రంగనాథరామాయణము - ఉత్తరకాండ/ఉత్తరకాండ
శ్రీరస్తు
రంగనాథరామాయణము
ఉత్తరకాండము
(ద్విపదకావ్యము)
శ్రీనాథచరణరాజీవసేవకుఁడు, భానుకోటిప్రభాభాసమానుండు
మనుచరిత్రుఁడు శత్రుమత్తమాతంగ, ఘనఘటాపాటనకంఠీరవుండు
కోనవ౦శార్ణవకువలయప్రియుఁడు, నానొప్పు కోనగన్నక్షితీంద్రునకు
ననుకూలయై యున్న యన్నమాంబికకుఁ, దనయుండు సాహిత్యతత్త్వకోవిదుఁడు
దానప్రసిద్ధుండు ధర్మశీలుండు, భూనుతాచారుండు బుద్ధభూవిభుఁడు.
అఖిలపురాణేతిహాససమ్మతము, నిఖిలలక్షణగుణాన్వీతము నగుచుఁ
దెలుఁగున నొప్పఁగా ద్విపదరూపమున, నలిఁ బూర్వరామాయణము మున్నుఁ జెప్పి
సకలేశుఁడగు రామచంద్రువర్తనము, సకలంబు రచియించి సకలపుణ్యముల
సకలలోకులుఁ దన్ను సన్నుతి సేయ, నకలంకమహిమల నందెదఁగాక
యని నిశ్చయము చేసి యంతరంగమునఁ, దనయిష్టదేవతాధ్యానంబు సేయ
గరుడాధిరూఢుఁడై కరపంకజముల, నరుదుగా శ౦ఖశార్ఙ్గాదులు మెఱయ
నురమున శ్రీదేవి కుద్దియై పరఁగి, చిరలీలఁ గౌస్తుభశ్రీ చెన్ను మిగుల
భువనకారకునకుఁ బుట్టినిల్లైన, నవవికసితనాభినలినంబు మెఱయ
సరిదివారాత్రులు సంగడిఁ బొలయఁ, గర మొప్పు రవిశశుల్ కన్నులై వెలుఁగ
ననిమిషుల్ గొలువఁగ నచ్చర లాడ, సనకాదియోగీంద్రసన్నుతుల్ చెలఁగఁ
బీతాంబరం బొప్పఁ బృథులనీలాద్రి, భాతి మే నమరంగఁ బంకజోదరుఁడు
భానుకోటిప్రభాభాసితుం డగుచు, మానసంబునఁ దోఁచి మహితవాక్యముల
నీవు నా కెంతయు నెరయ భక్తుఁడవు, నీవు పుణ్యుండవు నీవు మాన్యుఁడవు
గావున నీభక్తిఁ గైకొంటి మేము, నీ వింక మముఁ గూడి నెమ్మి నేతెమ్ము
నీవాంఛితార్థంబు నిర్వహింపంగ, నీవరనందనుల్ నిపుణమానసులు
వారి నియోగింపు వారు నీకోర్కి, గారవంబునఁ జేయఁగలవారు మీఁద
నని పల్కి విచ్చేసె నాదేవునాజ్ఞ, మనమున ధరియించి మముఁ బిల్వఁబంచి
యాతతప్రీతితో నాతెఱంగెల్ల, మాతోడ వినిపించి మముఁ గటాక్షించి
మీరు పుణ్యాత్ములు మిహిరప్రతాపు, లారూఢభుజశక్తు లధికవైభవులు
చండభుజాదండసకలారిదండ, ఖండనోదగ్రు లఖండవిక్రములు
కవిరాజభోజులు కమనీయతేజు, లవిరళసూనృతు లతికృపాన్వితులు
హరిపదాంబుజభక్తు లార్యానురక్తు, లురుతరప్రావీణ్యు లుదధిగాంభీర్య
లున్నతాయుష్మంతు లుత్తమోత్తములు, సన్నుతాచారులు సౌభాగ్యయుతులు
బహుపురాణజ్ఞులు బహుకళాన్వితులు, బహుకార్యకోవిదుల్ బహుదానపరులు
నాకులదీపకుల్ నాగుణాన్వితులు, నాకీర్తివర్ధనుల్ నాకూర్మిసుతులుఁ
గాన నాపూనినకథ యెల్లజనులు, మానుగాఁ గొనియాడ మధురవాక్యముల
నెమ్మిఁ జెప్పుఁడు మీరు నిపుణులై యనుచు, మమ్ముఁ బంచిన మేము మాతండ్రిప్రతిన
చిరకీర్తు లెసగఁగఁ జెల్లింపఁగనుట, పరమధర్మం బని భక్తితో గోరి
శ్రీదేవి దేవియై చిత్తంబులోన, నేదేవదేవుని నెలమి భావించు
నేదేవుముఖమున నింద్రుండు శిఖియు, భూదేవతలు మున్ను పుట్టి రిం పెసఁగఁ
బొలుపార నేదేవుభుజములఁ బొడమి, రలఘుతేజోమూర్తు లైనపార్థివులు
ధీరులై వైశ్యు లేదేవునితొడల, నారంగ జనియించి రంచితద్యుతులు
సురుచిరచిత్తులై శూద్రు లేదేవు, చరణాంబుజంబుల జనియించి రెలమి
నేచి మూఁడడుగుల నేదేవుఁ డఖిల, భూచక్రమును గొనిపోయినయపుడు
పదతలంబున నేడుపాతాళములును, బదపంకజంబులపై రసాతలము
నిరవార జంఘల నెల్లపెన్నిధులు, సరిదపాంపతులును జానుదేశముల
ననిమిషాచలమందరాద్రు లంఘ్రులను, దనరు విశ్వేదేవతలు కటిస్థలిని
మూలప్రజాపతి ముష్కంబునందు, లీలమై మదనుండు లింగంబునందుఁ
దగునాభిక్రిందను దనుసంధులందు, మొగి మరుత్తులు కుక్షి మూఁడులోకములు
నందముఖంబులు న౦దదేవతలు, సంధులనదులు నిస్టాపూర్తములును
వసువులు వీపున వామహస్తమున, నసమానగతి రుద్రు లంసభాగమునఁ
బ్రక్క నంభోధులు బాహుదండములు, దిక్కులు నమృతదీధితి మానసమున
నక్కున నజుఁడును నంబుజోదరుఁడు, ముక్కంటియును దేవముఖ్యుఁ డింద్రుండు
గళమున నదితియు గళరేఖలందు, విలసికద్యుతులతో విద్యలన్నియును
నరుదార సప్తర్షు లాననాబ్జమున, మెఱయు వేదంబులు ముఖగహ్వరమున
నవమౌక్తికంబులు నవ్యదంతములు, వివిధసంస్కారముల్ వివిధసూక్తులును
నమరుఫాలంబున నఖిలశాస్త్రములుఁ, గమలయు ధర్మార్థకామమోక్షములుఁ
బరఁగ నోష్ఠముల నంబరము నశ్వినులుఁ, గర మొప్ప నూర్పుల గంధవహుండుఁ
జెన్నొంద భారతి జిహ్వాగ్రవీథిఁ, గన్నుల రవిసుధాకరమండలములు
కలితకాంతులు కృత్తికలు మున్నుగాఁగ, నలువార ఱెప్పల నక్షత్రములును
నారంగ శిరమున నమరలోకంబుఁ, దోరంపుశిఖయందు ధ్రువమండలంబుఁ
బెక్కురూపులు దాల్చి పెంపారుచుండు, నొక్కరూ పగుచుండు నొక్కరూపమున
సకలభూతములందుఁ జరియి౦చుచు౦డు, సకలభూతోద్భవస్థానమై యుండు
దేవవంద్యుఁడు రమాధీశుండు సకల, దేవతలకుఁ దానె దిక్కైనవాఁడు
ధర్మవ్యవస్థలు దానములెల్ల, ధర్మైకసాక్షియై తగఁజూచువాఁడు
నవిజేయుఁడై యుండు నఖిలదానవులఁ, బవరంబులోపలఁ బరిమార్చుచుండుఁ
గల్పాదిగతులెల్లఁ గనురెప్ప పెట్టు, నల్పకాలములోన నడఁగించుచుండు
వేధయై నిర్మించు విష్ణుఁడై మనుచుఁ, గ్రోధించి కడతేర్చు రుద్రుఁడై యుండి
యణుమాత్రుఁడై యుండు నధికమై యుండు, నణిమాదిగుణముల కందరా కుండు
వెలి నుండు లో నుండు వెలితిగా నుండుఁ, గలఁడన్నచోట నక్కజముగా నుండు
నెఱిఁగించు నాతఁడు నెఱిఁగెడు నతఁడు, నెఱుకకు విషయంబు నెఱుకయుఁ గూడి
నెఱిఁగిన యటమీఁద నేకరూపమునఁ, దెఱపి లేకున్న యాదీప్తియై యుండు
సకలదానవ్రతజపతపక్రతువు, లకలంకగతిఁ జేయు నంచితాత్ములకు
ఫలరూపమై యుండు ఫలదుఁడై యుండు, వెలి నుండు లో నుండు వెలితిగాకుండు
నిర్మలజ్యోతియై నిగమార్థవీథిఁ, గర్మకలాధీనగతిఁ బొందకుండు
యోగాత్ముఁడై యుండు యోగమై యుండు, యోగీంద్రుఁడై యుండు యోగియై యుండు
ముక్తికాములకెల్ల ముక్తియై యుండు, భక్తులు భావించు భావమై యుండు
మధుమాధవాదిగా మాసనామముల, నధికనిరూఢిఁ గాలాత్ముఁడై యుండుఁ
బురుషోత్త మాచ్యుత పుండరీకాక్ష, హరి విష్ణు నారాయణాది నామముల
దివ్యస్వరూపుఁడై దీపించుచుండు, నవ్యక్తుఁడై యుండు నందరాకుండు
నజ్ఞానతమ మంతరంగగేహమున, విజ్ఞానదీపంబు వెలుఁగునఁ దొలఁగ
ననిశంబుఁ దలపోయు ననఘులం దుండు, నని మత్కులస్వామి యగు విష్ణుఁ గొలిచి,
కల్మషంబులు దూలఁ గణనాథుఁ గొలిచి, వాల్మీకిఁ గొనియాడి వాణిఁ గీర్తించి
యారంగ మత్స్యకూర్మాదిదివ్యావ, తారంబులం దెల్లఁ దలపోసిచూడ
రామావతారంబు రమణీయమగుట, రాసుపావనచరిత్రము దివ్యభాష
లోకానురంజనశ్లోకబంధములఁ, జేకొని వాల్మీకి చెప్పినజాడ
మాతండ్రి బుద్ధక్షమానాథుపేర, నాతతఘనుపేర ననఘునిపేర
ఘనుఁడు మీసరగండ కాచభూవరుఁడు, నని జనుల్ గొనియాడ నర్థితో మేము
వినుతనూతనపదద్విపదకావ్యమున, ఘనమైన పాకంబు గాటమౌ శయ్యఁ
బాకటంబుగ నాఁధ్రభాషఁ జెప్పంగఁ, గైకొన్న యుత్తరకథ యెట్టిదనిన.
కథాప్రారంభము
.శ్రీరామచంద్రుండు సితకీర్తు లలర, ఘోరాజి రాక్షసకోట్ల నిర్జించి
మరల నయోధ్యకు మహిమతో వచ్చి, చిరలీల రాజ్యంబు సేయుచున్నెడను
శుభమూర్తి నమ్మహాశూరు దీవింప, నభిలాష జనుదెంచి రఖిలసంయములు
నొగి తూర్పుదిక్కుననుండి కౌశికుఁడు, తగయవక్త్రితుఁడను తాపసోత్తముఁడు
గాలవుండను పేరుగల తపోధనుఁడు, నోలి కణ్వుండు గార్గ్యుండును మఱియు
దక్షిణంబున నుండి తను మునుల్ గొలువ, నక్షీణపుణ్యాత్ముఁ డగు నగస్త్యుండు
సురుచిరవ్రతుఁడైన సుముఖుండు నియమ, పరుఁడైన విముఖుండు పడమటనుండి
మథితకల్మషమహామతి త్రిశంకుండుఁ, గ్రథనుండు దూర్వుండు నునుఁడు లోధ్రకుఁడు
ధనదుదిక్కుననుండి తగ భరద్వాజ, మునియు విశ్వామిత్రమునివరేణ్యుండు
జమదగ్నియును నత్రి సంయమీశ్వరుఁడు, నమితతేజుండు కశ్యపుఁడు గౌతముఁడు
నిరుపమమహిమైకనిధి వసిష్ఠుండు, కర మర్థి బహుశిష్యగణములు గొలువు
నధికతపోధను లధికశాస్త్రజ్ఞు, లధికులు వేదవేదాంగపారగులు
సప్తార్చిరాదిత్యసమతేజు లట్లు, సప్తర్షు లాదిగా సంయమీశ్వరులు
వీనుల కింపారు వేదనాదములు, మానుగా నేతెంచి మహి నొప్పి రంత
సకలసమ్మతిఁ గుంభజన్ముఁ డందఱకు, నకలంకమతియుఁ గార్యజ్ఞుండు నగుచు
నగరివాకిలి జేరి నరనాథచంద్రుఁ, దగవొప్ప రఘురాముఁ దర్శింపఁదలఁచి,
దౌవారికునిఁ జూచి తరమైన రామ, భూవరు నెఱిఁగింపఁ బొమ్ము నీ వనిన
నతఁ డేగి ముకుళితహస్తుఁడై నిలిచి, పతిదృష్టి తనమీఁదఁ బాఱుటఁ జూచి
జనవాథ మిముఁ గాన సకలసంయములఁ, గొనివచ్చియున్నాఁడు కుంభసంభవుఁడు
మొగసాల ననవుఁడు ముదితాత్ముఁ డగుచు, జగదీశుఁ డెదురుగాఁ జనుదెంచి మ్రొక్కె
పరువడిమై నర్ఘ్యపాద్యాదివిధుల, గురుభక్తిఁ బూజించి గోదాన మిచ్చి
భక్తిఁ దోడ్కొనివచ్చి పరిచరజనులు, యుక్తకార్యముల నియోగింప వారు
భద్రకాంచనమయబహురత్నచిత్ర, భద్రాసనంబులపై దర్భ పఱచి
చారుకృష్ణాజినాస్తరణముల్ చెలువ, మారంగ రచియింప నందుఁ గూర్చుండి
కుశలమే రఘురామ! కువలయజనులు, కుశలమా! యని నీకుఁ గుశలంబె కాదె
పరుషవిక్రము నకంపను జంబుమాలి, నురుబాహుబలుని యుధాజిత్తు మత్తు
నక్షీణబలు విరూపాక్షు సంగ్రామ, దక్షతగల మహోదర ఘటోదరుల
శూరోత్తముని బ్రహ్మసుతువరాంతకుని, ఘోరవిక్రముల నికుంభకుంభులను
నంతకసముని దేవాంతకు వికటు, సంతతాహవజయశాలి దుర్ముఖుని
నతులబలోదగ్రుఁడగు మహావీరు, నతికాయు ఘనకాయుఁడగు కుంభకర్ణు
వీ రాదిగాగల వీరరాక్షసుల, ఘోరాజిఁ జంపితి కువలయాధీశ
సుతబంధుయుతముగా సురలోకవైరి, నతిరయంబునఁ జంపి తాదశాననుని
నీవు విల్లందిన నిఖిలంబు బెదరు, రావణుం డన నెంత రఘువీర నీకు
ననిమిషదుర్జయుండగు తండ్రికంటె, నినకులోత్తమ చాలనెక్కుడు గాదె
యింద్రాదిదివిజుల హృదయశల్యంబు, నింద్రజిత్తును గెల్వ నెవ్వఁడు చాలు
నతికాయు నడఁప నీయనుజుండు దక్క, నితరుఁ డెవ్వఁడు గలఁ డిన్నియు నేల
నక్షీణబలుఁడు బ్రహ్మాస్త్రప్రయోగ, దక్షుండు కపటయుద్ధముల దుర్జయుఁడు
కాలుని గెలిచిన కడిదివీరుండు, త్రైలోక్యజయశాలి దశకంఠసుతుఁడు
మేఘనాదునికి సౌమిత్రిఁ దప్పించి, రాఘవ నిలుతురె రణమున నొరులు
అభియాతికులమెల్ల నణఁచి లోకముల, కభయ మిచ్చితి శుభం బగుఁగాక మీకు
సమరంబులోపల సకలరాక్షసుల, సమయించి వచ్చి రాజ్యమును గైకొన్న.
నినుఁ జూడఁగంటిమి నిండె మాతపము, అనఘాత్మ ధన్యుల మైతి మే మనిన
ముకుళితహస్తుఁడై మునుల నీక్షించి, సకలేశుఁడగు రామచంద్రుఁడు పలికె
ననికి దక్షులు విరూపాక్షాదు లుండ, ఘనసత్త్వుఁడగు కుంభకర్ణు డుండఁగను
భుజవిక్రమాటోపభువనభీకరుఁడు, రజనీచరేంద్రుండు రావణుం డుండ
మేఘనాదుని మీరు మిగులఁ బేర్కొంటి, రాఘనుబలమును నధికవిక్రమము
సామర్థ్యమును నెట్టిచందంబు తండ్రి, కేమికారణమున నెక్కుఁడైనాఁడు
వరము లేగతిఁ గొన్నవాఁ డంతవట్టు, కర మర్థి విన నిచ్చ గలదు నా కనిన
ననఘుఁడు మునివరుఁడగు నగస్త్యుండు, నతినయోక్తుల రాఘవాగ్రణి కనియె
మఱి మేఘనాదుని మహితప్రభావ, మెఱుఁగఁజెప్పెద మనుజేంద్ర ము న్నతని
తనయుఁగాఁ బడసిన దశకంఠుకులము, జననప్రకారంబుఁ జరితంబు వినుము
ప్రథమయుగంబున బ్రహ్మపుత్రుండు, ప్రథితోరుతరకీర్తి పరమార్థవిదుఁడు
నిరుపమచరితుఁడు నిర్మలధర్మ, పరుఁడు పులస్త్యుఁ డన్ బ్రహ్మర్షివరుఁడు
సంపూర్ణగుణముల జనకునిభంగిఁ, బెంపార సురలకుఁ బ్రియమైనవాఁడు
దివి జారి చేరువఁ దృణబిందుఁ డనఁగ, నవిరళప్రతినిష్ఠ నధికుఁడై వెలయు
నట్టియారాజర్షియాశ్రమంబునకుఁ, బట్టుగా భానుప్రభాభాసి యగుచు
నిర్మలస్వాధ్యాయనిరతుఁడై విహిత, ధర్మక్రమంబునం దప మాచరింప
నరలోకనాయక నాగకన్యకలు, కరమర్థి రాజర్షికన్యకాగణము
నచ్చలేమలు నమరకన్యకలు, నిచ్చలు నేతెంచి నేర్పుమై నచటఁ
బాడుచు నింపార బహువాద్యగతుల, నాడుచు నుండఁగ నాపులస్త్యుండు
కనుఁగొని కోపించి కన్నియలార, ననుఁ గలంపఁగ వచ్చి నా రిట్లు మీర
లేకన్య నావల నిమ్ముగాఁ జూచు, నాకన్య ధరియించు నపుడ గర్భంబు
నని శపియించిన నతిభీతిఁ బొంది, కనుగొని యటఁ బాసి కాంతలు చనిరి
పరుషోగ్రమైన యాపలుకులు వినక, తిరమైనవేడుక తృణబిందుపుత్రి
యాదెస మెలఁగుచు ననతిదూరమున, వేదవాక్యధ్వని విని చేరవచ్చి
యమ్మహాత్మునిఁ జూడ నప్డ గర్భంబు, గ్రమ్మఁగాఁ గనుఁగొని కడుభీతిఁ బొంది
యిది యేమి మూఁడెనో యింతలో ననుచు, మదిలోన శంకించి మరల నేతెంచి
తనతండ్రిముందర దైన్యంబుతోడఁ, దనరారుసిగ్గునఁ దలవంచియున్న
నాతృణబిందుండు నద్భుతస్తిమిత, చేతస్కుఁడై పుత్రిచేడ్పాటుఁ జూచి
యకట నీ కిదియు ననర్హంబు గాదె, వికృతభావం జేమివిధమున వచ్చె
నెవ్వరి కెగ్గు నీ వేమి కావించి, తెవ్వరు శపియించి రేదిక్కు చనితి
తప్పక నాతోడఁ దలఁకు నీ వుడిగి, చెప్పుదుగా కన్నఁ జేతులు మొగిచి
జనక! పులస్త్యునాశ్రమసమీపమునఁ, జనఁజొచ్చియచట నా సఖులు లేకున్న
వెదకుచో ని ట్లైనవేష మాక్షణమె, విదితమై వచ్చితి వెఱచి మీకడకు
ననవుడు తృణబిందువాత్మలోనంతఁ, గని కూఁతుఁ దోడ్కొని కడువేగ నరిగి
యాపులస్త్యునితోడ ననియె నీకన్యఁ, దాపసోత్తమ మీరు దయఁ జూడవలయు
నెలమిఁ దపోనిష్ఠ నింద్రియజయము, గలమీకు శుశ్రూషఁ గావించుఁగాక
యనిన పులస్త్యుఁ డాయబలఁ గైకొన్న, దినకరతేజుండు తృణబిందుఁ డరిగె
సముచితస్థితి నంత సంయమీశ్వరుఁడు, విమలధర్మాచారవినయశీలములఁ
దనకు సంతతమును దగిలి శుశ్రూష, లొనరింప నమ్ముని వనిత నీక్షించి
నలినలోచన నీకు ననుఁ బోలు నుభయ, కులకీర్తి నిచ్చితిఁ గొడుకుఁ బౌలస్త్యు
వాఁడును దా విశ్రవసుఁ డనుపేరి, వాఁడునై తగునని ధ్వని వింటిఁ గాన
నని పల్క గర్భంబు నభివృద్ధిఁ బొంది, వనజాక్షి సుతు విశ్రవసుఁ గాంచె నంత
ననఘాత్మ కాళింది కాపులస్త్యునకు, ఘనుఁడు పౌలస్త్యుండు కర మర్థిఁ బుట్టి
ముజ్జగంబుల ధర్మమును బేరుకొనఁగ, సజ్జనుఁడై వేదశాస్త్రము లెఱిఁగి
నృపవర యతఁడును నియతితో ఘోర, తపము సేయఁగ భరద్వాజుఁ డేతించి
వర్ణింపఁదగు రూపవతి యైనదేవ, వర్ణిని యనుకూఁతు వానికి నిచ్చె
నతఁడును నాపత్నియం దొక్కకొడుకు, నతులతేజోనిధి నవనీశ వడసె
నంబుజాసనుఁ డంత నచటికి సంత, సంబున దేవర్షిసహితుఁడై వచ్చి
వినుతింప నీతఁడు విశ్రవసునకు, జనియించెఁ గాన వైశ్రవసుడన్ పేర
నమరుఁ గాకనునుడు హుతాగ్నియుఁ బోలి, విమలతేజోభూతి వెలుఁగుచు నంత
వేయేండ్లు ననశనవిధిఁ జేసెఁ దపము, వాయు వాహారమై వర్తించి పిదప
వింతగాఁ దపమున కంతరంగమున, సంతోష మందుచు జలజసంభవుఁడు
నింద్రాదిసురలతో నేతెంచి యతని, యింద్రియజయమున కెంతయు నలరి
వర మేమి సంయమివర వేడు మనినఁ, బరిపూర్ణతరలోకపాలత్వ మడిగె;
నడిగిన నపుడు నాలవలోకపాలుఁ, బొడమింపఁ దలఁపు నాబుద్ధిలోఁ గూడె
వాసవసమవర్తివరుణులతోడ, వాసి కెక్కుచు ధనేశ్వరుఁడవై యుండు
మినసమప్రభగల యీపుష్పకంబుఁ, గొను మంచు వర మొసంగుచుఁ బోయె నజుఁడు
ధనపతియును నింత తండ్రిసన్నిధికిఁ, జనుదెంచి వినతుఁడై సకలంబుఁ జెప్పి
జలజాసనుఁడు నివాసస్థాన మనఁగఁ, బలుకఁడు నాకున్కిప ట్టేది యనినఁ
బసిఁడికోటలు ప్రభాభాసితరత్న, విశదచిత్రములైన వివిధసౌధముల
భర్మనిర్మితసాలభంజికాకలిత, నిర్మలకలధౌతనిబిడహర్మ్యముల
మహనీయహాటకమణిగోపురముల, బహురత్నతోరణప్రచురమార్గముల
నరుదులై మెఱయంగ నమరేంద్రుపురముఁ, బురణించు లంక యన్ పురలలామంబు
దక్షుఁడై సకలంబుఁ దగ విశ్వకర్త, రాక్షసులకు నుండ రచియించినాఁడు
తనయుండ నీవందుఁ దగు రాజ్యసుఖము, లనుభవించుచునుండుమని పల్క నతఁడు
తోయధిపరిఘయై దుర్భేద్య మగుచు, నాయతస్థితిఁ ద్రికూటాద్రిమధ్యమునఁ
బెంపారు లంకకుఁ బ్రియముతో వచ్చి, యింపారు నప్పురం బెలమి నేలుదును
నిచ్చలు గంధర్వనిర్జరస్తుతుల, నచ్చరిలేమల యాటపాటలను
మది కొప్ప నుదయార్కుమాడ్కిఁ దేజమునఁ, బొదలుచు లీలమై పుష్పకం బెక్కి
తక్కనిభక్తితోఁ దల్లిదండ్రులకు, మ్రొక్కి పోవుచు నిట్లు ముదముతో నుండె
ననవుఁడు నతినిర్మలాగ్నియుఁబోలె, జనపతి తలయూఁచి సంయమిఁ జూచి
యెలమి రాక్షసులకు నీలంక మున్ను, కలుగుట విదితంబుగా వింటి నేఁడు
పొరిఁ బులస్త్యునికులంబున నిశాచరులు, పరఁగుట విందు నప్పౌలస్త్యునందు
ఘనుఁడు రావణకుంభకర్ణులకంటె, ననుపమబలుఁడు ప్రహస్తునికంటెఁ
గడిమి నవ్వికటునికంటె రావణుని, కొడుకులకంటె నెక్కుడు బాహుబలము
గలవాడు తొంటిరాక్షసు లెవ్వ రీడు, బలవంతుఁ డరివీరభయుఁ డెవ్వఁ డరయ
నతితరజయశీలుఁ డగుచున్న విష్ణు, చేత నేగతిఁ బరాజితు లైరి వారు
విన వేడ్కఁ బుట్టెడు వివరించి చెప్పుఁ, డన నమ్మహాత్ముండు ననియె రామునకు
నరనాథ కొందఱ నలువ యుగాదిఁ, బొరి జలంబులలోనఁ బుట్టించె నంత
వారు నాఁకలినీరువట్టును బట్టి, వారిజాసను గానవచ్చి కే ల్మొగిచి
యే మెట్లు మనువార మిటమీఁద మాకు, నేమివర్తన మన్న నించుక నవ్వి
యుదకంబు రక్షించు నొగి నంచుఁ బలికె, మది వారిపలుకులు మహితాత్ముఁ డెఱిఁగి
రక్షింతుమనువారు రమణ రాక్షసులు, శిక్షింతుమనువారు క్షితి యక్షు లనియె
రాక్షసకులమున రఘువర కడిమి, నీక్షింప హేతిప్రహేతు లన్వారు
మధుకైటభులఁ బోలి మహి నిశాచరుల, కధిపతులై పుట్టి రందుఁ బ్రహేతి
పరిణయం బొల్లఁడు పరఁగంగ హేతి, వరియించె నుభయవైవస్వతానుజుఁడు
అంత విద్యుత్కేశుఁ డనువాఁడు పుట్టె, నంతకు చెలియలి కాహేతివలన
నతఁడును సోదకంబగు మేఘలీల, నతిశయిల్లుచు నూత్నయౌవనుఁ డైన
సాలకటంకటాసంజ్ఞాభిధానఁ, బోల సంధ్యాదేవి పుత్త్రి పుత్త్రునకు
హేతి పెండిలి సేసె నెలమితో నదియు, జాతగర్భస్థితి జని మందిరమున
సుతుఁ గాంచి యట నొక్కచోఁ బాఱవైచి, రతికిఁ గ్రమ్మఱ వచ్చె రమణునికడకు
బాలుఁడు నాననపంకజంబునకుఁ, గేలుమాటుగఁ జేసి గిరిగుహల్ చెలఁగ
నెలుఁగెత్తి పిలిచె బీరెండ నోరెండఁ, బలుమాఱు నుఱిమిన వంగి వాపోవ
నందివాహనముపై నగరాజసుతయు, నిందుమౌళియు మింట నేగుచునుండి
విని గౌరి వెరగంది వింటివే దేవ, కనుఁగొంటివే వీనిఁ గనుఁగొనవలయు
నరుదైన దయపుట్టె నటుగాన మీరు, పరమేశ యీబాలుఁ బాలింపవలయు
నని విన్నవించిన నప్పుడు వాని, కనుపమస్థితిఁ దల్లి యంతప్రాయంబు
నమరత్వమును నిచ్చె నమ్మహాదేవుఁ, డమరఁ గర్భంబున నపుడ జన్మంబు
తమ సవితృలపాటిదగువయఃస్థితులు, నుమయును వర మిచ్చె నొగి రాక్షసునకు
నంత సుకేశాఖ్యుఁడై వాఁడు జనని, యంతప్రాయమున వాఁ డమరుఁడు నగుచుఁ
బురుహూతమహిమతో భువనంబు లద్రువ, వరగర్వమునఁ క్రొవ్వి వర్తించుచుండ
గ్రామణియనుపేరి గంధర్వుఁ డతని, సామర్థ్య మూహించి సమ్మదం బెసఁగ
వరరూపవతి వేదవతియనుకన్యఁ, బరఁగంగ నతనికిఁ బత్నిఁగా నిచ్చె
లీల నాతఁడు సుమాలిని మాల్యవంతు, మాలిని గనియె నమ్మత్స్యాక్షివలన
మూఁడగ్నులను రుద్రు మూఁడునేత్రముల, మూఁడుమంత్రంబుల మూఁడువాయువులఁ
బోలి యామువ్వురుఁ బొలుపార మేరు, శైలంబునకు నేగి సకలలోకములు
భయమందఁ దపములు పరమేష్ఠిఁ గూర్చి, నియతితోఁ జేయంగ నీరజాసనుఁడు
కనకాద్రి కేతెంచి ఘనులార! వేఁడి, కొనుఁ డేమివరములు కోర్కి మీ కనిన
ముగురు విచారించి ముకుళితహస్తు, లగుచు వా రతిభక్తి నాబ్రహ్మఁ జూచి
యెనసి మే మన్యోన్యహితులమై యుండ, వినుతతేజంబుల విలసిల్లుచుండ
నరుల కజేయులమై యుండనిమ్ము, చిరజీవులై యుండఁ జేయుము మమ్ము
ననిన నవ్వరములు నబ్జజుఁ డొసఁగి, తనలోకమున కేగెఁ దదనంతరంబ
వారిజసనదత్తవరశక్తిఁ జేసి, వారును ముదమంది వారింపఁబడక
ననిమిషుల్ మొదలుగా నఖిలలోకముల, జనులఁ బాధించుచు జనలోకనాథ!
దుర్మదచరితు లాదుర్జయుల్ విశ్వకర్మయొద్దకు వచ్చి మనుఁడ నేర్పెసఁగ
నీవు నివాసముల్ నిర్మింతు సకలదేవతాగంధర్వదితిసుతాదులకు
మాకు నింపెసఁగంగ మంథాద్రిపైన, శ్రీకిఁ బట్టగు హేమశిఖరిపైనైన
హిమవంతముననైన నెల్లసంపదలఁ, గమనీయరచనలు గలపట్టనంబు
నిర్మింపు నీ వన్న నెరయంగ విశ్వ, కర్మయు వారితోఁ గరమర్థిఁ బలికె
వినుఁడు పురాతనవృత్తాంత మొకటి యనఘుండు నారదుఁ డఖిలలోకములుఁ
దిరిగి యొక్కెడ వాయుదేవుని గాంచి, యరుదార నతనితో ననియె నీరీతి
ని న్నొక్క టడిగెద నిక్కంబుఁ జెప్పు, మిన్నిలోకములకు నెక్కుడు బలము
గలవారు వీ రని గణుతింపుమనిన, నలరుచు నిట్లను నాగంధవహుఁడు
త్రిగుణాత్మకమ్మైన దేదీప్యమైన, ముగురువేలుపులకు మొగ యాకసంబు
కన్న నే నధికసత్వాఢ్యుండ నైతి, ననిన నీకంటె సత్వాఢ్యులు లేరె
నీయవనీతలం బెల్ల ధరించు, నాయనంతుండు సత్వాఢ్యుండు గాఁడె
యనిన నవ్వుచు నిట్టు లనె గంధవహుఁడు, వినుము శేషుండు నావిక్రమమునకు
నెన గాఁడు చెప్పెద వేల! మునీంద్ర, యనిన నావచనంబు నాత్మలో మఱల
కనఘుండు చనుదెంచు నా శేషుఁ డెల్లి, నని శేషవరునొద్ద కాప్రొద్దె పోయి
వినిపించె సకలంబు విశదంబు గాఁగ, విని యనంతుం డతివేగంబె కదలి
కనకాద్రికడ నున్న కరువలిఁ గాంచి, వినుమని పలికెఁ బ్రవీణత మెఱసి
బలవిక్రమంబులు పలుమాఱుఁ జెప్ప, నిలువక పాఱెడు నీతోడి దేమి
లక్షయోజనముల లలిఁ బొడ వగుచు, నక్షీణశిఖరాళి నలరు నీయద్రిఁ
గప్పెదఁబడగలఁ గదలించితేని, నిప్పుడు నీసత్వ మెఱిఁగెద ననుచుఁ
బాటించి మణిఫణాపఙ్కులచేత, హాటగిరిఁ గప్పె నపుడ శేషుండు
నన్నివాయువుల నొక్కంతగాఁ గూర్చి, పన్నగవరుఁ గరువలి తాఁకుటయును
నలవడ యోగంబునం దెల్లప్రొద్దుఁ, జలియింపకుండెడి శంభుండ పోలి
యున్న నావాయువు లొగి లోకపంఙ్తు, లన్నియు గుండ్లుబెం డ్లాడంగదొణఁగెఁ
దొడఁగిన దేవతల్ తుప్పునఁ దూలి, వడి బ్రహ్మయొద్దకు వచ్చి కే ల్మొగిచి
దేవలోకములెల్లఁ దెగి చెడిపోవు, నీవాయు వెడపక నిటు వీఁచెనేని
యనిన నాబ్రహ్మ శేషాహియొద్దకును, జనుదెంచి యిట్లను జతురవాక్యముల
విశ్వంభరునిఁ దాల్చి విశ్వంబుఁ దాల్చి, శాశ్వతకీర్తియు క్షమ గలనీకు
నీయెడ లోకంబు లెల్ల నశించు, వాయువుతో స్పర్థ వలదు నాగేంద్ర
యని పద్మభవుఁ డాఁడ నయ్యనంతుండు, తనలోనఁ బరమశాంతంబును బొంది
యొకపడ గించుక యోరసేయుటయు, నకలంక మగువాయు వందులఁ జొచ్చి
ధృతి నొక్కశిఖర ముద్వృత్తిని విఱిచి, యతివేగమున దక్షిణాబ్ధిలో వైవ
నదియ త్రికూటమై యమరుచు నెపుడుఁ, బదిలమై యత్యంతబలమయై చూడ
నక్షత్రవలయంబు నడుమగాఁ బెరిఁగి, దక్షిణవారాశి తనుఁ జుట్టియుండ
నమరుఁ ద్రికూటాద్రి యాత్రికూటమున, నమరేంద్రుపనుపున నమరించినాఁడఁ
జెలువార నతిచిత్రచిత్రహర్మ్యములు, కలధౌతబహురత్నకలితశిల్పములు
గలగృహప్రాకారఘనగోపురాదు, లలవడఁగా లంక యనునొక్కపురము
నది విపక్షాభేద్య మగుచుఁ బక్షులకు, గదియంగ రాకుండు గగనంబుఁ దాఁకి
యందు రాక్షసు లుండి గర్హత నెలమిఁ, బొందుగా బొండు నప్పురమున కనిన
వారు నాలంకకు వడి నేగుదెంచి, ...................................................
తగ సుమాలికి నిచ్చె దనపెద్దకూఁతు, మగఁటిమి వారు నమ్మాల్యవంతునకు
నెలమి రెండవకూఁతు నిచ్చెసౌభాగ్య, నిలయ మూఁడవకూఁతు నిచ్చెమాలికిని
బదపడి వార లప్పడఁతులఁ గూడి, మదనరసాస్తకమతులతో బడలి
సంతోషమున రతుల్ సలుపుచునుండి, రంత సుమాలియు నాకేతుమతియు
నతులశూరుల బ్రహ్మహణు నకంపనుని, వితతప్రతాపుని వికటుఁ డన్వాని
ఘనభుజున్ గరటముఖశ్యావదంతు, లనువారి సంహ్రాది యనుమహాబలుని
భాసురయశుని సుపార్శ్వునిఁ బ్రణుని, భాసకర్ణుని నిబహ్వాసి ధూమ్రాక్షు
నమరఁ బుష్పోత్కట యనుకోమలాంగిఁ, గమనీయశుభమూర్తి కైకసి యనియు
నమరఁ గుంభీనస యనునామ మెసఁగ, రమణీయమై యొప్పు రాజాస్య గనియె
నలఘుతేజోమూర్తి యగుమాల్యవంతుఁ, డలరి యాసంకృతి యనుపత్నియందు
మొగి వజ్రముష్టి దుర్ముఖు విరూపాక్షు, నగణితశత్రుఘ్ను నగ్నికోపనుని
మదమత్తుఁ డనువాని మఱియొక్కకూఁతు, నధికతేజస్విని ననలాఖ్యఁ గాంచె
మాలికిఁ గొడుకులు మహిమతోఁ బుట్టి, రోలి నవ్వసుధపై నురుతరతేజు
లనలుండు ననిలుండు హరుఁడు సంపాతి, యును విభీషణుమంత్రు లుర్వీశ వారు
ఇవ్విధంబునను నయ్యింతులవలన, మువ్వురు సంతతుల్ ముదముతోఁ బడసి
మృత్యుఘోరాకృతి మిగుల సంతతము, నత్యంత బలవంతులై సమీరణము
మాడ్కి నెల్లందుఁ గ్రుమ్మరుచు జనముల, వేడ్కతోఁ జెఱుపుచు విపులదర్పమునఁ
గొడుకులుఁ దారు గైకొనియు లోకములఁ, గడలేనిబాధలఁ గావించుచుండ
ది క్కెవ్వరును లేక దివిజులు మునులు, ముక్కంటికడ కేగి మొగిఁ గేలు మొగిచి
గౌరీశ! పరమేశ! కందర్పదహన, కారుణ్యమున మముఁ గావంగవలయు
వనజసంభవుచేత వరములు వడసి, కినుకతో నడరి సుకేశనందనులు
మునులయాశ్రమములు మునుకొని చెఱుతు, రనిశంబు బాధింతు రఖిలదేవతల
వేల్పులనాకంబు వెడలంగ వ్రాలి, వేల్పుల మేమంచు విహరింతు రచట
నేనె విష్ణుండను నేనె రుద్రుఁడను, నేనె పద్మజుఁడను నేనె యింద్రుఁడను
నేనె కృతాంతుఁడ నేనె పార్థివుఁడ, నేనె చంద్రుండను నేనె భాస్కరుఁడ
నని పల్కుచుండుదు రానిశాచరులు, చను మమ్ము రక్షింప సకలలోకేశ!
కడుఘోరరూపంబుఁ గైకొను వారి, నడఁగించి మాకు నీ వభయ మిమ్మనినఁ
దలఁచి సుకేశనందనులపైఁ గూర్మి, పొలియింపఁజాలక భూతేశుఁ డనియె
వారు నా కరయంగ వధ్యులు గారు, వారల వధియించు వారిజోదరుఁడు
విష్ణునివరములు వేఁడుఁ డాసర్వ, జిష్ణుఁడు మీకెల్ల సేమంబు సేయు
నని పల్క శివునకు నతిభక్తి మ్రొక్కి, మునులును సురసంఘములు నేగుదెంచి
హరిఁ గాంచి ముకుళితహస్తులై దేవ, కరుణించి మము నీవ కావంగఁదగుదు
వనజసంభవదత్తవరులు సుకేశ, తనయులు సురమునిస్థానంబుఁ గొనిరి
వారు లంకాపురి వర్తింతు రమర, వైరులఁ గడతేర్పవలవదే మీకు
దనుజమర్దన వారితలలు చక్రమునఁ, దునుమాడి జముఁ గూర్పు దుష్టరాక్షసుల
నభయంబు నేఁడు మా కానతి యిమ్ము, త్రిభువనాధీశ్వర దేవ నీ వనిన
నిర్జనంబుగ వారి నిర్జితు నింక, నిర్జరవరులార నెమ్మది నుండుఁ
డని పల్క వారు నయ్యసురాంతకునకు, వినతులై చనఁగ నావృత్తాంత మెఱిఁగి
మనమునఁ దలపోసి మాల్యవంతుండు, తనసహోదరులతోఁ దగ నిట్టు లనియె
మునులును సురలును ముక్కంటిఁ గాంచి, వినతులై వేఁడిన “వివరింప వారు
నాచేతఁ జావరు నలినలోచనుఁడు, మీచింతఁ బాపెడు మీ రేగుఁ" డనుచు
నాభూతపతి వల్క నమరాదు లబ్జ, నాభునికడ కేగి నమ్రులై నిలిచి
మనబాధ లెఱిఁగింప మనల నిర్జింప, దనుజారి సమయంబు దగఁ జేసినాడు
విశదోరుయశు మహావీరు హిరణ్య, కశిపుఁ జంపెను బలిం గడతేర్చి పుచ్చె
రాధేయు వధియించె రణభూమి నముచి, సాధించి వాతాపి సమయించెఁ గడఁగి
శుంభుని దునిమె నిశుంభు మర్దించె, శుంభదంశులు యమార్జునుల నిర్జించె
నిరుపముండగు కాలనేమి భంజించెఁ, బరిమార్చె మఱి లోకపాలుఁ డవ్వాని
హార్దిక్యు నణఁచె స౦హతు సంహరించె, దుర్దము లగుచున్న దుష్టరాక్షసుల
మఱియును బల్వుర మర్దించె దీని, నెఱిఁగి యావిష్ణుతో నేల వైరంబు
జగముల బాధలు చాలించి సంధి, తగఁ జేసి మనుటయుఁ దగినకార్యంబు
నయమార్గ మెఱిఁగిన నామాట వినిన, భయ మేది నెమ్మది బ్రతుకంగవచ్చు
శిష్టకరక్షణశీలుఁ డాహరికి, దుష్టమర్దన మది దోషంబు గాదు
వినుఁ డన్నమాటలు వీనులఁ జొరక, తనరు తెంపున వారు తమయన్న కనిరి
వేదంబు లొగిఁ జదివితిమి యజ్ఞములు, వేదోక్తవిధులఁ గావించితి మెలమి
వివిధదానంబులు విహితధర్మములు, నవిరళరాజ్యంబు నమరఁజేసితిమి
కడుఁదేజమునఁ బెద్దకాలంబు మంటి, మడరి యోడించితి మఖిలలోకముల
యశముఁ గంటిమి విష్ణుఁ డైనఁ గానిమ్ము, పశుపతి గానిమ్ము బ్రహ్మ గానిమ్ము
మనలఁ గయ్యంబున మార్కొనఁగలరె, మన మిఁక లంకలో మసలక వెడలి
నైరకారణులైన వాసవాద్యమర, వీరులఁ బొలియించి వెస వత్తు మనుచు,
ఖరిహయస్యందనకమఠశార్దూల, శరభభేరుండాజసింహవాహనులు
గురుమృగపన్నగక్రోడోగ్రకరటి, నరగోవిహంగమనక్రవాహనులు
నఖిలాయుధోజ్జ్వలహస్తులు నగుచు, నిఖిలసేనలతోడ నేల యల్లాడ
భీకరాకృతులతోఁ బేర్చి రాక్షసులు, నాకంబుపై నెత్తి నడువఁగ నపుడు
తలపోసి గృహదేవతలు నిప్పురంబు, లలిఁ దూలఁగలదంచు లంక వెల్వడిరి
వారిదంబులు రక్తవర్షముల్ గురిసె, వారాసు లుప్పొంగి వడి మేరఁ దప్పె.
నట్టట్టుగా దొర్లె నలకులాచలము, లట్టహాసముతోడ నాడె భూతములు.
చరణంబు లెఱ్ఱనై సరి నూరుకముల, గొరవంకలును బాఱె ఘోరంబు లగుచు
సుడియుచుఁ బొడచూపె సురగాలిపెల్లు, యెడనెడ వఱడు బిట్టెదుట వాపోయె
వలయమై సేనపై వడి గ్రద్ద లాడెఁ, గలఁగుచు నుగ్రంబుగాఁ గాకు లఱచెఁ
బలుమాఱు నిటు మహోత్పాతముల్ వొడమ, దలఁకక రాక్షసుల్ దర్పంబు లెసఁగ
మొగి మాల్యవంతుండు మున్నుఁగా నొక్క, తెగువతో నడచిరి దిశలెల్ల నిండ
నంత నిర్జరదూత లసురాంతకునకు, నంతవృత్తాంతంబు నట యెఱిఁగింప
కలసి విద్యాధరగంధర్వసిద్ధ, విలసితగానముల్ వీనులఁ బొలయ
నమరులు గొలువంగ నఖిలసైన్యములు, సముచితస్థితితోడఁ జనుదెంచుచుఁడ
మెఱసి వక్షస్థలి మించుకౌస్తుభము, మెఱుఁగు దిక్కులనిండ మిఱుమిట్లు గొలుప
జంగమరోహణాచలతుంగశృంగ, సంగతి గల నీలజలదంబుభంగి,
విక్రమోదగ్రుఁడై విహగేంద్రు నెక్కి, చక్రగదాఖడ్గశార్ఙ్గంబు లోలిఁ
గరపంకజంబులఁ గర ముల్లసిల్లఁ, బరుషభూరీభేరిభాంకృతుల్ జాలఁగ
నాభీలగతి దిక్కు లద్రువంగ వనజ, నాభుండు నాజికి నడచె నయ్యెడను
గరుడపక్షానిలగమనవేగమునఁ, దరులెత్తి వడిఁ బాఱఁ దారలు చెదర
వినువీథి రవితేరు విముఖమై పఱవ, ఘనమాలికలు తూలికలభంగిఁ దూల
మున్నీరు గడలెత్తి మ్రోయ మిన్నేరు, పెన్నేల నెగసిన పెందూళి యనఁగ
విఱిగి మహాచలవిపులశృంగములు, దఱుగుచు నిలఁ గూల ధరణి కంపింపఁ
గువలయహితబింబగురుకాంతి నమరు, ధవళాతపత్రంబు దవ్వులఁ గాంచి
జయశాలి విష్ణుండు చనుదెంచె ననుచు, భయమంది రాక్షసబలమెల్ల గలఁగ
నంత నద్దేవున కభిముఖు లగుచు, నెంతయుఁఁ గడకతో నేర్పులు మిగుల
దినకరకరజాలతీవ్రార్చు లడర, ఘనమాంసశోణితకలితంబులైన
పరశుతోమరకుంతపట్టసప్రాస, పరిఘాసిముద్గరప్రముఖాయుధములఁ
దిరిగి నొప్పించుచు దితిజారిమేను, శరవృష్టిఁ గప్పిరి సకలరాక్షసులు
ధారాధరంబులు ధరణీధరంబు, వారిధారలఁగప్పు వలనొప్ప మిగులఁ
విలయకాలంబున విశ్వలోకములు, కలఁగి యద్దేవుని ఘనశరీరంబుఁ
జొచ్చినవిధమునఁ జొచ్చి లో నణఁగ, నచ్చెరు వడరంగ నయ్యంపగములు
భుజబలదర్పముల్ పొలుపార నంత, రజనీచరాధముల్ రథికుతో రథియుఁ
గరముఁ దాఁ గరివాఁడు కరివానితోడఁ, దురగంబువానితోఁ దురగంబువాఁడుఁ
దరిమి పదాతి పదాతితోఁ దాఁకి, పొరిఁబొరిఁ జల మెక్కి పోరుచున్నెడను
నడిదము జళిపించి యంగముల్ త్రుంచి, కడిదిఁ బొమిడికలు గదలచేఁ జదిపి
నెఱి నారసంబుల నెఱకులఁ ద్రుంచి, మెఱుఁగు వజ్రంబుల మెడలు దున్మాడి
చేతికి నందక సెలకట్టె లెత్తి, వేతొడల్ గాడిపో వీఁకతో వైచి
కడుగట్టిరథములఁ గనునొగల్ గొట్టి, పొడలెత్తి పొడిగాఁగ బుడమితోఁ జఱచి
రంత రాక్షసముఖ్యు లగుమహావీరు, లంతకాకృతులతో నార్పులు నిగుడ
సరిఁ దోమరంబుల శక్తుల నొంచి, శరవృష్టి గప్పి రా సకలలోకేశు
నప్పుడు విష్ణుండు నలిగి శార్ఙ్గంబు, కొప్పునకొప్పుగా గుణ మెక్కఁద్రోచి
జిహ్మగాధిపకల్పశింజినీరవము, బ్రహ్మాండకోటరభరితంబుఁ గాఁగ
మిడుగుర్లు మంటలు మింటఁ బెల్లడవఁ, బిడుగులఁ బోలెడు భీకరాస్త్రములు
గరుల పెన్గాడ్పున ఘనపంక్తి దూల, నిరుఁదెసఁ గొని వడి నిగిడింప నవియు
నెడ నిశాచరు లేయు నిషుపరంపరలు, వడిఁ ద్రుంచివైచుచు వచ్చి రాక్షసుల
మస్తకంబుల ద్రుంచి మరువులు చించి, హస్తము ల్దునుమాడి యంగము ల్ద్రుంచి
నెఱకులు గొని కాఁడి నేల భేదించి, మఱియును బహురక్తమాంసముల్ తొరఁగఁ
జరణముల్ జానువుల్ జత్రువుల్ జంఘు, లురము లూరులు బాహు లుదరముల్ కాళ్లు
నిటలంబు లాదిగా నిఖిలాంగకములు, చటులవేగమున జర్ఝరితముల్ చేసి
వేదండకుంభముల్ విదళించి తురగ, పాదంబు లతిఘోరభంగిగాఁ ద్రుంచి
కేతుదండము లుర్విఁ గిరి కొల్పి మెఱయ, నాతపత్రావళు లందంద నఱకి
రథికులఁ బొలియించి రక్తవాహినులు, పృథివీతలంబునఁ బెల్లుగాఁ బఱపి
వెలయ మేఘధ్వనివిధముగా బెట్టు, జలజనాభుఁడు పాంచజన్య మొత్తుటయు
జలజభవాండమ్ము సంధులు ప్రిదిలెఁ, గలఁగె నబ్ధులుఁ దారకంబులు డుల్లెఁ
జలియించె దిక్కులు శక్రాదిసురలు, చెలఁగి నిశాచరసేన మూర్ఛిల్లె
వనజాప్తబింబంబు వలనఁ బెల్లడరు, ఘనరశ్మిజాలంబుగతి వెలుంగుచును
గనుఁగొని లయవేళ కడలి వెల్వడిన, పెనుప్రవాహంబులు పెలుచ మ్రోయుచును
నరుదార నద్రిగహ్వరముల వెడలు, నురగసంఘముభంగి నుగ్రంబు లగుచు
తతభుజాదండకోదండంబువలన, నతిగాఢముక్తంబు లైనబాణములు
నీక్షింప గణనకు నెక్కుడు గాఁగ, రాక్షసావలికెల్ల రణభూమిఁ గెడపి
కడునల్క శరభంబు కనలి సింహంబుఁ, గడిమిమై సింహంబుఁ గరియూధములను
గలయంగ గరి భయంకరలీలఁ బులులఁ, బులి తురంగంబులఁ బోఁదోలుకరణి
గరుడవాహనుఁ డుగ్రగతిఁ దోల నోలిఁ, బరువడి రాక్షసభటులరూ పణఁచెఁ
బుఁఖానుపుంఖవిస్ఫురితబాణములు, శంఖశార్ఙ్గధ్వనుల్ సైరింపలేక
నతిభీతి హతశేషులగువారు విఱిగి, ధృతిమాలి యాలంకదిక్కు పాఱుటయు
సుడిగొన్న తమసేనఁ జూచి సుమాలి, యెడ సొచ్చి యనువుగా నిషుపరంపరల
నసురారి నొప్పించి యాకసంబద్రువ, వెస నార్చి నిలిచె దిగ్వివరంబు నిండ
నాజి ము న్విఱిగిన యానిశాచరులు, తేజంబు లూహించి తెరువు గ్రమ్మరిరి
దానవాంతకుఁ డంతఁ దనరారునలుక, వానిసారథితల వడిఁ గూల నేయ
నరద మిడిచికొంచు నశ్వముల్ బెదరి, మరలిపాఱఁగఁ జూచి మాలియు నంత
బసిఁడిపింజెల నొప్పు బాణముల్ దొడఁగి, యసురారిపై నేయ నవియు నందంద
సీతకరద్యుతులతోఁ జెలువారు హంస, వితతులు క్రౌంచాద్రి వెసఁ జొచ్చుకరణిఁ
బరువడి వెలుఁగుచు విడివడి చొచ్చె, నరుదార విలసిల్లు నవ్విష్ణుమేన
దాని కొక్కింతయుఁ దలఁకక నిలిచి, దానవాంతకుఁ డంత ధనువు మోయించి
కులిశోపనములైన ఘోరబాణంబు, లలుకతో నడరించి యతని నొప్పించి
విముఖునిఁ గావించి వెసఁ గిరీటంబు, సమరోర్విఁ బడవైచి చాపంబుఁ ద్రుంచి
కేతువు ఖండించి కీలాలధార, లాతతగతి దొర్గ హరులపో రణఁచి
మఱియును దఱుమంగ మాలి తే రెక్కి, యురగభీకరగదాయుతబాహుఁ డగుచు
గిరిశృంగములనుండి కేసరి యెగసి, కరమల్క లంఘించుగతి నేల కుఱికి
యదరులు చెదరంగ నాభీలలీల, గద గొని వడి నేసె గరుడునిశిరము
కులిశసన్నిభగదాఘోరఘాతమున, నలఘుశీలాకల్ప మగుశిరం బవిసె
మఱుఁగున నగ్గరుత్మంతుఁ డాలోన, బిరుదు ముందరయైనఁ బెలుచ విష్ణుండు
కలత నానారత్నఘనదీప్తు లడరఁ, విలయార్కు- పరివేషవిస్ఫూర్తి దోఁపఁ
గాలానిలావర్తగతి కానఁబడఁగఁ, గాలచక్రాకృతి గలచక్ర మెత్తి
పెడచేతివాటున పృథులమస్తకము, మిడుకుచుఁ బడ వానిమెడఁ ద్రుంచివైచె
నవునవునని మింట నందంద పేర్చి, దివిజసంఘము లార్చె దిక్కులనిండ
మాలిపాటున కంత మాల్యవంతుండు, దూలె సుమాలియు దుఃఖంబు నొందె
నసములు సెడి భీతి నందఱు లంక, దెసమోముగా వైనతేయుండు తెలిసి
పదవిక్షేపనపవనవేగమున, రాక్షసకోటుల రణభూమిఁ దోలఁ
దలలు వీడఁగ నాయుధంబులు విడచి, వలనేఁది పాఱెడువారి వెందవిలి
పటుశిలీముఖముల పాలు సేయుచును, నటు నింగి నిండిన యానిశాచరుల
వారిదాకృతిఁ బోలి వారాశిలోన, ఘోరాశుగంబులఁ గూలనేయుచును
వెండియుఁ బోనీక వెసఁ గూడఁ దఱిమి, పుండరీకాక్షుండు భూరికోపమున
నరుణారవిందాక్షుఁడై విక్రమించి, పొరిఁబొరిఁ జంపె నప్పుడు నిశాచరుల
నెట్టనఁ గరవాలనిష్ఠురహతులఁ, దెట్టలై నడుములు తెగిపడ్డవారు
ప్రేవులు నెమ్ములు పిశితఖండములు, ప్రోవులై గదలచేఁ బొలిసినవారు
విక్రమోదగ్రులై వెసఁ దాఁకి వీఁకఁ, జక్రంబువాటున స్రుక్కినవారుఁ
గవచముల్ భేదించి గరు లంట నమ్ము, లవయంబులు గొన్న యముఁ గన్నవారు
వారణంబులతోడ వాజులతోడఁ, దేరులతో గూడఁ ద్రెళ్లినవారు
నెరసిన కీలాలనిర్ఝరంబులను, బరువడిఁ దునియలై పడిన కైదువులు
దూలిన గొడుగులు తుమురైన రత్న, కీలితాభరణముల్ గిరిగొంచు నమర
నధికవేగమున ని ట్లసురారి మసఁగి, వధియింప నమ్మాల్యవంతుఁడు మగిడి
కనలుకోపంబునఁ గన్నులకెంపు, దనరారఁ బలికె నద్దనుజారిఁ జూచి
యెఱుఁగవె రణధర్మ మేల చంపెదవు, వెఱచి పాఱెడువారి వెనువెంటఁ దగిలి
సమరభయార్తులఁ జంపినవారి, కమరలోకము దూర మతిపుణ్యులైన
నని చెప్పఁగా విందు మని కోడువారిఁ, జనునె జనార్దన చంప నిబ్భంగి
నదె చక్ర మదె చాప మదె గదాదండ, మిదె సంగరంబున కే వచ్చినాఁడ
మీఱి నీతో లావు మెఱయుదు నింకఁ, బాఱెడువారలపని యేమి నీకు
నని పల్క దనుజారి యన్నిశాచరుని, గనుఁగొని నీచేత గడునొచ్చి సురలు
శరణు వేఁడిన నేను సకలరాక్షసులఁ, బరిమార్ప బ్రతినలు పట్టినవాఁడ
మెచ్చి వరంబులు తపంబులకు, నిచ్చిన విధి వెన్క నిడికొన్ననైన
సురిగి పాతాళంబుఁ జొచ్చిననైనఁ, బొరిగొందు మి మ్మేలఁ బోనిత్తు ననిన
ఘంటికల్ మెఱయఁగ ఘనశక్తి పూని, మంట లారఁగ వాడు మధువైరి వైచె
బేరురం బది నాటఁ బృథులవిద్యుతుల, వారిదాకృతి నొప్పి వనజనాభుండు
చానిన కొని వైవ దారహారముల, తో నొప్పునాతని తోరంపుటురము
కవచంబు భేదించి గాఁడవైచుటయు, నవశభావము చెంది యాలోనఁ దెలిసి
కింకిణుల్ మెఱయంగఁ గేల నంకించి, హుంకృతితో వక్ష ముగ్రశూలమున
వెసవైచి పిడికిట వీఁకఁ దాఁకిఁప, నసురారి కవియెల్ల నవలీల లైనఁ
బిఱిఁదికి నొకవింటిపె ట్టోసరించి, యఱచేతఁ జఱఁచె బిట్ట సురారిశిరము
గరుడుండు ఱెక్కలగాలి చొక్కాకు, కరణిఁ దోఁపఁగ నుగ్రగతిఁ దోలె వాని
వాఁడును సేనతో వసుధేశపాణి, వాఁడిమి చెడి లంక వడిఁ జొచ్చె నంత
నసురారిదెస శంక నాలంకయందు, మసలక రాక్షసుల్ మఱియుండ వెఱచి
కొడుకులతో బంధుకోటులతోడఁ, బడఁతులతో గూడఁ బాతాళమునకు
భూలోకనాయక పోయిరి వీరు, సాలకటంకటసంతతివారు
పఙ్క్తిరథాత్మజ బాహుదర్పమునఁ, బంఙ్క్తికంఠునకంటె బల్లిదుల్ వీరు
ధర నీవు చంపిన దశముఖప్రముఖు, లరయఁ బులస్త్యు నన్వయమువా రధిప
నారాయణుడుదక్క నరలోకనాథ, వీరి నిర్జింప నేవీరుఁడు లేఁడు
ఆదిత్యకులజ నీ వాచతుర్భుజుఁడ, వాదినారాయణుం డైనదేవుఁడవు
శరణాగతక్రియ సకలరాక్షసులఁ, బరిమార్పఁబుట్టితి భానువంశమున
యుగయుగంబునను నీ వొక్కొక్కమూర్తి, నెగడుదు ధర్మంబు నిలిపెడుకొఱకు
నని పల్క మఱియును నవనీశుఁ జూచి, మనుజేంద్ర వినుము సుమాలి యన్వాఁడు
తనయఁ గైకేశి యన్దానిఁ దోడ్కొనుచుఁ, జనుదెంచి ధరణిపైఁ జరియించునెడను
నేపారఁ బుష్పకం బెక్కి మోదమున, నాపులస్త్యునిమన్మఁ డగుకుబేరుండు
ముద మందఁ దండ్రికి మ్రొక్కఁబో నతని, సదమలతేజంబు చక్కఁగాఁ జూచి
యరుదంద సుతఁ జూచి హరిణాక్షి! నీకుఁ, బరిణయకాలంబు పరికింప నిదియ
యతఁ డేల మన కిచ్చు ననుచు నావలన, నతివ! శంకించి ని న్నడుగ రెవ్వరును
నుభయకులంబుల నుజ్జ్వలాకార, విభవగణంబులు విలసిల్లు వరుని
నిలలోన నొకని నన్వేషించి నిన్నుఁ, దలమోచుకొనిపోయి తరుణి యీవలసె
నాఁడుబిడ్డలఁ గన్నయప్పుడె కాదె, వాఁడిమి చెడియుండవలయుఁ దండ్రులకు
లలితలక్షణగుణలావణ్యములను, నెలజవ్వనము నొప్పు నెలనాఁగ నీకు
నటు గాన నీయంతనైన నేఁ బనుపఁ, గుటిలకుంతల వరుఁ గోరి పోఁదగుదు
వతివ పద్మజుసుతుఁ డైనపులస్త్యు, సుతు విశ్రవసుఁ బొందు సోయగం బమర
మగువ నీకొడుకులు మన్మలు నితని, పగిదిఁ దేజస్వులై పరఁగెద రనినఁ
బ్రియమంది రఘువీర పితృవియోగమున, భయదసంధ్యావేళఁ బరికింప కరిగి
వనితయు నవ్విశ్రవసుఁ డగ్నిహోత్ర, మొనరించుతఱి నగ్నియునుబోలె వెలుఁగ
వీడఁబో నడఁచుచు విలసితాననము, తోడన యుజ్జ్వలాత్మునిమ్రోల నిలిచి
కంతుని జయలక్ష్మికరణిఁ జెన్నొందు, నంతఁ బౌలస్త్యుండు నయ్యింతిఁ జూచి
శ్రోణీభరంబును సురచిరకాంతి, నేణలాంఛనకలితేందుబింబంబు
నవ్వు నెమ్మొగమును నలినాక్షి నీవు, నెవ్వరికూఁతుర వేది నీపేరు
వచ్చినపని యేమి వామాక్షి యనిన, నచ్చెల్వ ముకుళితహస్తయై పలికెఁ
బెనుపొంద మాతండ్రిపేరు సుమాలి, యనఘాత్మ కైకశి యనుకన్య నేను
ననుఁ దండ్రి పుత్తెంచె నారాకతెఱఁగు, మునినాథ మీచిత్తమునఁ జూడుఁ డనిన
నత్తెఱం గెల్లను నాత్మలో నెఱిఁగి, మత్తేభగమన నీమది కోర్కిఁ గంటి
కోమలి ననుఁ బొంది కొడుకుల వడయఁ, గామించివచ్చితి గానఁ గైకొంటి
వనిత సంధ్యావేళ వచ్చుటఁ జేసి, తనయుల నిచ్చితి దారుణాత్మకులఁ
గ్రూరబుద్ధియుతుండుఁ క్రూరవర్తనుఁడుఁ, గ్రూరుండు నగు పెద్దకొడు కందులోన
ననవుడుఁ గైకసి యమ్మునీశ్వరుని, గనుఁగొని దయదోఁపఁగా నిట్టులనియె
ధాత్రిభారకుల నదయచిత్తులను న, పాత్రులఁ గృపసేయఁ బాడియె దేవ
యనుటయుఁ జంద్రబింబాస్య నీ కూర్మి, తనయుల కిద్దఱ తఱిఁ బుట్టువాఁడు
హరిపదాంబుజభక్తుఁ డనురాగచిత్తుఁ, డురతరయశుఁడు మహోజ్జ్వలుఁ డగుచు
లంకకుఁ బతియునై లలి నీదుకులముఁ, గొంకక పాలించుఁ గోర్కు లింపార
నని విశ్వవసుఁ డాడ నట్లకా కనుచు, మనమున సంతోష మంది యాలేమ
బాగైనభక్తి తోఁ బరిచర్య సేయఁ, గాఁ గొంతకాలంబు గడచిన యంతఁ
జకితాత్ములై చిత్తచలనంబు లేక, ... ... ... ... ... ... ... ...
క్రమమొప్పఁగా నెల్ల కాలంబులందు, సముఖులై యామునీశ్వరు నాశ్రమంబు
వేకువ నొకజమ్మిచెట్టుమీఁదటను, బూరిపుంజములచేఁ బొలుచుమందిరము
లారంగ రచియించి యందుఁ బెంపొందఁ, దారును పుత్రమిత్రసమేతముగను
నున్నచో నొకపక్షి యువిదయండములు, పన్నుగాఁ బొదుగుచుఁ బాయకున్నంత
నానాతినాథుండు నతిముదం బలర, మానుగా నమృతోపమానంబు లైన
ఫలరసంబులఁ దెచ్చి పరిపాటి నిడుచుఁ, బొలుపార నొకనాఁడు ప్రొద్దుమా పైనఁ
దాసమీపమునున్న యాసరోవరము, నాసమీరముల నీరాస నం దరుగ
నందలి కెందమ్ము లాసౌరభంబు, మందమారుతముచే మతి చాల బ్రమసి
పెన్నిధిఁగన్న యాపేదచందమున, వన్నెగా తనమనోవాంఛఁ బోఁ గ్రోలి
మత్తుఁడై యున్నెడ మార్తాండుఁ డెలమి, నత్తఱి నస్తాద్రి కరిగె నర్గుటయుఁ
గమలంబులెల్ల నొక్కట మోడ్పఁ బక్షి, రమణుఁడు పూమందిరములోనఁ జిక్కి
వెలువడ లేక నిర్విణ్ణుఁడై జలజ, వలయంబులోపల వర్తించుచుండి
యా మందిరమ్మున వేమఱుఁ దిరుగు, నామార్గమున వేగునంతకుఁ బక్షి
కులములు నెలుఁగింపఁ గుముదముల్ మగుడఁ, దలకొని చంద్రుఁ డస్తాద్రికి నరుగఁ
గమలతో వెస సోఁగ కమలంబు లెత్త , బ్రమదాబ్ధిలోనఁ దెప్పలు దేలుచుండ
నాసమయంబున నాసరోజూప్తుఁ, డాసుపర్ణాగ్రజుఁ డటు తేరు గడుప
భాసమానోదయపర్వతంబునకు, భాసురగతి నేగి భాసిల్లునంత
విరిసిన నెత్తమ్మి వెడలి యాపక్షి, పరిపక్వమైనట్టి ఫలములు గొనుచు
వెఱపును మోదంబు వీడు జోడాడఁ, దరుణిమందిరము కంతట నేగుదెంచి
కొమ్మని యిచ్చినఁ గొనక నీవలచు, కొమ్మలకే యిచ్చి కోర్కులింపార
మనమున బ్రియమైన మాడ్కి నందంద, చని సుఖింపుదుగాక చాలు మాకింక
నని తూలనాడిన నతివ కాపక్షి, ఘనుఁడు నిక్కము దోపఁగాఁ నిట్టు లనియె
వనజాక్షి తామరవనము కే నరిగి, గొనకొని పూఁదేనెఁ గ్రోలునత్తఱిని
ఇనుఁ డస్తమించిన నెల్లతామరలుఁ, గనుమూసినట్టు తక్కక మూయఁబడిన
నం దొక్కకమలంబునం దుండి వెళ్ళఁ, బొందుగానక యున్న పొందింతె గాని
యితరకాంతలతోడ నిచ్చమైఁ జిక్కి, మతిమఱచుట గాదు మసలుట లేదు
వలవ దకారణవైరంబు మనకుఁ, గలిగిన నవ్వరె ఘనులైనవారు
మిన్నక యిట్లాడ మెలఁతరో తగునె, యన్న నప్పుడు నవ్వి యలచేనిపంట
కొయ్యలు చెప్పెడిఁ గుటిలకుంతలుల, సయ్యాటములనైన చందనపంక
మొఱపుమై నీ మేన నుండఁగా నిట్లు, మఱియు నూరార్చె దే మనఁగల నింక
నీమను సెఱుఁగను నిజమును గల్ల, లో మనోహర నీవు నుచితోక్తు లింక
మానుము నీ వన్న మగువరో యిదియు, నానీరజపుధూళి యంతియె కాని
వారకాంతల కుచద్వయమందునున్న, సారంపుమృగమదసారంబు గాదు.
వారిజసుమముల వాసనగాని, వారిజాయతనేత్ర వలదు శంకింప
నింత యవిశ్వాస మేటికి నాడు, నంతరంగమున నొండరమర లేదు.
ధారుణి సాక్షి వేదంబులు సాక్షి, తారకంబులు సాక్షి తరువులు సాక్షి
గా మగువల నాదుకలలోన నంట, నో ముగ్ధ విడుము నీ వొడఁబడవేని
వారక నావిశ్రవసువు దాఁ జేయు, ఘోరపాతకము చేకొని చనువాఁడ
ననవుఁడు వెఱగంది యంత నాలేమ, వినయోక్తు లెసఁగ నవ్విభున కిట్లనియె
నీసదాచారున కీజితేంద్రియున, కీసత్యరతునకు నీశుభమూర్తి
కీదయాంబోనిధి కీపవిత్రునకు, నేదెస వర్తించె నేదోష మనిన
నల సుకేశాఖ్యున కాసంశ్రుతికిని, వెలయ జన్మించిన విపులప్రతాపుఁ
డామాల్యవంతుని యనుజుని పట్టి, భామినీమణి యనఁ బరఁగు కైకేసి
సంతానవాంఛ నీసంయమీశ్వరుని, నంతయుఁ బ్రార్థింప నట్లకాక ననుచుఁ
బలికె బొంకునఁగాని భామిని కోర్కి, తలకూర్పలేక తద్దయు నున్నవాఁడు
ఋతుకాలముల నొక్కఋతువుఁ దప్పినను, గతిలేదు తమపితృగణముల కండ్రు
తరుణి పుష్పవతియై తక్కియుండఁగను, బురుషుఁ డొం డూరికిఁ బోవఁగఁదగదు
పోయిన దోషంబు పొందెను నతని, కాయంబులోన దుఃఖంబులు పెరుఁగుఁ
దమనివాసముల నెంతయుఁ బ్రేమ నుండి, తమియెల్ల నావేళఁ దప్పించి లేని
యలబ్రహ్మకును భ్రూణహత్యదోషంబు, నలవడఁ బ్రాపించు నఁట మర్త్యు లెంత
పదిఋతువులు దప్పె భామిని కిపుడు, కదియఁడు నాదోషగతి యెంత లేదు
అని పక్షి తన ప్రియురాలితోఁ జెప్ప, విని సమ్మతించె నవ్విధి తన్నుఁ గుఱిచి
యూనినభ క్తితో నున్న కైకేసి, పూనిక యెర్గి యప్పుడు విశ్రవసుఁడు
తనయాత్మ ఋతువులదశకంబు నిలిపి, గొనకొని యాయిcతిఁ గూడెఁ గూడుటయు
నంత నా నెలఁతయు ననురాగమందెఁ, గొంతకాలమునకు గురుగర్భమైన
నిడుదకోఱలు మేఘనీలదేహంబు, మినుగుఱుల్ రాలెడి మిడికన్నుగఁవయు
నిరువదిచేతులు నీరైదుతలలు, నురుతరోష్ఠంబులు నుగ్రతేజంబుఁ
గలపుత్రు నొక్కనిఁ గాంచె నాలోనఁ, గలయ నెత్తురువాన ఘనరాసి గురిసె
నినునితేజము మాసె నిలఁ జుక్క లురిలెఁ, బెనుగాలివడివలెఁ బృథివి కంపించెఁ
మఱియు నుత్పాతముల్ మఱి నెల్లచోటఁ, దఱచయ్యె నంత నాతనయుని జూచి
యలవడ గుణనామ మని విశ్రవశుఁడు, తలపోసి యాతని దశకంఠుఁ డనియె
మనుజేంద్ర యావెన్క మహనీయశీలుఁ, డనుపమదుర్జనుఁ డఖిలనిర్దయుఁడు
శరబాహువిక్రమసమవర్తిసముఁడు, కఠినాత్ముఁడగు కుంభకర్ణుని గనియె
నప్పుఁడు దిగ్భ్రముం డయ్యె భాస్కరుఁడు, చెప్ప నగ్గలముగా సృష్టి వాపోయె
కలఁగె పయోధులు కంపించె ధరణి, కులగిరుల్ గదలె దిక్కులు వ్రక్కలయ్యె
నాకంబు చెదరెఁ బినాకి కంపించెఁ, జీకాకు పడియె నాశేషలోకంబు
కొఱగానివేషంబు ఘోరమై తోఁప, మఱి శూర్పణఖయను మలినాంగిఁ గనియెఁ
బిదపఁ ధర్మాత్ము విభీషణుఁ గాంచి, మది ముదం బందె నామత్తేభగమన
మఱి సుమాలిని పుత్త్రి మదిరాయతాక్షి, వఱలు పుష్పోత్కట వడసె నమ్మౌని
కరమర్థిఁ బుత్త్రార్థిఁ గవయుటఁ జేసి, ఖరదూషణాదులఁ; గాంతయుఁ బినస
కరమర్థి గొని కొంతకాలంబు చనఁగఁ, దరుణి యెంతయుఁ బోయెఁ దనమేను దొరఁగి
వా రంతఁ బెరిఁగిరి వనభూములందుఁ, గ్రూరుఁడై చరియించి కుంభకర్ణుండు
పరమధర్మాత్ములఁ బట్టి బిట్టల్కఁ, బొరి మ్రింగుచుఁడును భువనంబు లదర
రావణుం డఖిలవిద్రావణుం డగుచు, దేవగంధర్వాది దివిజుల నెల్ల
గారింపుచును గడుఁ గష్టవర్తనల, వారక చరియించువా రని కడిమి
నిగమశాస్త్రాభ్యాసనిరతుఁడై నియతి, జగము లౌనన విభీషణుఁడు వరించు
ఖరదూషణాదులు కడకతోఁ బోయి, యరుదైన దండకాటవి నుండి రంత
మనుజేంద్ర యొకనాఁడు మహనీయభూతిఁ, దనరు పుష్పక మెక్కి తండ్రికి మ్రొక్కి
ఘనవీథిఁ జనుదేరఁ గైకేసి ధనదు, గనుఁగొని దశకంఠు కడకు నేతెంచి
చూచితె విూయన్న సురుచిరతేజుఁ, డీచందమున నీవు నెన్నఁ డొప్పెదవు
నామనోరథ మార నందన యాత్మ, నామెయి గైకొనుమయ్య నీ వింక
ననపుడు తల్లితో నాతఁ డిట్లనియెఁ, గొనకొని పరమేష్ఠిఁ గోరి మెప్పించి
యీతనికంటె నే నెక్కుడు పొలుతు, నోతల్లి వత్తు నీడొండె నీతనికి
నెమ్మది వగవక నీ వుండుమనుచుఁ, దమ్ములుఁ దానును దశకంఠుఁ డజుని
గడుభక్తితోడ గోకర్ణాశ్రమంబు, కడ కేగి తపములు గావించి రనిన,
నేవెంట తపములం దెవ్వరు చేసి, రేవరంబులు గాంచి రెఱిఁగింపు మనఘ
యనవుఁడు మునినాథుఁ డవనీశుఁ జూచి, విను కుంభకర్ణుండు విమలాత్ముఁ డగుచు
మహనీయపంచాగ్నిమధ్యంబునందు, విహితక్రమంబులు వేఁడివేసవులు
వీరాసనస్థితి విలసిల్లి వాన, వారక నానుచు వానకాలమున,
నాకంఠజలమగ్నుఁడై ఘోరనియతి, చేకొని విడువ కాశీతకాలమున
నరుదార నిబ్భంగి నతినిష్ఠఁ దపము, చరియించెఁ బదివేలసంవత్సరములు
అకలంకమానసుండై విభీషణుఁడు, సకలేంద్రియంబులు సరి నిగ్రహించి
యైదువేలబ్దంబు లవనిపై నేక, పాదస్థుఁడై యూర్వబాహుఁడై మఱియు
నైదువేలేండ్లు నుగ్రాంశుఁ గన్గొనుచు, నాదరంబునఁ జేసె నత్యుగ్రతపము
అతినిష్ఠ దశకంఠుఁ డనశనవ్రతము, మతిఁ బూని వేయేండ్లు మసలక సూది
మొనమీఁద నిలిచి యిమ్ముగఁ జేతు ననుచు, ఘనమైన తపము సంకల్పంబు సేసి
కమలగర్భుని నాత్మకమలమం దునిచి, విమలచిత్తస్థితి వేడ్కతో నిలిచి
యాహారతృణ్నిద్రలన్నియు మాని, యూహించి నిష్ఠతో నుండె వేయేండ్లు
అంతట బ్రహ్మ త న్నాలింపకున్న, సంతోషమును బొంది చలము పెం పెక్కి
యేకపాదస్థుఁడై యెలమిఁ బెంపొంది, చేకొని యిరువదిచేతులు మొగిఁచి
యూనిననిష్ఠతో నుండె వేయేండ్లు, దానికి నాబ్రహ్మ దయఁజూడకున్న
ధరణిపై నర్థితోఁ దలక్రిందు గాఁగ, వర్షకాలంబునఁ బడిబట్టబైట
శీతకాలంబునఁ జిత్ర మౌచుండ, లోఁతైనకొలఁకులలోపలనుండి
మండువేసవి కారుమంటలు నిగుడ, యొండొండ కలిసిన నోడక నిలిచి
భానుమయూఖముల్ పైఁబాఱుచుండ, మానైనపంచాగ్నిమధ్యంబునందు
నేచి కాలత్రయ మెడపక నియతి, నాచరించెను దప మర్థి వేయేండ్లు
అంత వారిజగర్భుఁ డాత్మలోఁ దన్ను, నెంతయుఁ దలఁపక యెఱుఁగనట్లున్నఁ
దగ హోమగుండంబుఁ ద్రవ్వించి యచటఁ, దగినద్రవ్యంబులు తానె తెప్పించి
నిగమకల్పితతంత్రనిచయంబుతోడ, నగణితంబుగ వేడ్క నగ్ని సంధించి
పద్మాసనం బిడి పఙ్క్తికంధరుఁడు, పద్మజుఁ దనమనపద్మమం దునిచి
ప్రథమమస్తకముఁ దాఁ బటుగతిఁ ద్రుంచి, ప్రథమాహుతియుఁ గాఁగఁ బావకులోన
వేల్చె నథర్వణవేదమంత్రముల, వేల్చిన నది గాల్ప వెఱచియుండుటయు
నగ్నితో గోపించి యప్పుడు నూఁద, భగ్న మయ్యెను దల పావకులోన
నూరేండ్ల కొకతల నూకడ గాఁగ, మాఱు లే కిబ్భంగి మసలనీ కదిమి
తరిగొని యొక్కొక్కతలఁ గోసికోసి, యరుగ్రుమ్మి యిటువలె నత్తఱి నొకటి
తక్కక తొమ్మిదితల లోలి వేల్చి, చిక్కినతలఁ గోయఁ జేయి చాఁచుటయు
నందె మంటలు మింట నాయింద్రపురము, నందిన భీతిల్లి యప్పురందరుఁడు
నమరులు తను గొల్వ నధికవేగమునఁ, గ్రమ మొప్పఁ గమలజుకడ కేగుదెంచి
యవధారు దేవ దశాస్యుండు నేఁడు, తవిలియు నతిఘోరతప మర్థిఁ బూని
తలలు తొమ్మిది గోసి తడయక వేల్చి, తలయొక్కటియు వేల్పఁ దలకొన్నవాఁడు
ఆతల వేల్చిన నాయగ్ని యెగసి, భూతలంబంతయుఁ బొరిపొరిఁ గాల్చు
నిగిడి లోకము లెల్ల నీఱు గావించు, మిగుల నాక్రోశించి మిన్నులఁ బ్రాకు
వారిజాసన నీవు వచ్చి యాయసుర, వారించి వరములు వరుస నీకున్న
బ్రహ్మహత్యయు నెంత ప్రబలి లోకముల, బ్రహ్మాదిసురులను బాధింపకున్నె
యనఘాత్మ వారింపు మాతనితపము, నని విన్నపము సేయ నంబుజోదరుఁడు
మనమునఁ గరుణించి మహితాళుఁశుఁ డగుచుఁ, జనుదెంచి సురమునిసంఘముల్ గొల్వ
వచ్చియాదశకండు వద్దన నిల్చి, యిచ్చెద వరము నీయిష్ట మే మడుగు
మనవుడు దశకంఠుఁ డాక్రోశమునను, తనతలఁ జూచి యాధాత కిట్లనియె
నడిగినవరముల నర్థితో నాకుఁ, గడుఁగృప నిచ్చినఁ గైకొందుఁగాని
దేవత లొగి మెచ్చఁ దివిరి యీశిరము, పాపవకజ్వాలలఁ బడవేల్తు ననిన
నోవత్సవత్స తెం పుడుగు నీ వింక, భావింపఁగా నీవు పటుసాహసుఁడవు
మెచ్చితిఁ దపము నీమెడమీఁదివాలుఁ, బుచ్చు మే మట వరంబులు వేఁడుమనిన
ననురాగమును బొంది యపుడు విధాతఁ, గనుఁగొని వినఁతుఁడై కరములు మొగిచి
నరవానరాదులు నా కొక్కతృణము, సరకుగాఁ గొన నల్పజంతుజాలములఁ
బక్షీంద్రగంధర్వపన్నగదివిజ, యక్షరాక్షసదానవాదులచేత
సరసిజాసన నాకుఁ జావు లేకుండఁ, గరుణించి వర మిత్తుఁ గాక నీ వనను
యడిగెదఁ దెగినచో నామస్తకములు, గడిమి నప్పుడు మొల్వఁగా నిమ్మ యొకటి
వీఁకతోఁ ద్రిభువనవిజయంబు నాకుఁ, గైకొని భోగింపఁగా నిమ్మ యొకటి
యనవుఁడు నాబ్రహ్మ యగుఁగాక యనుచుఁ, గొనకొన్నకృపతోడఁ గోరి యిట్లనియె.
