Jump to content

రాజశేఖర చరిత్రము (ఎమెస్కో)/అయిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

అయిదవ ప్రకరణము


సీత యొక్క వివాహ ప్రయత్నము__బైరాగి యొక్క ప్రసిద్ది__ ఆతఁడు వైద్యమునకుఁ గుదురుట__జనార్ధనస్వామి యుత్సవము రుక్మిణి యొక్కకాసులు పేరు పోవుట.

ఒకనాఁటి యదయమున రాజశేఖరుఁడుగారు సభతీర్చి చావడిలో గూర్చుండి యుండఁగా సిద్ధాంతి వచ్చి తాటాకులతో నల్లిన యొరలో నుండి సులోచనములజోడును దీసి ముక్కునకుఁ దగిలించు కొని దాని దారమును నొసటనుండి జట్టుమీదుగా వెనుకకు వేసికొని కూరుచుండి తాటాకు పుస్తకమునకుఁ గట్టిన దారములో గ్రుచ్చిన చిన్ని తాటాకు ముక్కలను నాలుగయిదింటిని పయికిఁ దీసి ముందుకు వెనుకకు త్రిప్పుచు వానివంకఁ జూడసాగెను.

రాజ__సిద్ధాంతిగారూ! సీతకే సంబంధం బాగున్నది?

సిద్ధాంతి__చక్కగా నాలోచించి చూడఁగా మంత్రిప్రగడ బాపిరాజుగారి కుమారుని జాతకము సర్వవిధముల ననుకూలముగా గనఁబడుచున్నది.

మంత్రిప్రగడ బాపిరాజు తన కుమారున కేలాగునైన సీతను జేసికొని రాజశేఖరుడుగారితోడి బాంధవ్యము వలన బాగుపడవలెనని చిరకాలమునుండి కోరియున్నవాఁడు కాన, ఈ నడుమఁ దనయింట జరిగిన సీతాకళ్యాణసమయమున సిద్ధాంతికి మంచి ధోవతులచాపు కట్ట బెట్టటయే కాక సీత నిప్పించిన యెడల నింతకంటె మంచి బహు మానము చేసెదనని యాశపెట్టెను.

రాజ__బాపిరాజు కుమారుఁడు నల్లనివాఁడు. చదువులోను తెలివిలేదని వినుచున్నాను. వా డప్పడే దుస్సహవాసముచేత చెడు తిరుగుళ్ళు తిరుగ నారంభించినాఁడఁట! వానికి సీత నియ్యను. మన శంకరయ్య జాతక మెట్లున్నది?

సిద్ధాంతి__మీ మేనల్లుని జాతకము చూచినాను. సమస్త విధములచేతను దివ్యజాతకమే కాని జన్మనక్షత్రము కృత్తిక. మన సీతది కూడ కృత్తికానక్షత్రమే--శ్లో అజైక ప్రాచ్చవిష్ఠాచ పునర్వస్వధ కృత్తికా: మృగశీర్షంచ విత్తాచసవితోత్తర ఫల్గుని జ్యేష్టాచ విశ్వతో యంచ నక్షత్త్ర క్యే నినస్యతి ఏకారాశౌ పృధగ్ధి ష్ణ్యేచోత్తమ మ్పాణి పీడనం॥__అని శాస్త్రములో పయి నక్షత్రముల యైక్యమునందు కన్యావరులకు నాశనము సంభవించునని చెప్పఁబడి యున్నది. బాపిరాజు కుమారుని జాతకము సర్వోత్తమముగా నున్నది.అందులో కేంద్రాధి పతికి త్రికోణాధిపతి సంబంధము కలిగియున్నది; ఇతరులయిన తృతీయ, షష్ణ, ఏకాదశ, అష్టమాధిపతులతోడి సంబంధము లేదు__శ్లో. కేంద్ర త్రికోణపతయస్సంబంధేన పరస్పరం ఇతరైరప్రసక్తాశ్చే ద్విశేష శుభదాయకా:॥ ఆని శాస్త్ర ప్రకార మతఁడు మిక్కిలి యదృష్ట వంతుఁడు. తక్కిన చిల్లర చేష్టలకు రూపమునకును నేమి? మఱు నాలు గేండ్లు పైబడిన యెంత బుద్ధిమంతుఁడగునో యెవరెఱుఁగుదురు? నా మాట విని చిన్నదానిని నాతని కిండి.

