Jump to content

రతిరహస్యము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ద్వితీయాశ్వాసము

సురతాధికారః

క.

శ్రీ వనితావల్లభపద
సేవా హేనాకవిజయ శృంగారకళా
భావజ్ఞ సకలవిద్యా
ప్రావీణ్యా కుంటముక్ల భైరవమల్లా.


శ్లో.

విలసదమలదీపే పుష్పదామావకీర్ణే
                        ప్రసృతసురభిధూపే ధామ్ని కామీసువేషః।
సహ సహచరవర్గైర్వామపార్శ్వే నివేశ్య
                        స్త్రియముపహితభూషాం భావయే న్మర్మగోష్ఠీమ్॥


శ్లో.

కృతలఘుపరిరంభో వామదోష్ణా పటాన్తాం
                        చలకుచయుగకాంచీః సంస్పృశేద్భూయ ఏవ।
కలితలలితగాథాగీతిరుత్పాద్యచైవం
                        యువతిహృదయరాగం భగ్నగోష్ఠీప్రబన్ధః॥

శ్లో.

అలికచుబుకగండం నాసికాగ్రం చ చుమ్బన్
పునరుపహితసీత్కం తాలు జిహ్వాం చ భూయః।
ఛురితలిఖితనాభీమూలవక్షోరుహోరుః
శ్లథయతి ధృతధైర్యః స్వాపయిత్వా౽ధ నీవీమ్॥


సీ.

 పట్టెమంచము దూదిపఱుపు ముక్కలిపీట
                 యగరుధూపము వెలుగైనదివ్వె
పూవుల గంధపుఁబొడి పున్గుబరిణెయు
                 జాలవల్లిక వన్నెమేలుకట్లు
తమ్మపడిగమును దలగడ చిటిచాప
                 సానఱా యడపంబు సంచి గిండి
గొడుగు పావలు గాజుగుడిక సున్నపుఁగ్రోవి
                 గంధంపుఁజిప్ప బాగాలబరిణె


గీ.

చిన్నిబిందెయుఁ జిరుతెర గిన్నెబోన
నిలువుటద్దము వీణెయుఁ జలుకసురటి
మిద్దెయిల్లును ముంజూరు మిగిలినట్టి
పంచయును గల్గు కేళికాభవనమందు


తా.

పట్టెమంచము దూదిపఱుపు మూడుకాళ్ళుగలపీట అగరువత్తులపొగ
వెలుతురుగల దీపము పువ్వులు గంధపుపొడి పునుగుల బరిణెయు చిత్రపుపనిచేసిన
తమలపాకులకట్ట వన్నియగలిగిన తలిమము కళాంజి తలగడ చిఱుచాప సాన
ఱాయి వక్కలాకులుంచుకొనుసంచి సన్నపుమెడగలచెంబు గొడుగు పావకోళ్ళు
గాజుగుళిక సున్నపుకాయ గంధపుగిన్నె వక్కపొడిబరిణె చిన్నబిందె చిన్నతెర
భోజనపళ్లెము వీణె శుకము వట్రువవిసనకఱ్ఱ మిద్దెగలయిల్లు ముందు
చూరుగలపంచయు గలిగిన కేళికాభవనమునందు.


సీ.

పొగకంపు గలుగక మిగుల వెచ్చనగాక
                 తెలియైన నీటను జలకమాడి
కరము పల్చనయును గాక పిప్పియుఁ గాక
                 మృదువైన గంధంబు మేన నలఁది

గడిదంబుఁ జిలుగును కాక మేలైయున్న
                 పంచెపై వలిపదుప్పటము గట్టి
చెమ్మలేకయు వన్నె చెదరక వాసనఁ
                 గులుకు పువ్వులతోడఁ గొప్పు ముడిచి


గీ.

మదనరతికోవిదులు పీఠమర్దకాది
విటులు సల్లాపములుఁ జేసి వేడ్కఁజేయ
మోహనాకారుఁడై మరుమూర్తివోలె
పల్లవుడు కేళిమందిరాభ్యంతరమున.


తా.

పొగవాసనయు మిక్కిలివేడియులేని తేటయగు నీటితో స్నానము
చేసి పల్చనయు పిప్పియుకాక మెత్తనిగంధమును శరీరమున పూసి ముదుగును
అల్పమును కాని మేలగు పంచె కట్టి పరిశుద్ధమై వెలగల సన్నపాటి వెడల్పు
వస్త్రము పైన వైచుకొని తడిలేక రంగుమారక పరిమళోపేతమగు పువ్వులను
ముడిచి రతికళావేత్తలును పీఠమర్దకవిదూషకులును పరస్పరసంభాషణములతో
సంతోషమును గలుగజేయు శృంగారరూపము గలవాడై మన్మథునివోలెనున్న
వరుడు ఆ కేళీగృహమునందు —


సీ.

వలిపపయ్యెదలోన నిలువక వలిగుబ్బ
                 చనుదోయిమెఱుఁగులు చౌకళింపఁ
బగడంపువాతెఱపై నొకించుక దాఁగి
                 మొగమునఁ జిఱునవ్వు మొలకలెత్త
కొలుకుల నునుగెంపుఁ జిలికించు గ్రొవ్వాఁడి
                 దిట్టచూపులు తలచుట్టుఁ దిరుగ
నునుకొప్పులోపల నునిచినపువ్వుల
                 తావి పైకొని తుమ్మెదలను బిలువ


గీ.

తొడవులకునెల్లఁ దొడవైన యొడలితోడ
వలపుకునెల్లఁ దనమేని వలపుఁ దెలుప
పరఁగు కామిని దనవామభాగమునకుఁ
గదియఁగా వేడ్క లెంతయుఁ గడలుకొనఁగ.

తా.

గుబ్బచన్నులయొక్కఠీవి పయ్యెదలొనిండి యచ్చటనే యుండక
కనులకు మిఱుమిట్లు గొలుప, ఎఱ్ఱనికాంతిగల పెదవులపై దాగియుండిన మొలక
నవ్వు మొగమున కనుపింప, కనుగొలకుల నెఱ్ఱనిఛాయను ప్రకాశింపచేయు వాడి
చూపులు తలచుట్టును దిరుగ, కొప్పున ముడిచిన పువ్వులయొక్క పరిమెళము
తుమ్మెదలనుబిలువ, భూషణముల కన్నిటికిని భూషణమగు యొడలితో, మోహ
ముల కన్నిటికిని తనదేహమం దలమిన వలపుపూత మదనోపశ్లేషముచే పొంగి స్రవిం
చుచు విటునకు వలపు దెలుపునట్లుండిన కాంతను తన యెడమదిక్కునకు దీసికొని
కోరిక లీరిక లెత్త సంతసంబున —


ఉ.

సన్నపుఁబాటఁ బాడి రతిసంభ్రమ మొప్పఁగఁ గౌఁగిలింపుచు
న్జన్నులు చీరెకొంగు కచసంచయమున్ రచనాకలాపమున్
మున్నుగ వామహస్తమున ముట్టుచు హస్తము గీలుకొల్ప నా
సన్న యెఱింగి యొండొకఁడు జారిన నెచ్చెలికాండ్రు నంతటన్.


తా.

పురుషు డాస్త్రీని సంతోషమున కౌగిలించుచు కుచములును చీరె
కొంగును కొప్పును ముందుగ యెడమచేత ముట్టుచు చేసన్న జేయ చెలికాండ్రం
దరు తెలిసికొని యొక్కొక్క రాస్తలమును బాసిన తరువాత —


చ.

పొలఁతుక నాసికాగ్రము కపోలమును న్జుబుకంబు ఫాలమున్
జెలు వలరంగఁ జుంబనముఁ జేసి పదంపడి తాను జిహ్వలన్
గళరవ మొప్పఁ జుంబనవికారముల న్ఘటియించి మన్మథ
స్థలనకుఁ జేరఁజొచ్చి రతిసంగతిఁ జేసి ద్రవింపఁజేయుచున్.


తా.

పురుషు డాస్త్రీయొక్క ముక్కుకొన దవడ చుబుకము నొసలు
ముద్దాడి మరియు తాను కంఠధ్వని యొప్పునట్లు చుంబించుచు పాన్పునందు జేర్చి
రతిసాంగత్యముచేత ద్రవింపజేయవలయును.

రతిప్రేరేపణక్రియాలక్షణము

శ్లో.

యతి విమతిముపేయాద్ గణ్డపాలీం విచుంబ్య
స్మరగృహమపి లింగాగ్రేణ సంపీడ్య దత్త్వా।
ముఖమభిముఖమస్యా అంగమాలింగ్య దోర్భ్యాం
మదనసదనహస్తక్షోభలీలా విదధ్యాత్॥

ఆ.

అతివ రతికి విముఖ మైనను బురుషుండు
చెక్కుచుంబనంబుఁ జేసి మదన
గృహము లింగమునను గీటుచుఁ గౌఁగిట
హత్తి చేత గుహ్య మలమవలయు.


తా.

స్త్రీ రతికి సమ్మతింపకయుండునపుడు పురుషు డా నాతిదవడలు
ముద్దాడి మదనగృహమును కామదండముచేత తాకింపుచు కౌగిలించుకొని చేతితో
మదనగృహమును గవియవలయును.

భగభేద లక్షణము

శ్లో.

సరసిజమృదురన్తః కోపి కీర్ణోంగుళీభి
ర్భవతి చ వలితోన్యః కోపి గోజిహ్వికాభిః।
ఇతి మదననివాసో యోషితాం స్యాచ్చతుర్ధా
వ్రజతి శిథిలతాం చ శ్లాఘ్యతాం పూర్వపూర్వః॥


సీ.

నాల్గుచందములు మన్మథమందిరములందు
                 నుండు తామరరేకు నోజ నొకటి
పులినసంగతి మించి పొడవున మిక్కిలి
                 తరులచాయలు గల్గి తనరు నొకటి
విరివి లోఁతై చేతివ్రేళ్ళన్ని గూడంగఁ
                 జొనుపక పన్ను కాదనెడి దొకటి
వరుసనై గోజిహ్వ తెఱఁగున నధమమై
                 యేపట్ల కందక యెసఁగు నొకటి


ఆ.

యిందులోన మొదల నెన్ని దెయ్యది
యదియె ద్రవము నించు ననుగుణముగఁ
గొదువమూఁడు నొకటికొకటికి నధమమౌ
నెన్నిచూడఁ దనరు నన్నులకును.


తా.

స్త్రీలకు భగములు నాలుగుతెరంగులైయుండు. అందొకటి తామర
రేకువలె మృదువుగా నుండును. మఱియొకటి యిసుకదిన్నెవలె పొడవుగా మడ
తలు గలిగియుండును. వేరొకటి మిక్కిలి లోతై చేతివ్రేళ్ళన్నియు బ్రవేశింప

జేయక పరిపక్వముగాక యుండును. ఇంకొకటి ఆవునాలికవలెనే అధమమై
యేవిధముగాను సృక్కక యుండును. ఈ నాలుగువిధముల భగములలో మొదట
చెప్పిన తామరరేకువంటిదే పురుషున కనుకూలముగా ద్రవించును. కడమ మూ
డును వరుసగా నొకటికంటె యొకటి అధమమని యెరుంగవలయును.


శ్లో.

నివసతి భగమధ్యే నాడికా లింగతుల్యా
మదనగమనదోలా ద్వ్యంగులక్షోభితా సా।
సృజతి మదజలౌఘం సా చ కామాతపత్రం
ద్వయమిహ యువతీనామిన్ద్రియం నిర్దిశన్తి॥


ఉ.

కామినిగుహ్యమధ్యమునఁ గల్గిననాడియు లింగతుల్యమై
కాముకుఁడోలఁ జేసి యది కామగదల్చియు నంగుళీయక
భ్రామక మాచరించినను బట్టఁగ రెండుతెఱంగులందు న
క్కామగృహంబు భేదిలినఁ గామజలం బుదయింపకుండునే.


తా.

స్త్రీయొక్క భగమధ్యమందు లింగమునకు సమానమై మేఢ్రమునకు
నుయ్యెలగా నొకనాడి యుండును. ఆనాడిని కామముగా దలంచి వ్రేళ్ళచేత
త్రిప్పిన ద్వివిధములైన నా కామగృహ ముప్పొంగి రతిద్రవము పుట్టును.


శ్లో.

మదనసదనరన్ధ్రాదూర్ధ్వతో నాసికాభం
                        సకలమదశిరాఢ్యం మన్మథచ్ఛత్రమాహుః।
వసతి మదనరన్ధ్రస్యాన్తరే నాతిదూరాత్
                        స్మరజలపరిపూర్ణా పూర్ణచన్ద్రేతి నాడీ॥


క.

మరునికి ఛత్రం బనఁగా
మరునింటికిమీఁద ముక్కుమాడ్కి నెసంగు
న్నరమొకటి చంద్రనాడియు
పొరుగుననే యుండు నుదకపూర్ణం బగుచున్.


తా.

మన్మథునికి గొడుగా యనగా యోనికి మీదిభాగమున ముక్కువలె
యొకనరముండును. దానికి సమీపముననే జలపూర్ణమైన చంద్రనాడి యుండును.


శ్లో.

నివసతి బహునాడీచక్రమన్యత్ప్రధానం
                        త్రితయమిదమహోక్తం హస్తశాఖావిమర్దే।

కరికరఫణిభోగార్ధేన్దుకామాంకుశాద్వై
                        రలమిహ కరశాఖా యోగభేదాభిధానైః॥


శ్లో.

శిథిలయతి కఠోరాం తర్జనీమధ్యమాభ్యా
                        మసకృదుదితనాడీం క్షోభయిత్వా యధోష్టమ్।
ఇతి నఖరదచుమ్బాశ్లేషగుహ్యోపచారై
                        ర్విలసతి మదరాజ్యే యన్త్రయోగం విదధ్యాత్॥


సీ.

సవరించు బహునాడిచక్ర మంగజుమంది
                 రంబులోపలను నరంబుఁ గూడి
చంద్రనాడి స్మరచ్ఛత్రంబులును బహు
                 నాడిచక్రము ప్రధానత్రయంబు
కరికరఫణిభోగకామాంకుశార్ధేందు
                 వులుగాఁగ వ్రేళ్ళు నంగుళుల కయ్యె
నీవ్రేళ్ళలోపల నిన్నిటికంటెను
                 ముఖ్యంబు పెనువ్రేలు మొదటివ్రేలు


గీ.

గాన నీరెండువ్రేళ్ళను గదియఁగూర్చి
మొదటఁ జెప్పిన త్రితయంబు నదిమి పుణికి
మెదపి కలయించి యలయింప మదనజలము
వొడము భువియందు నెటువంటి పొలఁతికైన.


తా.

భగములోని నరమును గూడి బహునాడిచక్ర మని యొకటి యుం
డును. ఇదియు చంద్రనాడియు మన్మథునిగొడుగును ఈ మూడును ప్రధాన
ములు. కరికరము, ఫణిభోగము, కామాంకురము, అర్ధేందము, అని వ్రేళ్ళకు
పేరులు. ఈవ్రేళ్ళలో అన్నిటికంటె పెద్దవ్రేలును మొదటివ్రేలును ముఖ్యము
గావున ఈరెండువ్రేళ్లను యొకటిగా చేర్చి ముందుచెప్పిన చంద్రనాడియు
కామాతపత్రము బహునాడిచక్రమును యీ మూడింటిని యీరెండువ్రేళ్లచే నదిమి
మెదిపి, కలయబెట్టి అలియునటుల జేసిన యేలాటి కఠినమైన స్త్రీకైనను మదన
ద్రవము పుట్టును.


క.

ఈరీతిని నఖదంతప
రీరంభణచుంబనాదిరీతుల మదనా

గారోపచారముల యెడ
నోరిచి మరురాజ్యతంత్ర యోగోన్ముఖుఁడై.


తా.

ఈ విధముగా నఖక్షత దంతక్షత చుంబన యాలింగన కరకరి క్రీడలు
మొదలగు భగోపచారముల యందు సహించి మదనరాజ్యతంత్రములయం దాసక్తి
గలవాడై —


శ్లో.

అథసాత్మ్యవశాత్కృతబాహ్యరతః పరతః ప్రమదాం కలయేత్సమదామ్।
స్మరమందిరమానసనమానగతిః స్మరయన్త్రవిధిం విదధీత పతిః॥


చ.

హితమగుదేశరీతి సతియిచ్ఛ యెఱింగి విటుండు బాహ్యపున్
రతులఁ గలంచి కామగృహరంధ్రచరత్పరిమాణకోశుఁడై
యతనుకళావిధిజ్ఞు లగునార్యులు చెప్పినభంగి నుల్లస
త్ప్రతికరణప్రసక్తుల విరాజితుఁడై రతి సల్పఁగావలెన్.


తా.

విటుడు తన కనుకూలమైన స్త్రీయొక్క మనస్సును దేశాత్మీయ
మును తెలిసికొని నఖక్షత దంతక్షత ఆలింగన చుంబనాది బాహ్యరతులచే స్త్రీని
కరగించి యోనికి సమానమైన పరిమాణముగల శిశ్నము గలవాడయి మన్మథశాస్త్ర
వేత్తలు చెప్పిన ప్రకారము బంధనాదులచే రతి చేయవలయును.


శ్లో.

శిథిలస్మరన్ధ్రఘనీకరణం యది సంయమితోరు భవేత్కరణం।
సుఘన్ జఘనే శిథిలీకరణం వివృతోరుకమేన మతం కరణం॥


ఆ.

పెద్దమదనగృహము పిన్నగాఁ జేయను
బిన్నగృహము మిగులఁ బెద్ద సేయ
విటుఁడు సంవృతోరు వివృతోరువు లనెడి
కరణముల నెరింగి కవయవలయు.


తా.

విటుడు స్త్రీయొక్క భగము పెద్దదిగా నుండిన చిన్నదిగా చేయను
చిన్నదిగా నుండిన పెద్దదిగా చేయను సంవృతోరు వివృతోరువులను బంధములను
దెలిసికొని రమింపవలయును.


శ్లో.

ఇహ నీచరతే ఘటయత్యఘనం జఘనం ప్రమదాతిమదాకులితా।
ధ్రువముచ్చరతే ప్రవిశాలయత ప్రగుణం సమమేవ సమే స్వపితి॥

గీ.

నీచరతియందు మదమెక్కి నీరజాక్షి
సంకుచిత మొనర్పును దన జఘనతలము
ఒడ్డుగా నుంచు జఘనంబు నుచ్చరతిని
చాన కదలక నిదురించు సమరతాన.


తా.

స్త్రీ నీచరతమందు మదోద్రేకము గలదై జఘనమును సంకుచితమును
జేయును. ఉచ్చరతియందు విశాలమును జేయును. సమరతియందు నిద్రించు
చున్నటుల కదలక పరుండును.

బంధ భేదములు

శ్లో.

ఉత్తానకతిర్యగథాసితకం స్థితనానతమిత్యపి పంచవిధమ్।
సురతం గదితం మునినా క్రమశః కథయామి విశేషమశేషమతః॥


వ.

 మఱియు నాకరణంబుల లక్షణంబు లెఱింగించెద — నారీరత్నము పర్యంకం
బున వెల్లకిలగాఁ బరుండినపుడు తత్పాదంబులు కరంబుల న్బట్టి పట్టుబం
ధంబు లుత్తానకరణంబు లనఁ జను — పువ్వుఁబోఁడి ప్రక్కవాటుగా నెడమ
పార్శ్వంబుగానైనఁ గుడిపార్శ్వంబుగానయినఁ బవళించియుండఁ బురుషుఁ
డభిముఖముగాఁ బవ్వళించి పట్టుబంధంబులు తిర్యక్కరణంబు లనంబడు —
అంగనామణి కూర్చుండియుండఁ బురుషుండు పైకొని పట్టు బంధంబులు స్థిత
కరణంబులని యనంబడు — మగువ నిలిచియున్నపుడు స్తంభకుడ్యాదు లాని
కగా నుంచి పురుషుండు పట్టుబంధంబు లుద్ధితకరణంబు లనఁ జను — కో
మలాంగి పాదంబులు కరంబులు పానుపున నాని తిర్యగ్జంతువులరీతి వాలియు
న్నపుడు పురుషుండు వెనుకభాగమున నిలిచి పట్టుబంధంబులు వ్యానకర
ణంబు లనంబడు — నివియైదును బురుషకృత్యంబు లగు నింకఁ బురుషుండు
రతివిశ్రాంతుఁడయి పవళించియున్నపుడు ప్రేమాతిశయంబునఁ దనివి సనక
లతాంగి పురుషుని బైకొని పట్టుబంధంబులు విపరీతకరణంబులు నాఁ బరఁగె.
వీటికి యథాక్రమంబుగా లక్షణంబులు వివరించెద.


శ్లో.

ఉత్తానరతప్రచయే కరణ ద్వయమత్ర సమే, త్రయముచ్చరతే।
క్రమతోథ చతుష్టమల్పరతే గదితం మునినాథ వినా నియతేః॥


గీ.

కరణములు గ్రామ్య నాగరకములు రెండు
జృంభి తోత్ఫుల్ల నింద్రాణి చెలఁగు మూఁడు

పీడి బాడబ సంపుట వేష్టి నాల్గు
సమరతులను నీచోచ్చలఁ జనును వరుస.


తా.

ఉత్తానరతసమూహమునందుగల గ్రామ్య, నాగరక బంధములు రెం
డును సమరతమునందును, ఉత్ఫుల్లక, జృంభిత, ఇంద్రాణి బంధములు మూడును
నుచ్చరతమునందును, సంపుటకము, పీడితము, వేష్టితము, బాడబకబంధములు
నాలుగును నీచరతియందును నుపయోగింపవలెను.

1 గ్రామ్య, 2 నాగరక బంధముల లక్షణములు

శ్లో.

ఉత్తానితయోషిత ఏవ భవేదుపవిష్టవరోరుగమూరుయుగమ్।
తద్గ్రామ్యమథాస్య బహిః కటితో యది యాతి తదా కిల నాగరకమ్॥


చ.

చిలుకలకొల్కి పాన్పుపయి జల్వమరం బవళించియుండఁగా
నలువుగ దానియూరువులు నందకుమారుఁడు నైజజానుసీ
మలఁ దగనిల్పి పల్మరును మారునికేళిని గూడెఁ గావునన్
దెలియఁగ గ్రామ్యబంధమని తెల్పిరి దీని ముదంబు మీఱగన్.


తా.

స్త్రీ పానుపునందు పండుకొనియుండ నాస్త్రీయొక్క తొడలను
కృష్ణమూర్తి తనయొక్క మోకాళ్లయందుంచుకొని పలుమారు రతి సల్పెను కనుక
నాభావమును వాత్స్యాయనాదులు గ్రామ్యబంధ మని తెల్పిరి.


మ.

యమునాసైకతసీమలందుఁ గడునొయ్యారంబునన్ రాధికా
రమణి న్బూవులసెజ్జఁ జేర్చి చెలువారం దత్పదాంభోజయు
గ్మముఁ దా గజ్జలఁ జేర్చి యూరువుల దత్కాంతోరువు ల్చేర మో
దమున న్గూడిన నాగరాఖ్యమను బంధం బండ్రు ధాత్రీజనుల్.


తా.

కృష్ణమూర్తి యమునానదీతీరమునం దున్న యిసుకదిబ్బలయందు
పుష్పవేదికపయి రాధికనుంచి యారాధయొక్క పాదములు రెండును తన గజ్జల
యందుంచుకొని తనయొక్క రెండుతొడలచే నాపెయొక్క తొడలను బిగించి
రమించిన భావమే నాగరాఖ్యబంధ మందురు.

3 ఉత్ఫుల్లక బంధలక్షణము

శ్లో.

కరయుగ్మధృతత్రికమూర్ధ్వలసజ్జఘనం పతిహస్తనివిష్టకుచమ్।
స్ఫిగ్బింబబహిర్ధృతపార్ష్లియుగం హ్యుత్ఫుల్లకముక్తమిదం కరణమ్॥

ఉ.

కామిని కించిదున్నతముగా జఘనం బెగనెత్తి తత్కటీ
సీమలక్రిందఁ బాదములు చేరిచి కృష్ణు కటీద్వయం బొగిన్
బ్రేమను జేతులందు నిడఁ బ్రీతి విభుండు కుచంబు లాని యు
ద్ధామగతిన్ రమించినది ధారుణి ఫుల్లకనామబంధమౌ.


తా.

స్త్రీ కొంచెము ఎత్తుగా మొలనెత్తి తన పిరుందుల క్రింద పాదములను
జేర్చుకొని కృష్ణుని యొక్క రెండుపిరుందులను తన చేతులతో పట్టుకొనియుండ
పురుషు డాస్త్రీయొక్క కుచములను బట్టుకొని యేపుగా రమించుభావమును ఫుల్లక
బంధమనియు నుత్ఫుల్లక బంధమనియు శాస్త్రజ్ఞు లెఱింగించెదరు.

4 జృంభిత బంధ లక్షణము

శ్లో.

యది తిర్యగుదంచితమూరుయుగం దధతీ రమతే రమణీ రమణమ్।
విహితాపసృతిర్వివృతోరుభగా భువి జృంభితముక్త మిదం కరణమ్॥


మ.

అరులంబోణి నిజోరువు ల్కరములం దడ్డమ్ముగా సాఁచి ని
శ్చలమై యుండఁగ నెత్తి కామునిలు విస్తారంబుగాఁగ న్బిరుం
దులఁదోడ్తో నెదురొడ్డుచుండ హరి చేతోరాగ ముప్పొంగఁ జె
న్నలరం గూడఁగ జృంభితాఖ్యమగు బంధంబయ్యెఁ జిత్రంబుగన్.


తా.

స్త్రీ తనయొక్క తొడలను చేతులయం దడ్డముగా సాచి కదలకుండున
టు లెత్తియుంచి యోని విరివిచెందునటుల పిరుదులను వెంటవెంటనే యెదురొడ్డు
చుండ కృష్ణమూర్తి యుల్లాసముతో నాస్త్రీని రమించిన భావమే జృంభితబంధ
మనబడును. ఈబంధము బాడబావృషభులకు ప్రియము.

5 ఇంద్రాణిక, 6 ఇంద్రక బంధముల లక్షణము

శ్లో.

నిజమూరుయుగం సమమాదధతీ ప్రియజాను నియోజయతి ప్రమదా।
యది పార్శ్యత ఏవ చిరాభ్యసనాదిన్ద్రాణికముక్త మిదం కరణమ్॥


ఆ.

తొడలు సమముఁ జేసి తొయ్యలి విటుని మో
కాలిమీఁదఁ బారఁ గీలుకొల్పి
ప్రియుని చంక నిడుద పిక్కలు నిలుప నిం
ద్రాణికంబు నృత్యరమణి కయ్యె.

తా.

స్త్రీ తనయొక్క తొడలను సమముచేసి పురుషుని మోకాళ్లమీద
బారచాచి ప్రియునియొక్క చంకల రెండుపార్శ్వములయందు తనపిక్కల నుంచి
రమించిన భావమే ఇంద్రాణికబంధ మగును. ఈ బంధము నాట్యస్త్రీకి యొప్పి
యుండును. ఇది హరిణీతురగులకు బ్రియంబు.


చ.

సతి తనబాహుమూలములసందున గట్టిగ నాత్మజానువుల్
వెతికిలఁబెట్టి పాన్పుపయి వెల్లకిలం బవళించియుండఁగా
మితిగ మురారిపాదములమీఁదను దత్కటియుగ్మ ముంచి యు
న్నతకుచయుగ్మ మాని రమణన్ రమియించిన నింద్రకం బగున్.


తా.

కాంత తనచంకలసందులలో తనయొక్క పిక్కలను గట్టిగా పట్టి
పానుపుమీద వెల్లకిల పరుండియుండ కృష్ణముర్తి తనపాదములమీద నాస్త్రీ
యొక్క పిఱుదుల నుంచి కుచంబులను బట్టి రమించుభావమే యింద్రకబంధ
మగును. ఇది కరిణీజాతిస్త్రీకిని శశజాతిపురుషునకును బ్రియము.

7 పార్శ్వసంఘటిత, 8 ఉత్తానసంఘటిత, 9 పీడిత బంధముల లక్షణములు

శ్లో.

సరళీకృతజంఘముభౌ మిళితౌ యది సంపుటకో భవతి ద్వివిధః।
ఉత్తానకపార్శ్వవశాద్ యుపతేః స చ పీడితమూరునిపీడనతః॥


క.

చిక్కన్బిక్కల నాథుని
ప్రక్కల బిగియించి పాన్పుపైఁ బవళింపన్
జక్కెరవిల్తునికేళిన్
జక్కఁగ హరిఁ గూడఁ బార్శ్వసంఘటిత మగున్.


తా.

స్త్రీ తనయొక్క పిక్కలచే పురుషుని యొక్క పక్కలను బలముగా
బిగించి పరుండియుండగా పురుషుడు రతిసల్పుభావమును పార్శ్వసంఘటిత
బంధమనిరి.


చ.

చెలి తన రెండుపిక్కలను శ్రీహరిగౌను బిగించిపట్ట భూ
తలమునఁ జేతు లానుకొని తల్గడమీఁదను జేరియుండఁగా
గులుకుమెఱుంగుగుబ్బలను గోరుల నొక్కుచు మోవి యాని తా
నలరుచుఁ గ్రీడ సల్ప నది యౌత్తనసంఘటితంబు నాఁదగున్.

తా.

స్త్రీ తనపిక్కల రెంటిచేతను కృష్ణమూర్తియొక్క నడుమును బిగించి
పట్టి భూమిమీద చేతు లానుకొని తలగడమీదను జేరియుండగా నాస్త్రీయొక్క
చన్నులను గోళ్లతో నొక్కుచు నధరపాన మానుచు శ్రీకృష్ణుడు రమించుభావ
మును యుత్తానసంఘటిత బంధమనిరి. ఇది హరిణీశశులకు బ్రియమైనది.


చ.

జలజదళాక్షి పాదములు సక్కఁగ రెండును గూర్చి సాఁచి పూ
దలిమమున న్బరుండ ప్రమదంబునఁ బైకొని యమ్మురారి బో
ర్గిలఁ బవళించియుండ మృదురీతిగ నూరువుల న్దదీయ ని
శ్చలమదనధ్వజంబు సరస న్బిగియించినఁ బీడితం బగున్.


తా.

సతి తనయొక్క రెండుపాదములను సమముగా చేర్చి జాచుకొని
పానుపుపై బవళించియుండగా కృష్ణమూర్తి యాసతిపై బోరగిల్లుగా పండుకొన
నాసతి తనయొక్క తొడలతో కృష్ణమూర్తి శిశ్నమును బిగింప మురారి రతి
సల్పినభావమును పీడితబంధమనిరి. ఇది శశజాతి యువతికిని తురగజాతి పురుషునకును బ్రియము.

10 వేష్టిత, 11 బాడబక బంధముల లక్షణములు

శ్లో.

పరివర్తితమూరుయుగే తు భవేదితమేవ హి వేష్టితనామధరమ్।
గృహ్ణాతి భగోష్టపుటేన యది ధ్వజమస్ఫురమిత్యపి బాడబకమ్॥


మ.

నళినీలోచన యూరుకాండముపయి న్నాథోరువు ల్సుట్టి దో
ర్బలత న్మే న్బిగియారఁ గౌఁగిటను జేర్పన్ శౌరియున్ మోహ మ
గ్గలమై క్రమ్మఱ మీఁద వ్రాలి ధర మోకా ళ్ళూనియు న్మోవియు
న్గళన న్బట్టుచుఁ గూడ వేష్టితసమాఖ్యంబైన బంధం బగున్.


