Jump to content

రసాభరణము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

రసాభరణము

చతుర్థాశ్వాసము

క.

శ్రీనాయకుఁ డఖిలధరి
త్రీనాయకుఁ డగ్గణాదితేయమునిశ్రే
ణీనాయకుఁ డీధ్రువనగ
రీనాయకుఁ డెలమి నాదరించును మమ్మున్.


వ.

నాయకప్రకరణం బెట్టి దనిన, నాయకత్వంబు ప్రధాననాయకులు, సర్వ
రససాధారణనాయకులు, కేవలశృంగారనాయకులు, ననంగాఁ ద్రివిధం
బై పరఁగె నందు బ్రధాననాయకుండు కావ్యాలంకారవ్యక్తుండు గావున
నట్లుండె నున్న యిరుదెఱంగుల వివరించెద.

సాధారణనాయకులు

క.

ఎలమి నుదాత్తోద్ధతు లన
లలితుఁడు శాంతుండు నాఁ గలరు నాయకు లి
మ్ముల ధీరపూర్వు లనువా
రలు నలువురు వారు సర్వరససామాన్యుల్.


అందు ధీరోదాత్తుఁడు—


క.

భూరికృపామృతరసవి
స్తారుఁడు ధీరుఁ డతిసత్త్వధనుఁడు మహాగం
భీరుఁ డధికధనుఁ డనఁగా
ధీరోదాత్తుండు సంస్తుతికిఁ బాత్రుఁ డిలన్.


ఉదాహరణము—


క.

తనుఁ బొగడ సహింపఁడు శ
త్రుని నైనం దెగి వధింపఁదొడఁగఁడు ముదముం
గినుకయుఁ దోఁపఁగనీఁ డా
ననమునఁ గీర్తిసుభగుం డొనర రఘుపతిదాన్.


ధీరోద్ధతుఁడు—


క.

సులభక్రోధుఁడు మాయా
జలనిధినావికుఁడు దర్పసామర్థ్యయుతుం
డిలఁ జండవృత్తుఁ డనఁగా
వెలయును ధీరోద్ధతుండు విపులస్ఫూర్తిన్.


ఉదాహరణము—


క.

రక్కసులు మీరు మీకును
రక్కసులై నిలిచి రిపుడు రామునిబంటుల్
చిక్కితిరి పొండనుచుఁ గపు
లక్కజముగఁ గెడపుదురు దశాస్యునిబంట్లన్.


ధీరలలితుఁడు—


క.

వివిధకళానిపుణుఁడు సుఖ
నివహంబులతానకంబు నిశ్చింతుఁడు నా
నవనిఁ బచరించునాతఁ డ
లవునం బొగడొందు ధీరలలితుం డనఁగన్.

ఉదాహరణము—


చ.

అనఘుఁడు ధర్మసూనుఁ డఖిలావనికిం బతియయ్యె మత్సుతుల్
సునిశితశస్త్రు లాజిముఖశూరులు భారము లేదు నాకు నీ
యనిమిషభూరుహం బభిమతావహ మంచు వధూసమేతుఁడై
మనమునఁ జింత వంత యణుమాత్రము లేక సుఖించు శౌరిదాన్.


ధీరశాంతుఁడు—


క.

ధీరుఁడు ప్రసన్నచిత్తుఁ డ
పారకృపాన్వితుఁడు నాఁగఁ బ్రస్తుతుఁ డగుపం
కేరుహభవకులజనితుం
డారయఁగా ధీరశాంతుఁ డన విలసిల్లున్.


ఉదాహరణము—


క.

హరిచేతఁ గుచేలత్వం
బరుదుగ వీడ్కొనియు సంపదాఢ్యుండై సు
స్థిరతఁ గని శాంతభావముఁ
బొరసి సుశీలుఁ డన విప్రపుంగవుఁ డొప్పెన్.

నాయకనాయికాప్రకరణము

క.

ఒనరఁగ శృంగారరసం
బున కాశ్రయణంబు గాన బుధులెల్లను మే
లనునట్లుగ నొనరించెద
ఘననాయకనాయికాప్రకరణం బెల్లన్.


క.

అనుకూలుఁ డనఁగ దక్షిణుఁ
డన ధృష్టుండనఁగ శరసమాహ్వయుఁ డనఁగా
మును చతురత గలశృంగా
రనాయకులు వీరి నల్వురం దెలియనగున్.


అనుకూలనాయకుని కుదాహరణము—


ఉ.