రాజ__నేను బాపిరాజకొడుకునకు పిల్ల నియ్యను. నా చెల్లెలు పోవునప్పడు తన కొడుకునకు సీత నిచ్చునట్లు నాచేత చేతిలో చేయి వేయించుకొన్నది. దామోదరయ్యయు సీతనిచ్చి శంకరయ్యను మీ యొద్దనే యుంచుకొమ్మని నిత్యమును మొగమోటపెట్టుచున్నాఁడు. ఇప్పడు నేను పిల్లదానిని మఱియొకరి కిచ్చిన యెడల నా చెల్లెలు పోఁబట్టి యట్లు చేసితినని కలకాలము చెప్పుచుండును. అదిగాక మా శంకరయ్య బహుబుద్ధిమంతుఁడు; స్ఫురద్రూపి; విద్యావినయ సంప న్నుఁడు. పిల్లనాతనికే యిచ్చెదను. జాతకమును మీరు మఱియొక సారి శ్రద్ధతోఁ జూడవలెను.

ఆప్పడు సిద్ధాంతి తాను మఱియొకవిధముగా జెప్పిన కార్యము లేదని తెలిసికాని కొంచెము సే పాకాశమువంకఁ జూచి యనుమానించి సీత జననము కృత్తికానక్షత్రము యొక్క యేపాదము? అని ప్రశ్న వేసెను.

రాజ__ద్వితీయ పాదము.

సిద్దాం__శంకరయ్యది ప్రథమ పాదము. అవును అనుకూ లముగానే యున్నది-శ్లో. ఏకర్షేచైకిపాదేతు వివాహ: ప్రాణహావిద: దంవత్యోరేకనక్షత్రె భిన్నపాదే శుభావహ:॥__అను శాస్త్రమునుబట్టి దోషము లేకపోఁగా శుభావహముగా కూడ నున్నది. తప్పక సీత నీతని కిచ్చి వివాహము చేయండి.

రాజ__ఈ సంవత్సరములో పెండ్లి కనుకూలమయిన ముహూర్త మెవ్పుడున్నది?

సిద్ధాంతి__"శ్లోక మాఘఫాల్గునవైశాఖ జ్యేష్ఠమాపాశ్శుభ ప్రదా:" అనుటచే మాఘమాస మనుకూలముగ నున్నది. బహుళ పంచమీ మంగళవారమనాఁడు రవి కుంభలగ్నమం దున్నాడు. ఆ ముహూర్తము దివ్యమయినది__శ్లో॥ఆజ గో యుగ కుంభాశి మృగరాశి గతేరనౌ: ముఖ్యః కర్మగ్రహ స్త్వన్యరాసికేన కదాచన॥ అవి ప్రమాణ వచనము.

రాజ__మీ కొమార్తె జబ్బు నిమ్మళముగా నున్నదా?

సిద్దాం__తమ కటాక్షమువలన నిమ్మళముగానే యున్నది. నాఁడు మీరు చెప్పిన బైరాగి బహుసమర్థుఁడు. అతఁడు మా యింట గ్రహమును నిమిషములో వెళ్ళగొట్టినాఁడు. భూతవైద్య లందఱును మా చిన్నదానికిఁ బట్టిన గ్రహమును వదలించుట యసాధ్యమని విడిచి పెట్టినారు. ఆతcడు మూడుదినమలు జల మభిమంత్రించి లోపలికిచ్చి రక్షరేకు కట్టినాఁడు. నాటినుండియు పిల్లది సుఖముగా నున్నది.