తా.

స్త్రీ తననాథునియొక్క తొడలను తనయొక్కు తొడలతో చుట్టి
యాతని శరీరమును గట్టిగా యాలింగనము జేయ కృష్ణుడు మోహము రెట్టింప
భూమియందు మోకాళ్ళ నుంచి నాసతిపై వ్రాలి యధరపానము చేయుచు కళలను
ముట్టి రతిసల్పుభావమును వేష్టితబంధ మనబడును. ఇది బాడబవృషభులకు
బ్రియము.


మ.

మితిగాఁ గాళ్ళు గుదించి పాదములు భూమి న్నిల్పి మేనెల్ల నా
యతశయ్యన్ గదియించి మన్మథగృహప్రాంతంబున న్గట్టిగాఁ

బతిలింగంబు బిగించి పల్మరు నితంబం బెత్తుచు న్గాంత యు
ద్ధతిగాఁ గూడిన బాడబాఖ్యమను బంధం బయ్యెఁ జిత్రంబుగన్.


తా.

కాంత తనపాదములు భూమిమీద నానునటుల మితముగా కాళ్ళను
ముడుచుకొని పరుపుమీద నిడుపుగా శరీరమంతయు నానునటుల పండుకొని
పురుషునిదండమును తనయోనిప్రదేశమునందు గట్టిగా బిగించి పిరుదులను మాటి
మాటికి నెత్తుచు నేరుపుగా రమించుభావమును బాడబాఖ్యబంధ మనిరి. ఇది
బాడబావృషభులకు బ్రియము.

12 ఉద్భగ్న, 13 ఉరస్ఫుట బంధముల లక్షణములు

శ్లో.

యది సంహతమూర్ధ్వగమూరుయుగం యువతీం పరిరభ్య రమేత నరః।
తద్భుగ్నమురఃస్ఫుటనం తు భవేదురసి ప్రమదాచరణద్వయతః॥


మ.

తరుణీలోకశిఖావతంసము కరద్వంద్వంబుచే నూరువు
ల్సరిగా రెండును గూర్చి పట్టుకొని లీలాహాసము ల్మీఱఁగా
విరిసెజ్జం బవళించియుండ హరి పృథ్వి న్గొంతుకూర్చుండి మే
నొరువంకన్ రమియింపఁగా నదియె తా నుద్భగ్నబంధం బగున్.


తా.

సతి తనరెండుచేతులతో తనయొక్కతొడలను సరిగా జేర్చి పట్టుకొని
పుష్పశయ్యపై బవళించియుండ కృష్ణమూర్తి యాసెజ్జపయి గొంతుకూర్చుండి
యొకప్రక్కకు రమించుభావమును ఉద్భగ్నబంధ మనబడును. (ప్రక్కకు రమిం
చుట యనగా — సతి పడమరవైపునకు తలబెట్టి పండుకొనియుండ పురుషుడు
నైరుతిమొగంబుగా గూర్చుండి రమించుట.) ఇది కరిణీవృషభులకు ప్రియము.


చ.

వనిత నిజోరుకాండములు వంచి సమంబుగ రెండుఁ గూర్చి నా
థునియురమందు నించిన మృదుక్రియ దోఁపఁ బ్రియంవదుండు చ
య్యనఁ జెలి రెండుమూఁపులు కరాబ్జయుగంబునఁ బట్టి లాఘవ
మ్మున మురవైరి గూడునది భూమి నురస్ఫుటబంధమై తగున్.


తా.

కాంత తనయొక్క రెండుతొడలను సమముగా జేర్చి వంచి పురుషుని
యొక్క రొమ్ముపయిభాగమునం దానించగా నత డాసతియొక్క రెండుభుజ
ములను తనరెండుచేతులతో బట్టుకొని నెమ్మదిగా రమించుభావమును ఉరస్ఫుట
బంధమని తెలియందగినది.

14 అర్ధాంగనిపీడిత, 15 జృంభక, 16 ప్రసారిత బంధముల లక్షణములు

శ్లో.

అర్ధాంగనిపీడితమేకపదప్రసృతావథ జానుయుగం యువతేః।
స్కన్దే యది జృంభకమేకమధః ప్రసృతం యది పారితముక్తమిదమ్॥


మ.

ఒకపాదాబ్జము నాథుపే రురమునం దొప్పార మై వంచి వే
ఱొకపాదంబు తదీయహస్తతలమం దుద్యత్క్రియన్ సాఁచి బా
లిక పూసెజ్జను బండియుండగను బాళిన్ శౌరి పైకొన్న సా
ర్థక మర్ధాంగనిపీడితాఖ్యమగు బంధం బయ్యె నిద్ధారుణిన్.


తా.

కాంత తనకాలొకటి పురుషునిరొమ్ముమీదను బెట్టి వేరొకపాదము
నతనిచేతియం దుంచు పాన్పుపయి పవళింపగా మోహముతో కృష్ణమూర్తి తనరొ
మ్మునందున్న యాసతియొక్కపాదమును నదేవిధముగా వంచి ప్రక్కగా తాను
యొరగి చేతియందున్న పాదమును యట్లే వంచి పిఱుదులక్రిందుగా నింకొకచెయ్యి
వీపు ననుసరించి భుజమును బట్టి స్త్రీపాదమును బట్టినచేతితో తొడయు బాదమును
నణచి తాను గొంతుకూర్చుండి యొకమోకాలు వరుగుగా యుంచి రమించుభావ
మును యర్ధాంగపీడితబంధ మనిరి. ఇది బాడబతురగులకు బ్రియము.


మ.

చెలిజానుద్వయమున్ భుజాగ్రములచే జిక్కన్బిగన్ బట్టి యం
ఘ్రులమీఁద న్గటియుగ్మ ముంచుకొని వక్షోజద్వయిన్ రెండుచే
తులచే గట్టిగఁ బట్టి మో నధరమందు న్దంతము ల్నిల్పుచున్
గలయన్ జృంభకనామబంధ మని విఖ్యాతంబు లోకంబులన్.


తా.

కాంతయొక్కకాళ్ళను తనభుజములయందు బెట్టుకొని మెడచే చిక్క
బట్టి గొంతుకూర్చుండి తనయొక్కకాలివ్రేళ్ళ నాసతియొక్కపిఱ్ఱలను దాటి మొల
కట్టువరకును బోవునట్లు జొనిపి సళ్లు లేకుండునట్లు గట్టికా రెండుచేతులతో కుచ
ములను బట్టుకొని దంతక్షతములను జేయుచు రమించుట జృంభకబంధ మందురు.


చ.

చెలువుని ఫాలభాగమునఁ జేరిచి యొక్కపదాంబుజాతమున్
దలిమముమీఁద వేఱొకపదం బొగిఁజాఁచి పరుండిన న్ముదం
బలరఁగ, దత్కుచద్వయమునైన భుజంబులనైనఁ బార్శ్వసీ
మలనయినన్ గరంబుల నమర్చి రమింపఁ బ్రాసరితం బగున్.

తా.

సతి తనపాదమొకటి పురుషునియొక్క మొగమునం దుంచి రెండవ
కాలును పానుపుపై జాచుకొని పండుకొనియుండ పురుషు డాసతియొక్క
చన్నులనయినను భుజములనయినను ప్రక్కలనయినను బట్టుకొని రమించిన
భావమును ప్రసారితబంధ మనిరి.

17 వేణువిదారిత, 18 శూలచిత బంధముల లక్షణములు

శ్లో.

పరివర్తనతో బహుశః ప్రథితం కథితం భువి వేణువిదారితకమ్।
జంఘాగ్రమధో యదథోర్ధ్వగతం శిరసో యువతేర్యది శూలచితమ్॥


గీ.

అతివపదమొక్కటి భుజంబునందు నిల్పి
శౌరి రెండవపదముపైఁ గూరుచుండి
మాటిమాటికి నీగతి మార్చి మార్చి
కలియ వేణువిదారితకం బటండ్రు.


తా.

సతి తనయొక్కకాలు పురుషుని భుజంబునం దుంచి రెండవకాలు
జాచుకొనియుండ నాకాలుమీద పురుషుడు కూర్చుండి కుచంబులను బట్టి మాటిమాటి
కిని నాసతియొక్క కాళ్ళను మార్చుచు రమించుభావమును వేణువిదారితబంధ
మందురు.


గీ.

 ఒక్కపాదంబు శిరముపై నుంచి యొకటి
భుజముపై నుంచి క్రీడింపఁ బుడమి నదియు
శూలచితబంధ మనఁగను సొంపు మీఱె
ననుచు వచియించె మొదల వాత్స్యాయనుండు.


తా.

సతి కాలొకటి పురుషుడు నెత్తిపయి బెట్టుకొని రెండవకాలును భుజ
ముపయి నుంచుకొని రమించుభావమును శూలచితబంధమని వాత్స్యాయను డనెను.

19 మార్కటక, 20 ప్రేంఖాయత బంధముల లక్షణములు

శ్లో.

యది కుంచితపాదయుగం యువతే
                        ర్నరనాభిముదంచతి మార్కటకమ్।
ప్రేంఖా భవతి ప్రసభం యువతిః
                        ప్రమదా స్వపదా యది తంచ తదా॥

మ.

తెలియన్బానుపుమీఁదఁ జంద్రముఖి ప్రోదిన్వ్రాలి పాదాంబుజం
బుల నడ్డంబుగ నాథునాభిపయి సొంపు ల్మీఱఁగా నుంచినన్
జలజాతాక్షుఁడు వానిపై నదిమి మించ న్దత్కటి న్బట్టి తా
నలువై కూడి రమింప మార్కటకబంధం బయ్యెఁ జిత్రంబుగన్.


తా.

కాంత సెజ్జపయి పవళించి పాదముల నడ్డముగా వంచి పురుషునియొక్క
బొడ్డునం దుంచగా కృష్ణమూర్తి నాభితో దానిపాదముల నదిమి దానిపిఱుదులను
తనచేతులతో బట్టుకొని రమించినభావమును మార్కటకబంధ మందురు.


మ.

చిగురుంబోణి పదద్వయాతరమునన్ శ్రీకృష్ణుమధ్యం బొగి
న్దగఁగా నిల్పి కరద్వయి న్గరము లంట న్బట్టి యుయ్యాల లూ
గు గతి న్బల్మరు చండవేగ మమరన్ గూడ న్మురారాతి చె
ల్వుఁగ ప్రేంఖాయతబంధ మండ్రు జనము ల్పూవిల్తుశాస్త్రంబునన్.


తా.

సతి తనయొక్కపాదములను కృష్ణునియొక్క మధ్యమమునం దుంచి
తనచేతులతో పురుషునియొక్క చేతులను బట్టుకొని యుయ్యల యూగునటుల
చండవేగమున రమించుటయే ప్రేంఖాయతబంధ మనిరి. ఇది హరిణీవృషభులకు
బ్రియము.

21 పద్మాసన, 22 అర్ధపద్మాసన బంధముల లక్షణములు

శ్లో.

జంఘాయుగళస్య విసర్యయతః పద్మాసనముక్తమిదం యువతేః।
జంఘోకవిపర్యయతస్తు భవేదిదమేవ తదర్థపదోపపదమ్॥


చ.

సరసిజనేత్ర దక్షిణభుజంబున దక్షిణపాద ముంచి యా
చరణముమీఁద నడ్డముగ జాఁచిన వామపదాంబుజాత మ
చ్చెరువుగ వామబాహువునఁ జేర్చి పరుండిన లేమఁ గూడినన్
హరువుగఁ బంకజాసనము నా నుతిగాంచినబంధమై చనున్.


తా.

కాంత పురుషునియొక్క కుడిభుజమందు తనయొక్క కుడికా లుంచి
యాకాలుపై యడ్డముగా జాచిన యెడమకాలు పురుషునియెడమభుజమునం దుంచి
పండుకొనియుండగా పురుషు డామెయొక్క కాళ్ళు నడ్డముగా మడుప నియోగించి
సం దున్నంతవరకు తాను ముందునకు జేరి యోనియందు దండ ముంచి ఆపెయొక్క

రెండుతొడలసందునుండి తనచేతులను దూర్చి చండ్లను బట్టి రతిసేయుచుండ
నాసతి తనకాళ్ళు జరిగిపోకుండ పురుషునిభుజములయం దుంచినపాదములవ్రేళ్ళతో
పురుషునిమెడను బట్టియుండుభావమే పద్మాసనం బగును. ఇది బాడబాశశులకు
బ్రియము.


గీ.

పతిభుజముమీఁద నొక్కపదంబు సాచి
దానిపై నడ్డముగను బదంబుఁ దాల్చి
పడఁతి పవళింప శ్రీహరి పైకొనంగ
నర్ధపద్మాసనం బన నమరియుండు.


తా.

లేమ పురుషునియొక్క కుడిభుజమందు కుడికా లుంచి రెండవకాలు
నాకాలుపై నడ్డముగా యుంచి పండుకొనియుండగా కృష్ణమూర్తి పైవిధముగా
ఆపెతొడలసందునుండి తనచేతులను పోనిచ్చి చండ్లను బట్టుకొని రమించుభావ
మును యర్ధపద్మాసన మనిరి.

23 బంధురిత, 24 నాగపాశ బంధముల లక్షణములు

శ్లో.

నిజజానుయుగాన్తరనిర్గమితౌ స్వభుజౌ పతికంఠమసౌనయతే
రమణీ రమణోఁ౽పి తమేవ భుజద్వితయేన చ బన్ధురితం కురుతే।
తత్కూర్పరమధ్యగతేవ తదాపి ఫణిపాశమిదం మునయో జగదుః॥


మ.

సతి దా సాధనఁ జేసినట్టి వగ హెచ్చన్ మోహ ముప్పొంగ సం
గతి మోచేతుల రెండుసందులను మోకాళ్ళ న్దగన్ గ్రుచ్చి హ
స్తతలంబు ల్వడిఁ గూర్చిపట్టి మెడక్రింద న్జేర్చి పన్నుండఁ గా
జతురుం డప్పుడు కూడ బంధురితసంజ్ఞం బైన బంధం బగున్.


తా.

సతి తనయొక్క మోచేతులరెంటిసందులలో తనమోకాళ్ళను గూర్చు
కొని చేతులు రెండును గూర్చి పట్టుకొని తనకంఠముక్రిందగా నుంచుకొని పండు
కొనియుండగా పురుషుడు రమించుభావమును బంధురితబంధ మనిరి. ఇది కరిణీ
శశులకు బ్రియము.


మ.

చెలి మోకాళ్ళను బైకిఁ జాచుకొని మోచేతు ల్తగన్మధ్యఁ జే
తులు రెండొక్కటిగాఁగఁ గూర్చి మెడక్రింద న్జేర్చి పన్నుండ నె

చ్చెలి ముంజేతులు రెండు శౌరి తనమోచేతు ల్జత న్గూర్చి చె
న్నలర న్గూడీన నాగపాశ మనుబంధం బయ్యెఁ జిత్రంబుగన్.


తా.

కాంత తనయొక్కమోకాళ్ళను మోచేతిసందులలో గ్రుచ్చి పైకిజాచు
కొని చేతులురెండునూ యొకటిగా గూర్చిపట్టి మెడక్రిందుగా జేర్చి పండుకొని
యుండ పురుషు డామెయొక్క ముంజేతులు రెండును తనమోచేతులసందులయందు
గూర్చి రమించుభావమును నాగపాశబంధ మనిరి.

25 సంయమనబంధ లక్షణము

శ్లో.

అంగుష్ఠసమర్పితపాణిభృతో
                        జంఘాయుగళం యువతేః పురుషః।
నిజకూర్పరయోర్నిదధాతి భుజౌ
                        తత్కంఠ ఇదంకిల సంయమనమ్॥


ఉ.

ముద్దులగుమ్మ పానుపున ముందుగఁ దాఁ బవళించి పాదముల్
ముద్దుగఁ జేతులం దిడిన మోదమునన్ హరి రెండుచేతు లా
ముద్దియజానుసందుల సముజ్వలవైఖరి గ్రుచ్చి కంఠమున్
బద్దుగఁ గౌఁగిలింప నది బంధము సంయమనాఖ్యమై తగున్.


తా.

మగువ తనయొక్కకాళ్ళను మితముగా ముడిచి కాళ్ళవెలుపలనుంచి
చేతులను రానిచ్చి పాదములను బట్టుకొని పండుకొనియుండ పురుషుడు గొంతు
కూర్చుండి తనమోకాళ్ళతో దానితొడల నదిమి తనచేతులను తొడలక్రిందుగా
చంకలసందులలోనుండి పోనిచ్చి మెడక్రింద జేర్చి రతిసల్పుభావమును సంయమన
బంధ మనిరి. ఇది కరిణీశశులకు బ్రియము.

26 కూర్మ, 27 పరివర్తిత, 28 నిపీడనబంధముల లక్షణములు

శ్లో.

భుజయోర్భుజమాననమాననతో జంఘామభి జంఘమసౌ రమతే।
విన్యస్య నరో యది కౌర్మమిదం పరిపతిన్ తమూధన్వాగతోరు యుగమ్।
యదిపీడితమూరుయుగం తు భవేద్వనితోరువరాంఘ్రినిపీడినతః॥


చ.

మొగము మొగమ్ముమీఁద భుజము ల్భుజయుగ్మముమీఁద జంఘికా
యుగళము జంఘలందు నిడి యొక్కటిగాఁ దగగూర్చి యుంచి య

మ్మగువపయి న్మురారి గరిమంబునఁ బైకొనఁ గూర్మబంధమై
నెగడు ధరిత్రిసాధనకు నేరనివా రొనరింతు రింతయున్.


తా.

పురుషుడు సతిని పైకొని ముఖము ముఖముమీదను భుజములను భుజము
లమీదను పిక్కలను పిక్కలమీదను యొక్కటిగా చేర్చి పండుకొని రమించుభావ
మును కూర్మబంధ మనిరి. ఇది బంధములం జేయుటను అశక్తులగువా రుపయో
గింతురు.


ఆ.

మొగము మొగముఁ జేర్చి భుజములు బిగియించి
చాన రెండుతొడలు సాఁచి శౌరి
నడుము బిగియ నదిమి ముడివేయఁ బరివర్తి
తాఖ్యబంధమై నయంబు గాంచు.


తా.

పురుషుడు సతిముఖముతో ముఖము జేర్చి భుజములను పట్టుకొనియుండ
ఆపె తనరెండుతొడలను జాచి పురుషునియొక్కనడుమును బిగించి మెలివేయగా
రమించుభావమును పరివర్తితబంధ మనబడును.


గీ.

ముదిత యూరువు ల్నిజపాదములును బార్శ్వ
ముల నొదుగఁ ద్రోసి యందుపై మోవ నిల్పి
కూడెనేనియు నిదియ నిపీడనాఖ్య
బంధమగు గామశాస్త్రప్రపంచసరణి.


తా.

కాంతయొక్కతొడలు తనమోకాళ్ళసందుపార్శ్వములయందు యొదు
గునటుల ద్రోసి పురుషుడు తనపాదములయం దూనికనిల్పి రమించుభావము నిపీడ
నబంధ మగును.

29 ఉపవీతబంధలక్షణము

శ్లో.

ఏకం యువత్యాహృదయం స్వపాదౌ తదార్పితం తల్పగతం తదన్యమ్।
ప్రౌఢాంగనా వల్లభ ఏష బన్ధః ఖ్యాతః పృథివ్యాముపవీతకాఖ్యాః॥

(ఇతి పంచసాయకః)

గీ.

అతివతొడలమధ్యగఁ జేరు యతనుతండ్రి
యాపెహృదయ మందొకపాద మమర నిల్పి

వేఱొకపదంబు ధర నూని వేడు కలర
నమితరతిఁ జేయ నుపవీత మనిరి మునులు.


తా.

పాన్పుపై పవళించియున్న కాంత తొడలసందునఁ బురుషుండు చేరి
యాపెవక్షస్థలమున తనకాలొకటి యుంచి రెండవకాలును పాన్పుపై నుంచి రతి
సల్పుభావము ఉపవీతబంధ మనిరి.

30 సమపాదబంధ లక్షణము

శ్లో.

నిధాయ పాదౌ రమణాంసయోశ్చేదుత్తనసుప్తా రమతే పురన్ధ్రీ।
ప్రతిప్రబన్ధం సమపాదసంజ్ఞా ప్రోచుస్తదా భోగవిధానదక్షః॥

(ఇతి అనంగరంగకః)

క.

తరుణి తనపాదయుగళము
వరునూరువులందు నిల్పి పవళింపంగా
నురమురముఁ జేర్చి పైకొనఁ
బరువడి సమపాదనామబంధం బయ్యెన్.


తా.

కాంత తనయొక్క రెండుకాళ్ళను కృష్ణునియొక్క తొడలయం దుంచి
పాన్పుపయి పండుకొనియుండ కృష్ణమూర్తి యాసతియొక్క ఱొమ్ముతో తన
తనఱొమ్మును జేర్చి పైకొని రమించుభావము సమపాదబంధ మందురు.

31 త్రివిక్రమబంధ లక్షణము

శ్లో.

స్త్రియోం౽ఘ్రిమేకం వినిధాయ భూమా
                        వన్యం స్వమాలౌ నిజపాదయుగ్మం।
పృధ్వ్యాం సమాధాయ రమేత భర్తా
                        త్రైవిక్రమాఖ్యం కరణం తధా స్యాత్॥

(ఇతి అనంగరంగకః)

గీ.

సతిపదం బొకటి ధరిత్రి సాచి యొక్క
పదము బురుషుఁడు తనతలపైన నిల్పి
రెండుచేతులు భువి నానియుండఁ గూడ
నిది త్రివిక్రమకరణమై యింపుఁ జెందు.

తా.

స్త్రీ తనకాలొకటి శయ్యయందు సాచి రెండవకాలు పురుషునితలకు
సమముగా సాచి రెండుచేతులతో భూమి నానుకొని యుబికియుండగా పురుషు
డాకాంతను రమించినభావము త్రివిక్రమబంధ మనంబడును.

32 వ్యోమపదబంధ లక్షణము

శ్లో.

తల్పప్రసుప్తా నిజపాదయుగ్మమూర్ధ్వం విధత్తే రమణీ కరాభ్యామ్।
స్తనౌ గృహీత్వా౽ధ ఛజేత కాన్తో బన్ధస్తదా వ్యోమపదాఖ్య ఉక్తః॥

(ఇతి అనంగరంగకః)

గీ.

కాంత తనరెండుపదములఁ గాంతుశిరము
నందునను నిల్పి పవళింప నతఁడు ప్రేమఁ
గుచయుగము రెండుచేతులఁ గూర్చిపట్టి
కలియ నిది వ్యోమపదనామకరణ మయ్యె.


తా.

సతి తనయొక్క రెండుకాళ్ళను పురుషునితలమీద యుంచి పండుకొని
యుండగా పురుషు డాసతియొక్క కుచములను బట్టి రమించుభావమును వ్యోమ
పదబంధ మనిరి.

33 స్మరచక్రబంధ లక్షణము

శ్లో.

కాన్తోరుయుగ్మాస్తరగః స్వహస్తౌ నిధాయ భూమౌ రమతే పతిశ్చేత్।
బన్ధస్తదోక్తః స్మరచక్రనామా ప్రేష్ఠః సదా కామిజనస్య లోకే॥

(ఇతి అనంగరంగకః)

గీ.

నలినముఖి రెండుపదముల నడుమ నిలిచి
విభుఁడు చేతుల రెండు పృథ్వీతలంబు
నానుకొని క్రీడ యొనరించెనేని నదియుఁ
దనరు స్మరచక్రనామ బంధంబు జగతి.


తా.

సతియొక్క రెండుతొడలనడుమను బురుషు డుండి చేతులు రెండును
భూమియం దానించి రమించుభావము స్మరచక్రబంధమని దెలియందగినది.

34 అవధారితబంధలక్షణము

శ్లో.

నారీ స్వపాదౌ దయితస్య పక్షఃస్థితౌ సమాలింగ్య కరద్వయేన।

కించిన్నతోరు రమతే తదాసౌ ప్రోక్తో మునీంద్రైరవదారితాఖ్యా॥

(ఇతి అనంగరంగకః)

గీ.

తామరసనేత్ర తనదుపాదములు రెండు
నధిపునుదరంబుపైఁ జేర్చి యాపెయూరు
వులను వంచి భుజద్వయి నొకట కౌఁగ
లింప నవదారితాఖ్యమై పెంపుఁ జెందు.


తా.

సతి తనయొక్కపాదములరెంటిని పురుషునియొక్క కడుపుపయి
నుంచి యాపె తనతొడలను వంచి పురుషుని భుజములను రెంటిని తనభుజములతో
కలిపిపట్టుకొనియుండ పురుషు డాసతిని రమించుభావమును అవదారితబంధ మనిరి.

35 సౌమ్యబంధ లక్షణము

శ్లో.

ఉత్తానితోరుద్వయమధ్యగామీ దృఢం సమాలింగ్య భజేత యత్ర।
కాన్తాం విలాసిప్రియ ఏష బంధః సౌమ్యాఖ్య ఉక్తః కవిభిః పురాణైః

(ఇతి అనంగరంగకః)

గీ.

కాంత తనయూరువులు రెండు గగనమునకు
నిలిపి వళింప విభుఁడు చేతులను రెండు
నూరువులమధ్యమం దుంచి తారుకొన్న
సౌమ్యకరణంబునా నగు సంజ్ఞ లలరు.


తా.

స్త్రీ తనతొడలు రెండును మీదికెత్తుకొని పండుకొనియుండగా పురు
షుడు సతియొక్కతొడలమధ్యగా తనజేతులను బోనిచ్చి కుచంబులను బట్టి
రమించుభావము సౌమ్యబంధ మగును.

36 జృంభితబంధ లక్షణము

శ్లో.

ఊరుద్వయం వక్తముదంచితంచ కృత్వాంబుజాక్షీ భజతే పతించేత్।
ఆనందకర్తా తరుణీజనానాం బన్ధో౽యముక్తః కిల జృంభితాఖ్యః॥

(ఇతి అనంగరంగకః)

ఆ.

చిగురుబోఁడి యూరుయుగళంబు తనఫాల
భాగమందుఁ జేర్చి పట్టియుండ

బ్రియుఁడు దానిగూడి పిఱుఁదులం బట్టఁగ
జృంభితం బనంగఁ జెలువు మీఱె.


తా.

స్త్రీ తనరెండుతొడలను ముఖముదగ్గఱకు వచ్చునటుల చేతులతో
చేర్చి పట్టుకొనియుండ పురుషుడు దానిపిఱుందులను బట్టుకొని రమించుభావము
జృంభితబంధ మనంబడును.

37 నౌకాబంధ లక్షణము

గీ.

ఒకరొకరిప్రక్కసందుల నొక్కరొకరి
పాదయుగళంబు గీలించి పవ్వళించి
యొకరొకరిహస్తములఁ బట్టి యొప్పుమీఱఁ
గూడ నౌకాఖ్యబంధమై రూఢిఁ గాంచు.


తా.

పురుషునియొక్క నడుము ప్రక్కసందులో స్త్రీయొక్కపాదము
లును సతియొక్కప్రక్కసందులలో పురుషునియొక్కపాదముల నుంచి పురుషుని
హస్తముల సతియు సతిహస్తములను బురుషుడును బట్టుకొని రమించుభావము నౌకా
బంధ మనిరి.

38 ధనుర్భంధ లక్షణము

చ.

తరుణియు మొగ్గవ్రాలిన విధంబున నుండి కరద్వయంబునన్
జరణము లానియుండ సరస న్జఘనంబునఁ దత్కటిద్వయిన్
హరువుగఁ గూర్చి మధ్యము కరాబ్జముల న్బిగఁబట్టి కూడినన్
ధరపయిఁ జాపబంధమును నామము గాంచు మహాద్భుతంబుగన్.


తా.

సతి పాన్పుపయి బోరగిల పండుకొని మ్రొగ్గ వ్రాలినటుల తనరెండు
చేతులతో పాదములు పట్టుకొనియుండ బురుషుడు తనమొలకు సమముగా నాసతి
యొక్కమొల నుంచుకొని సతినడుమును తనరెండుచేతులతో గట్టిగా పట్టుకొని
రమించుభావము ధనుర్బంధ మనిరి.

39 కరపాదబంధ లక్షణము

ఆ.

ఉవిద బారసాచి యూరువు లాగతిఁ
బొడవు సాచి కావ బొటనవ్రేళ్ళం

బట్టి పాన్పుపైని బవళింపఁ గరపాద
నామబంధ మయ్యె సామువలన.


తా.

సతి తనయొక్కచేతులను బారసాచుకొని తనయొక్కతొడలను
గూడ బారసాచి కాలిబొటనవ్రేళ్ళను చేతివ్రేళ్ళతో బట్టుకొనియుండగా
పురుషుడు రమించుభావము కరపాదబంధ మనిరి.

40 సాచీముఖబంధ లక్షణము

క.

పదములు తిరుగఁ బిరుందులఁ
గదియించి శిరంబు రెండుకరములు శయ్యన్
గదియించి యున్న తరుణిం
గదిసిన సాచీముఖంబుగా నుతి కెక్కున్.


తా.

సతి తనయొక్కపాదములను ద్రిప్పి పిఱుదులక్రింద నుంచుకొని తలయు
చేతులును పరుపుపయి యుంచి పండుకొనియుండగా పురుషుడు రమించుభావము
సాచీముఖబంధ మనిరి.

41 అర్ధచంద్రబంధ లక్షణము

ఆ.

ఊరుయుగము మింట నున్నతంబుగ సాచి
కరయుగంబుచేతఁ గటియుగంబుఁ
బట్టి మీఁది కెత్తి పవళించుచెలిఁ గూడ
నర్ధచంద్రబంధ మనఁగ నొప్పు.


తా.

సతి తనయొక్కతొడలను పొడవుగా మీదికెత్తి చేతులతో పిఱు
దులను బట్టుకొని మీదికెత్తి పండుకొనియుండ పురుషుడు రమించుభావము అర్ధ
చంద్రబంధ మనిరి.

42 ఉపాంగబంధ లక్షణము

ఉ.

నారివరాంగమందు మదనధ్వజ ముంచి బిగించి యూరువుల్
చేరిచి చక్కఁగా శయనసీమఁ బరుండిన దానిమీఁదుగా
శౌరియుఁ బవ్వళించి నిజజానువుజానువు ఱొమ్ముఱొమ్మునన్
జేరిచి మోముమోముపయిఁ జేర్చి రమింప నుపాంగకం బగున్.

తా.

తనయొక్కయోనిలో పురుషునిదండ ముంచుకొని రెండుతొడలను
దగ్గరగా జేర్చి బిగించి పండుకొనియుండిన స్త్రీని పురుషుడు పైకొని సమముగా
బండుకొని ఆస్త్రీయొక్క పిక్కలమీద పిక్కలను ఱొమ్ముమీద ఱొమ్మును
ముఖముమీద ముఖము నుంచి రమించుభావము ఉపాంగబంధమని తెలియందగినది.


శ్లో.

ఉత్తానరతాని గతాని వదామ్యథ తిర్యగహంసురతద్వితయమ్।
మధ్యేవనితోరు నరోరుగతౌ కథితో మునిభిస్తు సముద్గ ఇతి॥


వ.

ఈబంధములు నలువదిరెండును ఉత్తానబంధ భేదములని తెలియందగినది.
ఇఁక పువ్వుఁబోఁడి ప్రక్కవాటుగా నెడమపార్శ్వంబుగానైన గుడిపార్శ్వంబుగా
నైనఁ బవళించియుండఁ బురుషుం డభిముఖముగాఁ బవ్వళించి పట్టు బంధములగు
తిర్యక్కరణంబులను రెండవవిధమైన బంధములం దెల్పెద.