లేరె పదాఱువే లనఁగ లెక్కకు నెక్కినరాణివాసముల్
శౌరికి వారితోఁ బ్రియము చాలఁగఁ గల్గుట సత్యభామకున్
భూరివిశేష మవ్వనితపుణ్యమొ చక్రికృపాసమృద్ధియో
యారయఁ బారిజాత మిల నన్యులకు న్సమకూడనేర్చునే.


దక్షిణనాయకుని కుదాహరణము—


ఉ.

హారము లిచ్చె నాకుఁ జెలి యారతిరాజగురుండు నాకుఁ గ
స్తూరిక యిచ్చె నాకు మధుసూదనుఁ డుంగర మిచ్చె నాకుఁ గే
యూరము లిచ్చె నాకు జలజోదరుఁ డీపువుదండ నాకు శృం
గారరసేశుఁ డిచ్చె నని కౌతుకమందుదు రెల్లవ్రేతలున్.


ధృష్టనాయకుని కుదాహరణము—


చ.

చను నెడ పిన్నదాన ననుఁ జాయలు వల్కకు వేఁటసన్నమా
వనతరువల్లికాకుసుమవాసనగంధము కంటకాగ్రసం

జనితము లీవ్రణంబులు ప్రచండపుటెండ చెమర్చుటల్ సతీ
ఘనముగ మోవి గందుట తగ న్విను శంఖరవం బొనర్పఁగాన్.


శరనాయకుని కుదాహరణము—


చ.

చెలియ యిదేలొకో చెవియుఁ జెక్కు నెఱుంగకయుండ నిన్నునోఁ
బలికెనె శౌరి యిట్లలుగఁ బాడియె నొచ్చిన నోరఁబల్కఁ డ
వ్విలసితమూర్తి నిన్ను నొకవేళ హితంబుగ నొయ్యఁబల్కుటల్
గలిగెనెయేని వెల్లవిరిగాఁ గలహించిన నాఁడరే యొరుల్.


క.

వరనాయకులకు నుచిత
స్మరలీల విటుండు పీఠమర్దనుఁడును నా
గరకుఁడు విదూషకుండును
నరయఁగ విశ్వాసు లగుసహాయులు ధరణిన్.


ఉ.

మంచితనంబున న్విభుఁడు మానుగ నాయకునంతవాఁడె యొ
క్కించుకవెల్తి నాయకు నహీనగుణంబులఁ బీఠ మర్ది దా
మించుగఁ గూర్ప విప్పఁగలమిత్రుఁడు నాగరకుండు లీల న
వ్వించు విదూషకుండు గడువేడుక నాయకనాయికాదులన్.


క.

నాయకుల సలలితాభి
ప్రాయంబునఁ దత్సహాయభంగులు దెల్లం
బైయలరు నాయికలను స
హాయుల నటఁ దెలియవలయు నది యెట్లనినన్.

నాయికాలక్షణము

క.

ధరణి స్వకీయ యనంగాఁ
బరకీయ యనంగ వెండి పణ్య యనంగాఁ
బరఁగుదురు మూఁడుతెఱఁగుల
వరసతియుఁ బరాంగనయును వారస్త్రీయున్.


చ.

పెనిమిటి కిష్టమైనపనిఁ బ్రీతినొనర్చు నొకప్పుడేని తాఁ
బెనిమిటిమీఁది మాటలును బెన్మిటియిష్టముగాని యాత్మలో
నునుపదు సాధ్వి, వెండి ప్రియమొందును జారిణి జారుఁ డబ్బినన్
మును ధనమెల్ల మ్రింగి పెడమోమిడుఁ బణ్యవిటుండు వచ్చినన్.


స్వకీయ కుదాహరణము—


ఉ.

ఏ నడపాడుచుండఁగ నుపేంద్రుఁడ నీమఱఁదల్ సుమీ నినుం
గాని వరింప నొల్ల దని గారవమొప్ప మదంబ పల్కు లే
లా నిజమౌనె యంచు నను లాలన చేసిన భావ మాత్మలో
నే నతఁ డున్నపానుపున కేగెడువేళఁ దలంతునే సఖీ.

పరకీయకు నుదాహరణము—


ఉ.