ననఘాత్మ యీకుండలాకృతి నిప్పు, డనయంబు దీపించు నమృత మీనాభి
గనుఁగొన నొరులకుఁ గానరాకుండ, నొనరించుకుండుమా యొగి నేమఱకుమ
అమృతంబునుండినయంతకాలంబు, నమృతత్త్వమూలమై యాననాబ్జములు
మొలపించు నది వోవ మొలవక యుడుగు, ననఘ బలోదగ్రయమృత మేమఱకు
మని పల్క వర మిచ్చె నంతటిలోన, దనుజాధిపతికి నత్తలలోలి మొలచె
నంత నాపద్మజుఁ డావిభీషణుని, సంతోషమునఁ గాంచి సదయుఁడై పఙ్క్తి
వదనున కిచ్చినవరములన్నియును, ముద మొందఁగాఁ జెప్పి మొగి నిట్టులనియె
ననఘాత్మ యీదశాననునాభి నమృత, మనలాస్త్రమునఁ గ్రుంకునని యెఱింగించి
మఱి నూటతొమ్మిదిమాఱులచాఁక, నరయ సుధాస్పర్శనంబునఁ జేసి
మొలచు నత్తలలు నిమ్ముల నటమీఁదఁ, దలకొని యతఁ డొంటితలతోన నుండు
ననుచు రహస్యంబులైన వాక్యములు, వినిపించి యతనితో వేధ యిట్లనియె
వర మేమి వేడుము వత్స! నీ వనుడు, వరద నా కెంతయు వాత్సల్య మొప్ప
నిర్మలగుణలోలు నెరిగుణశీలుఁ, గర్మవిదూరు లోకత్రయాధారుఁ
బురుషోత్త మాచ్యుతు బుండరీకాక్షు, చరణాబ్దముల భక్తి చాల నా కిమ్ము
పడయఠానివి లేవు పరమధర్మములు, పడయ దుర్లభమైన బ్రహ్మాస్త్ర మిచ్చి
కమలసంభవ నన్నుఁ గరుణింపుమనిన, నమర నా రెంటితో నమరత్వ మిచ్చి
గురుదయాంచితబుద్ధిఁ గుంభకర్ణునకు, వర మిచ్చువేడ్క నవ్వల నేగుదేర
ముకుళితహస్తులై ముందట నిలిచి, సకలదేవతలు నాచతురాస్యు కనిరి
వారిజాసన విూరు వరము లీవలదు, క్రూరాత్ముఁ డగుచున్న కుంభకర్ణునకు
వాఁడిమిఁ గడు వ్రాలి వరశక్తి లేని, నాఁ డుగ్రగతిలేని నందనచరుల
నచ్చనలేమల నమరకన్యకల, విచ్చలవిడిఁ బట్టి వెస మ్రింగుచుండు
మఱియును నరమునిమాంసాశి యగుచు, వెఱపించు లోకముల్ వీడు సంతతము
వరముల నిచ్చిన వాసవప్రభృతి, సురల కతఁడు మనశ్శూలంబు గాఁడె
మూఁడులోకంబులు మొగిఁ బాఱమ్రింగు, వేఁడిమి చూపఁడే వీఁ డేపు మిగిలి
యటుగాన వరరూపమగుశాప మిచ్చి, కుటిలాత్ముఁ డాతని క్రొవ్వార్పవలయు
నని విన్నవించిన నవుఁ గాక యనుచు, వనజాసనుఁడు సరస్వతిఁ దలంచుటయు
భారతియును వచ్చి పద్మజుమ్రోల, గారవంబున హస్తకమలముల్ మొగిచి
పని యేమి నావుడు పరమేష్ఠి పలికె, వనజాక్షి నీ వెల్లవారిజిహ్వలను
గల్గియుండుదు కుంభకర్ణుని జిహ్వ, నెలకొని తప్పాడు నీ వంచుఁ బనిచి
వనజాసనుఁడు వచ్చి వర మేమి వేఁడు, కొనుము నీ వనిన నాకుంభకర్ణుండు
యాఱేసినెలలు నిద్రావస్థ నుండి, తేఱుట తుది నొక్కదివసంబునందుఁ
గలుగంగ నా కిమ్ము కరుణతో ననుదుఁ, బలుక నవ్వర మిచ్చి బ్రహ్మ దాఁ జనియె
నప్పుడు వాణియు నాకుంభకర్ణు, తప్పులు బలికించి తాఁ బాసి చనఁగ
నీమాట నానోటి కేలొకో వచ్చె, నేమని వేడితి నీవరం బకట
యిరవంద నిది మున్ను హృదయంబులోనఁ, గరమర్థి దలంచిన కార్యంబు కాదు
పరికి౦ప దైవంబు ప్రతికూలమవుట, వెరవేది నాకోర్కె విపరీత మయ్యె
ననుచు విచారింప నంత రావణుఁడు, తనరుతేజముతోడ దండముల్ గొనుచు
ననుపమశ్లేషాత్మ కాహ్వయంబైన, వనములోపలి కేగి వర్తించుచుండ
వారిజాసనుచేతివరములు వడసి, వారు వచ్చుట విని వసుమతీస్థలికిఁ
బాతాళముననుండి పరివారసహితుఁ, డై తనూజులు మంత్రులగు విరూపాక్షు
శూరోత్తముని ప్రహర్షుని మహోదరుని, మారీచుఁ గొనుచు సుమాలి యేతెంచి
పౌలస్త్యపుంగవుఁ బఙ్క్తికంధరుని, నాలింగనముఁ జేసి యతనితో ననియె
ఘనుఁడ చిత్తంబునఁ గలమనోరథము, అనువార సిద్ధించె నధికభాగ్యమున
వ్రాలుతేజంబున వరములు వడసి, తీలోకమున నీకు నెదు రెవ్వ రింక
వినుము విష్ణున కేము వెఱచి పాతాళ, మున కేగితిమి భయంబున లంక విడచి
యసమానవిక్రమ యావిష్ణువలన, నెసఁగినభయము మా కిటమీఁద లేదు
బహుకాల మీలంక పాలించినాము, మహిమతో మేమున్న మనపట్టణంబు
నెలకొని సొంపార నీయన్న ధనదుఁ, డెలమి నప్పుర మిప్పు డేలుచున్నాడు
పరఁగ నెయ్యము మున్ను పాటించి యడుగు, పరిహరించిన లంక బలిమిఁ జేకొనుము
లంకాధిపత్యంబులం బొందు నీవు, కొంకక రాక్షసకుల ముద్ధరింపు
మాకు రాజవు నీవ మఱి దిక్కు నీవ, కైకొని పాలింతుగాక నీ వనిన
నతనితో రావణుం డనియె వైశ్రవణుఁ, డతులతేజుఁడు నాకు నధికమాన్యుండు
పితృసమానుఁడు గాఁడె పెద్దవాఁ డెందు, హితమైనఁ దగునె మీ కిట్లాడ ననుచుఁ
ద్రోచిపుచ్చిన ప్రహస్తుండును నవస, రోచితంబగు వాక్య మొక్కటిఁ బలికెఁ
దలఁపక దశకంఠ తగునె యీ పలుకుఁ, బలుక శూరులకు సౌభ్రాత్ర మెక్కడిది
యక్కయుఁ జెల్లెలు నగువారు గారె, యక్కశ్యపునిపత్ను లదితియు దితియు
నన్నదమ్ములు గారె యన్యోన్యశత్రు, లన్నెలంతల పుత్రులగు సురాసురులు
వనశైలసాగరవతియైన వసుధ, తనర గశ్యపునకై దైత్యు లేలఁగను
వారి నాలములోన వధియించి విష్ణుఁ, డారంగఁ త్రైలోక్య మమరుల కీఁడె
దేవాసురులకైనఁ దెఱఁగు చింతించి, నీవు గైకొను రాజనీతిమార్గంబు
నని పల్క మదిలోన నాదశాననుఁడు, ననువుగా నూహించి యౌఁగాక యనుచుఁ
బలికె నిశాచరబలముతో గూడి, యలరి యప్పుడు త్రికూటాద్రికి నరిగి
యెలమిఁ బ్రహస్తుని నీక్షించి పలికె, నలఘు విచారనీవర్ధేశుకడకుఁ
బ్రియమారఁ జని యాకుబేరునితోడ, నయశాలివై పల్కు నాపల్కు గాఁగ
ముదమున నీలంక మొదలు సుమాలి, మొదలైన రాక్ష సముఖ్యు లుండుదురు
మావారిపుర మిది మాకు నీ విచ్చి, పోవుట తగవని పొందుగాఁ బలుకు
మనఁ బ్రహస్తుం డేగి యామాటలెల్ల, వినిపింప నతనితో విత్తేశుఁ డనియె
విను రాక్షసులు లంక విడచినపిదపఁ, దనర నిందున్నాఁడఁ దండ్రిపంపునను
మానుగా నేను సమస్త రాక్షసుల, దానవనాథులఁ దగ సత్కరించి
యీలంక యేలితి నిది నాకుఁ దనకుఁ, బోలంగ నూహింపఁ బొత్తులపురము
తగువుతో నీలంక తనకును నేల, నగునంచుఁ బల్కి యాతని వీడుకొల్పి
చని విశ్రవసునకు సద్భక్తి మ్రొక్కి, ధనదుఁడు నప్పు డాతండ్రితో ననియెఁ
దనరారు నీలంక తనపురం బనుచు, ననఘాత్మ దశకంఠుఁ డడుగఁ బుత్తెంచె
నేమియానతి నాకు నిటమీఁద ననుడు, నామహాఘనతేజుఁ డతనితో ననియె
నీలంక గొనియెద నే నంచు నతఁడు, పౌలస్త్య నాతోడఁ బలుమాఱుఁ జెప్పెఁ
చెప్పినఁ గోపించి చెడవిచారించి, యొప్పఁగా వలవ దీయుద్యోగ మనిన
వరగర్వమునఁ జేసి వాఁడు నామాట, సరకు చేయకపోయెఁ జండకోపమున
నీ వింక నాలంక నిలువఁగవలదు, వేవేగ బలసమన్వితుఁడవై వెడలి
చారుసంపదలతో సామగ్రి మెఱసి, గారవంబున రమ్ము కైలాసగిరికి
నందు భానుప్రభ నమరు హేమార, విందదళీయుతవిమలోరుకమల
యనుపమసారసహంసనాదములఁ, దనరారుచున్న మందాకిని గలదు
కిన్నరగంధర్వగీర్వాణవరులు, చెన్నార నప్సరస్త్రీలును నందు
కమలకల్హారాది గంధవాసనల, నమరు సైకతముల నాడుచుండుదురు
వరగర్వితుండైన వానితో వైర, మరయ నీ కేటికి ననఁ గుబేరుండు
తనయులఁ గాంతలఁ దగ మంత్రివరుల, నొనరంగ భృత్యుల నోలిఁ బౌరులను
వరరత్నకాంచనవాహనాదులను, వెరవారఁగాఁ గొని వెడలి వేచనియె
ధనదుఁ డేగిన వెన్కఁ దత్పురం బొప్పెఁ, గనకనానారత్నఖచితసాధముల
నంత దశగ్రీవుఁ డనుజులుఁ దాను, సంతోషమును బొంది సచివులతోడ
బహురత్నతోరణబహుకేతునికర, మహనీయవీథుల మహిమఁ గన్గొనుచు
భటభుజార్దళహేతి బహువిస్ఫులింగ, పటలంబు దినకరప్రభల గీ ట్పరప
విలసిల్లు లంకాప్రవేశంబుఁ జేసి, యలరి ప్రహస్తుని యనుమతంబునను
బరఁగ లంకారాజ్యపట్టాభిషేక, మిరవందఁ గైకొని యెలమి శోభిల్లె
ధనదుఁడు నట యంతఁ దండ్రివాక్యమున, ననువంద రజతాద్రి కరిగి తా నచట
నమరేంద్రుపురికంటె నభిరామలీల, నమరంగ రచియించె నలక యన్పురము
నాపురంబున రాజ్యమర్థితో ధనదుఁ, డేపారఁ జేయంగ నిట లంకలోన
దశకంధరుండును దమ్ములతోన, విశదంబుగా నర్హవిధి విచారించి
యెలమి విద్యుజ్జిహ్వుఁ డీశూర్పణఖకుఁ, దలపోసి చూడఁగాఁ దగువరుం డనుచు
నమరఁ బెండిలి సేసె నంతటమీఁద, రమణితో మృగయాభిరతి నొక్కనాఁడు
దిరుగురు వనభూమి దితిసూను మయుని, దరలాక్షి నాతనితనయ నీక్షించి
యీవనంబున జను లెవ్వరు మెలఁగ, రీ వేల వర్తింతు వీయింతితోడ
ననిన నామయు డంత నతని వీక్షించి, తనదువృత్తాంతమంతయుఁ జెప్పఁ దొడఁగె
యామినీచరనాథ యాకశ్యపునకు, భామయౌ దితికిని బ్రభవించినాడఁ
నే మయుఁ డనువాఁడ హితబుద్ధితోడ, యామినీచరనాథ యమరులు నాకు
హేమ నానచ్చర నిచ్చి రేనందుఁ, బ్రేమతో నిచ్చినఁ బ్రీతిఁ గైకొంటి
మఱవక వేయేండ్లు మన్మథసుఖము, పరమానురక్తిమై పాటించుచుండఁ
బదునాలుగేండ్లకు భామావియోగ, మది దైవగతిఁ గల్గె నంత నే నలసి,
నాహేమ వర్తించు నాహోమగృహము, లో హేమకై వగ లుడుపంగలేక
పరమతపోవృత్తిఁ బరమేశు గూర్చి, యరయ సంతానేచ్ఛ నర్థితోఁ జేయ
గరళకంధరుం డంతఁ గరుణించి నాకు, వరరూపవతియైన వామాక్షి నిచ్చె
నరయ మందోదరి యనఁదగినట్టి, పేర నొప్పుచునున్న పువ్వులబోఁడిఁ
గమనీయకాంతి నిక్కన్యక ననిన, నమరకంటకుఁ డంత నాశ్చర్యమంది
యనఘాత్మ నీకన్య నాసదాశివుఁడు, గొనకొని నీ కెట్లు కూఁతుగానిచ్చె
వినిపింపు మనవుడు వేడ్కతో ననియె, ఘనభుజుఁడగు పఙ్క్తికంఠుతో మయుఁడు
తలకొని హిమనగాత్మజ యొక్కనాఁడు, యలర మైమర్దనఁ మర్థి గావించి
దేహపంకం బెల్లఁ బెఱఁగొప్పఁ బెట్టి, యూహింప నరుదైన యొప్పగువనిత
రూపంపుసౌభాగ్యరూపురేఖలను, నోపికతోడుత నొకబొమ్మఁ జేసి
పరమేశునకుఁ జూపి ఫాలాక్ష దీని, కిరవంద నాయువు నేపార నొసఁగి
సమరోర్వి నమరుల సాధించునట్టి, యమితబలోదగ్రుఁ డగువాని కిమ్ము
అనవుడు హరుఁ డప్పు డౌఁగాక యనుచు, ననయంబుఁ గరుణించె నంతట నదియు
నజరామరత్వంబు నతిరూపు నగుచు, భుజగకంకణుమ్రోలఁ బొలుపార నిలువ
నరయ మందోదరి యనునామ మిచ్చి, కరమర్థి నాయింతి గనుఁగొని మదిని
నంగజహరుఁ డంత నతికాముఁ డగుచు, నంగజసుఖలీల ననుభవించుటయ
నమరెడు గర్భంబు నగుట దాఁ జూచి, పురహరుతో గోప మొదవ నిట్లనియె
నిరుపమంబగుచున్న నీపేర్మి దూలి, పరకాంతఁ గలసితి పాతకం బనక
నశుచిత్వకారణ మటుమీఁదఁ గలుగఁ, బశుబుద్ధి యిది దేవ భావింపవైతి
నిదియు నా నేరమ యెసఁగిన తెరువు, నదయత నిను దూర నది పని లేదు.
ఇంక నీరూపంబు నిట్లుండెనేని, పంకజాక్షిని నీవు పాయంగలేవు
గాన నీరూపు నీకాంతకు వలవ, దా నేరమె చాలు నట్లయిన దాని
నైన మండూకమై యమరఁగా నీయు, మనవుడు శివుఁ డంత నట్ల కావింప
వెరవుగా మండూకవేషంబుఁ దాల్చి, యిరువుగా నున్నంత హిమశైలసుతయు
భూతేశ తొల్లింటి పుణ్యరూపంబు, నేతెఱంగునఁ గల్గు నిటుమీఁద ననిన
నంతటఁ గరుణించి యాపినాకియును, నింతితో వెఱగొప్ప నిట్లని పలికెఁ
గొంతకాలమునకుఁ గువలయంబునను, సత్యర్షి మయుఁ డని జన్మించి తనకు
సంతతి వేఁడ నిచ్చటికి నేతేర, నంతట ని న్నిత్తు నతని కాత్మజగ
సంతోషమున నీదు సౌందర్య మప్పు, డెంతయువేడ్కతో నీవు ధరించి
వరగర్వమునఁ జేసి వ్రాలుచునుండు, వరుఁడు రావణునకు వనితవు గమ్ము
ఆవరగర్భంబునందు జన్మించు, నావరవరుఁడు దా నమరుల గెలిచి
తరువాత రఘుకులోద్భవుఁడైన రాము, ధరణీంద్రు ననుజుచేతఁ జగముల్ బొగడ
మృతిఁ బొంది లక్ష్మీ సమేతుఁడౌ వాని, గతివేగఁ గనువాఁడు కమలాయతాక్షి
యనవుఁడు మండూకమై యుండె నదియు, గొనకొని పదివేలఘోరవర్షములు
నంతట నీవును నావిశ్రవసున, కెంతయుఁ బ్రియమార నెలమి జన్మించి
తేనును జను దెంచి యీశు సర్వేశు, మాననిభక్తి నామనమున నిలిపి,
పుత్రార్థినై తపం బొనరింప శైల, పతిజావిభుండు నీపొలఁతి నా కిచ్చె
నిచ్చినఁ దోడ్కొను చేను నాపురికి, వచ్చిన నొకనాఁడు వాత్సల్య మొప్ప
నారంగఁ బ్రార్థించి యడుగ నవ్విధము, నీరూపమెల్లను నీపుత్రి నాకుఁ
బరమపరిజ్ఞానభావ దా నగుట, నరయంగఁ దనతెఱం గంతయుఁ జెప్పె
నటుగాన నీసాధ్వి నమరులకంటెఁ, బటుతేజ మమరత్వభాతిఁ జెన్నొందె
వరుఁడు నీకన్యకు వలయుటఁ జేసి, వరు నిన్ను గూరిచి వచ్చినవాడఁ
నాడుబిడ్డలఁ గన్న యటుమీఁద నెట్టి, వాడు వాడిమి చెడవలయు నన్యులకు
నందను లిరువురు నాకు మాయావి, దుందుభు లనఁగ నుద్ధురపరాక్రములు
నని చెప్పి నీతెఱంగంతయుఁ జెప్పు, మనిన నమ్మెయిఁ జూచి యాదశాననుఁడు
లలితమై యొప్పు పులస్త్యువంశమున, నెలమిఁ బుట్టినవాఁడ నే దశాననుఁడ
నని పల్క విని కూఁతు నతని కీఁదలఁచి, మనమున సంతోషమగ్నుఁడై మయుఁడు
ఆపఙ్క్తికంధరు హస్తంబుఁ బట్టి, యీపంకజానన నిచ్చితి నీకుఁ
బౌలస్త్యకులవర్య పత్నిగా నింక, నీలేమ వరియింపు నింపు సొంపార
నమర మండోదరి యనఁగ నీవికచ, కమలాస్య ననుడు నక్కన్య నీక్షించి
లక్షణరూపాదులకు మెచ్చి యగ్ని, సాక్షిగా వరియించె సమ్మదం బలర
నేశక్తి సౌమిత్రి నిలఁ గూలనేసె, నాశక్తియును గాంచె నమ్మయుచేత
బలపరాక్రమశాలి పఙ్క్తికంధరుఁడు, లలనాసమేతుఁడై లంక కేతెంచి
బలిమన్మరాలైన పద్మాయతాక్షి, యలరు వహ్నిజ్వాల యనుదానిఁ దెచ్చి
వర్ణింపఁదగినవివాహంబు కుంభ, కర్ణున కొనరించెఁ గడుసమ్మదమున
సరమయన్ కన్యక శైలూషుఁ డనఁగఁ, బరఁగు గంధర్వాధిపతిపుత్త్రిఁ దెచ్చి
సముచితస్థితి సర్వసామగ్రితోడ, నమరఁ బెండిలి సేసె నావిభీషణున
కంత నాపౌలస్త్యులతివ లుఁదారు, నెంతయుఁ బ్రియమున హృదయంబు లలరఁ
దగ నందనమున గంధర్వులఁబోలె, నోగి వినోదించుచునుండి రంతటను
నిల నింద్రజిత్తని యెవ్వని జనులు, పిలుతు రెప్పుడు నట్టి పృథులవిక్రముని
శితికంఠువీర్యవిశేషంబువలన, సుతుని మండోదరి సొంపారఁ గాంచె.
నతఁడు జన్మించిన యప్పుడు ధాత్రి, ధృతిఁ దూలి యదరె నాదివిజులు బెదర
నురుతరమేఘంబు లుఱిమినభంగిఁ, పురజనంబులు భీతిఁ బొంది యేడ్చుటయు,
నందనునకు మేఘనాదుఁ డన్నామ, మందంబుగాఁ జేసె నాదశాననుఁడు
నగరిలో నా మేఘనాదుఁడు నంత, నొగి నాఁడునాఁటికి నొదవంగ నచట
నిమ్ముల మును బ్రహ్మ యిచ్చిన నిదుర, క్రమ్ముటయను గుంభకర్ణుడు వచ్చి
నన్ను నిద్దుర దశాననుఁడ! బాధించు, చున్నది నా కుండ నొకయిల్లు వలయు
ననవుడు దశకంఠుఁ డపుడు తక్షకులఁ, బనిచె ననేకుల బహుశిల్పవిదుల
వారును వెస నేగి వరచిత్రరచన, లారంగఁ దమనేర్పు లందంద మెఱసి
తారాచలోన్నతిఁ దనరారి లోన, మేరుగుహాంతరమితి నొప్పు మిగిలి
వివరింప బారల వెలుపారునూఱు, లవి మూడువేలును నన్నూరునిడుపు
గలిగి సముజ్జ్వలఘనలీలఁ దనరి, లలి రత్నతోరణాలంకృతం బగుచు
హాటకరత్నమయస్తంభరతులఁ, బాటిల్లు మణిసాలభంజికావళులు
రమణీయబహురత్నరచితవేదికలుఁ, గమనీయగతి నొప్పఁ గట్టిరి గృహము
నక్కుంభకర్ణుండు నమ్మందిరమునఁ, బెక్కువేలేండ్లును బెనుమబ్బు గవిసి
నిదురఁబోవఁగఁ లంక నిచ్చలు పఙ్క్త్తి, వదనుండు వెలువడి వసుధఁ గ్రుమ్మరుచు
సురల భూసురల యక్షులఁ బన్నగులను, బొరిపెట్టి చంపుచు భువనముల్ బెదర
నందనోద్యానాది నానావనంబు, లందుఁ జరించుచు నధికదర్పమున
నాఁకలేకేపారు ననిలుండు పోలె, వీఁక వృక్షంబులు' విఱిచివైచుచును
మదపుటేనుఁగుభంగి మట్టిమల్లాడి, నదులు గోరాడుచు నలి రేగి మఱియుఁ
జటులవజ్రముఁబోలె శైలశృంగములఁ, బటుభుజార్గళమునఁ బగులవేయుచును
బుడమిపైఁ గలయట్టి పుణ్యాశ్రమంబు, లెడపక చెఱుపుచు నిబ్భంగిఁ దిరుగ
దశకంఠుఁ డటు జగద్బాధకుం డగుట, విశదంబుగా విని వెసఁ గుబేరుండు
తనతమ్ముఁడైన యాదశకంధరునకు, నొనర బుద్ధులు సెప్పనొగిఁ బంప దూత
చనుదెంచి యతఁడును సంతోష మెసఁగ, మును విభీషణుఁ గాంచి మొగిఁ బూజ వడసి
ధనపతికుశలంబుఁ దక్కినబంధు, జనుల సేమంబులు సకలకార్యములు
నలర విభీషణుఁ డడుగఁగఁ జెప్పి, వలఁతియై యెఱిగించె వచ్చినపనులు
నంత దశగ్రీఁవు డధికతేజమున, నెంతయు నలరి కొల్విచ్చియుండఁగను
సమ్మదమ్మున విభీషణుఁడు తోడౌచు, నిమ్ముల మొఱఁబెట్ట నెలమి మ్రొక్కుచును
విత్తాధిపతిదూత వినయంబుతోడ, దత్తావధానుఁడై దశకంఠుఁ జూచి
తగలోకవార్తలు దడవుచో సమయ, మగుటయు ముకుళితహస్తుఁడై పలికెఁ
బ్రీతి మీయన్న కుబేరుండు నన్ను, దూతగాఁ బుత్తెంచె దోషాచరేంద్ర
మీకులంబున కెల్ల మేలైనపలుకు, లాకుబేరుఁడు సెప్పుచున్నాఁడు వినుము
పెక్కనాచారముల్ పేర్చి కావించి, తెక్కుడుముదముతో నేఁచితి సురల
నందనవనతరుల్ నఱిముఱి విఱిచి, తందంద బాధించి తఖిలసంయముల
కులములన్నియు నొక్కకులముగా బలిమిఁ, గలఁచి తెంతయు నన్నుఁ గైకొనవైతి
వెఱుఁగక పిన్నవాఁ డెంత చేసినను, నెఱి బుద్ధి సెప్పుట నీతి పెద్దలకు
నీయనాచారంబు లిటమీఁదనైనఁ, జేయక ధర్మంబుఁ జేకొని నడువు
చెడుత్రోవ వల దేను శివునకుఁ దొల్లి, తడయక తుహినాద్రిఁ దపము సేయఁగను
పరమేశుతోడ నాపార్వతీదేవి, చరియింపుచుండ నాచంద్రశేఖరుని
వఱలంగఁ జూచుచో వామనేత్రమున, నెఱుఁగక పొడగంటి హిమశైలపుత్రిఁ
దడయక నాకన్ను దగ్ధమై చూడఁ, గడునొప్పు దూలి పింగళవర్ణ మగుడు
నంత నక్కడ నుండ కందు వేఱొక్క, వింతయాశ్రమ మేను వెస నాశ్రయించి
యచటనె నూఱేళు లాహార ముడిగి, యచలితస్థితిఁ దప మాచరించుటయుఁ
గామారి మెచ్చి నాకడ కేగుదెంచి, యీమహాతపము ము న్నేఁ జేసినాఁడ
నీవు గావించితి నిష్ఠతో నిప్పు, డీవెంట సిద్ధింప దింక నన్యులకు
జగముల నాతోడ సఖ్యంబు నీకు, తగు నటుగాన మత్సముఁడవు నీవు
కడునుగ్రగతి నద్రికన్యాప్రభావ, మడరి నేత్రము దగ్ధమైనది గాన
నేకపింగాహ్వయ మింక లోకముల, నీ కొప్పు నని నన్ను నీలకంధరుఁడు
నిరుపమదయఁ జూచి నిజనివాసమున, కరుగంగ నట నేను నలక కేతెంచి
నరగర్వమున నీవు వారిలోకములఁ, దిరిగి యేఁచుట లెల్లఁ దెల్లంబు వింటి
నీచేతఁబడిన యానిర్జరుల్ మునులు, వేచి నీచెడుత్రోవ వెదకుచున్నార
లని చెప్పు మనియె మీయన్న వాక్యములు, వినిన మేలగు నీకు విందుగా కనిన
భ్రుకుటిరేఖాభీలభూరిఫాలముగ, వికటనేత్రస్ఫురద్విస్ఫులింగముగఁ
గని సభ కంపింపఁ గరములు చఱచి, కొని మొగంబులు బాదుకొని రోషమునఁ
చిటులు మంటలు మేను చెమరింప నోష్ఠ, పుటములు గటములుఁ బొరిబొరి నదరఁ
బరుషస్వరంబునఁ బలికె నిట్లనుచుఁ, దిరముగాఁ జెప్పితి తెలియంగ వింటి
నినుఁ బట్టి చంపెద నిన్ను నాకడకుఁ, బనిచిన ధనదునిఁ బట్టి చంపెదను
శివునితో సఖ్యంబు చేసితి ననుచు, నవమారఁ బుత్తెంచి నగుఁగాక నేమి
యిది నాకు నెంతయు హితవుగా కునికి, మదిలోన నెఱుఁగుదు మఱవ నీమాట
పితృసమానుఁడు నాఁకు బెద్దవాఁ డగుట, నితని సైరించితి నింతకాలంబు
నాలంబులోన నే నతనితో లోక, పాలురనందఱ భజింతు ననుచు,
నలుకతో వాలెత్తి యాదూత వేసి, బలి రాక్షసులకును భక్షింపవైచి
పుణ్యాహవాచనపూర్వకంబుగను, బుణ్యఘోషములతోఁ బొలుచు తే రెక్కి
మూఁడులోకంబులు మునుమిడి గెలుతు, వాఁడిమి నను గెల్చువాఁ డెవ్వఁ డనుచు
నతను బలోదగ్రుఁడగు మహోదరుఁడు, నతిఘోరవిక్రముఁ డగు ప్రహస్తుండు
సొరిది మారీచుండు శుకుడు సారణుఁడు, నరిభయంకరుఁడు ధూమ్రాక్షుఁడన్వాడు
సచివు లార్వురితోడఁ జనుఁదేరఁ బెక్కు, లచలముల్ నదులు మహారణ్యములును
దప్పక యొకముహూర్తంబునఁ గడచి, శివుడు పార్వతితోడఁ జెలఁగుచునున్న
కైలాసశిఖరంబు కడకేగి కడిమి, వ్రాలువీరులు యక్షవరులఁ దోలుటయు,
వారు నగ్గిరిపైకి వడి నేగి ధనదు, నారంగ నటు గాంచి హస్తముల్ మోడ్చి
ఘోరరాక్షసులను గొని రావణుండు, వారక కడిమి దుర్వారుఁడై పేర్చి
నీతమ్ముఁ డేపున నీతోడ సమర, మాతతగతిఁ జేయ నరుదె౦చినాఁడు
అనిన గుబేరుఁ డయ్యక్షులఁ జూచి, యని సేయుఁ డని పంచె నంత నెంతయును
నతులవిక్రములైన యక్షరాక్షసుల, కతిభయంకరమైన యాహవం బయ్యె
నానిశాచరమంత్రు లార్వురు నపుడు, నానాశరంబులు నాటి తూలుటయుఁ
జాల నొచ్చిన తనసైన్యంబుఁ జూచి, పౌలస్త్యుఁడును దిశల్ పగుల నార్చుచును
మహిమతో నడువ నమాత్యు లార్వురును, బహుసహస్రములతో బవరంబు సేయ
దెసలు గప్పిరి లసద్వివిపులశక్తులను, ముసలంబులను ఖడ్గములఁ దోమరముల
నోలి నొప్పించుచు నొక్కింత పోరఁ, గాలదండముఁ బోలు గదఁ బుచ్చుకొనుచు
వాయువుచే నేఁచి వరవహ్నిఁ బట్టి, పోయిన యడవులు పొరిఁగాల్చుభంగి
రాక్షసేంద్రుడు పేర్చి రణభూమిలోన, యక్షుల సమయించి యందఁదఁ గదిసి
యామహారథముఖ్యు లగు నమాత్యులను, భీమాట్టహాసముల్ బెరయంగఁజేసి
పఱతెంచి యయ్యక్షబలముతోఁ బొడువఁ, తఱుచుగాఁ గొందఱు ధరపైనఁ బడిరి
పెనుకిన్కఁ గొందఱు పెదవులు గఱచి, కొనుచునుండిరి తమకొలఁది కాకున్న
నొదవినభీతి నాయుధములు వైచి, యొదుగుచుఁ గొంద ఱొండొరులపైఁ బడిరి
యంత నారసములు నాహవగతుల, నంతకంతకు నిండె నాకాశపథము
ధనదుఁడు నప్పుడు తనసేన విఱిగి, చనుదేరఁ గనుగొని సంభ్రమించుచును
జండవిక్రముఁడైన సంయుగకంట, కుండాదిగా నాయకులు నెల్లఁ బనిచెఁ
కడిమితో సంయుగకంటకుం డంతఁ, దొడరి రాక్షసులతో దురము సేయుచును
మారీచు నొప్పింప మఱి మూర్ఛనొంది, యారాక్షసుండును నప్పుడు దెలిసి
యాలుకతో నని సేయ నాతడు విఱిగె, బలువడిఁ బరవంగఁ పఙ్క్తికంధరుఁడు
కనకచిత్రితరత్నఖచితంబు నగుచుఁ, దనరు నప్పురవరద్వారంబుఁ జొచ్చి
నగరివాకిట కేగ నడతెంచి యచటఁ, దగు సూర్యభానుఁడన్ దౌవారికుండు
నిలుపంగ నిలువక నిర్జరారాతి, బలవంతుఁడై పోవఁ బరుషరోషమున
నమితిబలుఁడగు నత డద్రిశృంగ, సమమైనతోరణస్తంభంబుఁ బెఱికి
వ్రేసె నక్కంబంబు వెసఁ బుచ్చుకొనుచు, నాసూర్యభానురూ పణచె రావణుఁడు
నాయుగ్రవిక్రమోదగ్రత కంత, నాయుధంబులు వైచి యక్షులందఱును
నగగహ్వరములకు నదులకుఁ బాఱి, బెగడఁ జొచ్చిన నాకుబేరుండుఁ జూచి
బలవంతుఁడగు మాణిభద్రుఁడన్వాని, నలయుచుఁ గనుఁగొని యతనితో ననియెఁ
బాపాత్ముఁ డగుచున్న పఙ్క్తికంధరుఁడు, నేపున నిటవచ్చి యెంతయుఁ గడిమి
దీపింప యక్షులఁ దివిరి చంపెడెని, యాపాపవర్తను నట నేలఁ గూల్చి
నతిభీరులగుచున్న యాయక్షులెల్ల, పవి నీవై పోయి పరిమార్పు మనినఁ
నక్షీణవిక్రము లగు నాల్గువేలు, యక్షవీరులతోడ నతఁ డేగుదెంచి
యాలంబు సేయంగ నతిఘోరలీల, నాలోన నందఱు నాయక్షవరులు
ఘోరముద్గరములు కుంతముల్ గదలు, తోరంపుశక్తులు తోమరంబులును
ముసలాయుధంబులు మొగిఁ బూని సమర, మసమానగతిఁ జేసి యరులఁ దోలుటయు
నావిక్రమంబున కలిగి నిర్జించి, వేవుర యక్షుల వెసఁ బ్రహస్తుండు
పరువడిఁ బురముపైఁ బడ మహోదరుఁడు, కరమల్క వేవుర గదపాలు సేసె
నంతలో ధూమ్రాక్షుఁ డని ఱెప్పపెట్టు, నంతలో యక్షుల నారెండువేల
మడియించినది చూచి మాణిభద్రుండు, తడయక ధూమ్రాక్షుఁ దలపడ నతఁడు
వడి ముసలం బెత్తి వక్షంబు వ్రేయఁ, గడు నొచ్చి వాఁడును గద ద్రిప్పివైచె
నురుగదాహతి మూర్చ నొంది యాతండు, ధరణిపైఁ బడఁ జూచి దశకంధరుండు
చండకాలానలచటులదోషమున, మండి పై నడవ నమ్మాణిభద్రుండు
వడి మూఁడుశక్తుల వైచె వైచుటయుఁ, గడునల్క నీతడు గదఁ బుచ్చుకొనుచు
వెస వానిమకుటంబు విఱుఁగవేయుటయు, నసమానభుజశక్తి నంతనుండియును
మాణిక్యరుచిరోరుమౌళిభంగమున, మాణిభద్రుఁడు పార్శ్వమౌళి నాఁ బరఁగి
యటు భంగమునఁ బొంగి యతఁడు రాక్షసులు, పటుతరధ్వని నిల్వఁ బాఱెఁ బాఱుటయు
నధికుఁడై దశకంఠుఁ డప్పద్మశంఖ, నిధులతో నొప్పుడు నిఖిలపుణ్యములు
దనరంగఁ బెంపారు ధనదునిఁ గాంచ, ధనదుఁడు ననియె నాదశకంఠుతోడ
కుబేరుండు రావణునకు బుద్ధి చెప్పుట
నతిరోషుఁడగునీకు నతిమదాంధునకు, హితబుద్ధి బుద్ధులు నెన్ని చెప్పినను
నాపల్కు వినవైతి నాన పోవిడిచి, యీపాపఫలము నీ వెఱిఁగెదు గాక
తగదన కెవ్వఁడు తల్లిదండ్రులను, మిగుల నాచార్యుల మేదినీసురుల
నవమానితులఁజేయు నాదురాత్మకుఁడు, వివిధాగ్రనరకముల్ విడువక పొందు
నొడలు నెమ్మదినుండ నొడగూడియుండఁ, జెడనిధర్మము సేయఁ జిత్తంబు చొరక
కానమి నెవ్వఁడు గర్వించి పలుకు, వానికి నరక మవశ్యంబుఁ గలుగు
మహితధర్మము సేయ మహనీయరాజ్య, సహితసంపదలతో సౌఖ్యంబు గల్గుఁ
గడఁగి యధర్మంబుఁ గావింప మీఁదఁ, గడలేనిదుఃఖంబు గల్గు గావునను
బరమసుఖార్థివై పాపంబు విడచి, కరమర్థి ధర్మంబు గావింపవలయు
గుఱి లేనిపాపంబు ఘోరదుఃఖంబు, కొఱకుఁ జేయుదు వీవు క్రూరుండ వగుటఁ
గడిమిఁ బాపము సేయఁగావచ్చుఁ గాని, కడిమి మైవలసినగతికిఁ బోరాదు
గైకొని యెవ్వఁడు కర్మంబుఁ జేసె, నాకర్మఫలము వాఁ డందకపోఁడు
దురితంబు గావించి దుస్సహం బైన, నరకంబుఁ బొందనున్నాఁడవు గానఁ
బాపాత్ముఁడవు నీవు పాపభీతులకుఁ, బాపకర్ములతోడ భాషింపఁదగదు
మారీచాదులు కుబేరుతోఁ బోరుట
అని పల్క మారీచుఁడాదిగా నప్పు, డనికి రావణమంత్రులందఱుఁ గడఁగి
పొరిఁ గుబేరునితోడఁ బోరి వీఁగుటయుఁ, బరుషవిక్రముఁ డైనపఙ్క్తికంధరుఁడు
నట్టహాసముతోడ యక్షేశుఁ గదియఁ, గట్టల్క నాతఁడు గదఁ ద్రిప్పి వేసెఁ
దలఁకక దారుణద్వందయుద్ధంబు, బలువిడిఁ జలిపి రప్పౌలస్త్యు లపుడు
నెలకొని ధనదుఁ డాగ్నేయాస్త్ర మేయ, లలి వారుణాస్త్రంబు లంకేశుఁ డేసి
నొలసి రారాజు వాయువ్యాస్త్ర మేయ, నలి నిశాచరపతి నాగాస్త్ర మే'సె
మఱియును బహుదివ్యమార్గణావళులు, పరఁగ నేయుచును నప్పౌలస్త్యవరులు
పైపైని మాయలు పన్ని శార్దూల, మై పోరి సూకరమై యాక్రమించి
జలదమై శలభమై జలధియై తోచి, యలుకతో నక్కఁడై యట దైత్యుఁ డగుచు
నేపున వడి నిట్ల సేకంబులైన, రూపముల్ గైకొని రోషంబుతోడ
నడరి విజృంభించి యతనిచే వేటు, పడి యాకుబేరుండు బలుమూర్ఛఁ గదిసి
నిండి పైపైఁ గ్రమ్మ నెత్తుట దోఁగి, ఖండితాశోకవృక్షముభంగిఁ బడియె
నెలకొని తొమ్మిదినిధులును ధనదు, వలతురై నందనవనములోపలికిఁ
గ్రమ్మరఁ గొనిపోవఁ గదిసిన మూర్ఛ, నిమ్ముల నట తేర్ప నిట రావణుండు
అక్షీణభుజబలం బచ్చెరువార, యక్షాధిపతిఁ గూర్చి హర్షంబుతోడ
నసమానజయకరానల్పశిల్పముల, పసనుగాఁ దీర్చిన పసిఁడికంబములఁ
బ్రచురప్రభాజాలబహువిధరత్న, ఖచితంబు లగుచున్న లగుతోరణములు
కలితముక్తాదామకము లొప్పు కామ్య, ఫలదంబులగు దివ్యపాదపంబులును
లసితోర్వుమాణిక్యలలితంబులైన, పసిఁడిసోపానముల్ పసిఁడివేదికలు
మానుగాఁ జూడ్కికి మానసంబునకు, నానంద మొనరించు నరుదుచందములఁ
గలయ నొండొంటికిఁ గడువింత లగుచుఁ, జెలువొంద నానావిచిత్రచిత్రములు
ఘనమనోవేగంబుఁ గామరూపంబు, ననవద్యమహిమయు నాకాశగతియుఁ
గలిగి దివ్యుల మోవఁగా నొప్పుఁ గలిగి, నెలకొని బ్రహ్మచే నిర్మింపఁబడిన
తనదు పుష్పకము నుద్దామదర్పంబు, తనరఁ గైకొని యెక్కి తారాద్రి డిగ్గి
ఘనమైన కాంతితోఁ గార్తికేయుండు, జననంబు నొందిన శరవణంబునకు
నరిగి పుష్పకరశ్ము లడరి వెలుంగ, నరవిందబంధుఁడో యన నద్రి నెక్కి
యొక్కవనం బట నొప్పారఁ గాంచి, యక్కడఁ బుష్పకం బరుగకుండుటయు
రావణుఁ డెక్కి వెళ్ళుపుష్పకము నిలిచిపోవుట
సచివులఁ జూచి యాశైలంబుమీఁద, నిచట పుష్పక మాఁగె నెవ్వఁడో యనఁగ
మదిలోన నూహించి మారీచుఁ డనియె, నిది యొక్కనెపము లే కి ట్లేల నిలుచు
ధనదుఁ డాఁగెనో యెండెధనుదునిఁగాని, తనర నన్యుల నిది దాల్పదో యనఁగఁ
గుఱుచచేతులతోడ గుజ్జురూపంబు, మెఱయ నందీశుఁ డామృడునకుఁ బ్రియుఁడు
పౌలస్త్యుఁ గిన్కతోఁ బల్కె నీ విచటి, కేల వచ్చినవాఁడ విటు శంక లేక
నిది మహాదేవునియేకాంతభూమి, కదియరా దీయద్రి కడువేగ దిగుము
గరుడోరగామరగంధర్వయక్ష, వరనిశాచరభూతవర్గంబులందు
నెందును నెవ్వరు నీపొంతఁ బోరు, నిందు నీ వేతేర నెవ్వఁడ వనిన
నిందుశేఖరుఁ డెంత యీకొండ యెంత, నిందు న న్వారింప నెవ్వఁడు గలఁడు
త్రిణయణుతోఁ గూడఁ దృణలీలఁ గేల, బెనసి యీశైలంబుఁ బెఱికివైచెదను
అని పుష్పకము డిగ్గి యచలంబుమొదలి, కనుపమభుజబలం బరుదారఁ జేరి
గిరిచరాననముతో గిరిజేశుకెలన, నిరవందనున్న నందీశ్వరుఁ జూచి
మేఘ ముఱిమినభంగి మిన్నెల్ల నద్రువ, నాఘనభుజుఁ డట్టహాసంబు సేయ
మృడునకు మాఱట మృతుఁడైనయతఁడు, కడునల్క నాపఙ్క్తికంఠుతో ననియె
నగచరాననుఁ డని ననుఁ జూచి పెలుచ, నగితిగావున దశానన నీవు నింక
నాయత భుజములు నరుదుకోఱలును, నాయుధంబులు గాఁగ నతిశూరు లగును
నడగొండ లనఁదగు నగచరోత్తములు, కడిమి నీకులక్షయముఁ గావింపఁ
బుట్టెదరిటమీఁద భువనంబు లలరఁ, బుట్టి నీ గర్వంబుఁ బుచ్చివైచెదరు
నీవు సేసినయట్టి నిష్ఠురపాప, మీవిధి నినుఁ జంపు నే నినుఁ జంప
నని పల్క నామాటలవి లెక్కగొనక, తనరినకిన్కతో దశకంఠుఁ డనియె
నిచట నీపుష్పక మెవ్వనిశక్తిఁ, బ్రచలింపకున్నది ప్రభువునుబోలె
నీయద్రి లీలమై నెవ్వఁ డున్నాఁడు, పాయక నాగర్వపర్వతారూఢు,
మన్నింపఁదగువారి మన్నింపనేర, కున్న ధూర్జటిదం బుడిపెద ననుచు
బృథుశక్తి రజతాద్రి బిగియారఁబట్టి, పృథివి వేయఁగ నూఁచి పెల్లగించుటయు
నాకొండ కంపించె నందున్నప్రమథు, లాకంపమును బొంది రాకంపమునకు
శైలేంద్రపుత్రియుఁ జంద్రశేఖరుని, నాలింగనము చేసె నతిభీతితోడ
నంతమహాదేవుఁ డాదేవదేవుఁ, డంతయు నెఱిఁగి పాదాంగుష్ఠమునను
లఘులీల నది భూతలంబున కొత్త, రఘునాథయంత నారాక్షసేశ్వరుఁడు
చండంబులగు శిలాస్తంభోరుబాహు, దండముల్ గదియఁగ ధరతోడఁ గదియ
నాకొండ వడి నొత్త నటమీఁది కెత్త, లేక చేతులు దీయలేక వాపోయి,
పిడుగులు వడునట్టి పెరుమ్రోఁత గాఁగ, విడువక యబ్భంగి వేనోళ్లు నొరల
నతనిమంత్రులు వెఱఁగంది చింతింప, నతిభీతి చలియించె నఖిలలోకములు
నింద్రాదిదివిజులహృదయముల్ గలఁగెఁ, జంద్రసూర్యులగతుల్ చలియించె నంతఁ
జిత్తంబుఁ దయఁ జెంది చిత్తజారాతి, యొత్తి యాయంగుష్ఠ మొక్కింత వదల
ఘనభీతిఁ జేతులు గ్రమ్మునఁ దిగిచి, కొనియున్నయమరారిఁ గొమరారఁ జూచి
విను దశగ్రీవ నీవిక్రమంబునకుఁ, బెనుపైన ధృతికిని బ్రీతుండ నైతి
భువనంబులన్నియుఁ బొరి భయం బంద, రవము చేసితిగాన రావణాహ్వయము
నీకు సార్థక మయ్యె నిఖిలలోకముల, నీకారణంబున నీపేరఁ బరఁగు
నని ప్రీతుఁడై పల్కి యమ్మహాదేవు, డనురాగమునఁ జంద్రహాసంబు నిచ్చి
యరయంగ ముమ్మాఱు నతిసత్త్వవృత్తిఁ, బరఁగఁగఁ బనిసేయుఁ బ్రతివీరులందు
నింతనుండియు నీకు నీసాధనంబు, పంత మెడలఁ బోవుఁ బౌలస్త్య యింకఁ
బొ మ్మెందు వలసినఁ బుష్పకం బెక్కి, సమ్మదంబున ననుజ్ఞాతుండ వైతి
నాచేత ననుడు నానాగభూషణున, కాచేతు లటు మోడ్చి యతిభక్తి మ్రొక్క
యలరుచు నవ్విమానాధిరాజంబుఁ, బొలుపారఁగా నెక్కి భూమి గ్రుమ్మరుచు
రాజుల కొందఱ రణభూములందుఁ, దేజంబు లలరఁగఁ దివిరి భంగించుఁ
బరిమార్చుఁ గొందఱ బలసమేతముగ, శరణన్న గొందఱ సైఁచి మన్నించు
రావణుడు వేదవతిని జూచి మోహించుట
నీతెఱంగున బాధ లెసఁగఁజేయుచును, నాతతస్థితి తుహినాద్రిపార్శ్వమున
నేపారువనమున కేగి యందునను, రూపయౌవనకళారుచిరాంగి నొక్క
హరిణాజినాంబర నంచితవ్రతను, వరతపస్విని వేదవతియనుకన్యఁ
బొడఁగాంచి యరుదంది పొలఁతి యీకడిది, నడవడికిని యౌవనమునకుఁ దగునె
నీయొప్పు గనుఁగొని నియతాత్ము లైనఁ, గాయజగోచరుల్ గాకపోఁగలరె
యెవ్వఁడు నీతండ్రి యెద్ది నీనామ, మెవ్వనిసతివి నీ విట నుండు టేమి
పోఁడిగా నెవ్వని బొందుదు వీవు, వాడు కృతార్థుండు వనజాయతాక్షి
యాపద లడఁగింప నంగజాస్త్రములఁ, జూపు నీకడకంటిచూ పింతె చాలు
నీమేను గుందించు నీతపంబునకు, నేమి ప్రయోజనం బెఱిఁగింపు మనిన
నాతిథ్య మొనరించి యావేదవతియు, నాతురుండైన దశాస్యుతో ననియె
మాతాత సురమంత్రి మహనీయబుద్ధి, నాతండ్రి కెనవచ్చు నాతఁ డున్నతుఁడు
మాతండ్రి ధర్మైకమతి కుశఛ్వజుఁడు, బ్రాతిగా నియతి నాబ్రహ్మర్షివరుఁడు
వేదంబు చదువ నావేళ నేఁ బుట్టి, వేదవతీనామవిఖ్యాత నైతి
నను నంతఁ గోరి గంధర్వులు సురలు, దనుజులు యతులు దైత్యులు నడుగ
నెలమితో విష్ణున కిత్తునన్బుద్ధిఁ, బలుమాఱుఁ దమ్మెల్లఁ బరిహరించుటయు
రాతిరిమై దైత్యరాజు శంబరుఁడు, మాతండ్రిఁ జంపె నేమఱుపాట వచ్చి
మాతల్లియును నంత మాతండ్రితోడ, వీరకల్మషబుద్ధి విహితమార్గమును
జేకొని తగ నేకచితిఁ బొంది పుణ్య, లోకంబునకు ధర్మలోలయై చనియె
నేనును మాతండ్రిహృదయంబుకోర్కి, మానుగా దలపోసి మానసంబునను
భక్తవత్సలుఁ డైన పంకజోదరుని, భక్తిభావంబున భర్తఁగాఁ గోరి
తపము గైకొంటి నాతపమున కిదియె, నెప మీతపశ్శక్తి నిఖిలంబుఁ గాంచు
నిను నెఱుఁగుదు నేను నీవు పౌలస్త్యు, మనుమఁడ వీపిన్నమాట లేమిటికి
ననవుడుఁ బుష్పకం బాతఁడు డిగ్గి, మనసిజశరభిన్నమానసుఁ డగుచుఁ
గనకలతాచారుకాంతిపూరమునఁ, దనువొప్ప నక్కన్యఁ దప్పక చూచి
తప మిది వార్ధకధర్మంబు గాని, చపలాక్షి యౌవనాచారంబు గాదు
నుపభోగకాలంబు నూరక పుచ్చి, విపరీతచరితంబు వెలఁది నీ కేల
లలితాంగి నీవింక లంకేశు నన్నుఁ, బొలుపారఁ గైకొని భోగింతుగాక
పతి నాకు విష్ణుండు భావింప ననుచు, జితలోకుఁడగునాకుఁ జెప్పఁగ నేల
నీగర్వ మేటికి నీమాట లేటి, కేగుణంబుల నాకు నెనవచ్చు నతఁడు
ననవుడుఁ గోపించి యక్కన్య పలికెఁ, జన దిట్లు పలుక నాజగదేకవీరు
వేదంబులందున వెదుకఁ జొప్పడని, యాదిదేవుండని యావిష్ణుమహిమ
కల్పాదికాలంబు గడపంగలేని, యల్పుల కెఱుగంగ నలవి గా దనినఁ
దెగువతోఁ గదిసి యాదేవకంటకుడు, తగవు చింతింపక తలవట్టి దివియ
విడిపించుకొని రోషవిస్ఫులింగమ్ము, లడర నయ్యింతియు నతని నీక్షించి
యోడక తలపట్టి తోరి దుష్టాత్మ, పాడియె నామానభంగంబు సేయ
నేనాఁట నిది చెల్లు నే నాఁటదానఁ, గాన ని న్నిప్పుడు కడతేర్పఁజాలఁ
జేసినతపమెల్లఁ జెడిపోవుఁగాన, గాసిల్లి శపియింపగా మున్నె చాలఁ
బ్రదు కేమిటికి పరిభవముతో ననుచు, సొదఁ బేర్చుకొని యగ్నిఁ జొరనిశ్చయించి
నేమంబు గైకొని నిశ్చలవృత్తి, హోమంబు నిచ్చలు నొనరింతు నేని
కాలంబు పాత్రంబుఁ గడపక ధర్మ, శీలనై దానంబు సేయుదు నేని
పొడమునింద్రియముల పొడ వడంగించి, కనునుగ్రతప మర్థిఁ గావింతు నేని
నాసుకృతంబున నక్షీణపుణ్య, భాసురుం డగునట్టి పార్థివేంద్రునకు
నరయ నయోనిజనై జనియించి, పరమపాతివ్రత్యపరతఁ బెంపొంది
దురితలోలుఁడవైన దుశ్శీలు నిన్ను, దురములోఁ బతిచేతఁ దునిమింతు ననుచు
నరవిందనాభుని యంతరంగమున, నరవించముఖి నిల్పి యనలంబుఁ జొచ్చె
వసుధ నప్పుడు పుష్పవర్షంబు గురిసె, నెనఁగ సంతోషించి రెల్లదేవతలు
ఆవేదవతియును నంత నాజనక, భూవరుం డధ్వరభూమి దున్నింప
సీతాంతరంబునఁ జెన్నొందఁ బుట్టి, సీతాభిధానంబుచే నుల్లసిల్లి
యసమానశుభమూర్తి నమరుచు జనక, వసుధేశుపుత్రియై వరియించె నిన్ను
నీవు విష్ణుండవు నీవు నీమహిమ, భావింప మానుషభంగి గా దెట్లు
వేదవతీకన్యవృత్తాంత మెఱిఁగి, యాదశాస్యుడు పుష్పకారూఢుఁ డగుచు
సంవర్తుఁడను మహాసంయమీశ్వరుడు, సవింధానంబున సకలసంయములు
ననిమిషసంఘంబు లలర మరుత్తుఁ, డనురాజు నధ్వర మర్థిఁ జేయింప
నావార్త కటువోవ నక్కడనున్న, దేవత ల్వీక్షించి తిరుగుడుపడఁగ
నిక్కడ జనుదెంచె నీయుగ్రుఁడైన, రక్కసు గెలువంగ రా దిప్పు డనుచు
నాకాధినాథుండు నమలియై జముడు, కాకరూపం బైనఁ గడుభీతి నొంది
యాలోన వరుణుండు హంసయై పెంపు, మాలి కుబేరుండు తొండయై మఱియుఁ
దక్కినసుర లెల్ల ధైర్యంబు లెడలి, యొక్కొక్కరూపమై యొగి నోసరింప
వడిఁ బేర్చి యాయజ్ఞవాటంబుఁ జొచ్చి, యడగుగర్వంబున నారాజుఁ జూచి
భూపాల నాతోడఁ బోరికిఁ గడఁగు, మోపనియట్టైన నోడితి ననుము
మిన్నక పోరాదు మెయితోడ నీకు, నన్న మరుత్తుఁ డయ్యమరారిఁ జూచి
యీమాట లాడ నీ వెవ్వఁడ వనిన, నామాట కతఁ డట్టహాసంబు సేసి
కిన్నరేశ్వరుతమ్ము గీర్వాణరిపురి, నన్ను రావణు మున్ను నరనాథ వినవె
నెఱసిన నాబల్మి నిఖిలలోకముల, నెఱుఁగని యవ్వీరుఁ డెవ్వఁడు లేఁడు
భువనైకభీకర భూరిప్రతాప, భవనుండ రిపుగజపంచాననుండ
ఇంద్రాది దివిజుల హృదయంబు లడరఁ, జంద్రహాసముఁ గొని చరియించువాఁడఁ
త్రిజగత్తులందును దివిజసంగ్రామ, విజయుండనై యుందు విపులసాహసుఁడ
నెవ్వఁడ వనుమాట నిచట నే వింటి, నెవ్వఁడనో యింక నెఱిఁగెదు గాక
వడిఁ గుబేరుని నాహవంబునఁ దోలి, కడిమిమై నీపుష్పకముఁ గొన్నవాఁడ
ననుడు మరుత్తుఁడు నాదశగ్రీవుఁ, గనుగొని రాక్షస కడుఁగృతార్థుఁడవు
భ్రాత నోడించితి బవరంబులోన, నీతేజ మొరులకు నేల సిద్ధించుఁ
దోయజగర్భుడు దుష్టాత్ముఁడైన, నీయట్టికొఱగాని నీడఁ బుట్టించె
నంతకుపురికి ని న్ననుతు నాయెదుర, నంతకు బదిలుండవై నిల్వు మనుచు
బాణాసనంబును బటుబాణభరిత, తూణముల్ గొని తెంపు తోరణంబునకు
నరుగంగ సంవర్తుఁ డడ్డంబు సొచ్చి, నరనాథ దీక్షితునకు నల్గరాదు
నేమంబుఁ గైకొని నిత్యైకనిష్ఠ, నీమహేశ్వరయాగ మీడేర్పవలయుఁ
గాన నిప్పుకుడు కులక్షయము వాటిల్లుఁ, గాన విక్రమవేళ గా దట్లు గాక
నెందును దుర్జయుం డీదశగ్రీవుఁ, డెందు వ్రాలునొ జయ మెఱుఁగఁగరాదు
అనిన మరుత్తుఁడు నాత్మ - జింతించి, ఘననిష్ఠ శాంతంబుఁ గైకొని మదిని
ఆకోపమున విల్లు నమ్ములు విడిచి, చేకొని జన్నంబు సేయంగ దొడఁగె
నకలంకుఁడై దైత్యుఁ డావిజయంబు, సకలదిక్కులయందుఁ జాటించి యార్చి
రోషోగ్రగతి నామరుత్తుని గెలిచె, దోషాచరేంద్రుడు తొడిబడ మునుల
సమయించి యటు వాసి చనియె దేవతలు, తమతమరూపముల్ దాల్చి రాలోన
నాకాధినాథుండు నమలి నీక్షించి, నీకలాపమున నానేత్రముల్ వేయుఁ
గలిగి క్రొమ్మేఘంబు గర్జిల్లి కురియఁ, జెలఁగి తజ్జలములు సేవింపుమనుచు
నరుదుగా వరమిచ్చె నదిమొదల్ నమలి, పురి చిత్రవర్ణమై పొలిచె లోకముల
వరుణుండు హంసకు వరమిచ్చె శుభ్ర, తరవర్ణమై మేను దనరారి వెలుఁగఁ
జన్నుగాఁ గాంచనప్రభ మేను గలుగఁ, గిన్నరాధిపుఁ డిచ్చెఁ గృకలాసమునకుఁ
గమణ నంతకుడును గాకి నీక్షించి, జరచేతఁ దెవులచేఁ జావు లేకుండ
మరణంబు నొందిన మనుజుల కెల్ల నిరవంద ధరణిపై నిడినపిండములు
తిరముగాఁ గొని వారిఁ దృప్తులఁ జేయ, వర మిచ్చినంత నధ్వరము దీరుటయు
నిజనివాసములకు నిర్జరుల్ చనఁగ, రజనీచరేంద్రుండు రణకాంక్షులైన
రావణుఁడు రాజులపై యుద్ధమునకుం బోవుట
భూతలాధీశులపురములమీఁద, నాతతోద్ధతగతి నరిగి యీనృపుల
కడిమిమై నాతోడఁ గయ్యంబు సేయఁ, గడఁగుఁ డోటమి యొండె గైకొనుఁ డనిన
ఘనుఁడైన సురథుండు గాధేయగయులు, ననవద్యతరతేజుఁడగు పురూరవుఁడు
మొదలుగాఁగల రాజముఖ్యులు పఙ్క్తి, వదను నిప్పుడు గెల్వ వశముగా దనుచు
కొనరంగ నూహించి యోడిత మనిన, విని రావణుఁడు తనవిక్రమంబునకు
నలరుచు ననరణ్యుఁ డనురా జయోధ్యఁ, జెలువంద రాజ్యంబు సేయ నం దరిగి
జననాథ నాతోడ సమరంబుఁ జేయఁ, జనుదెమ్ము కాదేని చాల నే ననుము
మిన్నక పోరాదు మృత్యుదేవతకు, నన్న నామాటకు నతఁడు కోపించి
నీరాక యెఱిఁగి నే నీతోడఁ బోర, ఘోరసైన్యముఁ గూర్చుకొని యున్నవాఁడ
శూరుఁడవై లావు చూపుదుగాక, యీరిత్తమాటలు నింకేటి కనఁగ
నురుసత్వజవములు నొప్పారు కరులుఁ, బరువడి లక్షయేఁబదివేలు హరులు
బహురథశ్రేణులు పటురథాటోప, బహుళంబు లగుచున్న భటసమూహములు
పెందూళి యెగయంగఁ బృథివి గంపింప, నందందు వెలువడి యారాజసేన
దశకంఠుసేనతోఁ దలపడి సకల, దిశల నార్పులు నిండఁ దెంపారఁ బోరి
దళముగాఁ బఱతెంచి దావాగ్నిఁ బడిన, శలభసందోహంబు చందంబు నొందెఁ
దడయక విఱిగిన దనసేనఁ జూచి, యడరుకోపంబున నానరేశ్వరుఁడు
మొనసి మారీచుడు మున్నగాఁ గలుగు, ఘనవిక్రముల దశకంఠు మంత్రులను
గడిమి మార్కొని చండకాండముల్ వఱసి, వడి మృగంబులఁ దోలు వడువునఁ దోలి
యమరారి కభిముఖుఁడై యింద్రధనువు, కొమరారు తనవింటిగుణము మ్రోయించి
దశకంఠుఁ కోటీరదశకంబు మీద, విశిఖంబు లేనూఱు నింట సంధించి
యడరింప నదియును నచలశృంగములఁ, బనువారిధారలభంగియై పడిన
నట్టహాసముతోడ నతిఘోరభంగి, నెట్టన లంఘించి నెత్తి వ్రేయుటయు
దారుణగతి రక్తధారలతోడ, నారాజు రావణుహస్తఘాతమున
నరదంబుపై నిల్వ కవనిపైఁ బడిన, గిరిశృంగశకలంబుక్రియ నేలఁ గూలి
కప్పిన పెనుమూర్ఛ గనుమూసియుండ, నప్పాటునకు నాదశాస్యుండు నగుచు
భూచర నాతోడఁ బోరికిఁ గడఁగి, నీ వేమి గుడిచితి నీలావు నమ్మి
యలఘుఁడౌ నాఢాక కఖిలలోకములుఁ, గులశైలవరములుఁ గూడఁ గంపించు
జగదేకవిజయుఁడై చరియించు నాకు, మగఁటీమి యెవ్వరు మాఱు లేరనినఁ
గంఠనాళమునకుఁ గదిసి జీవంబు, కుంఠితమై యుండఁ గొంత కన్విచ్చి
రావణు నీక్షించి రాక్షస నన్ను, నీవు చంపెద నని నిక్కి పల్కెదపు
కాలంబు నెవ్వఁడుఁ గడపఁగఁజాలుఁ, గాలగోచరుఁడైన గడతేరవలయు
నీ వొక్కనెపమున నియతి నీతెఱవు, గావింప నీ విటఁ గర్తవు గావు
కడుఁగీడుజన్మంబు గలుగుటఁ జేసి, పుడమిలో నరమాంసభోజివై తిరుగు
మధము ని న్నే మన నతిశూరుఁడైన, యధికుండు దన్నుఁ దా నగ్గించుకొనునె
ధరణిపైఁ గంఠగతప్రాణుఁ డగుచు, దురవస్థతో నిట్లు తుదిఁ జేరియున్న
నే నొండు గావింప నిటమీఁదఁ జాలఁ, గాన నీ వేమన్నఁ గైకొనవలసె
విమలైకధర్మంబు విశ్రుతకీర్తి, కొమరారు నిక్ష్వాకుకులములోపలను
నలువారఁ బుట్టిననాఁటను గోలెఁ, జెలువొంద దానంబుఁ జేసితి నేని
విపులయాగములు గావించితి నేనిఁ, దప మొనర్చితి నేనిఁ దగవుతోఁ బ్రజల
నెలమిఁ బాలించితినేని యిక్ష్వాకు, కులజుఁడు నుత్తమగుణరత్ననిధియు
ననుపమతేజుండు నగు మహారాజు; ననిలోన నినుఁ జంపు నని శాప మిచ్చె
సురదుందుభులు మ్రోసె సురపుష్పవృష్టి, యరుదార ధరణిపై నందందఁ గురిసె
నరనాయకుం డంత నాకలోకమున, కరిగె రావణుఁడును నటు వాసి చనియె
నని చెప్ప రఘురాముఁ డల్లన నవ్వి, మునినాథుఁ గనుఁగొని ముదముతో ననియె
ననఘాత్మ శూరసూన్యం బైననాఁడు, పొనుపడియుండెనె భువనంబులెల్ల
నాజికి నతనితో నడరంగ నెందు, రాజపుత్రులు లేరె రాజులు లేరె
యుఱక నారాజన్యు లోడితి మనిరె, వఱలు దివ్యాస్త్రముల్ వారికి లేవె
యోట మెన్నఁడు లేదె యుద్ధామవిక్ర, మాటోపగతిఁ దూల నాదశాస్యునకు
నెందు నాతనిఁ జూచి యెదురంగ లేక, పందలై పోయిరె పార్థివు లనిన
బరమేశుఁ డగుచున్న పార్వతీపతికిఁ, బరమేష్ఠి చెప్పినభంగి నిం పలర
దరహసితాస్యుఁడై తాపసోత్తముఁడు, ధరణీశుఁ గనుగొని తాఁ జెప్పఁదొణఁగె
రావణు చేసిన రణ మింక నొకటి, భూవరోత్తమ నీవు సోలంగ వినుము
రావణుడు కార్తవీర్యునిపై దండెత్తుట
యెల్లభూములమీఁద నేగి భూపతుల, నెల్ల సాధించుచు నేపున మఱియు
బలవైరిపురముతోఁ బాటియై ధరణిఁ, బొలుచు మాహిష్మతీపురమున కరిగి
కార్తవీర్యునితోడఁ గయ్యంబుఁ జేసి, కీర్తనీయంబగు గెలుపుఁ గైకొనఁగ
నే వచ్చినాఁడ మీ రింత వేగమున, నీవార్త యతనికి నెఱిఁగింపుఁ డనిన
నారాజమంత్రులు నావాక్యములకు, నారావణునిజూచి యతనితో ననిరి
విటపివాటిక లొప్పు వింధ్యాద్రిచెంత, నటదూర్మి యగుచున్న నర్మదలోనఁ
దరుణులతోఁ గూడఁ దగిలి మారాజు, సరిజలక్రీడలు సలుపుచున్నాఁడు
ఆహవోద్యోగంబు నతనితో నేల, బాహుపరాక్రమభవ్యఁడామనుఁడు
తెలియనేరవు మృత్యుదేవతయైన, వెలువడునే కార్తవీర్యుని దొడరి
వలవ దాతనితో వైరంబు నీకుఁ, దొలఁగి బ్రతుకు మిట్లు దొల్గవేనియును
ఇంతకు వచ్చు నొక్కింతయు నిలుము, యంతకు సైఁచవే నచటికిఁ జనుము'
అనవుడు నామాట కప్పుడె కదలి, తనరినకిన్క నాదశకంఠుఁ డరిగె
నింగితో సొరయుచు నిబిడోరుమేఘ, సంగతిశృంగముల్ సరివేయు మెఱయ
మదగంధములఁ బెక్కు మరగింపుకరులు, వదలక చరియించు వనవీథు లొప్పఁ
పరుషకంఠీరవ భైరవారావ, భరితంబులై గుహాభవనముల్ మెఱయఁ
బొలుచుసానువులపైఁ బొడవున నుండి, చెలఁగుచుఁ బఱతెంచు సెలయేఱు లమర
లీలమై నచ్చరలేములతోడఁ, గేళి సల్పుచు నోలి కిన్నరోత్తములు
ఘనులైన సురలును గంధర్వవరులుఁ, దనుజపుంగవులు విద్యాధరాదులును
ననువార నుండుట నాకలోకమున, కెనవచ్చు పెంపున హిమగిరిఁ బోలి
వినుతింపఁదగిన యావింధ్యాచలంబుఁ, గనుఁగొంచు వింధ్యోపకంఠదేశమున
బహువిహంగాకులపంకజాకరము, మహనీయతరపశ్చిమప్రవాహంబు
నగుచు దుప్పులు లులాయములు సింహములు, మొగిఁబులుల్ భల్లూకములు గజంబులును
గట్టెండతాఁకునఁ గదుపులై చొచ్చి, మట్టాడి కలఁచిన మడువులు గలిగి
వర్ణింప నెత్తమ్మివదనమై కలువ, కర్ణావతంసమై కదియు జక్కవలు
శవములై బొదిగొన్న కొదమతుమ్మెదలు, కచభారమై చారుకైరవస్ఫురణ
దరహాసమై తుంగతరసైకతంబు, భరితనితంబమై పరఁగు ఫేనంబు
వెలిపట్టుపుట్టమై వెరవార మెఱయఁ, గలహంసమాలిక కాంచియై పొలుచు
నధికారుణద్యుతి నమరు బంధూక, మధరమై సుడినాభియై తరంగములు
భ్రూలత లై లీలఁ బొలియు మీనంబు, లాలోలనయనంబులై తావు లెసఁగు
హల్లకంబులమీఁద నందంద తిరుగు, నొల్లనితనువాయు వూర్పులై కవియ
రోలంబములచే సరోరుహావళులు, రాలు పుప్పొడి యంగరాగమై మెఱయఁ
బైకొన్న కేసరపఙ్క్తులు తొడవు, లై కనుఁగొన నుత్తమాంగనభంగి
వివిధవిలాసముల్ వింతలై మెఱయు, నవపద్మగంధి నానర్మదఁ గనియెఁ
గని పుష్పకము డిగ్గి కదియ నేతెంచి, తనరారుముదమునఁ దత్తీరభూమి
జెన్నొంది బహుపుష్పసేవితం బగుచు, నున్న సైకతవేది నొప్పఁ గూర్చుండి
యతినిర్మలంబగు నంబుప్రవాహ, మతులపావనలీల నమరంగఁ జూచి
మంత్రులతోడను మన కిందు వలయు, మంత్రపూతములైన మహితకర్మములు
నచలైకనిష్ఠతో న౦గజారాతి, నిచట నారాధింప నేను గోరెదను
దనవేయురశ్ములఁ ధరణి పంపంగ, నినుఁడు నభోమధ్య మిదె చేరవచ్చెఁ
చెల్లంబుననుఁ జూచి తీవ్రత మాలి, చల్లనైయున్నాఁడు చంద్రుఁడుఁబోలె
దళమైనమకరందధారలఁ దోఁగి, పొలుపారఁ బవనుండు పొలయుచున్నాఁడు
ఆలోలగతివీచు లాడంబరంబుఁ, జాలకమానప్రచారంబు లేక
మది భీతిఁ బొందిన మగువచందమున, యిది చూడుకున్నది యిమ్మహాతటిని
బెక్కండ్రురిపులతోఁ బెక్కుకయ్యముల, నక్కజంబుగఁ బోరి యాతతక్షతులఁ
దొరఁగు పెన్నెత్తుట దోఁగి యుద్ధూత, ధరణిరజోలిప్తతను లైనమీరు
నీపుణ్యజలముల నెలమిఁ గ్రీడించి, వేపోయి కొనిరండు వివిధపుష్పములు
మనసున కింపుగా మహనీయలీలఁ, దనరారు నీసైకతంబుపై నమరఁ
జంద్రబింబమునకు సరివచ్చు నేఁడు, చంద్రశేఖరుఁడు ప్రసన్నుఁడై నన్నుఁ
గరుణించునని పఙ్క్తికంఠుండు పలుక, సొరిది మారీచుండు శుకుఁడు సారణుఁడు
ధూమ్రాక్షుఁడును ప్రహస్తుఁడు మహోదరుఁడు, తామ్రలోచనరుచుల్ దట్టమై నిగుడఁ
దివిరి మందాకిని దిక్కుంజరంబు, లవగాహ మొనరించు నట్టిచందమునఁ
బూతనిర్మలవారిపూరంబు నైన, యాతరంగిణిఁ జొచ్చి యనురాగ మెసఁగ
సరి జలక్రీడలఁ జల్పి నల్గడలఁ, బరికించి పరమేశ! భరితంబులైన
మవ్వంపుమధువులు మధుపము ల్గొనని, క్రొవ్విరుల్ గొనివచ్చి కొండగాఁ బోయ
నర్మదానదిఁ గృతస్నానుఁడై వెడలి, నిర్మలమతి రజనీచరాధిపుఁడు
సముచితంబగుచున్న సైకతంబునకు, నమర నేతెంచి రమ్యప్రదేశమునఁ
జెన్నైన బహురత్నచిత్రపీఠమునఁ, బన్నుగాఁ దాఁ గొల్చు పసిఁడిలింగంబు
నలువొంద నిడి గంధనవపుష్పదీప, విలసితధూపనైవేద్యాదివిధులఁ
బాటల నాటల బహువాద్యగతులఁ, బాటించి పౌర్వతీపతి భక్తితోడఁ
పూజింపఁదొణఁగెఁ దత్పూజాకలాప, మోజతోఁ బరిపూర్తి నొందించెనేని
యాజి సెవ్వనినైన నవలీల గెల్చుఁ, బూజకు విఘ్నంబు పుట్టిన నోడు
నతఁడు మదోన్మత్తుఁ డౌట నీతెఱఁగు, మతి విచారింపక మదనారిఁ గొలువ
నామహానదిలోన నట పశ్చిమమునఁ, గామినీజనులతోఁ గార్తవీర్యుండు
జలకేళి సలుపుచుఁ జటులదర్పమున, మెలసిన తనసత్త్వ మెఱుఁగఁగఁ దలఁచి
సేతువుచందమై చేతులు వేడ్క, నాతతంబుగ నీటి కడ్డము సాఁప
మడువుల గల గంధమకరనక్రాదు, లెడలు దప్పఁగఁ బూర మెదురు దొట్టుటయుఁ
బులినముల్ మునుఁగంగఁ బొరిఁబొరిఁ బక్షి, కులములు నెగయంగఁ గూలముల్ గూల
వానకాలమునాఁటి వడువునఁ బేర్చి, ఫేనమాలికలతోఁ బెనుప్రవాహంబు
పూజ దీరకమున్నె పుష్పగంధాది, పూజోపకరణముల్ పూజలతోడ
వడి నెత్తుకొనిపోవ వాసవారాతి, కడువిస్మయం బంది క్రమ్మఱ లేచి
పూజకు మునుకొని ఫుల్లప్రసూన, రాజిదక్షిణహస్తరాజి రాజిల్ల
వామహస్తంబున వడిఁ బట్టి విడచు, నామహావాహిని నలుకతోఁ జూచి
కరమొప్పఁ బశ్చిమగామిని యగుచుఁ, బరఁగ నన్నది తూర్పు వాఱంగఁదొణఁగె
నిది యేమి చిత్రమో యీతెఱం గెల్ల, విదితంబుగాఁ జూచి వేగరం డనుచు
శుకసారణులదిక్కు చూచి పంచుటయు, నకుటిలచిత్తులై యాసహోదరులు
వరుణదిగ్భాగంబు వదల కాకసము, నరయోజనం బేగి యనతిదూరమున
వాహినివేగంబు వారించుచున్న, బాహాసహస్రంబు భయదమై మెఱయ
లో నేచుమదమున లోచనాంతంబు, లీనినకెంజాయ లొగి పెల్లు నిగుడ
రామాకుచాఘాతరంగతరంగ, కోమలక్రీడల క్రొమ్ముడి వీడఁ
దామసగుణ మేచి తమకంబుతోడఁ, గామాతురుండు నై కాంతలనడుమ
కరిణీగణాన్వితగజరాజలీల, సరి జలక్రీడలు సలుపుచునున్న
యానరేంద్రుని జూచి యచ్చెరువారు, మానసంబులతోడ మరలి యేతెంచి
రావణుఁబొడఁ గని రజనీచరేంద్ర, యీవిధంబంతయు నెఱిఁగి వచ్చితిమి
అతివలతో నొక్కఁ డనురాగలీలఁ, జతురుఁడై జలకేలి చలిపెడుకొఱకు
భీకరంబగుచున్న పృథుబాహుసంఘ, మాకులంబుగ నేటి కడ్డంబు సాఁప
వొదిఁగి పోఁజాలక నుదకప్రవాహ, మెదురు గ్రమ్మినచంద మీచంద మనిన
నాతఁడు కార్తవీర్యార్జునుం డగుట, భాతిగా నెఱిఁగి యాపఙ్క్తికంధరుఁడు
కలహంబునకుఁ బన్ని కడకతో నడువఁ, బ్రళయమేఘధ్వనిభంగి మి న్నద్రువఁ
బరిగొని భూరేణుపటలంబు లెగయ, విరిగాలి యెదురుగా వీవంగఁదొణఁగె
నంత నాదశకంఠుఁ డతఁడున్నయెడకు, నెంతయు బలగర్వ మెసఁగంగ నేగి
వనితలతో గీతవాద్యనృత్యంబు, లనుభవించుచు నధికానురాగంబు
నరోక్తు లెసఁగ నానర్మదలోనఁ, బేర్మిమై జలకేళిఁ బెంపొందుచున్న
నక్షీణతేజు నయ్యర్జునుఁ గాంచి, రాక్షసేంద్రుడు క్రోధరక్తాక్షుఁ డగుచు
మది నేచి యారాజుమంత్రులతోడ, నొదవంగ నోరెత్తి యోమంత్రులార
యిదె వచ్చినాఁడఁ ద న్నెదిరింప నేఁడు, కదనంబునకుఁ బఙ్క్తికంఠుండ నేను
మీ రెఱిగింపుడు మీరాజుతోడఁ, బోరాదు నాతోడఁ బోరక తనకు
ననిన నాయుధపాణు లగుచు వా రనిరి, వినిపింప నిప్పుడు వేళ గా దతఁడు
జలకేళి నున్నాఁడు సతులతో గూడి, యలరి యిప్పుడు గయ్య మడఁగ నీ కగునె
నేఁ డింత సైరించి నిలుతుగా కెల్లి, వేఁడిమి యార్చిన వేడ్క సల్పెడిని
అది గాక నేఁడు నీ కాహవక్రీడ, మదిఁ బ్రియంబగు నేని మాతోడఁ బోరు
మము గెల్చి మఱికదా మారాజుతోడ, సమరంబు నీ కన్న సైరింప కడరి
యారాజుమంత్రుల నమరారిమంత్రు, లారంగఁ దొడఁగి శస్త్రాస్త్రఘాతములఁ
బరువడిఁ గెడపి తత్పలలరక్తములఁ, బరితుష్టిఁ బొంది రాబలిమిఁ గన్గొనుచు
నసమానగతి నాదశాస్యుండు సేచి, ముసలగదాశూలముద్గరంబులను
బలువిడి నొప్పించి బహుళ మైకదిసి, హలహలశబ్దంబు లందంద మెఱయ
సర్వసేనల నోలి సమయింప నతని, దుర్వారవేగంబు దూరస్థు లెఱిఁగి
వెసఁబోయి యాకార్తవీర్యునితోడ, వసుధేశ సేనతో వచ్చి రావణుఁడు
మడియించుచున్నాఁడు మనసేన నెల్లఁ, గడక నాలింపుమా కలకలం బనినఁ
కెలఁకులఁ బరికించి కేళి చాలించి, మెలఁతల వెఱవక మీ రుండుఁ డనుచు
నతులమదాటోప మడరంగ నుగ్ర, గతి వియద్గంగావగాహంబుఁ జేసి
వెడలు నైరావతద్విరదోత్తమంబు, వడువున నమ్మహావాహిని వెడలి
వెడఁదకన్నుల రోషవిస్ఫులింగములు, వెడలంగఁ గాలాగ్నివిధమున మండి
కనకవేష్టితమైన ఘనగదాదండ, మనువారఁగా గేల నమరించి మించి
యోలిఁ జేతుల నెల్ల నుజ్జ్వలాభరణ, జాలాంశు లడరంగఁ జండాంశుఁ బోలి
పటువీరరాక్షసబలమహాతిమిర, పటలంబుఁ దోలుచుఁ బౌలస్త్యుఁ జూచి
గద కేలఁ ద్రిప్పుదు గరుడవేగమునఁ, గదియంగ నేతేరఁ గని ప్రహస్తుండు
రయమార వింధ్యంబు రవి కడ్డుపడిన, క్రియ దోఁప నెడసొచ్చి కిన్కతో నిల్చి
పూనిక ముసలంబుఁ బూన్చి వైచుటయు, దానిగదాహతిఁ దప్పంగ జడిసి
కడువడిఁ బఱతెంచి గద మీఁది కెత్తి, బేడిదంపులావున బిట్టు వేయుటయుఁ
గులిశభగ్నాచలకూటంబువోలె, నలమిన మూర్ఛతో నతఁ డుర్విఁ బడియె
నంత మారీచాదు లప్పాటుఁ జూచి, గంతులై రణభూమిఁ గడచి పాఱుటయు
నాహవక్రీడకు నడరి సహస్ర, బాహుఁడు వింశతిబాహునిఁ గదిసె
నుప్పొంగి లయవేళ నుజ్జ్వల మగుచు, నొప్పారు సాగరయుగళంబు భంగి
నడగొండలో యన నలిమదావేశ, ముడుగని దిగ్దంతియుగముచందమునఁ
దగ వెల్గు దినకరద్వంద్వంబు నోజ, నొగి మండు దావాగ్నియుగ్మంబుభంగిఁ
గనియు దర్పంబునఁ గడు నేచి జెనయఁ, దివురు కంఠీరవద్వితీయంబు కరణి
నిరువురు దమలోన నేపు దీపింప, నురుబలాటోపంబు లొండొంటిఁ దొరయ
నుద్దండభుజబలు లురుగదాపాణు, లుద్దామగతు లొప్ప నొండొరుల్ దాఁకి
మండలీకృతగతుల్ మలఁగిపోవుటలు, మండిపట్టుట లొడ్డి మాఱువ్రేయుటలు
తప్పించుకొనుటలు దాఁటి పైఁబడుట, లుప్పరం బెగయుట లుత్తరించుటలు
పాయుటల్ డాయుటల్ ప్రతిహతుల్ చెలఁగ, వేయుటల్ జడియుటల్ వ్రేటు లిచ్చుటయు
వారక చెల్లంగ వడిఁ బోరి రిట్లు, దారుణగతి సమద్వంద్వయుద్ధంబు
వర్తించునప్పుడు వాసవారాతిఁ, గార్తవీర్యుఁడు గదఁ గట్టల్క వ్రేయ
మేఘంబుపై నొప్పు మెఱుఁగుచందమున, నాఘోరగద యొప్పె నతనివక్షమున
వెస దశగ్రీవుండు వేయ నగ్గదయు, వసుమతీనాయకు వక్షంబునందుఁ
బరపైన కొండపైఁ బడిన మహోల్క, వరుసను దీపించెఁ బరువడి మఱియు
మేదిని చలియింప మెట్టిన ధూళి, మేదురగతి నెక్కి మిన్నందుకొనఁగ
లాఘవ మెసగంగ లాగించుగతుల, మేఘముల్ చెదరంగ మేటియగ్గలిక
దిగ్గజంబులు మ్రొగ్గఁ దివిరి భూతంబు, లగ్గలమగుభీతి నందంద పఱవ
దృగ్గోళకంబులఁ దివురు కోపమున, నగ్గులు వెడలంగ నట్టహాసములు
భగ్గంచు వెలుఁగులు భయదహుంకృతులు, నగ్గించు పలుకులు నార్పులుఁ బెరయ
బలుఁడు నింద్రుఁడు బోరుభంగి నిబ్భంగి, నలయక పోరుచో నయ్యర్జునుండు
భీకరగతిబోని పృథుగదాదండ, మాకసంబున మంట లంట నంకించి
యానిశాచరు వైవ నతనిపేరురము, తో నది దాఁకి తుత్తునియలై పడఁగ
నుఱక యాపాటున కుల్లంబుఁ గలిగి, పిఱిదికి నొకవింటిపె ట్టోసరించి
పొదివిన మూర్ఛతోఁ బుడమిపై నతఁడు, చదికిలఁబడుచోట సయ్యనఁ గదిసి
పక్షీంద్రు డురగముఁ బట్టినకరణి, నక్షీణబలమున నమరారిఁ బట్టి
బలి నేచి విష్ణుండు బంధించునట్లు, బలిమి బంధింప నాపటుశౌర్యమునకు
మోదించి సురసంఘములు పుష్పవృష్టి, మేదినిఁ గురియుచు మేలుమే లనఁగఁ
కార్తవీర్యుఁడు రావణుని బంధించుట
దనపురంబునకు నాదశకంఠుఁ బట్టి, కొనిపోవ తెలివిఁ గైకొని ప్రహస్తుండు
పరిపంథిచేఁ బట్టువడి కట్టుఁబడిన, సురవైరిదైన్యంబుఁ జూచి కోపించి
వెస సేనతోఁ గార్తవీర్యునిఁ దాఁకి, వసుధేశ నిలునిలు వలను గా దింక
విడువిడు దశకంఠు విపులదర్పమున, విడువక పోరాదు వినుము నాయెదుర
నని పల్క రాక్షసులందఱుఁ గడఁగి, మునుకొని ఘనశూలముసలాయుధముల
గనుకని వైవ నాకైదువ లొడిసి, తనవేయుచేతులఁ దగులంగఁ బట్టి
వానిన గైకొని వడి వారిఁ దోలి, యానరేంద్రుడు వోయె నట పురంబునకు
నింతయు సుతునిచే నెఱిఁగి పౌలస్త్యుఁ, డెంతయుఁ జింతించి హృదయంబులోన
బరికించి మనుమునిపైఁ గూర్మికలిమి, తిరముగా మాహిష్మతీపురంబునకు
నలువార నేతెంచి నగరివాఁకిటను, వెలుఁగు భానుఁడువోలె విలసిల్లుచుండ
పులస్త్యుఁడు మాహిష్మతీపురికి వచ్చి రావణుని విడిపించుట
దౌవారికుఁడు డాసి ధరణీశుతోడ, దేవ పులస్త్యుఁ డేతెంచినాఁ డనిన
నాతతభక్తితో నయ్యర్జునుండు, చేతులు శిరముపైఁ జేర్చి మ్రొక్కుచును
అమరఁగ ముందట నర్ఘ్యపాద్యములుఁ, గొమరార ధేనువుఁ గొని పురోహితుఁడు
తనతోడ రాఁ బులస్త్యబ్రహ్మ కెదురు, సనుదెంచి చరణాంబుజంబుల కెరఁగి
యనుపమనిష్ఠతో నర్ఘ్యపాద్యములు, ననఘుఁడై యొనరించి యాగోవు నిచ్చి
యతులతేజోమూర్తి నాబ్రహ్మఁ జూచి, మతిలోన సంతోషమగ్నుఁడై పలికె
నెలకొన్న పెంపుతో నేఁడు నాపురము, పొలుపారె నమరేంద్రుపురముచందమున
నే నింద్రుఁ బోలితి నెల్లందు నాకు, మానుగాఁ గుశలంబు మది విచారింప
నేఁడు నాకుల మొప్పె నిఖలదేవతలు, పోడిగాఁ గొల్చు ని న్బూజింపఁగంటి
నేను ధన్యుఁడ నైతి నిదె రాజ్యలక్ష్మి, నానందనుల్ వీరె నాసతు ల్వీరు
యేనిదె మీకార్య మేమైనఁగాని, యానతి యిమ్మన నాపులస్త్యుండు
ధరణీశ కుశలమె ధర్మంబులందుఁ, బరికింపంగా నన్నిపరిచర్యలయఁ
బలములందును నీకుఁ బన్ను గా ననుచు, నెలమితో సంతోష మేర్పడ నడిగి
నిరుపమంబగుచున్న నీవిక్రమంబు, నురుబాహుబలమును నొప్పుఁ బేర్కొనఁగ
వ్రాలినకడిమి నెవ్వానిఁ బేర్కొన్న, గాలియు జలధులుఁ గదలంగ వెఱచు
నట్టి నామనుమని నాదశగ్రీవు, పట్టికట్టితి వీవు బవరంబులోన
మూఁడులోకంబుల మొగిఁ గీర్తి గంటి, పోడిమి నను నీదుబుద్ధి మన్నించి
రావణు విడువుము రాజేంద్ర నీవు, గావించుపూజలు గైకొందు ననిన
నగుఁ గాక నాకు నీయానతికంటె, తగ నొందుకార్యంబు దలపోయఁ గలదె
యనుచును బౌలస్త్యు నప్పుడు విడిచి, తనగౌరవం బొప్పఁ తగఁ గట్ట నిచ్చి
యురుమదోద్ధతుల నొండొరుఁ జంపకుండ, సరి నగ్నిసన్నిధి శపథముల్ సేసి
వినయంబుతో బ్రహ్మ వీడ్కొని యెలమిఁ, దనగృహంబునకు నాధరణీశుఁ డరిగెఁ
దనలోని సిగ్గునఁ దల లోలి వాంచి, తనవెన్క వచ్చు నాదశకంఠుఁ జూచి
చనుమని యాబ్రహ్మ సంతోష మొప్పఁ, దనలోకమున కేగెఁ దదనంతరంబ
మనమున నిట్లౌట మఱచి యంతయునుఁ, దనసేనఁ గూడుక తగ దశాననుఁడు
నట పుష్పకారూఢుఁడై విజృభించి, యిటునిటగా భూమియెల్లఁ గ్రుమ్మరుచు
రా జిత డీతఁడు రాక్షసుం డనక, నాజికి నతిబలు లగువారి నెల్ల
రావణుఁడు వాలిపై దాడి వెడలుట
నలుకతో గెలుచుచు నధికదర్పమున, గెలుపుఁ గైకొంచుఁ గిష్కంధకు నరిగి
వ్రాలిన కడిమిమై వచ్చినవాఁడఁ, వాలితోఁ గయ్యంబు వలయు నా కనిన
దరుచరేంద్రునిమంత్రి తారుఁ డన్వాడు, సురవైరిఁ జూచి యాశూరపుంగవుడు
వా లిక్కడ లేఁడు వ్రాలి దర్పించి, యాలంబునకుఁ జాల రన్యు లెవ్వరును
నాలుగంబుధుల నానగచరాధీశుఁ, డోలి సంధ్యావిధు లొనరించి వచ్చు
నొక్కింత నిలువు నీయుద్ధతులెల్ల, చక్కనయ్యెడుఁగాక సంభ్రమం బేల
సమరోర్వి నతనితోఁ జచ్చినవారి, యెముకలపెనుప్రోవు లివియె కన్గొనుము
దశకంఠ యమృతంబు ద్రావిన నైన, వశమె చావకయుండ వాలితోఁ దొడరి
మరణంబు వేగంబు మదిఁ గోరితేని, యరుగు మిప్పుడు దక్షణాంబుధికడకు
నుగ్రతేజముతోడ నుర్వికి డిగిన, యుగ్రాంశువిధమున నొప్పారువాని
నక్కడఁ గనియెద వవ్వాలి ననిన, ధిక్కరించుచు నేగి దేవకంటకుఁడు
కనకాద్రినిభమైన గాత్రంబు తరుణ, దినకరబింబంబుతెఱఁగు నాననముఁ
గలిగి సంధ్యావిధుల్ గడునిష్ఠతోడఁ, జలిపెడి నయ్యద్రిచరవీరుఁ గాంచి
కడుతెంపుతోఁ బుష్పకము డిగ్గి యతని, నడఁగఁ బట్టెదనంచు నల్లనఁ గదియఁ
గాలిచప్పుడు విని కనువిచ్చి చూచి, వాలియు నాదశవదను తెంపెఱిఁగి
కేసరి కరిఁ బట్టుక్రియ మహోరగము, గాసిల్ల గరుడుండు కబళించుకరణి
నీతని నలిఁ బట్టి యెమ్ములు నలియ, నాతతగతి జంక నంటంగ నిఱికి
శిథిలంబులై కాళ్లుచేతులు వ్రేలఁ, బృథివిపై జనులెల్లఁ బ్రియ మంది చూడ
నామూఁడుజలధుల నానిశాచరుని, దీమసం బడరంగఁ ద్రిప్పుదు ననుచు
నూహించి జపనిష్ఠనుండి యాలోన, సాహసంబున నానిశాచరేశ్వరుని
నవలీలఁ బట్టి కక్షాంతరాళమున, నవయవంబులసందు లందంద నులియ
నిఱికి యాకసమున కెగయంగఁ జూచి, వెఱగంది పోనీక విడిపింతమనుచు
దశకంఠుమంత్రులు దారుణగతుల, దిశల నార్పులు నిండఁ దెగువతో నరిగి
యనిలవేగంబున నరుగునవ్వాలి, ఘనవాలవాతూలగతి సైఁపలేక
తూలికాలఘులీలఁ దూలి వేసారి, రాలంబునకుఁ బోవ నలవిగా కునికిఁ
దల లూఁచి పొగడుచుఁ దరుచరేశ్వరుని, దలపడ మన మెంత దశకంఠులావు
సమసియుండఁగ మనసాహసంబులును, గ్రమమున నేరవు గతి దప్పె ననుడు
నంత నాకపివీరుఁ డమరసంఘములు, సంతోషమునఁ దన్ను సంస్తుతుల్ సేయఁ
బశ్చిమాంబుధికి నప్పౌలస్త్యుఁ గొనుచు, నిశ్చలగతి నేగి నేమంబుఁ దీర్చి
వరుస నుత్తరపూర్వవార్ధులయందు, వెరవొప్ప సాయాహ్నవిధు లనుష్ఠించి
మరలి కిష్కింధకు మహిమతో వచ్చి, పురసమీపంబునఁ బుడమిపై వైచి
నవ్వుచు నాదశాననుఁ జూచి పలికె, నెవ్వఁడ విటకు నీ వేతెంచు టేమి
నావుడు నమరేంద్రనందన యేను, రావణుఁ డనువాఁడ రాక్షసేశ్వరుఁడ
మలసి యాజికి వచ్చి మశకంబుభంగి, బలమువమ్ముగఁ బట్టువడితి నీచేత
నాలుగుజలధుల నన్ను నిబ్భంగి, నోలిఁద్రిప్పితి నీబలోద్ధతి మెఱయ
నీలావు కడునొప్పు నీధైర్య మొప్పు, వాలినగంభీరవర్తనం బొప్పు
ననవుడుఁ గోపించి యావాలి కినిసి, యని సేయనని వచ్చి యకట నీ వింకఁ
బురమున కీమొగంబులతోడ మరలి, యరుగుట యుచితమె యది యాల ముడిగి
పరఁగ నీయాననపంకజంబులకుఁ దరమిడి యస్త్రక్షతంబులు వలయు
నని పేర్చి నగరికి నద్దశాననుని, గొనిపోయి కందుకాంకునిగా నొనర్చి
వాలి రావణుని నంగదునితొట్టెకుఁ గట్టుట
యఁగదుతొట్లకు నటమీఁద వ్రేల, నంగక మగుదశాననకందుకంబు
నిరవందఁ గట్టిన నింద్రుమన్మఁడును, నురునఖాస్త్రంబుల నురుశోణితంబు
దొరఁగంగ దనుజునాథునిమోములందుఁ, బరువడి నిడి యాలపఙ్క్తులు గాఁగఁ
గడునుగ్రముగఁ జేయఁ గఱకురాక్షసుఁడు, మిడుకుచు వాపోవ మిన్నెల్ల నద్రువఁ
గరుణించి యాపఙ్క్తికంఠుని జూచి, యిరవంద నీకోర్కు లీడేఱె ననిన
విని సిగ్గుపెంపున వెలవెలఁ బాఱి, గొనుకొన్నభీతితోఁ గూఱి యి ట్లనియె
నమరులకంటె నీ వసురులకంటె, నమితవిక్రమలీల నధికుండ వగుదు
భూరివేగముఁ జూడ భుజగారి కొండె, మారుతమున కొండె మనసున కొండె
నీ కొండెఁ గల దేను నెరయఁ గయ్యముల, భీకరభుజశక్తిఁ బెంపొందినాఁడ
నీవును నేనును నిక్కంబు చెలిమి, గావింపఁదగుదుము కలసియుండుదము
నాసొమ్ములను నీవు నగచరాధీశ, నీసొమ్ములని చూడు నీదుచిత్తమున
మన మగ్నిసాక్షిగా మైత్రిఁ గైకొంద, మనవుడు విని వాలి యగుఁగాక యనుదు
నానిశాచరవీరుఁ డగుదశాననుఁడుఁ, దానును మన మన్నదమ్ముల మనుచుఁ
బావకు సన్నిధిఁ బరిరంభణములు, గావించి కీలితకరపద్ము లగుచు
నొప్పారుమృగరాజయుగళంబుభంగిఁ, జొప్పడఁ గిష్కింధ సొచ్చి రిర్వురును
నచటఁ గిష్కింధలో నద్దశగ్రీవుఁ, డుచితవర్తనమున నొకమాస ముండి
వాలితోఁ దొడరంగ వచ్చి రావణుఁడు, చాలక యిబ్భంగి సత్యంబుఁ జేసి
యలరుచుఁ బుష్పక మర్థితో నెక్కి, నలువార నాదశాననుమంత్రు లతని
గనుఁగొని మనమునఁగల కందువాప, నొనర నిశాచరుం డుల్లంబుఁ బెంచి
యెలమి మంత్రులు గొల్వ నెల్లలోకముల, గెలుచు దర్పముల నాకిష్కింధ వెడలి
వసుధేశు లులుకంగ వసుధఁ గ్రుమ్మరుచు, వశుధేశ యొకపుణ్యవనభూమిలోన
రావణుఁడు నారదుం జూచుట
ననిమిషమునిముఖ్యుఁడైన నారదుని, గని మ్రొక్కి కుశలంబు కరమర్థి నడిగి
యీవనంబునకు మీ రేతెంచు టేమి, నావుడు నతనితో నారదుం డనియె
నీవు పుష్పక మాఁపి నెమ్మి నాపలుకు, రావణ విను నీపరాక్రమంబునకు
నసమానబలమున నమరయూధముల, వెస విక్రమించిన విహగేంద్రుకరణి
మహనీయభుజశక్తి మా ఱెందు లేక, బహుసంగరప్రౌఢిఁ బరఁగు నీవలన
మనమున సంతోషమగ్నుండ నైతి, వినఁదగు నీ వొక్కవిధము లంకేంద్ర
వాసవాదులకు నవధ్యుండ వగుచు, వాసికెక్కిన వీరవరుఁడవు నీవు
నిన్ను దవ్వుఁల గని నిశ్చేష్టు లగుచు, నున్నమర్త్యులతోడి యుద్ధంబు లేల
జమునిలోకమునకు జవమున నేగి, జము గెల్వు నీబాహుసంరంభ మెసఁగ
నలఘువిక్రమశాలి యైన యాజముని, గెలుచుట సకలంబు గెలుచుట యనిన
నారద విను మేను నాకలోకంబు, వారినందఱి నాహవంబున గెలిచి
బలువార నమృతంబునకు సముద్రంబు, బలువిడి దెచ్చినభంగి నే నడరి
యనిమిషలోకంబు లన్నియు గెలిచి, మునినాథ యమునిపైఁ బోయెద ననుడు
సమవర్తిలోకంబు సమయించి కాని, యమరలోకముమీఁద నరుగంగవలదు
కీనాశుపై దశగ్రీవ నీ వరుగు, సేనతో ననవుడు చిఱునవ్వు నవ్వి
తలపోయ నరులపై దయ నిట్లు నీవు, పలికెద వనఘ నీపలుకుఁ గావింతు
బలిమి నందఱి లోకపాలుర గెలుతుఁ, బలికిన తొల్లింటిప్రతిన చెల్లింతుఁ
బ్రజల నందఱిఁ బట్టి బాధింతు జముని, భుజగర్వమంతయుఁ బుత్తు నీక్షణమె
యని మ్రొక్కి పుష్పకం బతఁడు దక్షణము, చననిచ్చె నంత నాసంయమీశ్వరుఁడు
తగుబలాబలములు తలపోసి చూచి, జగము లెవ్వనిచేతఁ జాలభీతిల్లుఁ
రావణుఁడు యమునిపై దండెత్తుట
బొరిపొరి నెవ్వఁడు పుణ్యపాపంబు, లరసి యేర్పఱచు దా నఖిలజీవులకు
నట్టికాలుని గెల్తు నని పల్కె నీతఁ, డెట్టుండునో కయ్య మేఁ జూతు ననుచు
యమునొద్ద కతివేగ మరిగె నారదుఁడు, ప్రమదంబుతో నర్ఘ్యపాద్యంబు లిచ్చి
అప్పు డాసమవర్తి యముఁడు ముందఱను, నొప్పార నెదురేగి యుచితోక్తు లమర
మునినాథకుశలమె ముద మొంద ధర్మ, మనిశంబుఁ జెల్లునె యనుచు ము న్నడిగి
యేమి కారణము మీ రిట రాక యనిన, నామునిప్రవరుఁ డాయమునితో ననియె
నాహవక్రీడకు నవిజేయుఁడైన, బాహుబలంబొప్పు పఙ్క్తికంధరుఁడు
పుడమిరాజుల నెల్ల భూరిదర్పమున, వడి గెల్చి నిను గెల్వ వచ్చుచున్నాఁడు
తెఱఁగొప్ప నీకు నిత్తెఱఁగు ము న్గలుగ, నెఱిగింపవచ్చితి నిందు నే ననఘ
యని చెప్పె నాముని యంతటిలోన, ఘనదీప్తు లడరంగ గగనమార్గమున
నడరుతేజముతోడ నర్కుండు వొడుచు, వడవునఁ గానఁగ వచ్చెఁ బుష్పకము
దారుణాకృతి నంత దశకంధరుండు, చేరి పన్నినజముసేవఁ గన్గొనుచుఁ
బన్నుగాఁ దమపుణ్యపాపముల్ గుడుచు, చున్నవారలఁ గాంచె నొక్కొక్కయెడను
యమపురవర్ణనము
గింకతో జమునుగ్రకింకరుల్ దిగిచి, కొంకక చేసిన ఘోరపాపములు
ముదలించి బాధింప మొగిఁ బొరల్వారు, .... .... .... ..... ...... ....... ......
