మొల్ల రామాయణము/సుందరకాండము/దూతను జంపుట దోసమని రావణునకు విభీషణుని హితవు
Appearance
దూతను జంపుట దోసమని రావణునకు విభీషణుని హితవు
[మార్చు]క. దూతపనిఁ బూని వచ్చిన
దూతలు తమ నోరి కెంత తోఁచిన నట్లా
నేతల నాడుదు, రాడిన
దూతలఁ జంపంగఁ దగదు దొరలకు నెందున్. 213
క. కాకుండిన మీ చిత్తము
కాకెల్లను దీఱ ముజ్జగంబులు బెదరన్
ఢాక నడలించి తోకను,
వీఁకన్ ముట్టించి పోవ విడుచుట చాలున్. 214
వ. అని విన్నవించిన. 215
ఆ. నీతి వాక్య సరణి నెఱయంగ విని రావ
ణాసురుండు కోప మెడలి పలికె
వీనిఁ దోఁక గాల్చి, వెడలంగఁ ద్రోయుఁ డీ
ప్రొద్దె యటకుఁ దిరిగి పోవుఁ గాక. 216
వ. అని యిట్లానతిచ్చిన విని, రాత్రించరు లతనిని సభా మధ్యంబు
నుండి బయటికి వెడలం గొనిపోయి యొక్కచోట. 217