మొల్ల రామాయణము/బాల కాండము/అయోధ్యాపుర వైభవము

వికీసోర్స్ నుండి

అయోధ్యాపుర వైభవము[మార్చు]

వ. అని వితర్కించి, ముదంబున నిష్టదేవతా ప్రార్థనంబును బురాతన
కవీంద్ర స్తుతియునుం జేసి నా యొనర్పంబూనిన మొల్ల రామాయణ
మహా కావ్యమునకుఁ గథా క్రమం బెట్టు లనిన. 1
సీ. సరయూనదీతీర సతత సన్మంగళ-ప్రాభవోన్నత మహా వైభవమ్ము,
కనక గోపుర హర్మ్య ఘన కవాటోజ్జ్వల-త్ప్రాకార గోపుర శ్రీకరమ్ము,
గజ వాజి రథ భట గణికాతపత్ర చా-మర కేతు తోరణ మండితమ్ము,
ధరణీ వధూటికాభరణ విభ్రమ రేఖ-దరిసించు మాణిక్య దర్పణమ్ము,
తే. భానుకుల దీప రాజన్య పట్టభద్ర-భాసి నవరత్న ఖచిత సింహాసనమ్ము
నాఁగ నుతి కెక్కు మహిమ సనారతమ్ము-ధర్మ నిలయమ్ము, మహి నయోధ్యాపురమ్ము. 2
సీ. మదనాగ యూధ సమగ్ర దేశము గాని-కుటిల వర్తన శేష కులము గాదు,
ఆహవోర్వీజయ హరి నివాసము గాని-కీశ సముత్కరాంకితము గాదు,
సుందర స్యందన మందిరంబగుఁ గాని-సంతత మంజులాశ్రయము గాదు,
మోహన గణికా సమూహ గేహము గాని-యూధికా నికరసంయుతము గాదు,
తే. సరస సత్పుణ్యజన నివాసమ్ము గాని-కఠిన నిర్దయ దైత్య సంఘమ్ము గాదు
కాదు కాదని కొనియాడఁ గలిగి నట్టి-పురవరాగ్రమ్ము సాకేత పురవరమ్ము. 3
సీ. భూరి విద్యా ప్రౌఢి శారదా పీఠమై-గణుతింప సత్యలోకమ్ము వోలె
మహనీయ గుణ సర్వమంగళావాసమై-పొగడొందు కైలాస నగము వోలె
లలిత సంపచ్ఛాలి లక్ష్మీనివాసమై-యురవైన వైకుంఠ పురము వోలె
విరచిత ప్రఖ్యాత హరిచందనాఢ్యమై-యారూఢి నమరాలయమ్ము వోలె
తే. రాజరాజ నివాసమై తేజరిల్లి-నరవరోత్తర దిగ్భాగ నగరి వోలె
సకల జనములు గొనియాడ జగములందుఁ-బొలుపు మీరును సాకేత పుర వరమ్ము. 4
క. ఇమ్ముల నప్పురి వప్రము
కొమ్ములపై నుండి పురము కొమ్మలు వేడ్కన్‌
దమ్ముల చుట్టము పద జల
జమ్ములు పూజింతు రొగి నజస్రముఁ బ్రీతిన్‌. 5
క. పరువున మురువై యుండును
సురపురమునఁ గల్ప తరులు చూపఱ కింపై
పరువున మురువై యుండును
దురగంబు లయోధ్యఁ గల ప్రతోళికలందున్‌. 6
క. దాన గుణమ్మున సుర పురి
నే నాఁడును నమర రత్న మెన్నిక కెక్కున్‌;
దాన గుణంబున మిక్కిలి
యేనుఁగు లా పురములోన నెన్నిక కెక్కున్‌. 7
క. కవి గురు బుధ మిత్త్రాదులు
వివిధార్చనలను సురపురి వెలయుదు రెలమిన్‌
గవి గురు బుధ మిత్త్రాదులు
వివిధార్చనలం బురమున వెలయుదు రెపుడున్‌. 8
క. భోగానురాగ సంపద
భోగులు వర్తింతు రందు భూనుత లీలన్‌
భోగానురాగ సంపద
భోగులు వర్తింతు రిందు భూనుత లీలన్‌. 9
సీ. ప్రకటాగ్నిహోత్ర సంపన్ను లౌదురు గాని-రమణీయ రుక్మకారకులు గారు,
శుభ పవిత్రోజ్జ్వల సూత్రధారులు గాని-టక్కరి హాస్యనాటకులు గారు,
ఉభయ సంధ్యాది విధ్యుక్త కర్ములు గాని-చర్చింపఁగా నిశాచరులు గారు,
తిలకించి చూడ సద్ద్విజు లౌదురే కాని-తలఁపంగఁ బక్షిజాతములు కారు,
తే. బాడబులు గాని యగ్ని రూపములు గారు-పండితులు గాని విజ్ఞుల పగిదిఁ గారు
