబుఁ గొలుచు నక్బ
     రెవరి గొప్పతనం బెంతొ యెఱుఁగు జగము " "

ప్రతాపుఁడు మఱల యుద్ధమును ప్రారంభించెను. కొండలలో దాగి పొంచుచు పైబడుచు చీల్చుచు కలచుచు విటతాటనము చేయుచు త్రుటిలో చాటగుచు నిట్టి యుద్ధము చేసెను. (Guerilla warfare.) అయినను గెలువలేక పోయెను. ప్రతాపుని దారిద్య్రమున కంతు లేకపోయెను. చివరకు ప్రతాపుఁడు దేశమే వదలిపెట్టి పోఁదలఁచెను.- భామాసాహి వచ్చెను. ధనమిచ్చెను. ప్రతాపుఁడు మఱల సైన్యము సమకూర్చెను. మఱల తన రాజ్యమంతయు గెలుచుకొనెను.

అంతయు నైనది. కాని, ఓయి ప్రతాపా శ్రీనృపలోక జగద్గురూ! మాయప్పా!

సీ॥ అక్బరు విశ్వంభరాధీశ మౌళిది
             ధనసేవ నీయది దైవసేవ
    యాతని దెల్లప్పు డాత్మవైభవము నీ
             యది నిరంతరము నాత్మావ బోధ
    మతని కుండినదెల్ల నైహిక బలము ని
             న్నాశ్రయించినదెల్ల నాత్మబలము
    నతని దందఱ కన్ను లలరించు భోగంబు
             నీది జగముమెచ్చు నిండుత్యాగ
             
గీ॥ మతఁడు జగము గెలిచె నాత్మ గెల్చితివి నీ
    వాతఁ డితర జనుల నాశ్రయించు
    నీవు స్వాశ్రయుఁడపు నీకు నాతని కెన
    లేదు జగము క్రిందు మీఁదులైన.

ఇంక నొకమాట. ఈరసప్రవాహములో ప్రవాహము వెంటనే పోయి విమర్శించితిని. వేరొక గతిలేదు. కాని ప్రవాహము నడుమను, తీరము వెంటను, నంగుళ మంగుళమును గల దామరపూలు, కలువపూలు, నీటి బెగ్గురులు మొదలైన శోభలు పాఠకులే చూచుకొనుచు చదువుకొన వలయును. ఇది పరమోత్తమ గ్రంధములలో నొకటి.

—♦♦♦♦§§♦♦♦♦—

విజ్ఞప్తి.

" శ్రీ రాణా ప్రతాపసింహ” కావ్యకర్తలు శ్రీ దుర్భాక రాజశేఖర శతావధానిగారు 30-4-1957 పరమపదించిరి. వారి లేఖనినుండి యింక నేన్నో కావ్య గుచ్చములచే పరిమళింపవలసిన భాగ్యము ఆంధ్రసారస్వత వనికి లేకపోవుట కెంతయు చింతించు చున్నాము.

ఆంధ్ర జనత నుండి “రాణా ప్రతాప” కావ్యము కావలెనను ఉత్తరము లెన్నియో వచ్చినవి. అట్టి కావ్యము ప్రజల కందుబాటులో లేకుండుట సంభావ్యము కాదని, వారి అల్లుడు కుమార్తెయు నగు శ్రీ M. అనంతరామ్ M.B.B.S, శ్రీమతి కామేశ్వరీ దేవిగారు ఈ కావ్యమును పునర్ముద్రణము చేయింప దలచి, ఆ కార్యభారమును నా కప్పగించిరి నేనును శ్రీ శతావధానిగారియందును, కావ్యము నందును నాకుగల గౌరవముచే సంతోషముతో అంగీకరించితిని. ఈ కావ్యము ని ట్లు ముద్రింపించి యిప్పుడు వెలువఱచు చున్నాము.

ఈ కూర్పున మేము చేసిన మార్పు లేవియు లేవు. తృతీయ ముద్రణ ప్రతి ఆధారముగా కావ్యము ముద్రింప బడినది. పీఠిక ప్రధమ ముద్రణము లోనిది గైకొన బడినది.