వేసరఁ డిందు రాఁదొడఁగె వెన్నుఁడు నీవును నమ్మురారిపైఁ
జేసితి కూర్మి మాను మని చెప్పితిఁ జిల్కకుఁబోలొ నెప్పుడున్
గాసి యొనర్చితే కుడువఁ గావిగొనం బడపెల్ల మాని నీ
వాసరసీరుహాక్షునకు నాలవుగా దొరకొంటె కూఁతురా.


క.

మున్నొకని యధీనము గా
కున్న రమణి నొరు లెఱుంగకుండ రమించున్
మిన్నక యెవ్వఁ డతని కా
కన్నియ పరకీయయట్లకా నెన్నఁబడున్.


ఉదాహరణము—


ఉ.

కన్నియ నేను నన్నుఁ దమకంబున నేటికిఁ గొంగువట్టె దా
సన్నఘనక్షమాజముల చక్కిఁ జరించెద రల్లవారె మా
యన్నలు మానుమాను మని యల్లనఁ బల్కఁగ బుజ్జగించుచు
న్వెన్నుఁడు గోపకామిని నవీనసుఖాంబుధిఁ దేల్చె నేర్పునన్.


క.

తొలితొలి ముగ్ధ యనంగా
నలరిన మధ్యమ యనంగ నటఁ బ్రౌఢ యనం
జెలువగు యౌవనవయసునఁ
గలిగిన సంకేతనాయికలు మువ్వు రొగిన్.


ముగ్ధ కుదాహరణము—


మ.

హరిఁ జూచెం దరుణీలలామ నతవక్త్రాంభోజ మొప్ప న్సుధా
కరరేఖం బురణించుఫాలమున రంగద్భృంగసంఘాకృతిం
గురులాడం గ్రముకంబుల న్మిగుల వక్షోజాతముల్ వ్రీడయం
దెరలో నిల్చు సువర్ణపుం బ్రతిమభాతి న్ముగ్ధభావంబునన్.


మధ్య కుదాహరణము—


మ.

నడ పొప్పు న్మురిపంబుతో నయనకోణంబు ల్మెఱుంగెక్కఁగా
నొడువు ల్దేనెల నీనఁగా నులియఁ గౌనుందీఁగె చన్దోయి మా
రెడుపండ్లం దెగడంగ నంగన మురారిం జూచెఁ బ్రేమంబు గ
ప్పెడు సిగ్గు న్మఱి సిగ్గుఁ గప్పెడు మనఃప్రేమంబు సంధిల్లఁగాన్.

ప్రగల్భ కుదాహరణము—


చ.

పొదుపై వృత్తనితంబ మొప్పఁగఁ గుచంబుల్ క్రొవ్వి యొండొంటితోఁ
గదియం గుంకుమపంకరేఖ నొసలం గన్పట్టఁ బ్రద్యుమ్ను ను
న్మదభద్రేభముభంగి బింకమునఁ ద్మందస్మితాలోకనం
బొదవం గృష్ణునిఁ జూచె నిందుముఖి ప్రేమోత్సాహ ముప్పొంగఁగన్.


ప్రౌఢ కుదాహరణము—


మ.

ధర నమ్రస్తనభారము న్విమలవక్త్రస్ఫూర్తియున్ రంజితా
ధరబింబంబును భ్రూలతానటనసౌందర్యంబు నుత్సంగగా
ఢరతాసక్తియు నూర్ధ్వసంగమనిరూఢత్వంబునుం గల్గు నం
బురుహామేదిని చూచెఁ గృష్ణు నసితాభోభృత్సమశ్యామునిన్.


లోల కుదాహరణము—


మ.

అలఘుశ్రేణియు లంబమానపృథుఘోరాకారము న్నాభిదే
శలురద్దీర్ఘకుచంబులున్ ఘటసదృక్షస్థూలతుందంబు నై
పలుమాఱు న్నిడుఁ దీఁగెనవ్వు నగుచుం బాహాగ్రము ల్సాఁచి చి
ట్టలు వెట్టు న్విటుమోముపై జరర కష్టం బిట్టిది న్వేశ్యయే.


గీ.

బాల్యమును యౌవనంబును బ్రౌఢతయును
లోలభావంబు గల పద్మలోచనలకు
డెందమున యందు నింపు వుట్టింపఁజాలు
నట్టి వశ్యావిధానంబు లెట్టి వనిన.


క.

బాలకి మరగించుట తాం
బూలంబుల సురభిగంధపుష్పంబులఁ జి
త్రాలోకనభాషణముల
శాలీమృతులాన్నపానసన్మానముల్.


ఉదాహరణము—


చ.