రాజ__మాచెల్లెలు సుబ్బమ్మకు దేహ మన్వస్థముగా నున్నది. మన గ్రామములో నెవ్వరును మంచివైద్యులు కనఁబడరు. నాకేమి చేయుటకును తోచకున్నది.

రామ__బైరాగిచేత మం దిప్పించరాదా? అతఁడు మీరు సొమ్మిచ్చినమాత్రము పుచ్చుకొనఁడు; ఈ యూర నెందఱికొ ధర్మా ర్థముగానే యౌషధములిచ్చి దీర్ఘ వ్యాధులను సహితము కుదిర్చినాడు.

66 రాజ__గట్టివాఁడయినయెడల నీవాతని నొక్క పర్యాయము మధ్యాహ్నము మా యింటికి వెంటబెట్టుకొని వచ్చి సుబ్బమ్మను చూపెదవా?నాలుగు దినములనుండి దాని శరీరములో రుగ్మతగా నున్నందున వంటకు మిక్కిలి యిబ్బంది వడుచున్నాము.

రాఘ__ఆవశ్యముగా దీసికొనివచ్చెదను. అతనికా భేషజములు లేవు. ఎవరు పిలిచినను వచ్చును.

సిద్ధాంతి__ఆతనికడ స్వర్ణముఖీవిద్య కలదని చెప్పుచున్నారు. మహానుభావులు గోసాయీలలో నెటువంటివారైనను నుందురు.

రాఘ__ఆతఁడు ప్రతిదినమును దమ్మిడియెత్తు రాగి కరఁగి బంగారముచేయునఁట: ఆతడప్పుడప్పుడు బ్రాహ్మణులకు దానధర్మము చేయుచున్నాడు. ఈ విద్యయే లేకపోయిన నాతనికి ధన మెక్కడ నుండి వచ్చును?

రాజ__రాఘవాచారీ! దేవున కధ్యయనోత్సవములు క్రమముగా జరుగుచున్నవా?

రాఘ__తమ యనుగ్రహ ముండఁగా ఉత్సవములకేమి లోపము? నిరుడు పుష్యమాసములో సంక్రాంతినాఁటి యుత్సవము ప్రత్యేకముగా తమ ద్రవ్యముతో జరిగినది. నిన్ననో మొన్ననో లాగున కనఁబడుచున్నది; ఆప్పుడే సంవత్సర మయినది. రేపే సంక్రాంతి__ఈ సంగతి తమతో మనవిచేయుటకే వచ్చి సుబ్బమ్మ గారికి జబ్బుగా నున్నందున సమయముకాదని యూరకున్నాను.

రాజ__క్రిందటి సంవత్సరము నూటయేఁబది రూపాయల నిచ్చినాను. ఈసంవత్సరము మాలోవల వివాహములు తటస్థమయినవి గనుక నూఱు రూపాయలను మాత్రమే యిచ్చెదను. ఏలాగున నయిన దానితో సరిపెట్టవలెను.

రాఘ__చిత్తము. దానికేమి? ఆలాగుననే చేసెదను.

రాజ __రాఘవాచార్యులూ బైరాగి నవశ్యముగా నేఁడే యింటికి తీసికొనివచ్చి నీవు మఱియొక పనిని చేసికోవలెను జుమీ! ప్రొద్దెక్కుచున్నది. శీఘ్రముగా వెళ్లు సిద్ధాంతిగారూ! మీకు సందేహముగా నున్న పక్షమున శంకరయ్య జాతకము మఱియొకసారి  చూడండి;ఎవరితోనైన నాలోచించవలసియున్నయెడల, లచ్చయ్యశాస్త్రి గారికికూడ ఆ జాతకము చూపవచ్చును.

సిద్ధాంతి__చిత్తము. నాకటువంటి సందేహము లేదు.

రాజ__అట్లయిన ఇప్పుడు బసకు పోయి తరువాత దర్శన మిండి.