పరుల మర్మము లాడు పరుషంపునోరుఁ, బురుషార్థ మెడలంగ బొంకెడునోరు
క్రొవ్వి పల్కెడునోరుఁ గొండెంపునోరుఁ, బ్రువ్వులు దొలఁగంగఁ బొరలెడువారు
విస్రంభములు వెంచి వీచులు సొరవ, నస్రప్రవాహిని యైనవైతరిణిఁ
గడచుమంటలుఁ జాలఁ గాలినయిసుము, నొడలఁ జల్లఁగఁబడి వడి వేఁగువారు
నసిపత్రవనములో నంగముల్ దునిసి, వసము గాకుండఁగ వడిఁ ద్రెళ్ళువారు
క్షురధార నసిధారఁ గూలెడువారుఁ, గరము రౌరవమునఁ గ్రందుకొన్వారు
క్షారకల్లోలినీకర్కశగ్రావ, ఘోరస్థలంబులఁ గ్రుమ్మరువారుఁ
బానతోయంబులు పలుమాఱు వేఁడి, కానక నో రెండఁగా నేడ్చువారు
నెన్నఁడు నోటికి నేకూడు లేక, యన్నంబు వెట్టరే యని వేఁడువారు
దారుణగతిఁ బట్టి తప్తలోహములు, వారకపోయంగ వడిఁ గ్రోలువారు
మంటలుగల లోహమయకంభములను, నంటఁగట్టిన నేచి యటు వేగువారు
నిప్పులయేటిలో నెరిఁగాళ్ళు వట్టి, యప్పళింపఁగ మండి యట మగ్గువారు
భీతినాలుకలచేఁ బెదవులు దడవి, యాతతదురవస్థలం చెడువారుఁ
జెన్నంటిమడుగుల చీఁకట్లు గవియు, చున్న కూపంబుల నొగినుండువారు
వెలవెల్ల నై తలల్ విడుచున్నవారు, మలపంకలిప్తులై మాసినవారు
నెంతయుబడుగులై యిమ్ములు దక్క, నంతకంతకు దీనులై యున్నవారుఁ
గనలఁ గాఁగిన పట్టుకాఱుల బట్టిఁ, తనువులు గదియంగఁ దపియించువారు
నాయసతుండంబు లగువాయసములు, పాయక నొప్పింప భయమందువారు
ఘనదండనిహతులఁ గడుఁ గూలువారు, మునుకొని పెనుగాలముల వ్రేలువారుఁ
గరకసంబులఁ ద్రెంచి కత్తులఁ గోసి, గొఱపంబులను డుస్సి కొఱవుల జూఁడిఁ
వదరుచుఁ బెనములపైఁ ద్రోచి వైచి, వదలక బాధింప వాపోవువారు
నవయంబులక౦డ లవిగోసినోరి, కవిగొ మ్మనుచు నీయ నంటనివారుఁ
దలలు క్రిందుగ శూలతతులు గీల్కొలుప, మెలఁగలే కాసన్న మృతిఁ బొందువారు
నిలువందగాదులు నిండింప మేను, లులుకంగ నోర్వలే కొరలెడువారు
నవరంధ్రములఁ గాఁగినట్టి నారసము, లవమాన్యత నొనర్ప నడలెడువారు
వ్రచ్చి వడియలచేఁ బటురౌద్ర మెసఁగ, నచ్చలంబున మోఁద నటు వేగువారు
తెరలేడునూనిలోఁ దెచ్చి వైచినను, నొరలుచు నిర్జీవమొందెడువారుఁ
జండకరోదగ్రశస్త్రసంఘములఁ, జెండి వైవఁగ భీతిచేఁ గ్రాఁగువారు
నీతులన్నియుఁ దప్పి నెరి నొచ్చి మిగుల, నాతతదురవస్థలం చెడువారు
నివి గాక మఱియును నెడపక చేయు, వివిధబాధల కోడి విలపించువారు
వరుస నానాగీతవాద్యనృత్యాది, వరసుఖక్రీడల వర్తించువారుఁ
దలకొని ము న్నన్నదానముల్ సేసి, పొలుచు దివ్యాన్నముల్ భుజియించువారు
గృహదానములు చేసి కీర్తింపఁదగిన, గృహరాజముల లీలఁ గ్రీడించువారుఁ
దవిలి కాంచనరత్నదానముల్ జేసి, వివిధభూషణముల విలసిల్లువారు
ననిశంబు ధర్మంబు లర్థితోఁ జేసి, వినుతతేజంబుల వెలుఁగొందువారు
నెక్కడఁ జూచిన నెడలేక చూడ్కి, కక్కజమై తోప నందంద గాంచి
కడలేని బాధలఁ గడుఁదూలువారుఁ, గడిమి మై విడిపించు కాలకింకరులుఁ
గడకతో నాపఙ్క్తికంఠున కెదుర, నడతెంచి హలహలనాదముల్ చెలఁగ
నుద్గతద్యుతులతో నోలిశూలములు, ముద్గరంబులు పటుముసలఖడ్గములు
పరిఘలు శక్తులు పటుగద లడరి, వరుసఁ బుష్పకముపై వెచిరి మఱియు
వడి గొని జముసేనవా రెల్లవారు, విడువక తరుశిలావిశిఖముల్ వఱసి
దిక్కులు వెలుఁగ నేతెంచుపుష్పకము, నొక్కింత దడవాఁగ నుడువీథి నదియు
ఘనమేఖలంబైన కనకాద్రిశిఖర, మనఁ దోఁచె యమకింకరావృతం బగుచు
బహుశిలాదులను బుష్పక మొంపఁబడియుఁ, బ్రహతంబు గాకుండె బ్రహ్మతేజమున
నంత రావణమంత్రు లలుకతోఁ గణఁగి, యంతకుమంత్రుల నతిఘోరలీల
దాఁకి మేనులు రక్తధారలు దొరఁగ, వీఁక దాఁకుచు వారి వివిధాయుధములఁ
దెరలించి మరలించి దివిజారిమీఁదఁ, గురిసిరి నెత్తురుల్ గూలశూలములఁ
బుష్పితాశోకంబుఁ బోలి రావణుఁడు, పుష్పకంబున నొప్పి బొమలు గీలించి
సొరిది కుంతంబులు శూలముల్ గదలు, .............................................
నంతకుసేనపై నందంద గురియ, నంత నాసైనికు లందంద గడఁగి
తొరఁగుకుంతాదులు తునియలై చెదర, శరజాల మడరించి సరిఁజుట్టుఁ దిరిగి
బిట్టుశూలంబుల భిండివాలములఁ, గట్టల్క నొప్పించి కడిమి నార్చుటయుఁ
గనుఁగొని తనదొడ్డకవచంబుఁ బూని, ఘనరోషమునఁ బుష్పకము డిగ్గనుఱికి
పురము లేఁచిననాఁటి భూతేశులీలఁ, బరఁగ విల్ గొని పాశుపతము సంధించి
ని౦డారఁ దెగఁగొని నిలు నిలుఁ డనుచు, మండి యాజముసేన మడియంగఁజేసి
వసుమతి కంపింప వడి సింహనాద, మెసగింప మంత్రులు నేచి తో నార్వ
నానాద మప్పు డాయంతకుఁ డెఱిగి, మానైన తనసేన మడియించె ననుచు
భూరిలోచనములఁ బొరినిప్పు లురల, దేరు సారథిచేతఁ దెప్పించి యెక్కి
యముఁడు రావణుతోఁ బోరుట
పవి ఘోరముద్గరప్రాసముల్ బూని, తివిరిముందట మృత్యుదేవత నడువఁ
గాలదండము భయంకరలీల మెఱయఁ, గాలపాశము నగ్నికల్పంబు నగుచు
నిరుగెలంకుల నొప్ప హేమముద్గరము, కర మొప్పి యుపరిభాగంబున వెలుఁగ
జగములు కంపింప సకలరాక్షసులు, తగిలిన పెనుభీతిఁ దను జూచి పాఱఁ
జనుదెంచి మదిలోనఁ జలియింపకున్న, ఘనబాహుదశకంఠుఁ గట్టల్కఁ దాఁకి
యలవున మర్మంబు లంట నందంద, బలువిడి నొప్పించె బలగర్వ మడర
దానికిఁ గడునల్గి దశకంధరుండు, కీనాశుపై నగ్నికీలలు నిగుడ
శరములు పరఁగించె జముఁడు నాశరము, లురుసాయకంబుల నొగి ద్రుంచివైచి
వివిధాయుధంబుల వివశుఁ గావించె, దివిజారియును దోన తెలిసి మార్కొనియె
నంతకుం డటు నవ్వి యకట నీపలుకు, పంతంబు లెటవోయెఁ బఙ్క్తికంధరుఁడ
పరుషవిక్రముఁడవు బవరంబులందు, నురక మూర్ఛలఁ బొందు టుచితమే నీకు
భూతలంబున రాజపుత్రుల గెలిచి, నాతోడి యుద్ధంబునకు వచ్చి తిట్లు
వారల గెలిచిన వడువున నన్ను, నేరీతి గెల్చెద వీలావు నమ్మి
యేచిన మదమున నె౦దైన జనక, కాచినమృత్యువుకడకు రాఁదగునె
వరగర్వమునఁ జేసి వచ్చితి వీవు, మరలి లంకకుఁ బోయి మనుట లే దింక
నీకు వరం బిచ్చి నిను బెద్ద చేసి, నాకంజభవుఁడు దా నడ్డమై నిలిచి .
కావు మీతని నన్నఁ గాఁతు లేకున్న, దేవారి యగునిన్నుఁ దెగటార్చివైతు
కోరి యేతెంచి కైకొన్నయీయాజిఁ, బారక నిలువుము బంట వైతేనిఁ
బ్రళయకాలమునాఁటి పావకుశక్తి, గలిగి వెల్గొందు నాకాలదండంబు,
ఇది సమంత్రకముగా నే ప్రయోగింపఁ, దుదిముట్టఁజేయు నిన్ దురములోపలను
ననుడు రావణుఁడు మహారోషవహ్ని, పెనఁగొన్న నందంద పేర్చి యి ట్లనియె
నోరి కాలుఁడ నిన్ను నుగ్రకృత్యమున, గారవంబునఁ గర్తగా మును బ్రహ్మ
చేసిన న న్నాడి చెనక నీవశమె, భాసురగతిఁ దపఃప్రౌఢి నే మున్ను
పాశుపతాస్త్రంబు పటునిష్ఠతోడ, నీశుచేఁ బడసితి నిది నిన్నుఁ గిట్టి
నీరు సేయకపోదు నే డాజిలోన, ధీరత వాటించి తిరుగకు మింక
యమదండ మది యెంత యముఁడన నెంత, యమునికి యముఁడనై యరుదెంచినాఁడ
నిజపరాక్రమ మొప్ప నీతోఁడఁ బోరి, విజయంబుఁ గైకొందు వేయును నేల
ననుదశాననుఁడును నాయంతకుండు, మనమువ రోషసమగ్రు లై కడఁగి
వివిధోరుశక్తులు వెస నింగి ముట్ట, దివిజులు వొగడంగ దివినుండి చూడ
నీభంగి నిరువురు నేడువాసరము, లాభీలగతిఁ బోర నాబ్రహ్మ యెఱిఁగి
బంధురతేజులై పరఁగు సంయములు, గంధర్వసురసిద్ధగణములుఁ గొలువఁ
జనుదెంచె నంత నాసమరంబు వారు, కనుఁగొని వెరగందగా దశాననుఁడు
దిక్కుల నందంద తిమిరంబు విరియ, నెక్కుడువడితోడ నిషుపరంపరలు
వెక్కసమై యుండ వింట సధించి, మిక్కిలికిన్కతో మృత్యువుమీఁద
నారి మ్రోయించుచు నాలుగమ్ములను, .........................................
లక్షించి జముమీఁద లక్షబాణములు, నక్షీణగతి నేసె నంత నంతకుఁడు
మొగమునఁ గోపాగ్ని మూఁడులోకముల, నొగి గాల్పఁజాలున ట్లెదవినఁ జూచి
యమరులు సురలును నాశ్చర్యమంద, యముఁ గనుఁగొని మృత్యు వనియె గోపమునఁ
నీపాపకర్ముని నేనె నిర్జింతు, నేపారఁగాఁ బంపు మేనల్గి నప్డు
దశకంఠుఁడన నెంత తలఁప హిరణ్య, కశిపుండు నను మీఱఁగా లేక చనియె.
ననిన సంతసమంది యంతకుఁ డతని, నని నేన చంపెదనని విజృంభించి
పొరిఁ గాలపాశంబు భూరిముద్గరము, నరుదార దుర్గముం డై వెలుంగుచును
బ్రహ్మ రావణునితో యుద్ధము మానుమని యముని వేడుట
వెస కాలదండంబు విస్ఫులింగంబు, లెసగంగఁ ద్రిప్పుచు నెల్లరాక్షసులు
భయమంది పఱవ నప్పౌలస్త్యుమీఁద, వైవ నూహించుచో వడి బ్రహ్మ గదిసి
యీనిశాచరుమీఁద నిది ప్రయోగింప, కీనాశ! తగదు నీకిన్క చాలింపు
సురలచేఁ జెడకుండ సురవైరి కేను, వరతపంబున మెచ్చి వర మిచ్చినాఁడఁ
గైకసితనయుఁ డీకాలదండమునఁ, జాక తక్కిననైనఁ జచ్చిననైనఁ
తప్పని నామాట తప్పు నబ్బుద్ధి, చెప్పితి నామాట సేయంగవలయు
నని దుష్టదనుజారులం దెవ్వఁడైనఁ, దనరు నావాక్యంబుఁ దప్పించు నతఁడు
భువనంబులన్నియుఁ బొంకింపఁదలఁచు, నవిచారమతి యగునటుగాన నీవు
నిరుపమద్యుతి నొప్పి నీచేత నున్న, నురుకాలదండంబు నుపసంహరింపు
మనవుడు నొడయుఁడ వైన నీమాట, కనుమతించితి నంచు నట్ల గావించి
వరశక్తి నీతఁ డవధ్యుండు నాకుఁ, బరికింప నింక నీబవర మేమిటికి
నని బ్రహ్మ వీడ్కొని యాదండధరుఁడు, తనగృహంబున కేగె దశకంఠుఁ డంత
జముని గెల్చితి నాకు సరి యెవ్వఁ డనుచు, సముచితస్థితమంత్రిజనులు కీర్తింప,
రావణుఁడు పాతాళమునకు దండెత్తి పోవుట
నాతతగతిఁ బుష్పకారూఢుఁ డగుచుఁ, బాతాళలోకంబు పైకెత్తి పోయి
భోగవతీపురిఁ బొలుపారుచున్న, భోగీంద్రులందఱుఁ బొరిఁ దన్ను గన్న
మానుగాఁ గైకొని మఱి వారిచేత, మానితవిభవుఁడై మణిపురంబునకు
నవిరళోద్ధతి నేగి యందు నివాత, కవచుల న్వీరులఁ గయ్య మర్థింపఁ .
జెలఁగి వారలు తమసేనలఁ గూడి, వెలువడి తలపడి వివిధాయుధముల
బలువిడి నొక్కటి పైమాఁడు నెలలు, చలమునఁ బోరంగ జలజసంభవుఁడు
వచ్చియాసమరంబు వారించి వలదు, మచ్చరం బిటమీఁద మది విచారింప
దేవదానవులకుఁ దెగువతోఁ గడగి, రావణు గెలువఁగ రాదు కయ్యముల
విూర లజేయులు మీకు నితనికిఁ, బో రేల సమబలుల్ పొ త్తొప్పు ననుచు
నరవిందసంభవుఁ డగ్నిదేవుండు, గురి గాఁగ సఖ్యంబుఁ గొమరొప్పఁ జేసి
రవిరళప్రియవాదు లగు నానివాత, కవచులతో గూడి కడువేడ్కతోడ
మణిపురం బది లంక మాఱుగానందు, గణుతింపఁగా నేఁడు గాలంబు నిలిచి
యొక్కటి కడమగా నొగి నూఱుమాయ, లక్కడ వారిచే ననువుగా నెఱిఁగి
యొగి నొప్పు కాలకేయులపురం బశ్మ, నగరంబు దానిపై నలువార నడచి
వేలసంఖ్యలుగల విపులవిక్రములఁ, గాలకేయులనెల్లఁ గడతేఱఁ జంపి
నానాస్త్రముల శూర్పణఖమగఁడైన, వాని విద్యుజ్జిహ్వు వధియించి మఱియు
నందంద దైత్యనాయకుల నన్నూటిఁ, గ్రందుగా వధియించి కడఁకతో నరిగి
విలసితనవరత్నవివిధచిత్రములఁ, బొలుపారు వరుణునిపుర మర్థిఁ గాంచి
సిరియందు జన్మించె, శితరోచియందు, సురుచిరంబుగఁ బుట్టె సుధయందుఁ బొడమె,
నాపయోనిధి నిండ నధికదుగ్ధంబు, లీపురంబుననుండి యిది నిచ్చ గురియు
గురుకీర్తి నొప్పు నీగోవుసామర్థ్య, మరుదంచు సురభికి నటు ప్రదక్షణము
'గావించిమ్రొక్కుచుఁ గడు తెంపుతోడ, నావీడు సొత్తించి యచట మార్పడిన
బలరక్షకుల గెల్చి పరుషంబు గాఁగ, నెలుఁ గెత్తి వారితో నేపుమైఁ బలికె
మీరు వేగమె పోయి మీరాజుతోడ, నారాక చెప్పుడు నాతోడ ననికిఁ
గడిమిమై రానిమ్ము కాదేని వచ్చి, తొడరంగలేనని తొలఁగపొ మ్మనిన
వరుణపుత్రులుఁ బౌత్రవర్గ౦బుఁ దారు, నరుదారఁ బుష్కరుండను వీరవరుఁడు
తీరుల విలసిల్ల దీప్తకోపమున, ఘోరసైన్యముఁ గొంచు గోవుతో వెడలి
దశకంఠుసేనతోఁ దలపడి యిందు, దశకంఠుమంత్రులఁ దలమీఱి కెడపె
నెసఁగునాశుగముల నెంతయు నొంచి, వెస రథంబులతోడ వినువీథి కెగయు
పటుసాయకంబులఁ బఙ్క్తికంధరుని, నటుమోముగా నేసి యతనిమర్మములు
పొరిఁగాఁడనేయ నప్పుడు మహోదరుఁడు, సురవైరి నొచ్చుటఁ జూచి కోపమునఁ
బృథుగదాపాణియై పృథులఘాతమున, రథహయంబులు మ్రగ్గ రథములు శృంగ
సారథుల్ నురుముగాఁ జక్రరక్షకులు, తోరంపునెత్తుర్లతోడ రూపఱఁగ
నాగ్రహంబునఁ గిట్టి యందఱఁ జంపి, విగ్రహంబున నార్వ వివశులై తొలఁగి
వారును నొక్కింతవడికి ధైర్యంబు, లారంగఁ గైకొని యతని దిట్టుచును
మండితభుజదండమండితద్యుతులుఁ, జండకోదండకాంచనమణిప్రభలుఁ
గలయంగ దీపింప గలసి లంకేంద్రు, బలువిడి దాఁక నప్పఙ్క్తికంధరుఁడు
కనుఁగొని నెఱకులకాండముల్ ద్రుంచి, ఘనముసలంబులు గదలు పరిఘలు
భయదశరంబులు పరుషపాషాణ, చయములు దుర్వారశక్తులు గురియ
రథము లెక్కుడు విర్గి రణయత్న మెల్ల, శిథిలమై తా రొండు సేయంగ లేక
పంకస్థలంబున భద్ర సామజము, లంకిలిఁ బడియున్నయ ట్లున్నఁ జూచి
నలువారఁగా సింహనాదంబుఁ జేసి, బలువారఁ దఱచుగ బాణంబు లేయ
వారును నయ్యురువడి నివారింప, సైరింపఁజాలక జగతిపైఁ బడిరి
పడినగేహములకుఁ బరిచరుల్ వారి, వడి నెత్తుకొనిపోవ వరుణునిమంత్రి
వచ్చి సునాథుఁ డన్వాఁడు లంకేంద్రు, నచ్చుగా మొగపడి యతనితో ననియె
నరవిందసంభవు నాస్థానమునకు, వరుణుఁడు చన్నాఁడు వరగీతగోష్ఠి
నిక్కడఁ గలవారి నెల్లఁ గయ్యమున, నిక్కంబు గెల్చితి నీ వేగు మనిన
ననయంబు నుప్పొంగి యందఱు వినఁగఁ, దనగెల్పు చాటించి దశకంధరుండు
రావణుఁడు బలిపురంబున కేగుట
భీషణగతి దిశల్ భేదిల్ల నార్చి, పాషాణనగరంబుపై నెత్తిపోయి
విలసితనవరత్నవివిధచిహ్నములు, వెలయు తోరణములు విలసిల్లుదానిఁ
బసిడికంబంబులఁ బస మీఱుదాని, ....................................
ఘటితవజ్రోపలకాంతి చెన్నొందు, పటికంపుసోపానపఙ్క్తులుదానిఁ
బ్రణుతవేదికలును భద్రపీఠికలు, మణికింకిణులు గల్గి మానైనదానిఁ
జంద్రప్రభాజాలచారుశిల్పముల, నింద్రుమందిరముతో నెనవచ్చుదాని
వారంగఁ గనుఁగొని యత్తెఱంగెల్ల, నారయుబుద్ధిఁ బ్రహస్తు నీక్షించి
యివ్విధంబున నొప్పు నిమ్మహాసదన, మెవ్వరినిలయమో యెఱిఁగి రమ్మనిన
నరిగి తల్వాకిట నాతఁ డెవ్వారి, నరసి కానక చొచ్చి యాఱువాకిళ్లు
చూడనిగతి జనశూన్యంబు లగుట, నేడవవాకిలి కేతెంచి యచట
నిండుదేహప్రభల్ నిగుడంగఁ గిరణ, మండలావృతుఁడైన మార్తాండుకరణిఁ
బొలిచి వెల్గెడు నొక్కపురుషునిఁ గాంచి, యలుకతో నతఁ డట్టహాసంబు సేయ
నొలయుభయంబున నొడలి రోమములు, నిలువంగఁబడి తాల్మి నిలుపంగలేక
మదిలోన శంకించి మరల నేతెంచి, త్రిదశారిఁ గనుఁగొని దేవ నే నరిగి
వడి నిర్జనములైన వాకిళ్ళు గడచి, తడయక సప్తమద్వారంబునందు
భూరితేజుని నొక్కపురుషుని గాంచి, వారనిభయమున వచ్చితి ననిన
విని పుష్పకము డిగి వింశతిభుజుఁడు, తనరు నవ్వాకిలికి తా నేగి చొరఁగ
ననలాగ్రజిహ్వయు నరుణక్షేత్రములు, నిరుపమద్యుతులచే నెగడు నాసికయు
వినుతబింబద్యుతి వెలుఁగునోష్ఠంబుఁ, దనరారు హనువులు ధవళదంతములు
గనలు పెంగోఱలు కంబుకంఠంబు, ...................................................
నున్నతఘోణంబు నూర్ధ్వరోమములుఁ, గన్నుల కతిభీతి గావించునొడలు
నురులోహముసలము లొప్పు నప్పురుషుఁ, డరుదార జంకెతో నడ్డ మై నిలువఁ
గడుభీతిఁ జిత్తంబు గలఁగంగ మేను, వడఁకంగ రోమముల్ వడి నిల్వఁబడఁగఁ
దనఘోరరూపంబుఁ దప్పక చూచి, తనరఁ జింతించు నాదశకంఠుఁ జూచి
నలవుమై రాక్షస నాతోడ నైన, ..................................................
కయ్యంబు సేయుదుగాక నీ విట్లు, కయ్యంబునకు వచ్చి కంపింప నేల
పటువిక్రమంబునఁ బరఁగురావణుఁడ, వటు నీకు భయరోమహర్షణం బేల
ననవుడు రఘువర యామాట కతఁడు, మనమున ధైర్యంబు మానుగా నిల్సి
యుద్ధంబు బలితోడ నొనరించుబుద్ధి, నుద్ధతి వచ్చితి నుచిత మిం కేది
యది సేయువాఁడ నే ననిన నాఘనుఁడు, మది విచారించి యామాట కి ట్లనియె
నలరుపెంపున దానవాధీశుఁడైన, బలిలోన నున్నాఁడు పరికింప నతఁడు
సురుచిరాంగుఁడు దానశూరుఁడు విప్ర, గురుజనప్రియుఁడు దుర్గుణవిరుద్ధుండు
బాలార్కతేజుఁడు బహుగుణార్ణవుఁడు, కాలదండాభీలకాలసన్నిభుఁడు
సమరదుర్వారుండు సమరశూరుండు, సమరైకవిజయుఁడు సమరదుర్జయుఁడు
వినుతసత్వుఁడు మహావీరుఁడు శత్రు, జనదీ్తపరోషుఁడు సత్పరాక్రముఁడు
ననిమిషదైత్యసంఘాదులవలన, ననిశంబు నిర్భయుండై యున్నవాఁడు
అట్టి యాబలితోడ నని సేయఁ దలఁపు, పుట్టెనేనియుఁ వేగఁ బొమ్మన్నఁ బోయెఁ
బోయినదశకంఠుఁ బొడఁ గాంచి బలియు, నాయతధ్వని నట్టహాసంబుఁ జేసి
పోలంగఁ దలపోసి పొలుచుహస్తమునఁ, బౌలస్త్య ర మ్మని పట్టి రాఁదిగిచి
తొడమీఁద నిడుకొని దోషాచరేంద్ర, కడగి వీవచ్చిన కార్యంబు నాకు
నెఱిఁగింపు నీప్రియం బేను గావింతుఁ, దెఱుఁగొప్ప ననిన నాదివిజారి పలికె
బలిఁ బట్టి విష్ణుండు బంధించినాఁడు, బలిమిమై నని విని బంధనం బుడుపఁ
దలఁచి వచ్చితి నేను దనుజేంద్ర యనుడు, బలి నవ్వి పలికె నప్పౌలస్త్యుతోడఁ
బూని వాకిటనున్న పురుషుఁ గృష్ణాంగు, మానుగాఁ గంటి వమ్మహనీయమూర్తి
దనుజవీరుల నెల్ల దండించినాఁడు, నను నిట్లు బంధించి నాతఁ డాఘనుఁడు
అతని నెవ్వఁడు గెల్చు నతఁడు గావింప, మితి నెల్ల భూతముల్ మృతిఁ బొందుచుండు
బ్రహ్మయు నాతడు పరమప్రభుండు, బ్రహ్మాదిసురలకుఁ బరికింప నతఁడు
నలువయు నాతఁడు నాకేశుఁ డతఁడు, కలితవిక్రముఁడైన కాలుండు నతఁడు
జగములు పుట్టింప సరిఁ బెంప నడఁపఁ, దగునేర్పు గలవాఁడు తలపోయ నతఁడు
తరిమిడి పరికింపఁ దాదృశుండైన, పురుషుఁ డెవ్వఁడు లేఁడు భువనంబులందుఁ
బశువుల ద్రాళ్ళను బంధించినట్లు, దశకంఠ నిను నన్నుఁ దక్కినవారి
ముడిగొన సంసారమోహపాశములు, వడి నంటగట్టినవాఁడె యాఘనుఁడు
వికటరోషుండైన వృత్తుండు ధనువు, శుకుఁడు శంభుండు నిశుంభశుంభులును
గాలనేమియు మధుకైటభకూట, కాలకేయులుఁ దక్షకుఁడు దారకుండు
యమళార్జనుఁడు గయుం డనియెడువాడు, .........................................
ప్రచురవిక్రములు శంబరవిరూపాక్ష, ముచుకుందదుందుభుల్ మొదలైనయట్టి
యతులబలోద్ధతు లడరంగఁ బోరి, యతనిచేతనె కూలి రఖిలంబు నెఱుఁగ
వేలసంఖ్యులు గల్గి వెల్గు నింద్రులను, వేలసంఖ్యలఁ బొల్చు విబుధసంఘముల
ముదమునఁ దనుఁ గొల్చు మునిసహస్రముల, వదలక పాలించువాఁడు నాఘనుఁడు
ఆతఁడు కట్టిన కట్ల నాతండె దక్క, యితరుండు విడువంగ నెంతటివాఁడు
అనవుడు దశకంఠుఁ డామాటలెల్ల, వినియును మదిలోన వెఱవక పలికె
దనుజేంద్ర తగ నిట్టు తపసిచందమునఁ, దనరుతేజము తటిత్తరళజిహ్వయును
శుభ్రోరుదంష్ట్రలు శోణనేత్రములు, బభ్రుకేశంబులు భయదాననంబు
సరి మేన వృశ్చికసర్పరోమములుఁ, బెరుఁగురోషంబునఁ బెనుమంట లెసఁగ
నత్యుగ్రపాశంబు నరుదార నడరు, మృత్యువు తోడుగా మెఱయు నంతకుల
నని గెల్చినాఁడ నే నటుగాన వెఱవ, ముసుకొని యేడవమొగసాలకడను
ఘనతరభీషణాకారుని గంటి, వినుతింపఁబడిన యవ్వీరు డెవ్వాఁడు
వినియెద వినుపింపు విశదంబు గాఁగ, ననుమాట విని యాతఁ డతనితో ననియె
విశ్వలోకమునకు విభుఁడును గురుఁడు, విశ్వరూపుఁడు నైన విష్ణుఁ డాఘనుఁడు
భావంబులకు నెల్ల బయలైనవాఁడు, దేవదేవుఁడు సర్వదేవతామయుఁడు
సర్వభూతాత్ముఁడు సర్వచిన్మయుఁడు, సర్వరూపుండును సర్వకారకుఁడు
శిష్టరక్షణమతిం జేసి చక్రమున, దుష్టరాక్షసకోటిఁ ద్రుంచినవాఁడు
తనర నాత్మధ్యానతత్పరులైన, మునులకు మోక్షంబు మొగి నిచ్చువాఁడు
తనభక్తి యెఱిఁగియుఁ దనపుణ్యకథలు, వినుతి సేసినఁ దన్ను వినినఁ బేర్కొన్న
యాగంబు యాజ్యుఁడు నగుఁ దన్ను గూర్చి, యాగంబుచేసిన నఖలపాపముల
వలనఁ దొలంగించి వాంఛితార్థముల, నలువారఁగా నిచ్చు నారాయణుండు
బలదేవుఁ డన బాహుబలలీలలందు, నలఘుఁడై వర్తించు నని యెఱిఁగింప
నతివినయంబున నాబలీంద్రునకు, నతిఁ జేసి యతనియానతిఁ జేసి యపుడు
సురవైరి వెడలి యచ్చోట నప్పురుషు, నరసి కానక దిక్కు లద్రువంగ నార్చి
లోకభీకరలీల లోకలోచనుని, లోకంబుమీఁద నాలోకకంటకుఁడు
మెఱసిపోవుడు నడ్మ మేరుశృంగమున, నొఱపుగా విడిసి యందొకరాత్రి పుచ్చి
మఱునాడు చని హేమమణిగణద్యుతులు, వఱలు కేయూరముల్ వరకుండలములు
రక్తాంబరంబులు రక్తమాల్యములు, రక్తచందనమును రంజిల్లువాని
రావణుఁడు సూర్యుఁడు మున్నగువారిపై దండెత్తుట
గర ముగ్రముగ వెల్గు కరసహస్రముల, దురువలోకుండగు తోయజప్రియుని
గని ప్రహస్తుని జూచి కడిదితేజమునఁ, గనలు నీభానునికడ కేగి నీవు
నిమ్ముల నారాక యెఱిఁగించి యనికి, రమ్మని పిలువుము రానోడెనేని
నోడితిననుమాట యుగ్రాంశుచేత, నాడించి రమ్మన నాతఁడు నరిఁగె
దండపింగళులను దౌవారికులకు, దండివీరుండైన దశకంఠుమాట
వినిపింప దండుండు వెస నేగి మ్రొక్కి, చనుదెంచినాఁడు దశాననుఁ డనికి
నాహవక్రీడకు ననువు గా దేమి, యూహించి చూచి నీ వోడితి ననుము
విను మిందులో నొక్కవిధము లేకున్న, జనఁ డాదశాస్యుండు జయకాముఁ డగుట
ననవుడు విని యర్కుఁ డతనితో ననియె, ఘనుఁడైన యాదశకంఠునితోడ
ననిఁ జేసి గెలువరా దనిఁ జేయఁజాల, నని యేను పల్కితి నని పల్కు మనిన
నాదిత్యుపనుపున నతఁ డేగుదెంచి, యాదశాస్యునితోడ నందఱు వినఁగ
నమితవిక్రమశాలివైన నీతోడ, సమరంబుఁ జేయంగఁ జాలఁ డర్కుండు
నామాట రవిమాట నక్తంచరేంద్ర, నామాట విను మన్న నామాట కలరి
యింద్రారి జయఘోష మసఁగించి మించి, చంద్రలోకమునకుఁ జనుచు మేరువున
నారాత్రి వసియించి యం దొక్కపురుషుఁ, డారంగ జలకేళి నలసిక న్మోడ్వఁ
గదియఁ గాంచనకుంభకఠినంబులైన, ముదుకనిచన్నులు మొన లొత్త దిగిచి
బలువిడి నచ్చరల్ పరిరంభణముల, మెలపుచు జనములు మేల్కొల్పఁ దెలిసి
దివ్యభూషణములు దివ్యాంబరములు, దివ్యానులేపముల్ దివ్యమాల్యములు
నమరంగఁ ద న్నోలి నమరకామినులు, ప్రమదంబుతోఁ గొల్వఁ బసిఁడితే రెక్కి
కడుఁబేర్మి నెగయఁగాఁ గని భూధరేంద్ర, వడి నేగు నీతేరివాఁ డెవ్వఁ డితఁడు
దేవారినైన నాదెసఁ గనుఁగొనక, పోవుచునున్నాఁడు భూరితేజమున
తనభయం బెఱుఁగఁ డీదర్పాంధుఁ డనినఁ, గనకాద్రి యాదశకంఠుతో ననియెఁ
జతురాస్యుఁ డితనిచే సంతుష్టుఁ డయ్యె, నితఁ డేగుచున్నాఁడు నిట మోక్షమునకుఁ
నలవున వత్స నీ వఖిలలోకములు, గెలిచితి తపమున గెలిచినా డితఁడు
శూరాగ్రణివి నీవు చూడఁగ నిట్టి, వారిపై గోపంబు వలదన్న నుడిగి
మఱియు నొక్కడు హేమమణిగణద్ యుతుల, నెఱసినరథమెక్కి నెమ్మితోఁ
గనుఁగొని గిరిరాజ కడునింపు గాఁగ, ననిమిషుల్ వొగడఁగ నచ్చర లాడఁ
జనుచున్న యాసముజ్జ్వలతేజుఁ డెవ్వఁ, డనిన నాశైలేంద్రుఁ డనియె నాతనికి
నీతఁడు వైరుల కెదురుగా నడిచి, యాతతాయుధఘోరహతుల సైరించి
వితతవిఃక్రమలీల వేడుక సలిపి, పతికి వంచనలేక ప్రాణంబు లిచ్చి
సురుచిరగతి నిట్లు సురలోకమునకు, నరుగుచునున్నవాఁ డటుగాక యుండఁ
బొలుపార వేడుక పుట్టినచోట, నెలమిమై విహరిఁప నేగుచున్నాఁడు
వినుమని యెఱిఁగింప వెండియునొక్కఁ, డనుపమాకృతితోడ నంతరిక్షమ్ము
నడుమఁ దేజమ్మున నాదిత్యుఁబోలె, నుడురాజుబింబంబునోజ మోమలరఁ
గమనీయభూషణగంధమాల్యములు, విమలాంబరంబులు వింతలై మెఱయ
వలఁతులై నుతగీతవాద్యనృత్యముల, నలరఁజేయుచు నిర్జరాంగనల్ గొలువ,
సమ్మదలీలఁ గాంచనవిమానమున, నిమ్ములఁ జనఁ జూచి యతఁ డెవ్వఁ డనిన
మానుగా నిశ్చలమతియై సువర్ణ, దానంబుఁ జేసినధర్మాత్ముఁ డనుచుఁ
దెలియంగఁ బలికిన దివిజారి పలికె, నెలమి నీగతి నేను నీవీరులందుఁ
జెలఁగి న న్నాజిలోఁ జెనయు వీరుండు, గలఁడేని యెఱిఁగిఁపఁగలవె నీ వనిన
నమరలోకంబున కరుగుచున్నారు, సమర మొల్లరు వీరు చరితార్థు లగుట
రావణ నీతోడ రణము గావించు, చేవయుఁ గలవీరుఁ జెప్పెద వినుము
ధీరుఁడై యొగి నేడుదీవులు నేలు, శూరుఁడౌ యువనాశ్వసుతుఁడు మాంధాత
యనురాజు గలఁ డొక్కఁ డతనికి నీకు, పని గల్గునని చెప్ప నచలేంద్రుఁ జూచి
రావణుఁడు మాంధాతతో యుద్ధము చేయుట
నిక్కంబు చెప్పితి నీవు మాంధాత, నెక్కడ నతఁ డుండు నెఱిఁగింపు మనిన
సర్వభూములు గెల్చి సత్కీర్తి దెసలఁ, బర్వ నయోధ్యకుఁ బతియైనయతఁడు
జనలోకవినతుఁడై చనుదెంచు నిటకు, ననఁగఁ గాంచనమయం బగువిమానమున
దొడవులు మణిగణద్యుతులతో నింపు, లడరించు దివ్యమాల్యానులేపములు
దిక్కుల వాసింప దృష్టిజాలములఁ, జిక్కింపఁజాలిన చెలువంబు మిగిలి
మాంధాత చనుదెంచె మహిమతోఁ బఙ్క్తి, కంధరుఁడును వరగర్వితుం డగుచు
గదిసి భూవర నాకుఁ గయ్య మీవలయు, మదవృత్తి ననుటయు మాంధాత నవ్వి
బ్రదుకనొల్లకయున్న పౌలస్త్య నీవు, కదనంబు నాతోడఁ గావింతుగాక
మాట లేటికి నన్న మాంధాతపలుకు, పాటిసేయక నవ్వి పఙ్క్తికంధరుఁడు
మనుజేంద్ర వరుణుని మది లెక్కసేయ, ధనదుఁ గైకొన దఁడధరుని నే నెఱుఁగ
నాకనాయకు మెచ్చ నరుఁడైననిన్నుఁ, గైకొందునే యంచుఁ గనలుకోపమున
సమరదుర్మదులైన సచివులఁ బనుప, నమితవిక్రములైన యానిశాచరులు
శరవృష్టి గురిసి రాజననాయకుండు, నరిది బాణములు ప్రహస్తునిమీఁద
జవమార శుకుమీఁద సారణుమీఁద, నవిరళోద్ధతి విరూపాక్షునిమీఁద
నొగి మహోదరుమీఁద నుద్దామబాహుఁ, డగునకంపనుమీఁద నందంద వఱపి
తగిలినకిన్కతోఁ దనమీఁద మఱియు, నొగిఁ బ్రహస్తుం డేయు నుగ్రబాణములు
పెల్లుగా వెస మింటఁ బెనుమంట లెసఁగ, భల్లంబు లడరించి బలువిడిఁ ద్రుంచి
కార్చిచ్చు మిడుతల గమి నేర్చుకరణిఁ, బేర్చి తోమరములు భిండివాలములు
శక్తులులోనుగా సకలాయుధముల, రక్తధారలతోడ రాక్షసుల్ గూలఁ
గర ముగ్రగతి వైచి కడిమిపై క్రౌంచ, గిరి నఱకిన కార్తికేయుచందమున
నలుక రావణువక్ష మట యుచ్చి పార, బలువిడితో నైదుబాణంబు లేసి
కనలు ముద్గర మెత్తి కడువడిఁ ద్రిప్పి, వినువీథి కెగయఁగ వెస వైచుటయును
వెస దానిపాటున వివశుఁడై వ్రాలి, ముసరి యాహారవంబులతోడి తన్నుఁ
గనుఁగొని రాక్షసుల్ గడుభీతిఁ బొంది, మనములఁ జింతింప మఱపుతో నుండి
యొక్కింతదడవున కొయ్యనఁ దెలిసి, యక్క జంబుగ నిల్చి యాదశాననుఁడు
పెక్కుబాణము లేసి భీతిల్లఁజేసి, చిక్కించి యాతేరు చెక్కలు చేసి
చక్కాడి హయములఁ జంపి కోపమున, వెక్కసంబుగ నిట్లు విక్రమించుటయు
విరథుఁడై మాంధాత విపులరోషమున, నురుతరరోచుల నొప్పారు శ క్తి
ఘంటికాఘణఘణత్కారముల్ చెలఁగ, మంట లర్కాంశుల మారుమగ్గింప
నంకించివైచిన యతులశూలమున, లంకాధిపతి దాని లఘులీలఁ ద్రుంచె
నంతకాకృతి నేచి యలుకతోఁ జూచి, యంతకు చేఁగొన్న యమ్ము సంధించి
వింతకన్మూఁతతో వివశుఁ డై యొఱుగ, నెంతయు వడి నన్నరేంద్రుని వైచె
నంత రావణుమంత్రు లందఱు నార్వ, నంతలో నతఁడును నామూర్చఁ దెలిసి
యంతకంతకు దట్టమై దిగంతముల, నంతరిక్షమునఁ బెల్లడరులు చెదరఁ
బొరిపొరి పుంఖానుపుంఖము ల్గాఁగ, శరసంఘముల నిశాచరునిపైఁ బఱప
సర్వదిక్కులు నిండఁ జండకాండముల, మౌర్వీరవంబుల మార్గణధ్వనులఁ
గలఁగినవారాసిగతి గానఁబడఁగఁ, జలియించి రావణుసైన్యంబు గలఁగ
లలినంత మనుజేశలంకేశు లంత, బలువిడి నన్యోన్యబాహుదర్పములు
సరిఁజెల్ల నిరువురు జయకాంక్షు లగుచు, బెరసి యొండొరుమీఁదఁ బెక్కుబాణములు
గరిగరి దాఁకంగఁ గడువీఁకఁ బఱపి, నెరిఁ బరస్పరబాణనిష్ఠురహతుల
నరుదార జర్ఝురితాంగులై రపుడు, పరుషరోషంబునఁ బఙ్క్తికంధరుడు
వెలుఁగు రౌద్రాస్త్రంబు వెస నేయ దాని, నిలిపి భూపాలుఁ డాగ్నేయబాణమ్ము
గంధర్వబాణంబుఁ గడఁకతో వింట, సంధించి యానిశాచరు నేయుటయును
వడి మానవేంద్రుండు వారుణాస్త్రమున, నెడలించి బ్రహ్మాస్త్ర మెత్తె నెత్తుటయు
నాచందమంతయు నాత్మయోగమువఁ, జూచి యప్పుడు పులస్త్యుఁడు గాలవుఁడు
నచటీకి నేతెంచి యని మాన్చి వారి, నుచితవాక్యమ్ముల నొక్కటిఁ జేసి
రయమునఁ జని రంత రజనీచరేంద్రుఁ, డయుతయోజనమాత్ర మటు మీఁది కెగసి
రావణుడు చంద్రమండలమునకుఁ బోవుట
భూరిహంసావళిఁ బొలుపారు ప్రథమ, మారుతస్కంధంబు మానుగాఁ గడచి
యోలి నక్కొలఁదిన యొండొంటిమీద, గాలికిఁ బట్టైన గగనమార్గమున
విలసిల్లఁగా నందు వివిధమేఘములు, గలుగు నారెండవకణయంబు గడచి
సమ్మదంబున సిద్ధచారణుల్ గొలువ, నిమ్మైన మూఁడవయెడయును గడచి
పొది వినాయకుతోడ భూతసంఘములు, పద నైననాలవభాగంబు గడచి
యలరు మందాకిని నవగాహకేళి, సలిపి దిగ్గజములు సరిగొండమీఁద
మదశీకరంబులు మానక కురియు, కదియ నాయేనవకణయంబుఁ గడచి
పరివృతబంధుఁడై పక్షీంద్రుఁ డునికిఁ, గరమొప్ప నాఱవఖండంబుఁ గడచి
చూడంగ ఋషులచే శోభిల్లుచున్న, యేడవమండలం బెలమితోఁ గడచి
చల్లగా మిన్నేటిజలశీకరములు, చల్లు నాయష్టమస్థానంబుఁ గడచి
వెసమీద నెనుబదివేలయోజనము, లసమానగతి నేగ నంతటిమీఁద
సకలలోకములకు సమ్మదం బొదవ, నకలంకగతి రశ్ములవికోటి నిగుడఁ
దారకావళి గొల్వు దనరి చంద్రుండు, దారుణాకృతిగల దశకంఠుఁ గాంచె
నానిశాచరువీరుఁ డౌ దశాసనుడు, నానిశాచరుఁ జేరు నపుడు రాక్షసులు
కదియఁజాలక యున్న గని ప్రహస్తుండు, గదిసి రావణుఁ జూచి కరములు మొగిచి
లలి నింక నిక్కడ లంకేంద్ర మేము, నిలువఁజాలము సీతు నెఱయంగఁ దాఁకెఁ
గడుఁజిత్ర మిది శీతకరుఁడు గాల్పంగఁ, దొడరె నోర్వఁగరాదు దొలఁగెద మనిన
గోపించి విలు వెసఁ గొని నారసములు, పైపైని జంద్రుపైఁ బఙ్క్తికంధరుఁడు
పఱవంగ బ్రహ్మ సంభ్రమముతో వచ్చి, యరుదారఁ గెడ సొచ్చి యతనితో ననియె
శశి లోకములకెల్లఁ జల్లనివాఁడు, శశితోడఁ గయ్యంబు సనదు వేమరలు
రాత్రించరోత్తమ రణములో నీకు, శాత్రవకోటిచేఁ జావు లేకుండ
నొకమంత్ర మిచ్చెద నొప్పార ననిన, ముకుళితహస్తుఁడై ముందట నిలిచి
ధాత నీకృప నేను ధన్యుఁడనైతి, ప్రీతుండనైతిని బెంపార నాకు
నరుదార నిచ్చెద నన్న యామంత్ర, మిరవంద నాకు నీ వెఱిఁగింతుగాక
నీమంత్రబలమున నే నజేయుండ, నామించి దేవాసురాదులవలన
నేభయంబును లేక యెల్లలోకములు, నాభీలభుజశక్తి నధికతేజంబు
గనియెద ననిన నాకమలసంభవుఁడు, గనుఁగొని యాపఙ్క్తికంఠుతో ననియె
మృతి చేరినప్పుడు మృత్యుజయంబు, మతి నిల్పి చే నక్షమాలిక దాల్చి
పటునిష్ఠ జపియింపఁ బ్రాపించు విజయ, మబుగాక తక్కిన నని నోడు దనుచు
మనమార నతని కామంత్రంబుఁ జెప్పి, తనరుతేజముతోడఁ దనలోకమునకు
లోలత నాచంద్రలోకంబు వెడలి, యాలోకవిభుఁ డేగె నంత రావణుఁడు
మరలి శత్రుల నెల్ల మడియంగఁ జంపి, తిరుగుడు పడుచున్న దేవకన్యకలఁ,
గలయంగ గంధర్వకన్యకావళుల, నలసభావముగల యక్షకన్యకలఁ
గడఁగి విద్యాధరకన్యకోత్తమలఁ, ..........................................
గర మొప్పు కిన్నరకన్యకావళుల, నరలోకకన్యల నాగకన్యకల
నచ్చరలేమల నమరకన్యకల, నచ్చుగాఁ గైకొని యందంద మఱియు
మెఱుగుఁదీఁగెలు వోలు మేనులు నలువు, గిరిగొన్న యలినీలకేశపాశములు
తరుణేందు నుపమింపఁ దగులలాటములఁ, గరివంకబొమలును గ్రాలుకన్గవయు
సుధ లొల్కు పల్కులు సుషుమదంతములు, మధురాధరంబులు మందహాసములు
చంద్రబింబము నొప్పు సరకుఁగాఁ గొనక, .....................................
తమ్మినెత్తావుల తలఁగింపఁజాలు, కమ్మనియూర్పులు కంబుకంఠములుఁ
బసిఁడిమించుల నొప్పు బాహుమూలములుఁ, గిసలయంబుల నవ్వు కెంగేలుగవయుఁ
గందర్పునభిషేకకలశంబు లనఁగ, నొంది దర్పోన్నతి నొనరు చన్గవయు
సన్నపుహరినీలసరణిచందమునఁ, జెన్నైనయూరులు శిథిలమధ్యములు
నాభీసరోమార్గనవ్యసౌపాన, శోభాపరంపరల్ సూచించువళులు
గంభీరనాభులు ఘననితంబములు, రంభానిభాకృతి రంజిల్లుతొడలు
ననువృత్తజంఘలు నరుణాబ్జకాంతి, పనుపడి విలసిల్లు పదపల్లవములు
హంసకంబులు మనోహరములై మెఱయ, హంసశంకలఁ జేయు నలసయానములు
నలినొప్పు చెయ్వులు నవవిలాసములు, నెలయు సోయగములు నెలజవ్వనములు
నొప్పారుకాంతల నొగి వారివారిఁ, గుప్పలుగాఁ జంపి క్రూరుఁడై గదిసి
సేసముత్యము లొల్క సీమంతవీథి, గాసిగాఁ దెగి మాసకము మణుల్ దొరఁగ
రోలంబకులనీలరుచిరధమ్మిల్ల, మారుతిమల్లికామాలికల్ మాల
నలకలు చెదరంగ నలికంబు చెమటఁ, దిలకంబు గరఁగంగ దృష్టులు మగుడ
హారముల్ బెరుఁగంగ నంగముల్ వడఁక, నారంగ చరణంబు లటు దొట్రుపడఁగ
లేఁతకౌ నసియాడ లీలఁ జూడ్కులకు, బ్రాఁ తైనచన్నులపై కొంగు దొలఁగ
ఘననితంబోన్నతి గలయంగఁజాలు, కనకమేఘల వీడఁ గడునొప్పునడల
ఝణఝణంకృతులతోఁ జారుమంజీర, మణికంకణంబులు మహి నూడిపడఁగ
బిగిచన్నుఁగవ బాష్పబిందువుల్ రాలఁ, దెగువతోఁ దలపట్టి దిగిచి పుష్పకము
నెక్కి౦చుకొనిపోవు నెడవారిమతులఁ, బొక్కుచు విలపింపఁ బొడముశోకాగ్ని
నొండొండ వెడలు నిట్టూర్పుల నొప్పి, యుండెఁ బుష్పక మగ్నిహోత్రంబుపగిది
నప్పుడు పౌలస్త్యు నతిభీతిఁ జూచి, యెప్పుడు మ్రింగునో యీనిశాచరుఁడు
ననుచుండ నం దొక్కనలినాయతాక్షి, మనమున బెగడంగ మఱియొక్కవనిత
ననుఁ గ్రూరుఁడై పట్టి నక్తంచరుండు, తునుమాడునో యని తొడఁగి చింతింప
గొందఱు మదిలోనఁ గూఱు నెవ్వగల, నందంద తమవారి నందఱిఁ దలఁచి
యక్కటా నామీఁద నర్మిలి వొడము, తెక్కలి శోకాగ్ని ధృతి నీరు గాఁగ
మరణంబుఁ గోరుచు మాతల్లి యెట్టి, దురవస్థఁ బొందునో తుదిలేనివగలఁ
బ్రాణంబుగా నను బాటించు తండ్రి, ప్రాణ మేవిధమునఁ బట్టునో యింక
ననురాగ మెసగఁగ నలిఁబ్రేమఁ జేసి, పెనిచినకొడుకులఁ బెడఁబాయవలసె
నెట్టుగా నోఁచితి నేఁడు నాకూర్మి, పట్టు లేపాటునఁ బడుదురో బెగడి
నాతోడఁబుట్టువుల్ నాబంధుజనులు, నీతెఱఁగునకుఁ దా మే మనువారొ
పరికింప నాపాలి భాగ్యదేవతయుఁ, బరమబంధుండైన పతి నన్ను దలఁచి
చిన్న నై వదనారవిందంబు వాంచి, యెన్ని చింతించునో హృదయంబు పొగుల
నట్టి నాపతిఁ బాసి యందఱఁ బాసి, యిట్లున్న నా కింక నేమియాపదలు
తుద లేనియిడుములఁ దూలి నేఁ జాల, మదిఁ జూడ కష్ట మీమనుజలోకంబు
నిను నేను వేఁడెద నీలోకమునకుఁ, గోనిపొమ్ము మృత్యువ కోర్కి దీపింప
నని యని కోపింప నంగనల్ గొంద, ఱనదలమైతి మే మని చాలఁదూలి
విధి దూఱ గొంద ఱివ్విధమున మాకు, విధి యుండ నేమని విలపింతు మనఁగఁ
గొందఱు మూర్ఛిల్లఁ గొందఱు దెలియఁ, గొందఱు పాపాత్మ! కూడునే యనఁగ
నాఱనిశోకాగ్ని నటు గొంద ఱులియ, నాఱడిపడితిమే యని కొంద ఱలయ
గుఱి లేనివగలచేఁ గొందఱు గుంద, మఱియుఁ గొందఱు సతుల్ మతుల నూహించి
నక్షత్రములమాపు నలినాప్తుకరణి, నక్షీణవిక్రముం డైన రావణుఁడు
మనవారి నందఱ మసఁగి రూపణిఁచి, మనముల నిబ్భంగి మానముల్ దూలఁ
బాపచిత్తంబునఁ బరకాంత లనక, నేపునఁ జెఱపట్టె నీదురాత్మకుఁడు
దురములోపలఁ దనదుర్మదం బణఁపఁ, బరకాంతనెపమునఁ బడిపోవుఁ గాక
పాయనియీపాపఫలమున ననుచు, వాయెత్తి పల్క నవ్వాక్యంబుతోడ
ధర పుష్పవర్షముల్ దఱుచుగాఁ గురిసె, సురదుందుభుల్ మ్రోసె సొరిది నాకసము
నంత నాదశకంఠు నాపతిప్రతలు, సంతాపమును బొంది సైరింపలేక
శపియించుటయు నగ్ని సగమాఱినట్లు, విపులతేజముతోడ వెలితియై తోఁప
నంత నాదశకంఠుఁ డామంత్రివరులు, సంతోషమునఁ దన్ను సన్నుతుల్ సేయ
రావణుఁడు తనపతిం జంపిన శూర్పణఖ యేడ్చుట
బలములు గొలువంగ బహుజయధ్వనులు, లలి మించ నేతెంచి లంక సొచ్చుటయు
మది శూర్పణఖయును మగనిచావునకుఁ, బొదివినశోకాగ్నిఁ బొగులుచు వచ్చి
యన్నిశాచరనాథు నడుగుల కెరఁగి, కన్నీరు పాద్యంబు గావింప నతఁడు
చెలియలి వెస నెత్తి చిత్తంబులోన, నలయకు నీ వంచు ననునయం బెసఁగఁ
బలికిన నందంద బాష్పముల్ దొరఁగఁ, తల వాలవైచి గద్గదకంఠ యగుచుఁ
బౌలస్త్యపుంగవ పదుమూఁడువేల, కాలకేయుల నీవు కడతేర్చునపుడు
మఱఁది నాచెలియలిమగఁ డితం డనక, నుఱక విద్యుజ్జిహ్వు నుచితమె చంప
మొగమోట వలవదె ముందటఁ బడిన, తగునె వధింపఁగఁ దనబంధు లనక
నిక్కంబుగా నాకు నిర్నిమిత్తమున, నక్కట వైధవ్య మందంగవలసె
నే మందు శోకాగ్ను లేమిట నార్తు, నే మందు విధి నిన్ను నే మందు ననిన
నిది యేల శోకించె దేను గయ్యమున, వదలక రిపుకోటి వధియించునపుడు
పరఁగు నాశరవీథిఁ బడిచచ్చెఁ గాని, పరికింప నాదృష్టిపథమునఁ బడఁడు
కడచినవానికిఁ గడిదిశోకాగ్నిఁ, బడ నేల తాలిమిఁ బాటింపు మింక
వగవకు నీకును వలయునర్థంబు, నొగి నిచ్చి ఖరునొద్ద నునిచెద నిన్ను
ఖరుఁడు నీ వనుజవు గాన నీమాటఁ, పరమప్రియంబున బాటించి నడుపు
రక్కసుల్ దండకారణ్యంబునందుఁ, దక్కక చరియింప దానవగురుఁడు
శపియించినాఁ డది సత్యంబు గాన, విపులతేజమున నావిపినదేశమును
ఖరుఁ డేలఁదగు నంచుఁ గామరూపములఁ, బరఁగునిశాచరుల్ బదునాల్గువేలు
మానుగాఁ గొలువఁగ మహిమ దూషణుఁడు, సేనాధిపత్యంబు సేయఁజాలించి,
కోరినధనములు కొఱఁత లేకుండ, నారాక్షసున కిచ్చి యనుజ నీ వెలమి
ఖరునొద్ద నుండుదు గా కంచుఁ బలికి, కరము గారవమార ఖరుని వీడ్కోలిపె
నతఁడును సేనతో నరిగి శాత్రవుల, తఱిగొని సమయించి దండకాటవిని
భీకరగతితోడఁ బృథులతేజంబుఁ, జేకొని రాజ్యంబు సేయుచునుండె
నఁతని కుంభిళ యనువనంబునకు, సంతోషమున నాదశగ్రీవుఁ డరిగి
తిరముగా నందంద దిశలు వాసించు, నురుగంధముల నొప్పు హోమధూమములఁ
బెక్కుయూపంబులఁ బెక్కువేదికల, నక్కజం బగుచున్న యజ్ఞవాటమున
బహుపవిత్రోదకభరిత మై కేల, మహనీయరుచిఁ బొల్చు మణికమండలువుఁ
బొలుపాఱ దర్భయు భూరివక్షమున, నలువారు కృష్ణాజినము నోలి మెఱయ
మేఘనీలద్యుతి మే నొప్ప నొప్పు, మేఘనాదుని గాంచ మేదురప్రీతి
నడర విభీషణుఁ డర్థంబుఁ గులము, గడతేర్చునడవడి గలిగి వర్తించి
పన్నుగా సాధులఁ బట్టి బాధించు, చున్న నీ కపకీర్తి యొకటి వాటిల్లె
మనపెద్దతాతకు మాల్యవంతునకుఁ, దనయ పుష్పోత్కట తత్పుత్రి మనకుఁ
దలఁపఁ గుంభీనస ధర్మంబునందు, చెలియలు తగకీడు చెప్పెద వినుము
రావణమధు వను రజనీచరుండు, నీవు జయార్థివై నెమ్మితోఁ జనుట
నీతనూజుఁడు యాగనిష్ఠ గైకొనుట, నాతతమతి నేను నఘమర్షణంబు
దొరకొని నియతి మైఁ దుదిముట్టుదాఁక, నిరతంబు గాఁగ నగ్నిష్టోమమఖము
గురుకొని సేయంగఁ గుంభకర్ణుండు, నెరయ నిద్రించుట నిజముగాఁ దెలిసి
తనర నీలంకలోఁ దన కడ్డువడిన, మనయమాత్యుల నెల్ల మడియంగఁ జంపి
యంతఃపురము సొచ్చి. యచ్చెల్వఁ గొనుచు, నెంతయు వడి నేగె నే నది వినియుఁ
దగవుతోఁ బిలిచి యాతరళాక్షి యొక్క, మగ నేగి వలచుట మగఁడు గా నతఁడు
తగినవాఁ డగుటయుఁ దగ విచారించి, తగదింకఁ దెగనంచుఁ దమకింపనైతి
నీతితో నూహించి నీకుఁ బొందైన, యాతెఱఁ గొనరింపు మనిన రావణుఁడు
కన్నులఁ గెంపారఁ గరమల్కఁ జూచి, యెన్నఁగా మధు వన నెవ్వఁడు నాకు
నరదముల్ బన్నుఁడు హరులఁ గట్టుండు, సరిజోళ్ళు పెట్టుఁడు సామజంబులకు
నాటోపములతోడ నలవులు మెఱసి, మేటిరక్కసులార మీవాహనముల
మీరినజయశాలి మేఘనాదుండు, ఘోరవిక్రముఁడగు కుంభకర్ణుండు
మున్నుగా నందఱు ముదముతో నడువ, సన్నద్దులై రండు సమరంబులోన
మధువను దానవు మర్దించి పిదప, నధికసంపదలకు నావాసమైన
రావణుఁడు దేవేంద్రునిపై యుద్ధమునకుఁ బోవుట
యమరలోకముమీఁద నరిగి కయ్యమున, నమరేంద్రు నోడించి యతనిచే నేను
నీవాఁడ ననిపించి నిర్వైరమునను, నే వచ్చి నెమ్మది నీలంకలోన
వలసిన భోగముల్ వరుసఁ గైకొనుచుఁ, జెలువొంద రాజ్యంబుఁ జేసెద ననుచు
నున్న యుద్భటబాహుయుగరోచు లెసఁగఁ, బన్ని యక్షోహిణుల్ పదివేలు గొలువ
నంత నందఱఁ జూచి యాదశాననుఁడు, సంతోషమున విభీషణు లంక నునిచి
వడి మేఘనాదుఁ డన్వాఁడు పెన్మొనకుఁ, గడఁగి ముందటఁ గుంభకర్ణుఁడు నడువ
వెనుకమై దానును వేదండఘటలుఁ, గనుపట్టురథముల ఘనఘోటకములఁ
గాసిల్లు ఘోరోరగముల నుష్ట్రముల, వేసడంబుల నెక్కి వెస నిశాచరులు
తెఱపి లేకుండంగ దిక్కులు నిండి, తఱుచు వాద్యములతో దళములతోడ
విడువక సురలతో వైరంబుఁ గొన్న, కడిది దానవులును గడఁక నీక్షించి
తనవెన్కఁ జనుదేఱ దర్పరోషములు, మనమారఁ జని చొచ్చె మధువుపట్టనము
నంత కుంభీనస యదియెల్ల నెఱిఁగి, చింతించి భయమునఁ జిత్తంబు గలఁగి
పఱతెంచి యడుగులఁ బడిన రావణుఁడు, వెఱవక లెమ్మని వెసఁ గేల నెత్తి
యేమి ప్రియంబైన నేఁ జేయువాఁడ, నేమిటిఁ దరుణి నీ వెఱిఁగింపు మనిన
నాకొఱకై దేవ నాభ ర్త మధువు, గైకొని ప్రాణముల్ గావంగవలయు
నభయంబు నీ విప్పు డానతి యిచ్చు, టభిమతం బిది నాకు నని పల్క నతఁడు
కరుణ గుంభీనసఁ గనుఁగొని నీకుఁ, బురుషుండు గాన నాబుద్ధి నూహించి
మధువుఁ గాచితి నేను మధు వేల రాడు, మధువుఁ దోడ్కొని రమ్ము మధువుతోఁగూడ
జంభారి గెలువంగఁ జనియెద ననినఁ, గుంభీనసయు నేగి కొమరొప్పఁ గదిసి
నిదురవోవుచునున్న నిజనాథు మధువు, మృదుకరాంబుజముల మెల్లన తెలిపి
యధికుఁడు మాయన్న యగుదశగ్రీవుఁ, డధికసైన్యముతోడ నమరేంద్రపురికిఁ
జనుచుండి నినుఁ బిల్వఁ జనుదెంచినాఁడు, మనకు బంధువుగాన మైత్రి వాటించి
నీవు తో డేగుట నెరయఁ గార్యంబు, నావుడు నలరి యానక్తంచరుండు
వచ్చిరావణుఁ గాంచి వరుసతో వాని, నచ్చగాఁ బూజింప నాదశాననుఁడు
మధువీట నాఁ డుండి మఱునాఁడు గదలి, మధువుతోఁ గొల్చి రామహిమతో నరిగి
కలధౌతగిరిమీఁదఁ గలయంగఁ సేన, నలవడ విడియించి యందుఁ దా నమర
భానుప్రభాజాలపరితప్తభువన, మానందమును బొంది యలర నంబోధి
నిక్కంగ విరహుల నిట్టూర్పు లెసఁగ, దిక్కులఁ బొదివిన తిమిరంబు విరియ
నెలిమిఁ జకోరంబు లెదురులు సూడఁ, గలువలు నవచంద్రకాంతముల్ గరఁగ
నలఁతమై కనుమోడ్చు నాసేనతోడ, జలజముల్ నిద్రింపఁ జంద్రుండు పొడిచె
నప్పుడు దశకంఠుఁ డన్నగాగ్రమున, నొప్పంగ నేకాంత మొకచోట నుండి
మందాకినీముఖ్యమహనీయనదుల, నందంద కమలకల్హారమాలికలు
నలువారఁ బట్టుచు నవకర్ణికార, ములతోడ నళికులముఖరఝంకార
నవపుష్పగంధముల్ నలువొప్పఁ దెచ్చి, సవరిల్లఁ బుప్పొడిఁ జల్లుచునుండ
నుల్లంబు వికసింప నొయ్యన వీచు, చల్లనిగాలికిఁ జాల మెచ్చుచును
విత్తేశుకొలువన వీనుల కింపు, లొత్త నచ్చరలేమ లొగిఁ బాడ వినుచు
నిటమీఁదఁ దనమీఁద నేవెల్లివచ్చు, పటుభంగమరునంపపదువులమాఁడ్కి
మారుతాహతిలతల్ మవ్వుంపువిరులు, సూరెలఁ జల్లఁగా సుఖము గైకొనుచు
రేఁగిన నవపుష్పరేణువుల్ దొప్ప, దోఁగి పూఁదేనియల్ దొరఁగఁ గైకొనుచుఁ
గ్రందుగా బహుపుష్పగంధముల్ చల్ల, మందమారుతముచే మానంబు దూలి
కాముఁడీ విభవంబు కడుమించి తన్నుఁ, గామమోహితుఁ జేయఁగా వెచ్చనూర్చి
రావణుఁడు రంభం జూచుట
యందంద రుచిజాల మడరంగ వెలుఁగు, చందురుఁ జూచు నాసమయంబునందు
రోలంబకులనీలరుచిఁ బొల్చుకచము, బాలచంద్రుని బోలు ఫాలరేఖయును
సోముఁడు కామారి సూడు సాధింపఁ, గామునమ్ములు విల్లుఁ గైకొన్నకరణి
మురిపెంబు నిండారు ముఖమండలమున, సొరిది చెన్నగు వాఁడిచూపులు బొమలు
యవిరళరేఖమై నమరంగఁ బొల్చు, నవకుందకళికల నవ్వుదంతములు
పానాభిరతిఁ దన్నుఁ బట్టినవారి, మానుపఁజాలని మధురాధరంబు
కందుసుదాధారఁ గడిగిన వెలుఁగు, నిందుబింబముతోడ నెనవచ్చు మోము
కంబుసన్నిభమైన కంఠంబు పసిఁడి, పంబినజిగి మించు బాహుమూలములుఁ
గర మొప్పు నవపుష్పకాంతిఁ జెన్నారు, కరపల్లవంబులుగల బాహులతలు
నిండారుపెంపున నిక్కి క్రిక్కిఱిసి, యొండొంటితో రాయు నురుకుచద్వయము
నారు చెన్నారుట నాస్తివాదమున, కారఁగ నవకాశ మైన నెన్నడుము
రోమావళీధూమరుచిరమై కాము, హోమకుండముక్రియ నొప్పునాభియును
మదనుజయోత్సవమహిమ సూచించు, కదళికాయుగళంబుగతి యూరుయగము
రతిరాజవరతపోరాశినాఁ దనరు, నతిదీర్ఘమేఘలంబగు నితంబమును
భావజు వాటించు పసిఁడితూణికల, కైవడి చిత్తంబుఁ గలఁచు జంఘలును
జిత్తంబు లలరంగ జిగుళుల గడచు, మెత్తనియడుగులు మెఱుపారు నడుపు
కనకరేఖాకాంతి గడగడపఱచు, తనువల్లికయు వీణఁ దలఁపించు నెలుఁగు
చెన్నారునప్సరస్త్రీలలో నెల్ల, మున్నెన్నఁదగు జగన్మోహనస్ఫురణ
చారులక్షణకళాసౌభాగ్యవతుల, కారయ నుపమాన మగుచున్నరంభ
యున్నతస్థనకుంభయుగళభారమున, నన్నువుకొఁదీగె యసియాట కులికి
చెలువున నేమంబు చింతించె ననఁగ, గొలఁదిభూషణములు కొమరారఁ బూని
కొన్నియు విరు లొప్పఁ గొప్పునఁ దుఱిమి, సన్నపునునుబూఁత చదునుగాఁ బూసి
కట్టినపుట్టంబుకప్పు ద న్గప్ప, మెట్టుచో మట్టియల్ మెలపునఁ దాఁక
మనసిజమంత్రంబు మఱవక లోన, మునికిన ట్లందియల్ మొగి నొయ్య మొఱయ
నవిరళగతిఁ గాముఁ డమరించు కోలు, దివిరి యాకెంగెలుదీప్తి రాగిల్ల
వలనొప్ప మన్మథధ్వజమానరుచుల, గెలిచి దృష్టలు భీతి గెలఁకులఁ బొలయఁ
దాలిమి దూలించి తావిలేజెఁమట, ................................................