ప్రొద్దుటూరు,

సి. వి. సుబ్బన్న శతావధాని.

1-8-58.

శ్రీ

కా మే శ్వ ర్యై న మః

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర

ప్ర థ మా శ్వా స ము

శ్రీనాధాబ్జభవాదు లెవ్వని మృదు శ్రీపాద పంకేరుహ
   ధ్యానానందరసాబ్ధిఁదేలి కృతకృత్యత్వంబుఁ బ్రాపించుచుం;
   ద్రా నీహార నగాత్మజా ప్రియుఁడు నిత్యానందుఁ డారోగ్య వి
   జ్ఞానశ్రీలిడి చంద్రశేఖరుఁడు విశ్వంబెల్ల రక్షించుతన్
   
సీ॥ అబ్జాతనయనుని యత్త వారిల్లైన
 కలశ పాథోరాశి గర్భమందు
వజ్రమౌక్తిక పంక్తి పడవని పరుపులై
 తేజరిల్లెడు మణి ద్వీపమందు
రవిరశ్మి నింత చొరంగనీని కదంబ
తరురాజ వనము మధ్యంబునందుఁ
బ్రావాతసూర్య ప్రపాదాసమానమౌ
చింతామణీ భద్ర సింహపీరి

గీ|| ద్రిదిశకోటి కిరీట సందీప్త రత్న
    రాజి నీరాణిత పదాజ్ఞయై జగంబుఁ
    బాలన మొనర్చు మాయమ్మఁ బ్రస్తుతింతు
    రమ్య గుణధన్య శైలాధి రాజకన్య.
    
    


సీ॥ పుంజీభవించి యుప్పొంగి శైలములు శృం
             గములెత్తి దివిని బ్రాకంగఁజనిన,
    రంగదుత్తుంగ తరంగ సంఘములతో
             నీరధి కలఁగి ఘోర్ణిల్లుచున్న ,
    హోమకుండముల సహోరాత్రముల నూర్ధ్వ
             శిఖల నగ్ని తపంబు సేయుచున్నఁ
     గులశైలములు పెల్లగిలఁ బ్రభంజనుఁడు జృం
             భించి భీకరధాటి వీచుచున్న
             
గీ॥ శబ్దగుణరూఢి నవ్యయ సరణి నభము
    విష్ణుపదమై తనర్చిన, వీసమైన
    నేజనని శక్తిమాహాత్మ్యమెఱుఁగ; వట్టి
    భవుని కొమ్మను మాయమ్మఁ బ్రస్తుతింతు.
    
సీ॥ ఏమహామహుఁడు సంస్కృతపాండితిని గొప్ప
            పర్వతంబని నుతుల్ వడయఁ గలిగె
    నేఘనుం డాంధ్రమందెల్లపండితులచే
            దిగ్ధంతియనుచుఁ గీర్తింపఁబడియె
    నేసద్గుణార్ణవుండెల్లెడఁ దర్కసిం
            హుఁడటంచుఁ బెనుకీర్తినొందఁ గలిగె
    నేకళావిదుఁడు వైయాకరణుల నిట్టి
            ఘనుఁడు లేఁడనుచు విఖ్యాతిఁ గాంచె

గీ॥ నట్టి కందాళ్లవంశ సుధాంబురాశి
    చంద్రుఁడైన దాసాచార్య సత్తముండు
    గురుఁడు దైవంబు; తత్పద సరసిజములు
    స్వాంతమున నెంచువాఁడ నపారభక్తి
    
మ॥ తననాధుండొనరించు సత్కృతుల కుత్సాహమ్మున దోడు చే
     యను గాక్షించి సహస్రహస్తముల శిష్యశ్రేణిఁ బోషింప నే
     ర్చిన మత్సద్గురు మానినీతిలక మా "శ్రీరంగమాంబా మహా
     జననీరత్నము” గొల్తు నెల్లపుడు సాక్షి దిందిరాదేవిగన్

మ॥ తనసౌజన్యము సజ్జనుల్ పొగడ నిత్యంబు సదాచార వ
    ర్తన మొప్పార, గురుండు దైవమగుచున్ బ్రహ్మోసదేశాది పా
    వనకృత్యంబులు నాకొనర్చిన ఘనున్ బ్రఖ్యాతచారిత్రు మ
    జ్జనకున్ వెంకటరామయార్యు మదిలో సద్భక్తి భావించెదన్.
    