అని చెప్పి పంపినతరువాత సభవారందఱును తమ యిండ్లకు బోయిరి. రాజశేఖరుఁడుగారు భోజనము చేసి చేయి కడుగుకొను నప్పటికి రాఘవాచార్యు లాబైరాగిని వెంటబెట్టుకునివచ్చి యింటఁ బ్రవేశపెట్టెను. నిత్యమును రాజశేఖరుఁడుగా రాతనికి సకలొపచార ములను చేయుచు భక్తితో ననుసరించుచుండెను. సుబ్బమ్మకు వ్యాధి వెంటనే నిమ్మళించినను స్వర్ణము చేయువిద్యను నేర్చుకోవలెనను నాస క్తితో రాజశేఖరుఁడుగా రాతనిని విడిచిపెట్టక, యింటనే యుంచు కొని నిత్యమును పాలను, పంచదారయు వేళకు సమర్పించుచు నెగళ్లకు వలయు పుల్లలను సమకూర్చుచు బహు విధముల భక్తి సేయుచు నాతని యనుగ్రహ సంపాదనకుఁ దగిన ప్రయత్నములు చేయు చుండెను. ఈ ప్రకారముగాఁ గొన్ని దినములు జరగఁగా నింతలో జనార్ధనస్వామివారికిఁ గళ్యాణోత్సవము సమీపించినది. ఆ యుత్స వమును జూచుటకై చుట్టప్రక్కల గ్రామములనుండి వేలకొలఁది జనులు వచ్చి ప్రతిగృహమునను క్రిక్కిఱిసినట్టు దిగియుండిరి.

మాఘశుద్ధమున నేకాదశినాఁడు రథోత్సవమునకు వలయు ప్రయత్నము లన్నియు జరుగుచుండెను. నాలుగు దినములనుండి రథమునంతను నలంకరించి దాని పొడుగునను వన్నెవన్నెల గుడ్డ లను చిత్ర వర్ణముగల కాగితములను అంటించి, వెదురుకఱ్ఱల కొనలకు హనుమద్విగ్రహమును, గరుడవిగ్రహమును గల ధ్వజపటము లను గట్టి రథమునకుఁ దగిలించిరి. దేవుఁడుకూర్చుండు పైవైపున గెలలతో నున్న కదళికా స్తంభములను నిలిపి వానికి మామిడి మండల తోను వివిధపుష్పములతోను తోరణములను గట్టిరి. ఆ యరఁటి కంబములకు నడుమను తెల్లని లక్కగుఱ్ఱములు రెండు రథము వీడ్చుచున్నట్లు ముంగాళ్ళు మీదికెత్తుకొని మోరలు సారించి వీధి వంకఁ జూచుచుండెను. ఆ రథమునకుఁ బదియడుగుల దూరమున వెదురు పేళ్ళతో నల్లబడి పయిని గుడ్డ మూయబడి వికృతాకారముతో నున్న యాంజనేయవిగ్రహములోను గరుడవిగ్రహములోను మనుష్యులు దూరి, చూడవచ్చిన పల్లె వాండ్రును పిల్లలను జడిసికొన లాగున నెగిరెగిరిపడుచు లక్కతలకాయలఁ ద్రిప్పుచుండిరి. అప్పడు పూజారులు పల్లకిలో నుత్సవవిగ్రహముల నెక్కించుకొని వాద్యము లతోఁ గొండదిగివచ్చి రథమునకు మూఁడు ప్రదక్షిణములను జేయించి స్వామి నందు వేంచేయింపఁజేసిరి; చెంతలనున్నవా రందఱును క్రిందనుండి యరఁటిపండ్లతో స్వామిని గొట్టుచుండగా రథము మీఁద గూర్చున్న యర్చకులును తదితరులును చేతులతో దెబ్బలు తగులకుండఁ గాచుకొనుచు నడుమ నడుమ జేగంటలు వాయించుచు గోవిందా యని కేకలు వేయుచుండిరి. ఆ కేకలతో రథములకుఁ గట్టి యున్న మోకులను వందలకొలఁది మనుష్యులు పట్టుకొని యిండ్ల కప్పులను వీధి యరుగులును కూలునట్లుగా రథము నీడ్చుచుండిరి. అంతట భోగముమేళ మొకటి రధమునకుముందు దూరముగా నిలువఁ బడ, మద్దెలమీఁద దెబ్బ వినఁబడినతోడనే దేవునితో నున్న పెద్ద మనుష్యు లందఱును మూకలను త్రోచుకొనుచు వెళ్ళి యాటకత్తియలముందు మున్నున్నవారిని వెనుకకుఁ బంపి తాము పెద్దలయి యుత్సవము నందు గాన వినోదమునకు కొఱత రాకుండ సమర్ధించుచుండిరి.

