రాజశేఖర చరిత్రము (ఎమెస్కో)/నాల్గవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

నాల్గవ ప్రకరణము

పురాణ కాలక్షేపము__రాజశేఖరుఁడు గారి స్థితి__ఆయన బావమఱఁది దామోదరయ్య చరిత్రము__మిత్రుఁడు నారాయణమూర్తి కథ_ఎలుక యడుగుట.

రాజశేఖరుఁడుగారు భోజనము చేసినతరువాత ఒక్క నిద్ర పోయి లేచి, తాంబూలము వేసికొని కచేరిచావిడిలోనికివచ్చి కూర్చుండిరి. అంతకుమునుపే గ్రామమునఁ గల పెద్ద మనుష్యులు పలువురు వచ్చి తగిన స్థలములలో గూర్చుండి యుండిరి. అప్పుడు రాజశేఖరుడు గారు 'సుబ్రహ్మణ్యా" అని పిలిచినతోడనే 'అయ్య' అని పలికి లోపలినుండి పదియాఱు సంవత్సరముల వయసుగల యెఱ్ఱని చిన్నవాఁ డొకఁడు వచ్చి యెదుర నిలువఁబడెను. ఆతఁడు రాజశేఖరుఁడుగారి జ్యేష్టపుత్రుఁడు; సీత పుట్టిన తరువాత రెండు సంవత్సరములకు మఱి యొక పిల్లవాఁడు కలిగెనుగాని యాచిన్నవాఁడు పురుటిలోనే సంధి గొట్టిపోయెను. ఆ వెనుక మాణిక్యాంబకు కానుపులేదు.సుబ్రహ్మణ్యము యొక్క మొగ మందమైనదేకాని మూడేండ్లప్రాయమున బాలరోగము వచ్చినప్పడు పసుపుకొమ్ముతోఁ గాల్చిన మచ్చమాత్రము నొసటను గొంచెము వికారముగా నుండెను; కన్నులు పెద్దవి; నుదురు మిట్టగా నుండెను; తల వెండ్రుకలు నిడుపుగాను నల్లగాను ఉండెను. చేతుల బంగారు మురుగులను చెవులను రవలయంటుజోడును అనామికను పచ్చదాపిన కుందనంపుపని యుంగరమును ఉండెను.

రాజ__సుబ్రహ్మణ్యా! అందటితోఁగూడ నీవు మధ్యాహ్నము భోజనమునకు వచ్చినావుకావేమి?

సుబ్ర__కార్తిక సోమవారము గనుక, ఈ దినము రాత్రిదాక నుండి మఱి భోజనము చేయవలెననుకున్నాను.  రాజ__లోపల బల్లమీఁద ఆదిపర్వ మున్నది, తీసికొని వచ్చి శాస్త్రులు గారిని వెళ్లి పిలుచుకొని రా.

తండ్రి యాజ్ఞప్రకారము సుబ్రహ్మణ్యము లోపలికి వెళ్ళి పుస్తకమును దీసికొనివచ్చి తండ్రిచేతి కిచ్చి, నడవలో నుండి నడచి వీధిగుమ్మము మెట్లు దిగుచు, దూరమునుండి వచ్చుచున్న యొక నల్లని విగ్రహమునుజూచి" వేగిరము రండి" అని కేకవేసి, తాను మరలి వచ్చి శాస్త్రులుగారు వచ్చుచున్నారని చెప్పి చావడిలో నడుమగా పుస్తకమును ముందఱఁ బెట్టుకొని కూర్చుండెను. ఇంతలో శాస్త్రులును బుజముమీఁద చినిగిపోయిన ప్రాఁతశాలువను మడతపెట్టి వేసికొని, బంగారము ఱేకెత్తుటచే నడుమ నడుమ లోపలి లక్క కనఁబడుచున్న కుండలములజోడు చెవుల నల్లలనాడుచుండ వచ్చి సభలోఁ గూర్చుం డెను. రాజశేఖరుఁడుగారు సాహిత్యపరులయ్యును, ఆకాలమునందు పెద్ద పుస్తకమును జదివి మఱియొక పండితునిచే అర్థము చెప్పించుట గొప్ప గౌరవముగా నెంచఁబడుచుండును గనుక, ఆ శాస్త్రులు వచ్చువఱకును పుస్తకమును జదువక గనిపెట్టుకొని యుండిరి.

రాజ__మీ రీ వేళ నింతయాలస్యముగా వచ్చినా రేమండి?