కలపము గూర్చి మైనలఁదుఁ గమ్మనిపూవుల దోఁపుఁ గొప్పునన్
ఫలరసభక్ష్యభోజ్యములఁ బానములం బరితృప్తి చేయుఁ ద
మ్ముల మిడుఁ జెక్కుటద్దముల మోపు ముఖాబ్జము కామమంత్రముల్
మెలపుగఁ జూపుఁ బాయవశమే హరి నాయబలాలలామకున్.


క.

హారంబుల నానాలం
కారంబుల వివిధసురతకౌశలముల ర
మ్యారామక్రీడల నిం
డారిన జవ్వనపుటింతి యలరుం బతికిన్.


ఉదాహరణము—


ఉ.

హారము లున్నతస్తనములం దొడఁగూర్చు రచించుఁ బెక్కలం
కారము లంగకంబులఁ దగ న్వనలీలల నిం పొనర్చు వీ

ణారుచిఁ జూపు నూత్నరతినైపుణభేదములం బెనంగు నీ
శౌరి లతాంగి యౌవనము సర్వము నీవిభుచేతఁ జిక్కదే.


క.

మక్కువ లొదవెడిపలుకులఁ
డక్కరియలుకలను బహువిడంబంబులఁ బెం
పెక్కిన సురతప్రచురతఁ
జిక్కుఁజుమీ ప్రౌఢయైన చెలువయుఁ బతికిన్.


ఉదాహరణము—


ఉ.

మక్కువ లూనఁ దేనెలగు మాటలు పల్కు నహర్నిశంబు నొ
క్కొక్కనెపంబుమై నలిగి యుగ్మలికిం దమకంబు తద్దయు
న్మిక్కిలిసేయు నొండొరుల మెచ్చని గాఢరతిప్రవీణత
ల్తక్కకచూపు శౌరి మిగులంగలదే మహి నెట్టిప్రౌఢయున్.


క.

ప్రియములు వలికినఁ జాలును
నయమున నొక్కింత చూచినం జాలును స
న్నయ చాలుఁ గరాంబుజముల
రయమున మిన్నందు లోల రతిసౌఖ్యమునన్.


ఉదాహరణము—


చ.

కనుఁగొని నవ్వు నాదరము గల్గినయట్టుల యంతికస్థలం
బున వసియింప వామకరపుష్కరసంజ్ఞ యొనర్చు మిన్నకై
నను దలపెట్టు హాస్యవచనంబులు యాదవరాజుపాలి కే
మని చను లోల ప్రీతియగునా కడివోయినపుష్ప మెయ్యెడన్.

.................

సీ.

ఇంక శృంగారనాయికలునా నెనమండ్రు తెఱవలుగలరు స్వాధీనపతిక
వాసకసజ్జికాహ్వయ విరహోత్కంహితాఖ్యాన విప్పలబ్ధాభిదాన
ఖండోచితనామ కలహాంతరిత ప్రోషితప్రియ యభిసారికాప్రసిద్ధ
వీరు మన్మథుని దిగ్విజయలక్ష్ములు వీరలకు నాయకానుకూలంబునందు
దాసి దూతి బోటి దాదికూఁతురు పొరు
గింటివనిత యెద్దియేని యొక్క
ముద్ర దాల్చియున్నముద్దియ శిల్పిని
స్వవశ తత్సహాయ లవనియందు.


క.

పతిచే నెప్పుడు నుపలా
లితయగు స్వాధీనపతిక, లెస్సగ సదన
స్వతనువు లలంకరించును
క్షితి వాసవసజ్జికాఖ్య చెలువునిరాకన్.


స్వాధీనపతిక—


క.

మురహరుని యురఃస్థలి సు
స్థిరమై యవ్విభుసముల్లసితదరహసిత
స్పురితవచనామృతాదులఁ
బొరయుచు సుఖియించు లక్ష్మిఁ బొల్తురె వనితల్.

వాసవసజ్జిక—


క.

హరిరాకకు నిచ్చలు మం
దిర మొప్ప నలంకరించు దేహమునం గ
స్తురి సురతరుకుసుమంబులు
సిరసునఁ దగ సత్యభామ చెలువగుచుండున్.


క.

విరహోత్కంఠిత యనునది
వరునితడవు సైఁపలేక వగనొందు నధీ
శ్వరుఁ డిక్కకు రాకుండిన
భరపడునది విప్రలంభ భావజుచేతన్.