గీ॥ "మాతృదేవోభవ" యటన్న మహితసూక్తి
     మఱువరానిది; నిరతము మజ్జననిని
     దొడ్డ ముత్తైదువను మనస్తోయజమునఁ
     గొలిచెదను సుబ్బమాంబ, సద్గుణకదంబ.
     
మ॥ నను గారామునఁజేర్చి యాంధ్రమున 'నోనామాలు' మెట్రిక్యులే
     షనుపై నాంగ్లము నేరిపించి తనదౌ సర్వస్వ మర్పించి పెం
     చిన కారుణ్యరసార్ద్రమానసుఁడు మా చిన్నయ్య ‘సంజీవరా
     యని దుర్భాకకులాబ్ధిసోముని మది ధ్యానింతు నెల్లప్పుడున్
     
గీ॥ భారతీనాధు నపరావతారములనఁ
     గావ్యజగము సృష్టించి లోకములు మనువు
     నన్నయాది కవీంద్ర మందారతరుల
     నాంధ్రభాషాగురుల నిత్యమభినుతింతు.
    
గీ॥ ప్రకృతితత్త్వరహస్య సర్వస్వ మెఱిఁగి
      నవనవోన్మేషమైన ప్రజ్ఞయుఁ దనర్పఁ
      గృతులు విరచించి లోకోపకృతులు పెంచు
      నార్య కవికోటి నిత్యవిద్యార్ధిగణము.
      
గీ॥ నూతనోజ్జీవమిచ్చు ప్రాభాత దక్షి
     ణానిలము సోకఁగా మేడపైన “టాడ్డు"
     దొర రచించు రాజస్థాన చరిత మెత్తి
     యొక్కనాఁడేను జదువుచు నున్నయపుడు.”
     
సీ॥ సంస్కృతాఖండ భాషాకావ్య సాహిత్య
            సామ్రాజ్య సర్వస్వ చక్రవర్తి,
     యఖిలాంధ్రభాషా మహాకావ్యవిరచన
            వ్యంగ్యవైభవ పట్టభద్రకీర్తి,


బహుళ విద్వద్బృంద పరిషదర్చిత పుష్ప
            మాలా మనోహర మహితమూర్తి
తేజంబు నెఱపు జ్యోతిశ్శాస్త్ర విద్యాంగనా
            నవ్య రుచిర భావానువర్తి.
            
గీ॥ శిత శతవధాన హర్షితా స్థాన దత్త
   కనక జయఘంటికా సింహ కంకణ రవ
   ముఖరితాశాంతసద్యశఃపూర్తి, సుకవి
   సింహ బిరుదుండు వేంకట శేషశాస్త్రి.
    
క॥ చనుదెంచి నన్నుఁ గవి వం
   దనమని వచియించి విలువఁ దమ్ముఁడ రాద
   మ్మని కౌఁగిఁటఁజేరిచి చెం
   తను నేఁ గూర్చుండుమన నతఁడు కూర్చుండెన్.
   
గీ॥ స్వాంతమునఁ బొంగి పొరలెడు హర్షభరము
   వికసిత ముఖాబ్దములపైన వెల్లివిరియ
   మాటలాడితి మలపును మలపులేని
   కుశల సంప్రశ్నములఁ గూర్చి కొంతతడవు.
   