శాస్త్రి__ఇంతకుమును పొకపర్యాయమువచ్చి చూచి పోయి నాను. తమరు లేవలేదని చెప్పినందున వేఱే యొక పెద్ద మనుష్యునితోఁ గొంచెము మాటాడవలసిన పనియుండఁగా మీరు లేచునప్పటికి మరల వత్తమని వెళ్ళినాను. ఆయనతో మాటాడుట కొంచె మాలస్య మయినది. క్షమించవలెను-నాయనా, సుబ్రహ్మణ్యమూ! పుస్తకము విప్పు.

సుబ్రహ్మణ్యము పుస్తస్తకమును విప్పుచు, 'తుండము నేక దంతమును దోరపుబొజ్జయు' నను విఘ్నేశ్వర స్తవ పద్యము నారంభించి చదువుచుండఁగా శాస్త్రులందుకొని యా పద్యము కడ వఱకు నయిన తరువాత, "అంజలిఁజేసి మొక్కెద మదంబకు" మొదలుగాఁగల సరస్వతీ ప్రార్ధనమును, పిమ్మట 'ప్రాంశుయోద నీలతను భాసితు" మొదలుగా గల వ్యాస స్తోత్రమును, పిదప మఱి కొన్ని పద్యములను తానుగూడ కలిపి చదివెను. ఈలోపల సుబ్రహ్మణ్యము గతదినము విడిచిపెట్టిన భాగమును దీసి, అర్జునుఁడు ద్వారకానగరమునకు వెళ్ళిన భాగమునందలి_

      "ద్వాదశ మాసికవ్రతము ధర్మవిధిం జరపంగనేగి గం
       గాది మహానదీ హిమవదాది మహాగిరి దర్శనంబు మీ
      పాదపయోజదర్శనము పన్నుగఁజేయుటఁ జేసి పూర్వసం
      పాదితసర్వపాపములు వాసె భృశంబుగ నాకు నచ్యుతా!"

అను పద్యమును జదివెను, ఆప్పుడు శాస్త్రులు పద్యములో నున్నవి కొన్నియు లేనివి కొన్నియుఁ గల్పించి దీర్ఘములు తీయుచు నర్ధము చెప్ప మొదలుపెట్టెను. అర్థము చెప్పుచున్న కాలములో సుబ్రహ్మణ్యము పుస్తకముయొక్క సూత్రమునకుఁ గట్టి యున్న పడకను జేతిలోఁ బట్టుకొని త్రిప్పుచుండెను అదిచూచి శాస్త్రులు ఉలికిపడి ముక్కు మీఁద వ్రేలు వైచుకొని "పుస్తకము చదువుచుండగా దాని నాప్రకారము ముట్టుకోవచ్చునా? వ్యాసుల వారు దాని మీఁదఁ గూరుచుందు రే' యని దగ్గఱ నున్నవారి కావిషయ మయిన కథ నొకదానిని జెప్పెను. ఆ మాటమీఁద నందులో నెవ్వరో యడిగినదానికిఁ బ్రత్యుత్తరముగా, వ్యాసులవారు దగ్గఱనుండి వెళ్ళచుండినఁ గాని స్మరణకు రారనియు, వారప్పు డామార్గముననే యాకాశముమీఁద దివ్య విమానమెక్కి వెళ్ళుచున్నారనియు చెప్పి ఆకాశమువంకఁ జూచి కన్నులు మూసికొని మూఁడునమస్కారములు చేసెను. ఈ ప్రకారముగా సంజవేళకు ఆదిపర్వము ముగిసినందున నాటికిఁ బురాణకాలక్షేపమును జాలించి "స్వస్తిప్రజాభ్య" మొదలుగాఁ గల శ్లోకమును జదివి యెవరియిండ్లకు వారు వెళ్ళిపోయిరి.

