మొల్ల రామాయణము/అరణ్య కాండము/శూర్పణఖ వలన సీతా సౌందర్యమును విన్న రావణుని కామాంధత

వికీసోర్స్ నుండి

శూర్పణఖ వలన సీతా సౌందర్యమును విన్న రావణుని కామాంధత[మార్చు]

చ. చలమున నంత శూర్పణఖ సయ్యన లంకకు నేఁగి, రావణుం
గొలువునఁ గాంచి మ్రొక్కి, తనకున్‌ నృపసూనులు సేసినట్టి చేఁ
తలు వినుపించి, వారు తమ తండ్రి యనుజ్ఞను వచ్చి, కానలో
పలఁ దిరుగాడు చందములుఁ బన్నుగ నేర్పడఁ జెప్పి పిమ్మటన్‌. 20
క. ఆరాము భార్య విభ్రమ
మే రాజకుమార్తెలందు నెఱుఁగము విని మున్‌
ధారుణిలోపలఁ గామిను
లా రమణికి సాటి పోల రభినుతి సేయన్‌. 21
సీ. కన్నులు కలువలో? కాము బాణంబులో?-తెలివిగా నింతికిఁ దెలియరాదు
పలుకులు కిన్నెర పలుకులో? చిలుకల-పలుకులో? నాతి కేర్పఱుపరాదు
అమృతాంశు బింబమో? యద్దమో? నెమ్మోము-తెంపులో సతికి భావింపరాదు
కుచములు బంగారు కుండలో? చక్రవా-కమ్ములో? చెలి కెఱుఁగంగరాదు
తే. కురులు నీలంబులో? తేఁటి గుంపు లొక్కో-పిఱుఁదు పులినంబో? మన్మథు పెండ్లి యరుఁగొ?
యనుచుఁ గొందఱు సంశయం బందుచుండ-వెలఁది యొప్పారు లావణ్య విభ్రమముల. 22
క. కలదో! లేదో! యనుచును
బలుమఱు నెన్నడుముఁ జూచి పలుకుదు రితరుల్‌,
బలిమో! కలిమో! యనుచును
బలుమఱు జఘనంబుఁ జూచి పలుకుదు రితరుల్‌. 23
సీ. షట్పదంబుల పైకి సంపెంగ పువ్వుల,-జలజాతముల పైకిఁ జందమామఁ,
గిసలయంబుల పైకి వెసఁ గలకంఠముల్‌,-సింధురమ్ములపైకి సింహములను,
దొండపండుల పైకి దొడ్డ రాచిలకల,-నలరుఁ దూఁడుల పైకి హంసవితతిఁ,
బండు వెన్నెల నిగ్గు పైకిఁ జకోరముల్‌,-పవనంబు మీఁదికి బాపఱేని,
తే. మరుఁడు వైరంబు చేసిన మాడ్కి, నలక-నాసికా కరానన చరణ స్వనములు
వర పయోధర మధ్యోష్ఠ వచన బాహు-గమన హాసాక్షు లూర్పారు రమణి కమరె. 24
క. బంగారు నీరు నిలువునఁ
బొంగారుచు నుండ నజుఁడు వోసిన మాడ్కిన్‌,
శృంగార మెల్ల నిలువునఁ
బొంగారుచు నుండుఁ గరఁగి పోసిన మాడ్కిన్‌. 25
వ. అట్టి వయో రూపంబులను గనుపట్టునట్టి య క్కాంతా రత్నంబు
నీకు సిద్ధించెనేని నీవు త్రిభువనంబులు విజయంబు చేసిన యంత
కన్నను సంతసింతువన్న విని, కామాశుగంబులం దగిలి, కామాంధుండై
కన్నులు గానక యన్నుకొని తన్నుఁదా మఱచి, యొడ్డోలగంబు
సాలించి, పుష్పకం బను విమాన రత్నంబుపై నధిష్ఠించి,
మారీచు కడకుం జని, ప్రార్థించి, "నీవు కనక మృగంబవై జనస్థాన
బునకుం జని, దశరథ నందనుండగు శ్రీరాముం డున్న
పర్ణశాల కడం బొడకట్టిన, నతండును నిన్ను వెనుకొను, నీవు నతని
నతి దూరంబుగాఁ గొనిపోయి మాయంబైన, నేను రాముని భార్యం
గొనివత్తు" ననిన విని సమ్మతిలక మాఱుత్తరం బిచ్చిన, రావణుం
డుగ్రుండై మండిపడ, నతం డా సన్న యెఱింగి, కనక మృగ
రూపంబును దాల్చె నాక్షణంబున; 26
క. ఒడ లెల్లను బంగారము,
పొడ లెల్లను రత్న సమితిఁ బోలిన మెఱపుల్‌
నడ లెల్ల నెఱపి మెలఁగెడు
కడ లెల్ల విలాస రేఖ కళలం దొప్పెన్‌. 27
వ. ఇట్లు కనక మృగాకారంబు గైకొని పర్ణశాల కడకుం బోయి మెలంగునప్పుడు. 28
క. కనియును వినియును నెఱుఁగము
కనక మృగం బనుచు వేడ్క గడలుకొనంగన్‌
గనఁగ, మృగం బద్భుత మిది
కనక మృగం బేమి సేయఁగలదో మీఁదన్‌. 29
వ. అని కనుఁగొన్న మునిజనంబులు మనంబులం దలంకునెడ, నా
మృగంబును మృగనేత్ర యగు ధాత్రీపుత్రి గని దాని నభిలషించిన,
నా సన్న యెఱింగి సౌమిత్రిని భూమిజకుం దోడిడి, శ్రీరామ
చంద్రుండు దాని వెనుకొని చనుచున్న యవసరమ్మున, 30