43 సముద్గకబంధ లక్షణము

చ.

కమలదళాక్షి తా నభిముఖంబుగఁ బార్శ్వముగాఁగ శయ్యపై
సమముగఁ బవ్వళింప హరి సంతసమందుచుఁ గౌఁగలించి చి
త్రముగఁ దదూరుమధ్యమున దాను నిజోరువు లుంచి కాంతయా
నములను బట్టి కూడ గరణంబు సముద్గకనామమై తగున్.


తా.

సతి తనకెదురుగా బ్రక్కవాటుగా బాన్పుపై సమముగా పండుకొని
యుండ కృష్ణమూర్తి సంతోషముతో గౌఁగలించి యాసతియొక్క తొడలసందున
తనతొడలను జొనిపి యాసతియొక్కకాళ్ళను బట్టుకొని రమించుభావము సముద్గక
బంధ మగును.

44 పరివర్తనబంధ లక్షణము

శ్లో.

అవిభజ్య సముద్గకయస్త్రమిదం
                        యువతిర్యది వా పురుషో భజతే।
పరివృత్తమితి స్ఫుటమాభ్యసనాల్లఘు
                        పూర్వతనోః పరివర్తనకమ్॥


క.

జగతి సముద్గకనామం
బగు కరణమవలెఁ బురుషుని యంకద్వయ మ

ధ్యగయై తదూరువులపై
వగగా నూరువుల నునుపఁ బరివర్త మగున్.


తా.

సతి మునుపు జెప్పియున్న సముద్గకబంధమువలెనె పురుషుని తొడల
నడుమ నున్నదై యతనితొడలలో తనతొడల నునిచి రమించుభావము సం
వర్తనబంధమని తెలియదగినది.

45 సమాంగకబంధ లక్షణము

చ.

ఒక రొక రూరుభాగముల నొద్దికతోఁ దొడ లుంచి గట్టిగా
నొక రొక రాభిముఖ్యముగ నుండియుఁ గౌఁగిట గ్రుచ్చిపట్టి తా
మొక రొక రూరుమధ్యముల నూరువుఁ జొన్పి రమింపఁగా సమాం
గకమను బంధ మయ్యె హిమకాలములం దిది యోగ్యమై తగున్.


తా.

సతీపతులు యొకరొకరి కెదురై తల లొద్దికగా నుంచి కౌఁగలించుకొని
యొకరితొడలనడుమ యొకరితొడల నుంచి రమించుభావము సమాంగకబంధ మ
గును. ఈబంధము చలికాలమం దుపయోగింప శ్రేయస్కరము.

46 అభిత్రికబంధ లక్షణము

చ.

పొలయలుక న్లతాంగి తనమోము నొసంగక పార్శ్వభాగసం
వలిలతముగాఁ బరుండ బహువారమృదూక్తుల సంతరింపుచున్
జెలువుఁడు వెన్కభాగమునఁ జిన్నెలఁ జూపుచుఁ బల్మిఁ గూడినన్
జెలఁగు నభిత్రికం బనఁగఁ జెల్వగుబంధము శాస్త్రవైఖరిన్.


తా.

సతి పురుషునిపై ప్రణయకోపముచే ముఖమివ్వక వెనుదిరిగి ప్రక్క
వాటుగా బండుకొనియున్నకాంతను మంచిమాటలచేత కుస్తరింపుచు నాపెతొడల
సందుగా తనతొడలను జొనిపి వెనుకదిక్కునుండి రమించుభావము అభిత్రిక
బంధ మనబడును.

47 నాగబంధ లక్షణము

శ్లో.

పార్శ్వస్థితాయాః మృగశకామకాక్ష్యాః పృష్ఠావలంబీ రమణః ప్రసుప్తః।
లింగస్మరాగారనివేశయోగాద్ ఇహోపదిష్టః ఖలు నాగబంధః॥

గీ.

బోరగిల్లగఁ బండిన పొలఁతివీపు
తనదువక్షంబున న్హత్తి వనజభవుఁడు
అతివ యూరులమధ్యగా నతనుగృహము
నాటునటుల రతి యొనర్ప నాగ మగును.


తా.

పొలయల్కచే వెనుదిరిగి ప్రక్కగా పరుండియుండిన కాంతను
పురుషుడు మంచిమాటలచే కుస్తరించుచు యాపెవీపును కౌగలించుకొని యాపె
తొడలసందునుంచి యోనిలోనికి తనశిశ్నమును బ్రవేశింపఁజేసి రతిసల్పినభావమే
నాగబంధ మనిరి.

48 సంపుటబంధ లక్షణము

శ్లో.

పార్శ్వప్రసుప్తా ప్రమదోపరిస్థః కాన్తాం సమాలింగ్య రతిం కరోతి।
యత్ర ప్రదిష్టో మునిభిః పురాణై ర్బన్ధస్తదా సంపుటనామధేయః॥

(ఇతి అనంగరంగః)

మ.

చెలి పార్శ్వంబుగఁ బవ్వళింపఁ గుదురై చెల్వుండు తాఁదత్తరం
బొలయ న్దానికడ న్బరుండి యొకకాలూర్ధ్వంబుగా జాను సం
ధులమీఁద న్ఘటియించి తత్కటితటి న్నూల్కొన్న మోహంబు రం
జిలఁ బాణిద్వయిఁ బట్ట సంపుటితమై చెల్వొందు నిద్ధారుణిన్.


తా.

సతి ప్రక్కవాటుగా పండుకొనియుండ పురుషు డాసతి కెదురై
ప్రక్కవాటుగా బవళించి సతియొక్క పైకాలును పొడుగుగా తనపిక్కలపై నుం
చుకొని సతియొక్కపిరుదులను బట్టుకొని రమించుభావము సంపుటిత బంధ మన
బడును.

49 వేణుదారణబంధ లక్షణము

ఆ.

పురుషు మూఁపుమీఁద బొందించి యొకకాలు
కాళ్ళక్రింద నొక్కకాలుఁ జాచి
నప్పుడపుడ గదియ నదియును వీడ్వడఁ
దరుణిఁ గూడ వేణుదారణంబు.

తా.

సతి పురుషుని వీపుమీదుగా నొకకాలును జాచి యతనికాళ్ళ
క్రిందుగా నొకకాలును జాచి రెండుకాళ్ళను పెనవేసియుండగా పురుషుడు
మాటిమాటికి యాపెకాళ్ళు వీడుచుండ రతిసేయుభావమును వేణుదారణబంధ మనిరి.

50 కర్కటబంధ లక్షణము

శ్లో.

యద్యంగనాకుంచితపాదయుగ్మం స్వనాభిదేశే పరికల్ప్యభర్తా।
రతిం ప్రకుర్యా దితి కర్కటాఖ్యం తదా మునీంద్రైః కరణం ప్రదిష్ఠమ్॥

(ఇతి అనంగరంగః)

చ.

ఎదురెదురై సతీపతు లహీనముదంబునఁ బవ్వళింప నా
సుదతి పదద్వయం బురము సోఁకఁగ నిల్పి కటీతటి న్ముదం
బొదవఁగఁ గౌఁగలింప నలయుగ్మలినై జగళంబు కౌఁగిటన్
గదియ బిగించి కూడునది ఖ్యాత మగు న్ధరఁ గర్కటాఖ్యమై.


తా.

స్త్రీపురుషులు సంతసముతో నొకరికొక రెదురుగా పండుకొని స్త్రీ
యొక్క రెండుకాళ్ళను తనఱొమ్మునకు తగులునట్లుగా యుంచి తనపిఱుదులను
స్త్రీ పట్టుకొనియుండ పురుషుడు విల్లురీతిగా వంగి సతియొక్కకంఠమును కౌఁగ
లించి రమించుభావము కర్కటబంధ మగును.

51 మానితబంధ లక్షణము

చ.

సతియొకవంక వాటముగ శయ్యపయిం బవళించి యుండగా
నతివ నిజోరుమధ్యమున నడ్డముగాఁ బవళించి తత్పదం
బొతికిలఁ బెట్టి యొక్కటి మఱొక్కటి మేనిపయి న్ఘటించి సం
మ్మతి రతిఁ జేయఁ జెల్వుగను మానితబంధమగు న్వసుంధరన్.


తా.

స్త్రీ ప్రక్కవాటుగా పానుపుపై పండుకొనియుండ పురుషుం డెదు
రుగా పండుకొని తనతొడలు నాస్త్రీయొక్క తొడలనడుమ దూర్చి నాస్త్రీకా
లొకటి దనదేహముపై వైచుకొని రెండవకాలును తనకాళ్ళతో వెనుకకు త్రోచి
పట్టి విల్లంబురీతిగా స్త్రీని వెనుకకు వంచి రమించుభావము మానితబంధ మనబడును.


వ.

పైన చెప్పంబడిన తొమ్మిదిబంధములును దిర్యక్కరణములని తెలియందగినది
ఇంక నంగనామణి కూర్చుండియుండఁ బురుషుండు పైకొని పట్టు బంధంబులగు
స్థితకరణంబులను మూడవవిధమైన బంధములను దెల్పెద—

52 యుగ్మపదబంధ లక్షణము

శ్లో.

స్థితమాసితసున్దరి పాదయుగం యది కుంచితమేకత ఏవ భవేత్।
లఘుతిర్యగథో పురుషో౽పి తథా మిలతీతి మతం కిల యుగ్మపదమ్॥


చ.

ఒకపద మోరగా ముడిచి యొక్కటి చాఁచి లతాంగి శయ్యపై
నొకట వసింపఁ దత్పదము నొయ్యనఁ జాచిన దానిపై నిజాం
ఘ్రిక మటుచాచి కుంచినది క్రిందుగఁ దా ముడుచు న్గవుంగిటన్
సకలవిలాసము ల్దెలియ సంగతిగై యుగపాద మై తగున్.


తా.

సతి యొకపాదమును ముడుచుకొని రెండవపాదమును జాచుకొని
పాన్పుపై కూర్చుండియుండ పురుషు డాసతి జాపియుంచినకాలుక్రిందుగా తన
కాలును జాపి రెండవకాలును సతి ముడిచియుంచిన కాలుక్రిందిగా తాను ముడుచు
కొని సతి కెదురుగా కూర్చుని కౌగలించి రమించుభావము యుగ్మపదబంధ మనబడును.

53 విమర్దిత, 54 మర్కట బంధముల లక్షణములు

శ్లో.

యదిసున్దరికూర్పరమధ్యగతః స్వకటిం భ్రమయన్పురుషోరమతే।
భవతీహ విమర్దతకం తదిదం కిల సమ్ముఖసంగతిమర్కటకమ్॥


మ.

చెలి కూర్చుండఁగఁ గౌఁగిట న్నిలిచి పార్శ్వీభూతదేహంబుతో
చెలువుం డున్న మితాంగుఁడై కటితటిన్ శీఘ్రంబుగాఁ ద్రిప్పుచున్
బలుమారు న్గళలంటుచున్ గలయుచోఁ బ్రౌఢాంగనాకల్పితం
బలరున్ ధాత్రి విమిర్దితాఖ్య కరణం బత్యంతసౌఖ్యాఢ్యమై.


తా.

స్త్రీ పురుషునితొడయందు యోరగా మొగము పెట్టి కూర్చుండ పురుషు
డాసతిని గౌఁగలించుకొని తాను కొంత వెనుకకు వ్రాలి యోనియందు లింగమును
బెట్టి సతియొక్క నడుమునుగాని కుచములనుగాని పిఱుదులనుగాని బట్టుకొని మిత
శరీరముగలవాడై పిఱుదులను ద్రిప్పుచు కళ లంటుచు రమించుభావము విమర్దితబంధ
మగును. ఈబంధము ప్రౌఢాంగన చేయందగినది.


క.

పురుషుఁడు తన జఘనముపైఁ
దరుణి న్గూర్చుండఁబెట్టి తంత్రజ్ఞుండై
సురత మొనరింప సతి వె
న్దిరిగిన మర్కట మనంగఁ దెల్లం బయ్యెన్.

తా.

పురుషుడు తనవడిలో తనకెదురుగా సతిని కూర్చుండబెట్టుకొని రతి
చేయుచుండ సతి వెనుకకు మళ్ళునట్టు లొనరించి ముందువై పాసతి చూచుచుండ రతి
సల్పుభావము మర్కటబంధ మనజెల్లును.

55 ఘట్టితబంధ లక్షణము

క.

కరములు కరములచేతన్
వరుస న్బట్టుకొని రెండు పదతలములు త
చ్చరణతలమ్ముల నానఁగ
గరిమ న్గూర్చుండి కూడ ఘట్టిత మయ్యెన్.


తా.

పురుషుడు తనచేతులతో స్త్రీయొక్క చేతులను బట్టుకొని తనపాద
ములురెండును స్త్రీపాదములకు సమముగా జేర్చి కూర్చుండి రమించుభావము
ఘట్టితబంధ మనబడును.

56 సమ్ముఖబంధ లక్షణము

శ్లో.

తథా స్థితాయా నాయక్యాః పాదమేకం ప్రసారితమ్।
సకూర్పరేణ విష్టభ్య రమేత్తత్సమ్ముఖం రతమ్॥

(ఇతి రతిరత్నప్రదీపికః)

ఆ.

తరుణి పాదయుగముఁ దనభుజంబుల వైచి
నడుము బిగియఁబట్టి పడఁతికెదురు
గొంతుకూరుచుండి కూడిన సమ్ముఖ
కరణ మనఁగ వినుతిఁ గాంచు జగతి.


తా.

స్త్రీయొక్క పాదములు రెండు తనభుజములమీద నుంచుకొని చేతు
లతో దానినడుము బిగించి పట్టుకొని పురుషుడు స్త్రీకెదురుగా గొంతుకూర్చుండి
రమించుభావము సమ్ముఖబంధ మనబడును.

57 ప్రస్ఫుటబంధ లక్షణము

ఆ.

 ఉవిద పాదయుగళ మురముపై నుంచుచుఁ
గదలకుండ బిగియఁ గౌఁగిలించి

జఘనసీమఁ దనదు చరణము లిడి కూడఁ
బ్రస్ఫుటాఖ్యమైన బంధ మయ్యె.


తా.

కాంతయొక్కపాదములురెండును తనఱొమ్ముమీద నుంచుకొని పురు
షుడు సతిచంకలసందుగా తనచేతులను బోనిచ్చి భుజములను బట్టి కదలకుండ రమిం
చుభావము ప్రస్ఫుటబంధ మనఁబడును.

58 ఉద్గ్రీవబంధ లక్షణము

ఆ.

గొంతు కూరుచుండి కోమలిచేతులు
వెనుకభాగమందు వేగ నిల్పి
యూర్థ్వముఖము గాఁగ నుండఁగఁ గూడ ను
ద్గ్రీవబంధ మనఁగ దెలియఁబడియె.


తా.

కాంత గొంతుకూర్చుండి చేతులు తనవెనుకదిక్కున పాన్పు నాను
కొని ముఖము నాకాశమువైపునకు సాచియుండగా పురుషుడు రమించుభావము
ఉద్గ్రీవబంధ మనిరి.

59 జఘనబంధ లక్షణము

ఆ.

నారితొడలమీఁదఁ గూరుచుండి గళంబుఁ
గౌఁగిలించి మేను గదియఁజేర్చి
శౌరియుండఁ దరుణి జఘన మెత్తి రమింప
జఘన మనెడి సంజ్ఞ జగతి వెలయు.


తా.

సతియొక్కతొడలపై పురుషుడు తనతొడల నుంచి యెదురుగా
కూర్చుండి శరీరము దగ్గరకు చేర్చి కౌఁగలింప కాంత తనపిఱుదుల నెత్తుచు రమిం
చుభావమే జఘనబంధ మనఁబడును.


శ్లో.

ఉక్తమేతదిహ యుక్తసంగమే భేదజాతమథ చిత్రమోహనమ్।
స్తంభకుడ్యమథవా సమాశ్రితాదుర్ధ్వగౌ యది తదా చతుర్విధమ్॥


వ.

పైన చెప్పఁబడిన యెన్మిదిబంధములును స్థితకరణములని తెలియదగినది.
ఇంక మగువ నిల్చియున్నపుడు స్తంభకుడ్యాదులానికగా నుంచి పురుషుండు పట్టు
బంధములగు ఉద్ధితకరణములను నాల్గవవిధమైన బంధముల నెఱింగించెద—

60 జానుకూర్పరబంధ లక్షణము

శ్లో.

కూర్పరేణ పరివేష్ట్య యోషితో జానుకంఠమవలంబ్యయత్పదా।
ఊర్ధ్వమున్మదవరస్య మేహనం యోజయేత్తదిహ జానుకూర్పరమ్॥


మ.

సతిభిత్తిస్థలిఁ జేరియుండ విభుఁ డచ్చంబైన ప్రేమంబున
న్మతియాహ్లాదము గూర్ప జానువులపై నైజాంఘ్రల న్నిల్పి కం
ఠతలం బొయ్యనఁ గౌఁగలించి యటుకూడ న్గామశాస్త్రజ్ఞు లు
న్నతిగాఁ గూర్పరజానుకం బనఁ దగు న్నవ్యప్రమోదంబుగన్.


తా.

కామిని గోడయొద్ద జేరి నిలిచియుండగా పురుషు డాస్త్రీయొక్క
మోకాళ్ళకు దనమోకాళ్ళను దగిలించి యాపె కంఠమును గౌఁగలించి రతిసల్పు
భావము జానుకూర్పరబంధ మనిరి.

61 హరివిక్రమ, 62 ద్వితలబంధముల లక్షణములు

శ్లో.

యోషిదేకచరణే సముచ్ఛితే జాయతేచ హరివిక్రమాహ్వయమ్।
భిత్తికప్రియకరస్య సున్దరీ పాదయోర్ద్వితలసంజ్ఞకం రతమ్॥


ఆ.

కంబ మొద్ద నిలిపి కామిని యొకపాద
మిల ఘటించి యొకటి యెత్తిపట్టి
యదిమి గళము కూడ హత్తి కౌఁగిటఁ జేర్చి
విటుఁడు గవయ సింహవిక్రమంబు.


తా.

సతి స్తంభమునకు వీపు నానుకొని యొకకాలు భూమిమీద నుంచి
మఱియొకకాలు చేతితో నెత్తిపట్టియుండగా పురుషు డాసతికంఠమును గౌఁగ
లించి ప్రక్కవాటుగా యదిమి రమించుభావమును హరివిక్రమబంధ మనిరి.
దీనినే సింహవిక్రమ మందురు.


మ.

కళుకు న్బంగరుభిత్తిభాగముల నాకాంతుండు తాఁ జేరి ని
శ్చలభంగి న్గరయుగ్మమందు సరసీజాతాక్షి పాదద్వయి
న్నిలువంబట్టిన నైజకంఠము బిగ న్నిండారఁ గౌఁగిళ్ళఁ దొ
య్యలి గూర్పన్ ద్వితలాఖ్యబంధ మగు సాంద్రానందసంపాదియై.

తా.

పురుషుడు స్తంభముయొద్ద నిలిచియుండి కాంతయొక్కపాదములను
దనచేతులతో బట్టియుండగా నాసతి పురుషునికంఠమును గౌగలించుకొని రమిం
చుభావమును ద్వితలబంధ మనిరి.

63 కీర్తిబంధ లక్షణము

శ్లో.

కణ్ఠే భుజాభ్యా మవలంబ్య భర్తుః శ్రోణిం నిజోర్వోర్యుగళేన గాఢమ్।
సంవేష్ట్య కుర్యా ద్రతమంగనా చే దుక్తః కవీన్ద్రై రితి కీర్తిబంధః॥

(ఇతి అనంగరంగః)

చ.

కలికి విలాసభంగిఁ దనకంఠము గౌఁగిటఁ బట్టియుండఁగా
నల జఘనప్రదేశముల నాచెలి యూరువు నిల్పి నేర్పుగా
సలలితలాఘవం బమర సాంద్రవినీతలసీమలందుఁ బెం
పలరఁగ శౌరి గూడ నిది యార్యనుతం బగు కీర్తిబంధమౌ.


తా.

కాంత శృంగారముగా పురుషునికంఠమును గౌగలించుకొని పురు
షునిమెలయం దాపెతొడ నుంచి గోడ కొరగగా పురుషుడు రమించుభావము
కీర్తిబంధ మనఁబడును.

64 పార్శ్వవేష్టిత, 65 ధృతబంధముల లక్షణములు

శ్లో.

భిత్తిగస్య కరపంకజే స్థితా ప్రేయసో విధృతకంఠదోర్లతా।
ఊరుపాశపరివేష్టితప్రియశ్రోణిరంఘ్రితలతాడనాశ్రయా।
దోలతి శ్వసితి సీత్కృతాకులా యోషి దేవమవలంబితం మతమ్॥


చ.

సతి జఘనప్రదేశమునఁ జాతురి మీఱఁగఁ గూరుచుండి సం
స్తుతగతిఁ బార్శ్వభాగమున సొంపులు గుల్కఁగ రెండుచేతులు
న్నతముగఁ గంఠ మందముగన న్గదియించి కడంగి కూడిన
న్జతురిమఁ బార్శ్వవేష్టితము నా వచియింతురు దీని నెంతయున్.


తా.

కాంత పురుషునియొక్క మొలయందు కూర్చుండి చేతులతో నతనికంఠ
మును గౌగలించి ప్రక్కలకు దిరుగుచూ రమించుచుండ పురుషు డొకస్తంభ మాని
కగా నిలిచియుండుట పార్శ్వవేష్టిబంధ మగును.


ఆ.

అబల జఘనదేశమందుఁ బాదము లుంచి
కరయుగమున గళముఁ గౌఁగలించి

డోల యూచినట్లు లీలగాఁ గూడినఁ
బరఁగు నది ధృతాఖ్యబంధ మంచు.


తా.

కాంత గోడకు నానుకొనియుండ యాపెతొడలసందుగా పురుషుని
కాళ్ళుంచి కంఠమును కౌగలించుకొని యుయ్యల యూచినట్లు రమించుభావము
ధృతబంధ మనబడును.

వ్యానకరణముల లక్షణము

శ్లో.

వ్యానతం రతమిదం యది ప్రియ స్యాదథోముఖచతుష్పదాకృతిః।
తత్కటిం సమధిరుహ్య వల్లభః స్యాద్వృషాదిపశుసంస్థితిస్థితః॥


చ.

పొలతుఁక పాణిపాదములు భూమిపయి న్దగ నిల్పియుండఁగాఁ
జెలువుఁడు వెన్కభాగమునఁ జిన్నెలు చూసిన వ్యానతంబులౌ
నలఘుబహుప్రకారముల నార్యులు బల్కి రవెట్టివైన నే
నెలమిని గొన్ని బంధముల నే రచియింతు సచింత నెంతయున్.


తా.

కోమలాంగి పాదములు, కరములు పానుపున నాని తిర్యగ్జంతువులరీతి
వాలియున్నపుడు పురుషుడు వెనుకభాగమున నిలిచి పట్టుబంధములు వ్యానకర
ణంబు లనఁబడును. ఈ వ్యానకరణములను పెద్ద లనేకవిధములుగా జెప్పిరి.
అవి యెట్టివైనను నందు కొన్నిబంధములమాత్రమే తెల్పెదను.

66 నిపీడితబంధ లక్షణము

క.

తరుణీమణి వెనుచక్కిన్
బిఱుఁదులు కరయుగముచేత బిగఁబట్టి రహిన్
వారి యానుచుఁ గ్రీడించిన
హరువమరు నిపీడితాఖ్యమను బంధ మగున్.


తా.

కాంత తనయొక్క కాళ్ళు చేతులు నేల నానుకొని ముందుకు వంగి
యుండగా పురుషుడు దానివెనుక చేరి పిఱుదులు పట్టుకొని రమించినభావమే
నిపీడితబంధ మనబడును.

67 నిఘాతకబంధ లక్షణము

గీ.

సాధనల నేర్పుఁ జూపుచు జలజనేత్ర
వెనుకభాగంబునకు నీడ్చి వేఱుగతులఁ

గదిసి రమియించిన నిఘాతకం బనంగఁ
గరణమగు శాస్త్రసరణి విఖ్యాతి మీఱ.


తా.

స్త్రీ మునుపటివలెనే వంగియుండ దానిపాదములను తనవెనుక
భాగమునకు లాగుకొని దానికాళ్ళమధ్య నిలిచి తొడలను బట్టుకొని రమించుభావ
ము నిఘాతకబంధ మనబడును.

68 చటకవిలసితబంధ లక్షణము

క.

తరుణీమణి తనపదములఁ
కరములఁ గూడంగఁ జేర్చి కడువంగినచో
మురవైరి నిలిచినిలిచియుఁ
బెరిమన్ రమియింపఁ జటకవిలసిత మయ్యెన్.


తా.

సతి తనకాళ్ళతోకూడా చేతులు జేర్చుకొని వంగియుండగా పురు
షుం డాసతివెనుకదిక్కున నిలిచి రమించుభావము చటకవిలసితబంధ మనిరి.

69 జుప్పబంధ లక్షణము

క.

పడఁతి పిఱుందులపైఁ దన
కడు పానిచి చంద్రవదన కడుపునఁ గరముల్
గడుబిగియఁ గూర్చి కదలక
నడరన్ రమియింపఁ జుప్ప మనఁ జెలు వొందున్.


తా.

సతి మునుపటివలె వంగియుండ యాపె పిరుదులపై తనకడుపు
నానించి యాపె కడుపును కదలకుండా పురుషుడు తనచేతులతో బట్టి రమించు
భావము జుప్పబంధ మనంబడును.

70 వరాహఘాతబంధ లక్షణము

క.

వనితపిఱుందులఁ గృష్ణుఁడు
తనచేతులు బిగియఁబట్టి తద్దయువేగం
బొనరఁగఁ గ్రిందునఁ దాఁకులఁ
గనఁగూడ వరాహఘాతకం బనఁ బరఁగున్.

తా.

వనిత మునుపటివలె వంగి పాదములను బట్టుకొనియుండగా పురుషు డా
సతియొక్కపిఱుదులను తనచేతులతో గట్టిగా పట్టుకొని క్రిందుగా తాకులు
తాకుచు రమించినది వరాహఘాతబంధ మనబడును.

71 వృషాభిఘాతబంధ లక్షణము

క.

ఇరుపార్శ్వంబులఁ బదములు
పరిపరిగతి మార్చిమార్చి పైభాగమునన్
గుఱిగాఁ దాఁకులు దాఁకుచుఁ
గరము రమింపన్ వృషాభిఘాతక మయ్యెన్.


తా.

సతి పూర్వమువలెనే యుండగా పురుషు డాసతిపదముల రెండువైపుల
నుంచి తనపాదములను మార్చుచు గుఱిగా పైభాగమునకు తాకులు తాకుచు
రమించుభావము వృషాభిఘాతబంధ మగును.

72 ధేనుకబంధ లక్షణము

శ్లో.

న్యస్తహస్తయుగళా నిజే పదే యోషిదేతి కటిరూఢవల్లభా।
అగ్రతోయది శనైరథోముఖీ ధేనుకం వృషపదున్నతేప్రియే॥


చ.

చందనగంధి భూమిపయి సంగతిగాఁ గరపాదపద్మము
ల్పొందుపడంగ నిల్పి కనుబొమ్మలఁ జూపుచుఁ గాళ్ళసందులన్
గ్రిందుగఁ జూడ నాయకుఁడు కేవలము న్బయి నిల్పి చేతు లిం
పొందఁ దదీయహస్తముల నూని రమించిన ధేనుకం బగున్.


తా.

సతి భూమిమీద తనకాళ్ళను చేతులను యాని వంగి తనకాళ్ళసందుగా
వెనుకపార్శ్వమును జూచుచుండ పురుషు డాసతి వెనుక నిలిచి యాపెచేతులతో
చేతులను జేర్చి వంగి రమించినభావము ధేనుకబంధ మనబడును.

73 గజబంధ లక్షణము

శ్లో.

అవనిగతస్తనమస్తకవదనా మౌన్నిత్యవస్త్ఫిజం నేతా।
తిష్ఠేత్ కరేణ యోనిం పూర్వం విక్షోభయేద్రమేదైభమ్॥

(ఇతి రతిరత్నప్రదీపికః)

చ.

స్తనములు మోము బాహువులు ధారుణిపై దగఁజేర్చి యానుచు
న్వెనుకటిభాగ మూర్థ్వముగ నిల్పి వధూమణి శ్రోణిదేశమం

దును వసియించి యొక్కకయితో మదనధ్వజ మూననిల్పుచు
న్దనియఁగఁ గూడ దంతికరణం బన నొప్పు విచిత్రవైఖరిన్.


తా.

స్త్రీ తనయొక్కచన్నులును భుజములును ముఖమును భూమిమీద
నానేటట్టుగా పండుకొని వెనుకభాగమును పొడవుగా యెత్తియుండగా పురుషు
డాపె పిరుదులయొద్ద నిలిచి తనచేతితో శిశ్నమును యోనిలో దూరునట్లు నిలుపుచు
రమించునది గజబంధ మనబడును.

74 మార్జాలబంధ లక్షణము

క.

చేతులు కాళ్ళును జాపుచు
వాతెర నయనములు పూలపానుపునకునై
నాతిపిఱుం దిడ కూడిన
నాతత మార్జాలకరణ మనఁగాఁ బరఁగెన్.


తా.

సతి వెనుకటివలె బోరగిల్ల పండుకొని కాళ్ళను జాపి పిఱులను కొంచె
ము యెత్తగా నాపెపిఱులవద్ద పురుషుడు కూర్చుండి రమించుభావము మార్జాలబంధ
మనబడును.

75 హరిణబంధ లక్షణము

శ్లో.

అధోముఖస్థాం రమయేచ్చ నారీం తత్పృష్టవర్తీ పశుతుల్యరూపః।
భర్తా పరిక్రీడతి భావహీనో నిర్దిశ్యతే హారిణబన్ధ ఏషః॥

(ఇతి పంచసాయకః)

గీ.

ముందునకు వంగి యుండిన ముదిత వెనుక
భావహీనతఁ జెందిన భర్త జేరి
పశువుచందంబునను రతిఁ బరపెనేని
యదియ హరిణబంధ మటందు రవనిజనులు.


తా.

ముందునకు వంగియున్న సతియొక్క వెనుకభాగమున పురుషుఁడు
నిలచియుండి భావహీనుఁడై పశువులవిధమున రతిసల్పుట హరిణబంధ మనబడును.

76 చాటుకపేలుకబంధ లక్షణము

శ్లో.

నితంబబింబం కిల నాయకస్య నార్యాస్త్రికం హస్తయుగేన దృత్వా।
గుల్ఫౌ నిదాయ స్థిత ఏవ తస్యాబన్ధో౽స్యసౌ చాటుకపేలుకః స్యాత్॥

గీ.

వసుధఁ జూచుచు నెదుటకు వంగి భామ
వెనుక నిల్చినమాధవు వెన్నుఁ బట్ట
నాపెపదముల మునివ్రేళ్ళ నదిమిపట్టి
కలియ “చాలుకపేలుక” కరణ మనిరి.


తా.

కాంత ముందునకు వంగి వెనుకకు చేతులను జాపి వెనుకనున్న పురు
షుని బట్టుకొనియుండ పురుషు డామెమడమలను తనపదములయొక్క మునివ్రే
ళ్ళతే బట్టి రతి యొనర్చిన చాటుకపేలుకబంధ మగును.


శ్లో.