రాజశేఖరుఁడుగారి యింటికి నిత్యమును బంధువులు నలువది తరములు గడచిపోయినను వంశవృక్షములు సహితము చూచుకో నక్కఱలేకయే తమబంధుత్వము జ్ఞాపకముంచుకొని రాజశేఖరుఁడు గారిమీఁది ప్రేమచేత నాతనిని చూచి యాదరించిపోవలెనను నుద్దేశముతో వచ్చి నెలల కొలఁదినుండి తినిపోవుచు వస్త్రములు మొదలగు వానిని బహుమానములు వడయుచుందురు. ఊరనుండు పెద్దమనుష్యులును పరిచితులయిన వారును గూడ రాజశేఖరుడి గారి యింట వంట దివ్యముగా జేయుదురని శ్లాఘించుచు నెలకు సగముదినము లచ్చటనే భోజనములు చేయుచుందురు; వారుచేయు స్తోత్రపాఠముల కుబ్బి రాజశేఖరుఁడుగారును వారు వచ్చినప్పడెల్ల పిండివంటలును క్షీరాన్నమును మొదలగు వానిని చేయించి వారిచేత మెప్పు వడయఁ జూచుచుందురు. అన్న ముడుకకపోయినను, పులుసు కాగకపోయినను, పప్పు వేగకపోయిననుకూడ వారివంట బాగుండ లేదని యెవ్వరును జెప్పలేదు__ఊరకే వచ్చిన పదార్థమునం దెప్పుడును రుచి యధికముగా నుండునుగదా? కొందఱు బంధువులు తాము వెళ్ళునప్పడు కొంత సౌమ్మును బదులుపుచ్చుకొని అదివఱకుఁ దఱుచుగా వచ్చుచుఁ బోవుచు నుండువారేమైనను అంతటినుండి తీఱిక లేక బదులుతీర్చుటకయి మరల నెప్పుడును వచ్చెడివారు కారు. ధన వంతుఁడు గనుక ఆయన కెల్లవారును మిత్రులుగా నుండిరి__ఆ మిత్రసహస్రములలో నొకఁడైనను నిజమైన యాప్తుఁ డున్నాడో లేఁడో యన్నసంగతిని మాత్రమాయనకు ధనలక్ష్మి తెలియనిచ్చినది కాదు. ఆట్టి మిత్రోత్తము లందఱును రాజశేఖరుఁడుగారికి స్తుతి పాఠములతో భూమిమీదనే స్వర్గసుఖమును గలిగించి యాయన నానందింపఁ జేయుచుఁ దా మాయన యిచ్చెడి ధనకనక వస్తువాహనముల నాతని ప్రీతికై యంగీకరించుచుందురు. నిత్యమును యాచకు లసంఖ్యముగా వచ్చి తమ కష్టకథలను గాధలుగాఁ జెప్పి చివరకు దమ కేమయినను యిమ్మని తేల్చుచుందురు - అట్టివారు నటించెడి యాపద నన్నిటిని ఆతఁడు నిజమయిన వానినిగానే భావించి సాహాయ్యము చేయుచుండును. కొందఱు బ్రాహ్మణులు పిల్లవానికి వివాహము చేసికొనెద మనియు, ఉపనయనము చేసికొనెద మనియు, తాము యజ్ఞములు చేసెదమనియు, సత్రములు సమారాధనలు చేయించెద మనియు చెప్పి యాయనవద్ద ధనమార్జించుకొని పోవు చుందురు. మిత్రుల వేడుకకయి రాజశేఖరుఁడుగారియింట రాత్రులు తఱచుగా గానవినోదములను నాట్యవిశేషములను జారిపోతాది నాటక గోష్టులను జరుగుచుండును. మోసగాండ్రు కొందఱు తమ కమ్ముడుపోని యుంగరములు మొదలగు వస్తువులను దెచ్చి, వానిలోఁ జెక్కినరాళ్ళు వెలయెఱిగి కొనఁగలిగిన సరసులు రాజశేఖరుడుగారు తప్ప మఱియొకరు లేరని ముఖప్రీతిగా మాటలు చెప్పి వస్తువు అంత వెల చేయకపోయినను మాటలనే యెక్కువ వెలకు విక్రయించి పోవు చుందురు. గ్రామములోని వైదిక బృందము యొక్క ప్రేరణచేత సప్త సంతానములలో నొకటైన దేవాలయనిర్మాణము జేయ నిశ్చ యించుకొని, రాజవరపు కొండనుండి నల్లరాళ్లు తెప్పించి రాజశేఖ రుఁడుగారు రామపాదక్షేత్రమునకు సమీపమున నాంజనేయునకు గుడి కట్టింప నారంభించి నాలుగు సంవత్సరములనుండి పనిచేయుచుండెను. కాని పని సగముకంటె నెక్కువ కాకపోయినను పనివాండ్రును పని చేయింపఁ దిరుగుచుండెడి యాశ్రితులను మాత్రము కొంతవఱకు భాగ్యవంతు లయిరి. ఈ ప్రకారముగాఁ దన్ననాదరము చేసి యితరులపాలు చేయుచు వచ్చుచున్నందున, ధనదేవత కాతవియం డాగ్ర హమువచ్చి లేచిపోవుటకు బ్రయత్నము చేయుచుండెను గాని చిర పరిచయమునుబట్టి యొక్కసారిగా విడువలేక సంకోచించుచుండెను. ఈ సంగతిని దెలిసికొని దారిద్ర్యదేవత యప్పుడప్పుడువచ్చి వెలుపల నుండియే తొంగిచూచుచు, భాగ్యదేవత యాతనిగృహము చోటు చేసినతోడనే తాను బ్రవేశింపవలెనని చూచుచుండెను. రుక్మిణి వివాహములో నిచ్చిన సంభావన నిమిత్తమై రాజశేఖరుడుగారికి మాన్యములమీఁదఁ గొంత ఋణమైనందున దానిమీద వడ్డి పెరుగు చుండెనేకాని మఱియొకతొందర యేమియును గలుగుచుండలేదు.

