రంగూన్ రౌడీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Rangun Rowdy Drama.pdf

హెచ్చరిక.

ఈ నాటకమును ప్రదర్శింప దలఁచినవారు వ్రాతమూలకమైన అధికారపత్రమును పొందనిదే, ప్రదర్శింపరాదు. అట్లు అతిక్రమించినయెడల సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యు లగుదురు.

ఇట్లు,

కురుకూరి సుబ్బారావు,

సరస్వతీ బుక్ డిపో, బెజవాడ.

రెండవ కూర్పు విన్నపము.

ఈ నాటకము దైవానుగ్రహమున, ఆంధ్రనాటకరంగస్థలమునఁ గొంత ప్రచారముఁ గాంచెననుటకు మోద మంచుచున్నాను. ఈముద్రణమునందు, తుదియంకమున, స్వల్పసంస్కారముఁ గావించితిని. ప్రదర్శనములందు సాధారణముగ నాందీబాయికి సంబంధించిన రంగములు విడువఁబడుచున్నను వానిని ముద్రణమునం దట్లే యుంచితిని. పంచమాంకమునందు ప్రధమరంగపు తుదిభాగమున, ప్రభావతికిని బట్లరుకును కొంతభాగము ఈ కూర్పునందు తగ్గింపఁబడినది. ప్రధమ ముద్రణమున, అనుబంధములను గ్రంధాంతమునగాక , గ్రంధమధ్యముననే ముద్రించితిమి కాని, అది వీధినాటకముల పద్దతి ననుకరించియున్న దనియును, కేవలము గ్రంధమును మాత్రమే చదువుకొను పాఠకులకు నడుమ నడుమ నీపాటలు, పరనాభ్యంతరమును గల్గించుచున్న వనియుఁ గొందఱు రసజ్ఞు లభిప్రాయము నొసంగుటచేత, అన్నినాటకములరీతిగా ఈ కూర్పునుందు, అనుబంధములను గ్రంధాతముననే ముద్రింపవలసివచ్చెరు. ప్రథమ ముద్రణమున విషాద శుభాంతరంగములను రెంటిని వేఱువేఱుగా ముద్రించితిమి. కాని శుభాంతరంగముయొక్క ప్రయోజన మంతగా కాన్పింపకుండుటచేత ఈ ముద్రణమున విషాదాంతముగ గ్రంధము పూర్తిచేయఁబడినది. ఈ ముద్రణమున సయితము ప్రధమ ముద్రణమునందున్నన్ని కాకున్నను, కొన్నిముద్రణ స్థాలిత్యములు గలవు. పాఠకులు గమనించి సవరించికొందు రని ప్రార్థించుచున్నాను.

బెజవాడ,

28 - 11 - 32.

ఇట్లు, విధేయుడు,

సోమరాజు రామానుజరావు,

గ్రంథకర్త.

ఇందలి పాత్రలు.

- పురుషులు -

1 శంకరరావు—(రంగూన్ రౌడీ) కథానాయకుఁడు.

2 తులసీరావు—పోలీసు సూపరింటెండెంటు (కథానాయకుని మామ)

3 రమేశబాబు—రంగూను నందలి లక్షాధికారి.

4 గంగారాం సేటు—ఒక మార్వాడీ,

5 కృష్ణమూర్తి—జానకి ప్రియుఁడు.

6 జయరాం—రాధాబాయి ప్రియుఁడు.

7 మోహనరావు—కథానాయకుని కుమారుఁడు.

8 జడ్జి—అన్నపూర్ణకు ఉరిశిక్ష విధించిన అధికారి.

9 ఒక బట్లరు—విజయనగరము హెూటలులోని నౌకరు.

10 సబిన్‌స్పెక్టరు—(కాకినాడలో)

11 సబిన్‌స్పెక్టరు—(విజయనగరములో)

12 జైల్ సూపరింటెండెంటు—(ఉరికంబమునొద్ద)

13 కిరాతుఁడు—(ఉరికంబమునోద్ద)

14 రంగారావు—పవర్ దారు.

15 సేవకుఁడు—(కాకినాడలో)

స్త్రీలు

1 అన్నపూర్ణ—కథానాయిక.

2 ప్రభావతి—రమేశుని భార్య.

3 గిరికుమారి—కాకినాడలోని వేశ్య.

4 రాధాబాయి—గంగారాముని కుమార్తె.

5 నాందీబాయి—గంగారాముని భార్య.

6 జూనకి—కథానాయకుని చెల్లెలు.

7 తల్లి—కథానాయకుని తల్లి.

8 ఇంగీషు దాసి—గంగారాముని దాసి.

9 లక్ష్మి—కథానాయిక దాసి.

10 దాసి—గిరికుమారి దాసి.

తొలిపలుకు.

