మొల్ల రామాయణము/బాల కాండము/అగ్నిదేవుఁడు ప్రత్యక్షమై దశరథునకుఁ బాయస మిచ్చుట
Appearance
అగ్నిదేవుఁడు ప్రత్యక్షమై దశరథునకుఁ బాయస మిచ్చుట
[మార్చు]మ. ఇల సాకేత నృపాల శేఖరుఁడు దా హేలా విలాసంబుతో
ఫల కాంక్షన్ గ్రతువుం బొనర్చినయెడన్ బంగారు పాత్రమ్ము లో
పల దుగ్ధాన్నము చాల నించుకొని తాఁ బ్రత్యక్షమై నిల్చి ని
ర్మల తేజంబునఁ బావకుం డనియెఁ బ్రేమన్ మంజు వాక్యంబులన్. 38
క. భూపాల! నీదు భార్యల
కీ పాయస మారగింప నిమ్మీ! తనయుల్
శ్రీపతి పుత్త్ర సమానులు
రూపసు లుదయింతు రమిత రూప స్ఫూర్తిన్. 39
వ. అని చెప్పి యప్పాయస పాత్రంబు చేతి కిచ్చిన. 40
ఆ. పాయసమ్ము రెండు భాగముల్ గావించి,
యగ్ర సతుల కీయ, నందులోన
సగము సగము దీసి ముగుద సుమిత్రకు
నొసఁగి, రంత నామె మెసవెఁ బ్రీతి. 41