రాజశేఖరుడుగారివలన బాగుపడినవారు పలువురున్నను వారిలోనెల్ల దామోదరయ్యయు, నారాయణమూర్తియు ముఖ్యులు, ఆ యిద్దరిలో దామోదరయ్య రాజశేఖరుఁడుగారి బావమఱఁది; రాజశేఖ రుఁడుగారి తోడఁబుట్టిన పడుచునే యాతనికిచ్చిరి కాని యామె ఒక్కకుమారుని మాత్రము గని కాలముచేసెను. ఆ కుమారున కిప్పుడు పదియేను వత్సరము లున్నవి; ఆతనిపేరు శంకరయ్య. అతని కెని మిది సంవత్సరములు దాటకముందే తల్లి పోయినందున, అతఁడు చిన్నప్పటినుండియు మేనమామగారి యింటనే పెరిగినాఁడు. అతనికే సీతనిచ్చి వివాహము చేయవలయునని తల్లిదండ్రుల కిద్దఱికిని నుండెను. భార్యపోయినతరువాత దామోదరయ్య రాజశేఖరుఁడు గారి సాయముచేతనే రెండవ వివాహము చేసికొనెనుగాని యాచిన్నది పెండ్లినాటికి తొమ్మిది సంవత్సరములలోపు వయస్సు గలది గనుక, ఈడేరి కాపురమునకువచ్చి రెండుసంవత్సరములు మాత్రమే యయి నది. ఆతనికి ద్వితీయ కళత్రమువలన సంతాన మింకను కలుగ లేదు. దామోదరయ్య మొదటినుండియు మిక్కిలి బీదవాఁడు; ఆతనికి రాజశేఖరుఁడుగారి చెల్లెలి నిచ్చునప్పటికి రాజశేఖరుఁడుగారి తండ్రియు ధనవంతుఁడు కాఁడు. వారిది పూర్వము వసంతవాడ నివాస స్థలము. రాజశేఖరుడుగారి తండ్రి తన యింటికి గోడలు పెట్టించుటకయి పుట్టలు త్రవ్వించుచుండగా నొకచోట నిత్తడిబిందెతో ధనము దొరికినది. ధనము దొరికినతరువాత స్వస్థలములో నున్న విశేష గౌరవముండదని యెంచియో, లోకుల యోర్వలేనితనము నకు జడిసియో రాజశేఖరుఁడుగారి తండ్రి దారపుత్రాదులతో నల్లని గూడ వెంటఁ బెట్టుకొని వచ్చియప్పటినుండియు ఈ ధవళగిరియందే నివాసముగా నుండి యాచుట్టుపట్టులనే మాన్యములుగొని కొంతకాలమునకు మరణము నొందెను. భార్య పోవువఱకును దామోదరయ్య రాజశేఖరుఁడుగారి యింటనే యుండి, ఆయనపేరు చెప్పి ధనము యితరులవద్ద తెచ్చి తానపహరించుచుఁ బయికిఁ దెలియనియ్యక దాచుకొనుచుండెను. తరువాత అప్పులవారు వచ్చి తొందరపెట్టినపుడు రాజశేఖరుఁడుగారే సొమ్మిచ్చుకొనుచుండిరి. తోడఁబుట్టినపడుచు పోయిన తరువాత దామోదరయ్య చేయు నక్రమములకు సహింపలేక యొకనాడు రాజశేఖరుడుగా రాతనిని కఠినముగా మందలించిరి. ఆందుమీఁదఁ గోపము వచ్చి దామోదరయ్య తన్ను బావమఱఁది కట్టు బట్టలతో నిల్లు వెడలగొట్టినాఁడని యూరివారందరిముందఱఁ జాటుచు దేశాంతరమునకు లేచిపోయి, యాఱునెలలకు గడ్డమును తలయును బెంచుకొని మరల వచ్చి, భూతవైద్యుఁడ నని వేషము వేసికొని నుదుట పెద్దకుంకుమబొట్టు పెట్టుకొని వీధులవెంబడి తిరుగుచుండెను. ఆవఱకే దామోదరయ్య తానార్జించుకొన్న ధనమును వేఱు జాగ్రత్త చేసికొన్నందున అప్పడాధనముతో నొక యిల్లుగట్టి ఆ గ్రామములోనే ప్రత్యేకముగా నొకచోటఁ గాపురముండెను. ఆతని భూతవైద్యము నానాఁటికి బలపడినందున ఊర నెవ్వరికైన కాలిలో ముల్లుగ్రుచ్చు కొన్న నాతనిచేత విభూతి పెట్టించుచుందురు. ఈ విధముగా దామో దరయ్య భాగ్యవంతుడగుటయేకాక, జనులచేత మిక్కిలి గౌరవ మును సహితము పొందుచుండెను.