భూగతస్తనభుజాస్య మస్తామున్తస్ఫిచదుధోముఖీం స్త్రీయమ్।
క్రామతి స్వకరకృష్ణమేహనో వల్లభః కరిదదైభముచ్యతే।
ఏణగార్దభికశౌనసైరిభప్రాయమేవమపరం చ కల్పయేత్॥


వ.

మఱియు నీ వ్యానకరణములయందు ననేకభేదంబులు గలవు. అందుఁ గొన్ని
నామంబు లెఱింగించెద — సృగాలంబును, గార్దభంబును, యౌష్ట్రంబును,
బౌండరీకంబును, మండనంబును, విపరీతంబును, నైణంబును, బారావతంబును,
మయూరంబును, మౌషికంబును, భేరుండంబును, గారుడంబును, ననునవియు
నింకనధికంబులుం గలవు. అవియన్నియు భావధూషితంబులు గానఁ బలుకఁబడవు.
అవియన్నియుఁ దత్తదాకార పరిమాణంబై యుండు. కలాకోవిదులగువారలు
తదన్వేషణరూపంబులును నృత్యసతులు గావించిన క్రియాగుణకార్యనిర్వాహ
కుఁడై వ్యానతంబురీతిగా నాకారవికారం బెన్నుచు సంతతంబుగాఁ గ్వచిత్సం
పర్కం బుపయోగింప శ్రేయస్కరంబు. ఇంక విపరీతంబుల నెరింగించెద.

77 పురుషాయితబంధ లక్షణము

శ్లో.

జాతశ్రమం వీక్ష్య పతిం పురన్ధ్రీ స్వేచ్ఛాతయైనాథ రతే ప్రవృత్తిమ్।
కందర్పవేగాకులితా నితాంతం కుర్వంతి తుష్ట్యై పురుషాయితం తత్॥

(ఇతి అనంగరంగః)

చ.

పురుషుఁడు భ్రాంతిఁ జెందఁ బువుఁబోఁడి చివాలున లేచి యూరువు
ల్విరళముఁ జేసి పైకొని చలింపఁ గుచద్వయము న్బిఱుందుల
య్యురమురమున్ మొగంబుమొగ మూని విభుం డెదురానుచుండఁగా
హరువమరంగఁ గూడఁ బురుషాయితబంధ మన న్నుతి న్గొనున్.

తా.

పురుషుడు రతివలన నలసి శయ్యయందు పవళించియుండ సతి తటా
లున లేచి పురుషుని పైకొని తొడలను విశాలము చేసి చండ్లును పిరుదులు కదులగా
రొమ్ము రొమ్మునను ముఖము ముఖమునను యుంచి పాన్పుపై చేతులాని యాసతి
రమించుభావము పురుషాయితబంధమని తెలియదగినది.

78 భ్రామరబంధ లక్షణము

శ్లో.

సుప్తస్య పుంసో జఘనోపరిస్థితా సంభ్రామయంత్యంఘ్రియుగం వికుంచితమ్।
చక్రాకృతిః స్త్రీ నరవద్విచేష్టతే తద్ భ్రామరాఖ్యం కరణం సమీరితం॥

(ఇతి అనంగరంగః)

చ.

నిదురతమిన్ మురారి తననేరుపుఁ జూపక పవ్వళింపఁగా
ముదిత వరాంగమధ్యమున మోహమున న్బ్రియులింగ ముంచి స
మ్మదమునఁ జక్రమట్లు తనుమధ్యమున న్గటిసీమఁ ద్రిప్పుచున్
గదలుట భ్రామరాఖ్య మనఁగాఁదగు బంధ మగున్ జగంబునన్.


తా.

పురుషుడు నిద్రాసక్తతచేత తనరతిచాతుర్యము జూపక నిలువుగా
పండుకొనియుండ కాంత మోహముతో నాతని పయికొని యోనియం దాతనిదం
డము నుంచుకొని తనచేతులును మోకాళ్ళను శయ్యయం దానించి పిఱుదులను
చక్రాకృతిగా ద్రిప్పుచు నతినికి నిద్రాభంగము కలుగకుండునట్లు రమించుభా
వమె భ్రామరబంధ మనబడును.

79 ఉత్కలితబంధ లక్షణము

శ్లో.

ప్రేష్య విభ్రమవతీ స్మరాలయే భర్తృలింగముపధాయ పురన్ధ్రీ।
భ్రామయేత్కటిమనందవిలోలా స్యాత్తదా కరణముత్కిలితాఖ్యమ్॥

(ఇతి అనంగరంగః)

మ.

చనుదోయి న్బతిఱొమ్ముపై నదిమి మించ న్గౌఁగిట న్బట్టి మా
రునియింటన్ ధ్వజ మూననిల్పి పలుమారున్ ధూర్తసామీధవా
యనుచున్ మోవి చురుక్కుమన్నఁ గురు లాయాసంబు దా నీడ్చినన్
దనివిన్ దిట్టుచుఁ గొట్టుచున్ గలియు బంధం బుత్కలీతం బగున్.

తా.

స్త్రీ వెనుకటిరీతిగా పురుషుని పైకొని తనపదములు పురుషునిపార్శ్వ
ములం దుంచి చేతులను యాతనిచంకలక్రిందుగా పోనిచ్చి భుజంబులను పట్టుకొని
చన్నుల నాతనిఱొమ్ముభాగమున నదిమి మోవి యానుచు రమించుభావము ఉత్క
లితబంధ మనబడును.

80 ప్రేఖాయతబంధ లక్షణము

శ్లో.

ఉత్తానశయితస్యోపర్యువిష్టా వధూస్తదా।
కిమప్యాలంబ్య హస్తాభ్యాం రమేత్ప్రేంఖోలితం హి తత్॥

(ఇతి రతిరత్నప్రదీపికః)

గీ.

శౌరి మీఁగాళ్ళపైఁ దనచరణయుగము
నిల్పి కరముల భుజములు నిక్కఁబట్టి
రతికిఁ బైకొని తోరణగతిని గూడ
వసుధఁ బ్రేంఖాయతం బను బంధ మయ్యె.


తా.

పురుషుడు పాన్పుపై పండుకొనియుండ స్త్రీ తనపాదముల నతనిపాద
ములపైభాగమున నుంచి యతనిభుజములను చేతులతో బట్టుకొని తనశరీర మతనికి
తాకింపక తోరణాకృతిగా రమించుభావము ప్రేంఖాయతబంధ మనఁదగును.

81 సంఘాటక, 82 ఉపపదబంధముల లక్షణములు

శ్లో.

యన్మిథస్తు విపరీతసక్థికం స్త్రీయుగం యుగపదేతి కాముకః।
కాముకావసి మదాకులాబలా సంపదోపపదఘాటకం విదుః॥


శ్లో.

ఇత్థమన్యదపి యోషితైకయా రమ్యతే వరచతుష్టయం యది।
కాముకేన యుగపచ్చ ఖండనాద్వక్త్రహస్తపదలింగసంగతః॥


సీ.

మరుమదంబునఁ జొక్కు మగువలిద్దఱు నొక్క
                 పాన్పుపై నిర్భరభంగి నున్నఁ
బురుషుఁ డందుల నొక్కపొఁలతి రమించుచుఁ
                 దరువాతి జవరాలి మరునియింట
జేతివ్రేళ్ళైనను జిహ్వయైనను బెట్టి
                 త్రిప్ప సంఘాటక మొప్పుఁ బుడమి

నీరీతినే నాథు లిరువురు పవళింపఁ
                 గాంతయొక్కతి రతికౌశలమున


ఆ.

నుపరతంబునందు నొక్కని నలరించి
యొకని బాహ్యరతుల నుబుసు పుచ్చి
విహగపశుమృగాదివిహ్వలరతులచేఁ
బరఁగునదె యుపపదబంధ మగును


తా.

ఇద్దరుస్త్రీలు శయ్యపైఁ బవళించియుండ పురుషుం డందొకస్త్రీతో
రతి చేయుచు రెండవదానిభగమందు చేతివ్రేళ్ళయునను నాలుకయైనను బెట్టి త్రిప్పుచు
రమించుభావము సంఘాటకబంధ మనబడును. ఆలాగుననే పాన్పుపై పురుషు
లిద్దరు పండుకొనియుండ యొకస్త్రీ యందొకనితో నుపరతి చేయుచు రెండవపురు
షునిదండమును చుంబించుచు బాహ్యరతిచే రమించుభావము ఉపపదబంధ మన
బరగెను.

83 గోయూధకబంధ లక్షణము

శ్లో.

పరస్పరం విశ్వసనీయయోషిత్సంఘాటకేన క్రమశోయువా౽ధ
రమేత గోయూధక మేతదేకా క్రాన్తా౽పి కాంతైర్బహుభిస్తధైవః॥

(ఇతి రతిరత్నప్రదీపికః)

గీ.

కాంతు నొక్కని జీరి పెక్కండ్రు స్త్రీలు
పడకటింటను జేర్చి యా పడఁతు లెల్ల
నొకరితరువాయి వరుస నింకొకరు వాని
గలసి రతి సల్ప గోయూధకరణ మయ్యె.


తా.

స్నేహితురాండ్రైన స్త్రీ లనేకమంది జేరి యుమ్మడిగా రమించుటకు
బురుషు నొకనిని జేర్చుకొని యొకరితరువాత నొకరు వరుసగా రమించుట గోయూ
ధకబంధ మనంబడును.

84 జలకేళితబంధ లక్షణము

శ్లో.

కరీ జలక్రీడకాలే కరిణీయూధమధ్యగః।
క్రమేణ రమతే సర్వాస్తద్వత్స్యాత్ వారికేళితమ్॥

(ఇతి రతిరత్నప్రదీపికః)

గీ.

జలక మాడుచుఁ గొలనులో సంచరించు
గోపికలఁ జేరి సృష్ణుఁడు కూర్మి హెచ్చ
నొకరితరువాయివరుస నింకొకరిఁ గూడి
కేళిఁ దనిపినవిధి జలకేళి యండ్రు.


తా.

ఆడయేనుగులను నీటియందు వంతులుప్రకార మొకదాని విడిచి యొక
దానిని మగయేనుగు రతిసల్పినప్రకారమే కొలనులో జలకమాడుచున్న గోపిక
లను నొకరితరువాత నొకరివంతున వరుసగా నాగోపికలతో గృష్ణుఁడు రతిసల్పిన
భావమే జలకేళి యనంబడును.

మన్థపీడితము మన్థవరాహముల లక్షణము

శ్లో

చిత్రయంత్రవిధిరేష భాషితో లింగయోనిపరిఘట్టనావిధౌ।
మంథపీడితవరాహఘాతఃద్యుక్తయో౽వతిఫలా మయోజ్భితాః॥


శ్లో

ఊర్ధ్వతోధ పరితోప్యధస్తథా పీడనాహననఘట్టనావిధాః।
మన్మథాకులనితంబినీభగే యోజయేత్కరధృతం ధ్వజం పుమాన్॥


సీ.

మన్థపీడితమును మన్థవరాహఘా
                 తంబును ననఁగ నత్యంతయుక్తు
లప్రయోజనము లీయనువులు కరకరి
                 క్రీడనంబును మందకృత్య మరయ
మీఁదఁగ్రిందును రెండుమేరల యోనిలోఁ
                 బీడింప నది మన్థపీడితంబు
చేత లింగముఁ బట్టి స్త్రీ యోనిలోఁ బెట్టి
                 కరముఁ ద్రిప్ప వరాహఘాతకంబు


గీ.

నీచరతులఁ దృప్తిని గనని కాంతకుఁ
దనివిగాఁగఁ దారుదండమునను
నుచ్చరతులఁ బ్రీతి నొందెడు నెలనాగఁ
జూచి యుపరతికిని జొనుపవలయు.


తా.

మంథపీడిత మంథవరాహఘాతలు రెండును అత్యంతయుక్తులును
ప్రయోజనము లేనివియునై యున్నవి. మఱియు నీయుపాయములు క్రూరమైన

యాటలును యలసకృత్యములునై యున్నవి. పురుషుడు కాంతయోనిలో దండ ముంచి
మీదకును క్రిందకును ద్రిప్పుట మంథపీడిత మనబడును. సతి తనచేతితో పురుషు
నిదండమును బట్టి తనయోనిలో నుంచుకొని మీదకును క్రిందకును ద్రిప్పినయెడల
మంథవరాహఘాత మనబడును. నీచరతులతో తృప్తినొందనికాంతను తమదండ
ముచే మంథపీడిత మంథవరాహఘట్టనంబుల జేయ దృప్తినొందును. ఉచ్చరతుల
వలన సంతసించుకాంతను యుపరతి చేయునటు లాసతిని పురుషుడు లాలింపవలెను.


క.

ఏకరణమునకుఁ బ్రియమై
యేకామినిచొక్కు దానియింగితమునకై
యాకరణంబున నాయకుఁ
డాకామిని గూడవలయు ననురాగమునన్.


తా.

ఏబంధమువలన సతి సంతోషపడునో దాని హృదయరంజనమునకు
గాను పురుషు డాబంధముచే నాసతిని యనురాగముతో గూడవలయును.


శ్లో.

యోజయేన్న విపరీతమోహనే నూతనప్రసవపుష్పయోగీనీమ్।
గర్భిణీం చ హరిణీం చ పీనరాం కన్యకామపి కృశాం చ వర్జయేత్॥


క.

తిరముగ విపరీతంబులఁ
బరివర్జింపంగవలయు బాలను స్థూలన్
హరిణిన్ గర్భిణిఁ బుష్పిణిఁ
దరుణిం బాలెంతరాలిఁ దనుతరదేహన్.


తా.

బాలయు, బలసినవాతశరీరముగలదియు, హరిణీజాతిసతియు, గర్భము
ధరించినదియు, ముట్టయినదియు, బాలింతరాలును, కృశించినదేహముగలదియు
వీరలను విపరీతబంధములను జేయుపట్ల వర్జింపవలయును.

రతితృప్తి లక్షణము

శ్లో.

యేన సా భ్రమితదృష్టిమండలా స్యాత్తతస్తు సరిపీడయేద్భృశమ్।
స్రస్తతా వపుషి, మీలనం దృశో, ర్మూర్ఛనా చ రతిభావలక్షణమ్॥


క.

గాత్రంబు పరవశంబగు
నేత్రంబులు మూయుఁ జెమట నించును నూర్పుల్
చిత్రగతిఁ బొలయుఁ బలుకఁ బ
విత్రఫలము లౌను సతికి వీర్యము వొడమన్.

తా.

నెలంతకు యింద్రియపతన మగునపుడు దేహస్మరణ తప్పుటయు, నేత్ర
ములు మూతపడుటయు, చెమట పట్టుటయు, నుచ్ఛ్వాసనిశ్వాసము లధికమగు
టయు, చిత్రముగ మాటలాడుటయు సంభవించును.


శ్లో.

శ్లేషయేత్స్వజఘనం ముహుర్ముహుః సీత్కరోతి మదగర్వితాకులా।
భావసిద్ధిసమయస్య సూచకం వక్ష్యమాణమరతేస్తు లక్షణమ్॥


ఆ.

జఘనఘట్టనంబు సలుపును బలుమారు
గళరవంబు చెలఁగఁ గన్నుమూయు
సొలయుఁ దిట్టుఁ గొసరు సుందరివీర్యంబు
వొడమువేళ మనసు బట్టునెపుడు.


తా.

మఱియు నెలంత కింద్రియపతన మగునపుడు మాటిమాటికి భగముతో
బురుషునిదండమును బెనగకుండునటుల నదుముటయు, పావురపుపల్కులు పల్కు
టయు, కన్నులు మూయుటయు, పరవశము నొందుటయు, తిట్టుటయు, కొసరు
టయు, మనస్సును బిగబట్టుటయు సంభవించును.

రతియందు దృప్తినొందని స్త్రీ లక్షణము

శ్లో.

హస్తమాధువతి హన్తి నో దదాత్యుజ్భితుం భటితి లంఘయేదితి।
నేచ్ఛయా శ్రమిణి వల్లభే౽ధవా యోషిదాచరతి పూరుషాయితమ్॥


క.

రతి తృప్తినొందకుండిన
నతివ విభునిఁ దిట్టుఁ జేతు లాడించు రతిన్
బతి యలసినఁ బురుషాయిత
రతిఁ గైకొని తనదుగుహ్యరతులఁ బెనంగున్.


తా.

రతియందు తృప్తినొందనికాంత పురుషుని తిట్టుటయు, చేతితో నత
నిని పట్టి యాడించుటయు, యతం డలయుచో బైకొని రతి చేయుటయు గలుగును.


శ్లో.

ఆదితో ఘటితయస్త్రమేవ వాతం నిపాత్య నరవద్విచేష్టతే।
చక్రవద్భ్రమతి కుంచితాంఘ్రికా భ్రామరం నృజఘనేసముద్గతే॥


శ్లో.

సర్వతః కటిపరిభ్రమో యది ప్రేంఖపూర్వమిదముక్తమూలితమ్।
తాడవం చ విదధీత సీత్కృతవ్యస్తసస్మితముఖీ వదేదిదమ్॥

శ్లో.

పాతితో౽సి కితవాధునా మయా హన్మి సంవృణు కృతో౽సి నిర్మదః॥
నిఘ్నతీ క్వణితకంకణం ముహుః కృష్ణకున్తలచుంబితాధరా।
పాన్ద్రదోలితనితంబమాకులా కర్మణశ్చ విరమేదపి స్వయమ్॥


చ.

చరణయుగము వంచి ఘటచక్రముభంగిఁ బరిభ్రమించుఁ గం
ధరనినదంబుఁ బెంచు జఘనస్తలడోలన మాచరించు వా
క్కరణ వహించుఁ బేరురము ఘట్టనచే నదలించుఁ గుంతల
స్ఫురణ కుదుర్చు వీరరతి చుంబనణ జేయు లతాంగి నాథునిన్.


తా.

రతితృప్తిలేనికాంత పురుషుని పైకొని తనకాళ్ళను వంచి చక్రాకృతిగా
దిరుగుటయు, పావురపుపల్కులు పల్కుటయు, కటిపురోభాగము నుయ్యలవలె
నాడించుటయు, శిశ్నమును చుంబించుటయు, ఱొమ్మును కొట్టుటయు, ముంగురులు
చక్కజేయుటయు, ముద్దుపెట్టుటయు, పురుషాయితబంధముల జేయుటయు
కలుగును.


శ్లో.

సశ్రమామథ విభాన్య పాతయేత్ సంపుటం చ స్ఫుటయేద్వసర్జనే।
తృప్తిమేతి యది నైవమపయ్సావాచరేద్గదితమంగుళీరతమ్॥


క.

సురతమునఁ గ్రిందుమీఁదగుఁ
దరుణియుఁ బురుషుని బెనంగుఁ దత్తద్రతులన్
బరితృప్తి బొందకుండిన
సరసుం డంగుళిరతంబు సలుపఁగవలయున్.


తా.

రతితృప్తిపొందనికాంత సంభోగమున క్రిందుమీదై బంధములతో
తృప్తినొందనియెడల పురుషు డాస్త్రీని యంగుళిరతముతో తృప్తి నొందింప
వలయును.


శ్లో.

మోహనం మదనయుద్ధమూచిరే తస్య తాడనమిహాంగ మిష్యతే।
ఆర్తిరూపమపి తత్ర సీత్కృతం తచ్చ భూరివిధముచ్యతే బుధైః॥


శ్లో.

తాడనం సమతలాపహస్తతో ముష్టినా ప్రసృతకేనచోదితమ్।
పృష్ఠపార్శ్వజఘనస్తనాన్తరే మూర్ధ్ని, తే హి మదనస్య భూమయః॥


శ్లో.

హింకృతం స్తనితసీత్కృతోత్కృతం ఫూత్కృతం శ్వసిత రోదనాదికమ్।
ముంద పీడయ గృహాణ జీవయ త్రాహి హా ధిగతి సీత్కృతం విదుః॥

వ.

మఱియుఁ బ్రబలరతి కుపయుక్తంబులగు సీత్కృతతాడనంబులను రత్యంగములు
బహుప్రకారంబులై యుండు నవి వివరించెద—


సీ.

తాడనంబున సమతలము ముష్టియు నన
                 నవి రెండుభావంబు లయ్యె వాని
నెలవు లెయ్యవియన్న నెత్తియు నెదఱొమ్ము
                 పార్శ్వంబులును వీపు భగతలంబు
సీత్కృతంబులునాఁగఁ జెప్పంగ నెనిమిది
                 హుంకృతంబులు సీత్కృతోత్కృతములు
తగఫూత్కృత శ్వసితంబులు రోదన
                 స్తనితము ల్ఫూత్కృతంబని యనంగఁ


ఆ.

బట్టు విడువు కొట్టు ప్రాణంబు రక్షించు
చిక్కితిని మఱేమి సేయుదునని
మ్రొక్కు వనరుఁ జేత ముట్టనీకుండుట
సీత్కృతంబునకును జిహ్న మిదియ.


తా.

తాడనము సమతాడనమనియు ముష్టితాడనమనియు రెండువిధములు.
నెత్తి, ఱొమ్ము, పార్శ్వము, వీపు, యోని, యివియైదును తాడనమునకు స్థానములు.
ఉత్కృతము, ఫూత్కృతము, శ్వసితము, రోదనము, స్తనితము, భూత్కృతము
లనధ్వనులు, పట్టు, విడువుము, కొట్టు, ప్రాణము కాపాడు, నీకు లోబడితి నికేమి
సేయుదు, మ్రొక్కు, యేడ్చు, ముట్టనీకయుండుటయు, నీయెన్మిదియు పైధ్వు
లకు చిహ్నములు.


శ్లో.

తచ్చ లావకకపోతకోకిలాహంసకేకిసదృశై రుతక్రమైః।
మిశ్రితం ప్రహరణే ప్రయుజ్యతే హ్యన్యదాపి రుదమిష్యతేవిటైః॥


క.

కేకి కలహంస లావుక
కోకిల పారావతములు కులికెడి పలుకుల్
గైకొని తాడన సీత్కృత
పాకంబుల వెలయవలయుఁ బతియున్ సతియున్.

తా.

స్త్రీపురుషులిరువురు రతి సేయుకాలమునందు నెమలి, హంస, కోకిల,
పావురములవలె పలుకులు పలుకుచు పైనజెప్పియున్న సీత్కృతతాడనంబులతో
మెలంగవలయును.


శ్లో.

ఊర్ద్వముచ్చరతి కంఠనాసికా హింకృతం స్తనిత మభ్రఘోషవత్।
వంశవిస్ఫుటనపంచ సీత్కృతం ఫూత్కృతం బదరసాతవజ్జలే॥


శ్లో.

రోదనధ్వనికరీం కరాహతిం హృత్ప్రయోజ్యమపహస్తకం విదుః।
ముష్టిరత్ర విదితస్తు పృష్ఠతే మూర్ధని ప్రసృతకం ఫణాకృతి॥


సీ.

స్తనితంబు హుంకృతధ్వనియును మేఘని
                 ర్ఘోషంబునకు నెనగూడియుండుఁ
గంఠనాసికలతోఁ గలియంగ నుదయించు
                 నినదంబు సీత్కృతం బనఁగఁ బరఁగుఁ
నెదురువ్రక్కల నూప నుదయించునేధ్వని
                 యటువలె భూత్కృతి నతిశయిల్లు
జలముల బదరికాఫలములు పడువేళ
                 బొదవెడుధ్వనితోడ ఫూత్కృతంబు


ఆ.

ఊర్జితంబులైన యోజను వర్ధిల్ల
నతివపల్కు రోదనాఖ్య మయ్యె
నిట్టిపలుకుతోడ నింతిని గరతాడ
నంబు సేయవలయు నాలు గవియు.


తా.

స్తనిత హుంకృతధ్వనులు రెెండును యుఱుమునకు సరిగా నుండును.
సీత్కృతధ్వని కంఠధ్వనియు నాసికధ్వనియు గలియునటుల గలుగధ్వనికి సమాన
ముగా నుండును. భూత్కృతధ్వని వెదురుబద్దలను కదుపగా నగుశబ్దమునకు సరిగా
నుండును. ఫూత్కృతము నీటియందు రేగిపండ్లు పడుసమయమున పుట్టుధ్వనితో
సమానముగా నుండును, శ్వసితమన శ్వాసమును, రోదనమన యేడ్చుటయు, నీరెం
డును ప్రసిద్ధము. పైన చెప్పబడిన ధ్వనులు చేయుచు పురుషుడు రతియందు స్త్రీకి
కరతాడనము జేయవలయును.


శ్లో.

హస్తతాళహననం చ జాఘనే పార్శ్వయోః సమతలం ప్రయుజ్యతే।
కర్తరీప్రభృతి దక్షిణాపథే తాడనం తదిహ దూషితం బుధైః॥

శ్లో.

తాడయేద్యువతిమంకగామినీం పృష్టతః ప్రియతమః స్వముష్టినా।
సాభ్యసూయమివ సాపి తన్తథా క్రన్దతి శ్వసిత కాముకాతరా॥


శ్లో.

అసమాప్తి హృదయే ప్రయుజ్యతే యుక్తయన్త్రయువతేః పుమాన్శనైః।
వర్ధమాననుపహస్తతాడనం సాపి సీత్కృతమిహాదరేన్ముహుః॥


సీ.

హుంకృతధ్వనితోడ నురమున దనహస్త
                 మిడి చేయవలయుఁ జప్పు డొగి విభుఁడు
ఘట్టింపవలె ముష్టిఘట్టన నెదుఱొమ్ము
                 స్తనితకూజితవిధూతములచేతఁ
బాముపడగరీతిఁ బట్టినచెయి వంచి
                 తలవేయవలయు సీత్కార మొదవ
దవడ లొయ్యన హస్తతాడనఁ గావించి
                 జఘనపార్శ్వములందు సమతలంబు


గీ.

మోపి కలహంసలావుక ముఖరవంబు
గదుర మోచేత వీపు వక్షస్థలంబు
తాడనము సేయ దక్షిణత్వమునఁ గాని
యన్యకరమున వేయరా దనిరి మునులు.


తా.

పురుషుడు హుంకృతధ్వనిచేత స్త్రీఱొమ్మున దనచేతితో కొట్టుటయు,
స్తనితధ్వనిచోత నెదుఱొమ్మున పిడికిలిచేత కొట్టుటయు, సీత్కృతధ్వనిచేత చేతిని
పాముపడగవలె వంచి తలయందు కొట్టుటయు, శ్వసితధ్వనిచేత దవడలయందు చేతితో
కొట్టి మొలకు రెండువైపులను సమతలముగా యుంటి హంసవలె పలుక మోజేతితో
వీపును వక్షస్థలమును కొట్టవలెను. కుడిచేతితో కొట్టవలెను గాని యెడమచేతితో
కొట్టకూడదని వాచ్యాయనాదులు పల్కిరి.


శ్లో.

తత్ర చేద్వివదతే శిరస్తదా తాడయేత్ ప్రసృతకాన కాత్కృతమ్।
ఫూత్కృతం యువతిరాచరేద్భృశం తాడనే శ్వసితరోదితే అపి॥


శ్లో.

సత్వరం సమతలేన తాడయేదాసమాప్తి జఘనే చ పార్శ్వయోః।
రాగపాతసమయే నితంబినీ హంసలావకరుతం సమాచరేత్॥

ఉ.

చేరువనున్నకాంత పతిచేత నిజాయతముష్టిఁ జీరినన్
నీరజనేత్ర నిబ్బరము నివ్వెఱపాటును రోదనంబు ని
ట్టూరుపుఁ దోఁపఁ గొంతవడి నొయ్యన ముష్టి గదల్చి కేళికిన్
జేరి తదీయతాడనవిశేషముఁ జూపును సీత్కృతంబుతోన్.


తా.

స్త్రీ పురుషునియొక్క పిడికిలిచేత కొట్టుబడి రోదనమును, నివ్వెర
పాటును, నిట్టూర్పల నించుచు, సీత్కృతధ్వని చేయుచు, తనపిడికిలిచే పురుషుని
గొట్టును.


శ్లో.

కన్ద్రితం శ్వసితమాచరేన్ముహుర్మోహనాన్తసమయో నితంబినీ।
అన్యదాపి విగతార్తినిఃసహా కంఠకూజితవతీ విరాజతే॥


చ.

శిరమునఁ గుంచితాంగుళముఁ జేయుచు ఫూత్కృతి యాచరింపఁ బం
కరుహదళాక్షి యూర్పులను గ్రందనము న్ఘటియింప నంత స
త్వరమునఁ బార్శ్వగుహ్యములు తాడనఁ జేయఁగరంగి లావుహం
సరతము లాచరించు నవసానరతంబునఁ దృప్తి వుట్టదే.


తా.

పురుషుడు ఫూత్కారధ్వని చేయుచు చేతివ్రేలును వంచి స్త్రీయొక్క నెత్తిపై కొట్టుచు రతి సేయ నూర్పులును యార్పులును నేర్పడును. వెంటనే పార్శ్వ
ములు భగమును తాడనము చేయ సతి ద్రవించి హంసపలుకులతో రతి యొనర్చి
దృప్తి నొందును.


శ్లో.

సానురాగపరుషత్వచండతాం పూరుషేషు దధతి స్త్రియో రతే।
రాగతో భవతి సాత్మ్యతః క్వచిద్వ్యత్యయోపి స చిరంమనోహరః॥


శ్లో.

పంచమీ గతిముపేత్యవీక్ష్యతే స్థాణువారితతురంగమో యథా।
కాముకావపి తథా రతాహనే ఛేతఘాతకదనం న పశ్యతః॥


శ్లో.

కింతు సాత్మ్యమభిచిన్త్యయోషితాం తీవ్రమన్దముపచార మాచరేత్।
ఔపరిష్టకవిధానదర్శినా నిన్దితా చ మునినేతి కిం తయా॥


సీ.

రతికాల మెఱుఁగక రమణుండు పైకొని
                 కొసరులఁ బల్కిన విసువు పుట్టు
గతిచండమందవేగంబులఁ జూపక
                 సత్వరీతులఁ గూడ సమ్మతించు

మధుమదంబున నున్న మానిని నఖదంత
                 కరఘాతములచేతఁ గరఁగుచుండు
తనసత్వమునఁ బొందఁ దరుణిసత్వంబును
                 దెలియక రతి సల్పు టలవికాదు


ఆ.

కాన సత్వ మెఱిఁగి కళలంటి చుంబన
భూషణాదిగతులఁ జూపనేర్చి
కామశాస్త్రవిధులఁ గాంతలు పతులును
దలఁపు లొప్పఁ దెలియఁ గలియుదు రిల.


తా.

పురుషుడు లాలనాదిక్రియలను జేసి సతిని ద్రవింపజేయక పైకొనిన
సతి విసుగుకొనును. రతి సేయునపుడు చండమందవేగములను జూపక సమరతి
చేసిన సతి సమ్మతించును. సతి కల్లు త్రాగి మత్తుతో నున్నయెడల నఖ దంత కర
ఘాతములచేత ద్రవించును. పురుషుడు సతి నాలింగనాదివిధులతో దానిబలమును
దెలిసికొని దానికి తగినబలమును జూపుచు రమించిన ద్రవించును. అట్లు కానిచో
వికటమగును. కావున సతియొక్కబలమును తెలిసికొని కళలను పట్టుచు నఖక్షతదంత
క్షత చుంబనాదిగతులను జేయుచు నీశాస్త్రమున జెప్పబడినప్రకారము దేశకాల
పాత్రంబులను దెలిసి సతీపతులు యొకరియుద్దేశము లొకరు తెలియుచు గలియు
దురుగాత.

ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
సురతాధికారో నామ
దశమః పరిచ్ఛేదః

కన్యావిశృంభణాధికారః

ఏకాదశః పరిచ్ఛేదః

కన్యావర లక్షణము

శ్లో.

త్రిగణమవికలార్థం సాధయన్సాధు లోకః
                        పరిణయతు సవర్ణాం శాస్త్రతో౽నన్యపూర్వామ్।
పరిణయసహవాసక్రీడితాదీని మైత్రీ
                        మధమసమధకాభ్యాం నైన కుర్వన్తి సన్తః॥


ఆ.

సంతతార్థధర్మసౌఖ్యాభిమతసిద్ధి
కరము పెండ్లిగాన ఘనుఁడు దెలిసి
తనకులంబుదాని మును వివాహముగాని
కన్య పరిణయంబు గాఁగవలయు.


తా.

ఎడతెగని ధర్మార్థకామసౌఖ్యమతసిద్ధికొరకు పురుషుడు తనకుల
మున బుట్టినదానిగా మునుపు వివాహము కానిదానినిగా జూచి యట్టికన్యను పెండ్లి
చేసుకొనవలయును.

సత్కన్యాలక్షణము

శ్లో.

కువలయదళకాన్తిస్స్వర్ణగౌరద్యుతిర్వా
                        కరచరణనఖేషు స్నిగ్ధరక్తా తతా౽క్ష్ణోః।
సమమృదుపదయుగ్మా స్వల్పభుక్స్వల్పనిద్రా
                        కమలకలశచక్రాద్యంకితా పాణిపాదే॥


సీ.

హేమవర్ణం బైన నిందిరాద్యుతి యైనఁ
                 గుందనకాంతిఁ యందంద మైనఁ

జరణంబులును హస్తజలజంబులును గోళ్ళు
                 కనుఁగొన లరుణిమఁ గలిగియున్న
సరసంబు మృదువునై చక్రాబ్జకలశాంకి
                 తములైన కరపాదతలయుగములు
సమము బింకెములైన చనుదోయి నల్లనై
                 కడ లొక్కకొలఁదైన కచభరంబు


గీ.

భోజనము నిద్రయును గొంచెమును మొగమ్ము
నుదరమును జాలపలుచనౌ మృదులతనువు
నధికశీలంబుఁ గలకన్య నర్హగాఁగఁ
జాటి చెప్పిరి పరిణయశాస్త్రవిదులు.


తా.

శరీరము బంగారుచాయ శ్యామలవర్ణము కుందనపుకాంతిని పోలి
యున్నదనియు, తామరను బోలినపాదములును, చేతులును గోళ్ళును కనుగొనలును
యెఱుపు గలిగినదియు, మృదువులై శంఖుచక్రాదిరేఖలుగల చేతులు పాదములు
గలిగియుండినదియు, చనుమొనలు నల్లగా యుండి సమమును బింకెమునుగల చన్ను
లు గలదియు, ఎక్కువజుట్టును, భోజనమును నిద్రయు కొంచెముగా గలదియు,
పలుచనగు మొగమును కడుపును, మెత్తనిదేహమును, ఎక్కువయాచారముగల
దియు, ఈగుణములు గల కన్యను వివాహమాడవలయునని పరిణయశాస్త్రవేత్తలు
పలికియుండిరి.

దుష్కన్యాలక్షణములు

శ్లో.

అకపిలకచపాశా చాప్రలంబోదరస్యా
                        వరణవిధిషు కన్యా శప్యతే శీలసారా।
బహిరథ రుదతీ యా జృంభతే యా చ సుప్తా
                        వరణవిధిసమేతస్తాం బుధా వర్జయన్తి॥


క.

వాకిట నిలిచిన నేడ్చినఁ
గాకాడిన నిదుర చాలఁ గలిగిన పలుకుల్
గైకొనక యావులించిన
నాకన్నియ వర్జనీయ యనిరి మునీంద్రుల్.

తా.

ఎల్లప్పుడును వాకిట నిలుచుటయు, యేడ్చుటయు, కోపము గలిగి
యుండుటయు, నిదుర గలిగియుండుటయు, చెప్పుమాటలను వినక ఆవులించుటయు
నీగుణములుగల కన్నియ పెండ్లి చేసుకొన తగదని మునీంద్రులు చెప్పిరి.


శ్లో.

గిరితరుతటినీనాం నామభిః పక్షిణాం వా
                        సమధికపరిహీనా వ్యానతక్రూరగాత్రీ।
అధరమధికలంబం కోటరం పింగళం వా
                        నయనమథ పహన్తీ కర్కశం పాణిపాదమ్॥


సీ.

పర్వతతరునదిపక్షినామంబుల
                 నేకన్యఁ బిలుతు రయ్యింటివారు
పొడవు కొంచెము దళంబును నల్పమును గాఁగఁ
                 దనరు నేకన్య వక్త్రమును దొడలు
పెదవియు నధికంబు పింగళమై గుంట
                 కన్నులు గలిగి యేకన్య మెలఁగు
కరతలంబులు పాదకమలంబులును గడు
                 కఠినంబు లగుచు నేకన్య యొప్పు


గీ.

నిదురఁబోవుచు నవ్వెడి నిడుదయూర్పుఁ
బుచ్చు నేడ్చెడి నేకన్య భుక్తివేళ
మీసములు గల్గి చనుదోయిమీఁద రోమ
ములును గల్గిన కన్నియఁ దలఁపవలదు.


తా.

కొండయు చెట్టును నదియు పక్షియు వీటిపేరులును, కొంచెము
పొడవగుమొగమును, కొంచము మందముగల తొడలును, పెద్దపెదవియు, గోరో
జనమువంటి వర్ణము గలిగిన గుంటకన్నులును, కఠినములయిన కాళ్ళుచేతులును,
నిదురబోవుచు నేడ్చునదియు, భోజనసమయమందు నిట్టూర్పల విడుచుచు నేడ్చె
డిదియు, మీసములు గలిగినదియు, చన్నులపై వెండ్రుకలును గలిగిన కన్యల వివా
హమునకు దగనివారు.


శ్లో.

శ్వసితి హసతి రోదిత్యేవ యా భోజనేసి
                        స్తనమపి పతితోర్థ్వం బిభ్రతీ శ్మశ్రులా వా।

విషమకుచయుగా వా వామనా శూర్పకర్ణీ
                        కుదళనపరుషోక్తిర్దీర్ఘవక్త్రా౽తిదీర్ఘా॥


ఉ.

చన్ను లొకింతగాక పరుసంబులఁ బల్కుచుఁ గర్ణయుగ్మమే
చెన్నును లేక రోమములఁ జెందినపిక్కలు చేతులు న్గడు
న్సన్నపురూపు దీర్ఘవదనంబును గందినపండ్లు గల్గు నా
కన్నియఁ బెండ్లియాడఁ గొఱగాదని పల్కిరి శాస్త్రకోవిదుల్.


తా.

కొద్దిపాటిచన్నులుగాక, నిష్ఠురములను పలుకుచు, చెవులు అంద
ముగా నుండక, పిక్కలయందును చేతులయందును వెండ్రుకలు గలిగి, శరీరము
సన్నమై, ముఖము పొడుగుగాను, నలుపురంగుగల పండ్లును, కలిగిన కన్నెను
వివాహమాడ తగదని శాస్త్రవేత్త లెఱింగించిరి.


శ్లో.

విటవిషయరతా వా రోమశా పాణిపార్శ్వే
                        స్తనపరిసరపృష్ఠే జంఘయోరుత్తరోష్ఠే।
భ్రమణవిధిషు యస్యాః కంపతే క్ష్మాతలం వా
                        పతతి హసనకాలే గండయోర్వా తరంగః॥


శ్లో.

భవతి సమధికా చేత్పాదజాంగుష్ఠతో౽స్యా
                        స్తుపవసతిరన్యా హీయతే మధ్యమా వా।
పతతి భువి కనిష్ఠా౽నామికా వా ద్వయం వా
                        న యది వరణకృతే కన్యకా వర్జనీయా॥


క.

 ఏకన్నె విటవిదూషక
లోకమునకుఁ బ్రీతిఁజేయు లోలుపమతియై
యేకన్నె నడువ నధిక
క్ష్మాకంపము నొందు దాన మానఁగవలయున్.


తా.

విటవిదూషకలోకమునకు బ్రీతిచేయటయం దాసక్తిగలదియు,
నడుచునప్పుడు భూమి యధికముగా చప్పుడగునట్టియు కన్నెను వివాహమాడకూడదు.


క.

కాలి పెనువ్రేలుచేరువ
వ్రే లధికంబైన నడిమివ్రేలు కృశంబై

వ్రాలిన నవ్వలివ్రేళ్ళును
వ్రాలక యిల మోపకున్న వనితను విడుమీ.


తా.

పాదముయొక్క పెద్దవ్రేలుకన్న ప్రక్కనున్నవ్రేలు పొడుగుగా
నున్నను మధ్యవ్రేలు సన్నముగా నుండి వ్రాలియున్నను చివరరెండువ్రేళ్ళును క్రిం
దికి వ్రాలియుండక భూమిమీద మోపకున్నను యట్టికన్నెను వివాహమాడంజనదు.


క.

చెక్కులు నవ్వినవేళల
స్రుక్కుచు నిరవైన నుదుట సుడియున్ను బై
వెక్కసమైనను వట్రువ
ముక్కైనను గన్నెమీఁది మోహం బేలా.


తా.

నవ్వుచున్నసమయమున చెక్కిళ్ళు లోనికి లాగుకొనియున్నను
ముఖమునందు సుడి యున్నను గుండ్రమయిన ముక్కు గలిగినను యట్టికన్నెపై
మోహమును విడువవలయును.

వివాహానంతరము

శ్లో.

అథపరిణయరాత్రౌ ప్రక్రమేన్నైన కించిత్
తిసృషు హి రజనీషు స్తబ్ధతా తాం దునోతి।
త్రిదినమిహ న భిన్ద్యాద్బ్రహ్మచర్యం నచాస్యా
హృదయమననురుధ్య స్వేచ్ఛయా నర్మకుర్యాత్॥


చ.

సురుచిరకన్యకామణిని శోభనలక్షణఁ బెండ్లియాడి యా
పరిణయరాత్రియందుఁ బయిబా టొకయించుక లేక మూఁడువా
సరములదాఁక సంగమవిసర్జనుఁడై సురతేచ్ఛ లేక య
వ్వరుఁడు చతుర్థరాత్రి తగువాంఛితకేళికి నాసఁ జెందుచున్.


తా.

మంచిలక్షణములుగల కన్నియను జూచి పెండ్లి చేసుకొని యారాతిరి
నుండు మూడురాత్రులవరకు దానితో రతి చేయస నాలుగవరాత్రియందు సంభో
గము చేయ నిచ్చగింపజనును.


శ్లో.

కుసుమమృదుశరీరా విద్విషన్తి ప్రయోగా
                        ననధిగతరహస్యైర్యోషితో యుజ్యమానాః।

ప్రథమమిహ సఖీభిః ప్రేమ యుమంజీత తస్యా
                        స్తదధిక మిహ కుర్యాత్ప్రశ్రయం యేన ధత్తే॥


చ.

తరుణులు పుష్పకోమలులు తత్తఱపాటున నేమి చేసినన్
విరసము పుట్టుఁ గావు వివేకమునం బురుషుండు తత్సమో
పరిచితభంగి రాగరసబంధురుఁడై యెట నేపరియోజనం
బు రమణి కిష్టమౌ నదె యపూర్వముగా నొడఁబాటుఁ జేయుచున్.


తా.

స్త్రీలు మిక్కిలి సుకుమారులు కావున పురుషుడు తొందరపడి
యేమి చేసినను వారు నిరసించుదురు. అందువలన పురుషుడు యెక్కువపరిచ
యము చేసుకొని యనురాగము గలవాడై స్త్రీల కభీష్టప్రయోజనములను జేయుచు
లాలింపవలయును.


శ్లో.

ప్రథమపరిగతాయాం బాలికాయాం చ చేష్టాం
                        తమసి రహసి చాహుః సంస్తుతాయాం తరుణ్యామ్।
క్షణమిహ పరిరంభం పూర్వకాయేన కుర్యాద
                        ముఖమభివదనేన స్వేన తాంబూలదానమ్॥


శా.

ఏకాంతంబునఁ జీఁకటైన నిశియం దిందీవరాక్షి న్సులో
లాకాంత న్దగబుజ్జగించి చతురాలాపమ్ము న్మెల్లఁగాఁ
గైకోనొక్కుచుఁ బూర్వకాయమునఁ జక్క న్గౌఁగిట న్జేర్చి యా
మూకత్వం బెడలించి వక్త్రగతతాంబూలంబునం బంచుచున్.


తా.

రహస్యస్థలమున చీకటిగానున్న రాత్రియందు స్త్రీని మంచిమాటలచే
బుజ్జగించుచు మాటలనేర్పుచే నంగీకారము బడయుచు కౌఁగలించి జంకును
బోగొట్టి నోటియందుగల తమ్మను పురుషుడు పంచియిచ్చుచు మెలంగవలెను.


శ్లో.

ప్రణయశపథసామవ్యాహృతైః పాదతై
                        స్తదనువయవిధానైర్గ్రాహయేచ్ఛ ప్రతీపామ్।
విశదమృదు విదధ్యాచ్చుంబనం తత్ప్రసంగా
                        త్కలమృదుభిరధైనాం యోజయేత్కేళివాదైః॥


శ్లో.

అవిదిత ఇవ పృచ్ఛేత్కించిదల్పాక్షరార్థం
                        ప్రతిగిరమవదన్తీం భూయ ఏవానురుధ్య।

అహమభిరుచితస్తే తన్వి నో వేతి పృష్టా
                        ప్రతివచనపదే సా మూర్ధ్ని కంపం చ కుర్యాత్॥


శ్లో.

ప్రణయముపగతా చేన్మన్దమన్దం వయస్యాం
                        ప్రతి కథితరహస్యా స్మేరనమ్రాననా స్యాత్।
కథితమిదమిదం తే ధీరసౌభాగ్యమిత్యా
                        ద్రుతమపి చ వయస్యా చాభిదధ్యాత్ ప్రియస్య॥


శ్లో.

ప్రకటవచసి సఖ్యాం నాహమేవం వదామీ
                        త్యవిశతపదవర్ణార్థోక్తిలీలాం విదధ్యాత్।
ప్రణయవికసనే చ ప్రార్థితా పూగపుష్పా
                        ద్యుపనయతి సమీపే స్థాపయేచ్చోత్తరీయే॥


శ్లో.

స్తనముకుళమథాస్యాః సంస్పృతశేత్పాణిజాగ్రైః
                        కరతలముపగూహ్యా౽౽నాభి నీత్వా వికర్షేత్।
తదథ యది నిరున్ధ్యాత్ సంసృజే త్యేవముకత్వా
                        సుముఖి న కరవాణి క్లిశ్యసి త్వం యదీతి॥


సీ.

పలుకకయున్న నాపైఁ గోపమా యని
                 బుజ్జగించుచుఁ జెక్కుఁ బుణికి బుణికి
యధరపానం బించుకైన నిమ్మని యొట్టుఁ
                 బెట్టుచు దండముఁ బెట్టి పెట్టి
యెఱుఁగరా దీమాట యింతని చెవిలోనఁ
                 జెలువైన ప్రియములఁ జెప్పి చెప్పి
మదనకేళికి నర్మమర్మగర్భంబుల
                 ననునయాలాపంబు లాడి యాడి


గీ.

వాద మేటికి నే లెస్సవాఁడ నాకుఁ
దగుదు వీవని శిరమును దడవి తడవి
కొన్నిపలుకులఁ జొక్కించి కన్నుసన్న
లెఱిఁగి చుంబింపఁ గన్నియ కింపు పుట్టు.


తా.

పురుషుడు స్త్రీ పలుకకుండిన నాపై కోపమా యని మంచిమాటలచే
బుజ్జగించి చెక్కుల బుణుకుచు, పెదవిపాన మిమ్మని యెట్టుబెట్టుచు, నమస్కరిం

చుచు రహస్యము చెప్పెదనని ప్రియమగుమాటలను చెవిలోన చెప్పుచు, రతికొఱకు
నర్మోక్తులగు సరసము లాడుచు మనయిద్దరికి వాద మెందులకు నాకు నీవు తగుదువు
నీకు నేను తగుదు ననుచు యాపెతలను దగ్గరకు జేర్చుకొని మాటలచే నాపె పరవశ
మగునటు లొనరించి యాపె యంగీకారమును గ్రహించి ముద్దాడినయెడల నాకన్ని
యకు ప్రియము కలుగును.


శ్లో.

ఇతిమృదుపరిపాట్యోత్సంగమానీయ యుంజ
                        న్నధికమధికమేవం యేచ్చ క్రమేణ।
నఖదశనపదైస్త్వామంకయిష్యామి వామే
                        నిజవపుషి వికారం కిం చ కృత్యాత్మనైవ॥


చ.

ప్రియ ముదయింప బాలిక యభీష్టముగా నొకమారు మెల్లఁగాఁ
బ్రియునిమొగంబుఁ జూచి యధరీకృతవక్త్రముతోడ నున్న క
న్నియ తగునంచు దంతహతి నించిన మోవి తొలంగనాడి త
న్నయనముఁ జూచి సిగ్గువడి తా నిటు లాడితినంచు నిట్రిలున్.


తా.

ఈవిధముగా యింపు పుట్ట నాకన్నియ పురుషునిమొగ మొకసారి
చూచి తలవంచియుండ నాపె తగినదని యెంచి యాపె మోవి నొక్కిన యాపె
కసరును. అందుల కాత డూరకయున్న తా నొనర్చినపనికి యాస్త్రీయే నొచ్చుకొనును.


శ్లో.

త్వదుపజనితమిత్యావేద్య సంప్రత్యహం త్వాం
                        సుముఖి సఖిసమాజే వ్రీడయిష్యామి భూయః।
ప్రతివపురథ చుంబేదూరసంవాహలీలాం
                        క్రమశిథిలితలజ్జాం సంప్రయేన్మేఖలాం చ॥


ఉ.

ప్రేమ నటింప వీడియము బెట్టుచుఁ బూవులదండ లంచు న
బ్భామిని పాన్పుఁ జేరునెడఁ బయ్యెదఁ బట్టి కుచంబు లంటి యా
సీమకుఁ జేర్చి దాబిగువుచేరె వదల్చి కరంబుఁ బట్టి నె
మ్మో మలరించి కోర్కె తుదముట్టఁగనిమ్మన గారవింపుచున్.


తా.

ప్రేమతో ప్రవర్తించుచు తాంబూలంబు పంచిచ్చుచు పూలదండ
నిచ్చెదనని యాస్త్రీ పైటకొంగును బట్టి లాగి దగ్గరకు దీసుకొని చన్నుల నంటుకొని
పాన్పుమీదికి లాగి కోకముడి విప్పి చక్కిలిగింతలు వెట్టి నాకోర్కె సఫలము కాని
మ్మని పురుషుడు యాపెను యాదరింపవలెను.

శ్లో.

ఉచితఘటితయత్రో రంజయేచ్చ క్రమేణ
                        ప్రణయవిధివిధూతే సాధ్వసధ్వాన్తరోషే।
ఇతి విషమగభీరే కన్యకానా రహస్యే
                        దిగియమిహ మయోక్తా కామసూత్రార్థదృష్ట్యా॥


ఉ.

బాలిక నీగతిన్ మృదులభాషలఁ దేర్చి నిజాంకపీఠికన్
గీలనఁ జేసి మాఱుపలికింపఁదలంచి నఖంబులన్ భుజా
మూలములందుఁ జన్నులను మోపుదునా యటుగాక వాతెరన్
నాలుగుమూఁడు దంతముల నాటుదునా యని భీతిఁ బెట్టుచున్.


తా.

ఈవిధముగా స్త్రీని పురుషుడు మంచిమాటలచే లాలింపుచు తన
తొడలయందు కూర్చుండబెట్టుకొని యాపె ప్రతివచనములయం దాసక్తిగలవాడై
నీచన్నులయందును చంకలయందును గోళ్ళచే నొక్కుదునా? అటుగాక మోవి
యందు దంతమలచే నొక్కుదునా? యని కొంచెము బెదరించినటుల మాట్లాడగా —


చ.

అని వెఱపించి సిగ్గువడ నాడి ప్రియోక్తులఁ బల్కి మోవిచుం
బన మొనరించి చన్నుఁగవ బట్టి తొడ ల్గదిలుంచి నీవిబం
ధనము వదల్చి మన్మథనిధానముపైఁ జెయి సాఁచి బాలికన్
బెనఁగుట మాన్పి లజ్జ విడిపించి రమించుట శాస్త్రపద్ధతిన్.


తా.

పురుషు డాస్త్రీ నావిధముగా బెదరించి యాపె సిగ్గుపడునటుల
పల్కి మంచిమాటల నాడుచు పెదవి గఱచి చన్నుల బట్టుకొని యాపెతొడలు దగ్గ
రకు జేర్చుకొని కోకముడి విప్పి భగమునకై చేయి చాచి యాపె పెనగులాటను మానిపి
లజ్జ విడునటు లొనర్చి కామశాస్త్రపద్ధతిగా రతి చేయవలయును.


శ్లో.

నాత్యస్తమానులోమ్యేన నచాతిప్రతిలోమతః।
సిద్ధిం గచ్ఛన్తికన్యాసు తస్మాన్మధ్యేన సాధయేత్॥


క.

నీసకియలముందట నీ
చేసినపనులన్ని నేను చెప్పెద మదనా
భ్యాసములఁ జూపి మఱి యటు
గాసిం బెట్టించి పలుచఁగాఁ జేయింతున్.

తా.

నీచెలికత్తెలముందట నీవు నన్ను చేసినపను లన్నియును జెప్పి నిన్ను
వారు చులకనజేయున ట్లొనర్చెదనని కొన్నిరసవంతములగు పలుకులచే నాస్త్రీని
సంపూర్ణముగా లోబరుచుకొనవలెను.


శ్లో.

ఆత్మనః ప్రీతిజననం యోషితా రాగవర్ధనం।
కన్యావిశృంభణం వేత్తి యస్స తాసాం ప్రియోభవేత్॥


ఆ.

అల్పరతము గాక యధికంబు గాక య
బ్బాలహిత మెఱింగి బంధురముగఁ
బొందిరేని సుఖముఁ బుట్టుచు నుబ్బుచు
దినదినాభివృద్ధి తేజరిల్లు.


తా.

అతిగా గాక స్వల్పముగా గాక యాబాలయిష్టము గుర్తించి యొప్పిద
ముగ రతుల నొనర్చినయెడల ప్రతిదినమును సుఖించుచు ప్రేమ వృద్ధి పొందించు
కొనుచు ప్రకాసించెదరు.


శ్లో.

సహసా వాప్యుపక్రాంతా కన్యాచిత్తమవిందతా।
భయం త్రాసం సముద్వేగం సద్యో ద్వేషం చ గచ్ఛతి॥


శ్లో.

సా ప్రీతియోగమప్రాప్య తేనోద్వేగేన దూషితా।
పురుషద్వేషిణీ వా స్యాద్వద్విష్టా వా తతో౽న్యగా॥


ఉ.

ఈగతి బాలల న్గవయ కెంతయు నాయకుఁ డిష్టకేళికిన్
వేగముఁ జూపెనేని సతి విహ్వలభావము భీతియు న్సము
ద్వేగము రోషము న్పొడము నప్రియ మాత్మ జనించుఁ గానఁ గా
మాగతవేదు లీరతిరహస్యము చిత్తములందు నిల్పుఁడీ.


తా.

పైన చెప్పియుండినప్రకారము పురుషుడు ప్రవర్తింపక తనయొక్క
సుఖముకొరకు స్త్రీని రతికి తొందఱజేసి యెత్తుడు కలుగజేసినయెడల నాస్త్రీ చం
చలహృదయయై భయము పొంది పారిపోవుటయు మనస్సునందు రోషము చెంది
ప్రేమలేకయుండుటయు సంభవించును కావున కామము దీర్చుకొనదలచినవారు
ఈరతిరహస్యమును మనస్సునం దుంచుకొందురుగాత.

ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
కన్యావిశ్రంభణం నామ
ఏకాదశః పరిచ్ఛేదః

భార్యాధికారః

ద్వాదశః పరిచ్ఛేదః

పతివ్రత లక్షణము

శ్లో.

యువతిరపి విహాయ ప్రాతికూల్యం స్వనాథం
                        వచనహృదయకాయైః పూజయేదిష్టదైవమ్।
గృహవసతిమథాసౌ చింతయేద్భర్తృవాచా
                        ప్రతిదినమతిమృష్టం వేశ్మ కుర్యాత్సుశోభమ్॥


శ్లో.

గురుషు సఖిషు భృత్యే భంధువర్గేచ భర్తు
                        ర్వ్యపగదమదమాయా వర్తయేత్ స్వం యథార్హమ్।
సితపరిమితవేషం కేళీవిహారహేతోః
                        ప్రచురమరుణమాహుః ప్రేయసో రంజనాయః॥


సీ.

 వనరుహానన మనోవాక్కాయములచేత
                 ధవుని దైవముగాఁగఁ దలపవలయుఁ
బ్రత్యుత్తరం బీక పని యేమి చెప్పినఁ
                 జెవిఁ జేర్చి వేగంబె చేయవలయుఁ
నత్తమామలతోడ నాప్తభృత్యులయెడ
                 మాయాప్రచారంబు మానవలయుఁ
బ్రతివాసరంబు శోభనసిద్ధికై నిల
                 యంబు గోమయమున నలుకవలయు


గీ.

నెపుడు తనుఁ జూచునో విభుఁ డిందు వచ్చి
యనుచు నిర్మలమైన దేహంబు దనర
పెనిమిటికి నిష్టమైన భోజనపదార్థ
చయము కడుభక్తితోఁ దాను సలుపవలయు.

తా.

స్త్రీ తనభర్తను మనస్సునందును మాటలచేతను దైవముగ తలంపవల
యును. భర్తయే పని చెప్పినను మారాడక విన్నదై యాకార్యమును శీఘ్రముగా
జేయవలయును. అత్తమామలతోడను యిష్టులయిన పనివాండ్లయందును కపటము
లేక యుండవలయును. ప్రతిదినమును శుభముకొఱకు ఆవుపేడచే ని ల్లలుకవల
యును. భర్త వచ్చి త న్నెప్పుడు చూచునోయని పరిశుభ్రమగుశరీరముతో యుండ
వలయును. భర్త కిష్టమైన భోజనపదార్థములను భక్తితో వండిపెట్టవలయును.


శ్లో.

మరువక, నవమాలీ, మాలతీ, కున్ద, మల్లీ
                        తరుణసదృశపుష్పా వీరుధః సౌరభాడ్యాః।
సుమధురఫలవృక్షా మూలకాలాబుభాండ
                        ప్రభృతివిటపకాదీనర్పయేద్వాటికాయామ్॥


శ్లో.

సకృదపి కులటాభిర్యోగినీభిక్షుకాభి
                        ర్నటవిటఘటితాభిః సంసృజేన్మౌళికాభిః।
రుచిరమిదమముష్మై పథ్యమేతన్నవేతి
                        ప్రతిదినమపి భర్తుర్భోజనేచ్ఛాం విదధ్యాత్॥


శా.

పూవుందోఁటల వృక్షవాటికలలో బొంపార భాండావళుల్
గావింపన్వలయున్ విదూషకనటక్రాంతాంగనాభిక్షుకన్
దైవజ్ఞన్ వ్యభిచారిణిన్ వివిధమంత్రప్రక్రియాయోగినీ
భావంగూడుట భాషణంబును నసద్భావ్యంబు భూమీస్థలిన్.


తా.

వాసనగల పువ్వులనీయుపొదలను మంచిఫలములనీయు వృక్షములను
కూరగాయలనిచ్చు పాదులను దొడ్డియందు పెంచవలయును. విటవిదూషకసహ
వాసము జేయుకాంతను భిక్ష మెత్తుకొని జీవించుదానిని జోస్యము జెప్పుదానిని వ్యభి
చరించుదానిని మంత్రతంత్య్రములు నేర్చిన యోగిని మొదలగు స్త్రీల యొక్క సహ
వాసము చేయుటయు తుదకు మాటలాడుటయు పతివ్రతయగు స్త్రీ యొనర్పజనదు.


శ్లో.

వచనమపి నిశమ్యాగచ్ఛతో వేశ్మమధ్యే
                        తదుపకరణసజ్జా సంవసేదాగతస్య।
చరణయుగళమస్య క్షాలయేదాత్మనా౽సౌ
                        రహసి చ పరిబోధ్యో విత్తనాశే ప్రసక్తాః॥


శ్లో.

అనుమతిముపలభ్యాధిష్ఠితాన్యత్ర యాయా
                        చ్చయనమనువిదధ్యాద్భర్తురుత్థా నమగ్రే।

శయనమపి న ముంచేన్నాస్య మన్ద్రం విభిన్ద్యాత్
                        వ్రతనియమవిధానవం స్వేన చాస్యానుగచ్ఛేత్॥


సీ.

విభుఁడు వచ్చినరాఁక విని వేగ మెదురుగా
                 నింటివాకిటికిఁ దా నేగవలయు
పతి తెచ్చినట్టి దేపాటి సంగ్రహమైన
                 నది లోనికి న్గొంచు నడువవలయుఁ
గాంతునిచరణము ల్గడిగి పీఠముఁ బెట్టి
                 యనుమతి గృహకృత్య మందవలయు
నతిరహస్యములైన యాయవ్యయంబులఁ
                 దెలియంగఁ బతికి బోధింపవలయుఁ


గీ.

బురుషు ననుమతిలేకయే పుట్టినింటి
కొక్కత యరుగుటయును దా నుడుగవలయు
వ్రతములును దానములును దైవములపూజ
లధిపునానతిఁ బొంది చేయంగవలయు.


తా.

పెనిమిటిరాకను విని వేగముగా నింటివాకిటివరకు వెళ్లుటయు, భర్త
తెచ్చినపదార్ధము లెంతకొద్దివైనను యవి యందుకొని లోనికి వెళ్ళుటయు, భర్త
పాదములను గడిగి కూర్చుండుటకు పీఠముంచి యతిని సమ్మతిని బొంది యింటిపను
లను చేసుకొనుటయు, గోప్యముగా నుంచతగిన ఆదాయములను వ్యయములను భర్తకు
తెలియజెప్పుట, పెనిమిటియాజ్ఞను పొందక పుట్టినింటికి ఒక్కతెయు పోకుం
డుటయు, వ్రతములును దానములును దేవపూజలును భర్తననుజ్ఞ పొందనిదే చేయక
యుండుటయు, మొదలగు నీ సద్గుణములను గలిగి పతివ్రత ప్రవర్తింపవలెను.


శ్లో.

క్వచిదపి నిభృతే వా ద్వారి వా నైవతిష్ఠే
                        చ్చిరమథ గిరమస్మిన్విప్రియాం న ప్రయచ్ఛేత్।
న విరళజనదేశే మన్త్రయేన్నిష్కుటే వా
                        న పురుషమథ పశ్యాన్మన్త్రహేతుం వినా చః॥


శ్లో.

సుఘటితబహుభాండం కాష్ఠమృచ్చర్మలోహైః
                        సమయమభిసమాక్ష్య ప్రాదదీతాల్పమూల్యాన్।

నిభృతమసులభానవి స్థాపయేద్భేషజాని
                        వ్యయమవహితచిత్తా చిన్తితాయాం చ కుర్యాత్॥


శ్లో.