చ॥ చిఱునగ వాస్యసీమ వికసింపగ వేంకటశేషశాస్త్రి “సో
    దర! మును నన్నయాది కవి తల్లజులెల్ల పురాణసంతతుల్
    సరస పదార్ధ భావ గుణ సంభృతమై తగు మంచి శైలిలో
    విరచన చేసియుండి రవి విశ్వజగన్నుతమై తనర్చెడున్. 15

క॥ పిదపఁ బురాణాంతర్గత
   విదిత వివిధకథలు గొనుచుఁ బెద్దన్నాదుల్
   పదునెనిమిది వర్ణణములు
   గదియించి రచించి రఖిల కావ్య శ్రేణుల్ 16
   
ఉ॥ కాలముకొంత యిప్పగిదిఁ గావ్యయుగంబుగ సాఁగె ; దానిలోఁ
    బూలవనంబు అయ్యమృతపున్ నెలయేఱులు నిగ్గుటాణి ము
    త్యాల బెడంగు మేల్గొ డుగులచ్చపు వెన్నెల సోగలో యనన్
    జాలిన మేటికావ్యము లసంఖ్యముగా జనియించె వ్రేల్మిడిన్.17


ఉ॥ ఆవలఁ గొన్నినాళ్లరుగ నంతట నంతట సారవంతమౌ
    త్రోవలు తప్పి కాంతిచెడి దుర్గము దుర్గములట్లు భీకరా
    శీవిషమున్న పేటికల చెల్వునఁ గాననరాజ మాడ్కిఁగా
    వ్యావళులున్ వికాసగుణమంతయుఁ గోల్పడె బీడువోవుచున్.
    
క॥ పెక్కామడ కొక్కఁడుగా
    నక్కడలిని గల్గు దీపులట్టులు కైతల్
    చక్కఁగ లిఖించి వార్గల
    రిక్కాలంబునను నొక్కరిరువురు పెద్దల్.
    
మ॥ ప్రతిభా పూజ్యులు వారు వ్రాసిన మహాగ్రంధంబు అత్యంత పు
     ణ్యతమంబుల్ గద' వాని నట్లునిచి యన్యగ్రంధముల్ చూచినన్
     మితియో మేరయొ యేమన్ వలయు స్వామీ వద్దు చాల్ చాల్ సర
     స్వతికిన్ వాఁతలు పెట్టినట్లలరుఁ 'బాపం శాంత' మిప్పట్టునన్.
     
చ॥ యతులు వనాళిఁ, బ్రాసములు నాయుధశాలల, లక్షణంబు ల
     శ్వతతి, రసంబు వైద్యుకడఁ బాకము వంటలలోన, నయ్యలం
     కృతులు బడంతులందు, మఱి రీతులు రోఁతల, శయ్య మేడ, ని
     ట్లతికిన కావ్యముల్ గనిన నయ్య యొడల్ దహియించినట్లగున్.
     
శా॥ ఈవిన్నాణము లెన్నియేని గల వాయీ యంశముల్ కొంతమే
    రై వర్తించు ముసళ్లపండువది ముందైయున్నదన్ మాడ్కిఁజె
    ల్యై విశ్వం బగలించుచున్నయది యాహా! గ్రాంధిక గ్రామ్య భా
    షావాదంబు క్షణక్షణంబునకు హెచ్చన్ జొన్చే నీ వేళలో.
    
గీ॥ దేశమంతటఁ వాఱు నదీమతల్లి
    వంటిదగు వ్యావహారిక భాష; దాని
    నచ్చటచ్చట దేశంబు నలముకొనిన
    మంచియును జెడ్డయును నాశ్రయించియుండు.
    
ఉ॥ ఊరకభాషలేమిటికి నుత్తమ సంస్థితి గల్గు: దాన సం
    స్కారబలంబు గల్గి యధికారము దాల్చిన ప్రాజ్ఞికోటి దా
    షారచనంబుఁ బూని కృషిసల్పినఁ గల్గెడి; రిక్తులూ వినన్
    బారము ముట్టునే గజము పైఁజవుడోలు ఖరంబు మోయునే.
    