రెండవయాతఁడైన నారాయణమూర్తి మొదట సద్వంశ మునఁ బుట్టినవాడేకాని దుర్మార్గులతో సాహసము చేసి తనకుఁగల కాసువీసములను వ్యయముజేసికొని బీదవాఁ డయ్యును పయికి ధని కునివలె నటించుచుండెను, అతనికి భాగ్యము పోయినను దాని ననుసరించియుండిన చిహ్నములు మాత్రము పోనందున, నారాయణమూర్తి తఱుచుగా రాజశేఖరుఁడుగారి యింటికి వచ్చుచు రహస్యమని చెప్పి రాజశేఖరుఁడుగారిని లోపలికిఁ బిలుచుకొనిపోయి తన యక్కరను దెలిపి సొమ్ము బదులడుగుచుండును. ఆ ఋణము మరల తీయినది గాదని దృఢముగా నెఱిగియు, రాజశేఖరుడుగారు మానవంతుల గౌరవమును కాపాడుచుండుటయందు మిక్కిలి యభిలాష కలవారు గనుకను, ఆతఁడు చిన్నతనములో తన సహపాఠిగనుకను, ఆడిగిన మొత్తమును రెండవవా రెఱుఁగకుండ చేతిలోబెట్టి పంపుచుందురు. ఆతఁడా ధనముతో సరిగ వస్త్రములు సుగంధ ద్రవ్యములు మొదలగు వానిని గొనుచు మిత్రులకు షడ్రసోపేతముగా విందులు చేయు చుండును. ఇదిగాక యాత డితరస్థలములలో జేసిన ఋణముల కయి ఋణప్రదాతలు తొందరపెట్టినందున, రాజశేఖరుడు గారు తన సొంత సొమ్ములోనుండి యప్పుడప్పుడు మూడువేల రూపాయలవఱకు నిచ్చి యాతనిని ఋణబాధనుండి విముక్తునిజేసిరి. రెండు సంవత్సరముల క్రింద నారాయణమూర్తియొక్క పెత్తండ్రిభార్య సంతు లేక మృతి నొందినందున, ఆమె సొత్తు పదివేల రూపాయలు ఆతనికిఁజేరెను. ఆ సంగతి తెలిపినతోడనే రాజశేఖరుఁడుగారు పరమానందభరితులై నారాయణమూర్తి యింటికిఁబోయి యాతని నాలింగనము చేసికొని తనకీయవలసిన యప్పును దీర్పవలసినవని లేదనియు యావద్ధనము తోను గౌరవముతో సుఖజీవనము చేయవలసిన దనియుఁజెప్పి యాదరించిరి. రాజశేఖరుఁడుగారి కీవఱకు బదులు చేయవలసిన యావశ్యక మంతగా తటస్టింపనందునను, ధనము విశేషముగ నున్నందునను నారాయణమూర్తి కావలసినయెడల తన ధనమును వాడుకోవచ్చునని రాజశేఖరుడుగారితోఁ బలుమారు పూర్వము చెప్పుచువచ్చెను.

