Jump to content

రంగనాథరామాయణము - ఉత్తరకాండ/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

రంగనాథరామాయణము

ఉత్తరకాండము

ఇయ్యది కాచవిభుఁడు, విఠ్ఠలరాజు నను నిరువు రన్నదమ్ములు తండ్రి (కోన బుద్దరాజు, ఈతఁడే పూర్వకాండమును రచించెను.) యాజ్ఞచే రచించిరి. ఇదితప్ప వేరొకగ్రంథము చేసినట్లుఁ గానరాదు. వీరు క్షత్రియు లనఁబడుచున్నారు. కృష్ణాతీరవాసులు. దీనిని 12 వ శతాబ్దాంతంబున రచించినట్లు కానఁబడుచున్నది. అనగా యిప్పటికి 700 సం॥లు కావచ్చుచున్నవి. ఇయ్యది భాస్కరరామాయణంబునకుఁ బూర్వమా, పరమా, సమకాలికమా యని విమర్శనీయంబు భాస్కర, రంగనాథరామాయణ విరచిత కవులిరువురు రాజునొద్దకు తమగ్రంథంబుల తీసుకొని వెళ్ళ రాజు రంగనాథరామాయణంబును గుడిచేతితోను, భాస్కరరామాయణంబును యెడమచేతితోను నందుకొనినట్లును యందుపై భాస్కరుఁడు కినిసి నీ కిచ్చుటకంటె గుఱ్ఱపువాని కిచ్చుట మంచిదని వెళ్ళిపోయిన ట్లొకగాథ కలదు. ఇందునుబట్టి నివి సమకాలికునివిగాఁ గన్పట్టుచున్నవి. ఈగాథ విశ్వాసనీయము కాదని పలువురయభిప్రాయము.

ఇఁకఁ బూర్వమా పరమా యని ఆలోచింతము. పూర్వకాండము పూర్వమే యని శైలినిబట్టియుఁ, గవిత్వసరణినిబట్టియు, యిదివరకు నెవ్వరైనను జేసినట్లును ప్రస్తావించకుండుటనుబట్టియు, సంస్కృతకవులనే స్తుతించుటనుబట్టియు, దేవునిపేరున రచించుటనుబట్టియు, ప్రాచీనకవిత్వలక్షణాధిక్రమమునఁ బోవుటఁబట్టియు పద్యకవిత్వంబునకుముందే ద్విపదకవిత్వ ముండుట మొదలగు కారణంబులఁబట్టి యిది ప్రాచీన ప్రథమరామాయణం బని దేలుచున్నది. ఉత్తరరామాయణముకూడ కవనధోరణిఁబట్టి పూర్వకా౦డము రచించినవారే అయియుండవచ్చునని కం॥ వీరేశలింగంపంతులు వారంటివారుకూడ యభిప్రాయపడుచున్నారు. అది సరియైనది కాదని మానమ్మకము. . ఏలయన సాధారణముగాఁ దాళపత్రగ్రంథాదులందు నక్కడక్కడ పోయినభాగములందు నాపూర్వగ్రంథశైలితో గలియుపదములఁ బూరించ యత్నించుచుండుటయు, ఒకకవీశ్వరునిశైలి నలవడఁజేసికొనుటకుఁ గుతూహల మున్నప్పుడు అది పట్టుప డుటకు నాతని గ్రంథములు చదివియు, శైలి కుదుర్చుకొనఁ బ్రయత్నించుటయు చూచుచునేయున్నారము. అదిఁ గాక యీతఁడు ఘనపండితుఁడు. లాక్షణికులుఁ గూడ నాతనిని లాక్షణికకవిగా నంగీకరించియున్నారు. మఱియు వీరల తండ్రి పూర్వకాండమును, తాము ఉత్తరకాండమును ఉభయంబులు ద్విపదకావ్యంబులే రచించుటయు పూర్వకాండకవనంబుతో అభేదముగా కలిసిపోయి ఏకగ్రంథముగా వచ్చునట్లు ప్రయత్నించి వ్రాయకూడదా. వీరు మంచివిద్వాంసులని చెప్పఁబడుచున్నవారలుగదా. కవనధోరణి పోలియున్నంతమాత్రన నాతఁడే దీని రచియించెనని యూహింపవలనుపడదు. తండ్రియాజ్ఞచే రచించినదియు, శైలిసరణిఁబట్టియు నిదియుగూడ నాతనికాలమునాటిదియే యని స్థిరపడుచున్నవి. కాన నిదికూడ భాస్కరరామాయణాదులకు ముందైయుండవచ్చును. ఆంధ్రదేశంబున నింకేరామాయణంబునకు దీనికి వచ్చినంతవ్యాప్తి వచ్చియుండమియే దీనిప్రాశస్త్యప్రాచీనత్వాదులు వెల్లడియగుచున్నవి. ఇయ్యది సలక్షణంబై, సరసకవితానిపుణత కలిగి, పదలాలిత్యంబుకలదై, సమంచితధారాప్రవాహమై, సహజశైలిని వ్రాయఁబడి పండితపామరజనానురంజకమై భక్తిరసమున నొప్పుచున్నది. వాఙ్మయాభివృద్ధి కెంతయుఁ దోడ్పాటగుచున్నది. పండితవరుఁడగు బుద్ధరాజే వీరలగుఱించి "బహుపురాణజ్ఞులు బహుకళాన్వితులు, బహుకార్యకోవిదుల్... నాకులదీపకుల్ నాకూర్మిసుతులు" అని స్తోత్రించుటయె వీరల పాండిత్యప్రకర్షణరసజ్ఞత్యాదులు వెల్లడియగుచున్నవి. గుణగ్రహణపారీణు లగు చదువరు లిందలి రసమును గ్రహించి కృతార్ధు లయ్యెదరు గాక.

ఇందుఁ గొంతభాగము లేటు పోలవరం జమీందారుగారి సరస్వతిపత్రికలో ముద్రితమైనది. ఇదియును మిగిలిన తాళపత్రగ్రంథంబును ‘‘ఆంధ్రపరిశోధకమహామండలి"కి స్వార్థత్యాగబుద్ధితో నొసంగిన శతావధానులు దివాకర్ల తిరుపతిశాస్త్రిగారికి నాకృతజ్ఞతావందనంబు లర్పించుచున్నవాఁడ.

ఇట్లు

చిత్రాడ,

చెలికాని లచ్చారావు,

9–7–20

సంపాదకుఁడు, అముద్రితాంధ్రగ్రంథసర్వస్వము

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.