క॥ అంతస్సారములేక య
   వాంతర భాషలను గల్గు పదజాలములన్
   దొంతరగఁ గలుప బాసయుఁ
   గంతులు గలవాని మేను కైవడిఁ బొలుచున్.24
   
క॥ క్రమమునకు బాసలోనయి
   యిముడమి, బుధకోటులెల్ల 'నెవరికి వారే
   యమునాతీరే' యనుగతి
   భ్రమగొని దెసలకును విఱిగి పారుదు రొకటన్.25
   
ఆ॥ సరసశబ్ద మిట్టి సబ్బండు బాసలోఁ
    చక్కఁదోవ దింకఁ దమవికొన్ని
    తాళ్లపాక వారితప్పులు మఱికొన్ని
    యనఁగఁ దప్పుఁ గుప్పలై రహించు.26
    
ఉ॥ భావకవిత్వ మొక్కఁడట; భావములేని కవిత్వమింక నాం
    ధ్రావనిఁగాదికే యవని నైనను గల్గునె? కల్గినేని యా
    ప్రోవు కవిత్వమంచు బుధ పుంగవు లెంతురె? యేటిమాటలో
    భావ మభావమౌ కవిత ప్రాణములేని శవంబు గాదొకో.27
   
ఉ॥ పేరేదియైననేమి, మఱి పేరున యోగ్యత వచ్చునే రసం
    బూరేడు నట్టి కైతమది యుత్తమ; మన్య మయోగ్య; మెల్లెడన్
    సౌరభ పూరముల్ దెసలఁ జల్లెడు తామరపూపుఁజూచి యే
    పేరునఁ బిల్చిన౯" గుణము వీసము హెచ్చునొ, లేక తగ్గునో. 28
B
గీ॥ అలరుఁదేనెల మఱపించు పలుకుఁబొందు.
    పలుకుఁబొందుకుఁ దగినట్టి భావపుష్టి,
    భావపుష్టికిఁ దగు రస వైభవంబు,
    కూర్చు ధన్యుండె పో: కవి కుంజరుండు.29

చ॥ పరువడిఁ బద్యకావ్యములు వ్రాయుట మోటదనంబటంట, నా
    గరికత కెంతో లోపమఁట, గద్యమొ గేయమొ సద్రసోత్తర
    స్ఫురణను మించునంట, మఱి పొత్తము పెద్దదిగాఁగ నుండినన్
    బరువఁట, చిన్నిపొత్తములు నాడెముఁ గూర్చునటంట, వింటివే. 30


సీ॥ భాషామహాదేవి వాహ్యాళి యొనరించు
           మానిత నంతనోద్యాన చయము
    సాహిత్యలక్ష్మి విశ్రాంతి కేర్పఱచిన
           హాటక వివిధ సౌధాగ్రతతులు
    బహుళ విద్యాధన ప్రకరంబు నింప దీ
           పించు భాండాగార సంచయములు
    బాగోగు బోధించి ప్రజ సుద్దరించెడు
           విజ్ఞాన సర్వస్వ వేశ్మవితతి
           
గీ॥ పద్యకావ్యసమూహ సౌధాగ్య గరిమ
    మిట్టిదని వివరింపఁగా నెవ్వఁడోపు
    లోకకల్యాణ విజయ సశ్రీకదివ్య
    పారిజాత ప్రసూనైక హారసమితి. 31
    
గీ॥ ప్రకృతసారస్వతస్థితి వఱలునిట్లు:
    మాటవరుస కంటినిగాక మనకు నేల
    దానిఁజర్చింప" ననుచు మందస్మితంబుఁ
    గొలుపు నాతని వదనమేఁ గలయజూచి. 32
    
గీ॥ “పూర్వకాలఁపుఁ బాండిత్యపుంబ్రశస్తి
    కావ్యముల యున్నతాదర్శ గౌరవంబు
    కొఱతవడ నిష్టపడనట్టి గొప్పసుకవి
    వగుట నింతగఁ బరితాపమందె దీవు. 33
    
చ॥ తలకొకబుద్ధి, బుద్ధికినిదగ్గ తలంపు, తలంపులోపలన్
    వెలువడు భిన్నభిన్న గతిఁ బెక్కులు యోజన, లింక నేగతిన్
    బలువుర కై కమత్య మదిపట్టు స్వతంత్రత ముఖ్య దైవమై
    నిలిచిన నేఁటికాలమున నీహితబోధ మెవండు చేకొనున్ ? 34
    