ఒకనాఁడు నాలుగు గడియల ప్రొద్దెక్కిన తరువాత రాజశేఖరుడుగారు కచేరి చావడిలోఁ బలువురతోఁ గూరుచుండి యున్న సమయమున రుక్మిణి నూతివద్దకు వచ్చి యక్కడనుండి పెరటి గుమ్మముదగ్గఱకుబోయి లోపలనే నిలుచుండి, తరిగిన గుమ్మడికాయ పెచ్చులను వీధిలోఁ బాఱవేయ వచ్చిన పొరిగింటివారి యాఁడు పడుచుతో మాటాడుచుండెను. అప్పడు చేతితో తాటాకు గిలక గుత్తుల నాడించుచు నెత్తిమీద నొక బుట్ట పెట్టుకొని యొక్క యొఱుకత యామార్గమునఁ బోవుచు రుక్మిణి మొగమువంక నిదానించి చూచి నిలువబడి "అమ్మా! నీకు శీఘ్రముగానే మేలు కలుగుచున్నది; భాగ్యము కలుగుచున్నది. నీ మనసులో నొకవిచారము పెట్టుకొని కృశించుచున్నావు. ఎఱుక యడిగితే నీమనసులోనున్నది సూటిగా జెప్పెద" నని చెప్పెను. ఆ మాటలు విని యా ప్రబోధికను దొడ్డి లోనికిఁ బిలుచుకొనిపోయి కొట్ల చాటునఁ గూరుచుండబెట్టి తాను లోప లికిఁబోయి చేటలో బియ్యము పోసి తెచ్చి యా బియ్యమును దనచేతిలో నుంచుకొని ముమ్మాఱు తనచేయి పాలమున మోపి మొక్కి కార్య మును తలచుకొని రుక్మిణి తన చేతిలోని బియ్యమును చేటలో విడిచి పెట్టెను. అప్పడాయెఱుకత తాను వల్లించిన రీతిగా నిష్టదైవతములఁ దలఁచుకొని వాకీయుఁడని వేడుకొని యామెచేయి పట్టుకొని "భాగ్యముకల చెయ్యి, ప్రతిష్టగల చెయ్యి" యని పలికి, “నీ వొక్కతలఁపు తలఁచినావు: ఒక్క కోరిక కోరినావు; ఒక్క మేలడిగినావు: అది కాయో పండో, కల్లో నిజమో, చేకూఱునో, చేకూఱదో యని త్రొక్కటపడుచున్నావు; అది కాయకాదు పండు: కల్ల కాదు నిజము. శీఘ్రముగానే చేకూఱనున్నది. ఆఁడువారివంక తలఁపా మగవారివంక తలఁపా యందు వేమో__మగవారంటే గడ్డము, ఆడవా రంటే లక్కాకు" అని రుక్మిణి ముఖలక్షణములను చక్కగా కనిపెట్టి "మగ వారివంక తలం'పన్నప్పుడామె మొగ మొకవిదముగా నుండుట చూచి సంగతి నూహించి “నీది మగవారివంక తలంపు శీఘ్రముగానే కార్యము గట్టెక్కనున్నది; నీ రొట్టె నేతఁ బడనున్న" దని చెప్పి తక్కిన ప్రసంగమువలన రుక్మిణి మనసులోని సంగతి నంతనుఁ దెలిసికొని రుక్మిణిఁమగడు దేశాంతరగతుఁ డయినవార్త నా వఱకే వినియున్నదికాన "నీ మగఁడు చెడుసావాసము చేత దేశాలపాలయి తిరుగుచున్నాఁడు; నీ మీది మోహముచేత నెల దినములలో నిన్ను వెదుకుకొనుచు రాగలడు" అని చెప్పి సంచిలోని పేరు నొకదానిని తీసి పసుపుదారముతో జేతికి కట్టి ప్రాఁతబట్టయు రవికయు బుచ్చు కొని, మగనితోఁ గలిసి కాపురము చేయుచున్న తరువాత క్రొత్తచీర పెట్టుమని చెప్పి తనదారిని బోయెను. రుక్మిణియు బరమానంద భరితురాలయి అంత సూటిగాఁ దన మనోగతమును దెలిపినందుకై యెఱుకత యొక్క మహత్త్వమును మెచ్చుకొని యబ్బురపడుచు లోపలికిఁ బోయెను.