రతిరహస్యము/తుదిపలుకు
తుదిపలుకు
కామోపాయ నియమములను గ్రహింపని పురుషుడు సతిని సంతోషపెట్ట జాలడు. అందువలన నాస్త్రీకి గామోద్రేకము కలిగి చంచలహృదయయై వ్యభిచరించుటకు గారణమేర్పడుచున్నది. కావున గామమనుభవించు గృహస్థులీ కామశాస్త్రమును దప్పక గ్రహింపవలెనను మాయుద్దేశము సర్వజనాదరణీయమగును గాక. ఈ యుద్దేశము తోడనే యీ గ్రంథకర్తయగు కొక్కోకుడు:-
శ్లో|| ఆసాధ్యాయాః సుఖం సిద్ధిః, సిద్ధాయాశ్చానురంజనమ్||
రక్తాయాశ్చ రతిస్సమ్యక్కామశాస్త్ర ప్రయోజనమ్||
అని కామశాస్త్రావసరమును జాటెను గాన సహృదయులు సాదరమున నీశాస్త్రము నాచరింతురని తలంచుచున్నారము.
ఈ గ్రంథ సంపాదన కొరకాంధ్రదేశమున బర్యటన మొనర్చి వ్రాతపతులను సంపాదించునపుడొక శ్రీమంతుడు "ఓరియంటల్ ఆర్టు" అనబడు ప్రాచ్య చిత్రకళా లేఖనములగు చౌశీతిబంధముల సంపుటమును మాకొసంగి "దేశమున గామము సేవింప నేర్పరులు కాని పురుషులధికముగా నుండుట వలన స్త్రీలలో జాలమంది వ్యభిచారిణులగ పడుచుండి" రని తన యభిప్రాయమును మాతో వెల్లడించెఉ. ఈ యుద్దేశము కూడ నందరంగీకరింతురని తలంతుము. విద్యావిహీనులీ కామసేవను గ్రహింపవలెనను దలంపుతోడనే బవిత్రస్థలములని పలువురు చేరెడి దేవాలయాది కట్టడముల యందు నీబంధముల బ్రతిమలను బూర్వులు నెలకొల్పిరి. కావున మేమీ గ్రంథమును జిత్రపటశోభితము గావించితిమి. ప్రస్తుత మాశ్రీమంతు డొసంగిన "చౌశితిబంధముల సంపుటము" లోని నలుబదిరెండు చిత్రము లీగ్రంథమున కనుబంధముగా ముద్రించితిమి. కడమ నలుబదిరెండును "ఆంధ్ర రతిరహస్యము"న కనుబంధముగా బ్రకటింప దలచితిమి. కానీ మా యశ్రద్ధ వలన చెదపురుగుల పాలాయెనని శృంగారపంచకముననే దెల్పియుంటిమి.
తమ తాతముత్తాతలనాటి నుండియు భద్రముగావించి కాపాడుచుండిన ప్రాచ్యచిత్రకళాలేఖనములగు "చౌశీతిబంధముల సంపుటము" నిచ్చిన యా శ్రీమంతులకు గృతజ్ఞతను దెలుపుచున్నారము.
ఇట్లు, ప్రకాశకుడు,
"కామగ్రంథమాల"