తృణతుషకణకాష్ఠాంగారభస్మోపయోగం
                        పరిజనవినియోగం కర్మణః ప్రత్యవేక్షామ్।
ప్రియతమపరిభుక్తత్యక్తవస్త్రాదిరక్షాం
                        శుచిభిరవసరే తైర్మాననం భృత్యవర్గే॥(పాఠాంతరము)


క.

ఆయంబు కొలఁది దెలియక
సేయంగావలదు వ్యయము సీమంతినికిన్
సేయంగవలయునేనియు
నాయర్థమునందుఁ బాద మైనను నొప్పున్.


తా.

పురుషునియొక్క యాదాయము తెలియక వ్యయ మొనర్పగూడదు.
వ్యయము సేయవలసివచ్చినయెడల పురుషునియాదాయములో నాలుగింటనొకపాలు
వ్యయము సేయుట పతివ్రతకు దగును.


మ.

కసవు న్గట్టెలు నూకలు న్నుముక యంగారంపుభస్మమ్మునున్
మసలంబాయక చేర్చి దాసులకు గర్తవ్యాప్తి పాలించి దు
ర్వ్యసనంబు న్జనఁజేసి భర్త విడువన్ వస్త్రాదిసంరక్షయై
వెస భామామణి యున్న నందమవు సద్భృత్యావళిన్ శుద్ధియై.


తా.

కసువు, కట్టెలు, ఊకలు, ఉముక, బొగ్గుపొడి యివి పారవేయక
భద్రపరుచుటయు, భృత్యులకు పనిపాటలు చెప్పి తగినట్టు పరిపాలన చేయుటయు,
పురుషుడు కట్టివిడిచినబట్టలు సంరక్షించుటయు మొదలగు సద్గుణములు గలిగి బతి
వ్రత ప్రవర్తింపవలయును.


శ్లో.

పరిజనపరిరక్షాం వాహచింతాం పశూనాం
                        కపిపికశుకశారీసారసాదేర వేక్షామ్।
గురుషు పరవశత్వం తేషు వాచం యమత్వం
                        స్ఫుటహసితనివృత్తిం శీలవృత్తిం చ కుర్యాత్॥


శ్లో.

ప్రణయసహచరీభిస్తుల్యరూపాం సపత్నీం
                        .........................................................।

గతపతి దయితే తు క్వాపి మాంగల్యమాత్రా
                        ణ్యుపచితగురువిప్రా ధారయేన్మండనాని॥


సీ.

పరిజన వాహక పశు పిక శారికా
                 సార సంరక్షణ సలుపవలయు
గురుజనంబులయెడఁ బరమభక్తి వహించి
                 చెప్పునూడిగమును జేయవలయు
సవతిపట్టున మహాసౌజన్యయై కూర్మి
                 సోదరిమాఱుగాఁ జూడవలయు
సవతిబిడ్డలఁ గాంచి సంతసిల్లుచు మదిఁ
                 దనదుబిడ్డలవలెఁ దలఁపవలయు


గీ.

మగఁడు పరదేశ మరిగిన మంగళంపు
సూత్రమే కాని శృంగారమాత్ర ముడిగి
యత్తమామలచేరువయందుఁ బాన్పు
నందు శయనింపవలయుఁ గులాంగనకును.


తా.

తనయింటియం దుండు పశుపక్షివాహనాదులను సంరక్షణమున శ్రద్ధతో
విచారించుటయు, అత్తమామలయందు భక్తితో సంచరించుచు వారు కోరినశుశ్రూష
లొనర్చుటయు, సవతియెడల నతిస్నేహ ముంచి తోబుట్టువువలె చూచుటయు,
సవతిబిడ్డలను ప్రేమతో జూచి తనబిడ్డలవలె ప్రేమించుటయు, భర్తకార్యార్థి
యై యూరు విడిచి వెళ్ళిన మంగళసూత్రము మాత్ర ముంచుకొని మిగిలినయలంకారము
లను విడిచి రాత్రులం దత్తమామల కెదురుగా పండుకొనుటయు, పతివ్రతయగుస్త్రీ
చేయందగును.


శ్లో.

ఉపగురు శయనం చ స్వల్పతాం చ వయస్య
                        ప్రతిదినమపి కుర్యాదస్య వార్తానుసారమ్।
అనవసితవిధానేప్యస్య నిర్వాహయత్నం
                        వ్రతనియమవిధిం చ క్షేమసిద్ధ్యై విదధ్యాత్॥


శ్లో.

స్వజనగృహము పేయాత్ ప్రక్రమే సద్వితీయా
                        న చిరమిహ వసేచ్చ ప్రేయసి త్వాగతే సా।

అవికృతవపుషం స్వం దర్శయేదుత్సవాదౌ
                        ప్రథమమపి విదధ్యాదాహ రేచ్చోపహారమ్॥


ఆ.

పుట్టినింట నున్న ప్రొద్దులఁ బ్రియురాక
వినినయపుడు తొంటివేష ముడిగి
సఖులు దాను నెదురు చనుదెంచి నీరాజ
నంబుఁ జేయ నుత్సవంబు దనరు.


తా.

పతివ్రతయగు స్త్రీ పుట్టినింటనున్న సమయమందు పెనిమిటి రాకను
వినినతోడనే యలంకరించుకొని చెలికత్తెలతో నెదురేగి హారతినీయ శుభము
గలుగును


క.

పరదేశమునకు నాథుం
డరిగిన తత్క్షేమవార్ లరయుచు నాయా
వెరవున వ్రతములు దైవత
పరిచర్యలఁ జేయవలయుఁ బతిమేల్కొఱకున్.


తా.

భర్త పరదేశములకు బోయినప్పుడు అతని క్షేమవార్తలను దెలిసికొ
నుచు యతడు క్షేమముగానుండుటకు వ్రతములు మొదలగు దేవతాపరిచర్యలను
జేయుచు పతివ్రత ప్రవర్తింపవలెను.


శ్లో.

యది బహుయువతిః స్యాత్పూరుషః సామ్యవృత్తి
                        ర్నిపుణమతిరుపేయాన్న క్షమేతాపరాధమ్।
వపుషి వికృతిమేకాం సంప్రయోగే రహస్యం
                        వహతి వదతి యచ్ఛ ప్రేమరోషేణ కించిత్॥


శ్లో.

కథమపి చ దతన్యాం శ్రావయేన్నో కదాచి
                        త్ప్రసరమపి సపత్నీగోచరే క్వాపి దద్యాత్।
యది నిగదతి దోషం కా చిదేకా పరస్యా
                        రహసి చ నిపుణో క్తైర్ధూషణై సైవ యోజ్యా।
ప్రమదవనవిహార ప్రేమసమ్మానదానై
                        ర్హృదయమిహ యథార్హం రంజయేద్వల్లభానామ్॥


సీ.

పెనిమిటి పెక్కండ్ర వనితలఁ గైకొన్న
                 సమమైన వర్తన సలుపవలయు

రమణుఁ డేగతి నపరాధంబుఁ జేసిన
                 యె గ్గొనర్పక క్షమియింపవలయు
నేకాంతమునఁ బ్రియుఁ డిచ్చగించినఁ దన
                 సురతనైపుణ్యంబుఁ జూపవలయు
సఖునితో నొనఁగూడు సవతి గోచరమైన
                 కోపంబు మాని కైకొనఁగవలయు


గీ.

నెట్టినిందలు సతులపైఁ బుట్టెనేని
యోర్చి పలుమాఱు నుడువక యుండవలయు
వనవిహారంబులను మనోవాంఛితార్థ
దానములఁ బ్రియు ననిశంబుఁ దన్పవలయు.


తా.

పెనిమిటి చాలమందిస్త్రీలతో సాంగత్యము చేయుచున్నను సహించి
యుండుటయు, భర్త యేవిధమగు నపరాధము చేసినను తప్పెంచక యోర్పుగలిగి
యుండుటయు, వల్లభుడు రహస్యముగోరినయెడ తనరతి నేర్పును చూపుటయు,
భర్తతో కలియు సవతి కనుపించిన కోపము నొందక తనతో సమానముగా చూచు
టయు, యేస్త్రీలపైనయినను నిందకలిగినయెడల నానిందను తాను మాటిమాటికిని
యెంచకయుంటయు, వనవిహారములయందును యతనిమనస్సునం దిచ్చగించు పదా
ర్థచయము నిచ్చుటవల్లను భర్త నెప్పుడును సంతోషపెట్టుటయు మొదలగు గుణము
లను గలిగి పతివ్రత ప్రవర్తింపజనును.

ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
భార్యాధికారో నామ
ద్వాదశః పరిచ్ఛేదః.

పారదారికాధికరణమ్‌

త్రయోదశః పరిచ్ఛేదః

పరస్త్రీసంగమనిషేధానిషేధముల లక్షణము

శ్లో.

భార్యాధికారికమిదం గదితం సమాసా
                        ద్వక్ష్యామి సంప్రతి పరప్రమదాభియోగమ్।
ఆయుర్యశోరిపురధర్మసుహృత్ స చాయం
                        కార్యో దశావిషయహేతువశాన్న కామాత్॥


క.

పాపములనెలవుఁ బుణ్యయ
శోపాయము విభవహాని యాయుష్యహర
వ్యాపారము నాశము పర
చాపలనేత్రల రతంబు చన దెవ్వరికిన్.


తా.

పరస్త్రీగమనమువలన పాపమును, పుణ్యనాశనమును, కీర్తి నశించు
టయు, అనాచారము సంభవించుటయు, ప్రాణాపాయము సంభవించుటయు,
ఉద్యోగనాశనమును, మొదలగు కష్టములు ప్రాప్తించును. కాన పరస్త్రీగమనమును
విసర్జించినచో పురుషుడు సుఖమునొందును.


క.

ఐనను గామాతురతన్
హానియగున్ బ్రాణములకు నని మును దివిజుల్
మానక ప్రార్థనములకున్
గానిమ్మని రట్టితెరువుఁ గామాసక్తుల్.


తా.

పరస్త్రీగమనమువలన నత్యంతమైనపాపము సంభవించినను కోరిన
స్త్రీని రమించనియెడల నది కామాతురత కోర్వక బ్రాణత్యాగము సంభవించిన
బ్రాణహత్యాపాతకము గలుగును కాన స్త్రీ తన్ను ప్రార్థించినయెడల నాస్త్రీ
సంగమము తగునని కామమునందు ప్రీతిగలవా రనిరి.

వ.

కావున నన్యోన్యస్నేహమోహంబులం బొందినఁగాని పరస్త్రీసంగమ
దోషంబు పొరయకుండదని చెప్పెదరు. అన్యోన్యస్నేహవ్యామోహంబు లత్యంతసుఖ
కారణంబులని కామశాస్త్రజ్ఞులు చెప్పెదరు. అట్లగుటకు ముందు ప్రేరణరూపం
బున బుద్ధిని జలింపఁజేయు నవస్థాదశకంబు నెఱింగించెద.

దశావస్థల లక్షణము

శ్లో.

నయనప్రీతిః ప్రథమం చిత్తాసంగస్తతోథ సంకల్పః।
నిద్రాచ్ఛేదస్తనుతా విషయనివృత్తిస్త్రపానాశః॥


శ్లో.

ఉన్మాదో మూర్ఛా మృతిరిత్యేతాః స్మరదశా దశైవ స్యుః।
తా స్వారోహతిమదనే యాయాత్పరయోషితం స్యరక్షాయైః॥


క.

చూచుట తలఁచుట కోరుట
కాచుట కృశ మౌట రుచులు గానమి సిగ్గున్
ద్రోచుట వెఱ్ఱియు మూర్ఛా
ప్రాచుర్యము మరణ మనఁగఁ బదియు నవస్థల్.


తా.

చూచుట, తలంచుట, కోరుట, కాచుట, చిక్కి పోవుట, అరుచి
పుట్టుట, సిగ్గు విడుచుట, చిత్తవిభ్రమము, మూర్ఛనొందుట, ప్రాణము పోవుట, ఈ
పదియు దశావస్థలని తెలియందగినది.


సీ.

ఒంటిమోహమునఁ గన్గొంటిఁ జక్షుఃప్రీతి
                 పలుమాఱు నది తలఁపంగఁ జింత
యుడుగనికోర్కెతో నుండుట సంకల్ప
                 మొగి గుణస్థితి నిద్ర యుడిగియుంట
విరహతాపంబుచే వేఁగి డస్సియునుంట
                 యరుచి యేమిటిమీఁద నాశలేమి
యెన్ని యాడెడివారి నెఱుఁగమి నిర్లజ్జ
                 యున్మాదమున నింటి నొల్లకుంట


గీ.

వలపు దలకెక్కి మది తన వశము గాక
పరవశత్వముచే డీలపడుట మూర్ఛ
పొందు లేకున్నఁ బ్రాణంబు పోవుననుట
మృతియు నయ్యె దశావస్థ లెఱుఁగఁజొప్పు.

తా.

చూచుట యనగా, ఒంటరిగా స్త్రీపురుషులు పరస్పరమోహముచే
కనుగొనుట. తలంచుట యనగా, చూచిన తరువాత యాచూచినవిషయమును మాటి
మాటికి తలంచుట, కోరుట యనగా, స్త్రీపురుషులు పరస్పరమును సాంగత్యము
చేయవలయునని కోరుట. కాచుటయనగా, ఒండొరులు స్వరూపస్వభావము
లను దలంచుకొని నిద్రపోకయుండుట. చిక్కిపోవుట యనగా, విరహతాపాన
లముచే డస్సిపోవుట. అరుచి పుట్టుట యనగా, విరహతాపజ్వరమువలన దేనిమీ
దయు నాశలేకయుండుట. సిగ్గు విడుట యనగా, తమ్ము నిందించువారిని గుర్తె
ఱుంగక యుండుట. చిత్తవిభ్రమ మన, వెఱ్ఱి యెత్తినట్లు యింటియం దుండుట కిష్ట
పడక తిరుగుట, మూర్ఛ యన, ప్రేమ యెక్కువయై మనస్సును పట్టియుంచుట
తమ వశముగాక పరవశత్వమునొంది డీలువడియుండుట. ప్రాణము పోవుట యన,
సంభోగము కలుగకపోవుటవలన స్త్రీపురుషులిరువురును ప్రాణములు వదలుట.
మోహము క్రమముగా నీదశావస్థలకు మూలమగునని దెలియందగినది.


సీ.

మొదటియవస్థను మోహనాకారంబుఁ
                 జూడంగఁ జింతించుచుండుటయును
రెంట వగపు పుట్టు రేయును బవలును
                 మూఁట నిట్టూర్పులు మొనసియుండు
నాలుగింటఁ దలంచి నడిరేయి చింతించు
                 నేనింట జ్వరము నే మెఱుఁగకుండు
నారింట నన్నంబు నరుచియై యుండును
                 సప్తమంబున లజ్జ సరవిఁ జనును


ఆ.

నష్టమమున నాలు కటు తొట్రువడియుండు
తొమ్మిదింట జీవి తొలఁగియుండు
పదిటఁ బ్రాణము చనుఁ బతికైన సతికైన
మరునిచేత నుండు నరులబ్రతుకు.


తా.

చూచుట యను మొదటియవస్థయందు స్త్రీపురుషులిరువురును యొకరి
చక్కదన మొకరు చూడవలెవనుకొందురు. తలంచుట యను రెండవయవస్థయందు
రాత్రింబగళ్లును దుఃఖము కలిగినట్లుండును. కోరుట యను మూడవయవస్థయందు
నిట్టూర్పులు కలుగును. కాచుట యను నాలుగవయవస్థయందు రాత్రులయందు

నిద్రజెందక యొకరినొకరు తలంచుకొందురు. చిక్కిపోవుట యను నైదవయవస్థ
యందు జ్వరము కలిగియుండును. అరుచి పుట్టుటయను నారవయవస్థయందు భోజన
పదార్థములు నోటి కింపుగా నుండవు. సిగ్గువిడచుట యను నేడవయవస్థయందు
క్రమముగా సిగ్గును విడుచును. చిత్తవిభ్రమ మను వెనిమిదవయవస్థయందు పలు
కులు తడబడును. మూర్ఛ యను తొమ్మిదవయవస్థయందు ప్ర్రాణంబులు హీనం
బులై చలించును. మరణ మను పదియవయవస్థయందు చనిపోవుటయు సంభవిం
చును. కావున స్త్రీపురుషులయొక్క బ్రతుకు మన్మథాధీనమయి యుండును.


శ్లో.

పునర్దారాః పునర్విత్తం పునః క్షేత్రం పునః సుతః।
పునః శ్రేయస్కరం కర్మ న శరీరం పునః పునః॥


గీ.

సతియు, ధనమును, క్షేత్రము సంతతియును
మంగళం బగు కర్మలు మఱలమఱలఁ
బోయినను బొందవచ్చును పుడమిఁ దనదు
బొంది వోయిన మఱలఁ దాఁ బొందలేఁడు.


తా.

భార్యా, ధనము, క్షేత్రము, సంతానము, మంగళప్రదమయిన
కర్మములు, ఇవియన్నియు గతించినను మఱలమఱల సంపాదింపవచ్చును కాని
శరీరముమాత్రము సంపాదింపఁజాలము.

కామితానర్హస్త్రీలు

శ్లో.

అసంగృహీతభార్యాం చ బ్రహ్మస్త్రీం యశ్చగచ్ఛతి।
సూతకం సతతం తస్య బ్రహ్మహత్యా దినేదినే॥


క.

భూమీసురసతిఁ గన్నెను
గామింపఁగరాదు మున్ను కామిని తన్నున్
గామించినను సుకృతముల
నీమంబును జెడును లోకనిందయుఁ దనకౌ.


తా.

బ్రాహ్మణుల భార్యలను, అవివాహితస్త్రీలను కాముకులు కామింప
జనదు. వారు తమంతతామే వచ్చినను పురుషులు పుణ్యాపాయమునకు లోకనిం
దకు జంకి వారిని త్యజింపంజనును.


శ్లో.

అద్విజభార్యావిషయః సాపి న దుష్టైవ పంచనరభుక్తా।
శ్రోత్రియసఖిసంబన్ధిక్షితిపతిభార్యా నిషిద్ధైవ॥

శ్లో.

పతితా సఖీ కుమారీ ప్రవ్రజితారోగిణీ ప్రకటా।
ఉన్మత్తా దుర్గన్ధా వృద్ధప్రాయా రహస్యభిత్కపిలా॥


శ్లో.

అతికృష్ణా నిక్షిప్తా కదాచిదేతా న గమ్యాః స్యుః।
విషయే౽గమ్యేపి బుధాః కారణతః పారదారికం ప్రాహుః॥


క.

శ్రోత్రియునిభార్య నృపుసతి
మిత్రునియెలనాగ మామమెలఁతయును గురు
క్షేత్రం బిలఁ బొందఁ దగ ద
పాత్రంబగుఁ దామె వలచి వచ్చిననైనన్.


తా

శిష్టునిభార్యయు, రాజుభార్యయు, స్నేహితునిభార్యయు, మామ
భార్యయు, గురునిభార్యయు, వీరలు కామించి పైబడినను పురుషులు కామ
వశులు కాక వా రపాత్రులని దలంపవలెను.


ఆ.

మత్త పతితుచెలియ మానవిచ్ఛేదిని
కన్య సువ్రతాత్మ కపిలవర్ణ
పూతిగంధ ముసలి బూతురోగముదానిఁ
గాక యన్యసతులఁ గవయవలయు.


తా.

మత్తురాలు, పాషండుని భార్య, మానహీనుఠాలు, ఋతుమతికాని
పడుచు, నీమముగలకాంత, నల్లనిశరీరముగలది, దుర్గంధవతి, వృద్ధస్త్రీ, సుఖ
సంకటములుగలస్త్రీ మొదలగు స్త్రీలను, తమ మేలుకొఱకు కాముకులు పొం
దం జనదు.

పరస్త్రీగమన హేతులఁక్షణము

శ్లో.

మద్వైరిసంగతోస్యాః పతిరియమస్మాన్నివర్తయేదేనమ్।
మత్సంసృష్టా బలినం ప్రకృతిం వా మాం జిఘాంనుమానేత్రీ॥


శ్లో.

గమనమనపాయమస్యాం మమ నిఃసారస్య వృత్తిహేతుర్వా।
మర్మజ్ఞా మయి రక్తా విముఖం మాం దూషయేదథవా॥


శ్లో.

మామభిరిరంసురయమితి మిథ్యాదోషేణ కపటఘటితేన।
కర్మాస్తి మిత్రకార్యం మహదనయా వా సమాగమ్యః॥

సీ.

నాశత్రుఁ గూడె నీనాతినాథుఁడు దీనిఁ
                 బొందిన నది వానిఁ బొందఁజేయు
బలవంతుఁ డీనాతిపతి దీనిఁ గదిసిన
                 చెలువ వానికి నాకుఁ జెలిమిఁ జేయు
ధనికురా లీకాంతఁ దగిలినఁ దనసొమ్ము
                 చేరలకొలఁది నాచెంతఁ జేర్చు
మర్మజ్ఞురాలు ప్రేమము గల్గు నామీఁదఁ
                 జొరకున్న నామర్మ మొరుల కిచ్చు


గీ.

దీని నేవేళఁ బొందిన దీనికతన
జాలఁదలఁచిన పనులెల్లఁ జక్కనౌను
మేలుగాకని యన్యకామినులఁ దగిలి
రతులు సల్పుదు రెటువంటిరసికులైన.


తా.

తమ శత్రువులకు స్నేహితులైన వారి భార్యలను బొందిన శత్రువు
లకును దమకును స్నేహము గలుగునని కొందఱును, బలవంతులైనవారి భార్యలను
పొందిన బలవంతులగువారితో స్నేహము కలుగునని కొందఱును, ధనికురాలగు కాం
తను బొందిన దమకు కావలసినపుడు ధనము యిచ్చునని కొందఱును, తమ మర్మ
ములను దెలిసిన పరకాంతలను బొందిన తమ మర్మముల నితరులకు దెల్పకుండు
నని కొందఱును, నీతిని దెలిసిన పరకాంతలను బొందిన తాము తలంచిన కార్య
ములు నెఱవేఱునని కొందఱును పరస్త్రీసంగమమునకు పురుషు లిచ్చగింతురు.


శ్లో.

ఇత్యుపలక్షణమిత్థం కారణమాలోచయన్న రాగతో యాయాత్।
కారణవిచారణసహమథవా స్వం వీక్ష్య మన్మథోన్మథితమ్॥


క.

ఈకార్యంబులలోపల
నేకార్యంబును నొనర్తు రిటు గాకున్నన్
భీకరమన్మథబాణా
స్తోకాహతినైనఁ జొచ్చి దొరకొందు రొగిన్.


తా.

కాముకులు పైన జెప్పియుండిన కారణములచేనైనను మన్మథబాణ
ములకు లోనైయైనను పరదారాగమనమున బ్రవర్తింతురు.

శ్లో.

జిగమిషుభిః పరదారా న్సిద్ధ్యాయతి వృత్త్యపాయపరిహారాః।
ప్రాగేన చిన్తనీయః లబ్ధప్రసరో హి దుర్జయో మదనః॥


క.

తలఁపఁగవలయును ధర్మము
తలపోయఁగవలయు వృత్తి ధనములు మొదటన్
వలరాజుఁ బిదపగెలువ
న్నలవియె? పరవనితమీఁద నాసేమిటికిన్.


తా.

కాముకులైనవారలు కాంతలను గోరునెడ యీకాంతను బొందుట
ధర్మమా! అధర్మమా యని విచారించి సిద్ధి, అర్ధము, వృత్తి, జీవనము, అపాయ
పరిహారమును విచారింపవలయును. అట్లుగాక యిచ్చవచ్చినటుల ధర్మములను
దెగనాడి మేలు కీళ్లెంచనియెడల మన్మథబాధ తీరునా? బుద్ధిమంతులగువారు
సాధ్యమైనంతవరకు పరస్త్రీలను వర్జించుట మేలు.


శ్లో.

సప్రత్యవాయదుర్లభ నిషేధవిషయశ్చ యో విషయః।
కామః స్వభావనామః ప్రసరతి తత్త్రైవ దుర్వారః॥


ఆ.

తలఁపరానిచోటఁ దలఁ పెల్లఁ జేర్చిన
మరుఁడు సంతసించి మదముఁ బెంచి
యిచ్చ వుట్టఁజేయు నింతులఁ బురుషులు
చూచినపుడె వేయు సుమశరములు.


తా.

కాముకులు పరస్త్రీల నిచ్చగించిచూచిన యెడల మన్మథుడు మద
మును బెంచి మన్మథోద్రేకము కలుగజేయును.


శ్లో.

ఉజ్వలవపుషం పురుష కామయతే స్త్రీ నరోపి తాం దృష్ట్వా।
అనయోరేష విశేషః స్త్రీ కాంక్షతి ధర్మనిరపేక్షా॥


శ్లో.

అభ్యర్థితా చ పుంసా నహసా న స్వీకరోతి సహజేన।
సుకృతసమయాద్యపేక్షీ ప్రవర్తతే వా నవా పురుషః॥


చ.

పురుషులు కామబాణహతిఁ బొంది రసస్థితిఁ గోరి వేడినన్
దరుణులు సమ్మతింపక యదల్తురు చేరఁగనీరు మెచ్చు సుం
దరతరమూర్తియైన నరుఁ దారె తగుల్కొనఁజూతురేని ని
బ్బరముగ ధర్మము న్గులము వావియుఁ జూడరు మన్మథోద్ధతిన్.

తా.

 కాముకులు మన్మధబాణములకు లోనై స్త్రీలను మోహించి దఱిజేరి
వేడినను సమ్మతించరు. దగ్గరకు రానీయక యెంచెదరు. సుందరరూపుని తామె
తగులుకొనుటకు దలంచిరేని ధర్మమును కులమును వరుసయును త్యజించియైనను
వానిని పొందగోరుదురు. పురుషు లట్లుకాక ధర్మమును పూర్వాచారములను
పాటింతురు. కావున పురుషుడు ధర్మనియమముడై స్త్రీవలె సులభముగ ధర్మము
ను త్యజించి పరదాగమనమునకుం జొరబడడు.


శ్లో.

సులభామవమనుతే౽సౌ కామయతే దుర్లభాం మృషాభియుంక్తే చ।
ఇతి నరనారీశీలం నార్యా వ్యావృత్తికారణం వక్ష్యే॥


ఆ.

చేరి వేఁడుకొనిన చేయీక యడియాసఁ
జూపి యపుడె యట్టి సుదతి నొక్క
పురషుమీఁద వలపుఁ బఱపెనంచును గల్ల
నిందఁ బఱపి వెఱపు నింపవలయు.


తా.

స్త్రీ తనయొద్ద జేరి ప్రార్థించినను పురుషుడు లోబడక యాస్త్రీ
యొకపురుషుని మోహించెనని నింద వేసినయెడల నాస్త్రీకి వెఱపు గలిగి తన్నిక
జేరదలంపదు.

కామినులు వ్యభిచరింపకుండుటకుఁ గారణములు

శ్లో.

భృశమనురాగః పత్యాపవత్యవాత్సల్యమతివయస్త్వం చ।
వ్యతికరనిర్వేదిత్వం ధర్మాపేక్షాపి కస్యాశ్చిత్॥


శ్లో.

భర్తురవిరహః స్వాత్మని దోషజ్ఞానం యియాసురన్యయా రక్తః।
ఇయమస్య మన్నిమిత్తా మా భూత్వీడేత్యసామర్థ్యమ్॥


సీ.

పతిభక్తి కలదు నాపైఁ జాలబిడ్డలఁ
                 గంటిగా యని యన్యుఁ గవయ దొకతె
నాపోడి మెఱిఁగినఁ జేపట్ట కధిపతి
                 విడుచుగా యని చేర వెఱచు నొకతె
పెనిమిటిఁ గనిన నీతనికి నాకతమునఁ
                 జేటు వచ్చునటంచు జేర దొకతె
యిరుగుపొరుగువార లెఱిఁగినఁ గులహాని
                 వాటిల్లునని చొరఁబార దొకతె

గీ.

వీని నెటువలెఁ బొందుదు వీఁడు నాకు
వశుఁడు కాఁడని తమకంబు వదలు నొకతె
యిచ్చ గలిగిన కామిను లేమి చెప్ప
నిట్టివిధముల జారుఁ జేపట్ట రెపుడు.


తా.

పతివ్రత యనిపించుకొంటిని చాలామంది పిల్లలను గంటి ననుకొని
సంతృప్తి చెందునదియు, ఆవిషయము భర్తకు తెలిసిన తన్ను విడిచిపుచ్చునని భయ
పడునదియు, భర్త జారుని గనిన తనవలన జారునకు ఆపద గలుగునని కీడును
శంకించునదియు, ఇరుగుపొరుగువారు చూచినయెడల కులమునుండి వెలిగావలసి
వచ్చునని శీలమును బ్రేమించునదియు, జారుడు తనను పొందుటకు వీలుండదని
నిరాశ చెందునదియు, స్త్రీలకు జారవాంఛ యున్నప్పటికిని నీకారణములచే జారుని
చేపట్టజాలరు.


శ్లో.

దుర్లక్ష్యో నాగర ఇతి సుహృదతి పత్యా ప్రయుక్త ఇతి గరిమా।
ఇంగితమూఢః పలితో నీచః శుష్కాభియోగ్యదేశకాలజ్ఞః॥


శ్లో.

ఇతి లఘిమా సుహృదర్పితభావో౽చిత్తజ్ఞ ఇతి ఖేదః।
తేజస్వ్యనిభృతభావో జ్ఞాతా జ్ఞాత్యుఝ్ఝితా భవేయమితి భీః॥


శ్లో.

ఇచ్ఛాయామపి సత్యాం స్త్రీణాంవ్యావృత్తికారణాన్యాహుః।
ప్రథమోక్తపంచకారణవారణమనురాగవర్ధనం కార్యమ్॥


సీ.

సంకటములు గల్గ సామి విరక్తినిఁ
                 జెందుననుచుఁ దాల్మి నొందియుండు
దుర్లక్ష్యుఁడు పతిమిత్రుఁడు నాగరకుఁడగు
                 జారుఁ డంచును మది న్గౌరవించు
దేశకాలంబులఁ దెలియని మూఢుఁడు
                 పలిత నీచుండని పరిహరించు
ప్రియునిసతినగు నాప్రేమ నెఱుంగక
                 కామింపరాఁ డని ఖేద మొందు


గీ.

కులమువారలు గాంచిన వెలి యటంచు
భయముఁ జెందియు వ్యభిచరంపఁగఁ దలఁపదు

పైనఁ జెప్పిన కారణపంచకమున
గాన వాటిని వారించి గవయవలయు.


తా.

తనయొక్క శరీరమువలనఁ బుట్టఁబడిన రోగముచే భర్త విరక్తిభావ
మును జెందుననిన యసామర్ధ్యమును, జారుడు నాగరికుఁడు దుర్లక్ష్యుండు భర్త
స్నేహితుఁడు నని గౌరవమును, జారు డింగితమూఢుఁడు పలితుఁడు నీచుఁడు
దంభాలాపి దేశకాలపాత్రంబులను తెలియనివాఁడని లాఘవంబును, స్నేహితుని
భార్యనగు నన్నుఁ గోరకయుండెనే హృదయాభిప్రాయమును దెలిసికొనలేని
వాడని ఖేదమును, బంధుజనాదులకుఁ దనవ్యభిచారము తెలిసిన బంధుతిరస్కారము
కలుగునని భయమును, నీయైదు కారణములవలన స్త్రీ వ్యభిచరింపఁజాలదు.
కాన వాటిని నివారించి యనురాగమును వృద్ధి చేయవలయును.


శ్లో.