చ॥ తెలివిగలట్టి బాలుఁడొక తీఱు పఠించుచు మాతృభాషలో
    పలఁ దగుజ్ఞాన మొందెడు ప్రబంధము లియ్యెడ నాలుగేనియున్
    వెలువడ వెట్టిపాపమొకొ, నేర్పేడు విద్యయుఁజూడ, నూటికిన్
    నలువదికన్నఁదక్కవ గుణంబులు వచ్చినవాఁడు నెగ్గెడిన్.35


గీ॥ వాలి వాల్మీకి కేమికావలయు ననుచు
    గైక కైకసి చెల్లెలుగాదె యనుచుఁ
    గర్ణుఁ డాకుంభకర్ణుని కడపటి కొడు
    కగుఁగదా యని యడుగు విద్యార్థులుండ్రు.
   
ఉ॥ క్రూరమృగంబు, వాడియగు కోఱలు, పెద్దదీ తోఁక, యాఫ్రికా
    తీరవనంబులన్ దిరుగు, దీనిని మర్త్యులు పట్టలేరటం
    చాఱవ ఫారమున్ జదువు నర్భకుఁ డొక్కరుఁ డావిభీషణున్
    గూరిచి వ్రాసె; నెట్టులు కనుంగొననేర్చెద విట్టిరోఁతలన్.
    
క॥ ఇది యెంతగఁజెప్పిన ను
    న్నది; ప్రకృతము ననుసరింత; మస్మన్మనమం
    దుదయించినట్టి కోరిక
    నిదె తెలిపెద నాలకింపు మీ శ్రద్ధమెయిన్.
    
గీ॥ సప్తసంతానములఁ బ్రశస్తమయి ఖిలము
    గాని దొకకృతి యన్న సత్కవులమాట
    కలికి పదియాఱువన్నె బంగారుమూట
    రమ్యతరమైన రతనాల రాచబాట.
    
సీ॥ జ్ఞానంబునకు మూలసారమౌ నాత్మ కా
            వ్యకవిత్వమని "వర్డ్సువర్తు” నుడివె;
    సత్యంబునకు సౌఖ్య సంగంబు చేకూర్పఁ
            జాలిన కళయంచు "జాన్స" ననియె:
    నతుల సంగీతర సాత్మకంబయిన భా
            వాలాపమనుచుఁ "గార్లైలు” తెలిపె
    బ్రతిధావిలానంబు వాక్యదేహంబుఁ దా
            ల్చిన రూపమనుచు 'షెల్లీ' వచించె
            
గీ॥ 'హడ్స'నాదిగ నెందఱో యాంగ్లకవులు
    పద్యకవితకుఁ గల గౌరవప్రశస్తి
    యట్టిదిట్టి దనంగ రాదని సహస్ర
    ముఖముల నుతింప వినమొకో పూర్వమందు.
    


గీ॥ దేశభక్తియుతంబు నీతిప్రబోధ
   కముఘనాదర్శమగు పద్యకావ్యమొకఁడు
   సరసజనములుమెచ్చ రసంబు హెచ్చ
   సృష్టి సేయంగ నిపుడు యోజించుచుంటి.
  
క॥ విరచించునెడలఁ గల్పన
   పేరయకయును నతిశయోక్తి పెంపొందకయున్
   జరిగినది జరిగినట్టులు
   మెఱయుటచే దేశచరిత మెప్పు వహించున్.41
   
క॥ ఆదిగా కార్యావర్తము
   త్రిదశులకును బావనమగు దేశము; దానన్
   బొదలెడు నృపులు మహేంద్రుని
   మదిమెచ్చరు పుణ్యవిభవమాన్యతలందున్.
   
సీ॥ మేవాడ రాజ్యలక్ష్మీ పదాంభోజాత
             ములను గొల్చిన దత్త పుత్రకుండు
    బాలగోవింద విప్రస్వామి శిష్యుఁడై
             తవిలి మ్రొక్కిన మేటి ధర్మమూర్తి
    స్వర్ణరక్షాబంధ బద్ధుఁడై బూందీ మ
             హారాజ్ఞి సేవించుననుఁగుదమ్ముఁ
    డఖల ప్రజాగణంబభినుతుల్ గావించు
             రామసింహుని రాజరక్షకుండు
             
గీ॥ తీవ్రరుజ పెచ్చు పెరిగి బాధించుచున్నఁ
   ద్రుటియు మేవాడ విడఁబోని దొడ్డమగఁడు
   భరత ఖండాభిమాని సత్ప్రభువతంస
   మాప్తమణి టాడ్డుదొర నిత్యమభినుతింతు.
   
