యెంకి పాటలు/దూరాన నాయెంకి
స్వరూపం
దూరాన నాయెంకి
యాడుంటివే, యెంకి, యాడుంటివే ?
పూతోరి పందిట్లొ
సీతాయి యెల్తుంటె
నీ తళుకు గేపకాన
నా తల తిరిగిందోలె!
యాడుంటివే, యెంకి, యాడుంటివే?
మామిడి తోట కెల్లి
మంచీ పండోటి గోసి,
యేటొగాని, నోట్లేస్తె
యిసమై పోయిందోలె !
యాడుంటివే, యెంకి, యాడుంటివే?
పొత్తేళ జొన్న సేలొ
సిత్తరమై పోతాది,
గుమ్మైన వోసనొస్తే
గుం డెగిరిపోయె నోలె!
యాడుంటివే, యెంకి, యాడుంటివే ?