తరళభావంబగు తమకంబుతోడ, నరుగంగఁబొడఁ గని యడ్డ మేతెంచి
నలినసంకోచంబునకు మ్రోయు మధుప, వలయంబుగతి రత్నవలయంబు మెఱయ
బిగియాఱఁ గెంగేలు పెనుగేలఁ బొదివి, మొగము దప్పక చూచి ముదముతోఁ బలికె
నీగతి రంభ నీ వెవ్వనికడకు, భోగింపఁ జనియెదు పుణ్యుఁ డెవ్వాఁడు
కలికికన్నులుల నల్గల్వలనవ్వు, పొలఁతి పున్నమచంద్రుఁ బోలు నీమోము
అధరామృతము నింద్రుఁ డమరంగఁ గ్రోలు, విధమునఁ గ్రోలెడు విటవీరుఁ డెవఁడు
పాఠీనలోచన పసిఁడికుంభముల, కాఠిన్యకాంతులఁ గడుఁగీడు పఱపఁ
జాలు నీవట్రువచన్ను లేధన్యుఁ, డాలింగనము సేయ నర్హుఁ డెవ్వాఁడు
కాంచనచక్రంబుగతి నొప్పి రత్న, కాంచిఁ జెన్నారు నీఘననితంబమున
నెయ్యంబు సలిపెడి నేర్పరి యెవ్వఁ, డియ్యెప్పు గలనీకు నెవ్వఁడు కోర్కి
జగదేకశుభగుమడ చతురుఁడ ఘనుఁడఁ, దగునె కామిని నన్ను దాఁటి నీ వరుగఁ
దనుమధ్య యీశిలాతలమధ్య మొప్పు, ననురక్తి నిందు న న్నలరింపఁదగుదు
సకలలోకంబులు శంకింప లంక, నకలంకగతి నేలునట్టిరావణుఁడ
వెడనింటివానికి వెఱచి ని న్నభయ, మడుగఁగ ముకుళితహస్తుఁ డైనాఁడఁ
కొని రతికేళిఁ గాంతుగా కనిన, నాకంపమును బొంది యతనితో ననియె
నాకు మామవు నీవు నక్తంచరేంద్ర, నీకు గోడల ముట్ట నీతియె తలఁప
భయము నా కొండెడఁ బాటిల్లకుండ, దయతో రక్షింపఁదగియెడు నీవ
విరసంబుగానిట్లు వీనులు చొరని, పరుసంపుపాపముల్ పలికితి వనుచు
విన్న నై వదనారవిందంబు సాఁచి, యున్న యద్దశకంఠుఁ డుత్కంఠ మిగుల
నెక్కడికోడల వేపుత్రునాల, వెక్కడిమామ నే నెలనాఁగ నీకు
నీ కేల బొం కన్న నీయన్న ధనదుఁ, డాకుబేరుని పుత్రుఁ డగుగుణోజ్జ్వలుఁడు
నలకూబరుడు నాకు నాథుండు గాఁడె, .........................................
యతనికి నే గూర్తు నాతఁడు నన్ను, మతి ననురక్తుఁడై మన్నించియుండు
గైసేసి యాతనికడకు నేఁ జనఁగ, దోసంబుఁ దలఁతువే దోషాచరేంద్ర
యిది యేల తడసెనో యింతప్రొ ద్దనుచు, నెదురుచూచుచునుండు నింతకుఁ బ్రియుఁడు
ప్రొద్దువోయెను నన్నుఁ బొమ్మను నీవు, పెద్దలు నడచిన పెనుత్రోవ నడువు
మారయ నధికుండవైనను నీవు, నీరు వట్టైనచో నేయి ద్రావెదవె
యనుడు నప్పౌలస్త్యుఁ డనియె నీదిట్ట, తనము వేశ్యల కెందు ధర్మంబు గాదు
వెలయాలుఁ జెలమయు వీథియు వనముఁ, జలిపందిరయు సర్వజనులకు సమము
లంజ యెవ్వనియాలు లలన యీమేర, కంజ నేటికి నీకు నప్సరాంగనలు
కాముదీమంబులకరణి కాముకుల, తామసంబున ముంచి తమకంబు పెంచి
వలరాజువలకు దీవలఁతురుగాక, వలఁతురె మదిలోన వారకామినులు
కుటిలంపుఁగనుబొమల్ కొమరారువిండ్లు, పటుకటాక్షంబులు బాణజాణములు
భామినిపలుకులు బాణమంత్రములు, కాముకచిత్తముల్ ఘనశరవ్యములు
గాలీల మెలఁగు ని న్గనుగొన్నమీఁదఁ, దాలిమి గలుగునె తనుమధ్య యనుచు
లాఁతిమించుల చూపు లలితకక్షములుఁ, బ్రాఁతి చన్నులు దోపఁ బయ్యెద దొలఁగఁ
బలువిడి నంటఁగఁ బట్టి పూఁగొమ్మ, నలఁచిన ట్లాలింగనంబుఁ గావించి
కుంభికుంభస్థలగురునితంబమును, రంభానిభోరులు రణితమేఖలయు
గంభీరనాభియుఁ గడుకాంక్షఁ బెనచి, సంభోగ మిమ్ముల జరపి పొమ్మనియె
నంత నారంభయు నంభోజసరసి, దంతి సొచ్చిన చొప్పుఁ దనకు వాటిలిన
చింతాపరంపరల్ చిత్తంబులోన, నంతకంతకు దట్టమై గడల్కొనఁగఁ
దలఁకుఁ గొంకుచుఁ దనలోనఁ దాను, బలుకుచుఁ బులిబారిఁ బడి విడివడిన
నలకూబరుండు రావణుని శపించుట
హరిణిచందంబున నడ తొట్రుపడుచుఁ, బిరిగొన్న దురవస్థఁ బ్రియుపాలి కరిగి
యనుగులఁ బడి లేచి యందంద మేను, వడఁకంగ వదనంబు వాంచి హారములు
బెనఁగొన ననయంబుఁ బ్రిదులలోఁ జెరివి, కొనినపువ్వులగ్రంధి క్రొమ్ముడి వీడఁ
దొంగలిఱెప్పలఁ దొరఁగు బాష్పములు, తుంగస్తనంబులఁ దోఁగినట్లున్నఁ
గనుఁగొని యిది యేమి కాంత నీచంద, మనవుడు నాలేమ హస్తముల్ మొగిచి
నడకుచుఁ బలుకను నాలుక రాక, కడుఁ దూలి గద్గదకంఠయై పలికె
యేను నీయొద్దకు నేతే రనింద్రు, పై నెత్తిపోవుచుఁ బఙ్క్తికంధరుఁడు
సేనతోఁ గలధౌతశిఖరిపై విడిసి, తా నందు నను గాంచి దర్పా౦ధుఁ డగుచు
నేను గోడల నన నెరి నంటఁబట్టి, నానమాలఁగ బిట్టు ననుగాసి సేసె
కావున నీతప్పు గావంగవలయు, నావుడు నలిగి యానలకూబరుండు
యొకకొంతదడ వాత్మ నూహించి చూచి, సకలంబుఁ గని కృతాచమనుఁడై కేల
జలములు గొంచు నాజలజాక్షిఁ జూచి, బలవంతుఁడైన యాపఙ్క్తికంధరుఁడు
కొంకక నిను బట్టికొనుటఁ జూడంగఁ, బంకేరుహాసనుబలిమియే యౌను
ఇది మొదలుగఁ బల్మి నెవ్వతెనైనఁ, గదిసి యి ట్లుపహతిఁ గావించెనేనిఁ
బదిశిరంబులు నూఱువ్రయ్యలై దర్ప, మదరంగఁ జెడుఁగాత మని శపించుటయుఁ
గరమున శాపోదకము లుర్విఁ బడఁగఁ, బొరిపొరి వర్షించెఁ బుష్పవర్షములు
సురదుందుభులు మ్రోసె సురలు సంతోష, భరితమానసు లైరి పరమేష్ఠి నగియె
రావణుఁ డదిమొదల్ రతికేళి బలిమి, గావింపకుండె నాఘనశాప మెఱిఁగి
రాజేంద్ర యాతఁ డారాత్రి వేగుటయు, రాజిల్లు సేనతో రజతాద్రి గడచి
నడువంగఁ బెనుమ్రోఁత నాకంబునందుఁ, గడుఘోర మయ్యె నాకలకలం బరసి
యిచ్చలోఁ దనమీఁద నెత్తి రావణుఁడు, వచ్చుచున్నాఁడని వాసవుం డెఱిఁగి
వసువుల రుద్రుల వఱలుతేజమున, నెసఁగునాదిత్యుల నెల్లసాధ్యులను
ఘనకీర్తులగు మరుద్గణములమహిమ, దనరువిశ్వేదేవతలఁ జూచి పలికె
నుద్ధతి మనతోడ యుద్ధంబు సేయ, బద్ధవైరముఁ గొని పఙ్క్తికంధరుఁడు
చనుదెంచె నతిఘోరసైన్యంబుతోడ, ననికి మీ రాయత మగుఁడంచుఁ బలికె
ఇంద్రుఁడు విష్ణుదేవునితో రావణుఁడు దాడివచ్చినది తెల్పుట
రావణు గెలువంగ రామి చిత్తమున, భావించి యట విష్ణుపాలికి నరిగి
ముకుళితహస్తుఁడై ముందట నిలిచి, సకలేశ నాతోడ సంగరంబునకు
బాహుదర్పితుఁడైన పఙ్క్తికంధరుఁడు, వాహినీసహితుఁడై వచ్చుచున్నాఁడు
వారిజాసనదత్తవరశక్తిఁ జేసి, వారిజోదర దుర్నివారుఁడై తిరుగు
నరకాసురునిపుత్రు నముచి నాబలుని, బరిమార్చు టేను నీబలిమిని గాదె
యాదినారాయణుండవు నీవు దక్క, నాదట మముఁ బ్రోవ నన్యు లోపుదురె
యిన్నిలోకములకు నేలిక వీవు, న న్నింద్రుఁ గావించినాఁడవు నీవు
దేవ మాకెల్లను దిక్కవు నీవ, కావున నసియుఁ జక్రముఁ గేలఁ బూని
దానవాంతక వచ్చి దశకంఠుఁ దునిమి, మానుగా రక్షింపు మమ్ము నీ విపుడు
ననవుడు నవ్విష్ణుఁ డమరేంద్రుఁ జూచి, విను పురందర నాకు వేళ గా దలుగ
శూరపుంగవులైన సురలతో గూడి, ఘోరనిశాచరకోటిమధ్యమున
ధాతవరంబున దర్పించియున్న, యాతఁడు దివిజుల కవిజేయుఁ డరయ
నేను వచ్చితినేని నెబ్భంగినైన, వానిఁ గయ్యంబున వధియింప కుడుగ
బ్రహ్మ దేవతలందుఁ బరికింప ఘనుఁడు, బ్రహ్మవరంబు నే పాటింపవలయు
నటుగాక నీదగు నభిమతం బిపుడు, ఘటియింప దిటమీఁదఁ గర్తవ్య మగుట
ననిమిషు లలరంగ నానిశాచరుని, నని నేనె చంపెద నదియు న ట్లుండె
నమరులతోఁ గూడి యతనితో నీవు, సమరంబు గావింపు సకలయత్నముల
వెఱవక పొమ్తన వినతుఁడై మరలి, వఱలుతేజముతోడ వజ్రి యేతెంచె
నంత నాదిత్యాదులగు సురల్ వెడలి, సంతతసాయకాసారఘోషంబు
బహువిధాయుధదీప్తి బహుళంబు గాఁగ, నహమికతోడను నడర రాక్షసులఁ
దలఁపడఁగా నందు దారుణస్ఫురణ, వెలుఁగుచు నార్పుల వినువీథి వగుల
మారీచుఁడను మహామాయాధికుండు, శూరముఖ్యుఁడు ప్రహస్తుఁడు మహోదరుఁడుఁ
గడునుగ్రుఁడు మహాకాయుండు నుద్ద, విడిమహాపార్శ్వుడు వెస మహాశనుఁడు
నగసన్నిభుఁడు మహానాదుండు నెన్నఁ, దగిన పోటరి మహాదంష్ట్రుఁ డన్వాఁడు
ప్రకటవిక్రముఁ డకంపనుఁడు సారణుఁడు, శుకుఁడు నికుంభుఁడు సూర్యవర్తనుఁడు
భీషణాంగులు మహాభీషణసుప్త, దూషణదుర్ముఖధూమ్రకేతువులు
సరవీరదారాక్షసంధకు లనఁగ, నరిదివీరులు విరూపాక్షుఁ డన్వాడు
దీపించుమఖరుఁడుఁ ద్రిశిరుఁడు యజ్ఞ, కోపుండు దేవాంతకుఁడు నరాంతకుఁడుఁ
దను గూడుకొని భుజాదర్పమల్ జూపఁ, గనలు నిర్జరసేనఁ కణకతోఁ జొచ్చి
రామ సుమాలియన్ రాక్షసవీరుఁ; డామహావాహిని నలుకఁ దాఁకుటయు
వడి నప్పు డష్టమవసువు సావిత్రుఁ, డదరంగ దేవగణాన్వీతుఁ డగుచు
మృత్యుదేవతభంగి మీరి రాక్షసుల, కత్యంతభయముగా నాజికిఁ దొణఁగె
నందుఁ బూషత్వష్ట లనఁగ నాదిత్యు, లందు వాలినవీరు లందంద గడచి
యసమానగతిఁ దాఁక నవ్వీఁకఁ జూచి, యసము డింపక తారునమ్మహాబలులు
బెరసి తోమరములు భిందివాలములుఁ, గరవాలములుఁ బరిఘలు శూలములును
శరములుఁ జాపముల్ చక్రముల్ గదలుఁ, బరశువుల్ శక్తులుఁ బట్టిసంబులును
ముసలముల్ సబలముల్ మొదలుగా నొక్క, వెస నాయుధంబులు వెరువులు మిగిలి
ధట్టనల్ మథన ముద్ధతులుఁ బంతములు, నట్టహాసంబులు నన్యోన్యహతులుఁ
జండహుంకృతులును శస్త్రఘట్టనలు, నొండొరుఁ గని మండు నుగ్రకోపములు
నుభయసైనికులందు నొక్కటఁ జెలఁగ, రభసంబుతోడ నారాక్షసుల్ దఱిమి
సురసేనఁ గెడప నాసురలు కోపించి, బిరుదు మొత్తములకుఁ బెల్లుగాఁ గదిసి
తొరఁగుశోణితములుఁ దునియునంగములుఁ, బొరిపొరి తునియలై పొలియుకైదువులుఁ
దెగుబాహుదండముల్ దెఱచువక్త్రములు, .........................................
నుఱుమగు నెమ్ములు నులియునంగములు, విఱుగునూరులు వెలివెడలుప్రేవులును
డొల్లుమస్తకములు డుల్లుదంతములు, గుల్లలతిత్తులై కూలు బొందులును
బొడిపొడియై రాలు భూషణావళులు, నుడువక వడి మ్రోయు నుగ్రపాతములు
నిలు నిలు మనుటలు నిలిచి పెన్మంట, లలుగులు చెదరంగ నంటఁదాఁకుటలు
దారుణగతిఁ జేసి దశకంఠుసేనఁ, బోరిలోఁ గెడపిరి భూరిదర్పమున
నంత సుమాలియు నత్తెఱంగునకు, నెంతయుఁ గిన్క ననేకాయుధముల
దివిజసైన్యము నొంచి దివ్యబాణంబు, లవిరళగతిఁ బెక్కు లడరించి మించి
ఘనరాజిఁబోలు పెన్గాలిచందమున, ననిమిషావలిఁ దోలి యచట మార్పడిన
వీరులఁ బటుశూలవృష్టిని ఘోర, నారాచవృష్టిని నలిరేఁగి ముంచె
నంత నాదిమవసు వైనసావిత్రుఁ, డంతయుఁ గనుఁగొని యధికరోషమున
సేనాసమేతుఁడై చెలఁగి ప్రేరేఁప, వాని నాతనిసేన వడిఁ గుప్పగూల్చె
నారాక్షసునితోడ నఖిలాయుధములు, సారించి విడువక సరి పోరిపోరి
బలువిడి నతఁడు నప్పన్న గరథము, బలునారసము లేసి భగ్నంబు చేసి
యింక నీమదమున నీయాయుధమున, కిఁకఁ జొప్పడ నేను గెడపెద ననుచుఁ
గాలదండముఁబోలు ఘనగదాదండ, మోలిమంటలు మింట నొండొండ నెగయఁ
గరమున నమరించి కల్పాంతసమయ, పరుషార్కపరివేషభంగిగాఁ ద్రిప్పి
యురువడి నుంకించి యురముపై వైవ, నరుదు గదాహతి నాసుమాలియును
అతిరోషనిర్ఘాతహతిని ద్రికూట, గతిఁ గూలె గూలినఁ గని నిశాచరులు
వడిఁ బాఱుటయుఁ జూచి వసుధపై నేచి, మిడికి కోపముతోడ మేఘనాదుండు
పాఱునారాక్షసభటుల నెల్గెత్తి, పాఱకుఁ డిది యేల పాఱెద రనుచుఁ
గ్రమ్మఱ మరలించి కామగం బైన, యమ్మహారథ మెక్కి యమ్మహారథుఁడు
బహువిధాయుధదీప్తిపటలంబుచేత, సహజతేజంబులఁ జాలంగ మెఱసి
వాఁడిమి దావాగ్ని వట్టినపొదలు, మాఁడించువిధమున మార్గణావళులఁ
బొరిపొరి సేనలఁ బోరిలోననడవ, సురలు నయ్యురువడి చూచి కంపించి
నెఱసినభీతితో నిలువంగలేక, పఱచి రాదెసఁ జూచి పాకశాసనుఁడు
వీఁడె నాతనయుండు విక్రమోజ్జ్వలుఁడు, వాఁడిమిఁ గడుమీఱి వచ్చుచున్నాఁడు
పఱవకుఁ డొక్కింత పదిలు లై నిలుఁడు, వెఱవక మగుడుఁ డీవేగ మీ రనుఁడు
నాయుధపాణులై యాసురల్ మగిడి, రాయతద్యుతి నప్పు డరదము మెఱయ
నాజయంతుం డుద్భటాటోప మెసఁగ, నాజికిఁ జనుదెంచె నంత పై నడరి
కింక రాక్షసులతో గెరలి దేవతలు, లంకేంద్రసుతుతోడ లలి నింద్రసుతుఁడు
వెస నాయుధంబుల విస్ఫులింగంబు, లెసఁగంగఁ దాఁకి రయ్యెడ నింద్రజిత్తు
పసిఁడిపింజల నొప్పు బాణముల్ దొడిగి, యసమానగతి నాజయంతునిసూతు
గోముఖుం డనువానిఁ గొనికాఁడ నేసె, నామహోద్ధృతిఁ జూచి యమరేంద్రసుతుఁడు
నింద్రజిత్తునిసూతు నేసెఁ బెక్కమ్ము, లింద్రజిత్తునిమీఁద నేసె నేయుటయు
భూరికోపంబున బొమలు గీలించి, యారాక్షసుండును నరుణాక్షుఁ డగుచు
ధను వింద్రధనువును దాను మేఘంబు, సునిశితాయుధమరీచులు మెఱుంగులుగ
భీమాట్టహాసముల్ బెడిదంపుటుఱుము, గా మహోగ్రతతోడ ఘనబాణవృష్టి
సురురాజసుతు ముంచి సురసేనమీఁద, నురుతరకోదండ ముగ్రమై మెఱయఁ
బొరిపొరి పుంఖానుపుంఖముల్ గాఁగ, శరములు వఱపె నాశరపరంపరలు
దెసలు నాకసమును దెఱపి లేకుండ, వెసఁ గప్పి నప్పుడు విశిఖముల్ దాఁకి
కడుభీతితో సురల్ గనుకని పాఱ, నడరునాఘనసాయకాంధకారమున
నితఁడు నక్తంచరుం డితఁడు నిర్ణరుఁడు, ప్రతివీరుఁ డితఁడని పరికింపరాక
తొడిబడి రాక్షసుతోడ రాక్షసుఁడుఁ, గడిమి నిర్జరుతోడఁ గడఁగి నిర్జరుఁడు
ననుపమస్థితిఁ బోర నపుడు పులోముఁ, డనియెడి దైతేయుఁ డాయి౦ద్రతనయు
ననికిఁ దొలఁగించి యంబోధికడకుఁ, గొనిపోయె బృందారకులు భయం బంద
వాసవసుతుఁ దోలి వడి మేఘనాదుఁ, డాసురగతి నేచి యఖిలరాక్షసులు
జలజభవాండంబు సందులువగుల, నలినార్వగా సింహనాదంబు సేసె
నప్పుడు దేవేంద్రుఁ డతనివిక్రమము, తప్పకంతయుఁ జూచి తనపుత్రుఁ డనికిఁ
దొలఁగిపోవుటఁ జూచి తూలి దిక్కులకు, నిలువక పాఱెడు నిజసేనఁ జూచి
ఇంద్రుఁడు యుద్ధమునకు వచ్చుట
యెదిరి శాత్రవు గెల్వ నిదివేళ యనుచు, మది నేచి తనసూతు మాతలిఁ జూచి
సమరసన్నాహంబు సమకొల్పి నాకు, నమరంగ రథముఁ దెమ్మని పల్క నతఁడు
జవనాశ్వములఁ బూల్చి సకలాయుధములు, నవిరళద్యుతులార నమరించియున్న
తేరు నానారత్నదీప్తిజాలంబు, ఘోరమై దీపింపఁ గొనివచ్చె నెలమి
నంత రథారూఢుఁడై పురందరుఁడు, సంతోషమున దేవసమితిమధ్యమున
నచ్చర లాడంగ నమరులు గొల్వ, నచ్చుగా వాద్యంబు లందంద మ్రోయ
వరమూర్తు లెనమండ్రువసువులు నడువఁ, బరువడి రుద్రులు పదియు నొక్కండ్రు
కోపించి నడువఁ గైకొనక యాదిత్యు, లేపునఁ బూని పన్నిద్దఱు నడువ
నొనరు మొత్తంబులై యుఱుములతోడఁ, బెనుమెఱుంగులతోడఁ బిడుగులతోడఁ
గరము భీకరలీలఁ గాలమేఘములు, కెరలుచుఁ దన కిరుగెలఁకుల నడువ
నడచె నాజికి నిట్లు నలిరేఁగి నడుచు, నెడనెడఁ బెనుగాలి యెదురుగా వీచె
నుగ్రాంశుమండలద్యుతి చాలఁ దూలె, నుగ్రంబుగాఁ గూలె నుల్క లెల్లెడల
నాసమయంబున నట్లు రావణుఁడు, వాసవుఁ డని సేయవచ్చుటఁ జూచి
రోమహర్షణఘోరరూపంబులైన, పాములచే మహాభయదమై యు౦డ
భర్మరత్నోజ్ఞ్వలప్రభ లొప్ప విశ్వ, కర్మ నిర్మించిన ఘనరథోత్తమము
వెస నెక్కి రాక్షసవీరసంఘంబు, లసురసంఘంబుఁ ద న్నలమి కొల్వంగ
జనుదెంచి రణకళాచతురుఁడై మెఱయు, తనయగ్రనందనుఁ దనర నీక్షించి
యీనిలింపుల గెల్వ నీయింద్రుఁ బఱప, నేనె చాలుదుఁ బుత్ర యితఁ డెంతవాఁడు
నిలువుము నీ వన్న నిలువకతోన, నలువున నమ్మేఘనాదుండు నడువ
దిక్కు లార్పుల వ్రయ్యఁ దెగువతో నడచె, నక్కజంబుగ దర్ప మడరఁగ నపుడు
రెండుసేనలవారు రేగి యొండొరులఁ, జండాట్టహాసముల్ సరిఁజెల్ల దాఁకఁ
గతుల విదలింప గదల నొప్పింపఁ, నత్తళంబులఁ జింప నమ్ముల ముంపఁ
గరవాలములఁ ద్రుంపఁ గడిదిచక్రముల, సరిఁదెంప నొగిఁ బట్టసముల ఖండింప
శక్తుల నదరింప శాతశూలముల, రక్తముల్ దొఱఁగింప రణ ముగ్ర మయ్యెఁ
గడిమి నప్పుడు కుంభకర్ణుండు రెండు, కడలవారికిఁ జూడఁ గడునుగ్రుఁ డగుచు
భూరిభూధరములఁ బొరి మహాశిలల, ఘోరంపుశక్తులఁ గ్రూరబాణములఁ
గనలుతోమరములఁ గఠినహస్తముల, ఘనపాదముల నొగిఁ గర మల్కతోడఁ
బెక్కుభంగుల గిట్టి పెక్కండ్రు సురల, నక్కజంబుగ నొంప నమ్మహోద్ధతికి
రుద్రులు సాధ్యులు రోషాగ్ను లెసఁగ, నద్రిఘోరాకారు నాకుంభకర్ణు
దలపడి శస్త్రాస్త్రతతుల నంగములు, కలయంగ నొప్పింపఁగా నప్పు డతఁడు
ఆయుధక్షతము నందంద వెడలు, నాయతాసృర్ధారలవని పైఁ దొఱఁగఁ
గోపారుణాననఘోరానలంబు, దీపింప నలుగులు ద్రిప్పి యార్చుచును
సలిలధారలతోడఁ జండాంశుబింబ, కలితమై మెఱుఁగులు గలిగి గర్జిల్లు
కాలమేఘముభంగిఁ గదియ నాలోనఁ, జాలి మరుద్గణసహితులై సురలు
వివిధముఖంబుల వివిధాయుధములఁ, దివిరి రాక్షససేన దెరలించి పఱప
నఱిమి కొందఱు చచ్చి రాహవక్షోణిఁ, గొఱప్రాణములతోడఁ గొందఱు పడిరి
కొంద ఱుగ్రాయుధఘోరఘాతములఁ, గ్రందుగాఁ గనుగడికండ లై పడిరి
పైశాచముఖములు బహువాహనముల, డాసి రథంబుల దండుల హరుల
ఖరములను మొసళ్ల ఘనవాహనముల, నురువిహంగంబుల నుగ్రసర్పములఁ
గనుకని భీతిమైఁ గౌఁగిళ్ళన ఱిమి, కొనియుండి రాహవక్షోణీతలంబు
చిత్రరూపంబులఁ జెలువారి యపుడు, చిత్రమై కడునుల్లసిల్లెఁ జూడ్కులకు
వడి నందు రక్తప్రవాహంబునడుమఁ, బడి పాఱుబాహులు పన్నగంబులును
జాలనమ్ములనాటి చప్పుళ్ళతోడఁ, గూలిన రాక్షసుల్ గూలుభూజములు
బలలంబులకు గాత్రపఙ్క్తులమీఁదఁ, గలయమూఁగిన కాకకంకగృధ్రములు
జలవిహంగంబులు శస్త్రఖండములు, జలచరంబులు నస్థిశకలంబు లిసుము
విగతదంతంబులు వెల్లులై తొరఁగ, నెగయు ఫేనములుగా నెత్తురుటేఱు
ద్రెళ్ళిన శవములు దేల నుల్లోల, కల్లోలముగఁ బాఱ ఘనశస్త్రవృష్టి
యీభంగి దనరంగ నేచి గీర్వాణు, లాభీలగతిఁ జంపి యార్పులతోడ
విక్రమించుట చూచి వింశతిభుజుఁడు, సక్రోధుఁడై దేవసైన్యసాగరము
నింకింతు బాణాగ్ని నిపుడు నే ననుచు, నింక నీభుజశక్తి నెంతయు నేచి
సురసేన వెసఁ జొచ్చి సురుల నొంచుచును, సురపతి కెదురుగా శూరుఁడై నడచె
కని వాసవుండును ఘనచాప మంది, కొని దిక్కు లద్రువంగ గుణము మ్రోయించి
కడునేచి కాలాగ్నికల్పంబు లైన, బెడిదంపునమ్ములఁ బెనుతెగల్ డిగిచి
లక్షించి కింకతో లంకేశువక్ష, మక్షీణజవమున నదురంట వేసి
నమ్మహాబాహుండు నతనిపై మెఱుగు, టమ్ములు నిగిడించె నాలోన మఱియుఁ
బొరిపొరి పుంఖానుపుంఖముల్ గాఁగ, నిరువురు నడరించు నిషుపరంపరలు
గగనంబు దిక్కులుఁ గలయంగఁ గప్ప, నొగినైన చీఁకటి నుభయసైనికులు
చక్రగదాకుంతశక్తిశూలాదు, లక్రమాటోపంబు లడరఁ గైకొనుచుఁ
దలపడి తమవారిఁ దమవారి గూడ, నలమి చంపుచు భీకరాంధకారమున
నింద్రుండు రజనీచరేంద్రుండు సూరుఁ, డింద్రజిత్తుఁడు దక్క నితరు లెవ్వారు
నిది రథం బిది గజం బిది యశ్వ మితఁడు, త్రిదశుడు వీఁడు రాత్రించరుం డనుచు
లక్ష్మీంపలేరైరి లంకేంద్రుఁ డపుడు, నక్షీణవిక్రములైన రాక్షసులు
చప్పుళ్లు తఱుచుగా సంగ్రామభూమిఁ, గుప్పలు గొన సురల్ గూల్చుటఁజూచి
భూరికోపంబున బొమలు గీలించి, దారుణగతి నార్చి తనసూతుఁ జూచి
వరుస నీనందనవనభూమినుండి, యరుదుగా నుదయాద్రి యది మేర గాఁగ
సాగిన యాదైవసైన్యంబునడుమ, వేగంబె రథమున పెరవారఁ బఱపు
సమరోర్వి నమరుల శస్త్రాస్తవృష్టి, సమయించి పుచ్చెద జములోకమునకు
సురరాజు నోడించి సురరాజు నగుచు, వరుణలోకముఁ గొందు వరుణు నోడించి
యక్షేశు నోడించి యక్షాధిపత్య, మక్షీణగతి నొప్ప నలకఁ గైకొందు
జముని నే నోడించి జముఁడ నే నగుదు, నమరుల నోడించి యమరుండ నగుదు
దేవతాపురములఁ దెగువతో నొడిచి, నావారి నిల్పుదు నామాఱుగాఁక
నిజముగా దివిజుల నేడు రూపణఁచి, విజయంబుఁ గైకొందు వెఱవకు మనిన
వాఁడును బగ్గముల్ వదలి యశ్వముల, వేఁడిహుంకృతులతో వె న్నప్పళించి
పన్నిన యాసేన వాయఁగా నడుమ, నున్న గజాశ్వాదియూధముల్ చదియ
నరుదంబుఁ దోలుడు నమ్మహారథుని, సురరాజు గనుఁగొని సురలతో ననియెఁ
గడిమిమై మనతోడఁ గయ్యంబు సేయ, వడి దశగ్రీవుఁడు వచ్చుచున్నాఁడు
.... ........ ....... ....... ...... ... ......, ..... ..... ...... ...... ....... ......
యారావణునిబట్టి యలవుమై తనదు, తేరికిఁ గొనిపోయె దేవతల్ చెలఁగ
నది జూచి దనుజులు నఖిలరాక్షసులుఁ, జెదరి హాహాధ్వనుల్ చేసి రాలోఁగ
నత్తఱి దూరస్థుఁడగు మేఘనాదుఁ, డత్తెఱంగునకుఁ దా నతికోపుఁ డగుచు
నరిది వేగంబున నరదంబు నిగుడ, సరకు సేయక దేవసైన్యంబుఁ జొచ్చి
మారారిచేఁ గొన్న మాయఁ గైకొనుచుఁ, దేరుపైఁ దోఁపక తీవ్రబాణములఁ
గరలాఘవం బొప్పఁ గడుబిట్టు వఱపి, సురసంఘములఁ దోలి సురరాజుఁ గదిసె
నప్పుడు సురనాథుఁ డమ్మహారథుఁడు, గప్పినపెనుమాయఁ గానఁజొప్పడక
తనరు రణశ్రాంతిఁ దనజోడు విచ్చి, ఘనపాశముల దశకంఠు బంధింప
నమ్మేఘనాదుండు నతనిమర్మముల, నమ్ములఁ గీలించి యతనిసూతుండు
మాతలి నొగలపై మఱపుతో నొరఁగ, నాతేరు విఱుగంగ నలుకతో నేసె
తే రటు విఱుగంగ దేవేంద్రు డప్పు, డైరావతము నెక్కి యతనిపై కుఱికె
మేఘవాహనుఁ డొంటిమెయి నుండఁ జూచి, మేఘనాదుఁడు మాయ మిగులఁ గావించె
యక్కుంజరముమీఁద నయ్యిందుమీఁదఁ, బెక్కుబాణము లేసి భీతిల్లఁజేసి
ఇంద్రుని రావణుఁడు కట్టి తీసికొని పోవుట
విజయంబు గైకొని వెస నింద్రు పట్టి, భుజబలాటోపంబు పొలివోవఁ గట్టి
తనసేనలోనికి దర్పంబుతోడఁ, గొనిపోవ నది గనుంగొని దివౌకసులు
తేరు గానఁగవచ్చు తేరుపై నెన్న, శూరుఁ గానఁగరాదు సురలకెవ్వరికి
నీమహారథుఁగాన నెబ్భంగి వచ్చు, నేమి సేయుదు మింక నిది దైవవశము
అనుచున్న మాయావి యగునింద్రజిత్తు, జెనయ శక్తులు గాక చింతించి చూచి
శక్రుచే విడివడి చాలలజ్జించి, విక్రమక్రీడకు విముఖుఁడైయున్న
దశకంఠు బలువిడి దాఁకి నొప్పించి, రశనిసంకాశములైన బాణముల
నప్పు డీరణకేళి నలసినతండ్రి, దప్పక చూచి యాదశకంఠుసుతుఁడు
విజయంబు గైకొని విచ్చేయు దేవ, నిజమైన నాగెల్పు నీగెల్పు గాదె
యనుడు దశగ్రీవుఁ డాయగ్రతనయు, వినయధీరోక్తులు విని సమ్మదమున
మరలె లంకకుఁ దమమందిరమునకు, నరిగిరి హీనులై యఖిలదేవతలు
లంకాభిముఖుఁడైన లంకాధిపతియు, సంకులధ్వనులతో సామజంబులును
వడిరథంబులు హరుల్ వరవీరభటులు, నడుచునప్పుడు 'మేఘనాదు నీక్షించి
పౌలస్త్యకులవార్ధి పరిపూర్ణచంద్ర, నీలావుబలిమిచే నిఖిలదేవతల
దేవేంద్రు గెలిచితిఁ దృణలీల నింద్రు, నీవేగమున గెల్వ నేవీరుఁ డోపు
భూరివిక్రమ నీవు భువనంబులందు, సూరోత్తముఁడ వంచు సుతు గారవించి
యాతుధానులు గొల్వ నమరేంద్రుఁ గొనుచు, నీతేరు ముందట నీవు వోనిమ్ము
బలముతో మంత్రులు బలసి యేతేర, నెలమి నేతెంచెద నేను నీవెనుక
నని నియోగించిన నమ్మహాబలుఁడు, జనకువాక్యములకు సంతోష మంది
నానాజయధ్వనుల్ నభ మంది మెఱయ, సేనాముఖంబున జెలరేఁగి నడచె
నంత దశగ్రీవుఁ డటు లంకఁ జొచ్చి, సంతోషమున నున్నసమయంబునందు
సురసమూహముతోడ సురవైరిపురికిఁ, బరమప్రియంబునఁ బరమేష్ఠి వచ్చి
ఇంద్రుని విడిపింప బ్రహ్మ రావణునొద్దకు వచ్చుట
తమ్ములుఁ దనయులుఁ దగువారుఁ దన్ను, నిమ్ముల గొల్వంగ నెమ్మినట్లున్న
యాదశాననుచేత నర్హసత్కార, మాదటఁ గైకొని యతనితో ననియె
రావణ నీపుత్రురణకౌశలంబు, భావింపఁ జిత్ర మీపరుషవిక్రముఁడు
నీతోడ సరి యొండె నీకంటె నెక్కుఁ, డాతఁడు భుజశక్తి నాజిరంగమున
నింద్రుని గెల్చుట నితఁ డిటుమీఁద, నింద్రజి త్తనుపేర నెల్లలోకముల
చేతనువినతుఁ డజేయుండు నగుచు, నీతఁ డుజ్జ్వలకీర్తి నేపారఁగలఁడు
సురవైరి నీవు నీసుతునితోఁ గూడి, సురరాజు గెలిచితి సురసేనఁ దోలి
నరలోక సురలోక నాగలోకములు, సిరులెల్ల నినుఁ జెందెఁ జెల్లె నీప్రతిన
నిను వేఁడికొన వేఁడి నెమ్మి నావెనుకఁ, జనుదెంచినారు నీసభకు దేవతలు
వీరికిఁ బ్రియముగా వీరి మన్నించి, ధీరవిక్రమ నీవు దేవేంద్రు విడచి
మేలు గైకొనుమన్న మేఘనాదుండు, పౌలస్త్యపతి వినఁ బంకజాసనుని
నమరేంద్రు విడుచుట కమరత్వ మడిగె, నమరత్వ ముర్వి నాయజుఁడు లే దనిన
నాజిఁ బూర్ణాహుతి యగునంతదాఁక, నోజతో వేల్చిన హోమాగ్ని వలన
నుత్తమాశ్వములతో నొకతేరు వడసి, యత్తఱిఁ బోవుచో నమరత్వ మిమ్ము
హోమంబు తుదిముట్టకున్న నాశస్త్ర, సామగ్రి చెడి పరాజయము గానిమ్ము
దారుణం బగుచున్న తపముచేఁ దక్కు, నేరూపమును బొంద దెప్డు నెవ్వరికి
నమర నీయమరత్వ మధికసత్యమున, సమరోర్వి గల్గినఁ జాలు నా కనిన
నతనికిఁ బ్రియముగా నావరం బొసఁగి, శతమఖు విడిపించి జలజసంభవుఁడు
తను గొల్చుకొనివచ్చు దశకంఠు ననిచి, యనిమిషావలితోడ నటు లంక వెడలి
వాడినమాల్యముల్ వదలినవలువ, వ్రీడానతంబైన విన్ననిమోము
గలిగి త న్నొందిన కష్టదుర్దశకు, నలయునట్లున్న యయ్యమరేంద్రుఁ జూచి
చింతింప నేల నీచేసినపాప, మంతరంగమున సహస్రాక్ష తలఁపు
మేపాప మంటేని యే నెల్లఁబ్రజల, రూపింప నవవయోరూపాదు లమర
నేజీవజంతువు లేమిటివలన, భాజనంబై యోని బడి మగ్ను లగునొ
యని యేను జీవుల నర్థి వీక్షించి, మనసులు చూడంగ మది విచారించి
యందంద నిర్మించి యందఱు నొక్క, చందమై తోఁచినఁ జాలఁ జింతించి
కనుఁగొన సతికోర్కి గడవంగ మిగులఁ, దనరినకోర్కి లేదని తెల్సి చూచి
యది హరియించెడి యత్తన్వి గాఁగఁ, మదిఁ గోరి యే నొక్కమానినీరత్న
మన్నియొప్పులు గొని యందఱికంటె, సన్నుతసౌందర్యసామగ్రి మెఱయ
నభినవనైపుణం బమరంగ నొక్క, సుభగాంగి నిర్మించి చూచెద ననుచు
నతిరూపవతిని నహల్య నాఁ బరఁగు, నతివ నిర్మించితి నధికయత్నమున
నేకాంతబుద్ధి నాయింతి నిర్మించి, యేకాంతునకు నిత్తు నింక నీకాంత
'నింతికిఁ దగువరుం డెవ్వఁడో యనుచు, నెంతయు మదిలోన నే విచారింపఁ
గనుఁగొని యఖిలదిక్పాలురు సురలుఁ, గొనకొని యుక్తతన్ గోర్కి నేతెంచి
నీభామ భార్యగా నిమ్ము నా కనుచు, నాభంగి సుర లడ్గ నట వారి కీక
వాలిసుగ్రీవుల జననప్రకారము
నీ వపేక్షించిన నీకును నీక, పావనచారిత్రభరితుఁడైనట్టి
గౌతముకడకు నాకళ్యాణశీలఁ, బ్రీతిమైఁ గొనిపోయి పెక్కేండ్లు నిలుపఁ
గామవికార మాఘనునిచిత్తమున, నేమియు లేకుంట నెఱిఁగి యాధృతికి
నాతపోమహిమకు నాత్మలో మెచ్చి, నాతన్వి నిచ్చిన ననురాగ మెసఁగఁ
బత్నిగా నతఁడు చేపట్టి యయ్యువతి, రత్నంబునం దనురక్తుఁడై యుండెఁ
గామవికారంబు గదియ నీ వంత, నామునిపుంగవు నాశ్రమంబునకుఁ
జని హుతాశనపటుజ్వాలచందమునఁ, గనుపట్టియున్న యాకమలాక్షిఁ గదిసి
తీవయోలమునకుఁ దివిచి యావెంటఁ, గావించి చనుచోట గౌతముం డెఱిఁగి
కనలుచు నతిఘోరగతి నిన్నుఁ జూచి, యొనరినరోషాగ్ను లొండొండ నిగుడఁ
బరసతి యని యంత భావింప కెగ్గు, దొరకొని చేసితి దుష్టాత్మ నీదు
నొడలెల్ల నొకవెయ్యియోనులై యుండి, యెడునంచు శపియింప నింద్ర నీ వాత్మ
నెంతయు బెదరుచొ ప్పెఱిఁగి దేవతలు, నింతట గౌతము నెలమిఁ బ్రార్థించి
యప్పురందరునకు నభయ మిమ్మనిన, నప్పుడు గర్హించి యమ్మునీశ్వరుఁడు
తనకుఁ జూడక యెట్లు దప్పద యొరులు, కనుగొన నవి వేయికన్ను లయ్యెడును
ననవుఁడు నౌఁగాక యనుచు నాసురలు, జని రని యట నబ్జసంభవుఁ డెలమి
నఱలేని దయతోడ నదియును గాక, మెఱసి యిట్లనియె నామేఘవాహునకు
నాతి నీ కంతట నట గర్భ మగుదుఁ, బ్రీతితో నుండఁగఁ బెం పేది మౌని
సతిని నీఱుగఁ జూచు సంజ్ఞ నే నెఱిఁగి, యతివేగమున వచ్చి యమ్మౌనిఁ గాంచి
యతివలు నజ్ఞాన లవిచారమతులు, నతిపాప లతివంచలాత్మలు గాన
వది విచారింప కీ వనఘ యీవనిత, నదయతఁ జూడంగ న ట్లొప్ప దుడుగు
మనఘాత్మ కరుణించి యర్థి మన్నింపు, మినుమాఱు లీకప్పు లీలేమ కనిన
నవుఁ గాక మీపల్కు లాత్మఁ జింతించి, యువిద మన్నించితి నుచితోక్తు లెసఁగ
నని గౌతముఁడు పల్క నతని వీడ్కొనుచుఁ, గొనుకొని యే నేగఁ గోరి యొక్కెడను
నంత నహల్యయు నర్థిఁ బెంపొంది, సంతసంబున నతిసత్వసంపన్నుఁ
ద్రిదశేంద్రసముఁడని త్రిదశులు పలుక, విదితవిక్రముఁ గాంచె వేడ్కతో సుతుని
నత్తఱి గౌతముం డాయింతివలన, నత్తలోదరియగు నంజనఁ గాంచి
యేపారియున్నచో నిలయెల్లఁ దిరిగి, యాపద్మబాంధవుం డాయుదయాద్రి
కేతెంచియున్నచో నింతి యహల్య, యాతాపసోత్తము నాశ్రమంబునను
ఋతుమతియై సుచరిత్రయైయున్న, గతిఁ గనుఁగొని దివాకరుఁ డంతలోన
నింపార సొంపుతో నిలకు నేతెంచి, తెంపుతోఁ దనయంశు దీపంబు లణఁచి
ఘనతిగ్మరోచుల కడకలు మాని, చనుదెంచి యమ్మునిసతితోడఁ గూడి
యున్నచో గౌతముం డొనర వీక్షించి, యన్నలినాప్తున కలిగి యిట్లనియె
నమృతంబువలన నీ కారాహువునకు, సమరంబు గల్గు నాసైంహికేయుండు
మిడుకంగ నినుఁ బట్టి మ్రింగెడు ననుచు, వడి శాప మిచ్చె నవ్వనజూప్తుఁ డంత
ఘనమైన భీతితోఁ గరములు మొగిచి, మునికులోత్తమ శాపమోక్షంబు నాకుఁ
గరుణించి యీతప్పు గావుమ యనినఁ, బరమేష్ఠిసముఁడైన బ్రహ్మర్షివరుఁడు
పరమకృపారసభరితుఁడై యప్పు, డరయంగ నిది కారణంబునఁ జేసి
యక్కజంబగు శక్తి నట్లొక్కమాఱు, వెక్కసంబుగ రాహు వేడ్క మ్రింగుచును
విడుచుచు నుండెడు విశ్వంబునందు, నుడుగక నిబ్భంగి నుండని పలుక
నంత సూర్యుఁడు వోయె నానాతి యంత, సంతసంబున నొక్కసత్పుత్త్రుఁ గాంచి
యనయంబు హర్షించి యట్లున్న యంత, మునివరుఁ డప్పు డామువ్వురఁ జూచి
వారికి నామముల్ వరుసతో నిడఁగఁ, గోరి విచారించి కోర్కు లింపార
వాసవువీర్యంబువలన నట్లౌట, జేసి వాల్యాఖ్యచేఁ జెన్నొందు నతఁడు
నుగ్రాంశునకుఁ బ్రేమ నుదయించెఁ గాన, సుగ్రీవుఁ డనుపేర శోభిల్లు నితఁడు
నామనోరథ మార నాకు జన్మించె, నీముగ్ధ కంజనానామమ్ము నయ్యె
నని యిట్లు ముని పల్క నలరుచు వారు, గొనుకొనియున్నచోఁ గుటిలమార్గమున
మఱియును నొకనాఁడు మౌనియాశ్రమము, చరణాయుధమునట్ల చని నడురేయిఁ
గుయ్యిడ నటు మేలుకొని గౌతముండు, చయ్యన నది కనుష్ఠానార్థ మరుగ
నమ్మునివేషమై యలరి యహల్య, నెమ్మన మలరంగ నీకోర్కి దీర్చు
కేగుచో నంజనయే నిన్నుఁ జూచి, వేగుచు నున్నంత వేగవేగుటయు
నత్తఱి నీకుఁగా నాయింతివలన, నుత్తముండగు సూనుఁ డొకఁ డుద్భవించె
భీదయారాగముల్ పెనఁగొని యాత్మ, లోఁ దలఁజూపగ లోలాక్షి యుండ
నట మునియుఁ దనకృత్యంబులుఁ దీర్చి, పటుగతి నేతెంచి భవనంబునందు
నున్నచో నంజన యొయ్యన చేరి, విన్నవించిన నీకు వృత్తాంతమెల్ల
దనమది నూహించి తాపసోత్తముఁడు, కనుగొని రోషాగ్నికణములు దొరఁగ
నడర మున్నిటిదోష మది చాల కిట్లు, చెడుబుద్ధి పరకాంతఁ జెఱిచిన నీదు
నండముల్ దెగియు మేషాండుఁడ వగుచు, భండనంబునఁ బట్టువడు శత్రుచేత
నిల నింక నరులును నీపాప మొదవఁ, గల దందు నర్థంబు గానిమ్ము నీకు
నింద్రత్వపదమును నింతకుఁ దెగుట, యింద్రత్వహానియు నెల్ల యింద్రులకు
నరదుగాఁ గల్గుగా కని పల్కి కిన్కఁ, బరుషముల వల్కుచుఁ బత్ని నీక్షించి
యీతపోవనమున నింతి నాయొద్ద, నీతి మాలిననీవు నిలువంగఁదగదు
చతురయౌవనరూపసౌందర్యమదము, కతమున నీ విట్లు గానక నేఁడు
ధృతి చెడి పరుఁ గూడి తిటు మహాపాప, మతిఁ బూని న న్నవమానంబుఁ జేసి
కడుఁదప్పు సేసితి గాన నొ ప్పెల్ల, నెడల లోకముఁ జేర కీవనాంతమున
అహల్యకు గౌతముఁడు శాప మిచ్చుట
వేపోయి పాషాణవేషంబు నొంది, యాపదఁ బడుచుండుఁ మని శాప మిచ్చె
నంత నహల్యయు నావాక్యములకు, నెంతయుభీతి మునీంద్రుతో ననియెఁ
గపటియై నీరూపుఁ గైకొని యింద్రుఁ, డపరాధ మొనరించు టదియు నే నెఱుఁగ
నజ్ఞానకృతమైన యన్యాయ మగుట, విజ్ఞానమయమనోవీథి నీక్షించి
మన్నింపఁదగు నన్న మది విచారించి, యన్నాతిపలుకుల కనియె గౌతముఁడు
వసుమతి నిక్ష్వాకువంశంబునందుఁ, బొసఁగంగ రాముఁడై పుట్టి విష్ణుండు
సమ్మదంబున లోకసంరక్షణకొఱకు, నిమ్ములఁ జనుదెంచు నీవనంబునకు
సుభగి యాతనియంఘ్రి సోఁకినయపుడు, శుభమూర్తి వగు దీవు శుద్ధాత్మ వగుచుఁ
గ్రమ్మఱ నెలమి నాకడకు నేతేర, నెమ్మిఁ గైకొనియెద ని న్నంచుఁ బలుక
నత్తన్వి మఱియు ని ట్లనియె నాతాప, సోత్తముఁ గనుఁగొని సురుచిరాకారుఁ
డైనయీబాలుని యాముగ్గురట్లుఁ, గనుఁగొని దయతోడఁ గరమర్థి పెంపు
మనవుఁడు విమలాత్ముఁ డ ట్లగుఁగాక, యనుచు నెయ్యముతోడ ననియెఁ బెంపొదవ
నీతఁడు శతమన్యు నింద్రియంబునకుఁ, బ్రీతితో జన్మించెఁ బెంపెసలార
నటుకాన నితఁడు శతానందుఁ డనఁగఁ, బటుకృపామూర్తియై పాటిల్లుఁ గాక
ఇయ్యింద్రసుతునకు నీయర్కజునకు, నయ్యెడు దేహాంతమందు సహస్ర
లోచనకిరణుల లోలీయ మెసఁగ, నాచతురాత్ములే యవనిలో నుగ్ర
వనచరరూపులై వాలిసుగ్రీవు, లనెడునామములతో నతిపరాక్రమము
సేయుచు నొకయింతిఁ జెలువారఁ బొంది, యాయింతికై వాలి యనిలోనఁ బరుని
చేత నీల్గెడు నని చెచ్చెర వాలి, కాతతంబుగ శాప మ ట్లిచ్చె నంత
భ్రామకభరితసంప్రాప్తులై వారు, నామహామునినాథు నర్థిఁ బ్రార్థించి
క్షమియింపు మనవుడు సంయమీశ్వరుడు, కమలాప్తతనయ సంక్రందనసుతుల
వినయోక్తులకు మెచ్చి విబుధసన్నిభుఁడు, తనమది కరుణ యెంతయుఁ దోఁపఁ బలికె
నిద్ధతేజంబుల ని ట్లొప్పి మీరు, శుద్ధాత్ము లగుచును సురపతిసూర్య
వరుల కత్తెఱఁగును వారక చెప్పి, కర మొప్ప బలపరాక్రమములు మెఱయ
వారికి నుదయించి వరకపిమూర్తు, లారంగఁ దాల్పుఁడ యభినవం బొదవ
ననుచు నమ్ముని వారి నంతటఁ బాసి, చనిన వా రంజనఁ జాలఁ గోపించి
నీకతంబున మాకు నీఘోరశాప, కర్మఫలము దా నిటు సంభవించెఁ
గన్నియరో నీవు కపివీరుఁడైన, యన్నగచరవరు నర్థి వరించి
యతివ జగత్ప్రాణుఁడైన యాపురుషు, కతమున శివవర్యకలితుఁ డైనట్టి
సుతుని వానరవరశూరుని గనుము, వితతంబుగా నంచు వెస శాప మీయ
సుగ్రీవుఁ డెంతయు శోకించి యపుడు, అగ్రజు వాలి నహల్యను జూచి
యక్కట యీకన్య కలుగంగ నేల, పెక్కుకర్మంబులఁ బెం పేది మనము
విధినియుక్తంబు గావింపన ట్లగుచుఁ, బదపడి కర్మంబు ప్రాప్తించుచోటఁ
దొలఁగినఁ బోవునె తుది నీశుఁడైనఁ, లలి మీర నేనైన లక్ష్మీశుఁడైన
దనకర్మమునకును దాఁ గర్త గాక, కనుకని పరులకుఁ గారణం బేమి
యని దూరవగచి తా నంజనఁ జూచి, వినయంబు దైవాఱ వేడ్క ని ట్లనియె
నతిముగ్ధమతివైన యతివ నీ కిట్టి, యతిదుష్కృతంబు దా నవని వాటిల్లె
నతిసత్త్వుఁ గాంచెద వఖిలసంగ్రామ, చతురవిక్రముఁడైన శాఖామృగేంద్రు
నతఁడు నాకిష్టుఁడు నగునట్లు గాఁగ, మతితోడ నిచ్చిన న్మన్నింపవలయు
ననవుఁడు నౌఁగాక యని ప్రభాకరుని, తనయుని వీక్షించి తరుణి యిట్లనియె
నాతనూభవునకు నరయంగ మీరు, మాతులుల్ గారె మ మ్మరసి రక్షింప
నేతెఱంగునఁ గర్త లిం దెవ్వ రింక, నీతలం పిటమీఁద నెఱయ నెట్లగునొ
యనవుఁడు సుగ్రీవుఁ డౌఁగాక యనుచు, ననయంబు హర్షించి యవ్వాలిఁ గూడి
చనిరి వా రింద్రునిసన్నిధి కంతఁ, జని తమకైనట్టి శాపప్రకార
మును దమకయ్యెడు మోక్షంబుతెఱఁగు, వినిపించి వానరవీరులరూపు
ధరియించినారు ముందట మేను విడిచి, పరమాత్ములై వారు వసియింతు రెలమి
నంత నహల్యయు నటఁ దనశాప, మంతయుఁ గైకొని యాసమీపమున
శిలభావమై యుండెఁ జెచ్చెఱ నంత, సలలితానుష్ఠానసంపన్నుఁడైన
గౌతమఋషి తనకైనపత్నీత్వ, వితధంబునకుఁ జాల విహ్వలుఁ డగుచు
నంజన నాశతానందుఁ దోడ్కొనుచు, రంజిల్లు మిథిలేశురాష్ట్రంబు చేరి
మెలఁగుచునున్న నామెయి జనకుండు, వలనొప్ప నేతెంచి వరమునీశ్వరుని
గనుఁగొని ప్రార్థించి ఘనశతానందు, నినసముఁ దోడ్కొంచు నేగె నేగుటయు
నంత నాగౌతముం డంజనఁ జూచి, సంతాపచిత్తుఁడై సౌభాగ్యలీలఁ
దనరెడు నీయింతిఁ దరుచరునకును, గొనకొని మూర్ఖతఁ గోరి యెట్లిత్తు
హా దైవమా యంచు నతిదుఃఖ మంది, మేదినిఫై విధి మీఱంగరామిఁ
దలపోసి తనబుద్ధిఁ దగ విచారించి, యలయక ఘనగిరులందుఁ గ్రుమ్మరుచుఁ
జనిచని యామేరుశైలంబుపొంత, ఘనుఁడు కేసరియను కపివరాగ్రణిని
విదితంబుగాఁ జూచి విమలవర్తనము, సదమలగుణయుక్తి సంతతాచార
చరితంబు వినయంబు సద్భక్తియుక్తి, భరితంబు గని మెచ్చి భార్యగా నిచ్చి
సలలితచిత్తుఁడై సంతోష మొదవ, నెలమితోఁ గనకాద్రి కేగె నమ్మౌని
నాఁ డంత గావించినాఁడవు గాన, నేఁడు శాత్రవుచేత నీ కింత వచ్చె
నది గాన వైష్ణవయాగంబు చేసి, పదపడి సకలపాపంబులఁ బాయు
నీలోకమున నందు నీతనూజుండు, నాలంబులోఁ జిక్కఁ డభియాతిచేతఁ
దాత పులోముండు దప్పించి తెచ్చి, యాతని దాఁచినాఁ డబ్ధిమధ్యమున
నని పురందరు చిత్త మలరంగఁ బలికి, తనలోకమున కేగెఁ దదనంతరంబ
పాకశాసనుఁడును బ్రహ్మవాక్యంబు, గైకొని నియతి నాక్రతువుఁ గావించి
యనఘాత్ముఁడై యుండె నమరలోకమున, నని యింద్రువృత్తాంత మంతయుఁ జెప్పి
యమరేంద్రు గెలిచిన నతని నన్యులకు, సమరంబులో గెల్వ శక్యమే యనిన
మేఘనాదునిలావు మిగులమే లనుచు, రాఘవుల్ పలుకంగ రవిసుతాదులును
వెఱగంది రాతనివిక్రమంబునకు, మఱియు నగస్త్యుఁ డమ్మనుజేంద్రుఁ జూచి
అగస్త్యుఁడు రామునకు రావణుచరితంబుఁ జెప్పుట
రావణాంతక విను రణశూరుఁడైన, రావణుసుతు వింటి రావణు వినుము
భయదసైన్యముతోడఁ బఙ్క్తికంధరుఁడు, జయకాముఁ డై మంత్రి సేనలు గొల్వ
నసమానగతిఁ బశ్చిమాంబుధికడకు, వెస నేగు నతఁడు తద్వీపమధ్యమునఁ
దప్తకాంచనదీప్తిఁ దనరి కల్పాంత, దీప్తాగ్నివిధమునఁ దేజరిల్లుచును
అమరులయం దింద్రుఁ డంచితద్యుతుల, నమరుగ్రహంబులం దబ్జబాంధవుఁడుఁ
గర మొప్పుగిరులందుఁ గాంచనాచలము, నరుదుగా నిభములం దైరావతంబుఁ
బాదపంబులయందుఁ బారిజాతంబు, వేదంబులందు ఋగ్వేదంబుఁ బోలి
యెల్లమూర్తులయందు నేమూర్తి వెలుఁగు, తెల్లంబుగా నందు దీపించువాని
విపులవాసంబును విశదదంతములుఁ, జపలంబులైన పిశంగనేత్రములు
నాజానుబాహులు నరుణాంబుజంబు, యోజఁ జెన్నగుమోము నురుతరాంగములుఁ
గంబుసోదరమైన కంఠంబు నఱుతఁ, బంబినరుచి నొప్పు పద్మదామకముఁ
బద్మరాగారుణప్రభ లుర్విఁ బర్వ, బద్మాంకముల నొప్పు పాదపద్మములు
మణిపుంఖదేదీప్యమానాశుగములు, రణితఘంటాభీకరములైన దొనలు
వాచాలకింకిణీవలయంబులైన, వీచోపులును గల్లి విలసిల్లువానిఁ
దలఁపంగ నూరులధర్మంబుఁ దపము, విలసిల్లుకటియందు విశ్వదేవతలుఁ
బూని మేహనమునఁ బుష్పసాయకుఁడు, దానిరంధ్రంబునఁ దగుప్రవాహములుఁ
బెనుపాఱువీఁపునఁ బితృసమూహంబు, మొనయునస్థిస్థానమున మరుద్గణము
నసమానగతిఁగుక్షి నబ్ధులు నదులు, వసువులు ప్రక్కల వరుసదిక్కులును
గన్నుల రవిశశుల్ ఘనతరాస్యమునఁ, జెన్నొందురుద్రులుఁ జెవుల నశ్వినులు
భాతిగా నతిచండబాహుదండములు, ధాతవిధాతలు దైవతాగ్రణులు
మణిబంధయుగమున మహితవజ్రంబుఁ, బ్రణుతహస్తంబుల భగుఁడుఁ బూషణుఁడు
భాసురనఖపఙ్క్తిఁ బరఁగు శేషుండు, వాసుకియును నహీశ్వరుఁ డశ్వతరుఁడు
ఘనుఁ డిలావంతుండుఁ గర్కోటకుండు, ఘనులు విశాలాక్షకంబళాదులును
నక్షీణవిషదీప్తుఁ డగు ధనంజయుడుఁ, దక్షుకుండును నుపతక్షకాహ్వయుఁడు
రోమజాలంబు లరుచిరగోహోమ, భూమిదానాదికపుణ్యదానములు
మేదురద్యుతు లొప్పు మేనఁ గానమ్ము, వేదవేదాంగాదివివిధవిద్యలును
నేతెఱంగున నెందు నెప్పు డెవ్వరికి, ధాతవరం చెట్లు తప్పింపవచ్చు
మున్నుఁ బుట్టినవాఁడు ముందటఁ బుట్ట, నున్నవాఁడును దేవయోనులయందు
నిరవద్యసిద్ధులు నిఖలాధ్వరములు, వరమూర్తు లొప్పార వర్తించువానిఁ
గనుఁగొని యతిచిత్రగతి నంజనాద్రి, కనకాద్రినిమ్ముల గదిసెనో యనఁగఁ
బట్టినయలుగుల పటుదీప్తు లడర, నట్టహాసముతోడ నవ్వీరుఁ గదిసి
కడువాఁడికత్తులఁ గనలుశూలముల, బెడిదంపుటీఁటెల బెనుపట్టసముల
నరుదార నొప్పింప నప్పు డవ్వీర, వరుఁడును బులిచేత వడివ్రేటు వడిన
కరివైరివిధమునఁ గరభంబుచేత, సరిదాకు వడిన కుంజరముచందమున
ఘోరవారణముచేఁ గోరాడఁబడియు, గౌరవం బెడలని కనకాద్రిభంగి
నంబువేగ౦బున నాహతంబైన, యంబుధిచాడ్పున నతికృద్ధుఁ డగుచు
నోరి రావణ నీమదోద్ధతియెల్ల, వారించి పుచ్చెద వడి నిల్వు మనుచుఁ
గల్పాంతనిర్ఘాతకల్పమై తాఁక, నల్పపీడితముష్టి నలవోకఁ బొడిచె
బిడికిటఁ బొడిచినఁ బెల్లు మూర్ఛిల్లి, పడినయాదశకంఠు బలము వేతోలి
మలయుచుఁ బాతాళమార్గమై యున్న, బిలములోపలఁ జొచ్చెఁ బృథులవేగమున
నంత దశగ్రీవుఁ డామూర్ఛఁ దెలిసి, యంతలోనన లేచి యసురులఁ జూచి
పటుముష్టి నన్నాజి పరవశుఁ జేసి, యెట పోయె నవ్వీరుఁ డెఱిఁగింపుఁ డనిన
రావణమంత్రు లారావణుఁ జూచి, దేవ పోరాని యాతెరువు లేమిటికి
దేవాసురాదులఁ దీవ్రదర్పమున, వావిరి గెలువంగ వలఁతి యాఘనుఁడు
భావింపఁబోఁ బోలుఁ బాతాళమునకు, నావీరుఁ డిందుగా నరిగె నీబలము
ననవుఁడు మగఁటిమి నమ్మహాబలుఁడు, ఘనఖడ్గపాణియై గరుడవేగమునఁ
దక్కక యాబిలద్వారంబుఁ జొచ్చి, యక్కడఁ జని చని యం దొక్కచోట
మేటిమేనుల మించు మేచకద్యుతులు, కాటుకకొండలగతి నుల్లసిల్ల
మహనీయకేయూరమణిముద్రికాది, బహుభూషణంబులఁ బ్రణుతవస్త్రముల
రక్తగంధంబుల రక్తమాల్యముల, రక్తమైఁ గైసేసి రాజిల్లుఘనులు
వెండియు నొకచోట వివిధమండనము, లొండొండ వెలిఁగెడు నుజ్జ్వలాకృతులఁ
బోఁడిగా ధరియించి పొలుపారుచున్న, మూఁడుకోటుల సదా ముదితమూర్తులను
మఱియునొక్కెడ భాసమానవర్గముల, మెఱసి యగ్నులభంగి మేనులు వెలుఁగు
లీలమైఁ దెలిపించు లేజవ్వనముల, నోలి వినోదించు చున్నయంగనల
వేఱొక్కచోఁ దనవిపులప్రతాప, మాఱించి వచ్చిన యవ్వీరుతోడ
సమవర్ణసమరూపసమబాహుబలులు, సమపరాక్రములు నాఁ జను చతుర్భుజులఁ
బొడఁగాంచి భయజాతపులకాంగుఁ డగుచుఁ, దడయక తద్బిలద్వారంబు వెడలె
వెలువడి మఱియు నవ్వింశతిభుజుఁడు, బిలబహిస్థలి నొకపృథులతల్పమున
దివ్యభూషణములు దివ్యాంబరములు, దివ్యగంధంబులు దివ్యమాల్యములు
ధరియించి చంద్రికాధవళ మై పొలుచు, మురిపెంపువెలిపట్టుముసుగు రాఁదిగిచి
నిదురవోవుచునున్న నిరుపమాకారు, ముదితతేజోనిధి నొక్కని గాంచి
యావీరుచేరువ నభినవరూప, లావణ్యములఁ బుణ్యలక్షణంబులను
బరమపాతివ్రత్యభవ్యశీలముల, నిరవంద నుతి గన్న యిందిరాదేవి
కుసుమగంధాదుల కొమరారియఱుతఁ, బసిఁడితామరపేరు పసనార వైచి
మణికంకణోత్కరమధురఝుంకార, రణితహస్తంబున రమణీయలీల
ధవళచామర మొప్ప ధరియించి సకల, భువనైకభూషణస్ఫూర్తి నొప్పుటయు
నటఁ జూడ్కి సుడివడ నాజగజ్జననిఁ, గుటిలాత్ముఁడై పట్టుకొన విచారించి
యందఱుమంత్రుల నవులఁ బోఁబనిచి, కందర్పవశగుఁడై కడక నొక్కరుఁడ
యోలి విషజ్వాల లొల్క నిద్రించు, కాలసర్పముఁ జేరుగతిఁ జేర నరిగి
ముట్టి డాయకమున్న ముసుఁ గెడలించి, యట్టహాసముఁ జేసె నమ్మహాబలుఁడు
దానికి మూర్ఛిల్లి ధాత్రిపై వ్రాలి, యానిశాచరుఁ డున్న యమ్మహాఘనుఁడు
నరనాథ మొదలంట నఱకుడువడిన, తరువున ట్లొరిఁగిన దశకంఠుఁ జూచి
యమరకంటక నిన్ను నంటంగఁ బొదివి, సమయింప నిప్పుడు సమయంబు గాదు
బ్రహ్మచే నీకన్న పాపంపువరము, బహ్మకు మాఱుగా బ్రతికించె నిన్ను
బ్రహ్మ మాన్యుఁడు గాన బ్రహ్మవాక్యంబు, బ్రహ్మకుఁ బ్రియముగాఁ బాటిఁపవలయు
బ్రహ్మప ల్కిప్పుడు పాటించి మీఁద, బ్రహ్మాదిసురి లడ్డుపడిన ని న్నణఁతు
నెట్టన నాచేత నీల్గు దీ వనిన, నెట్టకేలకుఁ దేఱి యెప్పటియట్లు
నిట్టూర్పు వుచ్చుచు నెసఁగుదీమములు, నిట్టులగా భీతి నేత్రముల్ మూసి
వెఱవక పొమ్మన్న విని కన్ను దెఱచి, వెఱపుతోఁ జేతులు వెస మోడ్చి పలికె
బాహుదర్పంబున బలమున నసమ, సాహసంబున నీదు సరి యెందుఁ గానఁ
బ్రళయాగ్నిశంకకుఁ బట్టినవాఁడ, వలఘుతేజోమూర్తి వనఘ యెవ్వఁడవు
నీపేరు వినిపింపు నిజముగా ననిన, నాపల్కు విని నవ్వి యవ్వీరవరుఁడు
ఘననాదగతిఁ గర్ణకర్కశం బైన, ఘనతరధ్వని బఙ్క్తికంఠుతో ననియె
నిప్పుడు నాపే రదేల నాచేతఁ, దప్పదు మరణంబు దశకంఠ నీకు
నెప్పుడు నాచేత నిలఁ గూలె దీవు, నప్పు డెఱింగెదల వమరారి నన్ను
ననుఁడు వెండియు నాదశాస్యుఁ డాఘనుని, గనుఁగొని మదిలోన గర్వించి పలికె
యుద్ధంబులో నిన్ను నోర్వంగఁజాలు, నిద్ధతేజుఁడు గల్గునే విచారింప
బ్రహ్మతేజంబునఁ బాటేల కల్గు, బ్రహ్మకు మనుమఁడౌ పఙ్క్తికంఠునకు
నట్లేన నీచేత నగునట్టి మరణ, మెట్లును గీర్తి నా కెల్లలోకముల
నని పల్క మఱియును నమ్మహామహుని, తనువునఁ బితృదేవతలు మరుత్తులును
వసువులు రుద్రులు వఱలు తేజమున, నెసఁగు నాదిత్యులు నెల్లదేవతలు
వెలుఁగు మూఁడగ్నులు వివిధరూపములు, నెలకొన్న విద్యలు నిఖిలవేదములు
సర్వపర్వతములు సర్వవారిధులు, సర్వసరిత్తులు సర్వసంయములు
సర్వగంధర్వులు సకలచారణులు, సర్వసిద్ధులు సర్వసాధ్యసంఘములు
గ్రహములు నక్షత్రగణములు నభము, నహిపతుల్ గరుడుఁడు నశ్వినుల్ సురలు
నసురవర్గంబులు నఖిలరాక్షసులు, నసమానగతిఁ దోఁప నన్నిలోకములు
నరుదారఁ బొడఁగని యతిభీతుఁ డయ్యె, సురవైరి యని కుంభజుండు చెప్పుటయు
నామునీంద్రునితోడ నవనీశుఁ డనియె, నీమహామహిమ నా కెఱిఁగింపవలయు
దాననాదులఁ బట్టి దర్పంబు లణఁచు, పూనికగల దివ్యపురుషుఁ డెవ్వాఁడు
పరికింప బిలభూమిభామలుఁ దారు, వరుస వినోదించువా రెవ్వ రనిన
మును దశాస్యుని నల్పముష్టిఘాతమున, వెస మూర్ఛఁ బొందించి బిలములోఁ జొచ్చి
యందు నాతఁడు వచ్చి యందున్నవారి, చందంబుఁ గని నిల్వ శంకించి వెడలి
వెలి ద్రోచి క్రమ్మఱ వెస నట్టహాస, కులిశపాతంబునఁ గూల్చిన యతఁడు
ఘనుఁడైన కపిలు౦డు కపిలుఁడు ననఁగ, మనుజేంద్ర నీవు నీమహిమ యంతయును
జక్రగదాఖడ్గశార్ఙ్గముల్ గేల, విక్రమక్రీడల విలసిల్లువాఁడు
నభవుఁడు శాశ్వతుం డసమానుఁ డనఁగఁ, ద్రిభువనాధీశుఁడై దీపించువాఁడు
భూతకోటుల నెల్లఁ బుట్టింపఁ బెంపఁ, బ్రాతి యడంగింపఁ బ్రభుఁ డైనవాఁడు
కారణభూతమై కర్మజాలముల, మేరల సకలంబు మెలఁగించువాఁడు
వేదముల్ గనువాఁడు విష్ణుండు కపిలుఁ, డాదినారాయణుం డైన యాఘనుఁడు
జిహ్వలు శిఖలుగాఁ జెలువారుచున్న, గహ్వరవాసులు కపిలనందనులు
నట్టి యాకపిలుచే నవలీలఁ దనరు, గట్టిమానము దూలి కడు విన్నఁబోయి
మరలంగ నేతెంచి మంత్రులుఁ దాను, బురికి నారాక్షసపుంగవుం డరిగె
నన విని రఘురాముఁ డటఁ గొల్చియున్న, వినుతవిక్రములైన వీరపుంగవులు
వెరగంది రమ్మహావృత్తాంతమునకు, మఱియు నగస్త్యుఁ డామనుజేంద్రుఁ జూచి
భూలోకనాథ యీభూరివిక్రముఁడు; నాలోక సురలోకుఁ డౌనింద్రజిత్తు
కైలాసచాలనక్షమబాహుఁడైన, త్రైలోక్యకంటకు దశకంఠు వింటి
యాయిరువురకంటె నధికవీరుండు, వాయుతనూజుఁ డీ వానరోత్తముఁడు
నాతతసత్వంబు నతులవిక్రమము, నీతియు బుద్ధియు నిఖిలవిద్యలును
మహితప్రభావంబు మారుతి కరయ, సహజంబు లతనికి సరియె తక్కొరులు
జానకి వెతకంగ సకలవానరులు, నేనేన యని పూని యేపుతో నడరి
రంగదుత్తుంగతరంగమై పొంగి, నింగితో రాయు నానీరధిఁ జూచి
వెలవెల నగుటయు వెఱవకుం డనుచు, నలఘువిక్రమశాలి యైన యాఘనుఁడు
జవమున లవణాబ్ధి శతయోజనంబు, లవలీల లంఘించి యట లంకఁ జొచ్చి
జనకజఁ బొడఁగాంచి సకలంబుఁ జెప్పి, వనపాలకులఁ జంపి వనమెల్లఁ బెఱికి
లంకేంద్రుతనయులఁ లలి మంత్రివరుల, గింకరకోట్లను గీ టణంగించి
బంధనముక్తుఁడై పలుకులఁ బఙ్క్తి, కంధరుఁ గెరలించి కడుమేను పెంచి
వాలిన యాలంక వడి నీరు చేసి, పౌలస్త్యుఁ నగరెల్లఁ బయలుగాఁ జమరి
సీతకంతయుఁ జెప్పి సేమంబుఁ గొనుచు, నేతెంచె నింతవాఁ డెవ్వఁడు గలఁడు
హనుమంతుని వృత్తాంతము
హనుమంతు చేసిన యంతకార్యంబు, ధనదుఁడు సేయఁ డంతకుఁడు సేయండు
విష్ణుండు సేయండు విబుధేంద్రుఁడైన, జిష్ణుడు సేయండు సేయరె వ్వరును
ననవుడు రఘురాముఁ డావాక్యములకు, మునినాథుఁ గనుఁగొని ముదముతోఁ బలికె
నితనికారణమున హితసంగమంబు, వితతంబుగాఁ గంటి విజయంబుఁ గంటిఁ
బడియున్న లక్ష్మణుప్రాణముల్ మగుడఁ, బడయంగఁ గంటి నాబంధులఁ గంటిఁ
జాల విభీషణుసకలధర్మములు, పాలింప లంకకుఁ బతిఁ జేయఁ గంటి
నే నయోధ్యాపుర మేలఁగఁ గంటి, జానకితో గూడ సౌఖ్యంబుఁ గంటి
నా కెల్లమేలు నీనగచరోత్తముఁడు, గైకొని కావించెఁ గడుఁబ్రీతితోడఁ
దలపోయ నీతఁడు తప్పించి యొరుల, కలవియే వైదేహి నట పోయి వెదక
నని పల్కి వెండియు నంజనాతనయు, విను వేడ్క కుంభజు వీక్షించి పలికె
వాలినపగవారు వాలిసుగ్రీవు, లోలి నెప్పుడుఁ బోరుచుండఁగా నితఁడు
తృణలీల నేల నాదేవేంద్రుతనయు, రణభూమిఁ గూల్పఁ డారవిసూనుఁ డలరఁ
దనలావు నాఁ డేల తా నెఱుంగండొ, తనకు నిష్టుండైన తపననందనుఁడు
వాలిచేఁ గడుఁదూలి వగఁ గూఱునతని, నేల యుపేక్షించె నెఱిఁగింపు మనుచు
హనుమంతుమోముపై హస్తంబుఁ జేర్ప, వినఁగ నగస్త్యుఁ డవ్విభునితో ననియె
గతియందు మతియందు ఘనశక్తియందు, నతులితుండైన యీహనుమంతునందుఁ
బరికింపఁగా నెంత పౌరుషంబైన, ధరణీశ గల్గుట తథ్యంబు వినుము
మునిశాపమున వీరముఖ్యుఁ డీఘనుఁడు, తనలావు దెలియక తా నుండుఁ గానఁ
జాలంగ భుజసత్త్వసంపన్నుఁ డయ్యు, వాలి నాలములోన వధియింపఁడయ్యెఁ
బరికింప నిమ్మహాబలుఁడు బాల్యమున, నరుదారఁ జేసిన యాపరాక్రమము
వినుతి కెక్కెడు నీవు వినఁగోరెదేని, వినిపింతు సకలంబు విశదంబు గాఁగ
నిరవంద గనకాద్రి నీతనితండ్రి, గిరిచరోత్తముఁడైన కేసరి యుండు
నతనికిఁ బత్నియై యంజనాదేవి, సతతంబుఁ బతిభక్తి సకలంబు సేయ
నతని కపత్యంబు నట్ల లేకున్న, మతి విచారించి యమ్మగువ పుత్త్రార్థి
పటుతరభక్తితోఁ బవనుని గూర్చి, యట భుంజకస్థలి నతిఘోరతపముఁ
గావింప నెఱిఁగి యాగంధవహుండు, వేవేగ నేతెంచి వెలఁది నీక్షించి
యెలనాఁగతపమున కెంతయు మెచ్చి, తలవడ నీయిష్ట మది గోరు మనిన
ననువంద నంజన యాత్మఁ బెంపొంద, ననఘాత్మ నీదయ నఖిలలోకముల
జనులు దేవతలును సంస్తుతి సేయ, ఘనపరాక్రముఁ డనఁగా విలసిల్లు
తనయుని నతిబలోద్ధతుఁ గృపసేయు, మనవుడుఁ గరుణించి యట్ల కా కనుచు
గౌరీశుఁ డిచ్చిన గర్భవృత్తాంత, మారామ కెఱిఁగింప నాత్మలోఁదలఁచి
హనుమంతునిపుట్టుక
కమలాక్షి విను తొల్లి గరళకంధరుఁడు, విమలమై తనమది వేడ్క లింపొందఁ
దనవినోదారామధరణీస్థలమున, కొనరఁ బార్వతితోడ నురువేడ్క వచ్చి
తరులనీడల వినోదం బాడియాడి, యిరువురుఁ దమలోన నేపు దీపించి
కొలఁకులఁ గ్రీడించి కొమరు దీపించి, యళులు మ్రోయఁగ మించునపు డుల్లసించు
బహుపుష్పములసౌరభము గ్రోలిక్రోలి, మహనీయహర్షాబ్ధి మదిఁ దేలి తేలి
చందమై సంపూర్ణచంద్రుఁడుగాను, మందవాయువు వీవ మది సంతసిల్లి
గొనకొని మర్కటకూటంబుఁ గాంచి, మనమునఁ బ్రియమంది మగువ యీశునకు
వినిపించి వేడ్క నీవిధము పుట్టెడిని, ననవుడు హరుఁ డంత నౌఁగాక యనుచు
నెనసినవేడ్కతో నేర్పడఁ బలికి, పూనినవేడ్క నిర్వురుఁ దారు నట్లు
వానరరూపులై వరుసఁ గ్రీడించి, జానొప్ప నెంతయు సౌఖ్యంబుఁ గాంచి
తమతొంటిరూపముల్ దాల్చి నిల్చుటయుఁ, గ్రమ మొప్ప గౌరికి గర్భ మెంతయును
దొరకొని బరువైనఁ దుదిఁ దాల్పలేక, పరమేశుతో వ్రేఁగు పడుచు నిట్లనియె
నీవరగర్భంబు నే మోవఁజాల, దేవర దీని నెందేనియు నిడుము
కాదేని మీ రైనఁ గైకొని ప్రేమ, తో దీని ధరియింపుదురు గాక ప్రీతి
ననుడు పార్వతిఁ జూచి హరుఁడు నవ్వుచును, నొనర నాగర్భంబు నుర్విపైఁ బెట్టెఁ
గొంతకాలము మోచికొనియుండి ధాత్రి, కాంత శంకరునకుఁ గడుభక్తి మ్రొక్కి
యవధారు కులగిరు లంబుధు లేడు, వివిధంబులగు మహావృక్షముల్ నదులు
స్థావరంబులు మఱి జంగమాదులును, మోవంగనోపుదు మోదంబుతోడఁ
దగ గర్భ మిది యేను దాల్పంగఁజాల, నగసుతాధవ దయ ననుఁ గావు మనుడుఁ
జిఱునవ్వు మోమునఁ జింది దైవాఱ, నఱిముఱి నాగర్భ మందుక శివుఁడు
వేయేండ్లు ధరియించి వెస దానిఁ బుచ్చి, నాయతి నా కిచ్చె నట నేను వేయు
వరుసముల్ ధరియించి వారక యున్న, తఱి నీవు పుత్రసంతానేచ్ఛ నన్ను
గుఱిచి వేఁడితి గాన కోర్కి దైవాఱ, ధరియింపుమనుచును దనచేతనున్న
గర్భఫలమును వాయుదేవుండు, గురుదయాంచితబుద్ధిఁ గోమలి కొసఁగి
చనిన పిమ్మట సంతస మ్మంది యింతి, తనమందిరమునకుఁ దా నేగుదెంచి
ద్వాదశమాసముల్ తగఁ జన్న పిదప, నాదట సుతుఁ గాంచె ననురాగలీల
ఘనతపోమహిమచేఁ గన్న యాత్మజుని, గనుచాటుగా నుండఁ గనుజాటు పెట్టి
యంతఁ బండులు దేర నంజనాదేవి, కాంతారమున కేగఁగా వేడ్క నతఁడు
శరభంబు గర్జించుచందంబు దోఁప, వరుసఁ బేరాఁకట వాపోవుచుండి
భూరిజపాపుష్పపుంజంబుకరణి, నారంగ నుదయాద్రియం దొప్పుచున్న
చండాంశుఁ బొడఁగని చటులవేగమునఁ, బండను వేడుకఁ బట్టఁగ నెగసి
యర్కున కభిముఖుం డై మింట నరుగఁ, దర్కించి సురసిద్ధదనుజసంఘములు
వైనతేయునకును వాయుదేవునకు, మానసంబునకు నీమారుతాత్మజుడు.