మ॥ సరసాగ్రేసర చక్రవర్తియును నా 'స్కాట్లండు' సంవాసియున్
    వరకారుణ్య రసార్ద్ర మానసుఁడు కర్నల్ జేమ్సు టాడ్పండితుం
    డిరవై రెండగునేండ్లు హైందవమునం దీంపార నుద్యోగియై
    చరియించెన్ గిరులున్ బురంబులును రాజస్థానదేశమ్మునన్.
    



ఉ॥ వీరరసార్ద్రమౌ కధలు వీనులు సోఁక నమస్కరించి పూ
    జారతి వీరులన్ గొలుచు సజ్జనుఁడౌటను రాజపుత్ర ధా
    త్రీరమణాళి సత్కధలు రేయుఁబవల్ గడియించి యాంగ్ల భా
    షా రమణీయకావ్యముగ శ్రద్ధమెయిన్ రచియించె నాతఁడున్.
    
సీ॥ సర్వసన్నుతము రాజస్థానదేశంబు
              మాతృదేశము మించి మహితభ
    క్తి గొలిచి తద్దేశ వాసుల బంధువులపోల్కిఁ
              ప్రేమించుటను జేసి వృధ్విజనులు
    పాశ్చాత్యుఁడైన నెప్పటికి టాద్దొర రాజ
               పుత్రుఁడే యనుచు సమ్మోదమంది:
    రతఁడును రాజపుత్రావనికొఱకుఁ బ్రా
               ణములైన నిచ్చు చందమున మెలఁగె;
               
గీ॥ నమ్మహాత్ముండు వ్రాయు గ్రంధమ్మునందు
    వీరరసతరంగములతో క్షీరజలధి
    కరణి మాధుర్యములు పెంచు చరితలెన్నొ
    కలవు కలవారియిండ్ల బంగారమట్లు.
    
శా॥ ఆకర్ణద్వయపావనంబగు చరిత్రాంశంబు లందెల్లఁ గ
    న్నాకై దివ్యరసాలవాలమయి సత్య న్యాయ సంపూరితం
    బై కన్పట్టెడి నాప్రతాపు చరితం బద్దాని గోస్తనీ
    పాకంబొప్పఁగ నొక్క దొడ్డకృతిగా వ్రాయన్ బ్రయత్నించెదన్.”
    
మ॥ అన "నీమాటలు వేదవాక్యము; లవశ్యంబిప్డు రాణాప్రతా
    పుని గీర్తింపు; మతండు వీరజనతా పూర్వాభిగణ్యుండు; క
    మ్మని నీకైతకు నమ్మహాప్రభుని ధర్మ శ్రీరతుల్ హాటకం
    బునకున్ సౌరభపూరముల్ గలుపు సొంపున్ గాంచి వాసిన్ గనున్"
    
క॥ అని ప్రోత్సహించుమతి నని
   యెను వెంకట శేషశాస్త్రి: యేనంతం బ్రతా
   పుని చరిత కావ్యరూపముగను
   వెలయింపంగ వ్రాయఁగా మొదలిడితిన్.
   


క॥ ఉత్తమ మితివృత్తము సము
    దాత్తము చిత్తూరుపురి ప్రతాపుఁడు ధీరో
    దాత్తుఁడు కైతము మెత్తని
    దిత్తఱి మెత్తురని తలఁతు నెల్లబుధేంద్రుల్.
    
శా॥ నా ధారాళ కవిత్వమందుఁ గల విన్నాణంబు లట్లుండ, నీ
    గాధల్ కర్ణయుగంబుఁ బట్టుకొని యాకర్షించు లోకంబు; వి
    ద్యాధుర్యుల్ విని చిఱ్ఱు బుస్సనక యాహ్లాదింత్రు; విశ్వైక కీ
    ర్త్యాధారంబులు రాజపుత్రనృప శౌర్యావార్య హేలాకళల్.
    