విరహోత్కంఠిత—


క.

మంద కడుదూర మాగో
విందుఁడు రాఁడేల యనుచు విరహాతురతం
బొంది యొకగోపకామిని
చందురుఁ బ్రార్థించుఁ బ్రాణసఖులం దలఁచున్.


విప్రలబ్ధ—


క.

సంకేతస్థలమునకుం
బంకజదృశుఁ డేలరాఁడు భయభీతుల నే
వంకఁ గరుణింపఁబోయెనో
యింకేమన నన్నుఁ దలఁపఁడే మదనార్తన్.


క.

ఇతర దెస రాత్రి రతిచి
హ్నితుఁడగుపతి ఱేపుగని సహింపనియది ఖం
డితయగుఁ గలహాంతరి తన
పతి నవమానించి పిదపఁ బరితప్త యగున్.


ఖండిత—


క.

మనసిజశరహత మగు నా
మనసది నీ కెఱుఁగరాదు మాధవ యీరే
నను సోఁకిన మదనాయుధ
తనువ్రణముల నిపుడె చూపెఁ దాపము చాలన్.


కలహాంతరిత—


క.

కోపించి జనార్దను నే
లా పల్కితి నపుడు వీనులకు నహితముగా
నోపడఁతి యిపుడు మదనుని
కోపము సైరింప నాకు గోచర మగునే.


క.

ఒకదేశమునకుఁ దననా
యకుఁ డేగినఁ జిన్నవోవునది ప్రోషితభ
ర్తృక నిలుపోపక ప్రియనొ
ద్దకుఁ జను నభిసారికాభిధాన తలంపన్.


ప్రోషితభర్తృక—


క.

మధురకు నేగెం జెలియా
మధుమర్దనుఁ డింక నేఁడు మగుడుట యెపుడో
మధుమాసకీరకోకిల
మధుకరతతు లేపురేఁగి మదనుని గూడెన్.


అభిసారిక—


క.

అందెలు దొడిగితి నీవు ము
కుందునియున్నెడకు నరుగఁగోరి లతాంగీ
పొం దెఱుఁగవే కదా నీ
కుం దెరువున నివియ తోడికొండీలు సుమీ.

స్వాధీనపతిక కుదాహరణము—


చ.

అలయక తీర్చుఁ గుంతలము లందముగాఁ దిలకంబు దీర్చుఁ బు
వ్వులు తుఱుమొప్పఁబెట్టుఁ దొడవు ల్దొడుగు న్సకలాంగకంబుల
న్వలు వమరంగఁగట్టు శుకవాణికి వేణుధరుండు కూర్మి ని
చ్చలుఁ జెలియా యిటేని దొలిజన్మమునం దిది యేమి నోఁచెనో.


వాసవసజ్జిక కుదాహరణము—


చ.

సుదతి నిజాస్యదీథితులు సోఁకి కరంగవిహారగేహముల్
పొదలు శరీరవాసనలఁ బొంపిరివోఁవఁగఁజేసి పానుపు
న్మృదువుగఁ జేసి క్రొవ్విరుల మేను నవీనవికాసలక్ష్మికా
స్పదముగఁ జేసె నీదగు ప్రసన్నసమాగతిఁ గోరి యచ్యుతా.


విరహోత్కంఠిత కుదాహరణము—


ఉ.

కోమలి కృష్ణుఁ డేమిటి కొకో తడవుండె నతండు సత్కళా
దాముఁడు కావ్యగీతరసతత్పరుఁడై యట నిల్వఁబోలు నేఁ
డేమియు లేదు ని న్నచటి కేమని పంపుదు వేఁడికొందు నా
కామునిఁ గన్నవాఁ డతఁడు గాన రయంబున వచ్చు వానిచేన్.


విప్రలబ్ధ కుదాహరణము—


ఉ.

వ్రేతలఁ జిక్కులంబఱుపు వెడ్డరికాఁ డిదె ప్రొద్దువోయె సం
కేతనివాస మశ్రుల నొగిం దడుపంబడియున్ దురాశ లే
లే తనలాగు గంటిమిగదే పద క్రమ్మఱఁ బోద మంచు న
బ్జాతదళాక్షి యీరెలుఁగుపాటునఁ దూలుచుఁ జెప్పెఁ బోటితోన్.


ఖండిత కుదాహరణము—


చ.