ఈ “రంగూన్‌రౌడీ” అను పతిభక్తినాటకము రంగూన్ ఆంధ్ర జాతీయ నాటకసభలో నేను పనిచేయుచుండినకాలమున, 1929 వ సంవత్సరమున ఆ సభకై రచింపఁబడినది. ఈ నాటకము తొలుత ప్రదర్శింపఁ బడినపుడు రుగూన్ పురవాసులను చాల గంద్రగోళపెట్టినది. రౌడీలను దూషించుటకై ఉద్దేశింపఁబడి యీనాటకము రచింపఁబడె నని కొందఱు అభిప్రాయపడి నాటక ప్రదర్శనమునకు పూర్వమే నా కనేక నిందాపూర్వకలేఖలను సంతకములు లేకుండ వ్రాసిరి. దౌర్జన్యమునకు పేరుపడిన రంగూనునందు పౌరులవలన నపాయమునకు శంకించి ప్రదర్శకులును నేనును గూడ నాటకదినమున రక్షకభటసహాయమునుసయిత మపేక్షింపవలసినవార మైతిమి. ప్రదర్శనమును గాంచుటకు కోపముచేత ప్రజలు రారేమో యని భీతిల్లితిమిగాని ఆ నాటక మెట్లుండునో చూతమను నుద్దేశముతో ఆ నాఁడు ప్రేక్షకులు ఇసుకవేసిన రాలనిచందమున నరుదెంచి హాలంతయు నిండిపోయిరి. నాటకప్రదర్శము మొదలు మంగళమువఱకును ప్రేక్షకులు సంపూర్ణ ప్రమోదభరితమానసులై నాటకమును వీక్షించి, తొలుత మే మంత భీతిల్లితిమో అంత కధికముగా భూషింపసాగిరి. ఈ నాటకమే రంగూన్ ఆంధ్రజాతీయ నాటకసభవారిచే గోదావరి, విశాఖపట్టణము, గంజాము జిల్లాలలో నంతటను పలుసార్లు ప్రదర్శింపఁబడి మంచి కీర్తిని గణించినది. సభవారికి సువర్ణపతకాదులు బహుమతిగా నొసంగఁబడెను.

ఈ నాటకమున శంకరరాయపాత్రను ధరించిన శ్రీయుత దొమ్మేటి సూర్యనారాయణగారి రౌడీనటనము నిజముగా చూచి తీరవలసినదే. ఇందు వీరసమానమైన నటనమును గావించి గ్రుధమునకు సుస్థిరమైన సత్కీర్తిని గలిగించిరి. ఈ నాటకము రంగూనునందు గొప్పసీనుల నహాయముతో ప్రదర్శింపఁబడెను. ప్రధమ విశ్రాంతికాలమున కాకినాడ లైట్‌హౌసును, సముద్రమును, స్టీమరును, శంకరరావును తిమింగలము మ్రింగుటయు, ప్రభావతీ రమేశుల నావ షికారును, తిమింగిలమును జంపి శంకరరావును రక్షించుటయును శబ్దరహితమగు కేవల నటనముతో బయస్కోపువలె చూపఁబడెను. కేవలము సీనును చూచు నభిలాషతో ప్రేక్షకులు రెండుసారులు సీనునకు “వన్సుమోర్” నిచ్చిరి. ద్వితీయ విశ్రాంతికాలమున రెండు కొండలపై వంతెనయు, క్రింద ప్రవాహమును, ఆ వంతెనపైనుండి ప్రభావతీ శంకరరావులు నడిచిపోవుటయు, శంకరరావు వంతెనను విరుగగొట్టుటయు, తులసీరావు పోలీసులతో వచ్చి రెండవప్రక్కనుండి తుపాకులను ప్రేల్చుటయు, పోలీసు లొక్కరొక్కరుగా కొండపైనుండి క్రిందికి దొరలి కూలుటయు, తులసీరావును ప్రేల్చుటకు శంకరరావు తుపాకిలోని గుండ్లయిపోవుటయు నిశ్శబ్ద నటనా రంగముగాఁ జూపఁబడెను. అట్టి గొప్పసీనులు ఆంధ్రదేశపు జిల్లాలలో ప్రదర్శింపఁ బడినపుడు చూపుట కీ సభవారి కవకాశము కలుగకున్నను, కేవలము సూర్యనారాయణగారి శంకరరావు నటసముతో ప్రేక్షకులను తృప్తి నందింపఁగలిగిరి. ఈ నాటకము నీతిదాయకమైన దని ప్రతివారును గ్రహింపకపోరు. ఇవి విషాదాంతమగుటయే యుక్తమని నా తలంపు. విషాదాంతముగనే ప్రతిసభవారును ప్రదర్శించుచున్నారు. శుభాంతరంగము నీ రెండవ కూర్పునందు విడిచివేయడమైనది.

ఈ నాటకమునఁగల గుణములను పాఠకులు గ్రహించి దోషములను నాకుగాని ప్రకాశకులకుగాని యెఱింగించినయెడల తృతీయముద్రణమున తప్పక సవరించుకొందు నని రసజ్ఞపాఠక మహాశయులకు మనవి చేసికొనుచున్నాను.

ఇట్లు బుధజనవిధేయుఁడు,

సోమరాజు రామానుజరావు,

భద్రాచలము.


_____________


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2021, prior to 1 January 1961) after the death of the author.