శా॥ ఈపొత్తంబునఁ గొంచెమేనియు గుణంబెందేనిఁ బెంపొంద శ్లా
    మాపీరంబది ‘జేమ్సుటాడ్డుదని లోకంబెంచి హర్షించుఁగా
    దేపట్లైన వికాసమూడి రసమెంతేఁ దక్కువై యున్న నా
    లోపంబంతయు నాదిగాఁ దలఁప గేలు మోడ్చి ప్రార్థించెదన్.
    
మ॥ వినమే మున్ను ప్రతాపుడంతటి మహావీరుండు లోకంబునన్
    గనుపింపండని పూజ్వులెల్లఁ బలుకంగా; నట్టి రాణా ప్రతా
    పుని గీర్తించెడుపట్ల నెట్లు కవనంబు సాఁగఁగాఁ జేతువో
    నిను సేవింతు విరించిరాణి' సుమపాణీ' వాణి! నన్నోమవే.
    
సీ॥ రచియించియుంటి వీరమతీచరిత్రంబుఁ
              దిరుపతి వేంకటేశ్వరులు మెచ్చఁ
    గృతి యొనర్చితిఁ జండనృపమౌళికధ దేశ
              చరితమున్ శోధించి సరసు లలర
    దగఁగూర్చియుంటిఁ బద్మావతీవిజయంబు
              వీరంబు హాస్యంబు వెల్లి విరియ
    వ్రాసియుంటి సమగ్ర రామాయణము నాట
              కములుగా విబుధలోకములు పొగడ
              
గీ॥ నిన్ని యొకయెత్తు మఱి ప్రతాపేంద్రుచరిత
   మొక్కయెత్తు సుధారసంబొలుకుచుండ
   నొక్కచూ పెక్కుడుగాఁ జూచి యుద్ధరింపు
   శైలరాజేంద్రకన్య' సౌజన్యధన్య!
   

కృతజ్ఞత.

మా తండ్రిగారగు (శ్రీ డి. రాజశేఖర శతావధానిగారికి రాణాప్రతాప సింహ చరిత్రమునందు అధికప్రీతి. ఈ కావ్యము నాల్గవ కూర్చు చేయింప దలచుచుండిరి. ఇంతలో వారు దినంగతు లగుటయు, మా వద్ద ప్రతులు లేక పోవుటయు, పలువురు కావలెనని యుత్తరములు వ్రాయటయు జరిగినది. అప్పుడు మే మీకావ్యము ముద్రింపించ దలచితిమి. ముద్రణ భారము శ్రీ పి. వి. సుబ్బన్న శతావధానిగారికి అప్పగించితిమి. ఈయన యెవరోకాదు, మా తండ్రిగారు "కామేశ్వరీస్తోత్రమాట" యందు:

భక్త్యా విచింతయతి మత్కుశలం సమగ్రం
ప్రోత్సాహయ త్యుపచర త్యనుయాత్యజస్రం
యః స్సీవి సుబ్బన సుధీః కవి బాలభాను
ర్జీయాచ్చిరం ససుకవిత్వ నవప్రధాతః.


అని వ్రాసిరి. ఈయన మాతండ్రిగారికంత దగ్గరివాడు. అందుచేతనే యీ కార్యభారము వహించినాడు. తిరిగి మేము 'కృ త జ్ఞ త' చెప్పవలెననుకొను వాడునుగాడు. అయినను మాధర్మము మేము నిర్వహింపవలయును గదా! మా తండ్రిగారికి అత్యంత ప్రీతిపాత్రమైన యీ కావ్యమును ముద్రిం పించుటకు తోడ్పడిన శ్రీ సి. వి. సుబ్బన్న శతావధానిగారికి కృతజ్ఞతాపూర్వక వందనము లర్పించునున్నాను.

మదరాసు, జి మన్నెము కామేశ్వరీ దేవి.

29-7-57