మొల్ల రామాయణము/అయోధ్యా కాండము/చంద్రోదయ వర్ణనము
చంద్రోదయ వర్ణనము
[మార్చు]ఉ. భాను సహస్ర సత్కిరణ పంక్తుల నుద్భవ మైన యా బృహ
ద్భానుని వెట్టఁ బెల్లుడుకఁ బడ్డ సుధాంబుధి మీఁది మీఁగడల్
పూని సమీరుచేఁ దెరలఁ బూర్వ దిశం గనుపట్ట దానిపై
ఫేన మనంగ నొప్పె శశి బింబము తూరుపుఁ గొండపైఁ దగన్. 13
చ. కుముదములుం, జకోరములుఁ, గోమల సస్యముఁ, జంద్రకాంతముల్
రమణఁ జెలంగ వెన్నెల తిరంబుగఁ జేసె జగంబు లుబ్బఁగాఁ,
గమలములున్, వియోగు, లధికంబుగఁ జోరులుఁ, జక్రవాకముల్
రమణఁ గలంగ వెన్నెల తిరంబుగఁ గాచె జగంబు లుబ్బఁగాన్. 14
ఉ. నారదు లైరి సన్మునులు, నాక మహీజము లయ్యె భూజముల్,
శారద లైరి భామినులు, శంకర శైలము లయ్యె గోత్రముల్,
పారద మయ్యె నీరధులు, పన్నగ నాయకు లయ్యె నాగముల్,
వారిద వర్గ మెల్ల సిత వర్ణము లయ్యెను బండు వెన్నెలన్. 15
చ. కొడు కుదయించె నంచలరి కోరి సుధాంబుధి మిన్ను ముట్టి, య
ప్పుడు జగమెల్లఁ గప్పె ననఁ బూర్ణత నొందెను సాంద్ర చంద్రికల్
పుడమికిఁ బాలవెల్లి గతిఁ బొల్పెసలారఁగఁ జంద్రుఁ డొప్పె, న
య్యుడుపతి మేని మచ్చయును నొప్పెఁ బయోనిధిఁ బద్మనాభుఁడై. 16
వ. అట్టి సమయంబున, 17
ఉ. కోరి చకోర దంపతులు గుంపులు గుంపులు గూడి, రంతులన్
బేరిన చంద్రికా రసముఁ బేర్కొని మార్కొని పొట్ట నిండగాఁ
బారణ సేసి, పెన్ బయలఁ బ్రాఁకుచుఁ, జంచు పుటంబు లెత్తుచున్
బేరెము వారుచుండె మదిఁ బ్రేమ జనింప వధూటి కోటికిన్. 18
ఉ. వెన్నెల తీఁగలన్ గొనలు వేడుక ముక్కలఁ ద్రుంచి తెచ్చి, దా
ర్కొన్న ప్రియాంగనా తతికిఁ గూరిమి నోరికి నిచ్చి, కేళికిన్
సన్నపుఁ కంఠ నాళముల సన్నలు సేసి సుఖించె నింపుగన్
దిన్నని చంద్రకాంత మణి తిన్నెలమీఁదఁ జకోర దంపతుల్. 19