కొమరుఁడ రాత్రి యెక్కడనొకో విహరించితి నీకు నాకుఁ బ్రా
ణము లరయంగ నేకమని నన్నుఁ బ్రియంబున నీవు పల్కువా
క్యము నిజమయ్యె నీయొడలి యంగభవక్షతము ల్మదీయచి
త్తము నొగిలించె నంచు వనితామణి పల్కు నిశాటభంజనున్.


కలహాంతరిత కుదాహరణము—


ఉ.

ఇచ్చు సురద్రుమంబు క్రియ నేమని చెప్పినఁ ద్రోపుసేయఁ డే
యొచ్చెము లేదు శౌరిదెస నూరక నీ విట నెగ్గులాడి యీ

యచ్చునఁ గాముబారిఁ బడి తా హృదయంబు సహింప నేమిట
న్మెచ్చొనరించు వానికని మిన్నక చింతిలు నింతి నెవ్వగన్.


పోషితభర్తృక కుదాహరణము—


ఉ.

మన్ననపాత్రుఁ డైన యభిమన్యునిపెండ్లికిఁ నేఁగి యేలొకో
వెన్నుఁడు తద్దయుం దడసె వేమఱు నవ్విభురాక గోరి నా
కన్నులు నెమ్మనంబుఁ దమకంబున నాదెసయంద యుండు నిం
కెన్నఁడు వచ్చునో యని మృగేక్షణ బెగ్గిలుఁ గాముచేఁతలన్.


అభిసారిక కుదాహరణము—


ఉ.

ఈలలితేందురోచులకు నీడుగఁ బూనితి మల్లెదండలు
న్మేలుగ వెల్లపుట్టమును నిర్మలమౌక్తికభూషణంబులుం
జాలవె నీరజోదరుని సన్నిధికిం జన నందె లేల కొం
డీలు పదస్థులైనఁ దరుణీమణి కార్యము దప్పకుండునే.


వ.

తత్సఖీజనంబుల గుణవిశేషంబు లెట్టి వనిన—


క.

సారోక్తులు పలుకును సం
చారిక హితవృత్తిఁ బలుకుఁ జతురిక మధుర
స్మేరోక్తులు దగఁ బలుకును
సారిక మఱి దూతి పల్కు సంధానోక్తుల్.


వ.

మఱి ధీరాధీరనాయికల తెఱం గెట్టి దనిన—


క.

తలరన్ ధైర్యము మనమునఁ
గలిగినయది ధీరనాయికానామ యగున్
వెలయను ధైర్యము చాలని
నలినవిలోచన యధీరనామక యయ్యెన్.


ధీర కుదాహరణము—


క.

అలిగినఁ దీర్పక నే మా
ఱలిగి మనం బరయ ముకుళితాక్షుఁడ నైన
న్నెలఁతుక తమకమువారియు
నెలయఁగ నిద్రించు భావ మే మని చెప్పన్.


అధీర కుదాహరణము—


క.

అలిగిన కోమలిఁ దీర్పక
తలఁపరయం గపటనిద్ర దాల్చిన మదిలో
నిలుపోపక చో టిమ్మని
వలిపిఱుఁదున నొత్తి చనుఁగవం బ్రియునదిమెన్.


గీ.

ప్రియుని నోటలేక పెద్ద భర్జించును
నంతఁ బోక కలఁచు నాగ్రహమునఁ
బరుష యనఁగఁ బరఁగు పంకజదళనేత్రి
యవ్విధంబు దగ నుదాహరింతు.


పరుష కుదాహరణము—


ఉ.

మాపటివేళ బోటులసమక్షమునం బ్రియు బాహువల్లికల్
కోప మెలర్పఁ బట్టి ప్రియ కూటగృహంబున కీడ్చి బాష్పముల్

పైపయిఁ గ్రమ్మఁ దొట్రుపడుపల్కులఁ దప్పులు దెల్పి చెప్పితి
న్నేపనికైన నోరి నిను నింక సహింపను నొవ్వవ్రేయుదున్.


వ.

మఱి యుత్తమమధ్యమాధమనాయికల తెఱం గెట్టి దనిన—

ఉత్తమనాయిక

క.

సముచితభాషణములఁ గో
పమురీతులఁ దత్ప్రసన్నభావంబుల ను
త్తమమధ్యమాధమాఖ్యము
లమరఁగఁ దెలియునది నాయికాంతర మెల్లన్.


క.