అప్పడు రుక్మిణి సమస్తాభరణ భూషితురాలయి, ఉమ్మెత్త పువ్వువలె నందమై బెడబెడలాడుచున్న కుచ్చిళ్ళు మీఁగాళ్లపై నొఱయ, ఎడమభుజము మీఁదినుండి వచ్చి జరీ చెట్లుగల సరిగంచు పయ్యెద కొంగు వీపున జీరాడ కట్టుకొన్న గువ్వకన్నద్దిన నల్లచీర యామె యందమున కొకవింత యందమును గలిగింప, కాళ్ల యందియ లును, పాంజేబులును. గళ్ళగళ్ళున శ్రావ్యనాదము చేయ, కుడి చేయి తప్పఁ గడమభాగమంతయుఁ బయిటలోఁ డాఁగి కనబడక యున్న వంగపండుచాయగల గుత్తపుపట్టరైక నీరెండలో ద్విగుణ ముగాఁ బ్రకాశింప, కొప్పులోని కమ్మపూవులతావి కడలకుఁ బరిమళము లెసంగుచు గంధవహువి సార్ధకనామునిఁ జేయ, నడచి వచ్చి వీధిలో నొక యరుగుచెంత నిలుచుండి రథము వంక జూచుచుండెను. ఈ దేశములో సాధారణముగా స్త్రీలు తమ భర్తలు గ్రామమున లేనప్పడు విలువచీరలు కట్టుకొని యలంకరించు కొనుట దూష్యముగా నెంచువా రయినను, ఇతరులయింట జరుగు శుభకార్యములయందు పేరంటమునకు వెళ్ళునప్పుడు గాని గ్రామములో జరిగెడి స్వామి కళ్యాణ మహోత్సవమును గ్రామదేవతల తీర్ధములను జూడఁబోవునప్పుడు గాని యెరువుతెచ్చుకొనియైన మంచిబట్టలను మంచి నగలను ధరించుకొనక మానరు. అప్పటి యామె సౌందర్యము నేమని చెప్పుదును! నిడుదలై సోగలైన కన్నులకుఁ గాటుక రేఖ లొకసొగసు నింప, లేనవ్వు మిషమున నర్థచంద్రునిఁ బరిహసించు నెన్నుదురున బాలచంద్రుని యాకృతినున్న కుంకుమబొట్టు రంగులీన, శృంగార రస మొలికెడి యా ముద్దు మొగముయొక్క- యప్పటి యొప్పిదము కన్నులకఱవు తీఱ జూచి తీఱవలసినదే కాని చెప్పిన తీఱదు. రథ మామె దృష్టిపథమును దాఁటిపోయినతోడనే ద్వాదశోర్ధ్వపుండ్రములను దిట్టముగా ధరి యించి దాసరులు ఇనుప దీప స్తంభములలో దీపములు వెలిగించు కొని నడుమునకుఁ బట్టు వస్త్రములను బిగించుకొని యొకచేతిలో నెమలికుంచె యాడించుచు రెండవ చేతిలోని గుడ్డచుట్టలు చమురులో ముంచి వెలిగించి సెగ సోకకుండ నేర్పుతో దేహము నిండ నంటించు కొనుచు ప్రజలిచ్చు డబ్బులను దీప స్తంభముల మట్లలో వేయుచు నడిచిరి. ఆ సందడి యడఁగినతోడనే రుక్మిణి తల్లియు మఱికొందరును తోడనడువ బయలుదేఱి, ఉత్సవమునిమిత్తమయి