కార్యముపాయవ్యంజనమశక్తి హేతౌ, యథాయోగ్యమ్।
అతిపరిచయతో గరిమా, లఘిమా వైదగ్ధ్యభోకయోః ఖ్యాతా।
ఖేదః ప్రణతేస్త్రాసోప్యాశ్వాసనతో నివర్త్యా స్యుః॥


చ.

అలయక పల్మరున్ దిరుగులాడి యగౌరవ ముజ్జగించి నే
ర్పులు పచరించి భావములు పొందుగఁ జెప్పిన లాఘవంబు చం
చలమగు ఖేదభావముఁ బ్రశాంతముఁ బొందు నమస్కరించినన్
కలభయమెల్లఁ బోవుఁ దమి గల్గిన నూరటమాట లాడినన్.


తా.

స్వసామర్ధ్యప్రకటనవలన కామినిహృదయమందు విశ్వాసమును గలుగ
జేసి ప్రథమమైన యసామర్ధ్యమును దొలంగింపజేయుటయు, అతిపరిచయము
వలన రెండవదియైన గౌరవమును తొలంగింపజేయుటయు, కార్యకుశలుడు భోగి
యనుభావమును తనపట్ల స్త్రీయందు కలుగచేసి మూడవదియైన లాఘవమును
దొలంగింపజేయుటయు, నమస్కరించుటవలన నాల్గవదియైన ఖేదమును, ఊర
డించుటవలన నైదవదియైన భీతియు తొలగింపజేసినచో స్త్రీలు వశులగుదురు.

పురుషదూతలు

శ్లో.

శూరః సముచితభాషీ రతితంత్రజ్ఞః ప్రియస్య కర్తా చ।
ప్రేక్షణకారీ సాహసరసికః ప్రోద్ధామయౌవనశ్రీకః॥


శ్లో.

ఆబాల్యజాతసఖ్యః క్రీడనకృత్యాదినా జాతవిశ్వాసః।
ఆఖ్యానశిల్పకుశలః కస్య చిదన్యస్య కృతదూత్యః॥

శ్లో.

అప్యగుణో మర్మజ్ఞ సఖ్యా ప్రచ్ఛన్నసంసృష్టః।
ఉత్తమయా సంభుక్తః సుభగః ఖ్యాతాన్వయశ్చ జామాతా॥


శ్లో.

పరిచారః స్మరశీలః తాదృక్షః ప్రాతివేశ్యోపి।
ధాత్రేయికాపరిగ్రహ ఉద్యోగత్యాగశీలశ్చ॥


శ్లో.

ప్రేక్షణరసికో వృష ఇతి విఖ్యాతః సద్గుణాధికః పత్యుః।
అభిమతమహార్షవేషాచారః సిద్ధా ఇమేనరాః స్త్రీషు॥


సీ.

శూరుఁడు ప్రియవాది మారతంత్రజ్ఞుఁడు
                 శోధకుండును సాహసుండు భోగి
యౌవనుండు ధనాఢ్యుఁ డాబాల్యముగఁ దాను
                 గూడంగఁ బెరిఁగిన కూర్మిసఖుఁడు
నేర్పరి విశ్వాసనీతుఁడు మర్మజ్ఞుఁ
                 డనుకూలప్రచ్ఛన్నుఁ డతఁడు దూత
యుత్తమాంగననైన నొడఁబాటు గొననేర్చుఁ
                 జక్కనివాఁడు ప్రశస్తదిక్కు


ఆ.

క్రొత్తపెండ్లికొడుకు కుసుమాస్త్రశీలుండు
బంటు దాదికొడుకు పరమహితుఁడు
వలవఁదగినవాఁడు వలనింటివాఁ డిట్టి
తంత్రములకు మిగులఁ దగెడువారు.


తా.

ప్రౌఢుడు, ప్రియముబలుకువాడు. కళాశాస్త్రము తెలిసినవాడు,
శోధించువాడు, సాహసముకలవాడు, సుకవాసి, మంచిప్రాయముకలవాడు,
ద్రవ్యముగలవాడు, చిన్నతనమునుండి కూడంగ పెరిగిన స్నేహితుఁడు, నేర్పుగల
వాడు, విశ్వాసము గలవాడు, గుట్టుగలవాడు, అనుకూలముగా నడచువాడు,
ఉత్తమవంశసంజాతనైనను వలలో వైచుకొనగల దేహసౌందర్యముకలవాడు,
గొప్పయింటి క్రొత్తపెండ్లికొడుకు, కనుసన్నలయందు నేర్పరి, నౌకరు, దాది
కొడుకు, మేలుకోరువాడు, కామింపదగినవాడు, పక్కయింటివాడు వీరలు
దూతకృత్యమునకు అర్హులు.

జారులకు వశులగుస్త్రీల లక్షణములు

శ్లో.

ద్వారావస్థితిశీలా దృష్టా పార్శ్వం విలోకతే యా చ।
రమణద్విట్దుర్భగా వా నిరపత్యా నిరపరాధపరిభూతా॥


శ్లో.

లంఘితలజ్జా పంధ్యా గోష్ఠీశీలా మృతాపత్యా।
పరిహరతి నాపరాధేప్యభిభూతా వా వృథా సపత్నీభిః॥


శ్లో.

బాలా మృతపతికా యా బహుపభోగా దరిద్రా చ।
న్యూనపతిర్బహుమానా మూఢధవోద్వేగినీ కళాకుశలా॥


శ్లో.

జ్యేష్ఠా బహుదేవరకా ప్రోషితభర్తా౽ధరీకృతా సమానాభిః।
నిత్యం జ్ఞాతికులస్థితిరీర్ష్యాళుః పతిసమానశీలా చ॥


సీ.

ఇంటివాకిట నిల్చి యిటునటునుం జూచు
                 పొలఁతి నాథునితోడఁ బోరు నతివ
గొడ్రాలు దుర్భగగోష్ఠిసమాచార
                 బహుభోగవనిత యా బాలవిధవ
పగలు నిద్దురపోవు పడఁతి కురూపిణి
                 సిగ్గులేనిది కళాశిల్పనిపుణ
విగతనాయక యవివేకి సకియ యల్ప
                 భోగిని మూర్ఖయు బూమెకత్తె


గీ.

యత్తయును మామయు సవతియాలు దన్ను
నెపము లేకయె దండించు చపలనేత్ర
కరము మఱఁదులు నధికంబుఁ గలుగు నతివ
సురతసాధ్యలు జారలౌ పురుషులందు.


తా.

తలవాకిట నిలిచి యటునిటు జూచునది, భర్తతో పోట్లాడునది
గొడ్రాలు, నీచమగు సల్లాపము లాడునది, వృత్తాంతములను తెలియజేయునది,
మిక్కిలి భోగముగలది, బాలవిధవ, పగలు నిద్రించునది, రూపహీనురాలు, సిగ్గు
విడిచినది, చిత్తరువులు వ్రాయునది, మగనిచే విడువబడినది, అవివేకుని భార్య, కొల
దిభోగము లనుభవించునది, మూర్ఖవతి, వేషకత్తె, అత్త మామ సవతి వీరలు తన
యందు నేరములేకున్నను నేరమును మోపి దండించుటవలన చపలముగా నుండునది.
మఱదులు ఎక్కువగా కలది వీరుజారులకు వశులగుదురు.

శ్లో.

కన్యాకాలే యత్నాద్వరితా వ్యూఢా కుతోపి కారణానైవ।
యా యోవనే౽భియుక్తా ప్రకృతిస్నిగ్ధా చ యా యస్మిన్॥


శ్లో.

చారణవిరూపవామనదుర్గన్ధిగ్రామ్యరోగిణాంభార్యా।
కుపురుషబద్ధక్లీబప్రమదా ఏతా అయత్నసాధ్యాః స్యుః॥


చ.

పెనిమిటి రోగియైన మఱి పెండ్లియునాడిన కన్నెనాఁడు చుం
బనమును యౌవనంపు నునుబల్కులఁ దేలిన భృత్యునింట దా
మనఁగల దంగమంగళిత మత్తకుపూరుషుకాంత వృద్ధునం
గనయును యోగికాంతయును వల్తురు జారుఁ బ్రయత్మ మేటికిన్.


తా.

భర్త రోగియయినను లేక మఱియొకతెను పెండ్లియాడినను, కన్ని
యగా నున్నప్పుడు చుంబనములు యౌవనపుమాటలచే పరవశమయినది, సేవకుల
యింటికి చనుదెంచునది, వెఱ్ఱివానిభార్య, ముసలివానిపత్నియు, యోగాభ్యాస
ము చేయువానిభార్య వీరు జారులయొక్క ప్రయత్నములేకనే మోహింతురు.


శ్లో.

అంగుష్ఠాదధికాగ్రా వామపదే స్యాత్ప్రదేశినీ యస్యాః।
హీనాగ్రమధ్యమా వా స్పృశతి న భూమిం కనిష్ఠా వా॥


క.

 కాలి పెనువ్రేలునకుఁ జెలి
వే లధికం బయిన మధ్యవేలు కృశంబై
వ్రాలిన నవ్వలివ్రేళ్ళున్
వ్రాలక నిల మోపకున్న వ్యభిచారిణియౌ.


తా

కుడిపాదముయొక్క పెద్దవ్రేలుకన్న పక్కనున్నవ్రేలు పొడుగు
గా నుండినను, మధ్యవ్రేలు సన్నముగానుండి వ్రాలియున్నను, చివర రెండువ్రే
ళ్ళును క్రిందికి వాలియుండక భూమిమీద మోపకున్నను యట్టికన్నె వ్యభి
చరించును.


శ్లో.

తదనంతరద్వయం వా కేకరదృక్పింగళాక్షీ చ।
తాం పుంశ్చలీమితి విదుః సాముద్రవిదో హసనతుణ్డీ చ॥


గీ.

ఓరగంటఁ జూచు నువిద, యూరక నగు
గలికి, పచ్చనికన్నులఁ గలుగుబోటి,
శాస్త్రములఁ దెల్పు వ్యభిచారిజాడ లెల్లఁ
గలుగుసతి వశ్య ముగ నని తలఁపవచ్చు.

తా

కడగంటిచూపు గలది, కారణములేకనే నవ్వుచుండునది, పచ్చని
కన్నులు గలది. సాముద్రికశాస్త్రవేత్తలచే జెప్పబడిన వ్యభిచారలక్షణములు గల
స్త్రీలను వ్యభిచారిణులుగా గుర్తింపదగినది.


శ్లో

సిద్ధతామాత్మనో జ్ఞాత్వా లింగాన్యున్నీయ యోషితామ్।
వ్యావృత్తిరకారణోచ్చేదాన్నరో యోషిత్సు సిధ్యతి॥


క.

ఈలాగు లక్షణంబుల
నీలాలక జారగాఁగ నిశ్చితమతియై
వేళయుఁ గాలము నయ్యై
పాళముఁ దానెఱిఁగి విటుఁడు పైకొనవలయున్.


తా.

కాముకులు పైన చెప్పియుండిన లక్షణములుగల స్త్రీలను జారిణులుగా
నెఱింగి దేశకాలపాత్రల ననుసరించి ప్రయత్నము సేయవలయును.


శ్లో.

ఇచ్ఛాస్వభావతో జాతా త్క్రియయా పరిబృంహితా।
బుద్ధ్యా సంశోధితోద్వేగా స్థిరా స్యాదనపాయినీ॥


శ్లో.

యాసాం ప్రథమం సాహసమథవా నిర్యంత్రణం వచో యామ।
తాః స్వయమభియోక్తవ్యాప్తద్విపరీతాస్తు దూతీభిః॥


ఉ.

ఇచ్చదనంబువల్లఁ దగనించుకదాని దృఢంబుఁ జేసి తా
నచ్చపుబుద్ధిచేత తిర మయ్యెడు లీల ఘటించెనేని యే
యొచ్చము లేక నిల్చువిటు గూరిచి సాహస మందఁజేసి తా
నచ్చట సిద్ధికై తగుసహాయము చేయుదు రిష్టభృత్యులన్.


తా.

కాముకపురుషులు జారకాంతల యిష్టమును గుర్తించి వారలసంధా
నమునకు తగు స్నేహితులను బంపవలెను.

వ్యభిచారిణుల గుర్తించుట

శ్లో.

స్వయమభియోగే కార్యో ప్రణయం ఘటయేదలంపటః ప్రథమమ్।
ఆకూతమదనలేఖాం దృగ్దూతీం ప్రేరయేద్బహుశః॥


క.

దూతికలచేత జారిణి
చేతోగతి గానరాక చిక్కనిరూపుల్

దూతికలఁ జేసి పలుమరు
నాతరుణులు చూపువగల నరయఁగవలయున్.


తా.

కాముకపురుషులు దూతికలనుబంపి వారివలన జారస్త్రీలు సమ్మతిం
పనియెడల నాజారస్త్రీలు చూపువగలను గాంచుచు తామే ప్రయత్నించి కృత
కృత్యులు కావలెను.


శ్లో.

కేశస్రంసవసంయమమంగే నిజ ఏవ కరరుహైశ్ఛురణమ్।
ఆభరణనాదమసకృద్ మర్దనమధరోష్ఠయోః కుర్యాత్॥


శ్లో.

ఉత్సంగసంగతశ్చ ప్రియసుహృతః సాంగభంగమపి జృంభేత్।
విసృజేద్గద్గదవాక్యం భ్రువమేకా ప్రహ్వయేద్భూయః॥


శ్లో.

అన్యాపదేశతస్తత్కథయా సఖిభిః సమం తిష్ఠేత్।
సాదరమస్యా వచనం శృణుయాద్ బ్రూయాద్ మనోరథం వ్యాజాత్॥


శ్లో.

సుహృది శిశౌ వా జనయేత్తామేవోద్ధిశ్య చుంబనాశ్లేషమ్।
ఉత్సంగమంగమస్యా లఘు స్పృశేద్బాలలాలనవ్యాజాత్॥


శ్లో.

బాలక్రీడనకానాం దానాదానే కథాం చ తద్వ్యాజాత్।
తత్సంవాదిని లోకే ప్రీతిం సంసృజ్య సంచారమ్॥


శ్లో.

శృణ్వత్యామపి తస్యామవిదితవద్విశదమనతస్త్రకథాః।
కుర్యాదుత్యతి చైవం ప్రణయే నిక్షేపమాదధ్యాత్॥


సీ.

తల విప్పి ముడుచుట తన శరీరము గోళ్ళ
                 నలముట యొడలి సొమ్మంటుకొనుట
చేరువఁ గూర్చున్న చెలికానిపై నీల్గి
                 యావలించుట యొయ్య నలిగికొనుట
తనుఁ గనుఁగొన్నచో దండంబుఁ బెట్టుట
                 యన్యాపదేశంబు లాడుకొనుట
నా మాట వినుమని నయముగా నొకరితోఁ
                 బలుకుట యొకనినిఁ బట్టుకొనుట


గీ.

విడెము సేయుట శిశువునో రొడిసిపట్టి
తమ్మఁబెట్టుట పసిబాల నెమ్మిఁబట్టి

యందియిచ్చెడి గతి దేహ మందుకొనుట
జారగుణముల సతుల లక్షణము లయ్యె.


తా

తలవెంట్రుకలను విప్పి ముడివేసుకొనును, గోళ్లతో తనశరీరము గీచు
కొనును, శరీరముననున్న నగలను సరిచేసుకొనును దగ్గరగా కూర్చుండియుండు
స్నేహితులపై నీల్గి ఆవలించును, అతివేగముగ కోపమును గాంచును. తనవైపునకు
చూచిన నమస్కరించును, గూఢోక్తులను పలుకును, ప్రేమతో తనమాటవినవలసి
నదిగా యితరులతో పల్కుచు వారిచేతిని పట్టుకొనును, తాంబూలమును వేసుకొని
బిడ్డనోటియందు బెట్టును, బిడ్డను అందిచ్చులాగున నటించి ముట్టుకొనును, ఈపను
లు జారస్త్రీ తాను కోరినపురుషునియెదుట నొనర్చును.

జారస్త్రీలను సమ్మతింపఁజేయు లక్షణము

శ్లో.

ప్రతిముహురహరహరథరవా యస్య గ్రహణేన భవతి సంశ్లేషః।
అథ యోజయేన్నిజైస్తాం దారైర్విశ్వాసగోష్టీషు॥


శ్లో.

క్రయవిక్రయోద్యతాయామస్యాం స్వం యోజయేత్తదాసక్తః।
పరబుద్ధిరన్ధ్రరోధం కుర్యాత్ప్రణయానుబన్ధం చ॥


ఉ.

మాటల సమ్మతింపకయ మచ్చిక చేసిన జారకాంతకున్
బేటముఁ బుట్టఁ జేయుటకుఁ బ్రేమ బయల్పడ సంచరించుచున్
బూటకుఁ బూటకున్ గుసుమపుననవగంధఫలాదు లిచ్చుచున్
జీటికిమాటికిన్ గథలు సెప్పుచుఁ గూర్మి జనింపఁజేయుచున్.


తా.

జారకాంత రతికి సమ్మతించుమాటలను పలుకక ప్రీతిని గనుపరచిన
కాంతకు తనపై ప్రేమ పుట్టుటకు నాపెపై యెక్కువప్రేమను కరుపరుచునట్లు
సంచరించుచు పువ్వులు గంధము పండ్లు మొదలయినవి యిచ్చుచు రతిప్రయుక్త
మైన కథలు చెప్పుచు తనపై యామెకు ప్రేమ కలుగునటుల జారుడు ప్రవర్తింప
వలెను.


శ్లో.

ఇతిహాసాదికథాయాం ద్రవ్యగుణే వా వివాదముత్పాద్య।
తత్పరిజ నైస్తయా వా వార్తాస్తాం కృతపణః పృచ్ఛేత్॥


శ్లో.

ఏవం ప్రణయం ప్రణయన్నింగితమాలోచయేదస్యాః।
అభిముఖనాలోకయతే లజ్జామాలంబతే ముహూర్తం చ॥

శ్లో.

రుచిరం న చిరం వ్యాజద్వ్యనక్తిగాత్రం, పదా భువం లిఖరి।
గుప్తం సస్మితమసకలమవిరళమథవా విలోకతే మన్దమ్॥


శ్లో.

భావాదంశగతం శిశుమాలింగతి చుంబతి బ్రూతే।
కించిత్స్పృష్టాధోముఖమవిశదవర్ణక్రమం స్మితప్రాయమ్॥


శ్లో.

వదతి తదన్తికసంస్థితిమనుసరతి వ్యాజతో దీర్ఘమ్।
మాం పశ్యత్వితి భావాద్యత్కించితద్వ్యాహరత్యుచ్చై॥


సీ.

ఇతిహాసములలోన నేకథ లడిగినఁ
                 గొనకొని తనదు సద్గుణమె చెప్పు
సుందరీమణి తను జూచిన కనుఱెప్ప
                 వెట్టక నెమ్మోముఁ బెగడఁజూచు
లజ్జఁ బొందినదానిలాగున నొక్కింత
                 తలవంచి కాలు భూతలము వ్రాయు
నేమోమొ పనికినై యెవ్వరో పిల్చినా
                 రని తల యెత్తి యావలను జూచు


ఆ.

నవ్వొకింత సలిపి నయమునఁ గన్నెత్తి
చూచి పిన్నవాని చుంబనంబుఁ
జేసి కౌఁగలించి వాసియౌ పలుకులఁ
గొంతకొంతజారకులము వలుకు.


తా.

ప్రబంధములలోని యేకథ చెప్పుచున్నను యందున్న సద్గుణములు తన
గుణంబులతో బోల్చుచు, విటుడు తను చూచిన కనురెప్ప వేయకయే యతని మొగము
చూచుచు, సిగ్గుపొందినదానివలె కొంచెము తల వంచి భూమిపై పాదముతో వ్రా
యుచు, ఏపనికో ఎవ్వరో తనను పిలిచినటుల తలయెత్తి విటునివైపునకు కాక
నింకొకవైపునకు చూచి చిరునవ్వు కనబరచి విటుని మొగము చూచి దగ్గరనున్న కుర్ర
వానిని ముద్దుబెట్టుకొని కౌగలించుకొని మర్మోక్తులను మాట్లాడును. ఇట్టిపనులు
జారిణులు తాము ప్రేమించు జారులను గాంచునప్పు డొనర్తురు.


ఉ.

నమ్మిక చేయునట్లు తననాతుకఁ బంచి విశేషగోష్ఠితా
నిమ్ముగఁ జేసి ప్రీతిమెయి నెంతయు నాత్మనివాసభూమికిన్

రమ్మని పిల్చి తెచ్చి ప్రియురాలును దానును నన్యపుష్పగం
ధమ్ములు వెట్టి యన్నయును దమ్ముఁడటం చనివావిసేయుచున్.


తా

పురుషుడు తాను మోహించిన కాంతయొద్దకు తనయొక్క భార్యను
బంపి దానితో యెక్కువస్నేహము చేయించి తనయింటికి పిలిపించుచు వచ్చిన
పుడు పుష్పములు మొదలగువాసనద్రవ్యముల నిచ్చుచు నాపెభర్తను యన్న
తమ్ముడను వరుసలతో బిలుచుచు తనయందు ప్రేమ పుట్టునట్లు సంచరింపవలెను.


శ్లో.

పశ్యతి యత్ర సదాసౌ తత్ర కథావ్యాజమాచరతి।
తద్దత్తం వహతి సదా కిమపి సమీక్ష్యాన్తికో హసతి॥


క.

 ఏసొమ్ము జారగనునో
యాసొ మ్మమ్మునటులఁ గొనియరుగం దానిం
కాసొమ్ములఁ గని జారిణి
వేసర నాత్మీయ మనుచు వివరింపఁగనున్.


తా.

జారిణికి యెసొమ్ముయం దిష్టమో యాసొమ్ము నమ్మువానివలె యాపె
వద్దకు జన యాపె యాతనిని జూచి తనమన స్సెఱింగి ప్రవర్తించువాడని యిష్ట
పడును.


శ్లో.

న దదాతి తస్య దర్శనమనలంకారాథ యాచితా తేన।
వితరతి సఖ్యా హస్తే కుసుమపీడాది సాలస్యమ్॥


శ్లో.

నింశ్వసితి తిర్యగాలోకయతి విమృద్నాతి పాణినా స్వకుచమ్।
సంయచ్ఛతే చ వసనం కరశాఖాస్ఫోటనం కురుతే॥


శ్లో.

ద్వ్యర్థం వదతిసలజ్జం జనయతి జృభానిహన్తి కుసుమాదైః।
రుచిరం రచయతి తిలకం సఖ్యాఃశ్రోణీం చ సంస్పృశతి॥


శ్లో.

తారం కాసతి కేశాన్ముంచతి తద్వేశ్మ గచ్ఛతి వ్యాజాత్।
కరచరణాంగుళివదనే స్విద్యతి సమ్మార్ష్టి భుజవల్ల్యా॥


సీ.

ప్రియునిసద్గుణములు ప్రేమయు రెట్టింపఁ
                 బడఁతి దూతికలతోఁ బ్రస్తుతించు
శృంగారవతిగాక చెలువుని జూడదు
                 సఖిచేతఁ బుష్పసంచయముఁ బంపు

నుసురసురనుచు నిట్టూర్పులు నిగుడించుఁ
                 దనచన్నుగవ దానె తలఁగఁబట్టు
లలికటాక్షము దిక్కులఁ బరామర్శించుఁ
                 జిలుకనాథునికంటు జిట్ట విడుచు


గీ.

పలుక లజ్జించుఁ బువ్వుల బట్టికొట్టు
పిఱుఁదు ముట్టును దిలకంబుఁ బెట్టు సతిని
జూచు తలవిచ్చివానిల్లు చొరఁగఁజూచు
జార జారునిపొడ గన్న సంభ్రమించు.


తా.

తాను ప్రేమించినవాని మంచిగుణములనుగూర్చి దూతికతో పొగ
డును, శృంగారము చేసుకొని ప్రియునికి కనిపించును. దాసిచే పువ్వులు పంపును
ప్రియుసంగమ మెప్పుడు కలుగునాయని నిట్టూర్పులు విడుచును, మోహము బయ
ల్పడ తనచన్నుల నదుముకొనును, క్రీగంట దిక్కులను పరికించును, ప్రియునితో
మాట్లాడుటకు సిగ్గుపడును, విలాసముగా పువ్వులతో నాతని కొట్టును, బొట్టు
పెట్టుదానిమొగము పరికించును. ప్రియునిగృహమున కేరీతి పోవుదునాయని తల
పోయును. యాతనిని చూచి సంతోషించుచుండును.


క.

కరచరణాంగుళవదనాం
బురుహంబు లొకింతచెమట పొడమినఁ దుడుచున్
దరుణీమణి జారుఁడు తను
బొరిపొరి వీక్షింప నలుకఁ బొడమున్ దెలియన్.


తా.

తనమొగమునందుగల చెమటను చేతివ్రేళ్ళతో తుడుచును, ప్రియుడు
తన్ను మాటిమాటికి కాంచుచున్నయెడల కార్యభంగము కలుగునని యతడు తెలుసు
కొనునట్లు కోపించును.


శ్లో.

ఉత్సంగసంగతా చ ప్రియసఖ్యా వివిధవిభ్రమం తనుతే।
ప్రీతిం ద్యూతం చ కథాం తత్పరిచారై సమం కురుతే॥


శ్లో.

తత్పరిజనాశ్చ శృణుతే తస్య కథాం స్వమిత తం సమాదిశతి।
విశ్వసితి తస్య సఖిసు స్నేహత్తద్వాచమాచరతి॥


ఉ.

ఈగతి నున్న జారునకు నింగితభావము మాన్పి వేఁడి యు
ద్యోగిని దత్సమీపమున నుండి ప్రసంగము సేయుచు న్న్మనో

రాగుఁడు చూచె ని న్ననుచు రంజిలఁజేయు తదీయదూతిహ
స్తాగతరత్నభూషలు క్రియాళి గదల్చి వచించి మ్రొక్కుచున్.


తా.

ఈవిధముగానున్న జారునకు తనభావము నర్మోక్తులతో నెఱింగించి
వేడుకొనుచు నాతనికి కనుపించునంతచేరువగా నుండ నీప్రియుడు నిన్ను చూచు
చుండెననుపల్కు చెలికత్తెను బెగ్గఱగా మాట్లాడవలదని మ్రొక్కును.


క.

నవ్వుచుఁ జేరువనుండిన
జవ్వని యే మేనిబలుక సన్నలు సేయున్
దవ్వుననుండి దూతిక
నివ్వటిలున్ బలుకఁ బ్రియము నేరుపు లొలయన్.


తా.

జారులు చేరువనుండినయెడ హావభావములచే తమకోర్కె నెఱిం
గింతురు. అట్లుకాక దూరముననుండిన దూతికలమూలమున నెఱింగింతురు.


శ్లో.

కతి యువతయో౽స్య భవ్యాః కతమాః కస్యామసౌ సదారమతే।
ఇత్యాది తస్య లోకం పృచ్ఛతి నిభృతే చ సాకూతమ్॥


క.

పెక్కండ్రుకామినులు గడుఁ
జక్కనివారుండ నాదు సాంగత్యంబున్
మక్కువఁ జేసియు నాతం
డక్కరపడెనా యటంచు నడుగున్ బ్రీతిన్.


తా.

చక్కనిస్త్రీలు చాలమంది యుండ నాకూటమి నతడు గోరి నిన్ను
పంచెనా యని ప్రియుడు పంపినదూతి నడుగును.


శ్లో.

ఇతి దర్శితేంగితాయాం సశ్లేషం స్పష్టకాదినా యుంజ్యాత్।
అకలితమంబువిహారే స్తనజఘనం సతిస్పృశేదష్యా॥


ఉ.

జారిణి యింగితంబు సరసజ్ఞుఁడు కాంచి తదీయసంగతుల్
గోరి పయోవిహారమున గొమ్మలతో నొనగూడి యెవ్వరున్
జేరనివేళఁ బట్టెఱుఁగఁ జేసి నితంబకుచస్థలంబు లొ
య్యారముతోడఁ బట్టి యొకయందము చూపుట జారుచందమౌ.


తా.

ఈవిధముగా కాముకపురుషుడు జారస్త్రీయిచ్చ నెఱింగి యాపె
స్నానమునకై యొంటరిగానున్న సమయమును దెలిసికొని యాపెను డాసి చనులను
పిఱుదులను బట్టి కౌగలించి ప్రేమను గనుపరచవలయును.

శ్లో.

అవతార్య కామపి రుజం వార్తావ్యాజేన తత్ర నీతాయాః।
ఆలంబ్య పాణిమస్యాః శిరసి దృశోః స పులకం దద్యాత్॥


ఆ.

దొడ్డతెవులు పుట్టఁ దొయ్యలి నీచేత
నమృతముండు జమరు మనిన కన్ను
దోయి మస్తకంబుఁ దొలుతనె ముట్టఁగఁ
బులకలెత్తు జారపురుషునకును.


తా.

కాముకుడు నాకొకవిధమగు జబ్బుకలిగినది. నీ చేతియం దమృత ముం
డునుగాన నన్ను ముట్టుమన నాజారిణి యతని కన్నులను శిరస్సును ముట్ట నాతని
శరీరము గగుర్పొడుచును.


శ్లో.

అనురాగపేశలం చ బ్రూయదుభయార్థమీదృశం వాక్యమ్।
శమయ మమ సుముఖ! పీడాం కలయ నిమిత్తం త్వమేవాస్యాః॥


శ్లో.

సుతను! మదనాదరో౽యం యుక్తం కిం త్వద్గుణస్య ఫలమ్।
ఇత్వౌషధాదిపేషణవిధిషు వ్యాపారయేదేనామ్॥


శ్లో.

సనఖస్పర్శం కుర్యాద్దానాదానం చ పూగకుసుమాదేః।
కరజరదనపదలాంఛితమస్యై పర్ణాదికం దద్యాత్॥


శ్లో.

అథ సన్నిధాప్య రహసి ప్రౌఢాశ్లేషాదిసుఖరసం విన్ద్యాత్।
సుచిరమనోరథసంచితమన్మథగురుదీక్షయా క్రమశః॥


ఉ.

సుందరి నీకనుంగొనలఁ జూచిన రోగము మాను నాకు నా
మందును నూరి యిచ్చి యది మాన్పుము నాయెడ నాదరంబు సే
యందగుఁ జేయకున్న ఫల మయ్యది తేటగునంచు జారుఁ డీ
చందము మాటలాడు రతిసంజ్ఞలుగాఁ బరకాంతతోడుతన్.


తా.

నీకన్నులతో నన్నోరగా చూచిన గాని నాకు కలిగిన మదనజ్వరము
మాననట్లున్నది. ప్రీతితో నామందు యిచ్చి నారోగమును మాన్ప సమర్థురాలవు
నీవే సుమా. నీ వట్లొనర్పనియెడల నందువలన గలుగు ఫలమును నీవు కాంచగలవు.
అనగా ప్రాణములు పోవునని జారిణితో గూఢోక్తులను బల్కును.


ఉ.

ఆకులు పోకలున్ గిసలయాదులు కొమ్మని యందియిచ్చుచోఁ
జేకొనఁగోరనంటి మఱి చిత్రనఖక్షతదంతలాంఛనా

స్వీకృతవల్లికాదిదళచిహ్నము లిచ్చి రహస్యమైనచోఁ
జేకొని కౌఁగిలించి సుఖసిద్ధికి దీక్ష యొనర్చు నయ్యెడన్.


తా.