తీపెసఁగఁ బ్రియము లాడును
గోపము వెలి దోఁపనీదు గొనకొని దయితుం
డేపాటిప్రియముఁ జెప్ప మ
హోపప్రశమంబుఁ బొందు నుత్తమసతి దాన్.


ఉత్తమనాయిక వచనము—


ఉ.

వేయునునేల నాకు నరవిందవిలోచన నీదరస్మిత
శ్రీయును నీసుభాషితవిశేషము నీవిలసత్కటాక్షముల్
నీయసమానరూపమును నీమహనీయగుణంబు మన్మనో
నాయక యస్మదీయజననంబు ఫలంబులు గావె యిన్నియున్.


ఆనాయిక కోపము—


చ.

పలుకులఁ జెయ్వులం గమనభంగులఁ జూపుల నేవికారముం
దలఁకొననీక పూర్వగతి దప్పక యున్నవధూటి నిమ్ములం
బిలిచి నిజాంకపీఠమునఁ బెట్టి మఖాబ్జము చూడ బాష్పధా
రలు దెలిపె న్మనోగతనిరంతరకోపముపేర్మి శౌరికిన్.


ఆనాయిక ప్రసన్నత—


శా.

ఏతప్పు న్మును సేయ నిందువదనా యింతేల కోపంబు న
న్నేతన్మాత్రునిగాఁ దలంచితఁటవే యేముట్టెద న్నీపదా
బ్జాతం బంచు నొకింత నమ్రుఁ డయినం బ్రాణేశ్వరు న్నేత్రసం
జాతాంభఃకుచకుంభసంఘటితభాస్వద్వక్షుఁ జేసె న్వెసన్.

మధ్యమనాయిక

క.

మునుకొని ప్రియమును నప్రియ
మును బెరయఁగఁ బల్కుఁ దెల్లముగఁ గోపము చూ
పును విభుని మ్రొక్కు గైకొని
యనుఁగై మఱి తేఱు మధ్యమాంగన ప్రీతిన్.

మధ్యమనాయిక వచనము—


ఉ.

అక్కట నీకుఁ గూర్తు నని యందఱుఁ బల్కఁగ నంతవట్టు నే
నిక్కము చేయఁబూని యొకనిం గనువిచ్చియుఁ జూడ నిట్లు నా
మక్కువ నీ వెఱింగియును మానవు నీవెడత్రోవ లింక నే
చక్కటినైన నోరి నిను సైఁపఁజుమీ కడు నొవ్వఁజేయుదున్.


ఆనాయిక కోపము—


గీ.

మోవి యదర బొమలు ముడివడ నెఱ్ఱని
కన్ను లెసఁగ నొడలు గంపమొదవ
నంగములు చెమర్ప ననుచితోక్తులు వల్కుఁ
జెలువఁ దేర్ప నెట్లు సేయుఁ బ్రియుఁడు.


ఆనాయిక ప్రసన్నత—


క.

మ్రొక్కఁగ వచ్చినఁ గాళ్ళుం
జక్కఁగ జాఁచికొని ప్రియునొసలుఁ మీఁగాళ్ళుం
దక్కక కదిసిన మదిలో
మిక్కుట మగుకోపశిఖ శమించెం బ్రియకున్.

అధమనాయిక

క.

పతిఁ గడవఁబలుకు నతఁ డవ
మతి చేసిన నలుక దక్కు మతి నూరక యా
నతుఁ డైనఁ దేఱ దతఁ డు
ద్ధతుఁ డగుటయుఁ గ్రిందుపడు నధమకాంతధరన్.


అధమనాయిక వచనము—


క.

ఏను బ్రియముఁ జెప్పినఁ గై
కోనేరవు కూళవిద్య కుదురై ప్రేవుల్
వూనముగఁ బల్కి సచ్చెదు
సూనాస్త్రునిచేత ననుచు సుదతి యదల్చెన్.


ఆనాయిక కోపము—


క.

పోనని పోదుం గనుఁగొన
నే నని కనుఁగొందుఁ గోప మెత్తినఁ దగునిం
కేనతని నొల్లఁబొమ్మని
పూనియ పైఁబడుదుఁ గూర్మి బగ్గిఁకఁ జెలియా.


ఆనాయిక ప్రసన్నత—


గీ.

కాంతుఁ డలుక దీర్పఁ గాళ్ళపై వ్రాలిన
గానివాని యనుచుఁ గాంత ద్రొబ్బుఁ
వాఁడు గినిసిపోవ వడిఁ బాఱి పట్టు రా
కున్నఁ గాళ్ళమీఁద నొరగు వనిత.