పొరు గూళ్ళనుండి వచ్చి గుడారములలో బెట్టిన కంచరీదుకాణములను పండ్ల యంగళ్ళను దాఁటి, మెట్ల పొడుగునను ప్రక్కలయందు బట్టలు పఱచుకొని యఱచుచు కూరుచున్న వికలాంగులకు సెనగపప్పును గవ్వలును విసరివైచుచు, కాశికావళ్ళు ముందుబెట్టుకొని పుణ్యాత్ములను పాపాత్ములను స్వర్గమును నరకమును జూపెదమని పటములు చేతఁబెట్టుకొని వచ్చెడివారిని పోయెడివారిని నడ్డగించెడు కపట యాత్రికులకు తొలఁగుచు, కొండయెక్కి దేవతాసందర్శ నార్ధము వెళ్లెను. అక్కడ విసుకచల్లిన రాలకుండు మూఁకలలో నుండి బలముగలవారు దేవునకుఁ బండ్లియ్యవలె నను నపేక్షతో దూకి సందడిలోఁ బడి దేవతాదర్శన మటుండఁగా మందిలోనుండి యిూవలఁబడినఁ జాలునని నడుమనుండియే మరలి యీవలకు వచ్చి సంతోషించుచుండిరి. వారికంటె బలవంతులయినవారు గర్భాల యమువఱకును బోయి పండ్లను డబ్బును పూజారిచేతిలోఁ బెట్టి యీవలఁ బడుచుండిరి. ఆర్చకులను ఒకరువిడిచి యొకరు వెలు పలకివచ్చి చెమటచేఁ దడిసిన బట్టలను పిండుకొని వెలుపలగాలిలో కొంతసేపు హాయిగానుండి మరల గర్భాలయములోఁ బ్రవేశించి యా యుక్కలో బాధపడుచుండిరి. ఈ ప్రకారముగా వచ్చిన యర్చ కులలో నొకఁడు మాణిక్యాంబను జూచి యా మెచేతిలోని పండ్లను బుచ్చుకొని లోపలికిఁ బోయి స్వామికి నివేదనచేసి వానిలోఁ గొన్ని పండ్లను తులసిదళములను మరలఁ దెచ్చియిచ్చి యందఱ శిరస్సుల మీఁదను శఠగోపము నుంచెను. అంతట మాణిక్యాంబ వెనుక తిరిగి యాలయద్వారమును దాఁటుచుండెను. రుక్మిణి యామెచెఱఁగు వెనుక నిలుచుండెను. ఒక ప్రక్క సీతయు మఱియొక ప్రక్క నొక ముత్తైదువయు నిలువఁబడిరి. ఆ సమయములో నెవ్వఁడో వెనుకనుండి రుక్మిణి మెడలోనికి చేయిపోనిచ్చి కాసుల పేరును పుటుక్కున త్రెంచెను. రుక్మిణి వెనుకకు మరలి చూచు నప్పటికి చేయియుఁ గాసుల పేరునుగూడ నదృశ్యములాయెను. రుక్మిణి కేకతో పదిమందియు వచ్చి దొంగను పట్టుకొనుటకయి ప్రయత్నముచేసిరి కాని యా దొంగసహితము వారిలోనే యుండి తానును దొంగనే వెదుకుచుండెను. అప్పుడు రుక్మిణి మొదలగు వారు ప్రదోషసమయమున నగ పోయినందునకయి మఱింత విచారించుచు నింటికిఁ బోయిరి.