నింతవేగము గలఁ డితఁడు బాల్యమున, నింతవాఁ డిటమీఁద నెంతవాఁ డగునొ
యిట్టిసత్వంబును నిట్టిధైర్యంబు, నిట్టికార్యము గాన మెవ్వరియందు
వినము గానము నంచు విస్మయం బంది, కనుఁగొనుచుండంగఁ గడకతో నపుడు
కొడుకును నర్మిలి గూడి వెన్ దగిలి, వడివచ్చుచున్న యావాయుదేవుండు
వీఁక నుష్ణాంశునివేఁడిమి నడుమ, దాఁకి శరీరంబు దపియింపకుండ
గమనవేగఁబునఁ గలయఁగఁ బొడము, చెమట చిత్తడిపొడి సేయుచుఁ బొలయ
లీల నవ్వీరుండు లెక్కింపఁ బెక్కు, వేలయోజనములు వెస నాక్రమించి
యవిరళగతి రశ్ము లడరఁ గైకొనక, రవి చేర నరిగె నారవియు వీక్షించి
బాలుఁడు గావునఁ బఱతెంచెఁ గాని, పోల నీతఁడు దుష్టబుద్ధి రాఁడనుచు
నార విచారించి యంశుజాలముల, మారుతసుతుమేను మాఁడింపఁడయ్యె
నాభీలగతి నప్పు డంజనాతనయుఁ, డాభానుబింబంబు నరుదారఁ బట్ట
గ్రహణపర్వము నాఁడె కావున రాహు, వహిమాంశుఁ గబళింప నట కేగుదెంచి
దినకరుం డున్నయాతెఱఁగెల్లఁ జూచి, హనుమంతుఁ డదలింప నతిభీతుఁ డగుచుఁ
జంద్రార్కభయదుఁడై చలియించురాహు, వింద్రలోకమునకు నేగి కొల్వున్నఁ
బురుహూతుఁ గనుఁగొని బొమలు గీలించి, పరుషవాక్యంబులఁ బల్కి రోషమున
రాకాసుధాకరు రవి నమావాస్య, నా కాఁకటికి నీవు నాఁ డిచ్చి నేఁడు
నానోటకడి వుచ్చి నాకేంద్ర యొరున, కీ నీకు నుచితమె యిపు డొక్కరాహు
“నాకంటె మును వోయి నలినభాంధవుని, గైకొనియున్నాఁడు కడిమితో ననిన
నాపల్కులకు మండి యాఖండలుండు, కోపరక్తాక్షుఁడై కొలువు చాలించి
కీలాకరాళమై కేల వజ్రంబుఁ, గ్రాలంగ సంచితగాత్రుఁడై పొలిచి
పన్ని తెచ్చిన తనభద్రసామజముఁ, బన్నుగాఁ గరిరాజపట్టంబుదాని
కైలాసగిరిఁబోలు గాత్రంబుదాని, నాలుగుకొమ్ముల నలినొప్పుదాని
ఘనతరోన్నతి మింటఁ గడచినయట్టి, యనువైన యౌన్నత్య మమరెడుదాని
మదము లొల్కెడుదాని మదగంధములకు, ముదముతోఁ దువ్మెదల్ మొగిమ్రోయుదానిఁ
బొందినరవిచేతఁ బూర్వాద్రిభంగి, సిందూరతిలకంబుచే నొప్పుదానిఁ
గనకరశ్ములఁ బొల్చు మంటలచాని, ఘనతరోన్నతి మిన్ను గడచినదాని
నైరావతము నెక్కి యధికతేజమున, నారాహు మున్నుగా నాదిత్యుకడకుఁ
జనుదేర నప్పు డాసైంహికేయుండు, ననతిదూరంబున హనుమంతుఁ గాంచి
వడిమీఁద బఱతేర వనజాప్తు విడిచి, కడిమి నతఁడు వానిఁ గనిపెట్ట నెగసె
నంత కంఠీరవ మలుకతో నెగయ, నెంతయు వడిఁ బాఱు నిభముచందమున
నింద్రయింద్రా యంచు నెసఁగినభీతిఁ, జంద్రారి పఱతేర జంభారి చూచి
సైంహికేయా భీతి సంచలింపకుము, సంహరించెద వీని సమరోర్వి ననుచుఁ
గమకింప మిక్కి లగ్గలికతో నతఁడు, నమితవిక్రమశాలియై సంభ్రమించి
యీపండు కడుదోర యిది సార మనుచు, నేపున నయ్యింద్రునిభమున కెగసి
ప్రళయకాలమునాఁటి పావకుభంగి, బలువిడిఁ గవయు నప్పవనునిభంగి
వజ్రమహోజ్జ్వలజ్వాలలు నిగుడ, వజ్రంబుఁ గొని పూన్చి వేచె వైచుటయు
నది దాఁకి దాపలి హనువెల్ల విఱిగి, యుదయాద్రిపైఁ గూలె నురుమూర్ఛతోడఁ
బుత్రుదైన్యముఁ జూచి పొడము నయ్యలుక, వృత్రారిపై నల్గి వెస గంధవహుడు
ప్రజలనందఱ యాగపశువులభంగి, నిజగతి నూర్పులు నిగుడంగనీక
యుగ్రుఁడై తనుసంధు లొండొండ విఱుగ, నిగ్రహించినవారు నిశ్చేష్టులైరి
జగములన్నియు ననుష్ఠానము లేక, నిగమశాస్త్రంబులు నెరపంగ లేక
నిత్యకర్మంబులు నెరిఁ జేయలేక, యత్యంత శూన్యంబు లై యుండి రంత
ఘములు వెసఁ గొంచు బద్మాయతాక్షి, యలరెడువేడుక నాశ్రమంబునకుఁ
జనుదెంచి పల్లవశయ్యపైఁ గూర్మి, తనయుండు లేమికిఁ దద్దయు వగచి
యెక్కడఁ బోయెనో యీకుమారకుఁడు, అక్కటా యంచు నాయడవిలో నెల్లఁ
ద్రిమ్మరి కానక ధృతి దూలితూలి, క్రమ్మినశోకాగ్ని గడునేగుచుండ
భద్రేభగామినిపతియైనయట్టి, యద్రిచరశ్రేష్ఠుఁ డైనకేసరియుఁ
తనమనోవీథి నెంతయుఁ గాంచి చూచి, యనిలవరాత్మజుం డాయుదయాద్రిఁ
గందుకచంద్రికాగతి నొప్పు భాను, నందంబు గని ఫలంబను కాంక్షఁ జేసి
యాఁకటిషెల్లున నట నీవు లేమి, సోఁకోర్వలేక నాసూర్యబింబంబు
బండని తలఁచి దోర్బలశక్తి నెగసి, చండాంశుకడ కేగి జంభారిచేత
హతుఁ డయ్యెనని మఱి యటమీఁద నడుచు, కతయంతయునుఁ బ్రియకాంతకుఁ జెప్పి
యూరార్చి నెమ్మది నుండె నున్నంత, మారుతిచేతను మానముల్ దూలిఁ
బంధురతేజముల్ పరిపోయి దివిజ, గంధర్వయక్షరాక్షసముఖ్యు లెల్లఁ
గడుభీతితోఁ గూడి కమలసంభవుని, కడకేగి వినతులై కరములు మొగిచి
మొగి బహుస్వేదజంబులు నండజములు, నొగి జరాయుజములు నుద్భిజ్జములును
ననఁగ నాలుగుజాతు లైన జంతువులు, మును మమ్ము నిర్మించి ముదముతో మాకు
నాయువు లొగి నిచ్చి యాయుష్యములకు, వాయుదేవుని నధీశ్వరుఁ జేసి తెలమి
నాతండు మీయాజ్ఞ నఖిలజంతువుల, భాతిగా నది మొదల్ పాటించుచుండి
యేవెంటనో మాకు నింతనిగ్రహము, గావించె నిప్పు డాగంధవాహుండు
దేహగేహద్వారదేహళీ సీమ, నూహింపలోపడి యుండుటఁజేసి
యవరోధముననున్న యంతఃపురంబు, నువిదలయెలుఁగులు నూర్పుల నలవె
దేవప్రజానాథ దేవలోకేశ, మావిన్నపము విని మమ్ము రక్షింపు
వాయుపీడితులమై వచ్చినమాకు, నీయుగ్రనిగ్రహ మిప్పుడు వలదు
అని విన్నవించిన నావాక్యములకు, వనరుహగర్భండు వారితో ననియె
వినుఁడు మీ రిట్లైనవిధ మెల్లఁ దెలియ, ననిలున కంజన యనుదానివలనఁ
గలిగెఁ దనూజుఁ డాకపిబాలకుండు, ఫలకాంక్ష నాదిత్యుఁ బట్టెఁ బట్టుటయుఁ
గని రాహు దేవేంద్రుకడకు వేగంబె, చని నేఁడు నూతనస్వర్భానుఁ డొకఁడు
భానుఁ బట్టినవాఁడు పర్జన్య వచ్చి, వాని నివారింపవలయు నీ వనిన
గాసిల్లి యతఁ డున్నకడ కేగుదెంచి, వాసువుఁ డురుఘోరవజ్రఘాతమునఁ
బరవశుఁగాఁ జేయఁ బవనుఁ డాతెఱఁగుఁ, బరికించి తనయునిపైఁ గూర్మి గలిగి
బలసూదనుఁడు లోకపాలుఁడు గాన, బలభేది కెగ్గుగాఁ బ్రజలఁ బీడించి
యశరీరియై చొచ్చె నఖిలజంతువుల, వశగతిఁ బవనుండు ప్రాణముల్ బలము
పవనుండు ధాతుసంబంధకారణము, పవనప్రభావంబుఁ బరికింప నరుదు
భువనత్రయాధారభూతమయుండు, పవనుండు లేకున్నఁ బడు శరీరములు
కావునఁ బవనుఁడు కలుషించినపుడు, జీవుల కేవెంట సేమంబు గలుగు
మీ రిప్పు డూర్పుల మెలఁకువలేక, యూరక నిలువెండియున్న భూజముల
గతి నున్నగతి సదాగతి గానఁ బాసి, గతిఁ బడు తొల్లింటిగతి నెల్లగతులు
మన మందుఁ బోవుట మతినిచారింప, ననువైనతెఱఁ గంచు నప్పుడు కదలి
సర్వగీర్వాణులు సర్వగుహ్యకులు, సర్వగంధర్వులు సర్వరాక్షసులు
సర్వయక్షులు మఱి సర్వసంయములు, సర్వప్రజలుఁ గొల్వ జలజసంభవుఁడు
పవనుపాలికి నేగఁ బవనుఁడు నచటఁ, బవిఘాతమున జాలఁ బరవశుఁడైన
కొడుకును దా నెత్తుకొని విషాదమునఁ, గడుఁగలంగుచు బ్రహ్మగతి సంభ్రమమునఁ
జక్కంగ నెదురుగాఁ జనుదెంచి మ్రొక్కె, మ్రొక్కిన నాచతుర్ముఖుఁడు మోదించి
యనిల లెమ్మని పల్కి యతఁ డెత్తుకొనిన, వనచరార్భకు పారవశ్యంబుఁ జూచి
యినమయూఖములకు నిందురశ్ములకు, ఘనతరస్నేహంబు గలిగెనో యనఁగ
నవముద్రికారుచుల్ నఖరచంద్రికలు, నవిరళిస్థితి నొప్పు హస్తాంబుజమున
నంగసమ్మార్జన మల్లన చేయ, సంగతప్రాణుఁడై చయ్యన నతఁడు
నలువ యంటుటఁ జేసి నలిఁదేఱి పొలిచె, జలముచేఁ బ్రొదలిన సస్యంబుకరణి
నంత నందనుఁ జూచి యంతరంగమున, వంతయంతయుఁ బాసి వాయుదేవుండు
ముద మార జగములు మునుపటియట్ల, వదలక ప్రజలందు వర్తింపఁదొణఁగెఁ
బ్రజలు నాదురవస్థఁ బాసి మోదించి, రజుఁ డప్పు డనిలజు నలరింపఁదలఁచి
సురలనందఱఁ బిల్పి సురరాజ యముఁడ, వరుణుఁడ యీశాన వైశ్వానరుండ
ధనదుఁడ చెప్పెదఁ దగుహితంబొకటి, వినుఁడు మీరందఱు విమలచిత్తములఁ
గడక నీశిశు వొక్కకార్యంబు మనకుఁ, గడుఁబ్రియంబున మీఁదఁ గావింపఁగలఁడు
గాన నందఱము నీకపికుమారునకు, మానుగా వరములు మన మిత్త మనియె
ననవుడుఁ బ్రియ మంది యంజనాతనయుఁ, గనుఁగొని తనవజ్రఘాతంబువలన
హను వట్లు విఱుగుట నఖిలలోకములు, హనుమంతుఁ డనుపేర నధికుఁడై పరఁగ
వానికి వర మిచ్చి వజ్రఘాతమునఁ, జావు లేకుండంగ శతమఖుఁ డపుడు
దండహస్తుఁడు కాలదండంబుచేత, దండి మృత్యువుచేత దండింపఁబడక
యెన్నఁడు రోగంబు లెవ్వియు లేక, యున్నతశుభమూర్తి నుండంగనిచ్చె
దయతోడ వరుణుండు తనఘోరపాశ, చయముచే జలముచేఁ జాకుండనిచ్చెఁ
దనచేతఁ దనయాయుధంబులచేత, మొనసి చావకయుండ ముక్కంటి యిచ్చెఁ
గర మొప్ప నగ్నియుఁ గనకకుండలము, లరుదైనకచ్చడ మర్థితో నొసఁగెఁ
దనగదతాఁకున ధర గూలకుండ, నని నసాధ్యుఁడు గాఁగ యక్షేశుఁ డిచ్చె
మునుమిడి నేర్పుతో మును విశ్వకర్మ, తనయొనర్చిన యాయుధంబులచేత
మరణంబు లేకుండ మన్నించి యిచ్చెఁ, గరువలి బిట్టల్కఁ గడువేడ్కతోడ
నితఁడు విద్యాభ్యాస మెన్నఁడు సేయ, మతిఁ గోరునాఁడు సమస్తశాస్త్రములు
ననుపమగతి వచ్చునట్లుగా నిచ్చె, దనతోడితేజంబుఁ దగ భానుఁ డిచ్చె
మఱియుఁ దక్కినసురల్ మారుతి కపుడు, వరము లీరీతిని వరుస నిచ్చుటయుఁ
బాయనిమునిశాపభయము లేకుండ, నాయు వగ్గలముగా నజుఁ డిచ్చె నిచ్చి
యనిలుని గనుఁగొని యనఘ నీసుతుఁడు, వనచరశ్రేష్ఠుండు వరకీర్తిఘనుఁడు
నసహాయశూరుండు నసమానబలుఁడు, పస గల్గువాడు విద్వాంసుండు మఱియు
ననివార్యసత్త్వుండు నని నజేయుండు, ననుపమతేజుండునై వ్రాలఁగలఁడు
కామరూపము కామగమనంబు నెపుడు, కామించునప్పుడు కల్గు నీతనికి
రామచంద్రుఁడు లోకరక్షకుఁ బూని, యామినీచరుల రూపడఁగించునాఁడు
జయము రామునకును సమరంబులోన, భయము రావణునకుఁ బాటించు నితఁడు
కడునద్భుతములైన కడిదికార్యములుఁ, గడిమి మైఁ బెక్కులు గావింపఁగలఁడు
విజయంబు లితనికి విను మంచుఁ బలికి, నిజలోకమున కెగె నీరజాసనుఁడు
నమరులు తమతమయావాసములకు, నమరంగఁ జని రంత నాసమీరణుఁడు
నందనుఁ గొని యంజనాదేవికడకు, నందితహృదయుఁడై నలి నేగుదెంచి
సుతు నిచ్చి వరములు సురలు నీసుతున, కతిమోదమున నిచ్చిరని యెఱిఁగించె
నంత శైశవమున నంజనాతనయు, డంతంతఁ జని తాపసాశ్రమంబులకు
మునుల కృష్ణాజినములు వల్కలములుఁ, గొని వృక్షశాఖలఁ గ్రుమ్మరుచుండి
హోమాగ్ను లార్పుచు నొగి సృక్సృవాది, హోమసాధనములు హోమగుండముల
నొండొండ వైచుచు హోమవేదికలఁ, గుండల ఘృతములు కూలఁద్రోయుచును
జినరాళ్ళభాండముల్ చిల్లులు వుచ్చి, చనుచు నివ్విధమున సంయమీశ్వరుల
వారక వారింక వారిచిత్తముల, వారిజాసను దివ్యవరశక్తిఁ జేసి
తమఘోరశాపముల్ దాఁకలేకున్కిఁ, తమలోనఁ బరికించి తాల్మిసేయుటయు
దానికి మదిలోన దాఁకి కేసరియు, మానుగాఁ బవనుండు మాత యంజనయుఁ
దనయుఁడ వలదంచుఁ దగుబుద్ధిఁ జెప్పఁ, వెనుకఁ బల్మఱు నిట్లు వేసరించుటయుఁ
గినిసి భార్గవులు నాంగీరసు లనఁగ, ననఘ తపోమూర్తులగు మహామునులు
నీ వెఱుంగకయుండు నీలావు ననుచు, నీవీరు శపియించి రీతఁడు నంత
నాయాశ్రమముల నతిశాంతవృత్తిఁ, బాయక మునులకు భక్తుఁడై యుండె
నంత నాయంజన యాత్మజుఁ జూచి, యెంతయు ముదముతో నింపారఁ బలికె
ననఘ నీమామలు నతిబలోన్నతులు, నెనయఁ గిష్కింధ దా మేలుచున్నారుఁ
గొనకొని నీ వేగి కోర్కె నందుండి, యినతనూభవునకు హితమంత్రి వగుచు
వారక వర్తింపు వాలిసుగ్రీవు, లారయఁ దమలోన నరమర లైన
సుగ్రీవునకుఁ బూని శూరత మెఱసి, యగ్రజు వాలి నుర్వి గూల్పకుము
అరయంగ వారు నీ కర్థి నిర్వురును, సరియె కావున వల్దు సమరయత్నంబు
ననవుడు నౌఁగాక యని కేలు మొగిచి, మనమున నతిభక్తి మాత కి ట్లనియె
బ్రాతిగా నాకు నీబ్రహ్మచర్యంబు, ధాతయు నొసఁగెను దక్క నాచేత
మ్రొక్కించుకొనఁదగు మూర్తి యెవ్వాఁడు, అక్కజంబుగ దయ నాన తిమ్మనుఁడు
ఓపవనాత్మజ యొనర నీమేన, దీపించుచున్న యీదివ్యభూషణము
లరుదారఁ గాంచినయతఁడు నీ కొడయఁ, డరయ నీవసుమతి యనఘాత్మ యంచుఁ
దనతల్లి పలికిన తథ్యంబ యనుచు, మనమున హర్షించి మహనీయశీలుఁ
ఆంజనేయుఁడు వాలిసుగ్రీవులకడకుఁ గిష్కింధకు వచ్చుట
దలకొని సాష్టాంగదండంబు వెట్టి, యెలమిఁ సద్భక్తితో నెరఁగి మాతకును
మనమున హర్షించి మహనీయశీలుఁ, వలగొని నిల్వ నవ్వనిత దీవింప
నలరుచుఁ గిష్కింధ కట వేగ నేగి, నలరు చచ్చటికపు లంతఱు మ్రొక్కి
యరమరికయు లోక నందఱిలోన, నిరవంద సుగ్రీవు నిష్టుఁడై యుండె
క్షితినాథ వాలిసుగ్రీవులతండ్రి, వితతతేజుఁడు ఋక్షవిరజుఁ డన్పేర
గపిరాజు కడుఁబెద్దకాలంబు నీతి, నిపుణుఁడై రాజ్యంబు నెమ్మితోఁ జేసి
యమరలోకమునకు నరిగినపిదప, నమరుగ మంత్రజ్ఞులగు మంత్రివరులు
వానరరాజ్యంబు వలనొప్పఁజేయ, భానుతేజుని వాలిఁ బట్టంబుఁ గట్టి
రాతఁడు గావిందు నధికారమునకు, భాతిగా సుగ్రీవుఁ బతిఁ జేసి రంత
నగ్గికి గాలికి ననుకూలవృత్తి, నగ్గలంబుగ నెయ్యమైన చందమున
వవజాప్తసుతునకు వాయుపుత్రుండు, మనమున నరలేని మంత్రియై యుండ
వారక తమలోన వైరంబు వుట్టె, శూరుఁడౌ వాలికి సుగ్రీవునకును
వ్రాలిన గడిమిమై వాలిసుగ్రీవు, నాలంబులోపల నది మొదల్ గాఁగఁ
బరిభవింపఁగఁ జూచి భానుపుత్త్రునకుఁ, పరమాప్తుఁ డయ్యు నీపవననందనుఁడు
నీతఁడు నిజశక్తి యెఱిఁగి మార్కొనిన, నితనితోఁ బోరగఁ నెవ్వరు గలరు
వనములఁ గలఁగించు వాయువుభంగి, కనలి లోకము లేర్చు కాలాగ్నికరణి
వొ"? ప్రజాసంహార మొనరించు జముని, పగెరిఁ చేర్చినయపు పావనితోడ
వాలినా నెవ్వఁడు వాయుపుత్రుండు, ఫాలాక్షునైనను బంధింపఁగలఁడు
బాహుబలోత్సాహపటువిక్రమాదు, లూహింప నితనికి నొప్పు లోకముల
జలజబాంధవుచేత శబ్దశాస్త్రంబు, వెలయంగ నీతఁడు వినియెడునాఁడు
ఉదయాస్తనగముల నుగ్రాంశుతేరు, వదలక కనకాద్రి వలఁగొని తిరుగ
నాతేరుముందట నాభీలరశ్ము, లాతతగతిఁ దాఁక నభిముఖుం డగుచు
సైరించి రవితోడఁ జరియించువాఁడు, ఘోరంబుగా నభోగోళమధ్యమున
హితబుద్ధిఁ దపముల నెల్లశాస్త్రముల, ప్రతివాఁడు విను బృహస్పతియు నాతనికి
హనుమంతు వర్తన యది చెప్ప నరుదు, మనుజేంద్ర రావణు మర్దించుకొరకు
యనిమిషు లూహించి యవనిలో భాను, తనయుండు నింద్రుండు తారుండు నలుఁడు
గజుఁడు గవాక్షుండు గంధమాదనుఁడు, విజితవిరోధులు ద్వివిధమైందవులు
శూరాగ్రగణ్యుండు జ్యోతిర్ముఖుండు, వీ రాదిగా కపివీరు లైరనిన
భూలోకపతి మునిపుంగవుఁ జూచి, వాలిసుగ్రీవు లేవనితనందనులు
వాలిసుగ్రీవులయు ఋక్షవిరజునియు వృత్తాంతము
యాఋక్షవిరజుండు నతఁ డెట్టివాఁడు, గారవంబు నన్న ఘటజన్ముఁ డనియె
నావనంబున నొక్కనాఁడు నారదుఁడు, భూవర వచ్చిన పూజఁ గావించి
వాలీసుగ్రీవు లన్వారిజన్మంబుఁ, బోలంగ వినఁ బ్రీతి పుట్టెడుననుచుఁ
దప్ప కే నడిగినఁ దాపసోత్తముఁడు, చెప్పిన కథ నీకుఁ జెప్పెద వినుము
అఖిలనిర్జరసేవ్య మగుదున్న మేరు, శిఖరేంద్రమధ్యమశిఖరంబునందు
జానుగా యోజనశతయాత్రభూమి, మానితంబుగ సభామండపం బమరు
నచట యోగాభ్యాస మరవిందగర్భుఁ, డచలితుఁడై సేయునప్పు డాతనికి
వెలువడుకన్నీరు వెసఁ గేలఁ బుచ్చి, యిలమీఁద విడుచుడు నెసఁగుతేజమున
వినుతింపఁదగ ఋక్షవిరజుఁ డనంగ, వనచరుఁ డయ్యె నవ్వానరోత్తముని
వనజసంభవుఁడును వాత్సల్య మొప్పఁ, గనుఁగొని కారుణ్యకలితుఁ డై పలికె
నిఖిలదేవతలకు నిలయమై యునికి, సుఖతరం బైన యీసురభూధరంబు
పొలుచు నిందలివనంబుల కందమూల, ఫలభోజులై మమ్ముఁ బన్నుగాఁ గొల్చి
కొడుక నీ వుండుము కొంతకాలంబు, కడుమేలు సిద్ధింపఁగలదు నీ కనిన
నెలమి నీయానతి నెడపక చేయఁ, గలవాఁడ నేనును గడుభ క్తి మ్రొక్కి
దివిజాద్రి కలయంగఁ దిరిగి పక్వంబు, లవుఫలంబులు దీని యతితృప్తుఁ డగుచుఁ
బరిపక్వఫలములుఁ బరువంపువిరులుఁ, బరువడిఁ గొనివచ్చి పంకజాసనుని
ననిశంబు సాయంతనార్చనవిధుల, మనమారఁ గ్రోలుచు మఱియొక్కనాఁడు
అంగదుఁ డుదకపానార్థ ముత్తరపు, శృంగంబునకుఁ బోయి చెలువొందుచుండు
నీరజోత్పలములు నెనయుగంధముల, వారక దిక్కులు వాసించుదాని
కలహంససారసకారండవాది, జలపక్షిరవముల సరిఁజెల్లుదానిఁ
బదతలంపులకెంపు ప్రకటంబు గాఁగఁ, ద్రిదివాంగనలచేతఁ దేఱినదాని
మధుపానమదలోలమధుకరావళుల, మధురగానంబుల మావైనదాని
రంగత్తరంగల రాలుపుప్పొళ్లు, బ్రుంగుఁడై వెలయంగఁ బొలుపారుదానిఁ
గడునొప్పుగల యొక్కకమలాకరంబుఁ, బొడగని చేరంగబోయి తీరమున
నాపోవఁ బ్రక్షాళితాంగుఁడై జలము, లోపినయటు గ్రోలి యుదకమధ్యమునఁ
దననీడఁ బొడఁగని తన్నుఁ గైకొనిన, వనచరుం డెవ్వఁడో వైరిగాఁబోలు
వీనిఁ బట్టెదన౦చు వెసఁ జొచ్చి యలుక, మానసంబున బుట్టి మడువులో నుఱికి
మునిఁగి లోపల నెల్ల మునిమిడి వెదకి, తననీడ గానక తప్పెఁ బొమ్మనుచు
జలజాకరస్త్రీకి జంగమత్వంబు, గలిగెనో యన నొక్కకాంతయై వెడలి
మెఱుఁగు నిల్చినభంగి మెఱయునంగమును, నెఱు లొగి గిరిగొను నీలకేశములు
పొడవైనముక్కును బొలుపారుబొమలు, నిడువాలుగన్నులు నిద్దంపునుదురు
మెరుగారుచెక్కులు మెల్లనినగవు, బరిపోనిమించుల బాహుమూలములు
తియ్యకెమ్మోవియు దృష్టులమెఱుపు, నొయ్యని చెయ్వులు నొప్పారుమెడయు
నెక్కొన్నచన్నులు నిరుపేదనడుము, పిక్కటిల్లెడివల్దపిఱుఁదు చెన్నారు
లలితగళంబును లలితాంఘ్రియుగము, కిసలయంబుల నవ్వు కెంగేలుగవయు
ననఁటిబోఁడియలట్లు నమరు పెందొడలు, వనజసోదరమైన వదనంబు గల్గి
సకలాంగలావణ్యసౌభాగ్యములను, సకలలోకములందు సరిచెప్పరాక
కొలనితీరంబునఁ గొమరారుచున్న, యెలదీఁగెపగిది నయ్యెలనాఁగ యెుప్పి
నంత పద్మజుఁ గొల్చి యందునాఁ డింద్రుఁ, డెంతయుముదముతో నేగుదేరఁగను
జలజాప్తుఁడును శరచ్చంద్రికావిమల, జలపూర్ణ మైన యాజలజాకరంబు
నుపరిభాగముచేత నొగి సురేంద్రుండు, తపనుఁడు నప్పు డాతన్వంగిఁ జూచి
దర్పకావేశంబు దనరుచిత్తముల, దర్పించి కదియంగఁ దమకించునెడను
స్ఖలితరేతస్కులై కాంక్షలు దీరి, సలుపనొల్లక నంగసంగసౌఖ్యములు
బలభేదివలన వెల్పడినవీర్యంబు, చెలువొంద నయ్యింతిశిరముపై నుఱికి
గాలంబు దడియంగ వడినొల్కెఁ గాన, వాలినా నుదయించె వ్రాలుతేజమున
నంచితమతి నింద్రుఁ డాతనూజునకుఁ, గాంచనమాలికఁ గడుబ్రీతి నిచ్చి
సురలోకమున కేగె సూర్యవీగ్యంబు, పరికింప గ్రీవంబుపయి నొల్కె గాన
నుగ్రాంశునకు నత్తలోదరివలన, సుగ్రీవుఁ డనియెడు సుతుఁడు జన్మించె
అంత నాతని జూచి హనుమంతుతోడ, సంతసంబున నిష్టసౌఖ్యంబు జేసి
వినుతతేజంబున విలసిల్లుచుండు, తనయుఁడ వీ వంచు దయతోడఁ బలికి
తపనుండు కందర్పదర్పోపహతికి, నపరాబ్ధిఁ గ్రుంగక నరిగిన ట్లరిగె
భానుఁ డమ్మఱునాడు ప్రథమాద్రి కరుగ, మానుగాఁ దనతొంటి మగరూపు గలుగ
విగ్రహోగ్రుఁడు ఋక్షవిరజుఁ డావాలి, సుగ్రీవుఁ లనియెడుసుతులఁ దోట్కొనుచుఁ
గామరూపంబులు గైకొన నేర్చు, నామహావానరులగువారుఁ దాను
దేవత లమృతంబు దృష్తివోఁ ద్రావు, కైవడిఁ దేనియల్ కడుఁబ్రీతిఁ ద్రావి
చనుదె౦చి మ్రొక్కిన చతురాననుండు, తనయులతో నొప్పు తనపుత్రుఁ జూచి
వీనుల కిం పయిన విమలవాక్యముల, మానసం బలరింప మది విచారించి
యింక రక్షుణదక్షుఁ డితఁ డంచు నొక్క, కింకరు నీక్షించి కృపతోడఁ బలికె
నిర్మాణనిపుణత నెఱయంగ విశ్వ, కర్మునిపంపునఁ గనునొప్పుఁ గాక
యకలంకమణికాంచనాదులఁ బొల్చు, మకరతోరణములు మహితసాధనములు
మేడలు మాడువుల్ మించు బుట్టించు, క్రీడావనఁబులుఁ గృత్రిమాద్రులును
సురుచిరకాంచనసోపానపంఙ్క్తు, లరుదైనవాకిళ్ళు నమరువీథులును
ఘనమణిమయమగు కడిఁదిశిల్పములు, అనువందఁ గిష్కింధయను పట్టనంబు
వెరవున నిర్మించి వీరవానరులఁ, బొరి నం దనేకులఁ బుట్టించినాఁడ
నప్పురంబున కితఁ డధిపతియైన, నొప్పార రక్షించు నొగిఁ దరుచరుల
నటుగాన నతనితో నటకు నీ వరిగి, పటుపరాక్రములైన ప్లవగపుంగవులఁ
బ్రియమున నందఱఁ బిలువంగఁ బంచి, నయమున మన్నించి నాపల్కుఁ జెప్పి
యద్రిచరశ్రేష్ఠు లనుమతింపఁగ, భద్రకిరీటాతిపత్రాదు లమర
విపులపీఠంబున విలసిల్ల నునిచి, కపిరాజ్యపట్టంబుఁ గట్టు మీతనికి
గిరిచరాధీశుఁడై కిష్కింధ కితఁడు, పరిపాలనప్రౌఢిఁ బరగుఁ గా కనుచుఁ
బనిచె నాతండును బ్రహ్మవాక్యంబు, విని తనూజులతోడ విలసిల్లుచున్న
యాఋక్షవీరుని నతిభక్తిఁ గొలిచి, గారవంబున నేగి కపిపుంగవునకు
నజువాక్య మెఱిఁగించి యాతఁ డాతఁ డని, ప్రజ లొప్పఁ గిష్కింధఁబట్టంబుఁ గట్టెఁ
బట్టాభిషిక్తుఁడై బ్రహ్మనందనుఁడు, పట్టె సిరులతోడఁ బట్టనం బమర
సంతసంబునఁ దన్ను సకలవానరులు, నెంతయుఁ గొలువఁగ నెల్లకార్యములు
నోజ మంత్రులతోడ నొగి విచారించి, రాజనీతిజ్ఞుఁ డై రక్షానురక్తి
నెల్లదిక్కులయందు నెప్పుడు నాజ్ఞ, చెల్లంగ రాజ్యంబు సేయుచు నుండిఁ
గమలాప్తకులవర్య ఘనతేజులైన, యమరేంద్రసుతునకు నర్కపుత్రునకు
వినుతి కెక్కిన ఋక్షవీరుడు మొదల, జనని యటమీఁద జనకుఁ డైనాడు
ఈపుణ్యకథఁ ద్రితి నెవ్వఁడు సెప్పె, నాపుణ్యునకు విన్నయట్టిపుణ్యునకు
మానుగా సిద్ధించు మహితపుణ్యములు, గాన రాఘవ నీకుఁ గళ్యాణ మనిన
సౌమిత్రిసహితుఁడై సంతోష మంది, యామునీశ్వరునితో నవనీశుఁ డనియె
వాలిసుగ్రీవులు వాసవార్కులకు, భూలోకవినుతులై పుట్టినతెఱఁగు
పరికింప నురుబాహుబలపరాక్రమము, లిరువురందును గల్లు టేమి యచ్చెరువు
మునినాథ యీకథ ముదమార నీవు, వినుసింప నీచేత వింటి నే ననిన
నింకొక్కకథ నీకు నెఱిగింతు వినుము, లఁకేంద్రదమన యాలంకేశ్వరుండు
పరమపావన సీతఁ బట్టిన దాని, కరయంగ గారణం బది యొండు గలదు
రావణుఁడు సీతను బట్టుటకుఁ గారణము
అది నీకుఁ జెప్పెద నాతెఱం గెల్ల, విదితంబుగా నీవు విను మొక్కనాఁడు
కృతయుగంబున దశగ్రీవుండు జగము, నతిభీతిఁ జెంద నెల్లందుఁ గ్రుమ్మఱుచు
నారంగ బ్రహ్మజుఁ డైన సనత్కు, మారుఁ డున్నెడ కేగి మహనీయశాంతి
నకలంకగతినున్న యతనికి మ్రొక్కి, ముకుళితహస్తుఁడై ముందట నిలిచి
వినయంబుతోఁ బల్కె విశ్వలోకముల, ననఘ నీ వెఱుఁగని యర్థంబు లేద
యకుటిలబుద్ధి నే నడిగెదఁ గాన, సకలంబు నెఱిగింపు చతురాస్యతనయ
యమరులకంటె సత్త్వాధికుం డెవ్వఁ, డమరు లెవ్వనిశక్తి నడఁతురు రిపుల
నిమ్ములను జనంబు లెవ్వనిఁ గూర్చి, నెమ్మిఁ గావింతురు నిఖిలభూసురులుఁ
పరమయోగీంద్రులుఁ బరిపూర్ణబుద్ధి, పరఁగఁగ నెవ్వని భావింతు రెలమి
యనుఁడు నాదశకంఠు నందుఁ దలంపు, మనమున నెఱిఁగి యమ్మహితాత్ముఁ డనియె
బ్రహ్మార్థవిదులైన పరమయోగులకు, బ్రహ్మాదిసురలకుఁ బరికించి చూడ
నెవ్వనియుత్పత్తి యెఱుఁగరాకుండు, నెవ్వఁడు లోకంబు లెల్లఁ బాలించు
ననిశంబు దేవాసురాసు లెవ్వనికి, వినతు లెవ్వనినాభి వేధ జన్మించె
సచరాచరములైన జగము లాబ్రహ్మ, రచియించు నెవ్వాని రమణీయశక్తి
నమర నెవ్వని జెంది రఖిలదేవతలు, నమృతంబుఁ ద్రావుచు నధ్వరంబులను
నతఁడు నారాయణుం డావిష్ణుమహిమ, మతిని దర్కింప సమర్థుఁ డెవ్వాఁడు
పతత్త్వవేదులై పాంచరాత్రాది, పరమాగమంబుల బహుపురాణముల
సకలవేదంబుల సకలశాస్త్రముల, సకలయోగీంద్రులు చర్చింతు రతని
నమరాభియాతులౌ నఖిలరాక్షసుల, సమరంబులోపల సమయించుకొఱకుఁ
గరముల నసిగదాఖడ్గాదు లమర, ధరియించియుండు నాదానవాంతకుఁడు
నన విని దశకంఠుఁ డావాక్యములకు, మనమున నరుదంది మఱియు నిట్లనియెఁ
జక్రిచే రణభూమిఁ జచ్చినవారి, విక్రమంబుల వేఱ వినుతింప నేల
మధువైరిచే నాజి మరణమై చన్న, యధిపుఁ డేగతిఁ బొందు నది యెఱిఁగింపు
నావుడు విని యాసనత్కుమారుండు, రావణు వీక్షించి రజనీచరేంద్ర
యితరుచే రణభూమి నీల్గినయట్టి, ధృతిమంతులకుఁ గల్గుఁ ద్రిదివసౌఖ్యములు
త్రిదివోపభోగముల్ దీరిన పిదపఁ, దుద లేని జన్మాదిదుఃఖముల్ గల్గు
విష్ణుచేఁ జచ్చిన వీరోత్తములకు, విష్ణులోకము నిత్యవిభవమై చెల్లుఁ
బుండరీకాక్షుఁడు భూరికోపంబు, నొండొక్కవరమును నూహింపసరియె
దనుజారికోపంబుఁ దపము శత్రులకు, విను మంచుఁ జెప్పిన వింశతిభుజుడు
వారక యాదైత్యవైరితో వైర, మేరూపమునఁ గీర్తిహేతువు నాకు
నిటుమీఁద నాతెఱం గేయుపాయముల, ఘటియించునో యని కడు విచారింప
నామహాయోగియు నాతలం పెఱిఁగి, యామినీచరనాథ యనుమాన ముడుగు
కమలనాభుఁడు నిన్నుఁ గయ్యంబులోన, సమయింపఁగలఁ డన్న సంతోషమంది
యెట్టివాఁ డసురారి యెఱిఁగింపుమనిన, నిట్టివాఁడని చెప్ప నెవ్వరి కలవి
యైన నే నెఱిఁగినయంత చెప్పెదను, వీనులారఁగ నీవు విందుగా కనుచు
నాదినారాయణు నాద్యంతరహితు, వేదవేద్యుని సర్వవిభుఁ జెప్పఁదొణఁగె
దేవదేవుఁడు సర్వదేవతారాధ్యుఁ, డావిష్ణుఁ డప్రాప్యుఁ డప్రమేయులకు
నవ్యక్తుఁ డసమానుఁ డవికారుఁ డభవు, డవ్యయుఁ డతిసూక్ష్ముఁ డధికాధికుండు
పుణ్యుఁ డగణ్యుండు పురుషోత్తమాది, పుణ్యనామంబులఁ బొలుపారువాఁడు
దేవియై యిందిరాదేవి గొల్వంగ, శ్రీవత్సలాంఛన శ్రీ చెన్ను మిగులఁ
బీతాంబరం బొప్పు పృథులనీరదము, భాతిమై యమరంగ భాసిల్లువాఁడుఁ
బొరి భూతకోట్లను బుట్టింపఁ బెంప, విరియింప నొక్కఁడె వెరవైనవాఁడు
పుణ్యాశ్రమంబులఁ బుణ్యదేశములఁ, బుణ్యవనంబులఁ బుణ్యవృక్షములఁ
బుణ్యపురంబులఁ బుణ్యశైలములఁ, బుణ్యసరిత్తులఁ బుణ్యతీర్థములఁ
బుణ్యకాలములఁ బుణ్యదానములఁ, బుణ్యవ్రతంబులఁ బుణ్యకర్మములఁ
బుణ్యయాగంబులఁ బుణ్యభాగములఁ, బుణ్యయోగంబులఁ బుణ్యభావములఁ
బుణ్యతంత్రంబులఁ బుణ్యమంత్రములఁ, బుణ్యసత్కథల నెప్పుడు నుండువాఁడు
ఆపుండరీకాక్షుఁ డధ్యక్షుఁ డతఁడు, రూపింపఁ దేజస్స్వరూపమై యుండు
ఫాలాక్షుఁడై యుండు బ్రహ్మయై యుండుఁ, గాలాగ్నియై యుండు గగనమై యుండు
వాయువై యుండును వటభూజపత్ర, శాయియై తా నుండు శరధిమధ్యమునఁ
బావకుఁడై యు౦డుఁ బ్రణవమై యుండు, సావిత్రియై యుండు సత్యమై యుండు
దపములై యుండుఁ దత్ఫలములై యుండు, జపములై యుండుఁ దొల్చదువులై యుండు
బుడమియై యుండుఁ బైపొడవులై యుండుఁ, బుడమికి నాధారభూతుఁ డై యుండు
నొడలు గైకొనకుండు నొడలిలో నుండు, నొడయఁడే బ్రహ్మాదు లొగిఁ గొల్వ నుండు
గడుబెక్కులగు బ్రహ్మకల్పముల్ గడవఁ, గడపట నొక్కటఁ గడలేకయుండు
నింద్రుఁడై యుండు దినేంద్రుఁడై యుండుఁ, జంద్రుఁడై యుండును శమనుఁడై యుండు
లో నుండు వెలి నుండు లోకజాలముల, జానుగా వ్యాపించి సందు లేకుండు
భక్తిభావము దక్క పద్మజూదులకు, యుక్తి నప్పరమేశు నూహింపరాదు
తర్కంబు గెలుపును తత్త్వంబు విడిచి, కర్కశమతు లైనకాతరాత్ములకు
హరిపదం బతిదూర మై యుండు భక్తి, పరులైనవారికిఁ బ్రాపింపవచ్చుఁ
దరళభావము దక్కి తనువుఁ బ్రాణములు, భరితవిజ్ఞానాగ్ని భస్మంబు సేయు
భాగవతోత్తముల్ పరమవైష్ణవులు, యోగతృష్ణల గాంతు రోలి నవ్విష్ణు
యామినీచరనాథ యాజగన్నాథు, తామసిపై పొందఁదలఁచితే వినుము
అనఘుఁడు త్రేతాయుగాది నిక్ష్వాకుఁ, డను రాజపుంగవు నన్వయంబునను
దశరథుఁ డనుపేరి ధరణీశ్వరుండు, విశదోరుకీర్తులు వెలయ జన్మిందు
నాసత్యసంధున కాజానుభుజుఁడు, భాసురాకారుఁడు పటుపరాక్రముఁడు
నూర్జితసత్వుఁ డత్యుగ్రతేజుండు, దుర్జయుండును వైరిదుర్నిరీక్షుండు
నతిగభీరుండును నధికశూరుడు, మతిమంతుఁడును సత్యమధురవాక్యుండుఁ
గోదండచతురుండు ఘోరదివ్యాస్త్ర, వేదియు జగదేకవీరుండు నైన
రాముఁ డయ్యాదినారాయణమూర్తిఁ, భూమండలంబునఁ బుట్టంగఁ గలఁడు
సిరియును భూపుత్రి సీతనాఁ బుట్టి, గురుమతి జనకునికూతురై పెరిఁగి
రూపలక్షణగుణరుచిరతేజముల, దీపించి యారాముదేవి గాఁగలదు
అటమీఁదఁ చన కూర్మియనుజన్ముఁ డైన, చటులవిక్రమశాలి సౌమిత్రి గొలువ
పరమపాతివ్రత్యభవ్యశీలముల, నిరుపమస్థితిఁ దోడునీడయుఁ బోలె
నామహీసుతతోడ నరుగుదేఱంగ, రాముఁడు దండకారణ్యంబునందుఁ
దనతండ్రి యయియున్న దశరథునాజ్ఞ, సముచితమునివృత్తిఁ జరియింపఁగలఁడు
అన విని రఘునాథ యంతరంగమున, ననురాగమును బొంది యారావణుండు
మదగర్వ మెసఁగఁగ మసలి నీతోడఁ, గదన మెప్పుడు సేయఁగలుగునో యనుచు
సర్వలోకములందుఁ జరియింపుచుండె, సర్వేశ్వరుఁడ వీవు సముయించి తతని
ననిన నాధరణీశుఁ డావాక్యములకుఁ, దనలోన వెఱగంది తలయూఁచి పలికె
విజ్ఞానసంపన్నవిశ్వశోకముల, నజ్ఞాత మగుధర్మ మది నీకు లేదు
పదపడి పౌలస్త్యపతి యేమి చేసె, నదియుఁ జెప్పుదుగాక యన నిట్టు లనియె
జననాథ నీచేత సమరంబులోనఁ, దునియలై పడి ముక్తి దొరకొందుననుచు
ఘనబాహుఁడగు పంఙ్తికంఠుఁడు సీతఁ, గొనిపోయెనని చెప్పి కుంభసంభవుఁడు
నరనాథు నీక్షించి నగరాజమైన, సురమహీధరముపై సురలు సిద్ధులును
మునులు గంధర్వులు ముద మంది వినఁగ, ననిమిషమునిముఖ్యుఁడైన నారదుఁడు
నాకుఁ జెప్పినకథ నగలోకనాథ, నీకుఁ జెప్పెద నీవు నెమ్మితో వినుము
నారదప్రేరితుఁడై రావణుఁడు శ్వేతద్వీపమునకుఁ జనుట
బాహుదర్పితుఁడైనపంఙ్తికంధరుఁడు, సాహసంబున నిశాచరులతోఁ గూడి
యెల్లందుఁ దిరుగుచు వెవ్వ రుద్ధతులు, బల్లిదు లెవ్వరు భండనంబునకు
ధరణీశ రాక్షసదనుజగంధర్వ, సురవర్గములలోన శూరు లెవ్వారు
వారున్నయెడలకు వడి నెత్తిపోయి, వారిఁ బోరికిఁ బిల్చి వరగర్వి యగుట
భయ మెందుఁ గానక భయదసంగ్రామ, జయకాముఁడై యట్లు చరియించుచుండ
బ్రహ్మసన్నిధినుండి బ్రహ్మనందనుఁడు, బ్రహ్మవర్చసమహోద్భాసి నారదుఁడు
నొండొకరవిభంగి నురుదీప్తి మేఘ, మండలోపరిభాగమార్గంబునందుఁ
జద లెల్ల వెలుఁగంగఁ జనుదేఱఁ జూచి, యెదురుగా జని వాని నింపారఁ బలికె
లోకపూజిత సర్వలోకజ్ఞ బ్రహ్మ, లోకంబు మొదలైన లోకంబు లెల్లఁ
జూచినాఁడవు నీవు శూరులబలిమి, నేచినపురుషులు నేయఁదుఁ గలరు
కడకతో మద్భుజాకండూతి వోవఁ, దొడరి కయ్యము వారితోఁ జేయవలయు
నావుడుఁ దలపోసి నారదుం డనియె, రావణ నీమనోరథసిద్ధి వినుము
చెప్పంగఁదగు దుగ్ధసింధువుపొంత, నొప్పు శ్వేతద్వీప మొక్కటి గలదు
కనుఁగొనఁగా నందుఁగలవీరు లెల్లఁ, దనుకాంతిమై సుధాధాముఁ బోలుదురు
అతులప్రమాణంబులగు శరీరములు, నతిదీర్ఘబాహులు నతులసత్త్వములు
నురువిక్రమంబులు నుగ్రతేజములుఁ, బరుషనాదంబులు భయదరోషములు
నచలధైర్యంబులు నమర వర్తింతు, రచటికిఁ జనుమన్న ననియె వెండియును
నేయాగ మేపుణ్య మేయుగ్రతపము, ధీయుక్తిఁ జేసి యాదివిని బుట్టుదురు
మునినాథ యెఱిఁగింపు ముదముతో నాకు, ననుడు నయ్యనఘాత్ముఁ డనియె నాతనికి
విజ్ఞానమయమనోవీథి నూహింప, నజ్ఞానులకుఁ జూడ నతిదుర్లభంబు
యుక్తిభేదములెల్ల నొండొంటఁ దెలిసి, భక్తి నారాయణపరతంత్రు లగుచు
నేకనిష్ఠావృత్తి హృదయంబులోనఁ, జేకొని హరియందుఁ జిత్తంబు నిలిపి
హరికథాశ్రవణంబు హరికీర్తనంబు, హరిపదధ్యానంబు హరినామజపము
హరిమహోత్సవమును హరినిరీక్షణము, హరిసేవనముఁ దక్క నన్యంబు లేని
హరిభక్తు లైనవా రందుఁ బుట్టుదురు, ... ... ... ... ... ... ... ... ...
అసురారిచే నాజి హతు లైనవారు, నసమానసౌఖ్యంబు లందుఁ బొందుదురు
విను మంచుఁ జెప్పిన విస్మయం బంది, తనలోన నూహించి దశకంధరుండు
మదవృత్తిఁ దద్ద్వీపమార్గంబు చనఁగ, నిది కడునాశ్చర్య మేఁ జూతు ననుచు
నారదుండును నంత నలి నేగె నప్పుఁ, డారాక్షసుండును నద్దీవిఁ జేరి
విలయమేఘధ్వనివిధము నొనర్చి, బలువిడి బ్రహ్మాండభాండంబు లవియ
నంత రావణుమంత్రు లాదీవిచెంత, నెంతయు భీతులై హృదయముల్ గలఁగి
రావణుఁ గనుకొని రజనీచరేంద్ర, నీవెన్క రాలేము నిలువంగలేము
మాదగ్పములు దక్కె మామతుల్ దూలె, నీదీవిసామర్థ్య మెట్టిదో గాని
యిది చూడు మరుదైన యీపుష్పకంబు, చదలగాడ్పులఁ దూలు జలదంబుభంగి
నిగుడక నిలువక నిజశక్తి దూలి, మగిడిపోయెడి దీని మది విచారింపు
మదగర్వ మింకిన మాపని యేమి, కదనంబునకు నంచుఁ గడిమి పోవిడిచి
తొలఁగజూచిన వారితోన పుష్పకము, దొలఁగంగఁబుచ్చి యాదోషాచరేంద్రుఁ
డొక్కఁడె చనుదెంచె యుద్ధంబు సేయ, నిక్కడఁ గలవీరుఁ డెవ్వఁడో యనుచుఁ
బరికించియందుల పడఁతులఁ గాంచి, యరు దంది కదియంగ నం దొక్కవనిత
యడరువేడుక పుట్టి యఱచేతిలోన, నిడుకొని నవ్వుచు నెలమితోఁ బలికె
నెవ్వఁడు పుత్తెంచె నిం దేల వచ్చి, తెవ్వనితనయుండ వెవ్వఁడ వనిన
నేవిశ్రవసునకు నిష్టపుత్రుండ, రావణుఁడనియెడు రాక్షసేశ్వరుఁడ
సమరార్థి నై యిందుఁ జనుదెంచినాఁడ, నమితవిక్రమశాలి యగువానినొకని
నెక్కడఁ బొడఁగాన నే నంచుఁ బలుక, నక్కొమ్మలందఱు నందంద నగుచు
నానాతిచే నప్పు డ ట్లున్నవానిఁ, దా నందుకొని యొక్కతరలాయతాక్షి
శిరములు పదియును జేతు లిర్వదియు, నిరులుఁ గొన్మేనునౌ నిది యొక్కపురుగు
కనువింత చెలులార కనుఁగొనుం డనుచు, నడు మంటఁబట్టి యానాతులు చెలఁగి
శిశువు నెత్తినభంగి జిరజిర గొనఁగ, దిశ లెల్లఁ ద్రిప్పినతెఱఁగుగాఁ ద్రిప్పి
వారివారికి నిచ్చి వనజాక్షు లిట్లు, వారక నొగి నెల్లవారు గావింపఁ
గడక నొక్కతె చేయి గఱచె నాసతియుఁ, జెడుపుర్వు గొనుమంచుఁ జెలిమీఁద వైవ
నదియు నాదశకంఠు నవలీలఁ గొనుచు, నొద విన వేడ్కతో నుడువీథి కెగసి
కడువల్క చెలిచేయి గఱచినపుర్వ, వడిఁబోయి పడు మంచు వాని వైచుటయుఁ
గులిశాహతం బైనకొండచందమున, బలువిడి నబ్ధిలో బడియె మ్రోయుచును
నిబ్భంగి నందలియింతులచేతఁ, బ్రాభవం బెడలిన పఙ్క్తికంధరుడు
పడినచందముఁ జూచి పరమహర్షమున, నడరి నారదుఁ డాడె నని చెప్పిమఱియు
మనుజేంద్ర నీచేత మరణంబు నొంది, ఘనకీర్తిసుఖములు గైకొందు ననుచు
లోకైకరక్షణలోలుఁడ వైన, నీకుఁ గోపము పుట్ట నిఖిలలోకముల
గాఢదర్పంబునఁ గలఁచె రావణుఁడు, మూఢాత్మకుఁడు గాఁడు మోక్షార్థి గాని
విక్రమోజ్జ్వల నీవు విష్ణుఁడ వగుటఁ, జక్రగదాశంఖశార్ఙ్గహస్తుఁడవు
వామనరూపంబు వలనొప్పఁ దాల్చి, భూమి మూఁడడుగులు పొలము ము న్నడిగి
యుడువీథి నొకపాద మొకటి పెన్నేల, కడమకు బలిఁ బట్టి కట్టితి వీవు
సురలభక్తికి భక్తిసులభుండ వగుటఁ, గరుణించి లోకైకకంటకుండైన
రావణు వధియింప రామరూపమున, నావిర్భవించితి వాదిదేవుఁడవు
మానుషదేహాభిమానివి నగుచు, మానసంబున నిన్ను మఱపు గైకొనక
విష్ణుండ నే నని విజ్ఞానవీథి, నుష్టాంశుకులనాథ యూహించి చూడు
సతతంబు నిను రహస్యములలో నెల్ల, నతిరహస్యము గాఁగ హరుఁ డెన్నుచుండు
నృపమాత్రమూర్తివై నీయందుఁ గలుగు, విపులవిక్రమమున వింశతిభుజుని
ననిలోన సుతులతో ననుజులతోడ, మనుమలతో నిష్టమంత్రులతోడ
నిఖిలబంధులతోడ నెట్టనఁ జంపి, తఖిలలోకములకు నక్కుము ల్లణఁగ
ననురాగమును బొంది రఖిలదేవతలు, మును లాశ్రమంబుల ముదితాత్ములై రి
ఆరావణుండును నట్ల సనత్కు, మారుచేఁ జగదేకమాత శ్రీదేవి
సీతగా మునువింటఁ జేసి యద్దేవి, నా తెంపు చేకొని యట లంకలోన
జననియ ట్లునిచి నీచండకాండములఁ, గనియె నిత్యంబైన కైవల్యపదము
పౌలస్త్యకులముఖ్యుఁ బఙ్క్తికంధరుని, నాలంబులోపల నవలీలఁ దునుమ
నాదైత్యదమనుండ వగునీకుఁదక్క, నేదేవునకుఁ జెల్లు నినకులాధీశ
చెలువొంద నీకథ చెప్పిన విన్న, నలరుచుఁ బుత్రపౌత్రాదులతోడ
శుభలీల నరలోకసురలోకసుఖము, లభినతస్థితిఁ గాంతు రాపుణ్యమతులు
క్రమ మొప్పనీయుపాఖ్యానంబు శ్రద్ధ, సమయంబునం దెల్ల జపియించిరేని
బితృదేవతులు గయాపిండప్రదాన, గతిఁ దృప్తులై పుణ్యగతులు గైకొందు
రనవుడు రఘురాముఁడౌ రామచంద్రుఁ, డనుజులు మువ్వురు నర్కనందనుఁడు
నగచరోత్తములును నక్తంచరేంద్రుఁ, దగవిభీషణుఁడును నతనిమంత్రులును
నమ్మహాకథ విని యాశ్చర్యమంది, సమ్మదంబును బొంది సభలోననున్న
భూసురోత్తములును భూపాలవరులు, భాసిల్లువైశ్యులుఁ బరఁగుశూద్రులును
మఱియుఁ దక్కినవారు మతుల నందంద, వెఱఁగంది యారామవిభుని గన్గొనఁగ
నాకుంభసంభవుఁ డనియె రాజేంద్ర, నీకీర్తి వింటిమి నిన్నుఁ జూచితిమి
లోకైకవినుత శుశ్లోకుండ వగుచు, నేకాగ్రబుద్ధి నీ విల యేలుచుండు
త్రైలోక్యకంటకు దశకంఠుఁ దునిమి, వ్రాలిన నీపెంపు వర్థిల్ల నిమ్ము
అగస్త్యాది మౌనీంద్రులు రాముని వీడ్కొని చనినపిమ్మటకథ
పోయివచ్చెద మంచుఁ బొలుపారఁ దమకుఁ, జేయు సత్కృతు లొప్పఁ జేకొంచు నెలమి
నందఱుఁ దమతమయాశ్రమంబులకు, సందీప్తతేజులై చనిరి సంయములు
అంతరశ్ములు చల్లనై డిందుపడఁగ, నంతకంతకు బింబ మరుణంబు గాఁగ
నీడలు నిగుడఁగ నీడముల్ జేరఁ, గూడుచు బహుపక్షికుల మెలుఁగింప
మక్కువ గనుమాటు మరి సైఁపలేక, జక్కవల్ బెగడంద జలజముల్ మొగుడఁ
దోయజగంధముల్ దోఁగి తువ్మెదలు, మ్రోయుచుఁ దమదిక్కు మొగిరాకఁ జూచి
కైరవంబులు నవ్వఁ గమలబాంధవుఁడు, చేరె నస్తాచలశృంగంబుకడకు
నిబ్భంగి నినుఁ డస్తమింపంగ నప్పు, డబ్భానుకులనాథుఁ డఖిలభూపతుల
నర్కతనూభవుఁ డాదిగాఁ గలుగు, మర్కటోత్తములసమ్మతి విభీషణుని
నెంతయు సంతోష మెసఁగ వీడ్కొలిపి, యంతఃపురంబున కరిగె ని ట్లరిగి
సముచితక్రమమున సాయంతనాది, సమయోపచారముల్ సలిపి నిండించె
నారాత్రి వేగంగ నంచితస్తోత్ర, పారీణులగు పుణ్యపాఠకుల్ వచ్చి
వీరపుంగవరామ విజయాభిరామ, భూరివిక్రమనిత్య పుణ్య మేల్కనుము
కౌసల్య సత్పుత్త్రుగా మోచి కన్న, భాసురోదయరామభద్ర మేల్కొనుము
కౌశికుఁ డొనరించు కడిదిజన్నంబు, శైశవంబునఁ గాచి సత్కీర్తి గన్న
పాటవబహుదివ్యబాణసంపన్న, తాటకాబలగర్వదమన మేల్కొనుము
హాటకశైలంబు నాకృతి గని, మేటియై ధాత్రిలో మెఱసినయట్టి
హరచాపగౌరవాహరణైకనిపుణ, నరనాథ జానకీనాథ మేల్కొనుము
తవిలి భార్గవరాము ధైర్యంబు పెంపు, తివిచినకోదండదీక్ష మేల్కొనుము
చతురనయోపాయ సత్యప్రతిజ్ఞ, పితృవాక్యపాలన ప్రియుఁడ మేల్కొనుము
దండివిరాధుని దారుణాస్త్రమున, ఖండించివైచిన ఘనుఁడ మేల్కొనుము
ఘటితకారణజన్మ ఖరదూషణాది, భటమేఘపటలోగ్రపవన మేల్కొనుము
మారీచనీరంధ్రమాయాంధకార, నీరజబాంధవనేమి మేల్కొనుము
ఉగ్రాస్త్రమున వాలి నొడిచి కిప్కింధ, సుగ్రీవు కొసఁగిన శూర మేల్కొనుము
సదయావలోకన సత్యప్రసన్న, వదన విభీషణవరద మేల్కొనుము
దుర్వారకల్లోలదుస్తరాంభోధి, గర్వశోషణచండకాండ మేల్కొనుము
ఘను కుంభకర్ణుని గడిది బాణములఁ, దునుమాడుదుష్కృతదూర మేల్కొనుము
దశకంఠకంఠనిర్దళనప్రచండ, విశిఖప్రయోగప్రవీణ మేల్కొనుము
ఘనకీర్తిచంద్రికాక్రాంతదిక్చక్ర, జనలోకనుత రామచంద్ర మేల్కొనుము
పూతశుభాకారభూనుతాదార, భాతృవత్సల రామభద్ర మేల్కొనుము
సుఖరాత్రియై నీదు సుప్రబోధమున, నఖిలలోకములకు నానంద మొదవె
యోగనిద్రాలీల నుదధిమధ్యమున, భోగీంద్రతల్పుఁడై పొలుపారుచున్న
పురుషోత్తమునిభంగి భువనరక్షైక, పరత మేల్కొనుమంచుఁ బ్రస్తుతించుటయు
నెత్తమ్ము లిటమీఁద నిద్దుర దెలియ, నత్తెఱంగిట్టిద యనిచూపుకరణి
నల్లన నయనంబు లలరఁ దాల్చుటయు, మెల్లనిపొడ వెట్టి మేల్కని వచ్చి
మలయజవాసితమణిహేమకుంభ, జలముల నొగి వార్చి జలకంబు దీర్చి
యత్యంతనియతితో నగ్నిహోత్రాది, నిత్యకర్మంబుల నెరయంగఁ దీర్చి
భూసువర్ణాదికపుణ్యదానములు, భూసురవితతికిఁ బొలుపార నిచ్చి
సురపితృపూజలు సొరిదిఁ గావించి, గురుభక్తియుక్తుఁడై గురుల మన్నించి
భూసురాశీర్వాదపూతంబులైన, సేసఁబ్రా లొనరంగ శిరమునఁ దాల్ప
కప్రంబుతోఁ గూడఁ గలయ వీడ్యములు, విప్రపుంగవులకు వేడ్కతో నిచ్చి
యాననం బలరంగ హస్తముల్ మొగిచి, వీనుల కింపార వినయంబుతోడ
విచ్చేయుఁ డని పల్కి వివిధభూషాదు, లచ్చుగా ధరియించి యధికతేజమున
బహుచిత్రమణిగణప్రభలు శోభిల్ల, మహనీయతరసభామండపంబులకుఁ
జనుదెంచి జనముఖజలజంబు లలరఁ గనుఁగొని దోషాంధకారంబు విరియ
భద్రపీఠంబను ప్రథమాద్రి రామ, భద్రుండు విలసిల్లెఁ బద్మాప్తుకరణి
నంత వసిష్ఠాదులగు పురోహితులు, సంతుష్టమతులైన సకలభూపతులు
రుచిరభూషణజాలరోచిష్ణు లగుచు, నుచితాసనంబుల నోలి శోభిల్ల
వరభూషణాదుల వరుసఁ గైసేసి, పరమప్రియంబున భరతుండు నెలమి
శత్రుభీకరభుజోజ్జ్వలుఁడు లక్ష్మణుఁడు, శత్రుఘ్నుఁడును వచ్చి సమయజ్ఞు లగుచు
జననాథముఖచంద్రచంద్రికారుచులఁ, గనుఁగొని తమహస్తకమలముల్ మొగిచి
బహురత్నకోటీరభాగముల్ గదియ, మహితాత్ము లింపార మాటిమాటికిని
బని యేమి దేవ యన్పల్కుము న్గాఁగఁ, బనులెల్లఁ గైకొంచు భక్తిమైఁ గొలువ
ననుపమజయసత్వు లగుఋక్షవరులు, ఘనబాహులగు మహాకపులతో గూడి
మర్కటాధిపుఁడును మంత్రులతోడ, నర్కసన్నిభతేజుఁడగు విభీషణుఁడు
వరకవుల్ గాయకుల్ వరుసతో సరస, పరిహాసచతురులు బహుకళావిదులు
పౌరాణికులు శాస్త్రపరిణతుల్ వేద, పారగుల్ నృపనీతిపరిచితమతులు
నుచితభంగుల నుండు నురుహేమరత్న, రచితభూషాదులు రమణమైఁ బూని
లలితముక్తాదామలసితంబులైన, నలినంబు లన నొప్పు నగుమొగంబులును
గ్రాలుచూపులు నల్లకలువలోయనఁగ, నాలోలచతురంబులైన నేత్రములు
నమృతాంశునవరేఖ లడఁచు ఫాలములు, నమృతంబు మఱపించు నధరబింబములు
కాముకావళిమతుల్ గరఁగింపఁజాలు, కామకార్ముకశృంగగతిఁ బోలు బొమలు
నెత్తిమ్మితావులు నిగుడు నాసికలు, మెత్తనిచిగురుల మించు హస్తములు
నిండారు నునుశాంతి నెలకొన్న చంద్ర, ఖండంబు లన నొప్పు గండపాలికలు
వదనేందురుచులను వంచించి వెనుక, నొదవు చీఁకట్లన నొప్పు క్రొమ్ముళ్లు
విలసితభుజలతావిక్షేపణములఁ, గలయ నిగ్గులు సూపు కమ్రకక్షములు
ప్రక్క గానఁగ సకుల్ పైపయిఁ బొరలఁ, బిక్కటిల్లుచునున్న బిగిచన్నుఁగవలు
వృత్తోరుయుగములు వేడ్కఁ గ్రాముకుల, చిత్తముల్ గరఁగించు సింహమధ్యములు
నడదీగెలో యన నవకంబుఁ గాంతి, కడునొప్పు మేనులు ఘననితంబములు
చిఱుతనవ్వులు తీయచెయ్వులుఁ గల్గు, తెఱవలు వలరాజుదీమంబు లనఁగ
మణిమయమేఖలమంజీరవలయ, ఝణఝణత్కారంబు సరిఁ గ్రందుకొనఁగ
గురునితంబోల్లసత్కోమలగతుల, మురిపెంబు లమరంగ మొగి నేగుదెంచి
వరుస నానాగీతవాద్యనృత్యముల, సరసులై కొలువఁగ సమయంబు లెఱిఁగి
పొలుపుగా ధర్మార్థపురుషార్థకథలు, చెలఁగి పౌరాణికుల్ చెప్పంగ వినుచు
రాజితమణిహేమరత్నపీఠమున, రాజమధ్యంబున రాజేంద్రవిభుఁడు
రవికులోత్తముఁడైన రామచంద్రుండు, దివిజసేవితుఁడైన దేవేంద్రుభంగి
గ్రహగతుండగు చంద్రుగతి నొప్పుచుండె, మహిమ ని ట్లొప్పుదు మఱియొక్కనాఁడు
సకలజ్ఞు మిథిలేశు జనకు నీక్షించి, ముకుళితహస్తుఁడై ముద మొప్పఁ బలికె
రాముఁడు జనకుని మిథిలకుఁ జను మని వేఁడుట
నలరి విదేహాన్వయంబు నిక్ష్వాకు, కులమును వెలయుట కుశలమై యొప్పె
ధరణీశ మీరును దశరథేశ్వరుఁడుఁ, బరికింప మాకొక్కభంగియె కాదె
పెక్కునాళ్ళకు మమ్ముఁ బ్రీతిఁ గన్గొనుచు, రాజశేఖరుఁడవై రాజిల్లు మీరె
పూజితంబగుచున్న పురుషరత్నములు, ఇక్కడ నుండితి రిష్టభావమునఁ
బోయివత్తురుగాక భూపాల యనుచు, నాయతద్యుతి నొప్పునవ్యరత్నములు
కట్టనిచ్చిన వానిఁ గరపంకజమున, ముట్టి లేనవ్వుతో ముదితాత్ముఁ డగుచు
భావింప నృపవీర పరమబంధుఁడవు, నీవు కావున మేము నిన్నె కోరెదము
కాకుత్స్థకుల యిట్టికడిఁదికార్యంబుఁ, జేకొని యెవ్వఁడు సేయంగ నోపు
నీయొప్పురత్నంబు లివి నీకె యొప్పు, మాయీవిగా వీని మరలఁ గైకొమ్ము
అనవుఁడు రఘురాముఁ డౌఁగాక యనుచు, జనకభూవరు సంతసమున వీడ్కొలిపి
రాముఁడు కేకయరాజాదులను వారివారిపురంబులకుం బంపుట
తగఁ గేకయాధీశుఁ దనమేనమామ, యగుయుధాజిత్తుని నలరారఁ జూచి
కడుఁబెక్కుదినములు గడచె మీతండ్రి, యుడుగక చింతించుచుండు మీవలన
నీరాజసంపద లెల్ల మీయవియె, గౌరవోజ్జ్వల మాకుఁ గలవారు మీరె
యీభూతినిలయంబు లీమహామణులు, నీభూషణంబులు నెల్లఁ గైకొనుము
సౌమిత్రి ని న్నంపఁ జనుదెంచువాఁడు, భూమీశపుంగవ పోయిర మ్మనిన
మనుజేంద్ర మీచేయుమన్ననలెల్లఁ, గనకభూషాదులు కట్నముల్ మాకు
నని ప్రదక్షిణముగా నతిభక్తి వచ్చి, వినతుఁడై రఘురాము వీడ్కొని చనియె
నంత కాశీపతియగు ప్రవర్ధనుని, సంతోషమున రామచంద్రుండు సూచి
జననాథ నీతోడ సఖ్యంబు చేసి, ఘనమైన తేజంబుఁ గంటి మెంతయును
బంధురగతి నీవు భరతుతోఁ గూడి, బంధుకృత్యము తగఁ బాటించి తనఘ
పెద్దవాఁడవు మాకుఁ బ్రియమార ననుచు, గద్దియ దిగి చక్కఁ గౌఁగిటఁ జేర్చి
మహిమతో వీడ్కొల్పి మఱియును నూర్వు, రహితభయంకరులైన భూపతుల
విరిదమ్మిఱేకుల వెదచల్లు నట్టి, కరణిఁ దా నందఱఁ గలయంగఁ జూచి
రాజపుంగవులార రాజధర్మముల, రాజితగుణముల రణజయోన్నతుల
భాసురకర్మలఁ బ్రఖ్యాతు లగుదు, వాసికెక్కిన వీరవరులు మీ రెల్ల
విూలావుతేజంబు మిగులంగ నూఁది, పౌలస్త్యసుతుఁడైన పఙ్క్తికంధరుఁడు
సకలలోకములకు సమరదుర్జయుఁడు, నకలంకధీరుడు నమితదోర్బలుఁడు
నట్టిగర్వాంధుని నాలంబులోన, గిట్టి జయించితి గీర్వాణు లలర
మది నేను గారణమాత్రంబు గాఁగ, నది మీరు చేసిన యట్లుగాఁ గొనుఁడు
బవరంబునకుఁ దోడు భరతుండు నిలువ, వివిధసేనలతోడ వెస మీరు వచ్చి
చిరకాల మభినుతస్థితి నుంటి రింకఁ, బరమానురక్తి మీ పట్టనంబులకుఁ
బోయివత్తురుగాక భూపాలు రనిన, నాయుచితోక్తుల కందఱు నలరి
దారుణరణకేళి దశకంఠుఁ దునిమి, వీరపుంగవ నీవు విజయంబు గనుట
వైదేహిఁ దెచ్చుట వచ్చి పట్టంబు, మేదినీపతు లెల్ల మెచ్చఁ గైకొనుట
సంతోషమున బంధుసహితుఁడ వగుట, యంతకంతకు గీర్తి నధికుండ వగుట
పరికింప నరుఁ డిట్టిభాగధేయంబు, నిరుపమస్థితిఁ బొంద నీకుఁ జొప్పడియె
నెమ్మి సంస్మిత మైన నీముఖాంబుజముఁ, గ్రమ్మఱ నిటు సూడఁగాంచితి మేము
ఇదియె మాసంతోష మిదియె మాకోర్కి, మదిలోన మము మీరు మఱవకుం డనుచు
దండప్రణామముల్ దగ నాచరించి, నిండినప్రేమంబు నొలకొన నృపులు
సదయుఁడౌ శ్రీరామచంద్రునిమూర్తి, చెదరకుండఁగ మదిఁ జేర్చుచుఁ గదలి
పెక్కులక్షౌహిణుల్ బెదర సైన్యంబు, లక్కజంబుగ నేల యల్లాడుచుండ
తమయిండ్లకుఁ బోవురాజులు మార్గములో రాముని మెచ్చుకొనుట
నడుచుచో నమ్మహానాథు లొండొరులుఁ, గడువేడ్క రథములు గదియ రానిచ్చి
భరతుఁడు పిలిపింపఁ బ్రతినతో మనము, నరుగుదెంచినకార్య మది సేయఁగలిగె
సాహాయ్యకముపేరఁ జని మన రాము, నాహవనైపుణం బది చూడలేదు
రామరావణులకు రణమైనచోట, నేమనియుండిరో యింద్రాదిసురులు
క్రందెంత గలిగెనో గగనభాగమున, ... ... ... ... .... ...
దేవాసురాదులఁ దృణముగాఁ గొనుచు, దేవేంద్రుఁ డాదిగా దిక్పతు లడల
నాలంబులోపల నవలీల నిలిచెఁ, గైలాస మెత్తెను గౌరీశుతోడ
నట్టియాదశకంఠు నస్త్రవేగమున, నెట్టు వారించెనో యినకులోత్తముఁడు
ఎట్టిదివ్యాస్త్రంబు లేసెనో వానిఁ, గట్టల్క ననిలోనఁ గడతేర్చి పుచ్చె
నింద్రాదిదివిజుల హృదయశల్యంబు, నింద్రజిత్తనువాని నెక్కటి దాఁకి
సౌమిత్రి యేగతిఁ జంపెనో మనకు, నామహాభుజులావు లవి చూడలేదు
శూరపుంగవులైన సుగ్రీవముఖ్యు, లారఁజేసిన లావు లతివిచిత్రములు
హనుమంతు చేసినయట్టికార్యములు, విన విస్మయంబు లావిధము లన్నియును
గనుఁగొన లేకున్నఁ గాకుత్స్థుచేత, వినఁగఁ గనుఁగొన్నవిధమె కా మనకు
ననుచు సంతోషంబు లంతరంగముల, నినుమడింపంగఁ బోయిరి పురంబులకు
నిమ్ముల భరతుడు నెమ్మి లక్ష్మణుఁడు, నెమ్మి శత్రుఘ్నుఁడు నృపతివాక్యమున
రాజుల నయ్యయిరాజధానులకు, వాజిసామజరథావళులతో ననిచి
తేజంబుఁ బెంపును దీపింపఁ దన్నుఁ, బూజించి క్రమ్మఱఁ బుత్తెంచునపుడు
రాజన్యవిభుఁడైన రఘువీరుపేర, రాజమానానేకరత్నసంఘములు
చారుకాంచనముల సంతతద్యుతులఁ, దారకావళి మించు తారహారములు
భాసిల్లుతొడవులు పరికింప నొప్పు, దాసీసమూహముల్ తగురథంబులును
నుత్తమాశ్వంబులు నున్నతాకృతుల, మత్తమాతంగముల్ మలయజాదులును
రాముఁడు కపివీరులకు బహుమానము లిచ్చుట
బొరిపొరిఁ గొనివచ్చి భూలోకనాథు, చరణంబులకు మ్రొక్కి సరికేలు మొగిచి
దేవర మీకుఁ బుత్తెంచినా రనుచు, ......................................