చాతుర్వర్ణ్యగృహిణులు

క.

చాతుర్వర్ణ్యోదితగృహి
ణీతిలకంబులకుఁ గలుగు నేరుపులును ద
జ్జాతిగుణవిశేషగుణంబులు
నాతతముగఁ దెలియవలయు నవి యెట్లనినన్.


క.

గరగరికయు గాంభీర్యము
సరసోక్తులు గలుగుఁ గాని సద్ద్విజసతికిన్
సురతకళానిపుణత్వము
దొరకొన దెప్పుడును సిగ్గు దొడవై యునికిన్.


క.

బింకము చెలువును ధృతియుఁ గ
డంకయు మచ్చరము గలిగి డాసినచో మీ
నాంకునిదేవికి నెనయై
కొంకక విభుఁ గవయు రాచకోమలి గరిమన్.


క.

బుడిబుడిమాటల తఱచు
న్వెడబుద్ధులు మలినమైన వేషముఁ గడుఁ జొ
ప్పడియుండుఁ గాని కోమటి
పడఁతికి నేరుపులు లేవు పతిఁ గవయునెడన్.


క.

కమ్మలుఁ గడియము గాజులు
నమ్మడుఁగులుఁ జుక్కబొట్టు నమరఁగ రతితం
త్రమ్ములఁ బస గలిగి ప్రమో
దమ్ము పతికిఁ జేయు శూద్రతరుణి ధరిత్రిన్.

మన్మథమాహాత్మ్యము

సీ.

శృంగారరాజ్యాభిషిక్తుఁ డుద్యత్కళాచతురుండు మన్మథచక్రవర్తి
యతనిపట్టపుదేవి రతిదేవి పువ్వులరథము వాహనము సారథి వసంతుఁ
డాయుధ మిక్షుశరాసన మమ్ములు కమ్మగ్రొవ్విరులు టెక్కెమ్ము మీను
కలకంఠశుకశారికామధువ్రతములు సేనలు దళవాయి సీతకరుఁడు
కృతకపర్వతారామదీర్ఘికలయందు
విడిసి మలయసమీరుండు వేగుఁ జూడ
నాకవిభునైనఁ గైలాసనాథునైనఁ
జెలఁగి సాధించు మర్త్యులఁ జెప్పనేల.


క.

చూత మశోకంబును జల
జాతము నీలోత్పలము నెసఁగువిరవాదిం
జేతోజాతుని బాణము
లాతఁడు సాధించు వీన నఖిలజగంబుల్.


క.

కన్ను లశోకమునకు గుఱి
చన్నులు చూతమున కరుణ సరసిజమునకుం
జెన్నుగ నురమది దిరిసెము
నున్నతమస్తకము యోని యుత్పలమునకున్.


క.

కూడుడిగించు నశోకము
వాడించును మల్లెవిరి వివర్ణతచేయుం
జూడఁగఁ జూతము తలఁపులు
జోడించును దమ్మి చంపి చూపుం గలువల్.


క.

వినుతవచనరచనంబుల
ఘనతరముగ నిట్లు నాయకప్రకరణ మిం
పున వివిధనాయికావ
ర్ణనసహితం బగుచు నూతనస్థితిఁ దనరెన్.


శా.

జానొంద న్శకవర్షముల్ ఋతుశరజ్వాలేందులై యొప్ప న
య్యానందాబ్దమునందు మాఘమునఁ గృష్ణైకాదశీభౌమయు

క్తానామామృతవేళ నీకృతి యనంతార్యుండు సమ్యగ్రస
శ్రీ నిండన్ ధ్రువపట్టణాధిపున కిచ్చె న్భక్తిపూర్వంబుగన్.


క.

తలఁచిన తలఁపు ఫలించును
జెలు లగుదురు శత్రు లైన శ్రీ లొడఁగూడుం
గలికాలదురితములు దు
ప్పలఁ దూలును ధ్రువపురీశు భాసురకరుణన్.

గద్యము
ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ సుకవిజన
విధేయ అనంతనామధేయ ప్రణీతం బైన రసాభరణంబునందు
సాధారణనాయకచతుష్టయంబుల తెఱంగును జతు
ర్విధనాయికావిశేషంబును దత్సఖసఖీభేదం
బులును నాయికాప్రకరణంబు నన్నది
సర్వంబును జతుర్థాశ్వాసము.