మొల్ల రామాయణము/సుందరకాండము/శ్రీరామునకు సీతా సందేశము

వికీసోర్స్ నుండి

శ్రీరామునకు సీత సందేశము[మార్చు]

చ. రవికుల వార్ధిచంద్రుఁడగు రాముని సేమము చాల వింటి, నా
వివిధము లైన పాట్లు పృథివీపతికిం దగఁ జెప్పఁగల్గె నేఁ
డవిరళభంగి నీ వలన, నచ్చుగ నే నుపకార మేమియుం
దవిలి యొనర్ప లేను వసుధాస్థలి వర్ధిలు బ్రహ్మ కల్పముల్‌. 109
వ. ఇట్లు దీవించి మఱియును, 110
క. ఏ యెడఁ జూచిన ధరణీ
నాయకు శ్రీపాద యుగము నా చిత్తములోఁ
బాయ దని విన్నవింపుము
వాయు తనూభవుఁడ పుణ్యవంతుఁడ! తెలియన్‌. 111
తే. ఇపుడు రావణుఁ డేతెంచి కపట బుద్ధి,
గర్వమునఁజేసి నన్నెన్ని కాఱులాడె,
నన్నియును నీవు చెవులార విన్న తెఱఁగు
పతికి దయ పుట్టఁగా విన్నపంబు సేయు. 112
సీ. నిడుదపున్నెఱివేణి జడలుగా సవరించి-మలిన జీర్ణాంబరం బొలియఁ గట్టి,
భూమీరజంబు విభూతి పూఁతగఁ బూసి-తన పతి మూర్తిఁ జిత్తమున నిల్పి,
నిరశన స్థితితోడ నిలిచి భూశయ్యను-బవళించి నిదుర యేర్పడఁగ విడిచి,
తారక బ్రహ్మ మంత్రంబుఁ బఠింపుచుఁ-గఠిన రాక్షస దుర్మృగములలోన
తే. నహిత లంకా మహా ద్వీప గహన సీమఁ-దపము సేయుచున్నాను తన్నుఁ గూర్చి,
నాకుఁ బ్రత్యక్ష మగు మని నాథునకును-విన్నవింపుము సత్త్వ సంపన్న! నీవు. 113
వ. అని చెప్పి మఱియును, 114
చ. జనకుని భంగి రామ నృపచంద్రుని, నన్నును దల్లిమాఱుగాఁ
గని, కొలువంగ నేర్చు గుణగణ్యుని, లక్ష్మణు నీతిపారగున్‌
వినఁ గన రాని పల్కు లవివేకముచేతను బల్కినట్టి యా
వినుత మహాఫలం బనుభవించితి నంచును జాటి చెప్పుమా. 115
క. ఆ మాటలు మది నుంచక
నా మానముఁ గావు మనుచు నయ వినయ గుణో
ద్ధాముఁడు, రాముని తమ్ముఁడు,
సౌమిత్రికిఁ జెప్పవయ్య సాహసివర్యా! 116
వ. అని యిట్లు జనక రాజ తనయ పలికిన పలుకు లాలకించి
హనుమంతుం డా జననితో నిట్లనియె. 117
క. ఇనుఁ డుదయింపక మున్నే
వననిధి లంఘించి, మనుజ వల్లభుకడకున్‌
నినుఁ గొనిపోయెద, వీఁపున
జననీ! కూర్చుండు మనిన, సంతోషమునన్‌. 118
క. నీ వంతవాఁడ వగుదువు,
నీ వెంటనె వత్తునేని నెగడవు కీర్తుల్‌
రావణుకంటెను మిక్కిలి
భూవరుఁడే దొంగ యండ్రు బుధ నుత చరితా! 119
వ. అదియునుం గాక రామచంద్రునిం దప్ప నితరుల నంటుదానం
గాను, గావున నీతో రాఁదగదు మఱియును, 120
క. దొంగిలి తెచ్చిన దైత్యుని
సంగడులగు వాని వారి సాహస మొప్పన్‌
సంగర ముఖమునఁ జంపక
దొంగిలి కొనిపోవఁ దగునె దొరలకు నెందున్‌? 121
వ. మఱియు రామచంద్రుండు త్రిజగదేక వీరుండును, గోదండ దీక్షా
గురుండును, రాక్షస కులాంతకుండును నగుటంజేసి రాణివాస
ద్రోహి యగు రావణుని సంగరరంగంబునఁ బ్రఖ్యాతంబుగాఁ జంపి
కొనిపోవుట ధర్మంబు; నీవు రామచంద్రునకుఁ బరమ భృత్యుండవును,
బుత్త్ర సముండవును నగుటంజేసి, నీ వెంట నరుగు
దెంచుట తప్పుగాక బోయినను, బగ తీర్పక వచ్చు టుచితంబు గాదు.
కావున రాఘవేశ్వరుల కిన్నియుం దెలియ విన్నపంబుసేసి
తడయక తోడ్కొని రమ్మనిన నద్దేవికి నమస్కరించి
హనుమంతుం డిట్లనియె, 122
ఉ. నీ విభుఁ డబ్ధి దాఁటి, ధరణీతల నాథులు సన్నుతింప, సు
గ్రీవ సుషేణ ముఖ్య బల బృందముతో నరుదెంచి, నీచునిన్‌
రావణు నాజిలోఁ దునిమి, రాజస మొప్పఁగ నిన్నుఁ గొంచు, సే
నావళితోడ నీ పురికి నారయ నేఁగు నిజంబు నమ్ముమా! 123
వ. అని విన్నవించి నమ్రుండై యద్దేవిచేత దీవెనలు పొంది, మరలి
చనుచున్నవాఁడై తన రాక రావణున కెఱుంగఁ జేయవలయు నని తలంచి. 124