విన్నవించినవాని వేడ్కఁ గైకొనుచుఁ, గొన్నిభూషణములు కొన్నిరత్నములు
నుగ్రాంశుకులనాథుఁ డుగ్రతేజునకు, సుగ్రీవునకు నిచ్చి సుస్థితుం డగుచుఁ
దగుభూషణమ్ములు ధర్మైకనిరతుఁ, డగువిభీషణునకు నందంద నిచ్చి
సరినాఁగ యామినీచరులకు నెల్ల, నురుతరాభరణంబు లొగి నొప్ప నిచ్చి
భవ్యదయాదృష్టి పరమమంత్రులకు, నవ్యంబులగు భూషణము లిచ్చె నిచ్చి
సుగ్రీవుఁ జూచి నీసుతుఁ డంగదుండు, విగ్రహోదగ్రుఁడై వెలయు నీలుండు
హనుమంతుఁడును మాకు నత్యంతహితులు, ఘనవిక్రములు వాలికంటే నీకంటె
వీరు గావించిన విక్రమక్రమము, లారసి చూడంగ నతివిచిత్రములు
అది గానఁ దగు పూజ కర్హులు వీరు, వదలక మన్నింపవలయు మా కనుచుఁ
గడువేడ్కతోఁ గేలఁ గరమొప్పఁ దిగిచి, తొడలపై నిడుకొని తొడరారు కరుణఁ
దన దొడ్డతొడవులు దగ విభాగించి, జనులెల్లఁ బొగడంగ సరిరాఁగఁ దొడిగె
నంత నంగదుఁడును నచలనందనుఁడు, సంతోషమున మ్రొక్కి సభ నుల్లసిల్ల
గజగవాదులు నట్ల కడకతో మ్రొక్కి, నిజమైనభక్తితో నిలుచున్నఁ జూచి
యర్కవంశాధీశుఁ డనియెఁ దా నిట్లు, కర్కశవిక్రమఘనులైన మీరు
మర్కటోత్తములార మాకు సోదరులు, తర్కింప బంధువుల్ తనువు ప్రాణములు
వెలయంగ మీయట్టి వీరపుంగవులు, కలుగు సుగ్రీవుండు కడుధన్యుఁ డనుచు
నిరుపమాకృతి నొప్పు నీలుని నలుని, గిరిచరాగ్రణియైన కేసరిఁ గుముదు
ఘనుని సుషేణుని గంధమాదనుని, వినతుని మైందుని ద్వివిదునిం బనసు
వరకీర్తియుతు జాంబవంతు గవాక్షు, దురవలోకుండగు ధూమ్రు సన్నాహు
మొగిఁ బ్రజంఘుని దధిముఖుని దుర్దమునిఁ, దగు మహాబలు మహోద్దతు నింద్రజాను
నాళీకముఖుఁడగు నగచరోత్తముని, నాళీకముల నవ్వు నయనంబు లలరఁ
గనుఁగొని బహురత్నఖచితంబులైన, వినుతభూషణములు వివిధాంబరములు
మానితస్థితి నిచ్చి మఱియు నీవలయు, వానరోత్తములకు వరుసతో నిచ్చి
నిచ్చలు నిబ్భంగి నృపుఁడు మన్నింప, మెచ్చైనఫలములు మేటితేనియలు
నమృతోపమానంబు లైన యన్నములు, నమర భుజించుచు నంచితాకృతులు
ప్లవగగోలాంగూలభల్లూకపతులు, నవిరళస్థితిఁ గూడి యామినీచరులుఁ
జరియించుచుండి రాజననాథుఁ డంత, సురుచిరస్థితి నొప్ప సుగ్రీవుఁ జూచి
గిరిచరాధిప నీవు కిష్కింధ వెడలి, చిరకాల మయ్యెను శిశిరంబు వచ్చె
నీసేనతో నేగి నీవు నీపురిని, భాసురస్థితి మైత్రిఁ బాటించియుండు
ముపచారవాక్యంబు లొండింక నేల, కపినాథ నీ వెల్లకపులఁ బాలింపు
వాలినూనుఁడు వాలి వరులలో నెల్ల, వ్రాలినవీరుఁ డీవాయునందనుఁడు
విజయుఁ డీశతబలద్వివిదమైందులును, గజుఁడును గవయుండు గంధమాదనుఁడు
శరభుండు కుముదుండు జాంబవంతుండు, హరియుఁ గేసరియు గవాక్షుండు నలుఁడు
నీసుషేణుండును నీసుబాహుండు, నీసుందరుండును నీపాటలుండు
హేమాచలోన్నతి నేపారుచున్న, యీమేటిశరభుడు నీనిశంభుండుఁ
జూడుఁడు మొదలైన శూరులనెల్ల, వేడుక మన్నింపు వేఱు సేయకుము
వీరపుంగవ నీతి విడువకు మనుచు, నారవినందనుం డలరంగఁ బలికి
యుపగూహనంబుల నుల్లంబు లలర, గపినాయకులనెల్లఁ గడు గారవించి
సమ్మదంబున విభీషణుఁ జూచి మాకు, నెమ్మి గావించితి నీ వెల్ల హితవు
ధర్మాత్ముఁడవు సత్యదాక్షిణ్యమతివి, నిర్మలవ్రతుఁడవు నీతిమంతుఁడవు
గాన నీవకలంకగతి లంక నేలు, మానుగా సురలకు మఱి రాక్షసులకు
ననఘుఁడు మీయన్న యగుకుబేరునకుఁ, దనర నీ వేయెగ్గుఁ దలఁపకయుండు
ధర్మవర్తన మెందుఁ దప్పనివిహిత, కర్ములు ధరఁ బెద్దకాల మేలుదురు
పాయక ధర్మంబుఁ బాటింపు మనఘ, మాయెడ నెయ్యంబు మఱవకు మనిన
శైలచరాదులు సకలరాక్షసులు, మేలు మేలని రాము మృదుతరోక్తులకు
నలరుచు నీబుద్ధి యమరు నీబాహు, బలవిక్రమంబులు ప్రణుతింప నొప్పు
జగదీశ నీకీర్తిచంద్రికల్ జగము, లొగినిండి యొప్పుచు నున్నవి యనుచుఁ
బలుమాఱుఁ గొనియాడఁ బవననందనుఁడు, నలువార దండప్రణామంబుఁ జేసి
నరలోకనాయక నాకు మీమీఁదఁ, దిరముగాఁ గల భక్తి దీపింపనిమ్ము
వీరుండ నీకథ వినఁబడుచుండు, నారంగ నెంచాక నంతకాలంబు
జవనాథ నీకథాజలధి నోలాడ, ననిశంబు నాచిత్త మది గోరుచుండు
నిచ్చలు నచ్చరల్ నీకథామృతము, వచ్చి నాకడఁ బాడ వర మిమ్ము నాకు
నెంచాఁక నీకథ యెసఁగు లోకముల, నంచాఁక ధరియింతు నాయు వే ననినఁ
హనుమదాదులు రాముని వీడ్కొని చనుట
గరుణావిలాసంబు కన్నులఁదోఁపఁ, గరము వేడుకతోడ గద్దియ డిగ్గి
యాలింగనము చేసి యనిలనందనుని, నీలోకజాలంబు నెంచాఁకఁ గలుగు
రామాయణము గల్గు రమణ నెంచాఁక, నీమేను నందాఁక నిత్యమై యుండు
రాకాసుధాకరరశ్ముల నగుచు, నీకీర్తి వర్తించు నిఖిలలోకములఁ
గపికులోత్తమ మాకుఁ గావించినట్టి, యుపకారమునకు మా ఱొనరింపలేము
ఆపదల్ బ్రాపించు నప్పుడు సుజను, లోపి ప్రత్యుపకార మొనరించు టెల్ల
నీకు నాపద లేదు నిఖిలలోకముల, నేకతంబున నంచు నింపారఁ బలికి
నాయకరత్నమై నడుమ వైడూర్య, మాయతద్యుతిఁ బొల్చు హార మిచ్చుటయు
ధరియించి మారుతి దనరె నక్షత్ర, పరివృతాంగంబైన భర్మాద్రిపగిది
నృపలోకనాథుండు నెమ్మితో మఱియు, నుపగూహనంబుల నుచితవాక్యముల
నిమ్ముల మన్నించి యెలమి వీడ్కొలుప, సమ్మదంబున నద్రిచరనిశాచరులు
సాఁగిలి మ్రొక్కుచుఁ జనిరి చిత్తముల, రాఁగిల్లి తమతమరాజధానులకు
నమ్మహీశుండును నతిభక్తితోడఁ, దమ్ములు పనిచేయ ధరణి యేలుచును
కుబేరునియొద్దినుండి పుష్పకము మరలవచ్చుట
అపరాహ్ణసమయమునం దొక్కనాఁడు, విపులవాక్యంబుల వినువీథి వినియె
ననమ నేఁ బుష్పకంబను దాన మీరు, పనిచిన పౌలస్త్యుపాలికి నరిగి
కిన్నరాధిప రఘుక్షితిపతి నిన్ను, మన్నించి నను నీకు మరలంగ నిచ్చెఁ
బుత్తేరవచ్చితిఁ బొలుపార ననిన, విత్తాధిపతి కడువేడ్కతోఁ బలికె
నమరవిద్రావణుండైన రావణుని, సమదపుత్రామాత్యసహితంబు గాఁగ
దుస్సహరణభూమిఁ దున్మాడివైచి, నిస్సీమవిజయుఁడై నిను దెచ్చెఁ గాన
వసుధేశునొద్దనె వదలక నీవు, వసియింపఁదగు నన్న వచ్చితి నేను
దలఁచినప్పుడు వచ్చి ధరియింతు రూపు, గలిగియుఁ బొడలేక గమనింప నేర్తు
నా కేమి యానతి నరనాథ యనినఁ, గాకుత్స్థపతి విని కరుణతోఁ బలికె
నగుఁగాక గైకొంటి నతనివాక్యములు, తగువున నే నిన్నుఁ దలఁచినయపుడ
రమ్ము నీ కిమ్మైన రమ్యదేశమున, సమ్మదంబున నీవు చరియింతుగాక
యని గంధపుష్పలాజాదులం బూజ, లొనరించి వీడ్కొల్ప నుడురాజవీథి
రాజమానానేకరత్నదీధితులఁ, దేజరిల్లుచుఁ దూర్పుదిక్కున కరిగె
నాలోన భరతుండు హస్తముల్ మొగిచి, భూలోకపతితోడఁ బొలుపారఁ బలికె
పూజితధర్మైకబుద్ధి పెం పెసఁగి, రాజన్యవర నీవు రాజ్యంబు సేయ
నేరోగములును లే వెల్లభూజనులు, నార నాయుష్మంతు లగుచున్నవారు
కాలంబు దప్పక కడిమిమై వాన, లోలిమైఁ గురియించుచుండు నింద్రుండు
పాయక సుఖతరస్పర్శంబు లగుచు, వాయువు లెలమితో వర్తించుచుండు
వెసలఁ గీర్తులు నిండఁ ద్రిదశులు మెచ్చ, వసుధఁ బాలించుచు వర్తించునట్టి
రాజులలో నిట్టిరా జెందుఁ గలఁడు, రాజాధిరాజైన రామచంద్రుండ
యని సంతసిల్లుచు నఖిలలోకులును, వినుతి సేయుదురంచు విన్నవించుటయుఁ
గుండలమణికాంతిఁ గొమరారుచున్న, గండభాగంబులఁ గడునవ్వు మెఱయ
భరతువాక్యములకుఁ బ్రమదంబు నొంది, ధరణిఁ బాలించుచుఁ దగనొక్కనాఁడు
విద్యాధరాదులు విహరించునింద్రు, నుద్యానవనమన నుల్లసిల్లుచును
ధరణికిఁ దొడవైన తనవనంబునకు, ధరణిజ తోడ రా ధరణీశుఁ డరిగి
పొరి నశోకంబులుఁ బోకబోదియలు, సురగలుఁ జొన్నలుఁ జూతపోతములుఁ
బనసలు నరఁటులుఁ బగలుచీఁకట్లు, గొనుతమాలంబులుఁ గోవిదారములు
దాడిమంబులు నారదములుఁ బెంపొందు, నీడలు నిమ్మలు నింబభూజములు
మాతులుంగంబులు మంచినేరేళ్ళు, నాతతమోదములయిన కేతకులు
మాటికిఁ దనుతావిమారుతంబునకుఁ, బాటిల్లఁ బూచిన పాటలీతరులు
నాగకేసరములు నవకంబులైన, సాగు కింజల్కకేసరవృక్షములును
కడలేనికడుములు కర్ణికారములు, కడునొప్పుబొగడలు ఖర్జూరములును
గొరువులు నెరవులు గురువిందపొదలు, నరుదుగాఁ బొదలిన యంబాళములును
లలినొప్పు నుద్యానలక్ష్మికి నవియ, తిలకంబు లననొప్పు తిలకభూజములుఁ
గమ్మతావులు దిశల్ గలయ వాసించు, సమ్మదం బొనరించు చంపకంబులును
హింతాళతాళము లెడనెడ మఱియు, వింతలై కనుపట్టు వివిధవృక్షములుఁ
దరగని నెత్తావి దనరు క్రొవ్విరులు, గిరిగొన్న నవలతాగేహవాటికలుఁ
గమలముల్ పగళులు కలవలు రేలు, నమరంగ మకరంద మందంద దొరఁగ
వెలితి గానఁగరాని విమలపూరములఁ, బొలుచు వీచుల రాలు పుప్పొళ్ళజడియుఁ
గలహంససారసకారండవాది, కలకలారావముల్ గలకొలంకులును
వాదటఁ దనరుచు నవ్యరత్నములు, వేదికాతలములు వేడ్కలు వెనుప
మనసులు గలఁగ మన్మథుఁడు దర్పింప, వనజలక్రీడల వాంఛతోఁ జలిపి
యౌవనమధ్యంబునం దొక్కచోటఁ, బావనసమతలస్ఫటికవేదికను
బఱచినరత్నకంబళముపై విరులు, పఱచినఁ గూర్చుండి పరమానురక్తి
మాకందమకరందమధువులు గ్రోలి, జోకలై తుమ్మెదల్ శ్రుతిఁ గూడి మెఱయ
సరసగీతంబులఁ జారులాస్యములు, నరుదార హృద్యంబులైన వాద్యముల
గణికాజనులు దన్నుఁ గదిసి మెప్పింప, మణిభూషణాదులు మది కింపు నొసఁగఁ
పురజను లలరంగ భూపుత్రితోడఁ, బురమున కేతెంచి భూలోకవిభుఁడు
నిర్మలతరనీతినిష్ఠాత్ముఁ డగుచు, ధర్మక్రమంబున ధర నేలుచుండె
నిచ్చలు సీతయు నియతవ్రతంబు, లచ్చుగాఁ గైకొని యందఱత్తలకుఁ
బరమపావనమైన భవ్యశీలమునఁ ,బరిచర్య సేయుచు భక్తి మ్రొక్కుచును
ఒకరక్కసి సీతకుఁ దంత్రము పెట్టుట
బ్రకటితభోగసౌభాగ్యసంపదల, నొకకొఱఁతయు లేక యున్న దేవారిఁ
గనుఁగొని చూపోప కట యొక్కనాఁడు, తనమదిలోనున్న తల పెల్లఁ దెలియ
ధరణిజతో వినోదంబుగాఁ గడఁగి, కరమర్థిఁ బలికె నక్కజము దీపీంప
నోరామ కుంభజుం డొగిశంబరారి, యారామకంటెఁ జెల్వైన కామినులు
నేమానవులకును నెఱుఁగరాకుండఁ, గ్రామరూపంబులు కరము శోభిల్లఁ
దనరారు వారినిద్దఱి నిచ్చుటయును, మనమున నర లేక మైత్రితో వారు
బాణాకృతుని రామభద్రునియెద్ద, నేణాక్షు లుండుట యెఱుఁగుదొ లేదొ
యనవుడు సీత దా నాత్మలో నిట్టి, పని యెట్లు రామభూపతి కెట్టు లోర్వ
కాడిననాడె నేమనవచ్చు నల్ల, నాఁడంత చేసిన నాతియాఁగాదొ
యని చింతయును మోద మటు పురికొనఁగ, వనజాక్షి యత్తల వరుస వీడ్కొనుచుఁ
గడుమోదమునఁ దొంటికంటె శోభిల్లఁ, దొడిపూసికట్టి కౌతూహలం బొప్పఁ
గాకుత్స్థుఁడున్న యేకాంతపుటింటి, కాకందువుల కేగి యతివినోదములఁ
బ్రియునకుఁ బ్రియముగాఁ బ్రియగోష్ఠి,సలిపి, ప్రియుచిత్త మెఱిఁగి సంప్రీతి నిట్లనియె
దేవర యేకపత్నీవ్రతుం డనుచు, వరజనులు నక్కజముగా ననెడి
పలుకు బొంకని కానఁబడుఁ జిత్రగతుల, వలఁతులై మనుజు లెవ్వరు నెగ్గకుండ
లలితవిలాసినులైన కామినులు, గలరఁట నీయొద్దఁ గమలాప్తవంశ
యనవుడు రఘురాముఁ డవనీతనూజఁ, గనుఁగొని నీకు బొంకఁగ నేల వినుము
గొనకొని యొకనాఁడు కుంభసంభవుని, గన వేడ్కఁ జని నమస్కారంబు సేయ
సంతుష్టహృదయుఁడై నమ్మునీశ్వరుఁడు, నంతట నొకవిల్లు నమ్ములు రెండు
వలనొప్పగాఁ దెచ్చి వరుసతో నాకు, నలవడ నొసఁగుచో నాతఁ డిట్లనియె
నీబాణరాజంబు లెలమితో మీకుఁ, బ్రాబల్యముగ నెల్లపను లొడఁగూర్చి
నీకును నాధరణీతనూభవకుఁ, జేకొని పుత్రులై చెలఁగి జన్మించి
భువనంబు లౌననఁ బొగడత కెక్కి, యవనికి రాజులై యతిశయిల్లఁగను
గలరంచు నిచ్చినఁ గైకొని యేను, తలపోసి వానివిధంబెల్లఁ దెలియు
కొఱఁకునై యవి దాచికొన్నాఁడఁ గాని, తరళాక్షి యొండువిధంబు లే దనుడు
నవి యెవ్వి యనిన రామావనీశ్వరుఁడు, కవదొనలోన నొక్కటి వెల్గుచున్న
పసిడిపింజెలచేతఁ బ్రభగలయట్టి, విశిఖంబు లవి యని వ్రేలఁ జూపుటయు
నోనరనాథ యీయురుసాయకములు, మానినులై యుండు మార్గ మెట్టిదియొ
కావింపవలయు వేడ్కయ్యెడుఁ జూడ, నావిధంబంతయు ననిన రాఘవుఁడు
తనమది నూహింపఁ దచ్ఛరద్వయము, వనితాకృతుల్ దాల్చి వచ్చి కేల్మొగిచి
తమయున్నదొనకు నత్తఱి నేగి తొంటి, క్రమమున నున్న యగ్గలికయుఁ జూచి
యాలోన వెఱఁగంది యమ్మహాదేవి, పోలంగ మును విన్న పొందుగా నెఱిఁగి
మనమునఁ దలపోసి మఱియొక్కనాఁడు, మొనయు రోషమున రాముని గానకుండ
నాయంపకొనఁ జేరి యందున్న కపట, సాయకంబులఁ జూచి చయ్యన దిగిచి
ధళధళయను మించుతళుకుల నొప్పు, నలుగుల నూడ్చి కోలల నందె దాచి
వడిఁ గొంచుఁబోయి యెవ్వరు లేనిచోట, బొడిపొడి సేసి యాపొడి నీళ్లఁగలపి
త్రావెఁ ద్రావుటయు నాతాపసాధీశుఁ, డావసు ధేశుతో నాడినయట్లు
చపలాక్షియగు సీతజఠరంబులోన, నపుడు బాణములు పిండాకృతిఁ దాల్చె
శుకవాణికిని గర్భశుభసూచకములు, నకలంకగతిఁ జూడ నమరె నందంద
నడుమనునూనంబునకుఁ బాసె నంతఁ, గడుఁదోర మగుచు నాకాశంబుమీఁది
సుడి విస్తరిల్లె భూసుతకుఁ జిట్టుములు, బెడిదంబుఁ గాగ ముప్పిరిఁ బేనినట్టు
లారు నీలచ్ఛాయ నమరె దేహంబు, భారంబు గాఁగ షట్పదములు హేమ
కలశాగ్రముల నున్నగతి గల్గె పద్మ, దళనేత్రకును గుచద్వయ మొప్పుచుండె
నివ్విధంబునను మహీపుత్రి వేడ్క, మువ్వురత్తలకును మ్రొక్క యొక్కప్డు
మణిభూషణంబుల మహితమాల్యములఁ, బ్రణుతాంబరంబుల భవ్యగంధములఁ
బొలుపారఁ గైసేసి భూనాథుకడకు, నెలమి నేతేర నయ్యినకులోత్తముఁడు
కేళిగృహంబులఁ గృతకశైలములఁ, నోలిఁ గొలంకుల నుద్యానములను
నలరారు నిష్టంబులగు వినోదములు, సలుపుచుఁ బదివేలసంవత్సరములు
వసుధఁ బాలించుచు వదనాబ్జ మలర, వసుధేశుఁ డొకనాఁడు వైదేహిఁ జూచి
కమలాక్షి నీయందు గర్భచిహ్నములు, కొమరారుచున్నవి కుశలంబు లగుచు
నెయ్యదికోర్కి నా కెఱిఁగింపు మనిన, నొయ్యన నగవుతో నుడురాజవదన
యెలసిగ్గుచూపుల నిలఁ గనుంగొనుచుఁ, దల వాంచి యొక్కింతతడ వూరకుండి
దేవ భాగీరథీతీరదేశమున, వావిరిఁ దాపసవనభూములందు
ఫలములు సేవించి భక్తి నమ్మునులఁ, గొలువంగ నౌకనాఁడు కోర్కి నా కనియె
ననవుడు నౌఁ గాక యని పల్కి మఱియు, మనుజేశుఁ డాస్థానమండపంబునకు
నరిగి కొల్వైయున్న యవసరం బగుట, పరికించి విజయుండు భద్రుండు గురుఁడు
రాముఁడు ప్రజలను దనమంచిచెడ్డ లడుగుట
మతిమంతుఁడును నిద్ధమతివిరాజితుఁడు, మతివిశాలుండగు మాధవాఖ్యుండుఁ
గశ్యపుండనువాఁడు గాధిపింగళుఁడు, వశ్యవాక్యుండును వజ్రదంతుండుఁ
బరిహాసదశకళాపారీణు లగుచు, నరనాథుఁ డలరంగ నవ్వులఁగథల
సౌనొగిఁ బ్రొద్దువుచ్చుచు నుండి రాలోనఁ, దగ భద్రుఁ గనుఁగొని ధరణీశుఁ డనియెఁ
క్రొత్తరాజ్యంబైనఁ గూడి భూజనులు, క్రొత్తలు ఘటియించి కొన్ని యాడుదురు
నారాజ్య మెట్టిదో నన్ను నాపురము, వారు దేశంబులవారు నేమంత్రు
మామాతలగువారి మాసహోదరుల, నేమండ్రు వైదేహి నేమండ్రు చెపుడ
యనవుడు భద్రుండు హస్తముల్ మొగిచి, జననాథ చెప్పెద సత్యవాక్యముల
నినసుతుఁ డాదిగా నెల్లవానరుల, ఘనులైనఋక్షులఁ గడిదిరాక్షసుల
దనవారిఁ జేయుట దారుణం బైన, వనరాశి గట్టుట వడి నెత్తి చనుట
యఖిలలోకద్రోహి యైన రావణుని, సఖులతో సుతులతో సచివులతోడ
వారణంబులతోడ వాజులతోడఁ, దేరులతో గూడఁ దీవ్రబాణముల
ఖండించివైచుట కడిదిరాక్షసుల, దండించి లోకముల్ దయఁ గాచు టొప్పుఁ
బట్టిన చెఱవోయి పగవానియింట, నట్టున్న జానకి ననురక్తుఁ డగుచుఁ
గోపమంతయుఁ దక్కి కొనివచ్చి కుసుమ, చాపునిచేఁ జిక్కి చాపలం బెసఁగఁ
బ్రియము దలిర్ప నాఫృథివీతనూజఁ, గయికొనియున్నాఁడు కాకుత్స్థుఁ డెలమి
మనమునఁ గాంతల మార్తురు గొన్న, మనకు నిట్టిదిగాదె మనరాజు గుఱిచి
యనునివి లోనుగా నల్పవాక్యములు, మునుకొని పురజనుల్ మూకలు గట్టి
రచ్చల వీథుల రాజేంద్ర నిన్ను, నచ్చటనచ్చట నాడుచుండుదురు
దేవ మీయానతిఁ దెగి చెప్పవలసె, నీవిధంబుననున నిష్టోక్తు లనినఁ
గడునప్రియంబులై కర్ణరంధ్రములఁ, బడిన యామాటలు పదిలుఁడై సైఁచి
యిది యేమి తెఱఁగన్న హితులు బాంధవులు, నిది నిక్క మని పల్కి రిరుగేలు మొగిచి
జనలోకవిభుఁ డంత సడికిఁ జిత్తమున, వనటఁ బొందుచు నెల్లవారి వీడ్కొలిపి
దౌవారికుని జూచి తగఁ జేరఁబిలిచి, నీవు నాతమ్ముల నిర్మలమతులఁ
గడువేగఁ దెమ్మని కాకుత్స్థుఁ డనుప, ... ... .... .... ..... ..... .... ....
విన్నఁబోయినమోమువిధమెల్లఁ జూచి, యన్నకు మ్రొక్కుచు నంతంత నిలిచి
యిది యేమొకో నేఁడు హృదయంబులోన, నొదవినచింతతో నున్నాఁడు విభుడు
రాముఁడు తమ్మునితో లోకనిందం దెల్పుట
ఏమికారణమున ని ట్లున్నవాఁడొ, భూమీశుఁ డని వారు బుద్ధి నూహింపఁ
గనుఁగొని తాలిమిగన్నుల నాని, యనుజులఁ గూర్చుండుఁ డని నియోగించి
ప్రాణముల్ వైదేహి పరికింప నాకుఁ, బ్రాణాభిమానముల్ పరికింప మీరు
గాన శోకమునకుఁ గారణంబైన, యీనిందఁ జెప్పెద నిది మీరు వినుఁడు
సౌమిత్రి నీవును సకలసంయములు, నామహాదేవుఁడు నజుఁడు దిక్పతులు
నాదిత్యచంద్రులు యక్షగంధర్వు, లాదిగాఁ గలదివ్యు లందఱు జూఁడ
వనజాకరముఁ జొచ్చువడువున వచ్చి, యనలంబు సొచ్చిన యగ్నిదేవుండు
తినమూర్తిఁ గైకొని తన్వంగిఁ గొనుచుఁ, జనుదెంచి యతిశుద్ధచరిత యీసాధ్విఁ
జేకొనుమని పల్కెఁ జెలఁగి దేవతలు, నాకసంబుననుండి యది సత్య మనిరి
మఱికదా సీత నే మన్నించు టెల్ల, నెఱుఁగని లోకుల నే మనవచ్చు
దండకాటవిఁ జొచ్చి దశకంధరుండు, మెండునం గొనిపోయె మేదినీసుతను
జెఱనున్న సతిఁ దెచ్చి చేపట్టె రాముఁ, డెఱుఁగ నేర్చునె కామి యెగ్గైనతెఱఁగు
నని లోకు లాడుదు రపకీర్తిఁ బొందు, మనుజుఁ డేటికిఁ గోరు మది విచారింప
నెందాఁక నపకీర్తి యిలలోనఁ గలుగు, నందాఁక బొందుదు రధమలోకముల
సడి కోర్చి మనుకంటెఁ జచ్చుట మేలు, విడుతుఁ బ్రాణములైన విడుతు మి మ్మైన
జానకి విడువంగఁ జాలుట యెంత, కాన గంగాతీరకాననంబునకుఁ
దనకోర్కి చెల్లంగ ధరణీతనూజ, సనుగాక కొనిపోయి సౌమిత్రి నీవు
నక్కడ వాల్మీకి యాశ్రమభూమి, చక్కి నొక్కెడ డించి చయ్యని రమ్ము
ఈతెఱంగునకు నీ వేమియుత్తరము, నాతోడఁ జెప్పిన నాయాన నీకు
నని నియోగించుచు ననుజులతోడఁ, దనగృహంబునకు నాధరణీశుఁ డరిగె
నారాత్రి గడచిన నంత సౌమిత్రి, తేరు సుమంత్రుచేఁ దేరంగఁ బంచి
వైదేహినగరికి వంత నేతెంచి, యాదేవియడుగుల కతిభక్తి మ్రొక్కి
జనకనందన నీకు జగతీవిభుండు, మునివనంబును జూప ముదముతోఁ బనుప
వచ్చితి నదె తేరు వచ్చె నీ వింక, విచ్చేయు మనవుడు వేడ్కతో నలరె
వినుతభూషణములు విమలాంబరములు, మునిపత్నులకుఁ గొంచు ముదముతో వచ్చి
మిథిలేంద్రతనయ సౌమిత్రియుఁ దాను, రథ మెక్కి రం దొక్కరత్నపీఠమున
జనకజ గూర్చుండి సౌమిత్రి నాకు, మనసు గలంగెడు మాటిమాటికిని
ఒడలు వడంకెకు నొప్పనిచోటు, లడరంగఁ బలుమాఱు నదరంగఁ దొణఁగె
బుడమి శూన్యాకృతిఁ బొడసూపినట్లు, కడుఁగీడుశకునముల్ గనుచున్నదాన
నీదుర్నిమిత్తంబు లిచ్చదోషములు, మేదినీవిభునకు మీకు నత్తలకు
మేదినీజనులకు మిత్రవర్గముల, కేదియుఁ గాకుండ నిమ్మంచు సురల
వినయంబుతో సీత వినుతించె నంత, వనములు నగములు వడి దాఁటిపోయి
గోమతీతటమునఁ గోరి నాఁ డుండి, యామఱునాడు మధ్యాహ్నకాలమున
భాగీరథీతీరభాగంబుఁ జేరి, యాగంగఁ గని సీత యలకంట చూచి
యెలుఁగెత్తి సౌమిత్రి యేడ్చినఁ గలగి, వెలవెల్లనై కడు వెఱఁగంది పలికె
ముదముఁ బొందక నీవు మూఢునిభంగి, నిది యేల శోకించె దిది పుణ్యభూమి
మీయన్నఁ బాసియో మిగులఁ గోపించి, మీయన్న గినిసినో మిన్నక నిన్ను
నాప్రాణనాథుని నరనాథుఁ బాసి, యీ ప్రాణములతోడ నే నుండఁగలనె
యిమ్ముల నీ వింక నీదుఃఖ ముడుగు, క్రమ్మఱఁబోదము కాకుత్స్థుఁ జూడ
నను గంగ దాటించు నాకు నమ్మునులఁ, గనుఁగొను వేడుక గలదు నావుడును
నరద మక్కడ డిగ్గి యాతేరుతోడ, దరి సుమంతుని నున్చి తాను సీతయును
నావపై నది దాఁటి నవకుశోల్లసిక, పావనతటభూమిఁ బద్మాక్షిఁ జూచి
కన్నీరు దొరఁగ గద్గదకంఠుఁ డగుచు, విన్ననై వదనారవిందంబు వాంచి
యీక్రూరనిశ్చయం బేమని నేను, వాక్రుచ్చిపలుకుదు వైదేహియెదుర
రాజస్య కెఱిఁగింపరాదు పో నాకు, రాజన్యవిభుఁడైన రఘురామునాజ్ఞ
తప్పంగవచ్చునె తలఁప నిత్తెఱఁగు, చెప్పక పోరాదు చెప్పరా దనుచు
విన్ననై కన్నీరు వెడల శోకించు, చున్న లక్ష్మణుఁ జూచి యుల్లంబు గలఁగి
యిది యేల శోకించె దేమాట వింటి, పదిలుఁడై యున్నాఁడె పార్థివేశ్వరుఁడు
నామది గలఁగెడు నరనాథపుత్ర, యే మది చెప్పవే హృదయేశుమాట
యనవుఁడుఁ దెగువతో హస్తముల్ మొగిలి, జనకజనేమంబు జననాయకునకు
మఱియొక్కకొఱగాని మాట నీ కేను, వెఱచెద నెఱిఁగింప విను దానితెఱఁగు
పగవానిచేఁ బట్టువడియున్న మగువ, మగుడంగఁ గొనివచ్చి మన్నించినాఁడు
అని లోకు లాడెడి యపవాదమునకు, మనమునఁ గడునొచ్చి మానవేశ్వరుఁడు
నీశుభాచారంబు నిర్మలం బైన, నీశీలమును మున్ను నిక్కంబు గనియు
నీకానను డించి యేగుదెమ్మనుచు, నాకు నానతి యిచ్చినాఁ డంచుఁ బలుకఁ
దల్లడం బొదవంగఁ దాలిమి మాలి, .... .... ..... ..... ..... .....
నిడిచిమై తోఁచిన నిట్టూర్పు వుచ్చి, .... .... ... ... ... .... ....
నిరవైన పతిమీఁది నెయ్యంబు దలఁచుఁ, వెఱఁ గంది చింతించు వెఱపాటు నొందుఁ
ద న్నెప్పుడును మున్ను ధరణీశ్వరుండు, మన్నించె మున్ననన్ మది విచారించు
నట్టియాగారవంబంతయుఁ దూలి, యిట్టయ్యె నాభాగ్య మే మందు నింక
భూమివా రాడిన భూలోకనాథుఁ, డామాటలకుఁ జేయునది యొండు లేక
యీతెంపుఁ జేసెఁ బో యిది తెఱఁ గనుచు, నాతోడ నెఱిఁగించి ననుఁ బాయఁదగదె
భానువంశాధీశుఁ బాయంగలేక, మానసంబున నేను మఱగెదఁ గాక
మోమాటయును సిగ్గు మొగిఁ జిక్కు పఱప, నీమాట లెబ్భంగి నెఱిఁగించు నాకు
నే మని వాక్రుచ్చు నేను శోకింప, దీమసంబున నెట్లు దెగి నన్ను విడుచు
నిటు గానఁ దొలి మేన నేను సజ్జనులఁ, బటుపాపబుద్ధి మైపఱచినదానఁ
బ్రజ లంట నాకర్మఫలముగా కెపుడు, ప్రజ లేమి సేతురు పతి యేమి సేయు
నేను నోఁచిన నోము లిట్ల యైయుండఁ, గా నెవ్వరికి దీనిఁ గడవంగవచ్చుఁ
గారుణ్యనిధియైన కాకుత్స్థుఁ డేమి, నేరఁడు సడినొంద నేరడుగాక
యని యని శోకింప నచ్చోట మెలఁగు, మునికుమారులు సూచి మునినాథుకడకుఁ
జనుదెంచి వినతులై సంయమిప్రవర, వినుఁ డొక్కయరు దేము విన్నవించెదము
మునికుమారులు వాల్మీకికి సీత నెఱిఁగించుట
నాకలోకాంగన నరలోకమునకు, నేకారణంబున నేతెంచినదియొ
యేరాజుదేవియొ యిందిరాదేవి, గారవంబున నొప్పు గల దొక్కవనిత
యొక్కతెయును నాశ్రమోపాంతభూమిఁ, బెక్కుభంగుల విలపించుచున్నదియు
శోకాతురులదయఁ జూచి రక్షింప, మీకు నగ్రము గాన మీ రేగవలయు
ననిన నావాల్మీకి యంతయుఁ బ్రేమ, విని నిర్మలజ్ఞానవిధిని నీక్షించి
జననుతుండగు రామచంద్రునిదేవి, యనఘవర్తన సీత యని నిశ్చయించి
నిమిషంబు నిలువక నిజనియోగమున, నమరఁ గాంచనపాత్ర నర్ఘ్యంబుఁ గొనుచు
వేగంబ శిష్యులు వెనుక నేతేర, భాగీరథీసమీపమున కేతెంచి
యక్కడఁ బలుమాఱ నరదంబు చన్న, దిక్కుఁ గన్గొనుచును దిగనిశోకమున
రాసినయెలుఁగును రథమార్గధూళి, దూసరంబగు మేనఁ దూలి పైకొంగు
తుంగస్తనంబులఁ దోఁగ నందందఁ, దొంగలిఱెప్పలం దొరఁగుకన్నీరుఁ
గెంగేలు సెక్కున గిరిగొన్న వగలఁ, బ్రుంగిన మనసునై పొగులు భూసుతను
నంగనామణిని బద్మాయతనేత్ర, ... ... ... ... ... ... ... ... ...
రవికులోత్తముఁడైన రామునిదేవి, భువనైకపావని బొడఁ గని కదిసి
నప్పు డశ్రులు రాల నద్దేవి ఱెప్ప, లప్పళించుచుఁ జూచి యమ్మునీశ్వరుని
నడుగులముందట నవనిపై వ్రాలి, యడలంగఁ గరుణ నయ్యనఘాత్ముఁ డనియె
నిది యేల భూపుత్రి యింత శోకింప, హృదయంబుఁ బదిలింపు హితబుద్ధి వినుము
నీశుభాచారంబు నిర్మలంబైన, నీశీలమును నొప్పు నీ గౌరవంబు
ఘనుఁడైనరాముుండు గనియు నొండాడ, మునుకునజ్ఞులనోళ్ళు మూయఁ జొప్పడక
హృదయంబు గొని కాల్ప నీతెంపు సేసి, నదిగాన దుఃఖించు టనుచితం బింక
నీతపోవనము నీ కిల్లు నీ కేను, మీతండ్రి ప్రతినిధి మిథిలేంద్రతనయ
నరనాథుతో గూడ నాడించు వచ్చి, తరలాక్షి గనుఁగొన్నదాన వీవనము
మాయాశ్రమంబున మహనీయశీల, లైయున్న మునిపత్నులందఱు నీకు
నుచితవర్తనముల నుచితవాక్యముల, నుచితసత్కారంబు లొనరింపఁగలరు
మనుజేంద్రతనయ వే మావనంబునకుఁ, జనుదెంచి యం దుండు సంతాప ముడుగు
పౌరుషంబునకంటెఁ బ్రబలంబు దైవ, మేరూపమునఁ దప్ప దిది దైవకృతము
గాన విజ్ఞానంబు ఘనబుద్ధిఁ బూని, జానకీ వినుము నాసత్యవాక్యములు
జనకుండు మీతండ్రి సకలలోకైక, వినుతుండు దశరథవిభుఁడు మీమామ
రాజేంద్రతిలకుండు రామచంద్రుండు, తేజోభిరాముండు దేవి నీవిభుఁడు
ఉభయవంశములు నీ కుత్తమోత్తమము, లభిమానవతివి నీ వతిశుద్ధమతిని
పంకజానన ముఖప్రక్షాళనాదు, లింక నీ కుచితంబు లెన్నిభంగులను
బతివాక్యకరణంబు పరమధర్మంబు, సతులలో నుత్తమసతివి నీ వనుచు
ననునయోక్తుల శోక మార్చి యర్ఘ్యంబు, గొనుమంచు నిప్పించి గురుదయాబుద్ధి
జనకజఁ దోకొంచు సంయమీశ్వరుడు, మునికుమారులు దన్ను ముదముతో గొలువ
వనమున కేతెంచి వచ్చి సద్భక్తిఁ, దను గోరి మ్రొక్కిన తాపసాంగనలఁ
గనుఁగొని యీబాల కళ్యాణి సీత, జనకభూపతిపుత్రి సత్యశీలములఁ
దద్దయు నుతిగన్న దశరథేశ్వరుని, పెద్దకోడలు కీర్తి పెంపారుచున్న
రామునిదేవి యీరమణికి మీరు, సేమ మారఁగ రక్ష సేయంగవలయుఁ
జెఱనున్న సతిఁ దెచ్చి చేపట్టె ననుడు, వెఱుఁ గనిజను లెల్ల నెగ్గాడు టెఱిఁగి
లోకాపవాద మాలోకించి మనుజ, లోకేశుఁ డుత్తమశ్లోకుండు గాన
సడి కోడి పనిచిన సౌమిత్రి దెచ్చి, యడవిని సతి డించి యాజ్ఞమైఁ జనియె
మిథ్యాపవాదంబు మిన్నకయున్నఁ, దథ్యమైనట్లుండు ధనరలోన ననుచు
నినకులాధీశ్వరుఁ డీతెంపు సేయఁ, బనిచినాఁ డటు గానఁ బరమానురక్తి
మునిపత్నులార యీముద్దియ మీరు, కొనిపోయి మన్నించుకొని యుండఁదగును
వగవకుండఁగ నెమ్మి వర్తింపుఁ డనిన, నగుఁగాక యని మ్రొక్కి యాతపస్వినులు
ధరణిజఁ దోడ్కొంచుఁ దమనివాసముల, కరిగి యద్దేవికి నధికమోదమున
నుచితోపచారంబు లొనరించుచుండ, నచట వాల్మీకియు నర్థితో నుండె
విచారించులక్ష్మణునకు సూతుఁడు దేవరహస్యముం జెప్పుట
నంత నయోధ్యకు నరవంబు చనఁగఁ, జింతాపరంపరం జెంది లక్ష్మణుఁడు
నాసుమంతునితోడ ననియె భూజనులు, దోసంబు లాడిన దుష్కీర్తి కోడి
జనకజపావనచరితంబు మొదలఁ, గనియును నీతెంపుఁ గావించె విభుఁడు
క్రూరమృగవ్యాళఘోరకాంతార, దారుణావస్థకుం దగునె యాసాధ్వి
యెందు ననిరి పాప మీపాపఫలము, బ్రందినజనులతో పార్థివేంద్రునకొ
యనఘాత్ముఁ డారాముఁ డపవాదభీతుఁ, డనవుడు నాసుతుఁ డనియెఁ గే ల్మొగిఁచి
యేమిటి కీవెంట నింత శోకింప, సౌమిత్రి మదిలోన సంతాప ముడుగు
మీతండ్రి దశరథమేదినీనాథుఁ, డాతతబుద్ధిమై నడిగినఁ దొల్లి
యది రహస్యం బైన నాదేవమంత్రి, సుతుఁడు దూర్వాసుండు సూచించినాఁడు
అది నీకు నెఱిఁగింప నవసరం బగుట, విదితంబుగాఁ జేతు విను గోప్యముగను
గురునమస్కారంబుకొఱ కొక్కనాఁడు, ధరణీశనందన దశరథేశ్వరుఁడు
రమణీయగతి నేగె రథ మేను గడప, నమరవసిష్ఠుని యాశ్రమంబునకు
ననఘు౦డు దూర్వాసుఁ డంతకు మున్ను, చనుదెంచి యం దొక్కసంవత్సరంబు
నెమ్మి వసిష్ఠుండు నిలుపంగ నిలిచి, సమ్మదంబున నున్నసమయంబునందు
వసుధేశుఁ డాశ్రమవనసమీపమున, నసమానరుచిఁ బొల్చునరదంబు డిగ్గి
చని యావసిష్ఠుని చరణాబ్దములకు, ననఘాత్ముఁడై మ్రొక్క యర్కతేజమున
వ్రాలు నమ్మునిముఖ్యు వామభాగమున, నాలోలకీలోగ్రమగు నగ్నిభంగి
నమరు దుర్వాసున కవనతుం డగుడుఁ, గొమరార వారును గుశలంబు లడిగి
యధికప్రియంబున నర్ఘ్యపాద్యములు, మధురఫలాదులు మానుగా నొసఁగి
యుచితాసనమున నుండఁగఁ బనిచి, యుచితప్రసంగంబు లొండొండఁ దిగిఁచి
ధర్మకథాగోష్ఠి దగిలియుండఁగను, ఘర్మదీధితివోలె గహనమధ్యమున
నయ్యెడ ముకుళితహస్తాబ్జుఁ డగుచు, నయ్యత్రిపుత్రుతో నవనీశుఁ డనియె
నెందాఁక వర్తించు నీరవికులము, ఎందాక రాఘవుఁ డీనేల నేలు
నాతనూజుఁడు రామునకు మహీసుతకుఁ, బూతాత్మ యెందఱుపుత్రు లయ్యెదరు
తనరిన యాసుతుల్ ధర్మవర్తనల, ననఘాత్మ యెబ్భంగి నవని నేలెదరు
మఱి వీరియాయుఃప్రమాణంబు లెంత, యెఱుఁగ నిష్టము నాకు నెఱిఁగింపు మనిన
రఘుకులస్థితియు నారామువర్తనము, నఘదూరయగు సీత కయ్యెడుదశయు
మొదలుగా సకలంబు మునిపుంగవుండు, విదితంబుగాఁ జెప్ప విని రాజు నలకి
తనపురి కేతెంచెఁ దక్కినకథల, పని యేమి విన నీకుఁ బార్థివతనయ
నిండార రాముఁడు నెమ్మితోఁ బదునొ, కొండువేలేఁడులు కువలయం బేలుఁ
బెక్కండ్రురాజులఁ బృథివిపై గెలుచుఁ, బెక్కశ్వమేధముల్ పెంపారఁ జేయుఁ
బుడమికి రాజుగా భూపుత్రిపుత్రుఁ, గడువేడ్కఁ బట్టంబుఁ గట్టు నయోధ్య
పటుకీర్తి నటుమీఁద బ్రహ్మలోకమున, కటమీఁద వైకుంఠ మనుపేరు గలిగి
నిరవద్య మగుచున్న నిజలోకమునకు, హరిమూర్తియగు రాముఁ డరుగంగఁగలఁడు.
తొల్లి యీవిధ మెల్ల దూర్వాసుచేతఁ, దెల్లమైనది గాన ధృతిఁ బూనవలయు
నాదిత్యకులవిభుఁడగు రామువలన, వైదేహిదిక్కున వగపు నీ వుడుగు
పౌరుషంబునకంటెఁ బ్రబలంబు దైవ, మారయఁగా నున్నయదియుఁ దానయ్యె
ననవుఁడు మునిముఖ్యునాదేశమునకుఁ, దనలోన వెఱఁ గంది దశరథాత్మజుఁడు
తాలిమి పదిలించి తగుమాటలాడు, నాలోన దిననాథుఁ డస్తాద్రి కరిగె
నారాత్రి గడచిన నంత వేగుటయు, దేరు సుమంతుండు దెచ్చిన నెక్కి
మఱునాఁ డయోధ్యకు మధ్యాహ్నవేళ, తెఱయంగ నేతెంచి నిర్విణ్ణుఁ డగుచు
నేమనుచుండునో హృదయంబులోన, నామాననిధి విన్ననై యున్నవదన
మే మని దనుఁగొందు నే మందునోయి, ... .... .... .... .... .... .... .... ....
యకలంకచరిత్రగా నటు గనుఁగొనియు, నకట మిథ్యానింద కతిసాహసమున
జనకజఁ బాసె నాజననాథుఁ డనుచుఁ, జనుదెంచి యరిగి మోసల తేరు డిగ్గి
సీత నడవిలో విడిచి లక్ష్మణుఁడు రామునియొద్దకు వచ్చుట
వాకిళ్లు గడచి యవాఙ్ముఖుం డగుచుఁ, గాకుత్స్థకులు రాముఁ గదియ నేతెంచి
జానకిలేమి నాసకలసంపదలు, లేనికైవడి సొంపు లేనియ ట్లున్న
మందిరంబున శోకమగ్నుఁ డై యశ్రు, లందందఁ దొరఁగంగ నధికదైన్యమున
సీతగుణంబులు సీతగౌరవము, సీత పుట్టినయట్టి శిష్టగౌరవము
సీతయున్ దనతోడఁ జెప్పినతెఱఁగు, సీతకుఁ బాటిలు చెనఁటియీసడియు
సీత నుపేక్షించి చేసినతెంపు, చేతోగతంబులై చేడ్పాటుఁ బెనుప
నలఁతఁ బొందుచునున్న యారామునంఘ్రి, జలజంబునకు మ్రొక్కి జననాథసుతుఁడు
ధరణీశునంఘ్రులు దనమస్తకంబు, వరుస నొండొరునశ్రువారిచేఁ దడియ
వడిసెడుకేల నావశుధేశుఁ డప్పు, డడలువారించుచు ననుజన్ము నెత్త
నొక్కింతతడవున కొనరు గద్గదిక, చిక్కుకంఠాంతరసీమలో నణఁగ
దేవ భాగీరథీదేవి దాటించి, దేవరయాజ్ఞఁ దత్తీరదేశమునఁ
గల్మషేతర సీతఁ గళ్యాణచరిత, వాల్మీకియాశ్రమవనసమీపమున
మీవాక్య మెఱిఁగించి మిథ్యాపవాద, మేవిధంబునఁ బాయ దీవేంటఁదక్క
నటుగాన నీ వింక నడలకు మనుచు, నట డించి వచ్చితి నని పల్కెఁ బలికి
సుఖము దుఃఖమును శుభమును గీడు, నఖిలలోకులకుఁ గర్మానురూపమున
నధిప వర్తించు నయ్యైకాలగతుల, నిధులును జెడిపోవు నిత్యముల్ గావు
అనఘ యెంచఁగ సర్గ మందుట చాల, మనుట విచారింప మరణంబుకొఱకు
నిను నీవు గెలుచుట నిఖిలంబు గెలుపు, మనుజేంద్ర శోకంబు మదిలోన నుడుగు
పురుషపుంగవులైన పుణ్యాత్ము లెందుఁ, బరికింప మూఢులై పడరు బంధముల
నీ వేమి సామాన్యనృపతివే దేవ, నావుడు ధృతిఁ బూని నరనాథుఁ డనియె
జననాథతనయ నీసత్యవాక్యములు, విని సంతసిల్లితి విలసిల్లె మనము
తెఱఁ గేది నాలుగుదివసంబు లేని, మఱచినారము మహిమండలస్థితులు
ప్రజలవిన్నపములు పరిపాటి వినుచుఁ, బ్రజలఁ బాలించుట పరమధర్మంబు
ఎలమి మంత్రులఁ బురోహితులవిన్నపము, గలవారిఁ బిలిపింతు గాక కొల్వునకు
దుష్టనిగ్రహమును దోషంబు నణఁచి, శిష్టరక్షణమును జేయక యెవఁడు
రాముఁడు లక్ష్మణునకు నృగచరిత్రముం జెప్పుట
భూభారబోగంబు భోగించు నాతఁ, డాభీలగతిఁ బొందు నధమలోకముల
నీయర్థమునఁ దొల్లి యితిహాసమొకటి, పోయినయది విను భూపాలతనయ
సత్యసంధుఁడు నగ్రజన్మప్రియుండు, నిత్యకీర్తియు నైన నృగుఁడను రాజు
పుష్కరక్షేత్రంబుఁ బొంది సత్కర్మ, పుష్కరం బను నొక్కపుణ్యకాలమున
నెలమిఁ గ్రేపులతోడ హేమశృంగాదు, లలవడ రచియించి యగ్రజన్ములకు
నొకకోటిగోవుల నుల్లంబు లలర, నకలంకగతి దాన మమరంగ నిచ్చె
ననఘ తపోమూర్తి యగు నగ్నివైశ్యుఁ, డను విప్రపుంగవునావు ముం దప్పి
ఘనమైన యారాజుకదుపులోఁ గలసి, యునికిఁ దా నతఁ డిచ్చె నొక్కవిప్రునకు
నందంద పెక్కేఁడు లరసి యాగోవు, నెందుఁ గానక యమ్మహీసురోత్తముఁడు
కనఖలం బనుపేరు గలదేశమునకుఁ, జని యట నొకవిప్రుసదనంబునందుఁ
దనగోవుఁ గని సమదంబున “శబళ!”, చనుదె మ్మనుచు నిజస్వరముఁ జూపుటయ
నెలుఁగున నొడయుఁగాఁ నెఱిఁగి మో మెత్తి, పిలిచిన యావిప్రుపిఱుఁద న ట్లరుగఁ
దన్ను నానృపుచేతఁ దగఁ బరిగ్రహము, గొన్నబ్రాహ్మణుఁడును గూడ నేతెంచి
దానము నృగుచేతఁ నేను గొన్నాఁడఁ, గాన నాగో విది గాదు నీసొమ్ము
నావుడు నొకనవ్వు నవ్వి యావిప్రుఁ, డేవిధంబున నీకు నిది యేల దక్కు
నీకు నిచ్చినయట్టి నృగుడు దా నుండ, నీకు నాకును నేల నెరిగానివాదు
నృగు కెఱింగింత మానృగుమాట మనకు, నగునంచు నొడఁబడి యావిప్రు లరిగి
నగరివాకిటఁ బెక్కునాళ్ళును నిలిచి, జగడమాడుచు నవసరము లేకున్న
వేసరి కనలి యావిప్రు లారాజు, నూసరవెల్లియై యొకబొక్కఁ జొచ్చి
యొగి పదునెనిమిదియుగములదనక, తెగకుండునందాఁక దృష్టింపఁబడక
యాగొంది నుండుగా కని శాప మిచ్చి, యాగోవు విడిచి వారటు వోవుచుండి
వసుదేవుకడుపున వసుధ నావిష్ణుఁ, డసమానగతిఁ గృష్ణుఁ డనఁగ జన్మించు
నటమీఁద నీశాప మవ్వాసుదేవు, పటుదయాదృష్టిచేఁ బాయుఁగా కనుచు
మరలి వా రాత్మీయమందిరంబులకు, నరిగిరి నా విని యారాజసుతుఁడు
జననాథ విప్రులు శపియించి చనిన, వెనుక వర్తించినవిధ మెట్టి దనిన
విను సుమిత్రాపుత్ర విప్రశాపంబు, విని భీతి నారాజు విహ్వలుం డగుచుఁ
దనకు నయ్యెడుకష్టదశ విచారించి, తనమంత్రులాదిగా తగువారినెల్లఁ
దడయక రావించి తనపుత్రు వసువుఁ, గడువేగఁ బట్టంబు గట్టుండు ధరకు
చలికి నెండకు వానజడికి నెచ్చోటు, వలనుగా దచ్చోటు వలనొప్పఁజేసి
యక్కడనక్కడ నధికయత్నముల, బొక్కలు సేయుఁ డాబొక్కలలోనఁ
జరియింతు విప్రులు శపియించినట్లు, పొరి నాకుఁ గుడువక పోవ దాఫలము
సాగి బొక్కలఁ గప్పి చరియింప నాకుఁ, దీఁగెలు వృక్షముల్ తిరిగిరా నిడుఁడు
చల్లఁగాఁ దావులు జల్లు క్రొవ్విరులు, చల్లుఁడు బొక్కలు సవరగాఁ జేసి
యారసి రెండుమూఁడామడమేర, మీఁదట నెవ్వరి మెలఁగనీకుండ
కడువేగ నిప్పని గావింపవలయుఁ, దడయరాదని పల్కి తనపుత్రుఁ జూచి
జనులవిన్నపములు సతతంబు వినుము, తనయ నీతిస్థితి ధరణి పాలింపు
తనకర్మఫలమెందుఁ దప్పదు గాన, మనమున నాకుఁగా మరుగంగవలదు
బుద్ధిమంతుండవై పుత్ర నీ వుండు, మిద్ధకులాచార మేమర కెపుడు
వాత్సల్యమున సాధువర్గంబు నరియు, వత్స నీ వని పల్కి వసువు బోధించి
వాసవతేజుఁ డావసుమతీనాథుఁ, డూసరివెల్లి యై యొకబొక్కఁ జొచ్చి
పరికింప నేఁడు నాపాపశేషమున, ... ... ... ... ... .... ..... ..... ....
నృగుపాటుఁ జెప్పితి నీకు నింకొక్క, తగుకథ చెప్పెదఁ దమ్ముఁడ వినుము
రాముడు లక్ష్మణునకు నిమిచరిత్రముం జెప్పుట
వసుమతి నిక్ష్వాకువంశంబులోన, నసమానకృతి నిమి యనరాజు గలఁడు
ఆరాజు గౌతమునాశ్రమభూమి, చేరువఁ గమనీయశిల్పంబు లమర
ననిమిషపురిఁ బోలు నన వైజయంత, మనుపేరుగల పురం బమరించి యందుఁ
జెన్నొంద రాజ్యంబుఁ జేయుచు నొక్క, జన్నంబు గావింప జనకాజ్ఞ వడసి
ముదమున నందఱమునుల రప్పించి, పదపడి తగనర్ఘ్యపాద్యంబు లిచ్చి
భృగునంగిరసునత్రి పృథులతేజమున, నెగడు వసిష్ఠుని నెమ్మిఁ బూజించి
మనమార నను నీవు మఖము సేయింపు, మనుచు వరించిన నావసిష్ఠుండు
నరనాథపుంగవ నన్ను నీ విట్లు, వరియించి తింకొక్కవాక్యంబు వినుము
అమరంగఁ దను జేయు నధ్వరంబునకు, నమరాధిపతినన్ను నధ్వర్యు గాఁగ
నీమఖ మేన చేయించెద ననుచు, నామునీంద్రుఁడు పోయె నమరేంద్రపురికి
నాతపస్వులతోడ నంత నానిమియు, గౌతము వరియించి గడుసంతసమునఁ
జలికొండ కబ్ధికిఁ జక్కమధ్యమునఁ, బొలుపొంద నొకపుణ్యభూతలంబునకు
జనుదెంచి యచ్చోట సకలలోకములు, వినుతింప గౌతము విధివంత మమర
నైదువేలేఁడుల యందాక నిఖిల, భూదేవతలు నిలింపులు తుష్టిఁ బొంద
విలసితరత్నాదివివిధదానములఁ, జెలువార జన్నంబు సేయించుచుండ
నమరేంద్రుచే జన్న మట వసిష్ఠుండు, సమకొని యేనూఱుసంవత్సరంబు
లంచాకఁ జేయించి యది దీర్చి మరలి, సందీప్తతేజుఁడై చనుదెంచి యచట
నక్షపారునిచేత నర్హసత్కార, మక్షీణవిధియుక్తి నంగీకరించి
యినవంశగురుఁడనై యే నుండ నొండు, మునిచేతఁ జేయించి మూర్ఖుఁడై మఖము
నిమిగర్వమంతయు నేఁడు వారించి, నిమిషంబులో నంచు నిమిఁ గానవచ్చు
దౌవారికునిఁ జూచి తనరాక నీదు, భూవరు కెఱిఁగింపఁ బొమ్మన్న నతఁడు
పవ్వళించినవాఁడు పతినాగఁ దొలఁగి, దవ్వుగా నొక్కింతతడవు గూర్చుండి
యేను వాకిట వచ్చి యిట్లుండ లోన, మే నెఱుంగఁడొ గాక మేలు గా కనుచు
నొడల బుట్టినకోప ముడుపఁగ లేక, యొడలు లేకయె నిమి నుండ శపించె
నంత నానిమియును నానిద్రఁ దెలిసి, యంతయుఁ బరికించి యాశాప మెఱిఁగి
యపరాధిఁగా నన్ను నరయ కిబ్భంగి, శపియించెఁ గాన యీసంయమీశ్వరుఁడు
తలఁపఁ దానును మేనుఁ దక్కి వర్తింప, గలఁడంచు శపియించెఁ గర మల్కతోడ
సరి నప్పు డన్యోన్యశాపవాక్యముల, నరుదార నిరువురు నశరీరు లైరి
అంత నమ్మునియును నజుఁ డున్నకడకు, నెంతయు వెస నేగి యీవసిష్ఠుండు
నిమిశాపమునఁ జేసి నిర్దేహవృత్తి, కమలసంభవ యేను గైకొన్నవాఁడ
పూర్వశరీరంబుఁ బొందించి యొడలు, గీర్వాణనుత నాకుఁ గృప సేయు మనిన
తనయాత్మజునిపల్కుఁ దగ విని యపుడు, యనఘుఁడు బ్రహ్మ దా నట్లొప్పఁ
నతులతేజోధను లఖిలలోకైక, నుతులు మిత్రావరుణులు మహోన్నతులు
వారితేజంబున వసియించి నీవు, గౌరవంబున మేను గలిగి వర్తింపు
నీ వయోనిజుఁడవై నెగడు పొ మ్మనుచు, నావారిజాసనుం డటు కృప సేయ
నావసిష్ఠుఁడు బ్రహ్మ కట ప్రదక్షణము, గావించి వరుణలోకమున కేతెంచె
మిత్రావరుణులు విస్మితు లౌచు తమ్ము, సుత్రామముఖులైన సురలు మన్నింప
గైకొంచు దుగ్ధాబ్ధికడకు నేతెంచి, రాకాలమున వచ్చె నచటి కూర్వశియు
సఖులతో నాడుచు సరసభావమున, నిఖిలలోకైశ్వరనిలయమై వెలుఁగ
నంత నయ్యిరువురు నయ్యింతి జూచి, కంతునిచే జిక్కి కడు మేను గలఁగ
నచ్చర తనదృష్టు లామిత్రుమీద, మచ్చిక నాటించి మనసుపొం దెఱిగి
కనుకని నను నీవు కామించు టేను, గనుగొంటి నిన్నంటగంటి నాకోర్కె
యనవుడు నృపహతుడైన యామిత్రు, ఘనతేజ మచ్చోటిఘటమందుఁ బడిన
తాలిమి దూలంగ దమకించి వరుణు, నాలోకనస్థితి ననురాగ మెఱిగి
వరుణుడయునుమిత్రు వరియించె నిన్ను, నొరుని బొందుట నాకు నుచితమే యనిన
నంగన నీతోడ ననురాగలీల, నంగసంగతి నాకు ననుచితంబైన
చిత్తసంగతినైన చిత్తంబులోన, చిత్తజుఁ డలరంగ జెలువొందుగాక
మామకీయంబైన మహితతేజంబు, కామిని యీయొప్పుకలశంబునందు
నలరెద గా కన్న నంగీకరించి, ... ... ... ... ... ... ... ... ... ...
మదనవికారంబు మానసక్రీడ, చతురుడ వైతీ ర్చి సంతుష్టి బొందు
నావుడు వరుణుండు నాతిభావంబు, భావింప బావకప్రభ బోల్పు మిగిలి
ఘనవీర్య మ ట్లొల్క గాంచి యూర్వసియు, ననువారమును మైత్రమైన తేజమున
గరమొప్పుచున్న యాకలశంబునందు, తిరముగా నిది కాముదీపంబుపోలె
మిత్రుసన్నిధి కేగ మిత్రుఁ డాకమల, పత్రాక్షి యైనయబ్భామ నీక్షించి
కామవికారంబు గనియును నన్ను, గామిని గామించి గైకొంటి నంటి
నామేరయై యుండి నన్ను వంచించి, యేమనిన యాతగ వేను బేర్కొందు
దిట్టవై యొరుకోర్కె దీర్చితి గాన, పుట్టు మీతప్పున భూమండలమున
మనుజయోనిని బుట్టి మహనీయదుఃఖ, మనుభవింపుచు నుండు మట గొంతగాల
మటమీద రాజర్షియగు పురూరవుఁడు, చటులవిక్రమశాలి సౌమ్యనందనుడు
ఘనసారఘనకీర్తి కాశీశ్వరుండు, వనజలోచన నీకు వరుడు గాగలఁడు
యాపురూరవుభార్యవై సుఖం బొంది, యేపార నిజదేహ మిట పొందు మనియె
నా విని సౌమిత్రి నరనాథు జూచి, నావసిష్ఠుండును నారాజుమీఁద
నేదెస వర్తించి రెఱిగింపుమనిన, నాదిత్యకులనాథుఁ డనుజుతో ననియె
పాత్రశోభితమునై పరిపూర్తి నొందు, మాత్రావరుణమైన మహితతేజముల
మొగి పుట్టి రిరువురు మును లందు మున్ను, తగ నగస్త్యుఁడు బుట్టె ధర్మశీలుండు
పుట్టినప్పుడె తపోభూమికి వరుణు, పట్టియు నే నని బలుకుచుఁ బోయె
బిందుశేషములెల్ల బెరసి వెలుంగ, నందు వసిష్ఠుండు నమర జన్మించె
నమ్మునిపుంగవు నంత నిక్ష్వాకు, డిమ్ముల దనపురోహితు గా వరించె
నిది వసిష్ఠునిజన్మ మిటమీద వినుము, విదితంబుగా నిమివిభునివర్తనము
మునిశాపమున దేహముక్తుఁడైయున్న, మనుజాధినాథుని మహనీయతనువు
పావనస్థితి గల్గు పరమతేజమున, జీవన మున్నట్ల సెడకుండఁ జేసి
బంధురమణిమయాభరణముల్ వెలుఁగ, గంధపుష్పాదులఁ గైసేసి నిలిపి
యంకిలిలోకుండ యఖిలలోకముల, సంకల్పితంబైన జన్మంబు దీర్చి
యతిముదంబున గౌతమాదిసన్మునులు, గ్రతుభాగములఁ దృప్తిఁ గన్నదేవతలు
నీ వె౦దు బుట్టెద నృపవర మమ్ము, నేవరం బడిగెద విచ్చెద మెలమి
నని పల్క నిమి నాకు నఖిలజంతువులు, కనుఱెప్పలం దుండ గరుణింపు డనిన
నగుగాక జీవుల యాలోకనముల, జగదేశ వసియించి సతతంబు నీవు
వాయురూపంబున వర్తించు మనుచు, బోయిరి తమతమపుణ్యభూములకు
నంత తపోధన్యులగు మును లేనిమికి, సంతతి గలిగింపఁ జర్చించి చూచి
మంత్రవంతము లైనమహనీయహేమ, తంత్రముల్ జేసి యాధరణీశుమేను
నరణి సంధించి వా రర్థితో దరువ, చరితార్ధుడైయున్న జనకుండు బుట్టె
వీతదేహున కుద్భవించుట జేసి, యాతతంబుగ విదేహాభిధానంబు
మథనసంభవమున మహనీయమగుట, మిథిలనామము గల్గి మెఱసె నప్పురము
యన విని లక్ష్మణుం డవనీశుఁ జూచి, జననాథ తన్ను నాసంయమీశ్వరుఁడు
మది నల్గ శపియింప మారల్గెగాన, పదిలుడై యుండ డాపార్థివేశ్వరుఁడు
యాగదీక్షితునకు నలుగంగ దగునె, వేగిరపా టేల విజ్ఞాని కనిన
ననుజుడ తనలోన ననిశంబునుండి, కనలెడుశత్రుండు గాదె కోపంబు
భూరికోపము దన్ను బొదివినయపుడు, సైరింపవచ్చునె జనుల కెవ్వరికి
నకలంకగతి కోప మడప యయాతి, యొకడె నేరుచుగాక యొరులు నేరుతురె
నావుడు నారాజు నరనాథ కోప, మేవిధంబున సైచె నెఱిగింపు డనిన
నరనాథనందన నహుషనందనుఁడు, నిరుపమబలుఁ డైనృపుఁడు యయాతి
యర్మిలవృషపర్వు యాత్మజయైన, శర్మిష్ఠ దన కగ్రసతిగా వరించి
మరి దేవయానను మహితతేజస్వి, నెరయ శుక్రునికూతు నెమ్మి గైకొనియె
నంత నాయిరువురయందు నావిభుఁడు, సంతానకాముడై చరియింపుచుండ
శత్రుమర్ధనశాలి శర్మిష్ఠకోర్కి, పుత్రుండు జన్మించె పూరుడన్ పేర
యదుఁ డనగా దేవయానకు దనయు, డుదయించె నానాటి కొదవి రాసతుల
సౌభాగ్యవతియైనశర్మిష్ఠ కంత, నాభూవిభుఁడు చాల ననురక్తుఁ డగుచు
నద్దేవిసుతు బూరుడను పెద్దకొడుకు, పెద్దయు మన్నించి ప్రియముతో నుండు
నొకనాడు తమతల్లియొద్ద నాయదుడు, మొక మొకభంగియై ముందట నిల్చి
శర్మిష్ఠపై కూర్మి జననాయకునకు, మర్మంబు గాన యామహిషినందనుని
పాటించి నిను నన్ను బాటింపకునికి, పాటింప దమ్మునిపట్టి నీ వగుట
నట్టితండ్రికి బుట్టి యభిమాన ముడిగి, యెట్టకొ నేర్చితి యీకష్టదశకు
నెగ్గింపఁబడిన యీజీవనం బేల, నగ్నిలోఁబడి చత్తు యవమానమునకు
నీ వోర్వజాలిన నిలువమం దతఁడు, వావిరి నెలుగెత్తి వాపోవుచుండ
తనయునిదైన్యంబు తాలిమి గలప, తనతండ్రియైన యాదైతేయగురుని
తలప నాశుక్రుండు తనపుత్రి దన్ను, తలచినదురవస్థ తలుపులు నెఱిగి
యచ్చోట కేతేర నాదేవయాన, వచ్చి పాదములపై వ్రాలి పాద్యంబు
కన్నీట గావించుకరణి శోకించు, చున్న కౌగిట జేర్చి యొగి బుజ్జగించి
పలితంపుతాలిమి బాల నీ కేల, హృదయంబు నొగలంగ నిబ్భంగి బొగుల
నిది యేల శోకించె దీశోకమునకు, నది యేమి కారణ మట జెప్పు మనిన
ధర్మజ్ఞుఁ డని చూచి ధరణినాథునకు, నిర్మలమది నన్ను నీ విచ్చి తెలమి
నారయ నితనిచే నవమానమునకు, నోరువ బరలోక మున్నట్టులుండె
నురువిష౦ బనల మాయుధము మొదలగు, మరణకారణములు మహిఁ బెక్కు గలవు
మతి నాకు ని ట్లవమానంబు సేయు, పతి యేల కట్టడిప్రాణంబు లేల
నిన్ను విచారింపక నీపుత్రినైన, నను గురుచఁ జేసె నానరనాథుఁ డనిన
యౌవనాహంకృతి నవమాన మిట్లు, గావించె నటుగాన కష్టంపుముదిమి
నతఁ డొందుగా కంచు నలుకతో బలికి, సుత గుస్తరించి యాశుక్రుండు జనియె
నంత జరావిష్టుఁడైన యయాతి, సంతప్తహృదయుఁడై చాల చింతించి
యట శుక్రుఁ డాదేవయానకై వచ్చి, చటులకోపంబున శపియించు టెఱిగి
యదునొద్ద కేతెంచి యదుడ నాముదిమి, పదిలుండవై నీవు భరియింపవలయు
నెందాక విషయభోగేచ్చనా కొదవు, నందాక మదిలోన ననురాగ మెసఁగ
జనులఁ బాలింపుచు సకలభోగముల, దనిసి యాజర యేను దాల్చెద ననిన
భూపాల నీకూర్మిపుత్రుఁడై యున్న, యాపూరు డుండగా యన్యు లేమిటికి
ముదిమి యాతని కిచ్చి ముదమార నీవు, పదపడి యిన్నేల బాలింపు మనిన
నోదురాత్ముండ యోట లే కిట్లు, క్రూరోక్తు లాడితి కుటిలభావమున
యాతల్లికొడు కైనయతినీతిమతికి, నీతెంపు గలుగుట యిది యెంతపెద్ద
యతిపాపయతివి నీ వరయంగ నాకు, సుతుఁడవ యొకరక్కసుండవు గాక
నిఃదితచరితుఁడ నీకాంచుకొడుకు, లందరు రాక్షసు లై పుట్టగలరు
గురుఁడైననామాట గొనని నీవెంట, నిరువుగా నిలుచునె యిందువంశంబు
నీవును నీకు జన్మించినవారు, భూవిభుత్వమునకు పూజ్యులైపోను
యని శపింపుచు వచ్చి యగ్రనందనుని, గనుగొని యారాజు కరమర్థి బలికె
భోగేచ్ఛ మానదు పుత్రుండ నాకు, నీగతి ముదిమియు నిటు బ్రాప్త మయ్యె
నీజరాభారంబు నీవు గైకొన్న, రాజలోకము మెచ్చ రాజ్యంబు చేసి
పదపడి నాకు నై భరియించియున్న, ముదిమి గైకొనియెద ముదముతో ననిన
నను గాక ధన్యుండ నైతి నే ననుచు, మోగపు లొప్పంగ ముదముతోఁ బలుక
తన్నుఁ బొందిన జర తనపుత్రు పూరు, గన్నార జూచి యాఘనునందు నిలిపి
ప్రాయంబు గైకొని పరగ జన్నములు, సేయుచు రాజ్యంబు చెలువంద జేసి
పెద్దకాలము బోవ ప్రియమార బూరు, నొద్దకుఁ జనుదెంచి యుర్వీశుఁ డనియె
ప్రియపుత్ర నీయందు బెట్టినముదిమి, రయమార నా కిచ్చి రాగిల్లు నీవు
చేకొని నామాట జేసితివి గాన, నీకింద రాజ్యంబు నిత్యమై యుండు
ననుచు నాపూరుని నభిషిక్తు జేసి, వనమున కేగి యావసుమతివిభుఁడు
ధర బెద్దగాలంబు దప మాచరించి, సురచిరద్యుతి నేగె సురలోకమునకు
యాపూరుడును సకలావనీసురుల, నేపున బాలించి యెలమి సొంపార
నోజప్రతిష్ఠాపురోత్తమంబునకు, రాజై వసుంధర రక్షింపుచుండె
నంత నాయదుడు నిశాటసంతాన, వంతుడై యట క్రౌంచవటమున నుండె
నిమి వసిష్ఠునిచేత నిగ్రహితు డగుచు, శపియింప నమ్ముని శపియించె మగుడ
శుక్రశాపంబున స్రుక్కి యయాతి, వక్రుడై మారల్గ వాక్రువ్వ డయ్యె
గాన సైరణయందు గలరె యయాతి, మానమై రాజులు మనుజేంద్రతనయ
యనుచు తెల్లమి గాగ నక్కథ రాము, డనుజునితో జెప్ప నారాత్రి వేగె
వేగిన మరునాడు విహితంబులైన, పావనకర్మముల్ పరిపాటి దీర్చి
బహురత్నవిరచితాభరణాదు లమర, మహనీయగతి సభామంటపంబునకు
చెలువొంద నేతెంచి సింహాసనమున, గొలువిచ్చి లలితాజ్ఞగోమలద్యుతులు
నెరయ నూ రెల్లఱనేత్రంబు లొలయ, సురుచిరద్యుతి వసిష్ఠుడు కస్యపుండు
ధర్మశాస్త్రజ్ఞులు తగువిప్రవరులు, నిర్మలమతులయిన నీతికోవిదులు
సచివులు దమ్ములు సకలభూపతులు, నుచితభంగుల గొల్వ నుల్లసిల్లుచును
సౌమిత్రిఁ గనుగొని జనులవిన్నపము, నేమట విని వారి నిటకు దెమ్మనిన
మ్రొక్కుచుఁ జని పెద్దమొగసాల వెడలి, యక్కడ నిల్చి క్రందై యున్నజనుల
గనుఁగొని మీ కేమికార్యము లేపతికి, వినిపింపగలవన్న విని వార లలరి
రామచంద్రుడు బూని రాజ్యంబు సేయ, సేమంబె గా కొండు జెప్పంగగలదె
జారచోరాదులు జనుల బాధించు, దారుణాత్ముల బట్టి దండించు గాన
జాతిమార్గము దప్పి చరియింపవెరతు, రాత్రిదోషము లేదు మారాజుమహిమ
వసుథ నానాసస్యవతియై ఫలించు, విసురూపమగువాడు వెదకిన లేడు
తెవులు నొప్పులు లేవు తిరిపెంబు లేదు, నవత బొందుట లేదు నరకంబు లేదు
చావరు సంపూర్ణజర లేక బాల, యౌవనమధ్యవయస్కు లెవ్వరును
జగడంబు లే దనాచారంబు లేదు, పగ లేదు వగ లేదు బన్నంబు లేదు
వరపరాఙ్ముఖులైన వామలోచనల, వరపుజూపులయంద పక్షపాతములు
వాలారుజూపు లవారిజాననల, యాలోకనంబులయందె చాపలము
భామలబొమలందె వక్రతాక్రియలు, కామతంత్రములందె గాఢబంధములు
యఁగజక్రీడల నలరుయంగనల, యంగసంగతులందె యధరపానములు
కేళిశయ్యల దమకించుకామినుల, యాలింగనములందె యంగపీడనము
లన్నువచన్నులయందె కాఠిన్య, మన్నులచిత్తంబు లందె బేరములు
పడతులపృథునింబములందె మేర, గడచుట యతివలగతియందె జడను
లేమలవడకెడులేగౌనులందె, లేములు దోషముల్ లేవు దక్కెడల
నావుఁడు సౌమిత్రి నలి నేగుదెంచి, నావిధం బెఱిగింప నవనీశు డలరి
క్రమ్మర జని పనుల్ గలవారి జూచి, సమ్మదంబున దెమ్ము జననాథతనయ
ప్రబలుడయి రాజాజ్ఞఞ పాటింపకున్న, ప్రబలుడు దుర్బలు బాధింపుచుండు
నానాముఖంబుల నాసాయకములు, మానుగా రక్షించు మహి నెల్లజనుల
నైనను పరికించు టధికధర్మంబు, నా నత డేతెంచి నగరివాకిటను
......................................, .............................................
రాజుధర్మముతోడ రాజ్యంబు సేయ, భూజనులను ధర్మబుద్ధి నుండుదురు
ధర్మంబు దప్పక ధరణిపాలించు, నిర్మలాత్ములు గండ్రు నిత్యసౌఖ్యములు
పొలిపొలి ధర్మంబు భూలోకసుఖము, పరలోకసౌఖ్యంబు బ్రాపింపజేయు
సచరాచరం బైన సకలలోకముల, నచలితధర్మంబ యమర రక్షించు
ధర్మంబ రాజుల ధరణి యేలించు, ధర్మంబ శరణాగతత్రాణకీర్తి
గలిగించి రక్షించు గాన ధర్మమున, గలుగనియర్ధంబు గలదె లోకముల
ధర్మంబు నా నొండు తలపోయలేదు, ధర్మస్వరూపంబు ధరణీశ వినుము
దానంబు సేయుట దయ గల్గియుంట, మానుగా పెద్దల మన్నించి మనుట
వంచన సేయక వలయు బేహార, మంచితగతినాదు టదియె ధర్మంబు
ధర్మంబు నీవయై దశరథేశ్వరున, కర్మిలిపుత్రుండ వై జనించితివి
నీవు కేవలధర్మనిధివి లోకైక, పావనమూర్తివి బహుగుణాఢ్యుడవు
విజ్ఞానమయుడవు విశ్వలోకముల, నజ్ఞాతమగుధర్మ మది నీకు లేదు
నీవు రాజ్యము సేయ నిఖిలభూజనులు, నేవెంట నేభయ మెఱుగరు గాన
నిన్ని జెప్పితి మీకు ని ట్లేను వెఱవ, న న్నింక మన్నించి నామాట వినుము
జనలోకనాయక సర్వార్ధసిద్ధు, డను నొక్కభిక్షుకుం డలుకతో నన్నుఁ
దప్పు లే దూరక తల వ్వయ్య నడిచెఁ, దప్పు విచారించి దండింపుమనియె
ననవుడు నవ్విప్రు నపుడ రప్పింప, జనుదెంచి యతఁడును జననాథుఁ జూచి
నను నేల రప్పించినారు మీ రిచటి, కనవుడు నారాము డనియె నాతనికి
విప్రుండవై యిట్లు విపులకోపమున, నీప్రాణి నొప్పింప నేల నా కనక
తక్కక నీకుక్కతల వ్రయ్యవార, మొక్కలంబుగ నీకు మోదంగఁ దగునె
యీరోష మక్కటా యేవెంటఁ బుట్టె, నూరక దండింప నుచితమే నీకు
నారయఁ బ్రాణులయందు గీడైన, సైరింపఁదగుఁ గాక జనునె కోపంబు
పటుఖడ్గమునకంటె భయదాహికంటె, కుటిలశత్రునికంటె కోపంబు కీడు
వివిధమనోరథవీథి సంతతము, జవనాశ్వముల జరియింపుచున్న
యే నింద్రియంబుల నె౦దు బోనీఁక, మానుగా ధృతిచేత మరలంగ దిగిచి
యూహించి మనములో నొప్పంగ నణచి, దేహకర్మంబుల ధీప్రసాదముల
కుశలుఁ డై కోపంబు గుదియించి పరుల, యశుభంబు లడఁచుట యధికధర్మంబు
కావున గోపంబు గలవాఁడు సేయు, దేవపూజయుఁ బితృదేవతర్పణము
లురుహోమదానంబులును దపంబులును, వినుతాధ్యయనములు వివిధంబు లరయ
ననుడు నాభిక్షకు డవనీశుఁ జూచి, వినుపింపదొణఁగె నావిధమెల్లఁ దెలియ
బెడిదంపుటాకఁట భిక్షు కిల్లిల్లు, విడువక పాత్రలో వెలితిగాఁ దిరిగి
పొడవుకోపముతోడఁ బురవీథి నేను, నడతేర నీకుక్క నడువీథి నుండి
తొలఁగ జంకించిన తొలఁగకుండుటయు, నలిగి నాచేకోల నడిచిన న్నెత్తి
దాని యగ్రగ్రంధి దాకి శోణితము, మానక తొరుగంగ మస్తకం బవిసె
తప్పు జేసితి నేను దండ్యుడ నగుదు, తప్పు వాయగ నీవు ధరణీశ నన్ను
దండింపు నీచేత దండింపబడిన, దండహస్తునిచేతిదండన తప్పు
నని విన్నపము సేయ నధిపు డంగిరసు, ఘనువసిష్ఠుని భ్రుగు కశ్యపు గుల్భు
సకలమంత్రుల ధర్మశాస్త్రకోవిదుల, నకలంకచాతుర్యు లైనభూసురులఁ
గలయంగ నీక్షించి ఘనులార? మీరు, తలపోసి శాస్త్రీయదండ మీతనికి
విధియింపు డనవుడు విప్రుండు గాన, నధికశిక్షకు నీత డర్హుండు గాడు
తెగి తప్పుసేయుట తెల్లంబుగాన, తగినదండన మీరు దండింపవలయు
జననాథ మీకంటె శాస్త్రతత్వంబు, గలవార లెవ్వరు గలరు లోకముల
సాధుల రక్షింప జగతి సజ్జనుల, బాధించుదుష్టులఁ బట్టి శిక్షింప
విభవిష్ణుఁ డగుచున్న విష్ణువంశమున, బ్రభవించి రాజులై పాలింతు రవని
నృపవర పరికింప నీవు విష్ణుఁడవు, నృపమాత్రమే దేవ నీతేజ మనగ
కారుణ్యనిధియైన కాకుత్స్థు జూచి, సారమేయము బల్కె సంతోష మెసఁగ
నిది హీనజాతి నా కీకుక్కతోడ, నెదురు సంభాషింప నేటికి యనక
నాకడ కేతెంచి నావిన్నపంబు, చేకొని వింటి నాచేసినతపము
నింక నాతెఱగెల్ల నేర్పడ నీకు, పంకజహితవంశ పరగ విన్పింతు
కాలాంజనం బన గల దొక్కనగము, కాలకుడ్యం బనఁ గల దందు పురము
అప్పురంబున బాహ్మణాధికారంబు, నొప్పంగ నే జేసి యుంటి నాపదవి
ఘనభూతి నం దుండుఁ గాక యీవిప్రు, డనఘ నా కిది వరం బనగ భూవిభుఁడు
భాసురగతి నంత బట్టంబు గట్టి, గైసేసి తెచ్చిన గజము నెక్కించి
యప్పురి కనుపంగ నావిప్రుఁ డరుగ, నప్పుడు నొగి మంత్రు లధిపతి కనిరి
ధరణీశ నీచేత తలప నీవిప్ర, వరునకు దండ మీ వలను గా దనిన
విని మంత్రులార యీవిధ మెల్ల నెఱుగు, శునకంబ నావుడు శునకంబు బలికె
ననఘ దేవబ్రాహ్మణాధికారంబు, పని బూని యక్కొండ బహుకాల ముండి
తగ బంధుకోటికి దాసవర్గమున, కొగి బంచిబెట్టుచు నున్నశేషంబు
యాహార మై యుండ నాభారపరత, దేహాభిమానంబు ద్రెంచి ప్రాణులకు
హితము చేయుచునుంటి యే నట్టినాకు, నతికష్టగతి గుక్కనై పుట్టవలసె
క్రూరుడ విప్రుండు క్రోధాంధుఁ డెల్ల, వారలయెడ గీడువా డైనవాఁడు
విద్వదహంకారవృత్తిమై నునికి, సద్వినుతులఁ జూచి సైప డి ట్లగుట
నడరంగ నిరుదిక్కులందు నేడేడు, గడల వారల నధోగతి గూలఁ ద్రోచు
నరయ దేవబాహ్మణాధికారంబు, పరమాపదల కెల్ల పట్టు శోకముల
బలువిడి నవ్వారి పశుమిత్రపుత్ర, కలితంబుగా నధోగతిఁ గూలఁద్రోయ
నతనిదేవబ్రాహ్మణాధికారముకుఁ, బతి జేయునది మహాపతి రమారమణ
దేవభూసురనృపస్త్రీబాలధనము, నే వెంటఁ గొనఁదగ దన్నింటిలోన
దాన దేవద్విజద్రవ్యముల్ గీడు, గాన చిత్తమునందు గాదు కాంక్షింప
నని చెప్పి వీడ్కొని యాసారమేయ, మనఘమై చెలువొందు నాకాశి కరిగి
తనమేను కాశిలోఁ దా వైచి దొఱగి, ఘనమైన తనపూర్వగతియు గైకొనియె
నంత రాముడు నిశ్చలాత్ముడై రాజ్య, మెంతయు వేడ్కతో నింపార జేయ
ననిశంబు యమునాతటాశ్రమపుణ్య, వనముల జరియించు వరమునీశ్వరులు
చ్యవను డాదిగ నుండు సకలసంయములు, నవనీశు గానంగ నట వచ్చుటయును
గని ద్వారపాలుండు కడువేడ్కతోడ, జని రామునకు మొక్కి సవినయోక్తులను
వనజాప్తవంశపావన నేఁడు వచ్చి, మునివరు లున్నారు మొగసాల ననుచు
విన్నవించిన మోము వికసింప నిడుద, కన్నులఁ జెన్నారఁ గడువేడ్కఁ జూచి
విచ్చేయమని జెప్పు వేగ బొమ్మనిన, నెచ్చుగా నతఁ డేగి యెఱిగింప మునులు
వచ్చిసత్కృతు లోలి వరియించి తారు, వెచ్చిన బహుపుణ్యతీర్థోదకములు
ఫలమూలములు నిచ్చి పరిపాటి నిడిన, లలితాసనంబుల లలి నొప్పి రపుడు
ముకుళితహస్తుఁడై మునుల నీక్షించి, సకలజ్ఞుఁడగు రామచంద్రుఁ డిట్లనియె
నేమికార్యము మీర లిటకు విచ్చేయు, టేమైనఁ జేసెద నెరిగింపుఁ డెలమి
నాసర్వరాజ్యంబు నాజీవనంబు, భూసురోత్తములకై భూతిఁ బెంపొందు
ననవుఁడు నీమాట లాడంగ నీకు, జనుగాక యొరులకుఁ జనునె లోకముల
మీకులవ్రత మిది మేదినీనాథ, మీకు శరణ్యులు మఱి మీరె కారె
యీమహి రాజులనెల్లఁ గన్గొంటి, మీమాట వింటిమే యేరాజులందు
నని పల్కి వెండియు నడుగ నాచ్యవనుఁ, డనియె నారాముతో ననురాగ మెసఁగ
మధువనురక్కసునిచరిత్ర
ప్రథమయుగంబున బ్రహ్మణ్య మగుచు, పృథుశక్తి మధు వనుపేరిరక్కసుఁడు
మతిమంతుఁ డై దాను మహితుఁ డై దేవ, హితుఁ డై చరింపుచు నిందుశేఖరుని
చండతపోనిష్ఠ సంతుష్టుఁ జేయ, నిండారుకరుణ నానిఖలైకవిభుఁడు
సునిశితం బగు తనశూలంబువలన, ఘనశూల మొక్కటి కడఁగి నిర్మించి
యిది నీకు వరముగా నిచ్చెద దీని, పదిలంబుగా నీవు పట్టి భరింపు
తిరముగా దేవభూదేవతాభక్తి, గరమొప్ప నెందాక గలుగు నందాక
బనిసేయు నిది సురబ్రాహ్మణద్వేష, మొనరింపుడును ద్రుంచు నొగి నీకులంబు
పైవచ్చుఁ బగవారిపై వైవ నతని, వావిరి దునుమాఁడి వచ్చు నీకడకు
ననవుఁడు నావరం బద్దేవువలన, మనమారఁ గైకొని మధువు గేల్మొగిచి
యెలమి మాకులమున కెల్ల నీవరము, గలుగంగ పరమేశ గరుణింపు మనిన
నీవెన్క శూలంబు నీతనూజునకు, నావెన్క బని సేయ దన్యు లెవ్వరికి
శూలంబు దాల్చిన శూరుఁ డెందాక, వాలు నందాక నవధ్యుఁడై మెలఁగు
నని చెప్పి గౌరీశుఁ డఱుగంగ నచట, నొనరఁగ మధుపురం బొకటి నిర్మించి
యనఘాత్ముఁ డగుచున్న యావిశ్రవసువు, తనయ గుంభీనస దశకంఠుననుజ
నిమ్ముల సాహస మెచ్చంగఁ దెచ్చి, గ్రమ్మర యట పత్ని గాఁగ వరించి
కొంతకాలమున కాకొమ్మయం దెలమి, సంతానకాముఁడై చరియింపుచుండ
లవణుండు నా నొక్కలఘుచరిత్రుండు, భువనకంటకుఁ డైన పుత్రుఁడు బుట్టె
నారాక్షసుం డంత నాపుత్రుఁ జూచి, ఘోరపాపుఁడు వీఁడు కొడు కయ్యె ననుచు
చిత్తంబులో చాల చింతించి యతఁడు, చిత్తజాంతకుచేత చెన్నారఁ గన్న
ఘనశూల మిచ్చి యాకథయు నీచంద, మని చెప్పి వరుణాలయంబున కఱిగె
నది మొదలుగా నాతఁ డాశూలమహిమ, నొడవుదర్పముతోడ నుగ్రుఁ డై మండి
మూడులోక౦బులు మొగి నేలుచున్న, వాఁ డుగ్రకర్ముఁ డై వారింపఁబడక
మానక గారించు మము విశేషించి, వానిబాధలు పెద్ద వసుధలో నధిప
యఱయంగ నాశూలయతులప్రభావ, మఱుదు లోకములోన నతనివిక్రమము
పరగ మాచే వానిబాధలు వినియు, ధరణీశులెవ్వరుఁ దల లెత్తరైరి
మాకు శరణ్యులు మరి మీరె కాన, గైకొని మునిరక్ష గావింపవలయు
పౌలస్త్యకులముఖ్యుఁ బరుషప్రతాపు, త్రైలోక్యకంటకు దశకంఠు నలఁగి
యనిలోన పుత్రమిత్రాదులతోడ, దునుమాడి జగములు దుఃఖంబు లుడిపి
విచ్చేయుటంతయు విని విని బాధ, లచ్చుగా నెఱిఁగింప నని యేము రాక
యనుడు నావాక్యంబు లతిభక్తితోడ, విని పల్కె నారఘువిభుఁడు కేల్మొగిచి
లవణాసురునిచరిత్ర
యరయ నాతని కెద్ది యాహార మెద్ది, చరిత మెందుల నుండు సకలంబు నాకు
వినుపింపవలయు నా విని దేవ వాఁడు, గొనయ డీయశనంబు కొలది మున్ వినుడు
వదలక పదివేలు వనలులాయములు, పదివేలు మృగములు పరిపూర్ణతనులు
నరులు నన్నూర్వురు నన్నూరుగజము, లరుదుమేనుల వరాహములు నన్నూరు
వొకపూటభుక్తిగా నొగి గొనుచుండు, ప్రకటపాపస్థితిఁ బ్రతివాసరంబు
దక్కినజీవులఁ తగ పెక్కువేల, నక్కజంబుగ గొను నవనీతలేశ
యధికరోషాంధుఁడై యధికుల నడచు, మధువనంబున మదోన్మత్తుఁడై యుండు
ననుడు నప్పాపాత్ము నని ద్రుంచివైతు, మునులార వెఱవక ముద మొందుఁ డనుచు
భరతశతృఘ్నులపై దృష్టిఁ బరపి, కరుణార్ద్ర హృదయుఁడై కాకుత్స్థుఁ డనియె
నేపార మీలోన నెవ్వ రాలవణు, నోపి చంపెడువారు యుద్ధరంగమున
నావుఁడు భరతుండు నరనాథ లవణు, నే వధించెద బంపు డింక న న్ననిన
జననాథుఁ గనుగొని శతృఘ్నుఁ డనియె, వినతుఁడై హస్తారవిందముల్ మొగిచి
భూపాల సత్యంబు పూరింప మీరు, తాపసవేషంబు ధరియించి చన్న
విచ్చేయుడని మిమ్మ వేడ రాకున్న, వచ్చి నందిగ్రామవాసియై యచట
మీయాజ్ఞ గైకొని మేదినీరక్ష, పాయక చేయుచు బ్రజలెల్ల నలర
పరుసంపువల్కలాంబరములు జడలు, పొరిఁబూని ఫలమూలభోజియై నియతి
నీవిధంబున బెక్కుయిడుముల గుడిచె, దేవ మీ రిచట కేతెంచునందాక
నెమ్మది మిము గొల్వ నిల్చుగా కేను, గ్రమ్మిన మీశక్తి గడతేర్తు నతని
బంట నే నుండగా భరతుఁ డేమిటికి, నంటయు రఘునాథుఁ డలరుచుఁ బలికె
తమ్ముల కెందుకు తమయన్నపనులు, సమ్మదంబునఁ జేయఁ జను నటు గాన
యధికుఁడ వస్త్రంబులందు శూరుఁడవు, మధుఁ డేలుపురముల మహి నీ వెరగుము
పట్టంబు గట్టెద పరగ ని న్నతని, పట్టణంబున కేను పార్థివతనయ
నెట్టన నిజశక్తి నిర్జించి యతని, పట్టణం బేలుచుఁ బ్రజలు రక్షింపు
పగవాని నాజిలో భర్జించి యతని, నగరంబు గైకొని నలి నేలువాఁడు
పరగంగ ధారుణిపతులకు నెల్ల, నరయంగ శూరుఁడ యదియును గాక
ప్రజల రక్షించిన పరలోకసుఖము, నిజ మటు గావున నిఖిలలోకముల
ధర్మంబు విడువని ధారుణీపతికి, ధర్మంబు విజయమై తనరు లోకముల
ననుజ వసిష్ఠాదులగు మహామునులు, ఘనపవిత్రములైన కలశోదకముల
నభిషేక మొనరింప నలరి పట్టంబు, శుభతల గైకొని శోభిల్లుమనిన
మనుజేంద్ర యేను మీమహితవాక్యములు, విని మీరు మాటాడ వెఱచెద గాక
యారయ నాకంటె నధికులై పెద్ద, వారుండ బట్టంబు వరుసయే నాకు
ననవుఁడు నామాట కల్లన నవ్వి, జనపతి భరతలక్ష్మణుల వీక్షించి
శ్రీరాముఁడు శత్రుఘ్నునకుఁ బట్టంబుఁ గట్టుట
యభిషేకవస్తువు లన్నియుఁ గూర్పు, డభయుఁ డీశత్రుఘ్ను నభిషేకమునకు
వెస వసిష్ఠాదుల వేదపారగుల, నసమానమహిముల నలరుఋత్విజుల
సచివులు మొదలుగా జనువారినెల్ల, నుచితక్రమంబున నొగి బిల్వుఁ డంత
వలయువారలనెల్ల వరుస రప్పించి, విలసితమతి జేరి విన్నవించుటయు
నారాము నాతని నావసిష్ఠాదు, లారంగ శతృఘ్ను నభిషిక్తుఁ జేసి
యలర బట్టము గట్టి రంత నాయనుజు, నలఘుతేజము జూచి యతని రాదిగిచి
యూరుపీఠంబున నునిచి యావిభుఁడు, గౌరవం బలరంగ గరుణతోఁ బలికె
నఖిలలోకంబు లేకార్ణవంబైన, నిఖిలదైత్యాదుల నిర్జించుకొఱకు
పరమగు నీదివ్యబాణరాజంబు, నరుదుగా నిర్మించె యంబుజోదరుఁడు
విధిలోకసృష్టి గావింపక మొదట, మధుకైటభులు దీన మర్దింపఁబడిరి
పదపఁడి నాకు నీపటుసాయకంబు, విదితంబుగాఁ గల్గి విలసిల్లుచుండు
భూతసంహారంబుఁ బొరిఁ జేయకుడుగ, నిత్తెఱంగుననైన నీబాణ మనుచు
నిది ప్రయోగింపక యేగు రావణుని, యెదిరి నిర్జించితి నితరబాణముల
నటుగాని యాదివ్యమైనబాణంబు, చటులోగ్రశక్తి కసాధ్యుండు లేడు
వాని నీశరమున వధియింపు మనుచు, మానితం బైనయామార్గణం బిచ్చి
శూలిచేఁ బడిసిన శూలంబు వాని, కేల నుండిన నీకు గెలువంగ రాదు
నిచ్చలు బూజించి నియతి నాశూల, మచ్చుగా గేహంబునందుఁ బెట్టుచును
నన్నిదిక్కులయందు నాహారవాంఛ, పన్నుగాఁ బ్రాణుల బట్టి మ్రింగుచును
జరియించుశత్రుండు చనుదెంచెనేని, కర ముగ్రతేజుఁడై గడతేర్చి పుచ్చు
వీతశూలుఁ డైనవేళ నీ వెఱిఁగి, ప్రీతి కయ్యమునకు బిలిచి నిర్జింపు
మురుశూలహస్తుఁడై యున్న పైజనకు, వెర వేమరకయున్న విజయంబు గలుగు
లలితరేఖలు గల్గు లలి చిత్రగతుల, బొలుచు నుత్తమహయంబులు నాల్గువేలు
ప్రచురప్రభాభాసి బహురత్నహేమ, రుచిరంబులైన తేరులు రెండువేలు
దానధారామత్తతరుణాళి మధుర, గానంబులకు మెచ్చు కరు లొక్కవెయ్యు
వరవీరభటజనవ్రజ మొకలక్ష, నెరి సువర్ణంబులు నిరుఁగోట్ల నిచ్చి
యంగళ్లు బెట్టు బేహారులు నటులు, మంగళపాఠకుల్ మంచిగాయకులు
మఱియును దగువారు మహిమతోఁ గొలువ, నూరుసువర్ణము లోలి యొకకోటి గొనుచు
శత్రుఘ్నుఁ డొగి నమస్కారంబు సేయు, తత్రత్యులందఱుఁ దన్ను నుతింప
రామచంద్రుడు ప్రీతి రంజిల్ల ననుజు, తో మృదుచిత్తంబుతోడ నిట్లనియె
పరిసాటిసేనాధిపతుల మన్నింపు, పరుషభాషల వారి బల్కకు మెపుడు
యరసి భృత్యులచేత నయ్యెడుపనులు, ... ... ... ... ... ... ...