ధీవరులు గాని జాతి నిందితులు గారు-పరమ పావను లా పురి ధరణిసురులు. 10
ఉ. రాజులు కాంతియందు, రతి రాజులు రూపమునందు, వాహినీ
రాజులు దానమందు, మృగ రాజులు విక్రమ కేళియందు, గో
రాజులు భోగమందు, దిన రాజులు సంతత తేజమందు, రా
రాజులు మానమందు, నగరమ్మున రాజ కుమారు లందఱున్‌. 11
సీ. తగ దాన విఖ్యాతి ధరఁ గుబేరులు గాని-సతతాంగ కుష్ఠ పీడితులు గారు,
నిర్మల సత్యోక్తి ధర్మ సూతులు గాని-చర్చింప ననృత భాషకులు గారు,
ప్రకట విభూతి సౌభాగ్య రుద్రులు గాని-వసుధపై రోషమానసులు గారు,
కమనీయ గాంభీర్య ఘన సముద్రులు గాని-యతులిత భంగ సంగతులు గారు,
తే. వర్తకులు గాని పక్షు లేవరుసఁ గారు-భోగులే గాని పాము లెప్పుడును గారు,
సరసులే కాని కొలఁకుల జాడఁ గారు-వన్నె కెక్కిన యప్పురి వైశ్యు లెల్ల. 12
క. పంటల భాగ్యము గలరై
పంటలపైఁ బంట లమర బ్రతుకుదు రెపుడున్‌
బంటలుఁ బాడియుఁ గల యా
పంటలు మొదలైన కాఁపుఁ బ్రజలా నగరిన్‌. 13
సీ. కలికి చూపులచేతఁ గరఁగింప నేర్తురు-బ్రహ్మచారుల నైన భ్రాంతి గొలిపి,
మృదువచోరచనల వదలింప నేర్తురు-ఘన మునీంద్రుల నైనఁ గచ్చడములు,
వలపులు పైఁజల్లి వలపింప నేర్తురు-సన్న్యాసులను నైనఁ జలముపట్టి,
సురత బంధమ్ములఁ జొక్కింప నేర్తురు-వ్రతములు గైకొన్న యతుల నైన,
తే. నచల మెక్కింప నేరుతు రౌషధముల-మరులు గొలుపంగ నేర్తురు మంత్రములను,
ధనము లంకింప నేర్తురు తక్కుసేసి-వాసి కెక్కిన యప్పురి వారసతులు. 14
సీ. శారద గాయత్రి శాండిల్య గాలవ-కపిల కౌశిక కుల ఖ్యాతి గలిగి,
మదన విష్వక్సేన మాధవ నారద-శుక వైజయంతి కార్జునులు గలిగి,
చంద్రార్క గుహ గిరిసంభవ జయ వృష-కుంభ బాణాదులఁ గొమరు మిగిలి,
సుమన ఐరావత సురభి శక్రామృత-పారిజాతముల సొంపారఁ గలిగి,
తే. బ్రహ్మ నిలయమ్ము, వైకుంఠ పట్టణమ్ము-నాగ కంకణు శైలమ్ము, నాక పురము,
లలిత గతిఁ బోలి,యే వేళఁ దులను దూఁగి-ఘనత నొప్పారు నప్పురి వనము లెల్ల. 15
చ. కనక విలాస కుంభములు గబ్బి కుచంబుల లీలఁ, జిత్ర కే
తనములు పైఁట కొంగుల విధంబునఁ గ్రాల, గవాక్షముల్‌ రహిన్‌
గనుఁ గవ యట్ల పొల్పెసఁగఁగా భువి భోగులు మెచ్చ భోగినీ
జనముల రీతిఁ జెల్వమరు సౌధ నికాయము పాయ కప్పురిన్‌. 16
తే. మకర, కచ్ఛప, శంఖ, పద్మములు గలిగి,
ధనదు నగరమ్ముపైఁ గాలు ద్రవ్వుచుండు
సరస మాధుర్య గాంభీర్య సరణిఁ బేర్చి
గుఱుతు మీఱిన యప్పురి కొలఁకు లెల్ల. 17
గీ. అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడు
నొక్క ధేనువు దివి నున్న నుచిత మగునె?
అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడుఁ
బెక్కు ధేనువు లప్పురిఁ బేరు నొందు. 18
క. ఈ కరణి సకల విభవ
శ్రీకర మయి తాఁ బ్రసిద్ధిఁ జెలఁగుచు మహిమన్‌
నాక పురితోడ నొఱయుచు
సాకేత పురమ్ము వెలయు జగము నుతింపన్‌. 19
వ. అట్టి మహా పట్టణంబున కధీశ్వరుం డెట్టివాఁ డనఁగ: 20