జారుడు జారుణికి తాంబూలమునిచ్చుచు యాపెకరమును బట్టి దగ్గ
ఱకు జేర్చుకొని నఖక్షతదంతక్షతాలింగనాది బాహ్యరతు లాచరించి రతి కుపక్ర
మించును.


శ్లో.

నిబిడతమసి నిశి నార్యో వ్యవసితరతయో భవన్తి రాగిణ్యః।
అభియుక్తాస్తత్కాలే త్యజన్తి పురుషం న తాః ప్రాయః॥


ఆ.

కౌఁగలింతసుఖము గని జారకామిని
యతి రహస్యకాంత నరసి దూత
చేసిపుత్తు నెల్లి చీకటిరేయిని
బయలుసేయవలదు పట్టపగలు.


తా.

జార జారుని కౌగలింతసుఖ మనుభవించి యిప్పుడు పగలు కావున
రతికాలముకాదు, రేపురాత్రి దూతికవలన వర్తమానము పంపెదననియు రతి
కుపక్రమించవలదనియు బ్రతిమాలును.

సంకేతమున కుపయుక్తముకాని స్థలములు

సీ.

ముసలియౌ కామిని యొసఁగెడిచోటును
                 వేల్పుసానిగృహము వీడుపట్టు
జారసతీగోష్టి జరుగుకామినికొంప
                 దుర్జనప్రియమైన దూతిగృహము
వీధికొండెముఁజెప్పు వెలఁదిగేహంబును
                 జూదలియిలు దరిచోటినెలవు
యగసాలివాని నెయ్యంబైన గుడిసెయు
                 మంతురసానిదౌ మనికిపట్టు


ఆ.

కలుత్రాఁగుపొంత కలుషాత్ములమఠంబు
లంజెవాడయందు లాస్యకాంత
మందిరములు కావు మర్మకర్మప్రీతి
జరుగు జారపురుషసంగతికిని.

తా.

ముసలిదియయ్యు కామము ననుభవించుస్త్రీ యిచ్చెడిచోటును,
బోగముదానియిల్లు, జనసమూహముతిరుగుచోటు, జారస్త్రీలు గుంపులుగూడి
మాటలాడుకొనుయిల్లు, దుష్టులకు ప్రియురాలైన దూతికయిల్లు, వీథివారిపై కొండె
ములు చెప్పుదానియిల్లు, జూదమాడువాని యింటిపొరుగున, స్వర్ణకారునికి ప్రియ
మగుయిల్లు, మంత్రసాని నివసించుచోటు, కల్లుత్రాగుట కేర్పడినయిల్లు, పాపా
త్ముల మఠము, భోగమువీధి, నృత్యము చేయుదానియిల్లు, యివి జారస్త్రీపురుషుల
సంబంధములకు దగని తావులు.


శ్లో.

వృద్ధా౽నుభూతవిషయా యత్ర వసేత్తద్విదూరతో వర్జ్యమ్।
యత్త్రైకామభియుంక్తే తత్రాన్యాం లంఘయేన్నైవ॥


గీ.

ప్రౌఢ యగుకాంత నివసించు ప్రాంతమందు
నేది గౌప్యంబుగా నుండఁబోదు మఱియు
నొకతె భోగించునెలవు నింకొకతె చేరి
క్రీడ యొనరింప నెప్పుడుఁ గూడరాదు.


తా.

ప్రౌఢాంగన నెలవు చరువ రహస్యగోపనము కలుగదు గాన నటఁ జేర
రాదు. ఒకతె భోగించుతావున నింకొకతెఁ గూడరాదు గదా!


శ్లో.

అభియోగే సతి నార్యా భావపరీక్షా ప్రయత్నతః కార్యా।
యది గృహ్ణాత్యభియోగం రతిభావం న ప్రకాశయతి॥


ఆ.

దూతిఁ బిలిచి తలఁపురీతి యెఱింగింప
నదియు దానిభావ మరసికొనుచు
నియ్యకొని రహస్య మెవ్వరు నెఱుఁగక
యుండఁజేసె నేని యుత్తమంబు.


తా.

జారస్త్రీ దూతికను రహస్యముగా పిలిచి తన మనస్సులోని సంగతి
యెఱింగింప అది దాని యిష్టము నెరవేర్పనిష్టపడి యితరులకు తెలియనీయక
యొనగూర్చిన దూతికాభావ ముత్తమము.


శ్లో.

దూతీసాధ్యాం విద్యాదభియోగం యాతు నాదత్తే।
సంగృహ్యతే చ దోలాయితచిత్తా సాధ్యతే క్రమశః॥


గీ.

సమ్మతిని జూపఁజాలనిసతిని విటుఁడు
దూతివలన ప్రయత్నింప దొరయఁగలదు

అతివ డోలాయమానస యైనయెడలఁ
దానె వశ మగు నిష్టము దాచియున్న.


తా.

అంగీకారముఁ జూపని కామినిని దూతికవలన గ్రహించవలయును.
అంగీకారమును బ్రకటించుపట్ల డోలాయమానమానసయగు స్త్రీ తనకుఁదానే
జారునివశమగును.


శ్లో.

అగృహీత్వాప్యభియోగం సవిశేషాలింగితం వివిక్తేయా।
ధీరా దర్శయతి స్వం గ్రాహ్యా మాహుర్బలేనైనామ్॥


గీ.

విటునికోర్కిఁ దెలిసి వీలుచేయక యుండి
యొంటిపాటు జిక్కియున్నతఱిని
సరసమాడుచుండుచానను జారిణి
యనుచు దెలిసి బల్మి నంటవలయు.


తా.

తాత్కాలికాంగీకారమును జూపకపోయినను నేకాంతప్రదేశమం
దాలింగనాదిభావప్రకటనములను జూపినస్త్రీని బలాత్కారముననైన జారుఁడు
గ్రహింపందగును.


శ్లో.

మిలతి సహతే౽భియోగం ప్రణయచ్ఛేదేన సా సాధ్యా।
పరిహరతి యా౽భియుక్తా న మిలతి పునరాత్మగౌరవతః॥


గీ.

కోరిపైఁబడు సతిని దాఁ గూడవలయు
ప్రేమ యున్నట్లు నటియించి విటునివశము
కాకయుండెడిసతి యాత్మగౌరవంబు
కల ద టంచు నాయువతిని వలచవలదు.


తా.

ఎవ్వతె కోరఁబడినదై లభించునో జారుఁ డామెను బ్రేమింపంజనును.
ఎవ్వతె కోరఁబడియును జారునివశ మగుట కిష్టపడదో యాపె యాత్మగౌరవకాం
క్షిణియని జారు డెంచి విసర్జింపవలయును.


శ్లో.

నచ నాయకగౌరవతః ప్రత్యాదష్టే౽తిపరిచయాత్సాధ్యా।
ప్రత్యాదిశ్య కరోతి ప్రీతిం యా సా మాసాధ్యైవ॥


గీ.

ధవునిగౌరవమును మదిఁ దలఁచి విటుని
పొందని నెలంత పరిచయంబున నడంగు

కోరికెను దీర్పఁ దెగడియుఁ గూర్మిఁ జూపు
పొలఁతి వశ మగు నని నెంచవలయు విటుఁడు.


తా.

ఎవ్వతె భర్తగౌరవమును మనమునం దుంచుకొని వ్యభిచరింపదో
యాపె నతిపరిచయమువలన జారుఁడు పొందవలెను. తిరస్కరించియుఁ బ్రీతిని
జూపుస్త్రీ సాధ్యమగునని తలంపవలయును.


శ్లో.

ఆకారితా చ సూక్ష్మం వ్యజ్జయతి స్పష్టముత్తరం సిద్ధా।
యా స్వయమాకారయతి ప్రథమం సా ప్రథమసిద్ధైవ॥


గీ.

నర్మగర్భములను బల్కునాతి ప్రీతిఁ
దెలసి యాపెను గూడంగ వలయు విటుఁడు
ఎవతె జారునిపైఁ బ్రీతి నెంచె మొదలఁ
గూర్మిఁ జూపి తనంతఁ దాఁ గూడు నాపె.


తా.

ఎవ్వతె పరులకుఁ తెలియకుండునటుల నర్మగర్భములైన పలుకులతో
స్పష్టమగు ప్రత్యుత్తరములను బ్రచురించుచున్నదో యాపె జారునకు సాధ్యురాలు.
ప్రప్రథమమునఁ దానే జారుని వలచుచో యాపెయే జారునికిఁ బ్రధమమున వశు
రాలగును.


శ్లో.

ధీరాయామప్రగల్భాయాం పరీక్షిణ్యాం చ యోషితి।
ఏష సూక్ష్మోవిధిః ప్రోక్తః సిద్ధా ఏవ స్ఫుటాః స్త్రియః॥


ఆ.

పైనఁ జెప్పి నట్టిభావము ల్సరసులు
బాల ముగ్ధలందుఁ బరుపవలయు
భావవిస్ఫుట మగుభామలయెడ నిట్టి
శ్రమము లేక వశ్య మమరఁగలదు.


తా.

సూక్ష్మమగు నీయింగితాకారచేష్టాపరీక్షావిధానమును గంభీరప్రకృతి
గలిగిన బాలలయందును, ముగ్ధలయందును మాత్రమే చెప్పఁబడినది. విస్ఫుటమైన
భావముగల స్త్రీలు పైనఁ జెప్పంబడిన పరీక్షాదికవిధానములు లేకయే జారులకు
స్వాధీనమగుదురు.

దూతికాముఖ్యలక్షణము

ఉ.

ఎవ్వతె గారవంబున నహీనమతిన్ జరియించు మాటలం
దెవ్వతెయు తరంబుఁ దగనియ్యఁగ జాలుఁ బ్రియానుకూలయై

యెవ్వతె ధీరప్రౌఢగతి నింగితభావము నిర్వహించు నా
జవ్వని దూతి చేసినను సాధ్యమగు న్బరదారికారతుల్.


తా.

ఎవ్వతె గొప్పబుద్ధి కలిగియుండునో, ఎవ్వతె ప్రియుల కనుకూలనుగు
మాటలను జెప్పగలదో, ఎవ్వతె జారులయొక్క మనస్సులను దెలిసికొనునో, అట్టి
కాంతను దూతికగా నొనరించినయెడల పరస్త్రీలు సాధ్యులగుదురు.


శ్లో.

దూతీవిధేయమధునా యాదృగ్వక్ష్యామి తదపి సంక్షేపాత్।
ప్రథమమతిశీలయోగాదాఖ్యానాద్యైర్విశేషయేదేనామ్॥


శ్లో.

శ్రుతసౌభాగ్యదమన్త్రౌషధికావ్యరతిరహస్యానామ్।
ఘటయేత్కథాప్రసంగాన్ బ్రూయాద్వశ్వాసముత్పాద్య॥


శ్లో.

రూపకళావిజ్ఞానం శీలే క్వ తవ క్వ చాయమీదృశో భర్తా।
ధిగ్దైవముచితవిముఖం తారుణ్యం తే విడంబయతి॥


శ్లో.

ఈర్ష్యాళురకృతవేదీమృదువేగః శాఠ్యవసతిరవివిదగ్ధః।
దాసోపి తేన యుక్తః పతిరమయాః కష్టమిత్యాద్యైః॥


శ్లో.

పతిదూషణగణవచనైర్వైరాగ్యం లంభయేదేనామ్।
యస్మిన్నుద్విజతే సా దోషే భూయస్తమేవ పల్లవయేత్॥


సీ.

మొదలనింటికిఁ బోయి ముదిత సంశీలవృ
                 త్తాచారములగూర్చి యభినుతించి
రతిరహస్యాదికార్యంబులు వాక్రుచ్చి
                 సౌభాగ్యకరమంత్రసమితి యొసఁగి
యౌషధమణు లిచ్చి యంతటఁ దనయెడ
                 నమ్మికఁ బుట్టించి నాతిఁ జేర్చి
నిరుపమసత్కళానిపుణభావమునకు
                 దైవ మీతని నెట్లు ధవునిఁ జేసెఁ


గీ.

గోపకాఁడు కృతఘ్నుండు గుణవిహీనుఁ
డల్పరతుఁడును మూఢుఁడు నైనవాని
బెనిమిటిని నీకెట్టు ప్రియము వుట్టుఁ
దరుణి కొరగాదు నీచక్కఁదనమునకును.

తా.

కాముకపురుషునిచేత పంపబడిన దూతిక కాముకపురుషుడు కోరి
యున్న స్త్రీయింటికి జని యాపె యాచారవ్యవహారములను గూర్చి యాపెను
స్తుతించి స్నేహము చేసుకొని రతిరహస్యకార్యములను బోధించి సంపత్కరమగు
మంత్రోపదేశముల నొనర్చి కొన్నిమందు లిచ్చి తనయం దాపెకు నమ్మికగలుగునటుల
ప్రవర్తించి, తరువాత నీరూపురేఖావిలాసచాతుర్యములకు దైవము తగినభర్త
నొనరింపకపోయెను. నీభర్త ముక్కోపి, కృతఘ్నుడు, గుణవంతుడు కాడు, మూ
ఢుడు, అల్పరతుడు, ఇటువంటి మగనితో పొందు నీ కేమంతప్రియము? నీ చక్క
దనమునకుమాత్ర మతడు మగ డగుటకు తగడు.


క.

ఈలాగున సతి వినుతియు
నాలోననె మగనిదూషణాలాపములన్
బోలిచియుఁ దాల్మినిలుకడఁ
దూలిచి పతి రోయఁజేయు దూతిక మఱియున్.


తా.

దూతిక యీవిధముగా నాస్త్రీని స్తుతించి దానిభర్తను నిందించి
దానికి దానిపెనిమిటియందు రోతకలుగునటుల చేయును.


శ్లో.

నాయకగుణగణభణితిం కుర్యాదేవం ప్రసంగేన।
ఉత్పాద్య సౌమవస్యం బ్రూయత్సుభగే శ్రుణుస్వ యచ్చిత్రమ్॥


శ్లో.

చిత్రం కిమపి వ్యతికరమాసౌ యువా కుసుమసుకుమారః।
దృష్టిభుజంగీదష్టస్తవ సఖి సన్దేహమారూఢః॥


ఉ.

జారునిరూపరేఖలు ప్రసంగముఁ జేయఁదలంచినప్పు డా
వారిరుహాస్య కిట్లనును వామవిలోచన యొక్కచిత్రమే
చేరువఁగంటి నొక్కయెడఁ జిత్తరూపుఁడు యౌవనుండు నా
తారవిలోచనాహితముదంబును జేసె నటంచుఁ జెప్పఁగన్.


తా.

అనంతరము దూతిక జారపురుషుని రూపురేఖావిలాసములయొక్క
ప్రసంగము చేయదలంచి దానితో నేను నీవద్దకు వచ్చువప్పుడు ఇక్కడకు చేరు
వగా నొకచోట మన్మథునివంటి చక్కనిపురుషుని నాకన్నులు కరువుదీర
చూచితిననును.


శ్లో.

శ్వసితి స్విద్యతి ముహ్యతి సన్తపస్తస్యకోపి దుర్యారః।
త్వన్ముఖచన్ద్రసుధారసమప్రాప్య ప్రాణితానాసౌ॥

శ్లో.

స్వప్నే౽పి తస్య సుభగే! కదాపి నేదృగ్వికారో౽భూత్।
ఇత్యుక్తే యది సహతే పునరపరేద్యుః సమేత్య సంకథయేత్॥


ఉ.

తాపము పొందు లేఁజెమటఁ దాల్చును దేహము, నిద్రఁబోవ నా
రూపముదోఁచిన న్జెదరు రోజు తదీయముఖేందుసౌధధా
రాపరిషేచనంబు తనప్రాణసఖిన్ గనుఁగొన్న నాత్మస
ల్లాపము లుజ్జగించుటకుఁ దన్విచనున్ మఱివచ్చువేఁకువన్.


తా.

దూతిక చెప్పినపురుషుని మోహించి యాస్త్రీ పరితాపమును
పొందును, దేహమున జెమటపట్టును. నిద్రించుసమయములయం దాతని కలల
యందు గాంచి బెదరును. నాత డెక్కడైనను కనుపించునాయని సౌధభాగముల
యందుండి చూచును, దూతికవలన నాతని ప్రసంగములను వినజనును.


శ్లో.

వృత్తమహల్యాదీనాం శ్లాఘ్యం స్త్రీసంగమభియోక్తుః।
ఏవం ప్రయుజ్యమానే లక్షయితవ్యస్తదీయ ఆకారః॥


శ్లో.

దృష్ట్వా బ్రవీతి సస్మితమన్తిక ఏవోపవేశయతి।
పృచ్ఛతి భోజనశయనే ఆఖ్యానం దిశతి రహసి వా మిలతి॥


క.

ఏకాంతంబున నొయ్యన
నాకామినితోడ మాటలాడుచుఁ బూర్వ
శ్లోకములు కథలు చదువుచు
వాకొను దాసురమునీంద్రవర్తనగతులన్.


తా.

ఈవిధముగా యాస్త్రీ తిరుగుచుండ దూతిక యేకాంతమున దానితో
మాటలాడుచు పూర్వము జరిగిన రంకుకథలను జెప్పుచు దేవతలు మునులు జారత్వ
మున బూర్వము సంచరించినారు కనుక జారత్వమున దోషము లేదని తెలుపును.


సీ.

గౌతమమునిరాజకాంత గాదె యహల్య
                 దేవేంద్రుతోఁ గోర్కె తీర్చుకొనియె
నాదిత్యగురుపత్ని కాదె తారాదేవి
                 శిష్యుఁ జంద్రునిఁ బ్రియుఁ జేసికొనియె
దాశరాజతనూజ దాఁ గాదె యోజన
                 గంధి పరాశరుఁ గవిసిమనియెఁ

బరమపావని కాదె భాగీరథీదేవి
                 శంతనుతో రతి సల్పుకొనియె


గీ.

ద్రౌపదీకాంత కేవురు ధవులు కారె
గొల్లెతలు కృష్ణుతో నొనఁగూడి మనరె
కానఁ దొల్లిటివారును గవిసినారు
జారుఁ బొందిన నేమి దోషంబు సతికి.


తా.

ఆహల్య యింద్రుని పొందలేదా, తార చంద్రునితో కలియలేదా?
యోజనగంధియగు దాశరాజు కుమార్తె పరాశరుడను మునిని పొందలేదా? పరమ
పవిత్రమగు గంగ శంతనుని పొందలేదా? ద్రౌపతికి యైదుగురు మగలుగదా?
గోపికలు కృష్ణునితో సుఖింపలేదా? పూర్వకాలపువారగు యట్టిమహనీయులే
పరదారాగమనంబు దోషంబులేదని కూడినపుడు మనకుమాత్ర మేమిదోషము
గలదని తెల్పును.


శ్లో.

నిఃశ్వసతి జృంభతే వా స్వవిత్తమస్యై దదాతికించిద్వా।
యాన్తీమేష్యసి పునరితి పదతి, కథం సాధువాదినీ భవతీ॥


శ్లో.

సక్తి కిమప్యసమంజసమిత్యుక్త్వా తత్కథా భజతి।
కిన్న కరోమి వచస్తవ కిన్తు శఠో౽సావతీప మే భర్తా॥


శ్లో.

హనతి చ తస్య వికారం శ్రుత్వా భూయస్తు సోపహాసేవ।
ఇత్యాకారప్రకటనమాలోక్య ప్రాభృతం యుంజ్యాత్॥


వ.

ఆదూతి తెల్పుమాటలను వినినతరువాత యాపె నిట్టూర్పులు విడుచును.
దూతికిఁ గొంచెము లంచమిడును. తనయొద్దనుండి వెడలుదానిని మరల వెనుకకుఁ
బిలుచును. ఇంకొకమాటయని మరల మరల వెనుఁద్రిప్పును. నీవ ని ట్లగునా యని
మరల ప్రశ్నించును, దూతి చెప్పుదానిలోఁ గాఁగూడనిదేమో యున్నదనుచు
నాయకవృత్తమును మరల వినఁగోరును, నీ వన్న ట్లేమి చేయను నాపెనిమిటి మిక్కిలి
కోపి యాయె ననును, తద్భర్తృకోపస్వభావాదిప్రకటన మాలకించి దూతిక నవ్వి
తానును నట్లే యన్నదై యామాటవలన నాయింతి మనోగతమును గుర్తించి యుపా
యనదానాదికము నుద్భోదించును.


శ్లో.

తాంబూలకుసుమలేపనదానై రుపబృంహయేద్భూయః।
ఇతి సుఘటితసద్భావా వ్యసనవివాహోత్సవప్రాయే॥

శ్లో.

ఉద్యానపానయాత్రాజలావతారే హుతనహోత్పాతే।
ప్రవిచిన్తి తాత్యయే వా వేశ్మని నిజ ఏవ తౌ యుంజ్యాత్॥


సీ.

తాంబూలకుసుమగంధంబులు ముంగిట
                 నుంచు నాథుఁడు నీకుఁ బంచెననుచు
వనజాక్షి నీ కంపె నని పుష్పగంధంబు
                 లిచ్చి నాయకునిచే మెచ్చుఁ బడయు
నుత్సాహసంపాదోద్యానసీమల
                 కేళీస్థలంబులఁ గీలుకొల్పు
ననుకూలగృహము లేదని విచారించినఁ
                 దనమందిరం బిచ్చి తలఁగియుండు


ఆ.

నొకరిహృదయ మెఱిఁగి యొకరికి నెఱిఁగించి
యొకటఁ దలఁపుఁ జెప్ప నొకటఁ దనకుఁ
జెప్పకున్న వారిచేష్టలఁ బరికించి
యొకరి కొకరిమతము నొనరఁ బలుకు.


తా.

దూతిక జారస్త్రీముందు తాంబూలపుష్పగంధము లుంచి నీప్రియుడు
పంపెననును. ఆవిధముగానే పుష్పగంధములను జారపురుషుని కిచ్చి నీ ప్రియు
రాలు పంపెననును. జారస్త్రీ పురుషులకు పరస్పరము అధికమయిన మోహము
పుట్టునటులొనర్చి రహస్యస్థలములయందు వారు తారసిల్లునటులొనర్చును. వారిరు
వురు రతిక్రీడలకు తగినతావు లేదని విచారించుచుండ తనయి ల్లిచ్చి దూతిక
కాపాడుచుండును. వారిచేర్పులవలన యింగీతమును గ్రహించి యొకరిభావము
లొకరికి దెల్పునదియే దూతికాకృత్యమునకు దగినది.

త్రివిధదూతికాలక్షణము

శ్లో.

బుద్ధైకస్త సమీహీతమాత్మధియైవారభేత యా కార్యమ్।
సా హి నిసృష్టార్థోక్తా లింగేనోన్నీయ యా కార్యమ్॥


శ్లో.

శేషం సంపాదయతి స్వయమేవైషా పరిమితార్థోక్తా।
సంసృష్టయోస్తు నేత్రీ సన్దేశం పత్త్రహారీ స్యాత్॥

చ.

ప్రహిత యనంగ నిద్దఱికి బల్కులు పొందుగఁ జెప్పు దూతి, యు
ద్విహితసుఖోపభోగముల వేడకు జెప్పు, మితార్థపత్త్రసం
గ్రహణమునందు నిద్దఱికిఁ గార్యముఁ దెల్పును బత్త్రహారి నా
విహితులు దూతికాతతికి వీరలు మువ్వురు నెన్ని చూడగన్.


తా.

జారులగు స్త్రీపురుషులకు పొందికగా మాటలు చెప్పుదూతికను ప్రహి
తయనియు, విటీవిటులకు సంభోగవిషయములను దెల్పుదూతికను యుద్విహిత
యనియు, లంజమిండలకు హావభావసౌజ్ఞార్థములను దెల్పునది పత్త్రహారియనియు
వీరలు త్రివిధదూతికలని తెలియందగినది.


శ్లో.

దౌత్యమి షేణావ్యప్యా నాయకమేత్యాత్మగుణభావాన్।
వ్యాజేన వేదయన్తీస్వార్థం ఘటయేత్స్వయందూతీ॥


శ్లో.

ముగ్ధాం నాయకభార్యాం యత్నాద్విశ్వాస్య యా రహఃపృష్ట్వా।
అభిలాషలింగమాదౌ తేన ద్వారేణ నాయకం గమయేత్॥


శ్లో.

అపి నాయకః స్వభార్యాం ప్రయోజ్య తద్వత్ సమాయోజ్య।
ప్రకటయతి నాగరత్వం తాం భార్యాం దూతికాం ప్రాహుః॥


శ్లో.

బాలాం పరిచారికాం వా దోషజ్ఞాం ప్రేషయేత్సతతమ్।
తత్ర స్రజి కర్ణపత్త్రే గూఢం సన్దేశమాలిఖ్యః॥


శ్లో.

అవిదితకార్యాకార్యా బాలా౽లంకారపత్త్ర సంక్రాన్తైః।
నఖదశనలేఖపత్త్రైః ప్రహితా చేన్మూకదూతీ సా॥


శ్లో.

ద్వ్యర్థం పూర్వప్రస్తుమథవా దుర్లక్ష్యమన్యేవ।
యన్ముగ్ధయా కయాచిత్ శ్వవ్యోక్తా వాతదూతీ సా।
తత్రావిశంకముత్తరమపి దద్యాన్నాయికా తద్వత్॥


సీ.

పురుషుండు వచ్చినఁ బొలుపొందఁగాఁ జేయు
                 నతివ భావనదూతి కనఁగఁబరఁగు
మదనపత్త్రికఁ బెట్టి మగువకన్నియుఁ బంపఁ
                 దొయ్యలి పత్త్రికాదూతి యయ్యె
దంతనఖక్షతదళ మిచ్చి దూతిక
                 నాతిఁ బంపిన మూకదూతి యయ్యె

వరునిగాఁ జూచి భావములు పొందులు తోఁప
                 పొసఁగించునది స్వయందూతి యయ్యె


ఆ.

తానుసేయుకార్యతంత్రంబు మఱియెవ్వ
రైనఁ దెలిసిరేని యట్టివేళ
వారి కింపు పుట్ట బొంకింపనోపెడి
యతివ భావదూతి యనఁగఁబరఁగె.


తా.

జారజారిణిలు వచ్చువరకు శయ్యాదు లమర్చియుంచి వారియిష్టములను
నెరవేర్చునది భావదూతిక యనియు, స్త్రీపురుషులకు మన్మథపత్రికల నందించునది
పత్త్రికాదూతియనియు, జారిణి జారునకు దంతనఖక్షతము లుంచిన తములపాకుల
చుట్టలను బంపగా పట్టుకొనిపోవునది మూక దూతియనియు, పురుషునియొక్క
యిష్టమును గుర్తించి యాతని భావము ప్రకారము పొందిక చేయునది స్వయందూతి
యనియు, తానొనరించు కార్య మితరులకు తెలియగా వారు నమ్మునట్లు బొంకునది
భావదూతిక యనియు తెలియందగినది.


సీ.

కాంతబింబాధరక్షతము నాథుఁడు కన్నఁ
                 జిలుక ముద్దాడె నీచెలువ యనుచు
కొమ్మచెక్కిలియొత్తు గోరు నాథుఁడు గన్నఁ
                 గేతకిఁ గోసె నీనాతి యనుచు
సుదతికేశములు జుంజురులు నాథుఁడు గన్నఁ
                 బూఁబొద దూరె నీ పొలఁతి యనుచు
రమణినెమ్మోములేఁజెమట నాథుఁడు గన్నఁ
                 నీరెండఁ గాఁగె నీనారి యనుచు


గీ.

నబ్జముఖి దప్పి ప్రాణనాయకుఁడు గనినఁ
గొలుచు గంపెడుదంపె నీపొలఁతి యనుచు
లలన జారునిఁ బొందిన లక్షణములు
పురుషుఁ డీక్షింప దూతిక పోలబొంకు.

తా.

జారిణియొక్క మోవియందు దంతక్షతముండుటను దానిభర్త
గాంచిన చిలుకను ముద్దాడుటవలన గలిగినగంటు యనియు, చెక్కుల నఖక్షతములను
వీక్షింప మొగలిపువ్వులను గోసినది గాన మొగలి ఆకుల గీతలనియు, రేగియున్న
కురులను జూచిన పువ్వుల గోయుటకు పొదరిండ్ల దూరుటవలన రేగెననియు, మొగ
మునగల చిఱుచెమటలను గనిన నింతవరకు నీరెండయందుండెననియు, సురతబడ
లిక వలన దప్పిగొనియుండుటను గ్రహించిన గంపెడుధాన్యము దంపెననియు, నీవిధ
ముగా భర్త గ్రహించిన సంభోగానంతరలక్షణములను మరుగుపడునటులు దాని
భర్త సమ్మతించునటుల బొంకునదియే దూతిక.

దూతికాకార్యనిర్వాహకులు

శ్లో.

దాసీ, సఖీ, కుమారీ, విధవేక్షణికా, చ సైరన్ధ్రీ।
మాలికగాన్థికరజకస్త్రీ, ప్రవ్రజితా చ వస్తువిక్రేత్రీ॥


శ్లో.

ధాత్రీ, ప్రతివేశ్మనికా, స్థిరభావా దూత్య ఏతాః స్యుః।
శుకశారికాదయోపి ప్రతిమాప్రాయా విదగ్ధానామ్॥


ఉ.

బానిస కన్నె నెచ్చెలి విభర్తృక చాకెత గంధకారికా
మానిని పుష్పలావి యుపమాత గృహజ్ఞ జలాదులమ్మున
జ్ఞాసపత్త్రకారి రచనాంగన భార్య పథిప్రవేశ యా
ఖ్యానవిధిజ్ఞ లీపనికి నర్హులుగా శుకశారికాదులున్.


తా.

దాసి, కన్య, చెలికత్తె, విధవ, చాకలిది, గంధమమ్మునది, పువ్వు
లమ్మునది, మారుతల్లి, యింటిపెత్తనకత్తె, నీరు నమ్ముకొనునది, చిత్తరువులు
వ్రాయునది, భార్య, రతి ప్రవేశముకలది, కథలు చెప్పునది, చిలుక, గోరువంక
వీరలు దూతికాకార్యనిర్వాహకులనియు షోడశదూతికలనియు పలుకుదురు.


శ్లో.

అన్తఃపురమపి కేచిద్దాసీభిః కథితసదుపాయాః।
ప్రవిశన్తి తత్ప్రకారా లోకద్వయనిన్దితా నోక్తాః॥


క.

అంతఃపురములలోపలఁ
జింతన నిహపరసుఖంబు చేడియపలుకుల్
పంతములు కావు గావున
మంతనమున దూతపనులు మానఁగవలయున్.

తా.

అంతఃపురములలోనికి దూతిక వెళ్ళుటకు సదుపాయముండినను ఇహ
పరలోకసుఖంబులకు దూరులగుదురు కావున అంతఃపురస్త్రీలపై చింతవదలి
దూతను బంపుట కాముకులు మానవలయును.


చ.

వితరణకర్ణ కర్ణపదవీగతరత్నవిశేషవాక్పతి
ప్రతిమతిరమ్యవాక్యచయబంధురమోహితరామ రామభూ
పతిపరపంకజభ్రమరభంగురలోచన లోచనామనో
రతినిజరూప రూపగుణరాజిత భైరవమల్ల ధీమణీ.

ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
పారదారికాధికారో నామ
త్రయోదశః పరిచ్ఛేదః

గద్యము
ఇది శ్రీమదష్టభాషాకవితాప్రవీణ నవఘంటాసుత్రాణ మాచనామాత్య
పుత్త్ర సుజనకవిమిత్త్ర సజ్జనవిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతంబైన కొక్కోకంబను గళాశాస్త్రంబునందుఁ
ద్వితీయాశ్వాసము సంపూర్ణము