వనితలచే బంధువర్గ౦బుచేత, ధనములచే గావు తగువారి బ్రోవు
కడక నీవీగ్రీష్మకాలంబునందు, కడువేగ జాహ్నవి గడని యొక్కెడను
నీసేన విడియించి నీ వొక్కరుఁడవు, భాసురశరధనుఃపాణి వై కదియు
మెవ్వరే నీరాక యెఱిగించిరేని, క్రొవ్వున వెస బట్టికొని మ్రింగు నతఁడు
కాన వంచనమీఁది కార్య మున్మత్తు, డైన దురాత్ములయం దంచు బనుప
నల రిశాలాధ్యక్షులై యున్నవారి, గలయంగఁ గనుఁగొని కడుప్రీతిఁ బలికె
నేడువాసరముల కెల్లసైన్యముల, గూడి ప్రయాణంబు కొలది కేతెండు
మీ రని పలికి నామితిచన్ననాడు, గారవంబునఁ బుణ్యకర్మముల్ దీర్చ
ముగురమ్మలకు మ్రొక్క ముద నూరవారు, తగినదీవన లిచ్చి తను వీడుకొల్ప
చనుదెంచి యారాముచరణాబ్జములకు, వినతుఁ డై కౌగిట విభుఁడు మన్నింప
నాఖండలోజ్వలుం డైనయారాజ, శేఖరునకుఁ బ్రదక్షిణము గావించి
భరతలక్ష్మణులకుఁ బ్రణమిల్లి వారి, పరిపాటి వీట్కొని పైనమై కదలి
చనుచోట మూడువాసరములునడుమ, జనఁగ నాలవనాఁడు జాహ్నవి దాటి
యారయ వాల్మీకి యాశ్రమవనము, చేరువ నొకచోట సేనల నిల్సి
చని యమ్మునీంద్రుని చరణాబ్జములకు, వినుతుఁడై తనరాకవిధ మెఱిఁగించి
మునినాథ యీరాత్రి ముదమారవిందు, చని నెల్లి పడమరఁ జన్న యామార్గ
మున జనియెదనన్న మునిపుంగవుండు, మనమున సంతోషమగ్నుఁడై పలికె
దశరథాత్మజ మీరు ధర్మాత్ము లగుట, కుశలంబు మీ కని కుశలంబు లడిగి
మీయాశ్రమం బిదె మీకు మీయింటి, కీయెడ జనుదెంచు టిదియ నాపూజ
యచ్చోట మీ కుండ నిరవయ్యె నచట, నచ్పోట నీసేన నట విడియింపు
మీయర్ఘ్యపాద్యంబు లింద మీ కనుచు, నెయ్యంబుతోడ నానృపతనూజుండు
నిచ్చె నావాల్మీకి యిచ్చినపూజ, లచ్చుగాఁ గైకొని యధికమోదమున
ఫలమూలభక్షణపరితుష్టుఁ డగుచు, నలరి శతృఘ్నుఁ డనియె గేల్మొగిచి
యనఘ యుపాధు లీయాశ్రమోపాంత, మునుఁ బెక్కు లున్నవి ము న్నెవ్వ రిచట
జన్నముల్ జేసి రాజననాథు లెవ్వ, రన్న ప్రాచేతసుం డని చెప్పదొణఁగె
మార్గమాధ్యంబున వాల్మీకి శత్రుఘ్నునకు పూర్వరాజగు మిత్రసహుని చరిత్ర చెప్పుట
వసుధీశతనయ మీవంశంబునందు, వసుధసుధాంశుడన్ వాడు వర్తించు
మహితతేజుండు మతిమంతుండు మిత్ర, సహుఁ డన నితనికి జనియించెఁ గొడుకు
మృగయావినోదంబు మెయి నుండి యతఁడు, మృగముల నందఁద మ్రింగురక్కసుల
ఘోరకోపాధుల క్రూరవర్తనుల, దారుణాకృతుల గాంతారమధ్యమున
నిరువురఁబొడ గాంచి యచ్చోట మృగము, లరుదార వీరిచే నడఁగెనం చలిగి
క్రొవ్వాడిబాణంబు గొనుచు నం దొకని, దవ్వులఁ బడనేయ దక్కినవాఁడు
యామిత్రసహుఁ జూచి యనపరాధంబు, నామిత్రు జంపితి నగనాథ నీవు
మఱువకు నా చేయు మా ఱెగ్గు నిట్టి, తెఱఁగుసు మ్మనుచు నదృశ్యుఁ డై చనియె
నంత నారాజు నీయాశ్రమవనము, చెంత నధ్వరభూమి చెలువొందఁ దీర్చి
సకలదానక్రియాసామాగ్రితోడ, నకలంక మగుచున్న యశ్వమేధ౦బు
బహుకాలవర్తియు బహుమంత్రయుతము, బహుదానదక్షిణాస్పదము నై వెలుఁగ
నమరులు గావించు నధ్వరమునకు, సమమగుచున్న యాజన్నంబునిండ
గావించుచున్నెడఁ గపటవసిష్ఠుఁ, డై వచ్చి యలనాఁటి యారక్కసుండు
తనపూర్వవైరంబు దలఁచి చిత్తమున, కనలెడుచందంబు గానరాకుండ
నానరేంద్రుని జూచి యవనీశ నాకు, మానసం బలరంగ మాంసభోజనము
బెట్టింపు మనవుఁడు ప్రియమైనఁ జాలు, నట్లు సేయించెద నని వేట్కతోడ
నట బాలు బిలుపింప నట పోయి వాఁడు, యట బాలుఁ డై వచ్చి యచట నిలుచుటయు
నీచేతినేర్పార నేఁడు మాంసంబు, పాచకోత్తమ నీవు పక్వంబు చేసి
వే నీవు దెమ్మన్న విని వాడు నలరి, మానసి జంపి యామా౦సంబు వలయు
బరికరంబులతోడ పసనుగా వండి, నరనాథ తెచ్చితి నా నతఁ డలరి
తనదేవియును దాను తగ వసిష్ఠునకు, ననురాగమున దెచ్చి యామాంస మిడిన
నమ్మునిపుంగవుం డాతెఱం గెల్ల, గమ్మర బరికించి కడు నల్గి పలికె
భూనాథ సాహసంబున నా కభోజ్య, మైన మాంసంబు బెట్టి తౌను గా దనకఁ
హింస జేయుచు భూతహితబుద్ధి లేక, మాంసభక్షకుఁడ వై మహి నీవు నుండు
మని శాప మిచ్చిన నావాక్యమునకు, వనితాసమేతుఁ డై వణకుచుఁ బలికె
ననఘాత్మ మును మాంస మడిగితి వీవ, చనునె యివ్విధమున శపియింప ననిన
నారసి మదిలోన నతిపాపుఁడైన, యారక్కసుచేత లని విచారించి
ధరణీశ నాపల్కు తప్ప దీశాప, మరయ బండ్రెండేండ్ల యందాక ననిన
జననాథుఁడును మారు శపియింపఁదలఁచి, కనలి చే శాపోదకము లందుకొనిన
నారాజుదేవియ నవనీశు జూచి, యోరాజ యిది నీకు యుచితంబు గాదు
జననాథ యొడయఁ డీసంయమీశ్వరుఁడు, మన కెన్నివిధముల మాననీయుండు
దేవతాసదృశుఁ డీతేజోధనుండు, భావింప మనచేతఁ బడువాఁడు గాడు
విడువు మీకోపంబు వెరవు గా దనుచు, నుడివిన చేతివి ల్లొయ్యన వదల
నానీటిచిచ్చున యడుగులు మాడి, యైనకల్మషమున నామిత్రసహుఁడు
బ్రాతిగా కల్మాషపాదుడన్ పేర, నాతతగతి నొప్పె నదిమొదల్ గాఁగ
నటమీఁద నారాజు యాగంబు నడగె, నటు గాని యిది నాటియజ్ఞవాటంబు
యనుచు నావృత్తాంతమంతయుఁ జెప్ప, విని మనంబున జాల విస్మితుం డగుచు
మునినాథునకు మ్రొక్కి ముద మొప్ప వచ్చె, దనపర్ణశాలకు దశరథాత్మజుఁడు
నాలోన సీతయు నర్కేందుయశుల, బోలఁగ నిరువుర పుత్రులు గన్న
పరతెంచి యామేలుపల్కు వాల్మీకి, కెఱిగించి మునినాథ యీకుమారకులు
కుశలవులపుట్టుగ శత్రుఘ్నుఁ డెఱుంగుట
రవికులదీపకుల్ రఘురామసుతులు, భువనరక్షకు వీరు పోలంగఁ గలరు
బలసి పిశాచాదిభయము లేకుండ, వలయురక్షలు గట్టవలయు మీ రనిన
లలి వచ్చి కుశయును లవము మంత్రించి, నెలికి నక్కడ నున్న వృద్ధకామినుల
బిలిపించి యీకుశ పెద్దపాపనికి, చెలఁగు నీలవమును చిన్నపాపనికి
పరిమార్జనంబులు పరిపాటి సేయుఁ, డిరవందగాఁ బెంపు డీకుమారకుల
కుశమార్జనంబున కుశలుడై యునికి, కుశుఁ డనగా బెద్దకొడుకు వర్తించు
లవమార్జనంబున లవుడు నాకుశుని, యవరజుం డన నొప్పు నని యెఱింగించి
యభిమంత్రితములైన యాకుశలవము, లభిమతస్థితి నిచ్చె నామునీశ్వరుఁడు
మగుడ వారలు నంగమార్జనస్ధితులు, మొగి జేసినంత నామునివరేణ్యుండు
ధరణిజపేర నాదశరథాధీశు, వరపుత్రుడైన యావసుధీశుపేర
నిరువుర దెసలందునే గడుగోత్రముల, సొరిది జన్మించిన సుతుల నామములు
సంకల్పవిధి జేయ శతృఘ్నుఁ డెఱిగి, ... ... ... ... ... ... .... .... ...
యతిముదంబున బొంది యౌర మాభాగ్య, గతి యంచు గృతకృత్యకర్ముడై వచ్చి
మునినాథునకు భక్తి మ్రొక్కి కేల్మొగిచి, వినయోక్తు లలరంగ వీడ్కొని నడుమ
శతృఘ్నుఁడు యమునాతటంబున విడియుట
రమణీయగతి నేడురాతులు బుచ్చి, యమునాతటంబునఁ కఱిగి యచ్చోట
ననవుఁడు భార్గవుండాదిగాఁ గలుగు, మునులయాశ్రమభూమి ముద మార విడిసి
వారిచే ధర్మార్థవర్తనులైన, వారివృత్తాంతముల్ వరుసతో వినుచు
నవిరళప్రీతిమై నారాత్రి పుచ్చి, చ్యవను నీక్షించి యాశతృఘ్నుఁ డనియె
ననఘాత్మ లవణుని యావిక్రమంబు, కనలు నాతనిచేతి కడిఁదిశూలంబు
చందంబు లెట్టివి సమరోర్వి నాతఁ, డెందఱ సమయించె నెఱిగింపు మనిన
వసుధీశనందన వానిలా వెందు, నసమాన మాశూల మనివార్య మరయ
నతనిశూలముచేత నాజిరంగమున, మృతులైనవారికి మితిమేర గలదె
యైన నేర్పడ విను మవనీశపుత్ర, యేను చెప్పెద నీకు యితిహాసమొకటి
చ్యవనుండు శత్రుఘ్నునకు లవణవిజితులగు రాజులచరిత్ర చెప్పుట
యువనాశ్వపుత్రుఁ డయోధ్యకు రాజు, భువనైకనుతకీర్తి భూరివిక్రముఁడు
మాంధాత యనురాజు మహి నెల్లనృపుల, బంధులదోర్బలప్రౌఢిమై గెలిచి
యమరేంద్రు నిరసించి యతనిసింహాస, నమునందె గూర్చుండి నాక మేలుటకు
నింద్రలోకంబుపై నెత్తి పోఁ బెరిగి, యింద్రాదిసురలెల్ల నెదురుగా వచ్చి
వసుధీశ వలదంచు వారింప దనకు, వశము గాకున్నెడ వాసవుం డనియె
నిలలోన గ్రూరులనెల్ల ము న్నీవు, గెలిచిన మఱి కదా కిన్క మామీద
ధరణిరాజులనెల్ల తగ మున్ను గెలిచి, సురలోకరాజ్యసుఖలీలఁ జేయు
మని కుపితాత్ముడై యమరేంద్రుఁ డనిన, జననాథుఁ డనియె నాశక్రు నీక్షించిఁ
యని నన్ను నెదురించునతఁ డెవ్వఁ డుర్వి, వినుపింపుమనిన నవ్విబుధేంద్రు డలరి
రాజేంద్ర మధువను రాక్షసేంద్రునకు, భూజనద్రోహియై పుట్టెను కొడుకు
లవణుడు నాపాపలాలసుం డగుచు, నవనిపై వర్తించు నధికదర్పమున
నతనికి మధువనం బది యున్కిపట్టు, జితశత్రుఁ డగునిన్ను జీరికిగొనఁడు
నా విని తలవంచి నరనాయకుండు, దేవేంద్రు వీట్కొని తీవ్రకోపమున
మరలి సేనలతోడ మధువనంబునకు, నురువడిఁ జనుదెంచి యొక్కచో నిలిచి
లవణునొద్దకు దూతలకు బంప వారు, జవమున జని వేగ సంగరంబునకు
వడిజని మాంధాత వచ్చినాఁ డనిన, నొడిచి గ్రక్కున మ్రింగె నుగ్రకోపమున
నిది యేల తడసిరో యీదూత లనుచు, మది విచారించి యామాంధాత వచ్చి
యోరోరి నాతోటి యుద్ధంబు సేయు, వే రమ్ము నావుఁడు వెడనవ్వు నవ్వె
కడునల్క బరతెంచి కడిదిశూలంబు, వడినెత్తి యుంకించి వైచె వైచుటయు
మిడుగుర్లు మంటలు మింట నందంద, నడరంగ భటవాహనాదులతోడ
బలువిడి మా౦ధాత భస్మంబు చేసి, వెలుగుచు బరతెంచె వెస పురంబునకు
నని చెప్పి యాశూల మట లేక వాడు, మనుజేంద్రనందన మడియు నీచేత
శూలంబు చేనున్న శూలికినైన, నాలంబులో గెల్వ నలవి గా దతని
నని చెప్పెఁ జెప్పిన నౌగాక యనుచు, నినుడు పూర్వాద్రికి నేగుతెంచుటయు
శత్రుఘ్నుఁడు లవణాసురునిం జంపుట
లవణుఁ డాహారేచ్ఛ లలి వీడు వెడలె, యవనీశుసుతు డంత యమున వేదాటి
బాణబాణాసనపాణియై వెంట, తూణీరయుగ మొప్ప దుర్జయుం డగుచు
పొలుపార మధు వేలు పురముగోపురము, పొలమున కేతెంచి పొలుపార నుండె
నాయెడ మాధ్యాహ్న మగుచున్నవేళ, వేయుప్రాణుల జంపి వెసగొంచు వచ్చి
యాయతకోదండహస్తుఁడై దీప్త, నాయకుఁడై యున్న శత్రుఘ్నుఁ గనియె
కని దిగంతంబులు గగనంబు పగుల, పెనునవ్వు నవ్వుచు బిట్టేచి పలికె
నీచేతివిల్లును నీయంపదొనలు, నీచందమున జూడ నీవు నాతోఁడ
నని సేయుతలుపొకో యటుగాక యున్న, యొనఁ బెట్టుకొని యేల నున్నాడ విచట
నీదర్ప మణచెద నీయట్టివారి, మేదినిపై నేను మ్రింగినవారు
కొలదిఁ బెట్టగ రారు కోటులు గలరు, తొలఁగక నిలువు నీత్రు ల్లడంచెదను
నీవెంట గొని నన్ను నేమి సేయంగ, నీవు చాలుదె నాకు నిను జంపు టెంత
వడిబడి కార్చిచ్చువాత నీరైన, మిడుతచందము గాగ మ్రింగెద నిన్ను
కడుకొవ్వి వచ్చి నాకంఠమార్గమునఁ, బడి త్రుంగితివి పోర పారిపోఁగలవె
రణభూమిలో నాకు రాజన్యగణము, గణుతింప తృణమునకంటె నికృష్ట
మనుడు గోపావేశ మడరంగ జెమట, జనియింప దృష్టుల సరినిప్పు లురుల
నోరోరి రాక్షస యోరి నీచాత్మ, యోరి యొక్కట నన్ను నోర్చి నాపిదప
మరికదా నీరజ్జుమాటలు నన్ను, నెఱుగవె దశరథాధీశునందనుఁడ
దశకంఠు రణవీథిఁ దలలు ఖండించి, పశువు గావించిన పరమదీక్షితుఁడు
మనుజనాయకశిఖామణియైన రాము, ననుజుఁడ శతృఘ్నుఁ డనువాఁడ నేను
కడిదిమై ని న్నాజిఁ గడతేర్చుకొఱకు, వడినెత్తి నీమీఁద వచ్చినవాఁడ
బటుపాపవృత్తివి ప్ర్రాణఘాతకుఁడ, వటు గాన వధకు నీ వర్హుఁడ వనిన
మగటిమనుతి గన్న మామేనమామ, యగుదశగ్రీవుని యాజిరంగమున
సకలబాంధవమంత్రిజనపుత్రమిత్ర, నికరంబుతోఁగూడ నిర్జించినాఁడు
మీయన్నయా! మారు మీకులం బెల్ల, పాయకరోషాగ్ని భస్మీకరింతు
నాయత్తపడియుండు మనిన నీ విపుడు, పోయెదవో నినుఁ బోనీను గాని
పుడమి శతుఘ్నుండుఁ బుట్టనినాఁడు, కడిదివీరుఁడ వైతి గాక నే డగువె
నారాముచే పడ్డనారాక్షసాధీశు, నారావణునిఁ జూచి యలరుదేవతల
పగిది నాచే నీవు పడియున్న నిన్ను, మొగి కూచి మునులెల్ల ముదము నొందెదరు
మసలి నీతోఁ బెక్కు మాట లేమిటికి, వసుధ గూల్చెద నన్న వాఁడు గోపించి
యవనిపై తనచేతు లందంద జమరి, యవడలు దీటుచు నధికదర్పమున
నవని బీటలు వార నట యొక్కవృక్ష, మవలీలఁ బెరికి చే నమరించుకొనుచు
నిలు నిలు మరువకు నీపంత మనుచు, బలువిడిఁ బరతెంచి బాహు లంకించి
వృక్షతాడనమున విపులవక్షంబు, లక్షించి వైచి యాలవణుండుఁ దొలఁగ
నది చూచి శతృఘ్నుఁ డామహీరుహము, పదితునకలు గాగ భల్లంబు పఱపి
వాఁడు వెండియు మీఁద వైచినతరులు, మూడేసి మూడేసి మురియలు గాగ
నిశితాస్త్రముల ద్రుంచి నిండుచీకట్లు, దిశలఁ గప్పగ గప్పె తీవ్రబాణముల
మధువుసూనుఁడు నొక్కమ్రా కెత్తి పిడుగు, విధమున నడునెత్తి వేసె వేయుటయు
వెసఁ గోళ్లు చేతులు విరవిరబోవ, వశముగా కిలమీద వ్రాలఁగ నపుడు
క్రందైన గంధర్వగణములు మునులు, నందంద దివిజులు నచ్చరల్ జూచి
తెరలఁగజాలిన ధృతి చెడి దిశలు, మొరసి యాహాకారములు సేయు వినుచు
పృథు మూర్ఛనొందిన పృథివీశతనయు, ప్రథ నోర్వి మృతుఁడైన భంగిగాఁ దలచి
వక్త్రులై నాచేత వడి బడ్డవారి, విక్రమం బరయంగ వీ డెంతవాఁడు
మరి యెచ్చియాకలి మలుగంగ నితని, యెగమ్రింగెదనంచును నింటి కేతెంచి
కనకకుంభమ్ముల కాగిననీళ్ళు, ననువొందగాఁ జల్క మర్ధితో నాడి
కడువేగ మృగమదగంథాదు లలఁది, యడరుమాల్యాభర ణావళుల్ దాల్చి
తనమనంబున గొంత తామసం బడర, దనరినయాకట దర్పించి పలికె
నతిదీనవృత్తితో నవనిపై నట్లు, హతుడైనరిపుమాంస మది మ్రింగెదనని
యతిఘోరమగుశూల మచటి కేమిటికి, ప్రతిభయంకరవీరభటు లున్న గాక
యని కొంతదడవున కచటి కేతేర, మనుజేంద్రతనయుఁ డామరుపటు దెలసి
మునివరుల్ దీపింప మొగి దివ్వు లలర, తనరఁగ విలుగుణధ్వని చేసి నిలచి
రాజేంద్రవిభుఁ డైన రాముచే గొన్న, రాజితమణిహేమరత్నపుంఖంబు
యాజిని గెలిపించు నమ్ములందెల్ల, తేజంబు గలుగు నాదివ్యబాణంబు
చటులకాలానలసంకాశ మగుచు, చిటిలి పెన్నుదురుపై జెదరంగ దూచి
దిగిచి చే జంకించి ద్రిప్పిన భుగులు, భుగులన మంటలు బొరి మింట నంట
భూతముల్ బెదరంగ భువనముల్ దిరుగ, నాతతభీతిమై నప్సరల్ మునులు
గంధర్వసురసిద్ధ ణములు గూడి, బంధురధ్యుతిఁ బొల్చు పరమేష్ఠికడకు
చనుదెంచి వినతులై చతురాస్య మున్ను, వినము గానమ యిట్టివిధ మైనయరుదు
దేవాసురాదుల దెగటార్ప మున్ను, గావింపఁబడిన యాఘనసాయకంబు
ప్రళయకాలానలప్రభ నున్న జూచి, కలఁగి వచ్చితి మన్న కమలజుం డనియె
ముల్లోకములకును ముల్లైనయట్టి, బల్లిదు మధుపుత్రు బవరంబులోన
నేఁడు శత్రుఘ్నుండు నిర్జించువాని, వాడిశర౦బున వధ్యుండు వినుఁడు
యాదినారాయణుం డైనయాదేవు, డీదివ్యశరశక్తి నేర్చె దానవుల
నరయ శత్రుఘ్నుండు నాదేవునంశ, మరుగుకు వెరవకుండని పల్క వారు
చనుదెంచి కనుఁగొన శత్రుఘ్ను డార్చి, తునిమెద నింక నీదుష్టాత్ము ననుచు
బాణాధిరాజమై పరగు నాదివ్య, బాణంబు సంధించి బలువేగ దివియ
నట్టహాసమున వాఁ డాకాశ మద్రువ, నెట్టనపదహతి నేల గంపింప
పరుషరోషంబున బరవీరవక్ష, మిరవార లక్షించి యేసె నేయుటయు
నురమును నేలయు నొగి నుబ్బి పారి, నురగలోకమునకు నులుకుఁ బుట్టించి
యురుకరాళజ్వాల లొండొండ నిగుడ, నురువడి మరలి యాయుగ్రసాయకము
పరతెంచె తూణికి బాణిఘాతమున, నొరలుచు లవణుండు నుర్విపై ద్రెళ్ళె
పిడుగువ్రేటున బడ్డ పృథివీధరంబు, వడుగునఁ బడియున్న వాని నీక్షించి
మునిసిద్ధగంధర్వముఖులు నందంద, వినుతించి రమ్మహావీరు శత్రుఘ్ను
నంత నక్కడ నున్న యట్టివారెల్ల, నెంతయు నరుదని యీక్షింపుచుండ
శూలి యిచ్చిన మహాశూలంబు నరిగి, శూలిశూలమునంద జొచ్చెఁ జొచ్చుటయు
శక్రాదులు శత్రుఘ్ను నుతించుట
శక్రాగ్నులాదిగా సకలదేవతలు, విక్రమోదగ్రులై విలసిల్లుచున్న
శత్రుఘ్నునొద్దకు జనుదెంచి లోక, శత్రువు మధుపుత్రు జంపితి వీవు
మా కెల్లభయములు మనుజేంద్రతనయ, నీకారణంబున నేటితో బాసె
వర మిచ్చెదము నీకు వాంఛితం బెద్ది, నిరవార మది మాకు నెఱిఁగింపు మనిన
చేదోయి మొగిడించి శిరమున జేర్చి, యాదేవతలతోడ ననియె నాఘనుఁడు
మధు వేలునగరంబు మఱి దొంటికంటె, నధికంబు జేసెద ననియున్నవాఁడ
నది మీరు సిద్ధించు నట్లుగా తలఁపు, డిదియె నాకోర్కె నా యెల్లదేవతలు
మధుర నన న్వీడు మహినంతకంత, కధికమా నీచేత నని పల్కి చనిరి
నిజనివాసములకు నిర్జరుల్ జనగ, విజయసూచకభేరి వేయింపఁ బనిపె
తనసేనతో గూడ దను నెల్లవారు, వినుతింప నగరప్రవేశంబు చేసె
శత్రుఘ్నుఁడు మధురాపురము ప్రవేశించుట
నంత నానగరంబు యధికసంపదల, నెంతయు నానాటి కెసఁగి సొంపార
పద్మగంధములకు భ్రమరముల్ దిరుగ, పద్మాకరంబులు బహుతటాకములు
రచ్చలు నంగళ్ళు రాజమార్గములు, వచ్చుగాఁ జెన్నారు నారామములును
మకరతోరణములు మణిదీపకళిక, లకలంకగతి నొప్పు నాపణంబులును
వరుసతో నరుణాంశువంశరాజన్య, బిరుదుచిహ్నములైన పృథుకేతనములు
ప్రాకారములు మహాపరిధులు కోట, వాకిళ్ళు నొప్పారు వజ్రచక్రములు
నాకీర్ణమణిపుత్రికాళి జెన్నారు, నాకాంగనావిమానములతో గలయ
నయ్యంబరము దాకు నట్టాలకములు, నయ్యాతెఱంగుల నమరఁ జేయించి
యర్ధచంద్రాకృతి యమునాతీరమున, వర్ధించు నప్పురవరమునం దెలమి
ప్రజల కేయెగ్గులు బాటిల్లకుండ, నిజధర్మరతినీతినిష్టాత్ముఁ డగుచు
తప్పక నడపుచు దనధాన్యవృద్ధి, నొప్పు బెహారుల నోలి నిల్పుచును
నుదితోదితస్థితి నుండి చిత్తమున, నొడవు వేడుకతోఁడ నొకనాఁడు దలఁచి
జననాథుఁడగు రామచంద్రునివలన, పనివిని యే వచ్చి బహుకాల మయ్యె
నెన్న బండ్రెండవయేడు వర్తింపు, చున్నది సనియెద నుర్వీతలాధి
పతికి నమ్మలకును భరతలక్ష్మణుల, కతిభక్తి ప్రణమిల్లు టదియె నాకోర్కె
యని మంత్రివర్యుల నఖిలభృత్యులను, ఘనసైన్యముల బరికాపుగా నునిచి
జవనాశ్వములు రథశతకంబు గొలువ, నవిరలద్యుతితోడ నప్పుడ వెడలి
నడుమను కొన్నాళ్ళు నడచి సంతోష, మడరంగ వాల్మీకి యాశ్రమమునకు
చనుదెంచి మ్రొక్క నాసంయమీశ్వరుఁడు, యనురక్తి నిచ్చిన యర్ఘ్యపాద్యములు
నెమ్మితో గైకొని నృపనూనుఁ డొప్పె, నమ్మునీంద్రుఁడు నంత నతని వీక్షించి
యెక్కుఁడుమదమున నెల్లలోకులకు, ముక్కుముల్లై యున్న మూర్ఖు నాలవణు
తృణలీల జంపితి దివ్యాస్త్రమహిమ, గణుతింప నినుఁ బోలగలఁడె వీరుండు
వా డనేకుల శూరవరులైనవారి, వాఁడి మగంటిమి వడి జంపినాఁడు
కడుదుర్జయుఁడు పాపకర్ముఁడు వాఁడు, పడియె నీచే లోకభయమెల్ల బాసె
బహుయత్నములు చేసి పంక్తికంధరుని, మహి గూల్చె రాము డామహనీయభుజుఁడు
నారావణునికంటె నధికవీరుండు, క్రూరుండు నగుమహాకుటిలవర్తనుఁడు
పాపకర్ముల జంప భానువంశమున, నేపార బుట్టితి రీజగంబునను
లవణుండు నీవును లావులు మెరసి, బవరంబు సేయుట బవరంబులోన
లవణుండు నీచేత లఘులీలఁ బడుట, దివిజేంద్రసఖ వింటి తెల్లంబు గాగ
యెక్కుడు నుతి గాంచి తీ వంచు దిగిచి, చిక్క కౌఁగిట జేర్చి శిరము మూర్కొనుచు
తగుసంవిధాన మాదశరథాత్మజున, కొగినొద్ది వారికి నొనరించి పిదప
సూచితకథాగోష్టి నుండ లోకైక, సుచరిత్రుఁ డగురాము శుభవర్తనంబు
చనిన తెఱంగును జనుచున్న తెఱగు, జననున్న తెఱగును సకలంబు గలిగి
సముచితార్ధము లైన శబ్దసంపదల, నమరంగ సరసంబు లైనవాక్యముల
శత్రుఘ్నుఁడు తమయయోధ్యకుఁ జనుదెంచుచు మార్గమధ్యమున వాల్మీకిచే రామాయణంబు వినుట
మంగళధ్వనులొప్ప మార్గరావముల, సంగతశ్రుతి గూడి సరివీణె లొప్ప
వీనుల కింపుగా వినుపింప నపుడు, భూనాథసూను౦డు బొడముకన్నీరు
తలయూపుమూర్ఛయు దాల్మిచే నణచి, కలిగియు వినుచుండగా నొయ్య దెలసి
పరిజను లాశ్చర్యభయవిషాదముల, బొరలుచు నారాజుపుత్రుతో నగరి
యిది యేమి చిత్రమో యిక్కథామూల, మదియ మునీంద్రుని వడుగు మీ వనిన
నీమహామునియం దనేకంబు లరదు, లేమేమియో వాని నెఱుగ నేమిటికి
నని వీడుబట్టున కరిగి యచ్చోట, వినుతవీణానాదవిలసితంబైన
గానంబు వినుచుండగా రాత్రి వేగ, భానుఁడు ప్రథమాద్రిపై నొప్పె నంత
నిత్యకృత్యంబులు నియతితో దీర్చి, యత్యంతశుద్ధాత్ముఁ డగుచు నేతెంచి
ముకుళితహస్తుఁడై మునినాథ యేను, సకలేశుఁడగు రామచంద్రునిఁ జూడ
పని వినియెద నన్న పరిరంభణాదు, లొనరంగ వీట్కొల్పె నుర్వీశతనయు
నతఁడును మధ్యాహ్న మగుచున్నవేళ, నతిముదంబున నయోధ్యాపురంబునకు
నేతెంచె నక్కడ నినకులోత్తముఁడు, జాతిగా కొలువిచ్చి పనుపఁగ వచ్చి
సామజఘోటకస్యందనసుభట, సామగ్రి సామంతజను లెదుర్కొనఁగ
భూసురాశీర్వాదపుణ్యనాదములు, భాసిల్ల నందంద పటహాదు లువియ
నెమ్మి బౌరులు సేయు నీరాజనాదు, లిమ్ముల గైకొంచు నిందుమండలము
ప్రహసించు ధవళాతిపత్రంబు మెరయ, బహుగద్యపద్యాదిపఠనముల్ వినుచు
ఘన మైనసందడి గల రాజవీథి, జనుదెంచి నగరి మోసాలను తేరుగ్గి
వినయంబుతో డిగ్గి వేడ్క చేదోయి, యనయంబు ఘటియించి యారామచంద్రు
శత్రుఘ్ను డన్నలతో లవణాసురవధవృత్తాంతము చెప్పుట
పాదపద్మములకు ప్రణుతుఁడై నిలచి, మేదురద్యుతులతో మించురత్నములు
కానుకగా నిచ్చి కరములు మొగిచి, యేను మీయానతి నేగి యాలవణు
ననిలోన సమయించి యతఁ డేలుపురము, పనిబడి యక్కించి పరిపూర్ణమైన
దేవదేవుని బాసి దీర్ఘకాలంబు, గావున మిము చూడగా వేడి రాక
యీయేటితోఁ గూడ నేడులు మనుజ, నాయక బండ్రెండు నగు మీరు బనిచి
యావు బాసినయట్టి యాక్రేపుపగిది, భూవర మిముఁ బాసిఁ బోయి నాయునికి
నావుడు జిఱునవ్వు నవ్వి యోవత్స, నీవు బాలుఁడవు ని న్నెడబాయగలమె
మక్కువ నీమీద మాకు నమ్మలకు, నిక్కువ మటు గాన నిడివిగా నేల
తలపైనయపుడెల్ల తగ నీ వయోధ్య, కెలమితో వచ్చి మమ్మెల్ల గన్గొనుము
ప్రజల బాలింపుట పరగ రాజులకు, నిజధర్మ మనికాదె నిను బంపవలసె
పరిపాలనక్లేశభాజనుల్ గాగ, పరికింప నేసఖుల్ పార్థివోత్తములు
యమ్మలవగపేద నైదునాళ్ళుండి, యిమ్ముల నీపురి కేగు నీ వనిన
ధరణీశునానతి తగబూని వినుచు, భరతలక్ష్మణులకు పరిపాటి మ్రొక్కి
పయినంపుదినమున పార్థివేశ్వరుఁడు, ప్రియ మార వీట్కొల్ప బెంపొంద వెడలి
బరువడి తల్లుల భరతలక్ష్మణుల, పరిపాటి వీట్కొని భరతలక్ష్మణులు
తగుసేనతో గూడ తన్నంప రాగ, మగుడించి యతఁ డేగె మధుపురంబునకు
నంత నిక్కడ రాముఁ డవనీతలంబు, సంతసంబున నేలు సమయంబునందు
విప్రదంపతులు మృతకుమారకళేబరంబుతో రామునిపాలికిఁ వచ్చుట
నొకవృద్ధబాహ్మణుఁ డువిదయు దాను, సుకుమారతనుఁడైన సుతుఁడు జచ్చుటయు
బెగడి శోకించి యాపీనుఁగ తెచ్చి, నగరిముందర బెట్టి నరులెల్ల జూడ
ఓలి నీబాలకుఁ డుజ్వలాకారు, డేల మాతో బల్కఁ డిటు చూడుఁ డనుచు
హాహానినాదంబు లందంద చెలగ, మోహశోకంబుల మునిఁగి తేలుచును
వలవంత బనుపుచు బాపజాతులకు, కులవర్ధనుం డిట్టికొడు కేల దక్కు
పెక్కువేల్పుల భక్తి పెద్దకాలంబు, తక్కక యేను మీతల్లియు గొల్చి
తనయుఁడ నిను గాంచి ధన్యుల మైతి, మరియుండ ని ట్లయ్యె నక్కటా యనుచు
పుత్ర పుత్రా యంచు బొగిలి గన్గొనుడు, పుత్రుపైఁ బడి మూర్ఛ బొంది తేరుచును
నెక్కడ జొత్తు మే మేమి సేయుదుము, దిక్కుమాలితి మింక తెరు వేది మాకు
చిరునవ్వుతో నేఁడు చెరలాడవింక, మరిచితే మామీది మక్కువ తనయ
ప్రాణంబులై యుండి బాసితి వీవు, ప్రాణంబు లేటికి బాయవు మమ్ము
యన్న యీనెలతోఁడ నయ్యె నైదేళ్లు, గున్ననే వుదయించి కులదీపకుండ
మీతల్లి మూర్ఛిల్లె మేదినిమీఁద, నీతెఱంగున నున్నయెడ నుపేక్షింప
బాడియె నీముద్దుఁబల్కులతోడ, నోడకుమని తీర్చి యూరార్పువేళ
పారీణబుద్ధిమై పారలౌకికము, లారసి చూడంగ నఖిలశాస్త్రముల
తండ్రికి సుతుచేత ధర్మంబు గాక, తండ్రిచే సుతునకు ధర్మమె తండ్రి
ధరణి వర్ణాశ్రమధర్మముల్ చెడక, వరుసతో రాజాజ్ఞ వర్తించు గాన
ప్రజలు చేసినయట్టి పాపంబులెల్ల, ప్రజల బాలింపని పతుల బ్రాపించు
కలుగు రాష్ట్రమున కకాలమృత్యువులు, .... .... .... .... .... ....
పుడమిలో రాముఁడు పుణ్యాత్ముఁ డగుట, కడుబొంకు లిట్టివి గాకుండె నేని
బాలుఁడు నాకూర్మిపట్టి యీశిశువు, కాలగోచరుఁడు గా గారణం బేమి
వరసతో నిక్ష్వాకువంశంబురాజు, లిరవొంద నేలి రనేకు లీవసుధ
వినము గానమ యిట్టి విపరీతధర్మ, మనఘులై యారాజు లరయు దేశముల
నని రాము తమ్ముల నవ్వసిష్ఠాది, మునుల నిందింపుచు మొగి నేడ్చుచున్న
నాతెరం గంతయు నారాముఁ డెఱిఁగి, భీతిమై తగువారి బిలువంగఁ బనుప
పరిపాటిమంత్రులు భరతలక్ష్మణులు, వరుసతో నేతేర వాయుదేవుండు
బ్రాతిగా నోలి జాబాలిమాద్గల్య, గౌతమనారదకశ్యపుల్ మఱియు
ఘనులు మార్కండేయకాత్యాయనాది, మునులు వసిష్ఠుండు మొదలుగా వచ్చి
యందంద దీవించి యర్హాసనముల, నందఱు గూర్చుండి రంత నావిభుఁడు
కరుణతో నావిప్ర్రకథ యెఱిఁగింప, నరనాథు గనుగొని నారదుం డనియె
మనుజేంద్ర యీబాలుమరణకారణము, విను మెఱుంగుదు నెల్ల విధము నేర్పఁడగ
విప్రసంపూర్ణమై విశ్రుతాచార, సుప్రసన్నప్రభాశోభితం బగుచు
నాటియై కృతయుగ మది యొప్పుచుండు, లే దనాచారంబు లేశమాత్రంబు
నపమృత్యుశంక లే కాయవుల్ నెరయు, తపము సేయనివాడు ధరలోన లేడు
త్రేతక్షత్రియు లతిస్ధిరతపోమహిమ, నాతతశౌర్యంబులందు నొప్పుదురు
వార లీధర్మవ్యవస్థలు చేసి, ... ... .... .... ..... ..... ..... .....
కోరి పాలించిరి కొలది భూజనుల, నరయంగ నొకపాదమం దధర్మంబు
సమయించె దానిచే సకలభూప్రజల, .... .... .... ..... ..... ..... ...
పలుకుల ననృతంబు పాటిల్లుచుండు, నలఘులై వర్తింతు రఖిలకార్యముల
నరయ న౦దును పెద్దలగువారు బొంకు, బొరయ రుజ్వలతపోభూతి నుండుదురు
ద్వాపరమున నిష్ఠ దగిలి భూసురులు, భూపాలకులు తపంబులు సేయుచుండ
శుశ్రూష లొగి వైశ్యశూద్రులు వారి, కశ్రాంతమును జేయు టదియ ధర్మంబు
సాము బ్రవేశించి జరగంగ పిదప, గోమట్లు దపము గైకొని రటుగాన
నొనరంగ యీమూఁడుయుగముల శూద్రు, డనఘాత్మ తపమున కధికారి గాఁడు
కలియుగంబున ధర్మకాంక్షమై దపము, నెలకొని శూద్రుండు నిష్ఠతో జేయు
మూఁడుపాదంబుల మొగిని ధర్మంబు, వాడిమితో నిట్లు వర్తింపుదు౦డు
నిది మేరయై యుండ నిపు డొక్కశూద్రు, డొదవిననిష్ఠతో నుగ్రతపంబు
తిరముగా నీ వేలుదేశంబులోన, చరియింపుచున్నాఁడు సాహసక్రియను
యాపాపమున జేసి యధిప యావిప్రు, పాపడు మృత్యుఁ డయ్యె బాల్యంబునందె
చావున కర్హుండు సమయింపు వాని, నీవిప్రసుతుప్రాణ మెత్తేదువేని
యితరధర్మాచార మెవ్వడు నడచె, తఱిగొని పతి వాని దండింపకున్న
పాపచతుర్థాంశభాగియై నరక, కూపంబులో గూలు ఘోరవేదనను
తిరిగి నీ వేలెడుదేశంబు గలయ, బరికించి యక్కడ బాపంబు గంటి
వది చక్కజేయగా నలరు ధర్మంబు, పదపడి యీబాలుప్రాణముల్ వచ్చు
నని నారదుఁడు చెప్ప నగు గాక యనుచు, జననాయకాగ్రణి సౌమిత్రిఁ జూచి
శ్రీరాముఁడు శూద్రఋషిం జంపుట కేగుట
నీవు వే చని శోకనిర్మగ్న మైన, యావిప్రమిథునంబు నడలు వారించి
యిడుము తైలద్రోణి నేమేనివికృతి, బొడమకయుండ దత్పుత్రుదేహంబు
నని పల్కి పుష్పకధ్యానంబు సేయ, చనుదెంచె నదియును జననాథు డంత
మునులకు మ్రొక్కి యమ్మునులు దీవింప, ధనువును దొనలును ధరియించి యెలమి
పరిచరులైయున్న భరతలక్ష్మణుల, పురికాపు నిలుపుచు పుష్పకం బెక్కి
పడమటిదెసను తద్భాగంబునందు, పొడము దిక్కులనెల్ల భూములు వెదకి
పొడలేక దక్షిణభూమి కేతెంచి, పొడవడకుండంగ పుడమి గ్రుమ్మరుచు
నొకమహాశైలంబు నుపకంఠభూమి, వికసితాంబుజముల విలసిల్లుచున్న
కొలనిమధ్యంబున ఘోరంబు గాగ, తలక్రిందుగా నుండి తపము సేయుచును
నుండంగ పొడగని యొద్ది కేతెంచి, చండాంశుతేజుఁ డాజననాథుఁ డనియె
నోమహాత్మక తపం బొనరించె దిట్లు, యేమికార్యము నాకు నెఱిగింపవలయు
తాపసోత్తమ యేను దశరథాత్మజుఁడ, నాపేరు రాముండు నను వింటె నీవు
నిండుతేజంబున నెరయు విప్రుఁడవొ, యొండెభూపతివొ వైశ్యుఁడవొ శూద్రుఁడవొ
యేజాతి నీజన్మ మెలమితో నాకు, నీజాతి నెఱిగింపు నిజముగా ననిన
తప మేడ బొం కేడ తలపోసి చూడ, నృపవీర శూద్రుండ నిక్క మీపలుకు
లీమేనితోడ నే నింద్రునిపురికి, సేమంబుతో నేగు చింత నీతపము
చరియింపుచున్నాఁడ శంభూకు డనగ, బరగుదు నే నన్న బటుతరధ్వనుల
వసుమతిపతి కేల వా లొప్పఁబూని, వెస వానితల ద్రెవ్వవ్రేసె వ్రేయుటయు
పాసితో గూడిన పంకజత్వంబు, బ్రాపించె తమకంచు పద్మముల్ రోసి
రాగంబు దక్కిన రమణ నక్కొలను, జేగురునీ రయ్యె శిరమురక్తమున
పొరిపొరి సురలెల్ల పుష్పవర్షములు, గురియించి రారఘుక్షోణీశుఁ జూచి
నృపవర శూద్రుఁడు నీచేత జచ్చి, యపగతప్రాణుఁడై యమరేంద్రుపురికి
బొందితో నదె చూడు బోవుచున్నాఁడు, సందీప్తతేజుఁడై జనులెల్ల చూడ
నటు గాన పుణ్యుండ వభిమతం బెద్ది, యటు వేడు మిచ్చెద మని నవ్వె విభుఁడు
సురలార యీవిప్రసుతునిప్రాణములు, మరలని౦డని నన్ను మన్నించి మీరు
యిదియును నాకోర్కె యే నక్కుమారు, బ్రతుకింతునని పూని పలికినవాఁడ
నంతియె కాని నాయరయమి జేసి, యింతయు బాటిల్లె నీతెరం గనిన
నగుగాక నీవాక్య మది యేల తప్పు, జగతీశ నీ వెందు సత్యసంధుఁడవు
సుఖమున నావిప్రసూనుండు బ్రతికి, సఖుల బంధులతోడ జరియింపఁగలఁడు
అని పల్క నక్కడి నావిప్రసుతుఁడు, కనుకని నిద్ర మేల్కనినచందమున
చెలువారగా వచ్చె జీవంబు వచ్చి, తలిదండ్రు లలర నాతతతేజుఁ డగుచు
నాదేవతలు బ్రీతి నందఱు గూడి, మోదంబుతోడ రాముని జూచి యనిరి
శ్రీరాముఁ డగస్త్యునియధ్వరంబు జూడఁబోవుట
జన్న మగస్త్యుండు సకలధర్మములు, నున్నతంబుగ జేయుచున్నాడు నియతి
నిదియ పండ్రెండవయేడు దా నగుట, నుదకాధివాసుడై యున్నాడు ఘనుఁడు
నేడు పూర్ణాహుతి నీవు మాతోడ, పోడిగా జనుదెమ్ము పోదము చూడ
ననవుఁడు నగు గాక యని పల్కి రాముఁ, డనురాగమున బుష్పకారూఢుఁ డగుచు
జని చని బహునదీశైలదుర్గముల, ఘనఝిల్లికారవకర్ణకర్కశము
భూరిభూరుహకుంజపుంజభీకరము, ఘోరమృగవ్యాళకులసంకులంబు
నగుమహారణ్యమునం దొక్కచోట, నొగి నొక్కగృధ్రంబు నొకయులూకంబు
తమతమయిల్లంచు తమలోన కడగి, పెమకువ వర్తించి పెద్దకాలంబు
గృద్ధ్రోలూకగృహవివాదంబు శ్రీరాములు తీర్చుట
తడయక యింటికై తర్కింపుచుండ, పొడగాంచి యంత భూపాలుడు గదిసి
గ్రద్దయు గూబయు కడభక్తి మ్రొక్కి, గ్రద్ద యిట్లని పల్కె కాకుత్స్థు జూచి
నీవురక్షకుడవు నిర్జరాదులకు, భావింప మతి దివస్పతిమంత్రికంటె
ఘనకాంతిచంద్రునికంటె తేజమున, దిననాయకునికంటె ధృతి నుర్వికంటె
తోరంపుపెంపున తుహినాద్రికంటె, ... ... ... .... .... .... .... .... .... .....
పృథులవేగంబున బెనుగాలికంటె, ప్రథితుండ వభియాతి భయదకోపుడవు
భూతోదయంబును భూతవర్ణమును, భూతసంహారంబు పొరి నెఱుంగుదువు
నవజేయుండవు నృపనీకజేయు, లేవెంట బరికింప నెందును లేరు
ఒఁగి లోకపాలుర కుపమాన మగుచు, నెగడుదు శస్త్రాస్త్రనిపుణుండ వగుచు
నిట్టిమహారాజు కేవిన్నపంబు, ముట్టఁజేసెదఁ గృపామూర్తివై వినుము
యేను గట్టినవాఁడ నీయులూకంబు, తాను వచ్చినయది తనగృహం బనుచు
నారసి రక్షింపు డఖిలంబునందు, తీరము గా రాజులే దిక్కు నాథులకు
ననవుఁడు నాగూబ యవనీశుఁ జూచి, వినుతవాక్యంబులు వినుపింపదొణఁగె
వాసవునంశంబువలన బాలించు, భాసురమహిమతోఁ బ్రతివాసరంబు
యక్షలోకాధీశునంశంబువలన, ధక్షుడై కావించు ధనసంగ్రహంబు
యమునంశమున దప్పు లరసి దండించు, నమితతేజంబున నర్కువంశమున
నమరంగ నమృతాంశునంశంబునందు, నమృతదయాదృష్టు లందందఁ బరపి
దివిజులు బ్రీతు లై దీవింపుదుండ, కువలయోల్లాసంబు కోరి కావించు
భూవరుం డటు గాన పుడమిలో సర్వ, దేవతామయుడవు దేవ నీ వనఘ
విష్ణుమూర్తివి సర్వవిదుడవు లోక, జిష్ణుండ వొరుల కజేయుండ వరయ
రక్షకుండవు ధర్మరతుడవు దాన, దక్షుండ వక్షీణతరదయానిధివి
దురితదూరుండవు దుష్టాత్ములందు, పరికించి చూచిన పరుషకర్ముఁడవు
సచరాచరములైన సకలభూతముల, సుచరిత్ర సమదృష్టి చూతు వీ వెపుడు
లచ్చి నీకడకంట లలిగేలుదమ్మి, నచ్చుగా వసియించి యనిశంబు నలరు
నధికప్రభాభూతి నగ్నిదేవునకు, నధికుండ వమృతరసార్ద్రదేవుఁడవు
గతి యన్న ది క్కన్న గనువెలుం గన్న, మతి యన్న ధృతి యన్న మా కెందు నీవు
పరిచితవ్యవహారపరుడవై యుండు, యరయ నీ వెరుగని యర్ధంబు లేదు
విన్నవించెద దేవ విని విచారించి, మన్నించి తగ వైన మార్గంబు నడవు
నరనాథ యీగ్రద్ద నాయిల్లు జొచ్చి, బెరుకులాడుచు నన్ను బెద్దగాలంబు
గారింపుచున్నది కరుణించి మీరు, గారవంబున మేర గావింపవలయు
నని విన్నవించిన నప్పు డానృపుఁడు, ఘనగృద్ధ్రమును నులూకము జూచి యంత
యధికశాస్త్రజ్ఞుల నధికమంత్రులను, నధికనీతిజ్ఞులు నగుపురోహితుల
ఘనుఁడైనవిజయుండు కమనీయకీర్తి, దనరుజయంతుండు ధర్మపాలుండు
మతిమంతు డైన సుమంత్రుండు మంత్ర, రతుఁ డైనఘుృష్టియు రాష్ట్రసాధకుఁడు
సిద్ధార్ధుఁడును నతిస్థిరు డశోకుండు, నిద్ధవిచారుల నెనమండ్ర బిలిచి
వెస పుష్పకము డిగ్గి వినుడు మీ రనుచు, వసుధపై గూర్చిండి వసుధీశుఁ డనియె
నెవ్వ రీయిలు గట్టి రెన్నినా ళ్లయ్యె, జివ్వ యేటికి యథాస్థితి జెప్పు డనిన
నృపలోకనాయక నీవు విన్నపము, కృపతోడ వినుమంచు గృధ్రంబు పలికె
వసుధ నెన్నడు ప్రజాపతి యుద్భవించె, వసుధీశ కట్టినవాఁడ నే యిల్లు
గాన నాయిల్లన గను నులూకంబు, మానవాధిపు జూచి మానుగా బలికె
నెలమితో తరుసృష్టి యెన్నడు గలిగె, నిల నాఁడు మొదలుగా నిది నాగృహంబు
నావుడు దలపోసి నరలోకనాథు, డావాక్యములు రెండు నమర నూహించి
యేసభయెందేని యెలమితో బెద్ద, లాసీనులై బల్క నది సభ గాదు
పరికించి ధర్మంబు పలుకనివారు, కరి గోర పెద్దలు గారు లోకముల
జగ మెల్లఁ గొనియాడు సత్యంబు లేని, తగ వెందుఁ బరికింప ధర్మంబు గాదు
యొక్కొక్కపలుకున యుక్తు లెక్కించి, చక్కబల్కెడునది సత్యంబు గాదు
యెరిగియు సభలోన నెవ్వరై నేమి, యురుగతి దగవాడ కూరకుండుదురు
వారెల్ల బొంకిన వారివాక్యంబు, లారసి కామరోషాదులవలన
తగవు బల్కనివాడు ధర్మఘాతకుఁడు, వగవ నాతఁడు వేయు వరుణపాశముల
బరికింప దనకుదా బద్ధుడై కూలు, నిరవార నవి బాయు నేటేట నొకటి
యది గాన తగవు మీ రందఱు నెరిగి, యిది తెరంగని నాకు నెఱిగింపు డనిన
నేకాగ్రమతి మత్రు లెల్ల నూహించి, కాకుస్థవర యులూకము మాట గెలిచె
నీవాక్యపద్ధతి నీగృధ్ర మాడె, నీవప్రమాణంబు నిక్కమం చరయ
పెనుపార నృపదండభీతి లోకంబు, దనరంగ వర్తించు ధర్మమార్గమున
దగవు దప్పినవారి దండించు రాజు, జగదీశశిక్షపై జముశిక్ష లేదు
తలపోయ ననుఁడు నాధరణీశుఁ డలరి, కలయ మంత్రులఁ జూచి కరమర్థిఁ బలికె
నరయఁ బౌరాణిక మైనయర్థంబు, బరిపాటి జెప్పెదఁ బరిమితోక్తులను
కడ లేని పొడవైన గనకాద్రి దక్క, నడరి యేకార్ణవ మైనకాలమున
యుదకమధ్యమున నచ్యుతుఁడు పెక్కేళ్ళు, యొదవ నిదురఁబోవుచుండఁగ నజుఁడు
జనుదెంచి యావిష్ణుజఠరంబుఁ జొచ్చి, ననువొంద నొకగొంది యందుండె గాన
సుఖవృత్తి వెలువడఁ జొప్పడఁడయ్యె, నిఖిలేశు నింద్రియనిగ్రహంబునకు
పదఁపడి హరినాభి పద్మంబు వొడమె, బొడమినరుచి హేమభూషితం బగుచు
దానినాళంబున ధాత యేతెంచి, మానుగాఁ బుట్టించె మలనొప్పు మీఱ
మొగి జరాయుజముల మున్ను బుట్టించి, ... ... ... .... .... ....
పెద్దకాలంబు నీపెనుకువ బెట్టి, గ్రద్ద యులూకంబు గారించె గాన
వడి దీని దండింపవలయు మా కనుచు, నడిదంబు బూన్చిన నశరీరిఁ బలికె
వశుధీశ కోపంబు వల దిఁక గృద్ధ్ర, యసమానతేజుండు నధికశూరుండు
సూనృతవతుఁడు విశుద్ధమానసుఁడు, నైనభూనాయకుఁ డరయ దొల్మేన
బ్రహ్మదత్తుండ నాఁ బరగు నామమున, బ్రహ్మదత్తుండైన పార్ధివేంద్రుండు
నట్టి పుణ్యాత్ముకుఁ డైనయీగృఘ్ర, మెట్లయ్యె నంటివా యేర్పడ వినుము
గౌతముఁ డీరాజుకడకు నేతెంచి, బ్రీతి నన్నము నీవుఁ బెట్టు నా కనిన
నవుగాక ధన్యుండ నైతి నే ననుచు, బ్రవిమలమగునర్ఘ్యపాద్యంబు లిచ్చి
ధరణీశుఁ డధికయత్నంబుతో నూట, యిరువదేనబ్దంబు లిష్టాన్న మిడఁగ
నొగి దుష్టి బొందుచో నొక్కనాఁ డల్ప, మగుమాంసఖండ మయ్యన్నమం దుండ
గనుఁగొని శపియించి గౌతముం డతని, గినిసి పేరడవిలో గృధ్రమై యుండు
మనిన నాపలుకున కతిభీతి నొంది, కనుగొని యారాజు కరములు మొగిచి
యజ్ఞానకృత మిది యనఘాత్మ దీని, విజ్ఞానమయదృష్టి వీక్షించి నన్ను
కరుణింపఁదగునన్న గౌతముం డెఱిఁగి, యురుదయామతిఁ బల్కె నొక్కవాక్యంబు
వసుమతి నిక్ష్వాకువంశంబునందు, నసమానవిక్రముం డగురాముఁ డనగ
దిక్కాలకీర్తిచంద్రిక నిండి వెలుగ, నొక్కమహాబాహుఁ డుదయింపఁగలఁడు
జననాథ యీరామచంద్రుఁడు నిన్ను, ననుకంపతో దనహస్తాంబుజమున
నంటినప్పుడె గృధ్ర మగుటెల్లఁ బోయి, తొంటిదేహమునకు దొరుకునన్నాఁడు
ధరణీశ యిటుగాన దండింపవలదు, కరుణతో నంటుదు గాక నీ వనిన
వసుధీశుఁ డంతట వలకేల నంట, విసురూపమగు గృధ్రవేషంబు బోయి
వినుతభాషాదులు విలసిల్ల నొప్పు, మనుజరూపము దాల్చి మహిమతో నిలచి
జననాథ నీకృప శాపంబు వీడె, నని సంతసిలి పుష్పకారూఢుఁ డగుచు
సురలతో నొగి యగస్త్యుని యాశ్రమమున, కరుదార జనుదెంచె నంత నాసురలు
మునిచేత పూజలు ముదముతో గాంచి, ముని వీడుకొని నాకమున కోలి నరుగ
కాకుత్స్ధపతి పుష్పకము డిగ్గి వచ్చి, యాకుంభజన్మున కతిభక్తి మ్రొక్కి
యాతిథ్య మొనరింప నంగీకరించి, యాతపోధనునాజ్ఞ నాసీనుఁ డగుచు
సేమంబు లడిగిన జెప్పి యారాత్రి, ప్రేమంబుతో నిల్ప ప్రియమున నిలిచె
నవనీశుఁ గనుగొని యంత కుంభజుఁడు, ప్రవిమలస్నేహార్ద్రభావుఁడై పలికె
నసఘాత్మ నీరాక యతిసంతసంబు, గొనకొని మదిలోన గోరుచుండుదుము
పన్నుగా నెయ్యంబు బాటించి నీవు, మన్నించి వచ్చుట మాతపఃఫలము
పరికింప నిజధర్మపాతకుండైన, పరుషకర్ముని శూద్రుఁ బట్టి దండించి
పుడమిలో బ్రాహ్మణపుత్రుప్రాణములు, వడయజేసితి ధర్మపక్షపాతమున
నింద్రాదిదివిజుల యెద ముల్లు రామ, చంద్రుండ బెరికితి జగమెల్ల నెరుగు
సంతోషమున నీకు సన్మాన మేను, చింతించి యారత్నచిత్రభూషణము
నిచ్చెదఁ గైకొను నిది విశ్వకర్మ, నిచ్చలంబుగఁ జేసె నేర్పెల్ల మెఱసి
వడసిన యర్ధంబు పాత్రంబు లెరిగి, యిడిన యాఫల మెక్కు డెందు నావుడును
తనలోన క్షత్త్రియధర్మ మూహించి, జననాథుఁ డాకుంభజన్ముతో ననియె
దాన మందుట విప్ర్రధర్మంబు గాని, తా న౦దు టది రాజధర్మంబు గాదు
తలఁప మీ రెఱుగని ధర్మతత్వంబు, గలదె నావుఁడు నయ్యగస్త్యుండు పలికె
పృథివిపై విప్రులు పెల్లన జూచి, ప్రథమయుగంబున పృథువు చింతించి
సురల నిద్దురబోవ జూచి భూజనులు, నరయంగ జాలినయట్టి క్షత్రియుఁడు
ధరణికి రాజుగా దగునంచు వచ్చి, పరమేష్ఠి గనుగొని భర్తతో నెఱిఁగి
మము నేలఁదగురాజు మది విచారించి, కమలసంభవ నీవు కల్పింపవలయు
ననయంబు నారాజు నాజ్ఞకు వెరచి, ఘనపాపముల వాయగలవార మేము
నీకృపచే నన్న నిర్జరేంద్రాది, లోకపాలుర జూచి లోకేశుఁ డనియె
తిరముగా మీరు మీతేజంబులందు, పరగ నయ్యాచతుర్భాగంబులందు
సకలాంశముల సముజ్వలుఁడైన రాజు, నొకని నిర్మించెద నుర్విఁ బాలింప
నని వారిచే కొన్నియంశముల్ గూర్చి, వినుతరూపాదుల వెలయ నిర్మించె
క్షుపుడను శూరుఁడు క్షోణీవిభుండు, నృపనీతికళలందు నిష్ఠాత్ముఁ డగుచు
శక్రునంశమున భూచక్రంబు విపుల, విక్రమంబున నేలు విభజిష్ణుఁ డగుచు
వరుణునంశంబున వసుధలోనెల్ల, పరితుష్టి గావించు పరగ ప్రాణులకు
ధనదునంశంబున ధనసంగ్రహంబు, తనరంగ గావించి తగుచోట నిచ్చు
చండకోపమున జమునియంశమున, దండించు నటుగాన ధరణీశ నీవు
పెనుపారుచున్న కుబేరునంశమున, గొనిన దోషము లేదు కొనుమంచుఁ బలికి
దినకరాయతమైన దివ్యభూషణము, మునినాథు డిచ్చిన ముదముతో దాల్చి
యీభూషణము మీకు నెవ్వ రిచ్చినది, నేభంగి జేరె నా కెరుగింపు డనిన
కృతియుగంబున రఘుక్షితినాథ యేను, సతతంబు తపమర్ధి జరియింపఁదలచి
తరుచైన పొదలను ధరణీజములను, నెరసి నూరామడ నేవెంట గలిగి
నిర్మృగవిహగంబు నిర్మానుష్యంబు, నిర్మార్గమును నగు నిష్ఠురాటవికి
నరసి యం దొక్కెడ నబ్జశోభితము, నురుపూరనిమ్నంబు యోజనాయతము
కారండవక్రౌంచకాదంబయూథ, సారసబకచక్రచక్రవాకంబు
మకరందమధుపానమత్తరోలంబ, నికరాకరంబైన నీరజాకరము
వలతియై యాసరోవరసమీపమున, నొలసినయొప్పుతో నొకతపోవనము
తాపసశూన్యమై తనరంగ నచట, నేపారువేసవి నే నొక్కరాత్రి
జరిపి యాకొలనికి జనునప్పు డొక్క, భరితావయవమైన ప్రాయంపు శశము
పుడమిపై నుండఁగ బొడగాంచితోన, నుడుమార్గమున గంటి నొకవిమానంబు
నతులవేగంబును హంసాన్వితంబు, నతిచిత్రచిత్రిత మగుచున్నదాని
సోయగంబున నందు సురవిలాసినులు, వేయునన్నూర్వురు వేట్కతో గొలువ
కొందఱు వాయిఁప కొందఱు పాడ, కొంద ఱుంపగ మఱికొందఱంగనలు
మణికంకణంబుల మధురంబులైన, ఝణఝణత్కారముల్ సరి గ్రందుకొనఁగ
కరపల్లవోల్లసత్కనకదండములు, వరుస జెన్నగునాలపట్టముల్ బట్ట
వీనుల కింపార వీణారవంబు, లూని వేడుక కొందు రోలి విన్పింప
నావిమానముమీఁద నధికతేజమున, దేవభోగములందు దివ్యుని గంటి
నాదివ్యపురుషుఁడు నాదివ్యయాన, మాదఁట నట డిగ్గి యవని కేతెంచి
కడగి యాపీనుఁగు కండలు గోసి, కడుపార నమలి యాకమలదీర్ఘికకు
చని తృష్ణ పోవఁగ జలములు గ్రోలి, వనితాసమేతుఁడై వరలుతేజమున
నావిమానము నెక్కె నంత నాదివ్యు, నేవగింపుచు జూచి నే నిటు లంటి
దివ్యతేజంబున దిలకింపుచున్న, భవ్యమూర్తివి నీవు బరికించి చూడ
నిది దుష్ట మెందును హేయ మీమాంస, మిది యేల తింటివి యిటు రోత లేక
ఘనుడ యెవ్వడవు నీకథ యెరిగింపు, మనవుఁడు నను జూచి హస్తముల్ మొగిచి
యనఘ విదర్భేశు డగునాసుదేహు, డనురాజు మాతండ్రి యానరేంద్రునకు
నిరువురుకాంత లయ్యింతులవలన, నిరువురుపుత్రుల మేము పుట్టితిమి
స్వేతుండ నా పేరు చెన్నొందు సురథు, డాతతభుజు డైన యతనినామంబు
భూదేవవర ధర్మబుద్ధి మాతండ్రి, మేదిని బాలించి మృతుడైనమీఁద
నఖిలమతిమంత్రు లందఱు నన్ను, నవనికి రాజుగా నభిషిక్తుఁ జేయ
విహితభంగుల బెక్కువేలేళ్ళు నేను, మహి నెల్ల బాలించి మరియొక్కనాఁడు
ధరణిఁ బాలింప నాతమ్ముని సురథు, బరమహర్షమ్మున బట్టంబు గట్టి
యీవనంబున నొప్పు యీసరోజికిని, నే వచ్చి మూడువేలేడులు దపము
గావించి యిచట నాగాత్రంబు విడిచి, దేవలోకమునకు దివ్యదేహంబు
గైకొని చని యందు కడిది యాకలియు, పైకొని నీర్వట్టు బాధింప దలకి
పద్మసంభవు గాంచి ప్రణమిల్లి పాణి, పద్మముల్ ముకుళించి భక్తితో నంటి
సురలోకమున నిత్యసుఖు లెల్లవారుఁ, బరికింపగా క్షుత్పిపాసలు లేవు
యేను జేసినపాప మెట్టి బెట్టిదమొ, మానక యిట నన్ను మాడింపుచుండు
నేది నా కాహార మెరిగింపుమనిన, నాదట ననుఁ జూచి యబ్జజుం డనియె
విత్తనంబులు దెచ్చి వెదపెట్టకున్న, నెత్తెఱంగున గల్గు నెందైన ఫలము
యతిలోనుగా భిక్ష మవనిలో నిడవు, మృతిబొందునెడ నీరు మిడుదు లెవ్వరికి
తప మెంత చేసిన దానంబు సేయ, కుపభోగసౌఖ్యంబు లొగి నేల కలుగు
నిచ్చలు జని నీవు నీతొంటిదేహ, మచ్చుగా నమలుచు నానీరు గ్రోలు
మనవుఁడు దేవ నా కది యెంతగాల, మునకు నౌ మోక్షంబు మొగి నేది త్రోవ
కరుణింపవే దయాకర నాకు ననిన, పెరవార నాతోడ వేధ యి ట్లనియె
నంతకంతకు తృప్తి యగుచుండు నీకు, కాంతితో పీనుగ కండలు నొదవు
నాతపోవనమున కట యగస్త్యుండు, బ్రాతిగా వచ్చి సంభాషించునపుడు
కష్టకారణ మైన కల్మషం బెల్ల, నష్టమై సుస్థితి నలువార గాంతు
యెలమి యిం౦ద్రాదుల యెడరు వారింప, గలయగస్త్యుని కెంత గగన మీతెఱఁగు
నావుడు నదిమొదల్ నామేని మాంస, మేవగించక తించు నేను వర్తింతు
పెక్కువేలేడు లీపీనుగ గాంచి, కుక్కకొరకై తించు కొరమారవలసె
నీతేజ మరయంగ నీవు కుంభజుఁడ, వాతురు నను గాచు టధికధర్మంబు
రమణీయమైన యీరత్నభూషణము, నమరంగ గొను సువర్ణాదిదానమును
నాచేత గైకొని న న్నుద్ధరింపు, మేచినకృప నంచు నిచ్చె నా కతఁడు
దాని మే నందగ ధరణిపై నున్న, మానుషశరీరంబు మాయమైపోయె
నాదివ్యపురుషుఁడు నమరలోకమున, కాదట వెస నేగె నచ్చరల్ గొలువ
నాఁడు నే నందిన నవ్యభూషణము, నేడు నీ కొసఁగితి నిఖలైకవీర
యనవుఁడు విని రాముఁ డాశ్చర్య మంది, మునినాథు గనుగొని ముదితాత్ముఁ డగుచు
ననఘ నిర్జన మేటి కయ్యె నీవనము, వినుపింపవలయు నావిధము నా కనిన
మను వనుపేరిట మహనీయకీర్తి, ఘనుఁ డాదియుగమున గలఁ డొక్కరాజు
యతనికి నిక్ష్వాకుఁ డను తనూజుండు, వితతవిక్రమశాలి వెలయఁ జనించె
నతనితండ్రియు భూమి కభిషిక్తుఁ జేసి, ప్రతిదినంబున నీతి ప్రజలఁ బాలించు
ధర్మవర్తనుఁ డైన ధరణి రాజులకు, నిర్మలస్థితి గల్గు నిత్యసౌఖ్యములు
తప్పు సేయనివారి దండింపఁదగదు, తప్పు జేసినవారి దండింపవలయు
మొగి బ్రమాణాదుల మును తప్పు లరసి, తగ శాస్త్రదండంబు దండించునపుడు
నాకంబు గలుగు భూవాసుల కిట్లు, గాకున్న నరకంబు గలుగు వారలకు
పరమధర్మస్థితి బాటింపవలయు, పురుషుల కని పెక్కుబుద్ధులు చెప్పి
పరమయోగంబున బ్రహ్మలోకమున, కరిగె దేహము వాసి యానరేశ్వరుఁడు
యంత నిక్ష్వాకుండు నక్షీణబుద్ధి, కొంతకాలము భూమి కుశలుఁడై యేలి
యిమ్ముగ పుత్రకామేష్టి గావించి, సమ్మదమ్మున దేవసదృశులై వెలయు
కొడుకుల నూర్వుర కొమరొప్ప గాంచె, కడగొట్టుకొడు కందు కడునయోగ్యుండు
నవివేకియును పెద్దలగువారివలన, నవనీతచరితుండునై దండుఁ డనగ
నవనిపై వర్తించు నాదుష్టచరితు, నవగుణంబులు జూచి యానృపాలకుఁడు
తనయుఁ డవధ్యంబు తగ నేలుచుండు, మని తన్నుఁ బంచిన నగుగాక యనుచు
నతఁ డేగి మధువంత మనగ వింధ్యమున, వితతంబుగా నొక్కవీడు నిర్మించి
యెలమి శుక్రుఁడు పురోహితుఁడుగా కడిమి, వెలయు రాజ్యము పెక్కువేలేడు లందు
సలుపుచు నొకయేటిచైత్రమాసమున, నలరుచు భార్గవునాశ్రమంబునకు
చనుదె౦చి యచ్చోట సౌభాగ్యలక్ష్మి, తను వెత్తినట్లున్న దవళాక్షి జూచి
మదనుబాణంబుల మది గాడి తాల్మి, గదల నక్కన్నియ గదియ నేతెంచి
యెవ్వరికూతుర వెద్ది నీనామ, మెవ్వెంట జరియించె దిందు శుక్రోణి
నిను జూచి చిక్కితి నెయ్యంబుతోడ, నను నీవు కరుణించి నాకోర్కె దీర్పు
గైకొంటి నిను నమ్మి కలకంఠవాణి, వా కెత్తి పలుకంగవలవదే యనిన
నౌనని యతనితో ననియె నాపంక, జానన యెంతయు సమ్ముదం బలర
నవనీశ శుక్రుని యగ్రతనూజ, నవమతి దలపకు మరజ నాపేరు
మానుగా నెప్పుడు మాతండ్రి యాజ్ఞ, నే నిట నియతితో నిట్ల వర్తింతు
ధరణీశ నీవు మాతండ్రి శిష్యుఁడవు, గురుపుత్రి నిటు చూడగూడునే నీకు
నారసి మాతండ్రి యన్యాయమునకు, సైరించునే యల్గి శపియించెనేని
కర ముగ్రనిగ్రహగతి బుట్టుగాన, పరికింప నీకు నాపని గల్గునేని
మాతండ్రి నడిగి ధర్మప్రకారమున, బ్రీతితో వరియింపు పృథివీశ నన్ను
నడిగిన నీ కిచ్చు ననుఁడు నామాట, కొడఁబడ కాతఁడు నుద్దండవృత్తి
పొలఁతి యిప్పుడు నిన్ను భోగింప నాకు, గలిగిన నదిజాలు గాకున్న కీడు
మరియైన గానిమ్ము మగువ నీ వింక, దొరగుట ప్రాణంబు దొరగుటయనుడు
బలిమిమై కెంగేలుఁ బట్టి రాదిగిచి, వలదన రతికేళి వాంఛ పో జలిపి
తనపురంబునకు నాధరణిపాలకుఁడు, మనములో నలరుచు మహిమతో నరిగె
నంత నాయింతియు నాశ్రమవనము, చెంత నెంతయుభీతి చేట్పాటు నొంది
యెప్పు డేతెంచునో నిటకు మాతండ్రి, చెప్పంగవలయు నీచేటెల్ల ననుచు
నాకష్టపరిభవ మందందఁ దలఁచి, శోకింపుచున్నెడ శుక్రుఁ డేతెంచి
ధూళి బ్రుంగినమేను దొరగుకన్నీరు, కేలిచెక్కును గళత్కేశబంధమును
నలిగినచందంబు నాన గోల్పోయి, వెలవెలబారు నావిధము నీక్షించి
యిది యేల యేడ్చెద విటు నీవు పుత్త్రి, యిది యేమి నీతెఱం గెఱిగింపు మనిన
దండుఁడు ననుఁ బట్టి తగదొల్ల ననిన, కండగ్రొవ్వున నిట్లు గాసిగాఁ జేసె
ననుచు నేడ్చిన శుక్రుఁ డఖిలలోకములు, గొని కాల్చువిధమున కుపితుఁడై మండి
వింటిరే శిష్యులు వీనిసాహసము, మంటకైవడి మహామహిమ వెలుంగు
నాపుత్రి తెగబట్టి నాడోటు లేక, పాపకర్ముఁడు గాన భస్మీకరింతు
పుడమిలో వీ డేలుపురికి నే వెంట, నడరంగ నూరేసియామడమేర
నెంతయు నెడత్రవ్వ కేఁడువాసరము, లంతకంతకు దట్టమై రజోవృద్ధి
భృత్యవాహనబలోపేతంబు గాగ, నత్యుగ్రగతి వీని నడగింపగలదు
యనుచు నాదండుని యల్గి శపించి, తనపుత్త్రి గనుగొని దయతోడఁ బలికె
నరజ యిక్కడ బాసి యరగి నీ వల్ల, సరసీతటంబున జరియింపుచుండు
మాపద్మవనమున కామడమేర, నీపాంశుభయము లే దెల్లప్రాణులకు
నేప్రాంతమున వచ్చి ని న్నాశ్రయించు, నాప్రాణులకు సేమ మతనిదేశమున
నున్నవారందఱు నొగి వానితోన, చన్నవా రని పల్క జనకువాక్యమున
నుండ కక్కడ నాపయోజాక్షి చనగ, నొండాశ్రమంబున కొగి శుక్రుఁ డరిగె
నంత రజోవర్ష మట యేడుదినము, లంతకంతకు ఘోరమై పెల్లుగురియ
సచివవాహనభృత్యసహితుఁడై దండుఁ, డచటిజంతువులతో నడఁగి రూపరిన
నంత దండునిదేశ మడవియై యుండె, నంతనుండియు దండకారణ్య మయ్యె
నృపవర జనులందు నెంతయు ఘోర, తపము సేయుట జనస్థానంబు నండ్రు
వడి శుక్రుశాపంబువలన బ్రాణులకు, సుడియ రాకట ప్రాణిశూన్యమై యుండె
నని చెప్ప దిననాథుఁ డస్తాద్రి కరిగె, జననాథ మునులెల్ల జనుచున్నవారు
సాయంతనములైన శౌచకర్మములు, సేయంగ నియమంబు చెల్లించి నీవు
వత్తుగా కనుఁడు నవ్వశుధీశుఁ డరిగి, యత్తెరంగంతయు నట తీర్చి వచ్చి
మ్రొక్కిన దీవించి మునినాథుఁ డలరి, పెక్కుతెఱంగులఁ బ్రియపూర్వకముగ
నమృతాయితములైన యన్నపానాదు, లమరంగ నిడుటయు నవి యారగించి
యారాత్రి వేగియు నరుణకాలమున, గౌరవంబున నిత్యకర్మముల్ దీర్చి
శ్రీరాముఁ డగస్త్యునిచే సమ్మానితుఁడై యయోధ్య కేతెంచుట
చనుదెంచి భక్తి నాసంయమీంద్రునకు, వినతుఁడై హస్తారవిందముల్ మొగిచి
తాపసోత్తమ యేను ధన్యుండ నైతి, మీపుణ్యదృష్టి నామీఁద రాగంటి
పురమున కే నింకఁ బోయెదనన్న, గురుదయాబుద్ధి నాకుంభజుం డనియె
నేవిమలులు నిన్ను నిష్ఠభావమున, భావింతు రాఘనుల్ పరమపావనులు
పుణ్యలోకములందుఁ బూజ్యులు నగ్ర, గణ్యులునని దేవగణము గీర్తించు
నెవ్వరు మదిలోన నీసున నినుఁ, గ్రొవ్వి చూచిరి వారు ఘోరరూపమున
నలుకతోఁ గదిసిన యమదండనిహతి, ........................................
నవనికూలుదు రోలి నరకకూపమున, నెవ్వరు నీనామ మెలమిఁ గీర్తింతు
రెవ్వరు నీమూర్తి హృదయంబులోన, .............................................
నేకక్షణం బైన నీక్షింతు రెవ్వ, రేకార్యము నిన్ను నెందు నేమందు
నెరయ ధన్యులు వారు నిచ్చలు వారి, యరచేతిలోనివి యిఖిలపుణ్యములు
చెన్నొంద నీపేరు జిహ్వాగ్రవీథి, నున్నప్రాణులకెల్ల నూర్ధ్వలోకంబు
గలదన్న పరమభాగవతోక్తులకుఁ, గలుగుట యది యెంత కాకుత్స్థతిలక
ధర్మకర్మంబున ధరణిఁ బాలింపు, నిర్మలకీర్తిచే నిత్యుండ వగుము
యనఘాత్మ పోయిరమ్మని వీడుకొలుప, మునిపుంగవుల కెల్ల మ్రొక్క వా రనుప
వారల మగుడించి వచ్చి పుష్పకము, నారోహణము చేసి యధికవేగమున
మనుజాధినాథుండు మధ్యాహ్నమునకు, తనరువేడుక నయోధ్యకు నేగుదెంచి
నగరిలో నుచితాంగణమునఁ బుష్పకము, డిగి దాని బొమ్మన డిండిమధ్వనులు
విని రామచంద్రుండు వేంచేసె ననుచు, ననుజులు జనుదెంచి యడుగుల బడగ
యాలింగనము జేసి యావిప్రుఁ డలర, బాలునిప్రాణముల్ బడయసిద్ధించె
భరతలక్ష్మణులార పరికింప నాకు, ధరలోన యట్టితమ్ములు గలుగు
నెల్లధర్మంబులు నెలమితోఁ జేయ, చెల్లు నా కటు గాన చిత్తంబులోన
సురచిరంబగు రాజసూయంబు బరము, పురుషార్ధమని తలపోయుచున్నాఁడ
సోముఁ డాది రాజసూయంబు చేసి, ధీమంతులెల్ల సత్కీర్తులు గనిరి
కావున వినుతంబు గాగ నీమఖము, గావింతునో యొండుక్రతువు సేయుదునొ
యనవుండు భరతుండు హస్తముల్ మొగిచి, మనుజేంద్రుఁ గనుకొని మధురవాక్యముల
రాజేంద్రనిగృహీతరాజలోకంబు, రాజసూయము మీరు రాజరక్షకులు
భూరివిక్రమ నీకుఁ బూనంగరాని, మేర లెవ్వియు లేవు మీతేజ మరయ
ధరణి భూతముల కాధారమై యుండు, ధరణి కాధారంబు తలపంగ మీరు
సురలకు నరవిందసూతి యెట్లెట్ల, నరుల కారయ మీరు నరలోకనాథ
పరమధర్మస్వరూపంబు మీయొడలు, పరికింప నిది బహుప్రాణిఘాతుకము
యరుదార సోముఁడు యాగంబు దొడఁగి, చరియింప నక్షత్రసంగ్రామ మయ్యె
సమకొని యా హరిశ్చంద్రుండు సేయు, సమరంబులోన రిపుసమితిరూ పణఁగె
వరుణుడు గావింప వారిజంతువులు, పొరిఁబోరి తమలోనఁ బోరాడి బొలసె
దివిజేంద్రుఁ డొనరింప దేవదానవుల, కవిరళంబగు మహాహవము వర్తించె
నటుఁ గాన రాజసూయాధ్వరక్రమము, విదితంబుగా మీకు విన్నవించితిమి
కాకుత్స్థవర యేము కార్యతంత్రంబు, మీకంటె నెఱుఁగుదుమే విచారింప
నెలమి మీ రానతి యిచ్చినతెఱఁగు, వలఁతులై కావించువార మే మనిన
నల్లజీవులసహితమైనతెఱంగు, తెల్లంబుగాఁ జెప్ప తిరముగా వింటి
నీమాట గైకొంటి నృపపుత్ర యనిన, సౌమిత్రి బలికెను జననాథుతోడ
సౌమిత్రి శ్రీరామునితో వృత్రాసురునికథయు, అశ్వమేధయాగమహిమయుఁ జెప్పుట
మఖము జేసెదరేని మఖరాజ మదియు, నఖిలాధ్వరములందు నశ్వమేధంబు
యాయజ్ఞ మొనరింపు డఖిలయత్నముల, నీయర్ధమున కొప్పు నితిహాసమొకటి
విన్నవించెద తొల్లి వృత్రుఁడు నాగ, నున్నతాకృతి గల యొక్కదానవుఁడు
యొడ మడ్డముగ శతయోజనం బగుచు, పొడవు తద్విగుణమై పొలుచు నాతనికి
వసుధ యెండక పండ వైరంబు లేక, వసుధ పాలింపుచు వాఁ డొక్కనాఁడు
ధరణి పాలింపఁగ తనయ శంబరుని, పరిణతబుద్ధిమై బట్టంబు గట్టి
వైరాగ్యమున తపోవనమున కేగి, దారుణం బగుచున్న తపము గావింప
ననిమిషుల్ భీతిల్లి యసురారి గాంచి, వినతులై హస్తారవిందముల్ మొగిచి
యవధరింపుము దేవ యఖిలలోకముల, యవలీల గొనియెద నను విచారించి
దేవతల్ బెదరంగ తివిరి వృత్రుండు, గావింపుచున్నాఁడు కడునుగ్రత గాను
తొడఁగిన తప మిట్లు తుదముట్టెనేని, యొడయఁడై లోకంబు లొగి నేలు నతఁడు
కడముట్ట లోకముల్ గలుగునందాక, పరిచారకృత్యంబు పాటిల్లు మాకు
మాకు శరణ్యులు మరి మీరె గాన, మీకటాక్షము గోరి మిముఁ గంటి మేము
మిత్రేందులోచన మీ రల్గినపుడ, వృత్రుండు భస్మమైఁ బోవంగగలఁడు
నావుఁడు నంబుజనాభుఁ డాసకలదేవతాగణము నుద్దేశించి పలికె
వరదుండ నైనాడ వానికి మొదల, సురలార యటుగాన చొప్పుగా దలుగ
నేచందమున మీకు హితవు గావింప, జూచి తే నొక్కట సుగమమార్గంబు
తిరముగా మీకు మీతేజంబులందు, పొరి మూరుభాగముల్ పోల గైకొనుఁడు
నరుదార ప్రథమాంగ మమరేంద్రునందు, వరుస రెండవపాలు వజ్రంబునందు
నొంద మూడవభాగ ముర్వీతలంబు, నందు వశింపుడు యటమీదు వాఁడు
శక్రునిచే జచ్చు సమరోర్వి ననుచు, చక్రాయుధుఁడు బల్క సంతోష మంది
విష్ణుపాదములకు వినతులై యమర, జిష్ణులాదిగ యుద్ధజిష్ణులై సురలు
చనుదెంచి వసుధపై సకలభూతములు, గనుగొని భయమంద కడునుగ్రత బొంది
గావించు నతిభయంకరమూర్తియైన, యావృత్రుఁబొడ గని యంత నింద్రుండు
వెస వజ్రమున నెత్తి వేసె వేయుటయు, వసుమరి వాఁ డుర్వి వడిబోలి జచ్చె
నంత నింద్రుఁడు బ్రహ్మహత్య వాటిల్ల, యెంతయు భయ మంది యంత యేగుటయు
జగములు భయ మంది సకలభూతములు, మొగి దప్పి జనులెల్ల మూఢాత్ము లైరి
యిలఁ గలసస్యంబు లెండె పెన్నదులు, సలిల ప్రవాహముల్ సరి నింకిపోయె
మడుఁగులు గడువట్టె మణిగె లోకములు, నిడుములుఁ దరుచయ్యె నెల్లవారలకు
నది జూచి పావకుం డాదిగ సకల, దివిజులు నేతెంచి దివిజారిఁ గాంచి
దేవ మీయానతి దేవేంద్రుఁ డరిగి, దేవారి నావృత్రుఁ దెగటార్చినంత
నానెపంబున బ్రహ్మహత్య వాటిల్లె, హీనుఁడై పొడచూడ కింద్రుఁ డున్నాడు
భావింప నింద్రుఁ డాపాపంబువలన, నేవెంట నెడవాయు నెఱిగింపు డనిన
ననిగూర్చి సురరాజు నది నశ్వమేథ, మొనరింప బాయున యుగ్రపాపంబు
సనుఁడు మ్రొక్కుచు నంత సకలదేవతలు, సనుదెంచి మునిగణసహితంబు గాగ
శతమఖు దర్శించి సంతోష మెసఁగ, దివిజారితోడ నాతెరుగు జెప్పుటయు
నమరేంద్రుఁ డేతెంచి యశ్వమేధంబు, సమకొని కావించి సకలసామగ్రి
యాగంబు నిండంగ నట బ్రహ్మహత్య, వేగ నింద్రునిఁ జూచి బెగడియు నిలిచి
సురలార యింక నెచ్చోట నాయునికి, తిరముగా ననుఁడు నద్దివిజు లూహించి
పాపంబు నీవెల్ల పరగ నీ వెక్కు, డోపునే నిను దాల్ప నిఖిలలోకములు
నాల్గునంశంబులై నాలుగుచోట్ల, నోలి గైకొని నీవు నుందువుగాక
యనవుఁడు వాంఛయైన పెనమున, నొనర వర్తించెద నొక్కభాగంబు
నవనీజములబంకయం దొక్కభాగ, మువిదలరజమునం దొకట నుండెదను
వారిజాక్షులు పుష్పవతులైనమీద, నారయ నాల్గునా ళ్ళతిపాపవతులు
పోడిగా నెవ్వడు పొందినట్లయిన, వాఁడు గోబ్రాహ్మణవధ చేసినాఁడు
కాన చతుర్భాగంబుల యెలమి, వాని ప్రాపించెద వారింపఁబడక
ననుఁడు నాసుర లెల్ల ననుగాక యనుచు, ఘనవీథి జని రట్ల కాకంచు దివికి
ననవుఁడు సౌమిత్రి యావృతుకథయు, ననఘతరం బగు నశ్వమేధంబు
మహిమయు నీచేత మానుగా వింటి, మహనీయమైన యామఖముపెం పెల్ల
శ్రీరాముఁడు సౌమిత్రికి నిలుని వృత్తాంతంబు జెప్పుట
వినుతంబుగా యున్న విన్నాఁడ నేను, ఘనబుద్ధి నీయుపాఖ్యానంబు నెలమి
నలఘుఁడు కర్దముఁ డనుప్రజాపతికి, నిలుఁ డనగా పుత్రుఁ డెలమి జన్మించె
దక్షులై యనిమిషదనుజగంధర్వ, యక్షరాక్షసపన్నగాదులు దన్ను
వెరపుతో గొలువంగ విశ్వభూతముల, నురువృత్తి నేలుచు నొక్కనాఁ డతఁడు
జనరక్షకొఱకునై చైత్రమాసమున, తనసేనతో గూడి తావేట వెడలి
పెక్కుపొలంబుల భీకరాటవుల, మిక్కిలిదరుచైన మృగసమూహముల
జని జొచ్చి చంపుచు శరవణంబునకు, చనుదెంచె నటమున్న చంద్రశేఖరుఁడు
గిరిజాసమేతుఁడై క్రీడానురక్తి, చరియింపఁదలఁచి యాచపలాక్షికొఱకు
పరిచరులును దాను భామినీమూర్తు, లరుదార ధరించి యతిలోభుఁ డగుచు
చెలువంద దనకోర్కె చెల్లునందాక, తెలియ కిం దెవ్వ రేతెంచిన వారు
వనితలై వసుధపై వర్తింతురనుట, విని యాయవస్థల వృక్షసంఘములు
వనితలై యుండుట వరస వీక్షించి, తనుమధ్యలై యున్న తనసేనఁ జూచి
ఘనకుచాదులు గల్గి కాంతయై యున్న, తనరూప మెంతయు తప్పక జూచి
పరితాపమ౦ది భవానీసతీపతి, తిరముగా జేసిన తెరవుగా నెరిగి
వెరపుతో వచ్చి యావిధుకళామాళి, నిరుజన్ను లొగి మ్రోవ నిల జాల మ్రొక్కి
యవధరింపుము దేవ యాజ్ఞ ము న్నెఱుఁగ, కవివేకమును వచ్చి యాడురూపములు
బ్రాపించినారము పార్వతినాథ, మాపాటు కృప జూచి మన్నింపవలయు
నప్పుడు శంభుండు నగసుతాసహితుఁ, డై వారి జూచి తా నట్ల నగుచు
పురుషత్వ మది దక్క బుద్ధిలో వలయు, వరము వేద్యము నీకు వరదుఁడనైతి
ననవుడు విన్ననై యగరాజపుత్రి, గని లోకజనయత్రి కరుణింపవలయు
ననుచు కీర్తించిన నద్దేవి శివుని, మనసు రా గామింప మది విచారించి
సగ మీశ్వరుండును సగ మే ననుట, సగ మీవిదగుగాన జగములో నీవు
యువిదవై యెన్నాళ్లు యుండె దన్నాళ్ళు, నవనిపై పురుషుండవై యుండగలవు.
మగడవై యుందువు మగవాఁడ వగుట, మగువవై యుందువు మగువ యగుట
లెలియక యిటు సుఖస్థితి నుండు మనిన, నిలుఁడు భవానికి నిరుగేలు మొగిచె
తరుణినై నెలయును తదనంతరంబ, పురషరూపంబున బొలుపార నెలయు
వరుస నీవిధమున వర్తింప నాకు, గరుణింపుమని వల్క కరుణించ గరిజ
వనితయై యిలుఁడును వరరూపు దాల్చి, సునిసితమతి చంద్రుసుతుఁడైన బుధుని
వనితయై వర్చించె వరరూపు దాల్చె, మరి చెప్ప సోదరు లాశ్చర్య మంది
భూమీళ నాతియు పురుషుండు నగుచు, నేమాడ్కి చరియించె నిలుఁడు లోకములు
నాసోమసుతజన్మ మర్థితో వినఁగ, భాసురం బగు వింత ప్రభవించె మాకు
శ్రీరాముఁడు సౌమిత్రికి బుధునికథ చెప్పుట
నది మాకు నెఱిగింపు మనిన నారాముఁ, డొదవినకృపతోఁడ నది జెప్పఁదొడగె
గొనకొని చంద్రుండు కోర్కె నొకనాఁడు, యనఘాత్ముఁడగు దేవతాగురుపత్ని
వాచక యనెడు యువతి జూచి యపుడు, నేచిన మదనాగ్ని నెల్లను బొలిసి
తనయాత్మ నూహించి తను బుజ్జగించి, యనయంబు చింతించి యం దొక్కనాఁడు
తనమందిరంబున తగుమహోత్సవము, గొనకొని సేయించి గోర్కె దీవింప
గురుపత్ని రావించి కోరి యాలేమ, కర మర్ధి గనుగొని కదియంగఁబోయి
బలువిడి పైఁబడి పట్టి రాదిగిచి, వలదు నారతికేళి వాంఛ పోజలుప
పొందినగర్భంబు పోడిగా దాల్చి, యందంద వణకుచు నానాతి మగుడి
పోయి తనగృహంబున పోలుపఱియున్న, యాయింతి గనుగొని యాబృహస్పతియు
నాయబ్జరిపుసేత నాత్మలో నెఱిగి, పాయక నిను బల్మిఁ బట్టినచంద్రుఁ
డేయుగంబుల ప్రభ యంతయుం దరిగి, ...................................
నష్టమైపోయెడు నాన బోవిడిచి, కష్టచిత్తునిమేర కల్మషం బొంద
భ్రష్ఠుండనై గతప్ర్రాణభావమున, సృష్టింపఁబడకుండు నింద్రాదులకును
నని యిట్లు శపియింప నాచంద్రుఁ డెరిగి, మనమున ననుతాప మంది యంతయును
సాష్టాంగ మెఱిగి వాచస్పతి నాకు, శిష్ఠవ్రతాచారశీలత్వ నొడలె
సర్వపాపుఁడ నగుదు శపియింప నన్ను, నిర్వహింపుట కృప నియమంబు నీకు
నేయుగంబులలోన నెవ్వరు నిందు, సేయని పాపంబు సేసితి ననియు
పాపహీనుని గావఁ బనిలేదు గాని, పాపాత్ము గాచుట పరమధర్మంబు
నష్ట మే నేనున్న నళినసంభవుని, సృష్టిలో రాత్రులు శూన్యమై యుండు
లోకోపకార మాలోకించి యేను, శమదయామృతకృపాశరధియై యున్న
విమలాత్ములగు మిమ్ము వీక్షించి యేను, శరణాగతత్రాణసద్ధర్మయుక్తి
బరికించినను మీరు బాలింపవలయు, నటు గాన కరుణింపు డన్న నాగురుఁడు
పటుదయతో నర్ధభాగియై పలికె, పక్షద్వయములోన ప్రబలక పూర్వ
పక్షంబులో నీవు ప్రభ గల్గియుండ, గలవు పొమ్మన నపుడు గమలారి చనియె
నెలతుక గర్భంబు నెలలన్ని నిండ, విదితతేజుండును విమలమానసుఁడు
నుదయించె వాచుకు నుజ్వలాకారు, గనుగొని సకలదిక్పాలకు లోలి
తను జేరి గొలువ పితామహుం డెలమి, దేవేంద్రుఁడాదిగా దివిజసంఘములు
భావించి గురుసుతు బరమోత్సవంబు, సేయంగనని వచ్చి చెలువంబు నెడలి
యాయంగిరసుపుత్రు నామందిరంబు, విన్ననై యుండంగ వెఱగంది సురలు
చెన్నొంద నాగురువు చేరి యిట్లనిరి, యిది యేమి సుతునకు నిట్లొప్పుమీఱ
విదితజాతకకర్మవిధు లొనరింప, కెంతయు వేడుక యెసగంగ మీరు
సంతసంబున నన్న సంయమీశ్వరుఁడు, నమరవిజ్ఞానగతాస్యుఁడైయున్న
కమలగర్భుం డాత్మ గని నవ్వి పలికె, నతనికి జాతకర్మాద్యుత్సవంబు
విదితంబుగాఁ జేయ విధి యిప్పు డతని, కాయబ్ధిసుతు సోము నతని రప్పింపు
మీయత్న మతడు దా నెంతయుఁ జేయు, నని యానతిచ్చిన యజునివాక్యమున
గొనకొని చంద్రుని కోరి రప్పింప, తనతేజమంతయు తనగురుచేత
నొనరంగ నశియింప నొగిలి సోముండు, ననయంబు గంపించు నాననం బలర
జనుదెంచి సురలకు సద్భక్తి మ్రొక్కి, పని యేమి నావుఁడు బలికి రాసురలు
యనఘాత్మయీపుణ్యుఁడైన బాలునకు, మనమార జాతకర్మము సేయు మీవు
ననవుఁడు గమలారి యనియె కే ల్మొగిచి, యీవిధంబున తేజ మింతయు బాసె
గావున నెబ్భంగి గైకొందు ననిన, .....................................................
విబుధులు గరుణించి విధునకు దమదు, సొబగైన ప్రభలు యించుక కృప నిచ్చి
తలపోసి యిట్లని తగ బల్కి రర్ధి, నలవడ నింద్రాదు లైనదిక్పతులు
తమతమకళ లోలి దయ నొసఁగుటయు, కమలారి మున్నీటిగతి నొప్పి జూడ
తనర పుత్రునకు జాతకకర్మవిధులు, యనురాగమున జేయ నంత నాసురలు
కర మర్ధి బుధుఁ డనగా నామ మపుడ, తిరముగా నిడి గృహదేవతలందఱు
నరుదార వర్తి౦పు మని బల్క సురలు, వరుసతోడుతను దీవన లొగి నిచ్చి
తమనివాసములకుఁ దా రేగి రంత, కుముదబాంధవుఁ డేగె కొమరు దీవింప
నంత నాసౌమ్యుండు నంతంత కొదవ, నెంతయు గురుఁ డాత్మ నెనయ కొక్కెడను
నవమానితాలోక నాసీనుఁ జేయ, దివిజసద్గురు బాసి ధృతితీ రడంచి
యాసౌమ్యుఁ డనఘాత్ముఁ డగుటయు జేసి, వాసవాగ్రణియైన వారిజాసనుని
లోకంబు కిష్టార్థలోలుఁడై పోయి, లోకేశు బహ్మ నాలోకి౦చి మ్రొక్కి
దివిజవందిత నీవు దిక్కు జీవులకు, ప్రవిమలంబుగ వేగఁ బాలింపు నన్ను
సర్వజ్ఞుఁడవు సృష్టిజనకుండ వనఘ, సర్వభూతవ్రజజననక్రమములు
నెఱిగున్న నీకు నే నెఱిగింప నేల, గురుఁడు న న్నవమానగుణదృష్టిఁ జూచె
పరిపూర్ణమగు దయఁ బాలింపు నన్ను, తిరమైనకృపఁ జూడు దేవాగ్రగణ్య
యేమి నా కానతి యెక్కఁడ నునికి, యేమిటివాఁడనై యెలమి వర్తింతు
నని విన్నవించిన నబ్జసంభవుఁడు, గనుగొని కారుణ్యకలితుఁడై పలికె
నీవు పుణ్యుండవు నిఖిలలోకముల, కావున దివి నొప్పు గ్రహమండలమున
ననిశంబు నర్కచంద్రాదులలోన, ఘనతతో నాల్గవగ్రహమువై యుండు
మని యానతిచ్చిన నాబుధుం డలరి, ఘనకాంతి నాల్గవగ్రహమయుం డగుచు
దివ్యవిమానంబు దివ్యసంగతియు, దివ్యత్వమును బొంది తేజరిల్లుచును
విశ్వలోకమునకు విభుఁడైన పార్వ, తీశ్వరు నీశు సర్వేశు మహేశు
నభయంబు వేడెద నని మనం బలర, త్రిభువనారాధ్యు భూతేశునిగూర్చి
శోభితాలంకారసుమనసాధీశు, వైభవంబగు నొక్కవరశైలతటము
సరసిజాకరమున సాహసం బలర, కర ముగ్రతప మర్ధి గైకొని సేయ
గౌరిచే వర మట్లుఁ గర మర్ధిఁ బడసి, యరుదార నాతియై యాయిలుం డంత
యేమానవతుల౦దు నెందునులేని, కామనీయకములు గలకాంత యగుచు
మును దనతో వచ్చి మురిపెంబు లలర, వనజాక్షులై యున్నవారితోఁ గూడి
యొగి వాహనంబులు నొక్కచో నిలిపి, తగినవేడ్కలతోడ తరుణకుంజముల
నవలతావీథుల నానావిధంబు, లవుచున్న పొదరిళ్ళ నందంద దిరిగి
కలకంఠములు దమకలకలధ్వనుల, నెలుఁగులు చూపుచొం డెడకుఁ బో ననుచు
నధరబింబద్యుతు లారకీరములు, ............................................
కేళిమై కేకుల కాకారవంబు, లాలోలగతి వంచి నలిగేలి గొనుచు
నట యొక్కగిరి గాంచి యది డాయనగిరి, నటశృంగబహుగుహాంతరముల దిరిగి
యక్కొ౦డచేరువ నతిరమ్య మగుచు, జక్కవల్ మొదలుగా జలవిహంగముల
క్రందైనరావముల్ కమలగంధముల, బొందినభృంగాళి బొలుపారియున్న
దదె పంకజాకర మంచు రాయంచ, గదియవచ్చినలీల గదియ నేతెంచి
భరితయౌవనకాంతి పరిపూర్ణచంద్రు, బురడింపఁదగు చంద్రుపుత్రుండు బుధుఁడు
నీరపూరము జొచ్చి నిశ్చలుఁ డగుచు, దారుణస్థితి నుగ్రతప మందు సలుప
నరుదండి కనుగొంచు నానితంబినులు, సరిఁ బ్రవేశింప నాజలజాకరంబు
పద్మినీజాతు లీపద్మలోచనలు, పద్మిని నేను నాబాంధవుల్ వీరు
మానుగా నేఁడు సంబంధంబు గంటి, నే నంచు బొంగిన ట్లెసగె నక్కొలను
కన్నుల మీలు చన్గవలు జక్కవలు, నున్న నీనవ్వులు నూత్నఫేనములు
మొగములు నరవిందములు ముందుకురులు, మొగి తమ్మితావుల ముసురుతుమ్మెదలు
తరుణభుజాలతల్ తరుణవీచికలు, సరినొప్పువేణులు శైవాలములును
నదరించుకెంగేలు లరుణాంబుజములు, కడుమించునూర్పులు కమలగంధములు
తమలోన తడఁబడ్డ తమకంబుతోఁడ, నమర జలక్రీడ నందంద సలుప
తరుణులచమటల తత్కుచాఘాత, తరళవీచులు దాకి తామరల్ విరియ
మధుపాళి యెంగిలి మధువులు గలియ, నధికపయఃపూర్వమై కలంగుచును
కొల నప్పు డొప్పె నక్కొలనునందెల్ల, నిల నొప్పు జూచి యాయిందునందనుఁడు
మదనబాణంబులు మది దూర చాల, కదలి మానము దూలి కడుదూలిపోయి
యసమాన మీబాలయంగసౌభాగ్య, మసురకాంతలయందు నచ్చరలయందు
ననిమిషులందును నాయక్షులందు, మనుభామినులయందు మరియెందు నరుదు
పురుషుఁ డెవ్వఁడొ పువ్వుబోణికి నరయ, వరుఁడు లేకున్న నీవామాక్షి నాకు
నాలుగాఁ దగునంచు నచ్చోటతపము, చాలించి తనపర్ణశాలకు వచ్చి
నలువార నిలయొద్ద నలినలోచనులు, పిలిపించి మ్రొక్కిన బ్రియమారఁ బలికె
మృగవిలోచనలార మీరెల్లఁ గొలువ, జగదేకనతమైన సౌభాగ్య మలర
బిగిచన్నుగవయును ప్రధునితంబమును, గగనసోయగమునా కడునొప్పునడుము
నగ బల్క నేర్చిన నవపద్మ మనఁగ, జిగియగు నెమ్మోము చిగురుమోవియును
యలినీలవేణియు నమర మీతోఁడ, జలజనాళంబును జరచి నవ్వుచును
చెంగల్వ వెలుపలిచెవి జెవి కొన్న, యంగన యెవ్వతె యానితంబినికి
వరుఁ డెవ్వ డేటికి వచ్చె నిచ్చోటి, కిరవంద మీరు మా కెరుగింపు డనిన
ననఘ మాయొడయ రాలగృహీతహస్త, వనితలతో నాఁడ వచ్చినా నలరి
యావార్త వినియు విద్యావిశేషమున, నావిధంబంతయు నాత్మలో నెఱిగి
పొలుపార నాయాజ్ఞఁ బూని కింపురుషు, లలరుచునున్నవా రధికతేజమున
వారికి పత్నులై వర్తింపుఁడనుచు, నారయ మతి బల్క నచ్చెల్వ లలరి
కింపురుషులతోఁడ గ్రీడింపుచుండిఁ రింపార బుధుఁడును నిలఁ జేరబోయి
సుభగి యే చంద్రుని సుతుఁ డైనబుధుఁడ, నభిలాష నీమీఁద నధికంబు నాకు
కాముబాణంబుల కడుదూలి నిన్ను, కామించి తింకపై గైకొనుమనిన
ననఘాత్మ నీకోరినట్ల సేయుదును, ననవుఁడు నిలతోడ నాసోమసుతుఁడు
క్రీడమై నిచ్చట గిరిగుహాంతరముల, కూడియు పొదరిండ్ల కోర్కులు సలుప
మక్కువ నొక్కనిమిషమై యేగె నిలకు .............................................
పరగ నిట్లానిల పరిపూర్ణమైన, పురుషుఁడై మేల్కని పొలుపార వచ్చి
యాసరోవరమున నంతరిక్షమున, భాసురగతి నూర్ధ్వబాహుఁడై తపము
సేయ౦గ బుధుఁ గాంచి సేనతోఁ గూడ, నీయరణ్యమునకు నే వచ్చినాఁడ
నది యెందు బోయెనో నాసేన గాన, విదితంబుగాఁ జెప్పవే నాకు ననిన
సైరింపు మిలుఁడ యాసంతాప ముడుగు, భూరిశిలావృష్టి బొలిసె నీసేన
గాలిచే వానచే కడుడస్సి నీవు, మేలుగా నిద్దరమైనుండి యిపుడు
యనఘాత్మ యిట్లౌట కాత్మ జింతింప, పని యేమి నీవు నీపట్టణంబుకకు
ననురాగమున నేగి యర్ధితో రాజ్య, మనుపమంబున జేయ నర్ధింపుమనిన
సేన గోల్పడిపోయి సేయు నారాజ్య, మే నొల్ల నిఁక జాలు నెన్నిభంగులను
గైకొని యిందుశేఖరుఁగూర్చి తపము, నీకతంబున నేను నెరపెద నిచట
శశిబిందుఁ డనువాఁడు జనులఁ బాలింప, కుశలుఁడు నా పెద్దకొడు కున్నవాఁడు
చెలువొంద రాజ్యంబు సేయనిమ్మనుచు, బలికిన కృపతోడఁ బలికె నాబుధుఁడు
యిలుఁడ నీ విచ్చోట నేడుగాలంబు, నిలిచిన మే లగు నిలుమన్న నిలిచె
నంత రెండవమాస మరిగిన మగుడ, నింతియై బుధునితో నెలమి నవ్వుచును
నానెల వెడలంగ నవలిమాసమున, తానంతఁ బురుషుఁడై తపము సేయుచును
నానెల వెడలంగ నవలిమాసమున, నూనినవేడ్కతో నుగ్మలి యగుచు
వరుసతో నెబ్భంగి వర్తింప నిలున, కరుదార గర్భమై యతివృద్ధి బొంది
తొమ్మిదియగు నెలతుదిఁ బురూరవుని, సమ్మదంబున గాంచె సౌమ్యునివలన
నాసుతు తమతండ్రి యగుసోముచేతి, కాసోముసుతుఁ డిచ్చె నంతటిమీఁద
నాపురూరవుఁడును నభివృద్ధిఁ బొంది, యేపార చక్రవ ర్తితఁ డనఁ బరగె
నాలేమ యిలుఁడునై యాత్మలో వగచి, మేలుగాఁ దప మర్ధి మెయికొనియుండె
నని పురూరవుజన్మ మారాముచేత, విని నృపోత్తమ యేడు వెడలినమీఁద
నెబ్భంగిఁ జరియించె నిలుఁ డంచు నడుగ, నబ్భానుకులముఖ్యుఁ డనుజులతోడ
పురుషుఁడై యుండ నాభూపాలు బుధుఁడు, కరుణతో జరితార్ధఁ గావింపదలఁచి
పరగ సంవర్తను భార్గవు చ్యవను, తరుణితేజుల ప్రమోదకుని మోదకుని
గౌతముఁడను మహాఘనుని నగస్త్యు, బ్రీతి వసిష్ఠు గంభీరుని నత్రి
నపగతకల్మషు నపరాజితాఖ్యు, విపులతపోనిష్ఠ వెలుగు దుద్ధర్షు
నీమంబు విడువక నెరపు నరిష్ఠ, నేమియన్ మునినాథు నెమ్మి రప్పించి
యాదరంబున వారినందఱి మిగుల, మోదంబు బొందించి మొగినంత బుధుఁడు
మానుగా వారితో మనకు నీరాజు, మాననీయుఁడు కర్దమప్రజాపతికి
తనయుఁడు గాన యీధరణీశ్వరునకు, త్రిణ యను వాక్యంబుతెఱఁగు చింతింప
వలయు మేలెఱిగిఁపవలయు మీ రనిన, పొలుపాఱ నచటికిఁ బులహుండు గ్రతువు
నొగి వషత్కారుండు నోంకారుఁ డనగఁ, దగు మహాతేజులు తనతోడ రాగ
కర్దముఁ డేతెంచి కందర్పదర్ప, మర్దను కృపదీర్ప మరియొండు వెంట
గడవ శక్యము గాదు గౌరీశుపలుకు, మృడునకుఁ బ్రియ మశ్వమేధయాగంబు
శివునకుఁ బ్రియముగాఁ జేయుదమన్న, నవుగాక యని మును లంగీకరించి
వరతపోమూర్తి సంవర్తునిశిష్యు, పరమధర్మజ్ఞుఁడై బరగు మరుత్తు
కనుగొని జన్న మీకర్దముచేత, ననఘాత్మ చేయింపుమని నియోగింప
నాపుణ్యభూమియం దశ్వమేధంబు, గోపతివాహనుఁ గూర్చి చేయించె
నంత నాయాగంబునందు శంకరుఁడు, సంతుష్ఠుఁడై మునిసంఘంబుఁ జూచి
మునులార భక్తితో ముద మొప్ప నాకు, ననఘులై చేసిన యశ్వమేధమున
బ్రీతుఁడ నైతి నేఁ బ్రియమార నిలుప, కేతేఱఁ గొసగుదు నెఱిగింపు డనిన
నవుగాక యని పల్కె భవుండు నంత, సకలంబు దీర్చి నిజాశ్రమంబులకు
మునులు కర్దముఁడును ముదమార నేగి, ననురాగమును బొంది యంత నాయిలుఁడు,
బుధుని వీట్కొని తనపురి కేగి రాజ్య, మధికసమ్ముదమున నరసి పాలించి
యమరలోకమునకు నరిగె నావెనుక, నమరఁ బురూరవుం డందు రా జయ్యె
నటు గాన నశ్వమేధాధ్వరమహిమ, యిటువంటిదని చెప్ప నెవ్వరితరము
శ్రీరాముఁ డశ్వమేధయాగంబు సేయుట
యేమి గావించిన నెలమి సిద్ధించు, నీమఖం బటుగాన యేను గావింతు
సౌమిత్రి వెస నీవు చని వసిష్ఠులకు, వామదేవుండును వరతపోమహిమ
మొదవిన జాబాలియును కశ్యపుఁడును, మొదలుగాఁ గలిగిన మునివరేణ్యులకు
వినుతవర్తనులైన విప్రవర్యులకు, మనయత్న మెఱిగించి మానుగాఁ దెమ్ము
యనవుఁడు లక్ష్మణుం డన్నిచోట్లకును, జని మహామునులను సకలభూసురుల
గొనరాక విని రఘుక్షోణీవిభుండు, మనమార నాస్థానమంటపఁబునకు
నేతెంచి వారికి నియతితో మ్రొక్కి, యాతిథ్య మొనరించి యర్థితోఁ బలికె
మీయనుమతి నశ్వమేధయాగంబు, సేయుదు ననుచు జింతించినాఁడ
నానతి యిండన్న నఖిలసంయములు, మానుగా నీవు నీమఖము చింతించి
శాశ్వతధర్మైకసారమైయున్న, నశ్వమేధము సేయ నగునేని యొకటి
వినుము చెప్పెదము యుర్వీనాథ పత్ని, యును లేక నది సేయ యుక్తంబు గాదు
సకలజంతువులకు సమ్మదం బలర, సకలధర్మములకు సాధ్విచేయూత
కావున నిహపరకార్యాధికార, మేవెంట నొనఁగూడ దింతియు లేక
నటుఁగాన కాలోచితాధ్వరక్రియకు, కుటిలకుంతల నర్ధి గోరి వివాహ
మగుటయు నదగునన్న నారాముఁ డాత్మ, వగ బొంది యవనతవదనుఁడై యున్న
తరి వసిష్ఠుఁడు వచ్చి ధరణీశుఁ డున్న, తెఱఁగంతయును జూచి తెలియఁగ ననియె.
నీవు విశ్వకుటుంఓబి వెన్నంగ నాత్మ, భావింప మానుషభంగియే దేవ
యారయ నవతారమై కంటకులకు, వారక శిక్షింపువాఁడవై పుడమి
కాకుత్స్థకులదీపకరుఁడవై యిట్లు, ..........................................
మనుజరూపంబున మహనీయశీలుఁ, డన నొప్పు పంక్తిరథాధీశ్వరునకు
దెసల కీర్తుల నిండఁ దేజంబుతోడ, నెసఁగ జన్మించిన యిధ్ధతేజుఁడవు
యీక్రియ చింతింపనేలయ్య దైవ, తాకృతి బంగారుయంగన నొక్క
ప్రతిమ జేయించి శోభనకరలీల, సతిమారు నీసమక్షమునను నిలుప
ననయంబు కడునొప్పునని యూరడించి, కనకంబు దెప్పించి కడుబ్రీతితోడ
గొనకొని జానకి గూరిచి ప్రతిమ, ననువారఁ జేయించి యభిషేక మార్చి
కొనవచ్చి నిలిపిన కువలయాధీశు, కనుచూట్కి కాసీతక్రమము దోచుటయు
నప్పు డారఘురాముఁ డానందమునను, నొప్పి లక్ష్మణుఁ జూచి యొనర నిట్లనియె.
సమ్మదంబున విను సౌమిత్రి యింక, నిమ్ముగ నీయాగ విూక్షింపవలయు
రవిజు నంగదు సమీరణపుత్రు గజుని, గవయు గవాక్షుని గంధమాదనుని
పనసుని నీలుని పాటలుగుముద, వినతుని మైధుని ద్వివిదుని ఋషభు
శతబలి శరభు కేసరి జాంబవంతు, నుతకీర్తి యగు సుషేణుని దధిముఖుని
నాహవదుర్జయుం డగుధూమ్రవీర, బాహుసుబాహుల పటుపరాక్రముల
హరియూధపాఖ్యుని నఖిలయూధపుల, పరువడి ప్లవగాదిబలములతోడ
నారసి మనవార లగువారు వీరు, వా రన కొగి నెల్లవారి రప్పింపు
సకలబ౦ధులతోడ సచివులతోడ, సకలజ్ఞుడుగు విభీషణుని రప్పింపు
భ్రాజిల్ల మును మనబంధులైయున్న, రాజు వేర్వేర రథములతోడ
వీరకోటులతోడ వేగ రప్పింపు, .............................................
యెల్లదేశములకు నెలమితో బుచ్చి, యెల్లభూసురుల నింపెసఁగ రప్పింపు
సప్తార్చిసములైన సంయమివరుల, సప్తర్షులను దపస్సామగ్రి దనదు
దేవనదీపుణ్యతీరంబు మునుల, దేవభూముల నున్న దేవర్షివరుల
బ్రహ్మవర్చస్కులై బ్రహ్మలోకమున, బ్రహ్మసన్నిధి నున్న బహ్మర్షివరుల
ప్రార్థించి రప్పింపు బహువేదసహి, తార్ధనిశ్చయవిధులైన భూసురుల
నలవడి విద్యార్ధులైన శిష్యులను, జెలువొప్ప వేదంబు చెప్పు విప్రులను
వైదికతంత్రంబు వలనొప్పు నడపు, వేదపారగులైన వేదాంతికులను
వెలయు శాబ్దికులను వేదవాక్యములు, మిళితార్ధ మిది యను మీమాంసకులను
నొగి నంతకంతకు యుక్తు లెక్కించి, నిగమింప నేర్చిన నెరతార్కికులను
మఱియు నయ్యాశ్రమంబుల ఋషుల, తరువాత సిద్ధవిద్యాధరాదులను
మాననీయుల నెల్ల మన్నించి ప్రీతి, మానుగా రప్పింపు మనయాగమునకు
తేజ మారగ గోమతీతీరభూమి, రాజిల్లు నైమిశారణ్యంబునందు
యాగమంటపము నావలవడగాను, వేగంబు సేయింపు వివిధశిల్పముల
బియ్యంబుసయితంబు పెసలు నువ్వులను, నె య్యాతెఱఁగున ననేకభాండములు
పొరిఁబొరి కొండల పొడవైనరాసు, లగయగోఱులు గాగ నచట బోయింపు
కలుపు నేతుల చాలకదలీఫలాది, ఫలములు గుడములు బహుతైలములును
మధుశర్కరాదులు మానుగా గూర్పు, మధికంబుగా జన్న మగునంతదాఁక
నలవడ నన్నపానాదులెల్ల, వలయువస్తువులు నధ్వరసాధనములు
మహనీయగోగణబహుసహస్రములు, బహుకోటిబారువుల్ బహుసహస్రమును
బొలుపార నచ్చట బుచ్చు మచ్చోట, .....................................................
నరయ గోమట్ల నంగళ్లు బెట్టింపు, భరతు డప్పురి గల బహుకళావిదుల
వరుస మంగళగీతవాద్యనృత్యములు, ............................................
నంతకంతకు మెచ్చు లడరించువారి, నంతఃపురస్త్రీల నంబికాజనుల
పాపల నాహేమపత్నితో గొనుచు, నేపారమునుఁ బోవనిమ్మంచు బనిచి
పెంపార లక్ష్మణోపేతమై నేను, సంపూర్ణరుచి కృష్ణసారమై మెఱయు
తురగంబు విడిచి యాతురగంబువెనుక, నరుగు ఋత్విజులతో హయరక్షకొఱకు
జనుము నీ వని నెమ్మి సౌమిత్రి పనిచె, ననఘాత్ముఁడగు రాముఁ డాప్రొద్దె కదలి,
తాను సయంతుండు తగువారు గొలువ, నూనినవేడ్క మహోత్సవం బలర
నైమిశారణ్యంబునకు వచ్చి రాముఁ, డామహామఖయత్నమంతయుఁ జూచి
వారివారికి బను ల్వలతులు సేయ, గారుణ్యదృష్టుల గలయజూచుచును
వచ్చిన రాజుల వానరోత్తముల, నచ్చుగా రవినందనాదియూధపుల
నకలంకమానసుండగు విభీషణుని, సకలసేనలయందు జనువారినెల్ల
వేడుక మన్నించి వీరు వా రనక, వీడుపట్టుల వీరి విడియింపు డనుచు
భరతశత్రుఘ్నుల బనుపంగ వారు, యిరువార విడియించి రిమ్మైనయెడల
నంతనందఱు సరసాన్నపానముల, సంతుష్టహృదయులై సభకు నేతేర
నెసగి సుగ్రీవుండు నెల్లయువిదలును, వెస యజ్ఞవాటంబు వేష్టించి కొలువ
నక్తంచరారితో నావిభీషణుడు, భక్తితో ఋషులకుఁ బనులు సేయంగ
సకలవస్తుక్రియసామగ్రితోడ, నకలంకగతిఁ జెల్లు నయ్యధ్వరమున
నన్య మాలింపక నధ్వరపాద, విన్యాసశబ్దముల్ వినుచు నీక్షించి
యెవ్వ రీవస్తువు లెంతేసి యడిగి, రవ్వారిగా బెట్టుడని నియోగింప
కపులు రాక్షసులును గలసి యందంద, కృపణుండు దీనుండు కృశుఁడు లేకుండ
నాదట నొసఁగితి మర్ధులయం దింక, పేద యెవ్వఁడు లేఁడు పృథివిపై ననఁగ
నక్కడ మునివరుయాగముమహిమ, కక్కజం బందుచు నాత్మలో నలరి
వాసవడుయమసౌమవరుణాదిసురులు, చేసినమఖము వీక్షింప మీమొదల
మానుగా కలధౌతమణిసువర్ణాది, దానశోభితమయిన దశరథాత్మజుని
కత్రువుతో సరిబోల్పగాదుగా కనుచు, నతినిర్మలోక్తుల నగ్గింపుచుండ
నందంద వనచరుల్ యామినీచరుల, నం దన్నపానాదు లమర సేయించి
వదలక నడప సంవత్సరంబునకు, ముద మంది వాల్మీకిమునిపుంగవుండు
అశ్వమేధయాగము సేయుచున్న శ్రీరామునిచెంతకు వాల్మీకిమహర్షి శిష్యులతో వచ్చుట
బహుశిష్యగణములు బలిసి తన్ గొలువ, మహనీయమయిన యమ్మఖవాటమునకు
చనుదెంచినంత నాసంయమీంద్రునకు, మునిగణసహితుఁడై ముదమంది నృపుఁడు
మునిపూజ లొనరించి మునిగేహవాటి, వినుతింపఁదగుచోట విడియించె నంత
విశదాత్ముఁ డఖిలార్థవిదుఁడు వాల్మీకి, కుశలుఁడై కూర్పుండ కుశలవుల్ వచ్చి
వినతు లైనను వారి వేడ్క దీవించి, కనుగొని మీ రెప్డు గవవాయ కి౦దు
వనముల ఫలముల వ్రతనిష్ఠ గొనుచు, ..........................................
నగరివాకిట జననాయకుసభను, నొగి జతుష్పథముల నుద్యానములను
రాజితిగతి నొప్పు రచ్చల దేవ, రాజాలయంబుల రాజమార్గముల
యాగశాలల తాపసస్థానములను, రాగంబుతోడ నీరామాయణంబు
సరినొప్పునిరువదిసర్గలలెక్క, సరసంబుగాఁ గూడి చదువుఁ డెల్లెడల
మీ రెవ్వ రన్న వాల్మీకిసంయమికి, నారయ శిష్యుల మని జెప్పు డెలమి
నారదుచే వీణెనాదంబుఁ గలుగు, చారువీణాతంతి చక్కగా దిగిచి
చని రక్ష గావించు జననాయకుండు, జనకుండు గాన యీజనలోకపతికి
తప్పక వినిపింప దగవు విన్పింప, డొప్పుగా నెల్లిటనుండి మీ చదువు
కుశలవులు రామునిచెంత రామాయణము పాడుట
డని పల్క వారలు నారాత్రి వేగ, ఘననిష్ఠ దమనిత్యకర్మముల్ దీర్చి
మరునాఁడు మఖవాటమధ్యరంగమున, నెరయంగ మునులతో నెమ్మి గొల్వున్న
మనుజేంద్రుముందట మధురనాదముల, నొనగూడుకొని వీణె యొప్పుగా మ్రోయ
జదువంగ దొణగిన జనలోకనాథుఁ, డది తనచరితరమై యనవద్యమగుచు
పద్యబంధము గల్గి పాపనార్ధముల, హృద్యంబు గావున నింపార వినుచు
మదిలోన వెఱగంది మధురప్రసన్న, వదనుఁడై చేసన్న వారి వారించి
సముచితానుష్ఠానసమయజ్ఞుఁ డగుచు, నమరంగ నేమంబు లన్నియు దీర్చి
యెలమిమై గొలువిచ్చి యెల్లసంయముల, బొలుచు భూపతులను బుధు లనేకులను
పౌరాణికుల శబ్దపారీణులైన, వారలనెల్లను వరుసల తోడుతను
రప్పించి యాకుమారకులఁ బిల్పించె, తప్పక సభవారు తగ వారిఁ జూచి
నారచీరలు జడల్ నవభంగి గాని, వీరు రామునియట్ల విలసితాకృతులు
నడుపు గాంతియు జూపు నవ్వును వెలుగు, నొడలిచందము జూడ నొక్కరూ పనఁగ
చతురులై యారామచంద్రునియెదుర, ప్రతిబింబయుగళంబుభంగి గూర్చుండి
సన్నుతవిజ్ఞానసరణి నారదుఁడు, మున్నుఁ జెప్పినసర్గ మొదలుగా దొణఁగి
సరినొప్పు నరువదిసర్గలలెక్క, సరసంబుగాఁ గూడి చదువుచునుండ
పరగ సువర్ణముల్ పదివేలు మఱియు, కరమొప్ప బేర్కొన్న కామితార్ధములు
భరతు నిమ్మని పల్కకిఁ పనుపంగ వారు, దరహసితాస్యులై ధరణీశుఁ జూచి
యనఘాత్మ కందమూలహారనియతి, వనములనియతిమై వర్తించుమాకు
హేమప్రతిగ్రహ మిది యేటి కనిన, నామహీనాయకుం డావాక్యములకు
నల్లన నవ్వుతో నాసభాసదుల, నెల్ల గనుంగొని యెలమితోఁ బలికె
నెవ్వరిచరితమై యీకావ్య మమరు, నెవ్వరు జేసినా రిది యెంతఁ గలదు
పే రేమి దీనికిఁ బ్రియ మార నాకు, నారసి యెఱిగింపు డని వారి నడుగ
యిది నీదుచరిత మినిది యుర్వి మున్ సర్వ, విదుఁడైన వాల్మీకి విరచించె దీని
నేనూరుసర్గల నిది యెల్ల నాఁడుఁ మానుగా బరగు రామాయణం బనఁగ
విను మీకుఁ బ్రియమైన విందుగా కనిన, వినియెదమని వారి వీడుకొల్పుచును
మనుజాధిపతి యజ్ఞమంటపంబునకు, మునిజనంబులతోడ ముద మార నరిగె
ప్రతిదినంబును నిట్లుఁ బరిపాటితోడ, కత పెక్కుదినములు కడుఁబ్రీతి వినుచు
వీరు సీతాసుతుల్ వీరినామంబు, లారయ గుశలవు లని యప్పు డెఱిఁగి
తనలోన నొక్కింతతడవు చింతించి, జనలోకనాథుఁ డాశతృఘ్నుఁ జూచి
యీసమీరణి యీసుషేణుండు, యీవిభీషణుఁడును నెలమి నల్గురును
వాల్మీకికడ కేగి వైదేహి విగత, కల్మష యగునేని గనుగొంటి నేఁడు
నీలోకజనులకు నెల్ల తెల్లముగ, బోల విశ్వాసంబు బుట్టంగవలయు
జనకరాజాత్మజ నాలినమాట, విని వచ్చి చెప్పు డావిధము నా కనిన
నగు గాక యని వాఁడు నట పోయి మ్రొక్కి, జగతీశుమాట లాసంయమీంద్రునకు
వినుపింప నప్పుడు విని సంతసిల్లి, మనుజేంద్రమాటలు మాననీయములు
భావింప సతులకు పతియ దైవంబు, కావింప తనపల్కు గావింపవలయు
చనుఁడన్న వారు నాజననాథుకడకు, చనుదెంచి చెప్పి రాసత్యవాక్యములు
వారిమాటలు విని వసుమతివిభుఁడు, మీరెల్ల నెల్లి వాల్మీకియెదుర
శుద్ధిగా వైదేహి శోధింపుడనుదు, నిద్ధవాక్యంబుల నేర్పడఁ బలికి
సంతోషమున సభాసదుల వీట్కొలిపె, నంత భానుఁడు గ్రుంక నారాత్రి చనిన
మరునాఁడు కొలువుండి మహితతేజమున, వరలు వసిష్ఠుని వామదేవునిని
నోలిఁ బర్వతు బులహుని శతానందు, గాలవు కశ్యపు గార్గ్యు దూర్వాసు
చ్యవను మౌద్గల్యు విశ్వామిత్రుఁ గలశ, భవు నక్షపాదుని భార్గవు గణ్వు
సుమతి మార్కండేయు సువ్రతు శక్తి, నమరర్షిపుంగవుఁ డైన నారదుని
సకలమునీంద్రుల సకలభూపతుల, సకలవానరులను సకలరాక్షసుల
వరుస జన్నమునకు వచ్చి మున్నున్న, పరదేశములవారిఁ బౌరులఁ బ్రజల
వీరు వా రన కెల్లవిధములవారి, నారంగ రప్పించె నాస్థానమునకు
నప్పుడు తల వాంచి హస్తముల్ మొగిచి, కప్పుశోకమున గద్గదకంఠుఁ డగుచు
జనకజ వెనక రా సభకు వాల్మీకి, జనుదెంచె నట శిష్యసహితుఁడై యంత
సభవారు వైదేహి చనుదేరఁ జూచి, యభిమానవతికి నిట్లయ్యెనే యనుచు
శోకింపఁ గొందఱు జూచి యాసీత, లోకైకపావని లోకంబులోన
గంభీరు లాడెడు కలుషవాక్యములు, సంభావితములె? యీసాధ్వికి ననఁగ
నింద కోడనివాఁడు నిర్జీవి యనుచు, గొంద ఱారాముని గొనియాడుచుండ
జగతీశుధైర్యంబు జానకితెంపు, తగచూచి కొందఱు తలలూచి మెచ్చి
మేలు గావలయు భూమిజకు నా గొక్క, కోలాహలం బయ్యె కొలువులో నపుడు
వాల్మీకి రామునికి సీతావృత్తాంతంబు జెప్పి కుశలవుల నప్పగించుట
పరువడి నాకందు ప్ర్రాచేతసుండు, సంజ్ఞ విచారించి సదయుఁడై పలికె
ధరణీశ యీసీత ధర్మనిష్ణాత, పరమపతివ్రాత పావనమూర్తి
జనలోకనిందకు శంకించి నీవు, తను విసర్జించిన తగవు చింతించి
వచ్చి మాయాశ్రమవనభూమిలోన, నిచ్చలు నత్యంతనియతితో నుండి
కుశలవులను గాంచె గొడుకుల వగల, దశరథాత్మజ వారు తనయులు నీకు
నీసభ నిత్యంబు నీచరిత్రంబు, భాసురస్థితి నొప్పు పఠియింపుచున్న
వీరు నీకొమరులు వినుము సత్యంబు, యారయ నాపల్కు లంతియ కాదు
యనఘాత్మ మహితాత్ముఁ డగుప్రచేతసుని, తనయుండ గలలోనఁ ద ప్పాడి యెఱుఁగ
నెడపక పెక్కువేలేడులుఁ దపము, కడునిష్ఠతో నేను గావించినాఁడ
చిత్తంబు పలుకును సేతయు సీత, కెత్తెఱఁగుఁ జూడ నేకరూపంబు
యేదోషమును లేదు యీసాధ్వియందు, మేదినీసుత పెద్ద మేరువు పెద్ద
పూని యీసభలోనఁ బొంకితినేని, యేను చేసినతపం బెల్ల నిష్ఫలము
తరుణికి పురుషుఁడు దైవంబు గాన, పరికించి శపథంబు పరికింపుమనిన
సభ యెల్లఁ గలగ నాసంయమీశ్వరుఁడు, రభసంబుతోఁ బల్క రఘురాముఁ డపుడు
ముకుళితహస్తుఁడై మునినాథ సీత, యకలంకచరిత మీయఖిలవాక్యములు
సన్నుతచరితయై సకలదేవతల, సన్నిధి నిలిచి యీసాధ్వి తొల్లియును
పూర్తివిశ్వాసంబుఁ బుట్టించెగాని, నేను గైకొంటి నేయెగ్గును లేదు
సడి కోడి పావనచరితంబు గనియు విడువంగవలసె నీవిగతకల్మషను
నిన్నిమాటలు నేల నిదియె నాకొఱత, మన్నింపు డని పల్కి మనుజేశుఁ డనియె
కుశలవుల్ వీరు నాకొడుకులు సీత, విశదాత్మ యిది యెల్ల విశదంబ యౌను
జానకి సభలోన సఁడి బాపికొన్న, మారుగా గైకొందు మరియొండు లేదు
నావుడు నమ్మహీనాథుని తెరపు, భావించి యప్పుడు బ్రహ్మాదిసురులు
జనకరాజాత్మజ శపధంబు చూడ, చనుదెంచియుండిరి చదలెల్ల నిండ
పరిమళమిళితమైమై పలచనిగాలి, పొరిఁబొరి సభలోనఁ బొలుపార నపుడు
సీత నిజపాతివ్రత్యప్రభావంబున భూమిం గ్రుంగుట
సీత యాసభలోన చేతులు మొడిచి, మాత భూదేవిపై మరిచూట్కి నిలిపి
పతియును గురుఁడు నాపాల దైవంబు హితుఁడు రాముఁడు నాకు నే నన్య మెఱుగ
నెలమి రామునిఁదప్ప నే నన్యపురుషుఁ, దలఁపఁ బేర్కొన నాదు ధర్మంబు దప్ప
నిది దివ్యవచనం౦బయే యోయంబ, విదితంబుగా నాకు వివర మిమ్మనిన
నహికుమారులచేత నంచితమణుల, బహుతరద్యుతి నొప్పు భద్రపీఠంబు
బట్టించికొని నేల బయలిచ్చి పాయ, నెట్టన భూదేవి నెమ్మి నేతెంచి
యామణిపీఠంబునం దుంచి తల్లి, సేమమే యని పల్కి సీతఁ దోట్కొనుచు
వదలక చని పుష్పవర్షము గురియ, ముదముతోఁ బాతాళమున కేగె నపుడు
సీతపాతివ్రత్యశీలంబు దివిజు, లాలితంబుగ మింట నందందఁ బొగడ
సభవారలందఱు సభయులై యుండ, నభిరవం బని కొంద ఱప్పుడు మెచ్చ
నందంద మరికొందఱు లోక, నిందకు నిట్లోడునే రాముఁ డనగ
కొందఱు వైదేహి గొని భూమి చన్న, చందంబు బేర్కొని చాల శోకింప
కొందఱు మూర్చిల్లి కుంభిని వ్రాల, కొందఱు లోకంబు కొఱగామి కరయ
కొంద ఱాడాడకు గుంపులు గూడ, పదిలులైఁ గొందఱు పరమార్థవేదు
లిది కాలగతి దీని కే మందు మనఁగ, ..........................................
తమ్ములు బాంధవుల్ తల లోలి వాంచి, యమ్మహాదుర్దశ కతిభీతిఁ బొంద
విన్ననై వదవారవిందంబు వాంచి, కన్నీరు ధైర్యంబు కట్ట దెంచుటయు
పరికింప నాదృష్టి పదమున నిలిచి, తెగమోయమైపోయితే సీత యనుచు
కడు నల్గి శోకించి కార్యంబు బుద్ధి, తడవుగా నూహించి ధరణీశుఁ డలిగి
తమ్ముల సభవారి ధారుణిఁ జూచి, యుమ్మలింపుచు నప్పు డొకమాటఁ బలికె
వైదేహి లోకాపవాదంబు బాప, భూదేవి సభ వచ్చి పొడచూపుగాక
నను నల్పుగాఁ జేసి నాపత్నియైన, జనకజ గొనిపోవ జనునె యిబ్భంగి
లవణాబ్ధి బంధించి లంక సాధించి, తివిరి జానకి మున్ను దెచ్చిన నాకు
వసుధఁ దోడ్కొనిచన్న వైదేహి మగుడ, వెస దెచ్చు టది యెంత విక్రమం బనుచు
భూదేవి జూచి నీపుత్రి తోట్తెమ్ము, కాదేని తెరు విమ్ము గాకున్న నిపుడు
జలమయంబుగ నిన్ను జక్క గావింతు, విలు దెమ్ము నావుఁడు విని బ్రహ్మ బెగఁడి
మునులతో దిక్పాలముఖ్యులతోడ, జనుదెంచి రఘురామచంద్రు నీక్షించి
మనుజేంద్ర నీ కేల మది నింత చింత, మును నీవు వెలుగు నీమూర్తి భావింపు
పరమార్ధవిదుఁ డైన ప్ర్రాచేతసుండు, కర మొప్పగా దివ్యకావ్యరూపమున
నరుదార రచియించినట్టి నీపూర్వ, చరితంబు నుత్తరచరితంబు నేను
మును వింటి నీవును మునులతోఁ గూడి, విను మందు నీతత్త్వవిధ మెల్ల నీకు
విదిత మయ్యెడునంచు విమలవాక్యములు, ముద మందగాఁ బల్కి మునులతో గూడి
బిసరుహాసనుఁ డేగ పృథులవేగమున, వసుధ దిగ్గున నొక్కవాక్యంబు బలికె
వైదేహి లే దెందు వసుధీశ వగవ, కద్దానివృత్తాంత మదియెల్ల వినుము
మానుగా నీదేవి మర్త్యలోకమున, శ్రీనామమున నులసిల్లుచునుండు
వినుతస్వధాహ్వయవిఖ్యాత గలిగి, పెనుపొందు నీదేవి పితృలోకమున
దీపించి యాదేవి దీప్తి యనుపేర, నేపార వర్తించు నింద్రలోకమున
లక్షణముల లక్ష్మినాఁ బరగి, విలసిల్లు నీదేవి విష్ణులోకమున
నీదేవి యాదేవి యీచింత విడువు, ...............................................
జనకరాజాత్మజ జననాథ నీకు, గనుగొనగా బుద్ధి గలిగినట్లైన
నాకృప కుశలవు లందు బాటింపు, నీకథ వారిచే నెరయ విన్మవిన
తనలోన నంతలో తనపెంపు దలఁచి, వనజాప్తకులుఁ డంత వాల్మీకిఁ జూచి
శ్రీరాముఁడు పుత్రసహితుండై నిజనగరంబుఁ జొచ్చుట
యన ఘనీవాక్యంబు లఖిలసంయములు, వినగోరియున్నారు విమలచిత్తములు
నిమ్ముగ కథయెల్ల నెల్లుండినుండి, సమ్ముదంబున మీరు చదివింపవలయు
నని పల్కి సభవార లందఱుఁ గొలువ, తనయుల గొనుచు నధ్వరశాల కరిగె
నంత నంబుజమిత్రుఁ డస్తాద్రి కరిగె, జింతాపరంపరఁ జిత్తంబు దూలి
యారాత్రి వేగించి యవనివల్లభుఁడు, గారవంబున నిత్యకర్మముల్ దీర్చి
యందఱఁ బిలుపించి యాసభాసదుల, నందంద గూర్చుండుఁ డని నియోగించి
సుతులఁ జూచిన వారు స్తుతి గూడుకొనుచు, చతురలీలల సభాసదులెల్ల మెచ్చ
కడముట్ట నుత్తరకాండంబు చదివి, రడరంగ నప్పు డయ్యాగంబు నయ్యె
నంత విపులకెల్ల నధికదక్షణలు, సంతోషమున నిచ్చె సకలదీనులకు
భూరిదానము పెట్టి భూపాలకులకు, గౌరవంబున నెల్ల కపినాయకులకు
సకలరాక్షసులకు సరికట్టనిచ్చి, ముకుళితహస్తుఁడై మునుల వీట్కొలిపి
శుభమూర్తి యగుసీత శుద్ధాత్మ యగుచు, సభ నున్న చందంబుఁ జనిన చందంబు,
తనులోన పలుమారుఁ దలపోసికొనుచు, దనలోన విరహాగ్ని దనరంగ బొగిలి
జానకిశూన్యమై జగమున్నగతికి, నూనినవగల నయోధ్య కేతెంచి
పురి నశ్వమేధముల్ బొరిఁ బదివేలు, వరుసతో నన్నియు వాజిపేయములు
మఱియు నీవిధమున మఖసహస్రములు, నెరయంగ గావించి నీతిమార్గమున
సంతసంబున మహాజనులఁ బాలింప, గొంతగాలమునకు గురుపుణ్య యైన
కౌసల్య భర్తలోకంబున కరిగె, నాసాధ్వి దివమున కరిగినపిదప
దినములు పదునేను తెగిన కైకేయి, తననాథుకడ కేగె తదనంతరంబ
పరువడి దినములు పదునేను చన్న, నరిగె సుమిత్రయు నాత్మేశుకడకు
పరగ తల్లులకెల్ల పారలౌకికము, లురునిష్ఠఁ బరిపాటి నొనరించె నంత
యుధాజిత్తుపంపున గార్గ్యుఁడు శ్రీరామునికడ కేతెంచుట
నట కేకయాధీశుఁ డగు యుధాజిత్తు, పఱుబుద్ధి నూహించి పని యెఱింగించి
నూత్నభూషణములు నూత్నరత్నములు, రత్నకంబళములు రమ్యవస్తువులు
పదివేలహయములు పార్ధివేంద్రునకు, ముదముతో నిమ్మంచు మునిముఖ్యుఁ డైన
తనపురోహితు గార్గ్యు తగఁబనుచుటయు, చనుదెంచుటయు రామచంద్రుండు నెఱిఁగి
యెదురేగి యాగార్గ్యు నెలమిఁ బూజించి, పదిలమే కేకయపతికంచు నడిగి
కానుకల్ గైకొని గార్గ్యుండు మున్ను, తాను పిఱుందుపై దశరథాత్మజుఁడు
మన మారగా సభామంటపంబునకుఁ, జనుదెంచి యుత్తమాసనముఁ బెట్టించి
యేమికార్యము రాక యెఱిగింపు డనిన, భూమిశ మీమామఁ బుత్తెంచె నన్ను
కన్నుల నధికమై గంధర్వలోక, మున్నది సింధువు యుభయపార్శ్వముల
నరుఁదైన గంధర్వులందు ముక్కోటి, పొరినేచి శైలూషపుత్రు లున్నారు
సమరార్ధులగువారి సమయించి భూమి, గొమరార నేలు నీకొడుకులలోన
నిరువురఁ బుత్తెంచు టివె కార్య మనిన, కరములు మొగిచి యాగార్గ్యుతో ననియె
తనకొడుకులునైన దక్షు బుష్కరుని, గొని భరతఁడు మిమ్ము గొలిచి రాగలఁడు
శైలూషపుత్రుల సమయించి యందుఁ,బొలుపుగా పట్టణంబులు రెండు గట్టి
యిరువుర నందుంచి యేతెంచు భరతుఁ, డరుదార నని రాముఁ డానతి యిచ్చి
నలువొంద శుభవేళ నక్కుమారకుల, జెలువార పట్టాభిషేకంబు లెలమి
జేయించి భరతుని సేనాసమేత, మై యిరువురుసుతులతో నని వీఁడు కొలిపి
కరమర్ధిఁ బూజించి గార్గ్యు వీట్కొలువ, భరతుఁడు సేనతోఁ బయనమై వెడలి
భరతుఁడు సేనలతో యుధాజిత్తు పురికి నరుగుట
పలలభక్షులు రక్తపానులు నగుచు, బలము ముందట వెన్క పార్శ్వభాగముల
యాతుధానులు చుట్టు నలమి భూతములు, ప్రేతజాతంబులు పృథుపిశాచములు
పటుచెంచుపుటముల పక్షిజాతముల, చటుల సింహవ్యాఘ్రజంబుకంబులును
నాసురగతితోడ నరుగుదేరంగ, మాసంబుపై నర్ధమాసంబు చనఁగ
భరతుఁడు గంధర్వసేనల జయించి పుష్కరదక్షులకు పట్టములు గట్టుట
భరతుఁడు కేకయపతిదేశమునకు, నరిగె నయ్యెడ నంత నయ్యుధాజిత్తు
భరతు నెదుర్కొని బంధుకృత్యములు, పరిపాటి నొనరించి బలసమేతముగ
తిరమైన గంధర్వదేశంబుమీఁద, భరతునితోఁ గూడ బనికి నేతేర
భరతుఁ డాజికి నెత్తి పైవచ్చుననుచు, కరము సన్నద్ధులై గంధర్వులెల్ల
కడపతోఁ దలపడగా నేఁడుదినము, లుడుగఁగా రణ మయ్యె నుభయసేనలకు
నీభంగపొలుపోట మెందు ప్రాపింప..........................................................
కాలచక్రాకృతి కడుఘోర మగుచు, వాలి దీపించు సంవర్తాస్త్ర మేసె
భరతుఁ డాబాణంబుఁ బరప గంధర్వ, వరు లుర్విఁ బడి నాకవాసు లై రంత
మేడలు మాడువుల్ మించుగేహములు, వాడలు వీథులు వరుసనంగళ్ళు
ప్రాకారములు మహాపరిఘలు కోట, వాకిళ్ళు నట్టళ్ళు వప్రచక్రములు
వెరగందఁ దగుగుళ్ళు విపులదీర్ఘికలు, చెఱువులు వనములు జెలువంబు గాఁగ
బుష్కరావతి యనఁ బుష్కరుపేర, పుష్కలశ్రీ నొప్పు పురలలామంబు
తగ దక్షశిల నాగ దక్షునిపేర, నెగడి పట్టణములు నెమ్మిఁగట్టించి
యాపుష్కరావతియందుఁ బుష్కరుని, శ్రీపెంపు గల దక్షశిల దక్షు నునిచి
చెలువొంద రాజ్యంబు సేయుచునుండ, నెలమి నైదేండ్లకు నెల్లసంపదలు
దనరి వర్ణాశ్రమధర్మముల్ గలిగి, పనుపడ దేశంబు పరిపూర్ణమైన
తనయుల వీడ్కొని ధరణీశుకడకు, చనుదెంచి భరతుఁడు సద్భక్తి మ్రొక్కి
యెల్లవృత్తాంతంబు నెఱిగింప సంత, సిల్లుచు నారఘుక్షితినాథుఁ డనియె
శ్రీరాముఁడు భరతలక్ష్మణులతో అంగదచంద్రకేతులకు పట్టంబు గట్ట నియమించుట
శూరులు సౌమిత్రిసుతు లంగదుఁడు, చారువిక్రముఁ డైన చంద్రకేతుండు
కరమొప్పఁ బట్టంబు గట్టెద వీరి, కీరికి దేశంబు లెరిగింపు మనిన
నంగదేశము నొప్పు నయ్యంగదునకు, నంగదీయంబన నమరుపట్టణము
చంత్రకేతువుకు జనలోకనాథ, చంద్రవక్త్రం బన జనపురోత్తమము
నిరువురుసుతులకు నినవంశవర్య, పరికింప నన్న నాభరతుమాటలకు
నలరుచు రఘురాముఁ డక్కుమారులకు, చెలువొంద పట్టాభిషేకోత్సవములు
సన్నుతంబుగఁ జేసి సౌమిత్రిఁ జూచి, మన్ననఁ బలికె నమ్మనుజేశుఁ డపుడు
పొలుపొంద పశ్చిమభూమి నంగదుని, నిలుపుము లక్ష్మణా నీ వేఁగి భరత
తెరువొప్ప నుత్తరదేశంబునందు, నెరి జంద్రకేతుని నిలుపుఁ బొం డనిన
భూపాలునానతిఁ బోయి నందనుల, నాపురంబుల నిల్పి యందేడు నిలిచి
సర్వకార్యంబులు సమకొల్పి వచ్చి, యుర్వీశు లవ్వీరు లొగి గొల్చియుండ
ముదమార జన్మాబ్దములు దాశరథికి, పదనొకండవవేయి పరిపూర్ణమైన
శ్రీరామునికడకు యముఁడు మునివేషముతో వచ్చుట
కాలుఁడు మునిమూర్తి గైకొని వచ్చి, చాలకార్యము గల్గి జనుదెంచినాఁడ
సౌమిత్రి యొకమునీశ్వరదూత నేను, రామచంద్రునకు నారాక వినుపింపు
మనుఁడు లక్ష్మణుం డవనీశుకడకు, జని యొక్కమునిదూత జనుదెంచినాఁడు
వాకిట నున్నాఁడు వశుధీశ యనిన, వేకొని రమ్మని వేట్కతోఁ బలుక
వచ్చితోట్కొని వేగ వచ్చిన రాముఁ, డచ్చు గాఁ బూజాదు లతిభక్తిఁ జేసి
యెవ్వరు బుత్తెంచి రెయ్యది గార్య, మెవ్విధం బది నాకు నెఱిగింపు డనిన
నీకార్యా మేకాంత మెవ్వరు నిటకు, నేకాంతవేళయం దేతెంచిరేని
పూని చంపెదవేని భూపాల నీకు, నే నెఱిఁగించెద నీకార్య మనిన
తనలోనఁ దలపోసి ధరణీశుఁ డెల్ల, జనుల వీట్కొలుపుచు సౌమిత్రిఁ బిలిఁచి
వాకిట నీ వుండి వారింపు జనుల, నేకాంతమని జెప్పి యిందు రానీకు
మని పంచి యేకాంతమై యున్నయంత, మనుజేంద్రు జూచి యమ్మహితాత్ముఁ డనియె
చతురాస్యుపంపునఁ జనుదెంచినాఁడ, క్షితిప ఛాయాదేవికిని యేను సుతుఁడ
కాలుండ నే నీవు గరుఁడవాహనుఁడ, వీలోకజాలంబు లేలుదేవుఁడవు
యానల్వ నాతోడ నన్నవాక్యములు, మానవాధిప నీవు మానుగా వినుము
క్షీరసాగరమున శేషాహిమీఁద, నారంగఁ గనుమోడ్చి యానిద్రఁ దెలిసి
పొలుపైన నీనాభిఁ బుట్టినహేమ, నలినంబులో మున్ను నన్ను బుట్టించి
యేను వేఁడిన నాకు నెక్కుఁడై వేచు, దానవాదులనెల్ల దండింపఁదలఁచి
యసురులు దనవీనులం దుద్భవించి, మసఁగి నాపై వచ్చు మధుకైటభులను
తునుమాడి కీకసస్తోమంబు గరులు, నెనయ మేదఃపంక మిల గాఁగఁ జేసి
నదిమొదలుగ నాకు నఖిలలోకములు, విదితంబుగాఁ జేయ విజ్ఞాన మిచ్చి
యసురులు మర్దించి యఖిలలోకముల, నెసగింప నొకనాఁ డెల్లదేవతలు
లోకబాధలు తమలో విచారించి, లోకేశు మము గావు లోకముల్ నిలుపు
సాధుల రక్షింపు సజ్జనోత్తముల, బాధింపు దుష్టులఁ బట్టి శిక్షింపు
మొగి వర్ణధర్మంబు లొప్పుగా నిలుప, యుగయుగంబున మీకు నుదయింపఁ బ్రతిన
దేవ యిప్పుడు లంక దేవకంటకుఁడు, రావణుఁ డనియెడు రాక్షసేశ్వరుఁడు
కడుఁగ్రొవ్వి లోకముల్ గాల్చుచున్నాఁడు, వడి వాని వధియింపవలయు మీ రనిన
[గ్రంథపాతం 184 పుట]
కాలుఁ డేటికి వచ్చె కడునాఁడె ప్రతిన, యే నేమి బలుకుదు నే మందు నింక
నట్టితమ్మునిమీఁద నలుగంగ మనసు, నెట్టకో నా కంచు నిట్టూర్పుఁ బుచ్చి
సంతాపమొంద నాసౌమిత్రి జూచి, ..................................................
నాకొఱ కేచింత నరనాథ వలదు, నీ విట ధర్మంబు నెరపంగవలయు
నేకాల మెవ్వరి కెయ్యది ప్రాప్త, మాకాల మతనికి నది గాకపోదు
దేవ నన్ విడిచి ప్రతిజ్ఞఁ బాలింపు, నావెంట ధర్మంబు నడుపకయున్న
నరకంబు బాపించు న న్నట్లుఁగాన, గరుణించు దుర్గతి గాకుండఁజేయు
మని తెంపుగాఁ బల్కి ననుజుమాటలకు, తనలోనఁ బొగులుచుఁ దలపోసి చూచి
శ్రీరామచంద్రుఁడు వసిష్ఠాదులతో కాలునివృత్తాంతమును, దూర్వాసుని యాగమనమును జెప్పుట
యనఘు వసిష్ఠుని యఖిలార్ధవిదుల, జననాయకుల మంత్రిజనుల రప్పించి
వారితోఁ గాలుఁడు వచ్చినపనియు, నారయ నతనితో నాడినప్రతిన
యప్పుడు దూర్వాసుఁ డరుగుదెంచుటయుఁ, జెప్పిన విని యావసిష్ఠుండుఁ బలికె
ననఘాత్మ సత్యవాక్యము విచారింపు, మనుజుఁడు సౌమిత్రి యని విచారించి
విడువఁజాలకయున్న విధమెల్లఁ గాన, బడియెడు నీమనఃపరితాప మరయ
నిర్మలమౌ గాలనియతి చింతించి, ధర్మంబు నిక్కంబు దక్కెల్లఁ బోయి
గైకొన్న పలుకవు గావింపకున్న, కాకుత్స్థధర్మంబు కడతేరిపోవు
సుచరిత్ర ధర్మంబు శూన్యమైనపుడు, సచరాచరము లైన జగములు గ్రుంగు
జగములుఁ బొలియంగ సౌమిత్రి యేల, జగదీశ విడువుము సత్యంబు పూని
తనవాక్యనిష్ఠకై దశరథేశ్వరుఁడు, నినుఁ బుచ్చఁడే మున్ను నిష్ఠురాటవికి
యది గాన సౌమిత్రి నవనీశ విడిచి, పదిలుండవై కీర్తిఁ బాలింపు మనిన
నావాక్యములు విని యాస్థానమెల్ల, దైవంబు దూరగఁ ధైర్యంబు నూని
నీయట్టియుత్తము నిర్మలాచారు, నేయెగ్గు వచ్చిన నేఁ జంపఁజాల
ననఘాత్ములకుఁ బరిత్యాగంబు చావు, నిను నేఁడు విడిచితి నీ వేగు మనిన
నడలుచు సౌమిత్రి యన్నపాదముల బడిన సభాసదుల్ పార్ధివేశ్వరుఁడు
లక్ష్మణుని నిర్యాణము
తనుఁ జూచి యెడల నాస్థానంబు వెడల, చని కృతస్నానుఁడై సరయువునందు
వినుతనిశ్చలయోగవిజ్ఞానదృష్టి, తనపూర్వభాగంబు తగిలి గైకొనిన
వరుస దివ్యులు పుష్పవర్షముల్ గురియ, సురనాథుఁ డారాజసుతు మేనితోడ
గొని నాకమున కేగె కూడి దేవతలు, మునులును నేతెంచి ముదమారఁ గాంచి,
విష్ణునాలవపాలు వేంచేసె ననఁగ, విష్ణులోకమునకు వేంచేసె నచట
నంత రాముఁడు వసిష్ఠాదులఁ జూచి, వింతయై యున్నది విశ్వంబు నాకు.
ధరణి యేటికి నాకుఁ దను వేటి కింక, భరతు నయోధ్యకుఁ బట్టంబు గట్టి
సౌమిత్రి వెనుకను జనియెద ననిన, నామాటలకు యోడి నారాజసుతుడు
రాజేంద్ర పరలోకరాజ్యంబె గాదు, రాజిల్లు సురలోకరాజ్య మే నొల్ల
మిముఁ బాసి యే నుండ మీపాదసేవ, సముచితస్థితి నాకు సకలరాజ్యంబు
తిరముగాఁ గోసలదేశంబు గుశుఁడు, గురుకీర్తి నుత్తరకురుభూమి లవుఁడు,
సరి నేల పనుపుడు శతృఘ్నుఁ బిలువ, నరనాథ బుధుఁడు నావసిష్ఠుండు
రాముఁ గనుగొని రఘుకులాధీశ, నీమాట విని యట్లు నిర్విణ్ణులైన
ధరణీజనుల దీర్పదగునన్నఁ జూచి, నరులార యేమే లొనర్తు మీ కనుఁడు
నందఱు ముకుళితహస్తులై నిలిచి, యెందును మాకు నేయెగ్గును లేదు
మీరు విచ్చేసిన మిముఁ బాసి యిచట, నేరుతుమే రిత్తనేలపై నిలువ
పడతులతో నిష్టబంధులతోడఁ, గొడుకులతోఁ గూడ గొల్చి వచ్చెదము.
కరుణింపవలయు నాకాలునిపలుకు, లరసి యల్లన నవ్వి యౌగాక యనుచు
కొడుకుల నీక్షించి కుశునకు నందు, నడగొండ లననొప్పు నాగముల్ వేయు
నిరవొంద నరదము లిరువదివేలు, నరుదారు దురగంబు లరువదివేలు
గణన కెక్కుడు గాఁగ గలధౌతహేమ, మణిభూషణాదులు మనసార నిచ్చి
లవునకు నట్లకా లలినొప్ప నిచ్చి, ప్రవిమలమతి రాజ్యపట్టముల్ గట్టి
మీదేశముల కిఁక మీ రేగు డనిన, నాదాశరథికి వా రర్ధిమై మ్రొక్క
చని రంత రాముఁడు శత్రుఘ్నుకడకు, బనిచె నొక్కని వాఁడు పయనమై వెడలి
మరునాఁడు వేగంబె మథురకు నరిగి, తెఱగొప్ప లక్ష్మణుతెఱ గెఱిఁగించి
జననాథుప్రతినయు జననాథుతోడ, జననున్న యాపురజనులసంతసము
జెలువార పట్టాభిషేకముల్ జేసి, లలి భూములకుఁ గుశలవులఁ బంచుటయు
నొప్పెల్లఁ జెడి పుర మున్నచందంబుఁ, జెప్ప శత్రుఘ్నుండు చిత్తంబు గలఁగి
కడుదైన్యమునఁ గాలగతి విచారించి, తడయకయున్నచో దా నేగుదేర
నింతుల మంత్రులఁ బురోహితుల రావించి, యతివేగమున వారి కావార్తఁ జెప్పి,
పరుషవిక్రముఁడు సుబాహుండు మథుర, బరమధర్మంబునఁ బాలింపనిమ్మ
యని పల్కి తనపుత్రుఁ డైనసుబాహు, ననురాగమున బట్ట మర్ధితో గట్టి
న శత్రులు భీతిల్ల జనులఁ బాలింపు. శత్రుఘాతికి వైదిశాపురం బమర
ని పల్కి బలముల నఖిలవస్తువులు, జనుల మంత్రుల నొక్కసరి గాఁగఁ బంచి
పరిపాటితో నిచ్చి పట్టముల్ గట్టి, వరుస వీట్కొని యెల్లవారి నం దునిచి
రథ మెక్కి యెక్కుడురయముతో వచ్చి, పృథివీశునకు మ్రొక్కి ప్రియమారఁ బలికె
కర మొప్పఁ బట్టముల్ గట్టిరి సుతుల, పరిణతనీతిమైఁ బ్రజలఁ బాలిఁప
యేనిట మిముఁ గొల్చి యేతెంచువాఁడ, నానతి యిండన్న నంగీకరించి
నంత ఋక్షాదులు నఖిలదానవులు, సర్వగంధర్వులు సంయమీశ్వరులు
నురుతేజుఁడగు రాము డూర్ధ్వలోకమున, కరుగుట కనుగొంద మని వచ్చినారు
యని రాముఁ డెంతయు నర్ధి తమ్మునకుఁ, గొనకొని చూపిన కోర్కెతో వారు
వసుధీశ నీ వెంట వచ్చెదమనఁగ, నెసగంగ సుగ్రీవుఁ డేతెంచి మ్రొక్కి
యచ్చోట నంగదు నభిషిక్తుఁ జేసి, …..........................................
యనుమతి గైకొన నట విభీషణుఁకు, సమ్మదంబున మ్రొక్క జననాథుఁ డనియె.
ఘనులు చంద్రార్కులు గలయంతఁదాక, ననుపమస్థితి లంక నమరంగ నేలు
నక్తంచరోత్తమ నాయాజ్ఞ గాన, నుక్తు లేమియుఁ జెప్పకుండు నీ వనుచు
ననుకంపితాత్ముఁడై యంజనాతనయుఁ, గనుగొని నాకథల్ గలుగునందాక
నిత్యుండవై వీర నీ వుండు మనుచు, నత్యంతమధురంబు లైనవాక్యముల
వారింపుచును జాఁబవంతు నీక్షించి, నీరజాసనపుత్ర నీ వుండు మనుచు
తోన మైంధద్వివిధులఁ జూచి యమృత, పానంబుఁ జేసిన బల్లిదుల్ మీరు
గారవంబున గలుగునందాక కోరి మాసంతతిఁ గొలిచియుండుండు
చనుదెండు తక్కినజను లెల్ల ననుచు, మనమున మరునాఁడు మనుజేంద్రుఁ డలరి
యనఘు తేజోమూర్తి నమరు వసుష్ఠు, గనుగొని యిటమీఁదఁ గదలంగవలయు
నతిరాత్రవాజపేయాశ్వమేధాది, వితతనామంబులు వెలయుజన్నములు
నియతాగ్నిహోత్రముల్ నిజమూర్తు లమర, గయి కొనిముందటఁ గదలిపోనిండు
ప్రమదంబుతో మహాప్రస్థానకర్మ, మమరఁగఁ జేయింపు డన్న నమ్మునియు
నామహానుష్ఠాన మమరిఁ జేయించి, కనకాంబరంబులు గట్టి యానిభుఁడు
జననుతం బగు బ్రహ్మచర్యవ్రతంబు, మనమారఁ గైకొని మానంబుతోడ
కలితదర్భాంకురకరపద్ముఁ డగును, నొలసినవేట్క నయోధ్య వెల్వడఁగ
లలితాబ్జహస్తయౌ లక్ష్మి డాపలను, వలపట హ్రీ యను వామలోచనయు
ముందటను ధ్యానమును వెన్క విండ్లు, పొందుగా నమ్ముల పురుషులై కొలువ
సావిత్రియును మునుల్ సకలదేవతలు, దౌవారికులు భృత్యదాసవర్గములు
దాసీజనము లంతఃపురాంగనలు, భూసురోత్తములును పురిమంత్రిజనులు
ధరణీసురాకృతుల్ ధరియించి రాగ బరగు నాగమవరప్రణవమంత్రములు
భరతశత్రుఘ్నులు బంధువుల్ ప్రజలు, హరినామకీర్తన మమరగాయకులు
పశుబంధములు నేఁడు బాసె మా కనుచు, పశుపక్షివాహనప్రముఖజంతువులు
పరువడి తనదృష్టిపథమునఁ బడిన, తరులతాదులుఁ గూడి తనతోడ నడువ
నామడయును మీఁద నటసాము నడచి, కోమల మగు పుణ్యకూలదేశమున
నారయఁ జల్లనై యధ్వరశ్రమంబు, వారింపఁ బశ్చిమవాహిని యైన
సరయువుఁ జొచ్చు నాసమయంబునందు, సరసిజాసనుఁ గూడి సకలసంయములు
ఇనసుధాధాములు నెల్లదేవతలు, ననిమిషాంగనలు దో నరుగుదేరంగఁ
గూడ బుష్పకములు కోటానకోటి, వేడుకతో వచ్చి వినువీథి నిలిచి
నరనాథ నీ వాదినారాయణుఁడవు, పరికించి నీమూర్తి భావింపు మనిన
వరుస పై పుష్పవర్షముల్ కురియ, సురదుందుభులు మ్రోయ సొరిది విన్వీథి
వసుధీశుఁ డమ్మహావాహినినడుమ, నసమానగతి నప్పు డనుజులు దాను
వెలుఁగు మేనులుతోడ విష్ణుఁడై పొలిచె గలిసె సుగ్రీవుండు కమలాప్తునందు
శ్రీరామచంద్రుని నిర్యాణము
చూడవచ్చిన మహీశుల్ మొదలుగాగ, వేడుక సరయూప్రవేశంబు చేసి
దివ్యరూపంబులఁ దేజంబు లెసఁగ, దివ్యయానము లెక్కి తెరగొప్ప వెలువ
నురమున గౌస్తుభ మొప్పార నాభి, పరమేష్ఠి గాంచిన పంకజం బమర
గరుడాధిరూఢుఁడై కరపంకజముల, సరిసుదర్శనపాంచజన్యంబు లమర
ననిమిషగంధర్వయక్షసిద్ధాదు, లనురాగమును బొంది యందంద మ్రొక్క
నరవిందభవుఁ జూచి యారమావిభుఁడు, కరుణార్ద్రచిత్తుఁడై కడుఁబ్రీతిఁ బలికె
పరమేష్ఠి నాకు నీప్రజలు ప్రాణములు, కరములు ప్రియమున గదలి నావెనుక
శాశ్వతస్థితి గోరి చనుదెంచినారు, పశ్వాదులును వచ్చె బంధముల్ బాసి
యొగిఁ బుణ్యలోకంబు లొసఁగు నీ వనిన, తగ విచారించి యాధాత చిత్తమున
నొనర నాలోకంబు నుపరిభాగమున, దనరుచునున్న సంతానలోకమున
నిమ్ముల జరియింపనిం డంచుఁ బలికె, సమ్మదం బలర నాజలజసంభవుఁడు
తరుచరాదులతోటి తమమూర్తు లమర, సరి నేగి రయ్యైనిజస్థానములకు
ననిమిషావలినెల్ల నంత వీట్కొలిపి, దనుజారి వేంచేసెఁ దనలోకమునకు
రాజన్యవిభుఁడైన రాముతేజమున, రాజిల్లుచున్న యీరామాయణంబు
నెవ్వరు పఠియించి రెవ్వరు వినిరి, యెవ్వరు వ్రాయించి రెవ్వరు వ్రాసి
రెవ్వరు పూజించి రెవ్వరు దలఁచి, రెవ్వ రానందించి రెలమిఁజిత్తముల
నత్యంతశుద్ధాత్ము లై వారు బ్రహ్మ, హత్యాదులైనమహాపాతకములు
నొదవిన గోపదాద్యుపపాతకములు, మొదలుగాఁగల పాపపుంజంబుఁ బాసి
పితృదేవతాగురుప్రియతార్పణములు, నతిథిపూజలు మహాయాగకర్మములు
బహుతీర్థములు వేదపారాయణములు, విహితవ్రతంబులు వివిధదానములు
జపములు దపములు సత్యశౌచములు, నుపవాసనియతులు నొదవుపుణ్యములు
సతతంబు నొప్పార సంతోష మెసఁగ, సతులు బుత్రులు హితుల్ సకలబాంధవులు
ధనధాన్యములు గల్గి ధర్మముల్ గల్గి, వినుతకీర్తులు గల్గి విజయంబు గల్గి
యారోగ్యములు గల్గి యాయువుల్ గల్గి, శూరత్వములు గల్గి శుభములు గల్గి
సౌభాగ్యములు గల్గి సంపదల్ గల్గి, వైభవంబులు గల్గి వర్ధిష్ణు లగుచు
నిలలోన సుఖియించి యింద్రలోకమున, వలయు భోగంబులు వారు భోగించి
వసుధఁ గ్రమ్మఱఁ జక్రవర్తులై పుట్టి, రసికులై గైకొంద్రు రాజ్యసంపదలు
యనిచంద్రచందనహారనీహార, ఘనసారసన్నిభఘనకీర్తిధనులు
భూనుతుఁ డగు కోనబుద్ధభూవిభుని సూనులు దారులు సుగుణభూషణులు
ఘనుఁడు మీసరగండ కాచభూవిభుఁడు, వినుతపుణ్యుం డగు విఠ్ఠభూపతియు
రచియించి రుత్తరరామాయణంబు, రుచిరమై నిత్యమై రూఢిఁ బెంపెసఁగ
నాచక్రవాళశైలావనియందు, నాచంద్రతారార్క మై యొప్పు గాత.
శ్రీరామచంద్రార్పణమస్తు
సంపూర్ణము
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.